వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/పార్వతి శంకరుని నీలగళ కారణం బడుగుట

వికీసోర్స్ నుండి


పార్వతి శంకరుని నీలగళ కారణం బడుగుట.

201-సీ.
“కలధౌతగిరిమీఁద గౌరీశుఁ డొకనాఁడు
తపనీయమయ శిలాతలము నందుఁ
దొడలపైఁ దన కూర్మి తొయ్యలి నగజాత
నెక్కించుకొని గోష్ఠి నేర్పు మెఱసి
వేంచేసియున్నచో విశ్వేశు వదనార
విందంబు తెఱఁగొప్ప వెలఁది చూచి
“ యో భూతనాయక! యో గోపతిధ్వజ!
కొమరారు నీ కంఠకోణమందు
ఆ.
నలతి నలుపు కప్పు నిలువఁ గారణ మేమి
నాకుఁ జెప్పు” మనిన నవ్వి శివుఁడు
వనిత కోర్కెఁ దీర్పవలయుఁ బొమ్మని చెప్పెఁ
గొలువువారు వినఁగ మెలఁతతోడ.
202-వ.
నాఁ డేను పరమేశ్వరుకొలువున నున్నవాఁడఁ దన్నిమిత్తంబునఁ గొంత యెఱుంగుదు వినుండు విన్నవించెద నని మఱియు నమ్మహాదేవి మహాదేవున కిట్లనియె.
203-శా.
“ కైలాసాచలవాస! నీవు ధవళాకారుండ వై యుండఁగాఁ
గాలాంభోధరదీప్తి మెచ్చక భుజంగభృంగసంకాశ మై
నీలచ్ఛాయ యిదేమి భంగిఁ బొడమెన్ నీకంఠకోణంబునన్
వాలాయంబుగ నాకుఁ జెప్పుము కృపన్ వాగీశసంవూజితా!”
204-వ.
అనినఁ జంద్రశేఖరుం డిట్లనియె.
205-మ.
“ పొలఁతీ! తొల్లి సురాసురేంద్రులు సుధాంభోరాశిలో మందరా
చలముం గవ్వము చేసి వాసుకిని బెల్చం ద్రాడుఁగాఁ దర్చఁ దా
మలువన్ ఘోరవిషంబు పుట్ట నది హాహా యంచుఁ గంఠస్ధలిన్
నిలుపన్ లోకము నీలకంధరుఁ డనెన్ నీలాలకా! బాలికా!”
206-వ.
అని మఱియు “నీ ప్రకారంబు సవిస్తారంబుగా నెఱింగించెద విను” మని కాలకంధరుం డిట్లనియె.
207-క.
శైలారియుఁ బావకుఁడును
గాలుఁడు దనుజేశ్వరుండుఁ గంధులరాజున్
గాలియుఁ గిన్నరవిభుఁడును
శూలియును ననేక కోటి సురసంఘంబుల్.
208-వ.
తొల్లి మహాయాగంబున నప్రతిహత పరాక్రమ గర్వ దుర్వారులును; అనేక సకలభువనరాజ్యధురంధరులును; నిరంతరలక్ష్మీనివాసులు నై; యొక్కనాఁడు మేరుధరణీధర శిఖరంబునఁ గొలువున్న సమయంబున; లోకోపకారార్ధంబుగా నమృతంబు బడయవలయు నని విచారించి పాలవెల్లిఁ దరువం దలంచి యమృతశరధిశయనుం డగు భజంగశాయిపాలికిం జని వినతులై “మహాత్మా! మే మందఱము నొక్క ప్రయత్నంబు సేయ గమకించినారము; నీవు భూభార దక్షుండ వవధరింపు” మని విన్నవించిరి.
209-క.
అమృతంబుఁ బడయు వేడుక
నమృతాబ్ధి మధింపఁ దలఁచి యరుదెంచితి మో
యమృతాబ్ధిశయన! నీవును
మముఁ బనిగొనవలయు నయ్య! మన్ననతోడన్.
210-వ.
అని యివ్విధంబున దేవతలు పలుకఁ గమలామనోనాథుండు వారిపై దయాపూరిత చిత్తుండై యిట్లనియె.
211-సీ.
“ సురలార! మీకు భాసురలీల నమృతంబు
  దొరకు నుపాయంబు సరవి వినుఁడు
కరమర్ధి దనుజులఁ గపటంపుసంధిగాఁ
  జేసి వారును మీరు చెలువుతోడ
మందరాచలము సంభ్రమముతోఁ గొని వచ్చి
  కవ్వంబుగాఁ జేసి కడిమిమీఱఁ
