Jump to content

వీరభద్ర విజయము/దాక్షాయణి దక్షు నింటి కరుగుట

వికీసోర్స్ నుండి

దాక్షాయణి దక్షు నింటి కరుగుట

[మార్చు]

123-చ.
అని నియమించి శంభుఁడు గణాధిపులన్ బిలిపించి “దక్షునం
దన తన పుట్టినింటికిని ధన్యత జన్నము జూడఁబోయెడిన్
దినకరమండలప్రభల దివ్యవిమానముఁ దెండు రండు పొం”
డనవుడు వారు దెచ్చి రతి హాటకదివ్యవిమానరాజమున్.
124-వ.
అంత నప్పరమేశ్వరియు నమ్మహాదేవునకు వినయ భృతాంతఃరకణ యై సాష్టాంగ దండప్రణామంబు లాచరించి య మ్మహాదేవు ననేక ప్రకారంబుల నుతియించి య ద్దేవు ననుమతంబున నానాసహస్రకోటి తరణికిరణ ప్రభోజ్జ్వలంబై నభోభాగంబు విడంబించు సువర్ణాంచితం బగు దివ్యవిమానంబుఁ బ్రవేశించి యందు సుందర రత్నాంచితాస నాసీన యై యుండు నవసరంబున.
125-సీ
వీణియ నీవు దే వీణాసుభాషిణి!: మృగనాభి నీవు దే మృగనిభాక్షి!
రాజహంసికఁ దెమ్ము రాజహంసికయాన!: కీరంబు నీవు దే కీరవాణి!
మణిహారములు దెమ్ము మణిగణాలంకృత!: పువ్వులు నీవు దే పువ్వుఁబోడి!
గంధంబు నీవు దే గంధసింధురయాన!: కనకంబు నీవు దే కనకవర్ణ!
ఆ. పొలఁతి యాడు పసిఁడి బొమ్మలు నీవు దే
పసిడిబొమ్మఁబోలుపడఁతి! మఱియు
వలయునట్టి పెక్కు వస్తువులెల్లను
జిక్కకుండఁ దెండు చెలువ లెల్ల.
126-వ.
ఇవ్విధంబున న మ్మహాదేవి చెలికత్తెలు మొత్తంబులై తమలో బహు ప్రకారంబులఁ బను లేర్పఱిచికొని ప్రమథగణసుందరీ సమేతంబుగా గజకర్ణ లంబోదర సూర్యవర్ణ సోమవర్ణ శతమాయ మహామాయ మహేశ మృత్యుహరాదులు మొదలుగాఁ గల మహా ప్రమథగణంబులు గొలువ దివ్యవిమానారూఢయై యుండె నప్ప డ వ్విమానంబు ముదంబున గడపం దొడంగి రంత నదియును మనోవేగంబున దక్షుని యాగమంటపమ్ముఁ గదిసిన న క్కన్యారత్నంబు తన సఖీజనంబులుం దానును గగనగమనంబు డిగ్గి.
127-చ.
సలలిత మై గణోత్తములు ఝల్లనిపించు పసిండిదండముల్
కలఁగొనఁ బట్టి బిట్టున “త్రిజన్నుతవల్లభ వచ్చె మీ రహో
తలఁగి తొలంగి పాయుఁ” డని తాపసు లాదిగ వేల్పు మూకలన్
జలమమున బాయఁ ద్రోయుచును సందడి వాపి గణాళిఁ గొల్వగన్.
128-సీ.
వేదండగమనలు వింజామరలు వీవ;: పల్లవాంఘ్రులు వేడ్కఁ బలసి నడువ;
లలితరంభోరువు ల్వెలిగొడుగులు పట్ట;: సైకతజఘనలు సన్నుతింప;
హరిరాజసమమధ్య లంకించి పాడంగఁ;: గరికుంభకుచలు మంగళము నుడువ;
కమలబాహులతలు కళ్యాణములువాడ;: రాజనిభాస్యలు రమణఁ గొలువ;
ఆ. లోల మీనభృంగలోచన ధమ్మిల్ల
వతులు గొంద ఱతులగతుల నడువ;
తల్లిదండ్రి చెలుల దర్శింప న మ్మహా
కాళి నడచె యాగశాలకడకు.
129-వ.
ఇట్లు నడచి.
130-మ.
ఘన హేమోన్నత యాగమంటపముపైఁ గళ్యాణి నిల్చుండఁగాఁ
గనియుం గానని యట్ల వోయెఁ దగు సత్కారంబులం దేమిటన్
వనితం దల్పకపోయె తొల్లిటి వృథావైరంబుతో బూజలన్
దనిపెం గూఁతుల నల్లురన్ దివిజులన్ దక్షుండు దక్షాత్ముఁ డై.