శ్రీరస్తు
విక్రమార్కచరిత్రము
పంచమాశ్వాసము
|
శ్రీహరితగోత్రభూషణ
సాహసనవసాహసాంక సంగీతకళా
దోహళ సత్కవిసన్నుత
సాహిత్యరసప్రసంగ జన్నయసిద్దా.
| 1
|
వ. |
ఇవ్విధంబున ననంగవతీసమేతుండై యున్నయన్నరేంద్రుం డభినవసుఖంబు లనుభవించుచు నుండునంత.
| 2
|
సీ. |
రాజకీరకుమారరాజి కక్షరశిక్ష
యొనరింప వచ్చినయొజ్జ యనఁగఁ
గలకంఠనికురుంబకములకు వాకట్టు
విడిపింప వచ్చినవె జ్జనంగఁ
దరులతాదులకు వార్ధకము మానఁగ మందు
సేయంగ వచ్చినసిద్ధుఁ డనఁగ
సంప్రణయక్రోధజంపతినివహంబుఁ
గలుపవచ్చినచెలికాఁ డనంగ
|
|
తే. |
మందమారుతోద్ధూతమరందుబిందు
సిక్తషట్పదజ్యారవశ్రీవిలాస
మకరకేతుప్రతాపసమగ్రమై వ
సంత మేతెంచె సంతతోత్సవ మెలర్ప.
| 3
|
క. |
వలరాజుమూలబల మగు
నలిపికశుకములకుఁ జైత్రుఁ డభిమతభోజ్యం
|
|
|
బులఁ గూర్చె ననఁగఁ దరువుల
నలరులుఁ దలిరులును బండ్లు నక్కజ మయ్యెన్.
| 4
|
క. |
కిసలయకింజల్కరజః
ప్రసవశలాటుప్రభాపరంపర లెసకం
బెసఁగె మకరందవృష్టికిఁ
బొసఁగంగా నింద్రధనువు పొడమినభంగిన్.
| 5
|
మ. |
కనదంభోజముఖీనవీనముఖరాగవ్యాప్తిపూర్వంబు గా
ననునుల్లాసముఁ బొందె సంపెఁగలు, నానాకాననశ్రీవిలా
సిను లభ్యాగమవేళఁ జైత్రునకు నౌచిత్యంబు గావింప నె
త్తిననీరాజనదీపమాలిక లనన్ దేదీప్యమానంబులై.
| 6
|
చ. |
పరువపుఁబుష్పరేణువులపై మకరందపువెల్లిడొల్లి బం
ధురవనదుర్గమార్గ మతిదుస్తమమై చెలువొంద, నెందు న
చ్చెరువుగ మందమందగతిఁ జెందె మహాబలుఁ డయ్యుఁ జాల దు
స్తరమని కన్నెతావు లగు తావులవ్రేఁగున వాయు వామనిన్.
| 7
|
చ. |
విరహులఁ బట్టి తెచ్చి మనవీట భటావలి నెవ్వరైనఁ బూఁ
దరటులపాలు సేయమియ తప్పు సుఁడీ, యని చాటుచున్నశం
బరరిపుఘంటికారవముభంగిఁ జెలంగె నశోకతాడన
స్ఫురితవిలాసినీచరణభూషణఘోషణ మెల్లతోఁటలన్.
| 8
|
క. |
తిలకితవసంతలక్ష్మీ
తిలకములై నిరుపమానతేజోగరిమం
దిలకములు తరళనయనా
తిలకంబులు చూడఁ జూడఁ దిలకము లొప్పెన్.
| 9
|
క. |
కాముకులుఁ గామినులునుం
గామాతురు లగుట యరుదె? ఘనతరులతికా
స్తోమము ప్రేమము గైకొనె
నామని నబ్జజునకైన నలవియె పొగడన్.
| 10
|
సీ. |
కమలగర్భునిఁ బుత్త్రికాకాముఁ గావించి
కౌశికు వెలయాలి గవయఁ బనిచి
నిందిరావిభు గొల్లయిల్లాండ్రఁ దగిలించి
రజనీశు గురుసతిరతి కొనర్చి
రుద్రుని నర్ధపౌరుషునిఁగా నొనరించి
శుకునితాతకుఁ గామసుఖము నేర్పి
కులిశాయుధునిఁ బట్టి [1]కోడాట లాడించి
ఋష్యశృంగుతపస్సమృద్ధి మాన్పి
|
|
తే. |
విషమశరుసకు త్రైలోక్యవిజయ మొసఁగె
నిట్టిచరితంబు లెఱిఁగినయట్టినరులు
విజితకాముల మనుమాట విడువుఁడనుచుఁ
బల్కుగతిఁబల్కెఁ దోఁటలఁ జిల్కగములు.
| 11
|
వ. |
ఇత్తెఱంగునఁ జిత్తసంభవుసామ్రాజ్యలక్ష్మీనివాసం లైన మధుమాసంబు సకలజంతుజంపతిసంపాదితమనోవిలాసంబై భాసిల్లునంత నొక్కనాఁడు.
| 12
|
క. |
నరపతి యనంగవతితో
వరసతులు భజింపఁ ప్రమదవనమున కరిగెన్
సురసతులు గొల్వ శచితో
హరి నందనవనములోని కరిగినభంగిన్.
| 13
|
మ. |
అలరుందేనియ నర్ఘ్యపాద్యముల పర్యాయంబుతో నిచ్చి యిం
పులు మీఱన్ విరవాదిజాదివిరులం బుష్పాంజలుల్ చేసి యు
జ్జ్వలభృంగీనినదంబులం గుశలసంప్రశ్నంబు గావించి, భూ
తలనాథున్ భజియించె గంధవహుఁ డుద్యానాంతరాళంబునన్.
| 15
|
క. |
కాననవసంతలక్ష్మియొ
నా నుపవనపాలబాల నయవినయగతిం
గానుకతెచ్చినగుచ్ఛము
కానుక గావించె విభుఁడు కాంతామణికిన్.
| 17
|
ఉ. |
ఇచ్చిన నిచ్చలో నలరి యింతి, దరస్మితకాంతి చెక్కులం
దచ్చుపడం బ్రసన్నవదనాంబుజమై, వనపాలబాలికం
బొచ్చెము లేక రత్నమయభూషణభూషితఁ జేసి, దానితో
మచ్చిక మీఱఁగా మధురమంజులభాషల నల్ల నిట్లనున్.
| 18
|
సీ. |
ప్రోదిగాఁ బన్నీరుపోసి పెంచినకన్నె
సురపొన్న యున్నదే సుందరాంగి
పొలుపారఁ బచ్చకప్పురపుబాదున నిడ్డ
విరజాజి యున్నదే హరిణనయన
యెలమిఁ గస్తురిబూదియెరువునఁ బెరిఁగిన
సంపెఁగ యున్నదే చంద్రవదన
క్రొవ్వారుజవ్వాదికుదురునఁ బెరిఁగిన
చేమంతి యున్నదే కోమలాంగి
|
|
తే. |
సంతతంబును బూఁదేనె జాలువాఱఁ
గమ్మగందవుముద్దలఁ గట్టపెట్టి
కాలువలు దీర్చినపసిండికేళకూళి
నిండి తొలఁకాడుచున్నదే నీలవేణి.
| 19
|
వ. |
అనిన నయ్యనంగవతీమహాదేవికిం బ్రమదవనపాలబాలికాలలామం బిట్లనియె.
| 20
|
చ. |
జనవరవంశవారినిధిచంద్రుఁ డనం దగుచంద్రగుప్తనం
దనుకరుణాసుధారసమునం ద్రిజగంబులు పల్లవింపఁగాఁ
బనివడి ప్రోదిచేసి పెనుపం బెనుబొందినతోఁటలోనినూ
తనలతికావలీతరువితానమునొప్పులు చెప్ప నేటికిన్.
| 21
|
క. |
నావుడుఁ దదీయవచన
ప్రావీణ్యంబునను ధరణిపతి ప్రముదితుఁడై
యావైదర్భియుఁ దానును
గేవలలీలావనాంతకేళిరతుఁడై.
| 22
|
శా. |
లీలాశైలము లెక్కుచుం, దరుణవల్లీలాస్యముల్ చూచుచున్
ఢోలారోహణకేళిఁ దేలుచు, మదాటోపాలిగానధ్వని
శ్రీలాలించుచుఁ గీరభాషణములం జిత్తంబులన్ మెచ్చుచుం
గాలోన్మీలితపుష్పభూరుహతతిం గైసేయుచుం జూడ్కులన్.
| 23
|
సీ. |
మంజరీసంజాతమకరందమధుమత్త
చంచరీకద్వంద్వసంభ్రమములఁ
గోరకితానేకకోమలవల్లికా
వేల్లితభూజాతవిలసనముల
సహకారఫలరసాస్వాదనసంతుష్ట
[2]శుకసతీపతిరుతిప్రకటనములఁ
గిసలయాంకురరసగ్రసనసముత్కంఠ
కలకంఠవిటవిటీకలకలములఁ
|
|
తే. |
గనియు వినియు వసంతసంక్రాంతరాగ
సర్వసామాన్యమహిమ కాశ్చర్యమంది
చెలి కెఱింగించి కొనియాడి చెప్పి చెప్పి
ప్రమనవనకేలిఁ దేలిరి పతియి సతియు.
| 24
|
చ. |
అలరులు గోయుచోట నళు లాలనసౌరభ సూన మూఁగినం
గలఁగుట గాంచి కొప్పుపయిఁ గమ్మనిసంపెఁగదండ సేర్చి, తొ
య్యలి హృదయంబునందుఁ గుసుమాపచయవ్యసనంబు గ్రమ్మఱన్
మొలవఁగ జేసినన్, నృపతిముఖ్యునిఁ బ్రౌఢలు మెచ్చి రందఱున్.
| 25
|
సీ. |
అరవిరిపూదండ లఱుత నించెద నని
యనువునఁ జనుదోయి నంటి యంటి
పుప్పొడినెర సొయ్యఁ బోవ నూఁదెద నని
నయనచుంబనకేళి నడపి నడపి
చిప్పిలుపూఁదేనె జీరువాఱెడు నని
పాణిపద్మము గేలఁ బట్టి పట్టి
యలిమ్రోఁతలకు నింత యలుకంగ నే లని
చిక్కనికౌఁగిట జేర్చి చేర్చి
|
|
తే. |
నృపకులాగ్రణి మేలపునెపము గాఁగ
నలరుబంతిఁ గళాస్థాన మరసి యరసి
రమణి నిబ్భంగి బహుబాహ్యరతులఁ గలఁచి
సరవి సుఖములఁజాతుర్యసరణి మెఱసి.
| 23
|
ఉ. |
అందనిపుప్వుగుత్తిదెసకై యఱుసాఁపగ నేల బాల? కో
యం దలఁపయ్యెనేని నెగయ న్నిను నెత్తెద నంచు సంతసం
బందఁగ నెత్తియెత్తి విభుఁ డందఱిముందఱ డించుచుండగా
నందినకంటె సంతసము నందె లతాంగియు మాటిమాటికిన్.
