Jump to content

విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ)/ద్వితీయాంశము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

విష్ణుపురాణము

భావనారాయణకృతము

ద్వితీయాంశము


లావణ్యసుభద్రో
త్తాలపయోధరసువర్ణ ధరవిహరణకే
ళీలోల ప్రావృషణ్ణవ
నీలాంబుధరప్రకాశ నీలాద్రీశా.

1


వ.

అవధరింపుము మైత్రేయమహాముని శ్రీపరాశరున కిట్లనియె.

2


గీ.

ఘనులు స్వాయంభువుని పుత్రు లనుపమాన, ధర్మపరులు ప్రియవ్రతోత్తానపాదు
లందు నుత్తానపాదునియన్వయంబు, వింటిని ప్రియవ్రతుని జెప్పవే మునీంద్ర.

3


వ.

అని యడిగిన మైత్రేయునకు పరాశరుం డి ట్లనియె.

4


చ.

ఘనభుజుఁ డాప్రియవ్రతుఁడు కర్దమపుత్రికఁ బెండ్లియాడి య
వ్వనరుహనేత్రియందు బలవంతుల పుత్రకులం బదుండ్ర న
త్యనుపమతేజులం గనియె నమ్మహనీయులనామధేయముల్
వినుము మునీంద్రచంద్ర! కడువేడుకతో నవధాన మేర్పడన్.

5


వ.

అగ్నీధ్రుండును, అగ్నిబాహుండును, వపుష్మంతుండును ,ద్యుతిమంతుండును,
మేధియు, మేధాతిథియు, హవ్యుండును, సవనుండును, పుత్రుండును, జ్యోతి
ష్మంతుండును. అందు మేధాగ్నిబాహుపుత్రులు మువ్వురును జాతిస్త్మరులై
రాజ్యం బొల్లక నిర్మములును అఫలాకాంక్షులునై తపోనిష్ఠులైరి. తక్కిన
యేడ్వురుపుత్రులఁ బ్రియంవదుండు సప్తద్వీపంబులకు నధిపతులఁ జేసె. తత్ప్ర
కారంబు వినుము. అగ్నీధ్రునకు జంబూద్వీపంబును, మేధాతిథికి ప్లక్షద్వీపం
బును, వపుష్మంతునకు శాల్మలద్వీపంబును, జ్యోతిష్మంతునకు కుశద్వీపంబును,
ద్యుతిమంతునకు క్రౌంచద్వీపంబును, హవ్యునకు శాకద్వీపంబును, సవను

నకు పుష్కరద్వీపంబును ఇచ్చి యభిషిక్తులం జేసె. అందు జంబూద్వీ
పేశ్వరుండైన యగ్నీధ్రునకు నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్య,
హిరణ్వత్తు, కురు, భద్రాశ్వకేతుమాలులను తొమ్మండుపుత్రకులు ప్రజా
పతిసములు పుట్టిరి. అగ్నీధ్రుండు జంబూద్వీపంబు తొమ్మిదిభాగంబులుగా విభ
జించి నాభియను నగ్రపుత్రునకు దక్షిణంబైన హిమవర్షంబును, కింపురుషు
నకు హేమకూటంబును, హరివర్షునకు నైషధవర్షంబును, ఇలావృతునకు మేరువు
చుట్టున మేరువర్షంబును, రమ్యునకు నీలాచలవర్షంబును, హిరణ్వంతునకు ఉత్త
రంబైన శ్వేతవర్షంబును, కురువునకు శృంగపర్వతోత్తరవర్షంబును, భద్రాశ్వు
నకు మేరుపూర్వవర్షంబును, కేతుమాలునకు గంధమాదనంబును నొసంగె.

6


క.

ఈమాడ్కి నమ్మహీపతి, భూమీభాగముల కాత్మపుత్రుల రాజ
శ్రీ మించఁ జేసి సాలగ్రామాశ్రమమునకుఁ దపము గైకొనఁ జనియెన్.

7


సీ.

మునికులచంద్ర కింపురుషాభిధేయాష్టవర్షంబులందు సర్వసుఖసిద్ధు
లప్రయత్నంబున నావిర్భవించు, విపర్యయంబును జరాభయము మృత్యు
భయము నధర్మసంభవమును ధర్మసంభవమును లేదు వీడ్వడగ నుత్త
మాధమమధ్యమవ్యవహారములు యుగవ్యాపారములు గల్గ వందు నెపుడు


గీ.

దేవలోకసమములై వెలుగొందుచు, భోగభూము లగుచు పొగడు గనుచు
నధికమహిమ వెలయు నయ్యష్టవర్షంబు, అధివసింతు రచట ననఘమతులు.

8


క.

హిమవర్షపతికి నాభికి, నమితద్యుతి మేరుదేవి యను కామినికిన్
కమలాక్షునిభుఁడు ఋషభుఁడు, కుమారుఁ డుదయించె జగము కొనియాడంగన్.

9


వ.

రుషభుండు తండ్రిపరోక్షంబున హిమవర్షంబునకు రాజై రాజధర్మం బవల
బించి వివిధాధ్వరంబు లొనరించె. అతనికి భరతజ్యేష్ఠంబైన పుత్రశతం
బు గలిగె. అందు జ్యేష్టపుత్రుని భరతు హిమవర్షంబునకు నభిషిక్తునిం జేసి,
రుషభుండు పులహాశ్రమంబునకుఁ బోయి, యచ్చట వానప్రస్థధర్మంబునఁ
దపం బొనర్చుచు యథార్హయజనశీలుండై యోగమార్గంబున నుత్తమ
లోకగతుఁడయ్యె.

10


క.

ధీఁరుడు భరతుం డేలగ, భారత మన ధరణిఁ బేరుపడి హిమవర్షం
బారూఢి కెక్కె నతనికి, సూరివరా! ధార్మికుండు సుమతి జనించెన్.

11


వ.

సుమతిం బట్టాభిషిక్తుం జేసి భరతుండు సాలగ్రామాశ్రమంబున యోగాభ్యా
సరతుండై ప్రాణంబులు విడిచి శ్రేష్ఠంబైన యోగికులంబున విప్రుండై జని
యించె. మైత్రేయా! పదంపడి తచ్చరితంబు చెప్పెద; భరతపుత్రుండైన

సుమతికి తైజనుండు, అతని కింద్రద్యుమ్నుండు, అతనికి పరమేష్ఠి, అతనికి
ప్రతిహారుండు, అతనికి ప్రతిహర్త, అతనికి త్వష్ట, అతనికి విరజుండు, అతనికి
రజుండు, అతనికి శతజిత్తు, ఆశతజిత్తునకు విష్వగ్జ్యోతిప్రధానులగు పుత్రులు
నూర్వురు జనియించిరి. వారిచే గదా యీభారతవర్షంబు తొమ్మిదిభేదంబుల
నలంకరింపంబడియె. తదన్వయప్రసూతులైన మహీపాలకులచేత ఇబ్భారత
మహీమండలం బనుభవింపంబడియె. వరాహకల్పంబున నేకసప్తతి, చతుర్యుగ
పరిమితంబైన, స్వాయంభువమన్వంతరంబున నీస్వాయంభువసర్గంబు ప్రవ
ర్తిల్లె. ఇందుచేత జగంబు పూరితంబయ్యెనని చెప్పిన మైత్రేయుం డి ట్లనియె.

12


క.

స్వామీ! స్వాయంభువసర్గామితమహిమంబు వింటినంతయుమీఁదన్
భూమండలవిస్తారం బేమాడ్కిన్ బరుగు దాని నెఱిఁగింపఁగదే.

13


గీ.

సాగరంబులు ద్వీపవర్షములు గిరులు, నదులు కాననములు పట్టణములు ధరణిఁ
బరగు వీనిప్రమాణ మెప్పగిది వీని, కేమి యాధార మింతయు నెఱుఁగఁ జెపుమ.

14


వ.

అనిన శ్రీపరాశరుం డి ట్లనియె.

15


క.

ఓమునినాయక! వినుమా! భూమండలి తెఱఁగు సర్వమును చెప్పఁగ వా
గ్భామాపతికైనను రా, దీమెయి సంక్షేపభంగి నెఱిఁగింతుఁ దగన్.

16


వ.

జంబూప్లక్షశాల్మలకుశక్రౌంచశాకపుష్కరనామంబులం గల సప్త
ద్వీపంబులు క్రమంబున లవణేక్షుసురాసర్పిదధిదుగ్ధశుద్ధజలసముద్రంబుల
చేతం బరివేష్టితంబులై యుండు. ఈసప్తద్వీపంబులకు జంబూద్వీపంబు
మధ్యసంస్థితంబై యుండు. తన్మధ్యంబున నెనుబదినాలుగువేలు యోజనంబులు
పొడువును, పదాఱువేలయోజనంబులు పాతును ముప్పదిరెండువేలయోజనం
బుల శిరోవిస్తారంబును పదాఱువేలయోజనంబుల మూలవిస్తారంబును గలిగి
భూపద్మంబునకు కర్ణి కాకారంబై కనకమయంబైన మేరుపర్వతంబు వెలుంగు.

17


సీ.

హిమగిరి హేమకూటము నిషధము నన మేరుదక్షిణవర్షమేదినీధ
రములు నీలాద్రిశ్వేతమహీధరము శృంగవంతంబునఁగ సువర్ణశిఖరి
ఉత్తరవర్షభూభృత్తిలకములందు హేమకూటము శ్వేతభూమిధరము
లక్షయోజనదైర్ఘ్యలక్షితంబులు తక్కునాలుగు తొంబదివేలు యోజ


గీ.

నముల నిడుపున వెలయు నున్నతియు వెడలు, పును సహస్రద్వయమితమై పొల్చువర్ష
గిరివరంబుల కాఱింటికిని గణింప, ధీరవర వీనివిధమెల్లఁ దెలిసికొనుము

18


వ.

దక్షిణలవణాబ్ధిహిమవత్పర్వతమధ్యంబు భారతవర్షంబు, హిమవద్ధేమకూట
పర్వతమధ్యంబు కింపురుషవర్షంబు, హేమకూటనిషధపర్వతమధ్యంబు హరి

వర్షంబు ఈ మూడువర్షంబులు మేరుదక్షిణభాగంబున వర్తిల్లు. ఉత్తరలవ
ణాబ్ధి శృంగపర్వతమధ్యంబు కురువర్షంబు శృంగవచ్ఛ్వేతపర్వతమధ్యంబు
హిరణ్మయవర్షంబు శ్వేతనీలపర్వతమధ్యంబు రమ్యవర్షంబు ఈమూడు
వర్షంబులు మేరువు నుత్తరభాగంబున వర్తిల్లు. ఈవర్షంబు లాఱింటికి తొమ్మి
దేసివేలయోజనంబులు ప్రమాణంబు. మేరువునలుచుట్టును తొమ్మిదేసివేల
యోజనంబుల ప్రమాణంబున ఇలావృతవర్షంబు వెలయు. అయ్యిలావృత
వర్షంబునందు మేరువునకు పూర్వదక్షిణపశ్చిమోత్తరపార్శ్వంబుల క్రమం
బున మందరగంధమాదనవిపులసుపార్శ్వనామంబుల నాలుగు విష్కంభ
పర్వతంబులు యోజనాయుతోచితంబులై వెలయు. ఆగిరులయందు
కేతనరూపంబులై కదంబజంబూపిప్పలవటపాదపంబులు ఏకాదశశతా
యామంబులై వెలుంగు. ఆజంబూవృక్షంబు కారణంబునంగాదె యీద్వీపంబు
జంబూద్వీపం బనం బరఁగె.

19


క.

మునివర! యాజంబూతరు, ఘనఫలములు రాలిపడు నగంబుపయిన్ ఘో
రనినాద మెసఁగ నెప్పుడు, ననుపమగజరాజతనుసమాకృతు లగుచున్.

20


వ.

తత్ఫలరసంబు ప్రవహించి జంబూనది యనం బ్రసిద్ధయైన నదియై యిలావృత
వర్షంబునం బ్రవహించె. తద్రసపానంబు చేసిన యిలావృతవాసులకు స్వేద
దౌర్గంధ్యజరాభారేంద్రియక్షయంబులు లేవు. తద్రసార్ద్రయైన తీరమృ
త్తిక సుఖవాయువిశోషితయై జాంబూనదాఖ్యంబున సిద్ధభూషణంబైన సువ
ర్ణంబయ్యె. మేరువుతూర్పున భద్రాశ్వవర్షంబును, పశ్చిమంబున కేతుమాల
వర్షంబును వెలయు. ఈయెనిమిదివర్షంబుల నడుమ నిలావృతవర్షంబు వెలయు.
చైత్రరథగంధమాదన, వైభోజ, నందననామంబులం గల వనంబులు మేరు
పూర్వదక్షిణపశ్చిమోత్తరపార్శ్వంబులం గ్రమంబున నొప్పు. అట్ల క్రమం
బున అరుణోద మహాభద్ర శిశురోదన మానసంబులను సరోవరంబులు పొలు
చు. మేరువు పూర్వభాగంబున శితాంతచారుకుడ్యకురరీమాల్యవన్నైకం
కప్రముఖంబులు, కేసరాచలంబులు త్రికూటశేఖరపతంగరుచకనిషధా
దులు మేరుదక్షిణపార్శ్వంబున కేసరాచలంబులు శిఖవాహవైదూర్యకపిల
గంధమాదనచారుధిప్రముఖంబులు పశ్చిమకేసరాచలంబులు శంఖకూప
రుషభహంసనాగకోలాంజకప్రముఖంబులు, ఉత్తరకేసరాంచలంబులు
వెలయును.

21


గీ.

విప్రపుంగవ పదునాల్గువేలయోజ, నములు నిడుపున కాంచననగముమీఁద
పద్మజునిపట్టణం బొప్పు భవ్యతర, చిరత్నరత్నసువర్ణవిభ్రాజి యగుచు.

22

క.

ఆపురియెనిమిదిదిక్కుల, దీపితగతి వెలయుచుండు దిక్పతిపురముల్
శ్రీపరిపూర్ణసువర్ణగృ, హాపరిమితసకలవైభవాఢ్యము లగుచున్.

23


చ.

సరసిజనాభపజ్జలజసంభవమై, నభ మాక్రమించి భా
స్వరశశిమండలప్లవనచాతురి చూపి సురాద్రిమస్తకో
పరిపరిపాతజాతఘనభంగ యభంగుర గంగ భారతీ
శ్వరుపురి చుట్టి దేవమునిసన్నుతయై ప్రవహించు నిచ్చలున్.

24


వ.

ఆగంగయందునుండి పూర్వాదిచతుర్దిక్కులయందును గ్రమంబున, సిత,
అలకనంద, చతువు, భద్రయునను నామంబులు దాల్చి, నాలుగుప్రకారం
బుల జగతికి డిగ్గి సముద్రంబు చొచ్చె. తత్ప్రకారంబు వినుము. అందు సిత
యనుగంగ తూర్పు డిగ్గి నగంబు లతిక్రమించి భద్రాశ్వవర్షంబుఁ జొచ్చి ప్రవ
హించి పూర్వసాగరంబు చొచ్చె. అలకనంద దక్షిణంబు డిగ్గి శైలమ్ము ల
తిక్రమించి భారతవర్షంబు చొచ్చి సప్తవిధంబుల దక్షిణసాగరంబు చొచ్చె.
చక్షువు పశ్చిమంబునకు డిగ్లి గిరు లతిక్రమించి కేతుమాలవర్షంబు చొచ్చి
పశ్చిమార్ణవంబు ప్రవేశించె. భద్రయు నుత్తరంబు డిగ్గి గిరులు తరించి కురు
వర్షంబు చొచ్చి యుత్తరసముద్రంబు ప్రవేశించె. మేరుపూర్వపశ్చాద్భాగం
బుల ననిలనిషధాయామంబులై మాల్యవద్గంధమాదనశైలములు వెలయు.
తన్మధ్యంబునం గదా మేరునగంబు భూపద్మంబునకుఁ గర్ణికాకృతిం బరఁగె.
అప్పద్మంబునకు మర్యాదాశైలబాహ్యభాగంబు భారత, కేతుమాల, భద్రా
శ్వ, కురువర్షంబులు పత్రంబులై యొప్పు జకర, దేవకూటంబులను రెండు
పర్వతంబులు దక్షిణోత్తరాయామంబులై నీల, నిషధపర్వతప్రమాణం
బునఁ బూర్వమర్యాదాపర్వతంబులు వెలయు. గంధమాదనసంజ్ఞంగల
రెండుపర్వతంబులు పూర్వపశ్చిమాయామంబులై అశీతిసహస్రయోజన
ప్రమాణంబున సముద్రాంతర్వ్యవస్థితంబులై దక్షిణమర్యాచాపర్వతం
బులు వెలయు, నిషధ, పారియాత్రంబులను రెండుపర్వతంబులు మేరుపశ్చిమ
మర్యాదపర్వతంబులు, జఠర దేవకూట ప్రమాణంబులై వెలయు. త్రిశృంగ
జారుధి సంజ్ఞలంగల రెండుపర్వతంబులు గంధమాదనాయామంబులై
సముద్రాంతర్వ్యవస్థితంబులై యుత్తరమర్యాదాపర్వతంబులు వెలయు.
మేరువునలుదిక్కులం బ్రవహించిన గంగాప్రవాహంబులతో బెరయు కేసర
పర్వతంబు లతిరమ్యంబులై యొప్పు. ఏతచ్ఛైలాంతరద్రోణులు సిద్ధ, చారణ,
గంధర్వసేవితంబులై వెలయు. అందులక్ష్మి, విష్ణ్వగ్ని, సత్యాదిదేవతలకు
నాయతనంబులు పెక్కులు గలవు ఆద్రోణులయందు మఱియుఁ గాననంబులు,
పురంబులు పెక్కు గలవు. అందు కిన్నర, గంధర్వ, యక్ష, రక్షో, దానవుల

హర్నిశలం గ్రీడింతురు. ఇవిభూస్వర్గంబులు, ధర్మిష్ఠులకు నివాసంబులగు. పాప
కర్తల కగమ్యంబు లై యుండు.

