వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/16-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

16-ప్రకరణము

మరల జ్యోతిష్మతీ ముద్రాక్షరశాల

శాస్త్రులవారు కాళిదాసుని మేఘసందేశమునకు పద ప్రయోజనికయను వ్యాఖ్యను రచించి 1902 సం. మే ప్రకటించిరి. ఇయ్యది మల్లినాథవ్యాఖ్యతోను పెక్కు ఆక్షేపములకు సమాధానములతోను, ఎల్లవారును ఉపాధ్యాయ నిరపేక్షముగా చదువుకొనుట కనుకూలముగా ముద్రింపబడి ఆంధ్రదేశమున ప్రచారమునందున్నది. ఇదేవిధముగా టీకలతో సంస్కృతాంధ్రగ్రంథములను ముద్రించుటకు అచ్చాపీసు లేనిచో జరుగదని, ఎట్లో ద్రవ్యముంగూర్చుకొని జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను తిరుగ 1908 సం. అక్టోబరు నెలలో ప్రారంభించిరి. ఒకవైపు అచ్చాపీసునుజరుపుచు నింకొకవైపు కళాశాలయుద్యోగమును నిర్వహించుచు రెండేండ్లు గడపి 1910 సం. కళాశాలనుండి విరమించుకొని అచ్చాపీసునే జరుపుకొనసాగిరి. ఈవిధముగా ప్రకటనంగావించిరి-

"హిందువులకెల్ల నైహికాముష్మిక సర్వశ్రేయ:ప్రదయగు సంస్కృతభాష వారిచేత ఈకాలమందు ఉపేక్షితప్రాయము తిరస్కృతప్రాయయునై జర్మనీ, ప్రాన్సు, ఇంగ్లండు, రష్యా, యునైటెడ్ స్టేట్స్, జపాను, లోనగు దేశాంతర ఖండాంతర ద్వీపాంతరములకు వలసపోయినవిషయము జగద్విదితముగదా. మనదేవతలభాషయు మనకర్మభాషయు మన 'యెల్ల భాషలకుం దల్లి'యు నగు నీసరస్వతిని వెండియుం దెచ్చికొని హృదయాలయములందు ప్రతిష్ఠించికొని యుపాసించి తత్ప్రసాదంబున సంస్కృతభాషలో కావ్యనాటక కథాప్రబంధముల రసంబును ధర్మయోగ పురాణేతిహాస వేదవేదాంతాది విషయంబులను గ్రహించి సర్వశ్రేయంబులం బొందంగోరిక, ఇతర విద్యాభ్యాసప్రయాసచే బాల్యమందు ఈవిద్యను నేర్వని సజ్జనులకు పలువురకు చిత్తమందు ఉదయించుచున్నది. కాని, అట్టివారికి అనేకులకు ఉపాథ్యాయులు దొరకమింజేసి ఈయభీష్టము నెఱవేఱకయున్నది. మఱియు నిపుడు హౌణాది భాషాంతర ప్రసిద్ధ విద్యాకలావిశేషములనేమి స్వతంత్రకావ్య నాటకాది గ్రంథములనేమి ఆంధ్రంబున రచియింప ననేకులుకోరుదురు. వారి యుద్యమములకును సంస్కృతపరిచయము ఆవశ్యకముగదా. అట్టివారికొఱకును కేవల బాలురకొఱకును ఉపాథ్యాయునితో బనిలేకుండ స్వయంబోధకములుగా పెక్కు సంస్కృతగ్రంథములను, తెనుగున, టిప్పణముతో కొన్నిటిని, సంపూర్ణటీకతో కొన్నిటిని, ప్రకటించియు ప్రకటించుచును ఉన్నాడను. కారణ విశేషములచే నడుగంటుచున్న మనభాషలకొఱకై యీ యుద్యమమని విన్నవించుచున్నాడను."

వేదము వేంకటరాయశాస్త్రి.

