వేమన/రెండవ యుపన్యాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


శ్రీ:

రెండవ యుపన్యాసము

వేమన కాల దేశములు

హిందువుల యన్ని చరిత్రములవలెనే వేమన చరిత్రమునఁ గూడ నమ్మఁ దగిన సాక్ష్యములు లేకపోవుటచే సత్యము బైలు పడుట చాల కష్టముగా నున్నది. ఐనను అందు ముఖ్యములైన కాలదేశములను గూర్చి నేఁడు కొంత చర్చింతును.

ఇంగ్లీషువారి సహవాసముచే మనము నేర్చుకొన్న విచిత్ర విద్యలలో చరిత్ర రచన యొకటి. చరిత్రములు వ్రాయుట మన పూర్వ లెఱుఁగక పోలేదు. అది మానవ సామాన్య ధర్మము. కాని వారెన్నఁడును ఇప్పటివారివలె దాని నొక ప్రత్యేక మగు విద్యగా, ఒకరిద్దఱు వ్యక్తులకుఁగాక యొక దేశమునకే-జాతికే చేరిన ముఖ్య శాస్త్రముగా—పరిగణించినవారుకారు. పూజ్యమైన వ్యక్తియందు ప్రజలకు గౌరవమును గల్గించుట వారి ముఖ్యసాధ్యము, చరిత్రము దానికి సాధనమంతే కావున విన్న విషయములు కన్న విషయములు అన్నియనమ్మి, చాలకున్న కొత్తగాచేర్చి, సరిపడ కున్నదానిని తోసివేసి, వారు వ్రాయుచుండిరి. ఇప్పటి మన తీఱు వేఱు. పూర్వ కాలమున సంస్కృత తర్కశాస్త్రము తక్కిన విద్యలయందెల్ల నెట్లు ప్రవేశించెనో, యట్లే నేఁడును ప్రతి విద్య నేర్చువానికిని ఆ విద్యయొక్క చరిత్ర మత్యావశ్యకముగా నేర్పడినది. చరాచర వస్తువుల కన్నిటికిని, నేఁడు చరిత్రము గలదు. చరిత్రమునకును చరిత్రమెవరైన వ్రాసినారో లేదే యెఱుగను గాని, వ్రాయవచ్చుననుటలో సందేహము లేదు.

మనకు చరిత్రమువలనఁ గలుగవలసిన లాభము యదార్థజ్ఞానము. అది మంచిదైనను కాకున్నను, ఇష్టమున్నను లేకున్నను, సరే. కావున నేఁటి చరిత్రకారుని కొక విషయము సత్యమని స్థాపింప ననేక సాక్ష్యములు కావలయును; అవి పరస్పర విరోధములేక యుండవలయును. అట్లగుటచే సాక్ష్యము దొరికినఁ జాలునని తృప్తిపడక యది నమ్మఁదగినదా కాదా యని మొదలు పరీక్షింపవలసి యుండును. కావున నిప్పటి చరిత్రకారుఁడు తానొక న్యాయాధిపతిగా వ్యవహరించుచున్నాఁడు. ప్రతి సాక్ష్యమును కల్పితమై యుండవచ్చునను నపనమ్మకముతోనే విచారణ నుపక్ర మించును. ఇట్లగుటచే సందేహము చరిత్రకారుల స్వభావమైసది. ప్రాచీనులు అన్నిటిని నమ్మిరి. ఆధునికులు దేనిని నమ్మరు—అనఁగా, బలవంతమైన సాక్ష్యము, ఇతర చరిత్రకారులు బలవంతమని నమ్మునట్టిది, లేనిది. సాక్ష్యమున్నను లేకున్నను అన్నిటిని నమ్ముట యెంత అన్యాయమో, సాక్ష్యము లేనివాని నన్నిటిని నమ్మక పోవుటయు నంతే యన్యాయము. ఫలమేమనఁగా, ప్రాచీనపురాణములలో వస్తు స్థితిని ముంచివేయునన్ని విషయములు లభించుచుండఁగా, ఆధునికుల చరిత్రలలో అసలు సత్యమే పూర్ణముగా లభింపకతునకలుతునకలుగా లభించును. వేమన తండ్రివిషయమై వ్రాయవలసివచ్చె ననుకొనుఁడు; ప్రాచీనులు అతని ఒడ్డు, పొడవు, పేరు, ఊరు, ఔదార్యము మొదలగున వన్నియు వినియో యూహించియో వ్రాసి, మనకొరకు పరి పూర్ణమైన వ్యక్తిని చేతికందిత్తురు. ఆధునికులు ఉన్నదనుట ఇప్పుడు లేదనుకొనుటయే మంచిదిగాన, వేమన్నకు తండ్రియే లేఁడని యననుకొని, తండ్రిలేని కుమారుఁడు సృష్టిలో లేకపోవుటచే, ఒకవేళనుండినను అతని, విచారము మనకేమియు తెలియదని చెప్పి తండ్రియను నొక పదార్ధమును మాత్రము నామరూపాదు లొక్కటియు లేక మనతలఁపునకుc దెత్తురు.

మఱియు నమ్మవలసిన సందర్భము లందును ఇరువురి నమ్మకము లందు చాల భేదము గలదు. ప్రాచీనులలో నమ్మకమునకు అనుభవప్రమాణము గాని, యనుమాన ప్రమాణముగాని పనిలేదు. మన చేనిలోపండిన పచ్చకాయలను పాపరకాయలును రాసులుగాఁ బోసి, వానినొకమాఱు చేతితో తాఁకిన మాత్రమున బంగారుముద్దలుగాఁ జేసి యన్నగారికి ఇనామిచ్చినాఁడని వారు సందేహము లేక నమ్మి వ్రాయుదురు (చూ.వే.సూ.ర.పీఠిక, పు. 29). ఇట్టి దానిని ప్రత్యక్షముగా జూచుట యట్లుండనిండు. 'ఈ సామర్థ్యము గలవాఁడు, చేనుదున్ని, విత్తి, కోసి, కూలియిచ్చి-ఇంత యవస్థపడనేల? ఇంటిలోని యన్నగారి యినుపపెట్టెనో లేక పెరటి మట్టిగోడనో తాఁకి బంగారుగాఁ జేయవచ్చునే! ఏమి వెఱ్ఱివాఁడు వేమన్న! యని యూహింపవలసిన యక్కరయే పురాణములు వ్రాయువారి కుండదు. విషయ మెంత యసాధ్యమైన వారికంత యొక్కువ నమ్మకము. ఇంక చరిత్రకారుని తీరు వేఱు, అతనికి పరమ ప్రమాణము ప్రత్యక్షము. అనుభవబలములేని యనుమాన ప్రమాణమును ఆతనికి పనికిరాదు. మకియు తన కాలపు టనేకజనుల ప్రత్యక్షాను భపమేతప్ప తనయెుక్కని యనుభవమునకు వచ్చియుండినను తన్నుతానే యతఁడు నమ్మఁడు. ఇతరులు నమ్మరను భయ మతనికి మెండు. బంగారము కృత్రిమమైస వస్తుపుగాక సహజములైన ప్రకృతులలో నొక్కటిగావున, వేఱుపదార్ధమేదిగాని బంగా రముగా మార్ప వీలులేదని యాధునిక రసాయన శాస్త్రజ్ఞుల సిద్ధాంతమcట. కావున *తనకుఁ దెలియనిది తనతాతకును దెలియదు" అను నహంకారశాస్త్ర ప్రథమ సూత్రము ప్రకారము, అతఁడు రసవాద విద్యయే మిథ్యయని సిద్ధాంతముగా నమ్మును. తానొక వేళ పత్యక్షముగాఁ జూచినను 'ఇదేదో కనుకట్టువిద్య' యనుకొని తృప్తిపడును.


పై యిరువురికిని సమానధర్మ మొకటి కలదు.అదే దనగా అభిమానము, తమ జాతి, మతము, దేశము, భాష మొదలగు వానిపై నిరువురికిని అభిమానము మొండు. పురాణ కారుల యభిమానముచే అతిశయోక్తు లు ప్రబలినవి; చరిత్రకారుల యభిమానముచే అసత్యములు ముందుకు వచ్చినవి. అతిశయోక్తులును అసత్యములే యైనను అం దలంకార మున్నది. ఇందులో లే దంతే. బసవేశ్వరుఁడు ఆంధ్రుఁడని సాధించు అసత్యమునకన్న, భీముఁడు బండెఁడు పనసపండ్లను ఏకాదశి ఫలాహారము చేసెనను అతిశయోక్తిలో సొగసెక్కువ పురాణముల వారు తమజాతియే సృష్టికర్త తలమీది తుది వెంట్రుకనుండి పుట్టినదనియు తమ మతమే భగవంతు డుపదేశించిన మోక్షమార్గమని, తమదేశమందలి వీధులమన్ను గూడపుణ్యభూమి యని, తమ భాషయే దేవభాషయని, ఇతరజాతిని స్పృశించరాదని, ఇతరమతము నరకహేతువని, ఇతరదేశమున కాలుపెట్టిన గత్తిరించు కొనవలయుని -- ఇతర భాషలాడిన నాలుకను దర్భతో గాల్చవలయునని --- వ్రాసుకొనిరి. చరిత్ర కారులు, తమజాతియే సర్వగుణముల కాకరమై తమ మతమే సర్వమతసారము ; తమదేశమే వీరశూరవిక్రమాదిత్యుల ...... తమభాషయే ముద్దుపలుకుల మురిపెములమూట, యని వ్రాయుచు, ఇత..... * రించుచు, విధిలేక ప్రపంచమున వారిబ్రతుకు నోర్చియుందురు ! కన్న ..... * కవిత్వ మును వ్యాకరణమును, ఛందన్సును—ఇంతయేల? అ ఆ ఇ నేర్పిన యుపాధ్యాయు లాంధ్రులనియు, అరవము 'వినుటకు శ్రుతి క...... డు బొమ్మరాళ్ళతంబళము" అనియు మనవారు వ్రాసికొన్నారు. (చూ ఆంధ్రవాజ్మయ చరిత్రము, పీఠిక XXXIV; పే. 120). అరవమందు, మందును మళయాళమునుదును గల ' ழ ' కారము తెలుగునఁ గూడ యుండెనని యెవరైనఁ జెప్పిస నెదగ్రుద్దుకొనువారు మనలో నున్నారు. ఇది. ఆంధ్రులలోనే బ్రాహ్మణాహ్మణులరగడ, సర్కారు దత్తమండలముల వివాదము నియోగి వైదిక భేదము-మొదలగు పాక్షికవ్యవహారములచేత నెన్ని యసత్యములు అన్యాయసిద్ధాంతములు బైలుదేలిఱినవో, దేఱుచున్నవో, మీ రెఱుఁగుదురు. నన్నయ కవిత్వమునం దున్నంతమాధుర్యము తిక్కస కవితయందు లేదని యొకానొక వైదిక పండితులు నాతో వాదించిరి! కాని యిటీవల నన్నయ అసలు బ్రాహ్మణుఁడే కాదు క్షత్రియుఁడని యొుక వాదము బ్రెలుదేఱుచున్నట్లు జ్ఞాపకము ! నన్నయ బ్రాహ్మణుఁడైన నేమి, క్షత్రియుఁడైన నేమి, మన కేమిలాభమని తలచిన కొందఱు, కాపువారు కా(బోలు, నన్నయకుఁగల యాదికవిత్వకీర్తిని వేమన్న కీయఁదల(చి వేమన్న నన్నయకన్నఁ బూర్వుఁడనిరఁట ! (వం.సు. గారి వేమన, పు. '45). ఇట్లే రామరాజభూషణుఁడు బ్రాహ్మణు(డే కాని సూద్రుఁడు కాఁడను వాద మొకటి గూ(డ నా చెవిని బడిసది.