25


క.

వనజాతపత్రనేత్రుఁడు, మునివర భద్రాశ్వవర్షమున హయశిరుఁడై
అనిశంబు నుండు నచ్చటి, జనములు ఘనభక్తియుక్తి సతతము గొలువన్.

26


చ.

కమలదళాయతాక్షుఁ డనుకంప దలిర్పఁగఁ గేతుమాలవ
ర్షమున వరాహమూర్తి యయి రాజిలుఁ గూర్మశరీరధారి వి
భ్రమగతి నుండు నెప్పుడును భారతవర్షమునందు మత్స్యభా
వమున వసించియుండుఁ గురువర్షమునందు మునీంద్రచంద్రమా.

27


ఉ.

అంతట నిండియుండుఁ గమలాయతనేత్రుఁడు విశ్వరూపుఁడై
యెంతని చెప్పుదు న్మునికులేశ్వర యీనిఖిలప్రపంచమున్
వింతగఁ దాల్చి యాత్మ యయి విష్ణుఁ డధీశ్వరుఁ డుండుఁ గాన ని
శ్చింతత నింతయుం దెలిసి చిత్తమున న్నెలకొల్పు మెప్పుడున్.

28


వ.

ఈనవవర్షంబులందును, ప్రత్యేకంబ కులపర్వతంబు లేడేసి కలవు. అందులం
బుట్టిన నదులు శతసంఖ్యంబులు, హిమవద్దక్షిణమధ్యంబు నవసహస్రయోజన
విస్తారంబైన భారతవర్షంబు స్వర్గాపవర్గకాములకు తిర్యక్త్వనరకగాములకుఁ
గర్మభూమియై యుండు.

29


చ.

అనఘ మహేంద్రసహ్యమలయంబులు శక్తిమదృక్షవంతముల్
ఘనమగువింధ్యమున్ బఱపు గల్గి వెలింగెడి పారియాత్రమున్
పనుపడియుండు నెప్పుడును భారతవర్షమునందు దేవతా
జనవినుతోన్నతక్రమవిశాలత సప్తకులాచలేంద్రముల్.

30


వ.

ఈభారతవర్షంబునను, నింద్రద్వీపంబును కసేరుద్వీపంబును, గభస్తిమద్ద్వీ
పంబును, నాగద్వీపంబును, సౌమ్యద్వీపంబును, గాంధర్వద్వీపంబును, వారుణ
ద్వీపంబును, సాగరసంవృతద్వీపంబును ననఁ దొమ్మిదిద్వీపంబులు సహస్ర
యోజనవిస్తారంబులై యుండు. అందుఁ దొమ్మిదవదగు నీద్వీపంబు సాగర
వేష్టితంబై, దక్షిణోత్తరంబులు సహస్రయోజన విస్తారంబై యుండు. అందుఁ
బూర్వభాగంబునఁ గిరాతులును, బశ్చిమభాగంబుగ యవనులును, మధ్య
భాగంబున బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులును, స్వవృత్తినిరతులై
యుండుదురు. శతద్రుచంద్రభాగాప్రముఖనదులు హిమవత్పాదసంభ
వంబులు, వేదస్మృతిప్రముఖనదులు పారియాత్రోద్భవంబులు నర్మదాసుర
సాదులు వింధ్యనిర్ణేతంబులు. తాపిత, యోష్ణి, నిర్వింఛ్యాదులు ఋషభ

పర్వతసంభవంబులు గోదావరీ, భీమనదీ, కృష్ణవేణ్యాదులు సహ్యపాదోద్భ
వములు. త్రిసామా, ఋషికుల్యాదులు మహేంద్రవత్పర్వతసంభవంబులు.
కృతమాలా, తామ్రపర్ణిప్రముఖనదులు మలయోద్భోవములు. ఋషికూలా,
కుమార్యాదులు శక్తిమత్పాదసంభవములు. వీనివలన నుపనదులు పెక్కు గలవు.
అందుఁ గురు, పాంచాలాదిమాధ్యదేశజనులును, బూర్వదేశాధినివాసులును,
మద్రధామాంబ, పారసీకాదులును, నీనదులజలంబులు ద్రావుచుఁ దత్స
మీపంబున హృష్టపుష్టజనాకులులై వసింతురు.

31


చ.

వరుసకృతంబు త్రేతయును ద్వాపరముం గలి సంజ్ఞితంబులై
పరగుయుగంబు లెప్పుడును భారతవర్షమునందగాని, కిం
పురుషముఖాష్టవర్షములఁ బొందవు దాన, తపో, ముఖక్రియల్
పరముగుఱించి చేయుదురు భారతవర్షమునందు సత్తముల్.

32


వ.

ద్వీపంబులందు జంబూద్వీపం బుత్తమంబు. దానియందు యజ్ఞపురుషుండైన
శ్రీమన్నారాయణుండు పురుషులచేత యజింపఁబడు. సత్పురుషులు పరలో
కార్ధంబు సత్క్రియలు చేయుదురు. తక్కినద్వీపంబుల నన్యప్రకారంబున
భజియింతురు. జంబూద్వీపంబునందు భారతవర్షంబు శ్రేష్ఠంబు. ఇది కర్మ
భూమి. తక్కినవి భోగమూలములు. అనేకజన్మసహస్రంబులకుఁ బుణ్యసంచ
యంబువలన జంతువు భారతవర్షంబునఁ బురుషుండై జనియించు ఈయర్ధంబు
నకు దేవగీతలు కలవు. వానియర్థంబు వినుమని శ్రీపరాశరుడు మైత్రేయున
కిట్లనియె.

33


చ.

అమృతస్వర్గమోక్షముల కాదరువై తగుభారతాఖ్యవ
ర్షమున జనించినట్టి పురుషప్రకరం బతిధన్య మె ట్లనన్
తమతమనిత్యకర్మసముదాయము తత్ఫలకాంక్ష మాని శ్రీ
రమణునిఁ జేర్చి పొందుదురు ప్రస్ఫుటతన్మహనీయధామమున్

34


చ.

తెలియక మోసపోతిమి కదీయత దెచ్చినకర్మ మింకినన్
పలుపలు కేల శీఘ్రమున భారతవర్షమునందుఁ బుట్టి నే
ర్పలవడ భక్తియుక్తి జలజాయతలోచను పాదపద్మముల్
గొలుతుము ముక్తికై తలఁపఁ గొంచెమె తన్మహితప్రభావముల్.

35


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

36


గీ.

బ్రహ్మవిద్వర నవవర్షపరిమితంబు, లక్షయోజనవిస్తారలక్షితంబు
లైనయీదీవి చుట్టు చోద్యముగ నుండు, క్షారనీరధి లక్షయోజనమితంబు.

37

క.

లక్షద్వయయోజనమిత, లక్షితమై జలధిఁ జుట్టి ప్లక్షద్వీపం
బక్షీణవైభవాఢ్యజ, నక్షేమద మగుచు వెలయు నవ్యప్రతిభన్.

38


వ.

ప్లక్షద్వీపేశ్వరుండైన మేధాతిథికి శాంతభయుండును, శిశిరుండును, సుభోద
యుండును, ఆనందుండును, శివుండును, క్షేమకుండును, ధ్రువుండును, నన
నేడ్వురుపుత్రులు పుట్టి ప్లక్షద్వీపంబునకు రాజులైరి. వారిపేరన పూర్వవర్షంబు
మొదలుకొని ప్రదక్షిణంబుగాఁ గ్రమంబున శాంతభయవర్షంబును, శిశిర
వర్షంబును, సుభోదయవర్షంబును, ఆనందవర్షంబును, శివవర్షంబును, క్షేమ
కరవర్షంబును, ధ్రువవర్షంబును నన నేడువర్షంబు లయ్యె. ఈవర్షంబులకు
మర్యాదాశైలంబులు గోమేధ, చంద్ర, నారద, దుందుభి, సోమిక, సుమనో,
వైభాజనామంబులం గలిగి యేడుపర్వతంబులు గలవు. ఈవర్షాచలంబుల
యందును వర్షంబులయందును బ్రజలు దేవగంధర్వసహితు లై వసి
యింతురు.

39


గీ.

అందు నధికసమృద్ధంబులైన పుణ్య, జనపదంబులు పె క్కందు జనునకెల్ల
వ్యాధులును నాధులును లేవు వలసినట్లు, సర్వకాలనుఖంబులు సంభవించు.

40


వ.

ఆవర్షంబులకు అను, తప్త, శిఖ, విపాశ, త్రిదివ, అమృత, సుకృత అను
నామంబులంగల సముద్రగామినులైన సప్తనదులు గలవు. మఱియును క్షుద్ర
నదీపర్వతంబులును సహస్రసంఖ్యలు కలవు. తన్నదీజలపానంబు చేసిన జనులు
దేవసమాను లగుదురు. ప్లక్ష, శాల్మల, క్రౌంచ, కుశ, శాకద్వీపంబులను
పంచద్వీపంబులందును త్రేతాయుగసమానకాలంబు వర్తించు. మానవులు
పంచసహస్రవర్షంబులు పరమాయువుగాఁ బ్రదుకుదురు. ఆద్యకులులును,
కురువులును, విదులును, స్వాభావులును ననుసంజ్ఞలం గలిగి క్రమంబున
బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులు వర్తిల్లుదురు. ఆద్వితీయద్వీపమధ్యంబున
జంబూద్వీపప్రమాణంబైన ప్లక్షవృక్షంబులు వెలుగొందు, తన్నామంబు
నంగదా యాద్వీపంబు ప్లక్షద్వీపం బనం బరఁగు.

41


విప్రక్షత్త్రియవైశ్యు ల, తిప్రీతి తలిర్ప నందు దేవోత్తము ల
క్ష్మీప్రియువిహితక్రతుక, ర్మప్రవణమనస్కు లగుచు మదిఁ గొల్తు రిలన్.

42


సీ.

పాండిత్యలక్షణ! రెండులక్షలయోజ, నముల వెడల్పున నమరి యిక్షు
రసపరిపూరితార్ణవము ప్లక్షద్వీప, ధరణిమండలిఁ జుట్టి తనరుచుండు
డంబైన యిక్షురసాంబుధిఁ జుట్టి చ, తుర్లక్షయోజనస్తుత్యమైన
వెడలుపు శాల్మలద్వీపంబు గలదు త, ద్విభుఁడు వపుష్మంతుఁ డభయులైన

గీ.

నందనుల నేడ్వురను గాంచి యందఱికిని, శాల్మలము పంచి యిచ్చె తత్సంజ్ఞ నేడు
వర్షములు దానఁ బరఁగెఁ దద్వర్తనంబు, తెలియఁజెప్పెద వినుము సందియము వీఁగ.

44


శాల్మలద్వీపేశ్వరుండైన వపుష్మంతునకు శ్వేతుండు, హరి, జీమూతుండు,
లోహితుండు, వైద్యుతుండు, మానసుండు, సుప్రభుండు నన నేడ్వురుపుత్రులు
గిలిగిరి. వారిపేర నేడువర్షంబులు గలిగె. కుముదంబు, ఉన్నతంబు, వలాహ
కంబు, సంజీవన్యాది మహౌషధులుగల ద్రోణంబు, శంఖంబు, మహిషంబు,
కకుద్మంతంబు నన నేడుమర్యాదాపర్వతంబులు; యోని, తోయ, అతితృష్ట,
పంచ, వృక్ష, విమోచని, నివృత్తి అను నామంబులుంగల యేడునదులు
సకలకల్మషనాశనులు గలవు. అందు కపిలారుణ, పీత, కృష్ణ, వర్ణంబుల
చాతుర్వర్ణ్యంబు బరఁగు.

45


గీ.

వాయుభూతుఁడైన వనజాతలోచను, నఖిలవర్ణజనులు ననుదినంబు
యజనశీలు రగుచు నర్చింతు రతిభక్తిఁ, దెలివి శాల్మలమను దీవియందు.

46


క.

దేవత లెప్పుడు మూడవ, దీవిన్ మానవులఁ గూడి దిరుగుదు రతిశో
భావహము శాల్మలద్రుమ, మావసుమతి నుండు నున్నతాకృతి యగుచున్.

47


వ.

అదియును లక్షద్వయయోజనవిస్తారంబు కలదు. తన్నాయంబునఁ గదా
శాల్మలద్వీపం బనం బరఁగు. చతుర్లక్షయోజనవిస్తారంబైన సురార్ణవం బా
శాల్మలద్వీపధరణిం జుట్టియుండు.

48


ఉ.

ఓపరమర్షిపుంగవ సురోదధిచుట్టునఁ బెంపుతోఁ గుశ
ద్వీపము పొల్చు నందుఁ గల ధీరజనుల్ దివిజోపమానులై
యేపున నుందు రందమగు నెన్మిదిలక్షలయోజనంబులన్
శ్రీవటమున్ దివస్పతిపురిన్ హరియించుచుండు నెప్పుడున్

49


వ.

కుశద్వీపేశ్వరుండైన జ్యోతిష్మంతునకు ఉద్యోగుండును, వేణుమంతుండును,
స్వరదుండును, లంబనుండును, ధ్రుతియును, ప్రభాకరుండును, కపిలుండును
నన నేడ్వురుకొడుకు లుదయించి రాజు లైరి. వారిపేరన సప్తవర్షంబు లయ్యె.
విద్రుమంబును, సోమశైలంబును ద్యుతిమంతంబును, పుష్పవంతంబును,
కుశేశయంబును, హరియును, మందరంబును నన నేడుపర్వతంబులు, ధూత
పాపయు, శివయు, పవిత్రయు, సమతియు, విద్యుద్ధంభయు, మహియు,
అన్యయు అనఁ గ్రమంబున నేడువర్షంబులందు నేడునదులు కలవు. దమన,
శుష్మనస్, స్నేహ, మందేహసంజ్ఞలంగల బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులు
స్వకర్మనిరతులై అనపేక్షుతకర్మఫలులై, బ్రహ్మరూపకుండైన జనార్దను య
జింతురు.

50

క.

అలఘుకుశద్వీపము తా, వెలయుఁ గుశస్తంబసంజ్ఞ విను తత్కుశమున్
చెలువొందును నాలుగుల, క్షలయోజనములమితమున గణుతింపంగన్.

51


గీ.

అష్టలక్షయోజనాతివిస్తారమై, తగుఘృతాబ్ధి వెలయు దానిఁ జుట్టి
యాఘృతాబ్ధిఁ బుట్టియవల క్రౌంచద్వీప, మనఁగ ద్వీప మమరు మునివరేణ్య.

52


వ.

ఆక్రౌంచద్వీపంబు షోడశలక్షయోజనవిస్తారంబై వెలయు, కౌంచద్వీపేశ్వరుం
డైన ద్యుతిమంతునకుఁ గుశలుండును, మనుగుండును, ఉష్ణుండును, పివరుం
డును, అంధకారుండును, మునియు, దుందుభియును నన నేడ్వురుపుత్రులు
పుట్టి క్రౌంచద్వీపంబునకు రాజులైరి. వారిపేరిట సప్తవర్షంబులై దేవ
గంధర్వసేవితంబు లయ్యె. క్రౌంచంబును, వామనంబును, అంధకారంబును,
రత్నశైలంబును, దేవోత్పత్తియు, పుండరీకవంతంబును, దుందుభియును నన
నేడువర్షాచలంబులు పరస్పరద్విగుణంబు లై యుండు. ఈవర్షంబులయందు
వర్షాచలంబులయందు దేవసమానులై జనులు నిరాతంకులై యుండుదురు.
గౌరియు, కుముద్వతియు, సంధ్యయు, రాతియు, మనోజవయు, జ్యోతియు,
పుండరీకయు నను నేడువర్షనదులు గలవు. మఱియు క్షుద్రనదులు సహస్ర
సంఖ్యలు కలవు, పుష్కరపుష్కలధన్యాఖ్యాతసంజ్ఞలం గలిగి చాతుర్వర్ణ
జనంబులు వెలయుదురు.

53


శా.

ఎంచన్ శక్యము గాని వైభవముతో నిజ్యావిశేషంబునన్
చంచద్భక్తి తలిర్పఁగాఁ గొలుతు రిచ్ఛాపూర్తి వర్ధిల్లగా
ప్రాంచల్లీలల రుద్రరూపుఁడగు పద్మాధీశ్వరు న్నిత్యమున్
క్రౌంచద్ద్వీపనివాసులౌ జనులు నిర్ద్వంద్వత్వయుక్తాత్ములై.

54


వ.

