Jump to content

విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ)/ప్రథమాంశము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

విష్ణుపురాణము

భావనారాయణకృతము

ప్రథమాంశము



నీలాచలశృంగభాగమున, సంక్లిష్యత్సుభద్రాలతా
వ్యానద్ధత్వ మెలర్ప, నాశ్రితమనోవాంఛావిధానావధా
నానూనంబగు పూరుషోత్తమ సుపర్వానోకహస్వామి, మా
కానందప్రదకామితార్థఫలవర్గావాప్తి గావించుతన్.

1


సీ.

తను భజించఁగ నేర్చు జనులకోర్కెలఁ దీర్చు, సిరిఁ గూర్చు కేలికెంజిగురు లలర
నధికమాధురిఁ దెచ్చు నమృతపూరము మెచ్చు పస హెచ్చు కెమ్మోవిపండు వెలయ
సౌమనస్యము నించు చక్కందనము మించు తులకించు గుబ్బగుత్తులు వెలుంగఁ
జెవుల సేదలు దేరు సింగారములు మీరు నినుపారుఁ బల్కుతేనియలు చిలుక


గీ.

నీలగిరివాస నృహరి వక్షోలవాల, దేశమున వృద్ధిఁ బొంది యర్థితము లొసఁగు
ఘనతరశ్రీసుభద్రాఖ్యకల్పలతిక, లీల నేఁ గోరుఫలము ఫలించుఁగాత.

2


మ.

కలధౌతాచలచాకచక్యహసదంగచ్ఛాయతో, గండమం
డలనృత్యన్మణికుండలప్రభలతో నవ్యాసితోద్యన్నిచో
లలసద్దీధితితో మనోజ్ఞవనమాలాలంకృతోరస్థలీ
విలుఠద్ధారలతాభతో వెలయుసద్వేద్యుం బలుం గొల్చెదన్.

3


చ.

మెలఁగు నినాగ్ను లుట్టిపడు మిణ్గురు లుద్దతయుద్ధబద్ధదో
హలబలవన్నిశాటు లెదురైపడు సాంద్రపతంగకోటిగా
కొలఁదిడరానితేజములకుప్ప కకుప్సతిదిలకంబు, శ్రీ
నిలయుమహాసుదర్శనము, నిచ్చలు, నన్ గరుణించు గావుతన్.

4


సీ.

ప్రకటప్రభావ మార్కండేయశంకరప్రముఖాష్టకము, క్షేత్రపాలనికర
మావవణత్రయాధ్యక్షత్వమున మించు దీపించువిమలాదిదేవతలును

దలఁచినమాత్రఁ బాతకజాలములఁ ద్రుంచు పటుపైభవము తీర్థపంచకంబు
త్రిభువనశాసనోద్దీపితుం డుగ్రసేనసమాహ్వయుండు సేనావిభుండు


గీ.

కమలనేత్రునిదేహ మక్షయవటంబు, సిరులు శ్రీపురుషోత్తమక్షేత్రమునకు
నఖిలధనమును నగువీర యస్మదీయ, కృతికి శుభ మొసగుదురుగాక యతులమహిమ.

5


సీ.

తనకు మ్రొక్కిన మ్రొక్కు, జనుదనోకహ వినిర్దళన ప్రచండపరశ్వధంబు
తనసేవ పాతకోదకగభీరత్వ దుస్తరసంసరణవార్ధితరణితరణి
తనశ్రీమదంఘ్రితీర్థము ముక్తిసామ్రాజ్యపట్టాభిషేకసంభారజలము
తనసంశ్రయణము సౌధాయత మహనీయకైవల్యనిశ్రేణి కాశ్రయంబు


గీ.

గాఁగ వాధూలగోత్ర సాగరశశాంక, భావనాచార్యతనయుఁడై ప్రబలు నపర
హరిని కందాళశ్రీరంగగురుని, మద్గురుని భజింతు నభీష్టార్థరూఢికొఱకు.

6


సీ.

పూర్ణభక్తి భజింతుఁ బొయిగపూదత్త సే యాళువారుల చరణాంబుజములు
సేవింతు మదిలోన శ్రీభక్తిసార భట్టాధిప కులశేఖ రార్యవరులఁ
బ్రణుతింతు మునివాహభక్తాంఘ్రిరేణు ద్విషద్దండధరుల నిశ్చలమనీష
వరివస్యగూర్తు మధురకవిశఠగోప భాష్యకర్తలకు సౌభాగ్యరేఖ


గీ.

నాథయామునముని కూర్మనాథ పుండరీక, దృగ్రామ మిశ్రాదిలోకవిశ్రు
తాద్యగురుసంఘములకు సాష్టాంగనతులు, సేయుదు మదీయకృతికి మేల్సేయుకొఱకు.

7


సీ.

తారకబ్రహ్మమంత్రరహస్యసంవేదిఁ బ్రాచేతసుని మనఃపదవిఁ గొలిచి
చిదచిదీశ్వరతత్త్వపదవినిర్ణయశాలి శ్రీపరాశరుని నర్మిలి భజించి
గీతోపనిషదర్థజాతనిర్ణేతయౌ బాదరాయణుపదాబ్జముల కెఱగి
శ్రీకృష్ణపాదరాజీవచంచచ్చంచరీకాత్ము శుకుని సంప్రీతిఁ బొగడి


గీ.

ఆంజనేయ కయాధుసు తాంబరీష, నారద విభీషణాది పుణ్యస్వరూప
పరమభాగవతాంఘ్రిపంకరుహములకు, సవినయాధికసద్భక్తి సాఁగి మ్రొక్కి.

8


సీ.

సమధికస్ఫూర్తిఁ గృష్ణాగౌతమీమధ్యదేశంబునకు భవ్యతిలక మగుచుఁ
బొగడొందు కలిదిండిపురమున కధిపతి సుగుణుఁ డాపస్తంబసూత్రుఁ డధికుఁ
డసమశాలంకాయనసగోత్రుఁ డడవిరాచయమంత్రి వెలయు నయ్యనఘమతికిఁ
దనయుండు మంత్రి రాజనఘుఁ డాతఁడు గాంచె విమలచారిత్రుని వేంకటాద్రి


గీ.

నమ్మహాత్మునకును సూరమాంబికకును, నందనుఁడఁ బూరుషోత్తమనాథపాద
వందనానందమహిమ జీవాతుజీవ, నాఢ్యుఁడను భావనారాయణాభిదుడఁను.

9


వ.

శ్రీసుభద్రాకరుణాకటాక్షవీక్షాలబ్ధకవిత్వతత్త్వపవిత్రుండనై యుండి
మున్ను.

10

గీ.

ఘనత శ్రీపురుషోత్తమఖండ మాంధ్ర, సవ్యపదబంధములఁ బ్రబంధంబు చేసి
యెన్నఁ గులదైవమై యున్న వెన్నముద్ద, ముద్దుకృష్ణుని కంకితంబుగ నొనర్చి.

11


వ.

మఱియు నొక్కపురాణంబు తెనుంగున శ్రీజగన్నాథునకు సమర్పింపవలయు
నని తలంచి.

12


సీ.

ఏమునీంద్రునితాత తామరసానవ, చోద్యసంయమవసిష్ఠుఁడు వసిష్ఠుఁ
డేమునీంద్రునితండ్రి భౌమాంతరిక్షవిస్మయదృన్మహాతపశ్శక్తి శక్తి
ఏమునీంద్రునిపుత్రుఁ డిద్ధజగద్రక్షణాయతాఖ్యుడు బాదరాయణాఖ్యుఁ
డేమునీంద్రునిపౌత్రుఁ డామోదిహృత్కంజసుఖితకార్తస్వరాంశుకుఁడు శుకుఁడు


గీ.

జగతిఁ బొగడొందు నతఁడు జాజ్వల్యమానసవనహుతవహహుతపరాశరుఁడు భక్త
సస్యసుఖకృద్ఘనకటాక్షజపకృపాప, రంపరాశరుఁ డగు శ్రీపరాశరుండు.

13


వ.

అట్టి శ్రీపరాశరమునీంద్రుఁ డానతిచ్చిన పురాణరత్నంబైన శ్రీవిష్ణుపురా
ణం బశేషపురాణంబులకు రాద్ధాంతంబని విబుధప్రకరంబులవలన విని,
తెనుంగుసేయ సమకట్టి, యవిఘ్నపరిసమాప్తికి శ్రీసుభద్రావల్లభుండైన
శ్రీజగన్నాథుండ కలండని కృతనిశ్చయుండనై, కడంగి.

14


క.

సరసపదబంధబంధురతరకథితప్రసవమాల్యతతి శ్రీహరికిన్
గరిమ సమర్పించుచు నిహ, పరసుఖములు గన్న సుకవిపతుల నుతింతున్.

15


మ.

దినమున్ శ్రీపురుషోత్తమాధిపతికిం దేదీప్యమానప్రసూ
ననవోద్యద్వనమాలికాఫలవిమానంబుబుల్ సమగ్రంబులై
తనరన్ దోటలు క్షేత్రరాజమునఁ జెంత న్నిల్పి యప్పద్మలో
చనుఁడే తానగు రామకృష్ణభటు గోసాయిం బ్రశంసించెదన్.

16


క.

కృతి శ్రీవిష్ణుపురాణము కృతికి నధీశ్వరుడు నీలగిరిపతి కవితా
మతి ధాత్రి శ్రీసుభద్రా, పతి యహహ! మదీయభవము సఫలముగాదే.

17


సీ.

కాళ్లవేళ్లఁ బెనంగి పళ్లాలదరిఁ బాలుమాలుచుఁ గూయుమార్జాలకవులు
శ్రవణదుస్సహదుష్టశబ్దసంగతిఁ బోగుగట్టి వాపోవు సృగాలకవులు
పలుమారు చులుకగాఁ బలికి తోలిన బోక కాపుకానను కృష్ణకాకకవులు
చప్పుడు విని గుండె జంక గొందులు మండఁ జలపట్టి పట్టు పిశాచకవులు


గీ.

సాటి వత్తురె యింతైనఁ జక్రప్రశస్త, శాస్త్రగుణవర్ణనాపూర్ణసరసకవితఁ
బ్రవితతోభయలోకవైభవము, శబ్దరమ్యసత్కవివరశిరోరత్నములకు.

18


చ.

సరసతయున్ మృదుత్వమును జక్కదనంబు నలంక్రియాపరి
స్ఫురణము గల్గి శ్రీవిభుని బొందినచోఁ గృతి సాధ్వియందు రా

సరసతయున్ మృదుత్వమును, జక్కదనంబు, నలంక్రియాపరి
స్ఫురణము గల్గియుం బరులఁ బొందిన దుష్కృతియందు రెందునన్.

19


ఉ.

లాలితకావ్యసీమ నొకిలక్షణ మొప్పక యున్న సత్కవుల్
మేలు గ్రహింపఁ గోరుదురు మించిన సత్కృపఁ గాకవుల్ గడున్
బ్రేలుదు రింతెగాక సవరింపఁగ నేర్తురె యంచకైవడిన్
బాలును నీరు నేర్పఱచు పాకము కాకము పొంద నేర్చునే.

20


వ.

అని యిష్టదేవతానమస్కారంబును, శిష్టజనపురస్కారంబును దుష్టకవితిర
స్కారంబునుం జేసి యేతత్ప్రబంధభూషణంబునకు నాయకరత్నంబైన శ్రీజగ
న్నాథు దివ్యావతారం బభివర్ణించెద.

21


చ.

జగములు చేసి వేసరి ప్రజాపతి సర్వజగంబు లెల్ల ము
క్తి గనిన నింక నీయిడుమ తీరి సుఖంచెదనంచు నెంచి స
త్వగుణగరిష్ఠుఁడై హృదయవారిజసీమ నికామభక్తి ని
ష్ఠ గదుర శ్రీశపాదవిలసత్కమలద్వయి నిల్పి కొల్చినన్.

22


సీ.

కమలారి నేలు చక్కనినెమ్మొగమునకు మొలకవెన్నెలతేట కలికినవ్వు
కార్మొగుల్పస గెల్వఁగల తనుచ్ఛాయకుఁ బసిమి మించిన మించు పసిడిశాలు
మాననీయోరువక్షోనభోవీథికి హరిధనూరుచి రమాతరుణికాంతి
మండితప్రభనేత్రపుండరీకములకు మాకరందఝరం బమందకరుణ


గీ.

సొగసుపుట్టించఁ ద్రొక్కనిచోట్లు ద్రొక్కు, తేజుగలవాగెఱెక్క నేవాజిరాజు
నెక్కి గ్రక్కున నిందిరాధీశ్వరుండు, తామరసగర్భునెదుటఁ బ్రత్యక్షమయ్యె.

23


వ.

అప్పుడు.

24


గీ.

అజుఁడు మ్రొక్క యిష్ట మర్థించుటయు, శ్రుతిస్మృతిపురాణతతులు చతురవంది
సముదయములభంగి నమితిభక్తి నుతించు, మహితపురుషోత్తమంబు దెలిసి.

25


క.

కమలభవ! నీవుగోరిన, క్రమమున జంతూత్కరములు గాంచు విముక్తి
ప్రమదం బచటికిఁ జనుమని, కమలాధీశ్వరుఁడు పల్కఁ గ్రక్కున నజుఁడున్.

26


ఉ.

పొంగుచు నగ్రభాగమునఁ బూనిక నిల్పిన యాపవాహ్యచ
క్రాంగము నెక్కి యేగి చెలువారఁగఁ గన్గొనె నీలభూమిభృ
త్పుంగవభూషితన్ విబుధపూజితదక్షిణవారిరాశివా
స్తుంగతరంగరావపరిశోభిత శ్రీపురుషోత్తమస్థలిన్.

27


ఉ.

కాంచి విరించి మున్ను తనకన్నులకుం బొడగట్టి నట్టియ
భ్యంచితమూర్తి శ్రీవిభుని నచ్చటఁ జుచి కృతార్థవృత్తి తా

ప్రాంచితుఁడై, యనేకనిగమార్ధముల న్వినుతించి యుండ నే
తెంచెఁ బిపాస నో రిగురఁ దీవ్రతతో నొకకాకి గ్రక్కునన్.

28


ఉ.

కారణవారిపూరితసుఖప్రదరోహణనామకుండవి
స్ఫూరజలఁంబు ద్రావి సులభస్థితి నంగము దోచి తత్సర
స్తీరధరాస్థలిన్ బొరలి దేహము వీడి చతుర్భుజత్వశృం
గారశరీరియై సురలు గన్గొన దివ్యపదంబు చేరినన్.

29


క.

నీలధరాధరవరశిఖ, రాలయగతనీలమాధవాగ్రస్థలసం
లాలితరోహణకుండ, లాలఘుమహిమలు జగములన్నియు నిండెన్.

30


గీ.

అపుడు దండధరుండు, నిజాధికారసంశయము మానసమ్మున సందడింప
నొల్లఁబోయినమోము నిట్టూర్పువడల బడల, నొడలెల్ల సంతాపభరితముగను.

31


సీ.

నీలాద్రి కరిగి యిందిరఁ గూడియున్న శ్రీనీలమాధవు గాంచి నిభృతిభక్తి
వినుతించి ప్రార్థింప విశ్వంభరాధరుం డతని వంచించి తానప్పటికిని
నొనర నంతర్ధానమొంది క్రమ్మఱ మాళవేంద్రుఁ డింద్రద్యుమ్నుఁ డిద్ధమహిమ
నశ్వమేధసహస్ర మాహరింపఁ దదంతమున ననభృథవేళ వనధిలోన.


గీ.

మంజుమాంజిష్ఠకాంతిసంపదలఁ బొదలు, కల్పభూజాతమై, తరంగములఁ దేలి
వచ్చిన ధరాధిపుఁడు తెచ్చి వర్ణనీయ, తరమహావేదిపై నిడఁ దత్క్షణంబ.

32


క.

నగుమొగము, వాలుకన్నులు, మృగనాభిసదృక్షమైన మేచాయ, మణీ
ధగధగితదివ్యభూషలు, తగటువలువ వెలయఁ జక్రధరుఁడై నిలిచెన్.

33


గీ.

స్ఫురితకుండలనీలనిచోళధవళ, దేహవనమాలికోజ్జ్వలదీప్తితతులు
వరల సర్వంసహాధురావహనదీప్తసప్తఫణుఁడు, బలుం డహిస్వామియయ్యె.

34


సీ.

ధవళాబ్జరుచి నేలు తనకటాక్షేక్షణాంచలము లెక్కుడుసిరుల్ సంఘటింప
కుంకుమద్యుతుల నెగ్గులువట్టు తనమేనిచాయ నల్దిక్కులఁ జౌకళింప
అంజనప్రతిభఁ గాదను తనధమ్మిల్లకాంతులు కటికచీకటి ఘటింప
సురధనుఃప్రభకు మించులుచూపు తనమణిభూషణద్యుతులు విస్ఫూర్తి చూప


గీ.

దనపదాబ్జములు గొల్చుమనుజతతికిఁ, గల్పతరుశాఖ యగుచు సంకల్పితార్థ
సముదయము లిచ్చుకలశాబ్ధిజాత శ్రీసుభద్ర, భద్రప్రదాత్రియై ప్రౌఢి నిలిచె.

35


క.

త్రిభువనశుభదాయి రవి, ప్రభము దనుజకోటిహరము భాస్వరలాక్షా
నిభము సుదర్శనము మహా, రభసము ప్రాదుర్భవించె రక్షాచణమై.

36

వ.

ఇట్లు దైత్యసంహారి జతురూపధారియై నిలిచిన మొలచినహర్షోత్కర్షంబున
ని౦ద్రద్యుమ్నమహీమహేంద్రుండు రత్నప్రభాధురంధరంబగు మహోన్నత
ప్రాసాదవివరంబు నిర్మించి.

37


ఉ.

నారదుఁ గూడి బ్రహ్మసదనంబునకున్ జని, తత్ప్రతిష్ఠకై
వారిజసంభవున్ బిలువ వచ్చి ప్రతిష్ఠ యొనర్చె నప్పు డ
వ్వారిజనేత్రు భక్తజనవత్సలు సంశ్రితదీనలోకమం
దారు జతుర్విధాకృతి నుదారవిహారునిఁ బూరుషోత్తమున్.

38


వ.

ఇవ్విధంబున.

39


సీ.

సకలవేదపురాణశాస్త్రేతిహాసముల్ నందులై యేక్షేత్రవరముఁ బొగడు
నాబుజభవకీటకాంతజీవులకు నేక్షేత్రంబు మోక్షలక్ష్మీప్రదంబు
సకృదుచ్చరణమాత్ర వికలీకృతాఘసంహతికమై యేక్షేత్ర మతిశయిల్లు
కమలభవాండసంఘములు వోయిననైనఁ జెక్కు చెమర్ప దేక్షేత్రరాజ


గీ.

మట్టి శ్రీపురుషోత్తమాహ్వయవిముక్తి, దాయకక్షేత్రమున నీలధరమునందు
శ్రుతివినుతదారుదేహ మున్నతి ధరించి, శ్రీజగన్నాథుఁ డుండు వాంఛితము లిడుచు.

40

షష్ఠ్యంతములు

క.

ఏతాదృశగుణమణిఖద్యోత, ద్యోతప్రతానతోషితలోక
వ్రాతనవపద్మునకు వి, ఖ్యాతోరస్సౌధమధ్యగతపద్మునకున్.

41


క.

శుభమతికి దివ్యతరబో, ధభరితసామ్రాట్సహస్రతమహయమేధా
వభృథసమయార్ణవావి, ప్రభవద్దారవతనుప్రభాసంహతికిన్.

42


క.

సకృదుచ్చరితనిజాఖ్యా, ప్రకటితచాంద్రమసకిరణపాళీబహుధా
వికలీకృతాజవంజవ, నికరాంధతమసవిహృతికి నిఖిలాకృతికన్.

43


క.

కళ్యాణగుణికి, మోచితఖల్యాదుర్మోచపాపకంచుకబలసా
కల్యాతికల్యఘనసౌ, శీల్యమహానీలశైలశేఖరమణికిన్.

44


క.

వైహాయనవీథీగమ, నాహమహమికాప్రవర్ధితాతిపిపాసా
మోహవదరిష్టమోచన, రోహణవాస్తతికి నిగమరూఢాగతికిన్.

45


క.

కరుణాకల్పున, కురుమణి తరుణారుణబింబవిశ్రుతస్ఫుటవిలస
త్కిరణాలూనోగ్రతిమః, పరిణామఫణాఢ్యభుజగపతితల్పునకున్.

46


క.

బహుళబ్రహ్మహననపా, పహరణచణనిత్యతావిభాసిచ్ఛాయా
సహితసదాతనపల్లవ, బహుపాద్రూపునకు దళితభవతాపునకున్.

47
వ.

సభక్తిప్రణామపూర్వకంబుగా, నే నొనర్చి సమర్పింపంబూనిన శ్రీ విష్ణుపురా
ణంబున కనుక్రమణిక యె ట్లనిన —

శ్రీపరాశరుండు, జగద్ధితార్థంబుగా సంశషట్కసమేతంబైన శ్రీవిష్ణుపురాణంబు
నంగషట్కసమేతంబైన నిగమంబునుబోలె నిర్మించి ప్రియశిష్యుండైన మైత్రే
యమహామునికిం జెప్పె. తత్ప్రకారంబు.

48


చ.

తళుకుమెఱుంగుఁగోరలు, నుదగ్రమహావివృతాస్యగహ్వర
జ్వలితకరాళజిహ్వ జలజాతభవాండము తూఁట్లుబుచ్చు ను
జ్జ్వలితసటాచ్ఛటల్ ప్రళయసంజనితస్తనితోద్భటార్భటిన్
గలఁచు ఘనాట్టహాసములు గల్గిన శ్రీనరసింహుఁ గొల్చెదన్.

49


గీ.

తెలివి పౌర్వాహ్నికక్రియల్ దీర్చియధిక, గరిమనాసీనుఁ డగుపరాశరమునీంద్రుఁ
గాంచి మైత్రేయుఁ డత్యంతగౌరవంబు, తనర సాగిలి మ్రొక్కి యిట్లనుచుఁ బలికె.

50


చ.

అమితమనీష వేదములు నంగచయంబులు సర్వశాస్త్రముల్
క్రమమున నభ్యసించితి సలక్షణయుక్తి భవత్కృపారసం
బుమహిమ నెల్లశాస్త్రములఁ బూని పరిశ్రమ మెక్కు డంచు నం
దముగ మనీషు లెన్నగ మసంబుల నన్నతిధీప్రసన్నతన్.

51


సీ.

కలిగె నేలీల జగంబు క్రమ్మఱ నెట్లు గలుగు యన్మయమయి కానుపించుఁ?
బొడము నెచ్చట నెందు పొడవఱి యడఁగుభూతముల ప్రమాణంబు తెలఁప నెంత?
దేవాదిసంభనం బౌ వసుధాచలసాగరప్రమితి సంస్థానసరణి
సవితృప్రభృతికసంస్థానప్రమాణముల్ దేవాదివింశసంస్థితులు మనువు


గీ.

లన్నిమన్వంతరముల, కల్పాదికముల, వరుస యుగధర్మములును దేవర్షిరాజ
చరితములు వేదశాఖావతరణ, మహిమక్రమము వర్ణాశ్రమములధర్మములు తెలియ.

52


క.

ఆనతి యిమ్మని నిజపా, దానతుఁడై వేడుకొనిన యమ్మైత్రేయున్
బూనికఁ జుూచి పరాశరుఁ, డానందరసాహృదయుఁడై యిట్లనియెన్.

53


క.

భళిభళి లెస్స తలంచితి, వలఘుఁడు మాతండ్రితండ్రియైన వసిష్ఠుం
డలవునఁ జెప్పిన దిప్పుడు, తలఁపునకున్ వచ్చెనీవు తలఁచుటకతనన్.

54


క.

క్రూరగతి కౌశికునిచేఁ, బ్రేరితుఁ డగుదనుజుచేత మృతిబొందెను వి
స్థారతపోనిధిశక్తి యు, దారుఁడు మాతండ్రి యనుచు నంతయు వింటిన్.

55


చ.

విని విని విష్టకోపశిఖివిహ్వలచిత్తత దుష్టదైత్యనా
శనమున కొక్కసత్రము విశంకటలీల నొనర్ప నగ్నిలో

ననిమిషవైరికోటి దెగటార, మదీయపితామహుండు, క్ర
న్నన నను జూచి యిట్లను, మనంబు కృపారసమిశ్రమై తగన్.

56


ఉ.

కోపము మాను, రక్కసులకున్ మనకున్ బనియేమి, నీగురుం
డా పతితుండు గాఁడు, దివిజారులచే నిటు లౌట, పూర్వజ
న్మాపరిమేయకర్మఫల, మట్లగుటన్ విను, మూఢునట్లు క్రో
భోపహతుండుగాఁడు, ఘనుఁ డున్నతిబోధముకల్మి పౌత్రకా.

57


ఎవ్వరి నెవ్వరు చంపెద, రెవ్వరు చచ్చెదరు జనులకెల్ల నియతమై
నివ్వటిలు పూర్వకర్మం, బెవ్వలనికిఁ జనిన ఫలము నిచ్చుచు నుండున్.

58


గీ.

మనుజకోటి బహుక్లేశమున ఘటించి, నట్టికీర్తితపంబుల నడగఁజేయు
క్రోధ మెన్నితెఱంగుల క్రోధి యౌట, పాతకం బని చెప్పిరి పరమమునులు.

59


క.

వాసిన్ స్వర్గశ్రేయో, వ్యాసేధనిదాన మనుచు వర్ణింతురు పు
ణ్యసదృశులు పరమర్షు లు, దాసీనత కోప ముడుగవయ్య కుమారా!

60


గీ.

అనపరాధులు దైతేయు లగ్నిలోనఁ, గాలి రింతట చాలు నీకర్మ మవని
సాధుజనములు నిత్యక్షమాధనాఢ్యు, లనఁగ విందుముగాదం యెందును గుమార.

61


వ.

అని యిట్లు మహాత్ముం డైనఅస్మత్పితామహుం డనునయించినఁ దద్వాక్య
గౌరవంబున నపహృతసత్రయాగుండ నైతి. వసిష్ఠుండును సంతుష్టుండయ్యె.
నంత.

62


ఉ.

వారిజసంభవాత్మజుఁ డవారితదివ్యతిపో నుండు దే
వారుల కెల్లఁ గర్తయగునట్టి పులస్త్యుడు వచ్చినన్ మహో
దారుఁడు మత్పితామహుడు నర్ఘ్య మొసంగి మహార్హపీఠిపై
ధీరత నుంచ నుండి సముదీర్ణతతో నను జూచి యిట్లనున్.

63


ఉ.

వైరము మిక్కిలయ్యును నవార్యతపోధన! యివ్వసిష్ఠువా
గ్గౌరవ మూది తాల్మి మదిఁ గైకొని నిల్పితిగాన నీవు స
ర్వోరుపురాణవర్గములు యుక్తి నెఱింగెదు మత్కృపారస
స్ఫారకటాక్షవీక్షణవశంబున భాసురధీసమగ్రతన్.

64


సీ.

సన్మునీంద్ర! మదీయసంతతిపైఁ గడునల్క గల్గియుఁ దెగవైతిగాన
వర మిత్తుఁ గొనుము భవ్యపురాణసంహితాకర్త వయ్యెదు లెస్స గాఁగ దేవ
తాపారమార్థ్యమంతయు నెఱింగెదు ప్రవృత్తనివృత్తకర్మసంతతులయందు
నీమతి విమలమై నెగడు మత్ప్రసాదాతిశయంబున నని పులస్త్యుఁ

గీ.

డానతీయ వసిష్ఠుఁ డిట్లనియె నిమ్మ, హాత్ముఁ డానతి యిచ్చినయట్లు నీకు
సర్వమును నగుననియె నాచందమెల్లఁ, దలఁపునకు వచ్చె నిపుడు నీపలుకువలన.

65


వ.

అప్పురాణసంహిత నీ కెఱింగించెద ఇజ్జగంబు శ్రీవిష్ణునివలన నుద్భవించె;
అతనియంద నిలిచె; ఇజ్జగంబునకు స్థితిసంయమకర్త యతండ; ఇజ్జగంబులు
నవ్విష్ణుఁదేవుండని చెప్పి యప్పరాశరమునీంద్రుఁ డిట్లనియె.

66


సీ.

అవికారుఁడై శుద్ధుఁడై నిత్యుండై పరమాత్ముఁడై సర్వజీవాత్ముఁ డగుచు
నిత్యైకరూపుఁడై నీరజగర్భుఁడై పద్మాయతాక్షుఁడై భర్గుఁ డగుచు
దేవుఁడై శ్రీవాసుదేవుఁడై ప్రణవమై భూరిసృష్ట్యవనాంతకారి యగుచు
నవ్యక్తమై వ్యక్తమై స్థూలసూక్ష్మాత్ముఁడై యేకరూపుఁడై యాద్యుఁ డగుచు


గీ.

జగములకు మూలభూతుఁడై సకలలోక, ములకు నాధారమై సర్వమునకు నంత
రాత్మయై యణువులకును నణు వగుచును, వెలయు నేదేవుఁ డాదేవు విష్ణుఁ గొలుతు.

67


వ.

ఇవ్విధంబున జగదీశ్వరుఁడగు శ్రీవిష్ణుదేవునకు మ్రొక్కి చెప్పెద. తొల్లి దక్షాది
మునులకు పితామహుడు చెప్పె. ఆదక్షాదిమునులు నర్మదాతటంబున సార్వ
భౌముండగు పురుకుత్సునకుం జెప్పిరి. అప్పురుకుత్సుండు సారస్వతునకుం జెప్పె
నాసారస్వతుండు నాకుం జెప్పె.

68


గీ.

పరుఁడు పరులకుఁ బరముఁడై ప్రబలమహిమఁ, జెలఁగుపరమాత్ముఁ డాత్మసంస్థితుఁడు రూప
వర్ణనాదివినిర్దేశవర్జితుండు, సిద్ధగతి నూర్మిషట్కంబు చెందకుండు.

69

వాసుదేవతత్త్వము

క.

జగములలోపల తా న, జ్జగములు తనలోపలను ప్రశస్తి నిలుచుటన్
నిగమాంతవేదు లెన్నుదు, రగణితగతి "వాసుదేవుఁ" డని మునినాథా.

70


వ.

అవ్వాసుదేవతత్త్వంబు నిత్యంబును, నజంబును, నక్షరంబును, నవ్యయంబును
నేకస్వరూపంబును, వ్యక్తావ్యక్తస్వరూపంబును, హేయగుణప్రతిభటంబును,
నిర్మలంబును నగు పరబ్రహ్మంబు. ఆబ్రహ్మంబునకుఁ బురుషుండును, బ్రథా
నంబును, వ్యక్తంబును, కాలంబును నన నాల్గురూపంబులు, వీనికన్న పరంబయి
శుద్ధంబైన యవ్విష్ణుపరమపదంబును సూరిజనంబులు చూతురు; ఇప్పురుషు
ప్రధానవ్యక్తకాలంబులను బ్రహ్మరూపంబులు ప్రతిసర్గంబునందును వ్యక్తి
సద్భావహేతువులై వర్తిల్లు, విష్ణుదేవుడు క్రీడించు బాలకుండునుంబోలె
నవ్విధంబున బహురూపంబులఁ జేష్టించు.

71


చ.

అనయము నిత్యయై సదసదాత్మికయై యతిసూక్ష్మయై కడున్
బెనుపగుచున్న తత్ప్రకృతి పెద్దలు చెప్పుదు రాగమార్థముల్

గనుఁగొనుచున్ బ్రధానమని, కావున నింతకుఁ గారణమ్ము స
జ్జననుత యాప్రధానమ, నిజంబు తలంపఁ బ్రపంచకోటికిన్.

72


క.

అవ్యక్త మనెడునామము, సువ్యక్తం బగుచుఁ దనకుఁ జొప్పడఁగా స
ర్వవ్యాపియై ప్రధానము, దివ్యమహిమ వెలయుచుండు ధీరప్రవరా!

73


వ.

ఆప్రధానతత్వం బక్షయంబు, నాన్యధాధారం బమేయం బమలంబు, ధ్రువంబు,
శబ్దస్పర్శరూపరసగంధరహితంబు, త్రిగుణంబు, జగత్కారణంబు; అనాదిప్రభ
వావ్యయంబు, వ్యాప్తంబును నని బ్రహ్మవాదులు చెప్పుదురు.

74


ఉ.

రేలుఁ బగళ్లు నాకసము పృథ్వి తమంబు వెలుంగుఁగాక యు
ద్వేలతరేంద్రియంబులకుఁ దెల్లముగాక నిజప్రధానలీ
లాలలితుండు పూరుషుఁడు శ్లాఘ్యత బ్రహ్మసమాఖ్య నొప్పు భ
వ్యాలఘుచిత్స్వరూపమహిమాస్పదమై మునిలోకపూజితా.

75


క.

వెలయఁగ వ్యక్త మతీత, ప్రలయంబున నణఁగి మగుడఁ బ్రకృతిభవంబై
నిలుచుట నిసర్గ మది తా, నలవడు ప్రాకృత మనంగ నధికస్ఫూర్తిన్.

76


మ.

కమలాధీశుఁడు సుమ్ము మౌనివర! యిక్కాలంబు చర్చింప నం
తము లే దాదియు లేదు దీనికి ననూనత్వంబునన్ సర్గసం
యనుసంస్థానము లిందుచే నెపుడు సమ్యక్ప్రౌఢి సచ్ఛిన్నభా
వములై వర్తిలుఁజువ్వె యెల్లపుడు దివ్యల్లీల సంధిల్లగన్.

77

సృష్టిక్రమము

వ.

ఇట్లు ప్రవర్తిల్లుచుండ గుణసామ్యంబున నప్పురుషుండు పృథక్సంస్థితుండై
యుండ విష్ణుస్వరూపంబైన కాలంబు పరివర్తించు. అప్పుడు పరబ్రహ్మంబును,
పరమాత్మయు, జగన్మయుండును, సర్వభూతేశ్వరుండును, సర్వాత్మయుఁ, పర
మేశ్వరుండును నగు శ్రీహరి సర్గకాలంబున స్వేచ్ఛాప్రధానపురుషుల
యందుఁ బ్రవేశించి క్షోభంబు నొందించును. అట్ల క్షోభంబు నొంది క్షేత్ర
జ్ఞాధిష్ఠితంబైన ప్రకృతివిశేషంబువలన మహత్తత్త్వంబు పుట్టె. గుణమేళ
నంబునఁ ద్రివిధంబయ్యె. త్వక్కుచేత బీజంబువలె బ్రధానతత్త్వంబుచేత
మహత్తత్త్వం బావరింపంబడు. అమ్మహత్తత్త్వంబువలన వైకారికంబును,
తైజనంబును, భూతాదియు నన గుణమేలనంబున నహంకారంబు త్రివిధంబై
వర్తిల్లును. అందుఁ దామసంబైన భూతాదియను నహంకారంబు వికృతి నొంది
శబ్దతన్మాత్రంబువలన శబ్దలక్షణంబైన యాకాశంబు పుట్టె. భూతాదిచేత
నావరింపఁబడు నయ్యాకాశంబు వికృతి నొంది స్పర్శమాత్రంబు పుట్టించె.

దానివలన మహాబలవంతంబై స్పర్శగుణంబైన వాయువు పుట్టె. ఆకాశంబుచే
నావరింపఁబడు నావాయువు వికృతి నొంది రూపతన్మాత్రంబు పుట్టించె. దాని
వలన రూపగుణంబైన తేజంబు పుట్టె. వాయువుచే నావరింపఁబడు నాతేజంబు
వికృతి నొంది రసతన్మాత్రంబు పుట్టించె. దానివలన రసగుణంబులైన జలంబులు
పుట్టె. తేజంబుచే నావరింపఁబడి యాజలంబు వికృతి నొంది గంధమాత్రంబు
పుట్టించె. దానివలన గంధగుణంబైన పృథివి పుట్టె. ఇది తామసాహంకా
రంబువలనఁ బుట్టిన భూతతన్మాత్రసృష్టి యనం బరగు.

78


సీ.

అనఘాత్మ తైజసంబను నహంకారంబువలన నింద్రియములు గలిగెనవియుఁ
జెప్పెద శ్రోత్రంబు జిహ్వయు నేత్రంబు నాసిక త్వక్కు మనంబు ననఁగ
నాఱును బుద్ధీంద్రియంబులు శ్రవణాదిసిద్ధికై కలిగె నూర్జితము లగుచుఁ
బరిపాటి వాక్పాణిపాదపాయూవస్థములగు కర్మేంద్రియంబులు మునీంద్ర!


గీ.

యుక్తి శిల్పాదిసిద్ధికై యొనరు నివియు, వినుము వైకారికం బన విశ్రుతిగను
నయ్యహంకారమునఁ బుట్టె నఖిలమైన, దేవతాసర్గ మీరీతి తెలిసికొనుము.

79


వ.

ఇట్లు వైకారికాహంకారంబువలన నింద్రియాధిదేవతలుపుట్టిరి. ఆకాశ
వాయుతేజస్సలిలపృథువులు శబ్దాదిగుణసంయుతంబులై శాంతంబులును,
ఘోరంబులును, మూఢంబులును, విశేషంబులును నై పృథగ్భూతంబులై
యుండు, అన్యోన్యసంయోగంబు నొంది ప్రజల సృజించు.

80


సీ.

తెలివితోఁ బూరుషాధిష్ఠితత్వమున, నవ్యక్తమహానుగ్రహంబువలన
మహదాదు లత్యంతమహిమ నండంబు నుత్పాదించు నది పరిపాటి పెద్ద
యగుచు బుద్బుదతుల్యమై భూతసమితిచే నభివృద్ధ మగు జలాభ్యంతరమున
బ్రహ్మస్వరూపమై పరగు విష్ణున కది తలపోయ ప్రాకృతస్థాన మయ్యె


గీ.

నందుఁ జతురాననుం డయ్యె నబ్జనేత్రుఁ, డుల్బము సురాచలము జరాయువున గాని
గర్భజలము సముద్రసంఘములు నయ్యె, నధికవిస్మయ మొదవ బ్రాహ్మణవరేణ్య!

81


క.

గిరిసాగరాంతరీప, స్ఫురితసురాసురమనుష్యపూర్ణములై భా
సురలీల జగము లెల్లన్, బరిపాటిం గలిగెనందుఁ బరమమునీంద్రా.

82


వ.

అయ్యండంబు బహిర్భాగంబున నుత్తరోత్తరదశగుణితములైన వారివహ్ని
వాయువ్యోమభూతాదిమహదవ్యక్తంబు లనెడు సప్తావరణంబులచేతను
నారికేళఫలాంతర్బీజంబు బాహ్యోదకంబులచేతంబోలెఁ బరివృతం బగుచు
నుండు; అందు రజోగుణకలితుండై విశ్వేశ్వరుండైన హరి బ్రహ్మత్వంబు దాల్చి
యీజగత్సృష్టియందుఁ బ్రవర్తించు. సత్త్వగుణకలితుండై సృష్టంబైన

జగంబు విష్ణుత్వంబునం బాలించు; తమోగుణకలితుండై యతిభీషణంబైన
రుద్రరూపంబు దాల్చి యఖిలభూతంబుల భక్షించు; ఇవ్విధంబున.

83


సీ.

