వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/6-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

6-ప్రకరణము

క్రిశ్చియన్కాలేజి సంస్కృత ప్రధానపండితోద్యోగము

ఈ పైవాదములు శాస్త్రులవారికీర్తికి ప్రథమ సోపానము. ఎల్లవారును ధర్మసందేహములయందు వారి సలహాను పొందసాగిరి. ఇదియే వారికి క్రైస్తవకళాశాలలోని సంస్కృత ప్రథానపండితపదవికి కారణము నైనది. వారే ఇట్లుచెప్పి యున్నారు. *[1]"ఇందుంగడపట పేర్కొన్న పదమందుండగా (ముత్యాలపేట ఆంగ్లోవర్నాక్యులర్ స్కూలు హెడ్మేస్టరుగా) 1883 సం. స్త్రీ పునర్వివాహ దుర్వాదనిర్వాపణమును ధర్మ శాస్త్ర విషయకనిబంధన గ్రంథమును రచించి ప్రకటించితిని. బహుగ్రంథ పరామర్శపూర్వకముగా నిద్రాహారాదుల నొప్పరికించి దానిని రచించినఫలము ఇరుదెఱంగులయినది. నాకు దారిద్ర్యానారోగ్యాది క్లేశములును, తద్గ్రంథముచే నిరస్తవాదులైన మతద్రోహులకు బిరుదాంకములును లబ్ధమైనవి. ఆనిర్వాపణ గ్రంథమునకు ఇప్పటికిని ఎవరివలనను ఉత్తరము పుట్టలేదు. అయినను 'తపస్సు ఫలింపకపోయినను తనువు తేలికపడిన' దనురీతిగా ఆవాదగ్రంథము వలనను తత్కాలమందు మహాజన సంఘముమ్రోల నా కావించిన ఖండనోపన్యాసముల వలనను, నన్ను మదరాసులోని ప్రముఖులెల్ల రెఱుంగుటయు, డాక్టరు అపర్టు, మిల్లరు, లోనగు హౌణులకు నేను పరిచిత గీర్వాణ భాషుడనుగా గోచరీభూతుడ నగుటయు సంభవించినది. శ్రీ సమర్థి రంగయసెట్టిగారు నన్ను మదరాసు క్రిస్టియన్కాలేజి సంస్కృత ప్రథానపండితుం గావింపం దలంపుగొనిరి. నేనును ఆ పదమునే కోరుచుంటిని.

"ఆసమయమందే డాక్టరు ఆపర్టుదొరగారికి నేను ఇంచుకంత ఉపకరించితిని. ఎట్లన-వారు అప్పటికి ఐదుఏండ్లకుముందు 'నరపతివిజయము'ను ముద్రింపం దొరంకొని ప్రాయికముగా పండిత పరిష్కృతము సేయించియు, అందొక చూర్ణిక బిరుదాం కాది భూయిష్ఠము ఆదిలో కవిపెట్టిన రూపుం గోల్పోయి లేఖ కాది కారణంబున శబ్దస్వరూప వాక్యావాంతర వాక్యాది విభజన లేర్పడక క్రంపబలిసియుండ దానిని సంస్కరింపుడని మదరాసులోని సుప్రసిద్ధాంధ్రపండితులు మువ్వురుకడ నైదేండ్లు ఉంచియు భగ్నమనోరథులైరి. వారిని నేను కార్యవశంబున దర్శింపగా వారు ఆచూర్ణికను తదీయ దురూహతా వృత్తాంతముంజెప్పక నాచేతికిచ్చి సవరింపుమనిరి. నేనును వారము దినములు ఉన్మత్తునివలె తదేకతానుడనై దానిని సవరించి సాధువుగావ్రాసి ఆంగ్లానువాద సమేతముంగావించి కొనిపోయి వారికిచ్చితిని. వారు నాయిచ్చినదానిం గైకొని పండితసమేతముగా రెండు వారములు పరిశోధించుకొని అంగీకరించి అనంతరము నాకు దాని యా యైదేండ్లవృత్తాంతమును వక్కాణించిరి.

