Jump to content

విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ)/తృతీయాంశము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

విష్ణుపురాణము

భావనారాయణకృతము

తృతీయాంశము


ధుర్యనిజనివేదిత
మాధుర్యయుతప్రసార మహనీయమహ
త్త్వాధరితజాతిఘనసం
బాధ జగన్నాథ శ్రీసుభద్రానాథా.

1


క.

శ్రోత్రసుఖకారిణియును బ, విత్రయు నగు భరతుకథను విని సుస్థితి మై
చిత్రము మది కొనరించఁగ, మైత్రేయుఁడు హర్షసంభ్రమములం బలికెన్

2


చ.

గురుఁడవు నాపయిం గలుగు కూరిమి చేసి సమస్తమేదినీ
ధరసరిదంబురాసులవిధంబు భువస్సువరాజలోకభా
స్వరవిపులత్వముల్ రవినిశాచరముఖ్యనవగ్రహర్క్షసం
చరణము నాగలోకములచందము చెప్పితి వద్భుతంబుగన్.

3


వ.

దేవర్షిదానవాదులసృష్టియు, చాతుర్వర్ణోత్పత్తియు, నౌత్తానపాది, హైరణ్య
కశిప్వాదులచరితంబుల వింటి, నింక మనువులు మన్వంతిరాధిపతులు వినియెద
ననిన శ్రీపరాశరుం డిట్లనియె.

4


గీ.

ఆఱుమన్వంతరము లిప్పు డరిగె వర్త, మానమస్వంతరము సప్తమంబుసువ్వె
భావిమన్వంతరము లేడు నీవు వీనిఁ, దెలియు మిపు డన్నియును నీకుఁ దేటపఱుతు.

5


వ.

ప్రథమమనువు స్వాయంభువుండు, ద్వితీయమనువు స్వారోచిషుండును,
అందు నీశ్వరశర్వరి, వపుముఖులు సప్తఋషులు, చైత్రకింపురుషాదులగు
స్వారోచిషపుత్రులు రాజులు. తృతీయమను వుత్తముండు, ఆమన్వంతరంబు
నందు సుశాంతినామకుం డింద్రుండు, సుధాములు, సత్యులు, శివులు, ప్రతర్ద
నులు, వనవర్తులు నన నైదుదేవగణంబులు, వసిష్ఠపుత్రు లేడ్వురు సప్తర్షులు,
అభాదులైన యుత్తమమనుపుత్రులు రాజులు. చతుర్థమనువు తామ

సుండు, ఆమన్వంతరంబునందు సత్యాశ్వాదులు సప్తవింశతిదేవగణంబులు.
శిబినామధేయుం డింద్రుండు, జ్యోతిర్ధామాదులు సప్తర్షులు, సరఖ్యాత్యాదు
లైన తామసమనుపుత్రులు రాజులు. పంచమమనువు రైవతుండు. ఆ
మన్వంతరంబునందు మనునామధేయుండింద్రుఁడు. అమితాభవైకుంఠాదులు
చతుర్దశదేవగణంబులు, హిరణ్యరోమాదులు సప్తర్షులు. జలబంధాదులు
రైవతపుత్రులు రాజులు, స్వారోచిషోత్తమతామసరైవతులు నల్వురును
ప్రియవ్రతాన్వయసంభవులు. ఆప్రియవ్రతుండు విష్ణుదేవు నారాధించి
యాత్మవంశసంభవుల నలువురిని మన్వంతరాధిపతులం బడసె. ఆఱవమనువు
చాక్షుషుండు. ఆమన్వంతరంబునందు మనోజవాహ్వయుం డింద్రుండు. ఆర్య
ప్రసూతాదులు పంచదేవతాగణంబులు, సుమేధాదులు సప్తర్షులు. ఊరు,
పురు ప్రముఖ చాక్షుషపుత్రులు రాజులు. సప్తమమనువు సూర్యపుత్రుండు
శ్రాద్ధదేవుండైన వైవస్వతుండు. ఈమన్వంతరంబునందు ఆదిత్యవసురుద్రా
దులు దేవతలు, పురందరాఖ్యుం డింద్రుఁడు, వసిష్ఠకశ్యపాత్రిజమదగ్ని
భరద్వాజగౌతమవిశ్వామిత్రులు సప్తర్షులు. ఇక్ష్వాకదృష్టశల్యాతిసరి
ష్యంతనాభాగవరుణవృషద్రధసుమంతులు వైవస్వతపుత్రులు రాజులు.
అశేషమన్వంతరంబులయందును ననుపమయగు విష్ణుశక్తి సత్వోద్రిక్తయై
స్థితియందు దేవత్వంబుచేత నధిష్ఠించియుండు.

6


క.

వింతగ స్వాయంభువమ, న్వంతరమున యజ్ఞుఁ డనఁగ హర్షమున రమా
కాంతుఁ డవతార మొందె న, దాంతదురంతాసురప్రతతి తల్లడిలన్.

7


వ.

అక్కాలంబున నార్యాంకమాససు లన దేవతలు పుట్టి మఱియును.

8


గీ.

వినుము తుష్టియందు విష్ణుండు స్వారోచి, షాంతరమున నజితుఁ డనఁగఁ బుట్టెఁ
దుషితదేవగణముతో దుష్టదైత్యసం, తతుల కెల్ల గుండె తల్లడిలఁగ.

9


క.

ఉత్తమమనుకాలమునఁ బ్ర, పత్తి దనర శ్రీవిభుండు సత్యుం డనఁగా
నుత్తమ యగు సత్యకు సం, పత్తి వెలయఁ బుట్టె ధర్మపద్ధతి నడపన్.

10


క.

తామసమనువేళ జగ, త్స్వామి రమావిభుఁడు పుట్టె సాధ్యకు ధర్మ
శ్రీ మించ హరి యనఁగ ను, ద్దామవిశదకీర్తిలతలు ధరణిం బర్వన్.

11


క.

రైవతమన్వంతరమున, శ్రీవనితావల్లభుఁడు హరి యనఁగఁ బుట్టెన్
దేవగణంబులతో సం, భావనసంభూతియందు మహిమ దలిర్పన్.

12


మ.

తను వైకుంఠుఁ డన న్వికుంఠకు సముత్కర్షంబునం బుట్టె న
వ్వనజతాక్షుఁడు చాక్షుషాంతరమునన్ వైకుంఠసంజ్ఞామరుల్.

ఘనభక్తిం భజియించ దానవచమూగర్వాంధ కారంబు లె
ల్లను జెల్లాచెదరై సనన్ బటుతనోల్లాసప్రతాపంబుతోన్.

13


క.

వైవస్వతమనువేళ ర, మావల్లభుఁ డదితికిని సమాహితచిత్త
శ్రీ వెలయ కశ్యపునకుం, డావామనుఁడై జనించె నవ్యప్రతిభన్.

14


సీ.

విదళించె నేదేవి సదమలాంగుష్ఠనఖాంకురాగ్రమున బ్రహ్మాండభాండ
మోలించె నేదేవి యురుసపర్యాకృదబ్జాతజాతమనోంబుజాతతుష్టిఁ
దేలించె నేదేవి దివిషత్తరంగిణీత్రిషణంబుల సప్తఋషిజటాలిఁ
గళగూర్చె నేదేవి లలితప్రభావ్యాప్తి నౌత్తానపాది మౌళ్యగ్రమణుల


గీ.

నట్టిశ్రీపాదపద్మ ముదగ్రలీల, ముజ్జగములఁ ద్రిధాన్యస్తముగ ఘటించి
బలిని వంచించి భువనము ల్జలజనేత్రుఁ డిందమని యిచ్చె మగుడఁ బురందరునకు.

15


క.

అరయంగా నీమన్వం, తరముల నేడింటఁ బద్మనయనునిమూర్తుల్
ధరణిపయిఁ బుట్టి ప్రజలం, బరిపాటిం బ్రోచు వృద్ధిఁ బరఁగుచునుండున్.

16


క.

కుశలగతి జగములందు న, నిశము ప్రవేశించియుండు నిశ్చయముగ స
ర్వశరణ్యుఁ డిట్టు లగుట, న్విశిధాత్వర్థంబుసుమ్ము విష్ణుఁడు తలఁపన్.

17


చ.

మనువులు దేవతల్ ఋషులు మానవనాయకు లింద్రు లిందఱున్
వనజదళాక్షునంశములు వాక్కు లనన్ బని యేమి పద్మలో
చనుఁడె జగంబు లన్నియును సందియ నుండఁగ నేలయన్న నో
మునివర భావిమన్వధిపముఖ్యుల జెప్పుమటన్న నిట్లనున్.

18


ఉ.

త్వష్టతనూజ సంజ్ఞ యనఁ దామరసాప్తునిదేవి సద్వ్రతో
త్కృష్టచరిత్ర వల్లభునిదీప్తికి నోర్వక యాత్మయోగవి
స్పష్టవిభూతి ఛాయ యనుభామ నొకర్తు సృజించి భర్తకున్
శిష్టత సేవ చేయుమని చెప్పి తపం బొనరింప బోయినన్.

19


ఉ.

ఛాయయు మాయ యేర్పడక సారసబంధునిసేవ యెప్పుడున్
బాయక సేయుచుండె భయభక్తినయంబు లెలర్ప నంత భ
వ్యాయతితో నపత్యముల నర్హవిధంబునఁ గాంచ దివ్యతే
జోయుతమూర్తులం బెనుచుచుం బరిపాటి వసించియున్నెడన్.

20


వ.

ఇట్లు శనైశ్చరుండును, మనువును, తపతియు నను నపత్యత్రయంబుఁ గాంచి.

21


క.

మనువును యముఁడును యమునయు, ననుమువ్వుర గాంచి చనియె నాసంజ్ఞయ ము

న్ను నయమునఁ గొంతకాలము, చనఁగ యమునిసవతితల్లి శపియించుటయున్.

22


ఇవ్విధంబున.

23


గీ.

ఛాయ జముని శపింప నాచంద మరసి, సంజ్ఞ కాదని మది నెన్ని చండకరుఁడు
పోయి కనుగొనె నపుడు తపోవనమునఁ, గొదమగోడగియైయున్న గూర్మిసతిని.

24


శా.

అశ్వాకారము పూని యాత్మతనుదివ్యచ్ఛాయ పర్వంగ స
ప్తాశ్వుం డంచితపంచబాణవిశిఖవ్యాలీఢుఁడై యప్పు డ
య్యశ్వం జేరి తదీయభవ్యవదనం బాసక్తిఁ జుంబించెఁ దా
శశ్వద్విస్ఫుటహేషికాధ్వనుల నాశాభిత్తి కంపిల్లఁగన్.

25


వ.

పరమపతివ్రతాశిరోమణియైన నాసంజ్ఞయు నిజాంతఃకరణప్రవర్తనంబు
ప్రమాణంబుగా నక్కుహనాహయంబు సప్తహయుండ యని యంగీకరించి
నిలిచె నీతండును ననంగవశంవదుఁ డై తురగజాతిచేష్టలు కొన్ని నడిపి మావు
హత్తిన నత్తఱిఁం జరమధాతుద్రవోద్గమం బయ్యె. అందువలన రూపసంపన్నులగు
పుత్రులిద్దఱు నాసత్యు లనం బుట్టి స్వర్గలోకవైద్యులై రంత.

26


తమతమమునుపటిరూపులు, సముదారక్రీడఁ దాల్చి దంపతులు సము
ద్యమమున నిజవసతికిఁ జని, రమితప్రతిభాసమగ్రు లగుచు మునీంద్రా.

27


సీ.

తనతనూభవకు హితము చేయ మదిఁ గోరి, ఘనుఁడైన యావిశ్వకర్మ కమల
బంధునిఁ గరసానఁ బట్టి యష్టమభాగ, మరుగ వైష్ణవతేజమైననదియు
బుడమిపైఁ బడియు రాపొడి యైన నది గూర్చి, పూదెగాఁ గరఁగ నాపూదెలోనఁ
గొంత దానవకులధ్వాంతార్కనిభమైన, చక్రంబుచేసి శ్రీజాని కిచ్చెఁ


గీ.

గొంత శూలంబు చేసి భర్గునకు నిచ్చెఁ, గొంత శక్తిగఁ జేసి యగ్గుహున కిచ్చెఁ
గొంత సురకోటులకు నెల్లఁ గోరునాయు, ధముల నిర్మించి యిచ్చె నయ్యమరశిల్పి.

28


వ.

ఛాయాపుత్రుండైన మనువు పూర్వమనుసవర్ణుం డగుటం జేసి సావర్ణి యనం
బరఁగి యష్టమమను వగు. ఆమన్వంతరంబున నమితాభాదు లేకవింశతిదేవ
గణంబులు. దీప్తిమంతుండు, గాలవుండు, రాముండు, కృపుండు, ఆశ్వత్థామ,
వ్యాసుండు, ఋష్యశృంగుఁడు వీరలు సప్తర్షు లయ్యెదరు.

29


సీ.

ఏవీరవరుఁడు మహేంద్రాదుల జయించి, సకిలలోకములకు స్వామి యయ్యె
నేకర్మకుఁడు నిరుత్సేకుఁడై శాస్త్రోక్తి, నఖిలాధ్వరంబులు నాహరించె
నేపుణ్యుఁ డధికసుశ్రీపటుత్వమును బ్రా, హ్మణళయుక్తిచే నతిశయిల్లె
నేవదాన్యాగ్రణి శ్రీవధూనాథున, కవలీల భువనత్రయంబు నిచ్చె

గీ.

నట్టివైరోచని ప్రసన్నహరికటాక్ష, మాలికాలాలనమునఁ బాతాళవసతి
నుండి తదనుగ్రహమునఁ బెంపొద నింద్రుఁ, డగుచు సావర్ణికాలంబునందు వెలయు.

30


వ.

విజరోర్విరివన్నిర్మోకాదులు సావర్ణిపుత్రులు రాజులు కాఁగలరు. వినుము.

31


గీ.

వర్ణనీయుండు దక్షసావర్ణి యనఁగ, ఘనుఁడు నసముండు మనువు సన్మునివరేణ్య
సురలుపారమరీచ్యాదు లరయఁ, బదిగణంబు లద్భుతుఁ డింద్రుఁ డున్నతిని వెలయు.

32


వ.

సవనుండును, ద్యుతిమంతుండును, భవ్యుండును, వసుండును, మేధాతిథియు,
జ్యోతిష్మంతుండును, సవ్యుఁడును సప్తర్షు లయ్యెదరు. దృష్టకేతు, దీప్తికేతు,
పంచహస్త, నిరామ, పృథుశ్రవః ప్రముఖులు దక్షసావర్ణిపుత్రులు రాజు లయ్యె
దరు. దశమమనువు బ్రహ్మసావర్ణి. సుధామవిరుద్ధాదులు సప్తదేవగణంబులు.
శాంతినామధేయుం డింద్రుండు. హవిష్మత్ప్రభృతులు సప్తర్షులు. నాభాగాదులు
పదుండ్రు బ్రహ్మసావర్ణిపుత్రులు రాజులు కాఁగలరు. పదునొకొండవమనువు
ధర్మసావర్ణి. విహంగమకామగమాదు లేకత్రింశద్దేవతాగణంబులు. వృష
నామధేయుం డింద్రుండు. ఈశ్వరాగ్నితేజోవపుష్మంతులు సప్తర్షు లయ్యె
దరు. సర్వత్రగ, సర్వధర్మ, దేవతానీకాదులు ధర్మసావర్ణిపుత్రులు రాజులు.
పండ్రెండవమనువు రుద్రపుత్రుఁ డైన రుద్రసావర్ణి. ఋతుధామాఖ్యుం
డింద్రుండు. హరితరోహితాదులు పంచదశదేవగణంబులు. తపస్వి, సుతప,
తపోమూర్తి, తపోరతి, తపోద్యుతి, ధ్రుతి, తపోధను లన సప్తర్షు లయ్యెదరు. దేవ
వ, దుపదేవాదులు రుద్రసావర్ణిపుత్రులు రాజులు కాగలరు. త్రయోదశ
మనువు రౌచ్య నామధేయుండు. సుత్రామ, సుశర్మ, సుధర్మాదులు త్రయ
స్త్రింశద్దేవగణంబులు. దివస్పతినామధేయుం డింద్రుండు. చాక్షుఁడు, పవిత్ర,
కనిష్ఠ, భ్రాజక, వాచావృద్ధాదులు దేవగణంబులు. అగ్ని, బాహుశుచి
ప్రముఖులు సప్తర్షులు. జౌరుంభ, హితబుద్ధ్యాదులు భావుర్యపుత్రులు
రాజులు నగుదురు. ఇది చతుర్దశమన్వంతరప్రకారంబు.

33


చ.

వినుము చతుర్యుగాంతమున వేదములన్నియు విప్లవంబు నొం
దినఁ గృతవేళఁ దొంటిగతి నేర్పున వాని వసుంధరాస్థలిన్
బనుపడఁజేయ సప్తఋషిమండలి తా నయియుండు పద్మలో
చనుఁడు చతుర్దశాఖ్యగల సర్వమనుప్రవరాంతరంబులన్.

34


ప్రతికృతయుగమున వసుధన్, జతురత మను వుదయమందు సమ్యగ్ధర్మ
ప్రతిపాలకు లగుదురు త, త్సుతులు తదన్వయము వెలయు సూనృతలీలన్.

35


క.

సురలు హవిర్భాగము లా, దరమునఁ గైకొండ్రు సవనతంత్రంబుల భా
సురులై మన్వంతరములఁ, బరిపాటిన్యాయుజూకపటలి యలరఁగాన్.

36

వ.

ఇంద్ర, దేవ, సప్తర్షి, మను, మనుపుత్రులు మన్వంతరాధికారులుగా నెఱుం
గుము. ఇట్లు చతుర్దశమన్వంతరంబులు సహస్రయుగపర్వతంబగు నొక్క
దివసం బగు. అది యొక్కొక్కకల్పం బనంబరంగు. రాత్రియుఁ దావత్ప్ర
మాణమై వర్తిల్లు.

37


చ.

కమలజుఁడౌ రమాపతి జగంబులు మూడును మ్రింగి శేషత
ల్పమున లయాంబురాశిసలిలంబులపైఁ బవళించి తన్నిశాం
తమునఁ బ్రబుద్ధుఁడై సుజనతత్పరతన్ భువనాళిఁ దొంటిచం
దమున సృజించు రాజనగుణప్రచురీభవదాత్మతంత్రుఁడై.

38


క.

మనువులు ఋషు లింద్రుండును, మనుపుత్రులు దివిజులును రమావిభువంశం
బనుపమసత్వోద్రిక్తం బని యెఱుఁగుము నీమనమున నార్యప్రణుతా.

39


వ.

చతుర్యుగంబులందు నీవిష్ణుదేవుఁడు స్థితివ్యాపారలక్షణుండై యుగవ్యవస్థలు
నడుపు. కృతయుగంబునఁ గపిలాదిరూపధారియై సర్వభూతహితరతుండై
విమలజ్ఞానదానంబు సేయు. త్రేతాయుగంబునం జక్రవర్తిస్వరూపంబున జగ
ద్రక్షణంబు సేయు. భూత, భవిష్య, ద్వర్తమానకాలంబుల జగంబులు రక్షించు.
మైత్రేయ! మన్వంతరంబులు చెప్పితి నిఁక నేమి చెప్పవలయుననిన గురువునకు
శిష్యుం డిట్లనియె.

40


క.

వేదవ్యాసమునీంద్రుఁడు, వేదద్రుమ మేవిధమున విభజించెఁ దదీ
యాదృతశాఖల వెన్ని, శుభోదయుఁ డతఁ డెన్నిమారు లుదయించె మహిన్

41


క.

హరి పుట్టించు జగంబులు, హరియందును నిలుచుఁ బొలియు హరివలననె యా
హరికన్న సృష్టిరక్షణ, హరణములకు లేదు కారణాంతర మరయన్.

42


వ.

అని యడిగిన శ్రీపరాశరుం డిట్లనియె.

