వేమన/మూడవ యుపన్యాసము

వికీసోర్స్ నుండి


శ్రీ:

మూడవ యుపన్యాసము

వేమన సంసార స్థితిగతులు

ఇదివరకును వేమనవంశము, కాలము, దేశము-వీనినిగూర్చి కొంత వఱకును ఎక్కువ ఫలములేని చర్చ జరిగినది. ఇఁక నతని సంసార స్థితిగతులను గూర్చి యేమైన నెఱుఁగఁగలమా యని చూతము,

ఈ విషయమును గూర్చి చర్చింపఁ దలంచిన వెంటనే వేమన యింకేదో నన్ని వేశమున చెప్పిన యీ క్రింది పద్యము జ్ఞప్తికి వచ్చుచున్నది--

      "ఆ, నతులు నుతులు మాయ, సంసారములు మాయ,
            ధనము మనము మాయ, తలఁప మాయ.
           తెలియనీదు మాయ, దీనిల్లు పాడాయ, విశ్వ."*[1] (3834)

మనపాలికిప్పడు వేమన సతీనుతులు, సంసారము, సంపాదించిన ధనము, ఘనత, చదివిన చదువు—ఇవన్నియు నిర్ణయించు సాధనములు లేక 'మాయ' గానే కానవచ్చుచున్నవి. ఇట్టిచో లేనివి కల్పించుటకుఁగాని లేవనుకొని యూరకుండు టకుఁ గాని యిష్టము లేనప్పడు, ఉన్న యాధారములనుబట్టి యూహించుటయు కొంత తృప్తిని గలిగించును. ఆ యాధారములు వేమన పేరిటి పద్యములలో నతనివేయని నమ్మట కనుకూలమైనవి. వానిలో ఆకస్మికముగా చేరిన కొన్ని యంశములనుబట్టి పై విషయములను మనము కొంత నిర్ణయింపవచ్చును.

కాని, కవుల గ్రంథములందలి వ్రాఁతలనుబట్టి వారి చరిత్రమును నిర్ణయింప సాధ్యమా ? అట్లైనచో ఆంధ్ర వాజ్మయమందలి కవులెందరికో ఇష్టదేవత స్వప్నమున వచ్చి గ్రంథకరణమును యాచించె ననవలసి యుండును; ఎందఱికో, యేమియు వ్రాయకమునుపే, గ్రంథభర్తలు జాంబూన దాంబరాగ్రహారాదులు సంచకారమిచ్చి నా రనవలసి యుండును; ప్రతి ప్రభంద కవియును మూతులుంగలుంగలవంగ ములు మొదలగు తల తోకలేని మహీరుహమాలికలతో తిద్ధి తీర్చిన యూరామ మందు, మల్లెమొల్ల జాజి సంపెంగల పొదల నడుమ, గొజ్జఁగి నీటికాలువలు పూఁదేనియ సోనలు నావరించియున్న చంద్రకాంతశిలావేదికలపై, పుప్పొడుల మెత్తలపైఁ బరుండియే కవితా కాలక్షేపమును జేయుచునో, లేక మధ్యాహ్నపు వంటకు మార్గము నెఱుఁగని యిల్లాలితో కలహించుటచే విరహమున కోర్వఁజాలక చంద్ర మలయమారుతాదులను దూషించుచునో, ప్రాద్దుగడపచుండెననవలసి యుండును ! ఇట్లు ఇల్లాలిముక్కరకొకముత్యము గతిలేకున్నను, ఇంటిముంగలి వీధులకెల్ల ముత్యాల ముగ్గులు పెట్టువారు మనకవులు. పారి వ్రాఁతలనుబట్టి వారి సంసారస్థితిగతులను నిర్ణయించుట ప్రమాదము గదా ! యని యాక్షేపింప వచ్చును.

నిజమే, కాని వేమన యాతీఱు కవిగాఁడు, పొట్టపోసికొనుటకు, పరుల పొగడింతలకు వేకారికాని, పరుల ఖండనలకు వెఱచికాని యితఁడు పద్యములు వ్రాయలేదు. స్వానుభవ మితనికవిత్వమందలి జీవగుణమని మొదలే విన్నవించితిని. ఇతరాశలకు లోపడి పద్యములు వ్రాయువారిని

       "ఆ, తోఁట కూరకైనఁ దొగ్గలికైనను
             తమిఁదకుడుముకైన తవటికైన
             కావ్యములను జెప్పుగండ్యాలు ఘనమైరి విశ్వ." (1986)

యని తిరస్కరించి మొగము ద్రిప్పకొన్నవాఁడు. కావున ఇట్టివాని వ్రాఁతలను బట్టి యతని పూర్వోత్తరముల నూహించునప్పడు మనము మన భావనాశక్తికి స్వేచ్ఛాచార మిచ్చుటకు వీలులేదు.

వేమన కాఁపువాఁడు; కాఁపులలోను రెడ్డి, అనఁగానే 'వడ్లలో నెన్ని భేద ములో రెడ్లలోనన్ని కలవుగావున ఇతఁడే రెడ్డి?' యని చెక్కితీర్చిన చరిత్రకారుఁడు లేచి ప్రశ్నించును. కాని యాచర్చ నతనికే వదలిపెట్టెదను. ఎందుకనఁగా, అంత కన్న నెక్కువ విభాగము వేమనకే అవశ్యకముగఁ దోcపలేదు, మరియు తాను ' రెడ్డి' యని యొక్కడనో యొకటి రెండు చోటులఁ దప్ప తక్కిన స్థలములందెల్ల తాను వట్టి 'కాఁపు" నని చెప్పటయందే యతని కభిమానమెక్కువ.

       "ఆ. కలి యుగమున నున్న కాఁపు కులానకు
             వేమన తనకీర్తి విక్రయించె." (995)

అని మాత్ర మతఁడు చెప్పకొని సంతోషించెను! తక్కిన యన్ని కులములకంటె నీ కాఁపు కులముపై నితని కభిమానమును దయయును నెక్కువ గాఁగలదు—

       "ఆ. కాcపకులజులెంత కర్ములైనను గాని
             పాపరాశి కొంత పరిసి పోవు
             వివర మెఱుఁగనట్టి వెఱ్ఱిజీవులుగాన, విశ్వ." (ఓ.లై, 13-5-31)

మనదేశమునందు మొదటినుండియు ధనధాన్య నంపదగలిగి, శార్యౌదార్య ములకు పేరైనజాతులలో ఈ కా(పురెడ్లు ముఖ్యమైనవారు. మొదలు స్వతంత్ర ముగ రాజ్యముచేసి, తరువాత విజయనగరపు రాజులు మొదలగువారి చేతిక్రింద పాళయగారులుగాను అధికారులుగాను ఉండి, ప్రధాన రాజ్యములు నశించిన పిమ్మట వీరెక్కడి వారక్కడ స్వతంత్రులై వర్తించినవారు. సహజమైన స్వాతంత్ర్యాభి మానము, కాయశక్తి పరంపరగా వచ్చిన రాచరికపుఠీవి, స్నేహసాహసములు గలవా రగుటచేత, వీరెందున్నను జనులు వీరియెడ భయభక్తులు గలిగి వర్తించుట సహజము. దీనికితోడు స్వదేశాభిమానము, స్వదేశీయాభిమానము మొదలగు ఉదా రాశయములను బెంపొందించు చదువునంధ్య లెక్కువగా నేర్చియుండిరేని భరత ఖండమునకు వీరిచే నెంత యౌన్నత్యము లభించుచుండెడిదో యూహింప నసాధ్యము, ఆట్లుగాక సైనికధర్మ మొక్కువగలిగి సేనానీ ప్రతిభాసంస్కారములు చాలని వారగుటచేత సామ్రాజ్యమును స్థాపించు ప్రాచీనశక్తిని గోలుపోయినను, తామన్నచోటనే చిన్నపల్లె రాజ్యమును స్థాపించి తక్కినవారికి సామాన్యముగ లొంగక వర్తించుట వీరి స్వభావమైనది. మంచి చెడ్డలకు రెంటికిని లక్ష్యము లేక ద్రవ్యము వెచ్చపెట్టుట, అడిగినది లేదనక యిచ్చుట, చేత లేనప్పడు న్యాయా న్యాయ మార్గములు రెంటిచేతను ద్రవ్యము " సంపాదించుట, భట్రాజులో బ్రాహ్మలో ప్రాఁతపద్యములు పేరులు మార్చి చెప్పినను ఆ పొగడ్తలకు నంతోషించి బహుమానములు చేయుట, ప్రణయమున్నచోట ప్రాణముల నిచ్చుట, కోపము వచ్చినప్పడు కుత్తుక కోఁతలతోనే కసిదీర్చుకొనుట-ఇవన్నియు నిప్పటికిని వారి రాజసగుణములు, పూఁత మెఱుఁగులు, వీcపు వెనుకటి మూటలు, మొగమోటపు మౌనములును ప్రాయికముగ వీరెఱుఁగరు. వీరిలో ప్రబలులైనవారు నేఁటికిని 'ప్రభురెడ్లు' అని వ్యవహరింపఁ బడుచున్నారు.

వేమన యిట్టి పల్లెటూరి ప్రభురెడ్ల గుంపునకుఁజేరి, అన్నవస్త్రములకు గొదవ లేక, అప్పునప్పుల పాలుగాక, భూమి కాణి గలిగి, ఆవులు గొఱ్ఱెలు సమృద్ధిగాఁగల మంచి నెమ్మదియైన సంసారమందు జన్మించినవాఁడని యూహింపవలసి యున్నది.

