Jump to content

వృక్షశాస్త్రము/మామిడి కుటుంబము

వికీసోర్స్ నుండి

మామిడి కుటుంబము


మామిడిచెట్టు మనదేశమునం దంతటను బెరుగు ముఖ్యమౌ వృక్షములలో నొకటి. ఈచెట్లలో జాలరకములు గలవు. మ్రాను, ఎత్తుగను లావుగను బెరుగును. అడుగున నున్న కొమ్మలు అడ్డముగ వ్యాపించును. బెరడు కొంచెము నల్లగానుండును.

మామిడిపువ్వు పెద్దదిగా జూపబడినది.


ఆకులు:- ఒంటరి చేరిక. లఘుపత్రములు. కణుపు పుచ్చములు లేవు. బల్లెపాకారము, కొన్ని సమగోళాకారము, కొన్ని, అండాకారముగ గూడ కలవు. బిరుసుగాను, నున్నగాను నుండును. సమాంచలము, కొన సన్నము, కొన్నిటిలో గుండ్రముగను, కొన్నిటి యందు నాలమును గలదు.

పుష్పమంజరి:- కొమ్మల చివరనుండి రెమ్మగెలలు. పువ్వులు చిన్నవి. కొంచెము పచ్చగను గొంచెము ఎరుపు రంగుగను నుండును. మిధున పుష్పలును, ఏక లింగ పుష్పములును గలవు. పుష్పకోశము:- రక్షక పత్రములు 5. నిడివి చౌకపాకారము నీచము.

దళవలయము:- అయిదు ఆకర్షణపత్రములు. బల్లెపాకారము. రక్షక పత్రముల కంటె రెట్టింపు పొడగుండును. వీని మీద నెర్రని చారలు గలవు.

కింజల్కములు:- అయిదు. ఒక పళ్ళెరము మీద నున్నవి. వీనిలో నొకటి యెక్కువ పొడుగగ నున్నది. దీనికే పుప్పొడి తిత్తి గలదు. మిగిలినవి గొడ్డు కింజల్కములు.

అండకోశము:- అండాశయము, ఉచ్చము, ఒక గది. కీలము ఒకటి. ఇది అండాశయము యొక్క యొక ప్రక్కనుండి వచ్చు చున్నది. కీలాగ్రము కొంచెము వంగి యుండును. ఫలములో పెంకు కాయ.

పురుషపుష్పము:- ఇందు అండ కోశము లేదు. ఉన్నను గొడ్డయి యున్నది.

ఈ కుటుంబపు చెట్ల యందు గొంచెము జిగురుగానుండు రసము గలదు. ఆకులు ఒంటరి చేరిక. కణుపు పుచ్చము లుండవు. సాధారణముగ నన్నియు లఘు పత్రములు. ఇవి బిరుసుగా నుండును. పువ్వులు చిన్నవి. సరాళము. ఏక లింగ పుష్పములు. మిధున పుష్పములు గలవు. అండాశయము చుట్టును గ్రంధి కణములు గల పళ్ళెరము గలదు. దీని చుట్టును ఆకర్షణపత్రములన్ని కింజల్కము లుండును. ఫలము సాధరణముగ లోపెంకు కాయ.

మామిడితోటలను మన దేశమునం దంతటను బెంచు చున్నారు. వానిలో జాల రకములు వచ్చినవి. ఏరకమయినను టెంకనుండి మొలచును గాని యా మొలచిన చెట్టు పండ్లు మంచివి కాక పోవచ్చును. మంచి టెంకల నుండి చెడ్డ చెట్లును, తక్కువ రకము టెంకల నుండి మంచి చెట్లును గూడ వచ్చుట గలదు. కావున మంచి రకము వచ్చునని రూఢము చేసికొనుటకై అంటు గట్టెదరు. టెంకలను బాతి ఆ చిన్న మొక్క లేడాది ఎదిగిన పిమ్మట వర్షాకాలము నందు నంటు గట్టెదరు. ఈ అంటులను వర్ష కాలములోనే దూర దూరముగ బాతుట మంచిది. అందులకు ఇరువది యడుగుల దూరమున మూడేసి యడుగుల వెడల్పున గోతులు దీసి ఎరువు వేసి మొక్కలు పాతుదురు. ఆరునెలల వరకు వానికి నీడ యుండ వలయును. ఆమధ్య ప్రదేశములందు నేదయిన పైరు జల్లినను జల్లవచ్చును. అయిదేండ్లలో దోట కాపునకు రాగలదు. ఇంత వరకును అప్పుడప్పుడు నీరు పోయు చుండ వలెను.

మామిడిపండ్ల రుచియు, కాయల యూరుగాయలను, అందరము ఎరిగినదే. మామిడి కలప గట్టిగా నుండును. తలుపులు, ద్వార బంధములు, తొట్టి పడవలు గూడ జేయుదురు. నల్లమందు, నీలి మందు, తేయాకును బెట్టుటకు బెట్టెలను

నల్లజీడి.


