వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/3-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

3-ప్రకరణము

విద్యాభ్యాసము

ప్రతిభావంతులకు విద్య బంగారమునకు మెఱుగువంటిది. శాస్త్రులవారి విద్యయంతయు స్వయంకృషియే; తండ్రిగారికడ చదివినది చాలతక్కువ. అందుల కుదాహరణముగా నీయుదంతమును వారుచెప్పగా వింటిని. వేంకటరమణశాస్త్రులవారు, వీరిని వేంకటసుబ్బయ్యగారిని పిలిచి సంస్కృతము చెప్ప దలంచి హితోపదేశమును పాఠముచెప్ప నారంభించిరి. ఆటలపైనను వీథులు తిరిగి వేడుకలు చూచుటయందేగాని ఇంకను చదువులమీదికి శాస్త్రులవారిదృష్టి పోలేదు. తండ్రిగారు

శ్లో. అసాధనా విత్తహీనా బుద్ధిమన్త స్సుహృత్తమా:
   సాధయ న్త్యాశు కార్యాణి కాకకూర్మమృగాఖువత్.

అను శ్లోకమునకు చమత్కారముగా నీక్రింది విధమున నర్థము చెప్పనారంభించిరి.

"అసాధనా=సాధనములు లేనివారున్నూ, మీవలెనే, మీకు సాధనాలులేవు; విత్తహీనా:= డబ్బులేనివారున్నూ, అదిన్నీ మీవలెనే, మీకుడబ్బెక్కడిది, వట్టి దరిద్రులు, బుద్ధిమన్త:= బుద్ధిమంతులున్ను - (ఇది బహుశ: తమవలె నేమోయనితలంచి కొమాళ్లు కొంచెము మనసు తృప్తిచేసికొనిరి) ఇది మీవలె అనుకున్నారా ఎంతమాత్రంకాదు, మీకు తెలివెక్కడిది; సుహృత్తమా:= మంచిస్నేహితులున్నూ, ఇదిన్నీ మీవలెకాదు, మీకు స్నేహం బొత్తిగాలేదు, నిరంతరం కొట్టుకోవడమే మీపని" అని యీతీరున కొమారుల కిరువురకును పాఠముచెప్ప నారంభిం చిరి. 'ఒరేయి, మనకక్కరలేదు ఈచదువు', అనీ కలియబలికికొని శాస్త్రులవారును వారి సోదరులును మఱి తండ్రిగారికి కనబడక తిరిగి ఆ 'చదువు'ను తప్పించుకొనిరట. అప్పుడు శాస్త్రులవారికి దాదాపు పండ్రెండు సంవత్సరము లుండును. ఇదియే వీరు తండ్రిగారికడ కూర్చుండి చదివినదంతయు; తర్వాతి పాండిత్యమంతయు స్వయంకృషియే.

పెద్దవారైన వెనుక తండ్రిగారు వినునట్లు బిగ్గరగా చదువుకొనుచు అర్థము చెప్పుకొనుచుండుటయు, ఎచ్చటనైనను వీరు తప్పిపోయిన తండ్రిగారు 'ఆ', అనుటయు, వెంటనే వీరు దిద్దుకొనుటయు జరుగుచుండెడిది. ఎప్పుడైనను సందేహము లుండిన నడుగువారేగాని అక్షరమక్షరమును తండ్రిగారికడ నేర్చుకొనలేదు.