43


క.

వేదతరువునకు శాఖా, భేదములు సహస్రము లవి పేర్కొని చెప్పన్
గాఁ దరమె యైనఁ జెప్పెద,. నాదృతి సంక్షేపమున మహాత్మా తెలియన్.

44


గీ.

తామరసలోచనుఁడు ప్రతిద్వాపరమున, నతులితప్రభ వ్యాసుఁడై యవతరించి
యేకమగు వేదరాశి ననేకభంగి, వెలయఁజేయు జగద్ధితకలనఁ గూర్చి.

45


క.

బలవీర్యబుద్ధితేజము, లలవడ నల్పములు మానవాదుల కని య
య్యలఘుండు వేదభేదము, లెలమి నొనర్చెం దదీయహితమతి యగుచున్.

46


వ.

వేదంబులు విభజించి విస్తరించుటం జేసి వేదవ్యాసుం డన వాసుదేవుండు వెలయు.
వినుము. ఈవైవస్వతమన్వంతరంబున నిరువదియెనిమిదిమార్లు వేదంబు

మహర్షులచేత వ్యస్తంబయ్యె. ఈ వైవస్వతమన్వంతరంబున ద్వాపరయుగం
బుల నిరువైయెనమండ్రు వ్యాసులు చనిరి. ప్రథమంబు ద్వాపరంబున స్వాయం
భువుండు తాన వేదంబు వ్యస్తంబు చేసె. ద్వితీయద్వాపరంబునఁ బ్రజాపతి
వ్యాసుండయ్యె. తృతీయద్వాపరంబున శుక్రుండు, చతుర్థద్వాపరంబున బృహ
స్పతి, పంచమద్వాపరంబున సవిత, షష్ఠద్వాపరంబునఁ బ్రభువైన మృత్యువు,
సప్తమద్వాపరంబున నింద్రుండు, అష్టమద్వాపరంబున వసిష్ఠుండు, నవమ
ద్వాపరంబున సారస్వతుండు, దశమద్వాపరంబున శ్రీధాముండు, ఏకాదశం
బునఁ ద్రికృష, ద్వాదశంబున భరద్వాజుండు, త్రయోదశంబున నంతకుండు,
చతుర్దశంబున ధర్ముండు, పంచదశంబునఁ ద్రయ్యరుణుండు, షోడశంబున ధనం
జయుండు, సప్తదశంబునఁ గృతంజయుండు, అష్టాదశంబున ఋణంజయుండు,
తదనంతరంబు భరద్వాజుండు, తదనంతరంబ గౌతముండు, తదనంతరంబ
హర్యాత్మ, తదనంతరంబ వేనుఁడు, తదనంతిరంబ వాజశ్రవుండు, తదనంతరం
బ సోముండు, తదనంతరంబ శుష్మాయణుండు, తదనంతరంబ తృణబిందుండు,
తదనంతరంబ ఋక్షుండు, తదనంతరంబ వాల్మీకి, అవ్వల నస్మజ్జనకుండైన శక్తి,
తదనంతరంబ నేను, నాతరువాత జతికర్ణుండు, అవ్వల కృష్ణద్వైపాయనుండు.
ఈయిరువదియెనమండ్రును నతీతవ్యాసులు. వీరిచేత వేదంబు నాలుగువిధం
బుల ద్వాపరాదులయందు విభజింపంబడియె వినుము.

47


క.

భావిద్వాపరమున సం, భావితుఁడగు ద్రోణసుతుఁడు భాసిలు వ్యాసుం
డై వేదచయము విస్మృత, మై వెలయింపఁగను భూసురాన్వయతిలకా.

48


సీ.

ప్రణవాఖ్య మేకాక్షరము బృహత్వము బృంహ, ణత్వమ్ము గలకతన న్మునీంద్ర
బ్రహ్మంబుసు మ్మందు బరఁగు భూర్భువరాది, సప్తలోకంబులు సకలవేద
తతియు సర్వంబును దాదృక్ప్రభావసం, భావిత మది వాసుదేవరూప
మక్షయ్య మధికగుహ్యము జగదుత్పత్తి, రక్షణనాశకారణము యోగ


గీ.

సాంఖ్యనిష్ఠాపరులకు శాశ్వతపుసుగతి, యమృత మాద్యంతరహిత మనంత మజర
మట్టిహరిరూపకప్రణవాభిధాన, మానితబ్రహ్మమునకు నమస్కరింతు.

49


వ.

ఆప్రణవంబునందు నున్న ఋగ్యజుస్సామాథర్వణవేదంబులు సర్వాత్మకుం
డగు పుఁడరీకాక్షుండు తాన వేదంబులు శాఖలునై విభజింపంబడియె.

50


క.

ఆదిని వేదంబు చతు, ష్పాదంబై శతసహస్రపరిమితమై లో
కాదృతమై వెలుగొందు శు, భోదయతన్ సకలసన్నుతోన్నతచరితా.

51


వ.

తదనంతరంబ సర్వకామధుక్కైన యజ్ఞం బయ్యె. అంత మత్పుత్రుండైనవ్యాసుం
డిరువైయెనిమిదవద్వాపరంబునఁ జతుష్పాదంబగు వేదంబు ఋగ్యజుస్సామా

థర్వణరూపంబుల నాలుగుతెఱంగులుగా విభజించె. ఆకృష్ణద్వైపాయనుండు
సాక్షాన్నారాయణుండుగా నెఱుంగుము. అతండు దక్క నన్యులకు నపార
భారతసాగరంబు నిస్తరింప శక్యంబే. ఆవ్యాసుండు బ్రహ్మచేత నియుక్తుండై
వేదంబు నాల్గుతెఱంగుల విభజించి శిష్యులం జదివించె. తత్ప్రకారంబు
వినుము.

52


సీ.

శమదమప్రతిభావిశాలుండు పైలుండు, కృతమతిఁ జేసె ఋగ్వేదపఠన
సద్గుణాయనుఁడు వైశంపాయనుఁడు, శుభాయతి యజురామ్నాయ మధిగమించె
వినుతనిష్కామి జైమినిమునిస్వామి సం, భావనానియతి సామము పఠించె
మహనీయత మహామతిమంతుఁడు సుమంతుఁ, డధికప్రభ నథర్వ మధిగమించె


గీ.

రోమహర్షణతనయుండు రుచిరవినయుఁ, డతులితఖ్యాతుఁడౌ సూతుఁ డల పురాణ
సహితసకలేతిహాసముల్ చాలఁ జదివె, నక్షయవ్యాసకరుణాకటాక్షమహిమ.

53


వ.

వేదంబులయందు యజుస్సులచేత యజుర్వేదంబును, ఋక్కులచేత ఋగ్వేదం
బును సామంబులచేత సామవేదంబును, నథర్వంబుల చేత నథర్వవేదంబును
నయ్యె. అయ్యథర్వంబు రాజులకు సర్వకర్మసాధనం బయ్యె. ఇట్లు వేదవ్యా
సుండు వేదకాననంబును జతుర్విధంబుగా విభజించె. అందు పైలుడు ప్రథ
మంబు ఋగ్వేదంబు నింద్రప్రమతికి నిచ్చె. ఆయింద్రప్రమతి భాష్కలున కిచ్చె.
ఆభాష్కలుండు బోధ్యాదులైన శిష్యుల కిచ్చె. ఆబోధ్యాదులవలన యాజ్ఞ
వల్క్యపరాశరులు గ్రహించిరి. ఇట్లు శాఖోపశాఖల ఋగ్వేదంబు వెలసె. ఆ
యింద్రప్రమతి నిజపుత్రుండైన మండూకేయునిం జదివించె. అతనిశిష్య
ప్రశిష్యులవలన విస్తరిల్లె. అతనిపుత్రుండు వేదమిత్రుండు ముద్గల, గోముఖ,
వాచ్య, శాలీయ, కౌశికులను శిష్యపంచంబునకు సంహితాపంచకంబుఁ జెప్పె.
ఇవ్విధంబున ఋక్కులు బహువిధంబులై కీర్తితంబు లయ్యె.

54


క.

మునివర వైశంపాయన, మునివరుఁడు యజుర్నిగమము మును పిరువదియే
డనుపమశాఖలు గావిం, చి నయం బొప్పఁగ నొసంగె శిష్యుల కెల్లన్.

55


సీ.

మునివరు ల్తొల్లి సమూహమై మేరుభూ, ధరకూటమున నుండి తమరు చేసి
రొక్కమర్యాద శిష్యులఁ గూడి యే, ఋషియైన నెచ్చోటకు నరిగెనేని
యతనికి సప్తరాత్రాంతరంబున బ్రహ్మ, హత్య వాటిలు నని యది యెఱింగి
మును లెవ్వ రెచ్చోటికిని బోవ రంత వై, శంపాయనుఁడు శిష్యసమితితోడ


గీ.

నచ్చటికిఁ బోయి యవశాత్ముఁ డగుచు నపుడు, స్వప్రియుని నొక్కబాలకు చరణతాడ
నాభినిహతునిఁ జేసిన నాక్షణంబె, భవ్యునకు నాయనకు వచ్చె బ్రహ్మహత్య.

56

క.

మునిపతి వైశంపాయనుఁ, డనునయమున శిష్యవరుల నను, "సద్వ్రత మీ
రొనరింపవలయు నాకున్, బనుపడ నీబ్రహ్మహత్య పాసెడుకొఱకున్."

57


వ.

అని గురుండు చెప్పిన.

58


క.

నిరుపమమేధానిధి భా, స్కరతేజుఁడు వారిలోన చతురుఁడు ప్రజ్ఞా
చరణుండు యాజ్ఞవల్క్యుఁడు, గురునకు నిట్లనియె మెండుకొను సద్భక్తిన్.

59


గీ.

అల్పతేజు లతిక్లిష్టులైన వీరి, చేత నేమగు చేసిన చేయఁదగుదు
నేన యని పూని పల్క నమ్మౌనివరుఁడు, పల్కెఁ గోపారుణాననపద్ముఁ డగుచు .

60


క.

ద్విజవరుల ధిక్కరించుటఁ, బ్రజనితమై యిపుడు ఘోరపాపము నిన్నున్
భజియించెఁ దొలఁగిపొ మ్మ, క్క జముగ మాచదువు మగుడగా నిచ్చి యనన్.

61


చ.

గురుఁడని నీకు నే హితము గూర్చి యొనర్చెదనన్న నిట్టిని
ష్ఠురతరభాష లాడెదవు చొప్పడునే భవదీయవేదవా
గ్భరణము దీనిఁ గొమ్మనుచుఁ గ్రక్కునఁ గ్రక్కిన రక్తసిక్తభీ
కరయజురాగమంబుఁ గొనెఁ గ్రమ్మర నామునిసార్వభౌముఁడున్.

62


వ.

ఇట్లు గురునిముందరం గ్రక్కినయజుస్సులు తిత్తిరిరూపంబున శిష్యులు
గ్రహించి వారలు తైత్తిరీయు లనంబరఁగిరి, గురుప్రేరితులై యధ్వర్యులు
బ్రహ్మహత్యా వ్రతంబు చరించి రంత యాజ్వల్క్యుఁడు స్వేచ్ఛంజని యజు
స్సు లభిలషించి ప్రాణాయామపరాయణుడై యాదిత్యు నుద్దేశించి యిట్లని
స్తుతియించె.

63


సీ.

సకలవేదాత్మమోక్షద్వారభూతదీ, వ్యత్తేజ నీ కివే వందనములు
సోమాగ్నిభూతసౌషుమ్నతేజోధారి, భాస్కర నీ కివే ప్రణతితతులు
కాలస్వరూప యక్షరరూప విష్ణుస్వ, రూపక నీ కివే మ్రొక్కుగములు
సురపితృరక్షణోత్సుక హిమఘర్మాంబు, కారి నీ కివె నమస్కారచయము


గీ.

లంధకారాపహరణ లోకాధినాథ, సర్వకామధురీణ విశ్వప్రపంచ
కారణ పవిత్రకిరణౌఘధారి యభ్ర, మణి యొనర్చెద నివె ప్రణామములు నీకు.

64


క.

నీ వుదయింపక సత్క, ర్మావళికి జనుం డయోగ్యుఁ డఖిలాంబువులుం
గావు పవిత్రము లట్టి శు, భావహునకు నీ కొనర్తు నభివందనముల్.

65


క.

నీకిరణంబులు సోఁకిన, లోకంబు పవిత్ర మగును లోకనయన పు
ణ్యాకరుఁ డాతం డెవ్వఁడు, నీకమనీయాంఘ్రిభక్తినిరతుఁడు తలఁపన్.

66

గీ.

అమృతమయవాజు లేదేవుహైమరథముఁ, దాల్చి దుర్గమగగనపథప్రచార
చారువైఖరిఁ దిరుగు నాసకలలోక, లోచనుని నిన్నుఁ గొలుతు సుశ్లోకచరిత.

67


వ.

సవిత, సూర్యుండు, భాస్కరుండు, వివస్వంతుండు, ఆదిత్యుండు, దేవాద్యాది
భూతుండును నైన నీకు నమస్కారంబు.

68


లయగ్రాహి.

సూర్య తిమిరోన్నమదహార్యభిదురీభవదవార్యచటులోగ్రతరధుర్యవిలసద్భా
గర్యభుజగాధిపతిధార్యసురసంచయవిద్యాసమరూపబలధైర్యసుతసంజ్ఞా
భార్యనిజకృత్యసురకార్యనిగమాంతనువిచార్య జగదర్దన కదర్యగుణరక్షా
వర్యహరణప్రవణశౌర్యనలినీసుఖదచర్య సతతప్రణమధార్య నినుఁ గొల్తున్.

69


చ.

అని యనియంతిభక్తి నిగమార్థముల న్వినుతించు యాజ్ఞవ
ల్క్యునిన్ బ్రసన్నుడై పలికె నుగ్రమయూఖుఁడు వాజిరూపుఁడై
మునివర యేమి గోరితి నమోఘముగా నొనగూరు నీవు గో
రినపని యన్న నన్నయవరిష్ఠుఁడు చేతులు మోడ్చి యిట్లనున్.

70


సీ.

నలినాప్త మద్గురునకు లేనియాజుష, సంహిత మీకటాక్షమున నాకుఁ
గావలెననిన నాకపటవాజితనూధ, రుడు యజుస్తతులు విప్రునకు నొసఁగె
నమ్మునీంద్రుండు శిష్యవరులఁ జదివించె, వాజిసూక్తపఠనవశత వారు
వాజిను లనఁగ భూవలయమునఁ బ్రసిద్ధు, లైరి కణ్వాదు లయ్యాగమంబు


గీ.

కొలఁది మీరఁ బదేనుశాఖలుగఁ జేసి, రనఘులగు యాజ్ఞవల్క్యశిష్యవరు లుర్వి
నెగడఁజేసిరి మిగుల ఇన్నిగమమహిమ, మానితాచార మైత్రేయమౌనివర్య.

71


క.

జైమినిముని భేదించెన్, సామనిగమతరువుఁ బెక్కుశాఖలుగఁ దదీ
యామితమహిమము విను చే, తోమోదము నిండఁ గ్రమముతో మునినాథా.

72


వ.

జైమునిమునీంద్రుడు సుమంతునిఁ దత్పుత్రుని సుపార్శ్వుని నొక్కొక
సంహితఁ జదివించె. తత్పుత్రుండు సుకర్ముండు సహస్రసంహితాభేదంబు చేసె
ఆసుకర్ముని శిష్యులు హిరణ్యనాభ, కౌసల్య, పౌష్విజప్రముఖులైన యుదీచ్యు
లాసహస్రసంహితలు గ్రహించి సామగాత లైరి. హిరణ్యనాభునివలనఁ దచ్ఛి
ష్యులు లోకాక్షి, కౌధుకి, కర్మంధి, లాంగలి, దౌష్సందిప్రముఖులు సంహి
తలు గ్రహించిరి. వారిశిష్యప్రశిష్యులవలన బహుసంహితలు ప్రవర్తించె.

73


గీ.

ధర్మనిరత యథర్వవేదము సుమంతుఁ, డాత్మశిష్యుఁ గబంధుని నధిగమింపఁ
జేసె నాతండు చదివించె శిష్యు దేవ, దర్శు నాతఁడు పథ్యుకుఁ దగఁగఁ జెప్పె.

74

వ.

దేవదర్శశిష్యులు మేధ, బలి, బ్రహ్మ, శాల్కాయని, పిప్పలాదప్రముఖులు
చదివిరి. పథ్యశిష్యులు జాజలికుముదాదిశౌనకులు ముగ్గురును సంహితలు చది
విరి. శౌనకుండు రెండుసంహితలు చేసె. ఒక్కసంహిత బభ్రునకును, రెండవ
సంహిత సైంధవునకు నిచ్చె. సైంధవుఁడు రెండుగా భేదించి ముంజకేశనక్షత్రుల
కిచ్చె. మఱియు నాంగీరసప్రముఖు లనేకశాఖలు చేసి రిది యథర్వపకారంబు.

75


గీ.

అంచితాఖ్యానములు నుపాఖ్యానము లన, గాథలవిశాలతాఖ్యాతి గలపురాణ
సంహితలు చేసి రోమహర్షణసుతునకు, సూతునకుఁ జెప్పె వ్యాసుఁ డస్తోకమహిమ.

76


వ.

సుమంతుండును, అగ్నివర్చుండును, మిత్రాయువు, శాంశపాయనుండు, అకృత
ప్రణుండు, సౌవర్ణియు నన నార్వురు సూతునిశిష్యులు పురాణంబులు, సంహి
తలు చదివిరి. కాశ్యపి, శాంశాయన, రోమహర్షణియును సంహితాత్రయంబు
చదివిరి. బ్రాహ్మంబు, పాద్మంబు, వైష్ణవంబు, శైవంబు, భాగవతంబు, నార
దేయంబు, మార్కండేయంబు, ఆగ్నేయంబు, భవిష్యత్పురాణంబు, బ్రహ్మకై
వర్తనంబు, లైంగంబు, వారాహంబు, స్కాందంబు, వామనంబు, కార్మంబు,
మాత్స్యంబు, గారుడంబు, బ్రహ్మాండంబు నను నష్టాదశపురాణంబులు సర్గ,
ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితంబులు తెలుపుచుండు. మైత్రేయా!
ఇప్పుడు నీకుఁ జెప్పు నిప్పురాణంబు వైష్ణవంబను మూఁడవపురాణంబు. ఇందు
సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితంబులయందును, సమస్త
వస్తువులయందును, భగవంతుండైన విష్ణుండు ప్రతిపాదింపఁబడు. షడంగం
బులు, నాల్గువేదంబులు, మీమాంసయు, న్యాయవిస్తరంబును, పురాణం
బును, ధర్మశాస్త్రంబును నన చతుర్దశవిద్యలు ఆయుర్వేదంబును, ధనుర్వేదం
బును, గాంధర్వంబును, నర్థశాస్త్రంబును గూడ నష్టాదశవిద్యలు చెప్పితి. బ్రహ్మ
ర్షులు, దేవర్షులు, రాజర్షులు నన ఋషిప్రభృతులు మూఁడుతెఱంగులు. ఇవ్వి
ధంబున శాఖలు, శాఖాభేదంబులు, శాఖాకర్తలు, తద్ధేతువులుం జెప్పితి.
సర్వమన్వంతరంబులయందును శాఖాభేదంబులు సమంబ ప్రాజాపత్యశ్రుతి
నిత్యంబ. ఇతరంబులు వికల్పంబులు. ఇంక నేమి యడిగెద వనిన మైత్రేయుం
డిట్లనియె.

77


క.

మునివర నే నడిగినవె, ల్లను నానతి యిచ్చితిరి సలక్షణముగ నిం
క నొకటి యడిగెద నిన్నుం, బనివడి యది యాన తిమ్ము ప్రస్ఫుటభంగిన్.

78


సీ.