అఖిలంబు మ్రింగి యేకార్ణవంబున, నాగపర్యంకతలమునఁ బవ్వళించి
యోగనిద్రారూఢినొంది మేల్కని పున, స్సృష్టి గావించు స్రష్టుత్వ మొంది
సృష్టిరక్షణనాశకృత్యంబులకు బ్రహ్మ, విష్ణురుద్రాఖ్య లుద్వృత్తిఁ దాల్చు
ప్రమదంబుతోడుత భగవంతుఁడగు జనా, ర్దనుఁ డొక్కరుఁడెసువ్వె మునివరేణ్య


గీ.

భూతములు నింద్రియమ్ములు పూరుషుండు, కూడఁ గనుపట్టు జగమును గుణచయంబు
మహదహంకారములును శ్రీమత్పయోజ, పత్రనేత్రుండెసుమ్ము తప్పదు నిజంబు.

84


వ.

అని చెప్పిన మైత్రేయుం డిట్లనియె.

85


గీ.

అప్రమేయంబు నిర్గుణం బమలతరము, వరము శుద్ధంబు నైనట్టి బ్రహ్మమునకు
కలిగె నేలీల స్పష్ట్యాదికర్తృకత్వ, మానతీయంగవలయు సంయమివరేణ్య.

86


వ.

అనినం బరాశరుం డి ట్లనియె.

87


సీ.

యత్నంబు చేయు బ్రహ్మమునకు శక్తులు, సర్వభావము లేడ సంభవించు
కొలఁదిడఁగారాక గోచరింపఁగరాక, సర్గాదివైభవశక్తు లమరుఁ
బావకునకు నెట్లు పరగు నుష్ణత యట్లు, బ్రహ్మంబునకు శక్తి పటిమసువ్వె
నారాయణుండు తా నలినాసనుండను, భూమిక తాల్చె సంపూర్ణమహిమ


గీ.

నాతనికి నిజమానంబుచేత వర్ష, శతము పరమాయు వది రెండుసగము లైన
నొకటి పూర్వపరార్థమౌ నొకటి యెన్ని, కొన ద్వితీయపరార్థమౌ మునివ రేణ్య.

88

కాలవిభాగము

కనుగొన విష్ణురూపమగు కాలము సు మ్మిటులై ప్రవర్తిలున్
మునుపు తదీయవైభవము మోదముతో నెఱిగించినాఁడ నీ
కనఘ! చరాచరంబులకు నన్నిటికిని పరిణామకారియై
వినుతికి నెక్కు తత్క్రమము విస్తరలీల నెఱుంగఁగాఁదగున్.

89


వ.

పదేనునిమేషంబు లొక్కకాష్ట, ముప్పదికాష్ట లొక్కకళ, ముప్పదికళ లొక్క
ముహూర్తంబు. ముప్పదిముహూర్తంబులు మనుష్యమాసంబున నొక్క
యహోరాత్రంబు. పదియేనహోరాత్రంబు లొక్కపక్షంబు, రెండుపక్షంబు
లొక్కమాసంబు. ఆఱుమాసంబు లొక్కయయనంబు. అవి దక్షిణోత్తర
సంజ్ఞలం గల రెండుసంవత్సరంబు. లందు దేవతలకు దక్షిణాయనంబు
రాత్రియు, నుత్తరాయణంబు పగలును నగు. ఇట్లు దేవతాపరిమాణంబునఁ

బండ్రెండువేలవర్షంబులు కృతత్రేతాద్వాపరకలిసంజ్ఞితం బైనయొక్కచతుర్యు
గం బగు. అందు కృతయుగంబునకు నాల్గువేలు త్రేతాయుగంబునకు మూఁడు
వేలు ద్వాపరంబునకు రెండువేలు కలియుగంబునకు వేయిదివ్యసంవత్సరంబు
లని చెప్పుదురు. కృతయుగపూర్వసంధ్య నన్నూఱు, తత్సంధ్యాంశంబు
నన్నూఱు, త్రేతాయుగపూర్వసంధ్య మున్నూఱు, తత్సంధ్యాంశంబు మున్నూఱు;
ద్వాపరయుగసంధ్య యిన్నూఱు, తత్సంధ్యాంశంబు నిన్నూఱు, కలియుగ
పూర్వసంధ్య నూఱు, తత్సంధ్యాంశంబు నూఱుదివ్యవర్షంబులు. ఇట్లు యుగ
సంధ్యాసంధ్యాంశంబులు పండ్రెండువేలుదివ్యవర్షంబులు నొక్కచతుర్యు
గం బగు. సంధ్యాసంధ్యాంశంబుల మధ్యకాలంబు యుగాంతం బనం బరగు.
ఇట్లు కృతత్రేతాద్వాపరకలిసంజ్ఞలంగల నాల్గుయుగంబులు నొక్కచతుర్యు
గం బనం బరగు. అట్టి చతుర్యుగసహస్రంబు బ్రహ్మకు నొక్కదివసం బగు.
అట్టి దివసంబునందు చతుర్దశమనువులు పుట్టుదురు. వారికాలంబు వినుము.
సప్తఋషులు సురలుఁ మనువునకును బుత్త్రులైన నృపతులు నేకకాలంబున సృజిం
పంబడి యేకకాలంబున సంహృతులగుదురు. వీరలకాలంబు డెబ్బదియొక్క
దేవతాయుగంబు. అది మనుష్యమానంబున ముప్పదికోట్లునరువదియేడు
లక్షలు నిరువదివేలు వత్సరంబు లవి చతుర్దశగుణితంబైన బ్రహ్మకు నొక్క
పగలు. అప్పగటిచివుర నైమిత్తికప్రళయం బనం బరగు, అందు.

90


చ.

విలయదవానలచ్ఛటలవేఁడిమి భూర్భువరాదిలోకముల్
కలయఁగఁ బర్వెఁ దాపమునఁ గ్రాగి మహర్నిలయుల్ వడిన్ జను
స్థలమున కేగి రంత నతిదారుణలీల మహానిలోత్కరం
బుల జగ మెల్ల ముంచె పరిపూర్ణమహార్ణవవారిపూరముల్.

91


క.

ఆయేకార్ణవమున ఫణి, నాయకశయనమున బద్మనాభుఁడు వెలయున్
దోయజభవసంజ్ఞ జగం, బాయతగతి మ్రింగి యోగు లభినుతి సేయన్.

92


వ.

దినప్రమాణమైన రాత్రి చనినఁ దదంతంబున నెప్పటియట్ల జగంబుల సృజించు.
ఇట్లు బ్రహ్మకుఁ దత్ప్రమాణంబున వర్షశతంబు పరమాయువగు. అందు సగంబు
పూర్వపరార్థంబు నతిక్రమించె. తదంతంబున పద్మకల్పం బన విశ్రుతం బయ్యె.
ఇప్పుడు ద్వితీయపరార్థంబునఁ బ్రవరిల్లుచున్నది. కల్పంబు వారాహం బనం
బరగు నని చెప్పి మైత్రేయునకు శ్రీపరాశరుం డిట్లనియె.

93


గీ.

అనఘచరిత! యతీతకల్పావసాన, మున నిశాసుప్తుఁడై లేచి వనజభవుఁడు
సత్త్వసమధికుఁ డగుచు శూన్యత్వమందు, లోక మీక్షించి తనయాత్మలోఁ దలంచి.

94


వ.

బ్రహ్మస్వరూపియైన నారాయణుం గూర్చి యమ్మంత్రం బుదాహరించె.

95

శ్లో.

ఆపోనారా ఇతిప్రోక్తా ఆపోవై నరసూనవః।
అయనంతస్య వాః పూరం తేన నారాయణ స్స్మృతః॥

96


క.

ఆరయ నరసూను లగుట, నారములన జలము లమరు నారములయనం
జై రాజిల్లుకతంబున, నారాయణుఁ డనఁగఁ బద్మనాభుఁడు వెలయున్.

97


వ.

అని తలంచి విశ్వంభర యంభోంతర్గత యగుట యెఱింగె నప్పుడు.

98


సీ.

తనువు విదర్చ సంస్తబ్ధ తనూరుహో, ద్ధతి నజాండంబు రంధ్రములు వోవ
వాలధి త్రిప్ప దుర్వారవాతాహతి, నబ్దముల్ వలయాద్రి యవలికేగ
ఘుర్ఘురధ్వని చేయఁ గోటిసంఖ్యాకని, ర్ఘాతారభటిశంక గడలుకొనఁగ
అడుగుపెట్టిన ఛలోదగ్రఖురాధిఘ, ట్టన నగేంద్రములైనఁ దునిసిపోవ


గీ.

హరియె యజ్ఞత్రయీమయంబైన ఘోణి, రూపధేయంబు తాల్చి యారూఢమహిమఁ
దనుజనుస్స్థానవాసులై మునులు పొగడ, సంభృతోల్లాసభాసియై జలధిఁ జొచ్చె.

99


వ.

ఇట్లు మత్స్యకూర్మాదిరూపంబులు దాల్చి జగద్ధితం బొనర్చు నీశ్వరుండు యజ్ఞ
వరాహరూపంబు దాల్చి రసాతలగతియైన విశ్వంభర డాసిన నద్దేవియుఁ బ్రణ
మిల్లి భక్తివినయవినమితోత్తమాంగయై యిట్లని నుతించె.

100


గీ.

శంఖచక్రగదాధరా! సర్వభూత, మయ! జగన్నాథ! నీకు నమస్కరింతు
ప్రేమ తొల్లియు నను నుద్ధరించితి వను, కంప నిప్పుడు నను నుద్ధరింపవయ్య.

101


క.

ఏమొదలగు భూతంబులు, దామోదర! తావకాంశధరములు గావే
వేమరు నీ కిదె మ్రొక్కెద, శ్రీమహిళానాథ యుద్ధరింపుము నన్నున్.

102


సీ.

పరమాత్మ! ప్రకృతిరూపక! పూరుషకార! మహదహంకారతన్మాత్రభూత
కాలేంద్రియాత్మక! కలుషనాశన! జనార్దన! సర్గవిలయసంస్థానకార్య
నిపుణ! గోవింద! మానితగుణాధార! నిర్గుణ్యైక! కొను నాదుమ్రొక్కు లిపుడు
తల్లివి దండ్రివి దాతవు భర్తవు పోషకుండవు జగంబులకు నెల్ల


గీ.

లీల నేకార్ణవంబైనవేళ భోగి, భోగపర్యంకతలమునఁ బూర్ణమహిమఁ
బవ్వళింతువు నీకన్న పరముఁ డొకఁడు, కలఁడె చర్చించిచూడ జగన్నివాస!

103


క.

వనజాక్ష! వాసుదేవా!, నిను గొలువక దొరక నేర్చు నేమర్త్యునకున్
వినుతవిముక్తివధూసం, గనికామసుఖానుభవవికస్వరలీలల్.

104


గీ.

కనునవి వినునవి మనమున, ననయముఁ దలపోయఁ గొలఁదియైనవి బుద్ధిం
బనుపడ నిశ్చితమైనవి, మునినుతభవదీయరూపములు చర్చింపన్.

105


గీ.

అరయ నాధారమై స్రష్టవై యుపాశ్ర, యంబవై యాత్మవై నాకు నప్రమేయ
యుండుదువు నీవు దానిచే నొనరు దేను, మాధవి యనంగ నత్యంతమహిమ వెలయ.

106

క.

జ్ఞానస్వరూపజయ! ని, త్యానుపమానందగుణ! జయ! నిరుపమదయా
ధీనమనోంబుజ! జయ! ల, క్ష్మీనారీరమణ! జయ! సమేధితశౌర్యా.

107


వ.

యజ్ఞంబును, వషట్కారంబును, ఓంకారంబును, అగ్నులును, వేదంబులును,
తదంగంబులును, యజ్ఞపురుషుండును, సూర్యాదిగ్రహంబులు, నఖిలనక్షత్రం
బులును, మూర్తామూర్తంబులును, దృశ్యాదృశ్యంబులును నీవ, యిట్లు సర్వే
శ్వరుండవైన, నీకు నమస్కారంబు.

108


చ.

అని వసుధాపురంధ్రి వినయాతిశయంబునఁ దన్ను నీగతి
వినుతులు సేయ మెచ్చి పృధివీధరుఁ డుద్ధత శుద్ధసామని
స్స్వనఘనఘుర్ఘురారభటి సారెకుఁ జేయుచు దంష్ట్రికాంచలం
బున వడి నెత్తి తెచ్చె నతిమోద మెలర్ప వసుంధరాసతిన్.

109


చ.

సురుచిరదంష్ట్రచే ధరణినుస్థితఁ జేసి రమావధూమనో
హరుఁడు విదిర్చె వేదమయమైన శరీరము స్తబ్ధతాతిభీ
కరవరరోమఘాతములఁ గంజభవాండము తూఁట్లు వోవ నా
హరి నదసీయరోమనిచయాంతరసంస్థితు లైనసన్మునుల్.

110


వ.

జనస్థాననివాసులైన సనందనాదులు భక్తినమ్రకంధరులై ధీరతరోద్ధతేక్ష
ణుండైన యద్ధరాధరుని నిట్లని స్తుతియించిరి.

111


క.

పరమేశ! కేశవాచ్యుత!, వరశంఖగదాసిచక్రవర్ణితబాహా!
పరిఘ! జగదుద్భవస్థితి,, పరిహృతికారణచరిత్ర పాలించు మమున్.

112


సీ.

వేదము ల్పాదముల్ విశదదంష్ట్రిక లుయూపములు యజ్ఞములు దంతములు చితులు
వక్త్రంబు జిహ్వ పావకుఁడు రోమంబులు కుశసముత్కరము లక్షులు దివంబు
రాత్రియు స్థూలశిరంబు బ్రహ్మపదంబు సకలసూక్తంబులు సటలు ఘ్రాణ
మతులహవిస్సు గండతలముల్ స్స్రుక్కులు మహితనాదంబు సామస్వరంబు


గీ.

తనువు ప్రాగ్వంశ మఖిలసత్రములు సంధు, లిష్టములు పూ ర్తములు చెవు లిద్ధమహిమ
వెలయు దేవరవారికి వేదవేద్య!, యజ్ఞపూరుష! వికచపద్మాయతాక్ష.

113


ఉ.

పన్నగశాయి! భక్తజనపాలనఖేలనలోల! లీల నీ
యున్నతదంష్ట్రికాశాగ్రమున నున్నవసుంధర చూడనొప్పె సం
పన్నపయోరుహాకరనిమజ్జనకేళికవేళఁ గోరపై
నున్న సమున్నపంకిలపయోరుహిణీనవపత్రమో యనన్.

114


గీ.

వింతగ భవత్పదక్రమాక్రాంత మయ్యె, నంతయు ననంతపదము శ్రీకాంతకాంత!
తావకీనవపుర్వ్యాప్తమై వెలసెను, రోదసీగహ్వరంబు నిరూఢమహిమ.

115

వ.

దేవా! నీ వొక్కరుండవే పరమార్థంబవు. నీప్రభావంబున చరాచరాత్మకంబైన
జగంబు వ్యాప్తంబయ్యె. జ్ఞానాత్మకుండవైన నీరూపంబైన జగంబు నందఱు
బుద్ధి లేక యర్థస్వరూపంబుగాఁ జూచి మోహంబున మునుఁగుదురు. కొందఱు
జ్ఞానవిదులు శుద్ధచేతస్కులై యిజ్జగంబు జ్ఞానాత్మకంబుగాఁ జూతురు. సర్వాత్మ
కుండును, పరమేశ్వరుండును నైన నీవు ప్రసన్నుండవై యిద్ధర నుద్ధరించి
మాకు సుఖంబు సేయుమని రంత.

116


చ.

మొనసి సనందనాదిమునిముఖ్యులు తన్ను నుతింపఁ బద్మలో
చనుఁడు మహార్ణవంబుపయి సాగరమేఖల నిల్పె నఫ్డు మే
దినియు మునుంగదయ్యె నతిదీర్ఘవిశాలత నంబురాశిలో
ననువుగ నెప్పటట్ల సమయై తగె ద్వీపసరిద్దరాఢ్యయై.

117


మ.

మును సర్గాంతమునన్ లయాగ్నిఖలం మోఘక్రియం గాలిపో
యినభూమీధరకోటి దివ్యతరభూయిష్ఠప్రభావంబునన్
వనజాతాక్షుఁడు తొంటియట్ల చెలు వొందన్ నిల్పెఁ బద్మోద్భవుం
డనునామంబు ధరించి తాన మహనీయామోఘసంకల్పుఁడై.

118


వ.

ఇ ట్లమోఘవాంఛితుం డైనధరాధరుండు బ్రహ్మరూపధరుండును రజో
గుణావృతుండునై భూవిభాగంబు చేసి సప్తద్వీపంబులు యథాప్రకారంబున
నేర్పరించి భూరాదిచతుర్లోకంబులు తొల్లిటి యట్ల యేర్పరించి సృజ్యశక్తులు
ప్రధానకరణీభూతంబులుగా సమస్తజనంబుల సృజించెనని శ్రీపరాశరుం
డానతిచ్చిన మైత్రేయుం డిట్లనియె.

119


క.

దేవఋషిపితృదనుజమ, ర్త్యావళులన్, వృక్షతిర్యగాదుల నా రా
జీవభవుఁ డేవిధమువాఁ, డై వెలయ సృజించె చెప్పుమయ్య తెలియఁగాన్.

120


మ.

అనినన్ శక్తికుమారుఁ డిట్లనియెఁ గల్పాదిన్ సిసృక్షుత్వచిం
తనఁబద్మాసను డుండ సర్గ మపు డుద్ధంబయ్యె నుద్యత్తమో
ఘనమై బుద్ధివివర్జితంబయి సమగ్రంబై నగాఖ్యాకమై
వినుతప్రక్రియ జూడఁ బెంపెసఁగి యుర్వీదేవచూడామణీ!

121


వ.

తమంబును, మోహంబును, మహామోహంబును, తామిస్రంబును, అంధ
తామిస్రంబును, అనునైదుపర్వంబులుగల యవిద్య ప్రజాపతివలనఁ బ్రాదుర్భ
వించె. అదియ పంచథావస్థితంబై బహిరంతరంబుల అప్రకాశంబై, సంవృ
తాత్మకంబై, నగాత్మకంబైన సర్గంబై పుట్టి ముఖ్యసర్గంబునం బరగె. ముఖ్యం
బులు గదా నగాదులు. అప్పు డప్పితామహుం డాముఖ్యసర్గం బవలోకించి

మఱియ సాధకంబైన సర్గాంతరంబు తలంచుచుండ, నతనికిఁ దిర్యక్సర్గం
బభివర్తింప నందువల్లఁ దిర్యక్సర్గంబు పశ్వాదులు తమఃప్రాయంబులు,
నవేదులు, నుత్పథగ్రాహులు నజ్ఞానులు, జ్ఞానమానులును,అహ
మానులును, అంతఃప్రకాశంబులు, పరస్పరావృతంబులు నష్టావింశ
ద్విధాత్మకంబులునై పుట్టెను. ఆతిర్యక్సర్గం బన్యసాధకంబుగాఁ దలంచి
సర్గాంతరంబు తలంచునజునకు నూర్థ్వశ్రోతంబు ప్రవర్తించిన నందువలన
సాత్త్వికంబైన దేవవర్గంబు పుట్టె. వారు సుఖప్రీతిబహుళులును, బహిరంతరం
బుల ప్రకాశులును, అనావృతులును, తుష్టాత్ములునునై వెలుంగుదురు. ఆ దేవ
సర్గంబు చూచి పరమప్రీతిసంపన్నుండై పుండరీకాసనుండు వెండియు సర్గాం
తరంబు చింతించుచుండ, నర్వాక్శ్రోతంబు ప్రవర్తింప నందువల్ల తమోరజో
ధికంబును, దుఃఖబహుళంబును పునఃపునఃకారియు, బహిరంతఃప్రకాశం
బునునైన మనుష్యసర్గంబు పుట్టె. బ్రహ్మకు ప్రథమంబు మహత్సర్గంబు. ద్వితీ
యంబు తన్మాత్రభూతసర్గంబు. తృతీయంబు వైకారికంబును, నైంద్రియకం
బును. చతుర్థంబు ముఖ్యసర్లంబు. పంచమంబు తిర్యక్సర్గంబు. షష్ఠంబు దేవ
సర్గంబు. సప్తమంబు మానుషసర్గంబు. అష్టమం బనుగ్రహసర్గంబు. నవమంబు
కౌమారసర్గంబు. ఈతొమ్మిదిసర్గంబులును జగన్మూలహేతువు లగునని సంక్షేప
ప్రకారంబునఁ జెప్పి సవిస్తరంబుగా వినందలంచిన మైత్రేయునకు శ్రీపరాశరుం
డిట్లనియె.

122


క.

ప్రాచీనకర్మభావితు, లై చచ్చుచుఁ బుట్టుచున్ నిరంతరసంసా
రాచితు లగుదురు చెప్పఁగ, నీచందము చిత్తవృత్తి నెఱుగుదు రార్యుల్.

123


గీ.

అమరతిర్యఙ్మనుష్యాచరముల బొడమఁ, జేయు నజునకు మానససీమఁ బుట్టి
రాత్మజులు వారిచే జగంబంతయును స, ముద్ధితంబయ్యె వినుము సన్మునివరేణ్య.

124


క.

జలములలో మునిగిన, యజ్జలజాసనుజఘనసీమ జనియించిరి ని
శ్చలధైర్యు లసురవరు లతి, బలవంతులు తామసప్రబలమానసులై.

125


క.

వనజభవుండును నపు డ, త్తను విడువఁగ రాత్రి యగుచుఁ దనరె నది వినూ
తనగతి రాత్రుల బలియుట, దనుజవరులు దానచేసి ధర్మప్రవణా!

126


చ.

అనఘ పితామహుండు వపురంతర మొంది సృజించె సత్త్వయు
క్తిని సురకోటి నంత, నిజదేహము త్యక్తము సేయ నాక్షణం
బున దిన మయ్యె దేవగణముల్ దినభాగమునందు నొందు పెం
పును బలమున్ మునిప్రవర! పూనె విధాతయు నన్యదేహమున్.

127

గీ.

అందుఁ బితరులు జనియింప నబ్జభవుఁడు, విడిచెఁ దత్తను వదియును వెలసె సంధ్య
యనఁగ ద్విజకోటిచే సేవ్యయగుచు నెపుడు, బ్రహ్మయును నంత దేహాంతరంబుఁ దాల్చె.

128


క.

వినుము రజోధిక మగున, త్తనువువలన మనుజకోటి తద్దయుఁ బొడమెన్
వనజజుఁడు విడువ దఁనువది, వినుతజ్యోత్స్నాభిధాన విశ్రుతిఁ గాంచెన్.

129


వ.

జ్యోత్స్నారాత్ర్యహస్సంధ్యలు నాలుగును బ్రహ్మశరీరంబులుగా నెఱుం
గుము. మఱియు రజోమాత్రాత్మికయగు తనువు ధరించియున్న యన్నలినాస
నునకు క్షుతంబు వొడమె, నందువలన నంధకారంబునందు క్షుత్క్షాములు విరూ
పులు శ్శశ్రుముఖులు నైనవారు పుట్టి ధాతం జుట్టుముట్టి మాం రక్ష రక్ష
యని పలుకుటం జేసి రాక్షసు లనం బరగిరి. కొందఱు భక్షింతమను జక్షణంబు
వలన యక్షులనఁ బుట్టిరి. వారి నప్రియంబులం జూచుదాత కేశంబులు విశీర్ణం
లై తల కెక్కి విసర్పించు కతంబున సర్పంబులు పుట్టి హీనంబు లగుట నహు లనం
బరఁగె. అంత క్రోధావిష్టుండై, జగత్స్రష్ట కపిలవర్ణంబులును నుగ్రంబులును
బిశితాశనంబులగు భూతగణంబుల నిర్మించె నంగంబువలన గంధర్వులను,
వయస్సువలనఁ బక్షులను, వక్షంబువలన మేషంబుల, ముఖంబువలన నజంబుల,
నుదరంబులవలననుఁ బార్శ్వంబులవలనను గోవులను, బాదంబులవలన
నశ్వమాతంగరాసభగవయమృగంబులను, నుష్ట్రాశ్వతరన్యంకువులను, రోమం
బులవలన ఫలమూలినులగు నోషధులం గల్పించె, నిట్ల కల్పాదిత్రేతాయుగ
ముఖంబున నిర్మించి.

130


గీ.

గోవు నజమును పురుషుండు గొఱియ గుఱ్ఱ, మశ్వతరగర్దభంబులు ననఁగ నేడు
గ్రామ్యపశువుల నధ్వరకార్యమునకు, ఛాత నియమించె కుశలసంధాత యగుచు.

131


ఉ.

ఓపరమర్షివర్య! కమలోద్భవుఁ డధ్వరకార్యభారసు
శ్రీపరిమాణామ మొప్ప విభజించె నరణ్యపశువ్రజంబు గాం
క్షాపరలీల నెన్నికకు సప్తవిధంబుల భూతధాత్రి వై
శ్వాపదవానరద్విఖురసామజపక్షిజలేచరాహులన్.

132


సీ.

రుఙ్నివహంబు త్రివృద్ధధంతరము ల, గ్నిష్టోమగాయత్రినియమవిధులు
యజురాగమంబు స్తోమాధ్వరత్రైష్టుభం, బులు బృహత్సామోక్థ్యములతెఱంగు
సామంబు జాగతఛ్ఛందంబు సోమంబు, వైరూప మతిరాత్రవర్తనంబు
సమధికాధర్వ మార్యమణమానుష్టుభ, చ్ఛందంబు వై రాజసారసరణి


గీ.

ఘనుఁడు రాజీవభవుఁ డనుక్రమనిరూఢి, యొనర ప్రాక్దక్షిణప్రతీచోత్తరాస్య
నీరజంబులవలనఁ బూనిక సృజించె, సాంద్రవిభవంబు మీఱ మునీంద్రచంద్ర.

133

వ.

ఇట్లు దేవాసురపితృమనుష్యుల నానావిధభూతంబుల సృజించి మఱియు సంక
ల్పంబున యక్షపిశాచగంధర్వాప్సరోగణనరకిన్నరరక్షోవయఃపశుమృగంబుల
నవ్యయవ్యయంబులైన స్థావరజంగమంబుల సృజియించె. ప్రాచీనకర్మం
బులు బీజంబులుగా వేదశబ్దంబులవలన నెఱింగి నామరూపంబులు కల్పించు.
ఇట్ల ప్రతిసర్గంబునందును సిసృక్షాశక్తియుక్తుండై సృజ్యశక్తిప్రేరితుండై
సృజించుచుండునని చెప్పిన మైత్రేయుం డిట్లనియె.

134


క.

మునివర! యర్వాక్ఛ్రోతో, జనితులు మానవులు వారిజన్మంబులపెం
పును వర్ణములును గర్మము, లనూనగుణములును జెప్పవయ్య తెలియఁగాన్.

135


వ.

అనినఁ బరాశరుం డిట్లనియె.

136


సీ.

కల్పించె నాస్యపంకజముల సత్వైక, గుణగరిష్ఠులను బ్రాహ్మణుల ఘనుల
కలిగించె వక్షంబువలన రజోగుణా, ధిక్యభాసురుల క్షత్రియకులజుల
నిర్మించె తొడల నున్నిద్రరజస్తమో, వశ్యమానసుల సద్వైశ్యవరుల
పుట్టించె పదముల భూయిష్ఠ తామస, గ్రస్తవిగ్రహులశూద్రప్రవరుల


గీ.

పద్మగర్భుండు యజ్ఞనిష్పాదనార్థ, మనఘ వీరలు యజ్ఞసాధనముసువ్వె
యజ్ఞములఁ దృప్తు లై సుర లడిగినపుడు, వృష్టి యొనఁగూర్ప బ్రతుకుదు రెల్లప్రజలు.

137


మ.

వినుతాచారులు నైజకర్మనిరతుల్ విఖ్యాతధర్ముల్ యశో
ధను లంతఃకరణాతినిర్మలులునై ధాత్రీజనుల్ కోరిన
ట్లన సర్గం బపసర్గముం గనుచు వేడ్కం బెక్కుకాలంబు లి
ట్లనఘ ప్రక్రియనుండ నంతట సమగ్రాశ్చర్యసంపాదియై.

138


క.

హరిరూపమైనకాలము, పరిపాటిం జనులయందుఁ బడవైచు సుని
ష్ఠురపాపబీజ మది యు, ద్ధురగతి కడుఁ బ్రబలె బహుళదోషాస్పదమై.

139


గీ.

కర్మతతులు ఫలింపక ధర్మసరణి, సాగక విశేషసిద్ధులు సంభవింప
కపుడు జనసంఘములకు పాపాభిభవము, మించ ద్వంద్వాదిదుఃఖముల్ ముంచుకొనియె.

140


క.

వనగిరిజలకృత్రిమదు, ర్గనికరములు పట్టణములు ఖర్వటములు పెం
పెనయ రచియించి యందుల, ననువు పఱచుకొనిరి తగుగృహంబులు తమకున్.

141


వ.

ఇట్లు శీతాతపాదిబాధాప్రశమనంబునకుఁ బ్రతీకారంబుగా గృహాదికంబు నిర్మిం
చుకొని జీవనోపాయంబునకై వ్రీహులు, గోధుమలు, యవలు, అణువులు, తిలలు,
ప్రియంగువులు, ఉదారంబులు, కోద్రవంబులు, సతినకంబులు, మాషంబులు,
ముద్గంబులు, మసూరంబులు, నిష్పావంబులు, కుళుద్ధంబులు, ఆఢకంబులు, చణ
కంబులు, శణంబులు, ననఁ బదియేడువిధంబుల గ్రామ్యౌషధులు సంపాదించిరి.

ఇందు యజ్ఞార్హంబులు వ్రీహియవమాషగోధూమాణుతిలప్రియంగుకుళు
ద్ధంబులన గ్రామ్యౌషధు లెనిమిదియు, శ్యామాక, నీవార, జర్తిల, గవేధుక,
వేణుయవ, మర్కటకంబులను నారణ్యౌషధు లాఱునంగాఁ బదునాలుగోషధు
లేర్పఱించి దీనిచేఁ బరాపరవిదులైన మునులు యజ్ఞంబు లొనరింతురు. ఎవ్వరి
చిత్తంబునఁ బాపంబు వృద్ధింబొందు వారు యజ్ఞంబులను వేదవేద్యుండగు
శ్రీహరిని దేవతలను నిందింతురు. అట్లు వేదాదినిందకులై దురాత్ములు దురా
చారులు కుటిలాశయులునై నిరయంబునం బడి దుఃఖభాగులై యాతా
యాతంబులం బొందుదురని చెప్పి శ్రీపరాశరుం డిట్లనియె.

142


గీ.

ఇట్లు జీవననిర్వాహ మేర్పడంగ, కమలగర్భుండు వర్ణాశ్రమముల కఖిల
ధర్మవర్తులలోకముల్ ధర్మములను, నేర్పు విఖ్యాతి నొందగా నేర్పరించె.

143


సీ.

సత్కర్మనిరతులై జరగుబ్రాహ్మణులకు, నొదవు ప్రాజాపత్యపదనివాస
మాహవశూరతాఖ్యాతు లౌరాజుల, కేంద్రసంస్థానసౌఖ్యంబు గలుగు
పరిపాటినిజకర్మపరులైన వైశ్యుల, కనువొందు వాయులోకాధివసతి
ద్విజపరిచర్యల వెలయుశూద్రుల కబ్బు, నవ్య వైభవము గాంధర్వపదము


ధర్మమర్యాద యింతైనఁ దప్పకుండ, జగము లెల్లను బాలించుసారసాక్షు
నక్షయాంశంబు తానగునబ్జగర్భు, నాజ్ఞ చొప్పది సుమ్ము సంయమివరేణ్య.

144


క.

అష్టాశీతిసహస్రవి, శిష్టమునీంద్రవ్రజంబు చెందెడిలోకో
త్కృష్టపద మధివసింతురు, స్పష్టత గురుకులనివాసపరులు మునీంద్రా!

145


క.

మౌనివర! సప్తఋషులు న, నూనత వసియించునట్టి యున్నతపదవిన్
బూనికతో వసియింతురు, వానప్రస్థులు సమగ్రవైభవ మొప్పన్.

146


చ.

అనిశము నిత్యకర్మపరులై విజితేంద్రియులై వినిష్టవ
ర్తన ఋతుకాలదారనిరతత్వము నొంది దయార్ద్రులై మనం
బున పరహింస మాని జనపూజ్యత నొందుగృహస్థు లొందువా
రనుపమ మైనబ్రహ్మనిలయంబు వినిర్మలధర్మవిత్తమా.

147


గీ.

చంద్రసూర్యాదులైనను జనుచుఁజనుచు, మగిడివత్తురు గాని సన్మౌనిచంద్ర!
ఎప్పుడును పునరావృత్తి యెఱుగ రవని, ద్వాదశాక్షరచింతనాధన్యమతులు.

148


సీ.

తామిస్రమును నంధతమిస్రమును రౌరవంబు మహారౌరవంబు వీచి
కాలసూత్రంబు సంఘాతంబు నివియాదిగాఁ బెక్కునరకముల్ గలవు వాని
యందు మునుంగుదు రధ్వరవ్యాసేధకారులు వేదంబు గర్హ చేయు
వారును నిజకర్మవర్గపరిత్యాగు లైనమానవులు నిట్లగుటఁ జేసి

గీ.

మానవులు నిజవర్ణైకమార్గవృత్తి, నాశ్రమార్హసదాచార మర్హకర్మ
పథము వదలక మెలఁగ నిర్భరవివేక!, యైహికాముష్మికంబుల నందు టరుదె.

149


వ.

సర్వనియంతయగు వాక్కాంతోపయంత భృగుపులస్త్యపులహప్రత్యంగిరు
లును మరీచిదక్షాత్రివసిష్ఠులు నను మానసపుత్త్రుల నవబ్రహ్మల సృజించి ఖ్యాతి,
భూతి, సంభూతి, క్షమ, ప్రీతి, సన్నతి, ఊర్జ, అససూయ, ప్రసూతు లనఁ
దొమ్మండ్రుకాంతల సృజించి క్రమంబున భృగ్వాదులకుఁ బత్నులగా నిచ్చె.

150


చ.

మఱియు సనందనాదులగు మానసపుత్త్రులు వీతరాగులై
కరకరి మాని సంస్కృతిసుఖంబులపై కడురోసిపోవ న
త్తెఱఁగున కబ్జగర్భుఁ డతితీవ్రపుఁగోపము నొంద భ్రూకుటి
స్ఫురితతదీయఫాలమునఁ బుట్టె సుతుం డొకఁ డుగ్రమూర్తియై.

151


గీ.

జనన మొందుచు నతఁడు రోదనము సేయు, కతన రుద్రుండు నాపేరు కలిగె నతని
కంత నారీనరాత్మకంబైన తచ్ఛ, రీర మీక్షించి యధికసంప్రీతితోడ.

152


క.

విభజించుము నిను నని యీ, ప్రభు డంతర్ధాన మొంద పదపడి తన్నున్
విభజింప నతఁడు పురుషుఁడు, నిభగమనయు నైరి చిత్ర మిది యని పొగడన్.

153


వ.

అప్పురుషుండు పదునొకండుభేదంబుల నొంది శాంతంబులును ఘోరంబులును
నైనరూపంబుల వెలసె. అయ్యంగనయు సర్వమంగళాకారంబున శాంత
రూపయై వెలసె.

154


ఉ.

సంభృతసృష్టిచింతనవశంవదుఁడై, కమలాసనుండు స్వా
యంభువు మానసంబున ప్రహర్ష మెలర్ప సృజించి నవ్య
స్రంభసురూపలక్షణవరన్ శతరూపసతిన్ స్వయంమనః
సంభవ నిచ్చెనాతనికి సమ్మతిఁ బాణిగృహీతియై తగన్.

155


వ.

వారిద్దఱికి ప్రియవ్రతోత్తానపాదులను పుత్త్రు లిద్దఱును ప్రసూత్యాకూతులను
రూపౌదార్యగుణాన్వితలగు కన్యక లిర్వురును బుట్టిరి. అందు ప్రసూతి దక్షునికి,
ఆకూతి రుచిప్రజాపతికి భార్య లైరి. అందు ఆకూతి రుచిప్రజాపతివలన దక్షిణ
యను కన్యకను యజ్ఞనామధేయుండైన పుత్త్రునిం గనియె. వారిద్దఱును మిథు
నం బైరి. అందు యజ్ఞుండు దక్షిణయందుఁ బన్నిద్దఱుపుత్త్రులం గనియె. వారు
స్వాయంభువమన్వంతరంబున యామాఖ్యదేవత లైరి. దక్షుండు ప్రసూతి
యందు నిరువదినలుగురుకన్యకలం గనియె. అందు శ్రద్ధ, లక్ష్మి, ధృతి, పుష్టి,
తుష్టి, మేథ, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, సిద్ధి, కీర్తి అను నీపదమువ్వురను
ధర్ముండు భార్యలుగాఁ బరిగ్రహించె. వారిచెల్లెండ్ర ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి

ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వథలను పదునొక్కరి
క్రమంబున భృగుండును, మరీచియు, అంగిరుండును, పులస్త్యుండును, పుల
హుండును, క్రతువును, అత్రియు, వసిష్ఠుండును, వహ్నియు, పితరులును భార్య
లగాఁ బరిగ్రహించిరి. అందు ధర్మునివలన నశ్రద్ధ కామంబును, లక్ష్మి దర్పం
బును, ధృతి నియమంబును, తుష్టి సంతోషంబును, పుష్టి లోభంబును, మేధ
శ్రుతంబును, క్రియ దండంబును, నయంబు వినయంబును, బుద్ధి బోధంబును,
లజ్జ వినయంబును, వపువు వ్యవసాయంబును, శాంతి క్షమను, సిద్ధి సుఖం
బును, కీర్తి యశంబును పుత్రులుగా గనిరి. అందు శ్రద్ధాసూనుం డగుకామంబు
వలన నంది యనుకాంత హర్షుం డనుపుత్రునిం గనియె. అతండు ధర్మునకుం
బౌత్రుండయ్యె.

156


గీ.

పరమపుణ్య! యధర్మునిభార్య యయ్యె, హింస వారిద్దఱికిఁ గలిగె నెన్ని చూడ
అనృతుఁ డనునందనుఁడు నికృత్యాఖ్యకన్య, వారలిద్దఱు మిథునమై భూరిమహిమ.

157


వ.

భయంబును నరకంబును ననునిద్దఱుపుత్రులను మాయయు వేదనయు నను
నిద్దఱుకన్యకలం గనిరి. అందు భయంబును మాయయు నరకంబును వేదనయు
మిథునంబులైరి. అందు భయంబు మాయయందు భూతాపహారియగు
మృత్యువుం గనియె. నరకంబు వేదనయందు దుఃఖం బనుపుత్రుని గనియె.
మృత్యువువలన వ్యాధిజరాశోకతృష్ణాక్రోధంబులు పుట్టె. అవి యన్నియు
నూర్థ్వరేతంబు లయ్యె. ఇవియన్నియు జగత్ప్రళయకార్యపరుండగు శ్రీవిష్ణు
దేవుని రౌద్రరూపంబులుగా నెఱుంగుము. దక్షమరీచ్యాదులగు ప్రజాపతులు
సృష్టికార్యనిర్వాహకుండగు శ్రీవిష్ణుదేవుని రాజసరూపంబులుగా నెఱుంగుము.
మనువులు మనుపుత్రులు సన్మార్గవర్తులగు నరోత్తములు జగత్స్థితికార్యనిర్వా
హకుండైన శ్రీవిష్ణుదేవుని సాత్త్వికరూపంబులుగా నెఱుంగుమని చెప్పిన
మైత్రేయుం డిట్లనియె.

