వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/11-ప్రకరణము

వికీసోర్స్ నుండి

11-ప్రకరణము

శారదాకాంచికలు - పూండ్ల రామకృష్ణయ్యగారి జాబులు

కవిపండిత సంఘ ప్రథమసమావేశము ప్రతాపరుద్రీయ ప్రకటనకుముందే జరిగినది. శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారు శాస్త్రులవారికి ఆప్తస్నేహితులై గ్రంథరచనకు పురికొల్పుచుండిరి. ప్రతాపరుద్రీయమును రచించుచు శాస్త్రులవారు నెల్లూరిలోను మదరాసునందును తమ మిత్రబృందమునడుమ చదువు చునుండిరి.

తే 10-7-1897 పూండ్ల రామకృష్ణయ్యగారు 'ప్రతాపరుద్రీయమును అచ్చునకిండు అది మీకు వెలగల యశస్సును సంపాదించుననుటకు సందియములేదు' అని వ్రాసినారు.

తే 6-11-1897 ది. ప్రతాప అచ్చైన యనంతరము, ప్రతాపరుద్రీయ నాటకముంజూచి బ్రహ్మానందముం జెందితిమి. నిన్నటి రాత్రి మా యిల్లంతయు దీని పఠనమువలన మన మిత్రబృందముచే నిండిపోయినది... ఈగ్రంథమునకు మిగుల ఖ్యాతి వచ్చుననుటకు సందియములేదు.' అని వ్రాసిరి.

11-11-97 నెల్లూరు

ఆర్యా,

నమస్కారములు. తాము దయతోననిచిన గ్రంథత్రయముచేరి మివుల సంతసించితిని. మీ యాజ్ఞానుసారముగ బుస్తకముల బుచ్చుకొంటిమి. తిక్కుబొక్కులవిషయమై మీరు వ్రాసినసంగతి వింతయైయున్నది. మీరు సాత్వికులు అందువలన నందఱు దమమీద గడుసుందన ముపయోగింతురు. దానిని మీరు మార్చినగాని యికను వలనుపడదు. మీగ్రంథమునకు బ్రాశస్త్యము త్వరలోవచ్చుననుటకు సందియములేదు. నేను నిచ్చట దానికి వ్యాప్తిగలుగునట్లుగ జదువుచున్నాను.........

పూండ్ల రామకృష్ణయ్య.
తే 19-11-97 నెల్లూరు

ఆర్యా,

నమస్కారములు. తాము మొన్నటిదినమున వ్రాసినకార్డు చేరినది. అంతకుముందే తే 17 దిననే శశిలేఖను నేనును మన మిత్రబృందమంతయు గని యలరితిమి ఎన్నిమారు వారి వ్యాసముంగనినను విషయముసున్న. ముం దేమియో చేయబోవునట్లు గన్పట్టు, వారిచే నేమియుగాదు. పండితు లీగ్రంథమును విమర్శింప నర్హులని వ్యాసమె యొప్పుకొనుచున్నది ఇది నాటకలక్షణమునకు వెలియైనట్లు వారనలేదు... ఇట్టి తాటాకు చప్పుళ్లను మీరు లక్ష్యము చేయకుడు. అందఱిని నమ్మకుడు మీకు నెక్కువ వ్రాయునంతటివాడను గానుగదా. ఎవరెన్ని పోకలపోయినను మన మేమిచేయవచ్చును. కాలము జరిగిన నొకందులకు మంచిది. అట్టివారి సంశయములకు సమాథానము వ్రాయవచ్చును.

విధేయుడు,
పూండ్ల రామకృష్ణయ్య.
తే 22-11-97 నెల్లురు.

ఆర్యా, నమస్కారములు

శశిలేఖలోనిదగు విమర్శనము ద్రావిడప్రాణాయామము గాని వేరుగాదు.....ఎట్లును వారియభిప్రాయము మన కనుకూలముగ రాదు దానియందేమో ద్యోతకమగుచున్నది. పూ.రా.

