వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/10-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

10-ప్రకరణము

*[1]ఆంధ్రకవిపండితసంఘము - ప్రథమసమావేశము.

"ఏతన్నిర్మాత బళ్లారిడిస్ట్రిక్టు కోర్టుప్లీడరగు బ్ర.శ్రీ. ధర్మవరము రామకృష్ణమాచార్యులవారు. వారే ప్రథమ ద్వితీయ సంఘములందు కార్యదర్శి" ప్రథమసంఘము బళ్లారిలో 1897 సం. ఏప్రెలు నెలలో ఈస్టరు సెలవులలో జరిగెను. అప్పుడు శ్రీమాన్ రాయబహదర్ పనప్పాకము అనంతాచార్యులు, బి.ఎల్. గారు. అగ్రాసనాధిపతులు....... కృష్ణమాచార్యులవారు ఒకరొకరిని 'మీరీవిషయంబున ప్రధానోపన్యాసకులరయ్యెదరా' అనియు అట్లె సహాయ పోషకోపన్యాసములకు యథోచితముగ నడుగుచుండిరి. పలువురు విషయములం గ్రహించుచుండిరి. వేంకటరాయశాస్త్రులవారు ఏవిషయంబును కోరలేదు. కృష్ణమాచార్యులవారు వారిని ప్రధానోపన్యాసమున కడుగక ద్వితీయమునకు తృతీయమునకును అడుగుచుండిరి. కొక్కొండ వేంకటరత్నము పంతులవారిని మాత్రము ప్రధానోపన్యాసమునకే అడుగుచుండిరి. ఇట్లుండగా నగ్రాసనాధిపతిగారు కార్యదర్శియైన కృష్ణమాచార్యులవారిని 'మీరేల వేంకటరాయశాస్త్రిగారిని వదలివేయుచున్నారు.' అని హెచ్చరికచేసిరి. అంతట కృష్ణమాచార్యులవారు తత్కాలవిచార్యమాణమైన 5 వ విషయ మున వేంకటరాయశాస్త్రులవారిని సహాయోపన్యాసకులు గమ్మని యడిగిరి. శాస్త్రులవారు నిరాకరించిరి. 'అట్లైన మీరేమిచేయుదురు' అని కృష్ణమాచార్యులవారడిగిరి. '6 వ విషయము నాది' అని శాస్త్రులవారు చెప్పిరి. కృష్ణమాచార్యులవారు ఇంచుకంత సంశయించుచు నంగీకరించిరి. శాస్త్రులవా రా యొక యుపన్యాసముదక్క వేఱొకటి పూనుకొనలేదు. కడమ రెండు విషయములను ఇతరులు స్వీకరించిరి. పూర్వోక్త విషయాష్టకములో 5 వది వేంకటరత్నము పంతులవారిది. 'పండితులు గ్రామ్యమును భాషింపగూడదు; వ్రాయనుంగూడదు.' అనునది. వేంకటరాయశాస్త్రులవారిదైన యాఱవ విషయము 'కవులు నూతనమార్గమున గ్రంథములు రచించుట మంచిది' అనునది. మఱునాడు పూర్వాహ్ణమున నుపన్యాసములు ప్రారంభమైనవి. కాలము తెలియుటకై ప్రథానోపన్యాసకునికి 10 నిమిషములయి నంతట హెచ్చరిక గంటను, 15 కాగానే విరామఘంటను వాయించునట్లును, ద్వితీయునికి 5 నిమిషములయినంతట హెచ్చరిక గంటను 10 ని. లయినంతట విరామగంటను, తృతీయునికి విరామగంటను మాత్రమే వాయించునట్లును నియమమేర్పడెను..... కొన్ని కారణములచేత అపూర్వాహ్ణాంతము వేంకటరాయశాస్త్రులవారి 6 వ విషయంగూర్చి యుపన్యసించునట్లుగా అగ్రాసనాధిపతిగారుకోరిరి. శాస్త్రులవా రుపన్యాసమొనర్చిరి. పత్రికోపలేఖకులు, కడమవారి యుపన్యాసములందుంబోలె శాస్త్రులవారి యుపన్యాసము ననుగమింపనేరక లేఖినులను క్రిందవైచి సామాజికపదవి నవలంబించిరి. అగ్రాసనాధిపతిగారును కడమ సకలోపన్యాసములకును వాయించినట్లు శాస్త్రులవారి యుపన్యాసమునకు హెచ్చరిక గంటను వాయింపకయు, విరామగంటను వాయింపకయు శాస్త్రులవారికి కాలప్రమాణ నియమములందొలగించి, శాస్త్రులవారితో 'మీయుపన్యాసము నాపుట నాకిష్టములేదు.' అని నుడివిరి.

