వేమన/నాలుగవ యుపన్యాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


శ్రీ:

నాలుగవ యుపన్యాసము

వేమన కాలమందలి మతధర్మముల స్థితి

వేమనకు ఇంటినంసారమునందు కలిగియుండవచ్చునట్టి పరిణామములను కొన్ని యిదివరలో నూహించితిమి. దీనికన్నను పెద్దనంసార మొకటున్నది. సంఘము, ఆలుమగల కలహము, బిడ్డలకు నిష్పయోజకత్వము, దారిద్ర్యము మొదలగున వెన్ని యుండినను వేమనవంటివాని యుక్కుమనసు అంతగా చెదరి యుండదు. అరాచకము, అజ్ఞానము, స్వార్థపరత, వంచన మొదలగు నన్యాయము లచే తనకాలపు సంఘము పడుచున్న యవస్థ వేమనను 'ఇంటిలోని పోరు' కన్న ఎక్కువగా కలంతపెట్టినది.

నాలుగు పురుషార్థములలో ఇప్పటి సాంఘిక రాజకీయ పరిణామములను గలిగించు ప్రధానశక్తి కామసాధకమగు నర్థము. ప్రాచీనసంఘమును, రాజ్యమును ముప్పుత్రిప్పలఁ బెట్టినది మోక్షసాధకమగు ధర్మము. అనఁగా, ఇహలోక సౌఖ్య కాముకులై దానిని సాధించు నర్థమును సంపాదించుట. తన్మూలమున సంఘమును బలవంతముగాఁ జేసికొని రాజకీయస్వాతంత్ర్యమును సాధించుట ఇప్పటి మన పరాయణము. మోక్షధర్మముల చింత యెవరో కొందఱు వ్యకులను కలఁతపెట్ట వచ్చునుగాని మొత్తముమీఁద మనము కాముకులమగు ఆర్ధికులము. ప్రాచీనులలో నిట్లుగాక మోక్షధర్మములను గూర్చిన సంస్కారము చిన్ననాఁటినుండి ప్రజలకు బోధింపఁబడుటచే వారి కార్యాకార్యములను అదే నిర్ణయించుచుండెను.

ఆనఁగా, ఇప్పటివారందఱును అధార్మికులైనబద్ధులని కాని, ప్రాచీను లందఱును ముక్తులగు ధర్మావతారులని కాని చెప్పరాలేదు. మఱియు ఇప్పటి మన మందఱును కుబేరులము, మన్మథులమునై వారందఱు బికారిసన్యాసులుగా నుండి రనియుఁజెప్పట నాయభిప్రాయము కాదు. పంచేంద్రియములును, హృదయమును వారివలె మనకున్నవి. మనవలె వారికి నుండినవి. కావున ఇహలోకమందలి సుఖ స్వాతంత్ర్యములందాశకాని, ఇందలి బంధములనుండి తప్పించుకొనవలెనను కోరిక గాని యిరువురికిని సమానమే. అప్పటి ధర్మ మెంత మంచిచెడ్డలను చేసినదో, యిప్పటి యర్ధమును అంతే చేయుచున్నది. ధర్మబుద్ధితో సర్వశక్తులను వెచ్చించి సత్రములు, సోపానములు, చెఱువులు, కాల్వలు మొదలగునవి నిర్మించి పరోప కారముతో జన్మము సార్థకము చేసికొనిన త్యాగశీలురు వారిలోఁగలరు. ధర్మ బ్రాంతితో జనులను హింసించి, చంపి, దోచి, దొమ్మిచేసినవారును వారిలో నుండిరి. ఆహెూరాత్రమును అర్థార్జనచేసి ప్రజాభివృద్ధికెంతయు వెచ్చించువారు నేఁడును గలరు. అక్షరలక్ష లిచ్చినాఁడని చెప్పఁబడు భోజరాజకన్న అణ్ణామలైచెట్టిగా రేమిటఁ దక్కువ? ఇట్లే ద్రవ్యలోభముచే ఇతరులను వశపఱచుకొని నిర్గతికు లనుగాఁజేసి, వారి జాతినీతిజీవనములను ధ్వంసముచేయుచున్న వ్యాపారు లిప్పటి ప్రపంచమున ననేకు లుండుట మీ రెఱుఁగనిదికాదు. కావున నే నిందు ధర్మమనుపదమును న్యాయమను నర్ధమందుపయోగింప లేదు. సామాన్యవ్యవహారములో నీ రెండుపదములును ఒకటిగానే వాడఁబడు. చున్నను మనమిప్పడు కొంత భేదమును గల్పింపవలసియున్నది. న్యాయము. మనుష్యుని హృదయమందు సహజముగా జనించు దయ, ఔదార్యము మొదలగు నుదారభావములచే నిర్ణయింపఁబడును. ధర్మము ఒకజాతికో, వ్యక్తికో యోగ క్షేమములు కలుగవలయునని తప్పక యాచరింపవలసినదిగా పెద్దలు ఏర్పఱచిన నియమము. న్యాయము ఎవరికిని కష్టనష్టములు రాకుండఁ బ్రయత్నించును. ధర్మము ఎవరి కష్టసుఖములను గమనింపదు. న్యాయము ధర్మము గావచ్చును ధర్మము న్యాయము కావచ్చును. కాని అయియే తీరవలయునని నిర్బంధములేదు. శైవునిజూచిన సచేలస్నానము చేయవలయుననుట వైష్ణవుని ధర్మము. కాని న్యాయముకాదు. పంచములనుగూడ మనవంటి మనుష్యులనుగా భావించి దగ్గఱకుఁ జేర్చుట న్యాయము ; కాని హిందువుల ధర్మముకాదు. అనఁగా, న్యాయము మనుష్యజాతి సామాన్యము ; ధర్మము అవాంతరభేదములకు చేరినది. న్యాయము నకు ఇహలోకమందు దృష్టి ధర్మమునకు పరలోకమందు, కావున న్యాయము సార్వకాలికము ; ధర్మము మార్పులకు లోఁగునది. పరలోకదృష్టి చాలవఱకు నశించిన యీ కాలమందు ధర్మము నశించుచున్నది. పరలోకము అతీంద్రియ వస్తువుగావున దానియందు నమ్మికగలవారు తమ యనుభవముకొలఁది, అను మానము కొలఁది, దానిని సాధించుటకు వేఱువేఱు మార్గములను వెదకుదురు. వెదక లేనివారు తమ కెవరియందు గౌరవముగలదో వారిమాటనమ్మి వారు చెప్పిన త్రోవ నడతురు. ధర్మభేదమిట్లేర్పడును. ప్రకృతము ఆ నమ్మిక చాలవఱకు నశించు చున్నది గావున ఈ భిన్నధర్మములును మనలో నశించుచున్నవి. ఇందుచే మనకు నష్టమా లాభమా యను విషయము ఎవరియంతకు వారే పరలోకయాత్ర యొదిగి వచ్చినప్పడు, నిర్ణయించుకోవలెనుగాని వేఱుమార్గము గానను. అది యట్లుండనిండు.