షోడశలక్షయోజనవిస్తారంబైన దధిసముద్రం బాక్రౌంచద్వీపధరణిం జుట్టి
యుండు.ఆవల ద్వాత్రింశల్లక్షయోజనవిస్తరంబై శాకద్వీపం బాదధిసము
ద్రంబుఁ జుట్టియుండు శాకద్వీపేశ్వరుండైన భవ్యునకు జలజుండును, కుమా
రుండును, సుకుమారుండును, మరీచకుండును, కుసుమోత్కరుండును, మోదా
రియు, మహాద్రువుండును నన నేడువురుపుత్రులు పుట్టి శాకద్వీపంబునకు రాజు
లైరి. వారిపేర నాద్వీపంబున సప్తవర్షంబు లయ్యె. ఉదయగిరి, జలాధారంబు,
రైవతరశ్యామంబు, అంభోగిరి, అంచికేయంబు, రమ్యంబు, కేసరి అనియెడి
మర్యాదాపర్వతంబులు గలవు. తద్వీపమధ్యంబున సిద్ధగంధర్వసేవితం బై
సర్వాహ్లాదకరంబైన శాకవృక్షంబు వెలయు, తన్నామంబునం గదా యా
ద్వీపంబు శాకద్వీపం బనంబరఁగె. అందుఁ బుణ్యజనపదంబులు పెక్కు కలవు. నుకు
మారి, కుమారి, కధిని, వేణుక, ఇక్షు, ధేనుక, గభస్తి అనునామంబు

లంగల సప్తనదులుగలవు. మఱియుందక్కినక్షుద్రనదులును, గిరులును,
అయుతసంఖ్యలు కలవు. ఈవర్షంబులు స్వర్గతుల్యంబులై, ధర్మసమేతంబులై
యుండు. ముద్ర, మగధ, మానస, మందగ సంజ్ఞలంగలిగి క్రమంబున
బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ధర్మోపేతులై వర్తిల్లుదురు.

55


క.

శ్రీకాంతాధీశుఁడు సూ, ర్యాకృతిధరుఁ డగుచు నధ్వరార్చితుఁ డగు సు
శ్లోకులగుమానవులచే, శాకద్వీపంబునందు సౌజన్యనిధీ.

56


సీ.

ఋషివర ముప్పదిరెండులక్షలయోజ, నముల వెడల్పున నమితమహిమ
గలదుగ్ధవార్థి శాకద్వీపధరఁ జుట్టి, పొలుపొందు నవ్వల పుష్కరాఖ్య
మైనద్వీపముగల దఱువదినాలుగు, లక్షలమితమున శ్లాఘ్య మగుచు
తద్ద్వీపపతియగు ధార్మికాగ్రణిసవ, నుండు పుత్రకులు సన్నుతచరితుల


గీ.

నిరువురిని గాంచి వారికి నిచ్చె ద్వీప, మమ్మహాత్ములపేర దివ్యంబులైన
వర్షములు రెండు వెలయు పావనము లౌచు, వినుము తన్నామధేయము ల్మునివరేణ్య.

57


వ.

మహావీరుండును, ధాతకియు నన వారిపేర పుష్కరద్వీపంబున మహావీరవర్షం
బును, ధాతికివర్షంబును ననం బరఁగె. ఆరెండువర్షంబులనడుమ లక్షయు నేబది
వేలయోజనంబులపొడవును, నంతియవెడల్పును నై మానసోత్తరంబును,
వర్షపర్వతంబు పుష్కరద్వీపమధ్యంబున నుభయ౦బులకు మర్యాదా
చలం బై మండలాకారంబున నుండు. దానియుభయపార్శ్యంబులం గదా
దుగ్ధాబ్ధిచుట్టున మహావీరధాతకివర్షంబులు వలయాకారంబులై యుండు.
అుందు మానసోత్తరబాహ్యంబున మహావీరవర్షంబును, మానసోత్తరంబు
నకు నివ్వలిభాగంబున ధాతకవర్షంబునును నుండును. అందలి జనులు నిరామయు
లును, నిర్వికారులును, రాగ ద్వేషవర్జితులును, నుత్తములును, ఈర్ష్యాసూయా
భయ, క్రోధ, దోష, లోభాదివర్జితులునునై పదివేలేండ్లు బ్రతుకుదురు.
ఆవర్షద్వయంబునందును నదులును, శైలంబులును లేవు. వర్ణాశ్రమంబు
లును, వర్ణధర్మంబులును, త్రయీ, వార్తా, దండనీతి, శుశ్రూషలును లేవు.
భౌమస్వర్గం బనం బరఁగు నందు దేవతుల్యులై జనులు వర్తిల్లుదురు.

58


ఉ.

ఓధరణీసురప్రవర! యొప్పగు నావెనుదీవి నొక్కన్య
గ్రోధము వ్యోమయానగతి రోధసిరోధకవిస్ఫురన్మహో
చ్ఛేదము దానియందు సరసీరుహగర్భునివాస మొప్పు శో
భాధరితాఖిలామరవిహారనిశాంతనితాంతకాంతియై.

59


వ.

చతుష్షష్ఠిలక్షయోజనవిస్తారంబున స్వాదూదకసముద్రం బాపుష్కరద్వీపం
బుం జుట్టియుండు. ఇవ్విధంబున సప్తద్వీపంబులును సప్తసముద్రంబులచేత

నావృతంబులై యుండు, ద్వీపసముద్రంబు లుత్తరోత్తరద్విగుణంబులై
యుండు.

60


చ.

శమగుణభూషణా! వినుము సర్వపయోధులనీరు తారకా
రమణుఁడు పూర్వశైలశిఖరంబునఁ దోఁచిన నస్తశైలశృం
గముకడ కేగినన్ గడఁగి గాఢతరస్థితి పొంగుఁ గ్రుంగు ని
త్యము శితకృష్ణపక్షములయందు సమందతరాద్భుతక్రియన్.

61


వ.

చంద్రోదయాస్తమయంబుల సముద్రోదకంబులు వెయ్యిన్నేనూఱంగు
ళంబుల పొడవు పొంగుచుం గ్రుంగుచునుండు. పుష్కరద్వీపనివాసులకు షడ్ర
సోపేతంబులైన భోజనంబులు తలంచినంతన తనకుఁదాన సంభవించు.
స్వాదూదకసముద్రంబునవ్వల ఈభూమండలికి నినుమడియై యేజంతువులును
లేనికాంచనభూమి కలదు. దానియవ్వల పదివేలయోజనంబుల వెడల్పు నంతియ
పొడవునుం దగ వలయాకారంబున లోకాలోకపర్వతంబు కలదు. అది తమో
వృతంబై యుండు. ఇవ్విధంబున.

62


క.

పంచాశత్కోటిసమ, భ్యంచితయై భూతధాత్రి బరఁగుచునుండున్
చంచద్ద్వీపాంబుధిగిరు, లెంచం దనమీఁద నుండు నిద్దప్రతిభన్.

63


గీ.

వినుము మునినాథ దెబ్బదివేలయోజ, నములదళ మిమ్మహీస్థలి యమితభూత
కోటి కాధారమై యుండు హాటకాంబ, రునివిలాసం బి దంతయు నని యెఱుఁగుము

64


శా.

భూవిస్తారసముచ్ఛ్రయంబు లతివిస్ఫూర్ణద్గతిం జెప్పితిన్
ప్రావీణ్యం బలరారఁగావినఁదగున్ పాతాళవిస్తారమున్
శ్రీవైచిత్ర్యములందు దైత్యదనుజశ్రేణీభుజంగేంద్రు లి
చ్ఛావృత్తి న్విహరించుచుండుదురు శశ్వద్భోగభాగ్యాఢ్యులై.

65


వ.

అతలంబు, వితలంబు, నితలంబు, గభస్తిమంతంబు, మహంబు, సుతలంబు,
పాతాళంబు నన నేడుభేదంబుల నొకటొకటి దశసహస్రయోజనపరివృతంబై
యుండు.

66


ఉ.

భూరివివేకపాక! కనఁ బొల్పగునందుల శుక్లకృష్ణపీ
తారుణవర్ణయుక్తిగల యద్రులు, భూములు, స్వర్ణరత్నశృం
గారసమేతసౌధములు కాంచనపుణ్యవనీనదీసర
స్సారససారసౌరభవశంవదసన్మదషట్పదంబులన్.

67


క.

లీలమెయి నారదుఁడు పాతాళంబుననుండి దేవతాపురికి సము
ద్వేలగతి వచ్చియింద్రుం, డాలింపఁగఁ జెప్పె నచటియతివైభవముల్.

68

సీ.

ఆహ్లాదకారి శుభ్రాంచితమణుల దా, నవదైత్యనాగకన్యాశతముల
గీతవాదననృత్యకేళుల గంధమా, ల్యానులేపనభూషణాంబరముల
ప్రాజ్యలసద్భక్ష్యభోజ్యపానంబుల, హంసశోభితకమలాకరముల
కీరపుంస్కోకిలాధారవనంబుల ననుపమక్రీడామహాచలముల


గీ.

బహుళతరభాగ్యభోగ్యసంపదల నధిక, వైభవస్ఫూర్తుల సువర్ణవాసములను
ప్రబలి పాతాళలోకము ల్పరిహసించు, సారెసారెకుఁ గేరుచు స్వర్గపురిని.

69


వ.

ఆలోకంబుల సూర్యచంద్రతమఃప్రసారంబును, కాలకరణయు లేదు, దాని
క్రిందట.

70


సీ.

తనఫణాతతులనిద్దపుమణిద్యుతిపరం, పరలు బాలారుణప్రభల నీన
తనమహోన్నతదీర్ఘతనుకాంత సంపూర్ణ, స్ఫూర్తియశశివిభాస్ఫూర్తిఁ జూప
తనవిశాలాంతరీయనవీనచాకచ, క్యము క్రమ్ముకటికచీకటులు చూప
తనమహానిశ్వాసధారాప్రవాహముల్, విలయజంఝామరుత్కలనఁ దెలుప


గీ

తరళహారము లురమునఁ దారశైల, లుఠదమరవాహినీప్రణాళుల నదల్ప
తామరసనేత్రు తామసతను వనంతుఁ, డుర్వరాస్థలిఁ దలఁదాల్చియుండు నెపుడు.

71


చ.

ముసలహలాభిశోభితసమున్నతదోర్యుగుఁ డేకకుండలో
ల్లసనలసత్కపోలుఁ డచలస్వఫణాగ్రమణీగణప్రభా
ప్రసరణరంజితాఖిలధరావలయుండు లయుం డనంతుఁ
డుప్పసముగఁ దాల్చు నీభువనపంక్తులతోడి యజాండభాండమున్.

72


చ.

మునివరుఁడైన గర్గుఁడు సమున్నతిఁ దత్పదపంకజాతముల్
మనమునఁ గొల్చి జ్యోతిషికమార్గ మనర్గళబుద్ధిచే నెఱిం
గి నెఱినిమిత్తవేది యనఁ గీర్తితుఁడై దగెఁ దన్మహత్త్వ మిం
పెనయ ననంత మౌకతన నెంతు రనంతుఁ డటంచు సన్మునుల్.

73


చ.

అలఘుతరత్వలీల విలయావసరంబునఁ దన్ముఖాగ్నికీ
లల జనియించి రుద్రుఁడు చెలంగి జగత్రయజంతుజాలమున్
బలువిడి మ్రింగుఁ దన్మహిమపద్ధతి వేదము లైన నెన్నఁగాఁ
గలవె తదీయకీర్తనము కల్మషనాశము గాదె సువ్రతా.

74


వ.

ప్రళయకాలవ్యాజృంభమాణానంతముఖపరంపరాసముద్భూతజాతవేదశిఖా
నిష్క్రాంతిసమున్నిద్రుండగు రుద్రుండు సంకర్షణాత్మకుండై జగత్త్రయంబును
మ్రింగునని చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

75

గీ.

అవల జమునిక్రింద ననువొంద నరకవా, సములు పెక్కు గలవు సంయమీంద్ర
అందు పాపనిరతులౌ జనంబులు వసింతురు దురంతఘోరదుఃఖు లగుచు

76


వ.

అవియు రౌరవంబును, సూకరంబును, రోధంబును, తారంబును, విశననం
బును, మహాజ్వాలంబును, తప్తకుంభంబును, లవణంబును, తిరోహితంబును,
రుధిరాభంబును, వైతరణియు, క్రిమిశంబును, క్రీమిభోజనంబును, అసిపత్ర
వనంబును, లాలాభక్షంబును, పూయపానంబును, వహ్నిజ్వాలయు, అధశ్శి
రంబును, సందంశంబును, తమంబును, ఆవిచియు, శ్వభోజనంబును, అప్ర
తిష్టంబును, సంవీచియు మొదలైన నరకంబులు, భృశదారుణంబులు, శస్త్రా
గ్నిభయదాయకంబులునై, పెక్కు కలవు. అవియు యమశాసనాధీనంబులై
యుండు.

77


సీ.

పక్షపాతితఁ గూటసాక్షివల్కిన దురాచారుండు ప్రాపించు రౌరవంబు
భ్రూణహత్యాకారి పురహంత గోహంత, నిలుతురు రోధ మన్నిరయమునను
మధుపవిప్రఘ్నహేమస్తేనులను విరిజోకయు బడుదురు సూకరమున
క్రొవ్వునఁ గోడలిఁ గూతును గలిసినవాఁడు మహాజ్వాలవాసి యగును


గీ.

క్షత్రకులజుని వైశ్యునిఁ జంపినతఁడు, భగిని గలిసినవాఁడును భటునిఁ జంపి
నతఁడు గురుతల్పగుండును నధివసింతురు భయద తప్తకుంభాఖ్యనరకవసతి.

78


క.

గురులకు ననమతి చేసి, గురుపాపుఁడు వేదనిందకుడు తత్క్రయకా
ర్యరతుఁ డగమ్యన్ బొందిన నరుఁడును బోవుదురు లవణనరకంబులకున్.

79


వ.

మర్యాదాదూషకులు, దేవద్విజపితృద్వేషులు, రత్నదూషకులును, క్రిమిభక్ష
ణంబునం బడుదురు. దురిష్టకర్తలు క్రిమిశంబునం బడుదురు. దేవ, పితృ, సుర
ల కిడక భుజియించువారును లాలాభక్షణంబునం బడుదురు. శరఖడ్గాదికర్తలు
విశసనంబునం బడుదురు. అసత్ప్రతిపాదకుండును, అయాజ్యయాజకుండును
నక్షత్రసూచకుండును, పంక్తివారి కిడక తాను మృష్టాన్నంబు భుజియించు
వాడును లాక్షా, మాంస, రస, తిల, లవణ, విక్రీతయయిన బ్రాహ్మణుండును
నధోముఖనరకంబునం బడుదురు. మార్జాల, కుక్కుట, చ్ఛాగ, శునక,
వరాహ, విహంగంబులం బెంచినవారు దానియంద బడుదురు. రంగోపజీవియు,
కైవర్తుండు, కుండాశియు, గరదుండును, సూచకుండు, మాహిషకుండును,
పర్వగామియు, గృహదాహకుండును, మిత్రఘ్నుండును, శాకునియు, గ్రామ
యాజకుండును, సోమవిక్రేతయు తుదకాఖ్యనరకంబునం బడుదురు. మఖ
హంతయు, గ్రామహంతయు, వైతరణిం బడుదురు. ధనయౌవనమత్తులై
మర్యాదతప్పినవారును, అశౌచులును, కుహనాజీవులును, కృష్ణాఖ్యనరకంబు

నం బడుదురు. వనంబులు నరుకువాఁడు అసిపత్రవనంబునం బడు. గొఱియ
ల నేలువాఁడును, మృగవనాజీవియు వహ్నిజ్వాలాఖ్యంబునం బడుదురు.
మఱియు ననేకవిధపాపర్ము లనేకవిధనరకంబులఁ బడి యధోముఖులై
దుఃఖించుచు దేవతలం జూచుచుందురు. దేవతలును నధోభాగంబున నర
కమగ్నులగు నానరులం జూచుచుందురు.

80


గీ.

స్థావరంబులు క్రిములు నబ్జములు పక్షు లఖిలపశువులు నరులు ధర్మాభిరతులు
త్రిదశులును ముక్తులును నన తెలియ వరుస నొక్కటొకటికి సహస్రభాగోన్నతములు.

81


క.

విను జంతుతతులు ముక్తికి జనునంతకు నిలువవలయు స్వర్గనివాసం
బున నరకవాసమున ని ట్లని చెప్పిరి బ్రహవేత్త లైనమునీంద్రుల్.

82


సీ.

అఘములు చేసి ప్రాయశ్చిత్తవిముఖుఁడై, నర్యుడు ప్రవేశించు నరకవసతి
పాపంబుకొలఁది నేర్పఱచిరి ధరణి ప్రాయశ్చిత్తవిధులు మన్వాదిమునులు
జనుఁడు పశ్చాత్తాపసంసక్తుఁడై హరిం, దలపోయఁ జెడనిపాతకము కలదె
సకలతపఃకృచ్ఛ్రసముదయాత్మకములై వెలయు ప్రాయశ్చిత్తములకు నెల్ల


గీ.

పరమదుస్తరదురితభీకరము, పుణ్యకరము, సౌభాగ్యసంపదాకరము, సౌఖ్య
కరము, శ్రీకృష్ణవిభునామవరము, దలఁప మునివర తదీయమహిమ యే మనఁగవచ్చు

83


క.

