వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/9-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

9-ప్రకరణము

సమకాలికపండితులు - నాటి పత్రికలు

ఆంధ్రవాఙ్మయము ఆంగ్ల విద్యాసంపర్కముచేత క్రొత్తపోకడల బోవుచుండిన యీకాలమున పలువురు పండితులును కవులును తమ నూతన రచనలచే నాంధ్రవాగ్దేవిని సేవించుచుండిరి. ఆంధ్రనగరమైన మదరాసునగరము ఆంధ్రభాషకు కేంద్రస్థానమైనది. నెల్లూరినుండి పుదూరుద్రావిడ బ్రాహ్మణులు మదరాసుప్రవేశించి అచ్చాపీసులను స్థాపించి సంస్కృతాంధ్ర గ్రంథములను ముద్రింప నారంభించిరి. శ్రీ చిన్నయ సూరిగారు 1862 సం. మున నిర్యాణము జెందగా వారి శిష్యులైన శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులవారు, తమ గురువుగారు ప్రారంభించిన గొప్పనిఘంటు నిర్మాణపద్ధతి అసాధ్యమని తలంచి ఒకపాటివిధమున శబ్దరత్నాకరమను నిఘంటువును 1885 లో ప్రకటించిరి. వావిలాల వాసుదేవశాస్త్రులు మున్నగువారు సంస్కృత నాటకములను తెనుగునకు అనువదింప మొదలిడిరి. శ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులవారు, వీరేశలింగము పంతులవారు, ధర్మవరము రామకృష్ణమాచార్యులవారు ఇంక ననేకులు వేంకటరాయశాస్త్రులవారికి సమకాలికులై ప్రబంధములను గద్యగ్రంథములను నాటకములను వ్రాయుచుండిరి. వీరేశలింగము పంతులవారును గురుజాడ శ్రీ రామమూర్తి పంతులవారును ఆంధ్రకవి జీవితములను వ్రాయు చుండిరి. ఇయ్యది చాలసంగ్రహముగా శాస్త్రులవారి సమకాలి కాంధ్రభాషాస్థితి.

వేంకటరాయశాస్త్రులవారు నాగానందమును ప్రకటించి ప్రతాపరుద్రీయమును ప్రకటించుటకు నడుమ జరిగిన భాషా వివాదములే శాస్త్రులవారి ప్రతాపరుద్రీయ నాటకరచనా దీక్షకు కారణమైనటుల తలంచవలసియున్నది. ప్రతాపము వారి హృదయమున చిరకాలమునకు పూర్వమే అంకురించినను పక్వమై వెలయుటకు ఇంతకాలము పట్టెను. ఈలోపల నాంధ్ర దేశమందు పండిత కవులు పరస్పర వైషమ్యములచే వ్రాసికొన్న వ్రాతలచే ఆంధ్రకవి పండితసంఘ మేర్పడి వేంకటరాయశాస్త్రుల వారిచే తుదముట్టెను. ఈవిషయములు శాస్త్రులవారి జీవితమున ప్రధానస్థానము నందుటచేతను, శాస్త్రులవారు వాఙ్మయ సమరమున పోరాడిన యోధుడగుటచేతను. ఈ చరిత్రనంతయు వదలుట భావ్యముగాదు.