తమ యభిమానపు వాదమున కనుకూలమగు పూరిపడకనైనను బ్రహ్మాస్త్రముగా భావించుటవిరుద్ధములైన సాక్ష్యముల నన్నిటిని సందేహించి తిరస్కరించుట, యేదైనను నూతనసిద్ధాంతమును తప్పక బైటికిఁ దీయపలయునను సంకల్పము— ఇవి యూధునిక చరిత్రకారులలో ననేకుల మనస్తత్త్వములు. కాళిదాసు తస గ్రంథములలో నందందు "గుప్త పదము వాడుటచేత నతఁడు గుప్త రాజుల కాలము వాఁడని సుప్రసిద్ధ చరిత్రకారులకు ' కీతు ' గారు వాదించిరి ! (See the Journal of Royal Asiatic Society, 1909, p. 438) ఒకానొక యాంధ్రచరిత్రకారులు ద్రోణాచార్యులు కుంభసంభవఁడనుట కర్ధము ఆతఁడు కుమ్మరివాఁడై యుండుసని తల(చిర(ట ! అంతదూరమెందుకు? పేరు సవ్వఁడిబట్టి అతఁడు దోcణినడుపు బెస్తవాఁడనియు, ధర్మరాజు దొమ్మరి వాఁడనియుఁగూడ జెప్పవచ్చునుగదా !

ఇట్లు మన చరిత్రములు విచిత్రసిద్ధాంతముల కాకరములై యుండుటకు ముఖ్యకారణము మనలో చరిత్రరచనకు పనికివచ్చు బహిరంగ సాధనము లెక్కువగా లేకుండుటయే. ఉన్నవి యతిశయోక్తిమయములైస పురాణములు. ఇంక అంతరంగ సాధసములు అనుమానముసకు పనికివచ్చునే కాని, దృఢమైన సాక్ష్యమును సమ కూర్పునవి యేగ్రంథములందును ఉండవు, తమ చరిత్రమును ముందు వ్రాయువారికి పనికిరావలయునను నుద్దేశముగలవారు తప్ప, తక్కిన యెవరును స్వకీయ చరిత్ర విషయములకు తమ గ్రంథములలో నవకాశమివ్వరు. అవి ఆకస్మికముగా నందు రావలసినవి.

ఇట్టి యిరువురినడుమ పురాణమును, చరిత్రమును, దేనిని వ్రాయనేర్వని నావంటివానికి వేమన జీవితమును దెలిసికొనవలెనన్నప్పడు కలుగు కష్టము చెప్పి తీఱదు. ఐనను ఈ రెంటిని యధాశక్తి పరీక్షించి ప్రకృత ముపయోగించుకొనవలసి యున్నది.

వేమన సూక్తిరత్నాకరమున పీఠికలోని వేమన చరిత్రమను పురాణమున ఈక్రింది విషయములు గలవు : క్రీస్తుశకము 1328 నుండి 1428 వరకును నూరేండ్లు సరిగా కొండవీటిలో రాజ్యముచేసిన రెడ్డిరాజులలో కడపటివాఁడగు రాచ వేమారెడ్డికి మన వేమన తమ్ముఁడు. కొమరగిరి వేమారెడ్డి కొడుకు. తల్లి మల్లమ్మ. అన్న భార్య, తల్లివంటిది, సరసాంబ. వేమన చిన్ననాఁటినుండి వేశ్యవలలోఁ జిక్కి యుండి బొక్కసమంతయు దానికి దోచిపెట్టుచుండఁగా, వదినె సరసమ్మ యు క్తితో నాతనికి దానిపై రోఁతజనించునట్లు చేసెను. నగరి కంసాలి అభిరామయ్య. అతఁడు లంబికాశివయోగియను వానిని తత్వోపదేశార్థము రహస్యముగా సేవించుచుండెను. ఒకనాడా యోగి అభిరామయ్యతో రేపుదయమువచ్చి యుపదేశముపొందుమని చెప్పఁగా దానిని పొంచివిన్న వేమన్న, మఱునాఁడు అభిరామయ్యను బలవంతముగా నగరియందే నిలుచునట్లుచేసి, తాను పోయి యోగితో 'అభిరామయ్య తాను రాలేక నన్ను పంపినాఁడు" అని చెప్పఁగా 'వాఁడు నిర్భాగ్యుఁడు, నీవే రారా' యని యతఁడితనికే యుపదేశముచేసి యెందో పోయెను. జ్ఞానియై వేమన్న యభిరామయ్య క్షమాపణ వేఁడి, విరక్తుడై దేశదేశములుఁ దిరిగి పద్యరూపముగ తత్త్వాపదేశము ప్రజలకు చేయుచు, తుదకు ' కటార్లపల్లె ' లో సమాధివిష్ణుఁడయ్యెను.

ఇందు చరిత్రమునకు ముఖ్యవిషయములగు పంశము, కాలము, దేశము పేర్కొనఁబడినవి : కోమటి రెడ్డిరాజుల వంశీయుఁడు; 14 వ శతాబ్దమున నున్న ; కొండవీటిలోఁ బుట్టిపెరిగి కటార్లపల్లెలో ముక్తుఁడైనవాఁడు. దీనిని వ్రాసిన ఇది “నిక్కపు చరిత్ర' యనుచున్నారు కాని యే యాధారములచేత నిది నిక్కమనుకొనిరో తెలియదు. మతయు, పై వంశవృక్షమును సుగృహితనాములగు కీర్తి | శే| కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారు అసత్యమని ఖండించిరి. వేమన్న తండ్రి యనఁబడు కొమరగిరికి సంతానమే లేదట. కావున నతని తరువాత నతని దాయాది యగు కోమటి వేమారెడ్డి రాజ్యము చేసినవాఁడు. కొమరగిరిరెడ్డికి కొడుకనఁబడు రాచవేమారెడ్డి ఈ కోమటివేమారెడ్డి కొడుకcట ! వేమనయోగి కిం దేసంబంధమును ఉన్నట్లు కానరాదట.*[1]

శ్రీ చిలుకూరి వీరభద్రరాపగారు కుమారగిరికి కుమారుఁ డున్నట్లు శాసనాదుల వలన తెలియవచ్చుచున్నది యనిరి.†[2] కాని యతఁడు రాజ్యమునకు రాలేదు. ఈ రాజ్యమునకు రాని కుమారుఁడే బైరాగుల సావాసమునఁ బడిపోయిన మన వేమన్న యైయుండునా యను సందేహము గలుగును. కాని "వేమన వాక్యము" లనఁబడు వానిలో వేమన తండ్రి‡[3] 'రెడ్డన్న' యని చెప్పఁబడినది. ఇట్లే బందరుప్రతిలోని వేరొక వచనమందును గలదు (390). కుమారగిరివంటి ప్రభువుకు రెడ్డన్నయను సామాన్యనామ ముండునని యూహించుట యసాధ్యము. మణియు "వేదాంత సిద్ధాంతము " పీఠికలో కొమరగిరికి కొడుకు లిద్దఱనియు, వారిలో రాచవేమారెడ్డియే మన వేమన్న యనియు వ్రాయఁబడినది. కాని రాచవేమారెడ్డి నాలుగేండ్లు రాజ్య మేలెననియు తుద కాకస్మికముగా తన భృత్యునిచేతనే చంపఁబడియె ననియు " కొండవీటి దండకవిలె'లోఁ " గలదంట. కాబట్టి ప్రకృతస్థితిలో కొండవీటి రెడ్డిరాజు లకును వేమన్నకును సంబంధము గలదని యూహించుట దుష్కరము.

