వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/2-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2-ప్రకరణము

వేంకటరాయ శాస్త్రులువారి బాల్యము

శ్రీ వేంకటరాయశాస్త్రిగారు 1853 సం. డిసంబరు 21 రారీఖున (ప్రమాదీచసంవత్సర మార్గశీర్ష బ 6 లు బుధవారము) మదరాసులో జనించిరి. అప్పుడు వీరితండ్రిగారు, మదరాసులో సంస్కృతాంధ్ర ద్రావిడ పాఠశాలలో ప్రథానపండితులు. తర్వాత రెండేండ్లకే వేంకటరమణశాస్త్రులవారికి కాకినాడలో నుద్యోగ మైనది. వేంకటరాయశాస్త్రులవారి బాల్యమంతయు తండ్రిగారితోకూడ నాంధ్రదేశమున పలుతావుల గడచినది. బాల్యమునుండియు కంటబడిన వస్తువును కనులార జూచి చెవుల బడినవానిని చెవులారవిని ఆనందించి ఉత్తరకాలమున గ్రంథస్థములంజేసినారు. ఆ సునిశితబుద్ధికి అన్నియు జ్ఞాపకములే. రసాత్మకవాక్య మేది ఆయన చెవింబడినను మఱి యా హృదయమును వీడదు. ఆంధ్రదేశమును వర్ణింపను ఆంధ్రప్రతిభను లోకమునకు ప్రకటింపను వారికి బాల్యమందే ఆశజనించినది; ప్రతాపరుద్రీయ బొబ్బిలి యుద్ధనాటకములందు రూపు దాల్చినది.

ప్రతారుద్రీయనాటకరచనాబీజము వారి హృదయమున వారి యెనిమిదవయేటనే పడినది. ప్రతాపరుద్రీయనాటక ప్రథమముద్రణావతారికలో నిట్లు వ్రాసినారు. "ఓరుగంటి ప్రతాపరుద్ర మహారాజును తురకలు డిల్లీకి ఖయిదు కొని పోయిన కథ లిఖితముగాని ముద్రితముగాని నాకెచటను దొరకలేదు. నే నెనిమిదేండ్లవయసున నుండగా మానాయనగారు వేదము వేంకటరమణశాస్త్రులవారు తమమిత్ర బృందములో నీకథను ప్రస్తుతించునపుడు నేనును వింటిని వారుచెప్పుటలో నీకథ అరగంటకూడ పట్టలేదు. ఇటీవల నేను ఆంధ్రజనవినోదినీ ముద్రణాధికృతుడనై యుండగా 1888 సం. మున ఈకథను నాకుదోచినట్లు విరివిచేసి యల్లి కథారూపమున బ్రచురించి యుంటిని. పిమ్మట 1896 సం. జూలై నెలలో దానిని నాటకోచితముగా రూపుచేసి, ఈ నాటకమునందలి గద్యభాగమును మాత్రము వ్రాసి నామిత్రులకు జూపితిని......."

వేంకటరమణశాస్త్రులవారికి వేదాంతులు నలువురు శిష్యులు నిరంతరము వారితో గోష్ఠి సలుపుచుండువారు. ఒకరు ముసల్మాను, రెండవవారు చాకలి, మూడవవారు క్రిశ్చియను, నాలవవారు బ్రాహ్మణులు. సాయెబుగారు తమ మతగ్రంథములలోని వేదాంతవిషయములను చెప్పుచు "ఆ అరాబియా దేషంలో వఖ్‌పఖీర్" అను నీతీరున మాటలాడుచుండువారు. ఆ ఎనిమిదేండ్ల వయసున సాయెబుగారిమాటలు వేంకటరాయశాస్త్రులవారికి వింతగా కనబడినవి; హృదయమున నెలకొన్నవి. ఇట్టి సాయెబుల నెందఱనో కనియే ప్రతాపరుద్రీయ మందలి ఆమహమ్మదీయ పాత్ర భాషితములను వ్రాసితి మని వారే చెప్పియున్నారు.

