వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/5-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

5-ప్రకరణము

వితంతువివాహ వాదములు

ఇంతవరకును శాస్త్రులవారికి వేంకటరమణశాస్త్రులవారి కొమారులని ప్రసిద్ధియేగాని వేఱువిధమున ప్రసిద్ధియేర్పడి యుండలేదు. 1880 సం. ప్రాంతమునుండియు శాస్త్రులవారికి ప్రసిద్ధి రాసాగినది. జీవితమున కొంత కుదురుపా టేర్పడసాగెను; పాండిత్యసంపాదనములకు అవకాశములు కలుగ నారంభించినవి; శాస్త్రులవారి జీవితచరిత్రములో నొక క్రొత్త ప్రకరణము ప్రారంభమైనది. ఆంధ్రదేశమందు వితంతూద్వాహప్రోత్సాహక వాదములు బయలుదేరినవి. ఈశ్వరచంద్రవిద్యాసాగరపండితుడు మున్నగువారు ఉత్తరహిందూస్థానమున చేయు ప్రచారమునకు అనుగుణముగ తెలుగుదేశమున శ్రీ వీరేశలింగము పంతులు మొదలైనవారు ఉపన్యాసము లిచ్చుచు విధవావివాహమునకు శాస్త్రనిషేధము లేదనియు, ఎల్లవారును చేయవచ్చునని చెప్పసాగిరి. సనాతన మతస్థులు కొందఱు శాస్త్రులవారిని గ్రంథములు పరిశోధించి ఉపన్యాసము లిండని కోరిరి. ఆకాలమున మదరాసులో హిందూసభ యొకటియుండెను. దానిప్రాపున శాస్త్రులవారు ఉపన్యాసము లిచ్చుచు ఇతరులవాదములను ఖండించి విధవావివాహమును శాస్త్రముమాత్ర మొప్పదని చెప్ప మొదలిడిరి. నిరంతరము ఈవిషయమై గ్రంథములను శోధించుచుండిరి. నారదస్మృతి యాకాలమున దొరకుట యఱుదు. మూడే తాళపత్రప్రతులు, నాగరిలిపిని, దేశమునకంతటికిని, మదరాసు, కలకత్తా, బొంబాయి హైకోర్టుపుస్తక భాండాగారములలో నుండినవి. మదరాసుప్రతిని జడ్జి శ్రీ సర్.టి.ముత్తుస్వామయ్యరుగారు శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులవారి కిచ్చి చదివి కొన్ని విషయముల కర్థము వ్రాసియిండని కోరియుండిరి. వారికి నాగరిలిపి తెలియనందున వారు దానిని చెదలువాడ సీతారామశాస్త్రిగారి చేతికిచ్చిరి. వారికిని ఆలిపి తెలియనందున ఆగ్రంథము వారిచేత కొంతకాలము వృథాగా పడియుండెను. ఒకదినము ఏలకో శాస్త్రులవారు వారియింట దానిని చూచి చదువబోగా వారి క్రొత్త శిష్యుడు 'మీకది తెలియదు' అని వారింపజూచెను. వేంకటరాయశాస్త్రులవారు మఱింతవడిగా దానిని పుచ్చుకొని చూడగా అది నారదస్మృతి. దానిని తమ కెరవిమ్మని తమ యుపాధ్యాయులవారిని కోరిరి.

సీతా:- 'అది నీకెందుకు, నీకేంతెలుస్తుంది'

వేంకట:- 'నాకు తెలియకపోతే మరెవడికి తెలుస్తుంది? నాకు పనికిరాకపోతే మరెవడికి పనికివస్తుంది? అని తీవ్రముగా బదులుచెప్పిరి.

సీతా:- 'అయితే నీకు నాగరిలిపి తెలుసునా ?