"ఆ యిరువురచేతనుం బ్రతిబోధితులై డాక్టరు మిల్లరుగారు పూర్వోక్తమైన మదరాసు క్రిస్టియన్కాలేజి సంస్కృతోపాథ్యాయపదమును 1886 సం. నవంబరులో నాకొసంగిరి." మిల్లరుదొరగారు శాస్త్రులవారికి దర్శనమిచ్చి మాటలాడుచు వారితో నిట్లనిరి. "ఈ యుద్యోగమును కోరిన అర్జీదారులలో మిమ్ము నేను అభిమానించితిని"

శాస్త్రులవారు ఈ యుద్యోగమునకు అర్జీపెట్టుకొనలేదు. కారణాంతరములచేత ముత్త్యాలపేట స్కూలులో ఒక శుక్రవారమునాడు వారు తమయుద్యోగమునకు రాజీనామా నొసంగిరి. స్వాతంత్ర్యమునకు భంగమైన యుద్యోగము వారికి సరిపడలేదు. ఆ మఱునాడే క్రిస్టియనుకాలేజి రంగయసెట్టిగారు వీరిని ఆహ్వానించి పండితపదవిని గ్రహింపుడని కోరిరి. అంతకుపూర్వము రాజమండ్రికి తండ్రిగారికడకు పోవుటకు సంకల్పించి శాస్త్రులవారు ప్రయాణసన్నద్ధులై యుండిరి. దీనిచే నిలిచిరి. మిల్లరుదొరగా రట్లు చెప్పగానే శాస్త్రులవారికి వెంటనే 'ఇదేదో మర్యాదకు భంగకరమైన వ్యవహారముగానున్నదే' అని తోచి ఇట్లనిరి. 'నేను అర్జీ పెట్టుకొనలేదు. మీరే ఆహ్వానించినందుచేత వచ్చితిని.' అని ఆంగ్లమున చెప్పిరి.

మిల్లరు: క్షమింపుడు. ఈమాట చెప్పినందులకు చింతిల్లుచున్నాను. మేమే మిమ్మాహ్వానించితిమి. మఱి తాము జనవరినెల నుండి ఈయుద్యోగము చేయవలెను.

శాస్త్రులవారు: అటులైన నాకీయుద్యోగ మక్కరలేదు. ప్రస్తుతము నేను స్కూలునౌకరికి రాజీనామానిచ్చితిని. పని లేక యున్నాను.' మిల్లరు: కానీయండి. శాస్త్రులవారూ, తాము రేపటి నుండియే కాలేజిలో ప్రవేశింపుడు.

ఈవిధముగా శాస్త్రులవారు తమగౌరవమునకు ఎంతమాత్రము లోపమురానీయక దర్పముతోనే కళాశాలా సంస్కృత ప్రథానపండితులైరి.

సంస్కృతోపాథ్యాయులైనవెనుకనే శాస్త్రులవారు బి.ఏ. చదువుటకు ప్రయత్నించిరి.

  • [2]"1887 సం. బి.ఏ. పరీక్షకు నియతములైన సంస్కృతాంగ్లేయ భాషలలో మదీయశిష్యులతో గూడ నేనును పరీక్షితుడనైతిని. రెంటను జయమొందితిని. సంస్కృతమందలి జేతలలో మొదటివాడనై విజయనగర మహారాజ వైసాఖపుర గోడెగజపతిరాయ దాతవ్యములైన రు 400 పరిమితిగల బహుమానమునకుం బాత్రమనైతిని. కాని ఆసంవత్సరము డిగ్రీని పూర్తిచేసికోనందున ఆ బహుమానముం బడయనైతిని. ఉక్త కారణంబున ఈబహుమానము నాకు తప్పిపోయినదని నాతో ఆపర్టుగారు సెలవిచ్చిరి."


___________
  1. * ఆంధ్ర సారస్వతసభలోని యుపన్యాసము 1919 క్రీ.శ.
  2. * ఆం. సా. సభోపన్యాసము.