రేపును మాపును పగలును శ్రీపతి నారాయణుని నశేషజగద్ర
క్షాపారీణుని నరుఁ డుద్దీపితగతిఁ దలఁచి పాయు తీవ్రాఘములన్.

84


శా.

శ్రీవిష్ణుస్మరణానుభావమున సంక్షీణాఘుఁడై ముక్తికిన్
బోవంబూనిన మానవోత్తముని కింపుల్ జూపు నాకాదిలో
కావాసంబు దలంచి చూచిన ఘనంబౌ నంతరాయమ్ము సు
మ్మీ వాచంయమివర్య! యార్యులమతం బీచంద మూహించినన్.

85


మ.

జపహోమార్చనముఖ్యకర్మముల కంసధ్వంసివై చిత్తమ
చ్చుపడ న్నిల్పి యనల్సహర్షమున మించుల్చూపు పుణ్యుండు స్వ
ర్గపతిత్వాదిఫలంబునైనఁ గడువిఘ్నం బంచు భావించు మో
క్షపదప్రాప్తిమహాఫలంబునకు యోగప్రస్ఫురన్మానసా.

86


గీ

అపునరావృత్తి మోక్షదాయకము వాను, దేవమంత్రజపంబు భూదేవవర్య
దానితో సరిపోల్పఁగాఁ దరమె సుకృతి, మరుగఁ జెడిపోవు నాకపృష్టాతిశయము.

87


సీ.

కావున రేయుఁబగలును శ్రీవిష్ణుసం, స్మరణం బొనర్చుచు నరుఁడు సకల
కలుషనిర్ముక్తుఁడై కనఁ డెన్నఁడును నర, కములు పుణ్యము పాతకమ్ము ననఁగ

స్వర్గనరకములసంజ్ఞలు సుమ్ము స్వ, ర్గము మనస్సంతోషకరము, దుఃఖ
కరము నరకము స్వర్గమునకు నరకము, నకుఁ గారణములు మనంబుసువ్వె


గీ.

కాన పుణ్యమనస్కుఁడై కమలనేత్రు, ననుదినంబును మది నెన్నుకొనుచునుండు
జనుఁడు నరకంబునకుఁ బోక శాశ్వతప్ర, భావహరిలోకవాసవైభవముఁ గాంచు.

88


వ.

విద్యావిద్యల, జ్ఞానాజ్ఞానపర్యాయంబులందు నరకప్రాప్తికారిణియైన యవి
ద్యం బరిహరించి నిఖిలశ్రేయస్సంపాదినియైన విద్య నాశ్రయించవలయు. ఇవ్వి
ధంబున సశైల, సాగర, సరి, ద్ద్వీప, కాననంబైన భూమండలమందును, సర్వ
పాతాళంబును, నరకంబులును సంక్షేపరూపంబునం జెప్పితి. అని చెప్పి భువ
ర్లోకాదిలోకంబులు వినఁగోరు మైత్రేయునకు శ్రీపరాశరుం డి ట్లనియె.

89


మ.

రవిచంద్రప్రచురప్రభాపటలిచే రంజిల్లి సద్ద్వీపశై
లవనాంభోనిధియైన భూమికి విశాలత్వంబు తానెంత యెం
తవిశాలత్వమొ యాకసంబునకుఁ జోద్యంబై ప్రవర్తిల్లు ని
ట్లవధానంబున నాత్మలోఁ దెలియు దివ్యజ్ఞానభవ్యాశయా.

90


సీ.

ఉర్వీస్థలమునకు నొక్కయోజనలక్ష, మున సూర్యుఁ డుండు సోముండు రెంట
మూఁట నక్షత్రసమూహంబు లేనింట, సౌమ్యుఁ డేడింట రాక్షసగురుండు
తొమ్మిదింట ధరాసుతుఁడు పదునొక్కట, సురమంత్రి పదుమూట సూర్యసుతుఁడు
పదునాలుగింట సప్తర్షిమండలము ప, దేనింట నలఘుఁ డౌత్తానపాది


గీ.

ఉగ్రకరునకుఁ బదివేలయోజనముల, క్రింద విపరీతగతి రాహుకేతువసతి
యివ్విధంబున గ్రహములు ఋక్షములును, దివి ప్రవర్తిల్లుఁ గమలసంభవకులీన.

91


క.

సకలజ్యోతిశ్చక్రము, నకు మేదీభూతుఁ డగుచు నభమున ధ్రువుఁ డు
త్సుకత న్వర్తిలుచుండుం, బ్రకటితతేజోవిరాజమానుం డగుచున్

92


క.

తెలియఁగ యజ్ఞఫలంబున, నలవడు నీభూమి దీనియందునె యజ్ఞం
బులు సుప్రతిష్ఠితములగు, జలజాతాక్షుండె యిన్నిజగములు విప్రా.

93


క.

ధ్రువునికి నూర్ధ్వంబున భ, వ్యవిభవమునఁ బొగడు గను మహాశ్లోకము వి
ప్రవర! యొకకోటిపొడవున, నవిరళగతి కల్పవాసు లం దుందు రొగిన్.

94


చ.

అటకు ద్వికోటియోజనసమంచితమౌ జనలోకమందు ను
త్కటమతులౌ పితామహసుతప్రవరుల్ సనకాదు లుందురు
చ్చటుల వివేకపాకవిలసద్విమలాశయు లాత్మమానస
స్ఫుటసరసీజసౌధతలసుస్థితపంకజమందిరాసఖుల్.

95

క.

జనలోకమునకు నవ్వల నొనరుఁ జతుష్కోటియోజనోత్సేధమునన్
వినుతతపోలోకము సజ్జననుతవైరాజదేవసంఘవసతియై.

96


వ.

సూర్యకిరణదాహవర్జితులై వైరాజనామధేయదేవత లాతపోలోకంబున
నుండుదురు.

97


గీ.

అనుపమంబై తపోలోకమునకు మీఁద నాఱుకోటులపొడవున నతులగతులఁ
బొగడు గను సత్యలోక మద్భుతవిభూతి యదియె బ్రహ్మకు లోకంబు సదయహృదయ.

98


వ.

ఆసత్యలోకంబున నపునర్జాతకులు వసియింతురు.

99


క.

పాదాభిగమ్యమై భువి నేది వెలయుచుండు దాని నెఱుఁగుము నీ వ
త్యాదృతి భూలోకం బని భూదేవకులాగ్రగణ్య పుణ్యచరిత్రా.

100


వ.

ఆభూలోకప్రకారంబు నీ కెఱింగించితిం గదా యని చెప్పి మఱియు నిట్లనియె.

101


మునిసిద్ధసేవితంబై యనఘంబై భూదివాకరాంతర్గత మై
పెనుపొందు భువర్లోకం బనవద్య ద్వితీయలోక మదియే సుమ్మీ

102


క.

రవిమండలంబు మొదలుగ ధ్రువమండలిదాఁక, పెంపుతో వెలయు ముని
ప్రవర! చతుర్దశలక్షము సువరాహ్వయలోక మఖిలసురసేవ్యంబై.

103


సీ.

భూర్భువస్వర్లోకములు మూఁడు కృతకముల్, జనతపస్సత్యసంజ్ఞములు మూఁడు
నకృతికంబులు, కృతకాకృతకము మహర్లోకంబు, విను మునిలోకవినుత
యిట్లు మీఁ దేడు క్రిం దేడులోకంబులు, నమరు బ్రహ్మాండమధ్యమున నట్టి
యండంబుబైట సప్తావరణంబులు, దశగుణోత్తరములై తనరు నవియు


గీ.

జలదహనమారుతాకాశములు నహంక్రి, యామహిత్ప్రకృతులు జుమ్మునీమది నిది
దలఁపుము, కపిత్థబీజసంతతులఁ గప్పుచిప్పచందంబు గాఁగ, నూర్జితవివేక.

104


అల కృతకాకృతకాఖ్యం, గలలోకము శూన్యమునను గల్పాంతమునన్
పొలుపరి చెడు నత్యంతః, ప్రళయంబున నది వివేకపాకనిధానా.

105


గీ.

అకృతకంబులు మూఁడు నత్యంతవిలయ, సమయమున నాశ మొందు సంయమివరేణ్య
కృతకములు మూఁడు కల్పాంతహతము లగును, తెలియు మవ్విధ మెల్ల సందియము దీర.

106


వ.

ఆబ్రహ్మాండంబునకు దశగుణోత్తరంబులై సప్తావరణంబు లుండు. అనంతంబగు
ప్రధానంబున కంతంబు లేదు. ఆప్రధానంబు కదా సమస్తంబునకు హేతుభూ
తమైన ప్రకృతి యనంబరఁగు. ఆప్రకృతియందుఁ గోట్యయుతసంఖ్యాతంబులైన
యండంబు లావృతంబులై యుండు. దారువునందు నగ్నియు తిలలయందు తైలం

బును బోలి, ప్రకృతియందుఁ బురుషుండు వ్యాపించి చేతనాత్ముండై యుండు.
ఈప్రధానపురుషు లిద్దరును నన్యోన్యంబులుం గూడి సర్వభూతాత్మభూతయైన
విష్ణుశక్తి నాశ్రయించి దృఢసంశ్రయంబులై యుందురు. సర్గకాలంబునఁ బ్రధాన
పురుషక్షోభకారిణియై విష్ణుశక్తి వెలయు. ఆవిష్ణుశక్తియ ప్రకృతిపురుషాత్మకం
బైన జగంబు వహించియుండు. విష్ణుశక్తిసంక్షోభితంబులగు ప్రకృతిపురుషుల
వలన మహదాదులు పుట్టు. వానివలన సురాసురాదులు పుట్టి వారిపుత్రపౌత్రు
పరంపరలవలన జగంబు పూరితంబయ్యె. బీజంబువలన వృక్షంబు పుట్టి తత్పరం
పరలవలన వృక్షషండంబు నిండునట్లు సర్వబీజభూతుండైన శ్రీవిష్ణునివలన జగం
బులు పుట్టెం గావున నిజ్జగంబు శ్రీవిష్ణుమయంబు.

107


గీ.

క్రతువుకర్తయుఁ గ్రియయును కర్మపలము, సకలమంత్రంబులు సృగాదిసాధనములు!
అరసి చూచిన పుండరీకాక్షుఁ డనుచు, నాత్మఁ దలఁచు మునిజముసంయమివరేణ్య.

108


అని చెప్పి శ్రీపరాశరుం డిట్లనియె.

109


క.

విను భానునియరదము మిం, టను దొమ్మిదివేలయోజనంబులు పరవై
వెనుపగు నీషాదండము, కనఁదగుఁ దద్విగుణ మగుచు గాఢవివేకా.

110


వ.

ఆసూర్యునిరథంబుక్రిందట నీపాదండంబునం దగిలి నూటయేఁబదియేడు
లక్షలయోజనంబుల వెడల్పై చక్రంబు వెలయు త్రినాభికంబును, బంచా
రంబును, షణ్ణేమికమును, అక్షయాత్మకంబును, సంవత్సరమయంబును నై, కాల
చక్రంబు దానియంద ప్రతిష్ఠితంబగు. యుగంబునకుఁ బ్రథమాక్షంబు
హ్రస్వంబును ద్వితీయాక్షంబు దీర్ఘంబునునై యుండు. అందు యుగార్థంబు
నం దగిలి హ్రస్వాక్షంబు, ధ్రువునకు నాధారంబై యుండు. ద్వితీయాక్షంబు
యుగార్ధంబునం దగిలి చక్రసంయుగంబై మానసోత్తరంబునం బ్రవర్తిల్లు.
నలుబదేనువేలున్నేనూరుయోజనంబులు ద్వితీయాక్షప్రమాణంబు. ఉభయ
యుగార్ధంబులప్రమాణంబును నక్షప్రమాణంబును నక్షప్రమాణంబ
గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, పంక్తియనియెడు ఛందంబు
లేడును సూర్యుని యరదంబులకు నశ్వంబులయ్యె.

111


సీ.

పాకారినగరి పశ్వోకసార, యనంగ, వివిధసంపదలచే వెలయుచుండు
యమరాజునగరి సంయమని, సమాఖ్య వి, స్ఫురితవైభవములఁ బొగడుఁగాంచు
అబ్ధీశునగరి సుధాభిధాన, యనేక, భోగభాగ్యముల విస్ఫూర్తిఁ గాంచు
కాబేరినగరి యోగ్యత విభావరి, యన, నిరుపమసౌఖ్యభాసురతఁ గాంచు


గీ.

మానసోత్తరగిరికిఁ గ్రమమునఁ దూర్పు, నందు దక్షిణదిశయందు నబ్ధినాథు
దిక్తటాంతంబునందు నుదీచియందు, నతులసద్గుణగణ్య సంయమివరేణ్య.

112

శా.

భాతిం దూర్పుననుండి దక్షిణదిశా ప్రత్యగ్దిశోదగ్దిశా
స్ఫీతద్యోతవితానుఁడై పటుధనుఃక్షిప్తాశుగాశుక్రియల్
చేతోమోదముగాఁ బ్రదక్షిణముగాఁ జిత్రస్థితిం ద్రిమ్మరున్
జ్యోతిశ్చక్రసమేతుఁడై యెపుడు ఖద్యోతుండు విప్రోత్తమా

113


వ.

అహోరాత్రవ్యవస్థానకారణంబు భగవంతుండైన హరియ కానెఱుంగుము.
ఉత్తరాయణంబు యోగులకు సకలక్లేశసంక్షయకరంబైన దేవయానపథం
బగు మార్గంబు. సర్వకాలప్రభావుండగు సూర్యునకు నుదయాస్తమయంబులు
లేవు. ఏదీవివారి కెచటం గానంబడియె నాదీవివారి కచట నుదయింబు ఎచ్చటం
గానంబడక యుండు నది యస్తమయంబు. దర్శనాదర్శనంబుల, యుదయా
స్తమయంబులు. అర్కుడు శక్రాదులపురంబున నుండి పురత్రయంబు స్పృ
శింపుచుం జను. పురోభాగం బెంతదవ్వు తపించు పృష్ఠపార్శ్వభాగంబులయందు
ను నంతమేర తపించు. ఊర్ధ్వభాగంబున మేరూపరిభాగమ్మున నున్న బ్రహ్మ
సభం దపింపలేఁడు. బ్రహ్మసభాతేజఃప్రతిహతంబులై సూర్యకిరణంబులు మగు
డంబడు వినుము.

114


చ.

రవికిరణంబు లెప్పుడును రాత్రులయందు హుతాశుకీలలన్
దలివి వసించు నట్లన పదంపడి వహ్నియు భానుఁ జెందు తా
దివములయందు నట్లగుట దీధితి రేలుఁబగళ్లు వహ్నికిన్
రవికిని మిక్కుటంబగు సనాతనధర్మధురీణవర్తనా.

115


వ.

అగ్నిసూర్యులు పరస్పరానుప్రవేశంబున నాప్యాయనంబు నొందుదురు
ఉత్తరాయణ దక్షిణాయనాత్మకంబగు సంవత్సరంబు దేవతలకు నొక్క
యహోరాత్రం బగు. అందు.

116


ఉ.

తుంబురునారదాదు లతిదోహలు లై తనకీర్తి పాడ ది
వ్యాంబుజలోచనాశతము లాడ జగంబులు వేడ్కఁగూడ న
య్యంబరమధ్యవీథిఁ గమలాప్తుఁడు ద్రిమ్మరు నంశుమండలీ
చుంబితసర్వదిక్కుఁ డగుచున్ వడిఁ గుమ్మరిసారెకైవడిన్.

117


గీ.

ఉష్ణకరుఁ డుత్తరాయణం బొందునపుడు, మకరమున కేగునంత కుంభంబు నొందు
మీనమేషవృషంబుల కానుపూర్వి నరుగు, నామీఁద మిథునంబు నాశ్రయించు.

118


ఉ.

కర్కటకంబు ద్రొక్కి కుతుకంబు దలిర్పఁగ సింహకన్యలం
దార్కొని త్రాసుపై నిలిచి తాలిమి వృశ్చికచాపయుక్తుఁడై
అర్కుఁడు దక్షిణాయనపథాధరణమ్మునఁ ద్రిమ్మరున్ శుభో
దర్కగతిం గ్రమాన్వయము దప్పక చెప్పఁగరాని వేడుకన్.

119

పంచచామరము.

కొలందిగా ధ్రువుండు మేరుకూటలగ్నకాలచ
క్రలాలితాక్షరూఢుఁడై వికాస మొప్పఁ ద్రిమ్మరున్
కులాలచక్రనాభియందుఁ గూర్చినట్టి మంటిము
ద్దలాగునన్ నిరంతరంబు తత్స్థలంబునం దగున్.

120


వ.

అయనద్వయంబునందును మార్తాండుండు శీఘ్రమందగతుల నడచుకతంబున
నహోరాత్రు లల్పంబులును, నధికంబులును నై నడచు.

121


సీ.

పంకజగర్భుశాపంబునఁ బ్రత్యహం, బును మృతిఁబొందుచుఁ బుట్టుచున్న
నిరుపమోద్ధతులు మందేహాభిధానరా, క్షసులు సంధ్యల వచ్చి సవితుఁ బట్టి
మ్రింగ నూహింతురు మేదినీసురులు సం, ధ్యోపాస్తి సేయుచు నుర్వి విడుచు
మేదురప్రణవసమేతగాయత్ర్యభి, మంత్రితార్ఘ్యాంబువుల్ మహితవజ్ర


గీ.