ఈకాలమున నాంధ్ర దేశమున భాషావిమర్శకాదులకు పూనుకొని సూర్యాలోకము, ఆంధ్రభాషా సంజీవని, అముద్రిత గ్రంథచింతామణి, శశిలేఖ, వివేకవర్ధని, కలావతి మున్నగు పెక్కుపత్రికలు తీవ్రవిమర్శలు సలుపుచుండినవి. సూర్యాలోకమును, జి.సి.వి. శ్రీనివాసాచార్యులవారు మదరాసునుండి ప్రచురించుచుండిరి. ఇందు విద్యావిషయములేగాక లోక వృత్తాంతముకూడ ప్రకటింప బడుచుండెను. ఆంధ్రభాషాసంజీవని పత్రికను శ్రీ మహామహోపాథ్యాయులు కొక్కొండ వేంకటరత్నము పంతులవారు మదరాసునుండి జరుపుచుండిరి. వీరు మదరాసు ప్రెసిడెన్సీకాలేజిలో నాంధ్రపండితులేగాక ఆంధ్రవిద్యాపారంగతు లని ప్రసిద్ధి వహించియుండిరి. బహునాటక కర్తలైన శ్రీ ధర్మవరము రామకృష్ణమాచార్యులవారి వంటివా రనేకులు వీరి శిష్యవర్గములో నుండిరి. అముద్రిత గ్రంథచింతామణి యను పత్రికను శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారు నెల్లూరినుండి ప్రకటించుచుండిరి. వీరు 1860 సం. జూలై 4 తేది, నెల్లూర, దువ్వూరను గ్రామమున ఆఱువేల నియొగిబ్రాహ్మణ కుటుంబమున జనించి సంస్కృతాంధ్రములందు చక్కని జ్ఞానము సంపాదించుటయేగాక మంచిలాక్షణికులనియు, విమర్శకులనియు ప్రసిద్ధివడసిరి. 1885 సం. మున వీరును ఒడయారు వీరనాగయ్యగా రనువారుకలసి యీ పత్రికను, శ్రీ వేంకటగిరి మహారాజా, కీ.శే.శ్రీ రాజగోపాలకృష్ణయా చేంద్ర బహద్దరు వారిపోషణలో, ప్రారంభించి, 1888 సం. వరకు జరిపిన యనంతరము సహాయసంపాదకులైన వీరనాగయ్య గారు మానుకొనగా తామొక్కరే తమనిర్యాణపర్యంతము 1904 సం. వరకు జయప్రదముగా జరిపిరి. పూర్వకావ్యముల నెన్నింటినో పరిష్కరించి ముద్రించిరి. శశిలేఖయను పత్రికను మదరాసునుండి శ్రీ గట్టుపల్లి శేషాచార్యులవారు శ్రి నేలటూరి పార్థసారథి అయ్యంగారు మొదలైనవారి తోడ్పాటున ముద్రించుచుండిరి. శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులవారు వివేక వర్థనిని రాజమహేంద్రవరమునుండి జరుపుచుండిరి. కలావతి పత్రిక శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి సంపాదకత్వమున రాజమహేంద్రవరము నుండి వెలువడుచుండెను.

ఇక్కాలమున శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారికిని శ్రీ కొక్కొండ వేంకటరత్మము పంతులవారికిని బిల్వేశ్వరీయమను గ్రంథము విషయమై వివాద మేర్పడినది దీనింగూర్చి శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారే ప్రకటించిన వ్యాసమునుండి కొంత యుదాహరించుట మంచిది:-

  • "శ్రీ బిల్వేశ్వరీయకృతి విమర్శనముంగుఱించి- ఈసంవత్సరము మార్చినెల మొదలుగ మేము విమర్శించుచున్న శ్రీ బిల్వేశ్వరీయముంగూర్చి వివిథాభిప్రాయము లితరులచే బ్రకటింపబడినవి. వానికిం బ్రత్యుత్తరముగ నియ్యుపన్యాసముం బ్రకటించుచున్నారము:-

బ్రహ్మశ్రీ, మహారాజశ్రీ శ్రీమత్కొక్కొండ వేంకటరత్నము పంతులవారు సంస్కృతాంధ్రములయం దసమానపాండిత్యముగల వారనుట జగద్విదితమైన యంశము. అట్టి పండితునిచే విరచింపబడిన గ్రంథమును విమర్శించుట పండితులకు విధియైయున్నది. శ్రీ పంతులవారే తమ గ్రంథమును విమర్శనార్థమై 18-9-93 న, మా కార్యస్థానమునకు బంపియున్నారు. గ్రంథమును సాంతముగ జదువగా గుణములతో బాటు గొన్నిదోషము లగపడి నందున మావిమర్శనయంతయు ఒకగ్రంథముగ వ్రాసి ప్రక