ప్రాచీనులు మోక్ష కాంక్షులంటిని. అనఁగా ఆధునికులకు మాత్రము మోక్ష మక్కరలేదా ! మోక్షమునుగోరుట మనుష్యస్వభావము. కోరక యుండుట యసా ధ్యము. తక్కిన జీవరాసులకంటె మనుష్యునకు విమర్శము ఊహ యను రెండు. మనోధర్మము లెక్కువగా నుండుటచే, ఫలమున్నను లేకున్నను చూచినవిషయము. లను విమర్శించుట, తెలియనిదాని నూహించుట, అతనికి సహజములైనవి. దశ దిక్కులందు ఇన్నివిధములనికాని, యింతసంఖ్య గలవనికాని, తెలియరాని చరా చరవస్తువు లెచ్చటఁజూచినను గలవు. వానిలో గొన్నిపరస్పరము మిత్రములు ; కొన్ని శత్రువులు ; కొన్ని రెండును గానివి. ఇవి యేల యున్నవి ? రూపము, రుచి, వన్నె, పరిమాణము, గుణము, శక్తి మొదలగు నన్ని విషయములందును ఇవి యొకదానివలె నొకటి యుండకపోవుట యేల? ఇవి పరస్పర సుఖదుఃఖముల నెందుకు కలిగించును? ఇవి పుట్టుట, పెరుగుట, చచ్చుట యేల? మఱియు అట్లనఁగా నేమి? వీని యసంఖ్య క్రియలన్నియు తమంతటనే జరుగుచున్నవా? వీనిని మార్పసాధ్యము లేదా?-ఇత్యాదిప్రశ్నలకు ప్రత్యుత్తరమును గోరుట, తెలియక పోయిన నేమో చింతపడుట మాసవధర్మము. ఇట్లు తెలియవలెనను నాశ గలిగియు తెలియలేకపోవుట మనుష్యునకుఁగల యన్నిబంధములలో మొదటిబంధము. చలి వేఁడులు, పుట్టుచావులు మొదలగు మమష్యునికిని సమానమైనను ఈ బంధ మొక్కటి యితని కెక్కువగాఁ గలిగి, తక్కినవానికున్న నైశ్చింత్యసుఖమును ఇతనికి లేకపోయి, బ్రదుకు నహింపరాని దైనది. నాఁటినుండి నేఁటివఱకును మానవజాతి ప్రయత్న మంతయు ముఖ్యముగా పై యజ్ఞాన బంధమునుండి తమ్ము వదలిచుకొనుటకే వినియోగమగుచున్నది. ఈ సహజమైన ముక్తికాంక్ష నాకస్మికముగా వదలుటకు ఆధునికులందరు తటాలున పశువులో పశుపతులో కాలేరు గదా ! ఆ బంధమట్లే యున్నది. తెగలేదు. తెంచు కొను ప్రయత్నములును నిలువలేదు. కాని తెలిసికొనుటకు వేఱుమార్గము వెదకు చున్నారింతే. ప్రాచీనులు సర్వసందిగ్ధమైన యీ సృష్టిని సముదాయముగాఁ బరీ క్షించి, ప్రతివస్తువునందును గలుగు సందేహమును ప్రత్యేకముగాఁ దీర్చుకొనుట యసంభవముగా నెఱిఁగి, ఈ విచిత్ర వైరుధ్యమునకు మూలకారణమొకటి యుండ వలయునని నిశ్చయించి, తమ ప్రయత్నమంతయు నాప్రక్కకుఁ ద్రిప్పి పనిచేసిరి. ఫలమేమనఁగా, ఒక్కొక్కరి యూహయు అనుభవమును వేఱు వేఱు కారణములచే వేఱువేఱుగా నుండుటచేత, ఆ మూలమూర్తి యొకటియైనను ఒకవిధముగా నుండక, పలువిధములుగా మాఱి మనకష్టమును మఱింత హెచ్చించినది. అది సగుణమని కొందఱు, నిర్గుణమని కొందఱు, శూన్యమని కొందఱు, రెండును గానిదని కొందఱును తలంచిరి; బోధించిరి. ఇ(క సగుణమూర్తియని యంగీకరించిన వారిలో నెన్ని సిద్ధాంత భేదములు ? దాని యాకారము, లింగము, వన్నె, అవయవములు, గుణము, భాష మొదలగు దేనియందును ఒకటివలె నొకటిలేని వేఱువేఱు రూపము లా మూలమూర్తికి వచ్చిసవి. ఇట్లు చెఱసాల వదిలిరావలయునని ప్రయత్నించి వాకిట కాలుపెట్టఁగనే ఉన్ననంకిళ్ళు వదలుట యట్లుండ క్రొత్తసంకిళ్ళు వచ్చి నట్లయ్యెను ! అన్ని బంధములకన్న పెద్దబంధము మోక్షమే యయ్యెను! కావున నీమార్గము ఫలములేదని ఆధునికులగు పాశ్చాత్యులును వారి నాగరకత ననుస రించినవారును, కంటికిఁ గానవచ్చు పదార్ధము నొక్కొక్కదానిని ప్రత్యేకముగ పగుల( గొట్టి యంగాంగములు పరీక్షించి, దాని గుణనియమాదులను గనిపెట్టి, ఆ పదార్థ విజ్ఞానమూలమున సృష్టి రహస్యపులోఁతునుచూడఁ బ్రయత్నించుచున్నారు. కాని యిబావిని ద్రవ్విన ల్లెల్లభూతములు బయలుదేరుచున్నవి ! ఈ యిసుకపాతర కంతేది? మరియు నెన్నఁడును మనుష్యుని చేతికందని, కొలఁతకుఁ జిక్కని పదార్థములు ఖగోళాదులు కోట్లకొలదిఁ గలవు. వానిని చెలిసికొనుట కనుమానము తప్ప వేఱేమిమార్గము ? కావుననే సూర్య చంద్రాదులనుగూర్చి ఆధునికుల యూహలు వింతవింతలుగా బయలుదేరుచున్నవి. ఇంతకష్టపడి మనుష్యజాతి బ్రతికినన్నాళ్ళు పరీక్షించి పరీక్షించి, తమ సంపాదించిన జ్ఞానమును వ్రాసిపెట్టినను, తదియే వేఱొకసృష్టి యంతయై, యొక మనుష్యునికే కాదు, అందఱుఁజేరినను జీర్ణించుకొన వీలులేనంత యైపోవును గాన, ఇందుచే బ్రతుకు మరింత కష్టమే యగునేమో ! మఱియు, ఇట్లు పస్తువులను ప్రత్యేకముగా పగులఁగొట్టి పరిశోధించుట చేత, ఇదివఱకును మన మెఱుంగనివాని యందలి శక్తులు కొన్ని యొఱుఁగగలము : వాని నుపయోగించుకొని బ్రతుకులో కొన్ని యనుకూలములను కల్పించుకొనఁ గలము : “ఇది యెట్లు ?" అని యడిగిన కొంతవఱకును జవాబియ్యఁగలము. ఇది యొక విధమైన చిన్న మోక్షము. ఇంతే కాని యీ ప్రపంచమేల యిట్లు జరుగు చున్నది? దీనికి మూలమేమి? ఇత్యాది ప్రథమ ప్రశ్నలకు ప్రతిధ్వని తప్ప వేఱు పత్యుత్తరము గలదా? ఇట్లు ఆధునికులు మోక్షమును సంపాదించుటకై వేఱు మార్గమునఁ బ్రయత్నించి ప్రాచీనులవలె తుదకు బద్ధులే యగుచున్నా రింతేకాని వారు మోక్షద్వేషులు గారని చెప్పవచ్చి చాలఁ బెంచితిని.

ఈ మోక్షదృష్టియే ప్రాచీనులను ధార్మికులనుగాను, ఆధునికుల నార్ధికులను గాను జేసినది. పరలోక సుఖము వారి పరమార్థము, ఇహలోక సుఖము వీరి పరాయణము గాఁ బరిణమించినవనుట వేఱుగా చెప్పఁబనిలేదు.

వేమన యిట్టి ధార్మికులగుంపులోఁ బుట్టినవాఁడు. అతని కాలమునకు చాలనాళ్ళక్రిందనే మనలో మోక్షధర్మములు వేణువేఱుగా స్థిరములై యేర్పడినవి. వాని సత్యమును సందేహించుటయే పాపమని తలఁపఁబడెను. మరియు, ప్రత్యేక వ్యక్తులకు సంబంధింపవలసిన, అనఁగా, ఎవనియంతకువాఁడు పరీక్షించి నిర్ణయించు కొనవలసిన, మోక్షధర్మములు సంఘమునకుఁజేరి ఆ సంఘము వారందఱును వాని యధికారమునకు లో పడవలసి వచ్చుటచేత, తమ స్వతంత్రబుద్ధి నుపయోగించు దైర్యమే ప్రజలకు నశించియుండెను. ఏ జాతిలోఁ బుట్టినవాని కాజాతిలో పెద్దలు నిర్ణయించిన ధర్మమే నత్యమైన మోక్షపథమని నమ్మట, ఇతరమతములు నీచ ములు అసత్యములని తిరస్కరించుట, పై రెంటిని సాధించుటకుఁ గావలసిన తర్కశాస్త్రకౌశల్యము సంపాదించుట-ఇవి చిన్ననాఁటినుండి మనుష్యులకు నేర్పఁ బడుచుండెను. ఇందుచే భుక్తి గోరి సంభవించు రాజకీయకలహములకన్న ముక్తిని నిర్ణయించు మతకలహములే ప్రబలములై సంఘము నావరించి, దేశము నన్యా క్రాంతముచేసి, పరలోక మోక్షమెట్లున్నను, ఇహలోకబంధము ముడిని మరింత బిగువు చేసెను.