శారదా కాంచిక - ప్రథమకింకిణి

నాటిస్థితి యీజాబులచే కొంతతెలియుచున్నది. ఈచిన్న పుస్తకమున నింతకన్నను పెంచివ్రాయుటకులేదు. శాస్త్రులవారికి ఇక నొకటేమార్గము. తమ్ము దూషించువారిని నిరుత్తరులంజేయుటయే. అన్నివైపుల నందఱును తఱుముచుండిన నెంతకాల మొకప్రాణి యూరకుండును.

శాస్త్రిగారు, కొక్కొండము వేంకటరత్నము పంతుల వారి మిత్రకోటిలోచేరిన శ్రీరాయదుర్గము నరసయ్య శాస్త్రిగారును కొమాండూరు అనంతాచార్యులవారును పరిష్కరింపగా ఆనంద ముద్రణాలయమువారు ముద్రించిన, జక్కనవిరచిత విక్రమార్కచరిత్రమును విమర్శించి అముద్రితగ్రంథచింతామణ్యనుబంధముగా ప్రకటించిరి. తమ్ము నిరంతరము దూషించి వ్రాయువారిని వాకట్టుకొరకు ఆడంబరముగా తమ విమర్శకు శారదాకాంచికయనియు ఈలఘుగ్రంథము అందు ప్రథమకింకిణియనియు, ఇందుచే నింకను పెక్కు కింకిణులు (అనగా విమర్శలు) వెలువడనున్నట్లును ప్రకటించిరి.

ఈ విమర్శయొక్క యవతారికలో శాస్త్రులవా రిట్లు వ్రాసిరి"శ్రీమన్మదరాసు రాజథానియందు మ.రా.రా.శ్రీ, వేమూరు వేంకటకృష్ణమసెట్టిగారును తత్పుత్రులును ఆనంద ముద్రాక్షరశాల యనుపేర నొక యచ్చకూటమును స్థాపించి యున్నారు. వీరు ముఖ్యముగా ఆంధ్రప్రబంధముల నభిమానించి ముద్రించుచున్నారు. వీరియుద్యమ మేమనిన - ఈభాషయందు సద్గ్రంథములను లేఖకాది ప్రమాదజనిత దోషరహితముగా బండితులచే శోధింపించి ముద్రణసేసి లోకోపకార మొనర్పవలయునని, ఈయుద్యమమును నెఱవేర్చుటకై వీరు శోధన దాక్ష్యార్థము ఎంత ధనవ్యయమునకేని వెనుదివిసినవారు కారు. వీరి యీయుద్యమమునకు సంతసిల్లమి మూర్ఖత. వీరి యుద్యమము నెఱవేరి వీరికి కీర్తిగలుగు గావుత.

"ఇది సరియేగాని వీరికి గ్రంథములు శోధించుటకు వ్యుత్పన్నులు దొరకలేదు. కూలికిం జొరబడినవాడెల్ల బండితుండా? అచ్చుగూటపు మున్మానిసి కటాక్ష వీక్షణమునకు బాత్రమయిన మాత్రాన నొకడు పండితుడా? వీరికై తోడ్పడినవారికి తెలివిచాలమిచే వీరు ముద్రింపించిన గ్రంథములు సీతారామాచార్య పండితవర్య ద్విరేఫమాలికా బాలచంద్రోదయమాత్ర విజ్ఞేయములగు శకటరేఫార్థానుస్వారముల శోధనామాత్రమునం బరిడవిల్లుచు, కడమవిషయములం గుంటుపడుచు, వీరికి కీర్తికి బదులు ఆకీర్తిందెచ్చుచున్నవి. అచ్చు చక్కనిది, అట్ట గట్టిది, తప్పులు మెండు అని యీముద్రణగుణమును నాలుగు మాటల సంగ్రహింపవచ్చును..........