మఱియు, అంతరంగసాక్ష్యములచేత నీ యంశము దృఢమగును. వేమన ప్రబంధకవులవలె తానుండు ప్రపంచమును దాఁటి వ్రాసినవాఁడు కాఁడు. అతని పద్యములందెల్ల స్వానుభవమును కవితాధర్మము తాండవ మాడుచుండును. ఇతఁ డాగర్భశ్రీమంతుఁడై నడిమివయసువఱకును రాచనగరియందె పెరిగినవాఁడై యుండిన, పెద్దన్న, కృష్ణదేవరాయలు మొదలగువారి కవిత్వమందుఁ గానవచ్చు సంపత్సమృద్ధివాసన యిందెందును గానరాక పోవునా ? వానియం దభిమానము లేకున్నను ఖండించుటకైన పనికిరావా? మఱియు, వేమన్న "కుక్క యిల్లు సొచ్చి కుండలు వెతకుట" చూచినాడు (3227). ' పండిన చేనులోని పల్లేరుగాయలు ' తొక్కినాడు (2602). 'గడ్డివేసినను పోట్లగొడ్డు కొమ్మాడించు'నని యెఱింగినాడు (1744) 'పచ్చికుండలో నీళ్ళు పట్టిన నిలుపవని " కనుగొన్నాఁడు (1347). 'కుండ చిల్లిపడిన గుడ్డ దో(పగవచ్చు నను సంసారవు నాజూకును నేర్చుకొన్నాఁడు (1132). "కడుపునిండ తవుడు గంపలోఁబెట్టక, చన్ను ముట్టనీదు కొన్న బఱ్ఱె" యను మహిషీదోహనమర్మమును చదువుకొన్నాఁడు (851). ఇట్టి యనుభవములు రాజవంశీయులకు, అందును రాచరికపు జవాబుదారీ లేక యూరక తిని తిరుగమరగిన యువరాజులకు కలుగునా ? మఱియు, వేమన --

        " ఆ. ఎంత సేవఁజేసి యేపాటుపడినను
               రాచమూక నమ్మరాదు రన్న !
              పాము తోడి పొందు పదివేలకైనను, విశ్వ" (638)

అని చెప్పినవాఁడు. ఇంత పైన ' రాచకొడుకు గాకున్నను దూరబంధువై, బీదవాఁడై మైసూరుదేశమందలి కొందఱు 'అరసు'లపలె నేల యుండరాదు?" అని తలఁచు వారుండిరేని నా యాక్షేపణలేదు ; వారికి ఫలమును లేదు.

ఇట్టితఁడు రెడ్డిరాజుల వంశమువాఁడై యుండఁడని సందేహముగలిగిన వెంటనే, వారు రాజ్యముచేసిన 14-15 శతాబ్దములలో నున్నవాఁడను కాలమును నిరాధార మగుచున్నది.

ఇఁక కొండవీటిలో పట్టి పెరిగినాఁడనుటకు వేమన పద్యములలో నొక యాధారమున్నది :

           "ఆ. ఊరు కొండవీడు ఉనికి పశ్చిమవీధి
                 మూగచింతపల్లె మొదటి యిల్లు
                 ఎడ్డెరెడ్డికులమదేమని తెల్పుదు విశ్వ." (568)

కాని దీని యర్ధము సందిగ్ధము. కొండవీటి పశ్చిమవీధిలో నునికికిని మూగచింతపల్లె మొదటి యింటికిని సంబందమేమి ? దీని కంతరార్ధమేమో గలదంట. పాఠాంతరము లకును కరవు లేదు. అవి యట్లుండనిండు. కొండవీటివద్ద మూగచింతలపల్లె కలదఁట. కడపజిల్లాలోకూడ నొక మూగచింతపల్లె కలదనియు, నందలి వారొకబయలు చూపి యిదే వేమన్న పుచ్చకాయలు పండించిన చేనని చూపెదరనియుఁ జెప్పఁగా విన్నాను. [4] కొండవీటిలోఁ బుట్టి కొన్నాళ్ళుండి, తరువాత ఆ రెంటిలో నేదోయొక పల్లెలో మొదటి యింట వసించినాఁడను నర్థమిచ్చు పాఠాంతర మొకటి పై పద్యమున కుండవలె ననుకొంటిమేని, ఇతఁడు కొండవీటిలోఁ బుట్టినాఁడు కాఁడని సాక్షాత్ర్పమాణము లభించువఱకును మనమతఁ డందుబుట్టినవాఁడే యని నమ్మదముగాక! ఈ నమ్మికకు తోడు కర్నూలు జిల్లా క్రిష్టిపాడు వాఁడనియు, గుంటూరికిఁ జేరిన 'ఇను కొండ" వాఁడనియు, కడప మండలపు 'చిట్టివేలు" వాఁడనియును బ్రౌనుదొరవిస్న యుపపురాణములు కనీసము మూఁడున్నవని మనము గమనింపవలసి యున్నది.*[5]

ఇఁక నితఁడు కటార్లపల్లెలోవచ్చి సమాధి యయ్యెనాయను విషయమింకను సందిగ్ధము. ఇదివఱకు వేమన పద్యముల నచ్చువేసినవా రనేకులు ఇతఁడు కదిరి తాలూకా కటార్లపల్లెలో శార్వరి సంవత్సర చైత్రశుక్ల నవమినాడు తన జీవితమును చాలించెననియే వ్రాసియున్నారు. 'క్యాంబెలు దొరయును ఇట్లేతలఁచి కటార్లపల్లెకుఁ బోయి చూచి యక్కడిసన్నివేశములు గుట్టలు వాఁగులు మొదలగువానిని విపులముగా వర్ణించి వ్రాసెను.†[6] బ్రౌనుదొరకు కటార్లపల్లె సమాచారమే తెలిసినట్లు తో(పదు. నేనును ప్రత్యక్షముగా నాయా ప్రదేశములను చూచి రావలయునని పోయితిని.‡[7] కాంబెలు దొరకన్న మనముగా విపులముగా మీకు వర్ణించి చెప్పవలెనను కుతూ హలముతో త్రోవలోని తుమ్మచెట్లు, పాపాసుకళ్ళి, రాళ్ళ రప్పలగూడ వదలక గుర్తులు వేసికొంటిని. మొదలు కదిరి దగ్గరనుండు "నల్లచెరువు' గ్రామము నందును వేమన్నకు సంబంధము గలదని విని యక్కడికిఁబోయి యందలి గుడి దర్శించి యందలి వేమన్న చెక్క విగ్రహము మొగమున పట్టినామములు చూడఁ గనే శిపయోగియైన వేమన్న ముగమున నామా లేమిటిరా? యుని సందేహము కలిగినది. కాని యహింసావ్రతియైన వేమన్నపేర నేటేట నెనుఁబోతుల బలియిచ్చి నట్లే, యిదియు విచిత్ర కాలపరిణామములలోనొకటియై యుండుననుకొని, యక్కడి పూజారి చెన్నయ్యను విచారింపఁగా, నాతఁ డొక వేమన్నపురాణమును జెప్పెను. అదంతయు మీ కేకరువు పెట్టదలఁచుకోలేదు. కాని విధిలేక ముఖ్యాంశములు మాత్రము సూచించుచున్నాను

వేమన కొండవీటివాఁడు. పైఁడిపాలకొడిది రెడ్లవంశమువాఁడు. కనుగోళ్ళ గోత్రము. మొద లితనిపేరు పుల్లారెడ్డి, రాజైన యన్నతో కలహించి తల్లితో నల్ల చెరువుకు వచ్చెను. అక్కడ సేద్యము చేసుకొనుచు సుఖముండఁగా నొకనాఁడు త్రోవలో నతని తలపై పిడుగుపడి నిర్జీవఁడాయెను. తరువాతి కార్యము జరుప నక్కడివారు ప్రయత్నింపఁగా తల్లికి స్వప్నమందతఁడు గాన్పించి 'ఇ(క నేడునాళ్ళు సహింపుఁడు. మరల నేను జీవింతును" అని చెప్పెనఁట. అట్లే యెనిమిదవ దినమున సజీవుఁడై "ఏమి పుల్లారెడ్డి ! ఎట్లు ఏడునాళ్ళు చచ్చి బ్రతికితివి?" అని యక్కడివా రడుగఁగాఁ 'నా పేరు పుల్లారెడ్డి కాదురా, వేమన' యని చెప్పెన(ట. అది మొదలు మహాత్ముఁడై శిష్యపరివారముతోఁ దూర్పుదేశము తిరిగి యనేక మహత్త్వములను జూపెను. అప్పటి మద్రాసులోని యింగ్లీషుదొరలు ఇతని యద్భుతశక్తికి మెచ్చి చాల గౌరవించిరి. సంచారములో కడపజిల్లా రాజంపేట దగ్గర కోడూరిలో నతనితల్లి అచ్చమ్మయు, కుచ్చెర్లపాడు గ్రామములో భార్య ఆదిలక్ష్మమ్మయు మరణించిరి. ఇరువురికిని అతఁడు కట్టించిన సమాధులిప్పటికి అందుఁ గలవు. తరువాత కటార్ల పల్లెకు మరలివచ్చి వేమనసమాధిలో నజీవముగా పరుండి మూఁత వేయించుకొనెను. నల్లచెరువులోని గుడి తరువాత నతని వంశీయులగు జ్ఞాతుల కలహముచే నేర్పడిన ప్రతిబింబము.

ఈ కథ విన్నప్పడే నా సందేహము బలమయ్యెను. పుల్లారెడ్డి యుని మొదట పేరుండి తరువాత 'వేమన్న"గా ఏల మార్చుకొనవలెను? తల్లి పుస్తకములలోని మల్లమ్మగాక అచ్చమ్మ యయినది. ఇందు ప్రసిద్ధమైన బోగమువాండ్ర మాటయే లేదు.

ఈ సందేహములతోనే కటార్లపల్లెకుఁబోయి విచారింపఁగా నక్కడి ధర్మకర్త యగు చెన్నరాయఁ డనునాయన 'ఆ వేమన్న యీ వేమన్న కాదండీ! వేఱు' అని చెప్పి నా యా శలు నిరాశచేసెను! కారణమేమని యడిగితిని. తమవద్దనున్న తాటాకుల గ్రంథములో నట్లున్నయని చెప్పెను. దానిని తెప్పించి చూడఁగా నది వంగూరు సుబ్బరావుగారికి ఆంధ్ర సాహిత్య పరిషడ్గ్రంధాలయమునఁ గానవచ్చిన ద్విపద వేమనచరిత్రముగా తేలినది. అందలి యీ క్రింది వాక్యములను చెన్నరాయఁ డెత్తిచూపెను. సనకసనందనాది మునులు.