ఆ కాలమందు మనదేశమున వ్యాప్తిలోనుండిన ప్రధానసిద్ధాంతములు రెండుద్వైతము, అద్వైతము. బహుదేవతావాదులైన జైనులు ఆంధ్రదేశమును చాలనాళ్ళ క్రిందనే వదలిపోయిరి. వారాంధ్రదేశమందు మతవ్యాప్తి కెక్కువ ప్రయత్నించిరా యను విషయమే సందిగ్ధము. శూన్యవాదులైన బౌద్ధులన్ననో భరతఖండమందే నిలువ నీడలేక వలసపోయిరి. పాపమిఁక ఇట్లు తలకందని విషయములకై తగవు లాడలేక, కన్నులకుఁ గానవచ్చినదే సత్యమనియు, తక్కిన దంతయు మిథ్య యనియుఁ దలంచి, 'అప్పుచేసియైనను, నేయిత్రాగి చావవలయు’ నని నిర్ణయించిన సుకుమారబుద్ధులు చార్వాకులు, అన్నిమతములవారికిని శత్రువులై బ్రదుకుదెరువు గానక యంతర్ధానమైరి.. సృష్టిచేసినవాఁడు, సకలకల్యాణ ఈ చరాచర ప్రపంచ మును వినోదమునకై గుణములచే నింపినవాఁడు,దుర్గుణ శూన్యుఁడు; దీనిని రక్షించు వాఁడు; తుదకు తన కిష్టమువచ్చినప్పడు ధ్వంశముచేయువాఁడు నగు చేతన మూర్తి యొకఁడు గలఁడనియు, అతని నారాధించి భక్తిచే ప్రనన్నుని జేసికొంటిమేని తనలీలా సృష్టి యందలి బంధములను దప్పించి, మనలను తనవంటి నిర్ద్వంద్వులనుగాఁజేసి, తనవద్ద స్థిరముగా నుంచుకొనుననియు, అదే మోక్షమనియు, సగుణబ్రహ్మవాదులగు ద్వైతులుతలఁచిరి. వీరికి విరుద్ధముగా బ్రహ్మమొక్కటే సత్యమనియు, తక్కిన నామరూప విశిష్టమగు ఈ చరాచర ప్రపంచమంతయు మిథ్యయనియు, బ్రహ్మకే యొక్కొక్కమా ఱు మాయ యావరింపఁగా, ఇట్లు వేఱువేఱు గుణరూపములు గలిగినట్లు గానవచ్చునే కాని, యది నిర్గుణమనియు, కావున ప్రతివస్తువును మాయా వృతమైన బ్రహ్మమే యనియు, ఇట్లు 'నేను బ్రహ్మను అనుజ్ఞానమును సంపాదించి అవినతముగా అట్లే ధ్యానము చేయుచుండిన న్యాయభేదానుభవము గలుగుననియు, అదే మోక్షమనియు, నిర్గుణైక బ్రహ్మవాదులగు అద్వైతులు తలఁచిరి. కాని యీ యద్వైత జ్ఞానమును అనుభవపూర్వకముగా సాధించి ద్వైత బంధమునుండి విముక్తిని జెందుటకు సామాన్యులకు సాధ్యముగాదనియు, దానికిఁ గావలసిన ఓర్పు దార్ఢ్యము సంపాదించుటకు మొదలు సగుణమగు వస్తువు నుపాసింపవలయు ననియు, అట్లేదైనా నొక మూర్తిని సర్వసర్గుణపరిపూర్ణముగా ధ్యానించుచుండిన నది నిర్గుణోపాననకు దారి చూపుననియు, నిది లేనిదది యసాధ్య మనియు అద్వైతులు తలఁపవలసి వచ్చెను -

        "క. ఉడుగని సగుణివోపాస్తికిఁ
             గడఁగక నిర్గుణమె యూదిఁగైకొనినన్
             జెప్పెడిదేమి యడుగుపోయిన
             కడవనుబోసిన జలంబు కైవడియె కదా"
                                                 (శివయోగ సారము, ఆ 1)

కావున అద్వైత వాదులందఱును చిన్ననాఁటినుండి సగుణబ్రహ్మూపాసనయే చేయవలసివచ్చెను. ఫలమేమనఁగా, వారిలో తొంబది పాళ్ళ సగుణబ్రహ్మవాదుల పూజలు, ఉత్సవములు, వేషములు, వినియోగములు మొదలగు నన్ని పద్ధతులను అవలంబించి, సిద్ధాంతమున కద్వైతులైనను వ్యవహారమునకు ద్వైతులేయై యంతటితోనే తృప్తిఁ బొందిరి. సగుణోపాసకులకును వీరికిని భేదము లేకపోయెను. అప్పటికి హిందువులలో ప్రధాన దేవతలై పరస్పరము భిన్నులైన శివుఁడును, విష్ణు వును ఒకటే బ్రహ్మయొక్క పరిణామరూపములేయని చెప్పి 'శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే", యుని యొకవిధముగా నమాధాసము చేసికొని రేకాని, సర్వమును బ్రహ్మయే యను మహెదారమతమునకుఁ జేరినవారయ్యు 'శివాయ బుద్ధ రూపాయ' యని కాని, 'జీవరూపాయ' యని కాని చెప్పఁగలిగినంత విశాలసంస్కారము వారికిఁ గలుగకపోయినది. హరినిగాని హరునిగాని ప్రత్యేకముగఁ గొలుచు ననుకూలముతప్పి, యిద్దరికి మొక్కులు చెల్లించుట, ఇద్దఱికిని దేవళములు గట్టుట మొదలగు పనులలో ద్విగుణశ్రమవ్యయములకు పాల్పడవలసి వచ్చెను. కొందఱు బుద్ధిమంతు లీకష్టమును దప్పించుటకు ఈ రెండుమూర్తులను ఒకటే దేవళమున నొకటే మూర్తిలోఁ జేర్చి హరిహరస్వామి యనుపేరఁ గొలువఁజూచిరి కాని, వేషము, వన్నె, గుణము, శక్తి మొదలగు నన్నిటియందును పరస్పరము భిన్నులైన ఈ రెండు మూర్తుల నేకీకరించుట మనుష్యశక్తికి మీఱిన పనిగావున నా ప్రయత్నము సఫలము గాలేదు.

నిర్గుణ బ్రహ్మవాదులగు నద్వైతుల యవస్థయే యిట్లైన, నిఁక సగుణ బ్రహ్మ వాదుల పరిణామము నడుగవలెనా ? గుణమనుపదార్ధము నెపుడు అంట(గట్టితిమో అప్పడే ఆ గుణము, మన యనుభవము, యభిరుచి, వీని కొలఁది మాఱును. మనుష్యుల కందఱకు ఒకటేవిధమగు ఆనుభవమును అభిరుచియుఁ గల్గువరకును వారి యుపాస్యమూర్తి కేకరూపము సంభవింపదు. కావుననే మాధుర్యము, సౌందర్యము ప్రధానముగాఁ గల మహావిష్ణుమూర్తిని కొందఱు ధ్యానించి పూజింపఁగా, మఱికొందఱు, ధైర్యము, శార్యము, నిరర్గళవిక్రమమునుగల పరమశివుని నుపాసించిరి. ఇంతటితో నిలుచునా ? మనుష్యుల యోగ్యత, సంస్కారము, సమయము, సందర్భము-దీనినిబట్టిగూడ వేఱువేఱు గుణముల యందభిమానము గల్లుట నహజముగావున, పైహరిహరవ్యక్తులందు జారత్వము, చోరత్వము, పక్షపాతము, కపటము మొదలగు గుణములు జేరఁగల్గినవి! ఇట్లు సృష్టిలోని రహస్యములను దెలిపి బంధమోక్షమునకు మార్గముగా నేర్పడవలసిన యీ హరిహరమూర్తులలో పరన్పర భేదమట్లుండఁగా ఒక్కొక మూర్తియును ఆనేక భేదములు గలదైనది. ఉపాసనసాధనములుగా నుండవలసిన విగ్రహములు దేవతలుగానే తలఁపcబడెను. సంఘదేవతలు జాతిదేవతలుగను, దారిదేవతలుగను, ఇంటి దేవతలుగను అవతార భేదములు దాల్పపలసిపచ్చెను. ఉపాస్యదేవతలలో నిన్ని భేదములున్నప్పడు ఉపాస కులలో భేదములుండుటలో విచిత్రమేమి ? ఉపాస్యదేవతలమాట యట్లుండఁగా, మనుష్యులలోనే కాలము, దేశము, సంస్కారము, వాడుక, స్వభావము మొదలగు వానిచే నసంఖ్య భేదము లేనప్పుడును గదా? అవన్నియు ఉపాస్యదేవతయందును సంక్ర మించును. చూడుఁడు-మాధ్వులకును రామానుజీయులకును దేవత యొకటేకదా? ఇరువురును ఊర్ధ్వపుండ్రము (నిలువనామమును) ధరించువారే కాన వారిదేవత కును ఊర్ధ్వపుండ్రమే వేషమైనది. కాని యది గోపీచందనముతోనా తిరుమణితోనా యనుటలో భేదముగలిగినది. మాధ్వులదేవత గోపీచందనదేవత ; శ్రీవైష్ణవులది తిరుమణి దేవత. వీరిలో తిరుమణిపుండ్రము రెండు తెరంగులు-తెన్గల, పడగల యని. శ్రీరంగములో తెన్గల రంగనాధుఁడు; కుంభకోణములో వడగల శార్థపాణి. ఈ యిరువుర నామముల కలహము నింకను ఏకోస్టువారును తీర్పఁగలుగలేదు. భేద మునకు తరువాత మొట్టు ద్వేషము. ఒకరిపై నింకొకరి కసహ్యము. పరస్పర కలహ ములు. ఇట్లు మోక్షమునకై యన్ని ముప్పతిప్పలఁ బడి తుదకీ మొసలినోటికే వచ్చి పడినట్టినది మనుష్యుల యపస్థ !

