Jump to content

వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/4-ప్రకరణము

వికీసోర్స్ నుండి

4-ప్రకరణము

ఉద్యోగదశ

ఆదినములలో ఎందఱు పరీక్షలోతేరిన నందఱకును ఉద్యోగము లిచ్చుచుండువారు. ఆపరీక్షలో నుత్తీర్ణులయిన వెనుక దొర శాస్త్రులవారికి ఉద్యోగమును సిఫారసుచేయలేదు శాస్త్రులవారు వెంటనే పై దొరలకు వ్రాసికొనిరి. పైదొరలు విచారింపగా వీరిప్రిన్సిపాలు 'వెంకటరాయడు పెంకె, మనము చెప్పిన పనులు చేయడు, అధికప్రసంగి అతనికి రాజమండ్రిలోనే ఉద్యోగము కావలెను, మనము పంపిన యూళ్లకంతయుపోడు,' అని బదులు వ్రాసెను. శాస్త్రులవారు ఇదంతయు నబద్ధమనియు, ఎచటికి దొరతనమువారు పంపుదురో ఎంత జీతమునకు పంపుదురో అన్నిటికిని ఒప్పుకొని యున్నారమని చాలవినయముగా వ్రాసికొనిరి. అంతవిధిలేక శ్రీకాకుళము హైస్కూలులో కడపటి యుపాథ్యాయునిగా పన్నెండు రూపాయల జీతముపై శాస్త్రులవారిని నియమించిరి. ఇది యొకవిశేషము, ఎఫ్ ఏ,. ప్యాసై అంతకొంచెము పాటి జీతమునకు ఆంధ్రు లెవరును ఉద్యోగము చేయువారు కారు. శ్రీకాకుళములో కొందఱు శాస్త్రులవారిని 'ఏమండీ, శాస్త్రులవారూ, ఎఫ్.ఏ., చదివి ఇంతకొద్దిజీతానికి ఎలాగొప్పుకొని ఒచ్చారండీ? మేము వెళ్లమండి. మీరుదక్షిణాదివాళ్లండి, నెల్లూరు సీమనించి ఇంతదూరం ఈ రవంత జీతానికోసం వచ్చారండీ?' అని యడుగువారట. శ్రీకాకుళములో పెద్దమనుష్యులొకరు ఉచితముగా గది నిచ్చినారు. వారిపిల్లలకు చదువులుచెప్పుచు, ప్రబంధములు పఠించుచు అచ్చట రెండు నెలలుండిరి. ఆకాలములో కథాసరిత్సాగరమును చదివిరట. అంతట, ఏదోతోచి, శ్మశానములో రాత్రులు పిశాచములు బేతాళములు తిరుగుచుండునని అందులోకలదే చూతము ఏమయిన కనబడునేమోయని రాత్రులు తిరుగుచుండు వారట. ఒకదినము ఎవరోచూచి 'ఏమండోయి, శాస్త్రులవారూ, ఎక్కడ తిరుగుతున్నారు. ఈ అపర రాత్రివేళ?' అని యడిగిరి. 'పిశాచాలేమైనా కనబడతాయేమో చూతామని' అని శాస్త్రులవారు బదులుచెప్పిరి. 'మంచిపిశాచాలే, ఈఊరు ఏలాంటిదో ఎరగరు. ఇక్కడ బోగంకొంపలు, ఖూనీలు జరుగుతాయి. ఎవరోఅనుకొని రాత్రిపూట మిమ్మల్ని కడతేరిస్తే, ఏమైపోతారు. పదండి, పదండి ఇంటికి' అని వారు నివారించిరి, దానితో పిశాచాలకుగాను తిరుగుట మానివేసిరట.

