వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/15-ప్రకరణము

వికీసోర్స్ నుండి

15-ప్రకరణము

క్రిశ్చియన్కాలేజి సంస్కృతపండితపదవినుండి విరామము

శ్రీ శాస్త్రులవారు మదరాసు క్రైస్తవకళాశాలలో సంస్కృత ప్రథానపండితులుగాను శ్రీ సమర్థి రంగయసెట్టిగారి మరణానంతరము కాలేజిలో ప్రాచ్యభాషా ప్రవచనాధ్యక్షులుగాను (Superintendent of Vernacular studies) దాదాపు ఇరువదినాలుగు సంవత్సరములుండి 1910 సంవత్సరమున జనవరినెలలో విరమించిరి. ఈ ఇరువదినాలుగు సంవత్సరములలోను మదరాసురాజథానిలో సుప్రసిద్ధు లెందరో వారికడ సంస్కృత మభ్యసించిరి. శాస్త్రులవారు మొదటమొదట కళాశాల ప్రవేశించినకాలమున, మా నెల్లూరునగర న్యాయవాది శిఖామణులలో నొకరును చరిత్రపరిశోధకులు నగు శ్రీ వంగవోలు వేంకటరంగయ్య పంతులవారు ఆకళాశాలలో నింటర్మీడియేటు మొదటితరగతియందు చదువుచుండిరి. శాస్త్రులవారు వచ్చిన వెంటనే శుక్రనీతి మొదలైన పలువిషయములంగూర్చి చెప్పవలసివచ్చినదట. తరగతికి వలసినవిషయములను పూర్వపరిశోధన లేకయే శాస్త్రులవారు, చాలసులువుగా, ఆయాగ్రంథభాగములను, తమకు ముందే కఠస్థములైనవానింబోలె చెప్పుచు విద్యార్థులకు తొలిదినముననే తమయందు ఆశ్చర్యగౌరవములం గలిగించిరని శ్రీ పంతులవారే నాకుచెప్పియున్నారు. అప్పటికే శాస్త్రులవారికి గీర్వాణవాఙ్మయమున పెక్కువిషయములు కంఠస్థములు. కళాశాలలో ఆంధ్రులు ద్రావిడులు కర్ణాటకులు కేరళీయులు, హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులును సంస్కృతవిద్యార్థులుగా నుండిరి. శాస్త్రులవారు ఆంగ్లమున పాఠ్యములకు వివరించుచుండిరి. శాస్త్రులవారు బి.ఏ. పూర్తిచేసికోలేదుగాని ఆంగ్లమున మంచిపాండిత్యము నార్జించిరి.

శాస్త్రులవారికడ విద్యార్థులుగానుండి అనంతరము ప్రసిద్ధికి వచ్చినవారు-శ్రీ జగన్నాథపురి శంకరాచార్యస్వాములవారైన భారతీ కృష్ణతీర్థులు (పూర్వాశ్రమమున వేంకటరమణ సరస్వతియని ప్రసిద్ధులు), మైసూరులో దివానుగానుండిన రాజబంధువు శ్రీ లేటు కాంతరాజఅరస్ గారు, కీ.శే శ్రీ సత్యమూర్తిగారు, శ్రీయుత నాగేశ్వరరావు పంతులుగారు, మా పుదూరుద్రావిడసంఘమునకు చూడామణులు దివాన్ బహదూర్ సర్ అల్లాడి కృష్ణస్వామిగారు, మద్రాసు విశ్వవిద్యాలయ చరిత్రాచార్యులు శ్రీ కే.ఏ. నీలకంఠశాస్త్రులవారు, ప్రస్తుతము భరత్‌పూరు దివానుగారైన శ్రీ ఏ.వి..రామనాధన్‌గారు, ఇంక ననేకులు.

కళాశాలలో నున్నంతకాలము ఆంగ్లేయులు ప్రొఫెసర్లేమి, ఇతరాథ్యాపకులేమి శాస్త్రులవారియందు గౌరవప్రవత్తులతో మెలగిరి. శాస్త్రులవారు తమవిధిని ఆసడ్డచేసి యెఱుగరు. ప్రిన్సిపాలు మొదలగునధికారులకు ఒగ్గితగ్గి తిరుగలేదు.

ఒకదినము విస్తారము వర్షముకురియుచుండెను. శాస్త్రులవారు ఒక పెట్టెలో వస్త్రాదికములుంచుకొని, ఉడుపు ధరించి జోరువర్షములో గొడుగున్నను, తడిసి, కళాశాలచేరి, ఆ తడసిన దుస్తునుతీసి పెట్టెనుండి వేఱుదుస్తుధరించి తరగతికి పోయిరి. ఆదినము అనేకులు అథ్యాపకులు రాలేదు.

