వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/13-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

13-ప్రకరణము

ఆంధ్రభాషాభిమాని సమాజము

ఆంధ్రనాటకరంగమును అభివృద్ధికి దెచ్చుటకు అత్యుత్తమకృషిగావించినవారు మన శాస్త్రులవారే. శ్రీ శాస్త్రులవారి జీవితము భాషాసేవకే అర్పితము. అందొకభాగము మొదటి నుండియు భరత సూత్రానుసారులగు నాటకప్రయోగములకే ధారవోయబడినది. శాస్త్రులవారు దాదాపు ముప్పదిసంవత్సరములు సంస్కృతాంధ్రనాటకములను తమశిష్యులకు తాము స్వయముగానేర్పి ప్రదర్శింపించుచుండిరి. క్రిశ్చియన్కాలేజిలో ప్రవేశించిన కొలది దినములకే సంస్కృతాంధ్ర నాటకములను తమ విద్యార్థులచేత నాడింపించుటకు మొదలిడిరి. మదరాసులో సంస్కృతవిద్వాంసులు, సుప్రసిద్ధన్యాయవాదులును బహుగీర్వాణనాటకకర్తలును నైన శ్రీ టి.ఎస్. నారాయణశాస్త్రిగారి వంటి వారనేకులు మనశాస్త్రులవారి శిష్యులై ఈ నాటకములలో పాల్గొని పాత్రథారణ మొనర్చుచుండువారు. కాలేజిలో ప్రతి సంవత్సరాంతము ఆయాసంవత్సరము చదివిన నాటకమునాడుట ఆచారమై యుండెను.

ఇతరులచే ప్రదర్శింపించుట కసాధ్యమైన కష్టతరనాటకములను సయితము శాస్త్రులవారు జనరంజకములం గావించుచుండిరి. ఉత్తరరామ చరిత్రనాటకమును ఎల్లవారును ప్రదర్శనీయముకాదని వదలివేయుచుండిరి. దీనిని శాస్త్రులవారు ప్రదర్శింపించినారు. వారే తమ యుత్తరరామచరిత్రయొక్క యుపో ద్ఘాతమున నిట్లు వ్రాసియున్నారు. "ఈలోకోత్తరనాటకము శ్రవ్య ప్రబంధముగా రంజించునేగాని దృశ్యముగా రంజింపదని పాశ్చాత్య సంస్కృతపండితులును నూతనమతప్రియులగు నస్మదీయులే కతిపయులును పలికిరి. కాని ఇది దృశ్యముగా నత్యంత రంజకమగు నని ఆబాల్యము నాతలంపుగానుండెను మదరాసు కృస్టియన్కాలేజి సంస్కృత ప్రథాన పండితుడ నైనంతట బి.ఏ., పరీక్షకు ఉత్తరరామచరిత్ర పఠనీయము కాగా నాశిష్యులకుం బై మతభేదమును నామతమునుందెలిపి తదీయస్థాపనార్థము వారిచేత ఈనాటకమును మదరాసు పౌరసౌధములో ఆడించి, ఇది రంగమందు అత్యంతరంజకంబనియు, అతి శాకుంతలమనియు క్రిక్కిఱిసిన వేగురు రసికవిద్వజ్జనులకు ప్రత్యక్షముం గావించి నాడను. ఆప్రయోగముజరిగి ఇప్పటికి (1920 నాటికి) ముప్పది సంవత్సరములయినను ఆ శంబూకదివ్యపురుషుని నామస్తుత్యాది పద్యంబులు ఇప్పటికిని నావీనులలో అనురణనముం గావించుచునేయున్నవి. సితాదిసకలపాత్రములును వారివారి చర్యలును కన్నులయెదుర ఇప్పటికిని మెలగుచున్నవి. అనంతరము ఎన్ని నాటకములుచూచినను ఈవిధముగా డెందమును బందిగొన్నట్టిది లేదు." అని