విశాఖపట్టణము నార్మలు స్కూలులో 6 రు లు,స్టయిపెండు పై (విద్యార్థివేతనము) చదివి అట మెట్రిక్యులేషను (1869 సం) మొదటి తరగతియం దుత్తీర్ణులైరి. శాస్త్రులవారు మెట్రిక్యులేషను పరీక్షకుపోవుటకు పైకము కట్టవలసివచ్చినది. తండ్రిగారు పైకము చెంతలేక ఒకానొక పెద్దమనుష్యుని చేబదులడిగిరి. అతనికి శాస్త్రులవారనిన కిట్టదు. "అయ్యా! ఎందుకండీ, మంచిడబ్బు పాడుచేసుకుంటారు? మీఅబ్బాయికి ప్యాసుకాదు, వృథా." అనెను. అంతట వేంకటరమణశాస్త్రులవారు కొమారునితో "ఒరే, నాయనా, నీకు ప్యాసుకాదంటాడురా ఆయన ఎం దుకుదండుగ, మంచి డబ్బు పాడుచేసుకొంటారు,' అని అడుగుతున్నాడు" అనిచెప్పిరి. "నాకు ప్యాసుకాకపోతే మరెవడికి అవుతుందో చెప్పమనండి చూతాం?" అని వేంకటరాయశాస్త్రిగారు కోపముతో పలికిరి. "మీఅబ్బాయికి ప్యాసయితే నాచెవి కదపా యిస్తాను." అని ఆపంతులు పందెము వేసెను. సరియని పైకము కట్టినారు, శాస్త్రులవారికి చక్కగానే ప్యాసయినది. పైగా మొదటితరగతి. అప్పుడువారు మదరాసులో చదువుటకు వచ్చియుండిరి. తండ్రిగారికి పైకము పంపి అతనికి బదులిచ్చి వేయుమనియు పందెము ప్రకారము ఆతనిచెవి 'కదపా' తీయించి పార్సెలుద్వారా తమకు పంపవలసినదనియు వ్రాసిరి. కాని ఆపంతులు పంపలేదు. 'కదపా' శబ్దమును అప్పుడు తాముగ్రహించినట్లు ఈకథను వారుచెప్పగా వింటిని.

  • "అనంతరము పది పదునొకండు రూప్యముల స్టయిపెండుతో మదరాసు నార్మలుస్కూలులో చదువుచు ట్రైనింగు పొందుట - అచట బహుజనపల్లి సీతారామాచార్యులవారు ప్రథమాంధ్రపండితులు, చదలువాడ సీతారామశాస్త్రులవారు ద్వితీయాంధ్ర పండితులు - ఇరువురుం బ్రామాణికులు, ఆంధ్రమున గొప్పపండితులు. వే - లు పిళ్ళలోనగు యాప్పాణపు గ్రిస్టియనులు సంగీతలోలురు, ఈ సీతారామాచార్యులతో చెలిమి చేసికొని వీరిప్రతి శనివార వేశ్యాదిసంగీతగోష్ఠులకు చందాదారులై వచ్చుచుందురు. "ముత్త్యాలపేటలో తొలుత సంస్కృతాంధ్రద్రవిడ పాఠశాల యుండెను. దానికి మా నాయనగారు వేదము వేంకటరమణశాస్త్రులవారు ప్రథానపండితులుగా నుండిరి. సీతారామచార్యులవారు ఆంధ్రపండితులు, తోటపల్లి సీతారామయ్యగారు ద్వితీయాంధ్రపండితులు. అరవమునకు జ్ఞానసుందర పండా రాదులుండిరి. మానాయనగారు శాస్త్రోక్తాచారనిష్ఠులు, అసత్య దూరులు, అప్రతిగ్రాహకులు, వ్యాకరణమున అపరపతంజలి యని పేరొందినవారు, సీతారామచార్యులను ఆంధ్రవిద్యకు మెచ్చియు, ...లంపటుడని విగర్హించుచుండిరి. అందువలన సీతారామాచార్యులవారు తమ శనివారపు సంగీతగోష్థులకు నన్ను పిలుచుట లేదు. అట్టివానికి నేను పోవుటయులేదు."