             "ఇతడు శ్రీహరిపుత్రుఁ డితఁడు పావనుఁడు
              మున్ను వేమన పరమ ముఖ్యుడైనాఁడు
              అతఁడె యితఁడని పల్కి ఆశ్చర్యమంది
              మం'త్రాక్షత్రంబుల మహిమచేఁ బట్టి
              వేమనార్యులమీఁద వెదఁ జల్లిరంత...."

ఈ గ్రంథము చాలవఱకందే చూచితిని. ఇది చరిత్రముగాదు. పురాణములలో. పురాణం, చేసినవాఁడు వ్రాసినవాఁడు కల్పించిన చిక్కులు లెక్కలేనన్ని. ఇందు నల్లచెఱువు చెన్నయ్య చెప్పిస యీ లోకపు కథలేమియు లేవు. అక్కడివారి కది పరమపవిత్రగ్రంథము గావున దాని నెరపు తెచ్చుకొని నిదానముగాఁ జూడ వీలులేమిచేతను, ఆంధ్రసాహిత్యపరిషత్తలో నున్నదిగావున తెప్పించుకొనవచ్చును. నమ్మికలేకచేతను నందలి విషయములు కొన్నిమాత్రము గుర్తుచేసికొంటిని --

శ్రీవైకుంఠములో చెన్నకెశవులును, ఆదిలక్ష్మియు వేమన్నను పిలిచి నీవు భూలోకమున నవతరింపమని చెప్పఁగా అట్లే యతఁ డవతరించెను. ఇతని తండ్రి తులగవంశపు కేశవుఁడు. తల్లి లక్ష్మమ్మ (అచ్చమ్మ), కేశవనారాయణలు కూర్మి తమ్ములు. వీరు మార్కాపురము చెన్నకేశవస్వామి భకులు. తరువాత కదిరిదగ్గఱ నుండు రేపల్లెకు వచ్చినట్లు తోఁచును. ఇదే యిప్పడు ప్రాఁతరేపల్లెపట్టణమనియు, పాతర్లపల్లెపట్టణమనియు వ్యవహరింపఁబడుచున్నది. ఈ వేమన యిక్కడనే జన్మించెను. చేమన తత్త్వబోధచేసి కటార్లపల్లెలో నుండెను.

ఇంతకన్న నెక్కువ విషయములు గ్రహింపవీలులేదయ్యెను. గ్రంథము గచ్చపొదవంటిదని మొదలే చెప్పితిని, శ్రీ కొత్తపల్లె సూర్యారావుగారు నా ప్రార్థన ప్రకారము ఆంధ్రసాహిత్యపరిషత్తులోని ప్రతిని నా కొఱకై దయయుంచి వ్రాయించి పంపిరిగాని, మూలప్రతి చాల శిథిలమై యుండుటచే వారికి వృథాప్రయాసము నిచ్చినది తప్ప నాకేమియు ఫలము లేదయ్యెను. అది యట్లుండె,

నల్లచెఱువు చెన్నయ్య చెప్పిన కథయంతయు నొక్కటితప్ప సత్యమని యిక్కడివారందఱు సంగీకరించిరి. అదే దనఁగా, కొండవీటిసంబంధము. 'నెల్లూరు మొదలగు ప్రాంతములందు ఆ వేమన్నభక్తు లనేకు లున్నారు. కావున వారు వేమన్నపేర నిచ్చు వర్ణాశనాదులను సంపాదించుటకును, మర్యాద లనుభవించు టకును ఈ వేమన్నవంశీయులమగు మేము, ఇరువురు నొకటేయని యిట్లు కొండవీటి ముడి వేసికొన్నామే కాని వేఱుకాదని కటార్లపల్లె వేమన్నవంశీయుఁడగు చెన్న రాయఁడు సంకోచించినను స్పష్టముగాఁ జెప్పెను. ఈ సత్యప్రీతి కతనిని మన మభి నందింపవలసియున్నది. మన వేమన్నకు కటార్లపల్లె సంబంధమున్నను, లేకున్నను కొండవీటిసంబంధము మాత్రము గలదని యిక్కడివారును నమ్మియున్నారనుట యొక ముఖ్య విషయము.

ఈవేమన ఆ వేమన కాఁ డనుటకు వేఱొక ప్రబలాధార ముస్నది. అదే తాటాకుల పుస్తకమున అతని ననుసరించి యితఁడు వ్రాసిన ఆటవెలది పద్యములు నూటికి పైబడి కలవు, వాని మకుటము "బాలచక్రవేమ భవ్యనామ' యని, అర్థ మడుగకుఁడు. అది నాకుఁ దెలియని యనేక రహస్యములలో నొక్కటి. 'పఠనరామ" యునియు, 'బౌద్ధరామ' యనియు పాఠాంతరములు గలవు. పై పద్యములలోఁ గొన్ని 'విశ్వదాభిరామ' మకుటముతో ఆ వేమన్న పద్యాలతో సంగమించినవి. లేక ఆ వేమన్న పద్యములకె మకుటముమార్చి యిందులోఁ బేర్చినారేమో! ఒకటిరెం డుదాహరింతును----

           "ఆ, ఆది త్రిమూర్తులు ఆత్మలోనున్నారు
                 బంధించి తెలిపితో బయటపడును
                 హృదయమందు గురుని పండ జూడగలేరు, బాల."

           "ఆ యాత్రటోయినవాఁడు యెన్నాళ్ళు తిరిగినా
                పారమైన ముక్తి పదవిలేదు.
                మనసు నిలిపినవాడు మహనీయమూర్తికా, బాల." *[8]

ఈరెండవ పద్యము మకుటభేవముతో వేమన సూక్తిరత్నాకర మందున్నది (3245)

ఈ తుంగ వేమన్న జన్మకాలమును దెలుపు పద్యమొకటి యా పుస్తకమం దొకచో వ్రాయబడి యున్నది.

             వలనొప్ప తుంగాస్వవాయ పావనమూర్తి కేశవనామ కుశేశయాక్ష ?
             రమణిపాలిక శ్రీలరంజిల్లు లక్ష్మాంబకును అగ్రతనయుఁడై కొమరుమిగిలి
             ఘనతర రాజయోగ స్పూర్తి శార్వరి సంవత్సర చైత్రశుక్లపక్ష నవమి
             శాలివాహన శతాబ్ధములు వేయునార్నూఱొకనూరు వెసను రెండు
             పరగ మిగిలినదినము శ్రీ బాలచక్ర, వేమనార్యండునను భవ్యనామ మము
             ఆది శ్రీ లక్ష్మనారాయణావతారమైన శ్రీ చెన్నరాయుఁడై యవని వెలసె"

ఇందుచే నితఁడు శా.స. 1702వ శార్వరి సంపత్సరమున (క్రీ.శ. 1780) చైత్ర శుక్ల నవమినాఁడు జనించెను. ఇతనితల్లి లక్ష్మమ్మ సిద్ధార్ధీ సంవత్సర పుష్య బహుళ చతుర్ధశినాఁడు-అనఁగాఁ ఇతని ఇరువదవయేఁటను, భార్య అక్కలమ్మ (ఆదిలక్ష్మమ్మ) నల సంవత్సర పుష్యశుద్ధ షష్టినాఁడు, ఇతని 76వ యేఁటను, ఇతఁడు విభవ సంవత్సర పుష్యశుక్లాష్టమి—అనఁగా, తన 89 వ యేటను ఇహలోక యాత్ర ముగించినట్లు ధర్మకర్తలయింట వ్రాఁతలు గలవు. అనఁగా, ఇతఁడు క్రీ.శ. 1869 వ సంవత్సరమువఱకును జీవించియుండెనని చెప్పవలయును. కాని యూ తేదీలు సరియైనవి కావేమో ! ఎందుకనఁగా, ముగ్గురిమృతియు పుష్యమాస మందే జరుగుట యొక వింత. మఱియు, నేఁటికి 59 సంపత్సరములక్రింద చని పోయినవానిని చూచినవా రా యూరిలోఁగాని, చుట్టుప్రక్కలఁగాని యొక్కరైన నుండవలదా ? అక్కడ డెబ్బదియేండ్లు దాఁటిన ముసలివా రనేకు లున్నారు. వేమన్నకూఁతురగు అచ్చమ్మను తన చిన్నవయసున చూచితిననియు, అప్పడామెకు సుమారు డెబ్బదియేండ్లుండవచ్చుననియు "షేక్ ఆలం ఆను నొకానొక మనలి సాహేబు చెప్పెను. అతనికిప్పడు సుమారు ఎనుబదియేండ్లు, మఱియు, నీ వేమన్న 1869లోనే సిద్ధుఁడగుట నిజమేని, 1898లో-అనఁగా, ముప్పదియేండైనను గాకమునుపే-యీతని విషయమై విచారణచేసి వ్రాసిన కాంబెలుదొర, ఇతఁడు సుమా రిన్నూట యేఁబదియేండ్లక్రిందటివాఁడని వ్రాయుట చిత్రముగదా!*[9] కాని దొరగారు కటార్లపల్లెను చూచినారుగాని, యక్కడివారి నెవరిని ఎక్కువ విచారించినట్లు తో(పదు. బ్రౌనుదొర క్రితఁడు సమకాలమువాఁడే కావునఁ గాఁబోలు అతని కీతని సమాచారమే తెలియదు. అది యట్లుండె. తల్లి భార్యల మృతికాలమును, ఈ వేమన్న సమాధికాలమును సందేహించినను అతనిజన్మకాలమును సందేహించు టకు కారణము లేదు.