158


క.

స్థితిసర్గవిలయములు ని, శ్చితగతి నిత్యంబు లనుచుఁ జెప్పఁబడియె నూ
ర్జితపుణ్య! తత్స్వరూపము, వితతంబుగ నాకుఁ జెప్పవే కృప ననినన్.

159


చ.

ప్రమద మెలర్ప నిట్లను బరాశరుఁ డుద్భవరక్షణాంతముల్
క్రమమున రూపభేదములు గైకొని చేయు జనార్దనుండు ని
త్యము మహనీయదివ్యమహిమాతిశయంబున నడ్డపాట లే
కమితవివేకపాకపరమాద్భుతభూరితరప్రభావుఁడై.

160


వ.

నైమిత్తికంబును బ్రాకృతికంబును నత్యంతికంబును నిత్యంబును నన సర్వ
భూతంబులకుఁ జతుర్విధప్రళయంబు గలదు. అందు బ్రహ్మ శయనించిన నగుప్రళ

యంబు నైమిత్తికంబు. బ్రహ్మాండంబు ప్రకృతియందు లయం బొంద నది
ప్రాకృతప్రళయంబు. యోగీంద్రులు జ్ఞానంబునఁ బరమాత్మయందు నత్యంత
లయంబు నొందిన నది యాత్యంతికప్రళయంబు. అహర్నిశంబును జంతువులు
పొందు వినాశం బది నిత్యప్రళయంబు. ప్రకృతివలని ప్రసూతి యది ప్రాకృత
సృష్టి యనంబడును. అవాంతరప్రళయపర్యంతంబును జెప్పంబడునది నైమిత్తిక
సృష్టి. అనుదినంబును సమస్తభూతంబులుం బుట్టుట నిత్యసృష్టి. అని పురాణార్ధ
విచక్షణులచేతం జెప్పంబడు. ఇట్లు సర్వశరీరంబులయందు సంస్థితుండై భగ
వంతుండును భూతభావనుండును నగుశ్రీవిష్ణుదేవుం డుత్పత్తిస్థితిసంయమం
బులు చేయుచుండు. సృష్టిస్థితివినాశంబులకు సర్వప్రాణులయందు వైష్ణవ
శక్తులు పరివర్తించు. జగంబు గుణత్రయమయంబును బ్రహ్మశక్తిమయంబును
నై యుండు. ఇ ట్లెఱింగినమర్త్యుండు పునరావృత్తి నొందఁడు.

161


ఉ.

ఆది పితామహుండు తనయంతటిపుత్రకుఁ గాంతు నంచు న
త్యాదృతి నుండ నవ్విభునియంకమునందు జనించె పుత్రుఁ డు
న్నాదుఁడు నీలలోహితుఁ డనన్ వడి నేడ్చె నతండు భీతిసం
పాదకుఁడై యుపద్రవము పాటిల సద్ద్విజవంశవర్ధనా!

162


క.

ఏమిటి కేడ్చెద వని తనుఁ, దామరసప్రభవుఁ డడుగఁ దడయక నాకున్ే
నామ మిడు మనిన రోదన, సామగ్రిన్ రుద్రుఁ డనఁగఁ జను దని పలికెన్.

163


గీ.

రోదనము మానుమనిన నారుద్రుఁ డేడుఁ, మార్లు మఱియును నేడ్వ నమ్మహితమతికి
నామసప్తక మిడియె విన్నాణ మమర, నబ్దగర్భుఁడు మౌనికులాగ్రగణ్య.

164


క.

స్థానములు నందనులు బ, త్నీనివహము గలుగఁజేసె నిపుణుఁడు వాక్కాం !
తానాథుం డెనమండ్ర, కు నానందరసార్ద్రహృదయుఁడై మునినాథా.

165


వ.

అవియును భవుండు శర్వుం డీశానుండు పశుపతి భీముం డుగ్రుండు మహా
దేవుం డన నేడునామంబులు రుద్రునకు వెలయు. సూర్యుండు, జలంబు, భూమి,
వాయువు, వహ్ని, ఆకాశంబు, దీక్షితుండగు బ్రాహ్మణుండు సోముండు ననఁ
గ్రమంబున రుద్రాదులకుఁ దనువులయ్యె. సువర్చల, ఉమ, నువికేశి, అపర, శివ,
సాహ, దీక్ష, రోహిణి యను నెనమండ్రు క్రమంబున భార్యలైరి. శనైశ్చరుండు,
శుక్రుండు, లోహితాంగుండు, మనోజవుండు, స్కందుండు, సర్గుండు, నుత్తా
నుండు, బుధుండు నన పుత్రు లైరి; దీనిపుత్రపౌత్రులచే జగంబు పూరితంబయ్యె.
ఏతత్ప్ర్పభావుండగు రుద్రుండు సతీదేవిఁ దనకు భార్యగాఁ గైకొనియుండునంత.

166

ఉ.

దక్షునిమీఁదికోపమునఁ దాళక యాసతి యోగచాతురీ
దక్షత మేను పోవిడిచి, తా హిమవంతుని పుత్రియైన ఫా
లాక్షుఁడు పెండ్లియాడెఁ బ్రియమార నుమాసతి నాత్మవీథిఁ బ్ర
త్యక్షము తన్ను గోరు వికచాంబుజపత్రవిశాలలోచనన్.

167


గీ.

ధాతయు విధాతయు నన ఖ్యాతులైన, సుతుల నిద్దఱి పంకజాక్షునకు మహిషి
యైన శ్రీదేవి గాంచె సంయమివరుండు భృగుఁడు ఖ్యాత్యాఖ్య గలతనమగువయందు.

168


వ.

అనిన మైత్రేయుం డి ట్లనియె.

169


క.

శ్రీతరుణి దుగ్ధసాగర, జాత యనుచుఁ జెప్పుదురు నిజంబుగ మీరల్
ఖ్యాతికి భృగునకు సుతయం, చీతఱిఁ జెప్పితిరి దీని నెఱిగింపఁ దగున్.

170


వ.

అనిన బరాశరుం డి ట్లనియె.

171


గీ.

నిత్య సుమ్మా జగన్మాత నీరజాయ, తాక్షునకు ననపాయని యనఘచరిత
భర్తకైవడి తానును బ్రచురలీల, వెలయు నీలోకములయందు నలఘుమహిమ.

172


సీ.

అర్ధంబు పంకజాతాక్షుండు వాక్కు పద్మాలయసుమ్ము సంయమివరేణ్య
బోధ శ్రీవిష్ణుండు బుద్ధి శ్రీకామినీమణి సుమ్ము కమలసంభవకులీన
ధర్మంబు చక్రగదాపాణి సత్క్రియ సాగరోద్భవ సుమ్ము యోగివర్య
స్రష్ట కైటభదైత్యసంహారి సృష్టి లక్ష్మీమానవతి సుమ్ము శిష్టచరిత


గీ.

భూమిధరుఁ డబ్జనాభుండు భూమి కమల, యిభపరిత్రాత సంతోష మిందిరావ
ధూటి తుష్టి రమాధినాథుండు కామ, మబ్జకరయిచ్ఛ సుమ్ము విప్రాగ్రగణ్య.

173


వ.

శ్రీవిష్ణుండు యజ్ఞంబు, శ్రీకాంత దక్షిణ, జనార్దనుఁడు పురోడాశంబు,
రమాదేవి యాజ్యాహుతి, మధుసూదనుండు ప్రాగ్వంశంబు, లక్ష్మి పత్ని
శాల, శ్రీహరి యూపంబు, వారిధినందన చితి, భగవంతుండు కుశంబు, పద్మా
వాస యిధ్మ, సారసాక్షుండు సామంబు, పద్మ ఉద్గీతి, వాసుదేవుండు హుతాశ
నుండు, హరిప్రియ స్వాహ, జగన్నాధుండు, శంకరుండు, ఇందిర, గౌరి ;
చామోదరుండు, సూర్యుండు ; లోకమాత ప్రభ, వైకుంఠుండు పితృగణంబు,
సంపత్కాంత స్వధ, హృషీకేశుం డాకాశంబు, మంగళదేవత ద్యోవీథి,
శ్రీధరుండు శశాంకుండు, పద్మమందిర కాంతి, వాసుదేవుండు వాయువు,
మదనజనయిత్రి జగచ్ఛేష్ట, గోవిందుండు సాగరంబు, చంద్రసహోదరి తద్వేల,
గరుడధ్వజుం డింద్రుండు, ఇందిరాదేవి యింద్రాణి, మధుసూదనుండు
యముఁడు, కమలమందిర తత్కాంత, మాధవుండు ధనేశ్వరుండు, మారజనని
బుద్ధి, కేశవుండు వరుణుఁడు, పుండరీకవిష్టర వరుణాని, దైత్యాంతకుండు
సేనాని, క్షీరాబ్ధితనయ దేవసేన, పీతాంబరుం డవష్టంభంబు, విష్ణుమహిషి
శక్తి, పురుషోత్తముండు నిమేషంబు, హరివక్షోనివాసిని కాష్ట, త్రివిక్ర
ముండు ముహూర్తంబు, మానారీరత్నంబు కళ, పుండరీకాక్షుండు ప్రదీ
పంబు, అరవిందమందిర జ్యోత్స్న, పాంచజన్యధరుండు ద్రుమంబు, శోభన
దేవత లత, విష్టరశ్రవుండు దివసంబు, వైష్ణవి విభావరి, కృష్ణుండు
వరుండు, వారిజాలయ వధూమణి, ఉపేంద్రుండు నదంబు, నలినపాణి
నది, అచ్యుతుండు ధ్వజంబు, అబ్జగేహిని పతాక, నాగశయనుండు
కోలుండు, నలినాసన తృష్ణ, ధరణీధరుండు రాగంబు, రమాకాంత రతి,
యివ్విధంబున.

174


ఉ.

ఎన్నని చెప్పెద న్మునికులేశ్వర! పూరుషరూపధారు లె
న్నియుఁ బంకజోదరుని యాకృతులంచు దలంచు స్త్రీత్వసం
పన్నము లెన్నిభావములు పాటిలు నన్నియు పద్మమందిరా
సన్నుతమూర్తు లంచు మదిఁ జక్కదలంచు మచంచలస్థితిన్.

175


ఉ.

శ్రీసతిపుణ్యగాథ మునిశేఖరుఁడైన మరీచి చెప్ప ను
ల్లాసముతోడ వింటి నది శ్లాఘ్యము నీ కెఱిఁగింతుఁ దొల్లి దు
ర్వాసుఁడు శంకరాంశజుఁ డవారితదుర్భరసత్తపోవిభా
భాసితవిగ్రహుండు పరిపాటిఁ జరించె వసుంధరాస్థలిన్.

176


ఉ.

మేరునితంబాభోగపరిణద్ధమేఖలామణిఘంటికలు వాద్యమహిమఁ జూప
వదనాబ్జసౌరభ్యవాంఛామిళద్భృంగరావముల్ గేయకార్యము ఘటింప
వరిచలన్నవపాణివరమణికంకణోత్కరనిక్వణంబులు తాళగింప
కొదమతెమ్మెరలసోకున వాలిముంగురు లలిక భాగమున నృత్యంబు సలుప


గీ.

నలసగతులకు రాయంచ లాసపడఁగ, పృథుకుచభరంబునకు మధ్యరేఖ వణఁక
మర్మువిరిదండ తాల్చి మార్గమున వచ్, నొక్కవిద్యాధరాంగన యక్కజమున.

177


క.

ఆకుసుమదామసౌరభ, మాకారితమధుపనివహ మవ్వన మెల్లన్
బ్రకటగతి వాసింపఁగ, నాకమలభవోపమానుఁ డంగన కనియెన్.

178


ఉ.

అండజయాన! నీకు శుభమయ్యెడు నాకు నొసంగరాదె, పూ
దండ యనన్ లతాంగి కరతామరసంబులు మోడ్చి “మీరు గై
కొండు లతాంతదామ మిదిగో" యని యిచ్చి నమస్కరింప మ
ర్త్యుండును బోలెఁ గైకొని సదోహలుఁడై తలఁ దాల్చి పోవఁగన్.

179

సీ.

కూడి ముప్పదిమూఁడుకోటులు దేవతా, సంఘము ల్మిగుల హెచ్చరికఁ గొలువ
తాళమేళప్రాప్తిఁ దప్పక హాహాది, గంధర్వనాథు లుత్కంఠఁ బాడ
చోద్యవేద్యముగ రంభాద్యప్సరోంగనా, మణులు లాస్యైకసంభ్రమము చూప
జయజయజీవేతిశబ్దాయమానయై, విద్యాధరశ్రేణి వినుతి సేయ


గీ.

వేలసంఖ్యకు మిగులు ముత్యాలగొడుగు, లమితచామరములు దాల్చి యమరవరులు
గొలువఁ బౌలోమితో నభ్రకుంజరాధి, రూఢుఁడై వచ్చె నటకు మరుత్ప్రభుండు.

180


వ.

ఇట్లు స్వేచ్ఛాగతుండైన యాఖండలుం జూచి ప్రచండతపోమదశౌండుండగు
నమ్మునిమార్తాండుండు నిజజటామండలిమండనంబైన యప్పువ్వుదండఁ దిగిచి
దేవమండలేశ్వరుపై విసరివైచిన నతండును మెండుకొన్న యహంకారం
బున మనఃపంకజం బశంకంబై యుండ కరాంకుశంబున నందుకొని మరంద
బిందునందదిందిందిరవందిబృందసుందరగీతికారామంబైన యద్దివ్యకుసుమ
దామంబు దిగిచి కైలాసశిఖరంబు జుట్టిన జాహ్నవియనం దగునట్లుగా నుద్దామ
మదస్తోమాభిరామంబులగు సామజకుంభంబులం జుట్టిన బెట్టువదరు ముదురుం
దుమ్మెదపదువులరొదకు చెదరి యమ్మదకలభం బుదిరిపడి వడిం గరంబునఁ
దిగిచి మధుఁకరమలీమసాకారకల్యంబగు నమ్మాల్యంబు కరగనిగళనోపమాన
సాక్యలంబుగా ధరణిం బడవైచి యేచిన మదాంధకారంబు ఘోరంబుగాఁ
బెచ్చుపెరిగి రెచ్చి పదంబుల బెట్టుమట్టి పుట్టినకోపచాపలంబున సాటోపం
బుగాఁ బుచ్చికొని విసరి వియచ్చరకోటిపై వైచి యద్దెసకుం గవిసిన
కొవ్వున నార్చి దేవసంఘంబులు వెకలి పికవికలై చెదిరిపఱవ నీక్షించి
సహస్రాక్షుం డక్షీణసంరంభంబునన్ గుంభమధ్యం బంకుశంబున నాన్చిన న
నూనశోణితధారలు కటంబుల నుత్కటంబుగా సుదీర్ణకర్ణోపాంతకాంత
విద్రుమగుళుచ్ఛఛాయాకారంబుగా జారినన్ చేరిన కోపాటోపంబు ముమ్మ
రంబుగ క్రమ్మఱం బుచ్చుకొని యుచ్చైర్నాదంబున మేదిని వైచి పాదంబుల
రాచి ఘీంకారంబు చేసి నిలిచిన జూచి వాచంయమీంద్రుఁడు రుద్రరోష
నిస్తంద్రుండై యింద్రున కిట్లనియె.

181


క.

స్వారాజ్యపదమదాంధుడవై, రాజసమున మదీయహస్తార్పితమా
లారత్న మిచ్చమెచ్చక, యీరీతిన్ బాఱవైతువే కుటిలాత్మా.

182


ఉ.

సాగిలి మ్రొక్కి దేవరప్రసాదము సుమ్మని వేడ్కతో శిరో
భాగము చేర్ప కేనొసగు భవ్యరమాస్పదపుష్పదామ మీ
లాగునఁ బాఱవైచితి వలక్ష్యము చేసిటుగాన సంపదా
భోగము వాయు మూఁడుజగముల్ ప్రభుఁడౌ నిను గూడ వాసవా.

183

క.

నను నన్యులతో సరిగా, మనమునం దలంచితివొ కుపితమానసు నన్నున్
గని వణకు జగము లిపు డే, యనువున నీ కింతచులక నైతిన్ జెపుమా!

184


అనవిని సురపతియును, గ్రక్కునం గరి దిగనుఱికి మౌనికుంజరుపదముల్‌
తనమౌళి సోకమ్రొక్కుచు, ననునయవచనములు పలుక నమ్ముని పలికెన్.

185


చ.

వదరులు మాని పొ మ్ముడుపవచ్చునె యెవ్వరికైనన న్ను నా
హృదయమునందు లేదు దయ యెంచగ నించుకయైన తాల్మి చెం
దదు మది నెంత తెచ్చికొనినన్ భువనత్రయజంతుసాధ్వస
ప్రదుని నెఱుంగవే ననకు పురందర! యెందఱు లేరు తాపసుల్‌.

186


గీ.

గౌతమాదులు మునులు నీకడకుఁ జేరి, కలవి లేనివి నొకకొన్ని పలుక లేని
చేవ యొక్కించుకొని యెంత చేసి తింద్ర!, యెఱుగవే నన్ను దుర్వాను నిద్ధతేజు.

187


సీ.

తరుణారుణచ్ఛాయ దార్కొను ఘనదూర్ఘజట లుజ్ఞ్వలత్కీలజాలములుగ
భయదకేతుప్రభం జక్కున నగునటద్భ్రూకుటి ధూమవిస్ఫూర్తి గాఁగ
కోకనదద్యుతి గుచ్ఛించు కనుచూపుగము లురువిస్ఫులింగములఁ బోల
స్తనితనాదముఁ గేరు దంతసంఘట్టనారావంబు చిటచిటార్భటలు గాఁగ


గీ.

పేర్చుకార్చి చ్చనంగ మహాభీకరోగ్ర, మూర్తియైవ చ్చు నను జూచి ముజ్జగముల
వారు భయ మంది కందనివారు గలరె, చెనటివై యింద్ర! యి ట్లేల చేసి తీవు.

188


క.

అటునిటు నీ విప్పుడు, తటవెటమాటలు కొన్ని యాడ విడుచునె యస్మత్‌
పటుకోపతీవ్రదహనో, ద్భటకీలాజాలతాపభరము సురేంద్రా.

189


గీ.

ఎన్ని చెప్పిననైన నే నిప్పు డాడు, మాట దప్పునె నీ వనుమాన ముడిగి
నాగపతి నెక్కి దేవతానగరమునకు, పొమ్ము దేవేంద్ర! యిావట్టిబూమె లేల!

190


క.

అని పరుషోక్తులు పల్కు.చు, చనియెన్ మునిపతి యథేచ్ఛ శతమన్యుఁడు గ్ర
క్కున నభ్రగజము నెక్కుక, యనుపమఖేదమునఁ బోయె నమరావతికిన్.

191


వ.

అంత.

192


సిీ.

నిశ్చలపుణ్యతపశ్చర్య లుడివోయె సవనతంత్రంబులు సాగవయ్యె
ఫలియింపవయ్యె వృక్షలతాదు లామ్నాయశాస్త్రపాఠంబులు జరుగవయ్యె
ప్రాణివర్గములు దుర్చలవృత్తు లయ్యె సనాతనధర్మముల్‌ నడువవయ్యె
కామలోభాదు లగ్గలమయ్యె వగ్రహవ్యాప్తి నర్ఘవిశేష మల్పమయ్యె


గీ.

పాకదమనుండు సురలు నిశ్శ్రీకు లైరి, లోకములు లేమిచేత చికాకుపడియె
హరిహయకృతాపరాధకుప్యన్మునీంద్ర, చంద్రరుద్రభయంకరశాపమహిమ.

193

వ.

ఎచ్చట సత్యంబు గల దచ్చట లక్ష్మి నిలుచు. ఆసత్యంబును లక్ష్మి ననుసరించు.
లక్ష్మీరహితులకు సత్యం బెక్కడిది. సత్యంబు లేకున్న గుణంబులు గలుగనేర్చునే.
గుణంబులు లేకున్న పురుషులకు బలశౌర్యాద్యభావంబు సిద్ధంబగు. బలశౌర్యాది
వివర్జితుండు సకలజనంబులకు లంఘనీయుండుగు. అట్లు సర్వజనలంఘితుండు
ప్రసిద్ధుం డయ్యును అపధ్వస్తమతి యగు. ఇట్లు త్రైలోక్యంబు నిశ్శ్రీకంబును సర్వ
గుణవివర్జితంబును నగుచుండ నిశ్శ్రీకులగు దేవగణంబులతోఁ దాదృశులగు
దైత్యదానవులు రణోద్యోగంబు చేసిన పరాజితులై పురుహూతహుతాశన
పురోగములైన త్రిదశులు పితామహుశరణంబు చొచ్చి యథావృత్తంబగు నిజ
వృత్తాంతంబు విన్నవించిన వారల నాదరించి విరించి యిట్లనియె.

194


చ.

పరముఁ బరాపరేశ్వరు శుభవ్రజవర్థను దైత్యమర్దనున్
వరదు జగద్భవస్థితివినాశనకారణు దుఃఖదారణున్
నిరఘుఁ బ్రజాపతీశ్వరుని నీరజనేత్రుని దివ్యగాత్రునిన్
శరణము వేడు దీక్షణమ సత్యము మీకు శుభంబు గల్గెడిన్.

195


చ.

అనియని యంత సంభ్రమనిరంతరతాంతనితాంతచింత బా
యని ముని దేవతల్ గొలువ నంబుజగర్భుఁడు నిర్భరత్వరన్
జనిఁ జనితానుమోదము లెసంగ గనుంగొనె శుభ్రతావిమో
హనఘనవీచితల్పసుఖితార్జునసారథి క్షీరవారిధిన్.

196


వ.

ఇట్లు క్షీరాబ్ధి గాంచి విరించి తదుత్తరతీరం బాశ్రయించి సాష్టాంగనతి
గావించి యంజలిపుటంబులు ఫాలంబులం గీలించి పంచాస్త్రగురు నుద్దేశించి
యిట్లని వినుతించె.

197


చ.

సరసిజనాభ సర్వగత సర్వశరణ్య యనంతనామ య
క్షర యజ యవ్యయాత్మక సుఖప్రద భూధర లోకధామ భా
స్వర శరణాగతార్తిహర చక్రగదాధర దేవదేవ నీ
చరణసరోరుహంబులకు సాగిలి మ్రొక్కెద నిష్టసిద్ధికిన్.

198


గీ.

ఆదరమున ముముక్షువు లైనయోగు, లాత్మ దలఁతురు నిన్ను మోక్షార్థు లగుచు
అరయ ప్రకృతిగుణములు నీయందు లేవు, శుద్ధసత్వాత్మ మము కృపఁ జూడవయ్య.

199


సీ.

కాలమై, శక్తియై, కారణంబై, కారణమునకు కారణత్వము వహించి
కార్యమై, కార్యసంఘాతంబునకు కార్యమై సర్వభూతాత్మయై వెలింగి
భోక్తయై, భోజ్యమై, వ్యక్తయై, స్రష్టయై, సృజ్యమై యఖిలకర్తృత్వ మొంది
బోద్ధయై, బోధమై, బోధ్యమై, యవికారమై, స్థూలసూక్ష్మతాప్రాప్తి నొంది

గీ.

శంకరుఁడు నేను నింద్రాదిసకలసురలు, తెలియఁగా లేనిమహిమచేఁ దెలివి నొంది
పరగు నెయ్యది యవ్విష్ణుపరమపదము మది తిరంబుగ నిల్పి మ్రొక్కెదము భక్తి.

200


క.

వనజజుఁ డన శంకరుఁ డన, వనజోదరుఁ డనఁగ భువనవందిత! యయ్యై
యనువుల వెలయుదు వఘనా, శన! తావకమహిమఁ బొగడ శక్యమె కృష్ణా!

201


వ.

భవదీయదర్శనసూర్యోదయంబున నస్మన్నయనకమలంబులు తెలివినొందుం
గాక అని పలుకు పితామహునిపలుకులు విని యనిమిషపతి పురోగములైన
సురలు సాగిలి మ్రొక్కి యుచ్చైర్నాదంబున నిట్లని స్తుతియించిరి.

202


గీ.

మాకు నధిపతి యైనబ్రహ్మయును దెలియ, జాలఁడట నీపరమపదం బేల తెలియ
శక్య మగు మాకు నీవ ప్రసన్దృష్టి, జూచి దర్శన మొసఁగు మచ్యుత ముకుంద.

203


వ.

తదనంతరంబ బృహస్పతి పురోగములైన మును లిట్లని స్తుతియించిరి.

204


క.

ఆద్యుఁడవు యజ్ఞపురుషుఁడ, వాద్యంతవిహీనుఁడవు సమస్తాగమసం
వేద్యుఁడవు సృష్టిపతి వన, వద్యుఁడ వమితుఁడవు సకలవంద్యుఁడ వెందున్.

205


వ.

ప్రసన్నుండవై దర్శన మొసంగుము.

206


సీ.

ధాత యీతండు, పద్మామనోహర! త్రిలోచనుఁ డీతఁ డుత్ఫుల్లవనజనేత్ర
పూష యీతఁడు సుధాంభోరాశిశయన! వైశ్వానరుం డతఁడు దివ్యప్రభావ
పాకారి యితఁడు నిర్భరకృపాసంవేశ, యాదోధిపతి యీతఁ డసురదమన
ధనుదుఁ డీతఁడు తప్తకనకసుందరచేల, యక్షరా జితఁడు విహంగగమన


గీ.

సాధ్యమరుఁదశ్వివసువిశ్వసంజ్ఞసురలు, వీరు సర్వేశ! నిజపరివారసహితు
లగుచు వచ్చిరి మిముఁ గొల్వ నాదరించి, దృష్టిగోచరుఁడవు గమ్ము దేవదేవ.

207


వ.

దైత్యసేనాపరాజితులమై వచ్చి దేవరవారిశ్రీచరణంబులు శరణంబు జొచ్చి
తిమి రక్షించమని ప్రార్థించి రాసమయమున.

208


సీ.

ఎదబొదల్ సిరిమేన నొదగు నుంజాయల మక్కడించిన పైఁడిమణుగువాని
తళుకుదంతముల నిద్దపురుచిచ్ఛటల నిన్మడియైన కలికిలేనగవువాని
మేలిడా ల్చల్లు కెంగేలిచిందపుతేటనీటైన చుట్టువా ల్మెఱగువాని
దెలిగన్నుఁగొనలజూపులఁ జాలకళ లెక్కు నక్రకుండలసమున్నతులవాని


గీ.

చతురకలశాంబునిధిసుధాసౌధవీథి, జిలుగుదరగలముత్యాలచేర్లు సిరుల
నలరు ఫణిరాజుతూగుటుయ్యాలఁ దూఁగు, వాని శ్రీజాని గనిరి వాగ్వరుఁడు సురలు.

209


వ.

ఇ ట్లపూర్వరూపసంస్థానంబై తేజోరాశి యగు పుండరీకాక్షు నీక్షించి పితా
మహపురోగములు మ్రొక్కి "దేవా! బ్రహ్మేంద్రాదిసురగణంబులు నీవ,
యజ్ఞవషట్కారోంకారంబులు నీవ, ఇజ్జగంబంతయును నీవ, వేత్తయు, వేద్యం

బును నీవ, దైత్యనిర్జితులమై యార్తినొంది నిన్ను శరణంబు జొచ్చితిమి. నీ
తేజంబున మము నాప్యాయనంబు నొందించి రక్షింపుము.

210


క.

నిను గొలిచినపుడ తొలఁగున్, ఘనతరదుఃఖములు శుభము గల్గును పాపా
ఘనివృత్తి యగును వికసిత, వనజాయతనేత్ర భక్తవత్సలకృష్ణా.

211


క.

అని యిట్లు సురలు పలుకఁగ, వనజాయతలోచనుం డవారితకరుణా
వినుతకటాక్షేక్షణములఁ, దనియఁగ సురకోటిఁ జూచి తా ని ట్లనియెన్.

212


ఉ.

ఓసురలార నాదగుసమున్నతతేజముచేత మీకు ను
ల్లాసము చేయుదున్ గడునలంఘ్యము విప్రునిమాట తప్ప దా
యాసమనాక యోషధిచయం బఖిలంబును దెచ్చి వైచి ని
స్త్రాసమునన్ బయోజలధి ద్రచ్చుఁడు హెచ్చగు మీకు సంపదల్.

213


క.

మీరును దైత్యపతులు త, త్య్రారంభముతోడ మందరము మంథము స
ర్వోరగపతి వాసుకి త్రా, డారూఢిం జేసి చేయుఁ డబ్ధిమథనమున్.

214


సీ.

అసురల సామోక్తి నలరించి యమృతంబు మీకు సగంబని మేర చేసి
మత్సహాయత నబ్ధి మధియించి యమృతలాభము గాంచి యసురులఁ బరిహరించి
వినుతసుధాపానమున బలాఢ్యత మించి యమరత్వసిద్ధి నిత్యముగఁ గాంచి
శత్రువర్గముల వాంఛారూఢి నిర్జించి నిఖిలసంపదలఁ బూనిక వరించి


గీ.

యలరెదరు పొండు సురలార యనిన మ్రొక్కి, చని రమాపతి యాన తిచ్చినవిధమునఁ
క్షీరవారాశిలోన నక్షీణమహిమ, నోషధులు వైచి మథియించి రురుబలమున.

215


వ.

ఇట్లు మందరంబు కవ్వంబుగా వాసుకి నంకత్రాడుగా క్షీరాబ్ధి మధించు
నప్పుడు దేవతలు పుచ్ఛంబును దైత్యులు శిరంబును బట్టినప్పుడు విషదిగ్ధనిశ్వాస
వహ్నిచే నపహృతకాంతులై యసురులు నిస్తేజులైరి. తన్ముఖనిశ్వాసవాతా
హతిం దూలి వలాహకంబులు పుచ్ఛోపరిభాగంబునం బొగులు గట్టి వర్షింపం ద
ద్వర్షధారాప్యాయితశరీరులై సురలు బలసంపన్నులై యుండి రంత.

216


ఉ.

మందరభూధరంబు దధిమధ్య నిమగ్నము గాక యుండ గో
విందుడు క్రిందు కూర్మమయి వీపునఁ దాల్చి సురవ్రజంబు
నం దనుజాతిలోన గగనంబున నొక్కొకరూపు దాల్చి త
న్నందఱు గానకుండఁ గలశాబ్ధి మథించె నదృశ్యరూపుఁడై.

217


క.

సురలకు నసురలకును, నయ్యురగశ్రేష్ఠునకు పంకజోదరుఁ డొసఁగెన్
వరనిజతేజోబలవి, స్ఫురణమున ననూనబలము భూరివివేకా.

218

వ.

ఇట్లు మథించుచుండ క్షీరాబ్ధియందు.

219


క.

సురలు వినుతింప మౌనీ, శ్వరు లుత్సాహంబు నొంద సకలమనుజులు
పరమానురాగరససం, భరితులుగా సురభి యజ్ఞమాన్య జనించెన్.

220


క.

భూరితరనిజసముత్కట, సౌరభ మెల్లెడలను వెదజల్లుచు పారా
వారాంతరమున నప్పుడు, వారుణి యుదయించె దైత్యవర్గము చెలగన్.

221


సీ.

కాంక్షితప్రదము సద్గంధంబు దివ్యకాంతాసౌఖ్యదము కల్పతరువు పుట్టె
ధవళరూపము చదుర్దంతనితాంతసత్కాంతికాంతము దివ్యదంతి పుట్టె
రాజభాస్వరము ధారాజితానిలతరసంత్ర ముచ్చైశ్రవోశ్వంబు పుట్టె
మదవతీవదనోపమము సుధారసకరండము పూర్ణచంద్రమండలము పుట్టె


గీ.

అప్సరఃకోటి పుట్టె దివ్యామృతప్రపూర్ణకుండిక బూని యంభోజనేత్ర
మూర్తి ధన్వంతరి యనంగ స్ఫూర్తి వెలయ పుట్టె మంథక్షుభితమహాంభోధిలోన.

222


క.

అక్కజముగ దేవాసురు, లుక్కున వడి బట్టి తిగుచు నుద్ధతుల కడున్
త్రొక్కుడువడి వాసుకి వడి, గ్రక్కినగరళంబు భోగిగణములు గొనియెన్.

223


వ.

అంత.

224


సీ.

శృంగారలక్ష్మి మూర్తి వహించెనో యన మెఱుఁగుఁదీఁగ నదల్చుమేను వొరయ
తతసుధాచ్ఛాయ సుస్మితభూయ మందెనో యనఁగ వెన్నెలఁగేరుహాస మొప్ప
కలువచాయలు చూపుగము లయ్యెనో యన కాముతూపుల నేలుకన్ను లమర
అబ్జుండు వదన తాదాత్మ్యంబు నొందెనో యన తమ్మిఁ దెగడువక్త్రాబ్జ మమర


గీ.

మానితాంభోరుహాసనాసీన యగుచు, శ్రీకరకరాంబుజముల నాళీకయుగము
పూని కళ్యాణవిభవసంతానదాన, కాంత శ్రీకాంత వచ్చె సాగరము వెడలి.

225


ఉ.

అప్పుడు దిక్కరుల్ నిజకరాగ్రములన్
సురనిమ్నగాదిపు
ణ్యాప్పరిపూర్ణహేమకలశావళు లెత్తి జగత్సవిత్రి న
య్యప్పతికన్యకన్ పరమహర్షముతో నభిషిక్తఁ జేసె న
య్యొప్పిద మెల్లలోకముల కుత్సవదాయక మయ్యె నయ్యెడన్.

226


ఉ.

ఆడకువారిరాశి పురుషాకృతితో జనుదెంచి యెన్నడున్
వాడనిదివ్యహేమమయవారిజమాలిక తెచ్చి యిచ్చె కా
పాడుము మమ్ము నేమరకుమంచు రమారమణీలలామ కా
మ్రేడితభక్తియుక్తి గలప్రేమ నికామగతిన్ జెలంగఁగన్.

227


గీ.

తళుకు లెల్లెడ జిందుకుందనపుపనుల, ప్రచురదివ్యమణీకలాపములఁ దెచ్చి
అమ్మహాదేవి కర్పించె నపుడు భక్తి, వినయనంభ్రమరసవర్మ విశ్వకర్మ.

228

చ.

స్మరజనయిత్రి యప్పుడు ప్రసన్నమనోంబుజయై విలేపనాం
బరసుమదానుభూషణసమంచితమై సురలెల్లఁ జూడ శ్రీ
హరియుర మెక్కి చూచె జగమంతయు నంశుమదంశుజాలభా
స్వరసరసీజపత్రవిలసన్నయనాంచలచంచలేక్షలన్.

229


క.

గంధర్వులు పాడగ నమృ, తాంధస్తరుణీగణంబు లాడగ మాపు
ష్పంధయవేణీమణి యతి, బంధురగతి సురులవిన్నపము లాలించెన్.

230


వ.

ఇట్లు పుండరీకాక్షవక్షఃస్థలనివాసలక్ష్మీకటాక్షవీక్షణానిరీక్షితులై సహస్రాక్షపు
రోగములగు దేవతాధ్యక్షు లక్షీణనిర్వృతిం బొందిరి, వందిరి. ముకుందచరణార
విందవిముఖులై నముచిప్రముఖులు లక్ష్మీకటాక్షంబునకుం బాసి రేసి ధన్వంతరి
కరస్థయగు నమృతకుండిక యొడిసి పుచ్చుకొనిన నచ్యుతుండు కపటమానినీరూప
ధరుండై వారి వంచించి నిషేధ విబుధుల కొసంగిన తదీయపానంబున బలసం
పన్నులై యన్నిశాచరులందోలిన పాతాళంబు వట్టి రంత అనంతునకు మ్రొక్కి
గ్రక్కున నమరు లమరావతికిం జనిరి. సూర్యుం డవార్యతేజోధుర్యుం డయ్యె.
నక్షత్రంబు లక్షీణకాంతిపాత్రంబు లయ్యె. అగ్ను లనుద్విగ్నజ్వాలాలగ్నంబు
లయ్యె. ధర్మమార్గంబులు నిర్మలత్వానర్గళంబు లయ్యె. శక్రుం డవక్రపరాక్రమం
బున లక్ష్మీకటాక్షజుష్టంబగు విష్టపత్రయం బేలుచు స్వారాజ్యసింహాసనస్థుఁడై
కరగృహీతకనకారవిందయగు నిందిరాదేవి నిట్లని స్తుతియించె.

231


గీ.

పద్మవదన పద్మపత్రసుందరనేత్ర, పద్మసద్మ పద్మభాస్వరకర
పద్మనాభుదేవి పద్మపూజాప్రియ, నఖిలలోకజనని నాశ్రయింతు.

232


శా.

శ్రద్ధామేధలు భూతినీతిగతులు స్వాహాస్వధానత్క్రియా
సిద్ధుల్ యజ్ఞరహస్యవిద్యల పరిజ్ఞేయత్రయీవార్తలున్
బుద్ధిప్రస్ఫుటదండనీతులును నీపుణ్యాకృతుల్ శ్రీసుసం
బద్ధాక్షేక్షలఁ జూడవమ్మ! నను పద్మా! పద్మనాభప్రియా.

233


గీ.

నీవ యిజ్జగమెల్లను నిండియుండు, దీవుతక్కంగ నన్యుల కెక్కఁ దరమె
యజ్ఞమయమును యోగిచింత్యంబు నైన, సారసాయతనేత్రువక్షస్థలంబు.

234


క.

నీచే విడువంబడి యతినీచత్వము బొంద జగము నీ విపుడు సుధా
వీచుల నగు కనుచూపులఁ జూచిన నీక్షణమె సకలశుభములు గాంచున్.

235


క.

దారసుతాగారమహో, దారసుహృద్ధాస్యధనవితానములు శరీ
రారోగ్యైశ్వర్యాదులు, చేరు న్నీచూపుమహిమచే మనుజునకున్.

236

ఉ.

తల్లివి నీవు జీవులకుఁ దండ్రి పయోరుహలోచనుండు మీ
రెల్లజగంబు నిండి సుసమృద్ధత నుండుదు రస్మదీయహృ
ద్వల్లభ మైనకాంక్షిత మవశ్యము నిచ్చి దయావిమిశ్రసం
ఫుల్లకటాక్షవీక్షణసమూహములన్ నను చూడు మిందిరా.

237


గీ.

కమలసదన! మామకధనమందిరగోష్ఠ, పుత్రమిత్రతనుకళత్రచిత్ర
తరపరిచ్ఛదముల నిరతంబు విడువక, నిండి యెపుడు నిచట నుండు మమ్మ.

238


క.

శీలదయాసత్యాదివి, శాలసుగుణవితతి పంచజనుని భజించున్
శ్రీలలన! త్వత్కటాక్షస, మాలోకితుడైన యాతఁ డగుణుండైనన్.

239


చ.

అతఁడు కులీనుఁ డాతఁడు సమగ్రయశోధనశాలి యాఁత డూ
ర్జితబలుఁ డాతఁ దాహవవరిష్ఠుఁ డతం డభిరూపుఁ డాతఁ డా
యతమతిమంతుఁ డాతఁడు గుణాఢ్యుఁ డతం డతిపుణ్యుఁ డెవ్వఁ డ
చ్యుతసతి! నీదుసత్కృపకు యోగ్యుఁడు భాగ్యకళాధురీణతన్.