ప్రిన్సిపాలుగారు, దొర, శాస్త్రులవారితో నిట్లనెను. "శాస్త్రిగారూ, చూచారా, ఏవిధంగావర్షంకురుస్తున్నదో ఫలానివారు రాలేదు. వారిపనికూడా తాము చూడగలరా." శాస్త్రులవారికి నాడు విస్తారము పనియుండెను. పైగా శాస్త్రులవారికే ఎక్కువపని తగులుచుండెను. అధికారులకును ఇతరాథ్యాపకుల యందు పక్షపాతముండినది. వెంటనే శాస్త్రులవారు "వర్షమే ఒకకారణంగా తాము భావించేపక్షములో నేనుకూడారాక ఇంటనే ఉందునే" అని శాస్త్రులవారు బదులుపలికిరి.

ప్రిన్సిపాలుదొరకు బదులుచెప్పుటకు ఏమియు తోచలేదు. 'సరే, శాస్త్రులవారూ, అయితే మీపని మీరుచూచుకొండి.' అనెను.

శాస్త్రులవారు తమపనికి తాముపోయిరి.

వేసవికాలమున నొకదినమున తరగరిలో విద్యార్థియొకడు, శాస్త్రులవారు పాఠము చెప్పుచుండగా నిద్రబోవుచుండెను. దొర ఎచటినుండియోవచ్చి, శాస్త్రులవారి యనుమతిలేకయే వారిగదిజొచ్చి, ఆవిద్యార్థినిలేపి, శాస్త్రులవారినిచూచి Do you allow the boys to sleep in the class? అని యడిగెను. (విద్యార్థులను తరగతిలోనే నిద్రబోనిచ్చెదవా? అని యర్థము.) శాస్త్రులవారికి కోపమువచ్చినది. తరగతిలో తాము పాఠముచెప్పునప్పుడు తమ యనుజ్ఞలేకయే లోనప్రవేశించుట మర్యాదగాదు. వెంటనే వారు 'I do my duty' (నేను నాధర్మమును నెఱవేర్చుచున్నాను) అని బదులిచ్చిరి.

ఈదెబ్బకు ఏమి బదులుచెప్పుటకును తోచక దొర వెడలి పోయెను.

కళాశాలలోని యథ్యాపకులలో నొకరు బ్రాహ్మణద్వేషి. దూషణముగా నేదో యొక పురాణాంతర్గత విషయమును చెప్ప నారంభించి, సరిగా తెలియక, తుదకు 'Here the rascality is ...' అని చెప్పనారంభించెను శాస్త్రులవారు వెంటనే Keep it to yourself అని బదులిడిరి అచట నుండినవా రందఱును గొల్లున నవ్విరి. ఆక్షేపకుడు మఱి మాటాడలేకపోయెను.

విద్యార్థులకు శాస్త్రులవారియందు గౌరవమును ప్రేమయు నుండినవి. మైసూరులో రెండమంత్రిగానుండి ప్రస్తుతము భరతపురమునకు దివానుగానున్న శ్రీ ఏ.వి. రామానాధన్‌గారు, 1938 సం. జనవరి 13 తేది జరిగిన క్రైస్తవకళాశాల పురాణ బాల సంఘసమావేశమునాడు ఇట్లునుడివిరి. "The great Andhra patriot and scholar, Vedam venkataraya sastriar, was not only an erudite Sanskrit teacher, but a great friend and GURU to every student, He instilled in us a genuine love of Sanskrit and an appreciation of the beautiful and the lofty in our ancient literature' శాస్త్రులవారు తరగతిలో పాఠముచెప్పునప్పుడు విద్యార్థులు తదేకతానులై పాఠముగ్రహించువారు. శాస్త్రులవారు ఒకమారుచెప్పినది మరలచెప్పరు. విద్యార్థులు గట్టిగాచెప్పుడని యఱచినచో మఱింత మెల్లగా చెప్పువారు. తరగతిలో నుండునంతసేపు వారనిన విద్యార్థులకు భయము. ఇవలికివచ్చిన చాల చనువుగానుండువారు. వారు మధ్యాహ్నము తెచ్చుకొను కాఫీలను వారితోకూడ విద్యార్థులును గ్రహించువారు. మందమతులను వారివారి చిత్తవృత్తుల కనుగుణముగాబోధించి పైకి తెచ్చుచుండిరి. శిష్యులను లాలించుటలో నగ్రగణ్యులు. కళాశాలలలో విద్యార్థులు సమ్మెకట్టుట పరిపాటి. క్రైస్తవకళాశాలలో వారిదినములలో నెట్టి విద్యార్థులసమ్మెయైనను శాస్త్రులవారు క్షణము సంభాషించినచో మరల నావిద్యార్థులు తరగతులకు వచ్చి చదువుకొనవలసినదే. అట్టి సన్నివేశములలో దొర శాస్త్రులవారినే నియోగించుచుండువాడు. కళాశాలను వదలిన యనంతరము సయితము విద్యార్థులు. వారిని విశేషముగా నాశ్రయించుచుండువారు వారితో చెలిమిచేసి వదలిపోయినవారు లేరు. ఇతర కళాశాలలలోనుండి విద్యార్థులు సంస్కృతమునకును శాస్త్రులవారి బోధనుపొందుటకును వారి కళాశాలకే వచ్చుచుండువారు. శాస్త్రులవా రుండిన యా ఇరువదినాలుగు సంవత్సరములలో నొక మహమ్మదీయవిద్యార్థి యొకడే వీరి కళాశాలను వదలిపోయినవాడు అతనిని ప్రిన్సిపాలు, మిల్లరు దొరగారు "సంస్కృత విద్యార్థు లందఱును, ఎచటెచటినుం డియో మాకళాశాలకు వెదకుకొని వచ్చుచుండగా, నీవేల మాకళాశాలనువదలి పోవుచున్నావు" అని యడిగెను. అందుల కాతడేమియు సమాధానము చెప్పలేకపోయెను.