ఎప్పుడిట్లు సగుణనిర్గుణవాదములు రెండుసు ఏకమై సత్యమును నిర్ణయించు టకు బదులు సంసారమును వృద్ధిచేయుటకే మొదలుపెట్టెనో, అప్పడే తత్త్వజ్ఞానము నకుఁ గావలసిన నిష్పక్షపాతము, విరక్తి మొదలగు నుదారగుణములు నశించి, స్వార్థపరత, స్వాభిమానము మొదలగు సంసారిలక్షణములు మతములలో వేరూరి నవి. బ్రాహ్మణులలో ననేకులు తత్త్వమును వదలిపెట్టి మతమునకు చేయివేసి చాలవఱగును స్వాధీనముచేసికొనిరి. తక్కినవారికి మతబోధచేయుచు నయభయ ములచే వారిని తమ మతమునకు(ద్రిప్పకొనుచు, జనుల కులాచారముల నిర్ణయించి, బహిష్కారములు, పాదతీర్ధములు, ప్రాయశ్చిత్తములు మొదలగు మార్గములచే సంభావనలు సంపాదింప మొదలిడిరి. యమనియమములు నిత్యకర్మములుగాఁ గలిగి, విరక్తి జాతిధర్మముగాఁ గలిగి, *స్వస్తి ప్రజాభ్యః" అనియు 'జనయతు జగతాం శర్మ వైకుంఠనాచ" అనియు నిత్యజపము చేయుచు, ప్రజాసేపకై దారిద్ర్యమే వ్రతముగాఁ బూనవలసిన విప్రులాకాలమం దెట్టులుండిరో, యీక్రింది పద్యమునం దొకానొక బ్రాహ్మణపండితుఁడే యిట్లు వర్ణించినాఁడు:

             జారాంన్ఫోరాస్ కిరాతాన్ జనపదమథనాన్ రాజపాశాస్ మహీశాన్
             శిష్యాన్ కృత్వా2.తిమత్తా! శ్రుతినయవిధురా: శ్రోత్రియైర్బ్రహ్యానిష్టై:,
             సాకంనోభుజ్ఞతేźమీసకృదపివినతిం పర్వతే ఒగ్రే నతేషాం
             సంకేతేనైవ సిద్ధం తదిదమవిదుషాం శ్లామ్యమాచార్య పుంస్త్వమ్"*[1]
                  (విశ్వగుణాదర్శము)

ఇట్లు సంమమునకు సేవచేయుటకు బదులుగా దానిపై నధికారముము సంపా దించుట కొందఱి జన్మోద్దేశమాయెను. దానికై మొదలు బలవంతులగు ప్రభువుల నాశ్రయించి వంచించి లోపఱుచుకొనుట విద్యగా నేర్పడియెను ఆ కాలమందలి చిల్లర ప్రభువులను ఎట్లు వీరు లోపఱచుకొనుచుండిరో యికా క్రిందిపద్యములు విశ దీకరించుచున్నవి :

            "అనన్దబాష్ప రోమాఞ్చౌ యస్యస్వేచ్చావశంవదౌ
             కింతన్య సాధనైరన్యై కింకరాన్సర్వపార్టీవా:"
           "కౌపీనం భసితాలేపో దర్భాః రుద్రాక్షమాలికా
            మౌన మేకాసి కాచేతి మూర్ధనంజీవనాని షట్!"*[2]
                                                     (నీలకంఠదీక్షితుని కలివిడంబనము)

ఇట్లు దంభమే జీవనముగావర్తించినను అంత నష్టముండదు. మఱేమనఁగా సంతతాభ్యానముచేత ఈ దంభమే స్వభావముగా మాఱుట, ఇది యన్యాయమను జ్ఞానమే లేకపోవుట యనుననర్ధములు సంభవించినవి. బ్రాహ్మణులు నిజముగా మేము భూలోకదేవతలమనియే తల(చిరి, జంగాలు తాము సాక్షాత్తు జంగమపరమ శివులనియే నమ్మిరి. కావిబట్టలు గట్టిన మాత్రమున అందఱును తన్ను పూజింప వలయుననియు, లేకున్నవారు పతితులగుదుననియు, ఇంచుమించు ప్రతినన్న్యా సియు విశ్వసించెను. గొప్పవారియందలి గొప్పతనమును జూచియో, లేక కలదను భాంతిచేతనో, అల్పులు వారిని పూజించి గౌరవించుట తప్పుగాదనుటయేకాదుధర్మమగూడ. కాని, ఆ గొప్పవారే ఆ పూజకు తామర్హులనియు, అదిచేయనివారు నిజముగా చెడుదురనియు నమ్ముటకు మొదలిడినప్పడే ప్రపంచము పాడగుటకు ప్రారంభము.

ఈ విధముగా తత్త్వములు మతములుగా మాఱి యహంకారాభిమానములు ప్రబలించినవెంటనే,యదివఱకే యొకవిధముగానున్న జాతిభేదస్పులింగములు ప్రజ్వ రిల్లి, ఉపజాతులు ఉపోపజాతులును అసంఖ్యముగా సృష్టిచేసెను. బ్రాహ్మణలు మొదలు చండాలురవఱకును అంచును తమకన్న నొక తక్కువజాతికలదనుకొని నంతోషించిరి. చండాలురను బ్రాహ్మణులెంతదూరమున నుంతురో యంతదూరమున చండాలురచే నుంచఁబడిన "డొక్కలవారు' అను అడవిజాతివారిని నాచిన్నతనమందు చూచినాను ! జన్మభేదములకు తోడు మతభేదములునుజేరి, ఈ జాతులలో నొకరితో నింకొకరు భోజనము, వియ్యము మొదలగు సాంఘికధర్మము లట్లుండ, స్పర్శమును గూడ నహింపనట్లు చేసెను. వీరందరిపైనను అవకాశము దొరికినప్పడెల్ల అధికారము చెలాయించి, బ్రాహ్మణులు, మర్యాద ధనము మొదలగువానిలో “దేవాంశము'ను*[3] నంపాదించుకొనఁ జొచ్చిరి. వీరిలో విద్య వివాదమునకుమాత్రము పనికివచ్చునది యాయెను. ఏశాస్త్రమును ఏకళను నేర్చుకొన్నను దానికిఫలము పరముఖభంగమై తర్కశాస్త్ర పాండిత్యమావశ్యకమాయెను. రాజసభలలో నిట్టికోవిదుల కొట్లాటలు నిత్యకార్యములై, అందు గెల్చినవారికి 'దుశ్శాలువలో, సుశాలువలో బహుమానము దొరకుచుండెను. ఇట్టి వాదములనుగూర్చి వేమన్న యేమన్నాఁడు ?

          "ఆ. సాటిచేయవచ్చుఁ జదివివాదములాడు »
                చదువరులను జెట్టి సముదయమును
                పోరిపోరి గెల్చు నోరు నోవనివాఁడు..." (3873).

తుదకు పండితుఁడైనవాఁడు దేవళమునకుఁ బోయినప్పడు తనకుతగిన మర్యా దలు జరుగకుండిన, పూజారులను విడిచి,

             "ఐశ్వర్యమదమత్తేసి మాంనజానాసి దుర్మత
               పరైః పరిభవే ప్రాస్తే మదధినా తవస్థితి:"†[4]
                                (ఈ పద్యము పలువురు పండితులు చెప్పినట్లు వాడుక)

అని బ్రహ్మనే బెదరించు స్థితికి బ్రాహ్మణులు వచ్చిరి!

అనగా మనుష్యులందఱు నిట్లేయుండిరనికాదు. అది యసంభవము. నిజమైన విరక్తులు, తత్త్వదృష్టిగలవారు, శమదమాది సంపన్నులును అందందుండిరి; కాని వారికి సంఘమందు వ్యాప్తి చాలకుండెను-

         "ఆ. భూమిలోన పుణ్యపురుషులు లేకున్న
               జగములేలనిల్చు పొగులుఁ గాక,
               అంత తలుచుదొరక రాడనాడనుగాని...? (2868)

అని వేమన్నయే యున్నాడు. ఇట్లు సంపుమందెల్ల నించుమించుగా నొక ప్రక్కన జ్ఞానమును, వేఱొకప్రక్క నన్యాయమును పరస్పరసహాయముతో వృద్ధి బొందుచుండె ననుటలో సందేహములేదు. వేమన కాలమందలి సంఘస్థితి యిది. ఇతఁడు శైవమతము నాశ్రయించిన కుటుంబములోని వాఁడని మొదలేచెప్పితిని. అందుమ బసవేశ్వరునిచే, వ్యాప్తికి తేఁ బడి సదియు, బ్రాహ్మణులకన్న నితర జాతులలోనే చాల వ్యాప్తిఁగాంచి నదియునగు లింగధారి వీరశైవమతమునకుఁ జేరియుండును. ఈ మతము జాతిభేద తిరస్కారముతోనే మొదలైసను, దీని నాశ్రయించినవారే వేఱుజాతియై, అందులోను, అవాంతర భేదములు గలిగి యిప్పటికి నట్లేయున్నది. ఇక చుట్టుప్రక్కల ప్రబలి యున్నది వైష్ణవమతము. సహజముగా నితరులు చెప్పిన మాటలు విచారింపక నమ్మని వేమన వంటి విమర్శకునకు, పైరెండు మతములలో నేదిగాని తత్త్వపిపాస. నార్పఁగలిగి యుండలేదు