ఇట్లు కొండవీటివేమన్నయ, తుంగ వేమన్నయు వేఱువ్వక్తు లైననుఁ అతని మరణకాలమును, ఇతని జననకాలమును శార్వరి చైత్ర శుక్ల నవమిగానే యుండుట వింతలో వింతగదా! ఇది యిరువురు నేకవ్యక్తియను బ్రాంతిచేఁ గలిగిన దనుకొంద మన్న ఈ బ్రాంతికిఁదోడు పుట్టినపండుగ తద్దినము నొకటిఁగాజేయు వింత బ్రాంతిని గూడఁగట్టుకోవలసివచ్చును! అటైన నీ యిరువురిలో నెవరో యొకరు పుట్టినదో గిట్టినదో శార్వరి సంవత్సర చైత్ర శుక్షనవమి కావలయును. కొండవీటి వేమన్న పై తేదీలో సిద్ధిపొంది నాఁడని వ్రాసినవారందఱును నిన్నమొన్న యతని పద్యముల నచ్చువేసి పీఠికలు వ్రాసినవారే కావున, వారికన్న ప్రాచీనమైన తుంగ వేమన్న వంశమువారి వ్రాఁతయే మనకెక్కువ ప్రమాణము గావలసియున్నది. మఱియు వా రిప్పటికి చైత్ర శుక్ల నవమి యాతని తిరునాళ్ళ నడుపుచున్నారు. కావున పై తేదీ తుంగ వేమన్నదే యనుకొని యా తంటా నింతటితో వగcదెంచుకొందము ! ఇట్లు కట్టకడపట మన వేమన అద్యంతశూన్యుఁడైన సిద్ధమూర్తి యయినాడు.

ఐన మన వేమన్నకు కటార్లపల్లెతో సంబంధమే లేదా ? ఉన్నదని సందేహింప వలసియున్నది. కారణ మేమనఁగా; ఈ ప్రదేశమం దతఁడు సంచరించి కొన్నాళ్ళు నిలిచి తన మహత్త్వమును ప్రకటింపక యుండెనేని, తుంగ పుల్లారెడ్డి తాను వేమన్న యని మాఱుపేరు పెట్టుకొని, యతనివలెనే పద్యములు వ్రాసి, యతని యోగ సిద్దాంతములనే యవలంబించుట, ప్రజలతని నతని యవతారమే యని నమ్మి పూజించుట, సంభవింప దనుకొనుచున్నాను. ఆంధ్రదేశమంతయు వేమన్న సంచ రించినవాఁడైనను తక్కిన స్థలములకంటె నిక్కడ కొన్నాళ్ళేకువగ నిలిచి యుండఁ డేని, ఆతని పద్యములను వినుట మాత్రమేకాక యతని యోగసిద్దులు రసవాదము మొదలగు మహత్త్వములు ఆందఱు నెఱిఁగియుండరేని, తుంగ పుల్లారెడ్డి 'నా పేరు పుల్లారెడ్డి కాదురా, వేమన' యని చెప్పినవెంటనే నమ్మట యట్లుండఁగా 'వీనికేమి వచ్చెరా నడివయసులో నామకరణము !" అని పరిహసించి యుందురు. ఇదిగాక వేఱొక సాధనము గలదు. వేమన సూక్తిరత్నాకరములో క్రింది పద్యము గలదు.

        " ఆ. కదలి తూర్పు సందు ఘనత శోభిల్లగా
               బరగు వర కఠార్లపల్లె వెలసి
               యచలనిష్టఁగూడ సమరి యుండెదరయా విశ్వ." (887)

ఈ పద్యము వేమన్నది కాకపోవచ్చును. తుంగ వేమన్న శతకమునందును గానరాలేదు. నేను చూచిన తక్కిన ప్రాతప్రతులలోను లేదు. కాని యచ్చువేసిన వారు కృత్రిమముగా తయారుచేసినది మాత్రము గాదు. వారికి "కదిరి తూర్పునందు' అను పాఠముండపలయునని తెలియదు. 'కదలి' యనియే పాఠమున్నఁ దప్పేమి యందురా, తూర్పునందు కటార్లపల్లె యునఁగా నే యూరికి తూర్పున? ఆంధ్ర దేశమునకు కటార్లపల్లె సుమారు దక్షిణమగును. అక్కడివారు తెనుఁగుదేశమును తూర్పుదేశమందురు, కదిరికి కటార్లపల్లె తూర్పున నున్నది. కాపన "కదిరి' గ్రామ జ్ఞానములేని వ్రాఁతకాఁడెవఁడో తిద్ధి వ్రాసుకొన్న పాఠమిది. లేక కదిరిపద మర్ధము గాక సంపాదకులే తిద్ధియుందురు. చెప్పవచ్చిన దేమనcగా, పై పద్యము బందరు వారి యచ్చుప్రతికంటె ప్రాఁతది, అందులో వేమన కటార్లపల్లెలో వెలసియున్నట్లు స్పష్టమగుచున్నది. కావున పూర్వకాలమందును దీని నమ్మినవారు కొందఱుండి రన వచ్చును. కాని యతఁ డిక్కడనే సమాధియైనాఁడని చెప్పట కేసాధనమును ఇదివఱకులేదు. వాడుకయైనను గానరాదు. మీఁదుమిక్కిలి, కడపజిల్లా సామూరు గ్రామమువద్ద కొండగుహలో వేమన కట్టకడపట ప్రవేశించినాఁడని యక్కడి వేమన మతానుయాయులగు యోగులు కొందఱు చెప్పకొనుచున్నారని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రలవారు నాతోఁ జెప్పిరి. ఇది పురాణముల కథ.

ఇక చరిత్రమును చాల పరిశోధించి వ్రాసినవారిలో ముఖ్యులగు కీర్తిశేషులైన వంగూరి సుబ్బారావుగారు వేమన వంశమును గూర్చి సందేహముగా వ్రాసిరి. దేశమునుగూర్చి యంతకన్న నెక్కువ నిశ్చయముఁ చేసికొని, మొదలు కొండవీడు, దత్తమండలములు, గోదాపరిదేశము - ఈ మూఁ డిటియందును వేమన సంచరించి యుండవచ్చు ననుకొన్నను, తరువాత, వారికి తక్కిన యన్నిసాక్ష్యముల కంటె "కుక్కతోఁకఁబట్టి గోదావరీదునా" యను నొక వాక్యమే ప్రబల ప్రమాణముగాఁ గానవచ్చి 'గోదావరి మండలమున వీదులలోఁ బాఱవైచిన పల్లాకులలోని యాహార మును మృగపక్షులతోఁగలిసి భుజించువాఁడు" అని నిర్ణయించుకొనిరి! *[10]కాలమును గూర్చి యింకను ఎక్కువ నిశ్చయముగా నూహచేసిరి. పదునాఱవ శతాబ్దాదియందు కృష్ణదేవరాయల సమకాలికుఁడగు ఎడపాటి ఎఱ్ఱాప్రెగడ తన 'మల్హణ చరిత్రము' నందును, ఆ శతాబ్దాంతమందలి తురగా రామకవి తన "నాగరఖండ" మందును, పదునేడవ శతాబ్దమందలి పింగళి యెల్లనార్యుఁడు తన 'తోభ్య చరిత్రము" నందును వేమన్నను బేర్కొని యుండుటచేత ఇతఁడు ox-వ శతకమందున్నవాఁడని వారి యూహ. కావుననే -

          "ఆ. పరఁగరాయని కులబాచని ధనమెల్ల
                భటులపాలు కవుల పాలు తలప,
                ఒనర హీనజనుని ధనము దాయాదుల
                పాలు జారకాంతపాలు వేమ" (24-22) ♦[11]

అను పద్యమును వేమన 14-వ శతాబ్దము తుదలోనున్న రాయని భాస్కరునిగూర్చియే వ్రాసెనని తల(చిరి. మఱియు

           "శ్లో|| నిర్మాయ నూతన ముదాహరణానురూపం
                  కావ్యం మాయాత్రనిహితం నపరస్యకించిత్
                 కింసేవ్య తే సుమనసాం మనసాపి గస్థః
                 కస్తూరికా జననశక్తిమతామృగేణ" (రసగంగాధరము) *[12]

యని స్వాభిమానపూర్ణుడై చెప్పిన పండితరాయఁడు---

           'ఆ, ప్రస్తుంతబు వేళ పద్యంబు చదివిన
               తప్పలెన్నియున్న నొప్పియుండు ----" (26-38)

అను వేమన్న పద్యమునే
              "అపసరపలితావcచీ గుణగణరహితాపి పహతి పరమోదమ్"

అన్నట్లు సంస్కృతమున భాషాంతరీకరించుకొనియెసని చెప్పిరి !**[13] ఇంతేకాక

           క, భవదూరు(డు శరభాంకు (డు
              శివనీలుఁడు చేయు(గోటి సిద్దేశ్వరుఁన్
              శివభృత్యుఁడు వటమాలుఁడు
              శివమయ చిన్మయుఁడు సోమశేఖర గురుఁడుస్"
                                                                (ఓ. లై., 12-1-35)

ఆను వేమన పదములలోని యొుకానొక పద్యమున వేమన్నకు గురువుగాఁ జెప్పఁబడిన సోమశేఖరుఁడును, వీరభద్రవిజయముస బమ్నెర పోతన్న తన గురువుగాఁ జెప్పుకొన్న 'ఇవ్వటూరి సోమవిభుఁడును" ఒకరేయని తలఁచి పోతన్న వేమన్న లిరువురును సహాధ్యాయులై యుండవచ్చునని లూహను సాఁగఁదీసిరి !

కాని వీరి యీ కాలనిర్ణయం నెవ్వరును అంగీకరింపలేదు. భంగారుతమ్మయ్యగారు, శ్రీ ప్రభాకరశాస్త్రులుగారు దీనిని సయుక్తికంగా ఖండించిరి.†[14] పై రాయని భాస్కరుని పద్యమునకు పెక్కు వ్రాతప్రతులలోను అచ్చుప్రతులలోను ఈ పద్యం గలదు.