వేంకట:- 'అద్భుతంగా. రేపుతెల్లవారి మీకు మళ్లీతెచ్చి నప్పగిస్తాను లెండి.' 'తొందరలేదు నెమ్మదిగానే తెచ్చిపెట్టు' అని సీతారామశాస్త్రులవారు దాని నిచ్చినారు. వెంటనే శాస్త్రులవారు ఆపెద్ద గ్రంథమును ఇంటికి తెచ్చుకొని రాత్రియంతయు నిదురపోక చదివి అందులోని భాగముల నెన్నిటినో వ్రాసికొని ఉదయము దంతథావనమునకు ముందే దానిని గురువుగారికడకు కొని పోయిరి.

'అర్థంకాలేదాయేమి?' అని వారడిగిరి.

'ఇది చిత్తగించినారా' యని వేంకటరాయశాస్త్రులవారు తమవ్రాతను చూపిరి. వారు ఆశ్చర్యపడి కొన్ని నెలలుగా నది తమకడ నూరకపడియుండిన యాచరిత్రమును చెప్పి, వెంటనే ఆపుస్తకమును ముత్తుస్వామయ్యరుగారికి పంపివేసిరి. అందరకు కావలసినపనియు వేంకటరాయశాస్త్రులవారు చేసివేసినారు. ఈ విధముగా శాస్త్రులవారు విషయసంకలనము చేయుచుండిరి.

ఒకదినము శాస్త్రులవారు ఉపన్యాసము చేయుచుండిరి. సభ క్రిక్కిరిసియుండెను. పండితులు, ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయాధిపతులు, విద్యావంతులు నింక నెందఱో వచ్చియుండిరి. శాస్త్రులవారు ఉపన్యాస మారంభించి ముందుగానే యిట్లు ప్రతిజ్ఞచేసిరి.

'ఎవరికైనా సందేహాలు కలిగినపక్షంలో వెంటనే, అప్పుడే, ఉపన్యాసము మధ్యలోలేచి నన్ను అడిగివేయవలెను. ప్రకరణము దాటిపోగానే మీరు మరిచిపోవచ్చును. లేదా నేను మరిచిపోవచ్చును. ఉపన్యాసంకాగానే సందేహాలు తీరుస్తామని చెప్పి ఉపన్యాసం ముగియగానే, సభలేచినసందులో, తప్పించుకొనే ఉద్దేశం నాకులేదు. ఎక్కడికక్కడనే సందేహాలు తీర్చవలసింది న్యాయం. నాకు చేతనైతే సమాధానాలుచెప్తాను. చేత కాకపోతే పోయి కూర్చుంటాను. చెప్పగలిగినవాడు వచ్చి చెప్తాడు' అని.

ఏలయనగా వారి ప్రతిపక్షులు, ఉపన్యాసములు ముగిసినవెనుక సందేహములకు సమాథానములు చెప్పెద మని, తొలుత చెప్పి ఉపన్యాసము ముగిసినవెంటనే సభలేచు కలకలములో సమాధానములు చెప్పకయే తప్పించుకొని పోవుచుండిరి. అట్టివారికి దెబ్బగా శాస్త్రులవారు ఈవాక్యములను పలికిరి.

'అయ్యయ్యో! శాస్త్రులవారూ, అట్లాగయితే కొంపమునుగుతుందే' అని వీరిపక్షమువారొకరు వెనుకనుండి హెచ్చరించిరి.

'ఎంతమాత్రము కాదు. అదినాశపథము' అని శాస్త్రులవారు బదులు పలికిరి.

'అయ్యా! ఆయనదోవలో ఆయన్ను పోనీయండి. అంతా చెయ్యగలిగినవాడే.' అని యితరులు చెప్పిరి.

శాస్త్రులవారి యుపన్యాసమునకు అంతరాయము కలుగ లేదు, అందఱును ఆశ్చర్యముతో వినుచుండిరి. కొందఱు ప్రతి పక్షులు దీనిని చూడలేక ఎట్లైనను ఒకప్రశ్నవేసి అంతరాయము కలిగించవలయునని తమలో కలియబలికికొని ఒకనిని లేపిరి. ఆయన మధ్వమతస్థుడు. లేచి 'శాస్త్రులవారూ, ఒక ప్రశ్న' అనెను.

