వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/7-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

7-ప్రకరణము

కథాసరిత్సాగరము

గ్రంథరచనా ప్రారంభము నాటి మదరాసుజీవితము

క్రిశ్చియనుకాలేజి యుద్యోగము శాస్త్రులవారిజీవితములో నొక పెద్దమెట్టు; చాల ముఖ్యమైన ఘట్టములలో నొకటి. జీవితమునందు చక్కగా కుదురుపాటుకలిగెను. స్కూలు ప్రథానోపాథ్యాయుడుగా నలువదిరూపాయలు మాత్రమే జీతము. ఇప్పుడు నలువదియైదురూప్యములు వచ్చుచుండినవి. పూర్వముండినచోట అధికారులకును వీరికిని అభిప్రాయభేదముండినది. ఇప్పుడు శాస్త్రులవారికి స్వాతంత్ర్యగౌరవములు కలిగినవి; వారి పాండిత్యమునకు ప్రకాశమువచ్చినది; చిరకాలమునుండియు తా మపేక్షించుచుండినపదవి లభించినది; ఇది మొదలు శాస్త్రులవారిజీవితములో శాంతియు, గ్రంథరచనలకు అవకాశమును దొరకినవి; భావికీర్తికి పునాదు లీకాలముననే ఏర్పడినవి.

శాస్త్రులవారి నాటి మదరాసుజీవితము కొంత వినోదముగా నుండును. సంగీతకచేరీలు నేటివలెనే నాడును విశేషముగా జరుచుండెడివి. శాస్త్రులవారు తమ చదువులకు భంగమగునని వానికి పోవువారుకారు. జనవినోదినిలో 1883 సం. మునకు తర్వాతి సంచికలలో కొన్నివ్యాసములలో సంగీతమును గుఱించి వ్రాసియున్నారు. ఈవ్యాసములో స్వారస్యపు త్రాటికి మొదలు దొరకినది. ప్రతాపరుద్రీయమందలి యనేకవిషయ ములు తమ స్వానుభవమున వచ్చిన విశేషవిషయముల భాగములే యని ముందే వ్రాసియుంటినిగదా. స్వారస్యపు త్రాడు ఎచటనైనను దొరకునా యని వెదకుచుండగా జనవినోదినిలో వారి వ్యాసమందే కనబడినది. లాగిచూతము దీనిమొదలు. "గానరసజ్ఞు లనిపించుకొనగోరిన వారియందును అనేక దురభ్యాసములుకలవు. గానరసము బొత్తుగా నెఱుగని యొకరాజు నొద్దికి గొప్పగాయకుడొకడు పాడరాగా, గానమందు మహాపండితురాలైన రాణిగారు, రాజుగారిని ఒక కిటికీయొద్ద కూర్చుండబెట్టి వారిజుట్టునకు ఒకదారముగట్టి తాను కిటికీయొద్ద గోడచాటున (ఈకాలపు పంకావానివలె) కూర్చుండి గాయకుని పాటలో విశేషించి స్వారస్యము అగుపడినప్పుడెల్ల దారమును లాగుచుండెను. వెంటనే రాజుగారి తల యూగుచుండెను. గాయకుడు రాజుగారి రసజ్ఞతకు ఆశ్చర్యపడి ఆనందించి మఱియమఱియు హెచ్చరికతో ఇంక స్వారస్యముగా పాడసాగెను స్వారస్యపు దారముమూలముగా రాజుగారి తల మఱి మఱి ఆడసాగెను. ఎక్కువయూపుచేత ఆదారము పుటుక్కున తెగెను. అంత నారాజు గాయకునితో "ఓహోయి పాట నిలుపు, స్వారస్యపుదారము తెగిపోయినది" అనెను. గాయకుడు దాని యర్థమును గ్రహింపనేరక పాటమాత్రము మాని బ్రాంతుడై నలుదెసలు చూడసాగెను. ఈలోపున రాణిగారు ఒకపళ్లెములో బహుమానమును పంపిరి. దానిని రాజుగారు గాయకుని కిచ్చిరి. గాయకుడు సంతోషించి స్వారస్యపుదారము తెగినరహస్యమును తెలిసికొనలేకయే వెడలిపోయెను. ఈకథ లంబుతాలద్వారా కాలక్రమమున బైటబడెను."

ఆనందబాష్పములుకూడ ఇచ్చటనే యున్నవి. "మఱి యొకరాజు గానరసజ్ఞు డనిపించుకొనుటకై పాట వినునప్పుడెల్ల మిరియాల కలికము కన్నులలోవేసికొని బాష్పములు తెప్పించు కొనెనట, ఆసంగతి వారి కొట్టడిలెక్కలలో 'ఆనందబాష్పములకు అరపలము మిరియాలు' అని వ్రాయబడియుండెనట. ఆలెక్కలవలన ఆయనయొక్క రసజ్ఞత బయలువడెనట."

