Jump to content

వీరభద్ర విజయము/శంకరుండు దక్షునకు శాపం బిచ్చుట

వికీసోర్స్ నుండి

శంకరుండు దక్షునకు శాపం బిచ్చుట

[మార్చు]

163-సీ.
కైలాసగిరిమీఁద కఱకంఠుఁ డొకనాఁడు: కర మొప్పఁ గొలువుండి గౌరిఁ దలఁచి
యిది యేమి రాదయ్యె నీ యేణలోచన: యని యవ్విధం బెల్ల నాత్మ నెఱిఁగి
సుందరి తనకుఁ గూర్చుట యెల్ల భావించి: శంభుండు మనమునఁ జాల నొచ్చి
“యిది యేమి పంపితి నీ దక్షు నింటికి: మీనాక్షి తా నేల మేను వాసె
ఆ. పొలఁతి నిన్న నేను బొ మ్మని తరిమినఁ
బోవ నొల్ల ననియెఁ బువ్వుఁబోఁడి
పంకజాక్షి నొంటిఁ బంపిన కతమున
వెఱ్ఱితనము వచ్చె వేయు నేల"
164-వ.
అని మఱిఁయుఁ బరమేశ్వరుండు గౌరీదేవి ననంత కరుణాపూరిత మానసుం డై తలంచి వెండియుఁ దన మనంబున.
165-మ.
“పుడమిన్ రాజ్యముఁ గోలుపోయి తగ నేడ్పుం బొంది శోకించు న
జ్జడధీశాంతకుఁ డైన యింద్రుని కిలన్ జన్మించి రోషాంబుధిం
బడ వైవస్వతమన్వు నాఁడు ముదమొప్పన్ రాజ్యముం జేయఁగాఁ
గడతేర్తు” న్నని పాప దక్షునకు వేగన్ శాప మిచ్చెన్ వడిన్.
166-వ.
ఇట్లు పరమేశ్వరుండు శాపం బిచ్చిన దక్షుండు దదీయ ప్రకారంబు నొందె నంత.