     " ఆ, నేయిలేని తిండి నీయాస కనువది
            కూరలేని తిండి కుక్కతిండి" (2307)

          "పప్పలేనికూడు పరుల కనహ్యము"(2407)

ఆని చెప్పఁగల వాఁడుఁ బీదసంసారి గానేరఁడు. మఱియు -

         "పెట్టి పోయలేని వట్టిదేబెలు భూమిC
           బుట్టిరేమి వారు గిట్టిరేమి" (2597)

         "నద్దిమిగులనింట సంసారమేలరా " (650)
         "ఆప్పలేని వాఁడె యధిక బలుడు" (2407)

అను మంచి సంసార ధర్మముల నితఁడు బాగుగా నెఱిఁగినవాఁడు. తల్లిదండ్రులు చదువుకొన్న పండితులు గాక పోయినను, చదువుకొన్న పండితులు, పౌరాణికులు, కవులు మొదలగువారి కాశ్రయమిచ్చు స్వభావము గలవారు గావున, వేమన చిన్న నాఁటినుంచి తమ యింటికి వచ్చి పోవుచుండు చదువరుల, కవుల సహవాసమున సంస్కారమును బొందినవాఁడు. మఱియు నా కాలమున కొంచెమన్నవస్త్రములకుఁ గల కాఁపవారందఱును వ్రాఁత చదువుల నేర్చియుండిరనుటలో సందేహములేదు. కాని, రామరాజభూషణాదులవలె అవి కేవల పాండిత్య నంపాదనకై యుపయో గించిన వారరుదు. సిద్ధములైన మతనీతి తత్త్వములను దెలిసికొనుటకు వలసినంత దేశభాషా పరిశ్రమము సామాన్యజనుల కావశ్యకముగాఁ దలఁపఁబడుచుండెను. అట్టితత్వములను వ్యాప్తిచేయుట కేర్పడినవే పురాణములు. మొన్న మొన్నటి వఱకును పల్లెటూళ్ళలో ప్రతినిత్యమును కొంత ప్రొద్దైనను పురాణములు చదివియో చదివించియో కాలక్షేపము చేయనిరెడ్డి యుండలేదు. కావున వేమన సామాన్యముగ వ్రాఁత చదువులు చక్కగా వచ్చువఱకును కొన్నాళ్ళు బడిపంతుల బెత్తపు దెబ్బలు తిని, తరువాత భారతము, రామాయణము, బసవపురాణము, శివపురాణము మొదలగు గ్రంథములను పలుమాఱు తండ్రిగారికి చదివి వినిపించి యుండును. పురాణములందలి కథలలో సామాన్యముగ నందఱు నెఱుఁగని కథల నితఁడెఱిఁగినట్లు అనేక పద్యములు తెల్పును. పాదరసమువంటి ప్రతిభాశక్తి కలవాఁడగుటచే, తిక్కన మొదలగు వారి గ్రంథములు ఊరక యెవరికొఱకో పారా యణము చేయక వాని యర్ధమును గ్రహించువఱకు వదలకుండెనని తోఁచు చున్నది

       "ఆ. కబ్బ మొకటి పూని గడగడ చదివిన
            లోనియర్థ మెట్లు తానెఱుంగు,
            ఎఱుకమాలు చదువ లేటికో తెల్పరా విశ్వ." (929)

అని యితఁడు తరువాత నెవనికో యుపదేశించెను. ఇంతేకాక తానుగూడ, ఆ గ్రంథకర్తలవలెను, తమ 'ఆస్థానము'నకు, వచ్చిపోవుచుండు కవులవలెను, కవిత్వము చేయవలెనని సంకల్పించుకొని యుండును. మన యదృష్టముచే వేమన్న చదువు పురాణములు దాఁటి కావ్యశాస్త్రములకు పోయినదిగాదు గావున, చిక్కులేని, ధారాళమైన భావముమీఱిన భాష కాని భాషనుమీరిన భాపముగాని లేని నిష్కల్మష మైన పురాణ కవితాశయ్యయే యతనికి లభించినది. కాని తానేమి వ్రాయవల యునో యింకను ఏర్పడలేదు. నాలుక తీఁటమాత్ర మపరిమితముగాఁ గలదు. అది యూరకుండనీక యుద్రేకించుచున్నది. కాని ఛందోవ్యాకరణాదు లేవియు నేర్వ లేదు. మఱియు పద్యములు వ్రాయుటకు నివి యావశ్యకములను భావమే అతని ఎప్పటికిని-దోఁచియుండదేమో! కావున పల్లెటూరివారు ఇతనివంటి నవయవ్వనులు, మనసుకు వచ్చిన విషయముపై తమయూహ కందిన నడకలో, ఇప్పటికిని కపిలెపదములల్లు నట్లు, ఇతఁడును, అంతకన్న మేలైన విదా సంస్కారము గలదు గావున విషయ నిర్బంధములేక, తెలుఁగు పద్యముల నెల్ల చిన్నదియు కొంతవరకు పాటలవలె స్పష్టమైన లయగతి గలదియునగు 'ఆట వెలఁది'లో రచనచేయ మొదలిడినాఁడు. ఇతని చిన్నతనపు పద్యములేవియో మన మెఱుఁగము గాని, యింత ధారాళమైన రచన ప్రకృతి దత్తమైన వరప్రసాదమే కావునను, అది యాకస్మికముగా నొకనాఁడు పొంగిపొరలివచ్చు నీటిబుగ్గ వంటిది కాదు గావునను, చిన్ననాఁట నుండియే యితనికా వాడుక కలదని మన మూహింప వలసియున్నది.

దీనికి తోడు ఇతనికి కొంత సంగీత విద్యయందును అభిరుచి లభించినది. కవలకు పండితుల కెట్లో అట్లే గాయకులకును ఆ కాలపురెడ్లు ఆశ్రయభూతులు. కావున తమయూరిలో జరిగిన పాటకచ్చేరీలలో నెల్ల ఆగ్రాసనము వహించిన పెద్ద రెడ్డిగారి ప్రక్కలో చిన్న వేమారెడ్డియు కూర్చుండి తదేక ధ్యాసముతో వినుచుండె ననుట నిస్సందేహము.

       "క. గంగాధరుఁడే దైవము, సంగీతమె చెవులకింపు..." (1233)
అందును—
       "క, విద్యలలోపల నీతియు, వాద్యంబులలోన వీణ...." (3507)

అని నిర్ణయించు కొన్నాఁడు. సూక్ష్మములైన విషయములు గ్రహింపవలయు నను తీవ్రభావము గలవానికి తప్ప తక్కినవానికి " వీణ" యం దభిరుచి కలుగుట యసాధ్యము, సంగీతమందును ఒక్కొక్కరి కొక్కొక్క రాగము రుచించును. కవిచౌడప్ప రాగంబులలో గాంభీర్యముగల రాగము కాంభోజి' యనెను. భట్టు మూర్తియు *కాంభోజీరాగ విపంచికారవసుధాపూరంబు' అని దానియంచే పక్ష పాతము చూపెను. మనకవులలో నింకెవఁడో 'సావేరి' ని అంగీకరించినట్లు జ్ఞప్తి, వేమన్నకు 'తోడి పై ఆభిమానము. దానియోగ్యతను గ్రహించుట కందఱికి శక్తిలేదఁట : 'దున్నపోతునకును తోడిరాగంబేల' (2040) అనుచున్నాఁడు. ఏమోచాలదను అతృప్తి, జుగుస్స తనయశక్తిచేఁ గలిగిన దైన్యము, దానికితోడు కార్యసాధనమునందలి పట్టుదల, స్వాతంత్ర్యర క్తి-ఇత్యాదిభావములు చూపుటకు తోడిరాగమువంటిది లేదు, వేమన కీ రాగమందుఁగలిగిన యభిమానము ఆతని మనోధర్మములను స్పష్టముగా నూచించుచున్నది. కాని యింతకంటె నా విద్య యందును ఇతని కెక్కువ ప్రవేశము గలుగలేదు.

వేమన్నకు శివభక్తి యీ చిన్నతనమందే యలవడి యుండవలెను. తల్లి దండ్రులు తాతాచార్యులముద్రకుఁ దప్పిన పూర్వికశైవలై, కేవల వీరశైవమును బోధించు జంగముల యుపదేశములకు పాత్రులైయుండియుందురు. కాని ఆప్పటికి వీరశైవప్రాబల్యము తక్కువయై యుండుటచే, శివకేశవులకు భేదములేదని చెప్పినను సహజముగా శివభక్తి నెక్కువగాఁ జూప ఆద్వైత బ్రాహ్మణపండితుల నహవానములో మెలఁగినవా రనుకొనెదను. కావుననే వేమన్నకు చిన్ననాఁడే యిట్టి కేశవద్వేష మెక్కువలేని శివభక్తి కుదిరినది. లింగధారిగఁ గూడ నుండవచ్చును. అప్పటి వీరశైవులు బ్రాహ్మణులు ఏర్పఱిచిన దేవాలయములందలి పూజ పునస్కారములు, ఉత్సవములు, గ్రామసామాన్యములగు పోతులరాజుల పూజలుఇవన్నియు చిన్నతనమందే చూచి, తండ్రిగారితోడ వానిని నిర్వహించుటయందును పూజారు లిచ్చు మర్యాదలందును పాల్గొనినాఁడు. ఈ పొంగలి పుళిహెూరల పూజ లందును, బాజాబజంత్రిల మెరవణుల కోలాహలములందును, జంగాల పాదతీర్థము లందును, బ్రాహ్మణుల సమారాధనలందును, పూజారుల తలత్రిప్పల యావేశము లందును, ఎనుబోతు గొఱ్ఱెల బలిదానములందును—నిజముగనే మేని సత్యమును సత్ఫలమును గలదా యను శంక యెప్పటికే యొక్కడనో యొకమూలలో నతని కంకురించియుండును. కాని వయనుచిన్నది ; అనుభవములేదు; ధైర్యము చాలదు ; మీఁదు మిక్కిలి ప్రక్కలో తన్నుదండించు తలిదండ్రులున్నారు ; బెత్తపు బడిపంతు లున్నాఁడు. కావున పై విషయముగా నే నందేహములు గలిగినను, 'ఛీ వెధవా ! నోరుమూసుకో" అని యదర(గొట్టువారేకాని, తీర్చఁగలవారు లేరైరి. కావున నవి యట్లే యడఁగఁజొచ్చినవి. మఱియు నితఁడు తల్లి తండ్రి మొదలగు పెద్దలయెడ భక్తి, దయ మెండుగాఁ గలవాఁడని కానవచ్చుచున్నది

       "ఆ. తల్లికెదురుకొంట తండ్రికెదురుకొంట
             అన్నకెదురుకొంట యరయ మూఁడు
             పాతకములటంచు వర్తింపుమెఱుకతో..." (1842)

       "ఆ. తల్లితండ్రిమీఁద దయలేని పుత్రుండు
             పుట్టెనేమి వాఁడు గిట్టెనేమి?." (1853)

కాని, యితనిది అట్లు పుట్టిన సందేహములను చాలనాళ్లు అడఁగించుకొని యుండఁగల హృదయముగాదు. తన చుట్టుప్రక్కల నుండువారి నడవడులలో తప్పలుపట్టుట, పట్టినవానిని నిర్ధాక్షిణ్యముగా వారి మొగములమందఱనే చెప్ప వలయునను ధైర్యము, ఆ దైర్యము నుద్రేకింపఁజేయు వాగ్మిత్వము-ఇవి యితని స్వభావసిద్ధ గుణములు. కావుననే, తానేమో ఘనకార్యమును జేయఁగలవాఁడని, చేయవలయునని, సామాన్యజనులకన్న తనయందు విశేషముండెనని, యితఁడు నమ్మెను. మనుజుఁడై పట్టినందుకుఁ 'పుట్టలోని చెదల" వలె నిరర్ధకముగా ఒకపని చేయక, పట్టి గిట్టరా దనుకొన్నాడు—

       "ఆ. పుట్టలోన తేనె పట్టిన రీతిని
            గట్టుమీఁద మరియు పట్టునట్లు

            కట్టెలోన నగ్ని పట్టిన విధమున
            పుట్టి మెట్టవలెను భువిని వేమ" (2539)

