Jump to content

విక్రమార్కచరిత్రము/సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

విక్రమార్కచరిత్రము

సప్తమాశ్వాసము

శ్రీమత్కనకాంబరగో
భూమిప్రముఖేష్టదానపోషితబంధు
స్తోమమహీసురసరస
క్షేమంకర సదయహృదయ సిద్ధనమంత్రీ.

1


మ.

జగదాశ్చర్యకళాకలాపకలనాచాతుర్యధుర్యుండు వీ
రగుణోదర్కుఁడు విక్రమార్కుఁడు మహారాజాగ్రగణ్యుండు, సా
రగతిన్ రెండవమాట యమ్మదవతీరత్నంబుఁ బల్కింపఁగాఁ
దగుయత్నంబున నంతరంగమునఁ దాత్పర్యం బవార్యంబుగన్.

2


క.

దర్పితరిపుహరణభుజా
దర్పధురంధరుఁడు, మంత్రతంత్రస్ఫురణం
గర్పూరకరండమునకు
నేర్పునఁ బ్రాణంబు లొసఁగి, నెఱ నిట్లనియెన్.

3


క.

తగ వెఱఁగి దివియగంబము
తగుతెఱఁగునఁ బ్రొద్దుపుచ్చె, దగ వెఱుఁగక యీ
యిగురాకుఁబోఁడి పలికిన
బగడంబులు రాలునట్లు పలుకదు మాతోన్.

4


విక్రమార్కుఁడు కప్పురపుబరణిచేఁ జెప్పించిన రాజశేఖరుని కథ

క.

ఇప్పొలఁతిపగిది నీవును
నొప్పరికించుకొనియుండు టుచితముగా, దో
కప్పురపుబరణి యొకకథ
చెప్పఁగదే నాదుచనవు చేకొని యనినన్.

5

వ.

మహాప్రసాదం బని, యొక కథ విన్నవించెద నవధరింవు మని యాబరణి ధరణీశ్వరున కిట్లనియె.

6


సీ.

ఉల్లోలసురధునీకల్లోలమాలికా
        ప్రతిభటధ్వజపటప్రాభవంబు
నానామహాసౌధనవసుధాచంద్రికా
        ధగధగాయితనభోదర్పణంబు
ఖేచరదంపతిలోచనానందన
        వందనమాలికావైభవంబు
ప్రాకారకీలితబహురత్నదీపికా
        విహితవిక్రమదిశావిలసనంబు


తే.

వివిధశృంగారవనమహీవిహరమాణ
మందపవమానవలమానమానితంబు
రమణరమణీసమాకీర్ణరాజమాన
భరితవిభవంబు పంచకపురవరంబు.

7


క.

అన్నగరమున కధీశుఁడు
సన్నుతకీర్తిప్రతాపసముచితగుణసం
పన్నుఁడు విక్రమకేసరి
యున్నతరిపువీరవిదళనోగ్రత మెఱయున్.

8


ఉ.

పావనమూర్తి యవ్విభునిపట్టపుదేవి యుమావతీమహా
దేవి, కటాఠవీక్షణవిధేయనిధానపరంపరారమా
దేవి, రసప్రసంగసముదీర్ణకళాకలనాసరస్వతీ
దేవి, చిరక్షమాధరణిదేవి యనం జెలువొందుఁ బెంపునన్.

9


క.

ఆదంపతులకుఁ బ్రమద
శ్రీదైవాఱంగ రాజశేఖరుఁడు దిశా
మేదురకీర్తివిహారమ
హోదారగుణాభిరాముఁ డుదయించి తగన్.

10

క.

ప్రతిపక్షశిక్షణంబును
క్షితిజనసంరక్షణంబు చేసి, ‘యవశ్యం
పితు రాచార’ మ్మనుపలు
కతఁ డెంతయు నిజ మొనర్చె ననుపమశక్తిన్.

11


మ.

[1]పవమానప్రతిమానసత్త్వజవశుంభద్వాహనారోహణో
త్సవసంభావితు లైనరాహుతులతో, ద్వాత్రింశదుగ్రాయుధ
వ్యవహారోద్భటసద్భటప్రతతితో, నారాజసూనుం డుదా
రవిభూతిన్ జని యొక్కనాఁడు విపులారణ్యాంతరాళంబునన్.

12


వ.

బహుప్రకారంబు లగుమృగయావిహారంబులం దగిలి చని చని, యొక్కయెడ సర్వాలంకారసుందరంబగు శర్వాణీమందిరంబుఁ గనుంగొని, యమ్మహాశక్తికి దండప్రణామం బాచరించి, యనంతరంబ తత్ప్రదేశంబున.

13


సీ.

మత్తికాటుకపొత్తు మరగిననునుఁగెంపుఁ
        జూపులఁ గలికిమించులు నటింపఁ
బెక్కువన్నెలకంథచక్కిఁ జిక్కక నిక్కి
        చనుదోయి కెలఁకులఁ జౌకళింప
సంకుఁబూసలక్రొత్తసరుల నిగారించి
        కంబుకంఠము నూత్నకాంతి నొసఁగఁ
బలుగుఁగుండలములప్రభఁ బ్రోది చేయుచుఁ
        జెక్కులఁ జిఱునవ్వు చెన్నుమీఱ


తే.

యోగదండాగ్రగతపాణియుగళిమీఁదఁ
జిబుకభాగంబు నిలిపి రాచిలుకతోడ
సకలవిద్యానుసంధానసరసగోష్ఠిఁ
గలసి భాషించు యోగీంద్రకాంతఁ గనియె.

14


చ.

కనుఁగొని, తద్విలాసములు కన్నులపండువు సేయ, సత్కథా
జనితరసప్రసంగములచందము డెందము నామతింపఁగాఁ

జనవు నటించి డగ్గఱినఁ, జయ్యన 'భైరవరక్ష' యంచు నిం
పెనయఁగ యోగినీతిలక మిచ్చె విభూతి నరేంద్రసూతికిన్.

15


వ.

ఇచ్చినం బుచ్చుకొని సుఖాసీనుండై యున్నయవసరంబున.

16


క.

పంజరము వెడలి నరపతి
కుంజరు దీవించి, సరసగోష్ఠి సునీతిన్
రంజింపఁజేసె గీరము
మంజులభాషావిశేషమాధుర్యమునన్.

17


వ.

అనంతరంబ యారాజు రాజకీరాభిలాపగర్భంబులైన సముచితాలాపసందర్భంబు లుపన్యసించిన, నయ్యోగినీరత్నంబు ప్రయత్నపూర్వకంబుగా సర్వంసహాధీశ్వరున కిట్లనియె.

18


క.

అష్టాంగయోగవిద్యా
వష్టంభమువలనఁ, గీరవర వచనసుధా
వృష్టి మదిఁ దొప్పఁదోఁగఁగ
నిష్టము గలిగినను జెల్ల దిది మాకు నృపా!

19


క.

అఱువదినాలుగువిద్యల
నెఱవాది త్రికాలవేది నీ వీచిలుకన్
నెఱవుగఁ జేపట్టిన నది
చెఱకునఁ బం డొదవినట్లు చిరకీర్తినిధీ!

20


ఆ.

రాజయోగ్యమైన రమణీయవస్తువు
యోగిజనులయొద్ద నునికి దగునె?
యవధరింపు మనుచు, నవరత్నపంజరా
నీతమైన చిలుకఁ జేతి కిచ్చె.

21


ఉ.

ఇచ్చిన మూఁడులోకములు నేలినకంటెను సంతసిల్లి దా
నచ్చపలాక్షి వీడుకొని, యద్రిసుతాభవనంబు చేరువన్

మెచ్చులుమీఱఁ గోమలసమీరవిశాలరసాలవీథికిన్
వచ్చి, పథిశ్రమాపనయవాంఛమెయిన్ విడియించె సేనలన్.

22


వ.

తదనంతరంబ.

23


క.

భూతలపతిసూతి, కళా
చాతుర్యనిరూఢు లైన సచివులు దానున్
శీతలశశికాంతోపల
చూతలతాగృహమునందు శుకవిభుతోడన్.

24


వ.

సరసకథామాధురీధురీణమంజులభాషావిశేషతోషితుండై యిట్లనియె.