| 27
|
చ. |
తనరునశోకభూరుహలతాముకుళంబుల నంతరాంతరం
బున నిడి, పొన్నక్రొన్ననల భూపతి మాలికగా నొనర్చి చూ
పిన, గరువంపుఁగెంపు లెడవెట్టిన మౌక్తికహారలీల నె
క్కొనఁజనుదోయిపై నునిచెఁ గోమలి లేనగ వంకురింపఁగన్.
| 28
|
సీ. |
పల్లవంబులయొప్పుఁ బరికించుఁ బరికించి
యబ్జాస్యకెమ్మోవి యానఁ దివురు
విరులగుత్తులమీంచు వినుతించు వినుతించి
కామినిచనుదోయి గదియఁ గోరుఁ
గీరభాషణములఁ గీర్తించుఁ గీర్తించి
యంగనసరసోక్తు లాస సేయు
నెలదీఁగెపడుదల నీక్షించు నీక్షించి
రమణిమైపొందు చిత్తమున నిల్పు
|
|
తే. |
నిత్తెఱంగునఁ జిత్తజాయత్తుఁ డగుచు
జెలువయును దాను బూసెజ్జఁ జేరుటయును
దరుణు లొండొరుఁగనుసన్నఁ దాల్చుకొనుచుఁ
జెలఁగి పుష్పాపచయకేలి చేసిరంత.
| 29
|
ఉ. |
ఆసురపొన్న నాకు నలువం దెడి వేగమె పువ్వులన్నియుం
గోసెద నన్నఁ గైకొనినకోమలిగర్వము సైఁప కాత్మలో
నీ సొదవంగఁ బెల్లు జనియింపఁగఁ జేసెబ్రసూనరాజి లీ
లాసరసత్వ మొప్పఁగ విలాసిని యోర్తు దరస్మితంబుచేన్.
| 30
|
క. |
సన్నపుఁబల్లవములు గని
కన్నియచనుమిట్ట లనుచుఁ గనుఁగొని ప్రౌఢుల్
మిన్నక యుల్లసమాడరె
కన్నెఱికము దొరఁగెఁ జెక్కుగఱచిన దనుచున్.
| 31
|
చ. |
తొలఁగి నికుంజపుంజములు దూఱుచు దాఁగురుమూఁత లాడుచుం
గెలఁకులఁ జొచ్చి నిల్చినసఖీజనము న్నవకంపుఁదీఁగెలం
దెలియఁగలేని ముగ్ధలకుఁ దెల్లమిగా నెఱిఁగించెఁ దత్సఖీ
సలలితరత్నభూషలవిశాలవిలోచనదీప్తిజాలముల్.
| 32
|
చ. |
బలువిడి ఫాలలోచనునిపైఁ బ్రసవాయుధుఁ డేగునప్పు, డీ
యళులును గోకిలంబులు శుకాలియు మందసమీరణంబుఁ గెం
దలిరులు వచ్చినం గడుఁ బ్రతాపసమగ్రుఁడు గాఁడె యంచుఁ జె
ల్వలు వనవైభవస్ఫురణ వర్ణన చేసిరి కేలి సల్పుచున్.
| 33
|
చ. |
అరవిరజాజిగుత్తి నరుణాధరదీధితిచే, నశోకమం
జరినిఘనస్తనప్రభలఁ జంపకగుచ్ఛము నీలకుంతల
స్ఫురణఁ దమాలకందళముఁ బోలఁగఁ జేయుచు, నొక్కప్రోడ య
చ్చెరువుగ నైంద్రజాలికవిశేషముఁ జూపు సఖీజనాలికిన్.
| 34
|
చ. |
అలరులతోఁటలోన విరులన్నియుఁ గోసితి రంచు బోటులన్
సొలయఁగ నేల? బాల యిటు చూడఁగదే తిలకావనీరుహం
|
|
|
బులదెస, ద్రవ్వితండములు పుష్పము లున్నవి యంచుఁ బ్రోడయై
పలుకువయస్య నేర్పుఁగలభాషిణులెల్లను మెచ్చి రిచ్చలన్.
| 35
|
వ. |
ఇత్తెఱంగున మత్తకాశిను లుత్తరంగితప్రమవవనవిహారం బొనరించి చాలించి.
| 36
|
చ. |
చెదరినకుంతలంబులును జక్కుల ఘర్మకణాంకురంబులన్
వదలినకేశపాశములు వాడిననిద్దపుమోముదమ్ములుం
బరనెరవైనవాతెఱలుఁ బైకొనునూర్పులు నుల్లసిల్లఁగాఁ
గదిసినయయ్యనంగవతి గాదిలిబోటులతోడ నిట్లనున్.
| 37
|
క. |
[3]అలఘుతరాంశుకజాలము
కలుగునె నభమందు ఘర్మకాలము చూడన్
జలకేలి యుచిత మనవుడు
నెలఁతుక కిట్లనిరి చెలులు నిపుణత మెఱయన్.
| 38
|
చ. |
లలితవళీతరంగరుచులం దరలేక్షణ మీనలోచనాం
చలవదనాంబుజద్యుతి లసత్కుచచక్రవిలాసరేఖ నే
ర్పలరెడునీతనూసరసియందు నిరంతరమున్ విహారమున్
సలిపెడురాజహంసునకు సైఁచునె తక్కినపద్మినీరతుల్.
| 39
|
ఉ. |
నావుడు నాననాంబుజమున్ దరహాసము తొంగలింప ధా
త్రీవరముఖ్యుఁ డామదవతీతతి కిట్లను, నింతయేల? యే
నీజనజాక్షియాజ్ఞ యొకయించుక యైనను మీఱువాఁడనే
సేవకు లైనవారికి విశృంఖలవృత్తిఁ జరింపఁగూడునే.
| 40
|
క. |
అని సరసవచనరచనల
దనప్రియసతి నలరఁజేసి ధరణీశ్వరుఁ డా
వనితారత్నముఁ దానును
వనజాక్షులు గొలువ వనజవనమున కేఁగెన్.
| 41
|
ఆ. |
అంత నెదురువచ్చి యరవిందమకరంద
కలితసౌరభములు [4]గానుకిచ్చి
యబ్జినీసమీరుఁ డమర యధోచిత
స్థితి నరేంద్రు మనసు చెలఁగఁజేసె.
| 42
|
మ. |
భువనాధీశ్వరుదర్శనోత్సవసుఖంబుం బొంది యానంద తాం
డవముం జూపెడుభంగి నాకమలషండం బొప్పె భృంగాంగనా
రవగానంబులతో సరోజదళనేత్రశ్రీవిలాసంబుతో
నవచిత్రాభినయోర్మిహస్తఘటనానానావిలాసంబుతోన్.
| 43
|
ఉ. |
ఆకమలాకరంబున విహారము సల్పగ నుత్సహించి, శో
భాకరనూత్నరత్నసముదంచితకాంచనదివ్యభూషణా
నీకములం దొలంగ నిడి, నీరజలోచన లొప్పి రోలిఁ గా
రాకుల నుజ్జగించి చెలువారెడుమవ్వపుఁదీఁగెలో యనన్.
| 44
|
ఉ. |
ఆనెలఁతల్ సరోజినికినై దిగునప్పుడు, నూత్నరత్నసౌ
పానములం దదీయతనుబంధురబింబము లుల్లసిల్లెఁ దే
జోనిధి యైనయానృపతిసోయగమున్ దరిసించువేడుకం
బూని జలాధిదేవత లపూర్వగతిం జనుదెంచిరో యనన్.
| 45
|
సీ. |
ఉవిద లందఱుఁ గూడి యొక్కర్తుఁ జెలరేఁగి
కరయంత్రధారలఁ గప్పికప్పి
జలములో మునిఁగినసఖులయిక్క లెఱింగి
సలిలంబులోఁ గేలి సలిపి సలిపి
పంచపట్టుల నిల్చి పడఁతు లొండొరులతో
నలవునఁ జలుఁబోరాడి యాడి
సలిలకేలికి నోడి చను భీరువును బట్టి
జలజపరాగంబు చల్లిచల్లి
|
|
తే. |
యొనర నొండొరుభుజము చేనూఁది యూఁది
సరసగతులను జెలఁగి మత్సరము లోర్చి
|
|
|
కినిసి తొడరినయింతుల గెలిచి గెలిచి
జలవిహారము సలిపిరి సంతసమున.
| 46
|
చ. |
మృగమదపంకిలాంగు లొకమే, నొకమే ఘనసారచందన
స్థగితలు నైనకామినులు, సాటిగ నొండొరుఁ జల్లియాడుచో
సగమున నల్పు దెల్పు లగు చాయలు సెందఁ గళిందకన్యకా
గగననదీసమాగమముకైవడిఁ బద్మిని యొప్పె నత్తఱిన్.
| 47
|
చ. |
నెలఁతలు కంఠదఘ్న మగునీర విహార మొనర్ప నిల్చినం
గొలను తదాననస్ఫురణఁ గ్రొత్తమెఱుంగు వహించెఁ బెక్కుత్రి
ప్పులఁబడి యొక్కచంద్రుని నపూర్వముగాఁ గను టెంత యంచు నా
జలనిధి నెంచి, లీల బహుచంద్రులఁ దా నొనరించెనో యనన్.
| 48
|
క. |
చందనము సలిలకేలిని
బొందెడలిన యొక్కయింతి, ప్రోడతనమునం
గందర్పముద్ర లుండెడు
కందువలకు మాటుసేసెఁ గచనిచయంబున్.
| 49
|
ఆ. |
సలిలకేళి సల్పుచామలమోములు
కమలసమితి యనుచుఁ గదిసి యలులు
కురులసిరులు చూచి కొన్ని తేఁటులు మున్ను
మూఁగి యున్నవనుచు మొగినిజనియె.
| 50
|
తే. |
ఆననాంబుజసౌరభ మానునలులఁ
జోపనేరక సఖులలోఁ జొచ్చి నీట
మునిఁగి యవి వారిమోముల ముసురుకొనిన
నవ్వుచును లేచి యొక్కతె నవ్వుచుండె.
| 51
|
ఉ. |
అంత మహీవిభుండును బ్రియాంగనయున్ స్వకరావలంబనా
నంతసుఖానురక్తులయి యబ్జిని డిగ్గఁగఁ దత్కరంబు ల
త్యంతము రోమహర్షణసమగ్రత గైకొని నాథుదండ వి
క్రాంతి సరోరుహద్వయవికాసవిలాసముఁ బూనె నత్తఱిన్.
| 52
|
ఆ. |
జలముమీఁద నీఁదుసర్వంసహాకాంత
కెలమి మూఁపుఁదెప్ప యిచ్చినట్లు
జలముమీఁద నీఁదుజలజాతనేత్రకు
నెలమి మూఁపుఁదెప్ప యిచ్చె విభుఁడు.
