Jump to content

విక్రమార్కచరిత్రము/అష్టమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

విక్రమార్కచరిత్రము

అష్టమాశ్వాసము

శ్రీమహిళాంచితనయనా
శ్రీమద్వాణీవిలాసజిహ్వాగ్రతలా
క్ష్మామహితదక్షిణభుజా
సీమాద్రివిహారకీర్తి సిద్ధనమంత్రీ!

1


మ.

ప్రతిపక్షక్షితిపాలఫాలతలవర్ణధ్వంసనారంభజృం
భితనిస్త్రింశుఁడు విక్రమార్కుఁడు గుణాభిజ్ఞుండు దేజోవిని
ర్జితదీపార్కుఁడు కాంతిసోముఁడు సుఖక్రీడాకలాపైకమం
డితుఁడై, మూఁడవమాట యత్తరుణి నాడింపంగ నుద్యుక్తుఁడై.

2


ఉ.

చారుసువర్ణపూరకలశంబునకుం దనమంత్రవిద్యచేఁ
గోరి సచేతనత్వమును గూర్చి, యపూర్వకళామహాదర
శ్రీరుచి మీఱ నొక్కకథ చెప్పఁగదే! యని యానతిచ్చినం
గూరిమితోడ నాకనకకుంభము సంభ్రమ మొప్ప నిట్లనున్.

3


సువర్ణకలశముచే విక్రమార్కుఁడు చెప్పించిన పద్మావత్యాదుల కథలు

శా.

శృంగారాదిరసప్రసంగములుగాఁ జెప్పంగ నేర్తుం గథల్
సాంగోపాంగము గాగ, నొక్కకథ సువ్యక్తంబుగా నన్వయిం
పంగాఁ జెప్పెదఁ, జిత్తగింపు మని చెప్పం జొచ్చె భూపాలుతో
సంగోత్పాదకవాగ్విశేషరచనాచాతుర్య మేపారఁగన్.

4


సీ.

మాణిక్యసుందరమహనీయకందర
        భరితబంధురవింధ్యగిరిసమీప
మున, వివేకనిధాన మను పట్టణమునందు
        శ్రుతవర్మ యను మహాక్షోణినాయ

కునకుఁ బద్మావతి యనఁగ, గుణావతి
        యనఁగ, లీలావతి యనఁగఁ గలరు
ముగురు గూఁతులు; జగన్మోహనాకార
        నంగశాస్త్రవిదగ్ధ లతివినీల


తే.

కుటిలకుంతల ల్మదకుంభికుంభయుగళ
గురుకుచలు, వారిఁ దగినట్టి వరుల కొసఁగి
వరుస మూఁడూళ్ళ నిలిపె నావసుమతీశుఁ
డంత నాపురి కొకపరిహాసకుండు.

5


ఉ.

హారివరాంగనాజనవిహారి విదూషకచక్రవర్తి, సం
సారసుఖైకసారఘనసారపటీరవిలిప్తమోహనా
కారుఁ, డనూనకాముకశిఖామణి పుప్పకరండకుండు నా;
జారుఁ డొకండు వచ్చే సరసస్థితి రెండవమారుఁడో యనన్.

6


సీ.

కొదమచందురునిలోఁ గొదమకైవడి మించు
        నటియించు సన్నపునాభి వెట్టి
ములుపడి ప్రావడ్డ వలరాజుడాగుల
        మీఁద గందపుఁబూఁత మేళవించి
తేఁటిఱెక్కలకప్పు దెగడెడు కొప్పున
        బాగుమీఱఁగ వన్నెపాగ చుట్టి
తనరుజవ్వాదివాసనలచేఁ జెన్నొందు
        చిన్ని గేదఁగిఱేకు చెంపఁ జెరివి


తే.

కప్పురపు సోనపల్కులఁ గమ్మఁదావి
గుబులుకొనుచున్న విడియంబుసొబగుతోడ
రమణఁ జూపట్టు పుష్పకరండకుండు
హరుని కనుదృష్టి దాఁకనిమరుఁ డనంగ.

7


ఉ.

వచ్చి పురంబువాకిట రువారపుఁగోడెతనంబుతోడఁ గ
న్నిచ్చకువచ్చుచేడియల నెచ్చరికించుచు, ధూర్తకోటితో
మచ్చరికించుచున్, వెకలిమాటలు మాయపుఁగూచిమారపుం
బచ్చలు చూపుచున్, సెలవిపాఱఁగ నవ్వుచుఁ గేఁకరించుచున్.

8

క.

కన్నుండఁగఁ గనుపాపను
గొన్నవిధంబునను, సతులఁ గూడకయును దాఁ
గన్నమిడి మనోధనములు
గ్రన్ననఁ గొనిపోవు, కన్నకాఁడుం బోలెన్.

9


వ.

ఇట్లు వివేకవిధానం బను పట్టణంబునఁ బుష్పకరండకుండు బహుప్రకారంబులగు నిచ్ఛావిహారంబులం జరియించుచుండ, నొక్కనాఁడు కామశాస్త్రకళావేదులైన విటవిదూషకపీఠమర్దకనాగరకులతోడ బహువిధస్వైరిణీగణప్రసంగంబులం బ్రొద్దుపుచ్చుచున్న సమయంబున, మీదేశంబునఁ క్రొత్తలగు వార్త లెయ్యవి? యెవ్వరెవ్వరివలన నే మేమి చోద్యంబులు గల? వెఱంగింపుఁ డనిన వార లిట్లనిరి.