        "ఆ. పునుఁగు పిల్లికేల పట్టించె వానన?
              కనకము తనకేమి కల్లఁజేసె ?
              బ్రరహ్మచేఁతలెల్ల పాడైనచేఁతలు..." (2581)

నృష్టియందుcగల సుఖదుఃఖములు, పుట్టుచావులు, పుణ్యపాపములు మొద లగు వానినిగూర్చి కలుగు నిట్టి శాశ్వత ప్రశ్నలకు సరియైన, తృప్తికరమైన ప్రత్యుత్త రము పై మతములలో దొరకుట కష్టము. పామరులు చెప్పలేరు ; పండితులు చెప్పి నను విచిత్రములగు పారిభాషిక శబ్దములతో సంకేత సిద్ధమైన యుద్ధములతో నిండి యుండును గావున నవి యర్థమే కావు. ఐనను అంగీకరించుట కష్టము. వేదములు ఎవ్వరును వ్రాయకయే తమంతట పట్టిన ప్రమాణములని కాని, పరస్పర విరుద్ధము లగు పురాణము లన్నియు భగవంతునియపరావతారమగు వ్యాసుఁడే వ్రాసెనని కాని, సంకేతముతో పెరిగినవారికి తప్ప, తక్కినవారి మనసులకు పట్టుట కష్టము. తెలివి లేని చిన్న బిడ్డల వలెనో లేక, తప్పద్రాగిన దొరల వలెనో, భగవంతుఁడు నిర్ద్వంద్వుఁడై వినోదమునకు ప్రపంచమును పుట్టించి రక్షించి చంపుచున్నాఁడను నిత్యాది సగుణ బ్రహ్మవాదుల లీలావాదము గాని, కేవల చిద్రూపమగు బ్రహ్మకు ఆకస్మికముగా మంకు మూసికొనుటచే నది తన్ను తానే మఱిచి, "నేను మనుష్యుఁ డను రాయిని, చెట్టును, గుట్టను అనుకొనుచున్నది' యను నిర్గుణ బ్రహ్మవాదుల మాయావాదముగాని, మనఃపూర్వకముగా నంగీకరించుట యెట్లు ? ఎక్కువ చదువు కొన్నవాఁడు గాకపోవుటచే ఒకవేళ వాదమాడలేక యోడిపోవచ్చను గాని హృదయ మను పదార్థ మొకటున్నదే, దాని నేమి చేయవలయును? మఱియు, వేమన్న మనసు చాల మృదువై, దయ, ప్రేమము మొదలగు భావములకు లో (గెడిదైనను, తీవ్రమైన వివేచననాశక్తి దానిని స్వాధీనపఱుఁచుకొని గట్టిచేయుచుండును గాన, అది కేవలము భక్తిచేతనే తృప్తిపొంది భజింపఁబడు వస్తువునందలి గుణదోషములను విమర్శింపలేనంత నమ్మకము గలిగియుండఁజాలినది గాదు. మూలతత్త్వము సగుణమైసను నిర్గుణమైనను అది యొక్కటే కదా ! అట్టిచోట నీ శివకేశవాది భేదములేల ? మఱియు, వీరిని గూర్చిన పురాణములలో వీరు మనకంటె శకులని తెలియునుగాని, మనపంటి పొరబాట్లనే వీరును చేసినట్లున్నదే

 
       "ఆ. అగ్ని బాణముచేత అంబు థింకి నపుడె
             రాముఁడవలికేఁగ లావుమఱచె
             వరుస కొండలమోసి వారి ధేటికిఁగట్టి?" (ఓ. లై., 13-4-10).

        "ఆ. కనకమృగము భువిని కద్దులేదనకుండ
             తఱుణి విడచి పోయె దాశరథియు
             తెలివిలేనివాఁడు దేవుఁడెట్లాయెరా" (898)

ఇట్లే "ధ్యానములను శివుని ధ్యానమే శ్రేష్టంబు' అని మొదలుగా సంప్రదాయ సంస్కారమునుబట్టి యొకటి రెండుమాఱులు చెప్పినను, శివుని యందు(గూడ నర్వశక్తుఁడను నమ్మిక సడలియుండుటచే, నిత(డాతని నడతనుగూడ ప్రశ్నింపక విడువలేదు, కాని సర్వములో భేద ముస్నది*

       "ఆ. కంటిమంటచేత కాముని దహియించి
             కామమునసు కడకు గొరి(గూడె
             ఎట్టివారినైనఁ బట్టు ప్రారబ్దము."
                                         (వేదాంత సిద్ధాంతము, ప. 391)

విష్ణువుకన్న శివుఁడు గొప్పవాఁడని వాదించు శైవులతో నొకమాఱు విష్ణు పక్షము వహించి యితఁడిట్లు వాదించెను.

        "ఆ. కొడుకును బ్రదికించుకొనలేదు శంభుండు
              కొడుకును బ్రదికించుకొనఁడె శౌరి
              దేవతాంతరములు దీననే కనిపించె (వే.జ్ఞా., 694)

ఇట్లు తత్త్వజ్ఞాన పిపాస, వివేచననాశక్తియు మాత్రమే కాక, తీవ్రమైన న్యాయ దృష్టియుఁ గలవాఁడగుటచే, శివభక్తులు, విష్ణుభక్తులు అనఁబడు వారి దాంభిక వృత్తి , స్వార్థపరత, పాపభీతిలేమి, అర్ధములేని - కాని - కర్మలు మొదలగునవి యితనికి చాల నసహ్యమును కోపమును గలిగించినవి. శివభక్తులు.

        "ఆ. రాతి బసవని గని రంగుగా
              మొక్కుచు గునుక బసవని గని గుద్దుచుందు
              బసవభక్తులెల్ల పాపులు తలపోయ." (33o2)

            "లింగధారి కన్న దొంగలు లేరురా" (282)

అని తిట్టెను. తన దైవమగు శివుని భక్తులకే యీ మర్యాద యైనప్పు డిఁక వైష్ణవుల గతి చెప్పవలయునా ?
 
      "ఆ. వైష్ణవులనియెడు వార్త మాత్రమెకాని
            ప్రజలఁ జెఱుతురయ్య భ్రష్టులుగను" (3864)

ఇట్టి డాంభికుల, అజ్ఞానుల యాజమాన్యమున నడుపఁబడుచున్న పూజలు, ఉత్సవములు, పూర్వోత్తర కర్మములు, యజ్ఞములు, యాత్రలు మొదలగు నవియు, వాని శాస్త్రములును—ఏవిగాని, వేమనకు సహ్యములు గాలేదన్న నాశ్చర్య మేమి ? వీనిని గూర్చి వేమన వ్రాసిన పద్యము లుదాహరింప(బోయిస వేలకు మీఱును. మచ్చుకు ఒకటి రెండుదాహరింతును :

        "ఆ. రాతి బొమ్మకేల రంగైన వలువలు
              గుళ్ళు గోపురములు కుంభములును,
              కూడుగుడ్డ దాను గోరునా దేవఁడు....?" (3303)

        "ఆ. విప్రులెల్లఁ జేరి వెఱ్ఱికూఁతలు గూసి
             సతిపతులను గూర్చి సమ్మతమున
             మునుముహూర్తముంచ ముండెట్లు మోసెరా...? (3537)

        "ఆ. లంజకొఱకు మేక నంజుడు తినసాఁగి
              యజ్ఞ మెల్లఁ గామ యజ్ఞమాయె!
              మొదట సోమయాజి తుద కామయాజిరా..." (ఓ. లై., 11-5-22)

ఇట్లవన్నియు నిరర్ధకములని నిర్ణయించుకొన్న పిమ్మట, నిట్టి వాని కాచార్యులై స్వధర్మచ్యుతులైన బ్రాహ్మణులను నోటి కసిదీఱ దిట్టినాఁడు. వారి కులగోత్రముల గుట్టంతయు బైట బెట్టినాఁడు. వారు పేరుకు బ్రాహ్మణులే కాని పరబ్రహ్మము తెలుపా నలుపా యోఱుపా? తెలిసినవారు వారిలో లేరన్నాఁడు. తుదకు సంఘ మందలి యిన్ని యవస్థలకును వీరే జవాబుదారులనుకుని

       "ఆ. భ్రహ్మవంశభువులు ప్రబలులై యుండఁగ
             నితరజాతులకు గతులు కలవే ......" (2799)

అని వాపోయినాఁడు! గతులనఁగా సర్కారు జీతములని కాదు, ఆది యిప్పటి యనేక బ్రాహ్మణద్వేషుల మొఱుపువంటి, బిచ్చమెత్తియైనను విద్య నేర్చు సంప్ర దాయము, కొంతవఱకు వంశపరంపరా సిద్ధమగు మేధాశక్తియుఁ గలవారు గావున, విద్యాశాలల వేలము పాటలలో నెక్కువ నవాలుచేయగలిగి, నియమించిన కార్యము న్యాయముగాఁ గాకున్నను తెలివితో నిర్వహింపఁగలవారు గనుక, సర్కారువారి చనవు సంపాదించిన బ్రాహ్మణులను జూచి కడుపు చిచ్చుగల నేఁటి బ్రాహ్మణేతరులలో చదువుకొన్నవారు కొందఱు "బ్రాహ్మణులతో ప్రపంచము పాడైపోయినచో!" యని యఱచు చున్నారే కాని, ధర్మము న్యాయము మొదలగు నేవిషయము లందును వారికన్న వీరేమియు యోగ్యతగలవారు కాకపోవుటచే, వీరి ద్వేషము, ఎవరనుకొనని పనికిరాని ప్రాఁతమనుస్మృతి కాపీలను కచ్చితో కాల్చుటకు తప్ప నింకెందుకును పనికిరాకపోయినది. తత్త్వదృష్టి, ధర్మబుద్ధి, న్యాయాభిమానముఁ గాక అసూయ మూలమగుటచేత, ఈ బ్రాహ్మణద్వేషముచేత బ్రాహ్మణులు తమ తప్పలను దిద్దు కొనుట యట్లుండగా, ఏగుణములచే వారిట్లు నైయాయిక ప్రపంచమున సథఃపాతముఁ జెందుచున్నారో, ఆ గుణములనే యబ్రాహ్మణులును వృద్ధిచేసుకొని వాడ పాతాళ లోక యాత్రలో పోటాపోటీ చేయుచున్నారు! కాని వేమన్నకు బ్రాహ్మణ ఖండన మం దంతకన్న నెంతో యుదారమైన యాశయము గలదు.