| 53
|
చ. |
బిసములపేరులున్ సలిలబిందులకర్ణికలుం జెలంగఁగాఁ
బసిమి మెఱుంగుగాఁగ నవపద్మపరాగము చెందిరంబుగా
లసితపరాగకేసరకలాపసమగ్రత చిన్నపువ్వుగాఁ
బొసఁగ నమర్చి, నూతనవిభూషణఁ జేసెఁ బ్రియుండు ప్రేయసిన్.
| 54
|
చ. |
కరమనురక్తి భూవిభుఁడు కంజదళాయతచారునేత్రపై
బొరిఁబొరిఁ జల్లునీట మయిపూఁత గరంగినఁ జన్నుదోయిపై
నరుదుగఁ గామముద్రలు బయల్ పడకుండఁగఁ గప్పె ధారణీ
శ్వరకరనిర్గళత్సలిలసాంద్రసరోజసమాజపత్త్రముల్.
| 55
|
చ. |
అరవిరిదమ్మిఱేకుల నయంబున మైఁ గబళించి యొండొరుల్
సరిపడఁ జల్లులాడునెడఁ జంద్రనిభానన లెల్లఁ జల్లు బా
స్వరశతపత్త్రజాతములు చాల శరీరముఁ బొందిన, న్మనో
హరరుచిఁ బూనె భూపతి సహస్రవిలోచనుఁ గ్రేణిసేయుచున్.
| 56
|
శా. |
రాజేంద్రుండు విదర్భరాజతనయారత్నంబుఁ బెన్నుద్దులై
రాజీవాక్షుల నుద్దులుంచుకొని నీరం జల్లుఁబోరాడుచో,
రాజీవాకర మొప్పె వాసవశచీరంభాదిదివ్యాంగనా
రాజత్ఖేలన ఘూర్ణమానఖధునీప్రాకామ్యముం బూనుచున్.
| 57
|
సీ. |
రాజుపంపున నొక్కరామ వైదర్భిపైఁ
గరయంత్రధారోదకంబు గురిసె
నద్దేవికనుసన్న ముద్దియయొక్కర్తు
జననాథుపై నించెఁ జల్లునీరు
|
|
|
రమణునియానతి రమణి డగ్గఱి యోర్తు
తమ్మిపుప్పొడిఁ దాను నెమ్మిఁ జల్లె
నయ్యనంగవతీకరాబ్జసంజ్ఞ నొకర్తు
కువలయాధిపు వైచెఁ గువలయముల
|
|
తే. |
వరుఁడు నీలోత్పలంబుల వైవ ననతి
హల్లకంబుల వైచెఁ దా నాత్మవిభునిఁ
గాంతలును దాను నిబ్భంగి గలసి మెలసి
వనజవనకేళి యొనరించి తనివిఁ బొంది.
| 59
|
క. |
శ్రీరమణీమణిఁ గైకొని
క్షీరాంబుధి వెడలుగరుడకేతనుభంగిన్
నీరజలోచనఁ దోకొని
నీరజషండంబు వెడలె నృపవరుఁ డంతన్.
| 60
|
సీ. |
ఆళికభాగంబున నంటినకురులతోఁ
గరఁగినయంగరాగములతోడ
నరుణిమ వాసినయధరబింబముతోడ
దీపించుమదనముద్రికలతోడ
దళ మైనమవ్వంపుఁబులకాంకురములతో
జూపుల నునుఁగెంపు సొబగుతోడఁ
జెదరినమకరికాచిత్రపత్త్రికలతో
బరఁగెడునూర్పుఁదెమ్మెరలతోడఁ
|
|
తే. |
దొడల బెడఁగారునునువల్వతోడ నపుడు
రతిక[5]ళాసించివచ్చినరమణ మెఱయఁ
గొలను వెలువడి వచ్చి రాజలజముఖులు
వసుమతీనాయకానంగవతుల బలసి.
| 61
|
క. |
చీనాంబరమణిభూషణ
నానాగంధానులేపనవమాల్యములన్
|
|
|
మానినులును వైదర్భియు
మానుగఁ గైసేసికొనిరి మచ్చరికములన్.
| 62
|
చ. |
అనుపమరత్నభూషణసమంచితవస్త్రములన్ సుగంధచం
దనవికచప్రసూనములఁ దద్దయు నేర్పలరం బ్రసాధికా
జనము లలంకరించినఁ బ్రసన్నవిలాసవిభాసమానుఁడై
మనుజవరేణ్యుఁ డొప్పె శివుమన్ననఁ గన్న రతీశుఁడో యనన్.
| 63
|
క. |
సమయజ్ఞతఁ బొడసూపిన
సముచితపరివారవందిజనబృందములుం
బ్రమదలుఁ గొలువఁగ భూపతి
ప్రమదముతో నరిగె నాత్మభవనంబునకున్.
| 64
|
వ. |
ఇత్తెఱంగున నవీనచిత్తానందంబున విదర్భరాజతనయాలీలాలాలనంబునఁ జతురుదధివలయవలయితవసుమతీపరిపాలనంబు ఖేలనంబుగాఁ బ్రవర్తిల్లుచు నుల్లసిల్ల సకలమనీషావిశేషపరిగ్రహణచాతురీధురంధరుండై యవ్వసుంధరాధిపసింధురుండు సర్వేశ్వరీప్రసాదాసాదితసామ్రాజ్యనియమితవత్సరసహస్రద్విగుణీకరణపరిణతం బగుసుమతిసుతునిమతంబునం బ్రతివత్సరంబు నాఱేసినెల లన్యదేశపర్యటనం బనుసంధించుతలంపున యోగీశ్వరవేషధరుండై దివ్యపాదుకాపాదితస్వైరసంచారంబువలనను యోగదండప్రకాండప్రకల్పనానల్పనానానగరకల్పనావిహారంబువలనను విచిత్రమణిపాత్రికాసంజాతసరసాన్నసముచితాభ్యవహారంబువలనను దుకూలకంథానిష్క్రాంతనిష్కావళీకృతపరోపకారంబువలనను విచిత్రంబులగు మానుషచరిత్రంబులం బ్రవర్తిల్లినప్పుడు.
| 65
|
యోగిరూపంబున విక్రమార్కుఁడు పరదేశములఁ బర్యటించుట
సీ. |
స్తంభనమోహనోచ్చాటనాకర్షణ
మారణోద్వేజనోన్మాననములు
వాదవయస్స్తంభవశ్యపురశోభ
గజకరుణాదృశ్యకరణములును
బశుపక్షిమృగముఖ్యబహురూపధారణా
విధి పరకాయప్రవేశములును
|
|
|
నిర్వాంజన మహేంద్రజాల మాయోపాయ
మణి మంత్ర తంత్ర సామర్థ్యములును
|
|
తే. |
ద్వీప దుర్గాది దుర్గ ప్రదీపములు
నమృతకర భాస్కరోదయవ్యత్యయములు
సకలజంతుభాషాపరిజ్ఞానములును
నాదిగాఁగలవిద్యల నతిశయిల్లి.
| 66
|
క. |
ఒక్కొకమరి తనయంతన
యొక్కొకమరి సుమతిసూతియుం దానునునై
యెక్కడ నభిమత మైనను
నక్కడ విహరించుచుండు నాఱేసినెలల్.
| 67
|
చారుఁడు విక్రమార్కునకు చిత్రకూటమునందలి వింతలు చెప్పుట
తే. |
అంత నొకనాఁడు లోకవృత్తాంత మరసి
యరుగుదెంచినవారలయందు నొకఁడు
తాను గనినట్టిచోద్యంబు ధరణిపతికి
వినయ మొసఁగంగ నిట్లని విన్నవించె.
| 68
|
క. |
దేవరపనుపున నేఁ జని
భూవలయము దిరిగి యొక యపూర్వము గంటిం
భావనగతిఁ బ్రవహించును
దైవతనది చిత్రకూటధరశృంగమునన్.
| 69
|
తే. |
సజ్జనంబులు సద్భక్తిమజ్జనములు
సేయ నన్నీరు పన్నీరుచెలువు నొందు
సుకృతహీనులతనువులు సోఁకెనేని
కజ్జలముభావమున నొందుఁ దజ్జలంబు.
| 70
|
ఆ. |
అన్నగంబుపొంతఁ బన్నగాభరణుని
నిలయ మొప్పు వప్రవలయ మొప్పు
గోపురంబుతోడ నేపున రాపాడు
గోపురంబుతోడఁ గొమరుమిగిలి.
| 71
|
తే. |
తత్సమీపకాననభూమిఁ దపసి యొకఁడు
కలఁడు మౌనివ్రతుండు నాఁగణఁక మెఱసి
వెదలుసల్లినభస్మంబు వెండికొండ
బోలె నప్రమాణోన్నతిఁ బొలుపుమిగిలె.
| 72
|
తే. |
ఎంతకాలంబు గలదొ మున్నింక నెంత
కాల మొనరింపఁగలవాడొ కణఁగి యిపుడు
సలుపుచున్నాఁడు హోమంబు చలముపట్టి
యతనికోరిక లెవ్వరు నరయ రధిప.
| 73
|
చ. |
అన విని విక్రమార్కవిభుఁ డప్పుడు చారుఁడు మున్నుగాఁగ వే
చని కనియెన్ సమాధిగతసంయమిరత్నవినూత్నపేటమున్
ఘనమదహస్తిహస్తపరికంపితసానుగతాగవాటముం
గనదురురత్నవచ్ఛిఖరకమ్రకిరీటముఁ జిత్రకూటమున్.
| 74
|
కాళికను మెప్పించి విక్రమార్కుఁడు మునికి వరము లిప్పించుట
క. |
కని తద్గిరివిశ్రుతవా
రి నియతి సుస్నానము నొనరించి మహాదే
వునిగుడి కరిగి వినతుఁడై
చనె హోమనివాసమునకు సమ్మతితోడన్.
| 75
|
క. |
చని యమ్మునివరు నడిగిన
ననుపమమగుమౌన ముడిగి యతఁ డిట్లని చె
ప్పెను బెద్దగాలమును నే
నొనరించెద నుమగుఱించి హోమం బనఘా.
| 76
|
క. |
నాకోర్కి యొసఁగ దిప్పుడు
నాకోరిక యొసఁగుదనుక నడుపుదు హోమం
బీకరణిఁ బ్రతిదినంబును
జేకొని మధుసిక్తమైనశ్రీఫలసమితిన్.
| 77
|
ఆ. |
అనిన సాహసాంకుఁ డంబిక నెట్లేక
ప్రముదితాత్మఁ జేయఁ బ్రతినవట్టి
|
|
|
మధునిషిక్తమైన మాలూరసత్ఫల
వితతిఁ దాను నట్ల వేల్వఁ దొణఁగె.
| 78
|
క. |
అత్యంతనియతి వేల్చినఁ
బ్రత్యక్షము గాక యున్నఁ బార్థివుఁడు శిరం
బత్యాశ్చర్యముగాఁ గొని
ప్రత్యయమతి వేల్చి వరము వడయుదు ననుచున్.