'ఏమి?'

'మనం తద్దినాలు ఎందుకుపెట్టవలెను? మనంపెట్టే తద్దినాలు పెద్దలకు అందుతున్నవని ఏమినిశ్చయము? అందకపోతే పెట్టడమెందుకు?

వెంటనే శాస్త్రులవారు ఏమాత్రము తడవుకొనక గంభీరముగా, సభయంతయు చూచుచు 'ఎవరయ్యా మధ్వమతానికి ముద్ర కర్త?' అని యడిగిరి.

'అయ్యా నేనండీ' అని యొకాయన లేచెను.

శాస్త్రులవారు: ఈప్రశ్న అడిగే ఆయన్ను తక్షణం వెలివెయ్యండి. ఈయన అబ్బకు తద్దినం పెడుతున్నాడా కనుక్కోండి. పెట్టేవాడయితే ఈ ప్రశ్న వెయ్యడు. పెట్టకపోతే వెలివెయ్యండి.

ఆమాధ్వుడు: అయ్యా తెలివిలేక ప్రశ్న వేశానండీ.

శాస్త్రులవారు: అయితే కూర్చో.

మరల శాస్త్రులవారు ఉపన్యాస మారంభినారు ఈ మాఱు అంతరాయము కలుగలేదు.

మఱియొకచోట ఉపన్యసించునపుడు ఒకానొకరు సభలో నుండి మాటికిముందు ఏదో యొకప్రశ్న యడుగుచునేయుండిరి. ఒకానొక శ్లోకమునకు అర్థముచెప్పుసందర్భమున తద్విపరీతార్థముగా కూడచెప్పవచ్చునని శాస్త్రులవారిని ఆక్షేపించినారు శాస్త్రులవారు ఆశ్లోకమునకు ఆయర్థము పొసగదనియు నది విపరీతార్థమనియు, 'శుక్లాంబరధరం' అనుశ్లోకమును గాడిదపరముగా నర్థముచెప్పిన నెట్లుండునో అట్లుండుననియు చెప్పెరి.

'ఎల్లాగండీ శాస్త్రులవారు, 'శుక్లాంబరధరం' అనేశ్లోకాన్ని మీరు గాడిదపరంగా ఎల్లాచెప్తారు. అని వారు ఆక్షేపించిరి.

అంతట శాస్త్రులవారు ఇట్లారంభించిరి. "శుక్ల=తెల్లనై నటువంటి, అంబర=వస్త్రములను, ధర=ధరించినదియు; అనగా మోయుచున్నట్టిదియు, చాకలిమూటలను మోయుచున్నట్టిదియు; విష్ణుం=వ్యాపించుచున్నట్టిదియు, ఒకచోటనుండక తిరుగుచునేయుండునట్టిదియు, శశివర్ణం=బూడిదరంగు గలిగినదియు, అనగా తెల్లగానుండునట్టిదియు, చతుర్భుజం=నాలుగు కాళ్లుగలదియు, ప్రసన్నవదనం=దానిముఖము ఎంత ప్రసన్నము! అట్టిదానిని అన్ని విఘ్నములును ఉపశమించుటకొఱకు థ్యానించుచున్నాను." అని.

"అయితే విఘ్నంరాకూడదని గాడిదనెందుకండీ థ్యానించడం" అని యాతడు మరల నాక్షేపించెను.