240


గీ.

అఖిలగుణములు కలిగిననైన నచట, నీకటాక్షం బొకింతైన నిలువదేని
అవియ విగుణంబులగు నీగుణాలి వొగడఁ, గలఁడె వాగ్జానియైన పంకరుహవదన.

241


లయగ్రాహి.

ఇందిర! దరన్నలినమందిర! ముఖాబ్జజితచందిర! వినీలకచబృందజితమత్తేం
దిందిర సమస్తసురవందితపదోద్యదరవింద చరణానతముకుంద భవదీయా
మందకరుణావశగసుందరకటాక్షరుచికందళము లన్నను గనందగు దయాని
ష్యందనవబిందుతతులం దడిసి యంగము లనిందితసుఖానుభవ మొందుగతిఁ బొంగన్.

242


క.

అని వినుతించిన పద్మా, సన యింద్రునిఁ బలికె నీదుసన్నుతిచే నా
మన మలరె వరము లిచ్చెద, గొను మన నతఁ డమరరక్షకునిసతి కనియెన్.

243


క.

వర మిచ్చెదేని నే నీ, కరుణకుఁ బాత్రంబయేని కమలాలయ మ
త్పరిపాలితలోకత్రయి, నిరవుకొనుము పాసి చనక యెప్పుడు వేడ్కన్.

244


వ.

ఇది యొక్కవరం బింక నొక్కవరంబు
వేడెద.

245


క.

ఏ నొనరించిననీస్తవ, మేనరుఁడు పఠించు నతని నిందిర భవదీ
యానూనసత్కృపాస, న్మానితుఁగాఁ జేయుమమ్మ మానక యెపుడున్.

246


వ.

అనిన నరవిందమందిర పురందరున కిట్లనియె. నీవొనరించినస్తోత్రారాధనంబునం
బరితుష్టనైతి. నీవు కోరినయట్లు త్రైలోక్యంబును విడువ, నెవ్వండేనియు సాయం
ప్రాతస్సమయంబుల నీస్తవంబు పఠించు నతని నెపుడు విడువనని వరద్వయంబు

నొసంగె. ఇవ్విధంబున శ్రీదేవి భృగుమునీంద్రునివలన ఖ్యాతియందు నుద
యించి క్రమ్మఱ నమృతమథనకాలంబున నంబుధివలన బుట్టె. జగత్స్వామి
యగు జనార్ధనుం డేకాలంబున నవతారంబుల నొందు నాకాలంబులఁ దానును
సహాయత్వంబు నొందు. మఱియును హరి యాదిత్యుండుగా పద్మ పద్మంబు
వలనం బుట్టె. పదంపడి భార్గవరామావతారంబున ధరణి యన, రాఘవత్వం
బున సీత యన, కృష్ణావతారంబున రుక్మిణి యనం బరగు. ఇతరావతారంబుల
యందును సహాయిని యగు. హరి దేవత్వంబు నొంద దేవత యగు. హరి మనుష్య
త్వంబు నొంద మానుషియై భగవదనురూపచేష్టల మెలంగు.

247


ఉ.

ఇందిరదివ్యజన్మకథ యెవ్వఁడు వేడ్క పఠించు నెవ్వఁ డా
నందమునన్ విను న్శుచిమనస్స్థితి నాతనియింట సంతతా
మందము లై సిరుల్ నిలుచు మానక మూడుతరంబు లెప్పుడున్
జెంద దలక్ష్మి మౌనికులశేఖర! నీకు నెఱుంగఁ జెప్పితిన్.

248


వ.

అనిన మైత్రేయుం డిట్లనియె.

249


గీ.

భృగునివలన నెట్లు నెగడె సర్గము ప్రజ, లెంద ఱతని కైరి యెఱుఁగఁజెప్ప
వయ్య! నాకు ననిన నమ్మునిప్రవరుఁ డి, ట్లనుచుఁ జెప్పె హర్ష మగ్గలముగ.

250


క.

ఖ్యాతికి భృగునకు ధాత, విధాతయు నన పుత్రయుగము తనయ జగద్వి
ఖ్యాత రమయును జనించుట, చేతోమోదముగ నీకుఁ జెప్పితినిగదా.

251


వ.

ఆధాతృవిధాతలకుఁ గ్రమంబున మేరుకన్యక లైన ఆయతియు నియతియు నన
నిద్దఱు భార్యలైరి. అందు ధాతకు నాయతియందుఁ బ్రాణుండును, విధాతకు
నియతియందు మృకండుండును బుట్టె.

252


క.

పాండిత్యధుర్య! వినుము మృ, కండునకున్ బుట్టె సుతుఁడు కల్పాంతాయు
ర్మండితుఁ డఖండమతి మా, ర్కండేయుండనఁ దపో౽ధికత్వము వెలయన్.

253


వ.

అమ్మార్కండేయునకు వేదశిరుండు పుట్టె ధాతృపుత్రుండైన ప్రాణులకు ద్యుతి
మంతుండు, ద్యుతిమంతునకు రాజపత్తుండు పుట్టె. అతనివలన భార్గవవంశంబు
విస్తారంబు నొందె.

254


ఉ.

ఆతతసత్తపోవిభవుఁడైన మరీచికి భార్యయైన సం
భూతి విరాజనామకుని బుత్రుని గాంచెఁ దదీయవంశ ము
ద్యోతితమై ధరం బరగె యోగికులోత్తమ! యంగిరుండు వి
ఖ్యాతి యెలర్పఁగాఁ దనకులాంగనయౌ స్మృతియందు కన్యలన్.

255


వ.

సినివాలియు, మహువును, రాకయు, ననుమతియును నన నలువురిం గనియె.
అత్రికి ననసూయ యందు సోముండును దుర్వాసుండును, దత్తాత్రేయయోగీశ్వ

రుండును నన ముగ్గురు పుత్రులు పుట్టిరి. పులస్త్యునకు ప్రీతియను కాంతవలన
దత్తుండు పుట్టె; నతండు పూర్వజన్మంబున స్వాయంభువమన్వంతరంబున నగ
స్త్యుం డనంబరగు. పులహునకు క్షమయనుభార్యయందుఁ గర్దముండును
ఊర్వతీయుండును సహిష్ణుండు నను సుతత్రయంబు పుట్టె. క్రతువునకు సన్నతియను
భార్యయందు ఊర్థ్వరేతస్కులును నంగుష్ఠపర్వమాత్రులును జ్వలద్భాస్కర
తేజులునగు వాలఖిల్యు లరువదివేలు పుట్టిరి. వసిష్ఠునకు ఊర్జయందు రజుండును
గాత్రుండును ఊర్ధ్వబాహుండును సవనుండును అనఘుండును సుతపుత్రుం
డును శుక్రుండును నన నేడ్వురుఋషులు పుట్టిరి.

256


గీ.

అరయ నగ్న్యభిమాని బ్రహ్మాగ్రసుతుఁడు, పావకుఁడు స్వాహాయను తనభార్యయందు
వినుము! పవమానశుచిజలాశను లనంగ, సుతుల మువ్వుర గనియె నూర్జితమతులను.

257


వ.

వారలసంతతి పంచచత్వారింశద్భేదంబులం బరఁగె. పావకుండును పుత్ర
త్రయంబునుం గూడ ఏకోనపంచాశద్భేదంబుల వహ్నులఁ గీర్తింపంబడుదురు
బ్రహ్మకు నగ్నిష్వాత్తులును, బర్హిషదులును ననుపితరులు పుట్టిరి; వా రనగ్నులును,
సాగ్నులునునై యుండుదురు. వారలు స్వధయను భార్యయందు మేనయు,
వైధారిణియు నను గన్యలం గనిరి. వారిరువురు బ్రహ్మవాదినులును యోగినులును
ఉత్తమజ్ఞానసంపన్నలును సకలగుణాన్వితలునునై యుండుదురు. ఇది దక్ష
కన్యకాసంతానవృత్తాంతంబు. ఇది శ్రద్ధావంతులై వినువారు పుత్రపౌత్రాభి
వృద్ధు లగుదురని చెప్పి శ్రీపరాశరుం డిట్లనియె.

258

ధ్రువచరిత్ర

సీ.

మునివర స్వాయంభువునకుఁ బ్రియవ్రతో, త్తానపాదాఖ్యు లిద్దఱుతనయులు
తనరుదు రందు నుత్తానపాదునకు సు, రుచిసునీతులు భవ్యరుచులు సతులు
సురుచిపైఁ బ్రేమ హెచ్చుగ నుంచు భూనాథుఁ డిడడు సునీతిపై నించుకైన
సురుచికి సుతుఁడు భానురుఁ డుత్తముఁడు పుట్టె వెలయ సునీతికిఁ గలిగె ధ్రువుఁడు


గీ.

నవ్యమణిహేమరాజాననస్థుఁడైన, తండ్రితొడ యెక్కి యున్నయుత్తముని జూచి
ధ్రువకుమారకుఁడును దదారోహణాభి, కాంక్షియై డాయవచ్చినఁ గాంచి సురుచి.

259


ఉ.

పాపఁడ యీవృథాశ్రమము పాల్పడనేల నృపాలకాంక మే
రూపున నబ్బు నీ కిది యెఱుంగవె మున్ను మదీయగర్భజ
న్మాపరిమేయభాగ్యదశ నంద సునీతికి నేల పుట్టి తీ
వీపతి తండ్రియైన నిది యేల లభించుఁ ద్యజించుఁ గామమున్.

260


క.

మత్తనయుఁ డుత్తముం డీ, యుత్తమపదమునకు నర్హుఁ డుడుగుము నీ వీ
యుత్తలము పుణ్యఫలసం, పత్తి న్మత్సుతుఁడవైన మఱి సిద్ధించున్.

261

వ.

ఈరాజాసనంబు సామ్రాజ్యచిహ్నం బిది నాపుత్రునకే యోగ్యం బేల క్లేశ
పడియెదవు? సునీతికిం బుట్టిననీ కుచ్చైర్మనోరథంబులు సిద్ధించునే యని యధి
క్షేపించి పలికిన నప్పుడు.

262


క.

ధ్రువుఁ డవిరళతరకోపో, ద్భవుఁడై యచ్చోటు వాసి తనునొందుపరా
భవము తనతల్లి కెఱిగిం, చ వడిం దద్గేహమునకుఁ జయ్యనఁ బోయెన్.

263


క.

పరిభవపీడితు నీష, త్స్ఫురితాధరుఁ దనయు నపుడు చూచి జనని యా
దరమున నంకస్థలి నిడి, శిర మాఘ్రాణించి యనియెఁ జిత్తము చెదరన్.

264


సీ.

అన్న యేటికి విన్ననైనది నీమోము? కోపకారణ మేమి? చాపలమున
నెవ్వరైనను బతి కెగ్గు కావించిరో? నీ కెగ్గు చేసిరో? శోక మేల?
అనుటయు సురుచి త న్నవమానవాక్యముల్ గర్వించి పలికినక్రమము చెప్ప
వెండినిట్టూర్పు బల్విడిపుచ్చి దుశ్చిత్తమున దీనవసినయై తనయుఁ జూచి


గీ.

అల్పఫణితి సునీతి యిట్లనియె సత్యమయ్య తద్వాక్య మట్ల భాగ్యంబు లేని
నాకు నుదయించి నికృతిసంతాపజలధి మునుగఁ బాలైతి వింక నేమనఁగఁగలదు.

265


చ.

సురుచి పురాభవంబున విశుద్ధతపంబులు చేసియుండ భూ
వరుఁడు తదీయకార్యవశవర్తనుఁ డయ్యె నపుణ్యకర్మదు
స్తరపరిభావవారినిధి సాంద్రతరంగనిమగ్న యైనసుం
దరి ననుబోటి భార్యయను నామమె తాల్చు విహీనభాగ్యతన్.

266


ఉ.

అన్న! పురాభవాంతరసమార్జితకర్మచయంబు పాకమై
నన్నరు నొందు నెందును ఘనంబుగ దుఃఖసుఖంబు లిట్లు తా
నెన్నక స్రుక్కుఁబొంగునరుఁ డెవ్వఁ డతండు వివేకపాపసం
పన్నతలేనివాఁ డనుచుఁ బల్కుదు రాగమతత్వకోవిదుల్.

267


వ.

రాజాసనఛత్రచామరాశ్వవారణాదులు పుణ్యంబు లేనివారికిం గలుగవు.
పుణ్యవతియైన సురుచికడుపునం బుట్టుటం జేసి యుత్తమునకుం గలిగె నల్ప
పుణ్యనైన నాకడుపునం బుట్టిననీ కేల కల్గు నెవ్వరి కేమి గల్గు వారందుచేతఁ
దృప్తింబొందవలయునని యుపశమించుము. కాకున్ననట్టిమహోన్నతపదం
బులు లభించుటకై సర్వఫలప్రదుండైన దామోదరు నాశ్రయించి పుణ్యో
పచయార్థంబు యత్నంబు చేయుము. సుశీలుండవై ధర్మాతుండవై సర్వ
భూతహితరతుండవై సర్వమిత్రుండవై వర్తిల్లుము. ఉదకంబులు పల్లంబున
కోడిగిలినట్లు సంపదలు పాత్రంబు వెదకి పొందునని చెప్పిన సునీతికి ధ్రువుం
డిట్లనియె.

268

గీ.

అమ్మ! శమియించు మనుచు మీ రానతిచ్చి, నంతయు నిజంబు పరులజిహ్వాభిధాన
చాపనిర్ముక్తదుర్వచస్సాయకములు, నాటఁ గందిన మది నిది దీటుగొనదు.

269


చ.

అమితపరాభవానలశిఖావృతిఁ గందిన నింక నుత్తమో
త్తమపదలాభ మొందెద వృథావచనంబులు వల్కు నీసప
త్నిమదికి విస్మయం బొదవఁ దెల్లము తండ్రియుఁ బొందనోప డు
త్తముఁ డన నెంత యంచు విబుధప్రవరు ల్వినుతించునట్లుగన్.

270


క.

అని యిల్లు వెడలి పురబా, హ్యనవీనోపవనసీమయందుఁ దనపురా
తనపుణ్యపాకఫలతతి, యనఁ గొందఱు మునులఁ గాంచె నర్భకుఁ డంతన్.

271


మ.

ధృతకృష్ణాజినచేలులన్ రవిసముద్దీప్తప్రభాజాలులన్
దతతామ్రాభజటాభరాభరణులన్ నందన్మనోవృత్తులన్
హతకామాదిసమస్తశాత్రవుల దివ్యజ్ఞానదీపప్రభా
ప్రతతిచ్ఛిన్నతమస్కులం గనియె నబ్బాలుండు సప్తర్షులన్.

272


ఉ.

సాగిలి మ్రొక్కి హస్తజలజంబుల మోడ్చి నృపాలసూనుఁ డ
య్యోగులఁ జూచి యి ట్లనియె నో మహనీయతరప్రభావభ
వ్యాగమవేదులార! ధ్రువుఁ డందురు నన్ను మదీయపూర్వపు
ణ్యాగమనంబున న్మిము మహాత్ముల గంటి ఫలించెఁ గోరికల్.

273


వ.

ఉత్తమజనకుండైన యుత్తానపాదుని కుమారుండ నని విన్నవించిన సప్తర్షు
లిట్లనిరి.

274


గీ.

నాలుగైదేండ్ల యీడు మాణవకుఁడవు వి, షాద మేటికి నీకు భూజాని తండ్రి
యొకటఁ గొదలే దభీష్టవియోగ మేమి, కానుపించదు దేహరోగములు లేవు.

275


క.

నిర్వేద మేమిటికి గుణ, ధూర్వహ! యెఱిఁగించుమనిన ధ్రువుఁడు వినతుఁడై
పూర్వకథయెల్ల నయ్యం, తర్వాణులతోడఁ జెప్పినం దమలోనన్.

276


క.

ఔరా! క్షత్త్రియతేజం, బారూఢక్రోధరసమహాభారము దు
ర్వారాభిమానితాహం, కారైకాగార మెన్నఁగా శక్యంబే.

277


వ.

సవతితల్లి యుల్లసంబుల నుల్లంబు తల్లడిల్లుచున్నదని యమ్మహాత్ము లాదరించి
యిట్లనిరి. ఓయీ! క్షత్రియకుమారా! నీకుఁ గర్తవ్యం బేమి? అప్పనికి సహా
యం బాచరించెదము. చెప్పందలంచిన మాట చెప్పు మనిన ధ్రువుం డిట్లనియె.

278


చ.

అనఘచరిత్రులార! వినుఁ డర్థము రాజ్యము భోగ మేమియున్
మనమున గోరఁ గోరెద సమస్తపదంబుల కెల్ల నెక్కుడై

యనుపమమై యనన్యగతమై భువనత్రయసేవ్యమానమై
ఘనతరకల్పకల్పనలఁ గందనిపై తగుసత్పథంబునున్.

279


సీ.

వరదు గోవిందుఁ గొల్వకకాని సంస్థాన మబ్బునే? యటు చేయుమనె మరీచి
శ్రీజనార్దనుఁడు హర్షించిన నక్షరస్థానంబు గల్గు సత్యమనె నత్రి
అచ్యుతు సర్వభూతాత్ముఁ బూజింప దివ్యపదం బెసఁగుననె నంగిరుండు
హరిసేవముక్తిద యన నున్నతస్థానలాభ మెంతనియెఁ బులస్త్యమౌని


గీ.

అబ్జనేత్రుభజననగు కోర్కె యను క్రతుఁ, డిందిరేశువినతి నెసఁగు కామ
మనియెఁ బులహముని మహాత్ము విష్ణుని వేడఁ, జెందు సిద్ధులనె వసిష్ఠుఁ డపుడు.

280


వ.

అని సప్తర్షు లానతిచ్చిన.

281


క.

బాలకుఁ డిట్లను సన్ముని, పాలురతో నయ్య! మీరు పనిచినగతి ల
క్ష్మీలలనేశ్వరుఁ గొలిచెద, నీలీలకుఁ దగిన జప్య మెయ్యది నాకున్.

282


వ.

ఆరాధనక్రమం బెవ్విధం బానతీయవలయు ననినఁ జిత్తంబు బాహ్యపదార్థా
యత్తంబు గాకుండం జేసి జగద్ధామంబగు వాసుదేవునియందుఁ జేర్చి యేకాగ్ర
మనస్కుండవై జపియించుమని మనురాజంబగు వాసుదేవద్వాదశాక్షరం
బుపదేశించి భవత్పితామహుండగు స్వాయంభువుండు జపించిన బరితుష్టుడై
జనార్దనుండు త్రైలోక్యదుర్లభంబగు నైశ్వర్యంబు ప్రసాదించె, నీవును ని
మ్మంత్రంబున గోవిందుం బరితుష్టుం జేసి యిష్టార్థంబు లందుమని యాన
తిచ్చిన విని కృతకృత్యునింగాఁ దలంచుకొని వారలకు మ్రొక్కి యవ్వనంబు
వెడలి.

283


సీ.

ఎందేని పరమమునీంద్రు లుత్తమతప, శ్చర్యనిర్వాణసంసక్తిఁ గనిరి
యెందేని నిండుకాళిందీనదీపుణ్య, వారిపూరంబు లవ్వారి గాఁగ
నెందేని మధుదైత్యనందనులవణు ని, ర్జించె శత్రుఘ్నఁ డూర్జితజలమున
నెందేని వెలయు సమిద్ధసంపత్పరి, పూర్ణయై మధురాఖ్యపుణ్యనగరి


గీ.

నెపుడు నెందేని విహరించు నిపుణగోప, రూపసుకలాపుఁడైన సరోజనేత్రుఁ
నట్టిమధువనమున కేగె నధికధైర్య, ధుర్యమతిశాలి రాజసుతుండు వేడ్క.

284


ఉ.

మౌనిపు లానతిచ్చిన క్రమంబునఁ దన్మహనీయపావన
స్థానమునందుఁ జేసె నతిదారుణమైన తపంబు మిక్కిలిం
బూనిననిష్ఠతో హృదయపుష్కరసీమ పరాపరేశు ల
క్ష్మీనలినాననావిభు నమేయుని నిల్పి యనల్పవైఖరిన్.

285

వ.

ఇట్లు మధువనతీర్థంబున నూర్థ్వబాహుండును వామపాదస్థితుండునునై
కొన్నిదినంబు లేకాంగుష్ఠస్థితుండైఁ ఘోరతపంబు చేయుచున్నంత.

286


మ.

ధరణీచక్రము దిద్దిరం దిరిగె భూధ్రవ్రాత మల్లాడె సా
గరముల్ ఘూర్ణిలె భూతకోటి బెగడెన్ గంధర్వయక్షోరగా
సురదేవోత్కరముల్ మదిం దలఁకె నక్షోభ్యప్రభావావనీ
శ్వరపుత్రప్రవరప్రవర్తితతపశ్చర్యాప్రతాపంబునై.

287


వ.

అప్పుడు.

288


క.

యామాఖ్యదేవతల ఘో, రామితకూష్మాండతతుల నాఖండలుఁ డు
ద్దామగతిఁ బంపె నృపసుతుఁ, డామెయి నొనరించుతపము నలజడి పెట్టన్.

289


వ.

కామరూపులగు వామాఖ్యదేవతలును గూష్మాండగణంబులును మధువనంబు
ప్రవేశించి నానావిధమాయలు పన్ని రంత.

290


సీ.

వసివాడు వాడిన వదనపంకజముతో, నినుపాఱివడియు కన్నీటితోడఁ
గొదలుచు నొదవు గద్గదవచోయుక్తితో, దట్టంపునిశ్వాసధారతోడ
గమనసన్నాహసంగతమహత్కాంతితో నాకంపమానదేహంబుతోడ
శ్రమజలాసారసంసక్తగాత్రంబుతో, సంభవద్దైన్యరసంబుతోడఁ


గీ.

గొడుక! యిడుమలఁ గుడిచెదే యడవిలోన ననెడునర్థోక్తి గళకుహాంరాంతరమున
నాగు నేరుపుతో ని ల్చె నగ్రసరణి, నధికదుర్నీతిదైత్యమాయాసునీతి.

291


వ.

ఇట్లు నిలిచి.

292


క.

కొడుకా దేహవ్యయకర, మిడు మిది నీ కేల మాను మెన్నేనోములున్
బడి బడి నోచి నినుం గని, యడవులఁ గలిపితిని నోము లాఱడివోవన్.

293


సీ.

పాటించి మగనిచేఁబట్టు లేక యనాథ, భావంబుఁ దాల్చు నాబ్రదుకుఁ దలఁచి
మనసు చిల్లులు వోవ ఘనగర్వమున నాదు, సవతి పల్కెడి వచస్సరణిఁ దలఁచి
ముద్దుగాఱెడిరూపమున నాలుగైదేండ్ల, చక్కనినీమేనిసౌరు దలఁచి
నీబడి వాయక నిరతంబు క్రీడనా, లంపటులైన బాలకులఁ దలఁచి


గీ.

కుడువఁ గట్టంగ లేని యీగొదవఁ దలఁచి, యొడలు చివుకంగఁజేయునీయిడుమ దలఁచి
హాయి గలుగని వట్టికాపేయ మేల, రా వృథా దీని మానుమురా! కుమార.

294


ఉ.

మన్నన లేక భర్త యవమానము సేయ సపత్ని నవ్వ ని
న్గన్నులఁ జూచి యన్నియు సుఖం బని యోర్చితి నిట్టు నీవు రా

కున్న భవత్పురోధర నసూత్కరముం ద్యజియించుదాన స
ర్వోన్నతసత్తపోవిభవ మొంద సుఖించు చిరాయురున్నతిన్.

295


క.

అనుచు విలపించు మాయా, జననిం గని యక్కుమారచంద్రుఁడు వినియున్
విననిగతి నుండె హరిపద, వనజభ్రమరన్మనఃప్రవర్తనుఁ డగుచున్.

296


గీ.

వత్స! వత్స! మహోగ్రరావములు బెఱయ, రయసముద్యత తీవ్రశస్త్రప్రచండ
భండనోద్దండులగు దైత్యపతులు వీర, వచ్చి రెచ్చట చొరవఁగా వచ్చు నీకు.

297


వ.

అని యదృశ్యం బయ్యె నప్పుడు.

298


క.

పొడు పొడు మని కూకలు బ, ల్విడి చంపుఁడు చంపుఁ డనెడు వికృతోక్తులు మ్రిం
గుఁడు మ్రింగుఁ డనెడునార్పులు, దడబడఁగాఁ జుట్టుముట్టె దైత్యబలంబుల్.

299


చ.

అదరులు చల్లుకైదువు లుదగ్రతఁ ద్రిప్పుచు ఘోరవాక్యముల్
వదరుచు మండలభ్రమణవైఖరిఁ బాఱుచు నొక్కరొక్కరిన్
బదరుచు హుంక్రియాకలనఁ బల్మఱు నిక్కుచు వెక్కిరించుచున్
బొదుపయి బెట్టుకూసిరి నభోవలయం బద్రువ న్నిశాచరుల్.

300


గీ.

దీర్ఘదంష్ట్రలవదనము ల్దెఱిచి మెడలు, సాచి పెనుమంట లురుల నుచ్చైస్స్వరముల
మిగులవాపోయె నక్కలు మేదినీశ, తనయుముందర చెవులు చిందరులు వోవ.

301


వ.

మఱియు నద్దానవులు సింహోష్ట్రమకరాననులై నానావిధఘోరారావంబులు
చేయుచు నారాజపుత్రుని వెఱపించ నతండు గోవిందాసక్తచిత్తుం డగుటం జేసి
తన్మాయావిలసనంబు లేమియు నింద్రియగోచరంబులు గావయ్యె; నంతకంతకు
నేకాగ్రచిత్తుండై చిత్తజజనకుం దలంచుచునున్న యన్నరేంద్రునందనుం జూచి
సంక్షోభంబు నొంది బృందారకులు సర్వశరణ్యుండగు నిందిరారమణుపాలికిం
జని యిట్లని విన్నవించిరి.

302


గీ.

దేవదేవ, జగన్నాథ, శ్రీవధూసనాథ, పురుషోత్తమ, పరేశ, నవ్యమహిమ
వెలయు నౌత్తానపాది గావించుతపము క్రాచె, మము నెల్లఁ గరుణచేఁ గావవయ్య.

303


క.

నెలబాలుఁడు దినదినమున, కళల పసల వృద్ధి నొందు గతి నుగ్రతపో
విలసనమున దినదినమున, కలఘుం డతఁ డధికవృద్ధి నందుచునుండున్.

304


క.

బలరిపువరుణధనేశ్వర, జలజహితశశాంకు లేలుస్థానము లేలం
దలఁచియొ యొనర్చె నృపసుతుఁ, డలఘుతపము దీని మాన్పవయ్య ముకుందా.

305


చ.

అన విని పద్మనాభుఁ డను నమ్మహితాత్ముఁడు మీనివాసముల్
వివఁగన నొల్లఁ డొక్కటి నవీనమనోరథ మాత్మఁ గోరు నే

నొనరుతు దాని మీరు చనుఁ డుల్లములన్ భయమొందనేల నా
ననిమిషకోటి భక్తివినయంబుల మ్రొక్కుచు నేగునంతలోన్.

306


ఉ.

పంకజపత్రలోచనుఁ డపారకృపారసధార లా నమ
త్కింకరకోటి ముంచ సముదీర్ణసువర్ణసవర్ణపర్ణు ని
శ్శంకు సుపర్ణు నెక్కి వినుచక్కి వడిం జనుదెంచి యన్నిరా
తంకతపోభిరాము గుణధాముఁ గుమారునిఁ జూచి యిట్లనున్.

307


క.

ఉత్తానపాదతనయ! భ, వత్తపమునఁ దుష్టి పొంది వర మీయంగా
నిత్తఱి వచ్చితిఁ గోరుము, చిత్తంబునఁ దలఁచినది విశృంఖలవృత్తిన్.

308


వ.

అని పలికినపలు కమృతరసముపగిదిఁ జెవులం జినికిన నలరి కనుగవ విచ్చి యచ్చి
ఱుతపాపం డగ్రభాగంబునఁ గులిశాదిరేఖాభరణంబు లగుట నిసర్గసుందరారవింద
ప్రభవప్రభాసంభరణంబులగు శ్రీచరణంబులుఁ జరణాగ్రసమాశ్రితముక్తా
కారంబులగు నఖాంకురంబులును, నఖాంకురచంద్రకళాధరసర్వమంగళా
వాసపదదివ్యనగఫలద్వయంబులగు గుల్ఫద్వయంబును, గుల్ఫద్వయసపుష్కర
మహాశావారణకరకాండసముద్దండంబులగు జంఘాకాండంబులును, జంఘా
కాండమండనాయితంబులగు జానుస్తబకంబులును, జానుస్తబకశుంభదూరు
రంభాస్తంభంబులును, ఊరురంభాస్తంభజననకనకసైకతాయితనితంబబిం
బంబును, నితంబబింబసమావరకమణీమేఖలాంతరితహైమోపసంవ్యాన
కాంతి సరస్వతీప్రవాహావర్తాయితనాభిసరోజంబును నాభిసరోజగంధానుబంధ
పుష్పంధయమాలాలీలానుకారవిరాజిరోమరాజియు, రోమరాజీంద్రనీలైకస్తం
భోపరినిర్మితకమలాభర్మసౌధోపమానమాననీయవక్షస్థలంబును, వక్షస్థలసుమే
రుతటప్రాంతసమారూఢకల్పతరుశాఖాయమానభుజాస్తంభసంభరణమాన్యం
బులగు సుదర్శనపాంచజన్యంబులును, బాంచజన్యసౌభాగ్యయోగ్యతానర్గళం
బగుగళంబును, గళవృంతనితాంతకాంతముకురప్రభాజిత్వరంబులగు కపోల
ఫలకంబులును, గపోలఫలకనృత్యత్కాంతిపుంజరంజితనక్రకుండలోదీర్ణంబులగు
కర్ణంబులును, గర్ణాంతవిశ్రాంతనేత్రపుండరీకప్రభావంశకాండాగ్రజాగ్ర
న్ముక్తాఫలనాసికాప్రసూనంబును, నాసికాప్రసూనఫలితమధురఫలాధరబింబం
బును, అధరబింబమాధుర్యయాచనార్థసమాగీతార్ధేందుతిరస్కారిలలాట
రేఖయు, లలాటరేఖేందుజిఘృక్షావిలంబితమోహంకారతిరస్కారి శృంగారి
భ్రమరకవ్రాతంబును, భ్రమరకోదయాద్రిసముదితార్కబింబస్పర్థిరత్నకిరీ
టంబులుం గలిగి కోటిమన్మథలావణ్యంబున నున్న పన్నగశాయికి సాగి మ్రొక్కి
యిట్లని విన్నవించె.

309

చ.

సరసిజనాభ! నాయెడఁ బ్రసన్నుఁడవై వరమిచ్చెదేని దే
వరచరణాంబుజద్వయము వాంఛ నుతింపఁ దలంతు బాల్యని
ర్భరజడిమన్ బొసంగ దది భవ్యకృపారసధార నాపయిన్
దొరఁగ ననుగ్రహింపు మతి నూల్కొని నిన్ను నుతించునట్లుగన్.

310


సీ.

అని విన్నవించిన నరవిందలోచనుఁ, డధికకృపావృతస్వాంతుఁ డగుచు
ముకుళితహస్తుఁడై ముందర నిలుచున్న, యౌత్తానపాది నెయ్యమునఁ జూచి
నవ్వుచుఁ బాంచజన్యప్రాంతమున మేను, నివిరిన నాతఁడు న్నిద్రబుద్ధి
సంపన్నుఁడై నేలఁజాఁగిలి మ్రొక్కి, గ్రక్కున లేచి యంజలిఁ గూర్చి నుదుట


గీ.

మోపి యానందరసము సంపూర్ణలీల, మనసు నిండి వెలార్చిన మాడ్కిఁ గన్నుఁ
గొనల సంతోషబాష్పముల్ గురియ నవ్వి, రించిజనకుని నిట్లు గీర్తించఁదొడఁగె.

311


క.

భూమిజలానలవాయు, వ్యూమమనోబుద్ధులును సమున్నతసర్ల
శ్రీ మించిన భూతాదియు, నామూలప్రకృతియును ద్వదాకారంబుల్.

312


గీ.

అరయ శుద్ధుండు సూక్ష్ముండు వ్యాపకుండు, నై ప్రధానంబునకు నవ్వలైన పురుషుఁ
డీశ! నీరూప మిది నిక్క మిట్టినీకు, మోడ్పుకెంగేలు నాఫాలమున ఘటింతు.

313


వ.

భూతాదులకు, గంధాదులకు, బుద్ధ్యాదులకుఁ, బ్రధానంబునకుఁ, బురుషునకుం
బరుండవై, పరమాత్మయు బ్రహ్మంబును నని చెప్పంబడు నీకు నమస్కారంబు.

314


సీ.

వేయిశిరంబులు వేయికన్నులు వేయి, చరణము ల్గలయట్టిపురుషవరుఁడ
వంతట వ్యాపింతు వధిప! కాలత్రయ, జాతమంతయు నీవ సంభవించెఁ
జర్చింపఁగ విరాట్టు సామ్రాట్టును స్వరాట్టు, నధిపూరుషుండు నీయంద జగము
లన్నియు నీరూప యజ్ఞంబు పృషదాజ్య, మర్ధర్చసామంబు లన్నిఛంద


గీ.

ములును యజురాగమమును నీవలనఁ బుట్టె, నశ్వగోజాతిమృగములు నఖిలమును జ
నించె నీవలన నేసమున్నిద్రమహిమ, పూరుషోత్తమ! పావనాద్భుతచరిత్ర!

315


క.

సమ్మతి ముఖబాహూరుప, దమ్ముల బ్రాహ్మణులు రాజతతి వైశ్యనికా
యమును శూద్రులు పుట్టిరి, నెమ్మదిఁ జంద్రుండు పుట్టె నీకు మహాత్మా.

316


ఉ.

కన్నులఁ బ్రొద్దు, శ్రోత్రమున గాలి, ముఖంబున వహ్ని, నాభి న
మ్మిన్నును బుట్టె, స్వర్గ ముపమింపఁగ రేతమునం జనించె స
ర్వోన్నత! శ్రోత్రసీమ దిశ లుద్భవమయ్యెను, భూతధాత్రియున్
బన్నలినంబులం బొడమె, భవ్యము నీమహిమంబు మాధవా.

317


వ.

దేవా! న్యగ్రోధబీజంబునం దంకురించి వృద్ధిఁ బొందిన వృక్షంబు చందంబునఁ
బరమసూక్ష్ముండవైన నీయందు జనించి జగంబు వృద్ధిఁ బొందు, కదలీవృక్షంబు

త్వక్పత్రంబులకంటె భిన్నంబులు గానిచందంబున జగంబునకన్న నీవు
భిన్నుండవు గావు, హ్లాదతాపకారిణియైన జగంబునకుంగాని గుణవర్జితుం
డగు నీకు లేదు, పృథగ్భూతైకభూతుండవు, భూతభూతుండవు, ప్రధానవ్యక్త
పురుషవిరాట్సమ్రాట్స్వరూపుండవు, సర్వరూపధరుండవు, సర్వతపోవిశేషజన
కుండవును, సర్వేశ్వరుండవు నైన నీకు నమస్కారంబు. సర్వభూతహృదయంబ
వైన నీ వెఱుంగని మనోరథంబులు గలవే. భవదీయసందర్శనంబున మన్మనో
రథంబు సఫలంబయ్యె, ధన్యుండఁ, గృతకృత్యుండ, భాగ్యసంపన్నుండ నైతి
నని వినుతించిన నతనికి భగవంతుం డిట్లనియె.

318


ఉ.

బాలక! నేఁడు నీతపము పండె ననుఁ గనుగొంటి గాన నీ
వేళ నభీష్ట మెయ్యది ప్రవీణతఁ గోరుము మద్విలోకనం
బేల నిరర్ధకం బగు నభీష్టకరం బగుగాక, మర్త్యు లి
చ్ఛాలలితప్రసక్తి నను సమ్మతిఁ గాంచి లభింతు రిష్టముల్.

319


వ.

అనిన ధ్రువుం డిట్లనియె.

320


గీ.

అఖిలభూతేశ! నీవు సర్వాత్మ వగుట, కానుపింపదె మన్మనోగతము నీకు
నయిన నాచేత విన నిష్టమయ్యెనేని, యవధరింపుము దేవ మదర్థితంబు.

321


చ.

ఘనమగు మీప్రసాదమునఁ గాదె మహేంద్రుఁ డశేషలోకరా
జ్యనిరతభోగము ల్గనియె, స్వామి! ప్రసన్నుఁడ వైన దుర్లభం
బన నొకటెద్దియుం గలదె? యస్మదపేక్షితమౌట యెంత, భ
క్తనివహరక్షణంబు నియతవ్రతమౌగద నీకు నచ్యుతా.

322


క.

"ఈరాజాసన మోయి కు, మారక! నీ కర్హ మగునె? మదుదరజాతుం
డై రాజిలువానికిఁ గా, కారయ” నని సవతితల్లి యాడెను నన్నున్.

323


ఉ.

గాటపుగర్వరేఖఁ గనుగానక మాసవతమ్మ యన్నయ
మ్మాట శరంబుపోలె మురమర్దన! మర్మము నొవ్వ నాటి యు
త్పాటన చేయరాక పరితాప మొనర్చుచు నున్న దాపదు
ద్ఘాటనదక్ష! తావకసుధాసదృశేక్షల దాని మాన్పవే.

324


వ.

జగంబున కాధారభూతంబై, సర్వస్థానంబులకు నుత్తమోత్తమంబైన స్థానంబు
దయచేసి రక్షింపవలయునని ప్రార్ధించిన ధ్రువునకు భవబంధమోచనుండైన
పుండరీకలోచనుం డిట్లనియె.

325


సీ.

అధిపకుమార! నీయర్ధించినట్లు లో, కోత్తరసంస్థాన మొందె దీవు
వినుము తొల్లిటిమేన విప్రుండ వర్చనా, దికములఁ దుష్టి నొందించినావు

నను; మిత్రుఁ డగురాజనందనుఁ గనుగొని, యభిలషించితివి నీ కందువలన
నీజన్మ మొదవె సర్వేహితభోగముల్, యౌవనోదయమున ననుభవించి


గీ.

సకలలోకోన్నతంబైన స్థాన మొంది, యనిశము మదీయపాదపద్మాభిరతుఁడ
వై విముక్తిరమాధిరాజ్యము భజించె దస్మదీయదయాసముదగ్రమహిమ.

326


వ.

సూర్యాదిగ్రహంబులకు, సప్తఋషులకు, నశేషవైమానికులకు, నుపరితన
స్ధానంబునొందెదు; కొందఱుసురలు చతుర్యుగపర్యంతంబు, కొందఱు
మన్వంతరపర్యంతంబు వసింతురు. వీరలందఱు నీక్రింద వసింతురు. నీతల్లియైన
సునీతియు నతినిర్మలమైన నక్షత్రరూపము దాల్చి దివ్యవిమానంబున నీసమీ
పంబున నాకల్పపర్యంతంబును వసియించుగాక, ఎవ్వరేని సాయంప్రాతః
కాలంబుల నిన్ను గీర్తింతురు వారికి మహాపుణ్యంబు గలుగునని యానతిచ్చి
జనార్దనుం డంతర్థానంబు నొందిన.

327


ఉ.