అని దృఢ సంకల్పము చిన్ననాటనే యితని కుండియుండవలెను. ఇట్టి సంకల్పము లనేకులకుఁ గలవు. ముప్రాద్దును మంచముమీఁదనే పరుండి, ముల్లోకముల యాధిపత్యమును సంపాదించు సంకల్పములు చేయువారము మన మందఱమును. దానికిఁ గావలసిన శక్తియుక్తులట్లుండఁగా ముఖ్యమైన పట్టుదలయే యన లనేకుల కుండదు. వేమన్నకు మసస్పునఁ గలిగిన సంకల్పమును నిర్వహించు దార్ఢ్యము మొదటినుండి కలదనవచ్చును—

       "ఆ, పట్టి విడువరాదు పదిలక్షలకునైన" (2352)

       "ఆ. ఊఁపcబోయి కొంత యూఁగించి విడిచిన
            నూఁగుఁగాని గమ్య మొందలేఁడు
            పట్టు పూన్కికొలఁది పనిచేయు లక్ష్యంబు, విశ్వ" (559)

      “ఆ. పట్టుపట్టరాదు పట్టి విడువఁగరాదు
           పట్టెనేని బిగియఁ బట్టవలయు
           పట్టువిడుటకన్న పడిచచ్చుటయె మేలు, విశ్వ" (2758)

అచ్చపు రెడ్ల రాజనము ! ఇది గలవానికి దేవుఁడే లొంగి యతఁడు పట్టినపని. నిర్వహించి యిచ్చి తంటా తప్పించుకొనును. ఇట్లు దృఢసంకల్పముచేయు స్వభావము గలిగినను, ఏది పట్టవలెనో, ఏది విడువవలేనో నిర్ణయించుకొను. వివేకము అనుభవముచేతనో, అనుమానముచేతనో సంపాదించుకొనఁగల్గుటకు ముందు వేరొక ప్రబలమైనమార్పు వేమనజీవితమందుఁ గలిగినది.

అదే దనఁగా, యౌవనము. చిన్నయసూరి చెప్పిన 'కలిమి, దొరతనము, అరయమి' యను తక్కిన మూఁడును కొంతకుఁ గొంత కలవని మనమెరిగి యున్నాము. ఇట్లు సర్వసాధన సంపూర్ణమైన యావ్వనము స్వచ్ఛందముగా ప్రవర్తించుటకు వలసిన సమయనందర్భములకును ఆ కాలమందు కొదవలేదు.

పదునెనిమిదవ శతకమునాఁటి హిందువులకు రాజ్యకార్యనిర్వాహములు, శాస్త్రతత్త్వ విచారములు మొదలగు తీవ్రవిషయములందు ప్రతిభాబలము ప్రవహించుట నిలిచినది. 'ఎవరికివారే యమునాతీరే' యన్నట్లు స్వతంత్రులగుట కందఱును తమశక్తికొలఁదిఁ బ్రయత్నించిరి. సామ్రాజ్యస్థాపనకు శ్రద్ధతోఁ బ్రయత్నించినవారు లేరైరి. ఉన్నవారికి శక్తిలేదయ్యెను. రాజులు నవాబు లనఁబడు వారికిని తమ సెలవలకు ద్రవ్యము నార్జించుటయే ప్రధానోద్దేశముగా నుండెను. ప్రజలగతి యెట్లైనను పన్నులు వసూలైనఁ జాలును. కాబట్టి బలవంతుఁడు. ప్రబలుఁడై ప్రభుత్వము చెలాయించెను. ప్రజలు "సర్కారు వారికో, లేక "రెడ్డిగారికో యీయవలసిన దిచ్చిరేని తరువాత తక్కిన విషయములందు వారిని దండించుదాత గాని, మర్ధించు మామగాని లేకుండెను. ఇఁక చదువుసంధ్యలు నేర్చి సాంఘిక వర్తనముల నియమించు బ్రాహ్మణులు మొదలగు సంఘాధిపతులకు మతము, శాస్త్రము, ధర్మము—ఇవన్నియు సిద్ధములైన వస్తువులు. తమ ప్రాచీనుల పుస్తకములలో నన్నియుఁ గలవు. వానిని నేర్చుకొనుట, శక్తియున్న నవియే సత్యములని స్థాపించుట, యింతకన్న వేఱుచేయవలసిన పనిలేదు. అవి యుక్తములా కాదా యని సందేహించుటయే మహాపాతకము! వానిని తప్పక యాచరించిన ముక్తి సిద్ధము! సామాన్యజనులందిట్టి మనోభావమునకు పరిణామ మేది? సహజముగా నాచరించుటగాక ఆచరించినట్లు చూపుకొనుట. ప్రాణాయామము చేయుటకు ముక్కు మూసికొనవలెను. రెండు(వేళ్ళతో ముక్కుపట్టుకొన్నఁ జాలును. దానిని మూసినావా తెఱినావా యని, ఊపిరి నిలిచినదా యాడుచున్నదా యని, సంధ్య వార్పెడు వారి ముక్కు లన్నియు పరీక్షించు మూర్ఖుడెవ్వఁడు? స్నానముచేయవలెనని దౌతవస్త్రమునే కట్టవలెనని శాస్త్ర మున్నది. దానికి ఒక చెంబెఁడునీళ్లు మీఁదఁ బోసికొన్నను, ఒకమాఱు నీటిలో నద్ది పిండి ఆరవేసిన వస్త్రమును గట్టుకొన్నను జాలును. ఆంతేకాని దేహమునందును, వస్త్రమందును పంచమైలలున్నను ఫరవా లేదు. ఇట్లు ఆశక్తిచేత, ఆజ్ఞానముచేత శాస్త్రములన్నియు 'శాస్త్రము'నకై పోయినవి. వేషము ప్రధానమైనది. కావున మనుష్యసంఘమందు ప్రధానములైన రాజ్యము, మతము, ధర్మము అను మూఁటినిగూర్చి యెవరును ఎక్కువగా చింతించి, ఊహించి, చర్చించి నిర్ణయింపవలసినపనిలేదయ్యెను. ఇఁక నీతి మనచేతిది. మనలను దండించువాఁడు కల్గువఱకును మనము చేసినదే నీతి, కా(బట్టి ప్రజలు ప్రాయికముగ స్వేచ్ఛావర్తనులైరి. విషయవాంఛలు అడ్డులేక ప్రబలెను. రాముని యేకపత్నీవ్రతముకంటె కృష్ణుని యనాది బ్రహ్మచారిత్వము అనుకూలముగాc దోఁచెను. బహుపత్నీ కత్వము భరింపరాని బరువు. కావున వేశ్యల వ్యాపారము ఎప్పటికన్న నెక్కువయయ్యెను. ఊరూరను కనీస మొక దేవాలయము, దేవన కొక దాసి చాలినను భక్తులకు చాలకపోయెను. ఇక ఇరుగుపొరుగిండ్ల సహవాసము మొదటినుండి అన్ని మతములవారును, దేశములవారును ఖండించినది. మఱియు, ఆ యిండ్లలో వట్టి యాఁడువారు మాత్రమే కాక వారి భర్తలు మొదలగు మగవారు వుండుటయు, వారికిని తమవలెనే మానాభిమానములుండుటయు కొంచెము నిదా నించి యూలోచింపవలసిన విషయము.

        "ఆ. పరసతి గమనంబు ప్రత్యక్ష నరకంబు,
              అరయు నిందలకును నాలయంబు,
              పురుషుఁడు వినఁజంపు, భూపతి నొప్పించు, విశ్వ." ( 2450)

కావున వేశ్యాసంఘాభివృద్ధి కావలసివచ్చెను. వారికి మర్యాదలు, పెండ్ల పేరంటములలో సంభావనలు ప్రబలినవి. కాని వారిసంఖ్య యాకస్మికముగా పెరుగుట కష్టము. దేవదాసీలవలె సంఘదాసీలగు బసివిరాండ్రను బయలుదేర్చవలసి వచ్చెను. శైవులలోను, వైష్ణవులలోను సంఘయజమానులే దానికి నమ్మతించిరి. ఇది గాక నిత్యమును సంసారులుగానుండి సంతలలో మాత్రము వేశ్యావృత్తి నవలంబించు *సంతబస్వి'రాండ్రు కొందఱు కావలసివచ్చెను. చాలనందుకు దొమ్మరీండ్ర వేశ్యలు. కొంత క్షేమము గలిగెను. పరస్త్రీ సంగమమువలె వేశ్యాసహవాసమును పాపకర్మములని ధర్మశాస్త్రములున్నను, ఈ విషయమై చర్చలు జరిపి సిద్ధాంతముచేయు తొందఱ లేకుండ, మొదటికన్న రెండవది మేలనియు, ఆది పాపమే కాదనియు, ఐనను క్షమింపఁదగినదనియు, జనులందఱును పరస్పర హృదయ సంవాదముచే నిర్ణ యించుకొనిరి. నియమపరాయణు లెవరైననున్న వారిలో ననేకులకు వీరియెడల ననహ్యముకన్న అసూయయే యొక్కువయై, పైకి ఖండించినను, లోలోన గ్రుక్కిళ్లు మింగుచుండిరి. క్రమముగా ఏకపత్నీవ్రతము పురుషలక్షణమే కాదనుకొనఁ జొచ్చిరి. వ్యభిచారము చిన్నవారియందే కాని పెద్దవారియం దంత దోషముగాదని చెప్పకొనిరి. పూర్వకాలపు వృద్ధులలో ననేకుల కిప్పటికిని ఈ భావము లిట్లే యున్న వని మన మెఱుఁగుదుము. వేమన యిట్టి సన్నివేశములలో పెరిగినవాఁడు. తనకాలపు పెద్దలు (వీరిలో తండ్రిగూడఁ జేరియుండును) బాహాటముగ గదికాలోలురైయుండుటను చూచి నాఁడు ; దేవాలయముల యుత్సవములలో, పెండ్లిపేరంటములలో వేశ్యల నాట్య మును జూచినాఁడు ; సంగీతమందాశ సహజముగాఁ గలవాఁడు కావున, వారి మధుర గానముచే పదనెక్కిన పచ్చిపదములను విని వాని యభినయమునుజూచి పరవశమై నాఁడు. ముద్దవయస్సు, ఐశ్వర్యము, అధికారముగల తనపై అవకాశము దొరికినప్ప డెల్ల వారు ప్రయోగించు కటాక్షపు కటారుల పోట్లు పడినాఁడు. ఇట్టివారికి లోపడుట అన్యాయమని అధర్మమని తాను పురాణములలో చదివిన చదువులు జ్ఞప్తికి వచ్చినవి. మనోనిగ్రహముచేయఁ బ్రయత్నించెనుగాని, తనకుఁ దానుదప్ప సహాయపడు వా రెవ్వరును లేకపోయినారు. చదువుకొన్నవారు పెద్దలు ఈ విషయమున తనకన్న దుర్బలులై యుండినారు. ఇఁక తా నెంతటివాడు ?