శాస్త్రులవారికి ఆంధ్రాభిమానము హెచ్చు. పుదూరు ద్రావిడులయింట బుట్టినారు; నియోగుల (తెలుగువారి) యింట పెరిగినారు వారే యిట్లువ్రాసియున్నారు. "మదీయ నరసాపూరు చరిత్రము _ ఉపనయనమునకు మునుపటిది. ఉపనయనము గర్భాష్టమమున మల్లయ్యపాళెములో పులిపాక లచ్చన్న బాబుగారు, శేషమ్మపిన్నిగారు, చంద్రమ్మత్తయ్య, రవణప్పత్తయ్య - వారికి గోసమృద్ధి, పేరిన హైయంగవీనము, చక్ర కేళి యరటియాకు. వంట రుచి 12 సం. యనంతరము కూడ యథాపూర్వముగానే యుండుట. నెమళ్ల గొప్పయారామము. మా నాయనగారు కాపురమున్న యింటివారును పులిపాకవారే. కోడలో కూతురో అన్నపూర్ణమ్మ. అత్తగారు రవణమ్మ. ఆమెకు కుడిచేతి బొటనవ్రేలికి రెండుగోళ్లు. ఇరువురును వితంతువులే ఇంటియద్దె రు 1. వారు రాత్రి చేసికొను ఉప్పుపిండిగాని రొట్టెగాని నాతమ్ములకు తప్పదు. ఈ చెప్పిన మూడు కుటుంబములును అభేదప్రతిపత్తితో అత్యంతమైత్రితో నుండినవి. వారి యాయింటికి పిశాచప్రథ. ఆ పిశాచములు మేముపోడూరికి పోయినతర్వాత ఆయింట నివసించిన వారిని పీకుకొని తినుట - వేంకటరమణశాస్త్రులవారు మావారు అందుచే వారిని ఏమియు చేయమైతిమి అని పిశాచములు వాదించుట.

అన్నపూర్ణమ్మగారి యింట వేన్నీళ్లప్రొయ్యిలో టపాసులు కాల్చినందుకు నాయనగారు కొఱకచ్చు చేతగొని నన్ను జూడుటకు తఱుముకొనివచ్చుట. నేను నేలబావిని దాటి అందులో పాతము తప్పించుకొని తహశ్శీలుదారుగారి కచ్చేరికి పోయి నాయనకు రు 5 జీతము తగ్గింపుడని కోరుట కొఱకంచు అనగా వారికి అర్థము తెలియక కొంతచర్చయు పరిహాసమును జరుగుట.

టైలరుదొరగారు, రోజాపుష్పములు - గోచిలేని చిన్నదట్టి. దొరవారి యాక్షేపము. అవధూతాశ్రమము అని నేను వచింపగా దొరవారు సమాధాన పడినట్లు నటించుట. ఒకనాడు రాత్రి నాయనగారు నన్ను వీథిలోనికిత్రోసి తలుపు వైచుట అంతట చింతాతయ్యాగారి యింటికి పోవుట.

మాపొరుగు ఎడమవైపున గోటేటివారు వారి యింట దొండపాదులు మెండు. సదా ఆదొండపిందెలను కాయలను నేను భక్షించుచుండుట. మాయింటికి కుడివైపు పొరుగు రేవువారు. రేవు సీతమ్మగారు మా నాయనగారికి రు 120 అప్పిచ్చుట - ఆపైకమిచ్చి నాయనగారి యుత్తమర్ణు నొక యుపాదాన బ్రాహ్మణుని, వడ్డిగొనుటయేగాక నిత్యాతిథిని తొలగించుట. పులిపాకవారు మాకు సదా వైద్యము చేయించుచుండుట.