మానితసారుఁడౌ ధ్రువకుమారుఁడు శ్రీవిభుఁ డానతిచ్చిన
ట్లానిఖిలావనీతలసమంచితరాజ్యము చేసి యంత ది
వ్యానుపమానసత్సదమునందు వసించినవాఁడు నేటికిన్
శ్రీనలినాననావిభు భజించినవారలు రిత్తవోదురే.

328


గీ.

అతనియభిమానవృద్ధ మౌనట్టిమహిమ, చూచి యసురగురుండగు శుక్రుఁ డధిక
విస్మయము నొంది యప్పు డావిర్భవించి, హర్ష ము మనంబు నిండ ని ట్లనుచుఁ బొగడె.

329


క.

ఈనృపసూనుపరాక్రమ, మానంత్యతపఃప్రభావ మాసప్తర్షి
స్థానములకన్న నూర్థ్వ, స్థానంబునఁ గూర్చె నద్భుతక్రియ మీరన్.

330


చ.

నిరుపమపుణ్యలక్షణ సునీతితపంబు వచించ నెంచ నె
వ్వరితర మాత్మసంభవునివద్ద విమానముమీఁద తారయై
నిరుపహతిస్థలంబున ననింద్యతనుండె, స్వకీయకీర్తిభా
స్వరమతి నెవ్వరేఁ బొగడ వారికి శోభనముల్ ఘటించుచున్.

331


గీ.

ఆయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధి, కరము నిహపరసౌఖ్యసంఘటనకరము
నగును వీరలచరితంబు మిగులభక్తి, వినినవారికి ధర్మప్రవీణహృదయ.

332


వ.

ఆధ్రువునకు శంభు వనుభార్యయందు శిష్ట యనుపుత్రుండు కలిగె. శిష్టకు
నుచ్ఛాయ యనుభార్యయందు రిపుండును, రిపుంజయుండును, విప్రుండును, వృక
లుండును వృకతేజుండును ననుపుత్రపంచకంబు గలిగె. అందు రిపునకు బృహతి
యనుభార్యయందు చాక్షుషుండు పుట్టె. చాక్షుషునకు వాయుపుత్రియైన
పుష్కరిణియందు మనువు పుట్టె. మనువునకు విరణప్రజాపతిపుత్రియైన నడ్వల

యందు ఉరుండును పూరుండును శతద్యుమ్నుండును తపస్వియు సత్య
వాక్కును శుచియును అగ్నిష్టుత్తును, అతిలాత్రుండును విద్యుమ్నుండును అభి
మన్యుండును అను పుత్రదశకంబును తపతియను కన్యకయుం బుట్టె. తపతిని
వైరాజప్రజాపతి కిచ్చిరి. అందు పూరునకు ఆగ్నేయియందు అంగుండును సుమ
నుండును సాతియు క్రతుండును అంగిరుండును శిబియును అనుపుత్ర
షట్కంబు గలిగె. అందు అంగునకు మునీడ యనుభార్యయందు వెన్నుండు పుట్టె.
ప్రజార్థంబు మహర్షు లవ్వెన్నుని దక్షిణపాణి మథించిన వైన్యుండను మహీ
పాలుండు పుట్టె. అతండేకదా పృథుచక్రవర్తి యనం బ్రసిద్ధుండై ప్రజలకు
హితంబు గోరి వసుంధర నశేషవస్తువ్రాతంబునుం బిదికె. అనిన మైత్రేయుం
డిట్లనియె.

333


క.

మును లేటికి వెన్నునికర, వనజము మథియించి రెట్లు వరకీర్తి మహా
ధనుఁడు పృథుం డుదయించెను, వినిపింపుము నాకు పృథువివేకాభరణా.

334


వ.

అనిన పరాశరుం డిట్లనియె.

335


ఉ.

అంగుఁడు మృత్యుపుత్రియగు నంబుజనేత్ర సునీడ పేరి త
న్వంగిఁ బరిగ్రహించుటయు నమ్మిథునమ్మున కుగ్రహీతకో
త్తుంగుఁడు క్రూరవర్తనుఁడు దుర్గుణరాశి జనించె వేనుఁ డు
ప్పొంగుచు మౌను లత్తులువఁ బూన్చిరి భూభరణప్రసక్తికిన్.

336


వ.

ఇట్లు మాతామహదోషంబున దుష్టస్వభావుండగు నవ్వేనునిం బట్టాభిషిక్తుం
చేసిన నతండు.

337


గీ.

యజ్ఞములు సేయవలదు హోమాదివిధుల, మాట గూడదు దానధర్మక్రమములు
తడవరాదని కఱపె నుదగ్రభేరి, యెత్తి చాటించె భూజను లెల్ల వినఁగ.

338


క.

నాకన్న యజ్ఞభోక్తలు, లోకంబునఁ గలరె? నేన లోకేశ్వరుఁడన్
జేకొందు యజ్ఞపతియను, సాకాంక్షస్తుతులు జగములన్నియు మెచ్చన్.

339


చ.

అని ఘననాస్తికత్వనిధియై కడుమూర్ఖత నున్న యంగనం
దనుకడ కొయ్యనే మునికదంబము పోయి బహూకరించి యి
ట్లనియెఁ బరావరేశుఁడగు నచ్యుతుఁ గూర్చి మఘక్రియల్ వినూ
తనగతిఁ జేయు మోయధిప! తత్ఫలభాగము నీకు నబ్బెడిన్.

340


గీ.

యజ్ఞపురుషుండు శ్రీహరి యజ్ఞవిధుల, ప్రీతుఁడై మన కొసఁగు నభీష్టతతుల
ఏవిభునిరాజ్యమున చెల్లు నిచ్చ లతని, కొసఁగు నభిలషితములు దామోదరుండు.

341

సీ.

అన విని వేనుఁ డిట్లను నాకు మిక్కిలి పూజ్యుఁ డెవ్వఁడు జగంబులఁ దలంప
హరి యన నెవ్వఁ డంబురుహగర్భజనార్దన, శివేంద్రమారుతానలయమార్క
వరుణచంద్రాదిదేవతలెల్ల రాజదేహాశ్రితు లగుట ధరాధినాథుఁ
డఖిలదేవమయుండు సామోదులై నృపుఁ బూజింప శ్రేయోవిభూతి గలదు


గీ.

భర్తృశుశ్రూషణం బెట్లు పరమధర్మ, మంగనల కట్ల మీకు రాజాజ్ఞసేత
ధర్మ మట గాన మీరును దడవరాదు, యాగదానాదికృత్యము లస్మదాజ్ఞ.

342


చ.

అన మును లిట్లు పల్కిరి జనాధిప! యానతి యిమ్ము ధర్తవ
ర్దన మొనరింప నే మొకటి తథ్యము చెప్పెద మాదరమ్మునన్
వినుము జగంబు లెల్లను హవిఃపరిణామమె సుమ్ము యాగవ
ర్తనములు లేకపోయిన ధరావలయం బశుభంబుపా లగున్.

343


క.

అని పలుమాఱును జెప్పిన, విననొల్లక యతఁడు ధర్మవిముఖుం డైనన్
మును లెల్లఁ గోపమున నీ, ఘనపాపుని జంపుఁ డనుచు గాఢప్రతిభన్.

344


చ.

అనిశము యజ్ఞపూరుషు జనార్దను బుణ్యచరిత్రు నింద చే
సిన కుటిలాత్ముఁ జంపుఁడని శీఘ్రమె మంత్రపవిత్రదర్భవ
జ్రనిహతి చేసి రమ్మునులు సారసనేత్రుని నింద మున్న చ
చ్చిన యవివేకిఁ బాపగుణశీలుని దుర్మలినాంతరంగునిన్.

345


వ.

అంత.

346


ఉ.

చోరులు రేగి గేహములు చొచ్చి యవధ్యులసొమ్ములెల్ల ని
ష్కారణవైరులై కొనిరి సందడి గాఁగ నొకళ్లొక ళ్లతి
క్రూరత నర్థలోభమున ఘోరరణంబు లొనర్చి రంత ది
గ్వారము లెల్ల ముంచె ననివారత భూరిరజోంధకారముల్.

347


క.

మునులు నరాజకదోషం, బనుచు విచారించి యజ్జనాధిపుతొడ నే
ర్పొనర మథించిరి పుత్ర, జనన మాత్మలఁ గోరి సజ్జనస్తుతచరితా.

348


గీ.

చూడఁజూడంగఁ గాలినమోడువంటి, మేను మరుగుజ్జురూపు వెంబైననోరు
కలుగువాఁడు జనించె నొక్కరుఁడు వేన, మహిపు మథితోరుతలమున మౌనివర్య.

349


క.

ఏ నేమి చేయుదున్ మీ, రానతి యిం డనుచు నాతఁ డాతురుఁడై య
మ్మౌనులఁ బల్కిన వారు త, దాననమున్ గని “నిషీద" యని పల్కుటయున్.

350


చ.

అతఁడు నిషాదనామధరుఁ డయ్యెఁ దదంగసముద్భవుల్ సము
ద్ధతులు నిషాదు లుగ్రబలదర్బులు పాపరతుల్ జనించి యూ

ర్జితగతి వింధ్యపర్వతదరీవనసీమల నుండి రట్టు లా,
క్షితిపునిపాపమంతయును జెల్లె నిషాదవినిర్గమంబునన్.

351


సీ.

అమ్మునిపుంగవు లాతనిదక్షిణకరము మథింప భాస్కరసమాన
తేజుండు వరగుణాధికుఁడు పృథుండు, వైన్యుఁడు పుట్టె నప్పుఁడు వ్యోమవీథి
నుండి యాజగవనామోగ్రచాపము దివ్యకాండవర్మ ములు నగ్రమునఁ బడినఁ
గైకొనె నాతఁ డక్కాలంబున నశేషభూతనంతోషంబు పొసఁగె పుత్రుఁ


గీ.

డుదయమందిన వేనుండు త్రిదశపదము చేరె, పున్నామనరకంబు చెందక తద
నంతరమ సర్వనదులును నంబునిధులు, నతని కభిషేక మొనరించ నరుగుదెంచె.

352


వ.

ఇట్లు పుణ్యజలంబులును మణులుం గొని నదీసముద్రంబులు వచ్చె. సకలముని
సమేతుండై పితామహుండు వచ్చె. స్థావరజంగమాత్మకంబులగు సర్వభూతం
బులు వచ్చె. ఇట్లు వచ్చి యావైన్యు రాజుంగా నభిషిక్తుం జేసి రంత.

353


గీ.

అధికతేజుని దక్షిణహస్తకలిత, దివ్యచక్రుని శ్రీవిష్ణుదేవువంశ
భూతు నవ్వైన్యుఁ గనుగొని జాతహర్ష, కంచుకితమూర్తు లయ్యె లోకంబులెల్ల.

354


క.

హరి కొనరినట్ల యాభూవరునకు దక్షిణకరమున వర్తిల్లును భా
స్వరలీల దివ్యచక్ర, మ్మరుదుగ జగమంతయును నిజాజ్ఞ మెలఁగఁగాన్.

355


గీ.

తండ్రిపగిది ప్రజకుఁ దగ రంజనము సేయు, కతన విశ్వధరణిపతికి నతని
కొనరె రాజనామ మనుకూలమై భూమి, పతులకెల్ల నొజ్జబంతి యగుచు.

356


ఉ.

అంబుధి భూధరప్రతతులందు తదీయమహారథప్రచా
రంబు లవంధ్యయత్నరుచిరస్థితి నడ్డము లేక సాగె స
స్యంబు లకృష్టపచ్యము లనంతములై తగె గోగణంబు కా
మంబులు నిచ్చలుం బిదికె మాకుల జొబ్బిలెఁ దేనియ ల్మహిన్.

357


సీ.

అతని ప్రాజాపత్యయజ్ఞసుత్యాహంబు, నందు నిద్దరు సూతుఁ డనఁగ మాగ
ధు డనఁ బుట్టిరి వారితో మును లిట్లని రీరాజుఁ బొగడుండు మీర లనిన
నే మెట్ల వొగడుదు మీతనిగుణకీర్తు, లెఱుఁగరావనిన వా రితనిభావి
సద్గుణకీర్తు లుత్సాహంబుతోఁ గొని, యాడుఁ డాతఁడు వాని కనుగుణముగ


గీ.

నడవఁగలవాఁ డనిన మహానంద మొదవ, పొగడఁ దొడఁగిరి వారు విస్ఫూర్తితోడ
నఖిలమునులును సంతోష మంద వైన్య, వసుమతీభర్తయును మోదవార్ధిఁ దేలె.

358


వ.

సత్యవచనుండు, దానశీలుండు, సత్యదండుండు, లజ్జాశాలి, మైత్రుండు, క్షమా
శీలుండు, విశ్రాంతుండు, దుష్టశాసనుండు, ధర్మజ్ఞుండు, కృతజ్ఞుండు, దయా
వంతుండు, ప్రియభాషణుండు, మాన్యుండు, మానయిత, యజ్ఞశీలుండు,

బ్రహ్మణ్యుఁడు, సాధువత్సలుండు, వ్యవహారంబులయెడ శత్రుమిత్రసముం
డని సూతమాగధులు నుతింపఁ దృక్కర్మకుండై, ధరణిఁ బాలింపుచు, భూరి
దక్షిణాకంబులగు యజ్ఞంబు లనేకంబులు చేయుచుండునంత.

359


క.

ప్రజలు క్షుధాపీడితులై, నిజవసతులు విడిచివచ్చి నృపుఁ బల్కిరి భూ
భుజుఁ డవని లేనిదోషం, బజహద్గతిఁ బొదవఁ జెడియె నఖిలౌషధులున్.

360


గీ.

ఓషధులు నష్టమై పోవ నొదవదయ్యె, నన్న మేమియు మాకు సత్యముగఁ దండ్రి
వీవు జీవన మొసఁగక యెట్లు బ్రతుకు, వారమని విన్నవింప నివ్వటిలు కరుణ.

361


ఉ.

ఆనరపాలచంద్రుఁడు మహాజగవంబు ధరించి బాణముల్
పూని ధరిత్రి వెంటఁబడఁ బొంకము దప్పఁగ గోత్వధాత్రియై
ఆనలినాసనాదిభువనావళిఁ ద్రిమ్మర వెంటనంటినన్
దా నొకదిక్కు లేక వసుధాసతి యిట్లను కంపమానయై.

362


గీ.

అఖిలభూతములకు నాధారమగునన్నుఁ, జంపితేని యెచట జంతుసమితి
నిలిచి బ్రతుకఁగలదు నృపకులోత్తమ యన, వసుధ కిట్టు లనియె వైన్యవిభుఁడు.

363


క.

జడియక మచ్ఛాసనమును, గడచిన నిం జంపి భూతగణముల నెల్లన్
బడకుండ యోగబలమునఁ, గడువేడుకఁ దాల్తు ననినఁ గంపిత యగుచున్.

364


చ.

క్షితితలనాథ! యోషధులు జీర్ణములయ్యె మదాత్మయందు నూ
ర్జితగతి వత్సకల్పనము చేసి మదీయపయోవిశేష మం
చితభుజశక్తి వై పిదికి శీఘ్రము చల్లుము దాన నోషధి
ప్రతతులు పుట్టు నన్నము శుభస్థితి గల్గుఁ బ్రజ ల్సుఖింపఁగన్.

365


వ.

అనుటయు.

366


క.

ఆనృపతి వింటికొప్పునఁ, బూనికతోఁ గొండలెల్లఁ బోద్రోసి సమ
స్థానము చేసె ధరాస్థల, మానెలవు నివాసమయ్యె నఖిలజనులకున్.

367


సీ.

పూర్వసర్గంబున భూతలం బతివిష, మము గానఁ బురులు గ్రామములు నేర్ప
డవు గాన సస్యసంభవము గోరక్షయు, కృషియు వాణిజ్యాదివృత్తు లెచట
లేవు, వైన్యునినుండి లెస్సగా నన్నియుఁ, గలిగె నీగతి బాగుగా నొనర్చి
నగరముల్ గ్రామముల్ నానావిధములైన, వృత్తులు గల్పించి పృథుఁడు ప్రజల


గీ.

కెల్లఁ దగుకందమూలాదు లిష్టలీలఁ, దనర నాహారములు చేసి మనువరుండు
ఘనుఁడు స్వాయంభువుఁడు వత్సకార్యమునకుఁ, జాల నిజపాణి బిదికె నోషధిచయంబు.

368

వ.

ఆయోషధులచేతఁ బ్రజలు వృద్ధింబొందిరి. ఇట్లు ప్రాణప్రదాత యగుటం
జేసి జగంబులకుఁ దండ్రి యయ్యె, అతనిపేరనే ధరణి పృథివి యనం బరఁగె.
అంత దేవ, ముని, దైత్య, రక్షః, పర్వత, గంధర్వోరగ, యక్ష, పితృ, వృక్షం
బులు తత్తత్పాత్రంబులు కొని వత్సదోగ్ధృవిశేషంబు లయ్యె, నీపృథుని
జన్మాదికంబులు కీర్తించినవారికిఁ బాపక్షయంబును, దుస్వప్ననాశనంబును అగు
నని చెప్పి శ్రీపరాశరుం డిట్లనియె.

369


క.

మునినాథ! తనయు లతనికి, ననుపము లంతర్థిపాతులనువా రుదయిం
చిన నం దంతర్థితుసుతుఁ, డొనర హవిర్ధానుఁ డనఁగ నుదయం బయ్యెన్.

370


వ.

ఇ ట్లంతర్ధికి శిఖండియందు హవిర్ధానుండు పుట్టె, హవిర్థానునికి నాగ్నేయి యయిన
విషాణయందుఁ బ్రాచీనబర్హి, శుక్ర, గయ, కృష్ణులన నలువురుపుత్రులు
పుట్టి రందు.

371


క.

ప్రాచీనబర్హి ధర్మ, ప్రాచుర్యమహాయశుండు పాథోధిసుతన్
శ్రీచతుర సవర్ణయను స, మీచీసగుణాభిరామ మృగశాబాక్షిన్.

372


ఉ.

ప్రేమ దలిర్ప శాస్త్రవిధిఁ బెండిలియాడి మనోజ్ఞలీల న
క్కామినియందుఁ బుత్రకులఁ గాంచెఁ బదుండ్రఁ బరస్పరానురా
గామల ధర్మవర్తనుల నచ్చధనుర్నిగమాఢ్యులన్ బ్రచే
తోమహనీయనామకుల దుర్దమశాత్రవమానభేదులన్.

373


గీ.

వారు సాగరజలమధ్యవర్తు లగుచు, దశసహస్రాబ్దములు ఘోరతపము చేసి
రనిన శక్తికుమారు ముఖాంబుజాత, మెలమిఁ గనుగొని మైత్రేయుఁ డిట్టు లనియె.

374


ఉ.

ఏమి తలంచి యుగ్రతప మి ట్లొనరించిరి వార్ధిమగ్నులై
భూమిపనందనుల్ పరమపుణ్యులు పుణ్యచరిత్ర! నీదువా!
క్యామృతసేచనంబున మదాత్మ చెలంగఁగ నానతీయవే
యీమహి నీవు తక్క మఱి యెవ్వ రెఱుగుదు రీరహస్యముల్.

375


చ.

అనుటయు శ్రీపరాశరుఁడు హర్ష మిగుర్పఁగఁ బల్కెఁ బుత్రులన్
ఘనుల బదుండ్ర జాచి యతిగౌరవ మొప్ప కుమారులార! య
వ్వనజజుఁ డాజ్ఞ యిచ్చె, చెలువంబు తగన్ బ్రజల సృజించుమం
చనయము తన్మహాజ్ఞ సుగుణాకరులార! యొనర్పగాఁదగున్.

376


చ.

అనుటయుఁ దండ్రిఁ జూచి వినయంబున నందను లిట్లు పల్కి రో
జనక! ప్రజాభివృద్ధియగు సారపుకర్మము మాకుఁ దెల్పుమీ

వన వనజాక్షు సద్వరదు నచ్యుతుఁ గొల్చినకాక కోర్కు లే
యనువునఁ గల్గు సంశయము లన్నియు మాని భజించు డాయనన్.

377


శ్లో॥

ధర్మ మర్ధంచ కామంచ, మోక్షంచాన్విచ్ఛతా సతా।
ఆరాధనీయోభగవా, ననాదిపురుషోత్తమః॥

378


సీ.

ధర్మంబు వలసిన తాపసార్పితతపఃఫలు శార్ఙ్గధరునిని గొలువవలయు
అర్థంబు వలసిన ననుపమపరమార్తు శ్రీవధూరమణు నర్చింపవలయు
కామంబు వలసిన కామితఫలదుఁ, బుత్రితకాముఁ బ్రేమ నర్థింపవలయు
మోక్షంబు వలసిన ముహ్యద్గజేంద్రమోక్షణవిచక్షణు భక్తి సలుపవలయు


గీ.

పూని భగవంతుని ననాదిపూరుషోత్త, ముని భజింపక పురుషార్థములు ఘటింప
వమరమునికోటికైన నీయర్థ మెఱిగి, దానవాంతకుఁ గొలువుండు తనయులార.

379


ఉ.

ఆదిఁ బితామహుండు కమలాక్షునిఁ బూజ యొనర్చి చేసె దే
వాదికసర్వసృష్టియు సురాధిపముఖ్యులు నమ్మహాత్ము న
త్యాదృతిఁ గొల్చి కాంచిరి మనోర్థితసిద్ధులు నట్ల మీరు దా
మోదరుఁ గోరి కొల్వుడు సమున్నతితోడఁ బ్రజాభివృద్ధికిన్.

380


క.

అని యాదేశించిన తమ, జనకునిశాసనము మాళి సరణి నిడుచు నా
ఘనులు బ్రచేతసు లంబుధి, మునిగి తపము చేసి రపుడు ముదితహృతయులై.

381


క.

పదివేలు వత్సరంబులు, పదిలముగా హరిని మదిని బాదుకొలిపి స
మ్మదమునఁ దప మొనరించుచు, సదమలమతిఁ జేసి రొక్కస్తవము ముదితులై.

382


చ.

నిరతము శాశ్వతస్థితుల నిల్చు నశేషవచఃప్రతిష్ఠ యే
పురుషునియందు, నిజ్జగము పుట్టువు నాశము నొందుచుండు నే
పరమునిచేత, భక్తజనపాలకుఁ డేవిభుఁ డట్టియిందిరా
వరుచరణాంబుజంబులకు వందన మే మొనరింతు మెప్పుడున్.

383


క.

చోద్య మనౌపమ్యము జగ, దాద్యమగోచర మపార మాగమపదవీ
వేద్యమగు తేజ మెద్ది, సముద్యతమతి నట్టిహరికి మ్రొక్కెద మెపుడున్.

384


గీ.

పగలు నిశయును సంధ్యయు ప్రచురలీలఁ బ్రబలు నేదేవదేవురూపంబు లగుచు
నట్టికాలాత్మునకును శ్రీహరికి రూప, రహితునకె మ్రొక్కెదము భక్తి రంజిలంగ.

385


చ.

అనుదినమున్ సురల్ పితరు లాత్మలఁ బొంగి భజింతు రేమహా
త్ముని మునిపూజ్యు జీవమయు దుర్దమశార్వరగర్వహారి న
య్యనఘు సుధాకరాత్మునకు నంబుజనేత్రున కాత్మవీథి మే
మనితరభక్తియుక్తి చెలువారఁగ మ్రొక్కెద మెల్లకాలమున్.

386

గీ.

తమము వాఱదోలి తనతేజమున నభః, స్థలము వెలుఁగఁజేసి తాపశీత
జలము లొసఁగునట్టి జలజాప్తరూపికి, హరికి మ్రొక్కెదము నిరంతరంబు.

387


సీ.

జగములన్నియు మోచి శబ్దాదిసంశ్రయుండైన భూమ్యాత్మకు హరి భజింతు
మఖిలబీజాకృతియై జగద్యోనియౌ జలరూపి నచ్యుతు సంస్మరింతు
మనిమిష పితృకోటి నరయు దేవముఖాఖ్యు ననలాత్ము దనుజారి నభినుతింతు
మఖిలదేహములందు వ్యాపించి చేష్టించు పవనాత్ము విష్ణుని బ్రస్తుతింతు


గీ.

మంతటికి నవకాశ ముదగ్రలీల, నిచ్చు నాకాశరూపకుఁ గృష్ణుఁ గొలుతు
మింద్రియములకు స్థానమై యెసఁగువిషయ, రూపునకుఁ గేశవున కివే మొక్కుగములు.

388


చ.

చతురత నెప్పుడున్ విషయజాలము నొందుచు నింద్రియాత్ముఁడై
యతిగతి జ్ఞానమూలమయి యక్షరుఁడై కరుఁడై వెలుంగు నే
యతిశయితప్రభావనిధి యట్టిరమాసఖు న శ్రయింతు మే
మితరము మాని మానితసమాహితనిశ్చలభక్తియుక్తితోన్.

389


గీ.

ఇంద్రియగృహీతవిషయంబు లెపుడు నాత్మ, కించి యంతఃకరణలీల నెసఁగి విశ్వ
మయతఁ జెన్నొందునట్టి రమాసహాయు, చరణములు గొల్చెదము వినిశ్చలమనీష.

390


క.

తనయందు జగములన్నియు, జననవిలయసంస్థితులు నిజంబుగఁ గనఁగా
పెనుపొందు ప్రకృతిధర్ముని, వనజాక్షుని గొల్తు మే మవారితభక్తిన్.

391


చ.

అనయము శుద్ధుఁడై యగుణుఁడై గుణవంతుఁడపోలె భ్రాంతిచే
నొనరెడునాత్మరూపుఁ బురుషో త్తముఁ జిత్తము చేర్చువార మ
త్యనఘు విశుద్ధు నిర్గుణు నిరంజను విష్ణుపదంబు పేరిటన్
దనరెడు నాత్మతత్త్వము సనాతనుఁ గొల్చెద మబ్జనేత్రునిన్.

392


సీ.

హ్రస్వదీర్ఘస్థూలతాణుత్వవిరహిత మగ్ర్యమలోహిత మతను సక్త
మశిశిర మవ్యోమ మస్పర్శగంధరసం బచక్షుశ్రోత్రకం బపాణి
వాఙ్మనసము నామవర్జ మగోత్రమతుల మతేజం బహేతుకము విభయ
మభ్రాంతిక మనిద్ర మజరమరుజ మమృతం బపూర్వాపరత్వం బఘనము


గీ.

దృష్టిజిహ్వాతిగంబునై దివ్యమహిమ, దనరు శ్రీవిష్ణుపరమపదంబునకును
మ్రొక్కెదము మేము మానసాంభోరుహముల, భక్తితాత్పర్యగరిమసంభ్రమము నొంద.

393


వ.

అని యిట్లు.

394


ఉ.

లీలఁ గుమారు లంబుధిజలేశయులై పదివేలవర్షముల్
హాలిఁ దపం బొనర్చి శరణాగతవత్సలు భక్తకామదున్

శ్రీలలనాధినాథునిగుఱించి స్తవం బొనరించునంత భ
వ్యాలఘుతత్తపఃఫల మయత్నమునన్ ఫలియించు కైవడిన్.

395


సీ.

మోముచందురునందు ముగ్ధామృతము చిందు, లలితహసాంకూరములు చెలంగ
కేలుదములయందుఁ దాళతళ్యము గ్రందు, కమనీయశంఖచక్రములు మెఱయ
ఘనకటీరమునందు మినుమినుక్కులు చెందు, పొన్నీటినునుశాటి వన్నెఁజూప
మాళిభాగమునందు మార్తాండరుచి పొందు, హాటకహీరకిరీట మమర

396


గీ.

కలువరేకుల నునుచాయ బలుచఁ జేయఁ, జాలుమేడాలు దిక్కులఁ గీలుకొనఁగ
తేజువెంపెక్కిఱెక్కలతేజి నెక్కి, వారిలో వారియెదుర శ్రీవరుఁడు నిలిచె.

396


క.

నారాయణుఁ డఘవిదళన, పారాయణుఁ డట్లు నిలువఁ బార్ధివతనయుల్
కోరికఁ దచ్ఛ్రీపాదాం, భోరుహముల వ్రాలి వినయమున నున్నెడలన్.

397


గీ.

వారిజోదరుం డవారితకృప తమ్ము, వరము వేడు మనిన వారు తండ్రి
ప్రజలకొఱకుఁ దమ్ము పనిచినపని విన్న, పం బొనర్ప నిచ్చి పరముఁ డరుగ.

398


ఉ.

వారును వార్ధి వారి గరువంబున వెల్వడివచ్చి భూరిభూ
మీరుహసంఘముల్ పెరిగి మేదిని నిండి నభంబు గప్పి వెం
పారఁగ మారుతంబునకు నైనను దూరఁగ రాక ఘోరదు
ర్వారత నున్నఁ జూచి ప్రచురప్రతిఘావృతి దుర్నిరీక్షులై.

399


చ.

తరునివహంబు లుప్పతిలి ధారుణిఁ గప్పఁ బ్రజాక్షయంబు దు
ష్కరగతి నయ్యె నిత్తరులు గావె యనిష్టకరంబు లంచు భీ
కరపవనాగ్నులన్ నిజముఖంబుల వెల్వరూపం బటిష్ఠని
ష్ఠురతఁ బెకల్చి మారుతము శోషిలఁజేసె దహించె నగ్నియున్.

400


గీ.

ఆడకాడకు నొక్కొక్కయవనిజంబు, చిక్క నన్నింటి నీఱుగాఁ జేసె వహ్ని
దానిఁ గని యోషధీశుఁ డమ్మాననీయు, లున్నయెడ కేగుదెంచి ప్రియోక్తిఁ బలికె.

401


క.

ఆరయ నోయి ప్రజాపతు, లారా! యీపనులు లెస్సలా? శాంతి మదిన్
జేరిచి నావచనమ్ములు, మీరక సంధింపవలయు మీరు తరులతోన్.

402


శా.

కన్యారత్నము వృక్షసంజనిత చక్కంజూడుఁ డీయంగనన్
ధన్యన్ మారిష యండ్రు దీని నిటమీదం బుట్టు కార్యంబు నే
మాన్యాత్మస్థితిఁ గాంచి మత్కిరణసంస్పర్శంబునం బ్రోచినా
డ న్యాయంబునఁ బెండ్లియాడుఁడు నిరూఢప్రేమ సంధిల్లగన్.

403


క.

నాతేజములో సగమును, మీతేజములో సగంబు మెలతుకయం దు
జ్యోతితగతి సుతుఁడై యు, జ్జాతుండగు దక్షుఁ డనఁ బ్రజల నతఁడు గనున్.

404

క.

మండితనిజతేజోఘన, మండలమహిమాభిభూతమధ్యందినమా
ర్తాండుఁడు దుర్వారతప, శ్చండుఁడు కండుడన మౌనిచంద్రుఁడు వెలయున్.

405


ఉ.

అమ్మునిపుంగవుండు పరమాద్భుతచర్యల గోమతీతటీ
సమ్మితపుణ్యకాననము చక్కి సుదుశ్చరమౌ తపంబు తీ
వ్రమ్ముగఁ జేయఁ దత్తపము వాడిమివేడిమి చూపి నాకలో
కమ్మున మధ్యలోకమునఁ గంచుకిలోకమున న్మహోగ్రతన్.

406


ఉ.

భోరున నమ్మహాముని తపోమయవహ్ని సధూమకీలదు
ర్వారము చుట్టుముట్టుకొన ద్వారము గానక మానసంబులన్
గూరినభీతి వందురుచు గొందులు దూరి మునింగియుండె సం
చారము దూరమై చన భుజంగమలోకభుజంగవారముల్.

407


క.

జగతీస్థలి కార్చి చ్చే, ర్చుగతిన్ దుర్దాస్తలీల కూరజ్వాలా
ప్రగుణములై నలుదిక్కులఁ, బొగ లెగయుచు నుండె మునితపోమయవహ్నుల్.

408


సీ.

అవనము పెకల్చి యందుకధ్వనులతోఁ, బారిస్వర్ణదిఁ జొచ్చె సౌరదంతి
అరుణకరాళకీలాప్తిఁ జిగిర్చినపూనికఁ దోచె సంతానవాటి
త్రాసంబు చెందుచందమునఁ బీటలు వాఱె నామరమణి సుధర్మాంతరమున
పలుగాకపొందమ్మి తలిరులెల్లఁ గఱంగ, గంగ నుప్పొంగె బంగారునీరు


గీ.

దప్పివడ డస్సి సుర లమృతంబు వెతకి, రింద్రుఁ డాగుబ్బుపొగరెప్ప లెత్తఁడయ్యె
నగ్నిసూక్తంబు జపియించె నాంగిరసుఁడు, మునితపోగ్నిచ్ఛటలు మిన్ను ముంచుకొనిన.

409


వ.

అప్పుడు.

410


క.

వాచస్పతియనుమతి నతి, వాచాలప్రౌఢమతి దివస్పతితత్కా
లోచితగతి నచ్చరఁ బ్రమ్లోచన్ బనివంచె నపుడు ముని వంచించన్.

411


క.

నారీలలామ ధరణిన్, జేరినగ్రొక్కాఱుమెఱుఁగుచెలువున ఘనగం
భీరతపోమహిమమహా, నీరధి యగుమౌనియెదుర నిలిచి చతురయై.

412


ఉ.

పాటల నాటలన్ గలికిపల్కులఁ గుల్కుల వీణెమీటులన్
నీటుల హావభావకమనీయవిలాసవిలోకనక్రియా
చాటువచోపహాసముల సంయమిచిత్తము గుత్తగాఁ గొనెన్
పాటలగంధి పంచశరపంచశిలీముఖపాలు చేయుచున్.

413


క.

తమకమున మౌనిపతి, యక్కమలేక్షణఁ గౌగిలించి గాఢమనోజ
క్లమ ముడుగ సురతసుఖమయ, సముదీర్ణానందరూపజలధిం దేలెన్.

414

ఉ.

ఆపరమర్షిపుంగవుఁ డహర్నిశమున్ వినఁగోరు పంచబా
ణోపనిషద్రహస్యము సముత్కలికన్ మననం బొనర్చు కాం
క్షాపరుఁడై తదర్ధము ప్రసన్నత ధ్యానము సేయు నంత తే
జోపరిమేయమైన సతియాకృతిఁ గాంచి తదాత్మతం గనున్.

415


సీ.

కలికిచిల్కలకొల్కికుల్కునుంబలుకుల భావించు శుకవచఃప్రౌఢిమంబు
భామగాంగేయకుంభభవాభకుచముల వహియించు భారతమహితబుద్ధి
పడతివీక్షామోఘబాణపాతంబులఁ దలపోయు రామావతారమహిమ
నుదతివిశుద్ధతాస్ఫురితహాసంబుల రూపించు వేదాంతరుచులకలిమి


గీ.

సకియబొమదోయి ధర్మజిజ్ఞాస చేయు, కామనీమణియసదులేఁగౌనుతీఁగ
తథ్యమిథ్యాత్వసంశయతర్క మరయుఁ, బండితత్వాభిమాని యక్కండుమౌని.

416


గీ.

బహుతపోభ్యసనార్జితప్రచురపుణ్య, పాటవంబున నిర్ముక్తబంధుఁ డయ్యు
బహురతంబుల యువతిసంబం బంధ, బంధుడై యుండె నప్పు డప్పరమమౌని.

417


సీ.

జడలు గూడఁగఁబట్టి సవరించి కోరగా సిక వేసి నిండఁ బూచేర్లు చుట్టి
బూది వోనలిచి కర్పూరసాంకవమిళద్గంధసారం బంగకముల నలఁది
కుశముద్ర లూడ్చియంగుళికల రత్నదీధితిధగద్ధగితముద్రికలు దొడిగి
వల్కలాశుకములు వదలించి పొన్నీటివ్రాతదుప్పటి వలెవాటు వేసి


గీ.

మించుగడ్డంబుబవిరి దిద్దించి యెదుట, దర్పణము నిల్ప విటవేష మేర్పడంగ
కాంచి హర్షించి మౌని యాచంచలాక్షి, గౌగిలించె మనోజవికారమునను.

418


క.

ఈవిధి నభిమతసుఖపరుఁ, డై వాచంయముఁడు కొన్నియహములు చపలా
క్షీ! వసియించుము నీ వని, భావభవునియంపగముల పాలై మఱియున్.

419


సీ.

కామినిఘర్మోదకముల మజ్జనమాడు నాదరంబున నహరాగమముల
యువతికుచాభోగభవయౌవనాత్యుష్మౙాతవేదుని గొల్చు సంగవముల
అంగనామధురాధరామృతావాప్తి నభ్యవహృతిఁ దీర్చు మధ్యందినముల
లలనాగళోద్భవత్కలరవంబుల పురాణార్థంబు విను నపరాహ్ణములను


గీ.

రుచిరనిర్జరభామినిరూపధేయ, చింతఁ గనుమూసియుండు సాయంతనముల
పంచకాలపరాయణత్వాంచితుండు, కండుమౌని పురాభ్యాసగౌరవమున.

420


గీ.

ఇట్లు నూఱేండ్లమీద కొన్నేండ్లు చనిన, తోయజాతదళాక్షి కేల్దోయి మొగిచి
పలికె సురరాజుఁ గొలువఁ బోవలయు ననుచు, ననుచుప్రేమ నివారించె మునివరుండు.

421


క.

మందరకందరమందిర, మండరమణివేదులందు సుదతీసురతా
మందానందము కను ముని, బృందారకవిభుఁడు మిగులఁ బ్రేమ దలిర్పన్.

422

సీ.

తుదగోళ్ల నున్నగా దువ్వి కీల్గంటున దిండుగాఁ జుట్టు పూదండగములు
సొగసుగాఁ బచ్చికస్తురి పయోధరకుంభపాళిపై లిఖియించు పత్రకములు
లావణ్యనవవయోలలితావయవముల భూషించు నవరత్నభూషణములు
తరుణాంబుజాతజిచ్చరణపల్లవములఁ జతురసన్మతి బూయు జతురసంబు


గీ.

తమి గదంబంబు చేసి గంధంబు పూయు, శ్రమము దీఱంగ తాలవృంతమున విసరు
ఆకుచు ట్టిచ్చు బాగంబు లందియిచ్చు, కాంత కమ్మౌనిపతి సురతాంతములను.

423


శా.

క్రీడాకందరమందిరాంతరముల గేళీగతిన్ మౌనిరాట్
చూడారత్నము తాళమేళగతిమించుల్ సూపఁగా కోపుగా
నాడున్ వేడుక రాగరక్తుల బెడంగౌ జంతగాత్రంబులన్
బాడున్ జోడుగఁ గూడి నిర్జరపురీభామాలలామంబుతో.

424


గీ.

వారిజాక్షి మఱియు నూఱేండ్లపైఁ గొంత, కాల మరుగ మునికిఁ గేలు మొగిచి
దేవవిభుని గొలువ పోవలె సెలవిమ్ము, మౌనివర యటన్న మాన్చె నతఁడు.

425


క.

ఆపడఁతియు నమ్మునిపతి, శాపభయముకతన విడిచి చననోడి సము
ద్దీపితమదనానలఘన, తాపపరీతాత్ము నతనిఁ దనిపె రతులచేన్.

426


గీ.

క్రొత్తక్రొత్తయి ప్రేమ నూల్కొనఁగ నతఁడు, నిర్జరాంగనతోడ నిర్ణిద్రసుఖము
లంద మఱియును నిన్నూఱుహాయనములు, నడిచెఁ గడువడి కించిదూనంబు గాఁగ.