       "ఆ. ఆcడుదానిఁ జూడ, నర్ధంబుఁ జూడఁగ
            బ్రహ్మకైన నెత్తు రిమ్మ తెగులు..." (232)

అను సృష్టిసిద్ధమైన దోషము దెలిసికొన్నాఁడు. 'ఈ బుద్ధులు పాపకృత్యములైనచో ఇవి లేకయే బ్రహ్మ సృష్టిచేసి యుండరాదా?" యను ప్రశ్నకు ప్రత్యుత్తరము దొరకదయ్యెను. తుదకు మనపాపముల కన్నిటికి ఆ బ్రహ్మయే కారణమని ఈ "బ్రహ్మ యాలిత్రాడు బండిరేవునఁ ద్రెంప !? " అని యొక తిట్టుతిట్టి ప్రపంచ ప్రవాహములోఁ బడిపోయినాఁడు !

వేమన్న యిట్లు వేశ్యాలోలుఁడయ్యెనన్న వెంటనే అభిమానులు కొందఱు నాపై నాగ్రహింతురు. కాని యతనిమీఁది యభిమానమున నేను వారెవరికిని దీసి పోనని మాత్రము మనవి చేయవలసియున్నది. వేమననుగూర్చిన కథలలోనెల్ల నీ వేశ్యాసంబంధము కలదు. అతని యనుయాయులు, అతనినే దైవముగాఁ గొలుచు వారు, ఆందఱును దాని నాక్షేపింపక యంగీకరించినారు. కథలలోని విషయము లన్నియు అసత్యము లనుటకు నాకిష్టము లేదు. అత్యుక్తులను, ఇతర సాధనము లచే అసత్యములని స్పష్టముగా తేలినవానిని, వదలిపెట్టి తక్కినవాని నంగీకరించుట క్షేమము, న్యాయము. ఇఁక వేమనవంటి వేదాంతి వేశ్యచేఁజిక్కుట యసంభవమని తలఁచుట యజ్ఞానము. ప్రాఁతకాలపు సంఘస్వరూపమును గమనించిన యెవరికిఁ గాని, ఇట్టి విషయములలో తమదేశపు పుచ్చులన్నియుఁ గప్పిపెట్టి పాశ్చాత్యులు మనకు బోధించుచుండు తమలో లేని నీతిపద్ధతులు మన తాతముత్తాతలకు లేవనియు, వా రే న్యాయాన్యాయములను జేసినను తమంతచేసిరిగాని, యితరు లెవ్వరును వారికి మనకువలె వంకాయ పురాణములు" చెప్పలేదనియు న్పష్టమగును. కవికుల శిరోమణి సరస్వతి యవతారము, కాళిదాసు గణికాప్రియుఁడని మన ప్రాచీనులు తలఁచుచు నది యసంభవమని భావింపలేదు. అధర్మమని భావించి యుండవచ్చును. త్రివిధనాయికలలో రెండవది పరస్త్రీ, మూఁడవది వేశ్య! వారిద్దఱికిని రసికలాక్షణికు లందఱు స్వీయయగు మొదటియామెతోడ సమాన మర్యాదను కావ్య ప్రపపంచమున నొసఁగిరి, శ్రీనాథుని నైషధమును పంచకావ్యములలో పరిగణించిన వారే యతఁడు స్త్రీలోలుఁడనియు నెఱుఁగుదురు. ఇవన్నియు న్యాయములని నేఁ జెప్పరాలేదు. అది వేఱుమాట. మతిగొప్పవారందఱును అన్ని విధముల గొప్పవారే యని భావించుట, వారియెడ దోషము అసంభవ మనుకొనుట, మన యవివేకమునే వెల్లడించుననియే నా మతము. దోషములుండిన నష్టమేమి ? అందువలన కష్టము లనుభవించినవారు వారు. మనము వారి గుణములచేత, మహత్త్వముచేత మేలు పొందవలసినవారము. వేమన పరనారీ స హెూదరుఁడై, శుకమహర్షియపరావతారమై యుండి, యొక పద్యమును వ్రాయక యే మూలలోనో ముక్కుపట్టుకొని మురిగి యుండిన మనము నంతోషించుచుంటిమా ? మన్నించుచుంటిమా ? నన్నడిగిన వేమనవలె పద్యములు వ్రాయఁగలవాఁడెవఁడైన నేఁడు లభించునేని యతనికిఁ గావలసియున్న మనమందఱును చందాలెత్తి వేయిమంది వేశ్యలను సంభావన నమర్పింపవచ్చును.

మఱియొకటి చూడుఁడు : వేమన "జిహ్వచేత నరులు చిక్కి నొచ్చిరిగదా" (1603) యని పరితాపపడి దానికి లోఁగుట తప్పని చెప్పచున్నాడు. అనఁగా, పట్టిననాఁటినుండి యేది దొరికిన నది తిని, దొరకకున్న నుపవాసముండియే కాలక్షేపముచేసిన నిత్యోపవాసి యతcడని చెప్పవచ్చునా ? అట్టెన '" పప్పలేని కూడు పరుల కసహ్యము" ఇత్యాదులు వేమన్న చెప్పినవిగావా ? విషయలోలత్వమెల్ల నిట్టిదే. మఱియు, వేమనవంటివాఁడు కొన్నాళ్ళైనను విషయాధీనుఁడై యుండకపోవుటయే యసాధ్య మనుకొనుచున్నాను. ఇతని యుద్రేకము ఏ విషయమందు ప్రవర్తించినను చాల వేగము, వేఁడి గలది, తోఁచినపని చేయించుటయే దాని స్వభావము. దాని చేతనే వేమన యింతటివాఁడైనాఁడు. ఎక్కువ సందేహములు శంకలుగల మనుష్యులు గ్రంథములు వ్రాయుటకు పనికివత్తరేమో కాని కార్యములను సాధింపలేరు. మననుకు వచ్చినదానిని వెంటనే సాధింపఁ బ్రయత్నించువాఁడు పది పనులలో రెండైనను సత్కార్యములు చేయును. తక్కిన యెనిమిది యకార్యములు ప్రపంచప్రవాహములో మునిఁగిపోయి యా రెండే స్థిరముగా తేలును. అంతమాత్రముచేత నా యెనిమిదియు నతఁడు చేయలేదని కాని చేయఁజాలఁడని కాని ువాదించుట సాహనము.

మఱియు, కవిత్వము సంగీతము మొదలగు కళలకు లోఁగిన వారికి విషయ లోలత్వము తప్పనిదేమో! ఇది కొంత సాహస సిద్ధాంతమే యగును. కాని, హృదయమున జనించిన భావములను అడ్డఁగించుకోలేక బైట(బెట్టుట కళాధీనుల స్వభావము. కొంద ఱీతరులకు వెఱించి కొన్ని భావములను బైలుపఱుపక యడఁచు కొన్నను, ఆ భయము లేదని తెలిసిన వెంటనే స్వతంత్రముగ వానిని వెల్లడింతురు. కవులలో పచ్చి బూతులు వ్రాయువారు, గాయకులలో వానిని పాడువారు, చిత్రకారు లలో దిగంబరాది రూపములను చిత్రించువారు, చెక్కువారు, అట్టివానికి సంతసించి మెచ్చుకొనువారును అన్ని దేశములందును, అన్ని కాలములందును నీతి విలువ నెఱిఁగిన చదువరులే కలరు. ఈ స్వభావమే వారి వ్యవహారములందును వర్తించును. తోఁచినది చెప్పకపోవుట యెంతకష్టమో తలఁచినది చేయకపోయుటయు నంతే కష్టము. ఇందు న్యాయాన్యాయముల, ధర్మాధర్మముల విచారణకెక్కువ చోటులేదు. సహజమైన రసార్ధ హృదయమును నియమజ్యోతిచే గట్టిచేసికొన్న వా రనేకులు గలరుగాని వారట్లు గట్టిపడుటకు మొదలు కేవల రసపరవశులై హృదయదాసులైయే వర్తించి యుందురు. ఇందు కపవాదములు కలవు కాని మృగ్యములు.

పైవి యనుమానములు మాత్రమేకాక వేమన వేశ్యలస్వరూపమును చక్కగా నెఱిఁగినవాఁడని యతని పద్యములే ఫెూషించుచున్నవి. ఒక్క పద్యమునైన నుదాహరింపక విధిలేదు. మన్నింపుఁడు.

       "ఆ. లంజ లంజకాని లావెల్ఁల గొనియాడు
             లంజతల్లి వాని లజ్జ గడుగు"

కావున సిద్ధాంత మేమనఁగా

 
           "తల్లి గలుగు లంజఁ దగులుట చీకాకు, విశ్వ." (3351)

ఇందుపై వ్యాఖ్యాన మనవనరము. ఇదికాక “సానిదాని పొందు సౌభాగ్య భాగ్యము' అని అచ్చున కెక్కని పద్యభాగ మొకటి గలదు (ఓ.లై, 14-4-42). ఇవి ప్రక్షిప్తము లనుకొని సంతోషించువారు సంతోషింపనిండు. ఒకవేళ నట్టెనను, వేమనవంటి మహాత్ముని కిట్టిభావము లంటఁగట్టినను అతని మహత్త్వమునకు కొఱ(త రాదని నమ్మినవారు, అంగీకరించినవారు ఉన్నప్పడు అతనికే యిట్టి భావములు జీవితమం దొకానొక సమయమందుండియుండుననుట యసంభవము గానేరదు, ఒక విషయము అసంభవము కాకపోవుటకును సంభవించుటకును నడుమ నంతరము చాల స్వల్పము. సాధ్యములగు విషయములు సిద్ధములగునని నమ్ముట కెక్కువ హేతువు లక్కరలేదు.

