శ్రీరస్తు
విక్రమార్కచరిత్రము
షష్ఠాశ్వాసము
|
శ్రీమేళనగుణఖేలన
సామాదికచతురుపాయచాతుర్యనిధీ
స్వామిహితకార్యఘటనా
సౌముఖ్య జగత్ప్రసిద్ధ జన్నయసిద్ధా.
| 1
|
సీ. |
విభవంబు పొలువున విలువిద్యబలుపున
బురుహూతుఁ దత్సుతుఁ బోలు ననఁగ
సత్ప్రభపెంపునఁ జాగంబుసొంపున
మిత్త్రుఁ దత్పుత్త్రుని మీఱఁ ననఁగ
రాజరాజవిభూతి రతివిహారఖ్యాతి
ధనదుఁ దత్సూనుని నెనయు ననఁగ
గంభీరతాస్ఫూర్తి ఘనకాంతిమయమూర్తి
శరధిఁ దదాత్ముజు దొరయు ననఁగ
|
|
తే. |
నిరతసేవాగతాగణ్య నృపవరేణ్య
నుతకిరీటాగ్రకీలితనూత్నరత్న
కిరణనికరారుణారుణచరణుఁ డగుచు
విక్రమాదిత్యవసుమతీవిభుఁడు మెఱసె.
| 2
|
వ. |
అమ్మహీపతి యొక్కనాఁడు సకలప్రధానదండనాథసామంతమండలేశ్వరసమూహంబును, గురుభూసురపురోహితబంధుమిత్త్రపుత్త్రపౌత్త్రప్రకరంబును, గవిగాయకపాఠకవైతాళికసందోహంబును బరివేష్టింప, మణిగణభూషణప్రభాపటలశోభితాంగుండై మౌక్తికహారంబునడిమి నాయకరత్నంబునుంబోలెఁ దేజరిల్లుచు, మణిమయోన్నతభద్రసింహాసనాసీనుండై పేరోలగంబున్న సమయంబున.
| 3
|
సీ. |
ఆదినాథునియపరావతారము పూని
మత్స్యేంద్రనాథునిమహిమఁ దనరి
సారంగనాథునిసామర్థ్యమును బొంది
గోరక్షనాథునిగుణముఁ దాల్చి
సిద్ధబుద్ధునిబుద్ధి చిత్తమునం జేర్చి
ఖనిరువిద్యాధికఘనతఁ బేర్చి
మేఖనాదునిమంత్రవైఖరి వహియించి
నాగార్జునునికళాశ్రీ గమించి
|
|
తే. |
యావిరూపాక్షుఁ డితఁడన నతిశయిల్లి
యర్థి నవనాథసిద్ధుల కైక్యమైన
మోహనాకృతి యితఁడనుమూర్తిఁ దనరి
చిన్మయస్వాంతుఁ డగునొక్కసిద్ధవరుఁడు.
| 4
|
ఉ. |
పాదములందు బంగరపుఁబావలు పెట్టి, దుకూలకంథమై
మోదముతోడఁ దాల్చి, జనమోహనమారణధాతువాదయం
త్రాదిసమస్తవిద్యల సమర్థు లనం దగుశిష్యపంక్తి య
త్యాదరలీల నిర్మెయిలయందుఁ దనుం గొలువన్మహోన్నతిన్.
| 5
|
క. |
వచ్చి తగుచందమున సభఁ
జొచ్చి, మహీకాంతుఁ జూచి సుభగాకృతికిన్
మెచ్చి తలయూఁచి, కానుక
తెచ్చినరత్నంబుతోడ దీవన లిచ్చెన్.
| 6
|
ఉ. |
ఇచ్చిన సిద్ధవల్లభున కిమ్ముల నాసనపాద్యసత్కుృతుల్
పొచ్చెము లేకొనర్చి నృపపుంగవుఁ, డెయ్యది మీకుఁ బేరుఁ తా
రెచ్చటు, నేను జేయుపని యెయ్యది? భాగ్యయుతుండ నైతి మీ
వచ్చుటఁ జేసి భక్తజనవత్సల! యన్న దరస్మితాస్యుడై.
| 7
|
క. |
ఇందందుండుదు ననలే
కెందైనఁ జరింపుదును నిజేచ్ఛమెయి, సదా
|
|
|
నందుఁడు నామము, వచ్చితి
నిందులకును నిన్నుఁజూడ నిష్టం బగుటన్.
| 8
|
వ. |
అని చెప్పి మఱియు నిట్లనియె.
| 9
|
సీ. |
ఏవేళ వేఁడిన నా వేళ దివ్యాన్న
పానాదు లొడఁగూర్చుపాత్ర గలిగి
యెచ్చోటవ్రాసిన నచ్చోట పుటభేద
నములు గావించుదండంబు గలిగి
యెటఁబోవఁ దలఁచిన నట కెత్తుకొనిపోవు
సుకుమారయోగపాదుకలు గలిగి
యెపుడు విదల్చిన నపుడు వేలక్షలు
కనకంబు వర్షించుకంథ గలిగి
|
|
తే. |
నిర్మలజ్ఞానవిజ్ఞాన నిరుపమాన
రాజయోగీశ్వరత్వవిరాజిమహిమ
తనర మించిననీ కస్మదాదులకును
హస్తిమశకాంతరము గాదె యంతరంబు.
| 10
|
సీ. |
వేయిమోములవాఁడు విషముక్తుఁడైనను
బ్రతి యగు నీకు భూభరణశక్తి
వేయిగన్నులవాఁడు విమలవర్తనుఁడైనఁ
దర మగు వైభవస్ఫురణ నీకు
వేయిచేతులవాఁడు విగ్రహవ్యథఁ జెంద
కున్నఁ దేజమున నిన్నొరయువాఁడు
వేనామములవాఁడు వేడనివాఁడైన
నిత్యలక్ష్మీయుక్తి నిన్నుఁ బోలుఁ
|
|
తే. |
గాక యేతద్గుణంబుల గణన నేయ
నన్యరాజన్యవరులు వీయంతవారె?
ప్రసవశరరూప యప్రతీపప్రతాప
దీసితాటోప విక్రమాదిత్యభూప!
| 11
|
మ. |
అని యానందమరందకందళితవక్తాంభోజుఁడై యోగిరా
డ్జననాథుండు ప్రశంస సేయుటయు, నాసర్వంసహాధీశ్వరుం
డనఘా! నీదుకటాక్షవీక్షణము నాయం దందమై చెందెఁ గా
న నవీనప్రథమానభాగ్యమయధన్యత్వంబు నేఁ గాంచితిన్.
| 12
|
ఆ. |
అనుచు శిష్యసహిత మమ్మహాయోగీంద్రు
గారవించి కొలువువారి ననిచి
మనుజనాయకుండు మజ్జనభోజన
క్రియల వారికెల్లఁ బ్రియ మొనర్చె.
| 13
|
వ. |
వారలుం దానును సుఖాసీనులై యున్నయవసరంబున యోగీశ్వరునకు విశ్వంభరాధీశ్వరుం డిట్లనియె.
| 14
|
క. |
ఎన్నిక కెక్కినదేశము
లన్నియుఁ జూచితిరి కరతలామలకముగా
నిన్నిటిలోపలఁ జోద్యము
కన్నది విన్నదియు నొకటి గలిగినఁ జెపుఁడా.
| 15
|
చ. |
జనవర నీయెడం బ్రియము చాలఁగఁగల్గి, యపూర్వపుం బ్రయో
జన మెఱఁగింతు నన్యులకు సాధ్యము గానిది, లాటభూమిఁ గా
ననమునఁ బుట్టమీఁద నొకనాతుక, కోమలబాహువల్లి య
త్యనుపమకంకణాంకితసమన్వితమై కనుపట్టు నెప్పుడున్.