       "ఆ. బ్రాహ్మణులకు సకల భాగ్యంబు లీవచ్చు
             గౌరవింపవచ్చుఁ గోరివారు
             జ్ఞాన మొసఁగి జనులఁ గడతేర్పఁ గలిగిన." (2810)

అట్లు లేకున్నప్పుడు. -

      "ఆ. బ్రాహ్మణులకు(బెట్ట ఫలము కద్దందురు
            కుక్కలకును బెట్ట కొదవయేమి...?" (2809)

ఇట్లు చెడఁదిట్టినను తిట్టుటకు మూలము అసూయగాక, వారిలోపములను దిద్ద వలెనను నిష్కళంక శ్రద్దయే యగుటచే, వేమన్నను అట్టి విప్రులుగూడ గౌరవించిరి.
 
      "ఆ. ఇలను శూద్రుఁడౌట యెఱుఁగరా వేమని
            మనసు నతనితోడ మరులు కొనియె
            కొలిచిని ద్విజులెల్ల కోటాన(గోటులై.." (ఓ. లై., 12-1-30)

ఈ పద్యము వేమన్న చెప్పినను, చెప్పకున్నను, కోటానగోట్లు ద్విజులు ఇతనిని గొలుచుట యసత్యమేయైనను, కొంచఱైనను ఆతనిని గౌరవించి యుండుట సత్యము. ఇట్లు తమ దోషముల నెఱిగినవారు, న్యాయ ధర్మములను గౌరవించు శ్రద్ధా వంతులు బ్రాహ్మణులలోఁ గొందరైనను సర్వకాల సర్వావస్థలయందును ఉండుట చేతనే, యెన్ని మతములు మాఱినను, ఎన్ని రాజ్యములు తలక్రిందైనను, ఎందఱు ఎదుర్కొని పోరినను, బ్రాహ్మణజాతి మూలమట్టుగ నశింపక యివరకును నిలిచి గౌరవింపఁబడుచున్నది. నేఁటికిని అబ్రాహ్మణుఁడగు గాంధిని మహాత్ముఁడని నిష్కల్మషముగా నమ్మి, యతని ఖండనఖడ్గములకు చెవియొుడ్డి, యతని యుపదేశ ములను త్రికరణ శుద్ధిగా నాచరించువారిలో, బ్రాహ్మణు లున్నంతమంది బ్రాహ్మణేతరు లున్నారనుట నాకు సందేహము. అది యట్లుండె,

ఇట్లు బ్రాహ్మణులు తత్త్వజ్ఞానమునకుఁగాని, ధర్మస్థాపనకుఁగాని పనికి రారైరి. కేవలము జాతిలో మేమధికులమని మర్యాదలు లాగుకొనుచుండిరి. వట్టి 'గుడ్డెద్దు జొన్న” వంటిదే కాని వారియాధిక్యమెందును గానరాదయ్యెను. అందఱివలెనే రోగ ములు చావును వారికిని వచ్చుచున్నవి. తాపత్రయములలో నేది గాని వారిని మన్నించి వదలలేదు.

       "ఆ. బాపఁడనఁగ నేమి ? భక్తుఁడనఁగ నేమి?
             జోఁగియనఁగనేమి ? సొపులేక
             ఎన్ని పేరులైన నినజుఁడు పనిదీర్చు...” (2720)

మనుజులకు అన్ని చింతలకంటె ఈ 'ఇనజుని' చింతయే బలవంతమైనది. పేదతనము వచ్చిన బిచ్చమెత్తియో దొంగిలించియో బ్రదుకవచ్చును. రోగము వచ్చిన మందులు దినవచ్చును; ముదిమివచ్చిన మీసములకు వన్నెయైన వేసుకొని సుఖముగా నుండ వచ్చును—కాని చావువచ్చిన ? తరువాత నేమి యను జ్ఞానమావంతరమైనను లేక యుండుటచే, ఆకస్మికముగా, ఆశ్యముగా, ఇక్కడి సుఖదుఃఖములన్నియు బొత్తిగా విడిచి, యొకటేమాఱు, ఆ యంధకారకూపములోఁ దూరవలెనన్న నెవరికి భయ ముండదు ? జాతి దీనికిఁ దప్పలేదు. ఇఁక మతమో

       "ఆ. విష్ణుభక్తులెల్ల వెలిబూదిపాలైరి,
             వాదమేల మత విభేదమేల ?
             తెలియ లింగధరులు తిరుమణిపాలైరి..." (3575)

ఇరువురికిని చావు తప్పనిది. వారు చచ్చినఁ గాల్తురు. వీరు చచ్చినఁ బూడ్తురు రింతే. కావున నిట్టి చావస్వరూపము తెలియవలదా ? 'చావు దెలియలేని చదువేటి చదువరా ?” (3788) యని వేమన తలఁచెను.

ఈ పలుచిక్కుల సంసారపుముడిని విడఁదీయుటకు మార్గమేమి యని వెదకుట విధిలేని పనియయ్యెను. భక్తిగలిగి కొలిచిన శివుఁడో, కేశవుఁడో, యొక భగవంతుఁడు తన్నుద్ధరించునేమో చూతమని 'భక్తిగలుగ ముక్తిఁబడయుట నులభంబు' 'భక్తి కలుగుచోట పరమేశ్వరుండుండు (2814, 19) అని నమ్మి తన చిక్కులను దీర్ప భగవంతుని పలుమాఱు ప్రార్థించెను. కాని యితని యాత్రమున కా పరమేశ్వరుఁడు పలుకలేదు. ఇట్లు వా విడిచి యేడ్చెను.

       "ఆ. పలుకుమన్న నేల పలుకక యున్నావు?
             పలుకు నన్నుఁజూచి ప్రబలముగను ;
             పలుకవయ్య నీదు పలుకు నే నెగెద" (2467)

ఈ వేసరిన సమయమందే వేమన్నకు రసవాదవిద్యాభినివేశముచేత యోగుల సంబంధము కుదిరినన దనవచ్చును.

వెనుక అద్వైతమతము నాశయించినవారిలో ననేకులు దాని యనుభవమును సాధింపలేక వ్యవహారమందు ద్వైతులుగనే మాఱిరని చెప్పితిని. కాని, దీనినిగూర్చి యూరక చర్చించి ఫలములేదని తమంతట తాము ఏ కొండలలోనో, ఆడవలలోనో యుండి ఆ యుద్వైత తత్త్వమును సాధింపవలయునని పట్టుపట్టి పనిచేయుచున్న కొందఱు మొదటినుండియుఁ గలరు. వారే యోగులు.

అద్వైతమందనేక భేదములు గలవు. కాని మనదేశమందు ముఖ్యమైనవి మూఁడు : శ్రీవైష్ణవము, వీరశైవము, శాంకరము.

మొదటిదగు రామానుజసిద్ధాంతము, చిదచిదాత్మకమైన యీ ప్రపంచమును భగవంతుఁడు తననుండియే సృజించెను గావున అది మంటితోఁ జేయబడిన కడవ మంటికంటె నెట్లు వేఱుకాదో, యట్లే భగవంతునికంటె భిన్నముగాదని చెప్పచు, నా కారణమున '(విశిష్ట) అద్వైత మనఁబడినను, ముక్తియందును జీవుఁడును, భగవంతుఁడును వేఱువేఱుగానే యుందురనుటచే దీనిని ద్వైతమనియే చెప్ప వలసియున్నది. రెండవదియగు వీరశైవము, పై విశిష్టాద్వైతమునకంటె ముఖ్య తత్త్వములందెక్కువ భేదము లేకున్నను, మోక్షావస్థయందు శివునితో సాయుజ్య మును జెప్పుచు, జీవబ్రహ్మలకైక్యము దానికన్న నెక్కువగా నంగీకరించినది*[5]. మూఁడవదియగు శాంకరాద్వైతము, మోక్షస్థితిలో మాయాజనితమైన భేదజ్ఞానము పూర్తిగా నశించి నిత్య శుద్ధబుద్దమైన బ్రహ్మస్వరూపము మాత్రము నిలుచునని చెప్పుచు సర్వాద్వైత మనఁ బడుచున్నది.