           "ఈ లఘువిమర్శనచే నీగ్రంథమున జక్కనకవి
        'ప్రతిపద్యము జోద్యముగా
        గృతిజెప్పిన నొప్పుగాక కృతి నొకపద్యం
        బతిమూడుడైన జిత్రత
        బ్రతిపాదింపడె ఘణాక్షరన్యాయమునన్‌'

అని ప్రతిజ్ఞచేసినట్లే ప్రతిపద్యరసాయనముగా నున్నదని చూపితిని. ఇట్టి యీగ్రంథమును ముద్రించుటకు ఈశోధకు లెంత యసమర్థులో అది తెల్లముంగావించితిని. జక్కన కవనరసముం గ్రోలువారికి కొంతదారి చూపితిని."

ఈగ్రంథ ముద్రణానంతరము ప్రతిపక్షుల యాక్షేపము లెక్కువయైనవి. ఈక్రింది జాబులంగనుడు.

2-7-98 నెల్లూరు

ఆర్యా, నమస్కారములు.

తామువ్రాసినకార్డు చేరినది. విషయముంగని ముదమందితిని. ఏనెట్లును మిమ్మేమియుజేయజాలరని దృడముగా నమ్ముడు. సుబ్బరాయనింగారి యభిప్రాయము సరసమైనది. పద్మనాభశాస్త్రి సంథానకృత్యమునకై వచ్చియుండును. సందీయకుడు. జ్యేష్ఠమాస సంజీవని వచ్చినది. దానిలోను పంతులుగా రొక కొన్ని పద్యములతో నేడ్చియున్నారు. అన్ని పద్యములును అన్యాపదేశముగావ్రాసి నిందించినారు. వానిలో మీకు దెలుగుభాషలో బాండిత్యములేదని సూచింపబడియున్నది. మీరు సంస్కృత పండితులేగాని యాంథ్రపండితులుగారట. ఆ సంజీవనింజూచిన నన్ని పద్యములును విశదములగును. జూలై యముద్రితగ్రంథచింతామణిం బంపినాను. చేరియేయుండును. దానిలో ముద్రణ విమర్శనమున్నది. వేంకటకృష్ణమసెట్టిగారు త్వరలోనే మీతో మాటలాడుదురని నాకు దోచుచున్నది.............

పూ. రా
తే 6-7-98 ది. నెల్లూరు.

ఆర్యా, నమస్కారములు.

తాము వ్రాసినజాబుంగని కడుముదమందితిని. మీకింక మంచికాలము రానున్నది. మీ శత్రుసమాజమంతయు మీకింక నైదుపది జేయును. విక్రమవిమర్శనమే యిందుకు సాక్షియై మీ పరాక్రమమును వ్యాపింపజేయుచున్నదిగదా. ఇక బ్రసన్నము ప్రసన్నమగుట యరుదా. త్వరలో వ్రాతకు నారంభింపుడు. ఎన్ని పుటలు వ్రాసినది యీసారికార్డులో వినగోరినాను. ఇట్లు వ్రాసినందులకు మన్నింపుడు........

పూ. రా.
తే 8-7-98 ది నెల్లూరు.

ఆర్యా, నమస్కారములు.

మొన్నటిరాత్రి ఆర్ వెంకటసుబ్బయ్యగారితో మాటలాడునపుడు వారు మిమ్ములను జులకనగా వాకొనుటయ గక.........

పూ. రా.
తే 15-8-98 నెల్లూరు.

ఆర్యా, నమస్కారములు.