25


సీ.

అఖిలజగత్కర్త యైనపంకజగర్భు
        పట్టంపుదేవి చేపట్టి పెనిచె
నారాయణసహస్రనామసామ్యముగల
        రామాఖ్య యొసఁగిరి రాజముఖులు
వలరాజు తసమూలబలములోపల నెల్ల
        నెక్కుడుమన్నన యిచ్చి మనిచె
వేదాంతసిద్ధాంతవేది వేదవ్యాస
        భట్టారకుఁడు పేరు పెట్టె సుతుని


తే.

నిట్టిమీవంశకర్తల కితరపక్షి
వరులు తేజోనిరూఢి నెవ్వరును సరియె?
సకలవిద్యారహస్యభాషావిశేష
చాతురీధామ శుకరాజసార్వభౌమ!

26


చ.

పరిణతనూత్నరత్నమయపంజరపీఠికలన్ సుఖించినన్
సరసరసాలసత్ఫలరసంబులు కుత్తుకబంటి క్రోలినం
బరిచితవాక్యభంగి బహుభంగిఁ బ్రసంగము చేసెనేని, నీ
కరణి ద్రికాలవేదు లనఁగా మననేర్చునె యన్యకీరముల్?

27

క.

కావున నీభావంబున
భావించి, మదీయ భావిఫలసంప్రాప్తి
శ్రీ వివరించి వచింపుము
నావుడు, రాచిలుక మనుజనాథుని కనియెన్.

28


మ.

కరుణానీరధి సత్యధర్మధరణీకాంతుం డవంతీపురీ
శ్వరుఁ, డారాజుతనూజ నూతనకళాసౌభాగ్యకర్పూరమం
జరి కన్యాతిలకంబు, మన్మథమహాసామ్రాజ్యలక్ష్మీధురం
ధరశృంగారవిలాసవైభవసముద్యన్మూర్తి, ధాత్రీశ్వరా!

29


క.

ఆవెలఁదియు దేవరయును
దేవియు దేవరయుఁబోలెఁ దేజోవిభవ
శ్రీ వెలయఁగ నలరెద, రిదె
వైవాహికవార్త యిపుడె వచ్చు నరేంద్రా!

30


చ.

అన విని భూవిభుండు నగి, యౌ నిది చెప్పెడువారు చెప్పినన్
వినియెడువారి కించుక వివేకము లేదా శుకాగ్రగణ్య! నీ
వనియెడుమాట నాదు మది కచ్చెరువయ్యెడి నన్న, దేవ! యే
యనువుననైన నీయడుగులాన నిజం బని చిల్క పల్కినన్.

31


క.

తాళము వైచినతెఱుఁగున
భూలోకాధీశుడెందమున కానంద
శ్రీ లొదవించుచు వచ్చెను
లాలితమంజీరమంజులధ్వను లంతన్.

32


సీ.

కీలుకొప్పునఁ గన్నెగేదంగిఱేకులు
        పునుఁగుసౌరభముల బుజ్జగింప
నలికభాగంబున నెలవంకతిలకంబు
        కస్తూరివాసనఁ గుస్తరింప
సిర మైన పచ్చకప్పురముతో బెరసిన
        తమ్ములమ్మున తావి గుమ్మరింపఁ

గుచకుంభములమీఁది కుంకుమపంకంబు
        పరిమళంబులతోడఁ బరిచరింప


తే.

గంధవహనామవిఖ్యాతి గణనకెక్కు
నించువిలుకానివేగువాఁ డేఁగుదెంచి
యిగురుఁబోఁడులగమిరాక యెఱుకపఱిచె
సరసనుతుఁ డైన యారాజచంద్రమునకు.

33


ఉ.

చందనగంధు లిద్దఱు లసన్మణికాంచనదండచామర
స్పందన మాచరింప, నడపం బొకపంకజనేత్ర పట్టఁగా
నిందునిభాననామణు లనేకులు గొల్వఁగఁ జారులీలతో
నందల మెక్కి యొక్కజలజానన వచ్చె నృపాలుపాలికిన్.

34


వ.

వచ్చి యాందోళికావతరణానంతరంబున.

35


సీ.

జిగి దొలంకుచునున్న బిగిచన్నుఁగవక్రేవఁ
        గరమూలరోచులు కలయఁబొలయ
మించుగా దీపించు మెఱుఁగుఁజూపులయొప్పు
        మణికంకణములపై మాఱుమలయ
గరపల్లవద్యుతిఁ గస్తూరితిలకంబు
        కుంకుమపంకంబు కొమరుమిగుల
నవ్యవిస్ఫురణమై నఖముఖంబులకాంతి
        వెలయుముత్యములతోఁ జెలిమి సేయ


తే.

నలఁతినగవు లేఁజెక్కుల నంకురింప
రాచమ్రొక్కుగ మ్రొక్కి యారాజవదన
రాజు చేసన్న నాసన్నరత్నపీఠిఁ
జెలువు రెట్టింపఁగా సుఖాసీనయయ్యె.

36


క.

ఆరమణి యుచితవచనసు
ధారసమున విభుఁడు సమ్మదము నందుతఱిం
గీరము తనసర్వజ్ఞత
యారూఢికి నెక్క నంబుజానన కనియెన్.

37

చ.

పలుకులనేర్పునం జెవులవండువు చేసితి వింతసేపు, నా
పలుకు శిలాక్షరంబుగ శుభం బది శీఘ్రముగాఁగ నంతయుం
దెలియఁగఁ జెప్పు మింక భవదీయసమాగమనప్రసంగముల్
జలజదళాక్షి! యేమిటికిఁ జల్లకు వచ్చియు ముంత దాఁపఁగన్?

38


వ.

అనిన విస్మయానందకందళితమాససయు మందస్మితసుందరవదనారవిందయు నై, యయ్యిందువదన క్షమాపతినందను నవలోకించి, యామూలచూడంబుగా మదీయవిజ్ఞాపనంబు దత్తావధానుండవై చిత్తగింపుమని యిట్లనియె.

39


సీ.

వివిధవైభవముల విలసిల్లుపట్టున
        శ్రీలకెల్ల నవంతి మేలుబంతి
యన్నగరాధీశుఁ డధిగతపరమార్థ
        నిత్యసద్ధర్ముండు సత్యధర్ముఁ
డావిభుపట్టపుదేవి లీలావతీ
        దేవి రెండవభూమిదేవి తాల్మి
వారికిద్దఱకును వర్ణితసౌజన్య
        కర్పూరమంజరి కన్య కలుగఁ


తే.

గలిగె బాంధవతతికి భాగ్యములకల్మి
కలిగె నృపవంశమునకు శృంగారగరిమ
కలిగెఁ బ్రజలకుఁ గన్నులు గలఫలంబు
కలిగె మరురాజ్యలక్ష్మికి గౌరవంబు.

40


తే.

మొదలిపక్షంబు విదియయం దుదయమైన
చంద్రరేఖయుఁబోలె నాచంద్రవదన
దినదినంబునఁ గళలందుఁ దేజరిల్లు
సఖులనేత్రచకోరికాసమితి యలర.

41


సీ.

మొదలిసిగ్గులనిగ్గుఁ బొదరించు కనుమించు
        తొంగలిఱెప్పలఁ దొంగలింప

నెలవు లేర్పడుచున్న మొలకచన్నులచెన్ను
        బంగారుసకినలభంగి మెఱయ
శృంగారరసనదీభంగంబులో యన
        నారుతోడనె వళు లంకురింపఁ
గఱుదు లేమియు నెఱుంగని ముద్దుఁబల్కుల
        నలఁతి తియ్యందనంబు గులకరింపఁ


తే.

గుంతలంబులు హరినీలకాంతిఁ జెనక
గతులమురిపంబు గజరాజుగతుల నొరయ
బాల నవయౌవనంబునఁ జాల మెఱసెఁ
బ్రజలకెల్లను గన్నులపండు వగుచు.

42


ఉ.

నేరుపు రూపుగన్నకరణిం, జెలు వాకృతి నొందినట్లు, శృం
గారము మూర్తిగైకొనినకైవడి, నవ్యవిలాసరేఖ యా
కారము దాల్చి పొల్చుగతిఁ, గాంతి శరీరము గాంచె నాఁగ, నం
భోరుహనేత్ర యొప్పెఁ బరిపూర్ణవయోరమణీయలీలలన్.