"ఓగాడిదా, మాయుపన్యాసమునకు అడ్డు రాకుమా, మేము ప్రారంభించినపనికి మాటిమాటికి అడ్డురాకుమా' అని మాప్రార్థన" అని బదులుచెప్పిరి. ఈవాక్యముతో సభయెల్ల గొల్లున నవ్వసాగెను, ఆప్రాశ్నికుడు మఱి నోరెత్తక కూర్చుండెను. వెనుక వితంతువివాహవాదముల నన్నిటిని చేర్చి యొక గ్రంథముగా వ్రాసియుంచుకొనిరి. ప్రకటించుట ధనసాధ్యమైన విషయము. కావున ప్రకటనము ఆలస్యమగుచుండెను. ఇట్లుండగా తిరువలిక్కేణిలో నొక రావుగారు ఈవాదములను మరల రేపి కొంతప్రచారము జరిపించి, కొందఱు పెద్దలచేత చందాలు వేయించి (ఏతత్సందర్భమున తమకును కొంత ఋణనివర్తియగునట్లు చేసికొని) లోకమును బాగుపఱుపనెంచియుండిరి. ఈరావుగారియింట ప్రతి శనివార ఆదివారములు పండితగోష్ఠులును వాదప్రతివాదములును జరుగుచుండెడివి. ఒక పండితుడు అది పనిగా శాస్త్రులవారికడకువచ్చి వారు వ్రాసి యుంచుకొనియుండిన యాగ్రంథములలోని విషయములనుచూచి వ్రాసికొనుచు, శాస్త్రులవారినడిగి సందేహములను తీర్చుకొనుచు, శాస్త్రులవారి కాలమునంతయు హరించుచుండెను. అతడు ఆరావుగారియింట ఉపన్యాసములు సయితము చేయుచుండెను. శాస్త్రులవారు తమ కాలమంతయు నిట్లు పోవుటకు సహింపక ఒకదినము ప్రొద్దుననే బయలుదేరి ఆపుస్తకమునే ఆతని కిచ్చివేసిన బాగుండుననియు ఇక నాదినమునుండి ఆతడు తనకడకురాడనియు తలంచి తిరువలిక్కేణికి బయలుదేరిరి. అతనియింటికిపోగా నాతడు యింటలేడు. ఆతనిబంధు వొకడుండి 'అయ్యా, ఆయన ఫలాని రావుగారియింటికి పోయియున్నారు. తాము అక్కడికిపోకండి. తమకు అక్కడ అవమానంజరుగుతుంది' అనెను. 'నన్ను అవమానపరిచేవాడికి మూడుకళ్లు కావలెను. ఎవడయ్యా అంతటివాడు?' అని ఆరావుగారియింటికి శాస్త్రులవారు పోయిరి. ఆ రావుగారి జవాను గేటుకడ నడ్డెను. అంత వీరు కాగితముమీద తమపేరు వ్రాసిపంపిరి. ఆజవాను ఇటు చీటి పుచ్చుకొనిపోగా తాము అటు మఱియొకద్వారమున లోనికింబోయిరి. లోనికింబోగానే 'ఆహా! హా! శాస్త్రులవారా! రండి' అని కుర్చీ చూపి రావుగారు మర్యాదచేసినారు. ఆజవాను వీరిని చూడలేదు. చీటి చేతనుంచుకొని వ్రేలుడు మొగముతో నొకమూల అఘోరించుచుండెను. అచ్చట విధవావివాహముల వాదమువచ్చినది. పెద్దలొకరు "ఈ వాదాలన్ని కలిపి ఒక పుస్తకంగావ్రాయిస్తే బాగుంటుందండీ, వ్రాయించి ప్రకటించవలెను.' అనిరి. 'ఎవరిచేతవ్రాయిస్తాము?' అని యింకొకరడిగిరి. శాస్త్రులవారు 'అయ్యా అటువంటి దొకగ్రంథము సిద్ధముగా ఉంటే పనికిరాదా? మళ్లీ క్రొత్తగా వ్రాయించడమెందుకు.' అని యడిగిరి.

'ఆహా! పనికిరాకయేమి? బాగాపనికొస్తుందండి. అటువంటి దొకటిఉన్నదా అనే మాసందేహం!' అని ఆమొదట చెప్పినవారు పలికిరి.