అనంతరము చోడవరము తాలుకాస్కూలు ప్రథానోపాథ్యాయులుగా నియమింపబడిరి. ఈ స్కూలులో ప్యూను పేరు పేరిగాడు. వీడు బడికిరాక అనుదినము సెక్రిటరీగారి యింట నౌకరీచేయుచుండువాడు. ఎప్పుడైనను బడికివచ్చెనా స్కూలువరాండాలో బల్లలమీద పరుండి నిద్రపోవువాడు. శాస్త్రులవారు వీనికి బుద్ధిచెప్పదలంచినారు. అన్నిపనులను బడిలో ఉపాథ్యాయులే చేసికొనవలసియుండెను. పూర్వముండిన ప్రథా నోపాథ్యాయుడు సెక్రిటరీకి భయపడుచుండెను. శాస్త్రులవారికి ఎవడును లక్ష్యములేదు. ఒకదినము పేరిగాడు నిద్రపోవుచుండగా బెత్తముతో వాని వీపున, కాళ్ల మీద దెబ్బలు వాయించి వానికి కనబడక మరలవచ్చి తరగతిలో పాఠములు చెప్పసాగిరి. 'ఓయమ్మో, ఓయిబాబో,' అనివాడు అంగలార్చుచు 'నన్నెవరో కొట్టేశారండీ, చంపేశారండీ' అని రొద చేయసాగెను. ఉపాథ్యాయులందఱును వచ్చిరి. అందఱికిని వెనుక శాస్త్రులవారు పోయిరి. ఎవరు వానిని కొట్టినదియు తెలియ లేదు. బాలురు వినోదము చూచుచుండిరి. పేరిగానికి నాడు కాయశుద్ధియైనందులకు అందఱును సంతోషించిరి. శాస్త్రులవారు వానితో 'నువ్వుచేస్తూండేద్రోహానికి నిన్ను వెంకటరమణమూర్తి శిక్షించాడు. పో, ఎవరితోపోయిచెప్పుకొంటావో చెప్పుకోపో,' అని వానిని తఱిమివేసిరి. శాస్త్రులవారిని బదులు కొట్టుటకు వానికి ధైర్యములేదు, బలమునులేదు. వాడు వెంటనేపోయి సెక్రిటరీగారితో చెప్పుకొనెను. సెక్రిటరీ వీరిని తమయింటికివచ్చి అందులకు సమాధానము చెప్పవలసినదని ఆజ్ఞాపించెను. 'మేము ఇందుకోసం సెక్రిటరీగారి యింటికిరాము. ఈ విషయంలో మాయింటికి వారు రావచ్చును. లేదా స్కూలుకు వచ్చిమాట్లాడవచ్చును.' అని శాస్త్రులవారు బదులుపలికిరి. సెక్రిటరీ ఆయూరిలో పలుకుబడిగలవాడేయైనను తుదకు శాస్త్రులవారికి లొంగిపోయెను; పేరిగాడును స్కూలు నౌకరీ సరిగా చూడసాగెను. వెనుక శాస్త్రులవారు విశాఖపట్టణము హిందూ హైస్కూలు ద్వితీయోపాథ్యాయులుగాను రాజమహేంద్రవరము టౌను స్కూలు ప్రథానోపాథ్యాయులుగాను నుండిరి. రాజమండ్రికిపోయిన క్రొత్తలోనే యొకవిశేషము జరిగినది. ఆ బడిలో