| 17
|
వ. |
అనిన నమ్మహీకాంతుం డక్కాంతవృత్తాంతం బాద్యంతం బెఱింగింపుఁడనిన నా సిద్ధవరుం డిట్లనియె.
| 18
|
చ. |
భుజగజగద్విభూషణము పుష్పవురం, బది యేలురాజు చి
త్తజనిభమూర్తి కీర్తివనితారమణుండు ధనుంజయాఖ్యుఁ డా
సుజననుతప్రతాపుఁ డతిశోభనగానకళానిరూఢి శై
లజ నలరించి, తత్కృపఁ గళావతిఁ గాంచెఁ గళావిశారదన్.
| 19
|
సీ. |
ఎలజవ్వనమున నియ్యిందీవరేక్షణ
భూలోకమున వనభూమిలోన
వల్మీకబిలమధ్యవాసినియై యుండి
కరపంకజము తదగ్రమున నిల్పి
యాకేలు గేల నెయ్యమునఁ గీలించిన
పురుషునిఁ దనపుష్పపురికిఁ దెచ్చి
యతని మజ్జనభోజనాదుల నలరించి
మేలిపర్యంకంబుమీఁద నునిచి
|
|
తే. |
తాను నొకశయ్య శయనించి మౌననియతి
నుండ, ముమ్మాఱు పలికింప నోపెనేని
వాడు రమణుండు గాఁగలవాఁడు దీని
కనుచు నాకాశవాణి యిట్లనితిచ్చె.
| 21
|
చ. |
లలితకళావిశారద కళావతికే లది దాని నెవ్వఁడే
బొలుపుగఁ బట్టెనేని తన పుష్పపురంబునకుం గరంబు మె
చ్చులుగఁ గరంబు వట్టికొనుచుం జని యాతఁడు తన్ను మూఁడుమా
టలు పలికింపఁ దక్కును దృఢంబుగఁ, దక్కదు లేక తక్కినన్.
| 22
|
వ. |
అని చెప్పి యోగీశ్వరుండు ధరణీశ్వరున కిట్లనియె.
| 28
|
తే. |
ఆకళావతి సౌందర్య మసమశరుఁడు
ఎసఁగఁ జెప్పినఁ బొసఁగుఁ గా కితరజనులు
మించులావణ్యరస మొకయించుకైన
నొలుకకుండఁగ వర్ణింపఁ గలరె జగతి.
| 24
|
సీ. |
అమృతాబ్ధిజనితమై యలరుకల్పకలత
యంగనతనులత కనుగుణంబు
పుండరీకాక్షునిపొక్కిటితమ్మికి
సతిమోమునెత్తమ్మి సంగతంబు
|
|
|
కామసౌధోపరికనకకుంభములకు
రమణియురోజకుంభములు చెలులు
దివిజాధిపతిదంతితిన్ననినడపున
కంగననడవు విహారభూమి
|
|
తే. |
తెఱవయధరంబు పవడంపుఁ దీవెయురపు
పడఁతియలకము లళులకుఁ బ్రాణసఖము
లింతిచూపులు మగమీల నేలఁ గోరుఁ
దరుణిపలుకులు కాముమంత్రములగములు.
| 25
|
చ. |
కలువల గండుమీలఁ దొలుకారు మెఱుంగుల నిండువెన్నెలన్
వలవులరాజుతూపులగు వారిరుహంబుల, నొక్క యెత్తునన్
గెలుపుకొనంగఁ జాలు మృగనేత్ర యపాంగనిరీక్షణద్యుతుల్
బలుపుగ ధైర్యమూలమున పాఁ తగలింపవె యీశ్వరాదులన్.
| 26
|
సీ. |
ముద్దులు దొలఁకాడు ముద్ధియపలుకు ల
య్యసమాస్త్రుమంత్ర బీజాక్షరములు
క్రొమ్మెఱుంగులనీను కోమలిచూపు ల
య్యంగసంభవు వాలుటంపగములు
శృంగారరసమొల్కుచెల్వయాకారంబు
కామునివలపులకత్తె కనుఁగు
ఇంపులు వెదచల్లు నేణాక్షిచెయ్వులు
శంబరాంతకు జయసాధనములు
|
|
తే. |
కాంతమెయికాంతి కంతునిఖడ్గకాంతి
వనజముఖకురుల్ రతిపతి వాగురములు
మగువమురిపంబు మరునిసామ్రాజ్యపదము
చెప్పఁ జిట్టలు పూఁబోడి యొప్పుకలిమి.
| 27
|
తే. |
సుదతినునుఁబల్కులమృతంపుసొన గురియుఁ
దరుణిచూపులు మెఱుఁగుమొత్తముల నీను
రమణిసేఁత లనంగతంత్రముల నెఱుపు
నువిదనడపులు హంసల కొఱపు గఱపు.
| 28
|
వ. |
అదియునుంగాక యానీరజానన నెవ్వండు వరియించె నతండు సార్వభౌముం డగుట సిద్ధంబు గావున నౌదార్యవీర్యభుజశౌర్యసకలకళాచాతుర్యధైర్యధుర్యుండ వైననీకు నమ్మత్తకాశిని పట్టపుదేవియైన, రత్నకాంచనసాంగత్యంబునుంబోలె నత్యంతశోభితంబగు నని చెప్పిన.
| 29
|
ఉ. |
యోగివరేణ్య మీకృపఁ బయోరుహలోచనచెయ్యి చూడ నే
లాగున నాకుఁ జేకుఱు, విలాసినిహస్తము నాకరంబు నే
లాగునఁ గీలితం బగుఁ గళావతి పుష్పపురంబులోని కే
లాగున నేను జేరుదుఁ దలంపఁగ దుష్కరభంగు లిన్నియున్.
| 30
|
వ. |
అదియనుంగాక, యాబింబోష్ఠ మౌనవ్రతనిష్ఠాగరిష్ఠ యైయుండ హృదయపుటభేదనంబు గావించి, మూఁడుమాటలు పలికించుట యత్యంతదుర్లభంబని తలంచెద, నన్న నమ్మానవేశ్వరునకు సమానుషచరిత్రుండైన యాసదానందుండు కృపానందకందళితహృదయారవిందుండై, దారుశిలాలోహాదులకైనను చైతన్యంబు గలిగించి పలికించెడినేర్పు గలుగునట్లుగా విద్యోపదేశంబు చేసి, యాశ్రితానేకసిద్ధగణపరివృతుండై యంతర్జానంబు నొందె సంత విక్రమార్కుండును దత్కరలతాసందర్శనకుతూహలావేశంబునఁ జిత్తం బుత్తలపడ నిజప్రధానాగ్రగణ్యుండును నాప్తుండును నైన భట్టి మొదలుగాఁగల వారికి నెవ్వరికి నెఱింగింపక, నిజకరకీలితనిశితాసియసహాయంబుగా నర్ధరాత్రంబున యోగపాదుకలు దొడిగి కదలి, మనోవేగంబున ననేకశైలంబులు నరణ్యంబులు దఱిసి, లాటదేశంబునకుం జని యరణ్యమధ్యంబున.
| 31
|
విక్రమార్కుఁడు నాగకన్యకను జూచుట
ఉ. |
శ్రీకరమూర్తి యానృపతిసింహకిశోరము గాంచె నొక్కవ
ల్మీకము సంతతప్రకటలీనవధూకరకంకణప్రభా
నీకము, వేష్టితామలకనింబకదంబతమాలవిద్రుమా
శోకము, రంధ్రమార్గపరిశోభితగోచర నాగలోకమున్.