సర్వజ్ఞ యీసారసభవాండమధ్యస్థి, తాశేషలోకంబులందు స్థూల
సూక్ష్మరూపము లగుచు న్నిండి స్థావర, జంగమంబులు ప్రాణిసముదయములు

వ్రే ల్మోప నెడలేక క్రిక్కిరిసి స్వకర్మ, బంధబంధములయి పరఁగి తుదను
యమునివశము నొంది యాతన ల్చెంది క, ర్మానుగుణంబులై యోనులందుఁ


గీ.

బుట్టి సుఖదుఃఖములు కాంచి భూరికర్మ, వశత నెప్పుడు బోవుచు వచ్చుచుండు
నిది సకలశాస్త్రనిర్ణయం బిందు నొకటి, యడుగుచున్నాఁడ నానతీయంగవలయు.

79


మ.

శమనాజ్ఞావశవర్తు లౌట నిజ మీజంతువ్రజంబుల్ యథా
ర్థముగా నొక్కటి యాన తిమ్ము మునిచంద్రా! యెట్టికర్మంబుచే
శమనుం జూడక శాశ్వతప్రతిభమై జంతూత్కరం బొందు ది
వ్యమహావైభవ మట్టికర్మము విన హర్షంబు పుట్టె న్మదిన్.

80


చ.

అనినఁ బరాశరుండు పరమాకృతి నిట్లను దొల్లి భీష్మునిం
గని నకులుండు నీవడుగుకైవడి న ట్లడగంగ జాహ్నవీ
తనయుఁడు మాద్రిపట్టిఁ గని ధార్మిక! తొల్లి కళింగదేశసం
జనితుఁడు విప్రుఁ డొక్కఁడు ప్రసన్నత నాకడ కేగుదెంచినన్.

81


వ.

జాతిస్మరుండును విజ్ఞాసంపన్నుండును నగునమ్మునీంద్రుని బూజించి నీవడి
గిన యర్థం బమ్మునీంద్రుని నడిగిన నమ్మహానుభావుండు నాకుం జెప్పిన రహస్యంబు
నీకు జెప్పెద నని యప్పితామహుండు మనుమనిం జూచి యమునకుం గింకరు
నకుఁ దొల్లి యొక్కసంవాదంబు ప్రవర్తిల్లె. దానిం జెప్పెద వినుమని యిట్లనియె.

82


ఉ.

పంకజమిత్రసంభవుఁడు ప్రస్ఫుటపాశవిపాశహస్తుఁడై
కింకరుఁ జేరఁబిల్చి పలికెం జెవిలో హరిభక్తులున్న యా
వంకకు పోకు మేనును ధ్రువంబుగ నన్యులకుం బ్రభుండ ని
శ్శంకత వైష్ణవావళికి సత్యము నాథుఁడఁ గాను గింకరా.

83


చ.

అమరవరార్చితుండయిన యబ్జజుశాసన మూఁది సర్వలో
కములు హితాహితంబు లవికంపతలీల నెఱింగి శాసక
త్వమున వెలుంగు నాకును యథాకథనంబుగ శాసనుండు శ్రీ
రమణుఁడు సద్విహింగమతురంగమసాది సుమీ తలంపగన్.

84


గీ.

బహువిధవికల్పనాసముద్భాసి యయ్యు, జగ మిదంతయుఁ బద్మలోచనుఁడె సుమ్ము
కటకకుండలమకుటాదికప్రభేద, కలిత మయ్యును హేమ మొక్కటియ కాదె.

85


క.

అవనీపరిమాణువు ల, ప్పవనగతిం గానుపించుఁబవన మణఁఁగఁగా
నవనియ యౌనట్లన గుణ, నివహ మణఁగ జగము పద్మనేత్రుఁడు సుమ్మీ.

86

చ.

అమరచరప్రపూజ్యచరణాంబురుహుం డగు నిందిరావధూ
రమణు భజించి మ్రొక్కుచు విరాజతపూజితవృత్తి నున్నయ
య్యమలుని దండకుం జనకుఁ డాజ్యసమేధితవహ్ని డగ్గఱన్
గమరునుగాక దేహములు గాఢశిఖావిశిఖాభిఘట్టనన్.

87


చ.

అనిన భటుండు కే ల్మొగిచి యర్యమసూతికి నిట్లనం జనా
ర్దనుపదభక్తుఁడై వెలయు ధన్యుఁడు మానవుఁ డెట్టివాఁడు త
ద్వినుతచరిత్ర మెట్టిది వివేకనిధాన! యనూనసత్కృపా
భినయకటాక్షవీక్షల గభీరతఁ గన్గొని చెప్పవే యనన్.

88


సీ.

నిజవర్ణధర్మనిర్ణిద్రుడై శత్రుమి, త్రులయందు సమబుద్ధి గలుగునతఁడు,
పరసతి పరధనాపహరణవిముఖుడై, లేశమైనను హింస లేనియతఁడు
స్థిరమనోవృత్తియై గురు కలికాలక, ల్మషరహితాత్మత మలయునతఁడు,
హృదయవిశ్రాంతలక్ష్మీశుఁడై సమలోష్ట, కాంచనాశ్మత్వంబు గలుగు నతఁడు


గీ.

సత్యవాచాభినిరతి సౌజన్యనియతి, సతతహరిచింతనామతి సంభృతధృతి
కలితసత్కర్మగతియును గలుగునతఁడు, విష్ణుపదభక్తుఁ డనుచు భావించు మదిని.

89


వ.

మఱియును.

90


గీ.

స్ఫటికతైలశిలామలప్రభుఁడు విష్ణుఁ, డొక్కడెక్కడ దోషసమేధమాన
మాననమనోనివాస మెమ్మాడ్కగి నుండు, జ్వలనకీలాప్రతాపంబు జలములందు.

91


ఉత్సాహ.

అమలమతి యమత్సరాత్ముఁ డధికశాంతుఁ డతిశుభో
ద్గమచరిత్రుఁ డఖిలమిత్రతముఁడు ప్రియహితార్థవాక్
సముదయుం డమాయుఁడు గతగర్వుఁ డెవ్వఁ డట్టియు
త్తమునిహృదయమున వసించు దానవారి నిత్యమున్.

92


గీ.

వాసుదేవుఁడు నిజమనోవర్తియైన, పురుషుఁ డతిసౌమ్యరూపుఁడై పొలుచు జగతి
నయము మీరిన చక్కఁదనమున ధరణి, తలరసము సాలపోతంబు తెలుపుఁ గాదె.

93


సీ.

మహనీయయమనియమావిధూతసకల, కల్మషయోగసంకలసహితుల
ననుదినవిష్ణుచింతనసక్తచిత్తులై, పరితోషమునఁ బొంగు భవ్యమతుల
మర్దితమదమానమత్సరోద్వేగులై, సమశాంతతనున్న పురుషవరుల
దూరతోగళదహంకారలోభక్రోధు, లై వికారములేని పావనులను


గీ.

దూరమునఁ జూచి మ్రొక్కి యాత్రోవఁ జనక, తొలగి దవ్వుగఁ జనుము నీకొలఁది గాదు
తలఁప వారలమహిమ నీతరమె దీని, సరణి తెలిపితి నీకుఁ గింకరవరేణ్య.

94

చ.

అరిదరశార్ఙ్గనందకగదాఢ్యభుజార్గళుఁడైన యిందిరా
వరుఁడు వసించియున్న జనవంద్యుని మానససీమఁ బాపసం
కర మనవచ్చు నెట్లు? సువికస్వరభాస్వరరశ్మివారభా
స్కరుఁడు వెలుంగ నంధతమసంబు వెసంబరిపోక నిల్చునే.

95


క.

పరధనము గొనుచు జంతూ, త్కరములఁ జంపుచు వృథానృతము లాడుచు ని
ష్ఠురవృత్తిఁ దిరుగు నశుభా, కరుని మది ననంతుఁ డుండఁగాఁ దలఁచఁ డొగిన్.

96


చ.

ఒరుసిరి కోర్వలేక సుజనోత్తమనింద యొనర్చుచుం ద్విజో
త్కరగురుపూజఁ బోవిడిచి దానము ధర్మము లేకయున్న దు
శ్చరితునిమానసంబున నిశాచరకాననదావవహ్నియౌ
హరి నివసించియుండఁడు యథార్థము దీని నెఱుంగు కింకరా.

97


గీ.

మిత్రబాంధవపుత్రకళత్రమాతృ, పితృదుహితృభృత్యవితతిపైఁ బ్రేమ విడిచి
యర్థతృష్ణ సదాశాక్య మాచరించు, దుష్టచేష్టుండు విష్ణుభక్తుండు కాఁడు.

98


చ.

ఖలుఁడు విమార్గవర్తనుఁడు కష్టుఁడు దుష్టసమాగతుం డమం
గళమతి ఘోరపాపకృతకర్మనిబంధనబద్ధుఁడైన య
త్తులువ మనుష్యగర్దభము దూకొననేర్చునె వాసుదేవప
జ్జలరుహభక్తివాసన యసహ్యముగానె తలంచు నెప్పుడున్.

99


క.

ఏనును నిజ్జగ మెల్లరు, మానారీరమణుఁ డనుచు మది నెన్నెడున
మ్మానవమణిఁ గని దూరము, గా నేగుఁడు తొలఁగి బుద్ధి గలిగినయేనిన్.

100


ఉత్సాహ.

కమలనయన వాసుదేవ కలుషహరణ విష్ణుదే
వమహిధరణ నిఖిలమౌనివంద్యచరణ యచ్యుతా
యమలశంఖచక్రధారి యరసి ప్రోవు నన్ను నం
చు మది నెంచు పుణ్యుఁ దేరిచూడ కేగు దవ్వుగాన్.

101


పంచచామరము.

హరే జగన్నివాస కేశవాచ్యుత శ్రియఃపతే
మురాసురాంతకాప్రమేయమోక్షదావ మాం ప్రభో
పరాత్పరేశ యంచు నెంచు భాగ్యశాలి యెవ్వఁ డా
వరేణ్యుఁ డున్నత్రోవఁ బోవవద్దు సుమ్ము కింకరా.

102


చ.

వనజదళాక్ష భక్తజనవర్గముడగ్గరఁ బోవరాదు పో
యినయపుడే మదాంధదనుజేభఘటావిఘటీకృతప్రచం
డనిబిడరోషకేసరి భటా! హరిచక్రము విక్రమించినన్
మనతల లెల్లఁ బోవు ననుమానము లే దిది నీకుఁ జెప్పితిన్.

103

వ.

అని చెప్పి కళింగబ్రాహ్మణుఁడు గంగాపుత్రున కిట్లనియె.

104


క.

కమలాప్తభవుఁడు నిజభటు, నమరఁగ బోధించెఁ గౌరవాన్వయ! నా కా
కమలాప్తభవునికరుణన్, గ్రమగతి నెఱిఁగించె వింటిగాదె మదుక్తిన్.

105


సీ.

అని చెప్పి బ్రాహ్మణుం డరిగె మాద్రేయ! దు, స్తరసంసరణవారి దాటఁదరమె?
శ్రీహరిభక్తివిశిష్టనౌకాశ్రయ, ణము లేక యెన్నిచందములనైన
యముఁడు తద్భటులును యాతనల్ దండపా, శములును కేశవాసక్తమతికిఁ
దృణకణాయితములు తెల్ల మివ్విధమెల్ల, హరిభక్తులకు సాటి యవని కలదె


గీ.

నన్ను నడిగినయట్టిప్రశ్నమున కిది స, దుత్తరం బవుగదా మదీయోక్త మగుచు
మనుమనికి గంగపట్టి చెప్పినవిధంబు, తెలియఁజెప్పితి నిపుడు మైత్రేయ నీకు.

106


క.

అని చెప్పిన మైత్రేయుం, డనుమోదరసార్ద్రహృదయుఁడై నరు లబ్జా
క్షుని నె ట్లారాధింతురు, ఘనతరసద్భక్తియుక్తి గలిగి మునీంద్రా

107


క.

ఆరాధితుఁడగు మురదై, త్యారాతివలన నిరంతరారాధనని
ష్ఠారతుఁడై ఫల మొందు ర, మారమణీనాథభక్తమణి చెప్పంగన్.

108


వ.

అని యడిగిన శ్రీపరాశరుం డిట్లనియె.

109


క.

మును సగరుఁ డనెడునరపతి, యనుపమభృగువంశభవుని నౌర్వునిఁ గని యి
ట్లన యడిగిన నమ్ముని య, జ్జనపతికిం జెప్పె వినుము చక్కగ దానిన్.

110


వ.

ఔర్వుండు సగరున కిట్లనియె.

111


గీ.

భౌమపదమైన నవ్వలిపదములైన, నజునిపదమైన నిర్వాణమైన నొసఁగు
శౌరియారాధకుం డేమి గోరి తనకు, నర్థి నారాధనము చేయు నట్లు కరుణ.

112


వ.

అల్పం బధికం బను వివక్ష లేదు, ఆరాధనపరుం డేమి గోరినను నిచ్ఛానుగుణం
బుగా ఫలంబు నలినాక్షుం డొసంగు. ఇది ఫలప్రకారంబు. ఇంక నారాధన
ప్రకారంబు చెప్పెదనని యౌర్వుం డిట్లనియె.

113


శా.

ఆరూఢప్రతిభావిశేషమున నిత్యత్వోక్తవర్ణాశ్రమా
చారోదారచరిత్రుఁడౌ నరునిచే సమ్యగ్విధిం గేశవుం
దారాధ్యుండగు నింతకన్న మఱియొం డన్యంబు తత్తోషకం
బై రాజిల్లెడుత్రోవ లేదు నిజ మీయర్థంబు రాజోత్తమా.

114


గీ.

యజనముల యజ్వ యజియించు హరినె హరినె, జపిత జపియించు హింసించు జంతుహింస

కుండు హరినె యనేకభంగులఁ దరింప, సర్వభూతుండు హరి యౌట నగరభూప.

115


వ.

కావున సదాచారవంతుండై నిజవర్ణోక్తధర్మానుకారియై పురుషుఁడు జనార్దను
నారాధింపవలయు. బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు స్వధర్మతత్పరులై
సదాచారసంపన్నులై విష్ణుదేవుని నారాధించుట కర్తవ్యంబు. ఒండుప్రకా
రంబు లేదు.

116


గీ.

అనృత మాడక యొరు చెడనాడఁబోక, పరుషవై శున్యవాక్యము ల్బలుకపోక
మెలఁగు పురుషునిచేత శ్రీజలజనేత్రుఁ, డనుదినంబును సంతుష్టుఁ డగు నిజంబు.

117


సీ.

పరవధూపరవిత్తపరహింస లాత్మలోఁ, దలఁపనొల్లని పుణ్యతమునిచేత
గురుదేవ భూదేవవరులకు శుశ్రూష, లొనరించు పరమపావనునిచేతఁ
దనపుత్రునందు భూతములందు నొక్కచం, దమున మే లొనగూర్చు ధన్యుచేత
రాగాదిదోషవైరస్యంబు లేని చి, త్తమున వెలుంగు నుత్తమునిచేత


గీ.

సారవర్ణ శ్రమోదార సర్వధర్మ, పథము తప్పక చరియించు భవ్యుచేత
నబ్జనాభుఁడు సంతోషితాత్ముఁ డగును, సకలసమ్యగ్గుణకలాప సగరభూప.

118


వ.

అని చెప్పిన.

119


క.

సగరుం డౌర్వునిఁ గనుఁగొని, భృగువర నా కానతిమ్ము ప్రియము మనమునం
దగ వర్ణాశ్రమధర్మము, లగణితతావకకృపారసాతిశయమునన్.

120


వ.

అని యడిగిన నౌర్వుం డిట్లనియె.

121


సీ.

అగ్రజన్ముఁడు స్నాతుఁడై నిత్యకృత్యంబు, లాచరించుచు దాన మధ్యయనము
యజనంబు సురతృప్తికై చేయవలయు భృ, త్యర్థంబు యాజనాభ్యాపనములు
సత్ప్రతిగ్రహమును జరుపఁగావలయు న, గ్నిపరిగ్రహంబును నిఖిలభూత
మైత్రియు పాషాణమణిహేమములయందు, సమబుద్దియును ఋతుసమయములను


గీ.

పత్నికూటమియును జేసి పరఁగవలయు, నైహికాముష్మికంబుల నందుకొఱకు
నిగమనిగదితవిధి యిది నిగమబుద్ధిఁ, దెలియు మీచంద మెల్ల పార్థివవరేణ్య.

122


సీ.

క్షత్రియప్రవరుఁ డిచ్చకు వచ్చినట్టిదా, నములు చేయుచు యజనములు పెక్కు
లాచరించుచు నధ్యయనము సేయుచును శ, స్త్రాజీవమహిరక్ష లాత్మవృత్తి
గాఁ బ్రవర్తిల్లుచు క్షమ గల్గి ధర్మైక, నిరతి ప్రజారక్షణ రతి మెఱసి
దుష్టానుశాసన శిష్టసంరక్షణ, క్రమమున రంజకత్వమున వెలసి


గీ.

ధరణిఁ బ్రజ లొనరించు సత్కర్మతతులు, నంశములు తన్నుఁ జెంద దివ్యప్రభావ
కలితుఁడై యొప్పి వర్ణసంకరము మాన్చి, ప్రవిమలోభయలోకవైభవముఁ గాంచు.

123

వ.

పాశుపాల్యంబును, వాణిజ్యంబును, కృషియును వైశ్యునకు జీవికగాఁ బితా
మహుండు నిర్మించి యిచ్చె. అతనికి నధ్యయనయజ్ఞదానంబులు ప్రశస్తంబులు.
నిత్యనైమిత్తికకర్మానుష్ఠానంబును విహితంబు. శూద్రునకు ద్విజాతిశుశ్రూషం
బును ద్విజాతిపోషణంబును, క్రయవిక్రయార్జితద్రవ్యంబుననైనను నితర
కర్మోద్భవద్రవ్యంబుననైనను దానంబును, పాయక యజ్ఞంబులచేత యజిం
చుటయును, పిత్రియాదికర్మాచరణంబును నాచరింపవలయు. భృత్యాది
భరణార్థంబునకుఁ బరిగ్రహంబునుం జేయవలయు. సగరభూపాల! స్వభార్య
యందు ఋతుకాలాభిగమనంబును, సమస్తభూతదయయును, తితిక్షయు,
నాతిమానితయు, సత్యశౌచంబులు, అనాయాసంబు, మంగళంబు, ప్రియ
వాదిత్వంబు, మిత్రత్వంబు, నిస్పృహ, అకార్పణ్యంబు, అనసూయయు, సర్వ
వర్ణంబులకు సమానగుణంబులు. ఇంక నాపద్ధర్మంబులు వినుము.

124


గీ.

బ్రాహ్మణుఁడు క్షత్రియునివృత్తి రాజు వైశ్యవృత్తి, వైశ్యుండు శూద్రునివృత్తి నడుప
వలయు నాపదయైన శూద్రులనడకలు, బ్రాహ్మణక్షత్రియులకు నర్హములు కావు.

125


వ.

బ్రాహ్మణక్షత్రియులును సామర్థ్యంబు గలిగిన శూద్రవృత్తి మానవలయు.
అత్యంతాపదయైన శూద్రవృత్తియైన వలయుననియుం గలదు. కర్మసంక
రంబు చేయవలదని యౌర్వుం డాశ్రమధర్మంబులు వినుమని సగరున
కిట్లనియె.

126


సీ.

బాలత్వమునఁ గృతోపనయఁడై విప్రుండు, చదువుటకై గురుసదనవాసి
యె బ్రహ్మచర్యాసమాహితత్వముని శౌ, చాచారవంతుఁడై యధికబుద్ధి
గురునకు శుశ్రూష గూర్చి చేయుచును సు, వ్రతనిష్ఠ వేద మున్నతిఁ జదువుచు
నుభయసంధ్యలను సూర్యుని నగ్నిఁ గొలుచుచు, గుర్వాజ్ఞ భైక్ష్యంబు గుడిచి నిలిచి


గీ.