క్రొత్తగా నొక టీచరు రాఘవయ్యనాయడని వచ్చియుండెను. దేవరకొండ గోపాలశాస్త్రులవారిని తెలుగుపండితులు నుండిరి. ఈ శాస్త్రులవారికి ఒకకన్ను కాయ. వేంకటరాయశాస్త్రులవారు అందులకు కారణమడుగగా, మథ్యాహ్నము బాలురు స్కూలు గదులలోనే ఱాలతో ఒకరినొకరు కొట్టుకొనుటలో నొకఱాయితగిలి గోపాలశాస్త్రులవారి కన్ను పోయినదని ఆపండితులే చెప్పిరి. అంతట శాస్త్రులవారు బాలురను 1 - 2 గంటల సమయములో స్కూలు వరండాలలోనే యుండునట్లు నియమించి యుపాథ్యాయులకు, సర్క్యులరు ఒకటి పంపిరి. బాలురను ప్రవచనము చెప్పెడు గదులలోనికి ఆ సమయమున రానీయవలదనియు, రాలు రువ్వుట లోనగు దారుణ క్రీడలు ఆడనీయవలదనియు, వారిని గదులలోనికి పనియున్న రప్పించుకొని వెంటనే పంపివేయవలసినదనియు, వారితో ఆగంటలో ఉపాథ్యాయులు గోష్ఠి పెట్టుకోరాదనియు అందు వ్రాసిరి. దానిని చూచినందులకు గుఱ్తుగా నందఱను అందు సంతకము చేయవలసినదిగా హెచ్చరించిరి. అట్లే ఉపాథ్యాయులందఱును ఆసర్క్యులరులో సంతకము చేసిరి. కాని వేంకటరాయశాస్త్రులవారు గట్టి అనుశాసకులని ఎఱుంగక కొందఱు విద్యార్థులు ఆవిధముగానే గదులలో ఆడుచునేయుండిరి. వారిని శాస్త్రులవారు బెత్తముతో తాడించి బెదరించిరి. ఆక్రొత్త ఉపాధ్యాయుడు లక్ష్యముచేయక కొందఱు బాలురను పెట్టుకొని ఒకగదిలో గోష్ఠి చేయుచుండెను. తమ చిత్తమువచ్చినట్లు కొందఱు బాలురు ఆడుచుండిరి. వేంకటరాయశాస్త్రులవారు ఇందఱకును తమ శాసనమెట్టిదో తెలుపగోరి బెత్తముగొని, ఆగది ప్రవేశించి, అచటనున్న వారి మొగములను చూడక కాళ్లమీద అందఱకును చిత్తమువచ్చినన్ని దెబ్బలు వాయించిరి. ఆ యుపాథ్యాయునికిని చక్కగనే దెబ్బలు తగిలినవి. ఆతడు పై యుద్యోగస్థులకు అర్జీ పెట్టుకొనెను. విచారణజరిగినది. శాస్త్రులవారు తమ సర్క్యులరును చూపి, గోపాలశాస్త్రులవారి కంటిని చూపి, వివరించిరి. ఆనాయని అర్జీనిత్రోసి వైచుటయేగాక శాస్త్రులవారిని అధికారులు కరము శ్లాఘించిరి. అదిమొదలు శాస్త్రులవారన్న విద్యార్థులకేగాక ఉపాథ్యాయులకును భయమేర్పడెను. ఆపాఠశాల బాగుపడెను.