ఇంతదూర మీ విషయము చర్చించుటకు మీరు నన్ను మన్నింపవలసి యున్నది. కారణము గలదు. ఈవల మనలో, మహాపురుషులందఱు అన్నివిధముల దోష దూరులుగా నుండవలెనను బ్రాంతి, విమర్శకుల నావేశించుచున్నది. నన్నయ, పెద్దన మొదలగు వారు మత్సరగ్రస్తులై యుండిరనియు, శ్రీనాథాదులు స్త్రీలోలురై రనియు, కృష్ణదేవరాయలు మొదలగువారు క్రూరకర్ములైరనియుఁ జెప్పుకథలు నమ్మరానివని అసత్యములని ఆధునిక విమర్శకులనేకులు రాద్ధాంతము చేయు చున్నారు. ఇవి సత్యములైనను అసత్యములైనను ఆనంభవములుగావనియు, దోషసామాన్యము దగ్గఱ జేరనీకుండచేసిన పరిశుద్ధమహత్త్వము ప్రపంచములో లేదనియు, కావున ఒకరియందు దోషములుండవని సిద్ధాంతీకరించుటకు వారి యందలి మహత్త్వము మాత్రమే చాలిసంత హేతువు కాఁ జాలదనియు నామనవి. సహజముగా వచ్చునవి దోషములు. సాధింపవలసినవి సద్గుణములు. కావున వీనిని సాధించు లోపల అవి కొంతకుఁ గొంతయైనను తమ హక్కును జెల్లించుకొని తీఱుననుట సత్యము. అది యట్లుండె,

ఇట్లు ఇంద్రియపరవశుఁడైన వేమన యెంతదూరము వెళ్ళెనో చెప్పట కష్టము. కథ ఒక్క వేశ్యకధీనుఁడైయుండె ననుచున్నది. దాని సనుసరించిన పద్యమొకటి 'ఒక్క వెలయాలి పొందే మిక్కిలి సౌఖ్యమ్మటంచు మెలఁగితివేమా! (1673) యనుచున్నది. కాని వ్రాఁత ప్రతులలో

       "క, ఒకతెకు లోలత భ్రమయక
            నుకుమారుం డన్నిరుచులఁ జూడఁగవలెఁటో
            సకలవనంబులఁ దుమ్మెద
            మకరందముగ్రోలినట్లు మహిలో వేమా" (ఓ. లై., 11-6-24)

అను పద్యము గలదు. ఈ రెండు పద్యములును వేమన్నవి కావని తిరస్క రించినను, వేమనవని స్పష్టముగానుండు ఆటవెలఁదులలోనే, యితఁడేక ప్రియా వ్రతమును పాలించిన వాఁడు కాఁడనియు, ఇంద్రియచాపల్యమున, మాటల యందును ఆటలయందును సౌమనన్యమునుగాని, నియమమునుగాని, పాటించిన వాఁడు కాcడనియును బలమగు సందేహమును గలిగించునవికలవు. : ధీనులను తిరస్కరించి ఖండించు పద్యములే కాక, ఇతనియున్మస్తకమదనోన్మాద మును వెలిపుచ్చు పద్యములనేకములు గలవు. బ్రౌనుదొర యీ యసభ్యపద్యముల నన్నిటిని ప్రత్యేకముగా నేరి యొక కూర్పుఁజేసి వానికి ల్యాటినుభాషలోఁ గాఁబోలు, టీక వ్రాసి పెట్టుకొన్నాఁడు!

ఎట్టి కాలమందైనను ఇతఁడిట్టి యవస్థలో నుండఁగా తలిదండ్రులుగాని తక్కిన బంధువులుగాని యోర్చియుండుట కష్టము. ఎప్పడును వేశ్యలు, బసివి రాండ్రు, దొమ్మరిసానులు మొదలగు వారి సావానమున నుండియున్న ద్రవ్య మంతయు వెచ్చపెట్టుచు, చేతలేనప్పడు సుప్రసిద్ధ చరిత్రముగల వేశ్యామాతల చేతి *అర్ధచంద్ర ప్రయోగము" లనుభవించుచు, చాల దుర్బల హృదయుడైన యితని నెట్లు త్రోవకుఁ దేవలయునా యని వారాలోచించి, వివాహముచేసినఁ గొంత మేలుగానుండునని తలఁచి యట్లు చేసిరి కాఁబోలు. సంపన్నుల యింటివాఁడు గావున నితనికి అట్టి వంశమందే జనించిన సౌభాగ్యవతి యొకతె ముడివడి యుండును. ఇదివరకు వేశ్యాప్రియత్వముచే పలు కష్టములు పడినవాఁడు గావునను, వారివన్నియు 'పూఁత మెఱుఁగువంటి వలపులే" కాని, పడుపువృత్తిలో హర్థమైన స్నేహము లేదని యొఱిఁనవాఁడు గావునను, ఆ త్రోవ యొక్కమాఱు చాలించి, తనధర్మపత్నియగు నామెపై ప్రేమనంతయు నిలిపినాడు. ఎ పనియు ఆరవాయితో చేయు స్వభావము గలవాఁడు కాఁడు గావున ఎప్పడును ఆమెను వదలి యుండనేర నంత ముగ్ధుఁడైనాఁడు—

       "ఆ. తుంట వింటివాని తూపులఘాతకు
            మింటిమంటి నడుమ మిడుకcదరమె ?
            ఇంటియా లివిడిచి యెట్లుండవచ్చురా!" (1952)

ఇదియేదో సందర్భమున గ్రామాంతరమునకుఁ బోవుటచే గాబోలు నొంటిగా నుండవలసి రాcగా నప్పడు చెప్పిన పద్యమై యుండును. కొత్త ధర్మపత్ని గూరిమి మగఁడైన యీ కాలమందే యితఁడిట్లు నిర్ణయించు కొనెను :

    "ఆ. ఇంటియూలి విడిచి యిల జార కాంతల
          వెంటఁదిరుగు వాఁడు వెఱ్ఱివాఁడు,
          పంటచేను విడిచి పరిగె లేరినయటు" (359)

కాని యీ వివాహము సుఖముగా పరిణమింపలేదు. కారణము స్పష్టమే. నవవధువు నవవరుని అభిలషించును. ఆమెను వేమన వరియించి యుండెనేమో గాని యూమె మాత్రము ఇతనిని తానై వరించియుండదు. అది తొంబదిపాళ్ళు ఇరు ప్రక్కల పెద్దల యేర్పాటు. కావున భర్త యిప్పడు తనయెడల నెంత విశ్వాసముతో వర్తించినను అతని మొదటి నడవడిని ఇరుగుపొరుగుల 'సఖీమణులు' తప్పక యామెకు వన్నెపెట్టి చెప్పియుందురు. అతనికి ప్రీతిపాత్రమైయుండిన యే సంత బసివి'నో చూపి, 'అదిగో ! నీ లెక్క లేని యక్కలలో నొక్కతె యుని వేళాకోళము చేసియుందురు. ఏమియు నెఱుఁ గని వారి విషయముననే వేడుకకో వెక్కసమునకో యిట్టి కథల నల్లి సంసారములు ధ్వంసముచేయువా రెందరో కలరు. అట్లుండ వేమనపంటి వాని విషయమున నడుగవలెనా ? పాపము ! ముగ్ధయగు నామె యిట్టి వానికి నన్నుఁ గట్టిరి గదా యని వగచి, ఎట్లైనను అతనికి తాను లోఁగియుండక, తన యాజ్ఞలో నతని నుంచి, యిల్లు కడప దాఁటనీక చేయవలెనని వారి బోధనల ప్రకారము యత్నించి యుండును. ఎత్తిపొడుపుమాటలు, బొమముడులు, అనాదర ణములు, మౌనముద్రలు మొదలగు అస్త్రశస్త్రము లెన్నియో యామె ప్రయోగించి యుండును. ఇ(క వేమన్న పట్టుకతో అగ్గిరాముఁడు! క్రొత్త పెండ్లికొడుకునకు ఇవన్నియు అలంకారముగానే తోఁపవచ్చునుగాని వేమన్న యివన్నియు ననుభవించి యెఱిఁగిన ప్రాఁతకా(పు. అక్కడ సౌఖ్యములేదని యిక్కడనది గలదని యాశతో పెండ్లాడినవాఁడే కాని వేఱుకాదు. మఱియు, ఆమె కితనియం దెట్టి సందేహము. గలదో యితని కామెయందును అట్టి సందేహమే కలదు. అనఁగా, నా మెయందు దోషముండెనని కాదు. ఉండవచ్చునని కాని, కలుగవచ్చునని కాని, వేమన్నకు సందేహము గలదన్న మాట. మొదటినుండి స్త్రీని కేవల భోగ్యవస్తువుగా మాత్రము. భావించి, వారికి వేఱు తమకు వేఱుగా శాస్త్రములు వ్రాసుకొన్నవారి గుంపులోనే యితఁడును పెరిగినవాఁడు ; కాబట్టి'

      "ఆ, వరుఁడు చక్కనైన వజ్రాలగనియైన
            తళుకు మొఱుపువంటి తత్వమున్న
            అన్యపురుష వాంఛ ఆఁడుదానికినుండు...? (3422).

అని చిన్న నాఁటినుండియే యితని కుపదేశము జరిగినది. కనుకనే భర్త భార్యను స్వాధీన మందుంచుకొనవలెననియు, దానికి స్వాతంత్ర్య మీయరాదనియు నితఁడు, దృడముగా నమ్మినవాఁడు—

       "ఆ. మాట వినని యూలు మగనికి మరగాలు.' (3028)
       "ఆ. ఆలు మగని మాట కడ్డంబు వచ్చెనా
             ఆలుగాదు నుదిటి వ్రాలు గాని
             అట్టియాలి విడిచి యడవినుండుట మేలు..." (311)

       "ఆ. కాపవలయు మగఁడు కాంత నెల్లప్పడు
             కావలేని నాఁడు చావవలయు !
             కాcపు లేనిదాని కా(పర మడుగరా..." (1092)

అని యితని బోధ. అట్లగుటచే, ఇట్లు తనయందు గౌరవములేని--

      "ఆ. ఆలి వంచలేక యధమత్వమున నుండి
            వెనుక వంతుననుట వెట్టితనము
            చెట్టు ముదరనిచ్చి చిదిమినఁ బోవునా.." (301)

అని నిర్ణయించి, ఇతఁ డామెను ఇల్లు కదలనీక, ఇతరులను కన్నెత్తి చూడనీక, తన మాట కడ్డమాడనీక, దండింప మొదలుపెట్టెను. ఇక ఆమె మాత్రము రెడ్డికూఁతురు గాదా ! ఇతని రక్తమునం దున్నంత వేఁడి, స్వాభిమానము, ఆమె రక్తమునందును. గలదు గదా! కావున చూచినన్నాళ్ళను చూచి తుదకు నిర్లక్ష్యముచేసి ప్రతిఘటించి నిలచినది. ఇట్లీ రెడ్డిసానుల స్వాభిమానకలహములో ఉన్న ఆ ఇంత ప్రణ యమును పటాపంచలైనది. వేమన్న కిల్లు నరకప్రాయమైనది. ప్రభుత్వము చేయ వలసిన రెడ్లవంశమువాఁడు; అట్టి వానికి తన భార్యయే యెదిరించి నిలిచిన పౌరుషమున కంతకంటె హానికలదా ? మాటయెత్తిన వెంటనే యతని భార్య-

       "ఆ, వాడకుఱికి తిట్టు, వలదన్న మొఱఁబెట్టు,
             ముందు మగని దిట్టు, ముసుకుఁ బెట్టు,
             గడునురాలు మగని గంపఁబెట్టమ్మురా.." (3446)

కనుకనే “యిట్టి యాలితోడ నెట్లు వేగింతురా!? (3445) ' దేవఁడా" యని వేమన్న విసిగి వేనరినాఁడు. సహజముగా హింసాదులను సహించు స్వభావము గలవాఁడు కాఁడుగావున, ఇట్టి పనికిరాని భార్య నొక మాఱు గొంతు పిసికి చంపి పాఱవైచి, యింకొకతెను పెcడ్లాడుద మను రాక్షస కృత్యమునకు చొరఁగలవాఁడు. కాఁడయ్యెను. మీఁదు మిక్కిలి తానే 'చావవలయు’ నని తలచిన మానశాలి !