జలసమిన్ముఖ్యములు గురువులకు భక్తిఁ దెచ్చి యిచ్చుచు వేదంబు దృఢమనీష
నభ్యసింపంగవలయు రాజాగ్రగణ్య, బ్రహ్మచారి సముజ్వలప్రతిభ మెఱసి.

127


వ.

ఇట్లు బ్రహ్మచర్యంబు నడిపి గార్హస్థ్యంబునకు ననుజ్ఞాతుండై గురుదక్షిణ
యొసంగి.

128


ఉ.

ధర్మమునన్ యథోక్తగతి దారపరిగ్రహ మాచరించి స
త్కర్మమునన్ ధనార్జన ముదారతఁ జేసి గృహస్థకృత్యముల్
నిర్బలవృత్తియై నడిపి నిచ్చలు యజ్ఞము లైదు చేయుచున్
బేర్మి యెలర్ప సద్గతి లభించు గృహస్థుఁడు లోకపూజ్యుఁడై.

129

వ.

నివాపంబునఁ బితరులను, యజ్ఞంబున దేవతలను, నన్నంబున నతిథులను, స్వా
ధ్యాయ౦బున ఋషులను, సంతానంబునం బ్రజాపతిని, బలికర్మంబుల భూతం
బులను, వాత్సల్యంబున జనంబులను దుష్టిం బొందించి గృహస్థుండు నిజకర్మ
సమార్జితంబులగు నుత్తమలోకంబులం బొందు.

130


క.

బైక్షము జీవికగాఁగల, భిక్షుకులము బ్రహ్మచారిబృందమ్మును స
ర్వక్షేమంకరకృత్యవి, చక్షణు గృహమేధిఁ జేరి సప్రాణించున్.

131


ఉ.

వేదము లభ్యసించుటకు వేమరు తీర్థము లాడఁ బుణ్యశై
లాదులు చూడ నెప్పుడు ధరామరవర్గము సంచరించు న
త్యాదృతిఁ బ్రొద్దుకూఁకులు గృహంబులు నీరము లన్నము ల్మహీ
వేదులు తల్పముల్ హరియె విత్తముగా మదిలోన నెంచుచున్

132


వ.

అట్టి యతిథులకు గృహస్థుం డాస్పదంబు. అయ్యతిథుల స్వాగతంబు మధురో
క్తుల నడిగి గృహస్థుండు శయనాసనభోజనంబు లొసంగవలయు

133


గీ.

అతిథి యెవ్వనియింటికి నరిగి రిత్త, పోవుఁ దనపాతకములెల్లఁ బూను వాని
సుకృత మెల్లను గొనిపోవుఁ జువ్వె గాన, నతిథి నూరక పొమ్మన ననుచితంబు.

134


వ.

అవజ్ఞయు, దంభంబును, బరితాపోపఘాతంబులును, బారుష్యంబును నతిథుల
యెడం జేయరాదు. ఏగృహస్థుండైనను నాతిథ్యంబును సమ్యగ్విధిం జేయు
నాతండు సమస్తపుణ్యలోకంబుల నొందు.

135


క.

తనకు వయఃపరిణతిగాఁ, దనయులకడ నిలువనైనఁ దనయనుగతినై
నను రా సతి నియ్యఁగొలిపి, వనమునకుం బోయి యచట వన్యాశనుఁడై.

136


వ.

వనంబున నిల్చి, కేశశ్మశ్రుజటాధరుండును, భూమిశాయియు, మననశీలుం
డును, సర్వార్థనిస్పృహుండును, చర్మ, కుశ, కాశ, ధృతపరిధానోత్తరీ
యుండును, త్రిషవణస్నానపరుండును, నగ్నిదేవతాభ్యాగతపూజాతత్పరుం
డును, భిక్షాబలిప్రదాతయు, వన్యస్నేహకృతగాత్రాభ్యంగకార్యుండును, శీతో
ష్ణాదిసహిష్ణువు నై వానప్రస్థచర్య నడపి యతండు దవానలంబు తూలరాశు
లంబోలె సర్వదోషంబుల దహించి శాశ్వతపుణ్యలోకంబుఁ గాంచు.

137


క.

నాలుగవయాశ్రమము భూ, పాలక యెఱిఁగింతు వినుము బ్రాహ్మణుఁడు విని
ర్మూలితమదమత్సరుఁడై, నాలాయము భిక్షువృత్తి వర్తింపఁదగున్.

138


వ.

పుత్రమిత్రకళత్రాదులపై స్నేహంబు విడిచి త్రైవర్గికంబులగు సర్వారంభంబులు
విడిచి శత్రుమిత్రాదులయందు సమత గలిగి సర్వజంతులయందు ద్రోహంబు
మాని మైత్రుండై సంగంబు వదలి యేకరాత్రంబు గ్రామంబునఁ బంచరాత్రంబు

పురంబున నిలుచుచుఁ బ్రీతిద్వేషంబులు లేక యింటివారు భుజియించి
పొయి చల్లార్చినకాలంబునఁ బ్రశస్తవర్ణులయిండ్ల భిక్షాటనంబు చేసి ప్రాణం
బులు నిలుపుచుఁ గామ, క్రోధ, దర్ప, మోహ, లోభాదిదోషంబులు పరిత్య
జించి నిర్మలుండై తనవలన సర్వభూతంబులు, భూతంబులవలనఁ దానును,
భయంబు వొరయకుండునట్లుగా మెలంగుచు, నగ్నిహోత్రంబు శరీరంబున,
శరీరాగ్నిహోత్రంబులు ముఖంబునను వేల్చి భిక్షుండు మోక్షాశ్రమం బాశ్ర
యించి నిరింధనజ్యోతియుం బోలె శాంతుండై బ్రహ్మలోకంబు నొందునని
చెప్పిన.

139


క.

ఔర్వుని నతులప్రతిభా, శర్వుని నీక్షించి పలికె సగరుఁడు కరుణా
ధూర్వహకటాక్ష! యశ్రుత, పూర్వం బొక టడుగవలయుఁ బో మిముఁ దెలియన్

140


ఉ.

హత్తి యొనర్చు పూరుషున కారయఁ గృత్యములైన నిత్యనై
మిత్తికకామ్యకర్మములు మెచ్చుగ నేగతి యాచరించు వా
రిత్తఱిఁ జెప్పుమయ్య మది హెచ్చె భవద్వచనావళు ల్వినన్
జిత్తమునం, గుతూహలవిజృంభము భార్గవవంశవర్ధనా.

141


వ.

అనిన నౌర్వుం డిట్లనియె. పుత్రుండు పుట్టిన నభ్యుదయాత్మకంబైన శ్రాద్ధంబు
సేయవలయు. బ్రాహ్మణభోజనంబు వెట్టి నాందీముఖులకుఁ బిండప్రదానంబు చేసి
దశమదివసంబున నామకరణంబు చేయవలయు.

142


గీ.

వలయుభంగి నుత్సవము చెల్లఁగా దేవ, నామమైన మనుజనామమైన
శుభముహూర్తమున విశుద్ధుఁడై జనకుండు, సుతున కిడఁగవలయు నతులమహిమ.

143


వ.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకుఁ గ్రామంబున శర్మ, వర్మ, గుప్త,
దాసాత్మకంబైన నామం బిడవలయు. అర్ధహీనంబును, నప్రశస్తంబును, నప
శబ్దయుతంబును, నమాంగళ్యంబును, జుగుప్సితంబును నగు నామం బిడవలదు.
సమాక్షరంబును, నాతిహ్రస్వంబును, నాతిగుర్వక్షరాన్వితంబును, సుఖోచ్చా
ర్యంబునగు నామం బిడవలయు.

144


సీ.

సరవి ననంతరసంస్కారసంస్కృతుఁ, డై గురుగేహంబునందు విహిత
విధి నవలంబించి విద్యాపరిగ్రహ, ణము చేసి గురుదక్షిణాప్రదాన
కారియై గార్హస్థ్యకలన కనుఙ్ఞాతుఁ, డైనను మేలు కాదేని బ్రహ్మ
చర్యంబుననయుండు సన్న్యాసియైనను, వైఖానసుండైన వలసినట్టిఁ


గీ.

డై ముముక్షుత్వమున సత్క్రియాకలాప, మాచరింపంగవలయు బ్రాహ్మణుఁడు వేద
విహితవిధి యిది దీని భావించి వినుము, మహితగుణసాంద్ర! సగరభూమండలేంద్ర!

145

వ.

గార్హస్థ్యంబు గావలసి ననేకగుణవర్ష యైనకన్యకను దాను ద్రిగుణవర్షుండై పరి
గ్రహింపవలయు

146


సీ.

అతికేశియు నకేశి యధికాంగి కృష్టాంగి, పింగళన్యూనాంగి యంగహీన
రోగిణి, కులట, యరూపిణి, దుష్టవా, త్సల్యసరోషయు శ్మశ్రువదన
కాకస్వర కృశాంగి మల్హరస్వర పురు, షాకృతి బుద్ధాక్షి యరుణదృష్టి
పీనాంగి వామన పృధుదీర్ఘసంహత, భ్రూయుగరూక్షాంగి క్రుద్ధవదన


గీ.

చిత్రదంత మషీవర్ణ శ్వేతవర్ణ, కూపగండ సమున్నతగుల్భరోమ
సహితజంఘ వినిందితాచార యైన, కన్యఁ బెండిలియాడఁగఁ గాదు బుధులు.

147


వ.

మాతృపక్షంబునఁ బంచమియుఁ బితృపక్షంబుస సప్తమియు నైనకన్యకను
యథావిధి వివాహంబు గావలయును. బ్రాహ్మ్యంబు దైవంబు నార్హంబు బ్రాజా
పత్యంబు నాసురంబు గాంధర్వంబు రాక్షసంబు పైశాచంబు నన నెనిమిది
వివాహంబులు. అం దేవర్ణంబున కేవివాహంబు విహితం బావివాహిం బావ
ర్ణంబువారు చేయవలయు. ఇవ్విధంబున సలక్షణయైన ధర్మచారిణిని బరి
గ్రహించి తత్సహితుండై గృహస్థుండు విహితకృత్యంబులు నడిపి సమ్యగూర్ధ్వ
మహాఫలంబు నొందునని చెప్పిన సగరుం డిట్లనియె.

148


గీ.

మౌనినాథ! సదాచార మానతిమ్ము, కరుణతో నాకు శ్రవణేచ్ఛ గడలుకొనియెఁ
దాన నడిచి గృహస్థుండు మాననీయ, దివ్యలోకసుఖాప్తి మోదించుఁగాదె.

149


వ.

అనిన నౌర్వుం డిట్లనియె.

150


మ.

జననాథోత్తమ చెప్పెద న్విను సదాచారంబు నిత్యంబు స
జ్జను లత్యాకృతి నాచరించుట సదాచారంబనం జెల్లు స
జ్జనసంజ్ఞుల్ మనువుల్ ప్రజాపతులు నాసప్తర్షులుం జువ్వె త
ద్వినుతాచారపరాయణుండు గను ఠీవిన్ రెండులోకంబులున్.

151


గీ.

రాజ! విను ధర్మపీడాకరంబులైన, యర్థమును గామమును మాను టర్హ మగును
అసుఖమై లోకవిద్విష్ట మయ్యెనేని, ధర్మమును మానవలయు భూధరవరేణ్య.

152


వ.

కాల్యంబున న్లేచి తననివాసంబునకు నైరృతిభాగంబున నంపకోల వాఱినంత
దూరము పోయి యచ్చట మూత్రపురీషంబుల విడువవలయు

153


క.

తననీడఁ దరువునీడన్, విను గోరవివహ్నివాతవిప్రగురువులం
గనుచు నెదురుగను విడువం, జనదు మలము మూత్రమును బ్రశస్తున కెపుడున్.

154


గీ.

పైరులో దుక్కిలో మందపట్టునందు, తెరువులో నీటిలో నదీతీర్థములను
మసనమున నేటిదరియందు మానవుండు, మలము మూత్రంబు విడువరా దలఘుచరిత.

155

వ.

దివాభాగంబున నుత్తరాభిముఖుండును, నిశాభాగంబున దక్షిణాభిముఖుండును
నై విణ్వూత్రంబులు విడువవవలయును. ఆపదయైన నేముఖంబైన దోషంబు
లేదు.

156


గీ.

ధరణి తృణమునఁ గప్పి మస్తకము కప్పి, తడవు చేయక నిట్టూర్పు లడరనీక
మౌనియై విడువందగు మలము మూత్ర, మును సదాచారనిరతుండు జనవరేణ్య.

157


వ.

పుట్టమన్ను, నెలుకమన్ను, నింటిలోనిమన్ను, శౌచశేషం బైనమన్ను, గోడపూఁత
మన్ను, దుక్కిమన్నును శౌచంబునకుం గాదు. గృహస్థుల కొక్కమృత్తిక లిం
గంబునందును, మూఁడుమృత్తికలు గుదఁంబునను, బదిమృత్తికలు వామక
రంబున, మఱియు హస్తద్వయంబునఁ, బాదంబుల నొక్కటొక్కటిం బెట్ట
వలయు. స్వచ్ఛంబును, దుర్గంధఫేనవర్జితంబును నగుజలంబున శౌచంబు
చేయవలయు. అనంతరంబు పాదశౌచంబు చేసి కృతాచమనకార్యుండై,
కేశప్రసాదనంబు చేసి, మాంగళ్యదూర్వారంబుల ధరించి.

158


గీ.

తనకులాచారధర్మంబు తప్పకుండ, నర్థ మార్జించి యజయించు టర్హవిధము
హవియు సోమంబు నన్నంబు నర్థమునను, కలుగు గావున నర్థంబు వలయుఁ గూర్ప.

159


వ.

నదీతటాకజలంబుల, దేవఖాతజలంబుల, గిరిప్రస్రవణజలంబుల, గూపోద్ధృత
జలంబుల, గృహానీతజలంబులనైన స్నానంబు చేసి శుచివస్త్రధరుండై పితృ
తీర్థంబున నంజలిత్రయంబునఁ బితృతర్పణంబు చేసి జలత్రయంబున దేవర్షి
తర్పణంబు చేసి పితామహప్రపితామహులకును, మాతృమాతామహతత్పితా
మహప్రభృతులకును, గురుపత్నీగురుమాతులాదులకు, రాజునకు నుపకా
రార్థంబు భూతంబులకుఁ దర్పణంబు చేసి దేవాసురయక్షనాగగంధర్వరాక్షస
పిశాచగుహ్యకసిద్ధకూష్మాండతరుఖగబిలేశయభూనిలయవాయ్వాహార
జంతువులును, నరకయాతనాసంస్థితులును, బాంధవులును, నబాంధవులును,
జన్మాంతరబాంధవులును, మద్దత్తతిలోదకంబులచేత నాప్యాయనంబు నొందు
దురు గాక యని కామ్యోదకదానంబు చేసి పుణ్యంబు నొందు.

160


క.

ఆచమనము చేసి విశు, ద్ధాచార్యుండైన మనుజుఁ డర్యమునకు గా
లోచితగతి నర్ఘ్యంబులు, నేచలకము లేనిబుద్ధి నియ్యగవలయున్.

161


శ్లో॥

నమో వివస్వతే బ్రహ్మభాస్వతే విష్ణుతేజసే।
జగత్సవిత్రే, శుచయే సవిత్రే. కర్మసాక్షిణే॥

162


వ.

అను మంత్రం బుచ్చరించుచు సూర్యార్ఘ్యం బీయవలయు.

163

గీ.

అగ్నికార్యంబు దీర్చి యనంతరంబ, యభిమతసురార్చనము చేయు టర్హవిధము
ప్రకటతరషోడశోపచారములచేత, ధీరమతి సద్విజుఁడు సదాచారపరత.

164


వ.

బ్రహ్మకుఁ, బ్రజాపతికి, గృహ్యదేవతలకుఁ, గశ్యపునకుఁ, ననుమతికి వేల్చిన
హుతశేషంబు గొని మణికంబునందుఁ బృథివీపర్జన్యులకు బలి యిడి గృహద్వా
రంబున ధాతృవిధాతలకు గృహమధ్యంబున బ్రహ్మకు బలి యిడి యింద్ర ధర్మ
రాజవరుణధనేంద్రులకుఁ గ్రామంబునఁ బ్రాచ్యాదిచతుర్దిక్కుల బలు లిడి
ప్రాగుత్తరదిగ్భాగంబున ధన్వంతరికి బలి యిడి తదనంతరంబ, వైశ్వదేవంబు
చేసి వాయవ్యభాగంబున వాయువునకుఁ దక్కినదిక్కుల నయ్యైదేవతలకు
బ్రహ్మకు, నంతరిక్షంబునకు, భానునకు బలి యిడి విశ్వదేవతలను, విశ్వపతులను,
బితరులను, యతిభిక్షులను నుద్దేశించి బలి యిడవలయును. అనంతరం బన్నాం
తరంబు పుచ్చుకొని శుచిదేశంబున శేషభూతంబులకు దేవమనుష్యపశు
వయస్సిద్ధయక్షోరగదైత్యప్రేతపిశాచతరుపిపీలికాకీటపతంగాదులు మద్వి
సృష్టాన్నంబునఁ దృప్తి బొందుదురుగాక యని బలి యిడి తదనంతరంబ గృహ
బహిర్భాగంబున శ్వచండాలాదిజాతులకు బలి యిడి యతిథిసంగ్రహార్థము
గోదోహనమాత్రకాలంబు నిలిచి.

165


సీ.

అజ్ఞాతకులనాము నన్యదేశాగతు, శ్రమజలాసారసంఛన్నవక్త్రు
నతిపిపాసాక్షుత్సమాదూయమానాంగు, మార్గధూళీవిద్యమానదేహు
నాభీలగమనపుంజీభూతనిశ్వాసు, రభసాముహుర్ముహుర్భంజితోష్ఠు
ననుపమాకించనత్వాలోకనీయాత్ము, నస్పృష్టసంబంధు నర్చనీయు


గీ.

నతిథి గని మ్రొక్కి సంతోషితాత్ముఁ డగుచుఁ, దోడుకొని వచ్చి లోన నిర్దుష్టశాస్త్ర
విధులఁ బూజించి సద్భక్తి వెలయ నన్న, మిడఁగవలయు గృహస్థుండు నృపవరేణ్య.

166


వ.

అతిథి బూజింపక భుజించెనేని యధోలోకంబులం బడు. భోజనానంతరంబ
స్వాధ్యాయకులాదు లడుగవలయు.

167


క.

మనమున హిరణ్యగర్భుం, డని తలఁచుచు నతిథుల కెలమి నన్నం బిడఁగాఁ
జనునతిథి స్వర్గదాయకుఁ, డని చెప్పుదు రార్యజనము లమలచరిత్రా.

168


వ.

పిత్రర్థంబు తద్దేశ్యుండును, విదితాచారసంభూతియుఁ, బాంచయజ్ఞకుండును
నైన యొక్కవిప్రునిం భుజియింపంజేయవలయు. ఒక్కయెడ నెత్తి పెట్టిన
హంతకారోపకల్పితంబగు నగ్రాన్నం బొక్కశ్రోత్రియునకుం బెట్టవలయు.
పరివ్రాడ్బ్రహ్మచారులకు భిక్షాత్రితయంబు పెట్టవలయు. విభవంబు గలిగిన
నవారితంబుగా నిడవలయు. అతిథియు, బిత్రర్థబ్రాహ్మణుండును, హంతకార
భోక్తయు, భిక్షావృత్తులగు బ్రహ్మచార్యాదులుం గూడ నాలుగుదెఱంగుల

వారును నతిథు లనంబరుఁగుదురు. వీరిం జుచి గృహస్థుండు పాపవిముక్తుండగు.

169


శ్లో॥

అతిథిర్యస్యభగ్నాశో గృహాత్ప్రతి నివర్తతే।
సతస్మైదుష్కృతందత్వా పుణ్యమాదాయగచ్ఛతి॥

170


క.

ధాతృప్రజాపతీంద్రా, బ్జాతసుహృద్వసుగణాగ్నిసంఘ మతిథియం
దాతతగతి నిల్చి సుసం, ప్రీతిం భుజియించు గృహికి మే లొదవంగన్.