ధారలై తాకి దైత్యులతలలు ద్రుంచు, మగుడి సంధ్యలఁ బుట్టి యిమ్మాడి జత్తు
రాతతాయులు వారు నిత్యంబు నిట్ల, అహిమభానునినడక బ్రాహ్మణవరేణ్య.

122


ఉ.

ఆదిని వహ్ని నిండె ప్రధమాహుతిచేఁ బరితుష్టి నొందు ఛా
యాదయితుండు దాన దివిజారు లడంగుదు రట్లు కానఁ బ
ద్మోదరమూర్తిభానుఁ గరుణోదధి సంధ్యలఁ గొల్వఁగా దగున్
కాదని కొల్వఁ డెవ్వఁడు వికర్తన హంతయతండ ధారుణిన్.

123


వ.

ఇట్లు మందేహుల జయించి.

124


గీ.

లోకరక్షణపరులు సుశ్లోకు లధిక, తరతపోధను లత్యంతధర్మపరులు
కీర్తనీయులునగు వాలఖిల్యముఖ్య, భూసురులరక్షఁ దెలివొంది పోవు నినుఁడు.

125


వ.

నిమేషకాష్టకళాముహూర్తపరిమాణంబులు నీకుం జెప్పితిం గదా. అట్టి
ముహూర్తంబులు ముప్పది యహోరాత్రంబు. సూర్యరేఖోదయంబు
మొదలుకొని మూడేసిముహూర్తంబులు ప్రాత, స్సంగవ, మధ్యాహ్న,
పరాహ్ణ, సాయాహ్నసంజ్ఞలం బరఁగు. ఇప్పదేనుముహూర్తంబులు దివం
బగు అంతియె రాత్రియగు. ఉత్తరాయణ, దక్షిణాయంబుల నహోరాత్రం
బులు వృద్ధిక్షయంబులం బొందు.

126


గీ.

మేషతులలయందు మిహిరుండు వసియింప, సమము రేయిఁబగలు విమలచరిత
అగును దక్షిణోత్తరాయణంబులు కర్కి, మకరముల నినుండు మహిమ నుండ.

127


వ.

పదేనహోరాత్రంబులు పక్షంబు, పక్షద్వయంబు మాసంబు. మాసద్వ
యంబు ఋతువు, ఋత త్రయం బయనంబు. ఆయనద్వయంబు సంవత్సరం
బగు, వినుము.

128

గీ

వరుస సంవత్సరము బరివత్సరంబు, బ్రాహ్మణోత్తమ యివ్వత్సర మనువత్స
రమును వత్సరమును ననం బ్రభవముఖ్య, వత్సరము లైదుయుగ మన వసుధఁ బరఁగు

126


వ.

అందుఁ బ్రథమంబు సంవత్సరంబు, ద్వితీయంబు పరివత్సరంబు. తృతీయంబు
ఇవ్వత్సరంబు చతుర్థం బనువత్సరంబు. పంచమంబు వత్సరంబుగా నిట్లు
ప్రభవాది పంచవర్షంబులు సౌర, చాంద్ర, నక్షత్ర, సావనమాస వికల్పితం
బులై యుగ మనం బరఁగు. ఈభూమండలంబునకుఁ గడపలదైన లోకా
లోకశైలంబునకు దక్షిణంబును, నుత్తరంబును, వైషువంబును నన మూఁడు
శృంగంబులు గల వందు మేషతతులయందు మార్తాందుండు వైషువతీశిఖరం
బున నుండ దివారాత్రంబులు సమంబుగా నడచు. ఆసమకాలంబు విషువ
కాలం బనం బరంగి పుణ్యకాలం బయ్యె. అందు దేవ, పితృదానంబులు చేసి
కృతకృత్యు లగుదురు. శుక్లపక్షాంతంబు పౌర్ణమాసి యనం బరఁగు. కృష్ణ
పక్షంబు అమావాస్య యనం బరఁగు ఆపౌర్ణమాసికి రాకయు ననుమతి
యును, అమావాస్యకు, శిరవాలియు, కుహువు నను నామాంతరంబులు
కలవు. మాఘఫాల్గుణంబులును చైత్రవైశాఖంబులును జ్యేష్టాషాఢంబు
లును, శిశిరవసంతగ్రీష్మఋతువులు మూఁడు నుత్తరాయణంబు. శ్రావణ
భాద్రపదంబులును ఆశ్వీజకార్తికంబులును మార్గశీర్షపౌష్యంబులును
నను వర్షాశరద్ధేమంతఋతువులు మూఁడును దక్షిణాయనం బనం బరఁగు.

127


చ.

నరనుత చక్రవాళగిరి నాలుగుదిక్కుల లోకపాలురున్
పరమతపోధనుల్ సుగుణభాసురు లుత్తము లున్నతవ్రతుల్
దురితవిదూరు లుండుదురు దోహల మొప్పఁగఁ గర్దమాత్మజుల్
నిరతము లోకరక్షణమనీష నశేషజగద్ధితార్థులై.

128


వ.

వారలు సుధన్వుండును, శంఖపుండును, హిరణ్యరోముఁండును, కేతుమంతుం
డును ననం బరఁగుదురు. ఉత్తరంబు దేవయానమార్గ౦ బని చెప్పితిం గదా; దక్షి
ణంబు పితృయానమార్గంబు. అందు నగ్నిహోత్రులైన ఋషులు భూతారం
భకారియైన బ్రహ్మంబు చెప్పుచు సంతతతపోమర్యాదాశ్రుతంబులచేతఁ
బ్రతియుగంబులయందు బ్రహ్మస్థాపనంబు సేయుచుండుదురు. వారలమార్గం
బు గదా దక్షిణంబు. దక్షిణమార్గప్రవర్తనులు చచ్చుచుఁ బుట్టుచు యాతా
యాతంబు నొంది భూతసంప్లవపర్యంతంబు నుండుదురు. దేవయానమార్గంబై న
యుత్తరాయణంబునందు, ఇంద్రియజయశీలురును, బ్రహ్మచారులును, విమలు
లును, సంసారదూరులును, ఊర్థ్వరేతస్కులును నైన యతీశ్వరులు భూతసంప్లవ
పర్యంతంబును వసియించి యుండుదురు. వారలు లోభంబు లేమిని వ్యపాయ
వర్ణనంబున కామాదిదోషరాహిత్యంబున నమృతంబును బొందుదురు.

129

గీ.

కమలభవునిపగటి కడపల సకలభూతములు విలయ మొందు దానిపేరు
భూతసంప్లవంబు భూర్భువస్స్వర్లోక, నాశకరము బ్రాహ్మణవరముఖ్య

130


చ.

క్రమగతి బ్రహ్మహత్యయుఁ దురంగమమేధము చేసినట్టి దు
ర్దమతమపాపకర్ముఁడును బ్రస్ఫుటపుణ్యచరిత్రుఁడు నా యథా
ర్హమునిరయంబు నాకమున నంట వసింతురు భూతసంప్లవం
బమరిన దాఁక నిత్తెఱఁగులై చను వేదవిధానపద్ధతుల్.

131


గీ.

ధరణినుండి ధ్రువపదముదాఁక భూతసం, ప్లవము చెల్లును ఋషిపదముకన్న
ధ్రువపదమునకన్న నవలయై వెలయు శ్రీ, విష్ణుపదము ఘనవివేకధుర్య

132


సీ.

బ్రాహ్మణవర! విష్ణుపద మతిదివ్యంబు, తతము తృతీయపదంబు, వ్యోమ
మున వెలుంగుచునుండు మననశీలురు యతుల్, పుణ్యపాపంబులు పోవఁ ద్రోచి
అందుఁ జెందుదురు శోకామయాదులు పున, రాగతు ల్లేవు తదాశ్రితులకు
సచరాచరంబైన జగమంతయును దాని, యంద సంప్రోతమై యమరుచుండు


గీ.

లోకసాక్షులై వెలుంగుధర్మధ్రువాదు, లును దానియందనె నిలిచియుంద్రు
రనఘమైన జ్ఞానమును వివేకంబును, నందకలవు బొగడ నలవి యగునె.

133


మ.

తెలివిం దత్పద మంది యాధ్రువుఁడు మేధీభూతుఁడై సంతతో
జ్వలతారాగ్రహచక్ర మెల్లపుడు ఠేవం ద్రిప్పుచుం గాంచె నా
చలమూర్ధోపరిపుష్కరాంతమున నుచ్చైర్దీప్తితో నుండు శ్రీ
లలనాధీశపదాబ్జపూజనమహోల్లాసస్ఫురన్మూర్తియై.

134


వ.

విష్ణుపదంబున ధ్రువుండు, అతనియందు సర్వజ్యోతిస్సులు వానియందు మేఘం
బులు, వానియందు సంతతవృష్టియు నుండు. ఆవృష్టి వలన దేవతిర్యఙ్మనుష్య
ప్రముఖులకు పుష్టియు నాప్యాయనంబును నగు. యజనంబులయందు నాజ్యా
హుతిముఖంబునం బోషితులై దేవగణంబులు వృష్టికారణంబై సర్వభూత
స్థితికి హేతుభూతు లగుదురు. ఇవ్విధంబున లోకత్రయంబునకు నాధారంబై,
యమలాత్మకంబై, తృతీయంబైన విష్ణుపదంబు వృష్టికిఁ గారణం బయ్యె
వినుము

135


మ.

సిరు లొప్పం బ్రభవించె నందు నమరశ్రీపీనవక్షోరుహాం
తరవిన్యస్తపటీరకుంకుమవినోదపక్రమస్నానపిం
జరతాప్రాపితభూరివారికలితోచ్చైర్భంగశ్రీశాంఘ్రివి
స్ఫురితాంగుష్ట మనంగ గంగ భువనంబుల్ ప్రోవ విప్రోత్తమా.

136


సీ.

సకలలోకోన్నతస్థానస్థితౌత్తాన, పాదిశిరంబుపైఁ బాదుకొనియె
బహుతపోవిభవవిభ్రామితమహనీయశీలసప్తర్షుల నోలలార్చె

గళితసుధారససతుష్టబుధశ, శాంకమండలిఁ గొనియాడఁజేసె
కాంచనశైలశృంగనిరూఢసంతాన, వాటిపరంపర వాడుదీర్చె


గీ.

అచటినుండి యసితయలకనందాభిధ, చక్షుభద్ర యనెడు సంజ్ఞ లమర
నాల్గుదిక్కులకు ఘనప్రభ వహియించె, గంగ విమలవాస్తరంగ యగుచు.

137


క.

మేరుగిరిదక్షిణమునఁ గ, ళారుచి ప్రవహించు నయ్యలకనందం గౌ
రీరమణీరమణుఁడు వాం, ఛారతిఁ దలఁ దాల్చె పెక్కుసంవత్సరముల్.

138


హరవరమస్తకాంచితజటావలి వెల్వడి, చంద్రమశ్శర
చ్ఛరదశరద్యుతిం దెగడు చక్కనితుంగతరంగమాలికల్
ధరణికిఁ దారహారరుచి దార్కొన దక్షిణవార్ధిఁ జొచ్చి యు
ద్ధురసగరాత్మజాస్థితతి దోఁచిన స్వర్గతులైరి వారలున్.

139


ఈగంగాజలంబులయందు స్నాతులగువారలకు సకలపాపప్రణాశనంబును
అపూర్వపుణ్యప్రాప్తియు నగు. తత్తోయంబుల తర్పణంబు చేసిన పిత్రాదులకుఁ
బరమతృప్తి యగు. ఆగంగయందు యజ్ఞేశ్వరుండైన పురుషోత్తము యజ్ఞం
బుల నారాధించి భూపాలకు లిహపరసుఖంబు లనుభవించిరి. తజ్జలస్నానాతి
పూతపాపులగు యతీంద్రులు కేశవాసక్తమనస్కులై నిర్వాణంబు నొందిరి.
వీని నభలషించిన జూచిన నంటిన నవగాహించినఁ గీర్తించిన నిగ్గంగ సకల
భూతంబులం బవిత్రులం జేయు. యోజనశతంబుల నుండియైన గంగానామంబు
నుడివిన జన్మత్రయార్జితపాపంబు లడంగు. ఇట్లు సకలలోకపావనియైన గంగకు
నుద్భవస్థానంబైన శ్రీవిష్ణుపదంబు తృతీయపదంబుగా నెఱుఁగుమని చెప్పి
శ్రీపరాశరుం డిట్లనియె.

140


ఉ.

ఆకమలాక్షురూపము నభోంతమున న్వెలుగొందు శింశుమా
రాకృతితారకామయము నై, మునివల్లభ, దానితోఁకపై
నేకద యాధ్రువుండు వసియించుట, తారకల న్గ్రహంబులన్
గైకొని ద్రిప్పుచుండు నతిగాఢసమీరణపాశబద్ధుఁడై.

141


ఆరయ శింశుమారతనుఁడైన జనార్దనుమానసంబునన్
గోరి భజించు నాధ్రువునకు న్సకలగ్రహతారకాళికిన్
సారసపత్రలోచనుఁడు సర్వచరాచరభూతధారి యా
ధారముగా నెఱుంగుము యథాకథనం బిది నీకుఁ జెప్పితిన్.

142


క.

ఇనుఁ డెనిమిదిమాసంబుల, తనకరముల నవనిరసము తగఁ గైకొని నా
ల్గునెలల నొసంగు నన్నం, బనువుగ జీవించుఁ బ్రాణులన్నియు దానన్.

143

చ.

దినమణి వాయునాడిమయతీక్ష్ణమయూఖచయంబుచే జలం
బొనరగ సోమునందు నిడు నుర్వరసర్వజలంబు లీల గై
కొని ఘనపంక్తిపై విడుచు కూడుక కాలమరుత్ప్రయుక్తతన్
ఘనములు భూమిపై విడుచు గర్జిలుచు న్నవవారిపూరముల్.

144


సీ.

కమలాప్తుఁ డాకాశగంగాంబుపూరముల్, తినమయూఖములఁ గైకొని పయోద
తతులు సోకకయుండ ధరణిపై విడుచు త, జ్జలకణములు పయిం జలుక నరుఁడు
దురితనిర్ముక్తుఁడై నరకముల్ జూడక, దివమున కేగు భూదేవవర్య
మేఘసంవృతి లేక మిహిరుండు గానరా, దివినుండి పడు వారి దివ్య మనెడు


గీ.

స్నాన మని యెఱుంగు సంయమివర యిది, పాపనాశనమ్ము భవ్యతరము
లోకనుతము పుణ్యలోకదాయకము, పుణ్యైకలభ్య మతిరమాకరంబు.

145


క.

సరి కృత్తికరోహిణిమృగ, శిరమున రవి మొగులు లేక చెలఁగఁగ ధరపై
దొరఁగిన జల మది దిక్కరి, కరగళితము గాఁగ జగము కలుషము లడఁచున్.

146


వ.

మేఘసముత్సృష్టంబగు జలంబు సకలప్రాణులకు నోషధులకు జీవనకరంబగు,
అయ్యోషధులచేత శాస్త్రచక్షువులైన మానవులు యజ్ఞంబు సేయుదురు.
అయ్యజ్ఞంబువలన దేవతలకు నాప్యాయనంబగు. ఇట్లు యజ్ఞంబులు, వేదం
బులు, వర్ణంబులు సర్వదేవనికాయంబులు. పశ్వాదులు వృష్టిచేత నన్నసం
పన్ను లగుదురు అట్టివృష్టి సూర్యునివలన నిష్పన్నయగు. అట్టిసూర్యునకు
ధ్రువుం డాధారభూతుండు. ధ్రువునకు శింశుమారం బాధారంబు. శింశుమారం
బునకు హృదయస్థుండై శ్రీనారాయణుం డాధారంబై సర్వభూతంబుల ధరిం
చునని శ్రీపరాశరుం డిట్లనియె.

147


విను నాల్గువేలమీఁదట, నెనుబదియోజనములపొడ వెక్కును దిగు సూ
ర్యునిరథము రెండుదిక్కుల, ననయము నిది వత్సరగతి హరిదశ్వునకున్.

148


వ.