| 32
|
తే. |
కాంచి తిలకించి పులకించి కవియ నేఁగి
సమణికాంచనకంకణోజ్జ్వలితమైన
|
|
|
హస్తకమలంబుఁ బలుమాఱుఁ బ్రస్తుతించి
సిద్ధసూక్తుల కాశ్చర్యచిత్తుఁ డగుచు.
| 33
|
వ. |
సాహసంబు చేసి సాహసాంకుం డహీనాహిభువనబహుమానమాననీయవరారోహామనోహరనవరత్నమణిగణఘటితకంకణముద్రికాలంకృతహస్తాంబురుహవిన్యస్తకరారవిందుండైన, నానీలవేణి కళాపారీణ గావున మీఁదటం బాణిగ్రహణంబు గలుగుట కిదియ కారణం బన్నకరణిఁ నిఖలక్షోణీభరణశోభాకరం బగుకరంబు కరంబనురాగంబున నిజకరంబునం గీలించి పుష్పపురంబునకుం జని, వజ్రవైడూర్యమరకతపద్మరాగాది వివిధరత్నధగధ్ధగాయమానమాననీయం బగుకనకమయసంకేతనికేతంబున నునిచి, షడ్రసోపేతం బగుచతుర్విధాన్నపానాదులం బరితుష్టు జేసి, కర్పూరపరిమిళితంబగు తాంబూలంబు పెట్టి వినూత్నరత్నపర్యంకస్థునిం జేసి, చతురపరిచారికాజనంబును వాకిటనుండ నియోగించి మణికవాటఘటనపాటవంబు నెఱపి, తాను వేరొక్కశయ్యం బసిండితగడుదెగడుమెఱుంగుగల పఱపుపయి శయనించి, పట్టుపుట్టంబు ముసుంగువెట్టుకొని పలుకకున్నసమయంబున, నప్పుడమిఱేఁడు వెఱుఁగుపడి తనలో నిట్లనియెఁ.
| 34
|
సీ. |
కురులు కప్పు దనర్చి యిరులు గ్రమ్మక యున్నె
నగవు వెన్నెలమించు నిగెడెఁగాక
చన్నుజక్కవదోయి మిన్నువ్రాఁకక యున్నె
పయ్యెదవల యడ్డపడియెఁగాక
కనుగండుమీలు వే కడచిపోవక యున్నె
చెవు లనుకొలఁకులఁ జిక్కెఁగాక
యాననాంబుజముపై నళులు పైకొనకున్నె
మేను సంపెఁగతావిఁ బూనెఁగాక
|
|
తే. |
యొప్పు కనుఁబాటుదాకక యున్నె రత్న
భూషణద్యుతులొక్కటఁ బొదివెఁగాక
తలప నచ్చెరువైనయీతరళనయన
యవయవశ్రీలలీల లేమని నుతింతు.
| 35
|
చ. |
పసిఁడిసలాకవోలెఁ గనుపట్టుతనుం గనుఁగొంచు, మన్మథ
ప్రసవశిలీముఖాలి కగపడ్డ మనోగతి నెట్టకేలకున్
వెస గుదియించి, చూపులచవిం బులకించుచు నున్నచోటఁ దా
ముసుఁగిడుకొన్న దింతి, నిజమూర్తిఁ గనుంగొననీనికైవడిన్.
| 36
|
ఉ. |
ఇంచుక ప్రొద్దుపోకడకు నెవ్వరితో నుబు సేమి చెప్పుదుం
బంచశరవ్యధం దలఁకు భావము నేగతిఁ గుస్తరింతు, నీ
చంచలచారులోచనఁ బొసంగఁగ నేగతి మూఁడుమాట లా
డించి కవుంగిలింతు, నని డెందములోఁ దలపోసి యంతటన్.
| 38
|
విక్రమార్కుఁడు దివ్వెగంబముచేఁ జెప్పించిన కామమంజరి కథ
ఉ. |
దీనికిఁ జింత యేల యని తెల్వి మనంబునఁ బూని, కాంతిరే
ఖానవరత్నదీపకళికం దనరారెడు దివ్వెగంబముం
దా నొకనూత్నమంత్రమున దాఁకి సజీవను జేసి, దానితో
శ్రీ నెఱయంగ నొక్కకథ చెప్పఁగదె యని గారవించినన్.
| 39
|
క. |
అయ్య యవుఁగాక యంచును
దియ్య మెసఁగ రాజుఁ జూచి దివ్వియగంబం
బియ్యకొని, యపూర్వపుఁ గథ
నెయ్యంబునఁ జెప్పఁదలఁచి నెఱి నిట్లనియెన్.
| 40
|
చ. |
నరవర సావధానముగ నాదొక విన్నప మాలకింపు, ము
త్తరకురుభూములందు విశదంబుగ నాగపురం బనంగ న
త్యురుతరలక్ష్మి నొక్కపుర, మొప్పు నయోధ్యకుఁ బొమ్మ వెట్టి కి
న్నరపతిపట్టణంబు నగి నాగపురంబుఁ దృణీకరించుచున్.
| 41
|
మ. |
విను మావట్టణ మాదిరాజవిలసద్విఖ్యాతి ధర్మధ్వజుం
డనుభూపాలకుఁ డేలుచుండును, జనాధ్యక్షుండు భూమీశ భూ
జనసంస్తుత్యుఁడు నిత్యసత్యుఁ డురుసౌజన్యుండు ధన్యుండు స
త్త్వనయప్రాభవధీవిధేయుఁడు గుణాధారుండు ధీరుం డిలన్.
| 42
|
క. |
మనునిభుఁ డనఁ దనరినయా
మనుజపతికి సుగుణమధుపమంజరి యనఁగా
జనియించెఁ గామమంజరి
వననిధి జనియించుపద్మవాసినిఁ బోలెన్.
| 43
|
సీ. |
కమ్మనిపసిఁడిటంకంబునఁ గరగిఁన
లాలితనూత్నశలాకపోలె
రమణీయశృంగారరసమునఁ బసవారు
మురిపంపువలపులమొలకవోలె
గళ లమృతంబుచేఁ గరువుగాఁ గట్టి వ
ర్తించి నించినచంద్రరేఖవోలె
మీఱి తళుక్కున మెఱసి నిల్చినయట్టి
సోగక్రొమ్మెఱుఁగులేఁదీఁగవోలె
|
|
తే. |
దినదినంబునఁ బెరుఁగుచుఁ దియ్యమొదవఁ
దల్లిదండ్రులమనము లుత్సవము లొందఁ
గామమంజరి మంజువికాస మెసఁగె
బ్రజలకెల్లను గన్నులపండు వగుచు.
| 44
|
చ. |
పడఁతుకదేహవల్లికకుఁ బ్రాయపుసంపద కావువచ్చినన్
నొడుపుల రాజకీరముల నున్ననిపల్కులఁ దూలఁబోలె, ను
గ్గడువగుమేనికాంతిఁ దొలుకారుమెఱుంగులమించు మించె నె
న్నడుపులచేతఁ గీడ్పఱిచె నాగమరాళమయూరయానముల్.
| 45
|
క. |
ఎవ్వరికైనను గనుఁగవ
యువ్విళ్ళూరంగ మరునియున్మదనాస్త్రం
బివ్వనిత యొకోనాఁగను
జవ్వనమునఁ బువ్వుఁబోఁడి సన్నుతికెక్కున్.
| 46
|
క. |
లాలితమధుర సుగంధము
గ్రోలఁగ విరిదమ్మిమీఁదఁ గొమరారెడుమ
|
|
|
త్తాలికుల మొక్కొ! నాఁగను
బాలిక నెన్నుదుటఁ గురులు భాసురమయ్యెన్.