| 79
|
చ. |
అడిదము కేలఁ బూని మెడయుం దొడఁగూర్చిన, దేవి వచ్చి య
ప్పుడ వెసఁ జేత నున్నయసి పుచ్చి మదిం గడు మెచ్చి; యేవరం
బడిగిన నిత్తు నీ వడుగు మన్నఁ గరంబులు మోడ్చి భక్తి యే
ర్పడఁ బ్రణమిల్లి యిట్లనియెఁ బార్థిపుఁ డాజగదేకమాతతోన్.
| 80
|
క. |
వర మీవచ్చితి నా కిటు
పరమేశ్వరి నిమిషమాత్రఁ బ్రత్యక్షంబై
వర మొసఁగవు పొడసూపవు
చిరకాలం బితఁడు తపము సేయుచునుండన్.
| 81
|
తే. |
ఏమికారణ మానతి యిమ్ము నాకు
ననిన నంబిక యిట్లను నతనితోడ
నేకభావంబు నాపయి నింతలేదు
జపవిధాన మెఱుంగక జప మొనర్చు.
| 82
|
క. |
మనసొండైన జపంబును
మునివ్రేళ్లనె యెన్నుజపము మునుమేరవిలం
ఘన మొనరించుజపంబును
మునుకొని లెక్కిడనిజపము ముఖ్యం బగునే?
| 83
|
క. |
దేవుండు లేమి కలిమియు
భావింపఁగరాదు కనకపాషాణములన్
|
|
|
భావమున నునికి సిద్ధము
గావున భావంబు ప్రథమకారణ మనఘా!
| 85
|
క. |
చిత్తంబు పాపసహితం
బెత్తెఱఁగున నిత్తు నితని కీప్సితఫలముల్
రిత్తకు రిత్త ఫలించునె
యుత్తమఫలసిద్ధి భావ మొందని క్రియలన్?
| 86
|
క. |
నీసాహసనియతికి వి
శ్వాసమునకు నిచ్చ మెచ్చి వర మిచ్చెద, నీ
వాసక్తి నెద్ది వేఁడినఁ
జేసెద నిష్టార్థసిద్ది చేసెద నీకున్.
| 87
|
వ. |
అనినం బరమదయాలవాలుండును విశిష్టధర్మశీలుండును నైన విక్రమార్కమహిపాలుం డద్దేవి నుద్దేశించి యిట్లనియె.
| 88
|
ఉ. |
ఈముని యింతకాలమును నిట్టితపం బొనరించుచున్న వాఁ
డేమివరంబు గోరియొ మహేశ్వరి యవ్వర మిమ్మహీసుర
గ్రామణి కిమ్ము, నా కిది వరం బని వేఁడిన నట్ల చేసి యా
భూవిభు వీడుకొల్పి, గిరిపుత్త్రి యదృశ్యత నొందె నత్తఱిన్.
| 89
|
ఆ. |
ఇట్టిసాహసంబు నిట్టియౌదార్యంబు
గలుగకున్నఁ గలదె గరిమ యనుచుఁ
బ్రజలు ప్రస్తుతింప నిజరాజధానికి
నుచితలీల నరిగి యొక్కనాఁడు.
| 90
|
చ. |
చిరతరకీర్తి యానృపతిశేఖరుఁ డంచితభక్తియుక్తితో
వరరుచిఁ జూచి యిట్లనియె, వైదికలౌకికధర్మవైభవా
కరుఁడవు, సర్వతోముఖమఖప్రముఖంబు లనేకయాగముల్
వరుస నొనర్చితీ, వుభయవంశములున్ నుతికెక్కునట్టుగన్.
| 91
|
విక్రమార్కుం డశ్వమేధము నొనరించుట
క. |
మనుజాధీశకులోచిత
మనఁబరఁగిన యశ్వమేధయాగం, బది నే
నొనరించెదఁ దదుపక్రమ
మనఘా యెఱిఁగింపు మనిన నతఁ డిట్లనియెన్.
| 92
|
సీ. |
కాంచనమయములుగా స్రుక్స్రువాదిక
యజ్ఞసాధనముల నలవరించి
సకలభవ్యద్రవ్యసంపాదనమునకు
హితుల నియోగింపు మతులగతుల
శాస్త్రోక్తమతమున సంఘటింపఁగఁ బంపు
మతిపవిత్రస్థలి యజ్ఞశాల
షట్కర్మనిర్వాహచాతురీఖని యైన
యాజ్జికుచేత ననుజ్ఞ వడయు
|
|
తే. |
మర్హలక్షణసంపన్న మైనహయము
భూప్రదక్షిణసంచారమునకుఁ బంపు
భట్టిఁ దద్రక్షణమునకుఁ బాలుపఱుపు
వలయురాజుల మునులను పిలువఁ బనుపు.
| 93
|
వ. |
మఱియు వలయు నుచితకరణీయంబులకుఁ దత్తద్విధిజ్ఞుల నాజ్ఞాపింపుమని పనిచినం దదనుజ్ఞాపూర్వకంబుగా సర్వంబునకుఁ నిర్వాహకుల నియమించి యజ్ఞయజనదివసంబు భావించి చైత్రపూర్ణమాసిగా నిర్ణయించి దీక్షితుండై సుపరీక్షితం బైనయుత్తమాశ్వంబునకు నుచితోపచారంబు లొనరించి దిగంతంబుల సంచారపూతంబులుగా ననుగ్రహించి చనుదెమ్మని ప్రార్థించి యాంగికంబు లైనశుభసూచకంబు లంగీకరించి ప్రమోదాంతరంగుండై భట్టి నవలోకించి.
| 84
|
చ. |
హితుఁడవు కార్యఖడ్గముల కెంతయు మేటివి సర్వశాస్త్రస
న్మతచరితుండ వార్యుఁడ వమానుషకీర్తివి, నాకు శోభనా
న్విత మగుచారుకీర్తు లొదవింపఁగఁ గర్తవు నీవె, యంచుఁ ద
త్క్రతుహయరక్షకుం బనిచెఁ గర్మవిధేయుని సౌమతేయునిన్.
| 85
|
చ. |
పనిచిన సర్వసన్నహనబంధురుఁడై చనుదెంచి, యాతఁ డ
జ్జనపతికి న్నమస్కృతి ప్రసన్నతమై నొనరించి నిల్చి, యా
జనచరితార్థవిప్రవరసంఘముతోడఁ దదేకనిష్ఠమై
వెనుచన, నాహయంబు పృథివీవలయభ్రమణాభిలాషియై.
| 96
|
వ. |
నిర్గమించినకతిపయదివసంబులకు సుమతిసుతసమీపంబుననుండి యొక్కజంఘాలుండు చనుదెంచి పురోపకంఠలీలావనభూమియందు సబలంబుగ నిల్చి భవత్ప్రధానుండున్నవాఁ డుర్వీశ్వరాతత్పరాక్రమధురీణత చెప్పం జిత్రం బని యిట్లనియె.
| 97
|
సీ. |
సౌవీరభూపతి శరణుజొచ్చినఁ గాచె
గాంధారరాజుచేఁ గప్పమందెఁ
గుంతలాధిపుకూర్మికూఁతులఁ గొనివచ్చె
సౌరాష్ట్రవిభునిచేఁ బేరుకొనియెఁ
బాంచాలభూపాలుఁ బ్రతిరోపితునిఁ జేసెఁ
గేరళాధిపుసూను గిఱవువట్టె
యవనక్షమానాథు నాజ్ఞావశునిఁ జేసె
నంగక్షితీశున కభయమిచ్చె
|
|
తే. |
జయము గైకొన్నపిదప నాసకలనృపుల
నుచితసంభాషణములచే నూఱడించి
యజ్ఞవేళకు రమ్మని యానతిచ్చి
నిగ్రహానుగ్రహాక్రియానిపుణుఁ డగుచు.
| 98
|
చ. |
ధనదదిశామహేశ్వరవితానముచేత నుపాయనంబుగాఁ
గొనినవినూత్నరత్నఘనకుంజరఘోటకవారకామినీ
జనకనకాంబరాదుల నసంఖ్యములం గొనివచ్చినాఁడు, పెం
పెనయఁగ నన్యభూపతుల కిట్టిప్రధానులు గల్గ నేర్తురే!
| 99
|
సీ. |
సవనాశ్వరక్షకై సగరనందను లేఁగి
కపిలుకోపంబుచే గాసియైరి
|
|
|
క్రతుహయమనరక్షకర్తయై సౌమిత్త్రి
కుశునిచేఁ దమ్ముని గోలుపడియె
యజనాశ్వరక్షకుం డయి దిలీపసుతుండు
వాసవుకుటిలత మోసపోయెఁ
బార్థుఁ డధ్వరహరి పరిపాలనము సేయఁ
జని తనూజునిచేతఁ జచ్చిపుట్టె
|
|
తే. |
నరసిచూడంగ నొరులు నిరంతరాయ
సప్తతంతుతురంగసంచరణకరణ
బహుళతరకార్యలంపటబాహుళక్తి
భట్టిఁ బోలంగ నేర్తురే? పార్థివేంద్ర!
| 100
|
తే. |
అనిన రోమాంచకంచుకితాంగుఁ డగుచు
నెమ్మనంబునఁ బ్రమదంబు నివ్వటిల్లఁ
గనకమణిభూషణాదులు గట్టనిచ్చి
జాంఘికునిపైఁ గటాక్షవీక్షణము నిగుడ.
| 101
|
ఉ. |
అమ్మఱునాఁడు దంతితురగాదిసమస్తవరూధినీవితా
నమ్ము భజింపఁగా, మనుజునాథవరుం డెదురేఁగెఁ బేర్మి, నె
య్యమ్ము మనమ్మునం బెరుఁగ నాసుమతిప్రియకారికిన్ జగ
త్సమ్మతసర్వలక్షణసుసమ్మతమేధ్యహయానుపాలికిన్.
| 102
|
వ. |
భట్టియు సాహసాంకుని పాదంబులకు భక్తియుక్తంబుగాఁ బ్రణమిల్లి మఱియుం దగువారలకెల్లను సముచితోపచారంబులు నడపి తదనంతరంబ.
| 103
|
క. |
పురజను లెల్లను బ్రమద
స్ఫురణంబున సేస లొలుకుచుం దనుఁ జూడం
దురగానుచరణనియమా
చరణుండై యతఁడు యజ్ఞశాలకుఁ జనియెన్.
| 101
|
క. |
చని జనపతి తనకూర్చిన
జనవినుతమఖోపకరణసామగ్రి ప్రియం
బున వేఱువేఱ చూపఁగ
ననురాగముఁ బొంది భట్టి యద్భుతమతియై.
| 105
|
వ. |
అంత మధుమాసపూర్ణమాసి యాసన్నం బగుటయు.
| 106
|
క. |
తమలో నొండొరు మెచ్చక
సమధికవైభవసమగ్రసామ్రాజ్యరమా
రమణీయు లగుచు వచ్చిరి
సమధికశృంగారు లైనజగతీనాథుల్.