దేవర్షిగంధర్వాప్సరోగ్రామణిసర్పరాక్షసులచేత నాదిత్యుండు సతతాధి
స్థితుండై యుండు. అది యెట్లనిన ధాతియను దేవతయు కృతస్ధలయను నప్స
రయుఁ బులస్త్యుండను ఋషియు వాసుకియను సర్పంబున, రథకృత్తమ
గ్రామణియు హేతియను రక్కనుండును తుంబురుండను గంధర్వుండును
నీయేడ్వురును చైత్రమాసంబున సూర్యునిరథంబున వసియింతురు. అర్యముం
డను దేవతయు పులహుండను ఋషియు ధౌజుండను సర్పంబును పుంజికస్థల
యనునచ్చరయు ప్రహేతియను రక్కసుండును రథనిరుండను గ్రామణియు
నారదుండను గంధర్వుండును నీయేడ్వురు వైశాఖమాసంబున సూర్యునిరథంబు
పై వసియింతురు. అరుణుండను దేవతయు వసిష్ఠుండను ఋషియు నాగాఖ్యం

బను సర్పంబును సహజన్యయగు నచ్చరయు హూహూయను గంధర్వుఁడును
వరుణుండను రక్కసుండును చిత్రుండను గ్రామణియు నీయేడ్వురు జ్యేష్ఠ
మాసంబు సూర్యరథంబుపై వసియింతురు. మిత్రుండను దేవతయు అత్రి
యను ఋషియు తక్షకుండను సర్పంబును, పౌరుషేయుండను రక్కసుండును
మేనకయను నచ్చరయు హాహాయను గంధర్వుఁడును శతస్పరుండను గ్రామణియు
నీయేడ్వురు నాషాఢమాసంబున సూర్యునిరథంబుపై వసియింతురు. ఇంద్రుఁడను
దేవతయు విశ్వావసుండను గంధర్వుండును శ్రోతుండను గ్రామణియు ఇలా
పుత్రుండను రక్కసుండును అంగిరుండను ఋషియు ప్లమోచనయను నచ్చ
రయు సర్పాఖ్యుండను నాగరాజును నీయేడ్వురును శ్రావణమాసంబున
సూర్యునిరథంబుపై వసియింతురు. వివస్వంతుండను దేవతయు భ్రుగుండను
ఋషియు అగ్రసేనుండను గ్రామణియు అపూరణుండను గంధర్వుండును అను
ప్లమోచయను నచ్చరయు శంఖహరుండను సర్పంబును వ్యాఘ్రుండను
రక్కసుండును ఈయేడ్వురును భాద్రపదమాసంబున సూర్యునిరథంబుపై
వసియింతురు. పూషయను దేవతయు గౌతముండను ఋషియు ఘృతాచియను
నచ్చరయు నుషేణవ్యుండను రక్కసుండును రుచియను గంధర్వుండును ధనం
జయుండను సర్పంబును పారుండను గ్రామణియు నీయేడ్వురును నాశ్వయు
జమాసంబున సూర్యునిరథంబుపై వసియింతురు. పర్జన్యుండను దేవతయు
భరద్వాజుండను ఋషియును విశ్వావసుండను గంధర్వుండును ఐరావతుండను
సర్పంబును విశ్వాచి యను నచ్చరయు సేనజిత్తను రక్కసుండును చాపా
ఖ్యుండను గ్రామణియు నీయేడ్వురును గార్తికమాసంబందు సూర్యునిరథంబు
పై వసియింతురు.అంశుండను దేవతయు కాశ్యపుండను ఋషియు తార్క్ష్యుండను
గ్రామణియు మహాధరుండను గంధర్వుండును ఊర్వశియను నచ్చరయు చిత్ర
సేనుండను రక్కసుండును విద్యుత్తను సర్పంబును మార్గశీర్షమాసంబున
సూర్యునిరథంబుపై వసియింతురు. త్వష్టయను దేవతయు క్రతుండను ఋషియు
పూర్ణాయువను గ్రామణియు స్ఫూర్జకుండను రక్కసుండును కర్కోటకుండను
సర్పంబును అరిష్టనేమియను గంధర్వుండును, పూర్వచిత్తియను నచ్చరయు
పుష్యమాసంబున సూర్యునిరథంబుపై వసియింతురు. త్వష్ట యను దేవతయు
జమదగ్నియను ఋషియు కంబళుండను సర్పంబును తిలోత్తమయను నచ్చ
రయు ప్రపితుండను రక్కసుండును రుతజిత్తను గ్రామణియు ధ్రుతియను
నచ్చరయు మాఘమాసంబున సూర్యునిరథంబుపై వసియింతురు. విష్ణుండను
దేవతయు విశ్వామిత్రుండను ఋషియు అశ్వతరంబను సర్పంబును రంభ
యను నచ్చరయు యజ్ఞవేతుండను రక్కుండును సూర్యవర్చుండను గంధ
ర్వుండును సప్తజిత్తను గ్రామణియు నీయేడ్వురు ఫాల్గుణమాసంబున

సూర్యునిరథంబుపై వసియింతురు. వీరలు లోకప్రకాశనార్థంబు క్రమంబున
ద్వాదశమాసాధికారులై విష్ణ్యుశక్త్యుపబృంహితులై వసింతురు. అందు మునులు
నుతించుచు, గంధర్వులు పాడుచు, అచ్చర లాడుచు, రక్కసు లనువర్తించుచు,
పన్నగంబులు వహించుచు, గ్రామణులు పగ్గంబులు పట్టుచు వసియింతురు.
వాలఖిల్యులు పరివేష్టించి యుపాసింతురు. ఈయేడుతెఱఁగులవారును రవి
మండలఁబునందు నిలిచి హిమోష్ణవారివృద్ధులకుఁ దమతమసమయంబున
హేతువు లగుదురని చెప్పిన శ్రీపరాశరునకు మైత్రేయుం డి ట్లనియె.

149


సీ.

ధీరేంద్ర యీయేడుతెఱఁగులవారును, సరిజోదరదివ్యశక్తిబృంహి
తాత్ములై యాదిత్యులరదంబుపైనుండి, [1]శీతలోష్ణాంబువృష్టిముఖ్యకార్య
కారు లౌదురని వక్కాణించితిరి భానుఁ, డే శీతవాతాంబువృష్టులకును
హేతుభూతుఁ డని యెఱిఁగించితిరి, మును పిది సందియము దోఁచె నెఱుఁగఁ జెపుఁడ


గీ.

అదియుఁగాక భానుఁ డస్తమితుఁ డయ్యె, నుదితుఁ డయ్యె ననుచు నుర్విజనము
లెదురు చూడనేల యీపను ల్వీరలు, తీర్చిరేని దీనిఁ దెలుపవయ్య

150


వ.

అని యడిగిన మైత్రేయునకు శ్రీపరాశరుం డిట్లనియె.

151


క.

విను మెంద ఱున్నఁ గానీ, దినకరుఁడే ముఖ్యుఁ డతనితేజంబుననే
యొనగూడు నన్నిపనులును, జనవినుతము లగుచు నెపుడు జగములయందున్.

152


ఉ.

భూమిసురేంద్ర యిజ్జగముఁ బ్రోఁచుటకై విలసించు ఋగ్యజు
స్సామసమాఖ్యశ్రీవిభునిశక్తి యఘౌఘమ ద్రుంపఁజాలు ను
ద్దామమహావిభూతి నది తామరసాప్తునియందు నిల్చి ది
వ్యామృతవృష్టివాత, మిహికాదికకృత్యము తీర్చు నెప్పుడున్.

153


క.

రేపుల ఋఙ్నివహంబును, మాపుల సామవ్రజంబు, మధ్యాహ్నములన్
దీపితయజుస్స్తుతులును మ, హాపటిమ బొగడుచుండు నంబుజబంధున్.

154


వ.

సర్గాదియందు శ్రీమన్నారాయణుండు సృష్ట్యర్థంబు రజోగుణం బవలంబించి
ఋగ్వేదమయుండైన చతుర్ముఖుఁ డయ్యె. రక్షణార్థంబు సత్వగుణం బవలం
బించి యజుర్మూర్తియైన విష్ణుం డయ్యె. సంహారార్థంబు తమోగుణం బవలంబించి
సామస్వరూపియైన రుద్రుడం య్యె. కావున సామస్వరం బశుచి యయ్యె. ఏవం
విధమహిమగల విష్ణుశక్తి సత్వగుణస్థుండైన యాదిత్యు నధిష్ఠించి యుండి
వెలుంగంజేయు.

155


చ.

సమధికవిష్ణుశక్తిపరిసర్పితుఁడై సవితృండు ఘోరసం
తమసము బాఱఁద్రోలి భువనంబులు బ్రోచుచునుండుఁ గాని ని

త్యము నుదయంబు, నస్తమయ మందుటలేదు త్రయీమయాత్ముఁ డ
ర్యముఁడు త్రిమూర్తిరూపుఁడు సురస్తుతిపాత్రము సుమ్ము సువ్రతా.

156


చ.

సుముఖత శుక్లపక్షమున సోముఁడు భాస్కరు భాన్వనుప్రవే
శమహిమ వృద్ధిచేఁ బొలిచి శ్యామలపక్షమునన్ గళల్ యథా
క్రమమున దేవతాపితృపరంపర కిచ్చుఁ గళాసుధాశన
ప్రముదితులై సుఖింతురు శుభస్థితి వారును ధీరపుంగవా.

157


వ.

దేవతలకుఁ బక్షతృప్తియు, పితరులకు మాసతృప్తియు, మర్త్యులకు నిత్యతృప్తి
యుం జేయుచు నర్కుండు ప్రవర్తించు.

158


సీ

మూడుచక్రములు సోమునిరథంబునకును, కుందాభములు పదిఘోటకములు
కుడికడ నెడమదిక్కునఁ గట్ట నత్తురం, గము లారథంబు వేగమునఁ దిగుచుఁ
దనకు నాధార ముత్తానపాదసుతుఁడుగా దిన మొక్కఋక్షమున నుండి
చరియించు నవసుధాకిరణుండు సురకోటికళలు ద్రావిన రెండుకళలు చిక్కి


గీ.

సలిలములు చొచ్చి వీరుదుచ్చయము చొచ్చి యర్కమండలిఁ జొచ్చు నయ్యర్కుకిరణ
మొక్కటియె తన్ను గ్రమవృద్ధి నొందఁజేయ, గగనవీథి యథాపూర్వగతిఁ జరించు.

159


వ.

చంద్రుండు జలవీరుత్సూర్యమండలంబులు చొచ్చినకాలం బమావాస్య యనం
బరఁగు. అందును వీరుత్తులు ఛేదించిన నొక్కయాకైనం గోసిన బ్రహ్మహత్యా
ఫలంబు నొందుదురు. సౌమ్యులును బర్హిషదులును అగ్నిష్వాత్తులును అనఁ
బితరులు మూఁడుతెఱంగులవారలు. వీర లమావాస్యనాఁ డపరాహ్ణకాలం
బున సూర్యగతుండగు సోమునికళాద్వయంబును బానంబు సేయుదురు. అది
స్వధామృతం బనం బరఁగు. అందువలనఁ బరమనిర్వృతిం బొంది మాసతృప్తు
లగుదురు. ఇట్లు దేవపితృగణంబులు దృప్తులు జేసి యమృతమయంబు లైన
శీతలపరమాణువులచే [2]వీరుదోషధులు నిష్పాదించి వానివలనను బ్రకాశాహ్లా
దంబులవలనను మనుష్యపశుకీటంబుల నాప్యాయనంబు నొందించుచు
హిమాంశుండు కీర్తితుం డగుచు నుండు.

160


గీ.

అవనిదేవ పిశంగవర్ణాష్టతురగ, వాహ్యమై సర్వసన్నాహవంతమై ప్ర
శస్తి గాంచినరథముపైఁ జంద్రసుతుఁడు, బుధుఁడు వెలుగొందు లోకసంపూజ్యుఁ డగుచు.

161


క.

సవరూధం బనుకర్ష, స్తవనీయం బష్టభూమి జ తురగవాహ్యం
బవలోకనీయమును నగు, ప్రవిమలరథ మెక్కురవి తిరం బగు కణఁకన్.

162


గీ.

అరుణసంభవపద్మరాగారుణాష్ట, తురగసంవాహ్యకనకబంధురరథంబు
తెలివి దళుకొత్త నెక్కు దేదీప్యమాన, మణివరోద్భాసితగళుండు మంగళుండు.

163

చ.

ధవళహయంబు లెన్మిది యుదగ్రతఁ గట్టిన పైఁడితేరిపై
దివిజపురోహితుండు సముదీర్ణతతోడ వసించి యేటియే
టివరుస నొక్కటొక్కటిగ ఠీవిని రాసులు త్రొక్కుచుండుఁ బ్రా
భవమున భూజనంబులకుఁ బ్రస్ఫుటశోభనముల్ ఘటించుచున్.

164


గీ.

శబలవర్ణంబు లాకాశసంభవములు, నైనయెనిమిదిగుఱ్ఱంబు లానియున్న
స్యందనం బందముగ నెక్కి మందమంద, గమనమున సూర్యసుతుఁ డేగు గగనవీథి.

165


క.

ఎనిమిదినల్లనిగుఱ్ఱము, లనువుగ వహియించు ధూసరాభరథము పెం
పెనయంగ నెక్కి రాహువు, దినదినమును నభ్రవీథిఁ దిరుగుచునుండున్.

166


క.

ధూమలరుచి లాక్షావ, ర్ణామితవేగంబునైన నశ్వాష్టక ము
ద్దామగతిఁ బూన్చునరదము, పై మెలఁగున్ గేతు వభ్రపదమున నెపుడున్.

167


వ.

ఇది నవగ్రహంబులరథంబులతెఱంగు.

168


క.

రవిఁ బట్టి విడుచుఁ బదపడి, ధవళకరునిఁ బట్టి విడుచుఁ దత్తత్పర్వ
ప్రవరసమయముల రాహువు, దివి నవిరతవక్రగమనదీపితుఁ డగుచున్.

169


వ.

ఈనక్షత్రగ్రహతారలు రానులు నన్నియు ధ్రువునియందు వాతరశ్మిబద్ధం
బులై ధ్రువునిం ద్రిప్పుచు తామునుం దిరుగుచుండు. ఈధ్రువాదులకు
నాధారంబు శింశుమారం బని యెఱుఁగుము. ఈశింశుమారదర్శనంబు చేసి
పాపంబులం బాసి యాయుష్మంతు లగుదురు.

170


క.

వనజాతపత్రనేత్రుఁడు, మునిపుంగవ శింశుమారమూర్తిధరుండై
వినువీథిఁ దిరుగు నెప్పుడు, వినుము తదీయప్రభావవిశ్రుతమహిమల్.

171


వ.

ఆశింశుమారంబునకు నుత్తరహనువున నుత్తానపాదుండును, అధరంబున
యజ్ఞంబును, మూర్ధంబున ధర్మంబును, హృదయంబున నారాయణుండును,
పూర్వపాదంబుల నశ్వినులును, పశ్చిమపాదంబుల వరుణార్యములును,
శిశంబున సంవత్సరంబును, అపానంబున మిత్రుండును, పుచ్ఛంబున నగ్ని
మహేంద్రకశ్యపధ్రువులును నుండుదురు. పుచ్ఛాశ్రయంబైన యీనక్షత్ర
చతుష్టయంబును నస్తమయంబు నొందదు. ఇది సమస్తజ్యోతిస్సన్నివేశంబు.

172


గీ.

భువనములు జ్యోతిరుచ్చయంబులు వనంబు, లద్రులు దిశల్ నదీసముద్రాదికములు
అస్తినాస్తిపదార్థవేద్యములు నంబు, జాతనేత్రుండుసుమ్ము విఖ్యాతచరిత.

173


వ.

అశేషజగన్మూర్తియైన భగవంతుండు జ్ఞానస్వరూపుండు గాని వస్తుభూతుం
డు కాఁడు. కావున జగంబంతయు జ్ఞానస్వరూపంబు.

174

క.

విను భూమి యనఁగ మృత్తిక; యనఁగ ఘటం బనఁ గపాల మన చూర్ణ మన
న్వినుతపరమాణు వనఁగా, నొనరిన యది భూమి గాదె యూహింపంగన్.

175


వ.

అట్లు సచరాచరంబైన జగంబంతయు జ్ఞానస్వరూపుండైన భగవంతుండు.
విశుద్ధంబు విమలంబును విశోకంబును నిరస్తసంగమంబును ఏకంబును
నగుజ్ఞానంబు పరముండును పరేశుండును నగు వాసుదేవుండు. అతనికన్న
నన్యంబు లేదు. ఇది సకలభువనాశ్రితంబగు వాసుదేవాఖ్యజ్ఞానంబు నీకు
నెఱింగించితి.

176


క.

సవనపశుపావకర్త్వి, ఙ్నివహము స్వర్గఫలసామగీతి స్వరభో
గవిభూతిగతులు భూదే, వవరా! విష్ణుండసుమ్ము వర్ణింపంగన్.

177


క.

అని చెప్పిన మైత్రేయుం డనుమోదరసార్ద్రహృదయుఁడై యిట్లను నో
మునివర సర్వము దెలిపితి, రనుకంపముతోడ నాకు నధికప్రతిభన్.

178

జడభరతోపాఖ్యానము

క.

సుమహిత సాలగ్రామా, శ్రమమున భరతుండు తపము సమ్యగ్భంగిన్
కమలాక్షుఁ గూర్చి చేయుచు, విమలత్వము లేక యెట్లు విస్మృతి నొందెన్.

179


చ.

పలుదెస లిచ్చు సంగములఁ బాసి వివిక్తతపోవనంబులన్
నలినదళాక్షుచింతన మనంబునఁ జేర్చి భజించుచున్న య
య్యలఘున కాయవస్థయఁట యన్యులు దుర్విషయోగ్రసత్వని
స్తులవలమానసంసరణదుస్తరవార్ధిఁ దరింప నేర్తురే.

180


క.

భరతమహీపతి పావన, చరితం బెఱిఁగింపుమయ్య చయ్యన నాకున్
హరిచరణాసక్తులస, చ్చరితం బఘహరము గాదె సంయమితిలకా.

181


వ.

అని యడిగిన మైత్రేయునకు శ్రీపరాశరుం డిట్లనియె.

182


క.

భరతుఁడు హరిపదపూజా, నిరతుం డంతస్సపత్ననిర్హరణకళా
విరతుఁడు ధర్తారంభా, భిరతుఁడు రాజ్యంబు చేసి పృథుదోశ్శక్తిన్.

183


మ.