           "అ. ప్రాకటముగ నిట్టిలోకములో గంటి .
                 పల్లెముత్తఁడెన్నఁ బరమ గుణుఁడు,
                 అన్నదానముసను హరు పూజ చేతను
                 హరునిలోన ఐక్యమాయె వేమ?" (ఓ. లై.,13-3-39)

సుప్రసిద్ధ దాతయైన యీ గుంటుపల్లి ముత్తమంత్రి -

          " క, పొందుగ శరజల నిధిహరి
                చందనతరు చంద్రసంఖ్య శక పర్షంబుల్
                దుందుభినాపాడంబున
                నెందముగా వీరముత్తఁ డరిగెన్ దివికిస్"

అను చాటుపద్యము ప్రకారము క్రీ.శ. 1623లో మరణించెను. కావున నీ పద్యము వ్రాసిన వేమన 17వ శతాబ్దిమధ్యమందలివాఁడగును. అంతకు పూర్వఁడు కాఁజా లCడు. పై గుంటుపల్లి ముత్తమంత్రి పద్యము బందరు ప్రతిలో ‘లోకమందును గంటి బల్లెముత్తఁడు' అని ప్రకటింపఁబడి యుంట పొరబాటే. నేనును మొదలు గంటిపల్లె ముత్తఁడనియే తలఁచితిని, కాని, ప్రాచ్యలిఖిత పుస్తకశాలలోని రెండు వాఁతపతులలో

           " రీతైన సందవరీకులలో చాల
             గుంటుపల్లి ముత్తన్న గుణగరిష్ణుఁడు" (ఓ.లై, 13-9-22; 11-6-25)

అను పాఠముతో పై పద్యము గలదు.♦[15] యతిస్థానమందుండుటచే పద్యము యోగ్యత యెట్టిదైనను, పేరు నిస్సందేహముగదా. కాని వంగూరి సుబ్బారావుగారు వేమన కాలము నిదివఱకే నిర్ణయించుకొన్నారు గావున దానిని మార్చుకొన నిచ్చలేక, ఈ పద్యము ఏ భట్రాజులో వేమన మకుటమున కతికించిన ప్రక్షప్త మనుకొని తృప్తి పడిరి. * [16]ప్రక్షిప్తము గాకున్న పదునారవ శతకమందే వేమనను ఇతరులు పొగడుట సంభవించునని వారి ప్రశ్న. కాని ప్రత్యుత్తరము లేకపోలేదు. పై యెడపాటి యెఱ్ఱాప్రగడ మొదలగువారు, పాల్కురికి సోముఁడు, భవదూరుఁడు మొదలగు శైవాగ్రేసరులగు కవుల నడుమ వేమనయను పేరుఁ జేర్చియున్నారు.†[17] వేమన వేమన శైవప్రపంచంలో పుట్టిపెరిగినవాఁడే కాని కడకు త్రిమూర్తలను తోసిరాజని శుద్ధ ద్వైతిగా మాఱినవాడు వాఁడు. "హరిహరాదులందు నాసవిడిచి (372) న వాఁడు మాత్రమే కాక.

 
         "ఆ, బ్రహ్మవ్రాఁత కెదురు పల్కెడు వాఁడును
              ఆది విష్ణు సూత్రమడఁచు వాఁడు,
              మూఁడు కనులవాని మొనసి నిల్చినవాఁడు,
              కాసఁబడరు నీవు కాని వేమ" (ఓ. లై., 12-1-30)

అని చెప్పకొన్నవాఁడు. మఱియు, ఎఱ్ఱాప్రెగ్గడ వంటి విద్వత్కవులు వేమన్నను కవియని పొగడి రనుకొనుట సాహనము. ఇతని కవిత్వమునందు చదువుకొన్న వారి కిని గౌరవము నేఁడు కలుగుచున్నది గాని పూర్వకాలపు పండితులకుఁ గలదని నేను నమ్మఁజాలను. వారికి, ముఖ్యముగా 15, 16వ శతకములందు, కావలసినవి, శ్లేష యమకముల జిత్తులు, కల్పనాకవిత్వపు గత్తులు. అట్టివారికి యతిప్రాసభంగములు గలవి, ఛందస్సు దారితప్పినవియగు 'ఉప్పుకప్పురంబు' వంటి చప్పిడి పద్యములు తలకెక్కునా? కావున మన వేమన వారిదృష్టిలో శైవుఁడునుగాఁడు; కవియును గాఁడు; వారితనిని బొగడను లేదు. ఇక ఆ వేముఁడెవ్వఁడంటిరేని, పండితారాధ్య చరిత్రమున వర్ణింపఁబడిన చేటలవేమయ్యగాని, బెలిదేవరవేమనారాధ్యుఁడుగాని కావచ్చుననియు, ఈ రెండవవాఁడు శాపానుగ్రహసమర్ధుఁడగు కవియైయుండెననియు *[18] శ్రీ బండారు తమ్మయ్యగారు వ్రాసిరి. వంగూరి సుబ్బారావుగారును ఈ వేమన్నల నెఱుగుదురు.†[19] కాని వేమన్న కాలమును గూర్చి తమప్రాఁత నిర్ణయము మార్చు కొనఁ దల(పలేదు !

ఇదిగాక మన వేమన మహమ్మదీయుల రాజ్యకాలమున హిందువు లనుభ వించిన కష్టములు బాగుగా నెలిఁగిసవాఁడు---

        “క. పసరపు మాంసముఁ బెట్టియు
            మసకల సులతాను ముసలి మానులఁ జేసెస్" (ఓ. లై., 11-6-14)

      "ఆ. రాళ్ళు నమ్మియున్న రాజాధిరాజులు
           కూటి కెడలి భువిని గూలిచనిరి ;
           రాళ్ళు పగుల( గొట్టి రాక్షస పుత్రులు
           మాళ్ళు నూళ్ళగలిగి మనిరివేమ". (ఓ.లై. 21-1-30)

     " ఆ లింగమతములోన దొంగలుగా(బుట్టి
           యెుకరినొకరు నిందనొసరఁజేసి
           తురకజాతిచేత ధూళియైపోదురు, విశ్వ" (ఓ. లై.,13-3-39)

వేమన ముఖ్యముగా సంచరించిన పశ్చిమాంధ్రదేశములో మహమ్మదీయుల కాస్వాతంత్ర్యము విజయనగర వినాశానాంతరమే సంభవించును. మహమ్మదీయులు ప్రభువులుగా కడపసీమయందున్న కాలమున, అనఁగా 17వ శతాబ్దము యొక్క కడపటిభాగమం దితఁడుండినవాఁడని బ్రౌనుదొర గూడ తల(చెను (చూ, ఓ.లై,12-1-34; వ్రాఁతప్రతి పీఠిక). మఱియు నితని కాలమందు మహమ్మదీయుల యుచ్చాయస్థితి చాలవఱకు తగ్గియుండెననియు నీకింది పద్యముచే నూహింప చచ్చును—

      "ఆ. షేకు నైదు మొగలు చెలఁగు పఠానులు
           తురకల దొరతనము తొలుతఁజేసి
           రాఁగరాఁగ విడిచి రైతులై కొలిచిరి విశ్వ" (З765)

కావుననే

       "ఆ. మక్కకుఁ జననేల మగుడఁ దా రానేల
            యేకమైన చిత్తమెందుఁ గలదు,
            అన్నిటఁ బరిపూర్ణ మల్లా మహమ్మదు, విశ్వ."* [20] (2879)

అని ధైర్యముగా మహమ్మదీయులకును మతబోధచేయ సాహసించినవాఁడనియుఁ జెప్పవచ్చును.

మఱియు, వేమన వైష్ణవఖండన చాలతీవ్రముగాఁ జేసినవాఁడు. ఆంధ్రదేశమున వైష్ణవమతము కృష్ణదేవరాయల తరువాతనే కొంత వేఱూఱినది. ప్రాచీనమైన శైవ మతమును రాజాశ్రయబలముచే నెదుర్కొని జనసామాన్యమును వైష్ణవులనుగాఁ జేయఁబ్రయత్నించినవారు తాతాచార్యుల వంశమువారు. వీరి కాలముననే మాలలు మొదలు రాజులవఱకు నీ దేశమున నించుమించుగా సామాన్యజనులు ముక్కాలు మ్మువ్వీసము వైష్ణవులయిరి. తాతాచార్యుల వీఁపుముద్రల మంట మనవారింకను మఱవలేదు. వెంకటపతి రాయల కాలమున వీ రేర్పఱచిన నామధారిమతము స్థిర మైనది. దాసరులు, సాతానిపురుషాకారులు, బసివిరాండ్రును-వీరివలస నిర్ణయింపఁ బడిన మర్యాదల నిప్పటికిని అనుభవించుచున్నారు. వేమన్న కాలమున కీవైష్ణ ప్రాబల్యము పరమార్థ దృష్టిలేక, పరార్థదృష్టిగలిగి కేవలము వేషముక్రిందికి దిగి నట్లున్నది. మతము పేర నెన్నియో యకార్యములు చేయుచుండిరి.

       'ఆ, ఎంబెరు మతమందు నెస(గ మాంసముదిని
            మాఱుపేరుపెట్టి మధుపత్రావి
            వావి వరుసదప్పి వలికిపాలౌదురు, విశ్వ."