శాస్త్రులవారికడ నిరంతరము పండితు లెవరో యొకరు వచ్చివిద్యావ్యాసంగము చేయుచుండువారు. శాస్త్రులవారును, స్వయము గాయకులు కారేగాని, ఆశాస్త్రమును చక్కగా నెఱిగినవారు. ఒకదినము శాస్త్రులవారు ఏదో మంచివిషయమునుగుఱించి మాటలాడుచుండగా నొక సంగీతాభిమాని మధ్యలో సంగీత ప్రస్తావముం దెచ్చెను. ఒకానొక బోగముది నాటిసాయంకాలము నాట్యముచేయునని అతడు వచించెను. శాస్త్రులవారికి ఆప్రస్తావము దుస్సహముగానుండెను; పైగా వా రేదో వేఱువిషయమున లగ్నమైయుండిరి; వినిపించుకొనలేదు.

ఆతడు మరల, 'శాస్త్రులవారూ, అది కన్ను తిప్పితేనే చాలునండీ' అని చెప్పెను. ఆతనికి శాస్త్రులవారితో పరిచయము క్రొత్త. శాస్త్రులవారు వెంటనే ఆయనం గని తమ మనోభిప్రాయ మును బయలుపఱుపక, ముఖవికాసము మాఱకయే 'అయ్యా, నాకొక సందేహమున్నదండీ' అని యడిగిరి.

ఆతడు 'చెప్పండి శాస్త్రులవారూ' అనెను.

శాస్త్రులవారు: ఆవేశ్య మనకంటిలో వేలుపెట్టి తిప్పుతుందా, లేక తనకన్నే తిప్పుకుంటుందా, అని అడిగిరి.

అచటనున్న వారందఱును గొల్లున నవ్వసాగిరి. ఆ రసజ్ఞుడు నివ్వెఱబోయి చూడసాగెను. శాస్త్రులవారు నవ్వలేదు, మొదట నెట్లుండిరో అట్లేయుండిరి. 'ఇదేమి, ఈశాస్త్రులు, ఇంత తెలియనివాడా!' అని ఆతని యాశ్చర్యము కాబోలు. కొంతసేపుండి, అందఱును నవ్వి ముగించినవెనుక ఇంకొకరు, శాస్త్రులవారు వేడుకచేయుచున్నారని ఎఱిగి 'అయ్యా, అది మనజోలికిరాదు, మనలను తాకదులెండి' అనిరి.

'ఆహా! అయితే పర్వాలేదు' అన్నారు శాస్త్రులవారు. అందఱును లేచినవెనుక ఆప్రస్తావము తెచ్చిన ఆయనను ఇతరులు 'శాస్త్రులవారు మంచివిషయ మేదో చెప్పుచుండగా ఇటువంటి పాడు ప్రస్తావము తేవచ్చునా? నీకు బుద్ధి చెప్పడానికి వారు హాస్యముచేసినారు. వారికి లోకవ్యవహారం నీకంటె బాగానేతెలుసును. ఇకమీద కుదురుగా ఉండు.' అనిరి. అది మొదలు అతడు అట్టిప్రస్తావములుమాని వారిముందు, గౌరవముగా ప్రవర్తించుచుండెను.

1886 సం. శాస్త్రులవారు ప్రక్రియాఛందస్సు, అలంకారసారసంగ్రహములను రచించి ప్రకటించిరి. కథాసరిత్సాగర మును ఆంధ్రీకరింప నారంభించిరి. తమమిత్రులను ఎవరినైనను చదువుచుండుమని నియోగించి వారు చదువుచుండగా తాము తెలుగున వచనముగా చాలవడిగా వ్రాసికొనిపోవుచుండువారట. ఒకానొక రావుజీ, తెలిగ్రాపు ఆఫీసరు, సంస్కృతపండితుడు కొంతకాలము కథాసరిత్సాగరమును ఈపనికై చదువుచుండెను. శాస్త్రులవారు వ్రాయుటంజూచి ఆశ్చర్యపడెను. ఆతడు చదువుట నిలుపగానే శాస్త్రులవారి తెలుగువ్రాత పూర్తియయ్యెడిది. 'తంతిఆఫీసువాళ్లం, మేము ఇంతవడిగా వ్రాయలేమండీ' అని ఆతడు ఆశ్చర్యపడెను. వేఱుపనులచే దినమునకు ఐదుపుటలవంతున వ్రాసి కొంతకాలమునకు ఈ గ్రంథమును పూర్తిచేసి 1891 సం. ప్రకటించిరి. 1890 సం. సంస్కృత భోజచరిత్ర విక్రమార్కచరిత్రములను సంస్కరించి లఘుటీకలతో ప్రకటించిరి.