నుతవిన్యస్తమహీభరుం డగుచు నాక్షోణీతలాధీశుఁ డూ
ర్జితనిర్వాణపదంబు చేరుటకునై శ్రీకాంతకాంతాంఘ్రి లో
లతరస్వాంతనిరంతరత్వమున సాలగ్రామతీర్థంబునన్
జితకామాద్యరివర్గుఁడై తపము చేసెన్ శాంతచిత్తంబునన్.

184


సీ.

యజ్ఞేశ సర్వభూతాత్మ భూతాత్మక, యచ్యుత పుండరీకాయతాక్ష
గోవింద సమదరక్షోమానశాసన, మాధవ సకలసంభావనీయ

శ్రీమదనంతపక్షికులేంద్రవాహన, కేశవ నిజజనకేశహరణ
కృష్ణ దురాసదాక్షీణతేజోదీప్త, విష్ణుదేవ సమస్తవేదవేద్య


గీ.

అప్రమేయ హృషీకేశ యనుచు నెపుడు, పలుకుఁగాని యొకప్పుడు కలలనైన
నన్యభాషణములు వల్కఁ డఖిలసుగుణ, రాశి కీర్తివిభాసి యారాచతపసి.

185


క.

అగణితమతి నతఁ డన్యము, లగుకర్మము లాచరింపఁ డాదరలీలన్
భగవత్పూజానిహితము, లగుకర్మము లాచరించు నహరహము తగన్.

186


క.

ఒకనాఁ డభిషేకార్ధం, బకుటిలుఁ డారాచతపసి యతిశుద్ధజలా
ధికయగు మహానదికి ను, త్సుకమతి చని చేసెఁ బెంపుతో నిత్యవిధుల్.

187


క.

అంతర్జలమున లక్ష్మీ, కాంతుపదాంభోజయుగ్మకము తలఁచుచు ని
శ్చింత నతఁ డుండె విమల, స్వాంతంబున మంత్రరాజజపతత్పరుఁడై.

188


చ.

అటకుఁ బిపాసచే నొగిలి యప్పుడు గర్భిణియైన లేడియొ
క్కటి చనుదెంచి ప్రాంశుతటగాఢదురాసదమార్గమైన త
త్తటినికి నల్ల డిగ్గి సముదంచితలీలఁ దదీయవారి యు
త్కటగతిఁ ద్రాగుచుండఁగ, నుదగ్రమహోగ్రతరత్వరార్భటిన్.

189


క.

మృగపతి గర్జించిన భీ, తగతిన్ గడు పవియ నెగిసి ధరణీస్థలిఁ ద
న్మృగి పడి వడి మృతి నొందెను, మృగశాబమునీటిదండ మెదలుచుఁ బడియెన్.

190


గీ.

రాజితదయాంబురాశి యారాచతపసి, దాని నప్పుడ యాశ్రమస్థలికిఁ దెచ్చి
పెనిచె నదియును దినదినంబునకు వృద్ధిఁ, బొదలె సితపక్షశశిరేఖపొలుపు గలిగి

191


సీ.

నటనగా నుటజాంగణమున గంతులు వేయు, మురియుచు నవకుశముష్టి మేయు
కండూతి వో ఖురాగ్రముల నంగము గోకుఁ, బెఱమృగంబులఁ జూచి బెదరి పఱచు
తరుణరసాలపోతములఁ బ్రక్కలు రాయు, పలుమారు కుంజగర్భముల దూఱు
దూరంబుగా నటవీరాజి పడి పోవు, వేవేగ మగుడి యావిర్భవించు


గీ.

కెలన తననీడఁ గన్గొని క్రేళ్లు దాఁటు, నేల మూర్కొని పలుమారు నింగి చూచు
నలసి శయనించి రోమంధ మాచరించుఁ, దరుణమృగశాబ మారాచతపసియెదుట.

192


క.

సుతులపయి సతులపై ధన, వితతులపైఁ బ్రేమ విడిచి విపినమునఁ దపో
వ్రతనియతి నున్ననృపముని, యతిమమత వహించె మిగుల నామృగముపయిన్.

193


వ.

ఒక్కొక్కనా డమ్మృగంబు వనంబునకుం బోయి రాక తడసిన.

194


చ.

ప్రమదము గూర్చు నాదుమృగరత్నము కానకుఁ బోయి రాదు వ్యా
ఘ్రము కబళించెనో వృకపరంపర లంపట పెట్టెనో మృగేం

ద్రము తినెనో నిజంబుగ వినాశము నొందిన చందమైనఁ బ్రా
ణము లిఁక నామెయి న్నిలుచునా క్షణమాత్రము చిత్రవైఖరిన్.

195


వ.

అని తలపోయుచుండు.

196


గీ.

స్నానతర్పణసంధ్యాప్రధానవిధులు, మాననీయహరిధ్యానమంత్రవిధులు
పావనాగమసత్కథాపారవిధులు, హరిణలాలనమునఁ బోలవయ్యె మునికి

197


మ.

పురుషశ్రేష్ఠుఁ డతండు సర్వనియమంబు ల్మాని యెల్లప్పుడున్
హరిణాసక్తమనస్కుఁడై తిరిగె వన్యాహారమర్యాదలన్
"హరిణాసక్తమభూదహో నృపమనోవ్యాపారమేతత్సుదు
ష్కరమద్థా” యని ధీరకోటి పటువాచాప్రౌఢిఁ గీర్తింపఁగన్.

198


క.

అనవరతహరిణలాలన, ననుపమితసమాధిభంగ మయ్యె నతని క
ల్లననంతఁ గొంతకాలము, చనఁజనఁ బ్రాణప్రయాణసమయం బైనన్.

199


ఉ.

కన్నుల నశ్రుపూరములు గారఁ గుమారకులీల నేణ మ
య్యున్నతకీర్తిపై వదన మొయ్యనఁ జేర్చి భృశార్తి నుండె సం
పన్నమమత్త్వయుక్తిఁ బలుమారును దన్మృగరూపభావనా
సన్నమనస్కుఁడై విడిచెఁ గాయము న్యాయముగా మహీశుఁడున్.

200


క.

నిరతహరిణైకభావన, నరపాలకతాపసుఁడు పునర్జన్మం బా
హరిణకులమునన కనియెన్, నరజంబూషండభవ్యవసుమతియందున్.

201


వ.

ఇవ్విధంబున సప్పురుషప్రకాండుండు జంబూషండభూమండలంబున హరిణంబై
జనియించి జాతిస్మరత్వంబు కలిగి యనూనజ్ఞానోదయంబున శుష్కపర్ణతృణ
మాత్రంబున శరీరయాత్ర నడుపుచుఁ దొల్లిటి సాలగ్రామాశ్రమమునకు వచ్చి
యచ్చోటను గొంతకాలంబునకు హరిణశరీరంబు విడిచి.

202


ఉ.

అంబుజగర్భవంశ్య! విను మప్పటికిన్ శుచియైన యోగివం
శంబున విప్రుఁడై యతఁడు జన్మము నొంది లసద్వివేకపా
కంబున వేదశాస్త్రములు గాఢమతిత్వర నభ్యసించి పీ
తాంబరదివ్యపాదజలజాశ్రితమానసచంచరీకుఁడై.

203


గీ.

గుప్తమహదాత్ముఁ డాయోగికులవిభుండు, జడునికైవడి నున్మత్తుచందమునను
బాలురీతిఁ బిశాచంబుభంగి నుండు, నొరుల కేరికిఁ దనచర్య యెఱుఁగనీక.

204


సీ.

నిరుపమసంస్కారవరమలీమసదేహు, ననుకలారచితబోధనవగాహు
శతరంధ్రమలినవస్త్రప్రావృతకటీరు, వికటజటీభూతచికురవారు

కదశనపరమాన్నకబలతుల్యోత్సాహు, పరిభూతఘోరాంతరరిసమూహు
సదృశీభవత్తిరస్కారపురస్కారు, దూరితోపాస్తసంసారభారు


గీ.

ధీరు కుహనాజడీభూయహారు నిత్య, విష్ణుచింతనకార్యు నావిప్రవర్యుఁ
గాంచి ఙడమతి య౦చు లోకంబు మిగులఁ, బరిహసించు మహత్త్వ మేర్పఱుపలేక.

205


క.

జనకుఁడు పరలోకము చెం, దిన భాతృపితృవ్యు లడరి దినదినమును నొ
ప్పనిపనులు పనుప నతఁడును, జనదనక యొనర్చు మూఢజడునితెఱఁగునన్.

206


క.

పిలిచినఁ బలుకఁడు పలికినఁ, బలుబూతులు పలుకుఁ దనదుపజ్జకు నరుఁ డే
యలవునను జొరకయుండక, మెలఁగు నతఁడు గూఢగతి సమృద్ధి దలిర్పన్.

207


గీ.

పిలిచి కడుపుకూడు పెట్టి చెప్పినపను, లేమియైనఁ జేయు నేమి చెప్ప
నమ్మహానుభావుఁ డందఱిపనులకు, నిరతమును మహోపకరణ మయ్యె

208


వ.

ఇట్లు తనయోగసిద్ధికి సమ్మర్దంబు గాకుండ లోకవ్యవహారంబులు మాని నిరంతర
యోగానుభవపరుం డగుచు నుండం గొంతకాలంబు చనిన

209


సీ.

క్షత్తయన్ బేరిటి సౌవీరపతి దుఃఖ, కారణంబైన సంసారసుఖము
పై రోసి కపిలునిచే రహస్యజ్ఞాన, సార మెఱుంగఁగాఁ గోరి యప్పు
డిక్షుమతీతటి కేగుచోఁ బల్లకి, పట్టఁగ వెట్టికిఁ బట్టినట్టి
నరులతోఁగూడఁ బూర్ణజ్ఞాననిధియైన, యవ్విప్రవరుఁ దెచ్చి యానదండ


గీ.

మంసమున కెత్తఁ గర్మశేషానుభవము, గావలెనటంచు వాహకగణమునడుమ
నిర్వికారత్వమున మోచె నిరభిమాన, మాననీయాత్ముఁ డితఁడు బ్రాహ్మణవరేణ్య

210


మ.

ధరణీదేవుఁడు మూఁపుమీఁద శిబికాదండంబు విజ్ఞానని
ర్భరుఁడై తాల్చి యుగప్రమాణ మహిమాత్రప్రేక్షణుం డౌట యు
ద్ధురత న్మెల్లన పోవ వాహకజనుల్ తోడ్తో మహావేగులై
పరిపాటిం బరువెత్త నత్తఱిని నిర్బంధస్ధితిం బొందుచున్.

211


క.

వాహకులఁ జూచి నరపతి, యోహో యీవిషమగమన ముడుగుఁ డనిన నీ
సాహసము మాది గాదు దు, రీహుఁ డితనిచేష్ట యనిన నించుక నగుచున్.

212


మ.

ధరణీదేవునిఁ జూచి వేసరితివో? దవ్వేగితో? మోచునే
ర్పరయంజాలదొ నీకు? బీవరుఁడ వేలా చేసె దాలస్య మీ
కరణి న్నీ వన నానృపాలకుని జక్కం జూచి భూదేవతా
వరుఁ డల్ల న్నగి యిట్లు పల్కు విశదవ్యాపార మేపారఁగన్.

213


చ.

బలిసినవాఁడఁ గాను, విను పల్లకి మోచినవాఁడఁ గాను, నా
కలవును లేదు నీ వరయ కాడినమాట సహించినాఁడ నే

నలుగనటన్న రా జనియె నల్లదె పల్లకీదండె మూఁపుపై
బలుపిదె మేన నీ కిపుడు భారము మోచిన శ్రాంతి పుట్టునే.

214


వ.

అనిన బ్రాహ్మణుం డిట్లనియె.

215


గీ.

భూపవర యిప్పు డీ వేమి పోలఁ గంటి, వది యెఱిగింపు పిదపఁ జెప్పెదవు గాని
బలవదబలవిచారనిష్పాదితార్థ, మంతయను సూక్ష్మబుద్ధిచే నాకలించి.

216


ఉ.

పల్లకి మోచినాఁడ విదె పాయదు మూఁపున దండెయంచు నీ
వెల్లరు వీనుల న్వినఁగ నిప్పుడు పల్కితి రంతయు న్మహీ
వల్లభ కల్ల సుమ్ము విను వాంఛ జనించినయేని చెప్పెదన్
దెల్లము గాఁగ నీదగు మనీష తిరంబుగఁ జేయు మేర్పడన్.

217


సీ.

వసుధపై పాదము ల్వానిపై జంఘలు వానిపై నూరులు వానిపైని
కడు పందుమీఁద వక్షమ దానిపై బహు లామీఁద స్కంధంబు లమరియుండు
స్కంధాశ్రితము శిబికాదండ మిట్లౌటఁ బ్రకటింప నాకు భారంబు కలదె
శిబికపైఁ ద్వదుపలక్షితశరీరము నిల్చె నిన్నును నన్నును నున్నదాని


గీ.

భూతములు మోచు నంతియె భూమిపాల, యవియు నడుచు గుణప్రవాహమునఁ దగిలి
గుణములును గర్మవశ్యతఁ గూరుఁ గర్మ, సమితియు నవిద్యఁ గలుగు నిజంబు సుమ్ము.

218


వ.

ఆత్మశుద్ధుం, డక్షరుండు, శాంతుండు, ప్రకృతికంటెఁ బరుండు, వృద్ధిక్షయ
రహితుండు, అఖిలజంతువులయందు నొక్కరుండై యుండుటం జేసి.

219


క.

బలుపును దరుగును నెఱుఁగక, కలకాలము నొక్కతీరుగా నుండంగా
బలిసితివనియును నన్నున్, బలికితివది యేమియుక్తిఁ బలికితి చెపుమా.

220


వ.

భూమిపాదజంఘాదులకు నాకు శిబికాభారంబు సమంబ శిబికాభారంబు
భూతంబులు వహించుంగాని జంతువులు కావు శిబికయు భూతసంగ్రహంబు,
అదియు మమత్వావబృంహితంబై భ్రాంతిఁ గొలుపునని పలికి యమ్మహాను
భావుం డూరకుండిన.

221


క.

నరపతియును శిబిక యతి, త్వరితగతిం డిగ్గనురికి తచ్ఛ్రీపాదాం
బురుహముల కెరఁగి నిటలాం, తరమున నంజలి ఘటించి నమ్రతఁ బలికెన్.

222


క.

విడువిడుఁడు శిబిక నే మీ, యెడ త ప్పొనరించినాఁడ నెఱుఁగక నన్నున్
గడలేనికరుణతో ని, ప్పుడు గావఁగవలయు భువనపూజితచరితా.

223


క.

నీ వెవ్వ రేమిటికిఁగా, నీవిధమున నుండవలసె నేమిపనికిఁగా
రావలసె నిటకుఁ జెప్పుము, కోవిదనుత యనిన విభునకు న్ముని పలికెన్.

224

క.

నే నిట్టివాఁడ నని భూ, మీనాయక చెప్పఁదరమె మీ రనుశబ్దం
బే ననుచు నాత్మఁ బలుకుట, యై నెగడుంగాదె యనుచు నమ్ముని పలికెన్.

225


గీ.

అవనినాథ యనాత్మయం దాత్మబుద్ధి, నాచరించి యనాత్మోక్తమైన శబ్ద
మాత్మభవమంచుఁ బల్కుదురహహ నిజము, తెలియ నాత్మకు శబ్దంబు గలదె చెపుమ.

226


క.

నాలుక దంతోష్టంబులు, తాలువులును నిఖిలశబ్దతతిఁ బుట్టింపన్
జాలినహేతువు లి ట్లీ, కీ లెఱుఁగరు శబ్దమాత్మకృతమే తలఁపన్.

227


గీ.

ఇన్నియును శబ్దజననైకహేతువులుగ, నొక్కవాక్కె యనుచు బల్కు నోనృపాల
యెన్నివిధములనైన ని ట్లెంచిచూడ, బలిసి తీ వనుమాటలు పలుకఁజనదు.

228


క.

తలయును చేతులు మొదలుగఁ, గల యంగప్రతతి తనకుఁ గలుగుశరీరం
బల యాత్మకన్న వేఱని, తలఁచిన నేపేరఁ బిలువఁదగు నయ్యాత్మన్.

229


గీ.

పరుఁడు నాకన్న నొకఁడున్న భంగియైన, నితఁడొకఁడు నేనొకం డనుమతము కలుగు
భూతతతులందు నొక్కండ పురుషుఁ డుండు, కాన నీ వెవ్వఁ డనఁ జెప్పఁగా వశంబె.

230


క.

నీపల్లకి యిది నీవున్, భూపతి వేమెల్ల మోచుపురుషుల మిది నీ
ప్రాపుగలలోకమని యో, భూపాలక తలఁచుటెల్ల పోలదుసుమ్మీ.

231


గీ.

ధరణివర వృక్షమునఁ గల్గి దారు వందు, శిబిక యనఁ గల్గె శిల్పవైచిత్రిచేత
సరగ దీనికి వృక్షసంజ్ఞయును దారు, సంజ్ఞయును నింతిలో నెందు చనియెఁ జెపుమ.

232


క.

నిను వృక్షసమారూఢుం, డని కానీ దారురూఢుఁ డని కానీ,యో
జనమనదు శిబిక యనఁ గా, దన నేటికి దారుసంగ్రహము కాదేమో.

233


క.