427


వ.

అంత.

428


క.

అంగన పోయెదనని ముని, పుంగవు వేడుటయు నతఁడు పోనీయక యు
త్తుంగస్తనములు వక్షము, నం గదియఁగ గౌగిలించి నాతిన్ బలికెన్.

429


ఉ.

అంగన మాటిమాటికి దయారహితాత్మకవై సురాధిరా
జుం గొలువంగఁ బోదు ననుచున్ గఠినోక్తులు పల్క నేల యె
ట్టుం గడుసాహసం బతికఠోరతఁ జేయుట నిక్కమేని ఘో
రాంగజబాణవేదనలఁ బ్రాణము లేమగునో యెఱుంగుమీ.

430


వ.

అని యవ్వనంబున నవ్వధూమణి పెక్కుమారులు వేడిన క్రొన్ననవింటిజోదు
క్రొవ్వాడిములుకులవేడిమికి నోడి యాప్రాజ్ఞుం డాజ్ఞ యియ్యక కొంతకాలంబు
సురతసౌఖ్యంబుల దేలుచుండె.

431


ఉ.

అంతట నొక్కనాఁడు చతురాననసన్నిభుఁ డమ్మునీంద్రుఁ డ
త్యంతరయమ్మునన్ నిజగృహాంతము వెల్వడిపోవ నప్సరః
కాంత యటెందు పోయె దన నబ్జహితుం డదె వ్రాలె షట్పదీ
కుంతల! సంధ్య వార్వవలె కొంచెములే క్రియ లట్ల తప్పినన్.

432

చ.

అన విని నవ్వి యవ్వికసితాంబుజలోచన లోచనప్రభల్
మునిపతి నామతింప “ధరలో విన మెన్నఁడు నిట్టి ఘస్రముల్
మును బహువత్సరంబులు సమున్నతి మీ కొకవాసరంబొకో"
యన ననఘాత్ముఁ డచ్చరకు నచ్చెరుపా టొదవంగ నిట్లనున్.

433


గీ.

వెలయఁ బ్రొద్దున సంధ్యాదివిధులు తీర్చి, యిన్నదీతీరవనములో నున్న నీవు
వచ్చి నను గూడితివి ప్రొద్దువాలె నిపుడు, హాస్య మేటికి చెపుమ తథ్యంబు తరుణి.

434


వ.

అనినన్ ప్రమ్లోచ లోచనచ్చాయ లెల్లెడం గ్రేళ్లు దాట నజ్జటాధరున కిట్లనియె.

435


ఉత్సాహ.

ఏఱుపరుప తొమ్మనూటయేడువత్సరములపై
నాఱునెలలు మూడుదినము లయ్యె నన్ను గూడి దు
ర్వారమారకేళిఁ దేలి రాత్రులుంబగళ్లు నీ
కోరికలు పొసంగఁ దీర్చుకొనఁగఁ బట్టి గట్టిగన్.

436


చ.

అనుటయు నవ్వుటాల కిటు లాడెదొ సత్యమ పల్కుమన్న నో
ఘనతరధర్మశీల! పలుకన్ దగునయ్య మృషానులాపముల్
మునికులసార్వభౌముఁడవు ముఖ్యుఁడ వీ వడుగంగఁ గల్ల లే
యనువున నాడనోపుదు సుధాబ్ధి జనించుట రిత్తగా ననన్.

437


క.

ఝల్లని గుండియ యదరఁగ, వెల్లనైన మోము వాంచి విప్రుఁడు మిగులన్
తల్లడమందుచు చెల్లర, చెల్లర యనిఁ యిట్టు లనియె చిత్తములోనన్.

438


ఉ.

పూర్ణ మనూర్మిచంచల మబోధ్య మపారము నైనయట్టి బ్ర
హ్మార్ణవ మాకలించి సుఖ మందఁగఁ భారముఁ జేర్చు మామకో
దీర్ణవివేకనౌక సుదతీ! నిబిరీసకటాక్షవీక్షగో
త్కీర్ణమహాశుగౌఘనిహతిం గతిఁ దప్పె నిఁకేమి సేయుదున్.

439


చ.

అనిశము దుశ్చరక్రమములైన వ్రతంబులు పెక్కు చేసి కూ
ర్చిన సుమహత్తపోధనము రిత్తకురిత్తయి బూదిలోన వే
ల్చినమహితాహుతిప్రతతిలీల నిరర్థకమయ్యె నన్నుఁ బో
లినయవివేకపామరులు లేరు ధరావలయంబులోపలన్.

440


సీ.

అలరుఁగన్నులు కన్నులని చలించుటగాక, రౌరవాకారఘోరములు గావె
నునుపుగుబ్బలు గుబ్బ లనుచు నుబ్బుటగాక, యతులకుంభీపాకగతులు కావె
కోరినూగారు నూగార నెన్నుటగాక, తలపోయ కాలసూత్రంబు గాదె
నునుదరుల్ నునుదరు లనుచుఁ బొంగుటగాక, కనమహావీచిమార్గములు కావె

గీ.

సత్కవీంద్రులు తమవచశ్చతురిమములు, చూప నూరకె బ్రమసి సంక్షోభ మంది
వందురుటగాక తెలిసిన వాస్తవమున, వారిజాక్షులు జంగమనారకములు.

441


ఉ.

ఏతఱి సత్కులప్రభవుఁ డేవము లేక విహీనుఁడై త్రపా
పేతమనస్కుఁడై యకట యేగతి ముద్దిడు వాఁడు కష్టదు
ర్జాతవిదూషకాల్పనటజారభుజంగకచోరకోటిని
ష్ట్యూతశరావమైన వెలయుగ్మలిమోవి వసుంధరాస్థలిన్.

442


సీ.

విధ్యుక్తిసాంగమౌ వేదప్రపంచంబు, చదివి యత్యంతప్రశస్తిఁ గాంచి
మానక యుభయమీమాంసాపరిశ్రమ, ప్రమనస్త్వమునఁ గీర్తి పరిఢవించి
సిద్ధాంతసంసిద్ధి చిదచిదీశ్వరవిని, ర్ణయవివేకనిరూఢి జయము గాంచి
అలయక బహుళేతిహాసపురాణార్థ, వైదుష్యమునఁ జాలవన్నె కెక్కి


గీ.

పిదప నీరీతి చదివినచదువులెల్లఁ, జిలకచదువులు చేసి దుశ్శీలలీల
లోలనయనావిలోకనాభీలజాల, వినిహతిమృగంబు నైతి నే మనఁగఁ గలదు.

443


చ.

అని తను రోసి రేచి జలజాయతలోచనమోముఁ జూచి య
మ్ముని యను పాపజాతి నను ముంచితి వీకలుషాబ్ధిలోన న
య్యనిమిషనాథుకార్యమునకై చను మెక్కడికైన నీవు వ
చ్చినపని దీరెఁ గోపశిఖిచే నిను నేర్చెద నిల్చియుండినన్.

444


వ.

మఱియు నొకవిశేషంబు చెప్పెద. సఖ్యంబు సాప్తపదీనంబని చెప్పుదురు,
బహుకాలంబు నీతోడం గూడియుండి నిన్ను దండింపరాదు గావున.

445


క.

నిను గినియ నేమి యింద్రుని, ననఁ గారణ మేమి ఘనవిషాభవిషయవా
రనుపమవననిధివీచుల, మునిగిననను దిట్టఁ దగవు మూర్ఖుఁ డనగుటన్.

446


వ.

అని యమ్ముని యధిక్షేపించి కించిదరుణాయమాననేత్రాంచలుండై పెచ్చు
పెఱిగి రెచ్చి పలికిన ఱిచ్చవడి యయ్యచ్చర యచ్చెరుపాటునఁ దొటతొటం
దొరగు చెమటచిత్తడిం దడిసి వడవడ వడఁకు నవయవంబులు ముంచిన రోమాం
సంచయంబునన్ కంచుకితయై సంచరించి జవంబున దివంబునకుఁ బోవు
నప్పుడు.

447


క.

అమ్మునిపతితేజము, గర్భమ్మయి స్వేదమునఁ గలిసి స్రవియించిన న
క్కొమ్మయుఁ దరుపల్లవముల, సమ్మదమునఁ దుడిచివేసె శాఖలమీదన్.

448


క.

మారుత మేకము చేసిన, నారీమణి యయ్యె వినుము నాకును ప్రమ్లో |
చారమణికి మునిపతికిని, మారుతవృక్షముల కిది కుమారిక యయ్యెన్.

449

గీ.

కండుమునియును నప్సరఃకాంతకతనఁ, గూర్చిన తపోధనంబెల్ల కొల్లఁబోవ
తల్లడము నంది యధికసంతాసతప్త, చిత్తుఁడై దాని నిష్కృతి చేయఁబూని.

450


సీ.

ఆమ్నాయనివహంబు లందంద వందులై పొగడు నేక్షేత్రంబు భూరిమహిమ
గీర్వాణవితతు లేక్షేత్రంబు జనుల నారూఢిఁ గన్గొను చతుర్భుజులు గాఁగఁ
గీర్తించునంత నేక్షేత్రంబు కోటికోట్యయుతజన్మాఘంబు లడఁగఁజేయు
శ్రీసతీపతికి నేక్షేత్రంబు దేహమై తనరు కల్పాంతరస్థాయి యగుచు


గీ.

పతితపావనతాఖ్యాతిఁ బ్రబలుచుండు, భూమి నేక్షేత్ర మట్టి శ్రీపూరుషోత్త
మాహ్వయక్షేత్రమున కేగె నతితపస్స, మిద్ధరుచిహేళి కండు మునీంద్రమౌళి.

451


ఉ.

ఉత్కళికన్ మునిప్రవరుఁ డుబ్బుచు, గొబ్బునఁ జేరె భారతీ
యోత్కలసీమ దక్షిణమహోదధితీరమునందు సర్వసం
పత్కరమై విముక్తులకుఁ బట్టగు శ్రీపురుషోత్తమంబు సం
విత్కలనానిరూఢి నవివిశ్రుతుఁడై యతఁ డాక్షణంబునన్.

452


సీ.

కమలాక్షచక్రనిఖాతమార్కండేయకుండోదకంబునఁ గ్రుంకు లిడియె
తురగమేధీయబంధురగవిఖురదీర్ణసమధికేంద్రద్యుమ్నసరసిఁ దోగె
కాకమోక్షప్రదకారణాంభఃపూర్ణరోహణపావనోర్ముల మునింగె
దర్శనమాత్రఁ బాతకవిదారణచణాంచితతీర్థరాజవీచికలఁ దేలె


గీ.

శ్వేతరాజతపస్తుంగ శ్వేతగంగ, సంగముల దోచె కోటిజన్మార్జితాఘ
పుంజముల నొక్కవ్రేల్మిడి పొల్లు చేసి, మహితసద్గుణశాలి యమ్మౌనిమాళి.

453


వ.

ఇట్లు శ్రీపురుషోత్తమదివ్యక్షేత్రంబునకు భూషణీభూతంబైన తీర్థజాతంబునం
గృతస్నానుండై పుండరీకాక్షకృపాకటాక్షవీక్షేక్షుసారఝరీపరంపరలు
దార్కొని పేర్కొని కరడుగట్టి గట్టిగా కనుపట్టి పంచదారగట్టనం బట్టుగల
దట్టంపుప్రాసాదవజ్రదీధితిధట్టంబులు చుట్టుకొన్న మిన్నందియున్న శ్రీనీల
మహీధరం బధిరోహించి నేత్రపర్వంబులగు ద్వావింశత్పర్వంబులు గడచి
చని దివ్యప్రాసాదమధ్యగతవిచిత్రరత్నసింహాసనోపరిభాగంబున.

454


సీ.

అంజనాచలకాంతిభంజనాచలతనుచ్ఛాయ లెల్లెడలకు జౌకళింప
పద్మసౌందర్యైకసద్మసౌభాగ్యాకరాయితేక్షణరుచుల్ హర్ష మొసఁగ
మేరుకూటోదారభూరిరత్నస్ఫారమౌళిద్యుతులు నభోమార్గ మలమ
బాలాతపోద్దామలీలారుచిరహైమచేలాభ లంతట జికిలి చేయ


గీ.

సుకరసంవాసితదరారి సుకరవికచ, చకచకలు పేరెములఁ దొక్క చక్కఁదనపు
రాశియైయున్న శ్రీసుభద్రాసనాథు, శ్రీజగన్నాథుఁ గనియె నాసిద్ధమాని.

455

చ.

కనుగొని యంత సంభ్రమత గాఢముదర్ణవమగ్నుఁడై మహా
ముని తనివొకరెప్పకముంచిన యశ్రులు గండపాళిపైఁ
జినుకఁగఁ గంటకప్రతతి చెందిన యంగము పొంగ భక్తిఁ గ్ర
క్కున ధరఁ జాగి మ్రొక్కిడియె గోష్ఠవిహారికి కంసవైరికిన్.

456


గీ.

మ్రొక్కి లేచి హస్తములు ముకుళించి, మౌళ్యగ్రసీమ నిల్పి హర్షగద్గ
దస్వరంబు గళపథమ్మున మెల్లనె, యేగుదేర భక్తి నిట్లు పొగడె.

457


వ.

జయజయ సకలజగదుద్భవస్థితివిలయకారణభూతప్రభావ, భావభవకోటి
సౌందర్యధుర్యదివ్యవిగ్రహ, గ్రహపతిరోచిస్సహస్రప్రభాదుర్దర్శసుద
ర్శనదర్శనభయలోకాలోకగుహాంతరవిలీనదైతేయతమోవార, వారణరాజ
రక్షావిచక్షణా, క్షణదాచరప్రమోషితనిగమసందోహపునర్దానసంతోషిత
కమలభవకృతస్తోత్రసంతతానంద, నందత్సురాసురమహాభారపారావార
మగ్నమంథానశైలనిర్వహణమహిమసంజాతనూతనసుధాపానోన్మనస్సు
మనస్సముదాయకృతాదర, దరవిదళత్కేతకిముకుళాభదంష్ట్రాగ్రసముద్ధృత
ధరణీతరుణీసమాగమరోమాంచితమహాదేహవరాహ, వరాహవధరణ్య
గ్రగణ్యహిరణ్యకశిపువక్షోవిక్షోభసంభూతప్రభూతరుధిరాభిషేకాశోక
ముకుళతిరస్కారిహారినఖరాగ్రవిద్యోతమాన, మాననీయశ్రీపాదారవింద
నిష్యందిమకరందబిందుధారాయితమందాకినీప్రవాహాపాదితాశేషభువన
వనధివేష్టతక్షితీశాననవిరాజిరాజన్యరాజికాసనప్రజ్వలత్తనూనపాత్కీలా
భీలకుఠారధారాజాగ్రద్భుజాగ్రమునిశేఖర, ఖరదూషణత్రిశిరోముఖవిరోధి
శిరోధిగళద్రక్తధారాస్వాదామోదజవవత్పత్రివిక్షేపణక్రీడాసదోహల, హల
ముఖనిర్భిన్నయామునాంభఃప్రవాహ, వాహదేహధారిక్షపాచారివిదారి
భయంకరాలోక, లోకజిద్ధర్మత్యాజితపౌతనారివ్రతమండల, మండలభ్రమణ
చతురతురగఖురపుటనిరశితయవనకరోటిపరంపరపరవాసుదేవ, దేవ
సార్వభౌమస్వర్గశ్రీపురుషోత్తమనాథ, శ్రీజగన్నాథా! విజయీభవ దిగ్విజ
యీభవ.

458

అనులోమకందము-విలోమార్య

మారపితా నిజఘనదయ, సారసనాభా సమహిమ, సరనుతవరదా
తేరినతిగలనుతిమనవి, చేరు సురదదాసమతవశిధనాధారా.

459

తెనుంగున కందము - అదేశ్లోకము

నను నేలేననివాసికి, మసు నీలా గేది గురుతు మానకు భాగే
ననవయ యిందుల పనరయ, మనవలదా, వటమిదంత యాం తేజమయా.

460

వ.

అని పొగడి, బ్రహ్మపారస్తవంబున నిట్లని పొగడందొడంగె.

461


శ్లో॥

పారంపరం విష్ణురపారపారః। పరఃపరేభ్యః పరమార్ధరూపీ।
సబ్రహ్మపారః పరిపారభూతః। పరిః పరాణామపిపారపారః॥

462


శ్లో॥

సకారణం, కారణతస్తతోపి। తస్యాపిహేతుః పరహేతుహేతుః।
కార్యేషుచైవం సహకరకర్తృ। రూపైరశేషై రవతీహవిశ్వం॥

463


శ్లో॥

 బ్రహ్మప్రభుర్బ్రహ్మ ససర్వభూతో। బ్రహ్మప్రజానాంపతి, రచ్యుతో, సౌ।
బ్రహ్మావ్యయం, నిత్యమజం, సవిష్ణు। రపక్షయాద్యైరఖిలైరసంగీ॥

464


శ్లో॥

బ్రహ్మాక్షర మజంనిత్యం। యథాసౌ పురుషోత్తమః।
తథారాగాదయోదోషాః। ప్రయాన్తు, ప్రశమంమమ॥

465


శ్లో॥

ఏతద్బ్రహ్మపరాఖ్యం వై। సంస్తవంపరమం జపన్।
అవాపపరమాంసిద్ధిం। ససమారాధ్య కేశవం॥

466


వ.

మఱియును.

467


ఉ.

తారగిరీంద్రవైఖరి యదభ్రశరీరము, పండువెన్నెలన్,
గేరెడినవ్వు, చిత్రమణికీలితదివ్యవిభూషణప్రభో
దారతయున్ దగంగ, హరిదక్షిణపార్వ్శమునందు గాంచె, మం
దారసమాను, నీలపరిధాను భుజంగమసార్వభౌమునిన్.

468


గీ.

వారియిద్దఱినడుమ నవార్యమాణ, బాలభానుప్రభాసముద్భాసమాన
కాంతిసంతానసంతతాగమ్యమాన, భాసురాంగవితాన, సుభద్ర గనియె.

469


సీ.

వదనవారిజముపై వ్రాలనూహించువైఖరిఁ జలద్భ్రమరకోత్కరము వెలయ
అవయవకాంతి యాచ్నార్ధమై చేరినపగిది భూషాపరంపరలు మెఱయ
ఎల్లెడ నమృతంబు వెల్లివిరిసినకరణి కటాక్షవీక్షలు పొసంగ
సౌందర్యఘనతరస్పర్ధ బందీకృతంబైన రీతిని కేలియబ్ఙ మమర


గీ.

తరుణకరపల్లవాంగుళితాడ్యమాన, మాననీయవిపంచికామంజునాద
సాదరామోదమైయున్న జలదపద్మ, పద్మలోచనఁ గనియె సుభద్ర నపుడు.

470


క.

హరివామపార్శ్వమున, సుస్థిరరవికోటిప్రభావిశేషదురవలో
క్యరభస మహాసుదర్శన, మురుభక్తిం గనియె మునికులోత్తముఁ డచటన్.

471


వ.

ఇట్లు గాంచి, బహుప్రకారంబుల వినుతించి.

472


క.

వెండియును కండుముని మార్కండేయేశాదిశంభుగణమును విమలా
చండాకృతి ముఖ్యాఖిలచండీతతిఁ గాంచె నపుడు సమ్యగ్భక్తిన్.

473

మ.

పరమర్షిప్రవరుండు భక్తివినయభోజిష్ణుఁడై కొల్చె దు
ర్భరకారుణ్యధురీణు దానవతమోబాలార్కు శ్రీవైష్ణవో
త్కరచూడామణి రత్నవేత్ర సముదగ్రప్రస్ఫురద్బాహు శ్రీ
హరిసేనాపతి నుగ్రసేను పరమాహ్లాదంబు సంధిల్లగన్.

474


సీ.

కమనీయముఖ్య రుక్కాండంబు తుండంబు, చటులపక్షవిభూతి సామగీతి
ఆవృతయాజుషామోదంబు నాదంబు, బల మధర్వకులప్రభావఫలము
బహువిధచ్ఛందోనుబద్ధంబు స్కంధంబు, విపులనానాయజ్ఞవిధులప్రాపు
భూరివర్ణక్రమంబులు విక్రమంబులు పుచ్ఛంబు కల్పసంపూర్ణతాచ్ఛ


గీ.

మగుచుఁ జెలువొంద ఛందోమయత్వ మంది, యిందిరాప్రాణవల్లభు మందురాంత
రమున ననురలపై కాలు ద్రవ్వుచున్న, పన్నగారాతిఁ గొలిచె నప్పరమమౌని.

475


చ.

అనఘచరిత్రుఁ డమ్మునికులాగ్రణి యగ్రపథంబునందుఁ గ
న్గొనె ఘనమార్గమెల్ల నతికోమలపత్రవిచిత్రశాఖలన్
పనుపడఁ గప్పి శ్రీవిభుని మారటమూర్తి యనన్ మహాఘపా
టనపటు వైన యక్షయవటక్షితిజాతశిఖావతంసమున్.

476


సీ.

తరలిపోవకయున్న తననీడ దుస్త్యజ, బ్రహ్మహత్యాకోటిఁ బారఁదగులఁ
దరుణత్వరమ్యమౌ తనదళంబు కిశోర, పద్మనాభు ననుంగుబాన్పు కాఁగ
దృఢగతిన్ దనమహాదీర్ఘ శాఖాగ్రజా, గ్రద్విటపాలి దిక్పాలిఁ గడవ
స్థూలనిరంతరాభీలమౌ తనశిఫా, మూలజాలంబు పాతాళ మంట


గీ.

సిరుల శ్రీపూరుషోత్తమక్షేత్రసీమ, తాఁ ద్రివిక్రము నపరావతార మనఁగ
భువనవిఖ్యాతిఁ గాంచి సంపూర్ణ మహిమ, నలరునక్షయవటభూరుహంబు గొలిచి.

477


వ.

క్షేత్రరాజంబు నివాసంబు చేసి నారాయణమంత్రజపపరుండై కొంత
కాలంబునకు మోక్షసామ్రాజ్యసింహాసనాధ్యక్షుం డయ్యె.

478


చ.

కలుషవినాశకారి యగుకండుమునీంద్రుచరిత్రమున్ విని
ర్మలమహిమాభిరామ యగుమారిషజన్మము విన్నఁ గోరికల్
దలకొని చెందు సత్ఫలవితానము లూనము గాక యంచు ను
త్కలిక దలిర్పఁ జెప్పి గుణధాముఁడు సోముఁడు వారి కిట్లనున్.

479


క.

ఇల్లలన తొల్లి యొకభూ, వల్లభుసతి భర్త బాలవయసునఁ దెగిపోఁ
దల్లడిలి బాలవైధ, వ్యోల్లోలనిమగ్న యగుచు నురుదుఃఖమునన్.

480


ఉ.

పంకజనాభు భక్తపరిపాలనలాభు విభాసిశంఖచ
క్రాంకితబాహు నీరదనిభాంచితదేహు సభక్తియుక్తిహృ

త్పంకజవీథి నిల్పి వనితామణి పూజ యొనర్చికొల్చె జ్ఞా
నాంకురితాత్మయై తదజహద్ఘనభక్తికి మెచ్చి గ్రక్కునన్.

481


సీ.

మెఱుగురేయెండ సోదరము మేలిమిపైఁడి, జలపోసనపుశాల తళుకుఁ జూపఁ
కార్మొగు ల్నిగనిగ ల్కాదను నునుమేని, చాయ లెల్లెడలకుఁ జౌకళింప
నిడుదకేల్దోయిఁ బూనినసంకుచుట్టువాల్, డా లిరువంక బేగేలు ద్రొక్క
తెలిచామరలమించుఁ దల వంచుకొనఁజేయు, మెఱుగుకన్బెళకులు సిరుల నీన


గీ.

గొనబుసొమ్ములగములతోఁ గూడి యెదకు, తగినసొమ్మైనకలుములముగుదబెళకు
కలికిచూపులు చదలమేల్కట్లు గట్ట, కాంతముందర నిలిచి శ్రీకాంతుఁ డపుడు.

482


చ.

నిరుపమపుణ్యశీలగుణ నీ వొనరించిన భక్తి కిప్డు నే
వరదుఁడనై వరం బొసఁగ వచ్చితి వేఁడుమటన్న మ్రొక్కి య
త్తరుణియుఁ గేలు మోడ్చి యను దైత్యహరా! విధవాత్వదుఃఖదు
స్తరజలరాశిమగ్ననయి తావకపాదము లాశ్రయించితిన్.

483


గీ.

బాలవైధవ్యదుఃఖసంప్రాప్త పుత్ర, హీన నిర్భాగ్య యిట్టినా కిందిరేశ
జన్మజన్మంబులం దతిశ్లాఘ్యులైన, పతుల నిమ్ము లసత్కృపాపాటవమున.

484


ఉ.

ఓకరిరాజరక్షక! అయోనిజనై శుభలక్షణాంగినై
శ్రీకరరూపసంపదల చెన్ను వహింపుచు ప్రాజ్ఞనై గుణా
స్తోకసుపుత్రలాభము వసుంధరపెంపు వహించఁ గాంచ నీ
వే కృప నీవరం బనుచు వేడిన శ్రీవరుఁ డాదరంబునన్.

485


సీ.

ఇందీవరేక్షణ యింకొక్కజన్మంబు, నంద ప్రఖ్యాతు లుదారకర్ము
లధికతపోబలు లగుదురు పతులుప, దుండ్రు పుత్రకుఁడు బంధురయశుండు
ధీరాత్ముఁడు ప్రజాపతి గుణాభిరాముండు, గలుగు నీ కిపు డాత్మఁ దలఁచినటులు
అన్నియుఁ గల్గు నీయాత్మజుండు నశేష, వంశకర్తృత్వసద్వైభవంబు


గీ.

నందుఁ దత్సంతతియె నిందు నఖిలజగతి, నందఱికిఁ బ్రీతికారిణి వగుచు నెపుడు
నీవు పుణ్యస్వరూపివై నెగడె దనుచు, దనుజమర్దనుఁ డప్పు డంతర్ధి నొందె.

486


క.

అమ్మానినీలలామం, బిమ్మారిష దీని మీరలిందఱు నుపయా
మమ్మయి ప్రజల సృజింపుఁడు, సమ్మత మిది ద్రుహిణునకు నిజంబుగ ననినన్.

487


ఉ.

సోమునిమాట గైకొని విశుద్ధగుణాన్విత మారిషన్ ప్రచే
తోమహిమాభిధాములు పదుండ్రును బెండిలియాడి ప్రేమ న
క్కామినియందు దక్షు సుతుఁ గాంచి రతండు ప్రజాపతిత్వసు
శ్రీమహనీయుఁడై మది సృజించె విచిత్రితసృష్టిజాలమున్.

488

వ.

ఇట్లు అచరంబులును, చరంబులును, ద్విపదంబులును, షట్పదంబులునుగా
ననేకప్రాణిజాతంబుల మానసంబున సృజించి చూచి, చరితార్థంబు నొందక
మఱియు మానసంబున పంచాశత్కన్యకల సృజియించి అందు ధర్మునకు
పదుండ్రను కశ్యపునకుఁ బదమువ్వుర, చంద్రునకు నిరువదియేడ్వుర నిచ్చె. వారి
యంద దేవదైత్యనానాగణంబులును, గోఖగగంధర్వాప్సరోగణంబు
లును, దానవాదులునుం బుట్టిరి. అదిమొదలు స్త్రీపురుషసమాగమంబున,
బ్రజలు పుట్టిరి. తపోనిష్ఠాగరిష్ఠులగు పూర్వులకు సంకల్పంబున స్పర్శంబునఁ
బ్రజలు పుట్టుదు రనిన శ్రీపరాశరునకు మైత్రేయుం డిట్లనియె.

489


గీ.

ధాతయంగుష్టమునఁ బుట్టె దక్షుఁ డనుచుఁ, జెప్పుదురు మీ రతండు ప్రచేతసులకుఁ
బుత్రుఁడని చెప్పితీరి జగత్పూజ్య నాకు, సంశయంబయ్యెఁ దెలుపుఁ డీచందమెల్ల.

490


క.

సోమునికిఁ బుత్రికాసుతుఁ, డామహితాత్మకుఁడు దక్షుఁ డాతఁడె మరలన్
సోమునికి మామ యయ్యె, మహామహిమా తెలుపు దీని నాద్యంతంబున్.

491


సీ.

అని విన్నవించిన యమ్మునితో శ్రీపరాశరుం డిట్లను బ్రస్ఫుటముగ
భూతకోటులయందు పుట్టువులును నిరోధములును నిత్యముల్ విమలచరిత
ప్రవిమలజ్ఞానసంపన్నులౌ ఋషివరు లీయర్థమున సంశయింప రెపుడు
ప్రతియుగంబునయందుఁ బ్రభవించుచు నిరోధ మొందుచు దక్షాదు లుందు రెందు


గీ.

జ్యేష్ఠకానిష్ఠ్యములు లేవు చర్చసేయ, వారలకు భూరితపము నవార్యమాణ
సారదివ్యప్రభావముల్ కారణమ్ము, లనిన మైత్రేయుఁ డిట్లను నాదరమున.

492


క.

సురపన్నగగంధర్వా, సురతతియుత్పత్తి మాకు సురుచిరపరమా
దరమున నెఱిగింపుము ముని, వర యనుటయు నమ్మునిప్రవరుఁ డిట్లనియెన్.

493


చ.

కమలజునాజ్ఞ దక్షుఁ డతికౌశల మొప్పగ దేవదానవా
ద్యమితసమస్తభూతముల నాత్మ సృజింప నవన్నియున్ యథా
గ్రహమున వృద్ధి బొందక నిరర్థములై చనఁ జింతనొంది ది
వ్యమహిమ మైథునక్రియ ప్రజాళి సృజింపఁగ నిశ్చితాత్ముఁడై.

494


క.

వీరణుఁ డనెడు ప్రజాపతి, గారాబుతనూజ పుణ్యకలిత నశిక్నిం
గోరిక పెండిలియై కడు, కూరిమి నతఁ డైదువేలకొడుకులఁ గాంచెన్.

495


క.

వారలకడ కల్లనఁ జని, నారదుఁ డిట్లనియె ప్రియము నయమునఁ గదురన్
మీరలు ప్రజల సృజించెడి, వారా కడగనరు వెఱ్ఱివారలు తలఁపన్.

496


చ.

భువికడ యేమి గంటిరి, నభోవివరం బది యెంత దిక్కు లె
ట్టివి యడు గెంత యన్నియు కడింది యెఱుంగఁగ మీర లందఱున్

జవమునఁ బోయి వీనికడ చక్కగఁ గాంచి, యనంతరంబ ప్రా
భవము దలిర్పగాఁ బ్రజలఁ బన్పడఁ గాంచుడు పొండు నావుడున్.

497


క.

హర్యశ్వనాము లాగుణ, ధుర్యులు నలుదిక్కులకును దోడ్తో పౌర్వా
పర్య మెఱుంగక పోయి, యవార్యతనం దడగి రబ్ధివాహినులగతిన్.

498


క.

అందఱు జనినఁ బ్రచేతో, నందనుఁ డప్పటియుసుతుల నయగుణతేజ
స్సందీప్తుల గనె పరమా, నందుల వెయ్యంటి వీరణతనుజయందున్.

499


ఉ.

అప్పటి వచ్చి దేవముని యాశబలాశ్వులఁ జూచి యిట్లనున్
తప్పక యన్న లేగినపథంబున మీరును బోయి వారిలా
గప్పుడు గాంచి భూమికడ యారసివచ్చి ప్రజన్ సృజింపుఁ డీ
చొప్పున నన్న నన్నల, వసుంధరఁ జూడఁగఁబోయి రందఱున్.

500


ఆ.

పోయి జలధి సొచ్చి పోయిననదులట్ల, తిరుగరైరి యెపుడు ధరణియందు
భ్రాత లరుగ వెదుక పనివడిపోయిన, వారు మరలరారు వారియట్ల.

501


ఉ.

నందను లిట్లు క్రమ్మర వినాశమునందుట చూచి మారిషా
నందనుఁ డెంతయున్ గనలి నారదు శాపమహాబ్ధి ముంచి పెం
పొంద నశిక్నియందు గనె నుగ్మలులన్ దగ నర్వదింటి న
య్యిందునిభాననామణుల నిచ్చె బ్రసిద్ధులకున్ గ్రమంబునన్.

502


వ.

ధర్మునకుం బదుండ్రను, కశ్యపునకున్ పదమువ్వురను, చంద్రునకు నిర్వదేడ్వు
రను, అరిష్టనేమికి నలువురను, బహుపుత్రునకు నిధ్దఱను అంగిరునకు నిద్దఱను,
కృశాశ్వునకు నిద్దఱను నిచ్చె నందు ధర్మునిపత్నులు, అరుంధతి, వసువు, జామి,
లంబ, భాను, మరుత్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ అనుపదుండ్రు.
అందు విశ్వకు విశ్వదేవతలు, సాధ్యకు సాధ్యులు, అరుంధతికి మరుత్వంతులు,
వసువుకు వసువులు, ముహూర్తకు ముహూర్తజులు, లంబకు ఘోషుండును,
జామికి నాగవిధియు, మరుత్వతికి పృథివివిషయంబైన సర్వంబును, సంకల్పకు
సర్వాత్మకుండైన సంకల్పుండును, జ్యోతికి పురోగములైన యనేకసహస్ర
దేవతలునుఁ బుట్టిరి. వసుపుత్రులైన యష్టవసువుల నామంబులం జెప్పెద.
అప, ధ్రువ, సోమ, ధర్మ, అనిల, అనల ప్రత్యూష, ప్రభాసులనం బరగుదురు
అందు అపునకు వైతథ్య, శమ, శాంతనయులునుం బుట్టిరి ధ్రువునకు కాలకలన
కారియు భగవంతుండు నగు కాలుండు పుట్టె. సోమునకు భగవంతుండైన
వర్చుండు, వర్చునకు వర్చస్వియుం బుట్టిరి. ధర్మునకు మనోహరయందు ప్రవీ
ణుండును, హుతహవ్యుండును, శిశిరుండును, ప్రాణుండును, వరుణుండునుం బుట్టిరి

శివయందు మనోజవుండును, అవిజ్ఞాతగతియునుం బుట్టిరి. అనలునకు కుమా
రుండు శరస్తంబంబునఁ బుట్టె. అతనికి శాఖ విశాఖ మేష పృష్ఠజులు పుట్టిరి.
అతండు కృత్తికలకు నపత్యుండై కార్తికేయుం డనం బరగు. ప్రత్యూషునకు
ఋషియైన దేవలుండు పుట్టె. దేవలునకు మావంతులును, మనీషులు నగు
పుత్రు లిరువురు పుట్టిరి.

503


క.

సల్లలితగుణ బృహస్పతి, చెల్లెలు యోగప్రసిద్ధ చిరకాలము తా
నిల్లోకమెల్ల దిరిగె స, ముల్లసితబ్రహ్మచర్యయోగము వెలయన్.

504


వ.

అక్కాంత అష్టమవసువగు ప్రభావసువునకు భార్య యయ్యె. వారిద్దఱికి ప్రజా
పతియు, దేవవర్ధకియునైన విశ్వకర్మ పుట్టె. అతని శిల్పనైపుణంబుననకదా
దేవసంఘంబునకు దివ్యవిమానదివ్యభూషణాదులు కలిగె. మనుష్యులును
అతనిశిల్పంబునన నుపజీవింతురు. అజ, ఏకపాప, అహిర్బుధ్న, త్వష్ట, రుద్రులన
నతనికి పుత్రులు గలిగిరి. త్వష్టకు విశ్వరూపుఁడను కుమారుండును గలిగె. మరియు
హరుండును, బహురూపకుండు, త్ర్యంబకుండు, అపరాజితుండు, వృషాకపి, శం
భుడు, కపర్ది, రైవతుడు, మృగవ్యాధుండు, శర్వుండు, కపాలి యన నేకాదశ
రుద్రులు గల్గిరి. వారలకు శకుండు శ్వేతుండు సమాకూతుండును గల్గిరి.

505


గీ.

ఘనతపోనిధి కశ్యపమునికి భార్య, లనఘ మూర్తులు పదుమువ్వు రైరి యదితి
యాదిగాఁ గల వికచపద్మాయతాక్షు, లతులితపతివ్రతాగుణాభ్యధికమతులు.

506


వ.

వార లదితియు, దితియు, దనువు, అరిష్ట, సురస, ఖష, సురభి, వినత, తామ్ర, క్రోధ,
వశ, ఇల, కద్రు, మునియు నన వెలయుదురు.

507


గీ.

మనువు చాక్షుషుఁడై యుండ మహితమతులు, భూనుతఖ్యాతి పన్నిద్దరైన తుషితు
లదితికడుపున నాదిత్యు లనఁగ బుట్టి, రనఘ వైవస్వతాఖ్యమన్వంతరమున.

508


వ.

వారలు విష్ణుండును, శక్రుండును, అర్యముండును, ధాతయు, త్వష్టయు,
పూషయు, వివస్వంతుండును, సవితృండును, మిత్రావరుణుండును, అంశుండును,
భగుండును, అవితేజుండును అనుద్వాదశాదిత్యులు. అరిష్టనేమిపత్నులకుఁ
బదియాఱుగురు తనూజు లుదయించిరి. బహుపుత్రునకు విద్యుత్సంజ్ఞ గల పుత్రి
కలు నలుగురు కలిగిరి. ప్రత్యంగిరునకు ఋక్సంజ్ఞ గల బ్రహ్మఋషిసత్తములు జనిం
చిరి. కృశాశ్వునకుఁ బ్రహరణసంజ్ఞ గల పుత్రులు పుట్టిరి. వీరలకుఁ బ్రతియుగ
సహస్రాంతంబునందును సూర్యునకుఁ బ్రతిదివసంబునందు నుదయాస్తమయ
ములు కలుగున ట్లుత్పిత్తినిరోధంబులు గలుగుచుండు.

509


క.

దితికిని కశ్యపమౌనికి, సుతులిద్దఱు గలిగి రధికశూరులు సమిదూ
ర్జితుఁడు హిరణ్యాక్షుండును, క్రతుభుగ్జైత్రుఁడు హిరణ్యకశిపుం డనఁగన్.

510

గీ.

సింహికాభిధాన చెలియలు వారికి వెలఁదియొకతె గలిగె విప్రచిత్తి
యనెడిదైత్యపతికి వనితగా నిచ్చిన ప్రీతి నతఁడు దగఁ బరిగ్రహించె.

511


వ.

ఆహిరణ్యకశిపునకు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాద, సంహ్లాదులన నలుగురుపుత్రులు
వారిలోన.

512


క.

సమదర్శనుఁడు మహాత్ముం, డమలయశోనిధి గుణాఢ్యుఁడగు ప్రహ్లాదుం
డమితైకభక్తి నిలిపెన్, కమలాక్షునియందు నన్యకామరహితుఁడై.

513


సీ.

చల్లనై యుండె వైశ్వానరుఁ డంభోధి, మీఁగాలిబంటియై మీఱదయ్యె
శస్త్రాస్త్రజాలముల్ శకలీకృతము లయ్యె, విషధరదంష్ట్రిక ల్విఱిగిపోయె
పూబంతులై తాకె భూధరఘాతముల్, హంసతూలపుపాను పయ్యె ధరణి
మలయమారుత మయ్యె ప్రళయజంఝూనిలం బిభదంతములు పువ్వుటెత్తు లయ్యె


గీ.