శాస్త్రులవారు ఆపాఠశాలలో చేరిన మొదటిదినములలో ఆచార్యులవారి పాండిత్యాతిశయములను చక్కగ ఎఱుంగ నందున వారిని మాటిమాటికి ప్రశ్నలువేసి వేధించుచుండువారు. అటుపిమ్మట తండ్రిగారి కడకు పోయినప్పుడు ఈసంగతి చెప్పగా వారు నవ్వి "నీవు పొరపడితివి, వారు ఆంధ్రములో మహాపండితులు." అని వచించిరట. శాస్త్రులవారు ఆచార్యుల వారిని మరల దర్శించినపుడు తమ యవినయమునకు క్షమాపణ కోరగా వారు "నీవు గడుసువాడవు" అని అభినందించిరట. శాస్త్రులవారు ఆ పాఠశాలను వదలిన చాలకాలమునకు మరల గువర్యులను దర్శించి తమకు యోగ్యతాపత్రము నొకదానిని దయచేయు డని కోరినప్పుడు వారు ఈవిధముగ వ్రాసియిచ్చిరి. "ఇది వేదము వేంకటరాయశాస్త్రులవారి యోగ్యతను తెలియజేయు పత్రిక ....... వీరు కొన్ని యేండ్లకుముందు రమారమి ఒకటియునర సంవత్సరము నార్మలు స్కూలులో నాయొద్ద తెనుగు చదువుచుండిరి. అది మొదలు నేను వీరిని బాగుగ గుర్తెఱుంగుదును. చదువునప్పుడు వీరుచేయు విద్యావిషయకమైన ప్రశ్నలకు సదుత్తరములుచెప్పి వీరిని సమాథాన పఱచి నాపాండిత్యగౌరవమును మాటిమాటికిని నిలువ బెట్టుకొనవలసి వచ్చుచుండెను............................1882.

1875 సం. శాస్త్రులవారు రాజమండ్రిలో ఎఫ్.ఏ. పరీక్ష నిచ్చిరి. వారి ప్రిన్సిపాలు, దొర యొకడు, ఎందుచేతనో వారిపై ఆదినుండియు గంటువహించి యుండెను. పరీక్ష హాలులో శాస్త్రులవారు తెలుగు పేపరుకు జవాబువ్రాయుచుండిరి. మూడు గంటలకాలము. మొదటి రెండుగంటలు పరీక్షప్రశ్నలను అపార్థముచేసికొని జవాబులను తప్పుగా వ్రాసినారు. రెండు గంటలై పోయినవి. వెనుక మేలుకొని మొదట వ్రాసినదంతయు కొట్టివేసి అదంతయు మరల వ్రాయనారంభించి చాలవడిగా వ్రాసినారు. కాని ఆటవెలది తేటగీతి లక్షణములు వ్రాయవలసి యుండెను. 'ఇనగణత్రయంబు నింద్ర ద్వయంబును' అనివ్రాసినారు. గంటవినబడినది. 'హంసపంచకంబు నాటవెలది' అనివ్రాసినారు. దొరచూచి పేనా లాగుకొని పోయినాడు. అంతట చిటెకెనవ్రేలు సిరాలోముంచి "సూర్యుడొక్కరుండు సుర రాజు లిద్దరు" అనివ్రాసినారు. 'ఇంకా వ్రాస్తున్నావా?' అని దొర సిరాబుడ్డిని ఎత్తుకొని పోయినాడు. చిటికెనవ్రేలికి ఎంగిలి తగిలించి తడిచేసి 'దినకరద్వయంబు తేటగీతి' అని పూర్తిచేసినారు. దొర యీ మారు తెలివిగా పేపరునే ఎత్తుకొని పోయినాడు. ఈ గందర గోళములో శాస్త్రులవారు తమ నెంబరు వ్రాయలేదు ఇంతటి ప్రయాసము నిష్ఫలమగును. సగముదూరము ఇంటివైపు పోయినవారు వెనుకకువచ్చి ప్యూనునుప్రార్థించి దొరలేనప్పుడు పోయి తమ నెంబరువ్రాసికొని యింటి కరిగిరి.

ఆంధ్రసారస్వత సభవారు వీరికి మహోపాధ్యాయ బిరుదమును 1116 రు., ల నొసంగి సత్కరించిన సమయమున సభలో నిట్లుచెప్పిరి. '1875 వ సం., ఎఫ్.ఎ, కై విశాఖపట్టణముజిల్లా నరిసీపట్టణము అసిస్టంటు కల్లెక్టరు కచ్చేరి లోని యుద్యోగమును మానుకొంటిని. ఆంధ్రము, ఆంగ్లము, గణితము - అను మూడే విషయములచే ఎఫ్, ఏ., లో రెండవతరగతిలో 5 వ వాడనుగా జయ మొందితిని." అని.


_________