       "ఆ. భావమరసి తన్ను భార్యసేవించిన
             ఇంటికైన నగును ఈశ్వరుండు
             అదియులేక బ్రతుకు టధమము భువిలోన.." (2841)

ఈ యవస్థలోనే తన యదృష్టమునుగూర్చి యిట్లు దీనముగా విలపించెను: '

       "ఆ, సుఖసుఖాన నేను సుగుణుఁడై యుండఁగా
            నన్నుఁ బెండ్లియాడ నయముఁజెప్పి
            దీని గూర్చిన విధి నేనేమి యందును." (3802)

       ఆనునదేమి ? 'తప్పు లెన్నువారు తమ తప్పు లెఱుఁగరు' (1799)

అను తన న్యాయమును తనకే యన్వయించుకొని నోరుమూసికొని యుండుటతప్ప ! "అపరాధము స్వయంకృతము! అనుభవమే ప్రతీకారము.

ఈ భార్యయందితనికిఁగలిగిన సంతానముగూడ సుఖకరముగా పరిణమించి నట్లు కానము. తల్లిదండ్రులకుఁగల యిట్టి యనుకూల దాంపత్యమందు పుట్టిన బిడ్డల గతిని విచారించువారెవరు? వారు స్వేచ్చగాఁ బెరిగిరి. స్వేచ్చగా వర్తించిరి. ఇట్టి సంతానము గూర్చిన పద్య మొకటి-

       "క. ఎండిన మ్రానొకటడవిని
            నుండిన నందగ్ని పట్టి యూడ్చును జెట్లస్
            దండి గలవంశ మెల్లను
            చండాలుం డొకడు పుట్టి చంపును వేమా" (624)

ఇట్లు వేమనకు

       "ఆ. సుగుణవంతురాలు సుదతియై యుండిన
             బుద్ధిమంతులగుచుఁ బుత్రులొప్ప
             స్వర్గమేటికయ్య సంసారికింకను ... " (3903)

అని పడిన పేరాస లన్నియు వమ్మై పోయినవి. ఇందుకుఁ దోడు వేశ్యా ప్రియ త్వపు మహత్తుచేత ఆస్తియరిగిపోఁగా పేదఱికముగూడ ననుభవించినట్లు గానవచ్చు చున్నది. ఇదివఱకు తన్నాశ్రయించి తనయెడ భయభక్తి స్నేహములు చూపిన వారెల్ల నితని సహవాసము వదలుటయే కాక వేళాకోళముగూడ చేసినట్లున్నది

       "ఆ, కుడువఁ గూడులేక కూడఁ బెట్టఁగలేక
             విడువ ముడువలేక గడనలేక
             నడవసాఁగియున్న నడపీనుఁ గందురు..." (1135)

ఇతరులు తన్నేమన్నసు మానెను గాని యింటిలోనే-

       "ఆ. కూలి నాలిచేసి గుల్లాము పనిచేసి
             తెచ్చి పెట్టెనేని మెచ్చునాలు,
             చిక్కుపడ్డ వేళ చీకాకు పఱచురా.." (1163)

       "ఆ. ధనములేమి సుతుల, తప్పలనిడుదురు
             ధనములేమి( బత్ని తాఁక రాదు.. " (2114)
కాఁబట్టి

       "ఆ, ధనము లేమి యనెడు దావానలం బది
            తన్నుఁజెఱుచు మీఱి దాఁపఁ జెఱుచు
           ధనములేమి మదిని తలఁపనె పాపంబు..." (2113)

వేమన్న విసిగి పోయినాఁడు. తనకొడుకు లేమియుc బనికి రాకపోయిరి. యోగ్యులగు పతులను గన్నవారినిజూచి యిట్లు పేరాసపడెను :

       "ఆ, దనము లేని పేదతండ్రి గర్భంబున
             భాగ్యపరుషు డొకఁడు పరఁగఁ బుట్టి
             బహుళ ధనముఁ గూర్చి భద్రమార్గంబున
             పరుల కుపకరించి ప్రబలు వేమ" (2111)

వేమనకీ కాలమునకు ధనము స్వార్థముకొఱకను భావము నశించినది. జన్మ మెత్తినందులకు గతిలేని వారిని పోషించి యుపకరించుట పరమార్థమని తేల్చు కొన్నాఁడు. తన కాలమందలి స్వతంత్రులగు నిరంకుశప్రభువులు, రెడ్లు, పాళయ గాండ్రు. పరదేశీయులగు మహారాష్ట్రులు మొదలగువారు, ధనము కొఱకై

       "ఆ. పెక్కు జనుల( గొట్టి పేదల వధియించి
             డొక్క కొఱకు నూళ్ళు దొంగిలించి" (2594)

చేసిన యల్లకల్లోలమును చూచినాడు. క్షామడామరముల దాడిని కనుఁగొన్నాఁడు. నిలువ నీడలేక, కడుపునకు కడిలేక ఉన్నచోటు విడిచి యూరూరు దిరుగుచు మల మల మాఁడువారి నెందఱినో యెదుర్కొనినాఁడు. చేతనైనంత వరకు నట్టివారిని రక్షించుట తనధర్మమని తోచినది. అన్నదానమునకు మించిన దానము లేదని తేలినది

      “ఆ. ఆఁకలన్న వాని కస్నంబుఁ బెట్టిన
           హరుని కర్చితముగ నారగించు... " (209)

కనుక పేదల సేవయే పెరుమాళ్ళ సేవ. ఇ(క తనకాలమందలి ధనికులు కేవలము కుక్షింభరులై, లోభులై, పరదుఃఖదుఃఖిత్వము లేక నిర్ధయులై యుండిరి. మఱి కొందఱు, విషయపరాధీనులై దుర్వ్యయముల పాలయియుండిరి. ఇట్టివారిని జూచి

       "ఆ. ఆఁకలి గొని వచ్చెనని పరదేశికి
             పట్టెఁ డన్నమైనఁ బెట్టలేఁడు.
             లంజెదాని కొడుకు లంజల కిచ్చురా..." (210)

అని యసహ్యపడినాఁడు."ధనము వెంటరాదు ధర్మంబు సేయురో.." (2108 )

అని గొంతెత్తి యఱచి, ప్రార్ధించి, తిట్టినాఁడు. కాని వినువారు లేరైరి. వారికిచ్చినట్లు ధనము బ్రహ్మ తనకేల యియ్యఁడని కొఱవపడి

       "ఆ, విత్తమొకరి కిచ్చి వితరణగుణమును
             చిత్తమొకరి కిచ్చి చెఱచినాఁడు.
             బ్రహ్మచేత లన్ని పాడైన చేఁతలు..." (3498)

       "ఆ. ఉదధిలోని నీళ్ళు ఉప్పలుగాఁజేసె
             పసిఁడి గల్గువాని పిసినిజేసె
             బ్రహ్మదేవచేత పదడైన చేతరా.." (ఓ. లై.,13-3-39)

అని యానిర్హేతుకబ్రహ్మ కొక వషట్కారము చేసినాఁడు; కాని తనకెంత బీదఱికమైనను-

       "ఆ. అరయు "నాస్తి యనక యుడ్డు మాటాడక,
             తట్టుపడక, మదిని తన్నుకొనక,
             తనది గాదనుకొని తాఁబెట్టినది పెట్టు..." (156)

అని నిర్ణయించుకొనెను. అందును ఎంతక్షామమైసను ఎంగిలి యన్న మితరులకుఁ బెట్టిన కుక్కలై పట్టుదురని తలఁచినవాఁడు (639). కాని యిందులో నొకకష్టము. ఇచ్చేవానిని చూస్తే చచ్చేవాడును లేచు" నను శాస్త్రము సత్యములలో సత్యము. బిచ్చగాండ్రకు బిడియములేదు సరికదా దయా దాక్షిణ్యములును నున్న,

            "భీభర్తు భృత్యాన్ ధనికో దత్తాం వాదోయ మర్ధిషు
             యావద్యాచక సాధర్మ్యం తావల్లోకో నమృష్యతి"*[2]
                                                 (నీలకంఠ దీక్షితుని కలివిడంబనము, ప, 69)

అన్నట్టు, తమవలె దాతయు బిచ్చగాఁడగువఱకును యాచకులకు తృప్తిలేదు. ఇంతమాత్రము వేమన్నగారి దానము వాసన తగిలినఁ జాలును. దేశములోని వారందఱును, కలవారును లేనివారును, ఇతని వంటయింటనే వచ్చి కూర్చుండి కాపురము చేయుదురు! ఇఁక నింటిలోని యాపై సమాచారము మన మెఱుఁగుదుము. ఇంకను వినుఁడు-

        "ఆ. భాగ్యవంతురాలు పరుల యాఁకలిదప్పి
              తెలిసి పెట్టనేర్చు తీర్పనేర్చు ;
              తనదు దుష్టభార్య తనయాఁకలి కాని
              పరుల యూఁక లెఱుఁగ దరయ వేమ" (2833)

ఈ యవస్థలో ఈ యతిథిపూజకు( కావలసిన }ద్రవ్య మెందుండివచ్చును? ఊరక యింటఁ గూర్చున్న జరుగదని సంపాదనకుఁ బ్రయత్నించి కొన్నాళ్ళేవఁడో యొక రాజును కొలిచి చూచెను. కాని యాకాలపు సామాన్యరాజుల నమాచారము వేఱుగా చెప్పఁబనిలేదు. మఱియు ఈ వట్టి వెచ్చగానికి వలసినంత జీతమిచ్చిన, వారికితఁడు చేయఁగలిగిన సేవమాత్ర మేమియున్నది? కత్తిఁబట్టి యుద్ధముచేయు నేర్పున్నట్లు తో(పదు. ఇఁక వారితో నిచ్చకాలాడి వారిని ఇంద్రచంద్రులని పొగడఁ గల యోర్పును ఇతనికి లేదు. కోపము వచ్చినచో పద్యాలతో తిట్టఁగలఁడంతే. తుద కదియే జరిగినది---

       "ఆ. ఎఱుకలేని దొరల నెన్నాళ్ళు కొలిచిన
             బ్రతుకు లేదు వట్టిభ్రాంతిగాని
            గొడ్డుటావు పాలు గోఁకితే చేపునా ?...." (691)

అని యొకనాటి కా తంటా వదిలించుకొన్నాఁడు. కాని ముందుమార్గము ? మాన మర్యాదలు వదలి ధనవంతులను యూచించి సంపాదింపఁ బ్రయత్నించెను. కాని యిచ్చువాఁడెవఁడు ? తుదకు వారికిని రెండు ఆశీర్వాదములు

        "ఆ. కండలెల్లఁగోయఁ గాసీయఁజాలని
              బండలోభి కాసపడినఁగలదే ?
              కొండక్రిందఁ బసిఁడిగోరిన చందంబు..." (866)

         “క, మృగములు మృగముల నడుగవు
             తగనడుగవు పక్షిజాతి తన సరివానిన్
             మగవాఁడడిగిన నీయని
             మగవాఁడా మగపగాక మహిలో వేమూ !" (3232)