విషము సుధ, కృత్య దాసియు వివిధ మాయ, లెల్ల మంచుగములు నయ్యె నిందిరాస
హాయుఁ దలఁచుచునున్న ప్రహ్లాదునకును, దండ్రి ఘనరోషభీషణోద్ధతి ఘటింప.

514


మ.

అనమైత్రేయుఁడు కేలుదోయి నిజఫాలాంతంబునం గూర్చి యి
ట్లను నోశక్తికుమార! పంకజదళాక్షాంఘ్రిద్వయీచింతనా
భినుతానందను నందనుం జనకుఁ డప్రేమాత్ముఁడై యేల యి
ట్లనిమి త్తంబుగ నొంచఁ బంచె నిది యాద్యంతంబునుం జెప్పవే.

515


క.

అనినఁ బరాశరముని యా, ఘనుఁ గని యను మును హిరణ్యకశిపుఁడు తప మ
త్యనుపమగతి మందరనగ, మునఁ జేసె దృఢప్రయత్నమున నిశ్చలుఁడై.

516


ఉ.

అక్కజమైనతత్తప ముదగ్రతఁ జూప విరించి యంచపై
వాక్కలకంఠిఁ గూడి యటు వచ్చి వియచ్చరు లెల్లఁ జూడఁగా
రక్కసుఁ డిచ్చఁ గోరిన వరంబు లొసంగి చనన్ దపోమదం
బెక్కి జగత్రయంబు నతఁ డేలె సురాసురమర్త్యజైత్రుఁడై.

517


సీ.

ఇంద్రుడై సురకోటి నేలు పావకమూర్తి, యయి కయికొను కవ్యహవ్యతతులు
దండియై ప్రాణుల దండించు కోణేశుఁడై, యాతుధానుల నాక్రమించు
యాదోధినాథుఁడై యాదోగణము నొంచు, పవనుఁడై వడకించు భువనచయము
ధనపతియై సర్వధనములు హరియించు, రుద్రుఁడై ద్రుగనలార్చులు నిగుడ్చు


గీ.

తపనుఁడై దుస్సహోగ్రసంతాప మొసఁగు, సోముఁడై భూమి నించు నుద్దామమహిమ
మేఘమై వర్షధారాసమృద్ధిఁ జూపు, ద్రుహిణవరమత్తుఁ డాజగద్ద్రోహి యసుర.

518


క.

సురలెల్ల బంట్లుగా న, చ్చరలెల్లం జేటికలుగ సకలధరిత్రీ
నరులెల్ల భక్ష్యములుగా, హిరణ్యకశిపుఁ డెల్లజగము లేలె బలియుఁడై.

519

మ.

కనదభ్రంకషరత్నసౌధములలోఁ గాంతాసహస్రంబుతో
ననిశంబున్ శశికాంతకాంతకలశీహాలారసం బాని య
త్యనుషక్తోన్మదఘూర్ణితాక్షియుగకోణాత్యుగ్రరోచుల్ జగ
జ్జనసంత్రాస మొనర్ప నేలె నతఁడుచ్చైఃకీర్తి లోకంబులన్.

520


క.

వరమతి యాప్రహ్లాదుఁడు, పరిపాటిం జదివె బాలపాఠ్యంబులు ని
ర్భరహరిభక్తిపరుండై, గురుకులమున దైత్యబాలకులతోఁగూడన్.

521


క.

ఒకనాఁడు గురులతో, న య్యకలంకుఁడు తండ్రికడకు నరిగి తదీయాం
ఘ్రికమలముల కెఱగిన యతి, వికచముఖుం డగుచు సుతుని వినతున్ బలికెన్.

522


ఉ.

పాపఁడ నీవు సద్గురుకృపన్ బరిపాటి గ్రహించినట్టి వి
ద్యాపటిమం బెఱుంగ మది హర్షము పుట్టె పఠించుమయ్య భూ
విూపతి నీతిశాస్త్రము లమేయము లౌఁ గద వానిలోన నీ
వేపున నేప్రసంగములు హెచ్చని మెచ్చెద వందు సారముల్.

523


వ.

అనిన ప్రహ్లాదుం డిట్లనియె.

524


గీ.

అచ్యుతు ననాదిమధ్యాంతు నజు మహాత్ము, నప్రమేయు నవృద్ధిక్షయాత్ము సర్వ
కారణములకు సారమౌ కారణంబు, నాత్మ నిడి మ్రొక్కి కొలుతు నిరంతరంబు.

525


చ.

అన విని కోపవహ్ని నయనాంతముల న్వెడలంగ దైత్యుఁ డి
ట్లను గురుమోము చూచి యధమాధమ విప్ర విపక్షసంస్తుతుల్
తనయున కిట్లు చెప్పితి వుదగ్రమదీయమహాభుజార్గళా
త్యనుపమశౌర్యసారము నిరర్థము చేసి విమూఢవర్తనన్.

526


వ.

అనిన గురుం డిట్లనియె.

527


క.

కోపింపకు దైత్యేశ్వర, మాపాళముగాఁడు నీకుమారుఁడు ఘనవి
ద్యాపాటవకలితునిక్రియ, మాపాఠము చదువఁ డోమిమాయయొ తలఁపన్.

528


క.

అవిమర్శనమున శత్రుస్తవకథ నీతనయునకుఁ బ్రధానత్వమునన్
వివరింప లాతివారమె, భవదీయాశ్రితుల మింతపని సేయుదుమే.

529


క.

మాచెప్పినట్టి చదువుల, రోచకములు నీసుతునకు రుచియింపవు తా
వాచోయుక్తిత్వంబున, వాచించున్ బెక్కులైన వాచప్రౌఢుల్.

530


వ.

అని పలుకు గురునివచనంబులు విని హిరణ్యకశిపుండు ప్రహ్లాదున కి ట్లనియె.

531


క.

గురువు లెఱుంగక యుండన్, పరిపంథిస్తవము నీకుఁ బాఠ్యముగా నె
వ్వరు చెప్పిరి చెప్పుము నా, కరుదుగ శాసింతు వారి నందఱు చూడన్.

532

వ.

అనిన ప్రహ్లాదుండు తండ్రి కి ట్లనియె.

533


గీ.

సకలజంతువులకు శాస్తయై పరమాత్మ, విష్ణుఁ డెపుడు హృదయవీథి నుండు
నతఁడు దప్ప జనుని కన్యుఁ డెవ్వండు శా, సకుఁడు కలఁడు దైత్యచంద్ర చెపుమ.

534


క.

అనుటయు దైత్యేశ్వరుఁ డి, ట్లను విష్ణుఁ డనంగ నెవ్వఁ డఖిలంబున కే
నొనరంగ నీశ్వరుండన్, నను మిగిలినవాఁడు గలిగినన్ జెప్పు మిలన్.

535


వ.

అనిన ప్రహ్లాదుం డిట్లనియె.

536


క.

యోగిధ్యేయ మదృశ్యం, బేగుణనిధిపరమపదము హెచ్చౌజగదా
భోగం బేవిభుకృతిచే, వేగున్ పరమేశుఁ డతఁడు విష్ణుఁడు తండ్రీ!

537


వ.

అనిన విని దైత్యేంద్రుం డిట్లనియె.

538


ఉ.

ఈవెడమాట లేల పరమేశ్వరుఁ డెవ్వఁడు నాకు మిక్కి లీ
భూవలయంబునన్ ముగిసిపోఁదలవెత్తిన నీకు నీశ్వరుం
డై వెలుగొందువాఁడు చపలాత్మక యెక్కడ నుండు వాఁడు వా
చావితథత్వ మేర్పడ నిజంబుగ నాకు నెఱుంగఁ జెప్పరా.

539


వ.

అనుటయు ప్రహ్లాదుండు

540


ఉ.

నామది నేల నీతలపునన్ భువనంబుల నిండియుండి ల
క్ష్మీమహిళామనోహరుఁ డమేయుఁడు సర్వగతుండు నిత్యకృ
త్యామితసర్వచేష్టితములందు నియుక్తులఁ జేయు నిట్టిచో
తా మొనరించినా మనుట తథ్యమె రాక్షసలోకనాయకా

541


వ.

అనుటయు.

542


గీ.

వెడలఁద్రోయుఁడు వీని నివ్వేళ గురుని, శిక్ష నిఁకనైన సద్బుద్ధి చేరునేమొ
శత్రుపక్షస్తవంబులు చదువు మనుచు, వీని నెవ్వరో వెఱ్ఱి తవ్వించినారు.

543


క.

అనునెడ దానవభటు ల, య్యనఘునిఁ దోడ్కొనుచు గురునియాలయమునకున్
చనుదెంచి రచటఁ జదివెన్, వినుతమహామహిమ నిఖిలవిద్యలు వరుసన్

544


మ.

మనుజాధీశ్వరుఁ డొక్కనాఁడు నవరత్నస్తంభశుంభద్విభా
ఘనసౌధాగ్రమునన్ మణీఖచితయోగ్యప్రస్ఫురత్పీఠిపై
నను వొంద న్వసియించి కొ ల్వొసఁగి దివ్యద్రాజసం బొప్పఁగాఁ
దను రప్పించి పఠించు శాస్త్ర మడుగన్ దైత్యార్భకుం డిట్లనున్.

545


క.

పురుషుండు ప్రకృతియును నీ, చరాచరాత్మకము నైనజగములు నగునే
పరమాత్మువలన నాశ్రీ, హరి మాకుఁ బ్రసన్నహృదయుఁ డయ్యెడు మనినన్.

546

గీ.

దుష్టు వీనిఁ బట్టి ద్రుంపుఁడు జీవించె, నేని వీనివలన నేమి కలదు
అరయఁగా స్వపక్షహానికర్తృత్వంబు, కతన వీఁడు కులము కాల్పఁగలఁడు.

547


సీ.

అని యాజ్ఞ యిచ్చిన నసురులు నాయుధ, హస్తులై కవిసిన నక్కుమారుఁ
డస్త్రంబులందు మీయందును నాయందు, వివరించి చూడ శ్రీకృష్ణుఁ డుండు
నీసత్యమున విూర లెత్తిన కైదువుల్, నను సోకకుండెడు మనిన వారు
నానాస్త్రముల నొంప మేనింతయును నొవ్వ, కంతకంతకుఁ దేజ మధికమైన


గీ.

రాక్షసాధీశ్వరుండు పుత్రకునిఁ జూచి, యోరి దుర్బుద్ధికాన! నీయోజ మాను
మభయ మిచ్చెద నీకు నిరర్ధకంబు, చావ నేటికి రిపుకథల్ పోవనిమ్ము.

548


వ.

అనిన ప్రహ్లాదుఁ డిట్లనియె.

549


చ.

సకలభయాపహారియగు చక్రి మనంబున నున్నవాఁడు నా
కొకభయమైన లేదు భయ మొందినచో నభయంబు గాక యూ
రక యభయం బొసంగుట నిరర్ధక మింతియె కాదు సర్వబా
ధకభవమండలీభయము తప్పును దండ్రి! హరిం దలంచినన్.

550


వ.

అనుటయు.

551


శా.

రక్షోనాథుఁడు తక్షకప్రభృతిదుర్దాంతాహులం జూచి రూ
క్షాక్షీక్షాతతి నిప్పు లొల్క నను, నీయజ్ఞున్ దురాచారు శ
త్రుక్షేమంకరు నందనుం డనక మీదుర్వారదంష్ట్రావిష
ప్రక్షేపంబున నీఱు చేయుఁ డన నుగ్రక్రూరరూపంబులన్.

552


చ.

భుగభుగమ న్విషాగ్నులు నభోవివరంబున నిండ ఫూత్కృతి
ప్రగుణమరుత్పరంపరత రాయిడివారిదముల్చలింప తీ
వ్రగతి భుజంగము ల్గఱవ గ్రక్కున దంష్ట్రలు నుగ్గులయ్యె న
య్యగణితసద్గుణాకరునియంగము సోకినయంత వింతగన్.

553


గీ.

హరిపదాంభోజచింత దేవారిసూనుఁ, డింతయైనను విషపీడ యెఱుఁగఁడయ్యె
అది గనుంగొని యపుడు సర్పాధినాథు, లనిరి తలవంచుకొని సిగ్గు లినుమడింప.

554


తుమురయ్యె దంష్ట్రికలు, రత్నములెల్లం బగిలె రక్తధారలు ఫణసం
ఘములం దొఱఁగెన్ హృత్కం, పము పుట్జెన్ మాకు నతనిపజ్జకుఁ బోవన్.

555


గీ.

తీవ్రదంష్ట్రలు నాటి తదీయచర్మ, మించు కేనియు భేదిల దేమి చెప్ప
మాకు చెఱుప నశక్య మీమాణవకుని, పనుపు మేదైన నింకొక్కపనికి మమ్ము.

556


స్రగ్ధర.

అనినన్ రోషాగ్నికీలవ్యతికరభయదోగ్రాక్షివీక్షీప్రభావం
బున దిక్కు ల్మండ చండాద్భుతరవ మెసఁగన్ బూని దిఙ్నాగకోటిన్

బనిచెన్ దైత్యేశ్వరుం డర్భకునిఁ బొడువ శుంభద్గతిన్ దద్గజంబుల్
ఘనఘీంకారారవం బగ్గలముగఁ జని జాగ్రత్వరం బిట్టుముట్టెన్.

557


సీ.

కులిశఘోరవిషాణకోటిఘట్టన నేలఁ గూలఁగాఁ బడఁద్రోసి కుమ్మికుమ్మి
దండధరోద్దండదండప్రచండగుం, డాకాండనిహతుల నలిచినలిచి
గిరిపాదసదృశనిష్ఠురపాదతలమహా, ప్రక్షేపములఁ ద్రొక్కి రాచిరాచి
సకరకాసారవర్షనిభముక్తాయుక్త, సాంద్రోరువమధువుల్ చల్లిచల్లి


గీ.

వినుతగోవిందచరణారవిందమాక, రందరసపానహర్షనిర్భరుని నతని
చెఱుపఁజాలక దంతము ల్విఱిగి రక్త, పూర మూరంగ దిగ్గజంబులు దొలంగె.

558


వ.

అప్పుడు తండ్రికిఁ గొడు కిట్లనియె.

559


ఉ.

కొమ్ములు వీలి దిక్కరటికోటి మందంబఱి పోక నాదు స
త్వమ్మునఁ గాదు హైమపరిధానపదాంబుజచింతనప్రభా
వమ్మునఁ జుమ్ము భక్తజనవత్సలుఁ డంబుజనేత్రుఁ డాశ్రితా
ఘమ్ముల వమ్ము చేయుట జగమ్ముల వింతయె తండ్రి చెప్పుమా.

560


వ.

అని ప్రహ్లాదుండు పలికిన నాక్షేపించి రక్షోవల్లభుండు నిజబలాధ్యక్షులం జూచి
యిట్లనియె.

561


ఉ.

తీర్చగరాని వైర మిదె తెచ్చె దురాత్ముఁడు వీనిఁ గాష్టముల్
పేర్చి దహింపుఁ డీక్షణమ భీషణరోషమునం దనూనపా
దర్చులు గీలుకొల్పి యన నప్పుడ రక్కసు లక్కుమారుపై
పేర్చినయల్కనట్ల యతిభీకరవృత్తి నొనర్చి రార్చుచున్.

562


శా.

ఆదుర్వారమహాగ్నికీలములలో సామోదుఁడై యుండి ప్ర
హ్లాదుం డిట్లను దండ్రిఁ జూచి పరికీర్ణాంభోజకాసారమై
నాదేహంబున కీమహాగ్నిశిఖ లానందంబు నొందించె నా
శ్రీదేవీపతీ మానసాబ్జమున సుశ్రీయుక్తుఁడై యుండుటన్.

563


క.

అనునెడ దైత్యపురోహితు, లనునయవచనముల విభుని నని రిబ్బాలుం
డనుదితవివేకపాకుం, డనుకంప్యుఁడు గాక దండనార్హుఁడె తలఁపన్

564


క.

బాల్యము దుష్టగుణచాం, చల్యైకాస్పదము బుద్ధి జడిమాహిత దౌ
ర్బల్యఘనలౌల్య మిది సా, కల్యము గాఁబోక బుద్ధి కలుగునె చెపుమా.

565


క.

హెచ్చగు నీకోపంబు, వియచ్చరపతిమీఁదఁ జూపనగు నర్హంబే
యిచ్చిఱుతవానిపై నిది, పిచ్చుకపై బ్రహ్మశరము పృథులవిచారా.

566

క.

చదివించెద మీబాల్యము, వదులున్ బరిపాటి నగ్నివలనఁ గూమారుం
వదులుము మాప్రార్థనమున, నిదియే పదివేలు చనవు లిచ్చుట మాకున్.

567


గీ.

వినుము దైతేంద్ర మామాట వినక యితఁడు, శత్రుపక్షంబుఁ బట్టినచందమైన
నగ్నిముఖమునను కృత్యను సృజింతు, మంతట నడంగు నీతనిగంతులెల్ల.

568


మ.

అని దైత్యేంద్రుని సమ్మతించి ఘనకీలాభీలవన్యంతరం
బునఁ బద్మారమణీమనోహరపదాంభోజద్వయధ్యానసం
జనితానందసుధాబ్ధిమగ్నుఁ డయి రాజత్కాంతితో నున్న యీ
ఘనునిం దోడ్కొని తెచ్చి రింటికి సమగ్రప్రేములై భార్గవుల్

569


గీ.

గురులు పాఠము చెప్పి నిర్భరత స్వప్ర, యోజనములకుఁ బోవ నారాజపుత్రుఁ
డాదరమున సహశ్రోతలైన దైత్య, బాలకులఁ జేరఁబిలిచి యేర్పడఁగఁ బలికె.

570


సీ.

వినుఁడు దైతేయనందనులార పరమార్ధ, మెఱిఁగింతు నే మీర లితరమైన
దైవంబు నాత్మలోఁ దలఁపక శ్రీహరిఁ, గలుషవినాశనుం గొలిచి మనుఁడు
జననకౌమారయౌవనజరామరణముల్, క్రమమునఁ బ్రాపించు ప్రాణు లెల్ల
నిది మీరు మేమును నెఱిఁగినదేకదా, మృతుఁడైన జన్మంబుమీఁద నిజము


గీ.

గర్భవాసపునర్జన్మగతులు తొంటి, కైవడినె గల్గు నివియ దుఃఖములు కావె
చోద్య మిది దుఃఖశాంతులు సుఖము లనుచు, తలఁచుకొందురు మూఢులు తామసమున.

571


క.

వాతాదినిశ్చలాంగకు, లై తగువ్యాయామసుఖము నర్ధించెడి రో
గాతురులు ప్రహారములున్, జూతురు సుఖ మనుచు నదియు సుఖమే తలఁపన్.

572


క.

అక్కట మాంసశ్లేష్మా, సృక్కలితంబైన దేహ మిది యెక్కడ స
మ్యక్కాంతిసౌరభాదిక, మెక్కడ నివియెల్ల వట్టియెమ్మెలు తలఁపన్.

573


ఉ.

హేయపుతోలు మాంసమును నెమ్ములు నెత్తురు చీము మజ్జయున్
స్నాయుపురీషమూత్రములు సంఘముఁ గూడిన దేహ మిందుపై
రోయక ప్రేమచేసిన నరుండు మనంబున రోయనేర్చునే
ఈయెడఁ గానిపించని యనిష్టమహానరకప్రపంచమున్.

574


గీ.

ఎన్ని యిష్టపదార్థము లిచ్చగించు, నన్నియును వానిహృదయమధ్యమున నధిక
శోకశంకువులై నాటుఁ జోద్యలీల, నెన్ని చూచిన సుఖము లే దెందునైన.

575


సీ.

ఏయేపదార్థంబు లింటిలోపల నుండు, నవి యన్నియును దనయాత్మ నుండు
ఎచ్చటికైనను నేగిన నాయాశ, దాహోపకరణంబు తనకుఁ జువ్వె
జన్మదుఃఖంబు దుస్సహ మంతకన్నను, మరణదుఃఖం బతిమాత్ర మరయ
యమునియగ్రమునందు యాతనాదుఃఖంబు, గర్భసంక్రమణదుఃఖంబు గర్భ

గీ.

వాసదుఃఖంబు చెప్పఁ గావచ్చు నెట్లు, జగము దుఃఖమయంబ యీచంద మెఱిగి
బహుళదుఃఖాస్పదీభూతభవసముద్ర, తారకుని శ్రీవధూనాథుఁ దలపఁవలయు.

576


ఉ.

దేహములందు శాశ్వతుఁడు దేహి, వినుండు కుమారులార! సం
దేహము లేదు, దీనియెడఁ దెల్లము బాల్యజరాదిధర్మముల్
దేహముఁ జుట్టిముట్టికొను దేహికి లేవని మీరు నాత్మ స
మ్మోహము మాని దీనివిధముఁ దెలియందగు నప్రమత్తులై

577


సీ.

అనువు గా దిపుడు బాల్యావస్థ మీఁదట, నాచరింతుము యౌవనాగమమున
యౌవనోదయమైన నంగీకరింతము, ప్రౌఢనిర్భరవయఃపాకమునను
ప్రౌఢత్వమైన వార్థకమునఁ గావింతు, మవ్వేళ యొకపనియైన లేదు
వార్ధకంబైన దుర్వారరుజాదికసంగతి పొంగుడువంగు డగుచు


గీ.

చిత్తము చలించి పరలోకచింత లేక, తనువు దిగనాడి తీవ్రయాతనల వేఁగి
మగుడ జనించి యీరీతి మఱుఁగుగాని, జనుఁడు శ్రేయఃప్రయత్నంబు గనఁగ లేఁడు.

578


క.

ఆటలబాల్యము, మగువల, కూటమ్ముల యౌవనమ్ము, గురుతరరోగ
స్ఫోటనవార్ధకముం జను, చో టే దీపరము తేర చూడఁగనైనన్.

579


క.

కావున బాల్యమునన, లక్ష్మీవనితావిభుని భక్తమిత్రుని ముక్తి
శ్రీవిభవదాయిఁ గొలువన్, గావలయు న్మనము మనము గట్టై యుండన్.

580


గీ.

అఖిలశోభనములె గల్గు నాక్షణంబె, వివిధపాపతమోరాశి విరిసిపోవు
లేశ మైనను నలయిక లేదు నరుఁడు, హరి దలంపంగవలయు నహర్నిశంబు.

581


చ.

అనయము సర్వభూతగతుఁడై కడునెచ్చెలియైన పద్మలో
చనుపయి బుద్ధిఁ జేర్చి విలసన్మతితో వసియింతురేని మీ
రనుపమలీల క్లేశముల నన్నిటఁ బాసి సుఖోత్తరాకృతిన్
బనుపడుమోక్షలక్ష్మి సులభస్థితి గాంచెద రశ్రమంబునన్.

582


క.

పేర్చినతాపత్రయదహ, నార్చులచే వేఁగి శోచ్యులగు ప్రాణులపై
నేర్చునె ద్వేషింపఁగ జగ, దర్చితుఁడగు ప్రాజ్ఞుఁ డెట్టియనువున నైనన్.

583


వ.

కావున సర్వహానికరంబగు ద్వేషంబు విడిచి జగంబు సర్వభూతమయుండగు
శ్రీవిష్ణునిరూపం బని చూడవలయు. మనమందఱము నాసురభావంబు వదలి
శ్రీకేశవునియందు మనంబు చేర్చి యనలార్కేందుపవనులచేతను, బర్జన్య
వరుణ రాక్షన, యక్ష, దైత్య, దానవోరగ, కిన్నరులచేతను, మనుష్యపశుసం
ఘంబులచేతను, నాత్మసంభవదోషంబులచేతను, జ్వరాదిరోగంబులచేతను,

ద్వేషేర్ష్యాసూయామత్సరంబులచేతను, రాగలోభాదులచేతను, క్షయంబు
నొందింప శక్యంబుగాని పరమనిర్వాణసుఖంబు నొందవలయును. అపారసం
సారవివర్తనంబుల శోషింపక నావచనంబులు చేపట్టి యచ్యుతారాధనంబైన
సమత్వంబు నొందుడు. సమత్వంబున నారాధితుండై లక్ష్మీవల్లభుండు ప్రసన్నుం
డైన నల్పంబులైన ధర్మార్థకామంబు లెంత. దుర్లభంబైన మోక్షపథంబు
కలుగు. కావున నప్రమత్తులై శ్రీపురుషోత్తము నాశ్రయించుఁడని దైత్య
కుమారుల బోధించు ప్రహ్లాదునిచేష్ట లెఱింగి భయంబున దానవు లావృత్తాం
తంబు హిరణ్యకశిపునకుం జెప్పిన.

584


ఉ.

బాలునిమీఁద రెచ్చి యడబాలల బిల్వఁగనంపి దైత్యరా
ట్పాలుఁడు వల్కు వీనిఁ గులపాంసను శాత్రవపక్షపాతి దు
శ్శీలునిఁ జంపఁగావలయు శీఘ్రమ భోజ్యములందు దుర్దమ
క్ష్వేళము వెట్టి భోజనము సేయఁగఁ బెట్టుఁడు వీని కిమ్ములన్.

585


వ.

అని యాజ్ఞాపించిన.

586


క.

సూదగణం బపు డాప్ర, హ్లాదునకు న్విషము వెట్ట నతఁ డన్నముతో
మోదమునఁ గుడిచి దైత్యని, షూదనునిం దలఁపనదియు సులభత నరిగెన్.

587


క.

దితిజేశ్వరుఁ డాత్మపురోహితుల న్వేగమునఁ బిలిచి హింసింపుఁడు మీ
రితని నతిభయదకృత్యా, హతి నుద్ధతి ననిన వారు నతిరోషమునన్.

588


చ.

సురపరిపంథి భార్గవులఁ జూచి విపక్షసపక్షు వీని ను
ద్ధురతరకృత్య జేఁసి త్వరతో వధియింపుఁ డటన్న వారు న
ప్పురుషవరేణ్యుఁ డున్నెడకుఁ బోయి నృపాలకుమార మేము మీ
గురువుల మేమి చెప్పినను గోరిక నీవును జేయఁగాఁదగున్.

589


ఉ.

పాపఁడ లోకపూజ్యమగు బ్రహ్మకులమ్మునఁ బుట్టినావు శౌ
ర్యాపరమేయసాహసబలాఢ్యుఁడు తండ్రి జగంబు లేలు నీ
వాపగిదిన్ గుణాకరుఁడవై మముఁ బ్రోచెదవంచు నున్న సం
తాపముఁ దెచ్చి శాత్రవకథావితథాభినివేశ మింతటన్.

590


చ.

పరమగురుండు తండ్రియని పల్కఁగఁ దద్వచనంబు మీరినన్
పరము నిహంబునుం గలదె బాలక యేల కలంక తెచ్చె దీ
పరకథ మాని మానితశుభస్థితి నొందు మనంతుఁ డేల యె
వ్వరు నిఁక నేల తండ్రియ ధ్రువంబగు దైవ మెఱుంగ నేర్చినన్.

591

చ.

అన విని నమ్రుఁడై పలుకు నయ్యసురేంద్రకుమారుఁ డిట్లు మీ
రనయము నానతిచ్చిన వచోర్ధము గాదనవచ్చునయ్య, మ
జ్జనకుఁడు పూజ్యుఁ డౌట నిది సంశయమయ్య, గురూక్తి మీరరా
దనుట యెఱుంగనయ్య, విననయ్య భవద్వచనేరితార్థముల్.

592


క.

గురుల నలరింతుఁ, దండ్రికిఁ బరిచర్య యొనర్తుఁ గాని, భ్రాంతుఁడనై బం
ధురధర్మమార్గగమనాతర మేమఱియుండ నెవ్విధంబుననైనన్.

593


చ.

భళిభళి మంచివాక్యములె పల్కితి రిప్పు డనంతుఁ డేలయం
చలుగకుఁడయ్య మీకుఁ గడునల్పతరంబు వివేక మేమి గాఁ
దలఁచి పఠించినారు వితతశ్రుతిశాస్త్రచయం బదంతయున్
బలుమఱు నయ్యనంతునిప్రభావము లెంచి వచింపదేమొకో

594


సీ.

మనసు ఖేదము మాని వినరయ్య పురుషార్థసమితి యెవ్వరినుండి సంభవించె
ధర్యార్థులు మరీచిదక్షాదు లెవ్వరియనుకంపధర్మంబు లధిగమించి
రిష్టార్థ కామేప్సు లింద్రాదు లెవ్వరికరుణతత్ప్రాప్తులు గాంచి మించి
రనుపమధ్యానయోగాఢ్యులై సనకాదు లెవ్వరిదయ మోక్ష మెఱిఁగికొనిరి


గీ.

అట్టిజగదంతరాత్ముఁ డనంతుఁ డేమిపనికి వచ్చునటంచు దుర్భాషలాడ
చనునె భార్గవవంశసంజాతులైన మీకు రాక్షసభావంబు మీఱుచుండ.

595


వ.

అన విని మండిపడి పురోహితు లిట్లనిరి.

596


గీ.

మండిపోవకుండ మంటలో వెడలించి తెచ్చు టెల్ల మఱచి పెచ్చు పెఱిగి
ప్రేలె దీవు నిన్ను భీకరకృత్యచే నుక్కడంప నిచట దిక్కు గలదె.

597


వ.

అని రాసమయంబున.

598


సీ.

అమరవిద్వేషి తీవ్రాటోపమునఁ దమ్ముఁ బనుప భార్గవులు తపస్సమృద్ధి
కృత్యఁ బుట్టించి లాగించిన నది నిప్పు లురులఁ బెన్మిడిగ్రుడ్లు మెఱగుకోర
లాలోలజిహ్వ ఘోరానలజ్వాల కరాళవిజృంభితాభీలవక్త్ర
మతిదుస్సహాట్టహాసార్భటు లతిమాత్ర తనువును దగపదోద్ధతుల నేల


గీ.

పగులదాటించి యార్చుచుఁ బారుదెంచి చటుల శూలాయుధం బెత్తి జలధిజాస
హాయుఁ దలఁచుచునున్న నయ్యసురరాజతనయువక్షస్థలంబు క్రోధమునఁ బొడిచె.

599


క.

అప్పుడు వజ్రకఠినమగు నప్పుణ్యునితనువు సోకినంతన తుమురై
యప్పుడమి రాలె శూలం బప్పనిక డుచోద్య మయ్యె నసురుల కెల్లన్.

600


ఉ.

పాపము లేని యప్పరమభాగవతోత్తము పుణ్యచర్య చూ
పోషక యంపశూల మటు లుర్వర వ్రాల కరాళమూర్తి హె

చ్చౌ పెనుమాయ కృత్య భయదార్భటి నుగ్రదవాగ్నికీలజా
లాపరిమేయయై గురుల నందఱఁ గాల్చి నశించె గ్రక్కునన్.

601


వ.

ఇట్లు స్వయంకృతదోషంబున నద్దోషాచరపురోహితులు దహ్యమానులగుట
చూచి పరమకృపావిధేయుండై యద్దైతేయకుమారుండు.

602


గీ.

కృష్ణ! పద్మనాభ కేశవ సర్వభూతాంతరాత్మ హరి యనంత వరద
పుండరీకనయన పురుషోత్తమ రమేశ కావుమయ్య వీరిఁ గరుణతోడ.

603


చ.

అరయఁగ సర్వభూతములయందు సమత్వము నొంది యిందిరా
వరుఁడు వసించునంచు గరువంబునఁ జూచెదనేని శాత్రవో
త్కరములమీఁదనైన యనుకంపయె పూనుదునేని యిప్పు డీ
సురుచిరమంత్రపావకము సోఁకక లేతురు గాక మద్గురుల్.

604


క.

అనునెడ నందఱు సుఖులై, దనుజపురోహితులు లేచి తండ్రీ మము మ
న్నన చేసి బ్రతుకఁ జేసితి, వనుపమకళ్యాణసిద్ధు లగు నీ కెపుడున్.

605


మ.

అని దీవించుచు నేగి దైత్యపతి కాద్యన్తంబునుం జెప్ప నం
దను రావించి యనూనరోషఘటితార్థస్వాంతుఁడై పల్కె హె
చ్చనఁగావచ్చు భళీర యీమహిమ మంత్రారూఢిచేనో స్వభా
వనిరూఢంబొ యెఱుంగఁగావలయు సువ్యక్తంబుగాఁ జెప్పరా.

606


చ.

అన విని తండ్రి కిట్లనియె నగ్గుణభూషణుఁ డేన యేల యె
వ్వనిహృదయంబునందు నవవారిజలోచనుఁ డుండు వాఁడె పా
వనుఁ డఖిలప్రభావములు వానికె కల్గు నిదెంతవింత య
వ్వనరుహపత్రనేత్రునియవారితభూరితరప్రపత్తికిన్.

607


సీ.

తంగెటిజున్ను రాధావల్లభుండు, ముకుందుఁ డెన్నంగ ముంగొంగుపసిడి
గాడిగట్టిన దేవగమి పూరుషోత్తముఁ, డురగతల్పుఁడు గాదెనున్న కొలుచు
ముంగిటిపెన్నిధి మురదానవవిభేది, దైత్యారి యరచేతిదైవతమణి
పెరటిలో సురశాఖి కరిరాజవరదుండు, రతిరాజగురుఁడు నీరాటియమృత


గీ.

మాపదలఁ బాప సంపద లందఁజేయ, నఘము లడగింపఁ బుణ్యంబు లందఁజేయ
మోక్ష మొనఁగూర్ప భక్తసమూహమునకు, నేడుగడయును హరియె దైత్యేంద్ర వినవె.

608


వ.

అనినన హంకరించి యభ్రంకషసౌధశిఖరాగ్రంబుననుండి పడద్రొబ్బించిన
నబ్బాలుండు శ్రీలలనావల్లభునుల్లంబుననిడిపడిన భూతధాత్రి తూలతల్ప
సమానమై యుండుటంజేసి యవిశీర్ణాస్థిబంధనుండై సుఖంబున నున్న హిరణ్య
కశిపుండు సహస్రమాయాడంబరుండగు శంబరుని తద్వధార్ధంబు నియోగించిన

వాడును ననేకమాయాజాలవలాహకంబుల ధైర్యసారతిరస్కృతహేమాహా
ర్యుండగు నప్పురుషవర్యుం గప్పిన నప్పతికన్యకోపయంత నంతరంగంబునం జిం
తించుచున్న సమయంబున.

609


చ.

ప్రళయవిభాకరాయితవిభావదవక్రము దివ్యచక్ర మా
యలజడి మాన్పఁ బంకజదళాక్షుఁడు పంచిన వచ్చి దైత్యమా
యలు హరియిఁచిపోవుటయు నంత కుమారుఁడు శోషిలంగ న
త్యలఘువిశోషణానిలము నంప నిలింపనిరోధి క్రోధియై.

610


విలయవిశోషణ శ్వసనవేగమునం దనువెల్ల శోషణా
కులదశ నొందకుండ హరి గ్రోలె మహాపవనంబు తన్మనో
జలజనివాసియై గుణవిశాలుఁడు బాలుఁడు మోదమానుఁడై
నిలిచినఁ జూచి యిట్లనిరి నిర్జరవైరికిఁ దత్పురోహేతుల్.

611


చ.

నలుకువనొందె బుద్ధి పరిణామముఁ జెందెడి నింక దైత్యరా
ట్తిలక భవత్కుమారకుఁడు దీర్ణతతోడ త్రివర్గమార్గని
శ్చలమతియుక్తి నీచరణసారసము ల్భజియించి శత్రుదు
ర్బలనుతి మాను నెప్పుడు శుభంబగు నీతనిఁ బంపు మింటికిన్.

612


ఔశనసద్గ్రంథార్థ, సమాసమునఁ ద్రివర్గసారమంతయు గుర్వ
భ్యాసమునఁ గాంచు నితఁడని, యాసురబాలకుఁడు తాము నతివేగమునన్.

613


క.

ఇంటికి వేడుకతోఁ జని, యంటి సకలకళలు చెప్పి రాచార్యులు వె
న్వెంటనె నేర్చె, నవిద్యాలుంటాకుం డర్భకుం డలోలతఁ బెరయన్.

614


గీ.

మనకుఁ దలయెత్తికొనఁగల్గె ననుచుఁ బోయి, గురులు చెప్పిరి దానవేశ్వరునితోడ
జాడ్యమెల్లను విడిచి యాశ్చర్యలీల, నీసుతుఁడు సర్వవిద్యలు నేర్చె ననుచు.

615


క.

మోదమున దైత్యపతి ప్ర, హ్లాదునిఁ బిలిపించి పాపఁడా మేధాసం
పాదనఁ జదివితివే సం, వాదక్షమ మయ్యెనే త్రివర్గము నీకున్.

616


సీ.

ధరణీవిభుండు శాత్రవమిత్ర, మధ్యస్థు లెడయకుండగ నెట్లు నడవవలయు
స్వామ్యమాత్యాదులౌ సప్తాంగముల నెట్లు, పెంపు దీపింప రక్షింపవలయు
సంధ్యాదికంబైనపాడ్గుణ్య మేరీతి తేట, తెల్లంబుగాఁ దెలియవలయు
ప్రబలసహాయాదిపంచాంగలక్షణం బే, ప్రకారంబున నెఱుఁగవలయు


గీ.

చటులశక్తిత్రయం బెట్లు జరుపవలయు, సామభేదాదు లేరీతి సలుపవలయు
మూడుసిద్ధులు నేగతిఁ జూడవలయు, నుదయములు మూడు నేరీతి నొందవలయు.

617

వ.

మఱియు పౌరజానపదులయందు నెవ్విధంబునం జరియింపవలయు తక్కుంగల
రాజనీతితంత్రం బెట్లు నడపవలయునని యడిగిన తండ్రిపాదంబులకుం బ్రణ
మిల్లి ప్రహ్లాదుం డిట్లనియె.

618


క.

చెప్పిన చదివితినేనిం, దప్పక ధర్మార్థకామదములగు చదువుల్
చెప్పెడి దేమి యవన్నియు, నొప్ప వసత్ప్రాయములు సమున్నతి చూడన్.

619


గీ.

శత్రువులయందు దండంబు మిత్రులందు, సామమును జేయుమని చెప్పి రేమి చెప్ప
జగములన్నియు పద్మలోచనుఁడ యచట, శత్రుమిత్రకథాప్రపంచములు గలవె.

620


గీ.

అనఘ నీయందు నాయందు నన్యులందు, తెలిసి చూచిన శ్రీవిష్ణుదేవు డుండు
అట్టిచో శత్రుఁడన మిత్రుఁడనఁగ నొక్కఁ, డరయగల డట్టె పట్టిపామరత గాదె.

621


క.

ఈవట్టిమాట లెల్లం, బోవిడిచి శుభప్రయత్నమున కుద్యుతులై
శ్రీవనితావల్లభపద, సేవన మొనరింపవలయు చేతను లెల్లన్.

622


గీ.

ఆద్యబుద్ధి యబుద్ధి సు మ్మసురనాథ, అదియు నజ్ఞానసంజాత యగునిజంబు
పుడమి బాలుఁడు మెరుగుడుపురుగుఁ జూచి, యాత్మలోన దలంచఁడే యగ్ని యనుచు.

623


చ.

కలగొనబంధ మూడ్చగలకర్మము కర్మము, మోక్షలక్ష్మి యీ
గలయదివిద్య విద్య, యటుగాక వృథాశ్రమకారి కర్మ మ
ట్లలవడకున్న విద్య హృదయంబునఁ జూడగ శిల్పనైపుణీ
కలన యటంచుఁ జెప్పుదురు గాఢవివేకవిపాకభూషణుల్.