43


సీ.

కాంచనమణిగణచంచలరోచులఁ
        గాంతనెమ్మోముగా గండరించి
కుముదమీనచకోరకుసుమాస్త్రదీప్తులఁ
        గామినీమణి కన్నుగవ యొనర్చి
కనకకుంభరథాంగకరికుంభమంజరీ'
        రుచి నింతిచనుదోయి రూపుచేసి
బంధూకవిద్రుమపల్లవాంబుజకాంతి
        నతివపాదములుగా నచ్చుపఱిచి


తే.

కలితశృంగారవిరచనాకౌశలమున
నఖలమోహనమూర్తిగా నలరుఁబోఁడి
బంచబాణుండు తాన నిర్మించెఁగాక
వేదజడుఁ డైన యజునకు వెరవు గలదె?

44


సీ.

చందురు మెచ్చని చామ నెమ్మోముతో
        జలజదర్పణములు సాటి యగునె

మెఱుఁగులఁ గైకోని మెలఁతచూపులతోడ
        రతిరాజశరచకోరములు సమమె
పసిడికుండలమీఱు పడఁతిచన్నులతోడఁ
        గరికుంభచక్రవాకములు సరియె
హరినీలముల గెల్చునంగనకురులతో
        గాలాహిచంచరీకములు ప్రతియె


తే.

పొలఁతిక్రొమ్మేని సాటియే పువ్వుఁదీఁగె
బాలయడుగుల నెనయునే పల్లవమ్ము
లతివపలుకుల దొరయునే యమృతరసము
వెలఁది కెమ్మోవిఁ బోలునే విద్రుమంబు?

45


ఉ.

ఆరసి లక్ష్యలక్షణరహస్యనిరూఢముగా సమస్తవి
ద్యారతి నుల్లసిల్లె, వివిధంబులు చెల్వము లభ్యసించె, నా
నారథవాజివారణరణస్ఫురణంబులకీ లెఱింగె, నా
నీరజనేత్ర యిద్ధరణి నేరనివిద్యలు లేవు భూవరా!

46


ఉ.

ఆరమణీశిరోమణి వయస్యలు దానును నొక్కనాఁడు శృం
గారవనాంతవీథి రతికాంతుని నోమఁగ నేఁగి, యయ్యెడం
గోరిక మీఱఁ గీరములకు శ్రుతిశాస్త్రపురాణసత్కథా
సారము లొప్పఁజెప్పు నొకశారికఁ గాంచెఁ గళాభిసారికన్.

47


క.

కాంచి తమకించి కదిసినం
జంచలగతిఁ జిలుక లెల్లఁ జదలికి నెగయన్
మించినశారిక కోరిక
వంచనమైఁ జిక్కినట్లు వనితకుఁ జిక్కెన్.

48


ఉ.

ఆగొరవంకవంకఁ గమలానన నెయ్యపుఁజూడ్కిఁ జూచి, యే
లాగున నీకు నీబహుకళాకుశలత్వము సంభవించె? ని
చ్చాగతితోడ నీమెలఁగుచక్కటి యెక్కడఁ? జెప్పు మన్న శో
భాగరిమాభిరామ యగుపక్షివధూకులరత్న మిట్లనున్.

49

మ.

వెలయఁ గాదిలిపుత్త్రిచందమున వేవేభంగులం బ్రోచుచుం
బలుకుందొయ్యలిచేతిరాచిలుక పెంపన్ బెర్గి, నానాకళా
కలనాలీలఁ ద్రికాలవేదిని యనంగాఁ, జంద్రకాంతోపలో
జ్జ్వలకాంతారలతాంతవాటికలలో వర్తింతుఁ గాంతామణీ!

50


క.

అనవుడుఁ ద్రికాలవేదిని
యనునామము నీకుఁ గల్గినట్టిదయేనిన్
నను నుద్వాహము గాఁగల
మనుజేంద్రకుమారుఁ జెప్పుమా మెచ్చొదవన్.

51


వ.

అనుటయు.

52


క.

ఆవంచకపుర మేలెడు
భూవల్లభనందనుండు బుధగురుజనసం
భావితగుణమణిభూషా
శ్రీవిలసత్కీర్తి రాజశేఖరుఁ డబలా!

53


సీ.

కలిఖలప్రేరణాకులవివర్ణుఁడు గాక
        వర్తించు నలచక్రవర్తి యనఁగ
గౌతమమునిశాపభీతచిత్తుఁడు గాక
        తనరారు పాకశాసనుఁ డనంగ
జటినిటలానలోత్కటపీడితుఁడు గాక
        సొంపారు ననవింటిజో దనంగ
రాహుగ్రహోరునిగ్రహుఁడు గాక సుకాంతిఁ
        జాలనొప్పెడు పూర్ణచంద్రుఁ డనఁగ


తే.

శ్రీలఁ గడుఁ బేర్చి విభవంబుచేఁ దనర్చి
రూపమున నిక్కి సత్కళారూఢి కెక్కి
గౌరవంబున రాజశేఖరుఁడు వోలెఁ
జెలువమున నొప్పు నారాజశేఖరుండు.

54

వ.

మదనమత్తకాశినీచిత్తాకర్షణాకారశృంగారలీలావిహారుం డైన యారాజకుమారత్నంబునకు.

55


మ.

చనవొప్ప న్నినుఁ బొందఁ గాంచునదిపో సంసారసాఫల్య మం
గన, నీమాట లనంగశాస్త్రముల రంగన్మూలముల్, మత్తకా
శిని నీచూపులు చిత్తజాయుధమహాసింహాసనస్థానముల్,
వనితా! నీదుకుచంబు లంగభవదీవ్యత్కుంభినీకుంభముల్.

56


శా.

కాంతా! కంతుని మీఱు నవ్వసుమతీకాంతుండు కాంతుండుగాఁ
గాంతేనిం, గమనీయహేమమణిసాంగత్యంబు సంధిల్లు నీ
సంతోషంబు ఘటించు నంతకు భవత్సౌందర్య మూహింపఁగాఁ
గాంతారాంతరవల్లికాకుసుమసంకాశంబు గాకుండునే?

57


సీ.

తరుణి! యాతని యురస్సరసిలో నీకుచ
        చక్రవాకులు కేళి సలుపుఁగాక
యింతి! యాతని వద నేందుచంద్రికల నీ
        దృక్చకోరికలు నర్తించుఁగాక
కాంత! యాతని తనూకల్పభూరుహముపై
        నీబాహులతికలు నిగుడుఁగాక
పొలఁతి! యాతని కర్ణపుటకరండముల నీ
        వాచామృతంబు దైవాఱుఁగాక


తే.

నీకుఁ దగు నాతఁ డతనికి నీవు తగుదు
నీకు సరియైనసతియు నానృపకుమార
వరున కెనయైనపతియు నీవసుధఁ గలరె
నాదుమాటలు మదిలోన నమ్ము మనియె.

58


క.

ఇత్తెఱఁగున శారిక నీ
వృత్తాంతము విన్నవింప విని యనురాగా
యత్తం బగుచిత్తముతో
మత్తచకోరాక్షి మరునిమాయలకతనన్.

59

సీ.

అలరుఁ దేనియఁ గ్రోలి యానందమున మ్రోయు
        నలివిరావములకు నలికియలికి
చిగురాకుఁబొగ రాని చెలఁగి యెలుంగించు
        పికనికాయములకు బెదరి బెదరి
ఫలరసంబులఁ జొక్కి వలువలై పల్కెడు
        చిలుకలపలుకుల కులికియులికి
బిసములరస మాని పేర్చి వినోదించు
        కలహంసములఁ జూచి కలఁగికలఁగి


తే.

మేనుఁదీవెయు నలఁతయు మేళవింప
వెలఁదికరమును జెక్కును వియ్యమందఁ
జెదరుకురులును నుదురును జెలిమిసేయ
నున్న తన్వంగిఁ గనుఁగొని యువిదలెల్ల.

60


క.