171


క.

కాన నతిథిపూజ కర్తవ్యకర్మ మ, య్యతిథి కిడక కుడుచునట్టికడుపు
మానవేశ మలసమాసంబుసుమ్మి నీ, వాచరింపు మెపుడు నతిథిపూజ.

172


వ.

తదనంతరంబ సువాసినీ, దుఃఖవతీ, గర్భిణీ, వృద్ధ, బాలకులకు సంస్కృతాన్నం
బిడి వారు భుజియించినవెనుక గృహస్థుండు భుజియింపవలయు. వీరు భుజింప
క తా భుజియించినఁ బాపభోక్తయై నరకంబునం బడి శ్లేష్మభోజి యగును.

173


గీ.

జలము లాడక కుడుచుట మలము తినుట, యజపుఁడై తింట పూయరక్తాశి యగుట
నరవరేణ్య యసంస్కృతాన్నంబు తినుట, సిద్ధముగ మూత్రపానంబు చేఁతసుమ్ము

174


క.

ఎవ్వరికి నిడక తనమది, నివ్వటిలిన లోభవశత నింద్యచరితుఁడై
క్రొవ్వునఁ దాన భుజంచిన , బ్రువ్వులు కడుపారఁ దినుట భూరివివేకా.

175


వ.

గృహస్థుడు శాస్త్రోక్తంబుగా భుజించిన భవబంధంబులు తొలంగు. ఇహంబున
నారోగ్యబుద్ధివృద్ధులు సంభవించు. అనిష్టంబులు వైరిపక్షాభిచారంబులు
శాంతినొందు.

176


ఉ.

స్నానము చేసి శుద్ధవసనంబులు గట్టి సురర్షిపత్రనూ
నానఘతర్పణక్రియలు న్యాయపథంబునఁ జేసి జాపకుం
డై నియతిన్ హుతజ్వలనుఁడై యతిథిద్విజగుర్వశేషభృ
త్యానుగపాళి కన్న మిడి యాతరువాత గృహస్థుఁ డున్నతిన్.

177


సీ.

పుణ్యచందనమాల్యములు దాల్చి వస్త్రద్వ, యంబుతో నార్ద్రపాణ్యంఘ్రి యగుచు
సంశుద్ధవదనుఁడై సంప్రీతుఁడై విది, క్కులు మాని ప్రాగుదఙ్ముఖము గాఁగ
నాసీనుఁడై యనన్యమనస్కుఁడై ప్రశ, స్తమణిపాణ్యబ్జుఁ విమలశస్త
పాత్రంబునందుఁ బవిత్ర మౌ నన్నంబుఁ, బ్రోక్షణోదకముల ప్రోక్షణంబు


గీ.

చేసి ప్రాణాహుతులు వేల్చి చెలఁగుమదిని, మౌనియై గృహమేధి సమ్మతి భుజించు
టర్హవిధ మైహికాముష్మికావహంబు, సగరభూపాల ధర్మరక్షావిశాల.

178

వ.

మంత్రాభిమంత్రితంబులను, ఫలమూలంబులును, శుష్కశాకంబులును, హారి
తకంబులును, గుడభక్ష్యంబులును దక్కం దక్కిన పర్యుషితంబులు
మాని సారంబులు దీసిన వస్తువులు మాని భుజయింపవలయు. మధు,
జల, దధి, ఘృత, సక్తువులు దక్కం దక్కిన వస్తువులు సశేషంబుగా భుజి
యింపవలయు.

179


క.

మునుపు మధురములు రుచిగొని, వెనుకన్ లవణములు దానివెనుకం గటుతి
క్తనవామ్లద్రవ్యంబులు, గొనవలయు ననామయంబు గూడుటకొఱకున్.

180


వ.

మొదట ద్రవంబులును, మధ్యంబునఁ గఠినాశనంబులును, నంతంబున ద్రవం
బులును భుజయింపవలయు. ఇట్లు భుజయించి లేచి ప్రక్షాళితపాదుండై,
స్వస్థుండై, కృతాసనపరిగ్రహుండై, యిష్టదేవతాస్మరణంబు చేసి “యగస్త్యుం
డును, నగ్నియు, బడబానలంబును, నన్నంబు జీర్ణంబుసేయుదురుగాక.
సమస్తేంద్రియదేహి యైన విష్ణుండు మద్భుక్తంబైన యశేషాన్నంబు జీర్ణం
బుచేయుఁగాక" యని కరంబున నాభి నిమిరికొని తగినరీతి ననాయాసకర్మం
బులు చేయవలయు.

181


క.

ఆదృతి సచ్ఛాస్త్రాదివి, నోదంబుల దినము నడిపి నుతగతి సంధ్యా
ప్రాదుర్భావం బైన మ, హీదేవుఁడు సంధ్య గొలువ నెప్పుడు వలయున్.

182


వ.

దినాంతసంధ్య సూర్యదర్శనంబు చేయుచు బ్రాఁతస్సంధ్య నక్షత్రంబులు
చూచుచు నుపాసింపవలయు. సూతకా శౌచవిభ్రమాతురభయంబులఁ దక్క
నితరకాలంబుల సంధ్యకాలంబు గడవనీయవలవదు.

183


ఉ.

భానుఁడు గ్రుంకువేళలఁ బ్రభాయుతుఁడై యుదయించువేళలన్
మానవుఁ డెవ్వఁడే నిదుర మానక పోవు నతండు రౌరవా
ఖ్యానుపమాననారకములందు వసించు రుజాభిభూతుఁ డ
ట్లైనను బాప మంటదని రార్యులు మానవలోకనాయకా.

184


వ.

కావున నర్కుం డుదయింపకమున్న లేచి పూర్వసంధ్యయు, నిదురింపక
సూర్యునిఁ జూచుచు దినాంతసంధ్యయు నుపాసింపవలయు. కాలాతిక్రమ
ణంబు చేసి సంధ్యోపస్థానంబు చేయని దురాత్ములు తామిస్రనరకంబునుం
బొందుదురు.

185


గీ.

మగుడఁ బాకంబు సేయించి మాపు ధర్మ, పత్నియును దాను రేపంటిపగిది వైశ్వ
దేవముఖ్యక్రియ లొనర్చి ధీరుఁ డగుచు, నతిథిపూజ లొనర్చుట యర్హ మనఘ.

186

క.

రేపటియతిథికిబలెనే, మాపటియతిథికిని బూజ మహిమ నొనర్పన్
భూపాల పుణ్య మష్టగు, ణోపేతం బనుచుఁ జెప్పి రురుధర్మవిదుల్.

187


వ.

కావున మాపటియతిథిని యథాశక్తి నన్నపానాదు లొసంగి శయ్యాదికం
బులం దుష్టిం బొందించి తానును భుజియించి.

188


గీ.

తెగక కొంగోడు వోక శ్శిలత లేక, మలినదశ లేక జంతుసామగ్రి లేక
పరపు గల్గి విశుద్ధతఁ బరఁగుశయ్య, నధివసింపంగవలయు భూపాగ్రగణ్య.

189


క.

తెలియఁగఁ దూరుపుదక్షిణ, ములలో నొకవంక నేమమునఁ దలగడ మే
లలఘుగుణ యితరదిక్కులఁ, దలకొను రోగంబు లనిరి తత్కర్మవిదుల్.

190


సీ.

ఋతుకాలమునఁ దనసతి శుభక్షణంబున, యుగ్మరాత్రులఁ బొందు టుచితకృత్య
మస్నాత నాతుర నప్రశస్త ననిష్ట, గర్భిణిం దలఁకినకాంతఁ గుపిత
నన్యకాంత నకామ నదయ నన్యాసక్త, నాకొన్నకాంత నత్యంతభుక్తఁ
గదియక తాను నీకరణి గుణంబులు, లేక ప్రక్చందనాలేపనములు


గీ.

పూని యనురాగసహితుఁడై పూరుషుండు, చెలువు మీఱ వ్యవాయంబు సలుపవలయు
పైతృకదివసనిశలును బర్వనిశలు, గురుతరవ్రతనిశలును బరిహరించి.

191


వ.

చతుర్దశియు, నష్టమియు, నమానాస్యయు, బూర్ణిమయు, సూర్యసంక్రమ
ణంబును నీయైదుపర్వంబులయయ స్త్రీ, తైల, మాంసనిషేవణంబు చేసిన
పురుషుండు విణ్మూత్రనామపదంబు నొందు. ఇక్కాలంబుల సచ్ఛాస్త్ర
వేదధ్యానజపపరుండు కావలయు.

192


గీ.

అవనినాథ! యయోనియం దన్యయోని, యందు గురుదేవవిప్రులయగ్రమునను
జైత్యచత్వరతీరస్మశానతోయ, సదుపవనముల రతి చేయఁజనదు నరుఁడు.

193


పర్వంబుల రతి చేసిన దారిద్ర్యంబును, దివాభాగంబుల నాపదలును, జలాశ్ర
యస్థలంబున రోగంబులును నగు.

194


మ.

పరదారాభిగమంబు నెమ్మదిఁ దలంపన్ బాపమౌ నన్నచో
నరుఁ డాత్రోవఁ జరింప నాయువును క్షీణంబౌ మృతుండైన భీ
కరదుర్నారకము న్లభించునని వక్కాణింపఁగా నేల భూ
వర మర్త్యుం డది మాని స్వాంగనల ఠేవం బొంద ధర్మం బగున్

195


గీ.

సార్వభౌమ యథోక్తదోషములు లేని, యాత్మసతుల సకామల ననృతువేళ
నైనఁ బొందిన దోషంబు లంటుకొనవు, వర్ణనీయసదాచారవంతునకును.

196


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

197

సీ.

దేవగోబ్రాహ్మణాతిథిసిద్ధవృద్ధగు, ర్వర్చన యుభయసంధ్యాభివంద
నం బగ్నిసముపచారం బనుపహతవ, స్త్రద్వయధారణసౌష్టవంబు
నలయుగారుడరత్నములు దాల్చి ప్రయతుఁడై, యమలకేశకలాపుఁడై సుగంధ
మాల్యచందనలేపమహితుఁడై యుండుట, దగు బరస్వంబునుం దడవఁబోక


గీ.

యనృత మల్పతరంబైన నాడఁబోక కల్లగూడిన ప్రియమైన నొల్లక పరు
దోషములు లెక్కపెట్టక దుష్టయాన, మెక్కక వెలయుఁ నరుండు బెంపెక్కి యపుడు.

198


చ.

పలుమరు నన్యకాంత వెడుపల్కులు పల్కక యేటియొడ్డునీ
డల వసియింపబోక కులటాకులటాపతి శత్రుమిత్రదు
ష్కులపతితానృతోక్తి పరకుత్సితదుర్వ్యయశీలశాఠ్యకృ
త్ఖలతతిమైత్రి చేయక సుఖస్థితిఁ గాంచు నరుండు భూవరా

199


క.

ఒక్కఁడు మార్గము నడుచుట, చక్కనిపని గాదు వేగజలవాహములన్
మొక్కలమున మునుపుగఁదా గ్రక్కున నవగాహ మందఁ గాదు మునీంద్రా.

200


గీ.

చెట్టుకొనకొమ్మ కెక్కక చిచ్చు దగిలి, మండుసదనంబుఁ జొరక యెండొండ పళ్లు
గొఱుకక క్షుతంబు ముక్కున గొనక జృంభ, మాన్యమునఁ బోవనీకుండు టర్హ మధిప.

201


క.

పలునిట్టూర్పులు పుచ్చక, కలకలవడి నగక ద్రుతముగాఁ బాఱునదీ
జలములను చొరక నఖా, వళిఁ గొఱుకకయుండు టర్హపథము నరేంద్రా.

202


వ.

శ్మశ్రుకేశంబులు కొఱుకక లోష్టంబు ద్రుంచక యపవిత్రుఁడై ప్రశస్తజ్యోతి
స్సులు చూడక, నగ్నయగుపరకాంతను, నుదయాస్తమయకాలంబుల
సూర్యునిం జూడక, శవగంధం బాఘ్రాణింపక మెలగుట మేలని చెప్పి మఱి
యు నిట్లనియె.

203


గీ.

భూమినాథ చతుష్పథంబును స్మశాన, కాననము చైత్యవృక్షంబు కాని దుష్ట
కాంతసన్నిధియును జేరఁగాద యర్ధ, రాత్రములయందు బుణ్యచరిత్రులకును.

204


సీ.

భూమీసురులనీడ పూజ్యులనీడ దీ, పమునీడ దాఁటుట బాగుగాదు
శూన్యాటవీస్థలి చొరరాదు శూన్యగే, హమునందు నిలువరా దరయ నొకఁడు
మఱచియైన ననార్యమండలి చేరుటఁ, గాదు కోపితుఁ జేయఁగాదు కుటిలుఁ
బలుమారు పాముతోఁ జెలిమి సేయుటగాదు, తడవుగా నిలుచుండఁదగదు మిగుల


గీ.

తడవు నిద్రితుఁ డవుటయుఁ దడవు మేలు, కొనుటయుఁ దడవు గూర్చిుంటయును దఱచుగ
స్నానపరుఁ డౌట మిగుల నాసీనుఁ డగుట, యెపుడు దిరుగుటగాదు పృథ్వీశతిలక.

206


క.

ముంగిట నడుగులు గడుగుట, యెంగిలి పోయుటయుఁ గాదు హితమతితో స
న్మంగళము మానరాదు వి, నంగా దశ్లీలములు జనస్తుతచరితా.

207

వ.

నిరంతరశయ్యాసేవ వలదు. కే, శాస్థి, కంటకా, మేధ్య, బలి, భస్మ, తుషస్నా
నార్ద్రభూములు ముట్టవలదు. కోరకొమ్ములుగల జీవంబులకు దూరంబునంద
మెలంగవలయు. మంచున, నెండను, గాలినిం దిరుగవలదు. నగ్నుండై నీరాడు
టయు, నిద్రించుటయు, నాచమనంబు సేయుటయుం గాదు. కచ్చకట్టక దేవార్చ
నాచమనంబులు చేయరాదు. ఏకవస్త్రుండై హోమదేవార్చనాచమనజపాది
కంబులు చేయరాదు.

208


సీ.

దుర్వృత్తుఁ గదిసిన దోషంబు వాటిల్లు, సజ్జనసంగతి క్షణము చాలు
ధార్మికుతో విరోధము చేయఁగాఁ జన, దంతకన్నను గూడ దధముతోడఁ
బెండ్లియువాదంబు పెంపొందుఁ దుల్యశీ, లులతోన గాకున్న నలఁతఁ దెచ్చుఁ
గలహంబు పెంచుట గా దల్పహానికిఁ, దాళఁగానలయు శాత్రవులయెడల


గీ.

ధనసమార్జనకార్యంబు తడవరాదు, జలకమాడెడివేళల స్నానశాటి
నైన నిజపాణిచేనైన నవయవములు, దోమఁగా రాదు బుధునకు భూమినాథ.

209


వ.

కేశంబులు విదల్పక, నిలుచుండి వార్వక, కాలుమీఁద కాలు సేర్పక, పూజ్యుల
కెదురుగాఁ గాలు చాపక వర్తింపవలయు. గురువులయెదుట నీచాసనగతుండై
వినయంబున నుండవలయు. దేవాగారచతుష్పథంబుల కప్రదక్షిణంబు నడ
వక, పూజ్యులకు, సోమార్కాగ్న్యంబువాయువులకు నెదురగా నిష్ఠీవనంబును,
విణ్మూత్రోత్సర్జనంబునుం జేయక నిలుచుండియు, నడుచుచు మూత్రంబు
విడువక, శ్లేష్మవిణ్మూత్రరక్తంబులు దాఁటక, భోజనకాలంబున శ్లేష్మహాసో
త్సర్జనంబులఁ జేయక, బలిమంగళజప్యాదులయందును, హోమకాలంబునను
మహాజనసన్నిధిని స్త్రీల నవమానింపక, యీర్ష్య లేక, మనస్తాపంబు చేయక,
వారివచనంబులు విశ్వసింపక వర్తింపవలయు. మాంగళ్యపుష్పరత్నాఢ్య
పూజ్యులకు నమస్కరించి కాని సదాచారపరుం డిల్లు వెడలరాదు. చతుష్పథంబు
నకు నమస్కరించుచుఁ, గాలంబున హోమపరుం డగుచు, దీనానాథసాధువుల
నుద్ధరించుచు, బహుశ్రుతుల నుపాసించుచు, దేవర్షిపితృపూజనంబులు
సల్పుచు, నాతిథ్యంబు చేయుచు వర్తించు పురుషుం డుత్తమలోకంబులం
బొందు.

210


గీ.

అదన హితమిత్రుతోడ వశ్యాత్ముఁ డౌచుఁ, బ్రియములాడినయతఁడు సంప్రీతితోడఁ
బొందు నాహ్లాదకములైన పుణ్యలోక, చయము లక్షయములు గాఁగ జనవరేణ్య.

211


క.

మతియును లజ్జయు క్షమయును, నతులవినయగతియు నీతియాస్తికతయు నూ
ర్జితగతి కల్గిన మనుజుఁడు, చతురతఁ గను పుణ్యలోకసౌఖ్యములెల్లన్.

212

వ.

మఱియును నకాలగర్జికాదులయందును, బర్వాశౌచకాదులను, నుపరా
గాదులయందును ననాధ్యాయంబు చేయవలయు. ఎవ్వఁడేనియుఁ గోపితు
లైన సర్వబంధువుల నాశ్వాసించి శమంబు నొందించు నతం డుత్తమలోకం
బుల నొందు, స్వర్గం బన నెంత, మఱియు వర్షాతపాదులయందు ఛత్రధరుం
డును, రాత్రుల నడవులయందు దండధరుండును నై సదా పాదుకలు దొడిగియు
నడువవలయు, మీఁదును, దూరంబును, నడ్డంబును జూడక నడవవలయు,
యుగమాత్రంబు మహీతలంబు చూచుచు నడవవలయు.

213


గీ.

ఎవ్వఁడేని దోషహేతువులగు వాని, నెల్ల విడుచు వశ్యహృదయుఁ డగుచు
నతని బూరుషార్థవితతికి నింతైన, హాని కలుగనేర దధిపముఖ్య

214


వ.

పాపిష్ఠుఁడైన పురుషునియెడనైనఁ బ్రియంబు వలుకుచు నంతఃకరణశుద్దుండగు
పురుషునకు ముక్తి కరతలామలకంబు. కామక్రోధలోభంబులకు గోచరులు
గాక సదాచారవంతులగు పురుషుల యనుభావంబుచేత నిమ్మహీమండలంబు
ధరియింపంబడియున్నది గావునఁ బరప్రీతికారణంబైన సత్యంబు పలుకవలయు.
ఆసత్యంబ పరదుఃఖకరంబైనఁ బలుకక యూరకుండవలయు. ప్రియంబైనను
హితంబు గాకుండినఁ బలుకవలదు. అప్రియంబైన శ్రేయస్సంపాదకంబైన
హితంబు పలుకవలయు.

215


గీ.

ఇన్ని చెప్పనేల భూమీశతిలక, యఖిలభూతోపకారకం బగుచు నిహము
పరము నెసఁగెడువాక్యంబు పలుకవలయు, నవని మనుజుఁడు కరణత్రయంబుచేత.

216


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

217


క.

సూనుఁడు పుట్టిన గృహపతి, దానస్నానములు వలయుఁ దండ్రికి నంతన్
భూనాథ జాతకర్మవి, ధానక్రమ మాచరింపఁదగు నర్హగతిన్.

218


వ.

అభ్యుదయార్థంబు శ్రాద్ధంబు చేయవలయు. యుగ్మంబులుగా దేవపితల
నుద్దేశించి బ్రాహ్మణుల భోజనంబు సేయింపవలయు. ప్రాఙ్ముఖుండైన, నుదఙ్ము
ఖుండైనను దధ్యక్షతబదరంబుల దేవతీర్థంబుల దేవతలకుఁ బితృతీర్థంబులఁ బితల
కుంగా, నాందీముఖదేవగణంబులకుఁ బిండప్రదానంబు చేయవలయు. ఇంక
బ్రేతకర్మక్రియావిధి వినుము.