| 107
|
ఉ. |
వారలకెల్ల నమ్మనుజవల్లభుఁ డాసనపాద్య ముఖ్యస
త్కారములన్ సముజ్జ్వలదగారములన్ రసవచ్చతుర్విధా
హారములన్ రయం బొసఁగునట్టులుగా నియమించె విశ్వధా
త్రీరమణీశవర్ణితమతిం దనమామ విదర్భభూపతిన్.
| 108
|
క. |
పరమజ్ఞాననిరూఢులుఁ
బరమతపోవర్థితప్రభావులు నగు భూ
సురముఖ్యులు మునిముఖ్యులు
నరుదెంచిరి యజనదర్శనాపేక్షితులై.
| 109
|
క. |
పరమాదరమున వారల
తరతమభావంబు లెఱిఁగి తగఁ బూజింపన్
వరరుచిమాతామహునిం
బరహితమతి విష్ణుశర్మఁ బ్రార్థన చేసెన్.
| 110
|
వ. |
మఱియుఁ బ్రతివాసరసమాగతులైనవారికెల్ల నుల్లంబులు పల్లవింప నుచితోపచారంబు లొనరించుచు, నొక్కనాఁడు సకలసేనాధీశ్వరసంయమీశ్వరమంత్రిసామంతపురోహితపరివృతుండై పేరోలగం బున్నయవసరంబునం, దదీయప్రాణబంధువయిన సుధాసింధువుం బిలువంబోయిన
|
|
|
హితామాత్యుం డగుమహీసురోత్తముండు చనుదెంచి యన్నరేంద్రున కిట్లనియె.
| 111
|
చ. |
నరవర యేను మీపనుపునం జని కంటిఁ బయోనిధానముం
దరళతరంగతుంగకరతాడనజాతనవీనఫేనముం
గరిమకరోగ్రతుండశతఖండితశశ్వదహీనమీనమున్
ఖరకరబాడబానలశిఖాతతిదీధితిదిగ్వితానమున్.
| 112
|
సీ. |
లక్ష్మీసముత్పత్తి లావణ్యసంపత్తి
గోత్రరక్షణవృత్తిఁ గొమరుమిగిలి
కవిరంజనాసక్తి ఘనరసోదయయుక్తిఁ
బూర్వాపరవ్యక్తిఁ బొలుపు మిగిలి
పటుసత్త్వవిస్ఫూర్తి బంధురతరకీర్తి
గంభీరతాపూర్తి గరిమ కెక్కి
వాహినీశఖ్యాతి వరరత్నమయభూతిఁ
బురుషోత్తమప్రీతిఁ బొగడువడసి
|
|
తే. |
త్రిజగదానందకరకళాదీప్యమాన
రాజసందర్శనోత్సవరసనిరూఢి
నతిశయిల్లెడు నీకు నయ్యంబునిధికి
మహితసద్గుణసమితమై మైత్త్రియొనరు.
| 113
|
వ. |
ఈదృశాభిరామగుణరత్నాకరుండైన రత్నాకరుండు భవదశ్వమేధయజనారంభంబునకుం బ్రియం బంది నన్ను సముచితసత్కారంబులం దనిపి యీదివ్యమణిచతుష్టయంబు నాకుం జూపి యిట్లనియె.
| 114
|
సీ. |
ఇది యధ్వరమునకు నిష్టాన్నపానాదు
లవ్వారిగా నిచ్చు నద్భుతముగ
నిది యాగరక్షకు మదదంతిహయముఖ
చతురంగబలముల సంఘటించు
నిది యజ్ఞదక్షిణ పొదలించునట్లుగా
నప్రమేయధనంబు లావహించు
|
|
|
నిది మఖాగతులకు నీఁదగియెడు నూత్న
బహురత్నభూషణాంబరము లొసఁగు
|
|
తే. |
ననుచు నీనాల్గుమణులను నంబురాశి
పావడంబుగ నాచేతఁ బనిచె మీకుఁ
దానువచ్చినయట్లుగాఁ దలఁపు మనుచు
విన్నపము సేయుమనుచును వేడ్కతోడ.
| 115
|
క. |
అని పురుషార్థచతుష్టయ
మన నొప్పెడు మణిచతుష్టయము నిచ్చుటయున్
మనుజాధిపుఁ డావిప్రుని
గనుగొని యిట్లనియె వినయగౌరవ మెసఁగన్.
| 116
|
ఉ. |
అప్రతిమానలీల నొకయాగము నీవును నాచరింపు లో
ప్రథమానకీర్తి యెసకంబుగఁ గైకొనుమంచు నిచ్చె న
వ్విప్రకులాగ్రగణ్యునకు విశ్రుతపుణ్యునకుం గృపావిశే
షప్రతిపత్తితో నమృతసాగరదత్తవినూత్నరత్నముల్.
| 117
|
క. |
ఇచ్చిన మునులును నృపతులు
నిచ్చలఁ గడు మెచ్చి మెచ్చి యీయౌదార్యం
బెచ్చటను వినఁగఁజూడఁగ
నచ్చెరు వని ప్రస్తుతించి రాసమయమునన్.
| 118
|
వ. |
ఆనవరదాహూయమానాగ్నిభట్టారకుండైన వరరుచిభట్టారకుండు చనుదెంచి యజనవాసరం బాసన్నం బగుటయుఁ బ్రసంగించి శకాంతకునకు నిట్లనియె.
| 119
|
|
సీ. మున్ను నీభండారమున నున్న బహురత్న
కాంచనావళు లసంఖ్యములు గలవు
సతతంబుఁ గంధానుసంధీయమానంబు
లగుమాడలు గణింప నలవి గాదు
నృపులచే భట్టి కానికలు దెచ్చినసొమ్ము
కొలఁది యెవ్వరికి వాక్రువ్వ రాదు
|
|
|
తగనేత్రములను జింతామణి చేతులఁ
బరుసవేదియు నుండు సిరులఁ బెనుప
|
|
తే. |
నీవు జగదేకదానదీక్షావిధాన
గురుఁడ వటుగాన వేదోక్తసరణికంటెఁ
బదిమణుంగులు దక్షిణ లొదవ నిచ్చి
మేదినీనాథ దాశాశ్వమేధివగుము.
| 120
|
ఆ. |
అన్న యన్నపలుకులన్నియు గురుమంత్ర
సరణి నాత్మ నునిచి సాహసాంక
మనుజనాయకుండు మఱునాఁటిపున్నమ
జన్నమునకు దొణఁగె సముచితముగ.
| 121
|
ఆ. |
అమరగురుసమాను లైనయాజ్ఞికముఖ్యు
లఖిలసత్క్రియలును నాచరింప
నవభృథంబు సొరక యంకురితంబునై
యతిశయిల్లె నమ్మహాధ్వరంబు.
| 122
|
క. |
అనలుఁడు ప్రవర్గ్యవేళను
ఘనదీప్తులతోడ నూర్థ్వగతిఁ గనుపట్టెన్
మనుజేశ్వరునధ్వరమున
దనహృదయం బలర మిన్నుదాఁకినభంగిన్.
| 123
|
సీ. |
అమృతోపమానంబు లైనయన్నంబులు
కడిమాడసేయంగఁ గుడుచువారు
బహుధనధాన్యసంపదలసొంపు వహించి
పేదర్మికిని బొమ్మవెట్టువారు
వరరత్నభూషణాంబరసమగ్రత మించి
ప్రీతిఁ బ్రొద్దొకవన్నె పెట్టువారు
నాచంద్రతారార్క మైననిర్వాహముల్
గాంచి యుల్లము పల్లవించువారుఁ
|
|
తే. |
గోరికలకంటె సాహస్రగుణితఫలము
బొరసి యవ్విభు వెయినోళ్ళఁ బొగడువారుఁ
గాని మిన్నక యుండెడుమానవుండు
మందునకునైన లేఁడు తన్మఖమునందు.
| 124
|
చ. |
మన మలరంగ భూసురసమాజము కోటి భుజించెనేని క్రం
గనఁ దనుఁదాన మ్రోయుజయఘంటిక తన్మఘవాసరంబులం
దొనర నిమేషమాత్రమును నూరకయుండక మ్రోయుచుండె స
న్మునిజనకోటి నివ్వెర మునుంగ నమందరవంబు పెంపునన్.
| 125
|
ఉ. |
ఏచినవాఙ్మయప్రతిభ లెంతయుఁ జిత్రముగా నధీతిబో
ధాచరణప్రచారణసదర్థముగా శ్రుతిశాస్త్రముఖ్యవి
ద్యాచతురత్వముల్ మెఱయునట్టి మహాత్ముల కాని, యెవ్వనిం
జూచిన నల్బమానవుఁడు సున్న తదీయసదస్యకోటిలోన్.
| 126
|
క. |
సురుచిరమై యష్టాదశ
కరమితమై పసిఁడియిట్టికలనిర్మితమై
యరయఁ జతుస్సిత్యంబై
గరుడాకృతివేది యొప్పెఁ గడునద్భుతమై.
| 127
|
వ. |
విధ్యుక్తప్రకారంబుగా మేధ్యాశ్వబంధనబంధురంబైన యూపంబుచుట్టును ఖాదిరంబులుం బాలాశంబులు బైల్వంబులుంగా నాఱేసియు, దేవదారుమయంబులు రెండును, శ్లేష్మాత్మకవిరచితం బొక్కటియునుంగా నేకోత్తరవింశతి యూపంబులు, నలంకారార్థంబుగా ననేకశాతకుంభయూపంబులుం ప్రతిష్ఠించి, యందు జలచరశతంబునుం బక్షిశతంబునుం జతుశ్చరణశతంబునుంగా మున్నూఱుపశువుల నమర్చి, తద్విశసనాంతరంబున నశ్వాలంభనం బొనరించి, తదీయంబులగు మాంసంబులలోనం దత్తద్దేవతాప్రియకరంబు లైనయాహుతులు గావించునప్పు, డనంగవతీమహాదేవిచేత నర్హంబు లగుహుతంబులు సేయించి, పరిశిష్టంబు లగునవయవంబులు ఋత్విజులు యథోక్తహుతంబులు గావించిరి. తదీయహోమగంధంబు ఘ్రాణతర్పణంబు గావించి శీలవతీసుతుండు సమస్తసదస్యయుతుండై
|
|
|
యుచ్చైర్నినాదం బగునాశీర్వాదంబు చేసె. తదనంతరంబ సాహసాంకమహీవల్లభుండు.
| 128
|
క. |
అక్షీణదానలీలా
దక్షుండై ఋత్విజులకు దశగుణితముగా
దక్షిణ లొసఁగెను నుత్తమ
పక్షమున దశాశ్వమేధఫలతత్పరతన్.
| 129
|
క. |
హాటకములు దక్షిణగా
గోటానంగోటు లొసఁగి కుంభినియెల్లం
బాటించి దారవోసెను
హాటకగర్భప్రభావుఁ డగువరరుచికిన్.
| 130
|
వ. |
అతఁ డమ్మహీదానప్రతిగ్రహానంతరంబున నమ్మహీకాంతున కిట్లనియె.
| 131
|
ఉ. |
దానఘనుండ వౌట మఘదక్షిణగా ధర యెల్ల నిచ్చితీ
వేనది విప్రవర్గమున కిచ్చితి, నీవు భుజాగ్రపీఠికం
బూని ధరించుభూతలము భూసురకోటి భరింపనేర్చునే?