ఎందైన ఒకరిద్దఱికిచ్చు బుద్దియున్నను వారు దుర్మంత్రుల చేతి కీలుబొమ్మలు--

        "ఆ. ఇచ్చువానిచెంత నీయనివాఁడున్న
              చచ్చుఁగాని యీవి సాఁగ నీఁడు,
              కల్పతరువ క్రింద గ్రచ్చచెట్టున్నట్లు..." (347)

వేమన్న రోసినాఁడు. కాని కష్టపడువారిని జూచి మొగము త్రిప్పకొనిపోవు స్వభావ మతనికి సాధ్యముగాదు గావున, అడిగినవారి కప్పుడు తనవద్ద నేముండినను, ఎవరి దైనను, గమనింపక వెచ్చపెట్ట మొదలిడెను---

        "ఆ. ధైర్యయుతున కితర ధనమైన నెదురేమి?
             దానమిచ్చునపుడె తనకుఁ దక్కె,
             ఎలమి మించుపనికి నెవరేమి సేయుదు
             రడుగుదప్పఁ దప్పు బిడుగు వేమ" (2140)

అందుచే సన్మార్గమున పదార్థముగా వెచ్చింపని ధనవంతుని ధనమును వాని యనుమతి లేక మనము సత్కార్యమునకై సెలవచేసినను పాపములేదని యతఁడు నమ్మెను. మఱియు, నదియు నొక ధైర్యకృత్యముగా నతని రెడ్డిరక్తమునకుఁ దోఁచెను

       "ఆ, తనదు సొమ్ముఁజూడ దానమియ్యఁగ వచ్చు
             నవని దొడ్డగాద దెవరికైన
             అదరుబెదరు లేక యన్యుల సొమ్ముల
             దానమిచ్చువాఁడు దాత వేమ"* [3]

వేమన యిట్టి యౌదార్యబ్రాంతి ప్రవాహములోఁబడి యింకను చాలదూరము పోయినాడేమో యని భయపడవలసియున్నది. చూడుఁడు.

       "ఆ, ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన
            నటలనైన సాహసముననైన
            సంపదవలన సాధించి ధనమును
            బడుగునకు నొసంగ బాగు వేమ" (2097)

సత్కార్యసాధనకై దుష్కార్యముతో ద్రవ్యమార్జించినవారు అరవలలో తిరుమంగ యాళ్వారును, తెలుఁగులలో గోలకొండ గోపన్నయు మనకు పరిచితులే, వేమన నిజముగా పై పద్యమున సూచింపఁబడిన దుర్మార్గమునకే చొచ్చియుండెనేని, అటు ద్రవ్యమార్జించి రాళ్ళురప్పలలోఁ బోసి గుడులు గట్టిన పై యిద్దఱికంటె, కూడులేక చచ్చువారిని పోషించుటకు వినియోగించిన యితనియందే యెక్కువ న్యాయమున్న దనుకొనవలసియున్నది.

కాని, వేమనవంటి విశుద్ధహృదయమునకు చాలనాళ్ళు ఇంటిపనులు గిట్టి యుండుట యసాధ్యము. విశుద్ధహృదయ మనఁగా దోషమే లేనిదని కాదు; కపటము. మోనము మొదలగునవి లేనిదనుట. తప్పో యొప్పో తలఁచినది తలఁచినట్లుగాఁ జెప్పి, చెప్పినట్లుగా జేయు త్రికరణశుద్ధి గలవాఁడన్నమాట

       "ఆ. మాటలెల్ల కల్ల మనసెల్ల దొంగ యౌ
             నేటి ప్రాణమింక బ్రదుకు !
             మాట నత్యమైన మణి శతాయుష్యంబు..." (3206)

కనుక ఈ మార్గముతో ద్రవ్యమార్జింప సాధ్యముగాదు. కాని తనది ప్రపంచ సంసారము ; పథము జరుగుట యెట్లు ?

ఈ సందర్భమునందే కా(బోలు ఇతనికి చౌకలోహములను వెండిబంగారులుగా మార్చు రసవాదవిద్యపై మనసు పోయినది. ఇనుము, ఇత్తడి, రాగి మొదలగు లోహముల పాత్రము లెంత బీద సంసారమందైన నుండును. వాని నెల్ల బంగారుగా మార్పఁగల్లినయెడల నీ తిరి పెపుతంటా లుండవు కదా ! ఇందుకై యితఁడు వాద గ్రంథములు కొన్ని చదివియుండును. ఏ బైరాగులనో, కంసాలులనో యాశ్రయించి యుండును. ఎట్లును అనేక రసవాదయోగముల నితఁడు స్వయముగా చేసి చూచి నాఁడు. ఇంతేకాదు, ఆ విద్యలో సిద్ధినిగూడ బొందినట్లున్నది. కాని “యతఁడు సాధించిన సిద్ధిస్వరూప మెట్టిది? పై లోహములకు బంగారపుతూకము, వన్నె, మార్ధవము మొదలగు గుణములన్నియు పూర్తిగా వచ్చునట్లు చేయగల్గెనా ? లేక వన్నె మాత్రము గలిగించి తాను వంచితుఁడై లోకమును వంచించెనా ?" యను ప్రశ్నలకు సమాధానము నే నీయఁజాలను.

ఇఁక నీ రసవాదవిద్యయే మిథ్యయని, మోసమని భావించి, వేమన యీ పద్యములు వ్రాయనేలేదని నమ్మి యానందముతో నుండువారు ధన్యులు. కాని నాకంత నెమ్మది లేదు. ఈ విషయమును బోధించు అనేక పద్యములలో వేమన్న యొక్క యనన్యసులభమైన శైలి ప్రతి పదమునందును తాండవమాడుచుండును.

       "ఆ, బింబలములుండ దిగువైన
             ఫరసముండ పసిఁడి కొఱకు తిరిగి పాట్లుపడిరి
             సత్తు వెచ్చ(బేసి సాధింపలేరొకో... " .(2749)

       "ఆ. ఇంగిలీక మహిమ హేమించనేరక
             చిత్రపటమువ్రాసి చెఱచినారు ;
             బొంతజెముడు పాలఁ బొంగించ నేరరు..." (339)

ఇత్యాదిపద్యములు వేమన్నవి కావనువారిని, మఱలనొకమాఱు వేమన్న పద్యము లన్ని చదివి యామాట చెప్పుఁడని వేఁడుచున్నాను. అస లీవిద్య మిథ్యయని యేల యనుకొనవలెను ? పాశ్చాత్య శాస్త్రముల కిది తెలియదనియా ? లేక మనలో నిప్పు డెవరును చేసి చూప్పువారు లేరనియా ? మొదటి పక్షమున తూర్పు వారెఱింగి పడమటి వారెఱుంగని విచిత్రవిద్యలు లేవా? ఈజిప్టువారు వేలకొలఁది యేండ్లు పీనుఁగులను క్రుళ్ళిపోకుండ భద్రముగా పెట్టెలలో దాఁచియున్నారే పాశ్చాత్యులకు దాని రహస్య మర్ధమైనదా ? మనలో సామన్యయోగులు నిరాధానముగ నంతరిక్షమందు నిలుతురే (ఇది నేను పత్యక్షముగాఁ జూచినది); అది యేపాశ్చాత్త్య శారీరకశాస్త్ర ప్రకారము సాధింపవచ్చును? కరఁగిససీసము కాలకూటవిషము మొదలగు పదార్థములను గిన్నెలకొలఁది గటగట తాగి జీర్ణించుకొన్న 'స్వామిసీతారామ్జీ" యను అద్భుతశక్తి గలవాఁ డిప్పుడును ఉన్నాఁడు గదా! వేలకొలఁది జీతములదిను పాశ్చత్యవైద్యులు, ఏదీ దాని రహస్యమును బైటఁబెట్టనిండు.ఇఁక మనలో వట్టిశాస్త్రములు చెప్పవారే కాని చేసి చూపవారు ఇప్పడు లేరనుట చాలవఱకు సత్యము. అది యిప్పటి మన సర్వదరిద్రావస్థ. కాని యిదియొక రసవాదముందేనా? గోమఠేశ్వరునివంటి అఱువది యడుగుల యెత్తగల యేకశిలా విగ్రహమును దీర్పఁగలవారు మనలో నేఁడున్నారా? చుట్టుప్రక్కల నామడల కొలఁది చూచినను అఱచేతి వెడల్పురాయి దొరకక, బట్టలుతుకుటకుఁగూడ చెక్కపలకల నుపయోగింపవలసిన దేశమందు, శ్రీరంగపు దేవళమువంటి విచిత్రవిశాల శిలామయమైన మహెూన్నత మందిరమును మన ప్రాచీనులు నిర్మించిరిగదా? నేఁటి మనకు కలలోనైన నా శక్తి సాధ్యమని తోఁచునా? ఈ కారణముచేత పైఁజెప్పినవన్నియు మన బ్రాచీనులు చేసినవి కావని తలఁపలేము.

ఇఁక నీ విద్య సత్యమని చెప్పటకు నీకేమి యాధారమందురేమో ! సత్యమని నేను జెప్పలేదు; సత్యము కావచ్చునన్నాను. కారణము ఈ స్వర్ణవాద యోగములను దెలుపు అసంఖ్య గ్రంథములుండుటయే. వానిని వ్రాసిన వారందఱును వంచకులని కాని, బ్రాంతులని కాని చెప్పఁజొచ్చుట సాహసము. నా కంతటిదైర్యము లేదు. ఇది గాక ఈ విద్యను సాధించుటకై అనేక సంవత్సరములు వ్యయప్రయానములకు లోనై కొంతవఱకు దాని మర్మముల నెఱిఁగినవారు-పూర్తిగా దానిని తాము సాధింప లేకున్నను, సాధించినవారు ప్రత్యక్షముగా నిస్సంశయముగా రసము మొదలగు వానిని బంగారముగా మార్పఁగా కన్నులారఁ జూచినవారు-కపటవంచనాదులులేని నిష్క ల్మష చిత్తులు—ఆగు కొందఱిని నేనెఱుఁగుదును. కావున యిప్పటి పాశ్చాత్యుల యజ్ఞానముగాని, మన యజ్ఞానముగాని ప్రాచీనుల యజ్ఞానమును స్థాపించుటకు చాల వని నా మనవి. ఇట్టిసందిద్దవిషయములలో లేదనుకొనుటకన్న ఉండవచ్చుననుకొను టయే యుత్తమమార్గము.