219


క.

మృతుఁడైనఁ బ్రేతదేహం, బతులశుభస్నానచందనామోదసుమ
ప్రతతుల నలంకృతము చే, సి తగ విమానమునఁ బెట్టి చెలువగురీతిన్.

220


వ.

పురబాహ్యమునకుం గొనిపోయి యగ్నిసంస్కారంబు చేసి సచేలస్నానంబు
చేయవలయు. బాంధవులు దక్షిణాభిముఖులై గోత్రనామంబులు చతుర్థ్యంత

సమేతంబులుగాఁ జెప్పి జలాంజలి నీయవలయు. అంత గోవులు ప్రవేశించువేళ
నక్షత్రదర్శనంబు సేయుచు గ్రామంబు ప్రవేశింపవలయు. భూమి కటుప్రస్తర
శాయిత్వంబు వలయు. అనుదినంబును ప్రేతార్ధంబు భూమియందుఁ పిండంబు
విడిచి దివాభాగంబున మాంసవర్జంబుగా భుజియించి తమదినంబులు వెళ్లింప
వలయు. ప్రథమ, తృతీయ, సప్తను, నవమదినంబుల వస్త్రత్యాగబహి
స్స్నానంబులు చేసి తిలోదకంబు లీయవలయు. మూఁడవదివసంబున నస్థిసంచ
యనంబు సేయవలయు.

221


గీ.

అస్థిసంచయనము చేసినంతనుండి, యవనినాథ సపిండుల నంటవచ్చు
విను సమానోదకులు భోగవిధులు దక్క, నర్హు లగుదురు సర్వక్రియలకు నధిప.

222


వ.

సంచయనంబు చేసినవెనుక సమానోదకులకు, సపిండులకు స్త్రీసమాగమంబు
చేయరాదు. బాలుండును, దేశాంతరస్థుండును, బతితుండును, మునియు, జలా
గ్న్యుద్బంధనాదులయందు మృతులైన జ్ఞాతులకు సద్యశ్శౌచంబు విధియింపం
బడియె. మృతబంధుని యన్నంబు పదిదినంబులు భుజింపరాదు. దానప్రతి
గ్రహణయజ్ఞస్వాధ్యాయంబులు జేయరాదు. విప్రునకు బదిదినంబులును,
రాజన్యునకుఁ బండ్రెండుదినంబులును, వైశ్యునికి బదేనుదినంబులును,
శూద్రునకు మాసం౦బును నాశౌచంబు. వీరలు స్వకులోచితంబుగా శ్రాద్ధంబు
చేయవలయు.

223


గీ.

భూపవర్య యయుగ్మంబులుగ విప్ర, వరుల భుజియింపఁజేయఁగావలయు శ్రద్ధ
దనరఁ బిండంబు నిడఁదగు దర్భతతుల, పైని మృతుఁ గూర్చి యుచ్ఛిష్టపార్శ్వభూమి.

224


వ.

ఇట్లు యథోక్తంబు శ్రాద్ధంబు చేసి సపిండీకరణంబు చేసి ప్రేతత్వంబు మాన్చి
పితృత్వంబు నొందించి యుత్తరక్రియలు నడుపవలయు. పుత్త్రులు, దౌహిత్రులు
తత్పుత్త్రులు వీర లెవ్వరైనను నుత్తరక్రియలు నడపవలయు. అవి యెఱింగించె
ద వినుమని యౌర్వుం డిట్లనియె.

225


చ.

జలజభవేంద్రరుద్రవసుసారసమిత్రహుతాశనానిలం
బులు పితృవిశ్వదేవగణముల్ ఋషిమానుషపక్షిపన్నగం
బులు పశువుల్ సమస్తమగు భూతగణంబులుఁ దృప్తి నొందు ని
శ్చలమగు శ్రద్ధతో నరుఁడు శ్రాద్ధము చేసినఁ బార్థివోత్తమా.

226


వ.

ప్రతిమాసంబున నమావాస్యయందును శ్రాద్ధంబు చేయవలయు. ఇంకఁ గామ్యు
శ్రాద్ధంబు వివరించెద. వ్యతీపాతయోగంబున, విషువత్కాలంబున, సూర్య
సోమగ్రహణకాలంబునఁ, బండ్రెండుసంక్రాంతులు, నక్షత్రగ్రహపీడల, దుష్ట
స్వప్నావలోకంబుల, నవసస్యాగమనంబుల నిచ్ఛాశ్రాద్ధంబు సేయవలయు.

227

గీ.

సార్వభౌమ! యమావాస్య స్వాతితోడ, మైత్రితోడ విశాఖతోఁ జిత్రలీలఁ
గూడువేళల శాద్ధంబు గోరి చేయఁ, దృప్తి పితరుల కష్టవార్షికి జనించు.

228


చ.

పొలుపగు కృష్ణపంచదశిఁ బుష్యపునర్వసు రౌద్రతారలం
గలసినవేళ మానవుఁ డకంపితయై తగుశ్రద్ధ శ్రాద్ధ ము
త్కళిక నొనర్పఁ దృప్తియగు ద్వాదశవత్సరముల్ పితృవ్రజం
బులకు నృపాలచంద్ర! యిది పూనికతో నొనరింపఁగాఁదగున్.

229


గీ.

వరుణతారతోడ వాసవతారతోఁ, బూర్వభద్రతోడఁ బొసఁగఁ గూడి
యున్నతత్వ మమర నున్నయమావాస్య, దేవదుర్లభంబు భూవరేంద్ర.

230


వ.

ఈతొమ్మిదినక్షత్రంబులతోఁ గూడిన యమావాస్యయందు శ్రాద్ధంబు చేసినఁ
బితృతృప్తి యగునని చెప్పి యౌర్వుండు సగరున కిట్లనియె.

231


చ.

ఘనపితృభక్తి వైభవము గల్గు నిలాసుతుఁడౌ పురూరవుం
డనఘ సనత్కుమారుఁ గని యాదృతి వేఁడిన నమ్మునీంద్రుఁ డా
జనపతిఁ జూచి కౌతుకవశంవదుఁడై యెఱిగించె నట్లు స
ద్వినుతవచోర్థ మీవును బ్రవీణతతో వినుమంచు నిట్లనున్.

232


వ.

భాద్రపదమాసంబునఁ గృష్ణపక్షత్రయోదశియందును, మాఘమాసం
బున నమావాస్యయందును, సూర్యసోమగ్రహణకాలంబులయందుఁ ద్ర్యష్ట
కలయందును, నయ నద్వయంబునందును బితరుల నుద్దేశించి శ్రద్ధాసమన్వి
తుఁడై తిలోదకంబులనైన నీయవలయు, శ్రాద్ధంబు చేసెనేని సహస్రసం
వత్సరతృప్తి యగును.

233


గీ.

మనుజనాథ వినుము మాఘంబునం దమా, వాస్యఁ గూడెనేని వరుణతార
యదియె పితలకును మహాపుణ్యకాలంబు, పరమభాగ్య మదియె దొరకెనేని.

234


వ.

అమ్మాఘామావాస్యయును, సూర్యగ్రహణకాలంబును ధనిష్ఠతోఁ గూడిన
నందుఁ బితరుల నుద్దేశించి శ్రాద్ధంబు చేసిన నయుతకులంబులతోఁ బిత
లు తృప్తినొందుదురు. ఆయమావాస్య పూర్వభాద్రతోఁ గూడిన నందు
శ్రాద్ధంబు చేసిన బితలు యుగపర్యంతబును దృప్తినొంది సుఖింతురు.
గంగ, శతద్రువు. విపాశ, సరస్వతి, నైమిశంబు, గోమతి, గోదావరి యనుని
మ్మహానదుల నవగాహించి పితల నుద్దేశించి శ్రాద్ధంబు చేసినఁ బాపంబులం
బాయుదురు.

235


చ.

అనుపమ మాఘమాసమున నర్థి సమాతిథియందుఁ దోయ మై
నను దనయాదు లిచ్చిన మనంబునఁ దృప్తులమై సుఖింతు మం

చనుపమకౌతుకంబున మహాధ్వనిఁ బాడుచు నుండు నుత్సవం
బునఁ బితృసంఘము ల్వినుము భూపలలామ! నిజంబు చెప్పితిన్.

236


వ.

విశుద్ధంబులగు చిత్తంబులును, విత్తంబును, గాలంబును, విధియును, బాత్రం
బును, భక్తియు నరులకు వాంఛితంబు నిచ్చు. ఇంకఁ బితృగీతంబులైన శ్లోకం
బులు కల వవి విని యెట్లు చేయవలయు నట్లు చేసెదవు గాని వినుమని సనత్కు
మారుండు పురూరవున కిట్లనియె.

237


క.

మాకులమున నొక్కరుఁ డ, స్తోకమతి ప్రతిభుఁడైన సుగుణుఁడు పుట్టున్
గా కతఁడు విత్తశాఠ్యము, లేక యొసఁగు పిండములు చలింపనిభక్తిన్.

238


గీ.

వెలయు విభవంబుకొలఁది పృథ్వీసురులకు, మమ్ముఁ దలఁచి సమస్తభోగమ్ములు వసు
రత్నవస్త్రమహీయానరాజి యొసఁగుఁ, దృప్తి పొందుద మేము మోదించి యపుడు.

239


వ.

భక్తినమ్రుఁడై కాలంబున యథాశక్తి విప్రశ్రేష్ఠులకు నన్నంబు భుజింపం
జేయవలయు. అన్నంబున కసమర్థుండైన నామద్రవ్యంబైన నిచ్చి స్వల్పంబైన
దక్షిణ నీయవలయు. ఆమదానంబున కసమర్థుండైన జేరెడునువ్వులైనను
బ్రాహ్మణుల కీయవలయు. అందున కసమర్థుఁడైన నేడెనిమిదినువుగింజలు గలిపిన
జలంబులయంజలులు మమ్ము నుద్దేశించి భూమియందు నిడవలయు. లేకున్న గోగ్రా
సంబైన నిడవలయు. ఏమియు లేకున్న వనంబునకుం బోయి యూర్ధ్వబాహుండై
సూర్యాదిలోకపాలురు వినునట్లుగా “శ్రాద్ధోపయోగ్యంబైన వస్తువు నాకు
లేదు. భక్తిచేతనే మత్సితలు తృప్తు లగుదురుగాక" యని మాకు నమస్క
రింపవలయునని పితృగీతంబుల యర్థంబు చెప్పె. ఈ ప్రకారంబున నెవ్వం డె
ద్దేని శ్రాద్ధంబు చేయు నాతఁ డీసర్వంబును నాచరించినవాఁడని యూర్వుండు
సగరున కిట్లనియె.

240


గీ.

అధిప శ్రాద్ధభోజనార్హవిప్రోత్తమ, తతులఁ దేటపఱుతుఁ దద్విధంబు
వినుము సావధానతను సదాచారసం, పన్ను లాచరించుమార్గ మదియె.

241


వ.

త్రిణాచికేతుండును, ద్రిమధువును, ద్రిసుపర్ణుండును, షడంగవేత్తయు, శ్రోత్రి
యుండును, యోగియు, జ్యేష్ఠసామగుండును, ఋత్విజుండును, స్వస్రీయుండును,
జామాతయు, దౌహిత్రుండును, శ్వశురుండును, మాతులుండును, దపోనిష్ఠుం
డును, పంచాగ్న్యభిరతుండును, శిష్యుండును, సంబంధియు, మాతాపితృర
తుండును మొదలగు వీరలలోఁ బూర్వపూర్వు లుత్తములు. ఉత్తమాభావం
బైన నుత్తరోత్తరుల నియమింపవలయు.

242


సీ.

వినుము మిత్రద్రోహియును కుసఖియు శ్యాన, దంతుండు భృతకవేదప్రయోక్త
యభిశస్తుఁడును భృతకాధ్యాపితుఁడు గ్రామ, యాజకక్లీబచోరాంధపిశున

సోమవిక్రేతలు శ్రుతిమానునాతండు, తల్లిదండ్రులఁ బ్రోవనొల్లనతఁడు
భ్రాతృపరిత్యాగి [1]సూతిపోష్టయు నింది, తుఁడు వృషలీపతిదూషకుండు


గీ.

కన్యకాదూషయితయు రోగస్థితుండు, దేవలకుఁడాది గల్గు భూదేవతలను
జెప్పఁగారాదు శ్రాద్ధంబు చేయుటకును, ధర్మశాస్త్రార్థవిదులు భూధరవరేణ్య

243


శ్రాద్ధంబునకుఁ దొలునాఁడ పితృదేవతార్థంబు శ్రోత్రియాదుల నిమంత్రింప
వలయు. అనిమంత్రితులైనను, యతుల భుజియింపఁజేయవలయు. నిమంత్రణా
నంతరంబున యజమానుండు విప్రులును గ్రోధవ్యవాయాయాసంబులు చేయ
రాదు. వ్యవాయంబులు చేసిన వారిపితరులు రేతోగర్తంబున మునుంగుదురు.
కావునఁ బ్రథమంబ నిమంత్రింపవలయు. స్నానంబు చేసి గృహంబునకు వచ్చిన
విప్రుల పాదప్రక్షాళనంబు చేసి యాసనంబులం గూర్చుండంబెట్టి పితలకు
నయుగ్మంబుగను దేవతలకు యుగ్మంబుగను నొక్కొక్కరినైనను యథేచ్ఛంబు
నుగా నియమింపవలయు. మాతామహశ్రాద్ధంబును నివ్విధంబుననె చేయ
వలయు. అందు వైశ్వదేవంబులు వికల్పం బనిరి. దేవతలకుఁ బ్రాఙ్ముఖంబును,
బితలకును దఙ్ముఖంబును బ్రశస్తంబు. దేవపితలకు శ్రాద్ధంబు వృథక్కరణం
బని కొందఱు చెప్పుదురు. కొంద ఱేకపాకంబునఁ గూడం జేయవలయునని
చెప్పుదురు.

244


గీ.

ధరణినాయక విష్టరార్థంబు దర్భ, సమితి యిడి పూజ చేసి శాస్త్రవిధి నర్ఘ్య
మిచ్చియావాహనము చేసి యెసఁగుభక్తిఁ, బితలకుఁను బ్రీతిసేయుట పెద్దమేలు

245


వ.

తదనంతరంబ దేవతల నిట్లు పూజింపవలయు. తిలాంబువులు పితరులకు, యవాం
బువులు దేవతలకు నర్ఘ్యం బీయవలయు. సగ్గంధధూపదీపాదు లిచ్చి సవ్యా
పసవ్యప్రకారంబులు దేవపితల నర్చింపవలయు.

246


క.

క్షితివర యక్కాలంబున, నతిథి యటకు నన్నకాంక్షియై వచ్చిన స
మ్మతి నతనిఁబూజ చేసిన, నతులితగతిఁ బొందు శ్రాద్ధ మానంత్యంబున్.

247


వ.

అతిథిని గడపిపుచ్చిన శ్రాద్ధంబు నిష్ఫలంబగు. అనంతరంబ విప్రులచేత ననుజ్ఞా
తుండై యగ్నియందు నాహుతిత్రయంబు యథావిధి వేల్చి హుతశేషం బల్ఫా
ల్పంబులగు పాత్రలయందుఁ బెట్టవలయు. తదనంతరంబ మృష్టంబును, నభీ
ష్టంబును, సంస్కృతంబును నగునన్నంబు పెట్టి “యథాసుఖం జుషధ్వ" మ్మని
యనిష్ఠురంబుగాఁ బలుకవలయు. విప్రులును దచ్చిత్తులై భుజియింపవలయు.
యజమానుండును రక్షోఘ్నమంత్ర పఠనంబు చేయుచుఁ దనపితల ధ్యానంబు
చేయవలయు. ఇట్లైనఁ బితృపితామహప్రపితామహులు తృప్తినొందుదురు. తద
నంతరంబ పిండప్రదానంబు చేయవలయు.

248

మ.

హరి యజ్ఞేశ్వరుఁ డప్రమేయుఁడు సదా హవ్యంబు కవ్యంబు ని
ర్భరవృత్తిం గొనుదేవుఁ డీపితృసుతంత్రంబుం గటాక్షించు నా
సరసీజాక్షుని సన్నిధానమున రక్షస్సంఘభూతాదు లీ
ధరణిం జేరకపోవుఁగాక వికలత్వం బొంది నల్టిక్కులన్.

249


వ.

తదనంతరంబు విధానోక్తంబుగా వికిరంబు చేసి యుచ్ఛిష్టసన్నిధి పిండప్రదా
నంబు చేసి పూజించి బ్రాహ్మణుల కాచమనం బిచ్చి హస్తప్రక్షాళణానంత
రంబున సుస్వధేత్యాశీర్వాదపూర్వకంబుగా దక్షిణ యొసంగి పితృ శ్రాద్ధం
బును పితృపూర్వకంబుగా దేవతలను విడిచి యా ద్వారపర్యంతంబు నను
వర్తింపవలయు, మాతామహశ్రాద్ధం బిట్లు చేయవలయు. తదనంతరంబ
వైశ్వదేవంబు చేసి పూజ్యభృత్యబంధువులుఁ దానును భుజింపవలయు.
ఇవ్విధంబున బుధుండు పితృశ్రాద్ధంబును మాతామహశ్రాద్ధంబును జేయ
వలయు. చేసిన సుప్రీతులై సర్వకామంబుల నొసంగుదురు.

250


గీ.

జనవరేణ్య వినుము శ్రాద్ధకర్మమునకు, మూఁడు కడుపవిత్రములు దలంప
కూఁతుకొడుకు తిలలు కుతపకాలంబును, గాన వీనిఁ గూర్పఁ గలుగు మేలు.

251


వ.

రజతదానకీర్తనంబులును, రజతదర్శనంబును, ననునివి పవిత్రములు. క్రోధం
బును, నధ్వగమనంబును శ్రాద్ధకర్తయు, భోక్తయు వర్జింపవలయు.

252


క.

క్షితినాయక విను సోముఁడు, పితలకు నాధార మవనిఁ బెంపగుయోగం
బతనికి నాధారం బీ, కతన న్ముఖ్యుండు యోగి గణుతింపంగన్.

253


వ.

అట్టి యోగీంద్రుండు శ్రాద్ధంబునకుఁ బ్రశస్తంబు. శ్రద్ధానియుక్తుండైన
యోగీంద్రుండు పితరులను భోక్తలను యజమానునిఁ దరింపజేయునని
యౌర్వుండు సగరున కిట్లనియె.

254


గీ.

మనుజనాథ హవిష్యంబుమత్స్యశశక, నకులమాంసంబులును ఛాగలకవరాహ
గవయరురుహరిణీశల్యకములమాంస, ములును నిడ నెల్లపితరుల కొలయుఁ దృప్తి.

255


వ.

మేషమాంసంబును మాసతృప్తికరంబు, ఖడ్గమాంసంబును, కాలశాకంబును,
దేనెయు మహాప్రశస్తంబులు. గయకుం బోయి యచ్చట శ్రాద్ధంబు చేసినఁ
బితృతృప్తి యగు. చేసిన యతనిజన్మంబు సఫలంబు, ప్రశాంతికం
బులు నీవారంబులు, శ్యామాకంబులు, శ్రద్ధాంబులైన వన్యౌషథులు,
యవలు, ప్రియంగువులు, ముద్గంబులు, గోధూమంబులు, వ్రీహులు,
తిలలు, నిష్పానంబులు, కోవిదారంబులు, సర్షపంబులు శ్రాద్ధమునకు
యోగ్యంబులు. ఆగ్రయణేష్టికిరాని, ధాన్యజాతంబును, రాజమాషంబులు,

అణువులు, మసూరంబులును మానవలయు. అలాబువును, గ్రుంజనంబును,
పలాండువును, బిండమూలకంబును, గాంధారకంబును, గరభంబును, లవ
ణంబును, నౌషరంబును, నారక్తనిర్యాసంబులును, బ్రత్యక్షలవణంబును
వర్జితంబులు. వాగ్దూష్యంబు నక్తాహృతంబును, నుచ్ఛిష్టంబును వర్జంబ.
గోవులు ద్రావనివియు, దుర్గంధఫేనిలంబులును నగుజలంబులు గావు.