| 47
|
తే. |
ఒప్పులే యేఱి మాఱులేకుండ బ్రహ్మ
యంగకంబులు చేసే నం చాత్మ మెచ్చి
యవయవశ్రీలు గనుఁగొనునట్టి యిచ్చఁ
దరుణికన్నులు తలచుట్టుఁ దిరిగివచ్చు.
| 48
|
తే. |
బయలఁ గనుపట్టునొంటికంబంబుమీఁదఁ
బసిడికుండలు నిల్పినభంగి దోఁప
ససదుఁగౌఁదీఁగెఁ బొలుపోగునారుమీఁద
వలుదనునుగుబ్బ లొప్పారు వనజముఖికి.
| 49
|
ఉ. |
అంతటఁ గూర్మినందనవయఃపరిపాకము చూచి, తండ్రి య
త్యంతముదంబునం బొదలి, యంగజలక్ష్మియుఁబోలె నున్న యీ
కాంతకు, వంశశీలగుణగౌరవయౌవనరూవసత్కళా
వంతుఁడు కాంతుఁడైన, గరువంపుదపంబు ఫలంబు నొందుఁబో.
| 50
|
వ. |
అని విచారించి సకలలోకజయధ్వజుం డగుధర్మజుండు, మదవదసహ్యరిపుకరటిసింహుం డగుసింహళేశ్వరకుమారుండు హేమాంగదుండు రూపవిజితమకరధ్వజుండగుట మున్ను వినియునికిం జేసి, తగినవారలం బుచ్చి రప్పించి బ్రియపూర్వకంబుగా గారవించి, శుభముహూర్తంబున నానృపకుంజరునకుఁ గామమంజరిని వివాహంబు చేసి, మణిగణోజ్జ్వలానేకవిరాజితోపచారంబులం బూజించి, యల్లునిఁ గూఁతు ననర్హ్యరత్నఖచితకనకమయమందిరంబున నుండ నియమించిన.
| 51
|
క. |
రతియును గంతుఁడును, శచీ
సతియును నింద్రుండుబోలె, జలజాక్షియు భూ
పతియు సుఖాంబుధిఁ దేలుచుఁ
జతురత విహరించుచున్నసమయమునందున్.
| 52
|
క. |
హేమాంగదభూపతి తన
భూమికిఁ బోవంగ బుద్ధిపుట్టి, విరక్తిన్
ఏమివిహారమునకుఁ జొర
కేమియు ననకున్న నింతి యిట్లనుఁ దనలోన్.
| 53
|
క. |
ఏకాంతకాంతరూపమొ
యీకాంతుని నయనవీథి కిరవైనది, గా
కేకాంతంబునఁ గాంతల
కేకాంతులు నొఱపు సడల నిట్లుండుదురే!
| 54
|
వ. |
అని యతనితెఱం గెఱుంగం దలంచి సవినయంబుగా నిట్లనియె.
| 55
|
క. |
ఓనరనాయక భవదీ
యాననమునఁ దెలివి దోప, దాత్మయుఁ జింతా
ధీనం బైనది, యీగతి
నా నయహీనతనొ మజ్జనకుచేఁతలనో.
| 56
|
క. |
నీవలన నప్రియం బొక
యావంతయు లేదు, భూతలాధీశుఁడు న
న్నేవలన నుదాసీనత
గావింపఁడు, వినుము నాదుగతి నలినాక్షీ!
| 58
|
సీ. |
ఏను బొత్తుకురాక యెన్నఁడు నారగిం
పనియట్టి రక్తు మజ్జనకుఁ దలఁచి
చెమట నెత్తురుగాఁగఁ జిత్తమ్మునఁ దలంచి
యర్మిలిఁ బెనుచు మదంబఁ దలఁచి
నిముసంబు ననుఁ బాసి నిలువక యొడఁగూడి
చరియించు మత్ప్రాణసఖులఁ దలఁచి
యెయ్యది పనిచిన నొయ్యఁ జేయుచు నాదు
కనుసన్న మెలఁగుభూజనులఁ దలఁచి
|
|
తే. |
గంధసింధురసైంధవోత్కరముఁ దలఁచి
సతతసేవాగతనరేంద్రవితతిఁ దలఁచి
వనటయొదవిన నింత యొప్పనిమనమున
నున్న చందంబుగాని, వేఱొండు లేదు.
| 59
|
క. |
అనిన విని కామమంజరి
యనఘా! దీనికి విచార మందఁగ నేలా?
జననాథు మొఱఁగిపోదము
మనభూమికి, నతఁడు వినిన మాన్పఁగఁజూచున్.
| 60
|
వ. |
అనిన నత్తలోదరి యుత్తరంబునకుఁ జిత్తం బిగురొత్త నియ్యకొని, హృద్యానవద్యంబు లైన మణికనకాదిసమస్తవస్తువులు నాయితంబు చేసికొని, గమనోన్ముఖుండై యుండునంత, మార్తాండమండలంబు పశ్చిమాచలప్రాసాదశిఖరంబునకు శాతకుంభకుంభంబై యుల్లసిల్లె,స నయ్యవసరంబున.
| 61
|
క. |
తక్కువలుగాక నిగిడెడి
మక్కువలు మనంబులోన మల్లడిగొనఁగా
జక్కవలకవలు విరహము
పెక్కువలు దలంచి పరితపింపఁగఁ జొచ్చన్.
| 62
|
క. |
పగలెల్లను దము నేఁచిన
వగలెల్లఁ దలంచి యిరులుపవుఁజులు దనపై
దెగి యెత్తివచ్చు నని రవి
పగ బెగడినభంగి నపరవనధి నణంగెన్.
| 63
|
క. |
మెఱ పగ్గలింపఁ జుక్కలు
తఱచై పొడముటయు, గగనతల మొప్పారెన్
మెఱుగారుముత్తెములచే
మెఱపడి యగునల్లపట్టుమేల్కట్టుగతిన్.
| 64
|
శా. |
ఉర్వీచక్రమునం జరాచరములై యొప్పారురూపంబులన్
దుర్వారోన్నతి లోనుచేసికొని చేతోవృత్తి కాశ్చర్యమై
పర్వెం జీఁకటి నీలనిర్మలరుచిన్ భవ్యప్రభావంబునన్
‘సర్వం విష్ణుమయం జగ’త్తనుట నైశంబైనచందంబునన్.
| 65
|
వ. |
ఇట్లు క్రమంబునం దమంబు నిగిడి, మిఱ్ఱుపల్లంబు బయ లోలం బని యేర్పఱుప రాకున్నసమయంబున, నటమున్న సాహిణి నడిగి తెచ్చి సన్నద్దసర్వాయుధంబై యింద్రాయుధం బనుతురంగంబు నంతరంగంబు సంతసం బెసంగ నంగనాసహితం బారోహణంబు చేసి, పౌరులెల్ల నిద్రించుచుండఁ దలవరులఁ గన్నుఁబ్రామి పురంబు నిర్గమించి, నిజపట్టణాభిముఖుండై యరుగునప్పుడు, నిజాన్వయజాతుండైన హేమాంగదమహీపాలునకు గమననివారణకారణం బైనయంధకారంబు దూరంబు సేయ నుత్సహించుచందంబున.
| 66
|
సీ. |
కైసేసి పూర్యదిక్కామినీమణి చూచు
పద్మరాగంపుదర్పణ మనంగ
వేయిగన్నులుగల వేల్పుతొయ్యలిచేతఁ
జూపట్టుచెంబట్టుసురఁటి యనఁగఁ
విరహులపై దండు వెడలంగఁ దమకించు
నసమాయుధుని కెంపు[1]టరిగ యనఁగ
గల్పకభూజశాఖాశిఖాగ్రంబున
భాసిల్లు పరిపక్వఫల మనంగ
|
|
తే. |
నభ్రమాతంగకులపతి యఱుతనొప్పు
కనకఘంటిక యనఁగ, లోకముల కెల్ల
నుదయరాగంబు రాగంబు నొదవఁజేయ
నిందుఁ డుదయించె లోచనానందుఁ డగుచు.