గొరవంకయాసమాటల
మరువంకఁ దలంకు గలిగె మగువకుఁ దమలో
వెర వింక నేమి గలదని
యిరువంకలఁ బొగిలి రప్పు డెంతయు వంతన్.

61


సీ.

కనుదోయిమెఱుఁగులు కంతుతూపులకడ
        గిరవుగాఁ బెట్టితే హరిణనయన
మెయిదీఁగె నునుఁగాంతి మెఱుఁగుమొత్తములకు
        నెరవుగా నిచ్చితే యిందువదన
చనుఁగవ గ్రొమ్మించుఁ గనకకుంభములొద్ద
        నిల్లడవెట్టితే యిగురుఁబోఁడి
పలుకులచెలువంబుఁ గలికికీరములకు
        [2]వారకం బిచ్చితే వనజగంధి


తే.

శుకముఁ జదివింప నందంబు చూడ, గంద
మలఁదఁ బయ్యెద సవరింప వలను లేక

వగలఁ బొగులంగఁ జూడంగ వలసె మాకుఁ
బులుఁగు ని న్నింతచేసెనే పువ్వుబోఁడి.

62


వ.

అని చింతించి శిశిరోపచారంబులు సేయం దలంచి.

63


సీ.

చేమంతిఱేకులఁ జేసిన పఱపుపైఁ
        దెఱఁగొప్ప నల్లనఁ దెఱవ నుంచి
యందంద డెందంబునందు గంద మలంది
        సిరమైన పచ్చకప్పురము సల్లి
పదపల్లవంబులు పల్లవంబుల నొత్తి
        పుప్పొడి కరముల నప్పళించి
యఱుతఁ గ్రిక్కిఱియ ముత్యములపేరులు వేసి
        పన్నీటఁ గన్నీరు పాయఁ దుడిచి


తే.

చెలికి శిశిరోపచారముల్ సేయఁ జేయఁ
నంతకంతకు మదనాగ్ని యధిక మైన
జెలులు మదిలోన నెంతయుఁ జిన్నవోయి
రాజునకు విన్నవించిరి రమణితెఱఁగు.

64


తే.

విన్నవించిన నారాజు విన్ననగుచు
నిన్నుఁ దోడ్కొనిరమ్మని నన్నుఁ బనిచెఁ
జెప్పనేటికి దేవరచిత్త మింక
మదవతీమణిభాగ్యంబు మనుజనాథ.

65


వ.

అనిన నారాజశేఖరుండు.

66


క.

ఆరాజాననమాటయు
నారాజశుకంబుపలుకు, ననురాగరసాం
భోరాశిసుధాకరరుచి
సారం బై యప్పు డేకసంశ్రిత మయినన్.

67


క.

పలుకులు వేయి యిఁకేటికిఁ
బలుకును బంతంబు నొక్కభంగిగఁ బొసఁగం

బలుకఁగ నేర్తుగదా ! యని
చిలుకను దిలకించి ప్రియము చిలుకం బలికెన్.

68


క.

నీపలుకు వేదసారము
నీపలుకు గిరీశువరము, నీపలుకు శిలా
స్థాపితలిపి, నీపలుకున
కేపలుకు సమంబు శుకకులేశ్వర చెపుమా!

69


వ.

అనుచుఁ గీరంబును గారవించి, చతురికను దదనుచారికలను సముచితోపచారంబుల సత్కరించి, పరిణతపరిణయోత్సాహుండును సర్వసన్నాహుండును ననుగతానేకరాజశేఖరుండును నై యారాజశేఖరుం డాప్రొద్దె కదలి, కదళికాకదంబనింబజంబీరజంబు తమాలహింతాలలవంగ లుంగనారంగమాతులుంగసురంగాది మహామహీరుహనితాంతకాంతం బైన యవంతిపురోపకంఠోపవనాంతరంబు ప్రవేశించిన యనంతరంబ, యాసర్వంసహాధీశు వీడ్కొని.

70


క.

చతురిక వెస ముందరఁ జని
రతిపతిసముఁ డైన యతనిరాక ప్రియముతో
నతనునివేదనం బొరలెడి
సతితో మున్నాడిచెప్ప సమ్మద మొదవన్.

71


ఉ.

వ్రాసిన చిత్రరూపముకుఁ బ్రాణమువచ్చినభంగి లేచి, పే
రాస దలిర్పఁగాఁ జతురికాంగనఁ గౌఁగిటఁ జేర్చి, దానిలీ
లాసరసానులాపగతులం జెలికత్తెల గారవించి, కై
సేసికొనం గడంగె మునుచెప్పినశారికమాటఁ జెప్పుచున్.

72


వ.

అంతఁ జతురికావిజ్ఞాపితరాజశేఖరాగమనవృత్తాంతుండును సంతోషితస్వాంతుండునైన సత్యధర్మమహీకాంతుండు సరగ నగరంబు నలంకరింపంవబనిచి.

73


సీ.

లక్ష్మీసుతుని రాజ్యలక్ష్మికెల్లను మూల
        బల మైన శృంగారవతులతోడ

ఘనబలాకుంఠితకంఠీరవప్రౌఢిఁ
        గొమరారు భృత్యువర్గములతోడఁ
నాశాకరీశుల నపహసింవఁగ నోపు
        గంధసింధురసముత్కరముతోడఁ
బవమానుజవనత్వ మవమానపఱుపంగఁ
        జాలెడు నుత్తమాశ్వములతోడఁ


తే.

గమలసంభవసము లైనకవులతోడ
గరిమ సన్మతిగల మంత్రివరులతోడ
మహిమమై వచ్చి సత్యధర్మక్షితీంద్రుఁ
డింపు రెట్టింప నల్లుని నెదురుకొనియె.

74


వ.

ఎదురుకొని తత్సమయసముచితోపచారంబులు నడపి తోడ్కొనిచని, నిజప్రధానాగారంబు విడియించి, పౌరులం బురోహితులను రావించి తదుపదిష్టదివసంబున.

75


సీ.

హితులైన నిజపురోహితులు చెప్పినయట్ల
        శోభనద్రవ్యవిస్ఫురణ గూర్చి
కడువైభవముతోడఁ గళ్యాణవేదిక
        నింపుమీఱ నలంకరింపఁ బనిచి
కర్పూరమంజరిఁ గైసేసి తెమ్మని
        సరసవిలాసిని జనులఁ బనిచి
రాజశేఖరమహారాజు శృంగారించి
        తోడ్తేరఁ దగియెడుదొరలఁ బనిచి


తే.

పరిణయాగారమునకు దంపతులఁ దెచ్చి
లక్షణోచితవైదికలౌకికాది
కృత్యములు సాంగములు గాఁగ సత్యధర్మ
మనుజనాథుండు విబుధానుమతి నొనర్చె.

76


వ.

అయ్యవసరంబున మౌహూర్తికదత్తశుభముహూర్తంబున.

77

చ.

రతిరతిరాజమూర్తు లగురామయు రాకొమరుండు నొండొరుల్
సితలలితాక్షతావళుల సేవలు వెట్టిరి, మందమారుతో
చితచలనప్రసంగములచే నితరేతరకోరకావలుల్
చతురతఁ జల్లి యాడు నవజాతిలతాసహకారలీలలన్.

78


క.

చనుదెంచి హోమకార్యము
లనువున నొనరించి, పెద్దలగు వారలకుం
గనకమణిభూషణాదులు
తనియంగా నిచ్చె సత్యధర్ముఁడు దానున్.

79


ఆ.

భక్ష్యభోజ్యలేహ్యపానీయచోష్యంబు
లింపువెంప నారగింపఁజేసి
వారయాత్రికులకు వనుమతీనాథుండు
గారవంబుతోడఁ గట్టనిచ్చె.

80


క.

సొంపున నిమ్మెయిఁ బెండిలి
సంపతిలన్ సత్యధర్మజనపతిచంద్రుం
డంపగ, నావంచకపురి
కింపలరఁ గుమారుఁ డరిగె నింతియుఁ దానున్.

81


చ.