_____________________________________________________

  • అముద్రిత గ్రంథచింతామణి సం. 7 సంచి. 12. టించుటకు ముందుగ బంతులవారి యభిప్రాయముం దెలిసికొనిన మేలనియెంచి యీ ఫిబ్రవరినెల 4, 5 తేదులలో జెన్నపురికింబోయి వారికి మావిమర్శన గ్రంథమునంతయుం జూపితిమి. పంతులవారు మావిమర్శనముం గనుంగొని యే కారణముననో మీపత్రికం బ్రకటించినచో దీనికిం బ్రత్యుత్తరమిచ్చెద నని యుత్తరమిచ్చిరి. ఇయ్యుదంతమంతయు మహారాజశ్రీ పనప్పాకము శ్రీనివాసాచార్యులతో విన్నవించితిమి. పంతులవారు చెప్పినచొప్పున జేయుడని శ్రీనివాసాచార్యులవారును మాతో మందలించిరి. మేము మాస్వస్థలముం చేరినతర్వాత, 1894 సం. మార్చినెల పత్రిక ముద్రింపించుచుండగా శ్రీ పంతులవారు చెన్నపురినుండి మాకు నొక జాబువ్రాసిరి. [...ఇట జాబు ఉదాహరింప బడినది.] మా మార్చినెల పత్రిక యప్పటికే ముద్రితమై యుండినందున గాలము మిగిలినదని బదులులిడితిమి. (ఈ పద్యములలోపములను మేము పంతులవారికిం దెల్పినారము. మార్చి సంచికంజూచిన విస్పష్టమగును.) తాము వ్రాసిన పద్యముల బ్రకటింపలేదను కోపముతో మార్చినెల పత్రికయందలి మాయాక్షేపణలకు బ్రత్యుత్తరము లిచ్చుచు శ్రీ సిద్ధాంతి శివశంకరశాస్త్రులవారు వ్రాసినట్లుగ గొన్ని పద్యములువ్రాసి మమ్మునిందించిరి. ఆపద్యముల మేనెల సంచికలో బ్రకటించుచున్నారము, ఇందువలన బ్రప్రథమమున గచ్చకు గాలుద్రవ్వినవారే రైనది విజ్ఞు లెఱుంగుదురుగాత. ఆవల సంకులసమరము సమకూడినది. ఎవరిశక్తి కొలది వారు పోరాడిరిగదా. ఈవాగ్రణము భాషోపయోగమైన విషయముగాన మేమును మోమోటమిలేక వాగ్జన్యము గావించితిమి. అర్థరథు లతిరథులు మహారథులందఱు మాపక్ష మవలంబించిరి. కొన్నిప్రయోగము లుపసంహారములైనను మాకుజయమనుటకు సందియములేదు. పండితు లనేకులు మావాదమున కనుమోదకులగుటయే యిందుకు నిదర్శనము. అయిన నింతమాత్రమున మేము విఱ్ఱవీగువారముగాము. 'ప్రమాదోధీమతామపి' అని యున్నది గదా...... నిందింపం గడంగిరిగదా... ఇది యటుండనిండు. ఇప్పటికిని శ్రీ పంతులవారియందుం గడు గౌరవము మాకు గలిగియేయున్నది..."

ఇది యా వాదచరిత్రసంగ్రహము. దీనిని సమగ్రముగా నెఱుంగగోరువారు అముద్రితగ్రంథచింతామణినుండి గ్రహింపవలసినదేగాని ఈ లఘుగ్రంథమున హెచ్చుగావ్రాయ నవకాశములేదు.

ఇంతవరకును వేదము వేంకటరాయశాస్త్రులవారు విమర్శనలంగావించి ఎవరిహృదయములంగాని నొప్పించియుండలేదు. పైవాదముల సందర్భమున శ్రీ రామకృష్ణయ్యగారు పండితాభిప్రాయములను సేకరించువారై వేంకటరాయశాస్త్రులవారి యభిప్రాయముం గోరగా శాస్త్రులవారు కొన్నిజాబులు వ్రాసిరి. వానిని రామకృష్ణయ్యగారు తమ పత్రికయందు ప్రకటించిరి.