ఈ ముగ్గురిలో వైష్ణవులు, మోక్షమనఁగా భగవల్లోకములో అతనివంటి దివ్య మంగళవిగ్రహము గలిగి ద్వంద్వాతితులై యతని కైంకర్యసౌఖ్యము ననుభ వించుటయేయని తల(చిరి గావున, ఆ యధికారమును భగవంతుఁడనుగ్రహించు టకు దృఢమైన భక్తి వారికి చాలును. కాని యాయవిచ్చిన్న భక్తిని సంపాదించు టకును యమ నియమాది సాధనములు కాపలయును గాన వారు ప్రపత్తియను వేరొక సులభమార్గమును వెదకికొనిరి. అనఁగా భగవంతునియెడ తమ సమస్త భారమును అర్పించి నీవే దిక్కని నమ్మియుండుట. ఆదియును తామే చేయుటకు చేతఁగానివారు యోగ్యుఁడగు గురువు నాశ్రయించి, యతఁడు భగవంతునియెడఁ దనకుఁగల చనవుచే సిఫారసుచేయఁగా ఆ భగవంతునికి దయగలిగి తప్పలను క్షమించి తమ్ముద్ధరించి ముక్తి నిచ్చునని నమ్మిరి. ఇదే ఆచార్యనిష్ట ప్రపత్తి యనఁ బడును. ఎట్లును వారికిఁ గావలసినది సామాన్యముగ అహంకార మమకారాదులను వర్ణించి భగవంతునియెడ దైన్యము స్థిరముగా నుండుటకు ఎంత దేహేంద్రియ మనోదండనలు ముఖ్యమో అంతేకాని, యంతకు మీఱి హఠయోగాదులు సాధింప వలసిన పనిలేదు గావునను యోగులు పరమఫలముగాఁ జెప్పనట్టి యుద్వైతాను భవమునందు వారికి నమ్మిక లేదు గావునను వా రా మార్గమును వదలిరి. కావననే శ్రీవైష్ణవులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథ మొకటియుఁ గానరాదు. నాథమునులు *యోగరహస్య"మను గ్రంథమును వ్రాసిరఁట కాని యది యింకను బ్రెలుపడలేదు. ఎట్లును ఇప్పడు పాతంజలయోగసూత్రములు, యోగ తత్త్వపనిషత్తు, హఠప్రదీపక మొదలగు గ్రంథములు చెప్పనట్టిదియు, ఇప్పడును సామాన్యముగ యోగు లనఁబడువా రాశ్రయించినదియును ఆగు యోగవిద్యకును శ్రీవైష్ణవాద్వైతులకును సంబంధము గానరాదు.

ఇ(క శంకరుల యద్వైతము యోగసాహాయ్యము లేనిది బ్రతుకుటయే కష్టము. ఎందుకన(గా, వారి సిద్ధాంతము సమస్తమును మిథ్యయనియు, శుద్ధ నిర్గుణ బ్రహ్మయే సత్యమనియు, ఈ మిథ్యాజ్ఞానము నశించి శుద్దబ్రహ్మముగా నిల్చుటయే మోక్షమనియు చెప్పుచున్నది. అనగా మోక్షావస్థయందు తెలిసికొనుకర్త తెలియఁ బడు కర్మము అను భేదమేలేక కేవలము తెలివిగామాత్రము నిలిచియుండుట. ఎన్ని ప్రమాణములు చెప్పినను ఎంత వాదించినను అనుభవప్రమాణము లేనిది యీ సిద్ధాంతము నమ్ముట కష్టము. అట్టి జ్ఞాతృఙ్యేశూన్యమైన జ్ఞానావస్థ సాధ్య మనియు, అసంప్రజ్ఞాత సమాధిస్థితి యదియే యనియుఁ జెప్పి యోగశాస్త్రము దానిని సాధించు మార్గములను తెలుపుచున్నది. కావున శాంకరాద్వైతులు యోగము వదలేదు.

అద్వైతానుభవము విషయమున వీ రిరువురికి నడుమనున్నవారు వీరశైవులు. శివతత్త్వము సహజమగు 'శక్తి'బలముచే 'లింగ"మనియు, ‘అంగ"మనియు రెండుగాఁ బరిణమించును. లింగము పూజ్యదేవత ; రుద్రరూపము. అంగము జీవాత్మ. 'శక్తి'గూడ 'కళ"యని, 'భక్తియని రెండు తెఱఁగులిగును! కళ శివునియందుండి సృష్టికిని, సంసారమునకును కారణమగును. భక్తి జీవునియందుండి ముక్తి హేతువగును. ఇట్టి యవిచ్ఛిన్న భక్తిచే జీవునికి శివునితోడి 'సామరస్యము', అనఁగా, ఆనందమయమైన ఐక్యము, కలుగును. అదే ముక్తి, కాని యీ యైక్యము శాంకరాద్వైతుల యైక్యమువలె జీవునికి సంపూర్ణముగా ఆత్మనాశము గలిగించి పరబ్రహ్మతో నేకీభవింపఁజేయదు, జీవునికి తా నానందమనుభవించుచున్నానను జ్ఞానము గలదు[6]. వైష్ణవాద్వైతులవలె వేఱుగా నుండక, పాలలో నీరు చేరినట్లు గాఁబోలు, శివునితో సాయుజ్యమునందును దీని కఖండభ క్తిసాధనము ఆవశ్యకము గావున, అందుకు వారికి యోగసాహాయ్యము తప్పనిది. ఇట్టి యుద్వైతము నభ్య సించువారు శివయోగు లనఁబడిరి. తక్కిస యోగులు వట్టి యోగులు.

శంకరాద్వైతము బ్రాహ్మణజాతియందే వ్యాప్తిఁగాంచినది. బ్రాహ్మణులలో ననేకులు ఇప్పటికిని శాంకరులే. కాని వారియందు యోగవిద్య వ్యాప్తిఁగాంచలేదు. అద్వైతము సిద్ధాంతమందే కాని, వారి వ్యవహారమందు లేదని చెప్పితిని. ఇదిగాక అనూచానముగా జాతిసిద్ధమై వచ్చిన వైదిక కర్మానుష్టానమును వదలుట వారికి సాధ్యముకాలేదు; బ్రహ్మజ్ఞానము సంపూర్ణముగఁ గలిగి విరక్తుఁడైనవానికి తప్ప తక్కినవారికి కర్మత్యాగమును సంఘ మనుమతింపలేదు. కర్మత్యాగము, సంసార విరక్తియుఁ గలవారికి తప్ప యోగాభ్యాసము సాధ్యముగాదు. సన్న్యాసాశ్రమమును స్వీకరించినవారికిని సంఘముపై నధికారము, మతముల యాజమాన్యము మొదలగునవే కాక, త్రికాలపూజ, అభిషేకములు, నమారాధనలు, మెరవణులు మొదలగు సన్న్యాసధర్మములు ఇంటికర్మములకన్న నధికములైనవి. కావుననే ఆద్వైత బ్రాహ్మణులలో యోగు లపరూపమైనారు. ఎట్లును కర్మభూమియగు దక్షిణ చేశములో వా రరుదు.

ఇఁక వీరశైవము బ్రాహ్మణప్రాబల్యము నణఁచుటకై పుట్టిన మతము. ఈ మతము నాశ్రయించుట కందఱును అర్హులు. బ్రాహ్మణులలో నున్నన్ని నిత్య కర్మముల గలాటా వారిలో లేదు. మనలోవలె వారిలోను మఠములలో నధికారము వహించిన కర్మఠసన్న్యాసులున్నారుగాని, సామాన్యజాతులగుంపే వారిలో బలమగుటచేతను, అద్వైతులలోవలె నిర్గుణోపాసన చేయకున్నను నగుణోపాసనచేతనే కాల క్రమమున బ్రహ్మానుభవము సిద్ధింపగలఁదను అనుకూలము లేదు గనుక భక్తి యఖండముగా లేక మోక్షము సిద్ధింపదు గావునను వారిలో తప్పక యోగవిద్య ననేకు లాశ్రయింపవలసివచ్చినది. యోగమును పూర్తిగా సాధింపఁగల్గినవా రనేకులు లేకపోవచ్చును గాని, సాధింపఁ బ్రయత్నించినవారు తక్కిస మతములకన్న నా మతములో నెక్కువ గలరని తలఁచుచున్నాను.