"రెండవపూట మరల నుపన్యాసము లారంభమయినవి. వెంకటరత్నము పంతులుగారి గ్రామ్యవిషయము మొదటిది. వా రుపన్యసించుచుండగ సామా జికులు అగ్రాసనాధిపతిగారిని వేంకటరాయశాస్త్రిగారిచే నావిషయంబున మఱల నుపన్యాసముసేయింపుడని ప్రార్థించిరి. తదనుసారముగా నగ్రాసనాధిపతిగారు కోరగా వేంకటరాయశాస్త్రులవారు కాలనిర్బంధములేక అగ్రామ్య విషయముననే ప్రసంగించిరి.

"'పంతులవారు చెప్పినట్లు ఎల్లవారితోను సర్వకాల సర్వాస్థలయందును వ్యాకృతభాషనే భాషింపసమకట్టిన వ్యవహార హానికలుగుననియు గ్రామ్యజనులతో వ్యవహరించునపుడు గ్రామ్యము, పండితులతో భాషించునపుడును వారికి వ్రాయునపుడును వ్యాకృతభాషయునని వ్యవస్థ యేర్పఱుచుకొనుట మంచిది.'

"అని శాస్త్రులవారి యుపన్యాససారాంశము. అట్లే ఆవిషయమంగీకృతమాయెను. కడమయుపన్యాసకులలో పూండ్ల రామకృష్ణయ్యగారిని మాత్రమే బళ్లారి సామాజికులు అగ్రాసనాధిపతి ముఖముగా పల్మాఱువేడి ప్రసంగింపించిరి. వారి వాగ్ఘరికి కడునలరిరి. అగ్రాసనాధిపతిగారు... పండితులు వేదము వేంకటరాయశాస్త్రులవారి వంటివారుగా నుండవలయుననియు నట్టివారు అరుదనియు వక్కాణించిరి.

"కృష్ణమాచార్యులవారు శకటరేఫ అర్ధానుస్వారములు భాషనుండి తొలగింపదగినవని యుద్దేశ్యమును వెల్లడిచేసినారు. వేంకటరాయ శాస్త్రులవారు నిషేధించినారు; కృష్ణమాచార్యులవారు నిషేధము నొప్పలేదు. అంతట శాస్త్రులవారు తమవంతుగా, 'థ,-,-శ,స-భేదము' వీనింగూడ ఆరెంటితో జేర్పుమనిరి. బహువర్ణ నాశోద్దేశమునకు సాహసింపక కృష్ణమాచార్యులవారు నిజోద్దేశ్యమును త్యజించిరి.

"కృష్ణమాచార్యులవా రుద్దేశించిన విషయములలో నిదియొకటి-యూనివర్సిటివారు మెట్రిక్యులేషన్ పరీక్షకు ఆధునిక కవుల గ్రంథములను పెట్టునపుడు ఆకవులకు పారితోషిక మిచ్చుట లేదట. అట్టివారికి పారితోషిక మీవలసినదని యూనివర్సిటివారికి ఈసంఘము వ్రాయవలసినదట. ఈ సభ వారట్టిపెత్తనము పెట్టుకొనుట అనుచితమని వేంకటరాయశాస్త్రులవారికితోచి, కృష్ణమాచార్యులవారిని "ఈరీతిని ప్రతారితులైన వారెవరు?' అని యడిగిరి. వడ్డాది సుబ్బారాయడుగారు' అని వారుత్తరమిడిరి. 'అట్లని సుబ్బారాయడుగా రీసంఘమునకు వ్రాసినారా?' అని మఱల ప్రశ్న, లేదనియుత్తరము. 'కావున మన మిందు ప్రవేశింపగూడదు. సుబ్బరాయని వారికి ఇచ్చియే యుందురు. లేదా వారికి న్యాయస్థానములున్నవి.' అని శాస్త్రులవారు నిషేధించిరి. కృష్ణమాచార్యులవారు ఆయుద్దేశ్యమును త్యజించిరి."


____________
  1. * కవిపండిత సంఘ చరిత్రతత్త్వము-అని యొక చిన్నపుస్తకమును తృతీయాంధ్రకవి పండిత సంఘసాంఘిక విజ్ఞాపనముగా శ్రీ శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రిగారు (కళావతీ సంపాదకులు నేడు మహామహోపాధ్యాయులు, కళాప్రపూర్ణులు,) కోవూరు సుబ్బరామయ్యగారు, గుండ్లపూడి సుబ్బయ్యగారు, సి. దొరసామయ్యగారు (సత్వసాధనీ పత్రి కాధిపతి) అను నలువురు 1899లో ముద్రించి ప్రకటించిరి. ఇందలి రచన కడుమనోహరముగా నున్నందునను ఈగ్రంథము ఇప్పుడు దొరకనందునను ఇది మరల అచ్చుకాదనుతలంపునున అందలిభాగములనే యిం దుదాహరించుచున్నాడను.