అరిగి, పురంబులోని కమలాక్షులు మేడలమీఁదనుండి య
చ్చెరువుగఁ క్రొత్తముత్యములు సేసలు చల్లుచు నుండ రాజమం
దిరమున కేఁగుదెంచి, జననీజనకుల్ తను గారవింపఁ ద
చ్చరణసరోరుహంబులకుఁ జాఁగిలి మ్రొక్కెఁ బ్రియాసమేతుఁడై.

82


తే.

అంత నొకనాఁడు కాంతయు నవ్విభుండు
శారికాకీరరత్నపంజరము లొక్క
చూతపోతంబుకొమ్మను బ్రీతి నునిచి
మహితశృంగారవనలతామండపమున.

83


వ.

వినూత్నరత్నవేదికల మకరకేతనక్రీడాచాతుర్యంబులఁ బ్రొద్దుపుచ్చుచున్నసమయంబున గీరంబు శారిక కిట్లనియె.

84

క.

ఈరాజు రాజముఖియును
గారవమునఁ గలసిమెలసి కందర్పసుఖ
శ్రీరతులై విహరించెద
రీరీతిని మనము నునికి యెంతయు నొప్పున్.

85


క.

అనవుడు శారిక కీరముఁ
గనుగొని. మగవారు ‘పాపకర్ములు నమ్మం
జన’ దనినఁ ‘బాపజాతులు
వనితలుకా’ కనుచుఁ జిలుక వాదముచేసెన్.

86


వ.

తదాకర్ణనకుతూహలాయత్తచిత్తులై మత్తకాశినీమహీవరోత్తములు శారికాకీరంబులందేర నొక్కపరిచారక నియమించి.

87


క.

తెప్పించి వానిఁ గనుఁగొని
యిప్పుడు మీలోన వాద మేటికి మాకుం
జెప్పుం డనినను శారిక
చెప్పదొడఁగె నిందువదనచిత్తం బలరన్.

88


వ.

నన్ను నీరాజకీరంబు తనుఁ బరిగ్రహింపు మనిన.

89


క.

పురుషులు పొలఁతుల యెడలను
బరుషాత్మకు లనుచుఁ జాటిపలికినఁ గినుకం
బురుషులయెడలను బొలఁతులె
పరుషాత్మిక లనుచుఁ జిలుక పలికె నరేంద్రా!

90


వ.

అది యట్లుండె మదీయవచనంబున కనుగుణంబుగా నొక్కకథ చెప్పెద నవధరింపుమని యిట్లనియె.

91


శారిక రాజశేఖరునకుఁ జెప్పిన ధనగుప్తుని కథ

సీ.

అభినవశ్రీలతో నలకాపురంబుతో
        సదృశమై యొప్పుఁ గాంచనపురంబు
అన్నగరంబులోఁ గిన్నరేశ్వరుకంటె
        ధర్మగుప్తుఁడు సముద్దామవిభవుఁ

డావైశ్యవరపుత్త్రుఁ డగు ధనగుప్తుండు
        యీవనోదయదుర్మదాంధుఁ డగుచుఁ
దనతండ్రిపిమ్మట ధనమెల్లఁ బోనాడి
        కడు నకించనవృత్తిఁ గంచి కరిగి


తే.

యందు నిజమాతులోత్తము ననుపమాన
విభవు శ్రీగుప్తుఁ డగు వైశ్యవిభునిఁ జేరి
తండ్రి మృతుఁడౌట చెప్పక తత్తనూజఁ
బరిణయం బయ్యె వైభవస్ఫురణ మెఱయ.

92


వ.

రాగతరంగిణిఁ యను నక్కాంతం బరిగ్రహించి యనంతరంబ.

93


క.

రాగతరంగిణిఁ దన్నును
శ్రీగుప్తుం డొక్కభంగిఁ జేపట్టి బహు
శ్రీగరిమ గారవింపఁగ
రాగిల్లి తదీయమందిరంబున నుండెన్.

94


వ.

అంత.

95


క.

తన ప్రాణము ప్రాణములై
యనవరతముఁ దన్నుఁ గూడి యాడెడుధూర్తుల్
మనసునఁ బాఱిన నూరికి
జనియెద నని మామతోఁ బ్రసంగముచేసెన్.

96


ఉ.

చేసిన, మామ యల్లుని కశేషవిశేషవినూత్నరత్నభూ
షాసముదంచితాంబరలసద్ఘనసారపటీరవస్తువుల్
భాసురలీల నిచ్చి యనుపన్ సతిఁ దొడ్కొని యేఁగి, దుర్మద
శ్రీ సిగురొత్తఁ గాంచనపురీవరకాననమధ్యమస్థలిన్.

97


క.

తనుఁగూడి వచ్చువారలఁ
గనుమొఱఁగి, మహోగ్రవృత్తి ఘనకూపములో
వనితఁ బడఁద్రోచి, తెచ్చిన
ధనమంతయుఁ గొంచు నేఁగెఁ దనపురమునకున్.

98

వ.

ఇట్లు ధనగుప్తుండు త్రోచిపోయిన.

99


క.

ఆకాంత కూపకుహర
వ్యాకీర్ణలతావిశాన మాధారముగా
సాకారంబై నిల్చిన
శోకరసము భంగి నేడ్చుచును వగఁ బొగులన్.

100


ఆ.

అయ్యెలుంగు పథికు లాలించి యేతెంచి
వెడలఁ దిగువ నూతివెలిఁ దనర్చె
రాహువదనగహ్వరంబున వెడలిన
చంద్రరేఖలీలఁ జంద్రవదన.

101


సీ.

తావిఁ గైవ్రాలిన తమ్మిఱేకులభంగి
        వాలారుఁజూపులు మ్రాలు దేర
వేఁబోక కలువలవిందు చందంబునఁ
        జెలువంవునెమ్మోము చెన్నుదఱుఁగ
జళుకు సొచ్చినయట్టి జక్కవకవభంగి
        గరువంపు బిగిచన్నుఁగవ వణంక
నెండచే వాడిన యెలదీఁగెయునుబోలె
        నిద్దంపుఁదనువల్లి నిగ్గుసడల


తే.

ముదురుటూర్పులు గెమ్మోవిపదను దివియఁ
జెమటచిత్తడి చెక్కులఁ జిప్పిలంగ
నున్నతన్వంగి భయమేద నుపచరించి
యింపు రెట్టింప తెరువరు లిట్టు లనిరి.

102


క.

ఎవ్వరిబాలిక, వెవ్వతె
వెవ్వరు నినుఁ దెచ్చి రిచటి, కీకూపములో
నెవ్వరు నినుఁ బడఁద్రోచిరి
యెవ్వఁడు నీధవుఁడు నామ మెయ్యది నీకున్?

103


వ.

అనవుడు.

104

సీ.

కాంచిలోఁ జిరకీర్తిఁ గాంచి మించినయట్టి
        శ్రీగుప్తుఁ డనియెడు సెట్టిపట్టిఁ
గాంచనపురియందు గణనకెక్కినయట్టి
        ధనగుప్తునకుఁ బ్రాణదయిత నేను
రమణమై రాగతరంగిణి యనుదాన
        నత్తవారింటికి నరుగుచోట
నిచ్చోట మ్రుచ్చుల నిడదవ్వులనె గాంచి
        పతియు సహాయులుఁ బాఱిపోవ


తే.

నశ్రుపూరంబు చూపుల కడ్డపడిన
బ్రమసి మతి తప్పి పడితి నీప్రాఁతనూత
నింతలో వచ్చి మీరెల్ల నెదురుకొంటి
రెత్తుకొంటిరి నాప్రాణ మేమిచెప్ప.

105


ఉ.

ఇంచినవేడ్కతోడ నను నేనుఁగుకొమ్మున దాదిఱొమ్మునం
బెంచినతల్లిదండ్రులకుఁ బ్రేముడి నాయెడఁ బాయకుండు నే
గాంచికి నేగి వారిఁ బొడగాంచిన నంగద వాయుఁ గాన, న
న్నించుక యాదరించి కర మేదెడునట్టుగఁ జేయరే దయన్.

106


వ.

అనిన ననుకంపాతరంగితాంతరంగు లైన యప్పథికు లిట్లనిరి.

107


చ.