యేనుఁగుపల్లనం బిడిన నేడికకున్ వశమే వహింపఁగన్.
| 132
|
శా. |
ఉర్వీమూలము కోటికోటుల ధనం బొప్పించి విప్రాళిచే
సర్వక్షోణియు నీవు గైకొనుట కర్హం బన్న, నాయన్నయం
తర్వాణిత్వము మెచ్చి భూవిభుఁడు తద్వాక్యంబు చెల్లించి, మున్
"గుర్వాజ్ఞాం ప్రతిపాల యే"త్తనెడి పల్కుల్ బుద్ధిఁ గీలించుచున్.
| 133
|
ఉ. |
చిత్రతరంబు లైనయవశిష్టధనంబులు, రాగమంజరీ
పుత్త్రుఁడు సత్కృపామహిమఁ బూనినచూపులఁ జూచి దానవై
చిత్రి యెలర్ప నిచ్చుటయు జిత్తములం బ్రియమంది బ్రాహ్మణ
క్షత్త్రియవైశ్యశూద్రు లొఁగి గైకొని మోచిరి త్రవ్వితండముల్.
| 134
|
వ. |
అనంతరంబ యవభృథాభిషేకనిరతిశయతేజోవిరాజితుండై, యారాజశేఖరుం డాత్మీయమందిరంబు బ్రవేశించి, యాస్థానమండపాభ్యంతరం
|
|
|
బున నిరంతరమణిమరీచివిలసదున్నతద్వాత్రింశత్సాలభంజికారంజితంబైన దివ్యసింహాసనంబున నాసీనుండై, సముచితసంభావనాపూర్వకంబుగా సర్వసంయమిద్విజసర్వంసహాధీశ్వరుల నిజస్థానంబులకుం జన నియమించి.
| 135
|
ఆ. |
వితరణంబుగని వివేకంబుకందువ
సత్యశౌచములకు జన్మభూమి
సాహసంబు సెలవు శౌర్యంబు పొడవు నా
విక్రమార్కవిభుఁడు వినుతికెక్కె.
| 136
|
క. |
సజ్జనపరితోషకుఁడు జ
గజ్జనజనకుండు శత్రుగణకంఠాసృ
ఙ్మజ్జనకౌక్షేయుఁడునై
యుజ్జయనీనగర మేలుచుండెను గడిమిన్.
| 137
|
శా. |
ఆభూపాలకుఁ డొక్కనాఁడు మృగయావ్యాపారలీలాగతిన్
శోభాబంధురవాహవారణరథస్తోమంబు దుర్గాటవీ
క్షోభంబుం బొదలింపఁగా మెలఁగ నచ్చో నొక్కచో నొంటిమై
నాభీలం బగుదంష్ట్రవెంట నట డయ్యం బాఱి ఖిన్నాంగుఁడై.
| 139
|
క. |
ఘనవటవిటపిచ్ఛాయను
జనపతి శయనించి యున్నసమయమున, జగ
జ్జనసుతుఁడు దేవదత్తుం
డనుభూసురవర్యుఁ డొక్కఁ డతనిం గాంచెన్.
| 140
|
తే. |
కాంచి యవ్విభుతనుపరిక్లాంతి యెఱిఁగి
చేతికుండికాజలముల సేదఁ దేర్చి
యాత్మపురమున కేతేర నవధరింపు
మండలాధీశ! యొంటిమై నుండనేల.
| 141
|
చ. |
అనినఁ బ్రమోద మంది వసుధామరవర్యునిఁ గూడి విక్రమా
ర్కనృపవరేణ్యుఁ డాత్మనగరంబునకుం జనియెన్, ద్విజుండునుం
దనసదనంబు చేరెఁ బ్రమదమ్మున నమ్మఱునాడు పిల్చి, య
జ్జనపతి దేవదత్తునకు సమ్మతి నిచ్చెఁ బురోహితత్వమున్.
| 142
|
తే. |
కలయఁగాఁ జూచి కొల్వులోఁ గల్గువారు
వినఁగ దేవదత్తుఁడు మొన్న విపినభూమిఁ
గోరి నాకుఁ జేసినయుపకారమునకు
మాఱు సేయ నెన్నఁడు సమకూఱు నొక్కొ!
| 144
|
వ. |
అనిన నమ్మాటకు దేవదత్తుండు నృపోత్తమునియాసన్నవర్తిత్వంబునం జేసి, తనవర్తనం బఖలజనంబులు పరికీర్తనంబు సేయం బ్రవర్తించుచు నొక్కనాఁడు, సర్వాభరణభూషితుండైన రాజకుమారుండు ముంగిట నాడ ముద్దాడువాడునుంబోలె నెవ్వరు నెఱుఁగకుండ గూఢవృత్తి నెత్తుకొని నిజనివాసంబునకుం జనియె, నంత నక్కుమారు నెల్లవారు వెల్లెడల నరసి కానక ధాత్రీశ్వరున కత్తెఱం గెఱింగించిన, నతండును గుమారాన్వేషణంబునకుఁ దలవరుల నియోగించిన నయ్యారెకులు చని పురంబు సర్వంబును శోధించి, విపణివీథిం దదీయాభరణమ్ము లమ్మునమ్మహీసురు మచ్చంబుతోడం బట్టి తెచ్చి సమ్ముఖంబునం బెట్టిన, నమ్మహీపాలుం డుచితాలాపంబుల వెఱవు వాపి యడుగుటయు.
| 145
|
ఉ. |
భూసురముఖ్యుఁ డిట్లనియె భూషణసంగ్రహణాభిలాషినై
యాసురవృత్తిఁ బూని భవదాత్మజుఁ జెప్పఁగరానిచేఁత నే
జేసితి, నావుడున్ సభ నశేషజనమ్ములుఁ గ్రూరదండితుం
జేసినఁగాక యీచెడుగు చేసిన సేఁత సహింపవచ్చునే?
| 146
|
క. |
ఈభూషణంబు లెక్కడ
నాభూపకుమారుఁ డేడ నకటా! కృప లే
కేభంగిఁ దెగి వధించితి
వేభూములఁ జెప్పఁ గలరె యిట్టిదురాత్ముల్!
| 147
|
వ. |
అని కలుషించి దండింపం దలంచి.
| 148
|
ఆ. |
కొలువువెడల నీడ్చికొనిపోవ నతిసంభ్ర
మమున విక్రమార్క మనుజవిభుఁడు
వారి మగుడ బిలిచి వలదని వారించి
యెల్లవారు వినఁగ నిట్టు లనియె.
| 149
|
క. |
మున్నొకపురుషార్థము మది
నెన్నడు మఱవంగ రాని దితఁ డొనరించెన్
నన్నును నే నెఱుఁగక పడి
యున్నెడ వనభూమి శీతలోదక మొసఁగెన్.
| 150
|
ఉ. |
కావున నీతఁ డెంతయపకారము చేసిన సైఁపఁ బాడి, యే
నావిపినంబు వెల్వడికదా పురికిం జనుదెంచి రాజనై
యీవిభవంబుమై మనుట, యెంతటి తప్పిది? నాకుఁ దప్పినన్
దైవముసాక్షి యీతనికిఁ దప్ప నొకింతయు, మాట లేటికిన్?
| 151
|
ఉ. |
ఆపద చక్కఁబెట్టి తనయక్కఱలెల్లను దీర్చి, యెయ్యెడం
బ్రా పయినట్టికార్యములపట్టున నిర్వహణం బొనర్పఁగా
నోపి, తను న్భరించినబుధోత్తము నొప్పరికించు నమ్మహా
పాపికి నెన్నిజన్మములఁ బాయునొకో క్రిమికీటజన్మముల్!
| 152
|
ఉ. |
నావుడు రాజుసభ్యవచనంబున కెంతయు సంతసిల్లి, భూ
దేవుఁడు మందిరంబుసకు దిగ్గనఁ బాఱి కుమారుఁ దెచ్చి, ధా
త్రీవరు నంకపీఠి నిడి దీవన లొప్పఁగ నిచ్చి తత్సఖా
కోవిదకోటిడెందమునకుం బ్రమదంబు జనింప నిట్లనున్.
| 153
|
ఉ. |
దేవర నేఁడు కొల్వున మదిం గడునెంతయు సంతసించి, సం
భావనమీఱ నాకు నొకప్రత్యుపకారము సేయఁబూనుటే
నావల నీవల న్విని, యథార్థ మెఱుంగుటకై యొనర్చితిన్
నావెడబుద్ధికి న్మనమునం గలుషింపకుమయ్య వేఁడెదన్.
| 154
|
క. |
అనవుడు ధరామరేంద్రుని
కనుపమ మణిభూషణాదు లగుసంపదలన్
మనమలరఁ జేసి గృహమున
కనిచె సభాపదులు నిచ్చ నచ్చెరువందన్.
| 155
|
వ. |
ఇత్తెఱంగున విక్రమార్కావనీశ్వరుండు సత్యవచనప్రత్యుపకారపరాయణుండై ధరాపరిపాలనంబు సేయుచుండె నంత.
| 156
|
తే. |
అన్నరేంద్రుపురోహితుఁ డార్యనుతుఁడు
వేదవేదాంతవేది వివేకఘనుఁడు
దత్తనూజుఁడు మదవతీచిత్తహరణ
హరిలీలాకరుఁడు కమలాకరుండు.
| 157
|
వ. |
అక్కుమారుండు విద్యావిదూరుం డగుట గనుంగొని జనకుం డతని కిట్లనియె.
| 158
|
క. |
శత్రుఁడు చదువనిపుత్త్రుఁడు
శత్రుఁడు ఋణకారి యైనజనకుఁడు, మిగులన్
శత్రువు రూపసి యగుసతి
శత్రువు దుశ్చరిత యైనజనని తలంపన్.
| 159
|
క. |
కుల ముద్దరింపు చదువం
దలకొనుము “వచ స్సుభాషితపరివ్యక్తం
బల మేవ హి కేవల" మను
పలుకు పురాతనము గాక ప్రక్షిప్తంబే.
| 160
|
వ. |
అని ప్రార్థించినం గమలాకరుం డొక్కింతచింతాక్రాంతుండై యుండి నిశ్చితాంతఃకరణుండై తండ్రి కిట్లనియె.
| 161
|
ఉ. |
వేదపురాణశాస్త్రముఖవిద్యలు సర్వము నభ్యసించి, లో
కాదరణీయసారకవితాభ్యసనం బొనరించి మేటి నై
యాదిమునీంద్రవర్తనగుణాఢ్యుఁడనై చనుదెంచి, నీకు స
మ్మోద మొనర్తు నాపలు కమోఘపదం బని చెప్పి నమ్రుఁడై.