ఈమాఱు శాస్త్రులవారు మునుపటివలెగాక పెక్కుగ్రంథములను ముద్రింపగల్గిరి. 1910 సం., అమరుకావ్య, పుష్పభాణవిలాస, రసమంజరులను తెనుగు సంపూర్ణటీక తోను, భర్తృహరిశతకత్రయమును సంపూర్ణాంధ్ర వ్యాఖ్యతోను తెనుగుపద్యములతోను ముద్రించిరి. రఘువంశ కుమారసంభవముల తొలి యాఱుసర్గలను తెనుగు టీకాతాత్పర్యాదులతో ముద్రించిరి. శాస్త్రులవారు ప్రకటించిన సంస్కృతగ్రంథములలో నొక విశేషముగలదు. ఉపాథ్యాయునితో పనిలేకయే నాటకాంతము సంస్కృతమందు సాహిత్య మలవరచుకొనవచ్చును. తొలుత అమరము శబ్దమంజరులను ముద్రించినారు. వీనిచే నొకపాటి యర్థజ్ఞానమును శబ్దజ్ఞానమును కలుగును. బిల్హణచరిత్ర ఏపాటి శబ్దజ్ఞానము కలవారైనను చదువవచ్చును. దీనికి లఘుటీకను శాస్త్రులవారు ముద్రించినారు. వెనుక చదువదగినవి రఘువంశ కుమారసంభవములు. వీనికి టీకాతాత్పర్యాదులు చేర్చినారు. ఆవెనుక మేఘసందేశము. ఇవిగాక భోజవిక్రమార్కచరిత్రములను పూర్వము ముద్రించినవానిని మరల టీకలతోముద్రించిరి. ఇవి సులువైనవచనగ్రంథములు. హితోపదేశ దశకుమారచరితములను తెనుగు తర్జుమాలతో ముద్రించిరి. తర్వాత నెవరిసాయమునులేకయే చదువగలుగు ప్రజ్ఞకలుగును గాన పంచతంత్రమును, మూలముమాత్రము, ముద్రించిరి. వెనుక రసమంజరీ అమరుకావ్యములు - శృంగారరసమయములు. నాటికలలో సులువైన పియదర్శికను, ఒకపుటయందే ఒకవైపు అనువాదము, మఱియొకవైపు సంస్కృతమూలము, అడుగున నాటకలక్షణాది సకలవిషయంబులును తెలియునట్టివ్యాఖ్య, మొదలైనవానితో పుష్కలముగ ముద్రించిరి. ఈగ్రంథముల నన్నిటిని చదువునప్పటికి సంస్కృతమందు మంచి పాండిత్య మలవడును. విద్యార్థికి ఏగ్రంథముగాని స్వయముగా చదివి గ్రహించుశక్తి యలవడును.

శాస్త్రులవారి సంస్కృతనాటకముల యనువాదములు మూలమునకు చేరువగానుండును. కొన్నివిషయములలో నీయాంధ్రీకరణములు మూలమునకు వ్యాఖ్యాప్రాయముగా సైతముండును. సంస్కృతనాటకముల నాంధ్రీకరించుటకు ముందుగా వానింబఠించి భిన్న దేశముల ప్రతులను తెప్పించి పాఠ నిర్ణయముచేసికొని ఆవెనుక అనువదించుచుండిరి. ఈవిషయములంగూర్చి వారి విమర్శవినోదమను వ్యాసమునందు వివరము చూడవచ్చును.

ఆంధ్రగ్రంథములలో శాస్త్రులవారు పారిజాతాపహరణము, బిల్హణీయము, గౌరనమంత్రిప్రణీత హరిశ్చంద్ర ద్విపద, బాణాలశంభుదాసుడను విశ్వకర్మమతస్థుని సారంగధర ద్విపద, కావ్యాలంకారచూడామణి యను నలంకారశాస్త్రమును ఈ సంవత్సరమే (1910) ప్రకటించిరి. పారిజాతాపహరణమున శాస్త్రులవారు కొన్ని సవరణలంగావించిరి. వానిని గ్రహించియే శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్యగారు దీనికి వ్యాఖ్యరచించినారు. బిల్హణీయమున శాస్త్రులవారు ఒకటి రెండు పద్యములను తీసి ముద్రించినారు. "పుణ్యవిశేషలబ్ధ మృదుమధుర వాగ్వైభవంబున చేమకూర వేంకటపతి అమృతంపు గూరగారచియించిన" సారంగధరచరిత్రను లఘుటీకతో శ్రీ శాస్త్రులవారు 1911 సం. ముద్రించినారు ఆపైనెలలోనే "అద్దములోని లిబ్బివలె రసికులకు నబ్బియు నబ్బని యర్థములచే నబ్బురమెసంగుచు, కాకలీగీతముంబోలె మదురంబయ్యు నస్ఫుటంబై, రసికగోష్ఠులయందు సందేహాంతచర్యలకుంగారణంబైన కాకిమొలకువలతోనిండి సంపూర్ణానుభవమునకు రాకయున్నట్టి రసోత్తరప్రబంధమును" విజయ విలాసమును, ఎల్లవారికిని సుబోధంబుగా నటీకముగా ప్రకటించినారు. ఈగ్రంథములను శాస్త్రులవారు ప్రకటించి నేటికి ముప్పది రెండు సంవత్సరములైనవి. ఈలోపల పెక్కుతాళపత్రములును దొరకినవి. చారిత్రపరిశోధనయు జరిగినది.

ఈజ్యోతిష్మతీముద్రాక్షరశాలలో శాస్త్రులవారి గ్రంథములేగాక ఇతరులగ్రంథములును అచ్చగుచుండినవి. ఆంధ్ర విజ్ఞాన చంద్రికామండలివారి గ్రంథములును, చల్లావారి వైదిక గ్రంథములును, రామా అండ్ కంపెనీవారి ప్రచురములును, ఇంకను అనేకులగ్రంథములు అచ్చగుచుండినవి. వేంకటరాయశాస్త్రుల వారును వారి కుమారులు వేంకటరమణయ్యగారు (రాజన్న)ను చూచుకొనుచుండుటచే గ్రంథములు సుందరములుగాను నిర్దుష్టములుగాను ముద్రితములగు చుండినవి. వేంకటరాయశాస్త్రిగారు నిరంతరము గ్రంథములు పఠించుచు, రచించుచు, ప్రూపులు దిద్దుచును, వారికుమారులు అచ్చాఫీసు వ్యవహారములను చూచుచునుండిరి.


___________