బలవదసహ్యసింహశరభప్రముఖోగ్రవనాంతభూమి ని
మ్ముల నిను డించిపోయెదమె ముంగి లెఱుంగని ముద్దరాల, వా
వలఁ బని యేమి గల్గిన నవళ్యము నిన్నును దల్లిదండ్రులం
గలపకపోము, కంచి యది కంచియె మాకు బయోరుహాననా!

108


క.

అనునయవాక్యంబులచే
ననునయముం బ్రియము నొదవ నప్పథికవరుల్
తనవారికంటె మిక్కిలి
దనవారితనంబు దనరఁ దనుఁ బలుకుటయున్.

109

క.

కాంతారత్న మొకించుక
సంతావము సడల వెనుకఁ జనుదేరంగాఁ
గాంతారము వెలువడి చని
యంతట నక్కాంచిఁ గాంచి యందఱుఁ దమలోన్.

110


వ.

ఇట్లని స్తుతియించిరి.

111


క.

నీలీనింబకదంబక
సాలాగురుసరళవకుళచందనబదరీ
తాలతమాలరసాల
శ్రీలం గడు నొప్పుఁ గంచిచెంగటితోఁటల్.

112


క.

దీపితవినూత్నరత్న
ప్రాపితఘనకనకకలశబంధురశోభా
గోపితగగనప్రాంగణ
గోపురమై కరిగిరీంద్రుగోపుర మొప్పున్.

113


సీ.

ఏవీథిఁ జూచిన నెపుడు విద్వజ్జన
        వేదశాస్త్రాలాపవిలసనలు
లేయింటఁ జూచిన నిష్టాన్నభోక్తలై
        యతిథులు గావించు నతులవినుతు
లేమేడఁ జూచిన నిందీవరాక్షుల
        సంగీతవిద్యాప్రసంగమహిమ
లేతోఁటఁ జూచినఁ జూతపోతంబులఁ
        గలికిరాచిలుకల కలకలములు


తే.

కొలఁకు లెయ్యవి చూచినఁ గుముదకమల
కలితమకరందనిష్యందగౌరవంబు
లెల్లభాగ్యంబులకుఁ దాన యెల్లయైన
కంచిఁ జూడనికన్నులు కన్ను లగునె?

114

ఉ.

నూతనమీనకేతనవినోదవరిశ్రమఖిన్ను లైనయ
బ్జాతముఖీనృపోత్తముల సారెకు సారెకు సేద దేర్చు, వే
గాతటినీతటీకలితకాంతరసాలనికుంజమంజరీ
జాతమరందకందళితసారసమీరము కాంచికాపురిన్.

115


సీ.

చెక్కులక్రేవల సిరపుమించులతోడఁ
        దరపాలతళుకులు తడఁబడంగఁ
గలికిక్రేఁగన్నులఁ గ్రమ్ముక్రొమ్మెఱుఁగులు
        ముత్తువాళియలపై మోహరింప
గరగర నై యొప్పుకచభరంబులతావి
        పునుఁగుసౌరభములఁ బ్రోదిసేయ
మించిన వన్నెచీరంచులనెఱికలు
        మేఖలావళులతో మేలమాడఁ


తే.

బసుపునునుఁజాయ మైకాంతిఁ బసలు సేయ
నేవళంబులు చనుదోయి నిగ్గు జెనక
ద్రవిళబాలవిలాసినీతతులు మెఱయ
సిరికిఁ బట్టైన కాంచికాపురమునందు.

116


క.

నరుఁ డొకపుణ్యము చేసినఁ
బరువడి నది కోటిగుణితఫలదం బగుటన్
ధరఁ బుణ్యకోటి యనఁగాఁ
బరఁగుం గాంచీపురంబుప్రతి యే పురముల్?

117


సీ.

ఘనతరసౌధాగ్రకనకకుంభములవి
        కమలమిత్త్రుని దృశ్యుకరణిఁ జూపఁ
బ్రాసాదకీలితబహురత్నదీధితు
        లింద్రచాపంబుల నీనుచుండఁ
బ్రతిమందిరధ్వజపటశీతపవనంబు
        సిద్ధదంపతుల మైసేదఁ దేర్ప

గంధసింధురతురంగములసాహిణములు
        శ్రీకాంత కేకాంతసీమ గాఁగ


తే.

నావణంబులఁ బచరించునట్టిసరకు
లర్థపతివైభవంబుల నపహసింప
రమ్య మై యున్న కాంచీపురంబుతోడ
నితరపురముల నుపమింప నెట్లువచ్చు!

118


వ.

అని ప్రశంసించుచుఁ దత్పురంబు బ్రవేశించి, ప్రతిదినప్రవర్ధమానమహావైభవసుందరం బైనశ్రీగుప్తుమందిరంబుం బ్రవేశించి యతనిని గాంచి.

119


క.

కాంతారాంతరకూపా
భ్యంతరమునఁ గాంతఁ గనుట యాదిగఁ, దా రా
యింతిని గొనివచ్చినవిధ
మంతయు నెఱుగంగఁ జెప్పి యరిగినపిదపన్.

120


వ.

అతండు.

121


క.

ఎల్లింటినేఁటిలోనన
తల్లీ వెదకించి తెత్తు ధనగుప్తుని నీ
వుల్లమున వగపవల దని
చల్లనిమాటలఁ దనూజ సంభావించెన్.

122


వ.

అట ధనగుప్తుండు ధనంబు గొని నిజమందిరమున కరిగి.

123


సీ.

బందికాండ్రకు నిచ్చి పరిహాసకుల కిచ్చి
        కూడియాడెడు ధూర్తకోటి కిచ్చి
కుంటెనీలకు నిచ్చి కోడిగీలకు నిచ్చి
        మిన్నక వారకామినుల కిచ్చి
జూదరులకు నిచ్చి జుమ్మికాండ్రకు నిచ్చి
        జారవిలాసినీసమితి కిచ్చి
యిచ్చగొండుల కిచ్చి యుచ్చమల్లుల కిచ్చి
        వారక యుబ్బించువారి కిచ్చి

తే.

మాయజోగుల కిచ్చి దిమ్మరుల కిచ్చి
మద సానుల కిచ్చి పామరుల కిచ్చి
యెల్లధనమును ధనగుప్తుఁ డెఱుకమాలి
పచ్చపయికంబు లేకుండ వెచ్చపఱచి.

124


క.

రాగతరంగిణి గర్భ
శ్రీగరిమ వహించె ననుచు సీమంతశుభో
ద్యోగము నెపమున, ధనములు
శ్రీగుప్తుని మోసపుచ్చి చేకొనుబుద్ధిన్.

125


క.

కంచికిఁ జని, బహువిభవస
మంచితమగు మేనమామమందిరము ప్రవే
శించి, తనవనితఁ గనుఁగొని
సంచలత వహించి గుండె జల్లన నున్నన్.

126


క.

శంకింపవలదు, పోలఁగ
బొంకితి మును కాననాంతమున మ్రుచ్చులకుం
గొంకి యసహాయతను నే
వంకకు నరిగితివో యనుచు వైశ్యవరేణ్యా.

127


క.

అని రాగతరంగిణి తను
వినయోక్తుల వెఱపు మాన్పి, వేగంబుగ మ
జ్జనభోజనాదిసత్కృతు
లొనరింపఁగ, మామచేత నుపలాలితుఁడై.

128


ఉ.

ఆగుణహీనుఁ డొక్కతటి నర్ధనిశాసమయంబునందు సం
భోగపరిశ్రమస్ఫురణఁ బొంది కవుంగిట నున్నయట్టి యా
రాగతరంగిణీరమణిరత్నసువర్ణవిభూషణాదు లి
చ్ఛాగతిఁ గొంచుఁ బోఁదలఁచి, చంపఁ గఠారము పూన్చెఁ బూన్చినన్.

129


మ.

వనితారత్నము వానికార్యమునకున్ వాపోవ, నచ్చోటికిం
జని శ్రీగుప్తుఁడు తాను బాంధవులు నాశ్చర్యంబు రెట్టింపఁగా

ధనగుప్తుం డొనరింపఁబూనిన మహాధైర్యంబు సర్వంబు గాం
చి నిజేచ్ఛం జనుమంచుఁ గంచి వెడలించెం గిన్కతో నల్లునిన్.

130


క.