పోడూరు - సోంభట్ల వెంకటజోగయ్యగారు మా నాయనగారియొద్ద నైషధము చదువుచుండిరి. రాజులు కొందఱు వసుచరిత్ర చదువుచుండిరి. వెంకటసుబ్బయ్యకు గడ్డి మేటి నుండి వెంటిపట్టుకొని దిగుచుండగా జాఱిపడినందున చేయి విఱిగినది. దానిని ఒడ్డూరనుగ్రామములో రాజులు కట్టి కుదిర్చినారు. అక్కడ ప్రతి తరగతిలోను నేనే మొదటివాడను. పై తరగతిలో నన్ను వేయగానే క్షణములో నేనే మొదటివాడనగుదును. మఱి నాతావు తప్పింప నొరుల తరముగాదు. నాకు ఒకమాఱుచెప్పిన చాలును, ఒకమాఱు చదివిన వచ్చును. నాకు సులువుగ రానిది గణితము, కుదురనిది చేతివ్రాత. నేను దెబ్బలెఱుగను. అబద్ధము చెప్పను. సాలాఖరుపరీక్షలో నాకు పుస్తక బహుమానము, For General Proficiency అనివ్రాసి యిచ్చినారు.

ఉపనయనానంతరము - తాతగారు సంథ్యావందనము చెప్పుట నేను నోటచెప్పుచు చేతులతో సంథ్యోదకమును కాలువలు పాఱించుట...రేవువారి యింట నొకపంతులు సర్కారుద్యోగస్థుడు. పేరు కస్తూరివారు. తద్భార్య శేషమ్మ. ఆమె సంస్కృతమున విదుషి. ప్రతిదినము రాత్రి మానాయనగారి భోజనసమయమున వచ్చి వారితో సంభాషించుచుండును. తద్భర్త ఆమెను మానాయనగారితో ఇట్లు విద్యావ్యాసంగము సేయుటకు ఆక్షేపింపక పైగా సంతోషించుట."

శాస్త్రిగారు రాజమండ్రిలో నుండగా మితిమీరి బోటుషికారులు పోవువారు. ఒక్కొకప్పుడు రాత్రులు సయితము ఇంటికిరాకయే తిరుగువారట. వీరికి వీరితమ్ములు వేంకటసుబ్బయ్యగారు నిరంతరముతోడు. వారికిని శాస్త్రులవారికిని వయసున ఎక్కుడుభేదము లేదు. ఒకమారు వీరిరువురును కొందఱు స్నేహితులతో గోదావరిలో ఈత పందెములు వేసికొని ఆవలిగట్టునకు ఈదసాగిరి. కొంతదూర మీదు నప్పటికి ఆస్నేహితులు ఒకరొకరుగా వెనుకకు జారుకొనిరి. తుదకుశాస్త్రులవారును వారి సోదరులును మిగిలిరి. వీరికి అభిమానము ఎక్కువ. వెనుకకు పోయిన పరువులోప మని యీదుచునేయుండిరి. లోతు, కాలికి నేల యందదు. ఇందులో శాస్త్రులవారికి ఈత సరిగా రాదు. వారితమ్ములకు చక్కగా వచ్చును. వారు వీరిని పట్టుకొని ఈదుచుండిరి. శాస్త్రులవారి దోవతి వీడిపోయి కాలికి చుట్టుకొన్నది. ఇక ఆ యీతయు అసాధ్యమే. అంత వారు ఈదలేక తమ్మునితో "ఒరేయి, నన్ను వదలివేయి, నేను చచ్చిపోతాను, నాకు ఈదినం గండం, నువ్వెందుకు నాకోసం చచ్చిపోతావు?" అనిరి. "ఆ! మిమ్మల్ని వదలిపెడతానా?" అని వెంకటసుబ్బయ్యగారు మెల్లగా కాలికి నేలతగులువఱకు ప్రయాసతో కొనిపోయిరి. అక్కడ సరిగా కంటివఱకు నీరు. ప్రవాహము వేగముగా లాగుచుండెను. అలసిపోయినారు. వాస్తవముగా శాస్త్రులవారు నాడు తాము చనిపోవుచున్నామనియే తలంచినారు. ఇంతలో దూరమున పడవ యొకటి కనబడినది. 'పడవోయి పడవ, ఓయిపడవ' అని ఇరువురును అఱచినారు. రెండు పర్యాయములు వీరిమాటలు వారికి వినబడలేదు. తర్వాత విని, వీరు గుడ్డను పిండి విసరగా చూచి పడవవాండ్రు వచ్చినారు; 'ఏంబ్రామ్మలయా, ఏంపనయా గోదారిలో' అని కసరుచు ఎక్కించుకొని గట్టుచేర్చిరి.