                                         (వేమన జ్ఞానమార్గపద్యములు, ద్వి. భా, 14)

     " ఆ రంగధామమునకు హంగుగా తానేగి
            కల్లుకంపుసొంపఁ గల్గియుండు. . . ." (ఓ. లై., 13-3-39)

బ్రౌను దొర కాలమువజకును ఈ యకృత్యములు వెస్తవులు చేసెదరను భావము అనువర్తించిపచ్చినది. పైరెండవ పద్యమునకు టీకలో 'వైష్ణవులు పూజ నయినపుడు కల్లుత్రాగుదురు" అని యతఁడు గుర్తవ్రాసికొన్నాఁడు! దీని సత్యాసత్య నిర్ఱయము ప్రకృతవిషయముగాదు. అన్ని మతములు మొదలు మహెరాదారాశయ ములతోనే బైలుదేరినను, క్రమముగా దానివేఁడి యాఱిన వెంటనే సహజములైన యింద్రియచాపల్యములు ప్రబలించి, మనుష్యులు తమ తప్పలను సమర్ధించు కొనుట కామతములనే యుపయోగించి పతితులగుట యన్నిదేశములందును అన్ని కాలములందును గలదు. అట్టి యవస్థకు కొంతకాలమైసను పట్టునుగాన, పదు నా ఱవశతాబ్దపు మొదట వ్యాప్తికి వచ్చిన వైష్ణవమతముసకు పై దురవస్థ పదునేడవ శతాబ్దమందే కలిగియుండపచ్చునని యూహింపవచ్చును. 1923లో మరణించిన ముత్తమంత్రి నెఱిఁగినవాఁడు గావునను, వేమన్న యా శతకమధ్యభాగమునకన్న వెనుకనుండి యుండ(డు. ఇఁక పదునేడవశతకపుటాదియందే, ఆనఁగా, ముత్తమంత్రి మరణించిన కొన్నాళ్ళలోపుననే వేమన మరణించియుండునని శ్రీ ప్రభాకరశాస్తులవారి తలఁపు.

          “గజపతింట గ్రుడ్డిగవ్వలు చెల్లవా" (91)
         "గ్రద్దవంటివాఁడు గజపతిగాదొకో" (వే.జ్ఞా. పద్యములు, 780)

అని వేమన దూషించిన గజపతుల ప్రాబల్యము 17వ శతకపు పూర్వభాగ మందే కావునను, సుమా రిస్నూ రేండ్ల వయసుగల వ్రాఁతప్రతులు తంజావూరి గ్రంథాలయములో నుండుటచేతను, వేమనను 17 వ శతకపు తుదికీడ్చుట సాధ్యముగాదని వారి వాదము. ♦[21] కాని బండారు తమ్మయ్యగారు వేమన 17 వ శత కాంతము వఱకును బ్రతికియుండెనని యూహించుచున్నారు. గుంటుపల్లి ముత్త మంత్రి గోలుకొండ నవాబగు మహమ్మదల్లి పాదుషాయధికారము క్రింద కొండవీటి సీమకు అమీనాగా నియమింప(బడినవాఁడు కావున, అతని కాలమునందు *షేకు సైదు" అను పద్యము చెప్పనవకాశ ముండదనియు, ఈ పద్యమునాఁటికి తురకలదొరతనము నశించిన దనియు వారి వాదము.*[22] బ్రౌనుదొర, వెనుక(జెస్పి సట్టు వ్రాఁతప్రతిలో 17-వ శతకపు తుదలోను 18 వ శతకపు టాదియందును ఉన్నాడని వ్రాసికొన్నను అచ్చు ప్రతి పీఠికలో "పదునేడవ శతాబ్దపటాదియందు ఇతఁడున్నాఁడని నమ్మెదరు' అని తిద్దుకొనెను. †[23]

నాకుఁ జూడఁగా 18 వ శతాబ్ది యూదియందు వేమన్నయుండెసని యూహిం చుట యనుకూలముగాఁ దోఁచుచున్నది. తాటాకుల పుస్తకముల వయస్సు నిర్ణయించుట కష్టము : గజపతులకథ, ముత్తమంత్రి మరణము మొదలగుసవి విని యైనసు వ్రాయపచ్చును. కాని 1780లో జనించిన కటార్లపల్లె పుల్లారెడ్డి తాను వేమస యపరావతారమని చెప్పకొనుటకును, ప్రజలు, అందును వ్రాఁతచదుపులు రానివారు, దానిని నమ్ముటకును, వేమన మఱుఁగు పడి చాల సంవత్సరములై యుండిస సాధ్యముగాదు. కావున ఆ వేమన్న సమాధికాలమును ఈ వేమన్న జనన కాలమును ఎంత సమీపమందున్న నంతమేలు. కాని, వంగూరి సుబ్బారావుగారు వేమననెంత పై కీడ్చిరో నేనంత క్రిందికీడ్చు న్నానేమో యను భయము నాకు లేకపోలేదు. ఐనను మనచరిత్రములెల్ల చాలవఱకు ఊహాప్రపంచమునకుఁ జేరినవో కాన, ఇన్ని యూహలజతలో నాదియు నొక యూహయండిన నంతేమి బరువు గాదనుకొనుచున్నాను. ఇంతకన్న దీనికెక్కువ సత్యత్వము నిచ్చుటకు నాకధి కారము లేదు.

ఇట్లే వేమన యొక్కువగా వసించిన స్థలమునుగూర్చియుఁ గొంత యూహింప వచ్చును. వావిళ్ళవారి ముద్రణపు పీఠికలో, ఇతఁడు దత్తమండలముల వాఁడనుట న్యాయ్యమని ప్రాసియుంటిని, దత్తమండలములనఁగా, కదిరి త్రాలూకా యిప్పడనంతపురమునకుఁ జేరుటచేత ఈ జిల్లాకును కొంత వేమన ప్రసాదము దొరకిన శాస్త్రమైనదే కాని, యంతకుముందు, అసంతపురము బళ్ళారిజిల్లాల కితని సంబంధము కానరాదు. కావున నితఁడు కడప కర్నూలు జిల్లాలవాఁడని బౌ)ను, కాంబెలు మొదలగు వారివలె నేనును తల(చితిని. దానికి నా స్వదేశాభిమాసమే కారణ మని శ్రీ పం. సుబ్బారావుగారు తలంచిరి. నా స్వదేశాభిమానము సత్యమునే మఱుఁగుపఱుచునంత దట్టముగ ముదిరి బలిసినదని నేనింకను అనుకొనలేదు. అస లిటువంటి అవాంతర భాగములం దభిమానము కృత్రిమమే కాని సహజము గాదని నా మతము. ఆభిమానమను పేరుతో, పిల్లులకు దొరకిన పెసరయుండను పంచిపెట్టవచ్చిన కోఁతివలె, పరిపూర్ణమైన వస్తువును ప్రక్కలు కొఱికి తినుట యిప్పటి నాగరకత దుష్ఫలములలో నొకటి. ఇట్లే చేయుచుండినచో పూర్తిగా అసలే "నశించువఱకు ముగింపుండదు, వేమన యాంధ్రుఁడని యెఱి(గి తగిన మర్యాదను చూపఁగల్లితి మేని మన యభిమానమునకుఁ జాలును. అట్లుగాక మాదత్త మండలముల వాఁడని, మా యనంతపురము జిల్లావాఁడని, మా కళ్యాణదుర్గము తాలూకా వాఁడని, మా రాళ్ళపల్లివాఁడని, అందును మా యింటనే పట్టిన వాఁడని, ఉల్లిగడ్డ పొరల వొలుచుచుఁబోయిన, తుదకు నేనే వేమన్న యనుకొనవలసివచ్చి శూన్యము శేషించును! కావున వేమన దత్తమండలముల వాఁడని సామాన్యముగ నే నూహించుటకు అతఁడట్టివాఁడుగాc గాసవచ్చుటయే తప్ప వేఱు కారణమేదియు లేదని విన్నవించుచున్నాను.

అట్లు కానవచ్చుటకు కారణము లిదివఱకే కొన్ని సూచించితిని. ఇదిగాక ! గండికోట నితఁడు పేర్కొన్నాఁడు [1247], నంది దుర్గమును జూచినాఁడు [392]. కడపజిల్లా జమ్ములమడుగు తాలూకా ముడియమను గ్రామములో వేమన శిష్యుల పీఠము గలదcట 'యోగాభ్యాసము వారి వృత్తి ; ఇట్టి వారీమండలమున నూఱు కుటుంబముల వఱకుఁ గలరు" అని శ్రీ కావ్యతీర్థ జనమంచి శేషాద్రిశర్మ గారు నాకు వ్రాసిరి. ఇట్టి మఠము గండికోటలో నొకటి కలదఁట ; పామూరను గ్రామము వద్ద కొండగుహలో వేమన కడసారి ప్రవేశించినట్లు కల వాడుకను మొదలే తెల్పితిని గదా ! వేమన దక్షిణదేశమంతయు ఇంచుమించుగా సంచరించినాఁడని తలఁపవలసి యున్నది నిజమే ; అరవదేశమునఁ గూడ నితఁడు మఠములు స్థాపించినాఁడని వదంతి. ఎంతవఱకు నిజమో చెప్పలేను. తంజాపూరి రాచనగరులో వేమన్న చిత్రపటమున్నదంట. కాని దత్తమండలములలో వేమన కున్నంత ప్రచారము తక్కినచోట్ల నున్నట్లు కానరాదు. ఇప్పటికిని 'వేమన్న' యను పేరు గలవారీ దేశమందెందఱో కలరు.