మఱియు, ఇందఱు ఆధునిక రసాయనశాస్త్రజ్ఞులలో నల్లవారైనను, తెల్లవా రైనను ఎవరుగానీ, పాశ్చాత్యుల సిద్ధాంతముల ప్రకారము, ఆ గురువుల యుపదేశము ప్రకారము, వారి పద్ధతులనే యవలంబించి లక్షలకొలఁది వెచ్చించి పదార్థపరీక్షలు యుచున్నారే కాని, ఇట్టి యోగములను చక్కఁగాఁ దెలిసికొని పరీక్షించి సత్య మును బైలుపఱుపవలెనని పరిశ్రమించు వారేరి? పాశ్చాత్యపద్ధతులకై దిక్కుదిశ లేక కోట్లకొలఁది వెచ్చించు ' తాతా ఇస్స్టిట్యూటు' వంటి శాస్త్రపరిషత్తవారిట్టి విషయ ములకై యేలప్రవేశించి పనిచేయరాదు? ఇట్టి విషయములను మనవారివద్దనుండి తెలిసికొనుట చాలకష్టమనియు, సామాన్యముగా వారుచెప్పరనియు నేనెఱుఁగుదును. అర్థముకాని యప్రయోజకములైన మనవారి సంప్రదాయములలో నిదియొకటి. మన శాస్త్రములకు పట్టిన పెద్ద చీడపురుగది. కాని సత్యాన్వేషకులని పేరుపెట్టుకొన్న వారిట్టి విఘ్నముల నెదుర్కొనలేకపోవట, అది కారణముగా అసలే లేదనిచెప్పి యజ్ఞా నానంద మనుభవించుట, క్షమింపరాని దోషములు. ఇట్టివారి పేఁడిమాటలకు మందొకటే- ఉదాసీనము.

మఱికొందఱిరసవాద పద్యములకు వేఱువిధముగా అపార్థములుచేయుదురు. ఈ క్రింది పద్యము వినుఁడు :

       "ఆ. ఉప్పు చింతపండు నూరిలో నుండఁగా
             కరువదేల వచ్చె కాఁపులార
             తాళకం బెఱుఁగరొ తగరంబు నెఱుఁగరో..." (536)

దీనికి రసవాదజ్ఞ లొకరిట్లు అర్థము చెప్పిరి-"తాళకము అగ్గిసెగకు నిలువని వస్తువు. దానికి ఆగ్నిజయమును గల్గించి భస్మముఁ జేసిన నది స్వర్ణయోగ సాధనము లలో ముఖ్యవస్తువగును. ఈ పద్యమందాభస్మీకరణ మార్గము చెప్పఁబడినది. తాళ కము తగరపురేకులో చుట్టి పెట్టిమీఁద చింతపండు మెత్తిక్రింద మీcద నుప్పుపోసి పుటము వేసిన అది భస్మమగును. తరువాత దానిని ఇతర లోహములతో చేర్చి పుటము వేసిన బంగారు సులభముగా నగును.?? కాని యీ సులభవిషయమే రహన్యమట! దాని నెఱుఁగుటయే కష్టమcట! కాని, తాళకమును తగరమును, ఉప్పుచింతపండ్లతో చేర్చి నారో కూరయో చేయు క్రొత్తపాకశాస్త్ర మర్మమొకటి తెలియువఱకును, పై పద్యము నకు మీదఁజెప్పిన యర్థమువంటిదేదో కలదని మనమందలి మంగీకరింపవలసి యున్నది గదా! కాని ఈ వాదవిద్యలో నమ్మకములేకయో, ఉన్నను హిందువు విద్యను నేర్చియుండరను నూహచేతనో, నేర్చియుండినను వేమన్నవంటి విరాగి కీ విద్యయం దాశకాని, ఆన క్తికాని యుండదని తలఁచియో, బ్రౌనుదొర ఈ పద్యమున కొక విచిత్ర విపరీత వ్యాఖ్య చేసెను. ప్రతిపదార్థము తొలుత వ్రాసి, తరువాత

  • That is, I advise you to poison yourselves either with matural poisons or with immoderate quantities of salt or tamarind acid.' " అనఁగా మీరు (కరవు వచ్చినప్పడు) సహజములైన విషములనుగాని, లేక, మితిమీఱి ఉప్పను, చింతపండుపులుసునుగాని భక్షించి ప్రాణములు వదలుcడు " అని వేమన్న క్షామమునకు చావును మందుగా హితోప దేశము చేసెనని భావము వ్రాసెను! *[4]

ఇఁక వేమనపద్యములన్నిటియందును వేదాంతార్ధము కలదనుకొని మనవా రొకరు వ్రాసిన వ్యాఖ్య మచ్చుకు

“దీనికి రహస్యార్ధము గలదు. ఎట్లనగా 'ఉప్ప నీళ్ళలో వేసినయెడల (అనఁగా అది పుట్టుచోట) ఎట్లు కరిగిపోవునో, అట్లే యీ శరీరము నశించిపోవును. చింతపండు ఎట్లు పై బెరడున్ను, లోపలిగింజయున్ను పండును అంటుకొనియు అంటుకొనకయునున్నదో, అట్లే సంసారములో నుండువాఁడును భార్యపుత్రాదులయెడ అంటి అంటక యుండవలయును. తాళకంబు నిప్పులో వేసినయెడల ఎట్లు మాయమై పొగగా పోవునో, అట్లే ఈ శరీరమును నిప్పలో వేసినయెడల కాలిపోవును. తగర మెట్ల భూమిలో వేసినయెడల ఉన్న తావు తెలియక నశించిపోవునో, అట్లే ఈ శరీరమును నశించిపోవును. కాబట్టి మీరు దీనినంతయు చూచుచుండియు దుర్భిక్షము సంభవించెనని దుఃఖించవలదని భావము. ఇంతే యీ పద్యార్ధముగాని బంగారము చేయుదానికై చెప్పినట్లు భ్రమపడగూడదు."† [5]

ఇన్ని తొందఱలేల? వేమనగూడ నొకానొక కాలమందు దీని నమ్మియుండె నేమో పోనిమ్మనుకొనినయెడల ప్రపంచము మునిఁగిపోవనా? పోనిండు. ఈ సందర్భమున ఇటీవల జర్మనీలోనో, జపానుదేశమందో యెవఁడో శాస్త్రజ్ఞఁడు రసమును బంగారముగా మార్పఁగలిగినాఁడని పత్రికలలో నెల్ల ప్రకటింపఁబడిన విషయము మీ జ్ఞప్తికిఁ దెచ్చుచున్నాఁడను. అది యసత్యమని మరలC గొన్ని పత్రికలలో ప్రకటింపఁబడెననియు మిత్రు లొకరు చెప్పిరి. ఇది యనత్యమని దృడముగా నమ్మి మనమే నెమ్మదిగా నున్నాముగాని, పరదేశమువారింకను ఈ విషయమై కష్టపడుచునేయున్నారు. ఇంతలోనే యెప్పడో దీని తత్త్వము వారి శంఖములోcబడిరాఁగా అప్పడా తీర్ధమును మనము భక్తితో నెత్తిపై ప్రోక్షించుకుని పవిత్రుల మగుదుము ! అది యట్లుండె,

రసవాదములో పరిశ్రమించినవారికి వైద్యము సహజముగా లభించును. " వాదభ్రష్టో వైద్యశేష్ట!' అనుమాట మీ రెఱుఁగుదురు. ఆట్లే వేమనకును కొంత వైద్యము వచ్చినట్లున్నది. కుక్క కఱచినందు కితని చికిత్స.

       "ఆ, కుక్కగఱచెనేని కూయనీయకపట్టి
             ప్రక్కవిఱుఁగఁదన్ని పండఁబెట్టి
             నిమ్మకాయదెచ్చి నెత్తిన రుద్ధిన
             కుక్క విషము దిగును కుదురు వేమ" (1116)

ఈ చికిత్సను దప్పించుకొనుటకైనను నా కెప్పడును కుక్క కఱవకుండ భైరవని ప్రార్ధింపవలసియున్నది! ఇదిగాక

             “భూమి క్రొత్తయైన భుక్తులు క్రొత్తలా" (634)
             "అంటనీయక శని వెంటఁ దిరుగు" (666)

అను నిట్టి కొన్నిమాటలచే వేమనకు కొంచెము జోస్యమును తెలిసినట్లున్నది. కాని యంతలోనే "జ్యోతిషము జనముల నీతులు దప్పించు" (2718) ననుకొని చాలించుకొన్నాఁడు.

ఈ రసవాదవిద్య నేర్చి వేమన్న యెంతయో నంపన్నుఁడయ్యెనని యూహింప వీలులేదు. ఈ విద్య ముఖ్యముగా విరక్తులగు బైరాగులవద్ద నుండును. దీని కొఱకై వేమన్న మొదలు కంసాలివారినిగూడ నాశ్రయించినట్లున్నది. వారు దొంగలని యెవరో తిట్టఁగా నిట్లు వాదించెను:

       "ఆ. కల్లలాడుదురిల కంసాలి దొంగని
             అతని సొమ్ము కెట్లు అతఁడు దొంగ !
             మన్ను బంగరుగను మఱిచేసి పెట్టఁడా ?..." (951)

కాని యితడాశ్రయించిన కంసాలిగురువు, సామాన్యముగ నిట్టి రసవాద గురువుల వలె, తుదకు ' దగా ' చేసెనేమో ! కావున కోపించి, విసిగి, 'కంసలికిని మించు కడజాతి లేదయా? (3194)) యని యా కులమునకే యొక తిట్టు తిట్టి తరువాత బైరాగుల నాశయించెను గాఁ బోలును. ఇతనికి గురువనఁబడు ' లంబికాశివయోగి ' ఈ తెగవాడే యనుకొనుచున్నాను. వీరి సేవచే వాదము వైద్యము వచ్చుటకు తోడు, వీరి సహవాసము వేమన్నజీవితమందే గొప్ప మార్పును గలిగించినది, దానిని గూర్చి ముందు విన్నవింతును.

  1. * పైపద్యపు మూఁడవ పాదము (314) పద్యముది, వేమన పద్యములలో పెకి-ంటికి దేని పాదము దేని కతికించినను అచ్చుగాని ఆందముగాని చెడదు గావున విట్లు ఆనుకూల్యముకొఱకు మార్చఁబడినది.
  2. * ధనికుఁడు భృత్యుల నెంత పోషించినను, ఆడిగినవారి కెంత యిచ్చినను, యాచకుల తోడ నతఁడును సమానుఁడగు వఱకును జనులు ఓర్చి యూరకుండరు.
  3. * దానమిచ్చు టేటి తగవొ వేమ' యని వే, సూ. " దానమివ్వరాదు ధరను వేమ యని • వేమన జ్ఞానమార్గ పద్యములు". కాని యిదే ప్రాఁతప్రతుల పాఠము, పద్యార్ధపుధాటిని జూచినను ఇట్లే తోఁచును, బ్రౌనుదొర యీ పాఠమునే అంగీకరించెను. కాని యీ పద్యములు వేమన్నవి గావేమో యని సందేహించెను (చూ, వావిళ్ళవారి బ్రౌను ప్రతి, పే. 161). కాని నాకా సందేహము లేదు. ప్రాచీనులు దుర్మార్గుల ధనము నపహరించి సన్మార్గమందు వెచ్చపెట్టవచ్చునని, వలయునని చెప్పిరి (చూ. మనుస్మృతి, 11 అధ్యా.శ్లో.19)
  4. * ఓ, లై, ఈ ప్రతినెంబరు గుర్త వేయమesచితిని.
  5. † వేదాంత సిద్ధాంతము, పు.61.