వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/14-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

14-ప్రకరణము

పితృ మిత్ర వియోగము

శాస్త్రులవారికి చిరకాలమువరకు పరీక్షాధికారము రాలేదు. ఎవరెవరో అడ్డుతగులుచుండిరి. తుదకు 1900 సం. మున నాంధ్రమునకు పరీక్షకులైరి పూ రామకృష్ణయ్యగారు ఒకజాబులో తమసంతసము నిట్లు వెలిబుచ్చిరి.

తమ యెగ్జామినరుషిప్పు విషయమై యిచ్చట మే మొక పబిలికుమీటింగు చేయవలయుననియెంచి కొంతపనియుచేసి యుంటిమిగాని గజెటులో అదిప్రకటింపబడు నంతదనుక యేమి చేయుటకును వలనుపడదని తొందరనినందున నిలిపించినారము. అది యెప్పుడుబయటపడును? యీ మహాయుద్ధములో మిమ్ము నాంధ్రమునకే యేర్పాటుచేయుట కొంత సుగుణమనియు విమతులకు శృంగభంగమనియు తలచెద. ఇచట మాకందరికి తమకు యత్జామినరగుట బ్రహ్మానందముగా నునది.........చిత్తగించవలెను.

ఇట్లు విధేయుడు
పూండ్ల రామకృష్ణయ్య

కవిపండితసభ కగ్రాసనాధిపత్యము వహించినవారు 'అష్టాదశ భాషాలక్ష్యలక్షణాభిజ్ఞ సార్వభౌములు ప్రెసిడెన్సీ కాలేజి సంస్కృత మహోపాధ్యాయులు, ప్రాక్తనపైలాలజీ ప్రథమ ప్రవర్తకులు' వేంకటరాయశాస్త్రులవారికి వారి పాండిత్యము కతంబున పరమమిత్రులైరి. మదరాసులో వీరిరువురును ప్రతిసాయంకాలమును కలిసికొనుచుండెడివారు; సకల విద్యావిషయములందును సంప్రతించు కొనుచుండెడివారు. వేంకటరాయశాస్త్రులవారిని తమ పుదూరు ద్రావిడసంఘమునకు చెందినవారనియేగాక (శేషగిరిశాస్త్రులవారును పుదూరు ద్రావిడులు) ముఖ్యముగా వారిపాండిత్యముపై నిభిమానముంచి వారి గ్రంథములను పాఠ్యములగునట్లు ప్రయత్నించుచుండు వారు. నాగానందనాటకమును పాఠ్యముగా వీరిప్రోత్సాహము చేతనే పెట్టినారు. "శ్రీమంతులు అష్టాదశ భాషాధురంధరులునగు ప్రొఫెసరు శేషగిరిశాస్త్రులవారు నన్ను ఎఱుకచేసికొని నాకు మిత్త్రధేయమై తాముగా యత్నించియు, శ్రీ మిల్లరుదొరగారిని హెచ్చరించియు యూనివర్సిటీ పరీక్షాధికారమును నాకు ఇప్పించినారు."*

వెనుక శాస్త్రులవా రొకసంవత్సరము తమిళమునకు పరీక్షకులైరిగాని తమిళముపై నభిమానములేనందున దానిని మానుకొనిరి. తర్వాత బహుకాలము తర్కవేదాంతమున స్తత్వ శాస్త్రాదికములకు పరీక్షకులుగానుండిరి. కళాశాలలో కొంతకాలము పైశాస్త్రములను బోధించుచునుండిరి.

ఈకాలముననే (1900 సం) శాస్త్రులవారితండ్రిగారు వేంకటరమణశాస్త్రులవారు నిర్యాణముంజెందిరి. శాస్త్రులవారికి తండ్రిగారిమరణము హృదయమున ఆరనివ్రణముంగావించినది.