| 67
|
సీ. |
గంగాప్రవాహంబు గాఁబోలు నని వసి
ష్ఠాదు లనుష్ఠాన మాచరింప
నమృతంబువెల్లువ యని నిలింపాదులు
మునుకొని దోసిళ్ళ ముంచి క్రోల
దుర్గాంబునిధి యని తోయజాక్షుఁడు శేష
పర్యంక మిడుకొని పవ్వళింప
బరమేశు విశ్వరూపం బని బ్రహ్మాదు
లమర దండప్రణామములు సేయఁ
|
|
తే. |
దలఁప భూనభోంతరములకొలఁది దెలిసి
బెరసి యెన్మిదిదిక్కులఁ బొరలి పొరలి
దట్టముగ నంతకంతకుఁ దనరి తనరి
యిట్టలంబుగ వెన్నెల నిట్టవొడిచె.
| 69
|
సీ. |
పసగల వెన్నెలమిసిమి పుక్కిటఁ బట్టి
పొసఁగఁ బిల్లలనోళ్ళఁ బోసి పోసి
నున్ననిక్రియ్యన్కు వెన్నెలతుంపరల్
హుమ్మని చెలులపై నుమిసియుమిసి
కమ్మనివెన్నెల కడుపునిండఁగఁ గ్రోలి
తెలివెక్కి గఱ్ఱనఁ ద్రేన్చి త్రేన్చి
కన్నిచ్చలకు వచ్చు వెన్నెలక్రొన్నురు
వేఱి వే ప్రియురాండ్ర కిచ్చియిచ్చి
|
|
తే. |
తఱచువెన్నెలగుంపులఁ దాఱితాఱి
యీఱమగు వెన్నెలలలోనఁ దూఱితూఱి
పలుచనగు వెన్నెలలలోనఁ బాఱిపాఱి
మెలఁగెఁ బెక్కుచకోరంపుఁబులుఁగుగములు.
| 71
|
వ. |
ఇవ్విధంబున సాంద్రం బైనచంద్రాతపంబున నరేంద్రుం డతంద్రుండై, హయంబు రయంబునకు మెచ్చుచు నతిదూరం బరిగి, వేకువయగుటయు
|
|
|
నిద్రాలసుండై యొక్కపురోపవనప్రాంతంబున వటవిటపి నశ్వంబు బంధించి, యాతరుచ్ఛాయను సతియంకతలం బుపధానంబుగా శయనించి కన్ను మొగుడ్చునంత.
| 72
|
ఉ. |
రాయిడికత్తె లైనపెనుఁబ్రాయిడియత్తలయిండ్లఁ గోట్రముల్
సేయువిలాసినుల్ మునుకు సెందఁగ, వేశ్యలప్రక్క దాపులం
బాయనికాముకుల్ వెలుకఁబాఱి కలంగఁగ, మ్రోసెఁ గొక్కోరో
కోయని కుక్కుటస్ఫురదకుంఠితకంఠకఠోరనాదముల్.
| 73
|
సీ. |
శ్రీమదామ్నాయలతామూలకందంబు
పద్మినీమదవతీప్రాణపదము
చక్రవాకానీకసంజీవనౌషధ
మఖలలోకాలోకనాంజనంబు
ప్రబలాంధకారనిగ్రహరత్నదీపంబు
హరిహరబ్రహ్మవిహారగృహము
కైరవకాననోత్కటకాలకూటంబు
ప్రాలేయవిఘటనాకీలకంబు
|
|
తే. |
రత్నసానుసురక్షణారక్షకుండు
సతతసన్మార్గలంఘనజాంఘికుండు
దివిజకల్లోలినీసపత్నీగురుండు
భానుఁ డుదయించె దేదీప్యమానుఁ డగుచు.
| 74
|
వ. |
అంత, నంతవృత్తాంతంబు నెఱింగి ధర్మధ్వజుండు ప్రళయకాలవృషభధ్వజుండునుంబోలెఁ గోపారుణితలోచనుండై నిజదండనాథుం డగునీతిధ్వజుం బిలిపించి యిట్లనియె.
| 75
|
చ. |
తగిననరేంద్రసూనుఁ డని తన్నుఁ బ్రియంబునఁ బిల్చి తెచ్చి, మ
చ్చిగ సుత నిచ్చి మత్ప్రతిముఁ జేసిన సింహళరాజసూనుఁ, డా
తగవు మదిం దలంపక ముదంబున మత్తురగంబు నెక్కి, మ్రు
చ్చుగతి వధూటి గొంచుఁ బ్రజఁ జొక్కిడి పోయినవాఁడు చూచితే.
| 76
|
క. |
చనఁ దలఁచిన మన మనుపఁగఁ
జన నొప్పదె తనకు, నిట్టి చలచిత్తునిపై
ననుపమసేనాన్వితముగఁ
జని క్రమ్మఱఁ బట్టి తెమ్ము సమ్ముఖమునకున్.
| 77
|
వ. |
అనిన విని నీతిధ్వజుండు యుద్ధసన్నద్ధాఖిలసేనాసమన్వితుడై, యాప్రొద్దె కదలి హేమాంగదుండు చనినజాడ యరసి యతిత్వరితగతిం జని కూడముట్టిన, నాభీలంబైన యాకలకలం బాలించి కామమంజరీకాంత నలుదిక్కులం బరికించి, పడగలయడియాలంబులు నిరీక్షించి నిజజనకు సేనాసంకులంబుగా నిశ్చయించి, తనపతినిద్రాభంగంబు గాకుండ నతనియుత్తమాంగంబున కుపధానంబుగా నొక్కపరిధానంబు చుట్టి పెట్టి , తలచీర యాయితంబు చేసికొని సంగరోత్సాహం బంతరంగంబునం బొంగ, సన్నద్ధసర్వాయుధం బైనయింద్రాయుధంబు నారోహణంబు చేసి, ప్రాణేశ్వరచరణస్మరణపరిణతాంతఃకరణ యగుటను రణవిహరణంబు తృణకణాయమానంబుగా గణించుచు, విటవిటపి కనతిదూరంబున వచ్చుచున్న తత్ప్రబలవాహినిలోనికి నిజవాహనంబు నుఱక తఱియం బఱసి.
| 79
|
మ. |
మదదంతావళదంతముల్ నఱకు నమ్మావంతు లుద్భ్రాంతతన్
బెదరం, బల్లము గుఱ్ఱమున్ రవుతును వేటాఱుతుండెంబులై
చెదరంగా వడి వ్రేయు, వీరరధికశ్రేణిన్ బలౌఘంబులం
గుదియం జేయు, భటాలిఁ ద్రుంచు విలసద్ఘోరాసిధారాహతిన్.
| 79
|
చ. |
ప్రతిబలవార్థి బాడబముభంగి దహించును, రాముపోలికన్
శితశరధార పాల్పఱుచుఁ, జెల్లెలికట్టయుఁబోలెఁ బాఱనీ
కతులితలీల నాఁగు మునియచ్చునఁ బొంకమణంచు, మందగ
క్షితిధరవృత్తిమైఁ గలఁచుఁ జిత్రముగా లలితాంగి యుక్కునన్.
| 80
|
క. |
సరి నాధానము సేయుట
యరిఁబోయుట తివియు టేయు టద్భుతకరమై
|
|
|
తరుణిశరంబులు భానుని
కరములగతి రిపులగములఁ గప్పెఁ దఱచుగన్.
| 81
|
క. |
కప్పిన మదిలో నెంతయు
నుప్పొంగెడు రౌద్రరసమహోగ్రత నింతిం
దప్పక కనుఁగొని, కన్నుల
నిప్పులు రాలంగ వాహినీపతి పల్కున్.
| 82
|
క. |
అక్కున నిడుకొని మక్కువ
పెక్కువమై నేను బెనుపఁ బెరిఁగితి, నేఁడుం
జెక్కడిచిన వస రాలెడు
నిక్కము, నాకోలుతలకు నిలువఁగఁ గలవే?
| 83
|
క. |
తనయింటిదీప మనుచును
విను ముద్దిడికొనఁగఁ దలఁచువీఱిఁడి గలఁడే?