అటుగాన నెన్నిభంగులఁ
గుటిలత్వమ కూడు గాఁగఁ గుడుతురు మగవా,
రిటువంటివారి మదిలో
నెటుగా నమ్ముదురు సతులు హితు లని పతులన్?

131


క.

అని శారిక కథ సెప్పిన
విని, మీఁదటికథ వినంగ వేడుకపడునా
జననాథుఁ జూచి, కీరం
బనఘా! కథ యవధరింపు మని యిట్లనియెన్.

132


స్త్రీలు పాపములకు మూల మనుటకుఁ గీరము చెప్పిన కథ

సీ.

శ్రీకలితానూనచిత్రరేఖాయుక్తి
        కొమ్మలందును గోటకొమ్మలందు
నవరసపదయుక్తి నానార్థగరిమలు
        రాజులందును గవిరాజులందుఁ
గవిలోకసంతోషకరజీవనస్థితి
        సరసులందును గేళిసరసులందు
నవనవశ్రీసుమనఃప్రవాళవిభూతి
        మావులందును నెలమావులందుఁ


తే.

గలిగి సముదగ్రసౌధాగ్రతలసమగ్ర
శాతకుంభమహాకుంభజాతగుంఖి
తోరురత్నవినూత్నశృంగార మగుచు
సిరుల నొప్పారు విక్రమసింహపురము.

133


క.

భూపాలలోకమకుట
స్థాపితరత్నప్రభాతిశయచరణుఁడు, వి
ద్యాపరిణతమానసుఁడు, ద
యాపరుఁడు ప్రతాపమకుటుఁ డప్పుర మేలున్.

134

క.

ఆరాజేంద్రుని నందన
యారూఢస్మరవికారయౌవనలక్ష్మీ
గౌరవనిధి, సకలకళా
పారీణవిలాసవతి నృపాలతిలకా!

135


ఆ.

ఆప్రతాపమకుటుఁ డాత్మజఁ బాటలీ
పుత్త్ర మేలు రాజుపుత్త్రుఁ డైన
యాసుధర్మవిభుని ననుపమ మకరాంకుఁ
బిలువఁబనిచి వేడ్కఁ బెండ్లిచేసె.

136


ఉ.

చేసి, సుధర్మభూపతికిఁ జిత్రవిచిత్రవినూత్నరత్నభూ
షాసహితోరుసంపదలు సమ్మద మారఁగ నిచ్చి వైభవో
ల్లాస మెలర్బ నిల్పిన, విలాసవతీసతిఁ గూడి సమ్మద
శ్రీ సెలువొంద నుండె, మును జేసినభాగ్యఫలంబు పెంపునన్.

137


తే.

అంత నొకనాఁడు కాంత యత్యంతకాంత
చంద్రకాంతశిలాసౌధచంద్రశాలఁ
జాలవేడుకఁ దనప్రాణసఖులఁ గూడి
యంగజారాధనము సేయునవసరమున.

138


సీ.

చక్రవాకస్తని శైవాలధమ్మిల్ల
        సందీప్తడిండీరమందహాస
యావర్తనతనాభి యభినవ బిసహస్త
        రాజిత రాజమరాళయాన
సికతాతలనితంబ వికచబంధూకోష్ట
        వరతరంగావళీవళివిలాస
కంబుకంధర దళిణాంబుజాతానన
        నానావిధవిలోల మీననయన


తే.

యమృతసాగరవిభుని యర్ధాంగలక్ష్మి
యిందుధరునిల్లు పుట్టినయిల్లుగాఁగ

నెగడెడుపినాకినీతటినీవధూటి
పట్టణాంతరసీమఁ జూపట్టుటయును.

139


వ.

అక్కామినీరత్నంబు కేలుమొగిచి ఫాలభాగంబునం గదియించి.

140


మ.

జయకారం బొనరించె నంబరమణిసాధర్మ్యసంపన్నకున్
నయనానందనవారవిందమకరందశ్రేణికాస్విన్నకున్
నియతస్నాననిరంతరాగతజనానీకక్రమాసన్నకున్
జయజాగ్రజ్జలపక్షిపక్షపటలీసంఛన్నకుం బెన్నకున్.

141


వ.

అనంతరంబ తత్తటినీతటంబున.

142


సీ.

వెన్నెల జరియిడ్డ వెండితీఁగెలఁ బోలు
        యజ్ఞోపవీతంబు లఱుత నమరఁ
గన్నె చెంగల్వపూవన్నె మించిన నీరు
        కావిదోవతికట్టు కటిఁ దలిర్ప
వెలిదమ్మివిరిమీఁది యెలదేఁటిగతి గంగ
        మట్టిపై వేలిమిబొట్టు దనర
నీలకందుకముపైఁ గీలించు ముత్యాల
        విధమున సిగఁ గమ్మవిరులు మెఱయ


తే.

లలితనవయౌవనారంభకలితమైన
మేనిమెఱుఁగులు మెఱుఁగులమెఱుఁగుఁ దెగడఁ
జంద్రధరుకృప బ్రహ్మవర్చసము గన్న
మారుఁడన నొప్పు విప్రకుమారుఁ గాంచె.

143


ఉ.

అత్తఱి భూసురోత్తమునకై తనచిత్తసరోరుహంబు మీఁ
దెత్తినమాత్రలోనఁ దెరలెత్త, వియోగమహాంబురాశి పే
టెత్తం, దలంపుకీలు తలలెత్త వెసం దలపోఁత లించువి
ల్లెత్త, మనోజుఁ డింతి నడు గెత్తఁగనీని ప్రతిజ్ఞ దోఁపఁగన్.

144


క.

ఆరామ, కామువలనం
బోరాములు వడుచుఁ, దనదు పోరామి చెలిం

గారాముతోడ నాతని
నారామంబునకుఁ దేఁ బ్రియంబునఁ బనిచెన్.

145


ఉ.

పంచిన, భూసురోత్తముని పాలికి నేఁగి, ప్రియంబు చెప్పి రా
వించి, నవీనచంచదరవిందమరందవిలోలచంచరీ
కాంచితదీర్ఘికాతటవనాంతరసీమ వసింపఁజేసి, తా
నించిన వేడ్కతో మగుడ నేఁగి కుమారికతోడ నిట్లనున్.

146


ఉ.

భూసురవర్యుఁ దెచ్చితి, నపూర్వవనాంతలతాంతశయ్యకున్
భాసురరూపసంపదల బ్రాఁతిగ నాతని భావసంభవుం
ద్రాసునఁ దూన్పవచ్చు, ననురాగరసాంబుధి నోలలాడు, నీ
చేసినభాగ్య మెవ్వరును జేయరు తోయజపత్త్రలోచనా.

147


క.

అని యాసీమంతిని మం
తనమున నుపకాంతు నువవనంబున కైతె
చ్చినవార్త విన్నవించిన
విని కౌఁగిటఁ జేర్చి గారవించెం బ్రీతిన్.

148


క.

అంతటిలోపల నపరది
గంతమునకు భానుమంతుఁ డరుగుటయుఁ బటు
ధ్వాంత మనంతంబై హరి
దంతర వియదంతరముల నంతటఁ బర్వెన్.

149


శా.

ఆలో, నీలవినీలకుంతలవిలోలాలీంద్రసాంద్రప్రభా
భీలాకారమహాంధకారము విజృంభింపంగఁ బ్రాణేశు ని
ద్రాలోలాత్మునిఁగా నెఱింగి, విలసత్సౌధంబు పై డిగ్గి, నా
లీలారామములోనికిం జనియె నాళీవంచనప్రౌఢియై.

150


క.

అటమున్న పన్నగేంద్ర
స్ఫుటదంష్ట్రానిష్టుఁ డగుచు భూసురవరుఁ డ
చ్చట మృతుఁ డై పడియుండఁగఁ
గుటిలాలక యిట్టు లనియెఁ గుందుచు నల్లన్.

151

చ.

ఇలువడి వీటిఁబుచ్చి, హృదయయేశ్వరునిం గనుఁబ్రామి, బోటులం
దలఁపక, కన్నతండ్రికినిఁ దల్లికి నాడిక దెచ్చి, చీఁకటిన్
వలపులరాజుమాయఁ బడి వచ్చిన దానికి నింత పెద్దయే!
వలనుగ బ్రహ్మము న్నొసల వ్రాసినవ్రాతఫలంబు దప్పునే?