మఱియు, వేమన వాడిన ఈ క్రింది పదములు చూడుఁడు : మంకు (364) తారాడు (190) సంబళము (139) సొడ్డు (468) కళవళము (939) కూయు [1116] చాడి [1504] దుడ్డు (వే.1143) తాళిక (2114) బిత్తలి [2552] ఇత్యాదులు కన్నడ సీమకు సమీపమగు తెలుఁగు దేశమందే వాడుకలోc గలవు. మఱియు ఆకు వక్క (220) బైసి (396) వలికి [673] ఒక్క పొద్దు (792) రుద్దు (1116) పీకు (1125) కుళ్ళుపోతు [1147] మొదలగు శబ్ద ములు నల్లమల కీవలివారికి తప్ప ఆవల వారి కర్థమగునా యునియే నా సందేహము. వీనికితోడు కుంక (1033) చెంబడి (880) ఊ(క (549) వంటివి, ఈ దేశమున వాడుకలేని పదములు అపురూపముగాఁ గలవు కాని, యివి వేమనవంటి దేశ దిమ్మరికి వచ్చుట వింతగాదు,

ఇదిగాక వేమన బసివిరాండ్రను పలుమాఱులు పేర్కొని యున్నాఁడు. బసవ శబ్దము వృషభశబ్దపు కన్నడము. శివదేవాలయములకు కుఱ్ఱదూడను వదలిపెట్టుట, అది స్వేచ్చగా నెవరితోఁటలలో మేసినను నహించి యూరకుండుట, దానిని పూజిం చుట-కన్నడశైవల సంప్రదాయము. దానిని వారు బనవుఁడందురు. అట్లే యింటిలో నొక యాఁడుబిడ్డను వివాహము చేయక వదలుట కొందఱు వీరశైవులలో నిప్పటికిని గలదు. వారు వ్యభిచార వృత్తిచే జీవింతురు. వారికిని 'బసివి' యను పేరు సమాన ధర్మముచే వచ్చినది. తాతాచార్యులవారి వైష్ణవము రాకమునుపు ఈ దేశమందును ఆ పద్దతి యుండి యుండును. దానిని పూర్తిగాఁ ద్రోసివేయలేక కాఁబోలు, వైష్ణవ గురువులు, శిష్యులలో బసివిరాండ్రకు భస్మరుద్రాక్షలకు బదులుగా తిరుమణి తులసి పూనలనిచ్చి, దాసర్లగుంపులో వారిని జేర్చినారు. క్రమముగా బసివిరాండ్రను తయారుచేయుటకుఁ గూడ గురువులవారి యాజ్ఞ కావలసివచ్చినది. ఇట్లు గురువుగారి యనుమతిచే దాసీత్వమును వహించిన వైష్ణవ బసివిరాండ్రు ఈదేశపు 'నామధారుల'లో నెందఱో కలరు. వీరొక విధముగా పల్లెటూరి వేశ్యలు. ఇక్కడ తప్ప ఇత రాంధ్రదేశములలో వీరి పేరు వినరాదు. కావున వేమన్న పేర్కొనిన బసివి రాండ్రు శైవులైనను, వైష్ణవులైనను వారి పరిచయ మతని కీదేశమందే కలిగి యుండు ననుకొనుచున్నాను.

ఇఁక నేయితర స్థలములందుఁగాని వేమన వసించినట్లు ఇంతకంటె ప్రబలము లైన సాధనములుండెనేని, యవి నాకు తెలిసిన వెంటనే, అవశ్యముగా ఆ యూరికి విచ్చేయుమని, వేమన్నను పల్లకీలో మోసి యక్కడికి సా(గసంపుటకు నేను మొదటి బోయిలాగా నిలుతును.

వెనుకనే చెప్పవలసిన వేఱొక్క విషయమును మఱిచితిని. ఇప్పడు విన్న వింతును. వేమన్న కాలజ్ఞానమును వ్రాసెనఁట ! కాలజ్ఞానమనఁగా భూతమును భవిష్యత్తుగాఁ జెప్పట ! జరిగిన దానిని జరుగఁబోవనదిగా చెప్పి తన కాలమును త్రానే వెనుక కీడ్చుకొనుట ! పురాణములలోని భవిష్యద్రాజ వర్ణనమిట్టిదే. వ్యాసులే యీ పద్ధతికి ప్రథమాచార్యుఁడు గా(బోలు. అతఁడు ఇతర పురాణములలో వ్రాసిన చిల్లర భవిష్యత్తుకు తృప్తిపడక భవిష్యత్పురాణమని దానికే వేఱుపురాణమును వ్రాసినాఁడు. అనఁగా వ్రాయుచున్నాడు ! దానిలో సృష్టి మొదటినుండి మొన్న ఇంగ్లీషువారు రాజ్యమునకు వచ్చువఱకు భవిష్యత్తు చెప్పి, చిరంజీవిని గదా, తక్కినది నిదానముగా వ్రాసికొందమని కా(బోలు, ప్రకృతము విశ్రాంతి ననుభచించు చున్నాఁడు. కర్ణాటక శైవులలో నిట్టి కాలజ్ఞానములు వ్రాయుట యెక్కువ. బనవేశ్వరుఁడు మొదలగు వారెల్ల తలకొకటి వ్రాసినవారే. వేమనవంటివాఁడైన సర్వజ్ఞుని పేర నొకటి గలదు. తెనుఁగులో పోతలూరి వీరబ్రహ్మము మొదలగు వారి పేర నిట్టివి గలవు. కావున ఆ గుంపునకే చేరిన వేమన్నగూడ నొకటి వ్రాసి యుండిన నుండును. వ్రాయకుండినను శిష్యులలో నెవఁడో వ్యాసమహర్షి గరుసేవ చేయుటకై యతని పేరుపెట్టి వ్రాసియుండును. కాని యాగ్రంథము నేఁజూడలేదు. అందులోనిదే కాఁబోలు నీపద్యము.

      " క. నందన సంవత్సరమునఁ
           బొందుగ కార్తీక శుద్ధ పన్నమనాఁడీ,
           వింధ్యాద్రి సేతుబంధన సందున
           నొకవీరు(డేలు చాటరవేమా." ( 2151)

ఇది వేమన్న తన్నుఁగూర్చి చెప్పకొని యుండుననియు, కావున ఆతఁడా తేదీలో పుట్టి యుండవచ్చుననియు, 'ఏలు" సనఁగా మత ప్రచారముచే నేలినవాఁడనియు, నొక యూహ (వం, సు, వేమన, పు. 43). ఇట్టిదే మఱియొక పద్యమును గలదు :

       " ఆ. ఒకట రెంటమూఁట యోగీంద్రులను
             గూడి పర్వతంబు మొదలు గిరుల
             క్రమ మెఱింగి యల్ల మనపట్టణము లెల్ల
             వీరుఁ డొక్కఁ డేలు వినర వేమ." (777)

తక్కిన పద్యమంతయు నర్థము చేసికొనఁగలవారు. ఇక్కడఁ గూడ ఏలు' శబ్దమునకు పైయర్థమునే చెప్పి, యిదిగూడ వేమన్న తన్నుఁగూర్చియే చెప్పకొన్నాఁ డనుకొనవచ్చును. ఇట్టి పద్యములు వేమన్న భవిషత్కాల జ్ఞానమునకుఁగాని, మన భూతకాల జ్ఞానమునకుగాని, పనికిరావు. కావున వీనిని గూర్చి చర్చించి ఫలము లేదు

 1. * చూ, వం, సు. వేమన, పు. 65.
 2. †ఆంధ్రుల చరిత్రము, భౌ, 3 పు 190
 3. ‡ చూ, ఘటశోధని, పు. 48.
 4. చూ. అం. భా. 3, పు 193
 5. *See Brown's Verses of Vemana, Preface, p. III.
 6. † See Mad. Chris. Coll. Mag., March' 1898
 7. ‡ఈ ప్రయాణమందు మన్మిత్రులు శ్రీ అనంతపురపు వార్తకవి రామచంద్రరాపు, బి.ఏ. బి.ఎల్. గారును, కదిరి వసంతాచార్యులుగారు, రెడ్డిపల్లి వెంకటశ్రేష్టిగారును నాకు చేసిన సాహాయ్యము ఎన్నఁడు మఱవరానిది.
 8. *ఈతని పద్యము సుమారు ముప్పదివఱకు. మచ్చుకు శ్రీ కదిరి వసంతాచార్యులు
  గారు నాకు వ్రాయించి పంపి నా కృతజ్ఞతకు పాత్రులైరి.
 9. * *See Mad. Christ. Coll. Mag., March 1898, p. 524.
 10. * చూ, వం, సు, వేమన, ప, 170.
 11. ♦ ఈ ప్రతిలో 'రాజకులులు పాతినధనము' అని పాఠము గలదు. కాని, ధ్రాంతి, వ్రాఁత ప్రతులలోను, ప్రాఁతప్రతులలోను 'దాచని ధనము' 'బాచన్న ధనము' అనియే కలదు. 'బాచున్న' యను పాఠమును గలదు. అదియు పొరఁబాటే. ముందు చూడుము.
 12. * ఉదాహరింపఁదగిన వానినెల్ల నేనిందు కొత్తగా రచించితిని గాని యితరుల పద్యము లిందేమియు జేర్చలేదు. కస్తూరిని బట్టింపఁగల మృగము పువుల వాసన మనసున నైనఁ దలఁచునా ? అని తా.
 13. ** వం. సు. వేమన. పు. 124.
 14. † చూ, ఆంధ్రపత్రిక, రక్తాక్షి, క్రోధన, అక్షయ సంవత్సరపుల సంచికలు.
 15. ♦ పై ప్రతులలో నీ పచ్యమునకు మొదలీ క్రింది పద్యములు గలవు :

  "సర్వజ్ఞ సింగన్న నంతరించిన ధనము పరగ భూమి పాలు పరుల పాలు
  సరగ పెదవేమన్న సంతరించిన ధనము సురభూసురుల పాలు చూడువేమ"

  "పరగ రాయనిమంత్రిబాచన్న ధన మొల్ల భటకవియాచక పరుల పాలు
  సరగ శ్రీనాథుఁడు సంతరించిన ధనము వారజారస్త్రీలపాలు వేమ"

 16. * చూ, శతక కవుల చరిత్రము. పు, 79,
 17. † చూ, వం, సు, వేమన, ప. 39 నుండి పు, 41 వఱకు
 18. * చూ, ఆంధ్ర పత్రిక, రక్తాక్షి సంచిక.
 19. † చూ, వం. సు. వేమన, పు.201.
 20. * ఈ పాఠమే వ్రాఁతప్రతులందెల్లఁ గలదు. మహమ్మదు అల్లా కాఁడవి యెటిఁగిన యాధునికులు 'అల్లా మహాత్ముండు" అని తిద్ధిని, కాని సామాన్య మహమ్మదీ యుల పాలికి మహమ్మదే ఆల్లా, వేమనకింతకన్న నెక్కువ *ఇస్లాము? మతజ్ఞానము * గలుగ నవకాశములేదు.
 21. ♦ ఆంధ్ర, సం. సంచిక, క్రోధన,
 22. *ఆంధ్ర, అక్షయ, సంచికి.
 23. † See Brown’s Vemana, Preface III.