నను మార్కొనఁగఁ దలంచెదు
మును పెంచినమందెవేలమున నాలమునన్.
| 85
|
క. |
నను గినియఁ జేసి మగుడం
జనఁ గలవే నీవు పురికి? స్వామిహితుఁడవై
చను మింక నింద్రపురమున
కనినం గోపించె యేసె నతఁ డంపగముల్.
| 86
|
క. |
ఏసిన నవి పొడి చేసి, శ
రాసనముం దునిమి వేయ, నతఁ డొండొకబా
ణాసనము నెక్కువెట్టి శ
రాసారము గురియఁ దొణఁగె నంబుధముక్రియన్.
| 87
|
వ. |
ఇత్తెఱంగున నొండొరులకు వట్రపడక, నయ్యిరువురుం జలంబును బలంబును మెఱయ, దృష్టిముష్టి లక్ష్యాలక్షితశీఘ్రతరశరసంధానాకర్షణమోక్షణ
|
|
|
దూరాపాతనాద్యనేకధనుర్విద్యాకౌశలంబులు మెఱయుచుఁ బెద్దయుం బ్రొద్దు మహాయుద్ధంబు సేయుచున్న సమయంబునఁ, గామమంజరి నితిధ్వజునిరథరథ్యసారథుల లీలవోలె నాభీలభల్లంబులు పె ల్లేసి పొడిచేసి పేర్చిన, నతండు విరథుండయ్యును బొలిపోవనిబలిమి నతినిశితవిశిఖంబులు వఱపిన, నత్తన్వి కుముదలోచన యయ్యును గోపావేశంబున నరుణాబ్జపత్త్రనేత్రయై యతనికోదండంబు తుండంబులు చేసి మఱియును.
| 88
|
తే. |
ఎత్తనెత్తంగఁ జాపంబు లెన్నియేనిఁ
దోడుతోడనె దునుమాడి తోయజాక్షి
తోమరము వైవ నడుమన త్రుంచివైచెఁ
గుంత మెత్తినఁ బొడిచేసెఁ గుంత మెత్తి.
| 89
|
క. |
ఆహవమునఁ దరుణీమణి
బాహాటోపమున సైన్యపతిఁ దూలించెన్
సాహసము షడ్గుణం బని
యూహింపఁగ సతుల కెందు నుచితమ కాదే.
| 91
|
వ. |
ఇట్లు వికలసకలాయుధుండై సేనానాయకుండు.
| 92
|
క. |
కనుకనిఁ బఱచిన, నాతని
వెనుకొనుటయు, వాఁడు శరణు వేఁడినమాత్రం
గినుక యుడిగి తొయ్యలి మదిఁ
గనికరము జనింప మగిడెఁ గాంతునికడకున్.
| 93
|
ఉ. |
అంతట మేలుకాంచి వికచాబ్జముఖిం దురగంబు గానమిం
జింత జనింప నున్న నృపసింహుఁడు, గాంచె హయాధిరూఢయై
సంతసమార వచ్చిననిజప్రియకారిణి, నుగ్రసంగర
శ్రాంతశరీరిణిన్, మహితసజ్యశరాసనబాణధారిణిన్.
| 94
|
చ. |
కని తురగాధిరూఢగతిఁ గార్ముకబాణకృపాణపాణివై
చనిననిమిత్త మెయ్యది? నిజం బెఱిఁగింపు మనంగ, నాథుతో
వనజదళాక్షి యిట్లను, నవారణ నన్నును నిన్నుఁ బట్ట మ
జ్జనకుఁడు దాడిమైఁ బనిచె సైన్యయుతంబుగ దండనాథునిన్.
| 95
|
చ. |
పనిచినఁ గూడముట్టిన నృపాలకసైన్యముఁ గాంచి, కొంచెపుం
బనికయి నీదునిద్రకును భంగ మొనర్పఁగ నేల యంచు, నే
జని యనిచేసి తత్ప్రబలసైన్యము నెల్లను దూలఁదోలి, వే
వెనుకొన భీతుఁడై శరణు వేఁడినఁ గాచితి సైన్యనాథునిన్.
| 96
|
వ. |
అని విన్నవించి హయావతీర్ణయై, కృపాణబాణాసనబాణతూణీరంబులం దురంగంబుపై నెప్పటియట్ల పదిలపఱచి, వినయవినమితోత్తమాంగయైన యత్తన్విఁ జిత్తం బిగురొత్త, సమీపంబున నునిచికొని యతం డిట్లనియె.
| 97
|
క. |
తలఁపఁగఁ గయ్యపువెరవును
నలవును నీ కచ్చుపడుట యచ్చెరు! విమ్మై
దలపూ వాడక యుండఁగఁ
బలుసేన జయించి తిట్టిభార్యయుఁ గలదే!
| 98
|
తే. |
అనుచుఁ బ్రియురాలిఁ జేరంగ నల్ల దిగిచి
ఘనకుచంబులు విపులవక్షంబుతోడఁ
గదియఁ జేర్చుచు బిగియారఁ గౌఁగిలించి
విజయ మగ్గించి చెవులకు విందొనర్చి.
| 99
|
వ. |
కదలి యచ్చోటి కనతిదూరంబునఁ దేటనీట నొప్పారు నేట సంధ్యావందనాదికృత్యంబులు నిర్వర్తించి, యమ్మేటిజోటియుం దానును ఘోటకంబునుం దత్కాలోచితాహారంబులం దృప్తి సలిపి, కాలుకొన్న యంతనేల యరిగి యపరాహ్ణసమయంబున నొక్కపురవరోపాంతంబున నేకాంతంబైన కాళికాస్థానంబున విడిసి యున్నంత, నత్తలోదరి తనమగనిచేతికి
|
|
|
నొక్క సొన్నాటంకం బిచ్చి యిప్పట్టణంబున నాహారం బడిగి తెమ్మనుటయు.
| 100
|
క. |
అన్నరపతి తగులాగున
నన్నగరము చొచ్చి, యెల్ల యంగళ్ళందున్
సొన్నాటంకం బిచ్చెద
నన్నమిడెడువారు గలరె? యని యడుగుతఱిన్.
| 101
|
క. |
విన్నజనము లవ్విభునిం
గన్నారం జూచి, యాదిగర్భేశుఁ డితం
డెన్నఁడుఁ బ్రయాసమునకుం
జన్నతెఱఁగు దోఁప దేల చనుదెంచెనొకో!
| 102
|
క. |
సొన్నాటంకము సేయఁగ
నన్నము దన కెట్టు వెట్టనగు గరగరగా
విన్ననువున నని పలుకుచు
నున్నన్, విన్నదఁన మెసఁగ నున్నకుమారున్.
| 103
|
క. |
కనుఁగొని విలాసవతి యనఁ
జను వారవధూటి దాసి చని తద్విధమే
లినదాని కెఱుఁగఁజెప్పి, త
దనుమతిఁ గొనివచ్చె నింటి కానృపతనయున్.