ఇంతలో నెవరో వారి తండ్రిగారికడకు పోయి వారితో "శాస్త్రులవారూ, మీకొమాళ్లు ఈతపంద్యాలు వేసుకుని గోదావరిలో ఈత్తున్నారండి, నడివరదలో ఉన్నారు. కూడా వెళ్లినవాళ్లంతా వెనక్కు వచ్చేశారండీ. మీవాళ్లు మాత్రం అమాంతంగా చచ్చిపోతున్నారు." అని చెప్పిరి. 'ఊం' అని గంభీరముగాను కోపముగాను చూచిరేగాని తండ్రిగారు మఱేమియు బదులు చెప్పలేదు. మఱికొంతసేపటికి ఆ మనుష్యులే వచ్చి 'ఎవరోచూచి బోటులో ఎక్కించుకొన్నారండి. వస్తున్నారండి.' అని చెప్పిరట. 'వస్తున్నారూ? సరే, అని' బదులు చెప్పినారు తండ్రిగారు. కొమారులు ఇంటికివచ్చిన యనంతరము వారిని ఈవిషయమైనను వా రడుగలేదు. కొమాళ్లును భయపడి తండ్రిగారి ఎదుటికి పోలేదు.

ప్రతాపరుద్రీయము రచించునెడ విద్యానాథ పాత్రను నిర్మించుచు ఇదంతయు జ్ఞప్తికిందెచ్చుకొని విద్యానాథునికి చేర్చి సంవిథానమల్లినారు. గోదావరిపై వారికి మక్కువ యట్టిది.

ఒకపాటి మాటవిసరు శాస్త్రులవారికి బాల్యమునుండియు కలదు. అల్లాడి సదాశివశాస్త్రులవారు, తర్వాత శాస్త్రులవారికి శ్వశురులు, బాల్యములోనే యిల్లువదలి ఓడనెక్కి కటకము బరంపురము మొదలయిన ప్రదేశములకు పోయి వ్యాపారము చేసి విశేషధనమార్జించి, వేంకటరమణశాస్త్రులవారు విశాఖపట్టణములో నుండగా, ఇంటికి నెల్లూరి సీమకు మఱలు చుండిరి. వేంకటరమణ శాస్త్రులవారిని చూచుటకు మార్గ మడుగుచు ఒక వీథిచివరను వేంకటరాయ శాస్త్రులవారిని చూచి పోలిక చేత ఊహించి "బాబూ, నువ్వెవరిఅబ్బాయివి?" అని ప్రశ్నించిరి. అప్పుడు వీరికి ఎనిమిదేండ్లుండును, "ఎవడో ఒక వెఱిముండా కోదుకు. ఎవడైతే నీకేమి?" అని బదులు చెప్పిరి. ఇంచుక యైనను సదాశివశాస్త్రులవారి పటాటోపమునకును పరివారమునకును జంకలేదు. ఇదికూడ వేదమువారికి తగినట్లేయున్నదని తలంచి ఆవెనుక వేంకటరమణశాస్త్రులవారిని దర్శించి 'ఆ వెఱిముండా కొడుకు' వారి కుమారుడేయని వారు తెలిసికొనిరట.

ప్రతాపరుద్రీయములో వెఱ్ఱివాడు, 'నేను కండచీమను, ఏమనుకున్నావో? పట్టుకుంటే వదలను' అని శిష్యులను బెదరించును. విశాఖపట్టణములో వీరు నివసించిన యింటి పొరుగింటి యాతడు, ముసలివాడు, తన పడుచు భార్యను ఈవాక్యమునే పలికి నిరంతరము బెదరించుచుండువాడట. జ్ఞాపకముంచుకొని తమాషాగానుండినందున వెఱ్ఱివానికి తగిలించినారు.

బొబ్బిలియుద్ధనాటకములో ఐదవయంకమున సిఫాయీలు తిరుగబాటు చేయుచున్నారనియు, సారాయిలేనిది వారు యుద్ధముచేయరనియు ఒక సిఫాయి బుస్సీకి నివేదించును.