విను ఛత్రశలాకాదుల, కనయము భేదంబు సిద్ధమైన నెచటికిన్
జనె ఛత్ర మనెడున్యాయము, చనునా నీయందు బుద్ధి చక్కం గనినన్.

234


చ.

పురుషుడు కాంత గోవ్రజము భోగి విహంగమ ఘోటకంబు కుం
జర మనుసంజ్ఞ లెల్లను రసాజనవల్లభ కర్మహేతులో
కరచితసంజ్ఞ లెన్నికొనఁగా సురమర్త్యపశుద్రుమాదు లె
ల్లరసిన నాత్మ గాంచు వపురాశ్రితసంజ్ఞలు కర్మకృత్యముల్.

235


గీ.

అధిప రాజని భటుఁడని యన్యమైన, వస్తువని యంట తెలియనివార్తసువ్వె
సునిశితప్రజ్ఞ నరసిచూచిన ని వన్ని, నాటకంబులు సంకల్పనామయములు.

236


క.

జనకుండవు తనయుకునం, దనుఁడవు తండ్రికి సపత్నునకు రిపుఁడవు మ
న్నన పత్నికిఁ బతి విట్లగు, నిను నెవ్వ రనంగవలయు నృపవర చెపుమా.

237

గీ.

శిరము నీవు నీది శిరమొ యయ్యుదరంబు, నీవొ యుదర మెన్న నీదియొక్కొ
అంఘ్రిబాహుముఖ్యమగునంగకము లీవొ, అదియె నీదియో మహాత్మ చెపుమ.

238


క.

తలఁప సమస్తావయవం, బులకు న్వేఱైన నీవు భూపాలక యే
యలవున నే నని చెప్పం, గలవాఁడవు నిపుణబుద్ధిఁ గనుమా తెలియన్.

239


వ.

ఇవ్విధంబునఁ దత్వస్థితి వర్తింప నే నిట్టివాఁడనని యెట్ల చెప్ప నేర్తునని యాబ్రాహ్మ
ణుండు పలికిన పరమార్థసమన్వితంబులగు పలుకులు విని పులకించి యాభూపాల
తిలకుం డిట్లనియె.

240


సీ.

శిబిక నే మోవను శిబిక నాపై లేదు, నాకన్న దేహ మన్యంబు శిబిక
దేహంబు మోచె నింతియ భూతముల కెల్ల, కర్మచోదితవృత్తి కలిగియుండు
కర్మవశ్యత గుణగ్రామంబు దిరుగ నే, పని లేదు నా కని పలికి తిప్పు
డిదియెల్ల విని నాదుమది విహ్వలించెనో, పరమార్థతత్వజ్ఞభవము రోసి


గీ.

కపిలమునిఁ జేరి పరిమార్థకలనఁ దెలుతు, ననుచుఁ జనుచోటఁ దెరువును వినుతతత్త్వ
బోధనిధి నిన్నుఁ గంటి నాపుణ్యమహిమ, కలిమి నిరుపేద పెన్నిధిఁ గన్నయట్లు.

241


వ.

సర్వభూతేశ్వరుండైన విష్ణుడు జగద్రక్షణార్థంబు కపిలుండై యవతరించె.
అమ్మహానుభావుండ నన్ను రక్షించుటకు నీరూపంబునఁ బ్రత్యక్షంబగుట
సిద్ధంబు. నాకు నెయ్యది పరమార్థంబైన శ్రేయస్సు దాని నెఱింగించి రక్షింపు
మని ప్రణతుఁడైన సౌవీరపతిం జుచి బ్రాహ్మణుం డిట్లనియె.

242


క.

ఇలలోఁ బరమార్థార్థం, బులు శ్రేయము లెన్నియైన భూవర కల వం
దుల కొలఁది యెన్ని చూచినఁ, బలుకులు వెయ్యేల యవియుఁ బరమార్థములే.

243


గీ.

ధరతనయ రాజ్యలాభంబు తలఁచి నరుఁడు, దేవతారాధనము చేసి దీనిఁ గాంచు
ధరణినాయక మనమునఁ దలఁచిచూడ, నదియుఁ బరమార్థమైన శ్రేయంబుగాదె.

244


చ.

తలపఁగ స్వర్గలోకఫలదాయక మౌ క్రతుకర్మ మెంచఁగాఁ
గలిగిన శ్రేయమౌఁ గద, యకంపితయోగసమాధి నాత్మునిం
గలయఁగఁ జేర్చు శ్రేయ మది గాదొకొ భూపలలామ పెక్కువా
క్కుల పని యేమి శ్రేయములకున్ మితి లేదు తలంచిచూచినన్.

245


వ.

పరమార్థంబైన శ్రేయస్సు సంక్షేపరూపంబునం జెప్పెద. ఏకుండును, వ్యాపియు,
సముండును, శుద్ధుండును, నిర్గుణుండును, ప్రకృతికంటెఁ బరుండును, జన్మ
మృత్యాదిరహితుండును, సర్వగతుండును, నవ్యయుండును, బరమజ్ఞానమ
యుండును, నామజాత్యాదివియుక్తుండును నైన పరమాత్ముని నెఱింగిన
జ్ఞానంబు పరమార్థంబైన శ్రేయస్సు. అని చెప్పిన విని మనంబున సంచలించి

యిది యేమని విచారించు సౌవీరపతిం జూచి యమ్మహాబ్రాహ్మణుం డద్వై
తాంతర్గతంబైన యితిహాసంబు గలదు చెప్పెద వినుమని యిట్లని చెప్పం
దొడంగె.

246


గ.

ఋభు నామధేయుఁ డబ్జ, ప్రభవతనూభవుఁడు జ్ఞానభాసురుఁ డగ్ని
ప్రభుఁ డొకముని గలఁ డతనికి, నభినుతశిష్యుఁడు నిదాఘుఁ డనుముని వెలయున్.

247


వ.

పులస్త్యపుత్రుండైన యన్నిదాఘుండు ఋభునకుం బరిచర్య చేసి యతనివలన
నవాప్తజ్ఞానతత్త్వుం డయ్యును నద్వైతవాసన లేకయున్న గురుండు విచా
రించుచునుండె. అంతం గొంతకాలంబునకు నాశిష్యుండు దేవికానదీతీరంబున
రమ్యోపవనపర్యంతంబును సకలవస్తుసమృద్ధంబును పులస్త్యనివాసితం
బునునగు సగరాఖ్యపట్టణంబును నివాసంబు చేసె నంతి దివ్యవర్షసహస్రంబులు
చనిన.

248


సీ.

గురుఁడు శిష్యుని జూడగోరి యప్పురి కేగి, తద్గృహద్వారంబుదండ నిలువ
వైశ్వదేవము చేసి వచ్చి వాకిటనున్న, ఋభునిం గనుంగొని యభినుతించి
యన్నిదాఘుఁడు మ్రొక్కి యర్ఘ్యపాద్యము లిచ్చి, లోనికిఁ దెచ్చి యాసీనుఁ జేసి
యన్నంబు భుజియించుఁ డనుచుఁ బ్రార్థించిన, నాకు నెన్నఁడు కదన్నములుకూడ


గీ.

ననిన మాయింటఁ గలవు పాయసగుడోప, కలితమోదకసాజ్యముఖ్యంబులైన
భోజ్యములు పెక్కు నీచిత్తమునకు వచ్చు, వానిఁ గరుణించి భుజియింపవలయు ననిన

249


ఇవియన్నియును కదన్నము, లవహితమతి మృష్టమైన యన్నం బిడుమ
న్న వధూటిఁ జూచి యట్టిద, ధవళేక్షణ పెట్టుమని నిదాఘుఁడు పలికెన్

250


వ.

నిదాఘపత్నియు నట్ల శుచియై యలంకరించుకొని మృష్టాన్నంబు పెట్టిన యథే
చ్ఛంబుగా భుజియించి సుఖాసీనుడై యున్న యమ్ముని నవలోకించి ప్రశ్ర
యావనతుండై నిదాఘుం డిట్లనియె.

251


సీ.

మునినాథ తృప్తి యయ్యెనె తుష్టి గల్గెనే యాహారమున మనం బలరెనయ్య
యెచ్చోట నునికిప ట్టెచ్చోటి కరుగఁగాఁ దలఁచినా రిప్పు డెవ్వలననుండి
వచ్చితిరన్న నెవ్వనికి నాఁకలి గల దతని కన్నము దిన నగును దృప్తి
యాఁకలి నాకు లే దడుగనేటికిఁ దృప్తి దహనుచేఁ బార్థివధాతు వింక


గీ.

నాఁకలియు ధాతువు జలంబు నరిగిపోవ, దప్పియును బుట్టు మర్త్యబృందమున కెల్లఁ
దెలియ నాఁకలిదప్పులు దేహులకునె, యవియు రెండును నాకు లే వలఘుచరిత

252


వ.

క్షుధ పుట్టకుండుటం జేసి నిత్యంబు తృప్తియ మనస్స్వాస్థ్యంబు తుష్టి యనఁబరఁగు.
ఇవి చిత్తధర్మంబులు. పురుషుఁడు వీనిం బొరయండు. నివాసం బెచ్చట యెచ్చోటి

కిం బోయెద వెచ్చటనుండి వచ్చితివని యడిగితి, వినుము. పురుషుం డాకాశంబు
భంగి వ్యాపియు, సర్వగతుండును నగుటం జేసి నీవడిగినప్రశ్నం బర్థవంతంబు
కాదు. ఎట్లనినఁ బోవుటయు, వచ్చుటయు, నివాసంబును నాకు లే దనిన నిదాఘుండు
మ్రొక్కి పూజించిన నయ్యోగీంద్రుండు యథేచ్ఛం జనియె. నంత సహస్రవర్షం
బులు చనిన శిష్యునకు జ్ఞానదానంబు సేయందలంచి.

253


చ.

ప్రమదమున ఋభుండు నగరంబునకుం జనుదెంచి బాహ్యదే
శమునకు వచ్చినం గనలి శక్షుధనున్న నిదాఘుఁ జూచి ని
క్కము చెపుమయ్య యేకతముగా నిటు లుండఁగనేల యన్న వా
క్యము విని గారవం బమరఁగా ఋభుఁ జూచి నిదాఘుఁ డిట్లనున్.

254


గీ.

వినుము భూపతి వాహ్యాళి వెడలి మగిడి, పురికి వడినేగు సమ్మర్దమునకు వెఱచి
తొలఁగియున్నాఁడ ననిన నయ్యలఘుతేజుఁ, డనియె మందస్మితసమంచితాస్యుఁ డగుచు.

255


క.

జనపతి యెవ్వం డాతని, జన మెయ్యది యనిన నదె గజముమీఁద మహీ
జనపతి చూడుము వెంటన్, జనునది జన మనిన యోగిచంద్రుఁడు పల్కున్.

256


క.

సామజ మెయ్యది యెక్కిన, భూమిపతి యెట్టివాఁడు పోలింపుమనన్
సామజము క్రింద మీఁదన్, భూమిపతి వాహ్యవాహముల నెఱుఁగరొకో.

257


వ.

అనిన యోగీంద్రుం డిట్లనియె.

258


క.

క్రిందిది మీఁదిది యని పో, లం దెలియదు నాకు దీనిలావు దెలుపు మీ
వందముగ ననిన మునికుల, బృందారకనాథుఁ జూచి ప్రియము దలిర్పన్.

259


చ.

పలుకులు మాని యాఋభునిపై నతఁ డెక్కి మునీంద్ర మీఁద ని
ట్లలవడువాఁడు రాజు దిగుడై నిను వంటిది సామజం బికం
దెలియుమటన్న నయ్యలఘుతేజుఁ డనూనతరప్రబోధుఁడై
యలరుచు నిట్లు పల్కుఁ బరమాదరవాక్కుల నన్నిదాఘుతోన్.

260


గీ.

ఇదియు నాకుఁ దెలియ దెఱిఁగింపు మిదె నీవు, రాజ వేను కుంజరంబ నైతి
నీ వనంగ నెవ్వ రే నన నెవ్వ రే, ర్పఱపుమనిన నతఁడు భయము నంది

261


వ.

అమ్మహానుభావుని దిగి వచ్చి చరణంబులు పట్టుకొని నీవు ఋభుండవు గావలయు నిత
రులకు నీయద్వైతసంస్కారంబు కలదే? నీపలుకుల నామానసంబు కలంకం
దేరె. నాభాగ్యవశంబున నిన్ను గంటి నని పలికిన ఋభుం డిట్లనియె.

262


చ.

పరమవచోవిశేషముల బ్రాహ్మణవర్య! త్వదీయమానసాం
తరవిచికిత్స వాపెడికతంబున వచ్చితి నే ఋభుండ మున్

సరవి నొనర్చు నీదు పరిచర్యలు మెచ్చినవాఁడ గాన ని
ప్పురి కరుదెంచి తెల్పితిఁ బ్రబోధవిధం బతిసూక్ష్మవైఖరిన్.

263


వ.

అని చెప్పి యాఋభుండు చనియె. నిదాఘుండును గురూపదేశవిశేషంబున
నద్వైతవాసనావాసితుండై సర్వభూతంబుల నభేదంబునం జూచి ముక్తుండయ్యె.
సౌవీరనాయక నీవును తుల్యాత్మరిపుబాంధవుండవై సర్వగతంబైన యాత్మ
జ్ఞానంబు భజియింపుము. నభం బొక్క టయ్యును సితాసితభేదంబుల భ్రాంత
దృష్టులకు భిన్నంబై తోఁచిన ట్లొక్కండైన యచ్యుతుండు భ్రాంతులకు నా
నారూపంబులై తోఁచునని చెప్పిన నారాజు పరమార్థదర్శనుండై భేదదృష్టిని
విడిచె. మైత్రేయ! ఆబ్రాహ్మణుండు జాతిస్మరణాప్తబోధుండై యాజన్మం
బున నపవర్గంబు నొందె.

264


చ.

భరతనరేంద్రవృత్తము శుభస్థితిఁ జెప్పినఁ బ్రేమ విన్న న
ప్పురుషుల కాత్మమోహములు పుట్టవు నిర్మలబుద్ధి చెందు సం
సరణమునందు నున్నను బ్రసన్నత ముక్తి ఘటించు నంచు భా
స్వరవరకీర్తిశాలియగు శక్తికుమారఁ డానతిచ్చినన్.

265


చ.

జగదుపకారికారి నుతసత్యవచోనిగమామృతాంబుధి
ప్రగుణవిహారిహారి కకురప్రమదారుచమండలీగళ
న్మృగమదసారిసారి నిబిరీసభుజాపరిఖేల నావితా
భ్రగపరివారి వారిరుహ పత్రరుహాపరిభావిలోచనా.

266


క.

ప్రణమన్నిధానధానా, ర్పణమాప్తినిధానదానరాజద్గజర
క్షణగాన గానవిద్యా, చణ వేణ్వసమానమాన సకృతస్థానా.

267


భుజంగప్రయాతము.

మహానీలశైలేంద్ర మాణిక్యశృంగా
గ్రహర్మ్యాంతరావాసరంగన్మనోబ్జా
మహాలోకనాయాతమానుష్యకేష్టా
వహోరస్థలీనిత్యవాసీకృతాబ్జా.

268


గద్య.

ఇది శ్రీసుభద్రాకరుణాకటాక్షలబ్ధకవిత్వతత్వపవిత్ర వేంకటామాత్య
పుత్ర కంచాళ శ్రీరంగాచార్యకృపాపాత్ర సజ్జనమిత్ర శ్రీహరిగురుచరణారవింద
వందనపరాయణ కలిదిండి భావనారాయణప్రణీతంబైన నీవిష్ణువురా
ణంబునందుఁ బ్రియవ్రతునిచరిత్రంబును, అతండు నిజపుత్రులకు సప్త

ద్వీపంబులు పంచియిచ్చుటయు, జంబూద్వీపేశ్వరుండైన యగ్నీధ్రుని సంతాన
ప్రకారంబును, భారతవర్షాదినవవర్షప్రమాణంబులును, మేరువుప్రమాణం
బును, జంబూద్వీపప్రమాణంబును, సప్తసముద్ర, సప్తద్వీపప్రమాణంబు
లును, మానసోత్తరచక్రవాళశైలప్రమాణంబును, సప్తపాతాళప్రమాణం
బులును, నరకలోకవర్ణనంబును, ప్రాయశ్చిత్తంబులును, సూర్యాదినవగ్రహ
లోకప్రమాణంబులును, సప్తఋషిధ్రువమండలప్రమాణంబులును, సూర్య
రథగతిప్రమాణంబులును, ఉత్తరాయణదక్షిణాయనగతులును, విష్ణుపద
లక్షణంబును, భూతసంప్లవప్రకారంబును, గంగావతరణప్రకారంబును,
ద్వాదశమాసంబుల సూర్యురథంబు నడచుప్రకారంబును, చంద్రాదిరథగ్రహ
ప్రమాణంబును, శింశుమారవర్ణనంబును, భరతునిచరిత్రంబును, హరిణలాల
నంబును, జడబ్రాహ్మణచరిత్రంబును, బ్రాహ్మణసౌవీరపతులసంవాదంబును,
ఋభునిదాఘసంవాదంబును ననుకథలంగల ద్వితీయాంశంబునందు ద్వితీయా
శ్వాసము

269
  1. శీలాంభోష్ణవృష్టి
  2. వివిరుదోషాదులు