| 104
|
వ. |
ఇట్లు వచ్చిన హేమాంగదమహీపాలు, నబ్బాల యభ్యంతరమందిరంబునకుం దోడ్కొనిపోయి సమున్నతకనకాసనంబున నునిచి తత్క్షణంబ.
| 105
|
ఉ. |
మజ్జనభోజనాభరణమాల్యవిలేపనవస్త్రరాజిచే
బుజ్జవమారఁ దృప్తిసనఁ బూజలొనర్చి, లతాగృహంబులో
గొజ్జెఁగనీటఁ బైచిలికి క్రొవ్విరిజాజులఁ జేసినట్టిపూ
సెజ్జకుఁ దార్చి చిత్తజవిశేషసుఖంబుల నోలలార్చినన్.
| 106
|
వ. |
ఇట్లు వారసీమంతినీకృతనిరంతరలతాంతశరలీలాసంతోషితస్వాంతుండై మైమఱచి, మహీకాంతుండుం నిజకాంతవలనిచింత యావంతయు లేక యుండె నంత.
| 107
|
చ. |
ఉదయమునం దలిర్చుదిశ నొల్లక, తన్వసుహీనుఁ జేయుచుం
గదిసి ప్రతీచిఁ జెందె దిననాథుఁడు, భూరమణుండు సంతతా
భ్యుదయముఁ గోరుచున్నసతి నొల్లక, త న్వసుహీనుఁ జేయఁగా
మదిఁ దలపోయువారసతి మక్కువఁ జెందినలీల నత్తఱిన్.
| 109
|
వ. |
ఇట్లు సూర్యాస్తమయం బగుటయుఁ దనపతి రామికిఁ గామమంజరీకాంత సంతాపశాంతఃకరణ యై.
| 109
|
చ. |
ఇరవును దల్లిదండ్రులను నెత్తిన పెంచినవారిఁ బాసితిన్,
దురమునఁ దండ్రిసైన్యపతిఁ దోలితి సేనలతోడఁగూడ నీ
వురుషునిమీఁదిభక్తి, మఱి పోయి యితండును రాక తక్కె, నె
ప్పరుసున నోము నోచితినొ ప్రాక్తనజన్మమునందు నక్కటా!
| 110
|
వ. |
అని విలపించుచున్న సమయంబునఁ గాళికానికేతంబునకు నొక్కవృద్ధాంగన చనుదెంచి, దీపికానికరంబు సమర్పించి, మనోభవరాజ్యలక్ష్మియుంబోలె నున్నయత్తన్వి న్నిరీక్షించి, నీ వెవ్వ రెందుండి యేమికతంబున వచ్చి యిచ్చట నొంటి నున్నదాన? వనినం దనవృత్తాంతంబంతయు నెఱింగించిన.
| 111
|
క. |
అజ్జరఠ దోడుకొని చని
మజ్జనభోజనము లాత్మమందిరమున నా
లజ్జావతి కొనరించి. సు
హృజ్జనభావంబు నడపి హృదయముఁ దేల్చెన్.
| 112
|
ఆ. |
మగఁడు చన్న దెసకు మనసును జనియున్నఁ
జెయ్వు వెఱఁగుపడినఁ, జెవులు సొరని
వృద్దవనితకథలు వెడవెడ నూఁకొంచు
నుండె వగల నొగిలి యుత్పలాక్షి.
| 113
|
క. |
వేగింపరానివేదన
వేఁగింపఁగ నంత ప్రొద్దు వేగియు, సతికిన్
|
|
|
వేగకయుండెను దైవని
యోగంబున నంతఁ బతివియోగము కతనన్.
| 114
|
ఆ. |
ఎట్టకేల కట్లు హితవచనంబుల
నువిద నూఱడింప, నుల్లమునను
లేనిధృతి ఘటించి లేమ, యాపూజారి
సానిఁ బిలిచి ప్రియము సాలఁ జెప్పి.
| 115
|
క. |
క్షోణీనాయకుఁ గానమిఁ
బ్రాణములును మేన వెడలఁబాఱం జొచ్చెం
బ్రాణసఖీ! యేవెరవునఁ
బ్రాణేశ్వరు నన్నుఁ గూర్చి బ్రతికింపఁగదే.
| 116
|
క. |
పతి కలుగుకంటె సౌఖ్యము
సతులకు నొండొకటి గలదె చర్చింపంగాఁ
బతి లేమి సర్వశూన్యము
పతి గలిగిన సతికి నింద్రపద మది యేలా?
| 117
|
వ. |
అనినం బూజరిసాని యెత్తెఱంగుననైన భూవరోత్తము న్వెదకి తెత్తు నని యరిగిన.
| 118
|
తే. |
మగనిపోకకుఁ గడలేనిదిగులు వొదువఁ
గామమంజరి యెంతయుఁ గళవళించి
యరయఁ బోయినయంగన తెరువు చూచి
వనట నిట్లని తలపోయు మనములోన.
| 119
|
సీ. |
పూర్ణచంద్రాననుఁ బొడగాంచివచ్చినఁ
దొడిగినతొడవు లాపడఁతి కిత్తు
కమలాప్తజునిఁ గన్నార నేఁ గన్న
గాళికాదేవికి గ్రాస మిత్తు
సింహసత్త్వునిపల్కు చెవిఁ జేర్పఁ గల్గిన
దీనావలికి భూరిదాన మిత్తు
|
|
|
రాజశేఖరుపరిరంభణం బబ్బిన
గోటిగోవుల విప్రకోటి కిత్తు
|
|
తే. |
ననుచు జింతించుఁ దనలోన నట్టె నవ్వుఁ
జెక్కుటద్దంబు గదియంగఁ జెయ్యి సేర్చు
వెగుచు దైన్యంబు వొదలంగ విహ్వలించుఁ
బనవుఁ గొనగోరఁ గన్నీరు పాయ మీటు.
| 120
|
చ. |
ఎదురఁ జరించినట్లయిన నింపగుపల్కులు పల్కఁజూచుఁ దన్
గదిసినచందమైన నిఱికౌఁగిటఁ జేర్పఁ గడంగు, భీతుఁడై
పదముల వ్రాలినట్లయినఁ బాణితలంబున నెత్తఁగోరు, నే
యదియును లేక రిత్తయిన యంబుజలోచన యార్తిఁ జేడ్పడున్.
| 121
|
ఉ. |
పట్టణ మెల్ల దేవి గుడిభామిని యారసి తోడితెచ్చునో
కట్టెదురగ నృపాలుఁ గని క్రమ్మఱ నా కెఱిఁగింప వచ్చునో
యిట్టును నట్టునుం దిరిగి యెందుకు గానక తానె వచ్చునో
యట్టిద యైన నామనికి కాస్పద మెయ్యెదియొక్కొ దైవమా!
| 122
|
వ. |
అని యిట్లు కామమంజరి పురుషవియోగంబున నాతురచిత్తయై తలపోయుచున్న సమయంబున.
| 123
|
ఉ. |
భూరమణీశుఁ దెత్తునని పోయెడునప్పుడు పంతమాడి యే
నూరక యింటికిం జని తలోదరి నేమని చూతునంచు దు
ర్వారవిచారభావమున పట్టుచు మోమున దైన్య మొందఁ బూ
జారివధూటి వచ్చి జలజాతవిలోచనఁ జేరి యిట్లనున్.
| 124
|
క. |
పురము గలయంతమేరయు
నరసితి నిల్లిల్లు దప్ప కతిశోధన, నీ
వరుఁ డెందుఁ గానఁబడఁ, డె
ప్పరుసున నీకరుణవడయ భాగ్యము లేమిన్.