తాము తే 13 ది వ్రాసినజాబు చూచితిని మీయిష్టానుసారముగ జేయుటకు నేయాక్షపణమును లేదు. శశిలేఖలోని నరసకవి వ్యాసముంజూచి నవ్వుచున్నారు......మీరు జంకవలదు వ్యాసమూర్తిగారికి మీరు వ్రాయవలదు. నేనేవ్రాయుచున్నాను....ఎట్లువచ్చునో చూతము. శశిలేఖలో వారివ్యాసమంతయు రానిండు. ఆవల బదులీయవచ్చును. ముందుగా మీరేమియు వ్రాయవలదు. మొదటిసంచికవలెనే యంతయు నుండును భయములేదు... ప్రసన్న రాఘవము మాత్రము మఱవకుడు. జంకకుడు. వెనుకంజవేయకుడు. మీకు జయకాలము వచ్చినది. సవ్యసాచిగా నిపుడుండవలెను.

ఇట్లు మీమిత్రుడు
పూండ్ల రామకృష్ణయ్య.
తే 15-10-98 నెల్లూరు.

ఆర్యా, నమస్కారములు.

భాద్రపద సంజీవనిలో బంతులవారు ప్రసన్న రాఘవ విమర్శనుగూర్చి వెక్కిరించియున్నారు. మఱియు బ్రతాపరుద్రీయముంగూర్చి వ్రాసియున్నారు. ఆపద్యములలో బ్రతాపరుద్ర యుగంధరవేషములూనినవారు చచ్చిరనియు నికనీనాటకము చెడినదని ఎగతాళిగ వ్రాసియున్నారు......

పూ. రా.
అంతట శాస్త్రులవారు శ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులవారి యాంధ్ర ప్రసన్న రాఘవ నాటకమును విమర్శించిరి.

శారదాకాంచిక - ద్వితీయకింకిణి.

వేంకటరాయశాస్త్రులవారు తమ విమర్శయొక్క అవతారికలో నిట్లువ్రాసినారు:-

"ఈకాలములో ఆంధ్రభాషలో ప్రబంధములు పెచ్చు పెరుగుచున్నవిగదా. వానిలో అనేకములవలన భాషకు కడుం జెట్ట గలుగుచుండుటంగాంచి, ఏదే నొకగ్రంథ మాథారముగా నీచెరుపునెల్ల విద్యార్థి జనోపయోగమునకై భాషారక్షకై వెల్లడిసేయ దలంపుగొన్నవాడనై అట్టి యిప్పటిగ్రంథములలోనెల్ల మ.రా.రా.శ్రీ, కొక్కొండ వేంకటరత్నము పంతులవారు రచియించిన యాంధ్ర ప్రసన్నరాఘవము నాయుద్యమమున కత్యంతోపయుక్తముగా నున్నందున దానిని విమర్శింప దొరకొంటిని. ఉపయోగబీజము నించుక వివరించెద.