ఆకును ఉబ్బసము దగ్గునకును కొన్నిచర్మవ్యాధులకును సుఖ రోగములకును బనికి వచ్చును. గింజలు నొక్కి ఆరసము రాయుదురు. సూదితోనైనను సన్నని పుల్లతో నైనను గీయ వలేను. అంత మేరయు రసము పూయ రాదు. పొక్కెక్కిన యెడల దానిని పొడిచి చీము కారనిచ్చి పిండి కట్టుట మంచిది. ఈ గింజలతో మందు చేసి లోపలకు కూడ నిత్తురు. కొందరు గింజలను బేడతో గలిపి కాచి నీళ్ళతో గడిగి లోపల కిచ్చెదరు. గాని ఇది మంచి పద్ధతి గాదు. ఈ జీడి గింజలను గల్వములో నూరుచు జీడి మామిడి గింజల పప్పును గలుపుచు దేనెను వేయుచు నూరి తగు మోతాదులుగ లోపలికిత్తురు.

గింజల రసము బట్టల కానవాళ్ళు వేయుటకు బనికి వచ్చును. కొన్ని చోట్ల బట్టలకు రంగు వేయుటలో కూడ దీనిని వాడు చున్నారు. ఈ చెట్లను గీయుట వలన నొక రసము వచ్చును. ఈ రసము వార్నీషు లలో ఉపయోగించెదరు.

కాకరశింగు:- చెట్లు హిమాలయా పర్వత ప్రాంతముల మొలచు చున్నవి. ఈ చెట్లపై పొక్కులు, పొక్కులు వంటివి గలుగు చుండును. వీని నౌషదములలో వాడుదురు. కొన్ని చోట్ల రంగు వేయుటలోని వీని నుపయోగించు చున్నారు.

బడ్డిచెట్టు నుండి జిగురు వచ్చును. ఈ జిగురును బెరడును మందులం దుపయోగించుదురు. బెరడుతో గాచిన కషాయము నోటి పూతకును చిగురు జబ్బులకును బని చేయును.

ఇవురుమామిడి:- చెట్టు చాల పెద్దదై యున్నప్పు దొక్కొక్కప్పుడు జిగురు కార్చు చుండును. జిగురు అంతయు మాను మొదట క్రింద పడి యుండును. ఈ జిగురును లేత కాయలను గూడ ఔషధములలో వాడుదురు. ఇవి అజీర్ణమునకు మంచి పని చేయును.


ములగ కుటుంబము.


ఈకుటుంబము చిన్నది. ఈ చెట్ల దారువు గట్టిగా నుండదు. ఆకులు ఒంటరి చేరిక, మిశ్రమ పత్రములు. పక్ష వైఖారి. చిట్టి యాకులొక దానై కొకటి ఎదురెదురు గానుండును. సమాచలము. వీని మొదట గ్రంధి కోశములు గలవు. పుష్పమంజరి కణుపు నందుల నుండి రెమ్మ గెలలు, పుష్పములు అసరాళములు, ఏక లింగ పుష్పములు, పుష్ప కోశము సంయుక్తము ఒక గిన్నె వలెనున్నది. 5 దంతములు, దీనికిని రంగు గలదు. ఆకర్షణ పత్రములు అన్నియు సమముగా లేవు. 5 కింజల్కములు, పుప్పొడి తిత్తుల క్కొక్కటియే గది. గొడ్డు కింజల్కములు గూడ గలవు. పుష్ప కోశము నంతి పళ్ళెరము కూడ గలదు. అండాశయము ఒక గది. అండములు రెండు వరుసలుగా నున్నవి. గింజల పొర (బహర్త్వక్కు) రెక్కల వలె వెడల్పుగానున్నది. కీలాగ్రము మీద రంధ్రములు గలవు.

ములగచెట్టు:- జాలచోట్లనే పెంచుచున్నారు. దీని నుండి మంచి జిగురు వచ్చును. అది మొదట, తెల్లగనే నుండును గాని క్రమ క్రమముగా నెర్రబడును. గింజలనుండి పరిశుభ్రమగు నూనె వచ్చును. దీనిని మరలకు రాయుటకు వాడుదురు. కాని మన దేశములో నెందు చేతనోగాని నూనె తీయుట లేదు. ఈ నూనెకు సువాసనలను బీల్చి, వానిని పోకుండ నుంచుకొను గుణము గలదు. కావున వట్టి నూనెలు చేయుటలో దీనినిగూడ వాడుదురు. కొందరు ములక కాడలనే గాక పువ్వులను, ఆకులను కూడ కూర వండుకొనెదరు.

మధుశిగ్రువము:- ఒకరకము ములగ చెట్టు దీని పువ్వులెర్రగా నుండును.