దాలిమితో శేషుఁ దరిత్రాడుగాఁ జుట్టి
  సరసత్వమునఁ జాల జలధిఁ దరువఁ
ఆ.
గలిగినట్టి తాల్మి గలిగిన మీ కెల్ల
నమృత మబ్బు వేగ నర్ధి దాని
వలన ముదిమి చావు కలుగదు నేవింపఁ
గాన వేగఁ జేయ గడఁగుఁ డింక.”
212-వ.
అని బుద్ధికరపిన వారలు నిజనివాసంబులకుఁ జనుదెంచి యా రాత్రి సుఖంబుండి మఱునాఁడు సురేంద్రుండు సకల దివ్యులు దన్నుఁ బరివేష్టించి యుండఁ జింతామణిదివ్వ సింహాసనంబున నుండి తత్సమయంబున వాచస్పతిం గనుంగొని యిట్లనియె.
213-క.
“హరి యానతిచ్చె నమృతము
దొరకు నుపాయంబుఁ గడిమితోఁ జని రాత్రిం
చరవరులఁ బొందుపఱపుచు
నిరవుగఁ గొనిరండు మీర లిప్పుడు వారిన్.”
214-వ.
అని పలికిన నగుంగాక యని సురగురుండు దైత్యులపాలికిం జని హరివచనంబుల వినిపించి వారలం దోడ్కొని వచ్చిన; దేవనాథుండు వూర్వదేవతాసహితుండై మధుసూదనుండు తోడరా మందర నగేంద్రంబుకడకుం జని యమ్మహాశైలంబుఁ బెకలించి మూపులం దాల్చి సంభ్రమాయత్తచిత్తులై పవన వేగంబునఁ జనుచుండఁ బాద ఘట్టనంబులం గులపర్వతంబులు కందుకంబులం బోలి తూలి యాడుచున్న సమయంబున.
215-శా.
జంభారాతి దిగీశులున్ దనుజులున్ శైలంబుమూలంబులన్
శుంభల్లీలల మ్రోవలేమిఁ గని దా నూఁదెన్ భుజాగ్రంబునన్
అంభోజాక్షుఁడు పట్టి వైచెఁ జలనంబై కుంభనాదంబుతో
నంభోరాశిజలంబు మిన్నడువ నయ్యంభోధి నుజ్జృంభుఁడై.
216-వ.
“ ఉవేంద్రా! యేప్రకారంబున మహార్ణవంబు డగ్గరి తరవ వచ్చు దీనికిం జేరును, గుదురును, గవ్వంబును నేమి గావలయు నానతిచ్చి రక్షింపు” మని పలికిన నయ్యిందిరావల్లభుం డిట్లనియె.
217-చ.
“గొనకొని మీకు నంబుధికిఁ గుంభినికిం గుదురై వసించెదన్
ఘనతర మందరాచలముఁ గవ్వము చేసెద నెత్తి తెచ్చెదన్
వననిధిలోన నిల్పెదను వాసుకిఁ జేరుగఁ జేసి తెచ్చెదన్
వినుఁ డమృతంబు గాంచెదను వేలుపులార! భవత్సహాయినై.”
218-వ.
అని పలికి మఱియు నమ్మహాత్ముండు దేవేంద్ర దండధర వరుణ కుబేర ప్రముఖు లగు దిక్పాలకులును; దనుజ భుజంగ కిన్నర కింపురుష గరుడ గంధర్వ నాయకసమూహంబులును; నపరిమిత భుజబల పరాక్రమవంతులును; ననేక దేవజనంబులును; నుద్దండ సాహసులును శరధిమథనసాహసు లై తన్నుఁ బరివేష్టించి కొలిచి నడువం జనుదెంచి యల్లకల్లోలమాలికారావ నిరంతరబధిరీభూత దిగంతరాళంబును; మకర కమఠ కర్కటక మండూక తిమి తిమింగలాది జలచరావాసంబును; క్రౌంచ కాదంబ కారండవ కర్కశ సారస చక్రవాకాది విహంగనివాసంబును; అకాల కుసుమ ఫల భరిత నానా తరులతా విరాజిత వేలాయుతంబును; సనక సనందనాది మునీంద్ర సంచారణంబును; ననంత గంభీరంబును; నఖిల రత్న సముదయ జనదేశంబును; జలజనయనశయన స్ధానంబును; నమృతజలమయంబును నై వైకుంఠపుర సమీపంబున నొప్పుచున్న క్షీరార్ణవంబుఁ బొడగని డాయ నేతెంచిరి సంభ్రమంబున.