ఈ కాలముననే శాస్త్రులవారికి వివాహమైనది మొదట దాదాపు పదునాఱు పదునేడు సంవత్సరముల ప్రాయమున ఉడాలి వారి యాడుపడుచు శ్రీ జానకమ్మగారిని పరిణయమైరి గాని ఆయమ కాపురమునకు వచ్చుటకుమునుపే చనిపోయెను. వెనుక దాదాపు ఇరువదియైదవయేట పుదూరు ద్రావిడులలో సుప్రసిద్ధులైన శ్రీ అల్లాడి సదాశివశాస్త్రులవారి కొమార్తె శేషమ్మగారిని వివాహమైరి శాస్త్రులవారి వివాహము నెల్లూరు జిల్లాలో నాయుడుపేటకు తూర్పున పుదూరునకు సమీపమున నుండు చిల్లమూరుగ్రామమున శ్రీ సదాశివయ్యగారి స్వగృహమున జరిగినది.

వెనుక కొంతకాలమునకు శాస్త్రులవారు బి.ఏ. చదువ వలయునని, తమ యుద్యోగమందు తమ సోదరులు వేంకటసుబ్బయ్యగారిని ఉంచి, మదరాసునకు వచ్చిరి. బి.ఏ. చదువుటకు శాస్త్రులవారికి తీరికలేకపోయినది. ఇతరవిద్యావ్యాసంగములు ఎక్కుడయినవి. ఐదాఱు పర్యాయములు పరీక్షకు పైకము కట్టియు చదువు చాలదని పరీక్షకు పోలేదు. తదేక దీక్షతో సంస్కృతాంధ్రగ్రంథములను చదువుచుండిరి. ఇట్లుండగా ముత్యాలపేటలోని ఆంగ్లోవర్నాక్యులర్ మిడిల్ స్కూలునకు ప్రథానోపాథ్యాయులైరి. నలువదిరూప్యములు జీతము. అందు కుటుంబ వ్యయమున కయినది పోను మిగిలినదానినంతయు కలకత్తా బొంబాయి మొదలైన ప్రదేశముల నుండి సంస్కృత గ్రంథములను తెప్పించుచు చదువుచుండిరి. ఆదినములలో నచ్చైన గ్రంథములలోను ప్రచారమందున్న తాళపత్ర గ్రంథములలోను చదువక విడిచినదియు చదివి మఱచినదియులేదు. ముఖ్యముగా సాంఖ్య, యోగ, వేదాంత, వ్యక్తావ్యక్తగణిత గ్రంథములు విశేషముగా చదివిరి. బాల్యములో 'నాకు సులువుగరానిది గణితము' అని వారేచెప్పియున్నను గొప్పగణితశాస్త్రజ్ఞులని వారి నాటివిద్యార్థులు చెప్పుదురు. శాస్త్రులవారికి ఈకాలములో సోదరవియోగము వాటిల్లినది. వెంకటసుబ్బయ్యగారు శాస్త్రులవారితో ఆబాల్యము క్రీడించినవారు, నిరంతరము తోడునీడగా నుండినవారు, ఆకస్మికముగా నాలుగుదినములు జ్వరముచే బాధపడి రాజమండ్రిలో మరణించిరి. వారి గుణాదికములను శాస్త్రులవారు అప్పుడప్పుడు చెప్పి దు:ఖించు వారు. అన్నగారికన్నను ముందే ఎఫ్.ఏ., ఐ అన్నగారు ఇంకను బి.ఏ., కాలేదను కారణమున, తాము, అనాయాసమున బి.ఏ., కాగలిగినవారే అయ్యును 'అన్న బి ఏ., కాకముందే నేను బి.ఏ., అయితే బాగుంటుందా?' అని మానుకొనిరట. వీరికి ఆంగ్లభాషయందు అప్పటికే మంచి ప్రావీణ్య మేర్పడినది. సంగీతమునందును చాల అభిరుచి యుండెడిది. ఒకప్పుడు ఫిడిలునేర్చిన యొకడు వారికడకువచ్చి తనకు ఏదైన సాయముచేయవలసినదని కోరగా వెంటనే వీరు ఆలోచించక అన్నగారిద్రవ్యమునుండి ఆతనికొక రూపాయయిచ్చి, ఆ వెనుక అన్నవచ్చి ఏమిచెప్పునోయని భయపడుచుండిరట. అన్నగారు ఈవిషయమును తెలిసికొని తమ్మునిజూచి 'నీవు చేసినది మంచిపని' అని చెప్పువరకు వారిభయము తీరలేదు. సకలవిషయములయందును అన్న గారిమాట వేదవాక్యము. 'పాండిత్య ప్రతిభలలో సర్వవిధములను నన్ను మించినవాడు నాతమ్ముడు' అని శాస్త్రులవారు పలుమార్లు వచించువారు. ఆసోదరుల సౌభ్రాత్రము అట్టిది. అన్నగారికన్నను పొడుగుపాటి శరీరము, చక్కని మేనిచాయ, వ్యాయామాదులలో నైపుణ్యము, హాస్యాద్యుక్తులలో చాతుర్యము, సద్య:స్ఫురణము, దయార్ద్రహృదయము - ఇవి వీరిగుణములు.

వీరికిని అన్నగారికి వివాహమైన అనతికాలములోనే వివాహమైనది. వీరిభార్యయు వీరిగుణాదికములకై వీరిని వలచి పరిణయమైనది. ఎల్లవారి దురదృష్టముచే వారు ఆకస్మికముగా మరణింపగా ఆయమ నిరంతరము తదేకచింతచే స్రుక్కి శోకదేవతయై కొంతకాలమునకు తనువు త్యజించినది.

శాస్త్రులవారు తమ్ముని మరణసమయమున చెంతలేరు. మదరాసులోనుండిరి. తమ్ముడును తానును ఏవేవో కార్యములను సాధింపవలయునని పుట్టెడు ఆసలతోనుండు సమయమున, పిడుగుదెబ్బవలె, తమ్ముడు గతించెనను వార్త, జాబు మూలమున తెలియవచ్చినది రెండు మూడుదినములు శాస్త్రులవారు అన్నాహారములు మానివేసి ఏకథారగా నేడ్చుచుండిరి; క్రమముగా దు:ఖము ఉపశమించినను వారు తమ్మునిమాత్రము మఱువలేదు.

దినములు గడచిపోయినవి.


_________