624


సీ.

వినవయ్య ప్రణమిల్లి వినుపింతు నీకు సారాంశ మొక్కటి, భూమియందు నరుఁడు
రాజ్యభోగంబు కోరనివాఁడు కలఁడె, కోరినఁ గల్గునే భాగ్యరేఖ లేక
ఉద్యమంబులు సిరు లొనగూర్చునే భాగ్యకళ లేక యదియును గాక జడులు
అవివేకులు నశూరులగువారు భాగ్యంబుకలిమి, రాజ్యైకసుఖములు గాంతు


గీ.

రట్లగుట పుణ్యములు సేయ నలరు సిరులు, సమత నిల్పిన నిర్వాణసౌఖ్య మొందు
సకలభూతములును పంకజాతనయనుఁ, డనుచు చూడుము మదిలోన దనుజునాథ.

625


క.

ఎప్పుడు నీగతిఁ జూచిన, నప్పరమేశుఁడు ప్రసన్నుఁడగు నీశ్వరుఁ డా
చొప్పైన యెల్లకడలన్, చిప్పిలు క్లేశంబు లెల్ల క్షీణత నొందన్.

626


గీ.

అనిన నాజ్యసమర్పణాత్యంతదీప్త, వహ్నియును బోలి దానవేశ్వరుఁడు మిగుల
మండి దిగ్గున లేచి యమ్మాణవకుని, రొమ్ము తన్నె మహోదగ్రరోషమునను.

627


చ.

శ్రమమున విప్రజిత్తిబలిరాహుముఖాఖిలదైత్యకోటితో
నమరవిరోధి యిట్లను దురాత్ముని వీని మహాభుజంగపా

శముల నిబద్ధు చేసి రభసంబున నంబుధి వైవుఁడన్న దు
ర్దమభుజసారసాహసధురంధరు లై వడి నట్లు చేసినన్.

628


ఉ.

అంబుధిమధ్యభాగమున నమ్మహితాత్ముఁడు వడ్డ భూమిచ
క్రం బఖిలంబునున్ దిరిగె కంథిజలం బతివేలమై సమ
స్తంబును ముంచె దాని గని దైత్యులతో దనుజేశ్వరుండు రో
షంబునఁ బల్కు నిచ్చపలుఁ జంపఁగ దుర్భర మెన్నిభంగులన్.

629


ఉ.

కొండలు పెక్కు తెచ్చి యతిఘోరవిచారుని వీని కప్పు డు
ద్దండత వేయివర్షము లుదన్వదబంతరసీమ నూర్పు లే
కుండెడు నంత వీఁడన శిలోచ్చయకోటిసహస్రయోజనా
ఖండము గాఁగ గప్పి రవి గాఢనిరంకుశవృత్తి రక్కసుల్.

630


వ.

ఇట్లు మహార్ణవాంతర్జలంబున సహస్రయోజనవిస్తారంబుగా తనవై కొండల
తండంబులు పేర్చిన నోర్చి, యర్చితప్రభావుడగు నాడింభకుండు మనఃపుండ
రీకంబున పుండరీకాక్షుం దలంచి యిట్లని నుతించె.

631


గీ.

పుండరీకాక్ష తే నమో భుజగశయన, పూరుషోత్తమ తే నమో౽ద్భుతచరిత్ర
సర్వభూతగ తే నమో జలజనేత్ర చక్రధరహస్త తే నమో జగదధీశ.

632


క.

బ్రహ్మణ్యదేవునకు గో, బ్రాహ్మణహితునకు ప్రపంచపాలునకుఁ బర
బ్రహ్మమునకు దర్వీకృత, జిహ్వగునకు నీకు వినతి చేసెద కృష్ణా.

633


చ.

ఘనత రజోగుణంబున జగంబు సృజింపుచు సత్త్వయుక్తిపా
లన మొనరించుచున్ విలయలాలనతామసలీల నొఁదుచున్
తనరు త్రిమూర్తివైభనము దాల్చిన నీకు నమస్కరింతు నో
వనరుహనాభ భక్తజనవాంఛిత దానకళాధురంధరా.

634


క.

దేవాసురాదులును ధర, ణీవారిప్రముఖభూతనిచయము తన్మా
త్రావళియు మహదహంకృతి, భావంబులు నీవ పద్మపత్రదళాక్షా!

635


ఉ.

నీవయె కాల మాత్మయును నీవ గుణంబులు నీవ విద్యయున్
నీవ యవిద్య సత్యమును నీతి యసత్య విషామృతంబులున్
నీవ సమస్తకర్మములు నీవ తదీయఫలప్రభోక్తవున్
నీవ ఫలంబు నీవ ధరణీధర! సర్వము నీవ చూడఁగదే.

636


క.

యోగులు నిను చింతింతురు యాగపరులు నిను యజింతు రనిశము పితృదే
వాగణ్యరూపివై యుపయోగింతువు కవ్యహవ్యయోగ్యరసంబుల్.

637

క.

జగమంతయు నీరూపము జగదీశ్వర భూతభేదసముదయములు నీ
యగణితరూపంబులు, నీ దగు రూపం బంతరాత్మ యారసి చూడన్.

638


గీ.

అట్టి సూక్ష్మాంతరాత్మకు నధికసూక్ష్మ మగుచు చెలు వొందు నేపరమాత్మరూప
మట్టి పురుషోత్తమునకు దివ్యస్వభావసహితునకు మ్రొక్కువాఁడ నిస్తంద్రలీల.

639


క.

సర్వాత్మ సర్వశక్తి సర్వజగద్వంద్య సర్వసాక్షీ కరుణా
ధూర్వహ దురంత పాతక పర్వతనిర్వాపణోగ్రపవి నిను గొలుతున్.

640


సీ.

వాసుదేవునకు సర్వజ్ఞున కఖిలాతిరిక్తున కఖిలవరిష్ఠునకును
నామరూపవిహీనునకును నస్తిత్వోపలభ్యున కవతారలలితమహిమ
పాలితనిఖిలాత్మభావున కంతరాత్మాకృతి నిల్చి శుభాశుభంబు
వీక్షించు సర్వైకసాక్షికి ప్రభవిష్ణునకు విష్ణునకును సనాతనునకు


గీ.

జగదభిన్నునకును జగదాద్యునకు జగత్ధ్యేయరూపునకు నమేయునకును
యోగినుతున కధ్యయునకు సర్వాధారునకు నొనర్తు వందనంబు లేను.

641


క.

హరి సర్వజగన్మయుఁ డిది పరమార్ధము దీన భేదఫణుతులు లే వా
హరియే నే నాహరి నని యరుదుగ తన్మయత నొంది యతఁ డున్నంతన్.

642


శా.

ఆగోవిందుఁడ యేనటంచు మదిలో నంకించఁ దద్భావనా
యోగారూఢి నకల్మషుండుగఁ దదీయోదీర్ణహృత్పీఠిపై
యోగిధ్యేయుఁడు చక్రి యుండుటయుఁ దద్యుక్తికి సమస్తావనీ
భాగంబెల్లఁ దలంకె భూమిభృదకూపారాటవీయుక్తమె.

643


ఉ.

ఔరగపాశముల్ దునిసె, నద్రిపరంపర లెల్ల దూదియై
జారె, కుమారుఁ డంబునిధి చయ్యన వెల్వడివచ్చె తన్ను వెం
పార నెఱింగె, భూమి యిదె యంచు నెఱింగె ననంతరంబ య
న్నీరజనేత్రుని బొగడె నిండుమదిన్ ఘనభక్తియుక్తుఁడై.

644


సీ.

అక్షర, క్షర, పరమాత్మార్థ, స్థూలసూక్ష్మాకార, వ్యక్త, యవ్యక్తరూప
నిరఘనిరంజననిర్గుణాత్మక, గుణాధారగుణస్థితధర్మరూప
అధికకరాళసౌమ్యాత్మక, సదసదాకార, నిత్యానిత్యగణనిష్ప్ర
పంచకనిఖిలప్రపంచాశ్రయ, యనేక యేకరూప సమస్తలోకనాథ


గీ.

వాసుదేవ, సమస్తదేవాసురాది, మూలకారణ, సర్వసంపూర్ణ, యప్ర
మేయ శ్రీపురుషోత్తమ మీకు నెపుడు, వందనంబు లొనర్తు భావము చెలంగ.

645


వ.

ఇవ్విధంబున స్తుతియించిన.

646

సీ.

అడుగుగంటినయేరు నుడువ మేలగుపేరు, జడధిలోని బిడారు జరుగువాఁడు
తళుకుబంగరుచేల కలుము లీనెడిబాల, తలచఁ జేరెడిలీల గలుగువాఁడు
వినుపొద్దు కనుడాలు, తనయంతటిపడాలు, పెనురెక్కలరవాలు దనరువాఁడు
ఎదకు సొమ్మగుకందు. మొదటిమాటలపొందు, విదురుగేహమువిందు వెలయువాఁడు


గీ.

మెరుపు గలవాఁడు, చామనమేనివాఁడు, కరుణ గలవాఁడు, జగములు గాచువాఁడు
ఘనుఁడు శ్రీపుండరీకాక్షుఁ డవఘచరితుఁ, డాసురకుమారునెదుటఁ బ్రత్యక్షమయ్యె.

647


ఉ.

కోరిక మీర రక్కసుల గొంగమనంబు చెలంగ, ముంగిటన్
జేరిన పెన్నిధాన మనఁ జేరువ నిల్చిన మ్రొక్కి ధన్యుఁడై
దారకుఁ డింక నీదుభవతారకధీరకటాక్షవీక్షణో
దారకసత్సుథాప్లవవిధానమునన్ నను బ్రోవవే యనన్.

648


క.

మారునితండ్రియు, దైత్యకుమారునిపై చూడ్కి నిలిపి, మామకపాదాం
భోరుహభక్తికి మెచ్చితి కోరుము వర మనిన బాలకు డిట్లనియెన్.

649


గీ.

ఈశ కర్మవశంబున నెట్టియోనులందు నెందులఁ బుట్టిన నైన నాకు
విూపదాంభోరుహములమీఁదిభక్తి నిండి తిరుగక యెప్పుడు నుండవలయు.

650


క.

ఇల నవివేకులు విషయం, బులపై నొనరించు ప్రేమ పురుషోత్తమ ని
న్నెలమి భజియించునాకున్, గలుగంగాఁ జేయుమయ్య కారుణ్యమునన్.

651


వ.

అనుటయు.

652


ఉ.

నాపదభక్తి యెప్పుడు మనంబున నిండియె యుండు, మీఁడటన్
చేపడు నిట్ల నీకు నిది సిద్ధము వేడు మభీష్ట మేసిరుల్
చూప నమోఘదర్శనుఁడఁజుమ్ము, ననున్ గని రిత్తవోవు చే
తో౽పరిమేయసౌఖ్యగతు లందక యెందును జంతుసంతతుల్.

653


మ.

అనినం దైత్యకుమారకుండు జగదీశా! తీవ్రరోషోద్ధతిన్
మన ముప్పొంగఁగఁ దామసప్రకృతియై మాతండ్రి నామీఁదఁ జే
సినపాపంబులఁ బాపి యయ్యె నితనిన్ శ్రీమద్భవత్సత్కృపా
ఘనతీర్థంబున నోలలార్చి ప్రయతుం గావించి రక్షించవే.

654


వ.

అనిన వనజాక్షుం డవ్వరం బిచ్చి యింకొకవరంబు వేడుమనిన ప్రహ్లాదుం డిట్లనియె.

655


క.

కృతకృత్యుఁడ నైతిన్ భవదతులితసద్భక్తియుక్తి నచ్యుత యనినన్
చతురత మద్భక్తిన తుది నతులితనిశ్శ్రేయనంబు లందెదవంచున్.

656

చ.

జలరుహలోచనుం డరుగఁ జయ్యన నాయనఘుండు వోయి పెం
పలవడఁ దండ్రిపాదముల కర్మిలి మ్రొక్కినఁ గౌఁగిలించి యి
ట్లెలమి ఘటిల్లఁగాఁ బ్రతికితే యని మూర్ధము మూరుకొంచు క
న్నులఁ బ్రమదాశ్రబిందువులు నూల్కొన లాలితుఁ జేసె నందనున్.

657


వ.

ఇట్లు పశ్చాత్తాపతప్తుండగు తండ్రికి గురువులకు శుశ్రూష సేయుచుండె
నంత.

658


సీ.

జనకుండు దివికిఁ బోయిన దైత్యపతి యయ్యెఁ బ్రహ్లాదుఁ డంత పుత్రకులు పౌత్రు
లెందఱేఁ గల్గిరి యెల్లసంపదలును రాజ్యంబు విడిచి నిర్మలినచిత్తుఁ
డై సమదృష్టి పుణ్యాపుణ్యములు లేక నారాయణధ్యాననైపుణమునఁ
బరమనిర్వాణంబు ప్రాపించె నీపుణ్యచరితంబు పాతకక్షయకరంబు


గీ.

దర్శపూర్ణిమలందును ద్వాదశులను, వెలయ నష్టములందును విన్నవారి
నంబుజాక్షుఁడు ప్రహ్లాదు నరసి కాచి, నట్లు కాచు నిజంబు సంయమివరేణ్య.

659


వ.

ఆప్రహ్లాదునకు నాయుష్మచ్ఛిబి, బాష్కల, విరోచనులనఁ బుత్రులు గలిగిరి.
అందు విరోచనునకు బలి, బలికి బాణుండు మొదలగుపుత్రశతంబు పుట్టె. హిర
ణ్యాక్షునకు జర్ఝరుండు, శకుని, భూతసంతాపనుండు, మహానాభుండు, మహా
బాహుండు, కాలనాభుండును ననమహారథులు పుత్రులు గలిగిరి. దనువునకు
ద్విమూర్ఖుండు, శంకరుండు, అయోముఖుండు, శంకుశిరుండు, శంబరుండు,
ఏళవక్త్రుండును, మహాబాహుండు, తారకుండు, మహాబలుండు, స్వర్భానుండు,
వృషపర్వుఁడు, పులోముండు, మహాబలుడు, విప్రచిత్తియు ననఁ బుత్రులు గలిగిరి.
అందు స్వర్భానునకు సుప్రభయు వృషపర్వునకు శర్మిష్ఠయుం బుట్టిరి. ఆశర్మిష్ఠను
యయాతి గ్రహించుట చెప్పంబడియె. వైశ్వానరునకుఁ బులోమయుఁ, గాలిక
యు నన నిద్దఱుకన్యలు పుట్టిరి. వారిని మరీచి పరిగ్రహించె. వారలకుఁ బౌలో
మకాళికేయులన నరువదివేలు పరమదారుణులైన దానవులు పుట్టిరి. విప్రచిత్తి
వలన సింహకయండు వ్యసుండును, శల్యుండును, నభుండును, వాతాపియు,
సముచియు, ఇల్వలుండును, ప్రసృముండు, అంధకుండును, నరకుండును,
కాలనాభుండును, స్వర్భానుండును, వక్రయోధియు నని దనువంశవివర్ధనులైన
దానవులు పుట్టిరి. వీరలపుత్రపౌత్రు లనేకసహస్రంబులు పుట్టిరి. ప్రహ్లాదునికులం
బున నివాతకవచులు పుట్టిరి.

660


గీ.

శుకియు, శ్యేనియు, భాసియు, శుచియు, గృధ్రికయును, సుగ్రీవియును నను కన్య లార్వు
రుదయమొందిరి తామ్రయందు దిత తేజుఁ, డైనకశ్యపమునికి సంయమివరేణ్య.

661

వ.

అందు శుకివలన శుకంబులును, ఉలూకివలన నులూకంబులును, శ్యేనివలన
శ్యేనంబులును, భాసివలన భాసిపక్షులు, గృద్ధివలన గృధ్రంబులును, శుచి
వలన నుదకపక్షిగణంబులును, సుగ్రీవివలన నశ్వోష్ట్రగర్దభంబులునుం
బుట్టె.

663


క.

వినతకు నిద్దఱుపుత్రులు, ఘనతేజుం డరుణుఁ డనఁగ గరుడుఁ డనంగా
జనియించి రందు గరుడుం, డనివారణపన్నగాశనాఖ్యం బరఁగెన్.

664


వ.

సురసకు అమితౌజస్కంబును, ననేకశిరస్కంబును, ఖేచరంబును, మహాత్మ
కంబును నగు సర్పసహస్రంబు పుట్టె. కద్రువకుఁ దేజోబలసంపన్నంబులు ననేక
మస్తకంబులు నగు సర్పంబులు సహస్రంబు పుట్టె. సుపర్ణునకు వశవర్తులయ్యె.
అందుఁ బ్రధానసర్పంబులు శేష, వాసుకి, తక్షక, శ్వేత, మహాపద్మ, శంబర,
అనృతక, కర్కోటక, ధనంజయులు నాదిగాఁ గల విషోల్బణదందశూకంబులు
పెక్కు గలవు, మఱియు సురభివలన స్థలజంబులు, జలజంబులు, దారుణంబులు
పిశితాశనంబులు నైన పక్షిగణంబులు పుట్టె. ఇలవలన వృక్షలతాతృణజా
తులు పుట్టె. ఘషవలన యక్షరక్షోగణంబులు పుట్టె. మునివలన నప్సరోగణంబులు
పుట్టె. అరిష్టవలన మహాసత్వులైన గంధ్వరులు పుట్టిరి. స్థావరజంగమంబులైన
వీరందఱు కశ్యపదాయాదు లనంబరఁగుదురు. ఏతత్పుత్రపౌత్రపరంపర య
సంఖ్యంబై ప్రవర్తిల్లు. ఇది స్వారోచిషమన్వంతర సర్గంబు. వైవస్వతమన్వంత
రంబున వరుణయాగంబునందు వేల్చు ప్రజాపతికిఁ బ్రజాసర్గంబు కలిగెనని
చెప్పంబడు పూర్వసర్గంబున సువర్ణాఖ్యులగు సప్తర్షుల నిసర్గంబు మానసపుత్రు
లంగాఁ గల్పించి పితామహుండు గంధర్వ, భోగి, దేవ, దానవుల నట్ల కల్పించె.

665


క.

కొడుకులపని యీవిధమునఁ, గడతేరుట చూచి దితియుఁ గశ్యపమౌనిం
గడువేడ మెచ్చి యతఁ డో, పడతుక నీయిష్ట మేమి పలుకుమనుటయున్.

666


గీ.

పాకశాసను వధియించుపాటిపుత్రు, నొసఁగుమనుటయు నతఁడు నయ్యుత్పలాక్షి
కోరువర మిచ్చిపల్కె నోకీరవాణి ఘనశుచిక్రియ నూరేండ్లు గర్భ మీవు.

667


క.

ధరియించితేని యింద్రుని, బరిమార్పఁగఁ జాలునట్టి పట్టి భవద్భా
సురకుక్షిఁ బుట్టునని ముని, యరిగెన్ గర్భంబు దాల్చె నతివయు శుచియై.

668


చ.

అమరవరేణ్యుఁ డింతయు నిజాత్మగతంబునఁ గాంచి పోయి యా
యమ కతిభక్తి సేవ వినయంబునఁ జేయుచుఁ గాచియుండఁగాఁ
గ్రమమునఁ గించిదూనమయి కాలము వచ్చిన నొక్కనాఁడు పా
దముల నశౌచయై శయనధామమునం దితి నిద్ర వోయినన్.

669

క.

అంతరము వేచి పాకని, హంతయుఁ దత్కుక్షి సూక్ష్ముఁడై చొచ్చి సుదు
ర్దాంతపవి నేడుగనెలుగ, కాంతాగర్భంబు నఱికెఁ గడుమొఱ యిడఁగన్.

670


క.

మొఱ యిడకు మంచు నింద్రుఁడు, దొఱకొని యొకటొకటి యేడుదునుకలుగ వడిన్
నఱికె నతికోపమున ని, ష్ఠురవజ్రప్రహతి మిగులఁజోద్యము గాఁగన్.

671


వ.

ఇట్లు ఏకోనపంచాశత్ఖండంబులై యింద్రుఁడు "మారోదిహి" అని మాటి
మాటికిం బలుకుట మారుతులను నామంబుగల తీవ్రవేగులైన దేవతాభేదం
బులై యింద్రునకు సహాయులై రని చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

672


చ.

మునుపు మహామునుల్ పృథుని ముఖ్యునిఁ జేసి సమస్తమేదినీ
వినుతమహాధిరాజ్యపదవి స్థితికై యభిషిక్తుఁ జేసి ర
ట్లన పరమేష్టి రాజ్యములు శ్లాఘ్యగతి న్విభజించి యిచ్చె శో
భనకరుఁడై క్రమంబునఁ గృప న్సురదైత్యభుజంగకోటికిన్.

673


క.

తారాగ్రహవిప్రులకును, సారతపంబులకు యజ్ఞసముదయమునకున్
భూరిమహౌషధులకుగా, సరసభవుఁ డధిపుఁ జేసెఁ జంద్రుని నెలమిన్.

674


సీ.

రాజులకెల్ల వైశ్రవణుని వరుణుని, జలముల కాదిత్యజాలమునకు
విష్ణుని, వసునామవిబుధులకెల్లను పావకు, సురలకుఁ బాకదమను,
దక్షుఁ బ్రజాపతితతికి, ప్రహ్లాదుని దైత్యదానవసముత్కరమునకును,
యమరాజు పితృకోటి, కైరావణము నశేషగజంబులకుఁ, బక్షిసంఘమునకు


గీ.

వైనతేయుని, నుచ్చైశ్శ్రవంబు నశ్వములకు, వృషభంబు గోగణంబులకు, భూధ
రములకు హిమాలయంబు, సింహము మృగౌఘములకు, నధిపులఁ జేసె నంభోజభవుఁడు.

675


క.

కపిలుని మునులకు, సర్పాధిపులకు శేషుని, వనస్పతితతికి ప్లక్షాం
ఘ్రిపమును నధిపులఁ జేసె, న్నిపుణుఁడు పద్మజుఁడు నైపుణీక్రియ వెలయన్.

676


సీ.

ప్రాగ్దిశయందు వైరాజప్రజాపతితనయు సుధన్వునిం ధవునిఁ జేసె
దక్షిణదిశకుఁ గర్దమపుత్రకుని శంఖపదనామధేయుని ప్రభువుఁ జేసె
ప్రత్యగ్దిశాభూమి రజుసూను కేతుమం, తుని పాలనక్రియాధుర్యుఁ జేసె
ఉత్తరదిశ కేతుమత్తనూజు హిరణ్యరోమాభిధానుని స్వామిఁ జేసె


గీ.

అంబురుహసూతి వీరిచే నఖిలధరణి, యెపుడు పాలితయగు ధర్మనిపుణలీల
వీరు భూతభవద్భవ్యవివిధపతులు, శ్రీవిభువిభూతిభూతు లూర్జితవివేక.

677


ఉ.

సారసపత్రలోచనుఁడు సర్వమయుండు తదంశసంభవుల్
గారె సమస్తపాలనకళామహనీయులు దేవదైత్యమ

ర్త్యోరగముఖ్యులెల్లను దదున్నతిఁ జెందనివారి కెట్లు చే
కూరెడు శిష్టపాలనము కుత్సితదుష్టవినాశరూఢియున్.

678


గీ.

సృష్టియందు జగము సృజియించు స్థితియందుఁ, బ్రోచి విలయకాలమున హరించు
చతురులీలల రజస్సత్వంబు తమమును, నాశ్రయించి పంకజాక్షుఁ డెపుడు.

679


క.

నాలుగురూపులు సృష్టియు, నాలుగురూపులను స్థితియు నాలుగురూపుల్
పోలఁగ లయముం జేయుచు, నాలుగురూపులను పద్మనయనుం డుండున్.

680


ఉ.

సారసగర్భుడై ధరఁ బ్రజాపతులైన మరీచిముఖ్యులై
యారయఁ గాలమై ఘనచరాచరభూతములై జనార్దనుం
డీరహి నాల్గురూపముల నెప్డు రజోగుణలిప్తతన్ సువి
స్తారముగా సృజించు వివిధక్రియమైన జగం బి దంతయున్.

681


గీ.

విష్ణుఁడై, మనురూపియై, వితతమైన కాలమై, సర్వభూతసంఘాతచిత్త
సంస్థితుం డయి రక్షించు సత్వనియతి, యొనర జగమెల్ల శ్రీపురుషోత్తముండు.

682


ఉ.

రూపర నంతకాలమున రుద్రుఁడు తా నయి యంతకాగ్నిము
ఖ్యాపరిమేయరూపధరుఁడై దురతిక్రమకాలరూపుఁడై
వ్యాపితసర్వభూతగణుఁడై జగమంతయుఁ ద్రుంచుచుండు ల
క్ష్మీపతి తామసప్రకృతి మించఁగ నెంచగ నిత్తెఱంగునన్.

683


వ.

ఇట్లు జగత్సృష్టిహేతువులైన బ్రహ్మయు, మరీచ్యాదులు, కాలంబు, నఖిల
జంతువులును, జగత్స్థితిహేతువులైన విష్ణువు, మన్వాదులు, కాలంబు, సర్వజంతు
వులును, జగత్ప్రళయహేతువులైన రుద్రుండును, అగ్న్యంతకాదులును, కాలం
బును, సర్వజంతువులును, జనార్దనునివిభూతులుగా నెఱుంగుము. హరికిం గాక
సృష్ట్యాదిసామర్థ్యం బొరులకుం గలుగునే? సృష్టిస్థితిలయంబు లొనర్చునవి రజ
స్సత్వతమోయుక్తంబులగు హరిశరీరంబులుగా నెఱుంగుము. జగత్ప్రష్టయు,
జగద్రక్షకుండును, జగద్భక్షకుండును జనార్దనుండుగా నెఱుంగుము. సర్గస్థిత్యంత
కాలంబులందు గుణప్రవర్తన నతండు మూడుప్రకారంబుల వర్తించు. అగు
ణంబై, అనౌపమ్యంబై, జ్ఞానమయంబై, స్వయంవేద్యంబై, అధికంబై, జనార్ద
నుని పరమపదంబు వెలుంగుచుండు. అప్పరమాత్మస్వరూపంబును నాల్గు
తెఱంగుల వర్తించుననిన శ్రీపరాశరునకు మైత్రేయుం డిట్లనియె.

684


క.

పరమపదాఖ్యము బ్రహ్మ, స్వరూప మూర్జిత మధికము జ్ఞానమయము మీ
రరయ చతుర్విధ మంటిరి, యెఱిఁగింపుడు తత్క్రమము మునీంద్రా యనుడున్.

685

గీ.

సర్వవస్తువులందును జర్చసేయ, కరణ మది సాధనం బండ్రు కాంక్షితంబు
వస్తు వది సాధ్య మండ్రు భూవలయమునను, దెలిసి చూచి విభాగకర్తలు మునీంద్రా.

686


క.

వేమఱు యోగికిఁ బ్రాణా, యామాద్యము సాధనము సమంచితసాధ్యం
బై మించు బ్రహ్మ మది గని, తా మరలఁడు భవమునకు నుదారస్ఫూర్తిన్

687


ఉ.

వెంబడి యోగిముఖ్యులకు వేగమ ముక్తి యొసంగు సాధనా
లంబనమైన జ్ఞాన మది లక్షణ మొప్పఁగ జ్ఞానమైన బ్ర
హ్మంబున కొక్కయంశము సమంచితబోధనిధానసావధా
నం బయి యొప్పు మాససమునం దలపోయుము నిశ్చితస్థితిన్.

688


గీ.

యోగిజనము లతిక్లేశ మొదవ సాధ్య, మైన బ్రహ్మంబు చిత్తంబునందు గూర్చు
నట్టి సాధ్యావలంబనంబైన జ్ఞాన, మది ద్వితీయాంశ మయ్యె బ్రహ్మంబునకును.

689


క.

సాధనసాధ్యాభేద మ, సాధారణభంగి యగుచుఁ జన నద్వైత
త్వాధికమగు జ్ఞానమ్ము స, మాధేయంబై తృతీయమగు నంశ మగున్

690


వ.

ఏతత్జ్ఞానత్రయవిశేషనిరాకరణద్వారంబున దర్శితాత్మస్వరూపంబై
నిర్వ్యాపారంబును, అనాఖ్యేయంబును, వ్యాప్తిమాత్రంబును, అనౌపమ్యం
బును, ఆత్మసంబోధవిషయంబును, సత్తామాత్రంబును, అలక్షణంబును
ప్రశాంతంబును, అభయంబును, శుద్ధంబును, దుర్విభావ్యంబును, అనాశ్ర
యంబునునై జ్ఞానమయుండగు విష్ణుదేవుని జ్ఞానంబు పరమపదం బనంబరఁగు.
ఆజ్ఞాననిరోధంబు చేసి యోగిజనులు అందు లయంబు నొంది సంసారంబు
నొందరు. ఈప్రకారంబున నమలంబును, నిత్యంబును, వ్యాపకంబును, అక్ష
యంబును, సమస్తాపాయరహితంబును నైన విష్ణ్వాఖ్యపరమపదంబు పర
బ్రహ్మం బనంబరఁగు. పుణ్యాపుణ్యోపరమంబున క్షణక్లేశుండై యతినిర్మ
లుండై యోగీశ్వరుం డాబ్రహ్మంబుం జేరి పునరావృత్తి నొందండు బ్రహ్మం
బునకు మూర్తామూర్తంబులు రెండురూపంబులు. అవి క్షరాక్షరసంజ్ఞల
సర్వభూతావస్థితంబులునై యుండు. అక్షరంబు బ్రహ్మంబు, క్షరంబు జగంబు.
ఏకదేశస్థితుండైన హుతాశనుని జ్యోతి విస్తరిల్లినపగిది పరబ్రహ్మంబుశక్తి
విస్తరిల్లి జగంబయ్యె.

691


సీ

వివరింప బ్రహ్మయు విష్ణుండు శివుఁడు ప్రధానశక్తులు బ్రహ్మతత్వమునకు
అంతకుఁ దక్కువ యమరులు దక్షాదు లంతకుఁ దక్కువ యంతకన్నఁ
దక్కువ మనుజు లంతకును దక్కువ క్రమంబునఁ బశుమృగపక్షిభోగికులము
మేదినివృక్షగుల్మాదు లంతకుఁ దక్కువై యుండు నిది జగం బంతటికిని

గీ.

శక్తిశ్రీవిష్ణుదేవుండు సకలయోగి, చింతనీయప్రభావుండు శ్రీవిభుండు
సర్వశక్తీశ్వరుం డంబుజాతనేత్రుఁ డన్నిబ్రహ్మంబులును హరి యని యెఱుంగు.

692


క.

వరభూషణాస్త్రరూప, స్ఫురణంబు వహించియున్న పురుషాదుల న
య్యురగేంద్రశాయి నిత్యము, ధరియించుం బ్రాణిచయహితము చేకూర్పన్.

693


వ.

అనిన మైత్రేయుండు శ్రీపరాశరున కి ట్లనియె.

694


ఉ.

నీరజలోచనుండు రమణీయవిభూషణ శస్త్రరూప ధృ
త్పూరుషముఖ్యులన్ మహిమతో ధరియించునటంచు నిఫ్డు మీ
రారయ నానతిచ్చితి రదంతయు సత్కృప నానతీయవే
శ్రీరమణీవరాంఘ్రిసరసీరుహషట్చరణాయితాత్మకా.

695


వ.

అనిన మైత్రేయునకుఁ బరాశరుం డిట్లనియె.

696


క.

సకలజగజ్జీవాకృతి, ప్రకటితరుచి మెఱయుఁ గౌస్తుభము ధరియించున్
సకలజగద్రక్షకుఁడగు, వికచాంబుజలోచనుఁడు ప్రవీణత మెఱయన్.

697


క.

అమరు ప్రధానము శ్రీ, వత్స మనఁగగద యయ్యె బుద్ధితత్వము వీనిన్
కమలామనోహరుఁడు, నిత్యము దాల్చు నపారభూరిహర్షము మెఱయన్.

698


గీ.

అమరు భూతాదియును నింద్రియాదియు ననఁ, గలుగు ద్వివిధ మహంకార మెలమితోడ
నతులశంఖాకృతియును శార్ఙ్గాకృతియును, దాల్చి భజియించు శ్రీజనార్దనుని నెపుడు.

699


చ.

అమితజవాధరీకృతమహానిలవేగము చంచలస్వరూ
పము దురతిక్రమంబు నయి భాసిలుచున్నమనంబు చక్రరూ
పము ధరియించి శ్రీశుకరపద్మమునందు వెలుంగు నెప్పుడున్
స్వమహఉదీర్ణతాశమితశాత్రవభూరితరప్రతాపమై.

700


గీ.

పంచవర్ణకుసుమభాసమానత సుగం, ధాఢ్య యగుచు వైజయంతి యనఁగఁ
బుష్కరాక్షువక్షమున నుండు నెప్పుడు, భూతపంచకంబు భూసురేంద్ర.

701


క.

ఇరుదెఱఁగుల నింద్రియములు, శరరూపముఁ దాల్చి విజయసంభృతలీలా
స్ఫురణమునఁ గొల్చియుండున్, సరసీరుహపత్రనయను చాతుర్యమునన్.

702


క.

ఎందు నవిద్యామయతా, మందంబగు ఫలకమును సమంచితమహిమా
నందద్విద్యామయమగు, నందకమును దాల్చు పద్మనాభుఁడు వేడ్కన్

703


వ.

ఇవ్విధంబునఁ బురుషప్రధాన, బుద్ధ్యహంకార, భూత, మనస్సర్వేంద్రియ,
విద్యావిద్యలు భూషణాస్త్రస్వరూపంబులు దాల్చి భగవంతుని భజి

యించు. సవికారంబైన ప్రధానంబును బురుషుండును, జగత్తును, విద్యావిద్య
లును సర్వభూతేశ్వరుండై, కాలమయుండైన హరియంద నిలిచియుండు.
భూర్లోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనుల్లోక, తపోలోక, సత్యలోకంబు
లను సప్తలోకంబులును దాన యయి, కాలాత్మమూర్తి యయి, పూర్వులకుం
బూర్వుండై, సర్వవిద్యలకు నాధారంబై, దేవ, మానుష, పశ్వాది బహు
రూపంబులు దాల్చి, బహురూపధారియై శ్రీమన్నారాణుండు వెలయుచుండు.

704


క.

వేదము లితిహాసంబులు, వేదాంతోక్తులు పురాణవితతులు స్మృతులున్
వాదములు కావ్యగీతము, లాదట శబ్దాత్ముఁడైన హరితనువు లగున్.

705


క.

హరినేను జగములన్నియు, హరి తద్వ్యతిరిక్తమొకటి యరయగ లేదం
చురుమతి నెవ్వఁడు గను, నప్పురుషుఁడు ముక్తుఁ డగు నధికపూతాత్మకుఁడై.

706


వ.

ఇప్పురాణంబునందు నిది మొదలియంశంబు నీ కెఱింగించితి. శ్రద్ధాపరుండై విను
నతండు పుష్కరతీర్థంబుల ద్వాదశాబ్దంబులు, కార్తికపౌర్ణిమాశివ్రతంబు లాచ
రించిన ఫలంబు నొందు. దేవర్షి, పితృ, గంధర్వ, యక్షాదుల సంభవంబు విన్న
నిష్టవరంబులు వొసంగునని శ్రీపరాశరుండు మైత్రేయునకు నానతిచ్చుటయును.

707


శా.

శంఖక్షేత్రవిహార, హారకనకస్వచ్ఛీభవత్ఫాల్గునీ
ప్రేంఖారోహణధీర, ధీరచితసత్ప్రేమానమత్పత్రిరాట్
కంఖాణప్రభుచార, చారణనుతోగ్రవ్యగ్రచక్రప్రభా
సంఖిన్నాసురవార, వారణభయోచ్చైర్మేఘజంఝానిలా.

708


క.

దారూభవదాత్మ తనూ, చారూభవదతులమలయ జద్రవమృదుచ
ర్చోరూభవదామోద వి, భీరూభవదఖిలలోక పృథుసంశరణా.

709


తోదకము.

ఖేటకఘోటకఖేలనధీరా, హాటకశాటకహారికటీరా
కూట నిశాటనిగూహనసారా, కాటనపాటనకార్యరిధారా.

710


గద్య.

ఇది శ్రీసుభద్రాకరుణాకటాక్షవీక్షణలబ్ధకవిత్వతత్వపవిత్ర వేంకటా
మాత్యపుత్ర కందాళ శ్రీరంగాచార్యకృపాపాత్ర సజ్జనమిత్ర శ్రీహరిచరణార
విందవందనపరాయణ కలిదిండి భావనారాయణ ప్రణీతంబైన శ్రీవిష్ణుపురా
ణంబునందు మైత్రేయమహాముని శ్రీపరాశరునకు మ్రొక్కి ప్రశ్నంబు లడు
గుటయు, రాక్షససత్రయాగంబును, వసిష్ఠపరాశరసంవాదంబును, వాసుదేవు
నామనిర్వచంబును, ప్రకృతిపురుషేశ్వరకాలస్వరూపకథనంబును, భూత
తన్మాత్రసృష్టిప్రకారంబును, ఇంద్రియసృష్టిప్రకారంబును, బ్రహ్మాండోత్ప

త్తియు, సప్తావరణప్రకారంబును, కాలనిర్ణయంబును, యుగపరిణామంబు
లును, మన్వంతరప్రమాణంబులును, నైమిత్తికప్రళయప్రకారంబులును,
నారాయణనామనిర్వచనంబును, యజ్ఞవరాహావతారంబును, భూస్తుతియు,
భూసముద్ధరణంబును, సృష్టిప్రకారంబును, ముఖ్యసర్గాదినవసర్గప్రకారంబు
లును, సకలభూతసంభవంబును, చాతుర్వర్ణ్యోత్ప త్తియు, వర్ణాశ్రమంబుల
వారు పొందుగతులును, భృగ్వాది నవబ్రహ్మలయుత్పత్తియు, వారలవలనం
బ్రజోత్పత్తియు, లక్ష్మీచరిత్రంబును, దుర్వాసుని శాపప్రకారంబును, సముద్ర
మథనంబును, ఐరావతాదిసంభవంబును, లక్ష్మీసముత్పత్తియు, ఇంద్రస్తుతి
యును, ఉత్తానపాదుని చరిత్రంబును, ధ్రువసంతతిక్రమంబును, పృథుచరి
త్రంబును, ప్రచేతనుల చరిత్రంబును, కండుముని చరితంబును, శ్రీపురుషోత్త
మమాహాత్మ్యంబును, మారిషాచరితంబును, దక్షోత్పత్తియు, దక్షకన్యకాసం
తానప్రకారంబును, రుద్రోత్పత్తియు, ప్రహ్లాదచరితంబును, ప్రహ్లాదసంతతిప్రకా
రంబును, మరుత్తులజన్మప్రకారంబును, ఆధిపత్యకథనంబును, శ్రీహరి గుణత్ర
యంబు దాల్చి సృష్టి, స్థితి, లయంబులు చేయుప్రకారంబు, పరమపదజ్ఞాన
చాతుర్విధ్యంబును, ప్రకృతిపురుషాడులు శ్రీహరికి నాయుధభూషణాదులైన
ప్రకారంబులును, శ్రీహరి విశ్వరూపంబును ననుకథలంగల ప్రథమాంశ మ
నంబడు ప్రథమాశ్వాసము.

శ్రీ కృష్ణార్పణమస్తు.

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