| 162
|
వ. |
తండ్రి వీడ్కొని మహీమండలమండనం బైనకాశ్మీరమండలంబునకుం జని, యందు సరస్వతీవిహారసదనంబునుంబోని యొక్కమహాగ్రహారంబున సన్నిహితచంద్రజూటుండగు చంద్రచూడుం డనువిద్వచ్చూడామణిపాలికిం జని నమస్కరించి, తనయభిలాషంబు నెఱంగించి దేవతానిర్విశేషంబుగాఁ బరిచర్య సేయుచుండ, నతని సేవాతాత్పర్యంబునకు సంతసిల్లి సిద్ధసారస్వతమంత్రం బుపదేశించె, నంతం దదనుష్ఠానవిశేషంబునకు శారద ప్రత్యక్షంబై యతని సముచితవిద్యావిశారదుం గావించిన, లబ్ధకాముండై పితృదర్శనప్రీతి గురునియుక్తుండై యుజ్జయినీపురంబునకు వచ్చి నిజమందిరంబు ప్రవేశించి.
| 163
|
చ. |
జనకునిఁ గాంచి భక్తిభయసంభ్రమసంభృతుఁడై నమస్కరిం
చిన, నతఁడెత్తి నందనునిఁ జిక్కఁ గవుంగిటఁ జేర్చి పెక్కుదీ
వనలొనరించె, ముత్పులక వారము సమ్మదబాష్పపూరముం
దనరఁగ సమ్మదం బొదవదాల్చినలీల వికాసలక్ష్మితోన్.
| 164
|
ఉ. |
భూవరుసమ్ముఖంబునకుఁ బోయి ప్రసన్నతఁ గాంచి, యింపుమైఁ
గోవిదవర్ధనీయ మగుగోష్టి యొనర్చిన, నవ్విభుండు మో
దావహచిత్తుఁడై యభిమతార్థపరంవర లిచ్చి యమ్మహీ
దేవకుమారచంద్రమునిదిక్కు గనుంగొని ప్రీతి నిట్లనున్.
| 166
|
తే. |
ఈవు బహుదేశములఁ జరియించి యచ్చ
టచట నేమేమిచోద్యంబు లనఘచరిత
కనినవినినవి క్రొత్తలు గలిగెనేని
నాకుఁ జెప్పుమ యనఁ గమలాకరుండు.
| 167
|
క. |
పరిచితవిద్యానిధినై
గురునాథునిచే ననుజ్ఞ గొని యిట మిమ్మున్
దరిసించు నభిమతంబున
నరుదెంచుచునుండి మండలాధిప యంతన్.
| 168
|
తే. |
కాంచి యేలెడుజయసేనుఁ గాంచి, యతఁడు
నన్ను మన్నింప నందుఁ గొన్నాళ్లు నిలిచి
యొక్కనాఁ డేను బొడగంటి నొకవధూటి
నావిలాసిని చెలువ మేమని నుతింతు.
| 169
|
సీ. |
పొలఁతి వేనలితోడఁ బురినెమ్మి తనపురి
ప్రతివచ్చునని పాముఁబట్టెనేని
యింతినెమ్మోముతో నెనయుదునని వార్థి
పట్టి విష్ణుపదంబు ముట్టెనేని
చామచన్నులతోడ సరివత్తుమని కోక
ములు దండగుండాన మునిఁగెనేని
యతివమై దొరయుదునని సువర్ణశలాక
వహ్నిలోపలఁ జొచ్చి వచ్చెనేని
|
|
తే. |
నిక్కువంబుగ నమ్మంగనేర కజుఁడు
శుద్ధపట్టంబు గనుటకుఁ జొరక మానె
ననిన నయ్యంబుజాకాయతాక్షితోడ
నితరవనితల నుపమింప నెట్లువచ్చు?
| 170
|
క. |
ఆయంగన క్రేఁగన్నుల
యోయారపుఁగలికిచూపుటురులం బడినం
గాయజునిచిత్తమైనను
గాయజసంతాపవహ్నిఁ గరఁగక యున్నే.
| 171
|
సీ. |
చంద్రబింబముఁ బాలసంద్రంబులోఁ దోఁచి
కందెల్లఁ బోఁ బులు కడుగకున్నఁ
గామబాణంబులఁ గరసానఁబట్టించి
తొలుకారుమెఱుఁగునఁ దొడయకున్నఁ
బసిఁడిసలాకకుఁ బరిమళం బొనగూర్చి
గరువంపువెన్నెలఁ గరఁగకున్నఁ
|
|
|
జిగికందకుండ లేఁజిగురాకుఁ గొనివచ్చి
యొగరెల్లఁ బుచ్చి యింపొసఁగకున్నఁ
|
|
తే. |
గాంతనెమ్మోమునకు వాలుఁగన్నులకును
వఱలు నునుమేనికిని నొప్పువాతెఱకును
నీడుజోడైనప్రతి యని యెన్నఁగడిది
హస్తిమశకాంతరము సహజైకకాంతి.
| 172
|
క. |
అన్నాతిముద్దుమోమునుఁ
దిన్ననినెన్నడుము నగవు దేఱెడికన్నుల్
పెన్నేఱివేణియుఁ గ్రొవ్విన
చన్నులునుం గనినఁ బుష్పశరుఁడుం గరఁగున్.
| 173
|
వ. |
అది నరమోహిని యనువారనారీతిలకంబు.
| 174
|
ఆ. |
ఆవధూటితోడ ననుభవకేళికి
నఖిలషించి యెవ్వఁ డరిగెనేని
నతఁడు రాక్షసాభిహతుఁ డగు నారాత్రి
యంద దాని కిట్టి నిందగలదు.
| 175
|
క. |
పురిలోన నెదురుఁ దెరువై
యరుదెంచిన నవ్వధూటి నంగుళిఁ జూపం
గరిమర్థిఁ జూడ వెఱతురు
పురుషులు రక్కసుఁడు చంపుఁ బొమ్మని భీతిన్.
| 177
|
క. |
అని విన్నప మొనరించిన
విని వేడ్కను విక్రమార్కవిభుఁ డప్పుడ స
జ్జనహితుఁ డగుకమలాకరుఁ
డనుచరుఁడై యరుగుదేర నరుదెంచి తగన్.
| 178
|
క. |
కాంచెం గాంచీపురముం
గాంచనమణిసౌధసాలఘనగోపురముం
జంచలనయనానటనస
మంచితపర్యటనరణితమణినూపురమున్.
| 179
|
వ. |
కాంచి యందు నయ్యిందువదనమందిరంబునకుఁ గమలాకరమహీసు రోపదిష్టమార్గంబునం జని యజ్జనవరుండు.
| 180
|
క. |
నరమోహనవిలసనముల
మరుమోహనశరముకంటె మధురాకృతియై
నరమోహిని యనఁదగియెడు
నరమోహినిఁ గాంచి మనుజనాథుఁడు మదిలోన్.
| 181
|
ఉ. |
ముప్పిరిగొన్న వేడ్క నరమోహినిపై నెలకొన్న జూపులం
ద్రిప్పఁగలేక యీమదవతీరమణీయతప్రాపున న్మరుం,
డప్పరమేశపద్మనయనాంబుజగర్భులనైన వ్రేల్మిడిం
ద్రిప్పులబెట్టు, నంచు వినుతించి మదిం దిలకించి వెండియున్.
| 182
|
ఆ. |
ఈవధూటిరూపయౌవనసంపద
కాముకులకు లోచనామృతంబు
చిత్రగతి మృతంబు సేయుచునున్నది
కనకపాత్రలోనిగరళ మట్లు.
| 183
|
వ. |
అని తలంచుచున్న యవసరంబునం గమలాకరుం డాకమలానన కిట్లనియె.
| 184
|
ఉ. |
ధీరుఁడు విక్రమార్కజగతీతలనాథుఁడు నిన్నుఁ జూచు ని
చ్ఛారతి వీఁడె వచ్చె ననఁ జాగిలి మ్రొక్క ప్రియోక్తి నిట్లనుం
గ్రూరనిశాచరుం డొకఁడు కూరిమి నాయెడఁ గల్గియుండు, సం
హార మొనర్చు వచ్చినవిటావళిఁ దన్నిశ నొక్కవ్రేల్మిడిన్.
| 185
|
వ. |
అని తనతెఱం గెఱఁగించి మహీవల్లభునకు నప్పల్లవాధర యుచితోపచారంబు లొనరించి, సరసకథాభూషణంబులగుభాషణంబులం బ్రొద్దు పుచ్చుచున్నయంత సాయంతనసమయం బగుటయు.
| 186
|
చ. |
మునుకొని దంష్ట్రికారుచులు ముందటిచీఁకటినెల్లఁ బాపఁగా
వెనుకఁ దమాలనీలనిజవిగ్రహదీప్తులు చిమ్మచీఁకటిం
బెనుపఁగఁ గొమ్ముటేనుఁగు విభీషణతం జనుదెంచుకైవడిన్
దనుజవరుండు వచ్చెఁ దనదారుణరూపము భీతిఁ బెంపఁగన్.
| 187
|
ఉ. |
తత్సమయంబునందు వసుధావరుఁ డుద్గతుఁడై యదల్చి, యు
ద్యత్సముదగ్రసింహగతి దైత్యుని మార్కొని, యోరిదుష్ట ! ని
న్మత్సరబుద్ధి నీక్షణమ మర్దితుఁ జేసి, ధరిత్రి కెల్ల న
త్యుత్సవ మే నొనర్చెదఁ బయోరుహలోచనకోర్కి దీర్చెదన్.
| 188
|
చ. |
అన విని దానవేశ్వరుఁ డహంకృతి రౌద్రరసంబు మూర్తిగై
కొనినవిధంబునన్ నృపతికుంజరు నేడెత్తఱఁ దాఁకి వీఁక మైఁ
బెనఁగి పెనంగి లావఱిఁనఁ బేర్చి నరేంద్రుఁడు కాళ్ళు పట్టి నే
ల నడచి మల్లవిద్య సఫలంబుగఁ బీనుఁగుఁ జేసె దానవున్.
| 189
|
తే. |
ఇట్లు దానవు వెసఁ జంపి యిల్లు వెడలఁ
దివిచి వైచిన మేదినీధవునిఁ జూచి
హర్షమున నరమోహిని యల్ల నగుచు
నింపు రెట్టింప నతనితో నిట్టులనియె.
| 190
|
క. |
నరమోహిని నానామము
నరఘాతిని యని జనంబు నను నిందించున్
నరనాథ నింద మాన్చితి
చరితార్థం బయ్యె నాదుజననం బరయన్.
| 191
|
తే. |
ఏను మీపనిచినపని యెట్టిదైనఁ
జేసి మీదాసినై సేవ సేయుదాన
|
|
|
ననిన విక్రమాదిత్యుఁ డట్లయిన నీవు
నాకుఁ బ్రియముగ నొకటి యొనర్పవలయు.
| 192
|
క. |
లోకవిలోచనకైరవ
రాకాచంద్రుం డితండు, రమణీమణి నీ
వీకమలాకరుఁ బ్రియుఁగాఁ
గైకొను మిది నాకుఁ బ్రియము కమలదళాక్షీ!