"బుస్సీ - అవును మామాటగా బొడ్మిన్‌తో వారికి సారాయి మామూలు కొలత ప్రకారము ఇమ్మనిచెప్పుము."

అనిచెప్పును. ఈ 'బొడ్మిణ్ అనుపేరు విశాఖపట్టణములో నొక సారాయి దుకాణదారుని కుండెను. వినిన క్రొత్తలో చాల వేడుకగా నుండినందున సమయము దొరకినప్పుడు ప్రయోగించినారు. విశాఖపట్టణములో ఘనపండావారని సుప్రసిద్ధబ్రాహ్మణ కుటుంబమువారు ఓడ వ్యాపారు లుండిరి. కాలక్రమమున వారి యైశ్వర్యమంతయు నశింపగా నా పరంపరకుం జెందిన కడపటి బ్రాహ్మణుడు కాశీయాత్ర పోయెనని ఆ దినములలో ఆయనంగూర్చి కథలుగా చెప్పుకొనువారట ప్రతాపరుద్రీయములో చతుర్థాంకమున విద్యానాథుని యుగంధరుడు 'నీ ప్రథమోపాథ్యాయులు ఘనపండా దిగ్విజయ జ్యౌతిషికులు క్షేమమా?' అని యడుగును. వాస్తవముగా ప్రతాపరుద్రుని కాలమున నట్టివాడు లేడు; ఆతడు విద్యానాథునికి గురువునుంగాడు. శాస్త్రులవారు తమ సమకాలికుల నామధేయమును చమత్కారముగా నిచట ప్రయోగించినారు.

ఆనాటకమందే అష్టమాంకమున సుల్తానుముందు వర్తకు లాడించిన నాటకమున సిఫాయి పాత్రములు 'మనము గులాందస్త ఖైర్మునిషీ చేతకట్టించుకొన్న పాటకానిత్తమురా' అని పాడుదురు. ఈమునిషి శాస్త్రులవారికి సమకాలికుడు.

శాస్త్రులవారు జంగముపాటలు వినుటకు చెవికోసికొనెడి వారు. వానిపై వారికి ప్రీతిమెండు. బాల్యములో జంగము పాటలు, ముష్టివారిపాటలు, పడవవాండ్ర పాటలు ఒడలు తెలియని యావేశముతో విని కంఠస్థములంజేసినారు; తమ నాటకములలో రసాత్మకమైన యీగ్రామ్యోక్తులకు ఎక్కువతావొసంగినారు. శ్రీ శాస్త్రులవారి యుపన్యాసములయందును, నాటకములయందును మెండుగా హాస్యరసము స్ఫురించుచుండు ననువిష యము ఎల్లవారును ఎఱింగినదే. ఇందులకు మొదటికారణము శాస్త్రులవారే. వారి మాటల ధోరణియట్టిది. గొప్ప వ్యాకరణ విషయములను గుఱించి యుపన్యసించునపుడు సయితము శ్రోతలు కడుపులు చెక్కలగునట్లు నవ్వవలసినదే. మాటవడియు తడవు కొనక జవాబు చెప్పుటయు శాస్త్రులవారికి సహజములు. శాస్త్రులవారి నాటకములు లోకస్వభావానుకరణములు. లోకవృత్తాను కరణమునవారిది మొదటిచేయి. మాటలును చేష్టలును ఇతరులవి అట్లె అభినయించి చూపగలిగినది వారిశక్తి. శాస్త్రులవారి నాటకములు అంతటి ప్రసిద్ధిని చెందుటకు ముఖ్యకారణము వారి పాత్రోచితభాష. సాయెబులు, చాకళ్లు, మంగళ్లు, పామరులు, విద్యావంతులు, బాలురు, స్త్రీలు, అరవలు మొదలైన వారి గ్రామ్యభేదములను మెలకువతో కనిపెట్టి తమనాటకములో ప్రయోగించియున్నారు. ఈ గ్రామ్యభేదముల నన్నింటిని తమ బాల్యమునుండియే కనిపట్టుచువచ్చినారు. ఇదియే ప్రతిభ.


_________