శాస్త్రులవారికి ఎక్కుడుపని తగులుచుండెడిది. ఆవిషయమును తెలుపుటకై వారు అప్పుడప్పుడు ఇట్లడుగువారు. Who is the only christian in our college? అని అందులకు విద్యార్థులు మిల్లరనియు, కాక మఱియొకరనియు చెప్పువారు శాస్త్రులవారు 'No! It is myself. I live by the sweat of my brow.' అని బదులుచెప్పువారు. మథ్యాహ్నము కార్యాధిక్యముచే వారిమొగమంతయు చెమటచే నిండిపోయెడిది.

శాస్త్రులవారు సంస్కృతనాటకములను పాఠముచెప్పునప్పుడు ఆసంవత్సరము విద్యార్థులకు పాఠ్యమైన షేక్స్పియరు నాటకముతో దానినిపోల్చి ప్రాచ్యపాశ్చాత్య రూపకసామాన్య లక్షణములను బోధించువారు. ఒకప్పుడు విద్యార్థులు మిల్లరు దొరవారి తరగతిలో ఈవిషయములే వచ్చునట్లు ప్రశ్నించిరట. మిల్లరు ఆశ్చర్యపడి ఈప్రశ్నలను ఎవరు నేర్పిరని యడిగి శాస్త్రులవారని తెలిసికొని 'అవును ఆయన గొప్ప సంస్కృతపండితుడు' అనిచెప్పెను.

శాస్త్రులవారికి ఈనౌకరిలో పెన్షనురాదు. కళాశాలవారు మొత్తముగా కొంతద్రవ్యమొసంగు నేర్పాట్లేవో చేసియుండిరి. శాస్త్రులవారికి సంస్కృతాంధ్ర గ్రంథములను పెక్కింటినిశోధించి ముద్రింపవలయునని కోర్కెయునుండినది. మరల నచ్చాఫీసును ప్రారంభించుటకై తమకు పరీక్షకాధికారములచేత నేర్పడిన ద్రవ్యమునుచేర్చి దాదాపు మూడువేల రూప్యములను ఆర్బత్ నేటుబ్యాంకిలో వేసియుండిరి. ఈడబ్బున్నదను ధైర్యముతో అచ్చాఫీసు ప్రారంభింపదలంచి ఒకప్పుడు తాముద్యోగమును వదలుకొనెదమని తమ ప్రిన్సిపాలుతో చెప్పగా నాతడు అంతగొప్ప సంస్కృతపండితుడు మరల తమకు దొరకడనియు, శాస్త్రులవారిని అంతత్వరగాపంపివేయుట తమకిష్టము లేదనియు ఇంకను కొంతకాల ముండవలసినదనియు కోరిరి. శాస్త్రులవారు రాజీనామానొసంగెదమని ఎంతచెప్పినను దొరలు ఒప్పుకొనలేదు ఆదినము సాయంకాలము శాస్త్రులవారు ఇంటికి వచ్చుచు మార్గమున ఆర్బతునేటు బ్యాంకిమునిగిపోయినదని తెలిసికొనిరి. రాజినామాను దొరలొప్పుకొనకపోయినది మంచిదే యైనదనితలంచి కొంతకాలము ఆపనియందేయుండిరి.


____________