256


చ.

జనవర యొంటిడెక్కగల జంతువు లిచ్చినపాలు గొఱ్ఱెపా
లును నెనుపెంటి యిచ్చినవి లొట్టియ యిచ్చినపాలు కూడ వెం
దును మృగజాతిపాలు గడుదూష్యము లంచుఁ బితృక్రియావిదుల్
వినుతబహుస్మృతు ల్వెదకి విశ్రుతలీలలఁ జెప్పి రొప్పుగన్.

257


క.

అపవిద్ధుఁడు పాషండుఁడు, శ్వపచుఁడు రోగాతురుండు చండుఁడు నగ్నుం
డపవిత్రసూతకాశౌ, చపరులు కనుఁగొనినఁ గాదు శ్రాద్ధం బధిపా.

258


వ.

(వీరు) చూచినను రజస్వలలు చూచినను కుక్కటవానరగ్రామసూకరం
బులు చూచినను శ్రాద్ధంబునఁ బితలును దేవతలును భుజియింపరు.
కావున నివి దొరలకుండ శ్రద్ధాసమన్వితుండై చేయవలయు. తొల్లి కలాప
పురోపవసంబున మనుపుత్రుండైన యిక్ష్వాకునిముందరం జెప్పిన పితృగీతలైన
గాథలు కొన్ని గలవు. వానియర్ధంబు వినుమని యిట్లనియె.

259


గీ.

మాకులంబున నొకఁడు సన్మార్గశీలుఁ, డుదయమై గయ కేగి యం దొనరఁ బిండ
మిడునొకో యట్టులైన మేమిందఱమును, దృప్తి నొందెద మిప్పుడు ప్రియముతోడ.

260


ఉ.

అనిన వేడ్క మాకులమునందు జనించినవాఁడు శ్రద్ధతో
దేనెయు నేయుఁ బాయసము తెచ్చి మఘర్క్షమునం ద్రయోదశి
న్మానకవార్షికంబులగు మాసముల న్మముఁ గూర్చి పెట్టునొ
క్కో నిరపాయతృప్తి నపు డొందుదు మట్లయిన న్ముదంబునున్.

261


గీ.

గౌరియగు కన్య విప్రపుంగవున కర్థి, దాన మిచ్చిన నల్లనిదాని వృషభ
వరము విడిచిన దక్షిణావంతమైన, తురగమేధంబు చేసిన దొరకుఁ దృప్తి.

262


వ.

ఇవ్విధంబున నౌర్వుండు సగరునకు సదాచారంబు చెప్పె. ఇవ్విధంబున నడి
చినయతం డుత్తముండు. దీని నుల్లంఘించి నడిచినయతండు నిరయంబునం
బడు. అని చెప్పిన పరాశరునకు మైత్రేయుం డిట్లనియె.

263


చ.

మునివర నగ్నుఁ డెవ్వఁడు విమూఢత నేపని చేయ నగ్నుఁడౌ
వినవలతున్ దదీయమగు వృత్తము సత్కరుణాకటాక్షవీ

క్ష నెరయ నాపయి న్నిలిపి సర్వము దెల్పు మటన్న నప్పు డా
వినుతతపోధనుండు కడువేడుక నమ్మునిఁ జూచి యిట్లనున్.

264


గీ.

సన్మునీశ్వర ఋగ్యజుస్సామవేద, ములు త్రయీసంజ్ఞ వెలయు మర్త్యులకు నదియె
యావరణమగు దానిఁ బోనాడునట్టి, పాతకుఁడు నగ్నుఁ డిది వేదభాషితంబు.

265


వ.

సర్వవర్ణంబులకును సంవరణంబు వేదత్రయంబు. అట్టి వేదత్రయంబు విడి
చినవాఁడు నగ్నుం డనంబరఁగు.

266


సీ.

ధన్యవర్తనుఁడు మందాకినీసుతుఁడు నీ, వడిగినయట్ల త న్నడుగుటయును
మాతాత కరుణాసమగ్రుఁడై యక్కుమా, రోత్తమునకుఁ జెప్పె నత్తెఱంగు
విన్నాఁడఁ జెప్పెద వినుము మైత్రేయ దే, వాసురులకు మహాహవము దివ్య
వత్సరంబులు నూఱు వర్తిల్లెఁ దొల్లి యం, దసురవర్గములో నహ్లాదముఖ్యు


గీ.

లైనయసురులు బలియులై యాక్రమింప, సురలు నిర్జితులై పరిస్ఫురణ మాలి
విరిగిపోయి చలచ్ఛుభ్రవీచికావి, తతసురోదన్వదుత్తరతటము చేరి.

267


వ.

తపంబు చేసి తటంబున.

268


లయగ్రాహి.

మెండుకొని రక్కసులు భండనమునం బొడువ దండి చెడి యోడి చని నిండుమతితో నా
ఖండలముఖద్యుచరకాండము నుతించె మురఖండను నమేయగుణమండను విరాజ
త్కుండలిశయాను మృదుగండవిలసన్మకరకుండలరుచిప్రచయుఁ జండకిరణోద్య
న్మండలనివాసి జగదండసముదాయకపిచండిలు నఘౌఘతరుషండదవవహ్నిన్.

269


గీ.

విశ్వలోకేశ్వరుండైన విశ్వదేవు, నవ్యకమలాక్షు నారాధనంబు చేయఁ
గోరి మేముందరమును మిక్కుటఁపుభక్తిఁ, బొగిడిన బ్రసన్నుఁడై మమ్ముఁ బ్రోచుఁగాత.

270


క.

నెట్టుకొని భూతజాలము, పుట్టున్ లయ మందు నేప్రభునియందు మదిన్
బుట్టినసాహసమున మే, మట్టిహరిం బొగడఁగలమె యర్హత వెలయన్.

271


ఉ.

ఐనను దైత్యబాధఁ బరమార్తి మునింగినవారమై నినున్
బూని నుతించి సంతసము బొందఁగఁజేసి విపత్తిఁ బాయఁగాఁ
గాని భవద్గుణాబ్ధిక డగాంచి యధార్థ మెఱింగి కాదు సు
మ్మీ! నిగమాంతవేద్యమగు మీమహిమల్ వినుతించఁబూనుటల్.

272


ఉ.

భూమి జలంబు వాయువు నభోజ్వలనంబులు నీవ శబ్దము
ఖ్యామితతద్గుణంబులు నహంకృతి బుద్ధులు నీవ నీవ యు

ద్ధామతరప్రధానమును దత్పరుఁడౌ పురుషుండ వీవ ల
క్ష్మీమహిళేశ నీవ విను జీవునకుం బరమాత్మ వారయన్.

273


గీ.

అఖిలభూతాత్మ యేకమై యలరు నీదు, వపువె మూర్త మమూర్తంబున పరిమితము
బ్రహ్మమొదలుగ స్తంబపర్యంతమైన, జగ మిదంతయుఁ దానయై నెగడుఁ జువ్వె.

274


క.

చతురాననత్వమున నూ, ర్జితగతి జగములు సృజించి సృష్టికరణకృ
త్యతఁ బరఁగునీకు మ్రొక్కెద, మతిశయిత కృపార్ద్రదృష్టి నరయుము మమ్మున్.

275


క.

మరుదగ్నిశక్రశశిదిన, కరవసురుద్రాదిదేవగణరూపుఁడవై
యిరవొందునీకు మ్రొక్కెద, మరవిందవిశాలనేత్ర యరయుము మమ్మున్.

276


శమదమవర్జిత మజ్ఞా, నమయము దంభాత్మకంబు నయహీనము దు
ర్దమమును నగునీదై త్యో, త్తమరూపంబునకు మ్రొక్కెదము కమలాక్షా.

277


గీ.

నాతివిజ్ఞానమయమును నాతినష్ట, తేజమునునైన తావకోద్దీప్తయక్ష
రూపమున కేము పలుమరు మ్రొక్కువార, మంబురుహనేత్ర మముఁ గావు మాదరించి.

278


క.

పరికింపఁ గ్రౌర్యమాయా, భరితంబై యసిత మగుచుఁ బరఁగిన నీభీ
కరరజనీచరరూప, స్ఫురణమునకు మ్రొక్కెదము ప్రచురతరభక్తిన్.

279


క.

సురలోకప్రాపకమై, నిరతము సత్పురుషమాననీయంబై భా
సురగతి నెయ్యది దగు నా, స్థిరధర్మం బైననిను భజించెద మెలమిన్.

280


సీ.

గగనయానమున సంగము గల్గి చెన్నొందు, సిద్ధాత్ము నినుఁ గొల్తు మిద్ధభక్తిఁ
గ్రూరత్వము ద్విజిహ్వతారూక్షతయుఁ గల్గు, నాగాత్ము నినుఁ గొల్తు మాగమోక్తి
శాంతియు సుజ్ఞానసంపత్తియును గల్గు, ఋష్యాత్ము నినుఁ గొల్తు మిష్టభక్తి
నఖిలభూతములఁ గల్పాంతంబున హరించు, కాలాత్ము నినుఁ గొల్తు మేలు మనుచు


గీ.

నిఖిలజగముల భక్షించి నృత్యమాడు, ఘోరరుద్రాత్మకుని నిన్నుఁ గొల్తు మెపుడు
రాజసంబునఁ గర్మకారణతఁ గల్గు, మనుజరూపకు నినుఁ గొల్తు మనుపమాత్మ.

281


క.

పదునెనిమిది పదివధములు మొదలఁ గలుగు తామసమును మూఢతలోనన్
గదిరినవిశ్వాత్మకు నిను, సదమలతం గొల్చెదము ప్రసన్నతకొఱకున్.

282


గీ.

సకలయజ్ఞాంగభూతమై షడ్విధమయి, ముఖ్యమై సిద్ధికరమయి మొనయువృక్ష
శైలరూపికి నీకు నిశ్చలపుభక్తి, మ్రొక్కెదము మమ్ముఁ గావు నిరూఢమహిమ.

283


క.

సర్వాత్మ సర్వకారణ, సర్వగుణాధార గుణవిసర్జిత కరుణా
ధూర్వహ పురుషోత్తమ మము, గర్వితరక్షోవిజితులఁ గావుము కరుణన్.

284

వ.

దేవా! తిర్యఙ్మనుష్యదేవాదిరూపకుండవును, వ్యోమాదిభూతమయుండ
వును, శబ్దాదిగుణరూపకుండవును, సర్వాత్మకుండవు నైన నీకు నమస్కా
రంబు. ప్రధానబుద్ధ్యాదిమయస్వరూపకుండును, సమానాధికరహితుండును
కారణకారణంబును నగు నీకు నమస్కారంబు. శుక్లాది, దీర్ఘాది, ఘనాది
విశేషణరహితుండును, శుద్ధాదిశుద్ధుండును, బరమర్షిదృశ్యుండును నగు
నీకు నమస్కారంబు. అశేషపూర్ణంబై యక్షయంబైన బ్రహ్మంబగు నీకు
నమస్కారంబు. సనాతనుండును, నజుండును, బరమపదాత్మవంతుండును
నశేషబీజభూతుండును ననాదినిధనుండును నగు వాసుదేవునకు నమస్క
రించెదమని స్తుతియించిన స్తోత్రావసానంబునందు.

285


మ.

కరుణాశస్తుఁడు శంఖచక్రయుగరంగద్దీర్ఘహస్తుండు శ్రీ
తరుణీపూరితవక్షుఁ డాశ్రితజనోద్ధారక్రియాదక్షుఁ డు
ద్ధురనాగాంతకవాహుఁ డంబుదరుచీస్తుత్యోరుదేహుండు శ్రీ
హరి సాక్షాత్కృతి నొందె దేవసముదాయంబు ల్ముదం బొందఁగన్.

286


వ.

ఇట్లు సాక్షాత్కరించిన సంభ్రమాకులచిత్తులై ప్రణిపాతపురస్సరంబుగా బృం
దారకు లిట్లని విన్నవించిరి.

287


క.

కరుణించి ప్రసన్నుఁడవై, శరణార్థుల మమ్ముఁ గావు సమదనిశాటో
త్కరములఁ బరిమార్చి రమా, తరుణీవర భక్తసౌఖ్యదాయక కృష్ణా.

288


సీ.

యాగభాగాదు లఱ్ఱదిమి భక్షించిరి, చేసాప నింతైనఁ జిదుమలేక
నందనద్రుమరాజి నఱికి రెండైనచో, నీడ కొక్కటియైన నిలువనీక
పొందామరలు వీఁకి రెందు మిన్నేట మం, దున కైన వెదకిన దొరకనీక
వెడలిపోఁద్రోలిరి వెదకి మానెలవుల, నొదిగి యొక్కెడనైన నుండనీక


గీ.

కెరలి యచ్చరపడఁతులఁ జెఱలు పట్టి, రదిమి స్వారాజ్య మాక్రమించిరి విధాత
యాతతనుతాజ్ఞ మీఱి బలావలేప, చాపలాపరిమేయరక్షఃప్రవరులు.

289


క.

భవదీయాంశజులము మే, మవిరళదివ్యప్రభావ యైన యవిద్యా
తివిమూఢాత్ములమై యీ, భువనము నీకన్న భేదముగఁ జూతు మజా.

290


వ.

సర్వగోధర్మాభిరతులును, దేవమార్గానుసారులును, దపోవృతులును నగుటం
జేసి యారక్కసులం జంప శక్తులము గాము, వారల వధించు నుపాయం బాన
తీయవలయునని విన్నవించినఁ గరుణావశంవదుండై శ్రీహరి తన శరీరంబువలన
మాయామోహుండను నొక్కపురుషుని నుత్పాదించి సురల కతని నిచ్చి
వారి కిట్లని యానతిచ్చె.

291

సీ.

విబుధవర్గములార వినుఁడు మాయామోహుఁ డితఁడు దానవుల మోహింపఁజేయఁ
గలఁడు మోహితులయి ఘనవేదమార్గబ, హిష్కృతులై వీర్య మెడలి చెడుదు
రందఱు వారు నే నఖిలస్థితికిఁ గర్తఁ, గాన శత్రులఁ జంపఁ గాదు నాకుఁ
గమలజునకు నధికార మిచ్చితిఁ గానఁ, దదధీనసర్వదైత్యవర్గ


గీ.

మట్లు గావున నితఁడె మీయర్థమెల్లఁ జేయఁగలఁడు భయం బేల శీఘ్ర మరుగుఁ
డనుచు నంతర్హితుండయ్యె నాదిదేవుఁ, డమరులును మ్రొక్కి చనిరి హృష్టాత్ము లగుచు.

292


వ.

మాయామోహుండును నమ్మహాసురు లున్నకడకుం జనియె. తత్ప్రకారంబు
వినుము.

293


శా.

మాయామోహుఁడు వోయి కన్గొనియె శుంభద్వీచి మన్నర్మదా
తోయస్ఫారితతీరకాననమునందు న్నందితప్రస్ఫుర
ద్ధీయుక్తిం దప మాచరించుచుఁ బ్రశస్తిం బెంపు దీపించుదై
తేయశ్రేష్ఠుల వేదచోదితిసముద్దీపత్క్రియానిష్ఠులన్.

294


వ.

ఇట్లు కాంచి దిగంబరుండును, మండుండును, బర్హిపత్రధరుండును నై దైత్యు
లం జేరంబోయి మాయామోహుఁడు మధురవచనంబుల నిట్లనియె.

295


గీ.

దైత్యపతులార యేమియర్థంబు కోరి, తపము చేసెద రైహికార్థంబొ గాక
స్థిరతరాముష్మికార్థమో చెప్పుఁ డనిన, వార లి ట్లని రతనితో ధీరఫణితి.

296


క.

పరలోకఫలము చిత్తాం, బురుహంబులఁ దలఁచి తపము పూనితిమి గుణా
కర యక్కఱ యేమి ట్లీ, వరయుట కన వారిఁ జూచి యతఁ డి ట్లనియెన్.

297


చ.

వినుఁడు విముక్తి గోరినఁ బ్రవీణత మద్వచనేరితార్థముల్
ఘనతీరధర్మయుక్తములు కాంక్షితమోక్షఫలప్రదంబు లీ
రనితరబుద్దులై మదుదితామలధర్మము లాచరింపు డెం
దును సరి లేని మీవరమనోరథము ల్సఫలత్వ మొందెడిన్.

298


ఇది ధర్మం బిది యధర్మం బిది సాధు విది యసాధువు. ఇది ముక్తి యొసంగు నిది
ముక్తి యొసంగదు. ఇది పరమార్థం బిది యపరమార్థంబు. ఇది కార్యం బిది య
కార్యంబు. ఇది స్ఫుటం బిది యస్ఫుటంబు. ఇది దిగంబరధర్మం బిది బహువస్త్ర
ధర్మం బని బహుయుక్తిదర్శనచర్చితంబు లగు నతనివచనంబులు విని విశ్వసించి
యనేకాంతవాదపరులై యల్పకాలంబునన త్రయీత్యాగంబు చేసిరి. తద
నంతరంబ మఱియును.

299


క.

ధర్మపరు లౌచు వైదికకర్మాచరణప్రవణవికాసితతనులై
నిర్మలత నున్న కొందఱి, నర్మిలిఁ గని యధికవంచనాతికుశలుఁడై.

300

క.

కాషాయధారియై సం, భాషానిపుణత్వ మమర మాయామోహుం
డీషదనిశ్చితకుహనా, వేషతఁ బాషండవృత్తి వెలయం బల్కెన్.

301


క.

దనుజవరులార మీ రి, ట్లొనరించిన పనికి స్వర్గమో మోక్షంబో
వినుతఫలం బక్కట యిం, కనయినఁ బశుహింస మానఁగాదే మీకున్.

302


క.

జ్ఞానంబు కారణము వి, జ్ఞానమయవిశేష మనుచు సకలవిబుధులున్
బూని వివరించి రింకన్, జ్ఞానవిదులు గాఁగవలయుఁ జయ్యన మీరల్.

303


వ.

వినుం డిజ్జగం బనాధారంబై భ్రాంతిజ్ఞానార్థతత్పరంబై రాగాదిదుష్టంబై భవ
సంకరంబునందు భ్రమించుచుండు.

304


శా.

కార్యం బంచు నకార్య మంచు నిట వక్కాణింపఁగా నేల మీ
రార్యుల్ చూడుఁడు పుట్టి రంగనలు భోగార్థంబె యిట్లౌట ని
ర్మర్యాదంబుగ భోగము ల్గనుఁడు కామక్రీడ నెంచం దనూ
నిర్యాణం బయిన న్గనంగలరె నిర్జిద్రోపభోగక్రియల్.

305


గీ.

చిత్తగించిన వెల్ల భక్షింపవలయు, క్షణికతను విది చిత్తంబు కట్టఁదగునె
జగతిలో భక్ష్య మిది యభక్ష్యం బి దనుచు, నెంచుకొనుమాట లెల్లను వంచనంబు.

306


వ.

ఇవ్విధంబు తెలియుండు మద్వచనంబులు చేయుండనుచు ననేకహేతుదృష్టాం
తంబులు చూపి చెప్పుమాయామోహుని వచనంబు లవలంబించి నక్తంచరులు
కించిత్కాలంబునన శ్రుతిస్మృత్యుదితంబగు ధర్మంబు విడిచి యన్యోన్యబోధ
కులై శిష్యాచార్యపరంపరలవలన నందఱుఁ బాషండధర్మపరులై రప్పుడు.

307


సీ.