శాస్త్రులవారి శిష్యకోటిలోనివారు కొందఱు నెల్లూర నొకసంఘముగా చేరి ఆంధ్రగీర్వాణ నాటకములను శాస్త్రుల వారికడనేర్చి ప్రదర్శింపదలంచియుండిరి. వారి యాయుద్దేశము నెఱింగి శ్రీయుత పూండ్ల రామకృష్ణయ్యగారును, శ్రీయుత గునుపాటి ఏనాదిరెడ్డిగారును, మఱికొందఱు నెల్లూరి పెద్దలును చేరి ఆంధ్రభాషాభిమాని సమాజమును 1899 సం. ప్రాంతమున స్థాపించిరి. పూండ్ల రామకృష్ణయ్యగా రొక కార్డులో వేంకటరాయశాస్త్రులవారి కిట్లువ్రాసిరి.

తే 1-5-99 నెల్లూరు.

ఆర్యా, నమస్కారములు.

సంఘము నిన్నటిదినమున నేర్పాటైనది. పదముగ్గురు వచ్చిరి. ఇంకను రాగల యాదిత్యవారమునకు మఱికొందఱు జేరగలరు. ఇపుడు పరగ్రామములకు బోయియున్నారు. "ఆంధ్రభాషాభిమాని సమాజము" అని పేరిడినారు.....

విధేయుడు
పూండ్ల రామకృష్ణయ్య
8-2-1900 నెల్లూరు.

ఆర్యా, నమస్కారములు

...ఉష నేమి చేసినారు. హనుమంతరావు రామానుజాచారి మొదలగువా రచ్చటికే వత్తురు శ్రీనివాసన్ మార్చినెలలో జేరును. అందఱును మీదృష్టిపథముననేయుందురు. బహుశ్రద్ధతోనున్నారు ......ఏనాదిరెడ్డికిని నొకజాబువ్రాసినాను.

పూ. రా.
నెల్లూరు. 22-5-1900

బ్రహ్మశ్రీ మహారాజశ్రీ వేదం వేంకటరాయశాస్త్రుల వారి సముఖమునకు పూండ్ల రామకృష్ణయ్య అనేకసాష్టాంగ నమస్కారములుచేసి చేయంగలవిన్నపములు-......ఇచట మననాటకసభవారు శాకుంతలమును యించుమించుగా పూర్తిచేసి యుషకు చూచుచున్నారు. రెండునాటకములు వేసినగాని ఖర్చులు కట్టిరావనియు నుష క్రొత్తదిగానుండుటచేత కొంత లోకరంజకముగా నుండుననియు వారి యభిప్రాయము ....... మీరు యెప్పుడు వత్తురో దానిని వ్రాయవలయును....

పూ.రా.

వేంకటరాయశాస్త్రులవారు సర్వధ్యక్షులుగా రామకృష్ణగారు ప్రారంభించిన యాంధ్రభాషాభిమాని సమాజము ఇరువది యైదేండ్లు చక్కగాజరిగినది. శాస్త్రులవారు సమాజమువారి ద్రవ్యవిషయమునందుమాత్రము ప్రవేశించువారు కారు. ఈసమాజమువారు శ్రీ శాస్త్రులవారి నాటకములందప్ప నితరాంధ్రనాటకములను ప్రదర్శింపరాదనియు, ఇతరుల నాటకములు నాటకములే కావనియు, శాస్త్రులవారికడ సంపూర్ణముగా శిక్షనొంది, ఒద్దికలుకుదిరినవని శాస్త్రులవారు తలంచువరకును నాటకములం బ్రయోగింపరాదనియు కట్టుదిట్టములతో సమాజమును జరుపసాగిరి.

శాస్త్రులవారును ప్రతిసంవత్సరమును వేసవికాలము సెలవులలో నెల్లూరికేగి తమశిష్యులకు తాము స్వయముగా నేర్పి ప్రదర్శింపించుచుండిరి.


___________