ఇట్టి శివయోగులలో కొందఱూళృయందు, మఠములలోనో, గృహస్థులుగానో వసించియుండినను, అనేకులు ఆలుబిడ్డలులేని బ్రహ్మచారులై అడవులలోనో, కొండల యందో వసింతురు, న్వర్ణవాదవిద్య వీరిలో చాలమంది యెఱుఁగుదురను ప్రతీతి గలదు. విరక్తులై యోగాభ్యాసులైనవారి కీ కృత్రిమస్వర్ణమం దాశ యేల కల్గినదని మన కాశ్చర్యము గలుగును. ప్రాయశః హఠయోగసాధనకు దేహశక్తియు నారోగ్య మును ప్రధానములు గావున, దానికిఁ గావలసిన పుష్టాహారములు ఎక్కువ కష్టము లేక సంపాదించుటకును, ఆయుర్వేదముప్రకారము న్వర్ణమును భస్మాదిరూపముల చేత నిత్యమును సేవించుట చాలమంచిది గావున దానికిని, సహజమైన బంగారు దొరకుట కష్టమై, కృత్రిమముగా తయారుచేయవలసిన యక్కర వారి కేర్పడి యుండును. కాని కృత్రిమమైన బంగారునకు సహజమైనదాని గుణములుండునా యను ప్రశ్న కలుగును. చూచినవారు ఉపయోగించినవారు ఎవరైన దీని కుత్తర మీయవలయునే కాని నే నెఱుఁగను.

వేమన బీదరికమును బోఁగొట్టుకొనుటకై బంగారు తయారుచేయు విద్య నేర్వఁగోరి వీరి నాశ్రయించియుండునని యూహించితిమి, వారా విద్యను సామాన్యముగ నెవరికినిఁ జెప్పరు.

               “దాతవ్యం గురుభక్తాయ నదద్యాద్దుష్టమానసే"
               "వనితాపత్రమిత్రాదిగోప్యం సిద్దిప్రదాయకమ్”[7]

అని వారు భావించిరి. అనేక నందర్భములలో నిట్లు విషయములను గుప్తములుగా నుంచుట, తమ కొకవిధమైన విలువను, గౌరవమును సంపాదించుకొనుటకే కాని, వేఱుకాదు. ఈవిషయము ప్రాచీనులే యంగీకరించిరి. చూడుఁడు-హఠయోగులకు, దేహము లోపలిభాగమును శోధించు భౌతి, నౌళి మొదలగు కర్మము లాఱుగలవు.

               'కర్మషట్కనిందం గోప్యం మఠశోధన కారకమ్'
                                                                   (హఠప్రదీపిక, ద్వితీయోపదేశము, 23 ప.)

అని పై కసరత్తులుగూడ రహన్యముగ నుంచవలెనని శాసనము గలదు. పై శ్లోకమునకు వ్యాఖ్యచేయుచు బ్రహ్మానందయోగి—

              “గోపనాభావే షట్కర్మకమన్యైరపి విహితంస్యాదితి యోగినః పూజ్యత్వాభావః
               ప్రనజ్యే తేదిభావ:" (గుప్తముగా నుంచనియెడల నీకర్మము లందఱును జేయఁగల్లుదురు గావున, యోగికి పూజ్యత లేకపోవునని భావము).

అని వ్రాయుచున్నాడు. ఎట్లను స్వర్ణవాదమువంటి విలువగల విద్యలను రహస్యముగా నుంచుట మనుష్యస్వభావము. ఇట్టిదానిని సంపాదించుటకై వేమన్న చాల గురుసేవ చేసియుండును. వారును 'గోప్యం గోప్యం మహాగోప్యం' అని యెన్నో బాసలు చేయించుకొని యితనికేదో కొంత తెలిపియుందురు. ఇంత కష్టపడి తాను సాధించిన విద్యను స్పష్టముగా బహిరంగపఱుప నిష్టములేక కాఁబోలు, ఇతఁడును, ఈ విద్యనుగూర్చిన పద్యములన్నియు ఇతర వాదగ్రంథములందలి పద్యములవలెనే, స్పష్టముగాక చేసినాఁడు.

ఇట్లు బంగారమును సాధించు నాశకుతోడు తీవ్రమైన తత్త్వజిజ్ఞాన గలవాఁ డగుటచే, వేమన పైవారిని సేవచేయునప్పడు వారి నడతలను చక్కఁగా గమనించి యుండును. సంసారులకును, వారికిని గల భేదములు చూచి యాశర్యపడి యుండును. వారికి అడవి, యూరు, పగలు, రాతి యను భేదములేదు ; ఆహారమునకై యీ వస్తువులు కావలెనని, కాని యీ కాలమునఁ గావలెనని కాని నియమము గానరాదు ; ఉపవాసములకు వెఱువరు ; రోగాద్యుపద్రవములు వారిని జేరవు; దృఢకాయులుగా నుందురు; చలి, గాలి, యెండ, వాన, దేనికిఁగాని వెఱవరు; సమాధిలోఁగూర్చున్న గంటలకొలఁది బహిః ప్రపంచజ్ఞానమే లేకయుందురు; తామేదో మహానంద మనుభవించువారైనట్లు కానవచ్చి లౌకికములైన సుఖము నన్నింటిని అసహ్యముతోఁ జూతురు ; నిత్య బ్రహ్మచారులుగా నుందురు; సర్వ సందేహములను గలిగించు నిత్య కర్మములు, విగ్రహపూజలు మొదలగువానిలో పాల్గొనక, తాము బ్రహ్మస్వరూపము నెఱింగినట్లు మాటలాడుదురు ; జాతిభేదాదుల గమనింపరు ; సృష్టిస్థితిలయములను గుఱించి మనకెల్లఁగలుగు సందేహములన్నియు తీర్చుకొన్నవారివలె నుందురు ; ఏదైనను ప్రశ్నించిన మనకర్థము గాకున్నను తమకు సందేహము లేక ప్రత్యుత్తర మిత్తురు ; సామాన్యులకు లేని కొన్ని విచిత్రములగు శక్తులు సిద్ధులు గలవారని ప్రసిద్ధితో నుందురు! ఇట్టివారిని జూచినప్పడు తనకుఁ గల తత్త్వసందేహములను దీర్చుట వీరికి తప్ప తక్కినవారికి సాధ్యముగాదని నమ్మి, ఏమైనను జేసి, యెంత కష్టమైనను పడి, వారివంటి బ్రహ్మజ్ఞానమును తానును నంపాదించి యోగి గావలయునని, ఇదివఱకే యాలుబిడ్డలపై రోఁతగలిగిన వేమన్న నిర్ణయించెను.

           "ఆ. ఇహమున సుఖియింప హేమతారక విద్య
                 పరమున సుఖియింప బ్రహ్మ విద్య
                 కడమ విద్యలెల్ల కల్ల మూఢులల విద్య..." (436)

అని నిర్ణయించుకొని, యుట్టి యోగులలో ముఖ్యుఁడుగా నుండినవాఁడు గాఁబోలును, లంబికానివయోగి నాశ్రయించెను. ఇతని శ్రద్దకు సంతసించి యతఁడును నరహన్య మగు యోగవిద్య నుపదేశించెను. దానిని గూర్చి ముందు మనవి చేయుదును.

  1. * ఈ ఆచార్యపురుషులు-జారులు, దొంగలు, డోయలు, దోపిడికాండ్రు, పాళయగాండ్రు, దొరలు-వీరిని శిష్యులనుగాఁ జేసికొని, మిగుల మదించి, వేదవిద్య యెఱుఁగకయున్నను, శ్రోత్రియులగు బ్రహ్మనిష్టులతోడ పంక్తిని భుజింపరు : వారియెదుర నొకమారును మొక్కరు. ఈ యజ్ఞానుల యాచార్యపురుషత్వము సంకేతమిచే మాత మేర్పడినదిగాని వేణుకాదు. అవి తాత్పర్యము.
  2. *ఎవని కానంద బాష్పములు, రోమాంచము స్వాధీనముగా నుండునో, యట్టివానికి తక్కిన సాధనములేల ? దొరలెల్ల సేవకులే. కౌపీనము, భస్మధారణము, చేతులలో దర్భ, రుద్రాక్షమాళికలు, మౌనము, ఒంటరిగా నుండుట-ఈ యాఱును మూర్థులను బ్రదికించునవి. అవి తాత్పర్యము
    • దేవస్థానములందు నైవేద్యమును భక్తులకు వినియోగము చేయుటకుముందు పూజారులకిచ్చు పెద్దముద్దకు 'దేవాంశ' మనిపేరు. -
  3. † ఓ దుర్మతీ ! నీ వైశ్వర్యముచే పొగరెక్కి మదించినావు, నన్ను లక్ష్యము చేయప. ఇతరులు నీ కవమానము కలిగించునప్పడు సీ మర్యాద నా చేతిలో నున్నది. అని తాత్పర్యము.
  4. * Vide Bhandarkar’s Vaishnavism and Saivism, p. 135.
  5. Vide Bhandarkar’s Saivism, p. 134 to 137.
  6. *గురుభక్తన కీ విద్య చెప్పవలయును. దుష్టమనస్సు గలవావికి చెప్పరాదు. భార్య, పుత్రులు, మిత్రులు మొదలగువారికివి దీనిని దెలువక గుప్తముగా నుంచిన సిద్ధించును (దత్తాత్రేయతంత్రము,పే.116)