152


క.

పుటపుటనగు చనుఁగవపై
బొటపొటఁ గన్నీరు దొరఁగఁ బురపురఁ బొక్కం
దటతట గుండియ లదరఁగఁ
గటకట యిది నోముఫలముగా కేమనుచున్.

153


ఉ.

ఓరువరానివంతఁ దలయూఁచును, నుస్సని వెచ్చ నూర్చు, మీఁ
దారయ లేనికూర్మి యిటు లయ్యెఁగదే! యని పొక్కు; వెంట నె
వ్వారలు వత్తురో యనుచు వచ్చినమార్గము చూచి, వానియా
కారము మెచ్చి మైమఱచి కౌఁగిటఁ జేర్చు మనోజవేదనన్.

154


వ.

అప్పు డక్కళేబరంబు భూతావిష్టం బగుటయు.

155


క.

క్షోణీసురవరు బొందికిఁ
బ్రాణము వచ్చెనని యిచ్చ భావించుచు, న
య్యేణిలోచన సుమనో
బాణపరాధీనహృదయపంకజ యగుచున్.

156


క.

కరతాడన గళరవములం
బరిరంభణ చుంబనములఁ బైఁబడి పెనఁగన్
ధరణిసురశవభూతము
కరిగమనం బట్టి ముక్కు గఱచె మొదలికిన్.

157


ఆ.

ముక్కు శవమునోరఁ జిక్కినమాత్రాన
విడిచి భూత మపుడు వెడలిపోయెఁ
దెగువతోడ మొదలిమగఁ డున్నచోటికి
నాతి వచ్చెఁ జుప్పనాతివలెను.

158

వ.

చని తదీయగేహదేహళీప్రదేశంబున నిలిచి, పరిచారికల మేలుకొలిపి.

159


ఆ.

ముక్కులేని బోసిమొగమున వెడలెడి
నిడుదయూర్పుతోడ నెత్తు రొలుక
జెలువ మగనిదిక్కు చేసన్నఁ జూపి యీ
కొఱఁతనుఱుకు ముక్కుఁ గోసె ననియె.

160


క.

ఇల్లటపుటల్లుఁ డని తన
యుల్లమురా మెలఁగదనుచు, నూరక నాకీ
కల్ల యొనరించె నని, తా
నల్లనఁ బల్కుటయు వార లాక్రోశింపన్.

161


క.

విని, భూవరుఁ డచ్చోటికి
జని, యంతయుఁ జూచి రోషసంతప్తుండై
తనయల్లునిఁ గని నిర్దయ
జనులకు నొప్పించి, యపుడు చంపఁగఁ బనిచెన్.

162


ఉ.

వారలు నాసుధర్మవిభు వధ్యశిలాస్థితుఁ జేసి, ఘోరదు
ర్వారకుఠారధార ననివారణ వ్రేయఁగ నుత్సహించినం
జేరువ నున్న దివ్యముని చిత్తమునందుఁ గృపావి ధేయుఁ డై
నేరము లేక చంపఁ దగునే! యిది ధర్మము గాదు నావుడున్.

163


వ.

ఆరెకు లతిత్వరితగతిం జనుదెంచి.

164


క.

ఆమాట విన్నవించిన
భూమీశ్వరుఁ డచటి కరిగి, పుత్త్రికధౌర్త్యం
బామూలచూడముగఁ దన
కాముని స్పష్టముగఁ దెల్ప నంతయుఁ దెలిసెన్.

165


చ.

తెలిసి మహోగ్రుఁడై కినుక దేఱెడు చూపులఁ గూఁతుఁ జూచి, యీ
కులటకు శిక్ష యెయ్యదియొకో! యనుచుం దలపోసి, యాఁడువా

రల వధియింపఁ గాదని పురంబున నుండఁగక తోలి, యా
వల నొకచోట నలుని వివాహముచేసె రమాసమగ్రతన్.

166


క.

కావున వనితాజనములు
భూవల్లభ యెల్లపాపములకును మూలం
బేవిధమున మగవారలు
పావనవర్తనులె కాక పాపాత్మకులే?

167


వ.

అని కీరంబు సరసప్రకారంబున నుచితకథావిన్యాసం బువన్యసించి యనంతరంబ.

168


ఆ.

కడుఁ బ్రశంపచేసెఁ గర్పూరమంజరి
శారికాకథాప్రసంగమహిమ
రాజశేఖరుండు రాజకీరముకథా
ప్రౌఢి యొప్పు ననుచుఁ బ్రస్తుతించె.

169


చ.

అని, ఘనసారపేటిక నయంబు మెయిం గథ విన్నవించి, యో
జనవర! యిందు నెవ్వరిదెసన్ దురితం! బిది చిత్తగింపుమా
యనుటయు; సాహసాంకవసుధాధిఁపచంద్రముఁ డల్ల నవ్వుచున్
వనితల కేమిరాదు మగవారు దురాత్ములుకాక! నావుడున్.

170


వ.

విని.

171


సీ.

చిన్నారిపొన్నారిచెక్కుటద్దములపైఁ
        జిఱునవ్వు మొలకలు చెంగలింప
మదనునితూపుల మఱపించుచూపుల
        దెఱఁగుల మెఱుఁగులు తుఱగలింప
మొగమున కెగిరెడు బిగిచన్నుఁగవమీఁద
        మణిహారరోచులు మాఱుమలయఁ
గమ్మని నెత్తావిగ్రమ్ము క్రొమ్ముడినుండి
        యరవిరి విరవాదివిరులు దొరగ

తే.

సాంధ్యరాగంబు వెడలిన చంద్రరేఖ
యెసకమునఁ బొల్పు మునుముట్ట ముసుఁగుపుచ్చి
యాకళావతి మృదులపర్యంకతలము
నందుఁ గూర్చుండఁబడి, సాహసాంకుఁ జూచి.

172


క.

ఘనసారకరండమునకు
ఘనసారస్వరము నిచ్చి కథ చెప్పింపం
బనుపడిననేర్పు గలిగియు
జనవర! యిటు తప్పఁజెప్పఁ జనునే నీకున్.

173


చ.

పురుషుఁడు పాపకర్ముఁ డనఁబోలదు కాంతయె కాని, కాంతకుం
బురుషుఁడు కీడుచేసినను భూషణ, మేనుఁగుఁ బల్లువట్టిచూ
తురె? మగవాడు చేసె నని తొయ్యలియున్ దురితంబు చేసినం
బరమపతివ్రతాచరణభంగము గాదె, నరేంద్రశేఖరా!

174


క.

అని వనితామణి యుత్తర
మొనరంగా నిచ్చి, భూవరోత్తముచిత్తం
బనురాగంబున మల్లడి
గొనఁ, గ్రమ్మఱ ముసుఁగు వెట్టుకొని శయనించెన్.

175


ఉ.

లాలితలోచనోత్సవవిలాసవినూతనభద్ర, దానవి
ద్యాలలితప్రసంగనవదత్తక, మోహనశిల్పచాతురీ
ఖేలనకూచిమార, సుముఖీజనరంజన, కామకేళిపాం
చాల, సముల్లసత్కుసుమసాయకశాస్త్రకళావిశారదా!

176


క.

ధీరోదాత్తరఘూత్తమ
ధీరోద్ధతపరశురామ, ధీరలలితలీ
లారత్నావళినాయక
ధీరమహాశాంతమాలతీసుదతీశా!

177

స్రగ్విణి.

నిత్యభోగక్రియా నిర్జరాధీశ్వరా
సత్యభాషాహరిశ్చంద్రభూమీశ్వరా
శైత్యసత్కాంతినక్షత్రలోకేశ్వరా
భృత్యభావోదయప్రీతిలక్ష్మీశ్వరా!

178


గద్యము.

ఇది శ్రీమదఖిలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కయనామధేయప్రణితం బైనవిక్రమార్కచరిత్రం బనుమహాకావ్యంబునందు సప్తమాశ్వాసము.

  1. పవమానప్రతిమానతత్త్వజవ. అని వా. 1928.
  2. చేబదు లిచ్చుట