'ఇదుగో' అని శాస్త్రులవారు తమజేబులోనుండి ఆవ్రాతపుస్తకమును తీసి చూపించినారు. వారందఱును ఒకరిచేతినుండి మఱియొకరు గ్రహించి కాగితములు త్రిప్పినారు. ఒకాయన ఇంకొకాయన చెవిలో నేదోచెప్పెను. 'పనికిరాదనిచెప్పు' అన్న మాటలుగా పెదవులకదలిక చే శాస్త్రులవారికి తెలిసినది. ఏలయన వారి ద్రవ్యార్జనకు ఈగ్రంథ మనుకూలించినట్లు కనబడలేదు. ఆ పెద్దలలో నొకరు ఈవ్రాతప్రతిని చేతనుంచుకొని 'అయ్యా, అంతాబాగున్నదిగాని, ఇందులో వాళ్లప్రశ్నలకు అన్నిటికీ సమాధానంలేదే.' అని ఆక్షేపించిరి.

వెంటనే శాస్త్రులవారు 'ఆపుస్తకం దయచేయండి' అని పుచ్చుకొనిరి. అందు వారు కాగితములను ఒకవైపుమాత్రమే వ్రాసియుండిరి. రెండవప్రక్క వ్రాతలేదు. 'తాము ఇటు చిత్తగించినప్పుడు లేదా?' అని వ్రాయనివైపుచూపి 'ఇటుచిత్తగించినప్పుడు లేదా?' అని వ్రాసినవైపుచూపినారు. ఆపెద్దలు ఏమి చెప్పుటకును తోచక మొగాలు చూచుకొనిరి.

శాస్త్రులవారు: 'కనుక పూర్తిగా చదివిచెప్పండి. ఒక కాగితం తిరగవెయ్యగానే మీకు విషయమంతా కనబడదు.' అని చెప్పినారు.

ఆపెద్దలు ఇంకొకసాకువెదకుచు 'ఈపుస్తకం చాలా పెద్దదిగా ఉందండి. కొంచెము సంగ్రహించి వ్రాస్తే బాగుంటుంది' అనిరి.

శాస్త్రు: ఆహా, అని ఇంటికిపోయి చిన్ననోటుబుక్కులో సన్న యక్షరములలో వ్రాసి, ఇకనిన్ని విషయములుచేర్చి, మరల ఆ పెద్దలకిచ్చినారు. వారు చూచి 'ఆహా! ఇప్పుడు సరిగా ఉందండి.' అనిపలికినారు. ఇట్లుందురు గుణగ్రహణపారీణులు.

ఈ విధవావివాహవాదముల సందర్భమున శాస్త్రులవారికి చాల ప్రసిద్ధియేర్పడినది. ఆంధ్రదేశమందేకాక ద్రవిడ దేశమందును గొప్ప గీర్వాణపండితు లని ఖ్యాతిగలిగినది. ఈ ఖ్యాతిచే శాస్త్రులవారికి పలువురు పండితులు ఉన్నతపదవుల యందుండువారు మిత్రులయిరి. వారిలో శ్రీయుత, ప్రొఫెసర్ శేషగిరిశాస్త్రులవా రొకరు.

1883 సం. విధవావివాహగ్రంథమును శాస్త్రులవారు ప్రకటించి పెక్కువేలప్రతులను వెల లేకయే పంచిపెట్టిరి. ఈ సంవత్సరమే శాస్త్రులవారు అలంకారసారసంగ్రహ మని యొక చిన్నపుస్తకమును 'చంద్రాలోకాద్యనేక గ్రంథముల సారాంశమును' రచించి ప్రకటించిరి. 1880 లోనో అంతకు కొంతముందో 'జనవినోదిని' యను పత్రికకు సంపాదకులై దాదాపు పదేండ్లు వ్రాయుచుండిరి. ఈకాలమున ప్రతాపు కథను, తమతండ్రిగారి వలన వినినదానిని పెంచి అందే నాలుగుసంచికలలో ప్రకటించిరి. కథాసరిత్సాగరమును అనువదించుట కారంభించి కొన్ని ప్రకరణములు జనవినోదినియందు ప్రకటించిరి.

1886 సం. ముననే శాస్త్రులవారి యేకైకపుత్త్రులును మా తండ్రిగారునునగు వేంకటరమణయ్యగారు జనించిరి. వీరింగూర్చి మున్ముందు వ్రాయుదును.


_________