'ఇట్టిగ్రంథములు నన్నిటిని ఈప్రకారమే శోధించి అచ్చువేయ నుద్యుక్తుడనైయున్నాను. పండితులును, విద్యాశాలాధికారులును, విద్యార్థులును ఈ సదుద్యమమునకు సంతోషించి........ఈగ్రంథములకు ప్రచారము కలుగజేయుదురుగాక యని సవినయముగ కోరుచున్నాను' అని ప్రకటనగావించిరి.

శాస్త్రులవారికి, అచ్చాపీసును ప్రారంబించి అందు సంస్కృతాంధ్రగ్రంథముల శోధించి పరిష్కరించి ముద్రింపవలయునని యభిలాష పొడమినది. అంతట జ్యోతిష్మతీముద్రాక్షరశాలను 1890 ప్రాంతమున స్థాపించిరి. కథాసరిత్సాగర గద్యప్రబంధమును అం దచ్చువేసిరి. ఈకాలమున శాస్త్రులవారికి శ్రీ వేంకటగిరిమహారాజా, కీ.శే. శ్రీ గోపాలకృష్ణయాచేంద్రులవారి యాదరము లభించిఅది. శ్రీ మహారాజావారు స్వయము విద్యావంతులును విద్వత్పోషకులును. శాస్త్రులవారు కథాసరిత్సాగరములో నిట్లు వ్రాసినారు. "కథాసరిత్సాగరము...... నేను దొరంకొని ఆంధ్రలోకమును నమ్మి కొంతవఱకు నడిపి ఆంధ్రులకు ఈవిషయమున అక్కఱ చాలనందున అల్పసారుడను భగ్నారంభుడ నైతిని. ఇట్లుండ......శ్రీరాజగోపాలకృష్ణయాచేంద్ర బహదర్ వారు ఆప్తవర్గమువలన మదీయ పూర్వోక్తోద్యమాపరిసమాప్తి నెఱింగి లోకోపకార పారీణతావశంవదులై ఏతదాంధ్రగ్రంథ రచనా ముద్రణాసమాసమునకు వలయుసహకారమెల్ల తా మొనర్చెదమని నాకుందెలిపించి, అట్లే వలసిన సకలధనమొసంగి యీ యుద్యమమును నెఱవేర్చి నన్నుం గృతకృత్యుంగావించినారు." అని.

'నానాఖ్యానమనోహరం' బైన యీప్రబంధ మొక యపూర్వశైలిలో రచియింపబడినది. కఠినపదాడంబరము లేక సులువైన పదజాలముతోనిండి కథాభాగములకు ఆయాచోట్ల అనువైనశైలితో ఎల్లవారికిని సులభగ్రాహ్యమై ఈ పుస్తకము ఆంధ్రవచనవాఙ్మయమున నొక నూతనశైలికి మార్గదర్శకమై యున్నది. కొందఱు ప్రబంధములలోని వచనముల శైలిని వ్రాయుచుండిరి. మఱి కొందఱు వీరేశలింగముపంతులు ప్రభృతులు ఆంగ్లగ్రంథముల సాంప్రదాయములను తెలుగులోనికి తెచ్చుచుండిరి. శాస్త్రులవారు తెలుగువారి జాతీయతను తోపింపజేయు తిక్కనాదుల సాంప్రదాయము ననుసరించి ఆంధ్రదేశమందు జనసామాన్యముయొక్క వాడుకభాషకు చేరువయైనభాషలో కథలను వ్రాసిరి. ఈవచనమున పటిమయు గాంభీర్యమును చక్కగానున్నవి. శైలి ఏమాత్రము హెచ్చు తక్కువలులేక సాపుగా నడచినది. శాస్త్రులవారిశైలి ననుకరించి పలువురు వ్రాసియున్నారు; ఇంకను వ్రాయుచున్నారు. కాని శాస్త్రులవారి శైలియందలి మాధుర్య గాంభీర్యములు మాత్రము అనుకర్తలకు అలవడకయున్నవి.

ఇది యిట్లుండగా శాస్త్రులవారి యచ్చాపీసు ఎక్కువ కాలము జరుగలేదు; వారిని ఆర్థికక్లేశముల పాలుగావించినది. వెంటనే శాస్త్రులవారు దానిని విక్రయించివైచిరి. తమయుద్యమమును తాత్కాలికముగా నాపివైచిరేగాని మరల ప్రారంభించు నుద్దేశమునుమాత్రము మానలేదు.


___________