| 125
|
చ. |
అనిన దురుక్తి వీనులకు నస్త్రమయంబయి తాఁకి మూర్ఛ వ
చ్చిన ధర వ్రాలి యెంతయు నచేతనయై, మఱి యెట్టకేలకుం
|
|
|
దనువునఁ ద్రాణ దెచ్చుకొని, దైవకృతంబులు మానవంచు గ్ర
క్కున ననలప్రవేశమునకుం గృతనిశ్చయ యయ్యు నంతటన్.
| 126
|
వ. |
సర్వసన్నాహంబును మెఱయఁ గాళికానికేతనంబునకుం జని, యమ్మహాశక్తికి దండప్రణామం బాచరించి వెడలి, తదాలయపురోభాగంబున ఘతప్లుతమలయజాగురురక్తచందనదేవదారుపూరితంబును, ననలోపేతంబుసు గర్పూరాదిసుగంధబంధురంబును నైన యగ్నికుండంబునకుఁ బ్రదక్షిణప్రణామంబు లాచరించి ప్రవేశించునప్పుడు, జన్మజన్మంబునందును హేమాంగదమహీపతియే నాకుం బతి గావలయునని కుండమధ్యంబునం బడుటయు, నటమున్న తదాలోకనకుతూహలాంగదుండయ్యును నయ్యబల నిరీక్షింప మఱచి, విలాసవతీమధురసల్లాపాయత్తచిత్తుండైన హేమాంగదుండు విని, తలంచికొని యదరిపడి తన్నుఁదాన నిందించుకొనుచు, విలాసతీకరకీలితం బైనకేలు తిగుచుకొని.
| 127
|
క. |
నానేరమివలన బయో
జానన వైశ్వానరునకు నాహుతి యయ్యెన్
దీనికిఁ బ్రాయశ్చిత్తం
బౌనని తనమేను వహ్ని కాహుతిచేసెన్.
| 128
|
క. |
చేసిన, విలాసవతి తన
చేసినదోసమునఁ గాదె శిఖిఁ బడి వీరల్
వాసవుపురికిం జని రని
వాసిగఁ దనమేను నిచ్చె వహ్నికి నంతన్.
| 129
|
క. |
అవ్వారాంగన బానిస
మువ్వరు నీల్గుటకుఁ దాన మూలం బనుచున్
నెవ్వగపు వగల నీనం
గ్రొవ్వఱి వెసఁ జొచ్చె నగ్నికుండములోనన్.
| 130
|
వ. |
అంత నమ్మహాకాళి యెల్లవారును వినుచుండ.
| 131
|
క. |
కడచిరి నలువురు వహ్నిని
బడి యొక్కట నేను చూడ, బ్రదికించెద ని
ప్పుడు వీరి ననుచుఁ దానొక
పడఁతుక మేనను వసించి పల్కినమాత్రన్.
| 132
|
క. |
వెలఁదియు ధరణీవిభుఁడును
వెలయాలును దాసిఁ గూడి విమలాకృతులై
వెలువడిరి యగ్గిగుండము
జలరుహషండముననుండి చనుదెంచుగతిన్.
| 133
|
వ. |
తదనంతరంబ ధర్మధ్వజుతనయ తనప్రాణేశ్వరు నింగితం బెఱింగి యిట్లనియె.
| 134
|
ఉ. |
కారణ మేమి ‘నా యుసుఱు గల్గిన సర్వము గల్గు’ నాక, తా
వారవధూటి యయ్యు ననివారణదారుణవహ్నికుండ మీ
ధారుణి మెచ్చ మీవెనుకఁ దానును దోడనె చొచ్చెఁ, గాన నీ
వారిజనేత్ర మీకృప కవశ్యముఁ బాత్రము సేయఁగాఁ దగున్.
| 135
|
వ. |
అనినం గామమంజరీసముచితాలాపంబులకు సంతుష్టాంతరంగుండై హేమాంగదుండు విలాసవతిం దోడ్కొనిపోవుకౌతుకంబును దాని తల్లిదండ్రుల కెఱింగించి, వారల నుచితసత్కారంబులఁ బరితోషితులం జేసి యనంతరంబ.
| 136
|
క. |
రమణులు శిబికారోహణ
రమణీయత మెఱసి కొలిచి రాఁగా, ధరణీ
రమణుఁడు నిజపట్టణమున
కమరేంద్రాయుధము నెక్కి యరిగెం బ్రీతిన్.
| 137
|
క. |
అని యిట్లు దివియగంబము
జనవినుతరసప్రసంగసంగతరచనా
జనితకథామధుధారల
మనుజేంద్రుని చెవులఁ జవులు మరగించి తగన్.
| 138
|
క. |
వీరలలో సాహస మె
వ్వారిది? యనవుడు నృపాలవర్యుఁడు నగుచున్
వారసతీమణిసాహస
మౌరా యని మెచ్చవచ్చు, నని పల్కుటయున్.
| 139
|
సీ. |
మణిమయకర్లభూషణ రీచులతోడ
వెలఁదిచూపులమించు వియ్యమందఁ
జెక్కులమకరికాచిత్రరేఖలతోడఁ
జిఱునవ్వువెన్నెల చెలిమి సేయఁ
బయ్యెదకొంగుల బంగారుమెఱుఁగులఁ
జనుదోయితళుకులు చనువు మెఱయ
మంజరీకంకణమంజులధ్వనులతో
మేఖలారావంబు మేలమాడ
|
|
తే. |
ముసుఁగు దొలఁగించి తనులత మోద మడరఁ
బద్మమధ్యంబునం దున్నపద్మవోలె
హంసతూలికాతల్పంబునందునుండి
యాకళావతి మనుజనాయకునిఁ జూచి.
| 140
|
క. |
దివియగంబంబునకును
జీవము గల్పించి కథలు చెప్పింపంగాఁ
బ్రావీణ్యము గల్గియు నీ
వీవిధమునఁ దప్పఁ జెప్పు టిది నిపుణతయే.
| 141
|
క. |
తనపతిఁ గానక యెంతయు
మనికితవడి వచ్చి కామమంజరి చొరఁగా
గనికరమున నక్కాంతుం
డనలశిఖలలోనఁ జొచ్చె నవ్విధమునకున్.
| 142
|
క. |
కడుఁజోద్య మంది లంజియ
కుడిచినఋణ మెడల నగ్నికుండముఁ జొచ్చెం
|
|
|
గుడువక కట్టక బానిస
పడుటయు సాహసము గాక పార్థివముఖ్యా!
| 143
|
వ. |
అని పల్కి కళావతీనితంబిని కాదంబినీసమాక్రాంత యైనక్రొమ్మెఱుంగుతెఱంగునం గృతావకుంఠ యగుట యవలోకించి.
| 144
|
ఉ. |
అష్టమహావిభూతికలనాహవమంత్రజనానువర్తనా
దుష్టవిరోధిమంత్రిజనదుర్వహగర్వప్రమోదక ర్తనా
యిష్టఫలప్రదానదివిజేశ్వరధేనుసమానకీర్తనా
శిష్టజనప్రమోదకరజీవితవైదికధర్మవర్తనా.
| 145
|
క. |
కుకురు కురు చేర కేరళ
శక మరు కర్ణాట లాట సౌరాష్ట్ర మహీ
పకుమంత్రిజనమనీషా
నికషోపలనయకలాప నిగమాలాపా.
| 146
|
మందారదామము. |
శృంగారరేఖావిశేషస్వరూపా
రంగజ్జనానీకరక్షాదిలీపా
సంగీతసాహిత్యసారస్యలోలా
యంగీకృతాంగీకృతాచారశీలా.
| 147
|
గద్యము: |
ఇది శ్రీమదఖిలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కయనామధేయప్రణీతం బైనవిక్రమార్కచరిత్రంబను మహాకావ్యంబునందు షష్ఠాశ్వాసము.
|
|