  • శ్రీ వేంకటగిరిరాజాగారికి శాస్త్రులవారు వ్రాసినజాబునుండి. బాల్యమున వారికడ తామేమియు పఠింపకపోయినను ఆకొఱతను తీర్చుకొనునట్లు తామేచదువుకొనిరి. తండ్రిగారి శ్లాఘనందిరి. శాస్త్రులవారి స్త్రీపునర్వివాహదు ర్వాదనిర్వాపణమును వారుకని శాస్త్రులవారి తమ్ములతో 'మీఅన్న చక్కగానే వ్రాశాడోయి' అని వారు చెప్పువఱకు శాస్త్రులవారికి తృప్తికలుగలేదు. అట్లే ప్రతాపరుద్రీయముంగని తండ్రిగారు హర్షించినందులకు శాస్త్రులవారు లోకముహర్షించినదానికన్న నెక్కుడుగా నానందించిరి. మనశాస్త్రులవారికిని వారితండ్రిగారికిని జరిగిన ఉత్తర ప్రత్యుత్తరములలో కొన్నిజాబులు సంస్కృతమునందే గలవు.

శాస్త్రులవారు ఈదెబ్బనుండి కొంచెకొంచెము తేరుకొనుచుండగా వారియాప్తమిత్రులు శేషగిరిశాస్త్రులవారు హఠాత్తుగా వారముదినముల జ్వరముచే తమ 52 యేట పరమపదించిరి. ఇది వేంకటరాయశాస్త్రులవారికి పిడుగుదెబ్బగా తగిలినది. అప్పుడు వారు 'సిద్ధసుథాప్రవాహము'ను ఉషానాటకమను స్వతంత్రనాటకమును రచించుచుండిరి. ముద్రితమైనవెంటనే దానిని శ్రీ శేషగిరిశాస్త్రులవారి కీర్తిమూర్తి కంకితము గావించిరి. శ్రీయుత శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రులవారును (నేడు మహామహోపాథ్యాయులు, కళాప్రపూర్ణులు) తమ గౌతమీ మాహాత్మ్యమును వా కంకితమొనర్చిరి.

శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారును ఎక్కుడుకాలము జీవించలేదు.

తే 22-3-'02 నెల్లూరు

ఆర్యా, నమస్కారములు.

.......నేనురోగినైనాడను. దూరమునడువ లేను. ఎండసోకగూడదు. ఎట్లుజీవించగలనో దిగులుగానున్నది రాజైశ్వర్యములు వలసియున్నవి. ఆర్జననున్న...కుదురుపాటు చిక్కలేదు. చిత్తచాంచల్యము మెండుగానున్నది. ఇందుచే బక్షవాయువు వచ్చునట్లు తోచుచున్నది ఏదివచ్చినను ననుభవించక తీరదుగదా. విశేషములులేవు.

మీవిధేయుడు
పూండ్ల రామకృష్ణయ్య

శాస్త్రులవారికి వీరువ్రాసినజాబులు దాదాపు రెండువందలు. వానిలో కడపటిది 30-4-'03 తారీఖున వ్రాయబడినది. తర్వాతజాబులేదు. పూండ్ల రామకృష్ణయ్యగారు శాస్త్రులవారికి ఆప్తమిత్రులై తమపత్రికను వారిపత్రికగానే జరిపి అనుక్షణము సలహాలను పొందుచుండినవారు. ఆంధ్రకవిపండిత సంఘసమరమున శాస్త్రులవారికి తోడునీడగానుండిరి. పెక్కు అముద్రిత గ్రంథములను చక్కగా సంస్కరించి బహుగ్రంథ పరామర్శపూర్వకములైన విపులవిమర్శలతో ముద్రింపించిరి. 1904 సం. సెప్టెంబరు 1 తేదినాడు నెల్లూర, స్వర్గస్థులైరి. అముద్రిత గ్రంథచింతామణియు నిలిచిపోయినది.

ఆప్తమిత్రునిమరణము శాస్త్రులవారికి చాలహృదయావేదనకు కారణమైనది. కాలము గడువసాగినది. శాస్త్రులవారును ఐహికచింతలను మఱచుటకై గ్రంథపఠన రచనలలో మునిగిపోయిరి.


___________