  • "వబలకు ప్రాసముగలదని శ్రీ పంతులవా రిదివఱకు నేపద్యము నుదాహరించుచుండిరో యాపద్యంబున దమపడిన యభిప్రాయము బొరపాటని దానిని సంస్కరించిన బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారి యుపన్యాసమును సన్నుతించి యొప్పుకొన్నారు." ఇంతమాత్రమేగాదు, +"వేంకటరాయశాస్త్రులవారి 'ప్రక్రియాఛందస్సు' అను నొక గ్రంథముపై, బంతులవారీవిధముగ వ్రాసినారు. ఎట్లన 'ఈ పుస్తకము రూపున గడుచిన్నదైనను గుణాతిశయములచే బెద్దదనియే యెన్నదగియున్నది." అని, తర్వాతతర్వాత శాస్త్రులవారి జాబులను పూండ్ల రామకృష్ణయ్యగారు విశేషముగా ప్రకటింప నారంభించిరి. ఆంధ్ర భాషాసంజీవని యందు ఆసూరి శ్రీనివాసాచార్యులు లోనగువారు ముద్రింపించుకొన్న యుత్తరములకు శాస్త్రులవారు అముద్రిత గ్రంథచింతామణియందు ప్రత్యుత్తరమొసంగిరి. #ఇందులకు ఆసూరి శ్రీనివాసాచార్యులచే వేంకటరత్నము పంతులవారు మరల జబాబిప్పించిరి. ఇందు దూషణవాక్యములు ప్రయోగింపబడినవి. కాని వేంకటరాయశాస్త్రులవారు బదులు దూషింపక ఇట్లువ్రాసిరి. "అముద్రిత గ్రంథచింతామణియందు గడచిన యేప్రెలు, మే-సంచికలలో నాప్రకటించిన కొన్ని సవరణలనుగూర్చి చర్చించుచు గ్రొత్తగా గొన్ని యుదాహరణములంజూపి వానింగూర్చి నన్ను బ్రశ్నలువేయునవై వైశాఖ

______________________________________________________________________

  • అముద్రి-గ్రం-చిం. సం.7. సంచి.12

+అదే. సం.8. సంచి.1. పుట 19.

  1. అదే. సం.8. సం 4. జ్యేష్ఠమాసముల యాంధ్ర భాషా సంజీవనీ సంచికలయందు మూడుజాబులు ప్రకటింపబడినవి ఆజాబులలో వ్రాయబడిన తిరస్కారమునకును ఛలాపలాపములకును, ప్రకటితపూర్వము లయిన నాజాబులలోనే పూర్ణముగా దత్తోత్తరములయ్యును మరల నడుగబడిన యాక్షేపములకునుమాని విద్వద్వరేణ్యుల చిత్తమువడయవేడి సుప్రసక్తములయిన విషయములకు మాత్రమే నానేర్చినకైవడి సమాథానములు వ్రాసెదను. ఇందలి గుణదోషనిర్ణయమునకై విద్యానికషపాషాణములయిన విద్వద్వరేణ్యులే ప్రమాణము"*

ఇప్పటికి వేంకటరాయశాస్త్రులవారు ఎవరికిని ద్వేష్యులై యుండలేదు. పూర్వము వీరేశలింగము పంతులవారి వితంతువాదముల కెదురువాదములు సల్పినప్పుడు శాస్త్రులవారి పాండిత్యము లోకమునకు విదితమాయెను. వారిరువురకును అభిప్రాయభేద మేర్పడినదేగాని దూషణగ్రంథములవఱకును పోలేదు. కాని వేంకటరత్నము పంతులవారుమాత్రము, తమగ్రంథముల యందలి దోషములను వెల్లడిచేసిన పూండ్ల రామకృష్ణయ్యగారి యాక్షేపములు సాధువులని వ్రాసినందున వేంకటరాయశాస్త్రులవారిని వారి పాత్రోచితభాషను ద్వేషింప నారంభించిరి; దూషించి వ్రాయసాగిరి. కాని వేంకటరాయశాస్త్రులవారు బదులుదూషింపక సవిమర్శకములైన సమాథానములవ్రాసిరి.

____________
  • అముద్రిత. సం. 8. సంచి. 10