| 183
|
వ. |
అని యయ్యిరువురం గూర్చి యజ్జననాథుం డుజ్జయినీపురంబునకుం జని, దుష్టనిగ్రహశిష్టప్రతిపాలనంబులు సహజఖేలనంబులుగా ననయంబును సర్వంసహానిర్వహణదుర్వారభుజాగర్వఖర్వేతరుండై రాజ్యంబు సేయుచుండి, జగంబున నత్యాశ్చర్యభరితంబులైన చరితంబు లెఱుంగవేఁడి కర్ణావతంసీకృతకౌక్షేయకసహాయుండై చని యొక్కరుండును బెక్కుదిక్కులం జరియించుచు నొక్కనాఁడు.
| 194
|
విక్రమార్కుఁడు రక్షసునిచే మనుజవధ మాన్పించుట
క. |
పేరడవిలోన రాఁగా
నీరజహితుఁ డస్తమించి నెఱనఖిలాళా
పూరితమై తమ మెచ్చెను
భూరివదాన్యులవితీర్ణిఁ బోల్పఁగఁ బట్టై.
| 195
|
క. |
ఆచీఁకటి నొక్కండును
ద్రోచిచనఁగ రామి, ననతిదూరంబున వా
గ్గోచరము గానియున్నతి
నేచినవటవిటపినీడ నెలమి వసించెన్.
| 196
|
క. |
ఆవిటపి నుచితవచన
ప్రావీణ్యము మెఱయ నున్నపక్షులకుఁ జిరం
జీవి యనువిహగముఖ్యుఁడు
కోవిదబహుమాననీయగుణుఁ డిట్లనియెన్.
| 198
|
క. |
మీ రాహారార్థముగా
గోరి చరింతురు సమస్తఘోరాటవులన్
దూరగ్రామంబుల ఫలి
తారామంబులను దశదిశాంతరములలోన్.
| 199
|
తే. |
కన్నచోద్యంబు లేవేని గల్లెనేని
నాకు నెఱఁగింపుఁ డేను వినంగవలతు
ననిన నందులో నబ్బరికాభిధాన
మొకపతత్రి యిట్లనియె, నేఁ డుదయవేళ.
| 200
|
క. |
ఏ మొకకొందఱము మహా
గ్రామవనాంతరము లెల్ల గడచి చని, గ్రహ
స్తోమగతిప్రతిరోధన
భూమావంధ్య మగువింధ్యముసమీపమునన్.
| 201
|
క. |
చైత్రరథనందనంబుల
చిత్రస్ఫురణముల నుల్లసిల్లుఁ బ్రశంసా
పాత్రమయి యొక్కవిపినము
చైత్రరమాకాంతజన్మసదనం బగుచున్.
| 202
|
వ. |
అవ్వనంబున వన్యఫలాహరణార్థంబు సంచరించుచు, నొక్కయెడం గమలకల్హారకుముదశోభితంబును గలహంస కారండవ గ్రౌంచ చక్రవాక సారస మదసారంగ సంకులారావవిరాజితంబును నగునొక్కకమలాకరంబుతీరదేశంబున, ననేకబంధులోకపరివృతుండును దీర్ఘనిశ్వాసపవనధూళిధూసరితుండును గళద్భాష్పనయనకమలుండుమ దురంతదుఃఖపరవశుండునునై యున్న కంకాళఖండనుం డనునొక్కవిహంగపుంగవుం గని చేరంజని, తన్నెఱఁగించుకొని దుఃఖకారణం బడిగిన నతం డెట్టకేలకుఁ జిత్తంబు కలంకదీర్చుకొని యీరెలుంగున నాతో నిట్లనియె.
| 203
|
తే. |
ద్వాదశగ్రామములకు నధ్యక్షుఁ డొక్క
రాక్షసుఁడు వింధ్యనగగహ్వరమున నుండు
|
|
|
నతని కాయూళ్ళవార లాహార మెపుడు
బండిఁ గొనిపోయి పెట్టుదు రొండొకండ.
| 204
|
వ. |
వాఁ డన్నరమహిషసహితంబుగాఁ దదన్నంబు భజించుచుండు.
| 205
|
క. |
ఇలువరుసగాఁగ నీక్రియఁ
గలవారల నెల్లఁ బుచ్చెఁ గాలునిపురికిన్
ఖలుఁ డగునారాక్షసుండా
కులపడుఁ ద్రిజగంబు నతఁడు కుపితుండైనన్.
| 206
|
ఉ. |
ఏమని చెప్పుదున్ ఖగకులేశ్వర! నాసఖుఁ డొక్కభూసుర
గ్రామణి చావఁగాఁ గలఁడు రాక్షసుచేఁ, నది మాన్పఁ ద్రోవలే
దేమెయిఁ జూచినన్ హితులయిష్ట మొనర్పఁగ లేనినాభవం
బేమిభవంబు! దీనికిని నే దురపిల్లెద నేమి సేయుదున్.
| 207
|
క. |
నరులకుఁ బక్షులకును నె
ప్పరుసున సమకూరు మిత్రభావం, బిది య
చ్చెరువు, వినవలతు నా కిది
పరిపాటి నెఱుంగఁ జెప్పు బంధునిధానా.
| 209
|
వ. |
అనినఁ గంకాళఖండనుం డిట్లనియె.
| 210
|
క. |
నాచుట్టంబులు నేనును
వే చని యశనార్థ మడవి విహరింపంగాఁ
జూచి మముఁ బట్టఁ దిరిగెడు
నీచుఁ డొకఁడు మాచరించునెల వెఱిఁగి తగన్.
| 211
|
క. |
మచ్చు లిడి యురులు బోనులు
నచ్చట వెస నొగ్గి చనిన నది యెఱుఁగక యా
మచ్చుచ్చురులను బడి వగ
నిచ్చను దురపిల్లుచున్నయెడ నచ్చటికిన్.
| 212
|
వ. |
సమిత్కుశార్థంబు దైవవశంబున.
| 213
|
క. |
వచ్చి యొకద్విజకుమారుఁడు
చెచ్చెర మముఁ జూచి కరుణ చిగురొత్తంగా
గ్రచ్చఱ నయ్యురులూడ్చిన
నిచ్చల మామనికిపట్ల కేఁగితిమి వెసన్.
| 214
|
క. |
అది చనియును నేఁటికి నిరు
పదియేఁడులు గడచె, నాఁటఁబట్టియు నేనా
మది నాతనియాపద సం
పద నాయదిగాఁ దలంతు బంధుత్వమునన్.
| 215
|
క. |
అని చెప్పిన విని వచ్చితి
నని చెప్పిన విహగవిభునియాలాపంబుల్
వినియెఁ జెవియొడ్డి భూరుహ
మునక్రింద వసించి యున్నభూమీశ్వరుఁడున్.
| 216
|
క. |
విని యపుడ కదలి, జామె
క్కినయంతకుఁ జనియె నసురకేలీసదనా
వనిభృత్కంధరభూమికిఁ
దన కిదియ పరోపకృతికిఁ దఱి పొమ్మనుచున్.
| 217
|
క. |
చని వధ్యశిలాస్థలి న
జ్జనపతి కూర్చుండె నిర్విశంకత, నంతం
గనియె గుహ వెడలి చనుదెం
చి నిశాటుఁడు వధ్యశిల వసించినవానిన్.
| 218
|
చ. |
కని భ్రుకుటీమహోగ్రపరికంపితఫాలభయంకరాస్యసం
జనితనిదాఘవారికణజాలవిజృంభణరౌద్రమూర్తియై
యనియెఁ గణంగి యోరిమనుజాధమ! నిచ్చలుఁ దెచ్చువంటకం
బును నులివేఁడికూరలు నపూపములు గొనిరా కహంకృతిన్.
| 219
|
తే. |
ఒక్కఁడవ వచ్చి వధశిల యెక్కి నన్ను
నపహసించుచునున్నాఁడ వనుచుఁ దీవ్ర
గమనుఁడై చనుదెంచురాక్షసునితోడ
నృపతి నిశ్శంక నిట్లను నిభృతుఁ డగుచు.
| 220
|
చ. |
దితినుత! నేఁడు చావ నరుదెంచుమహీసురవర్యుమాఱు వ
చ్చితిఁ బరదేశి, నాచనవు చేకొని మత్తనురక్తమాంసముల్
ధృతిఁ గొను మంతకంటెఁ బరితృప్తి యొనర్చు, మదన్వయక్రమా
గతమగు నిప్పరోపకృతికల్పనఁ బారమునొందఁ జేయుమీ.
| 221
|
ఉ. |
నావుడు దానవేంద్రుఁడు మనంబున నచ్చెరువంది, సత్కృపా
భావనకుం బరోపకృతిభంగికి మెచ్చితి, వేఁడు మర్థి నీ
కేవర మైన నిచ్చెదఁ బ్రహృష్టమనస్కుఁడ నైతి నీయెడన్
నావుడు విక్రమార్కనరనాథుఁడు నద్దనుజేంద్రుతోడుతన్.
| 222
|
ఆ. |
ఈవివేకబుద్ధి యీచిత్తసంశుద్ధి
యీకృపారసావసేకసిద్ధి
కలదె యొరుల కెందుఁ గారణజన్ముండ
వగుటఁ జేసి నీక యబ్బెఁ గాక!
| 223
|
తే. |
నాకు వరమిత్తు ననుమాట నైజమేని
మనుజవధ యొనరింపక మాను మనినఁ
దత్పరోపకారైకతత్పరత కలరి
యట్లచేసెద నని పల్కి యసుర చనియె.
| 224
|
ఆ. |
భూపచంద్రముఁడు “పరోపకారార్థమి
దంశరీర" మనినధర్మమార్గ
సరణి దప్పకుండ సకలార్థిరక్షణ
వర్తనమున నిత్యకీర్తిఁ గాంచె.
| 226
|
మ. |
పరమబ్రాహ్మణదేవభక్తినియమప్రజ్ఞారమాలంకృతా
పరుషారాతిమహీశమంత్రిజనశుంభద్గర్వసంరంభసం
హరణప్రౌఢనయోన్నతాకనకదండాందోళికాఛత్రచా
మరముఖ్యోజ్జ్వలరాజవిహ్నమయసమ్యగ్వైభవప్రాభవా.
| 227
|
క. |
భావపరిశుద్ధికలనా
ప్రావీణ్యామృతగిరీశ పావనపదరా
జీవయుగభక్తితత్పర
సేనాహేవాకనిరతసిద్ధయపౌత్త్రా.
| 228
|
కాంతావృత్తము. |
ధారాధరవాహనధైర్యకృతీ
క్షీరాభిశిబీశ్వరశీతలరు
గ్ధారాధరకల్పకకామగవీ
తారాధిపసన్నిభదాననిధీ.
|
|
గద్యము: |
ఇది శ్రీమదఖిలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కయనామధేయప్రణీతం బైనవిక్రమార్కచరిత్రం బనుమహాకావ్యంబునందుఁ బంచమాశ్వాసము.
|
|