"కతిపయపదములకు సజీవనిర్జీవసాధనములచే అర్థమెఱుంగుట గ్రంథార్థమెఱుంగుటగాదు. గ్రంథార్థములో అన్నిపదములయర్థము వాక్యములయర్థము కథాసందర్భము, రసంబునుంగూడజేరును. వీనినెల్ల మాని దానినిమాత్రము పూని చేసిన తెనిగింపునకు మూలగ్రంథ నామమిడుట సరిగాదు. ఈగ్రంథమందు భాషాంతరీకరణము ప్రాయికముగా తప్పుగానుండును. మూలమునకు ఇది మూలముగాను, దీనికిది టీకగాను ఉండును. కొన్నిచోట్ల నిది మూలమునకుంగూడ నభేద్యమయిన వజ్రకవచముందొడిగి కూర్చుండును........ ఛందో వ్యాకరణాలంకారముల కిదివేరుపురువు....రసము సున్న. పూర్వులు చెప్పిన పాకము లిందులేవు....కవనము-పెద్దయక్షరములవ్రాత కుదురకముందే వ్రాసిన జిలుగు గొలుసు ఎట్లుండునో అట్లున్నది. పాదపూరణము వలన పద్యార్థము ప్రాయికముగా నభేద్యత్వముం బొరసియుండును. పాదపూరణ ప్రయోగమందును, అదియేనియు చక్కగ చేతగామియందును, ఇంతటి కవి మఱిలేడు.... అలంకారశాస్త్రమున జెప్పినదోషములలో ఇందులేనిది లేదు. అందులేనివి ఇందెన్ని యేనిగలవు. తప్పుయతులు, తప్పుగణములు, తప్పుసంధులు, అద్యంతసమాసములు, సరసవస్తుత్యాగము, కొసవిసరులు, అంత్యాశ్చర్యములు, సముచ్చయములు, పౌనరుక్త్యము, ఉక్తానుక్తకావ్యదోషములు, ఇత్యాద్యుపాయము లెన్నియేనియుండియు వీరు పద్యము కుదరక పడినపాట్లు అనుశోచనీయముగా నున్నవి. గద్యమందుగూడ ఆంధ్ర భాషాస్వభావోల్లంఘనములు తెనుగున బనికిరాని సంస్కృత ఫక్కికలు గ్రంథమును చెఱిచినవి. వీరికి సంస్కృతమునందుగల లఘుపరిచయముతో ఇట్టి ప్రబంధముందెనిగింప సాహసించుట గొప్ప పొరబాటు. తెనిగింపులో వీరికి అర్థము చెడినను తెలిసినదిగాదు, రసముచెడినను తెలియలేదు. కథచెడినను తెలియలేదు. లోకస్వభావవిరోధమువచ్చినను తెలియ లేదు. విభక్తిజ్ఞానముకూడ చాలక పెక్కుతావులగ్రంథము చెడినది.....

"సావధానముగా తత్త్వమరయువారు వీరికి సంస్కృతము తెలియదనియు; దేవనాగరలిపి తెలియదనియు, నాటకలక్షణము తెలియనేతెలియదనియు, ఆంధ్రభాషకు వీరు విషముపెట్టినా రనియు, ఇతరులగ్రంథముల గుణదోషములను చర్చించుటకు వీరు అధికారులు గారనియు, వీరిమతముచే భాషచెడుచున్నదనియు గ్రహింతురు." అని శాస్త్రులవారు నిరూపించిరి.

ఈవిధముగా శాస్త్రులవారు విమర్శలకుం బ్రారంభించి తమగ్రంథములనేగాక తమ్ము వ్యక్తిపరముగా పత్రికలలో నేమి, మిత్రుల సమక్షముననేమి, సందుదొరకినపుడంతయు దూషించు చుండిన కొక్కొండ వేంకటరత్నము పంతులవారిని వారిశిష్యులను నిరుత్తరులంజేయువారై గ్రంథములను ప్రకటింప నారంభించిరి.

ఈగ్రంథముంజూచి శ్రీశ్రీశ్రీ విక్రమదేవవర్మ మహారాజుగారు తమయభిప్రాయము నిట్లుతెలిపిరి-"ఆంధ్రపసన్న రాఘవ విమర్శనము పఠించినాడను అది కవికల్పద్రుమమనియు, నీషత్పరుషవచన సహితమయినను నిష్పక్షపాతబుద్ధితో జక్కగ బరిశీలించి వ్రాయబడినదనియు, నట్టిపొత్తమును వ్రాయను సామాన్యపండితుల కలవిగాదనియు, నాయభిప్రాయము." అని శాస్త్రులవారు ఇంతపరుషముగా వ్రాసినందులకు కారణములను తెలుపుటకే ఇంతవిస్తరముగా వ్రాయవలసివచ్చినది. 'శాస్త్రులవారూ! న్యాయమా యింతపరుషముగా పంతులవారిని తిట్టడము?' అని గిడుగు రామమూర్తిపంతులవారు తమ 'భాషాభేషజము'లో ప్రకటించినారు. న్యాయమే. ఆకాలపు పరిస్థితుల నెఱిగినవారికి తెలియును.


___________