పలుసంతమాటల పాఁతజోలిభళీర, సడిపడ్డ యీవట్టిచదువు లేల
పదమంచు నమ్మి నిబ్బరపుఁగర్మపయోధి, మునిఁగి రయ్యో వీరిముచ్చ టేల
పరుఁడు పెట్టక కాని బ్రతుకలే రయ్యారె, బడుగువేలుపుల బంబది? యిదేల
పూరి కట్టెలు మేఁకపోతులు నేతులు, నవుర జన్నపుబూమెలాట లేల


గీ.

డంబు లివి యేల పరమధర్మం బహింస, యనుచు వేదద్విజామరయజ్ఞతతుల
నతులపాషండచండయుక్త్యతిశయములు, గముల నిందింతు రసురపుంగవులు కపులు.

308


వ.

మఱియు నమ్మాయామోహుండు.

309


క.

జగతి నహింసయె పరమం, బగు ధర్మ మధర్మ మనుచుఁ బాటింపంగాఁ
దగునె క్రతుహింసయుక్తికి, మొగయవుగా యిట్టి యర్థములు చర్చింపన్.

310


మ.

క్రతువుల్ పెక్కులు చేసి దేవుఁడయి స్వర్ణం బేలు నౌరా శచీ
పతియంచున్ భ్రమ మంద నేల యనలప్రాంచఛ్ఛిఖాదగ్ధమై

వితథంబైన హవిఃకదంబకము భావింపం ఫలావాప్తి యీఁ
జతురంబే యహహా వినందగునె యీజంజాటము ల్వల్కినన్.

311


క.

అనయము క్రతువున మృతి బొం, దిన పశువు దివంబు గనుట నిజమే యట్లై
నను యజమానుఁడు నిజజన, కుని జంపఁగవలదె దివముఁ గూర్చెడికొఱకున్.

312


చ.

ఒకరు భుజింప నన్యులకు నొందదుగా పరితృప్తి శ్రాద్ధముల్
వికలతఁ జేయువారు కడువెఱ్ఱులు తృప్తి నిజంబ యేని యూ
రికిఁ జనువారు చల్దులు ధరించి చనం బని లేద యింటివా
రకుటిలచిత్తులై కుడువ నక్కడవారికిఁ దృప్తి గల్గెడిన్.

313


వ.

ఈయంతయుం జన శ్రద్ధేయముగాఁ దలంచి యుపేక్షింపవలయు. ఆప్తవాదంబు లా
కసంబుననుండి యూడిపడవుగదా! యుక్తియుక్తంబైన వచనంబు గ్రహింప
వలయు. నావచనంబులు మీకు రుచియించినఁ జేయుండని వెక్కుదెఱంగుల
బోధించు మాయామోహుని మతం బవలంబించి పాషండధర్మపరులై వేద
మార్గంబు విడిచి చరించి రంతం గొంతకాలంబు చనిన.

314


క.

హరిహయరథభటకోటి, స్ఫురణము మిన్నందఁ గదలి పోర మహాసం
గర మొనరించిరి దైత్యులు, సురగణములతో సమగ్రశూరత్వమునన్.

315


వ.

ఇట్లు పోరి దేవగణంబులచేత నిహతులైరి. మైత్రేయా! వేదోదితంబైన
స్వధర్మంబు వారికిఁ గవచంబై యుండె. నట్టి వేదమార్గంబు విడుచుటం జేసి
నష్టకవచు లైరి, దేవగణంబులు సుఖించి రని చెప్పి పరాశరుండు మైత్రేయున
కి ట్లనియె.

316


క.

మాయామోహోదితమగు, మాయామార్గమున నడుచు మనుజుఁడు నగ్నుం
డీయర్థమునకు సంశయ, మేయెడల న్లేదు మునికులేశ్వర వింటే.

317


వ.

బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, పరివ్రాట్సంజ్ఞలుగల యాశ్రమంబులు
నాలుగు గాని యేనవయాశ్రమంబు లేదు. ఎవ్వండేని క్రమంబున నాశ్రమధర్మం
బులు నడపకయుండు నప్పాతకుండు నగ్నుం డనంబరఁగు. శక్తుం డయ్యును నిత్య
కర్మంబు నడపండేని యద్దనంబుననే యతండు పతితుం డగు. ఆపద లేకయు,
నొక్కపక్షంబు నిత్యక్రియాహాని చేసినను మనుజుండు మహాప్రాయశ్చిత్తం
బున శుద్ధుం డగు. సంవత్సరంబు క్రియాహాని చేసిన మనుజునిఁ జూచి సూర్యావ
లోకనంబు చేయవలయు. ముట్టిన సచేలస్నానంబు చేయవలయు. సంవత్సర
క్రియాహానికరునకు శుద్ధి లేదని వేఱ చెప్పనేల? దేవర్షిపిత్రతిథిభూతంబులం
దృప్తులం జేయనివానికన్నఁ బాతకుండు లేఁడు. అట్టి పాతకితో యానాసనపరి

చ్ఛదసంభాషణానుప్రశ్నంబులచేతఁ గలిసి వర్తించిన యతండు తత్తుల్య
పాతకుం డగును.

318


క.

దేవతలఁ బితరులను భూ, తావళి నతిథివ్రజంబు నర్చింపక వాం
ఛావృత్తిం దాఁ దిను, పా, పావహునకుఁ గలదె నిష్క్రియాకలన మహిన్.

319


వ.

నాలుగువర్ణంబులవారును స్వధర్మవిముఖులై హీనధర్మంబుల నడిచిన నగ్ను
లగుదురు. ఈనగ్నుల సర్వకాలంబుల దర్శనస్పర్శనాదులను వర్జింపవలయు.
శ్రద్ధావంతు లాచరించు శాద్ధంబు నగ్నులచేతం జూడఁబడిన నిష్ఫలంబగు
నీయర్ధంబున కొక్కయితిహాసంబు గలదు. ఆకర్ణింపుము.

320


సీ.

సకలధర్మజ్ఞుండు శతధన్వుఁడనురాజు, కలఁడు లోకైకవిఖ్యాతయశుఁడు
తద్భార్య శైబ్య యుత్తమపతివ్రత శుభ, లక్షణాన్విత శుభశ్లాఘ్యచరిత
ఆదంపతులు సరోజాక్షు జనార్దను, జపహోమదానపూజావ్రతముల
నెలమి నారాధించి కొలుచుచు నొకనాఁడు, కార్తికమాసమాంగళికపౌర్ణ


గీ.

మాసి నుపవాస ముండి నేమమున గంగ, తోయములఁ దీర్థ మాడి సంతుష్టహృదయు
లగుచుఁ దటమున కేతెంచునవసరమున, నృపతిసఖుఁ డొక్కపాషండుఁ డేగుదెంచె.

321


ఉ.

వచ్చినవానితో నవినివల్లభుఁ డల్లన మాటలాడెఁ గ
న్విచ్చి లతాంగి వానిఁ గని విహ్వలయై కమలాప్తుఁ జూచి వా
క్యోచ్ఛరణంబు మాని చనె నొయ్యన నయ్యవనీశుఁ గూడి సం
పచ్చయపేటియైన ప్రతిభావిలసన్నిజరాజధానికిన్.

322


వ.

ఇట్లు నిజపట్టణంబునకు వచ్చి యథాన్యాయంబుగాఁ బుండరీకాక్షు నక్షీణ
పూజాదికంబులం దుష్టిం బొందించుచుండి రంతఁ గొంతకాలంబునకు నమ్మ
హీకాంతుఁడు నితాంతసమరక్రీడాపరిశ్రాంతుండై యంతంబు నొందిన
నతని కాంతారత్నంబును ధర్మక్రమంబునఁ జితారోహణంబు చేసె. ఉపవాన
దినంబునఁ బాషండసల్లాపంబు చేసినదోషంబున నమ్మేదినీనాథుండు వైదేశా
ఖ్యపురంబునందు శునకంబై జన్మించె. ఆతని యుత్తమాంగనయు సర్వ
లక్షణసంపన్న యై కాశీరాజునకుఁ గూఁతురై జన్మించి జాతిస్మరత్వంబు గలిగి
యుండి.

323


క.

తనతండ్రి పెండ్లి యాడఁగఁ, దనకుఁ బరిణయంబు చేయఁదలఁచిన నపు డ
వ్వనజాతేక్షణ వలదని, జనకుని వారించెఁ గలితజాతిస్మరయై.

324


శా.

ఆకన్యామణి యాత్మయోగభవదివ్యజ్ఞానదృష్టిన్ ధరి
త్రీకాంతు న్నిజవల్లభుం గనియె వైదేశంబున న్నీచనీ

చాకారంబగు కుక్కపుట్టువున దుఃఖాక్రాంతుఁడై యుండఁగా
నాకాలంబునఁ బోయెఁ దద్గతమహావ్యాసక్తి నవ్వీటికిన్.

325


వ.

అచ్చటికిం బోయి తదవస్థుండై యున్న పతిం జూచి దుఃఖించి యచ్చంచలాక్షి
సత్కారప్రవణంబగు వరాహారం బొసంగ భక్షించుచు లాంగూలచాలనం
బును, నధశ్చరణావపాతంబులును, భూలుంఠనంబును, వదనోదరదర్శనంబును
మొదలైన స్వశ్వజాతిలలితచాటుక్రియలు చేయ సతి వ్రీడితయై కుయోని
జాతుండైన పతిం జూచి దుఃఖించి ప్రణామపూర్వకంబుగా ని ట్లనియె.

326


క.

ధర్మైకపరాయణుఁడవు, నిర్మలుఁడవు విష్ణుభక్తినిరతుండవు స
త్కర్ముఁడవు శతధనుండను, నిర్మలవృత్తంబు గలుగు నృపతివి తలఁపన్.

327


గీ.

అరయ కుపవాసకాలంబునందుఁ దొల్లి, యధికపాషండుతో మాటలాడునట్టి
దోషమున నీకు నిటువంటి దొసఁగు వచ్చె, నాత్మఁ దలఁపుము నాఁటివృత్తాంతమెల్ల.

328


వ.

అని యివ్విధంబున.

329


మ.

లలనారత్నము తన్నుఁ జూచి మృదుసల్లాపంబు గావింప వీ
నులు నిక్కించుచు నాలకించి మదిలో నూల్కొన్నజాతిస్మర
త్వలసజ్ఞానమునన్ శరీరముతగుల్ వర్జించి జన్మించె న
వ్వలఁ గోలాహలనామభూధరము చెంపన్ నక్కయై గ్రక్కునన్.

330


వ.

అప్పతివ్రతాతిలకంబును సంవత్సరద్వయంబునకు నగ్గిరికిం బోయి, సృగా
లంబై యున్న తనవల్లభుం జూచి యిట్లనియె.

331


సీ.

రాజేంద్ర! మఱచితివే జను లెఱుఁగఁగా, శునకమై నీవున్నచోటి కేను
జనుదెంచి పాషండసల్లాపజంబైన, దోషంబు దెలిపితిఁ దొడరి నీకు
నన విని నక్క జీవనముపై వాంఛ పో, విడిచి నిరాహారవృత్తిఁ దనువు
........... ............ ................. ........ ......... ....... .... ....


గీ.

దొఱఁగి వృకమయి జన్మింప నెఱిఁగి సాధ్వి, వనమునకు నేగి తోడేటితనము దాల్చి
యున్నపతిఁ జూచి యక్కటా యోమహాత్మ. మఱచితే నీవు పూర్వజనపుఁజరితము.

332


క.

మును పాషండునితోఁ జ, య్యన వ్రతదివసమున మాటలాడినకతనన్
విను కుక్క నక్క తోడే, లనునీపుట్టువులు గల్గె నక్కట నీకున్.

333


క.

అని తలఁపించిన నపు డ, య్యనఘుఁడు వృకతనువు విడిచి యటవి జనించెన్
ఘనగృధ్ర మగుచు నయ్యం, గన యప్పుడు దెలుప నతఁడు కాకం బయ్యెన్.

334

ఉత్సాహ.

కామినీలలామ పల్కెఁ గాకిఁ గూడి యక్కటా
భూమినృపతు లెల్ల నీకు భూరిబలు లొసంగఁగా
స్వామియై చరించు నీ వసద్బలిప్రభోక్త వై
తేమి గలదు పూర్వకర్మ మింత వింత చేయఁగాన్.

335


వ.

పాషండసల్లాపదోషంబున శునక, సృగాల, వృక, గృధ్రజన్మంబు లెత్తి
యిప్పుడు కాకంబ వైతే యని తలఁపించిన.

336


గీ.

కాకతనువు విడిచి గ్రక్కున కొంగయై, యున్నవిభునికడకు నొయ్యఁ జేరి
చెలియ యెప్పటట్లు తలఁపింప నమ్మహీ, విభుఁడు నెమిలి యయ్యె విప్రవర్య.

337


చ.

విభుఁడు మయూరజన్మము, నవీనత నెత్తు టెఱింగి యప్పు డ
య్యిభరిపుమధ్య దానికి నభీష్టవరాభ్యవహారకృత్యముల్
ప్రభ నొనరించుచు న్సుకృతపాకము గోరుచుఁ బెంచుచుండఁ ద
చ్ఛుభచరితంబు పక్వమగు చొప్పునఁ గాలము వీలవచ్చినన్.

338


వ.

అక్కాలంబున జనకభూపాలుండు వాజిమేధమహాక్రతువు చేసి తద్దీక్షాం
తంబయిన యపబృథస్నానంబు చేయ నప్పు డప్పువ్వుఁబోఁడి మయూరంబుం
దాను నపబృథస్నానంబు చేసి యమ్మయూర౦బుఁ జూచి పాషండసల్లాప
దోషంబున శునక, సృగాల, వృక, గృధ్ర, కాక, బకజన్మంబు లెత్తి యిప్పుడు
మయూరంబవై యున్నాఁడవు. తలంచుకొనుమని తలఁపించిన జాతిస్మరుండై
మయూరదేహంబు విడిచి యజ్జనకమహీపాలునకుం బుత్రుండై జన్మించి
శీఘ్రకాలంబున సంప్ర్రాప్తయౌవనుం డయ్యె నంత.

339


ఉ.

మానిని తండ్రితోడ ననుమానము మాని మదీయపాణిపీ
డానుపమానయత్నమునకై యివు డీవు స్వయంవరంబు వెం
పూనఁగఁ జేయుమన్న ముద మొందుచుఁ గాశివిభుండు చేసెఁ బెం
పై నెగడన్ స్వయంవరమహం బరుదెంచిరి రాజనందనుల్.

340


గీ.

ముదముతోడ స్వయంవరమునకు రాజ, పుత్రు లేతేర నందులోఁ బూవుఁబోఁడి
జనకభూపాలనందనుఁ జారుకీర్తిఁ, దనపతి వరించె ధర్మపథంబు వెలయ.

341


వ.

అక్కాంతారత్నంబుతో నారాజనందనుండు బహుభోగంబు లనుభవించి
తండ్రిపరోక్షంబున వైదేహదేశంబునకు రాజై సాంగదక్షిణాకంబుగా బహు
యజ్ఞంబులు చేసి యనేకదానంబులు ధర్మంబులు చేసి పుత్రుల నుత్పాదించి
శాత్రవుల జయించి యథాన్యాయంబుగా రాజ్యంబు పాలించి ధర్మక్రమంబున

సంగ్రామంబులో నక్షీణవిపక్షప్రక్ష్వేడనక్షతవక్షఃస్థలుండై దివంబునకుం
జనిన నతనిధర్మపత్ని చితారోహణంబు చేసి యతండుం దానును సర్గక్షయ
పర్యంతంబును నక్షయంబులైన స్వర్గాదిభోగంబు లనుభవించిరని చెప్పి
శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

342


సీ.

పాషండసల్లాపదోషంబు నశ్వమే, ధావబృథస్నానజాతిమహిమ |
యును నిట్టితెఱఁగు సు మ్మనఘాత్మ కావునఁ, బాపిష్ఠపాషండభాషితంబు
సంస్పర్శనంబును జాలింపవలయు వి, శేషించి విను పుణ్యశీలు రైన
వారు యాగాదిదీక్షారంభవేళల, సద్వ్రతాద్యుపవాససమయములను


గీ.

గూడి పాషండుతో మాటలాడఁజనదు, మౌనివర యొక్కనెల క్రియల్ మాను నెవ్వఁ
డతనిఁ గని భానుఁ జూడంగ నర్హ మెపుడు, నన్నియును మానువానిమా టడుగ నేల.

343


వ.

పాషండులను, వికర్మస్థులను, బిడాలవ్రతికులను, శఠులను, హైతుకులను,
బకవృత్తులను, వాఙ్మాత్రంబు చేతనైన నర్చింపంజనదు. దురాచారులును,
బాపిష్ఠులునునైన పాషండులతో సంసర్గసల్లాపసహాసనస్థితులు వర్జింపవలయు.
ఇప్పుడు నాచేతం జెప్పంబడిన వీరు నగ్ను లనంబరగుదురు. దృష్టిమాత్రం
బున శ్రాద్ధంబు చెఱుపంజాలుదురు. వీరితో సంభాషించిన దినకృతపుణ్యం
బులు చెడు. కావున బుధుండు వీరిసమీపంబునకుం బోవలవదని చెప్పి శ్రీపరా
శరుం డి ట్లనియె.

344


చ.

కలగొనుజ్ఞాన మేమియును గానక మౌఢ్యమున న్వృథాజటల్
తలల ధరించి శౌచమును ధర్మము పైతృకపిండతోయముల్
తలఁపనిదుష్టచిత్తులకథల్ చెవిఁ దార్చినఁ దోడఁ బల్కినన్
జులుకన మర్త్యు లొందుదురు సుమ్ము మహానరకప్రపంచమున్.

345


వ.

అని చెప్పుటయు.

346


ఉ.

నీలక్ష్మాధరవాస వాసరకరోన్నిద్రారివహ్నిచ్ఛటా
తూలద్దైత్యవికాస కాసరశిరఃస్తుత్యోకృతాంతార్థికే
ళీలోలాత్మవిలాస లాసమహపాళీద్రష్టుకామాంతలో
కాలక్ష్యప్రతిమాస, మాసరసభావాశిష్టదోరంతరా.

347


క.

మంక్షుగసంసృతిసింధుమి, మంక్షూద్ధరణైకదీక్ష మహితపిపాసా
సంక్షోభరోహణమిళ, ద్ధ్వాంక్షవయోమోక్షదానదక్షిణవీక్షా.

348

తోటకము.

నిజభక్తమహత్త్వవినిర్దళితా, ప్రజహత్సుమహత్తరపాపతతీ
సుజనస్తవనీయయశస్తిలకా, వ్రజపద్మభవాండఫలప్రతతీ.


గద్య.

ఇది శ్రీమత్సుభద్రాకరుణాకటాక్షవీక్షాలబ్ధకవిత్వతత్వపవిత్ర వేంకటా
మాత్యపుత్ర కందాళ శ్రీరంగాచార్య కృపాపాత్ర సజ్జనమిత్ర శ్రీహరిగురు
చరణారవిందవందనపరాయణ కలిదిండి భావనారాయణ ప్రణీతంబైన శ్రీవిష్ణు
పురాణంబునందు స్వాయంభువాదిచతుర్దశమనువులచరిత్రంబును, వ్యాసావ
తారంబును, యాజ్ఞవల్క్యచరితంబును, సూర్యస్తుతియుఁ, జతుర్వేదసంప్ర
దాయంబును, నష్టాదశవిద్యాసంఖ్యానంబును, యమభటసంవాదంబును,
భగవదారాధనప్రకారంబును, వర్ణాశ్రమాచారంబులును, సదాచారంబును
శ్రాద్ధప్రకారంబులును, నగ్నప్రకారంబును, దేవాసురయుద్ధంబును, దేవ
తలు శ్రీహరిని స్తుతియించుటయు, మహామోహనిర్మాణంబును, బాషండా
చారవర్ణనంబును, శతధన్వోపాఖ్యానంబును ననుకథలుగల తృతీయాంశంబు
నందు తృతీయాశ్వాసము.

  1. సూతిపోష్ట — 'వృషలీసూతిపోష్ట' అని యుండనగును. శూద్రాపత్యపోషకుఁడని యర్థము.