10


ఆ.

ఇప్పురంబుచెంత నొప్పు మహాఘోష
పట్టణమున, జారపతులపాలి
భాగ్యలక్ష్మి యనఁగఁ బద్మావతీకాంత
వినుతి కెక్కు మూర్తివిలసనముల.

11


చ.

తొలకరివానకాలమునఁ దోఁచు మెఱుంగుపసిండినీటు తే
టలఁ బలుమాఱుఁ బుల్కడిగి డాఁచిన మన్మథమోహనాస్త్రమో,
వలపులవన్నెలం దొలఁచి వారిజసంభవుఁ డాఁడురూపుగా
నలవడఁజేసెనో యనఁగ, నాకమలానన యొప్పు నెంతయున్.

12


ఆ.

కొలను చొచ్చి పుచ్చుకొని తన్ను మదనుండు
రూపు సేయ ముల్లుసూపెఁ గాక
లేకయున్న మీన మాకాంతచూపుల
వలల కుఱికి వఱుతఁ గలయ కున్నె.

13


ఆ.

రమణ రాజమండలము నట్టనడుమఁ జూ
పట్టఁ బట్టి మిన్నుముట్టెఁగాక
గాకయున్న హరిణ మాకంజముఖిచూపుఁ
దూపు లడర నడవిఁ దూఱకున్నె.

14

చ.

సరసవినూత్నరత్నరుచిజాలముచేఁ దులకించుచున్న యా
గురుకుచక్రొమ్మెఱుంగుఁజనుగుబ్బలతో సరిచేయవచ్చునే,
తొరలి హిరణ్యకుంభముల దొడ్డతనంబులు చెప్ప నేటికిన్,
గురుత య దేల కల్గు గుడిగుండములం బడునట్టివారికిన్?

15


చ.

వరుఁడు ధనుర్ధరుం డయి దివానిశమున్ వెనుకం జరింపఁగా
వెరవున మోసపుచ్చి, తనవేడుకవచ్చినయట్టివారితో
సరసరతిప్రసంగములు సల్పఁగ నేర్చుఁ, దదీయనైపుణ
స్ఫురణముచంద మెందును నపూర్వము! చూడఁగఁ బొమ్మ గ్రక్కునన్.

16


వ.

అనుటయు.

17


చ.

చెలఁగి కటారిబిత్తరము చిమ్ము వికారపునవ్వు నవ్వు, మీ
పలు వడివెట్టు నూరక, 'మజా' యనుఁ 'దన్నన'యంచుఁ బాడుఁ గ
న్నులు వెసఁ ద్రిప్పు కొప్పుపయి నున్నగ దువ్వు, బళాలు వెట్టు, మూఁ
పులు పలుమాఱుఁ జూచుకొనుఁ బుష్పకరండకుఁ డాత్మ నుబ్బుచున్.

18


పద్మావతి కథ

ఉ.

క్రన్నన వారి వీడుకొని, కన్నుల మ్రొక్కి, వెసం దలారి యై
క్రొన్ననవింటఁ దేఁటిగఱికోల యమర్చి మరుండు వెంట రా;
మున్నుగ నెమ్మనంబు తన ముందటిచక్కని ద్రోవవెట్టఁగాఁ,
గన్నియయూరి కేఁగెఁ దమకంబునఁ బుష్పకరండకుం డొగిన్.

19


వ.

అరిగి మహాఘోషపురవరోపాంతంబున, శశికాంతశిలాతలంబునఁ బథిశ్రమం బార్చుకొని, తదవసరోచితాలంకృతుండై యన్నగరంబున కరిగి, మనఃపద్మసద్మయగు నప్పద్మగంధిమందిరంబు పౌరజనంబులవలన నెఱంగి, మందమందగతిం జని తన్నికేతనంబు ప్రవేశించి.

20


ఉ.

ప్రాకటహేమరత్నమయపంజరపీఠికలన్ శుకంబు ల
వ్యాకులలీలతో రతిరహస్యవికాసకళావిలాసకొ
క్కోకము లర్థితోఁ జదువఁ గూరిమితో వినుచున్, సురూపరే
ఖాకమనీయతామహిమఁ గామునిదీమముఁబోలె ముందటన్.

21

సీ.

రంజితమణిసాలభంజికలకుఁ దన
        భాసురాకృతి మేలుబంతి గాఁగ
రత్నపంజరకీరరాజికిఁ దనవాక్య
        సమితి గురూపదేశంబు గాఁగఁ
గమనీయకలహంసగతులకుఁ దనగతి
        యొఱపులు గఱపెడి యొజ్జ గాఁగ
ఘనసారగంధవాహనునకుఁ దనయూర్పుఁ
        దనిగాలి నెయ్యంపుదాది గాఁగఁ


తే.

దివిరి నడయాడుచుండు పూఁదీవె యనఁగ
నేకతమ నగరం జరియించుచున్న
కంబుకంఠిఁ బద్మావతీకాంతఁ గాంచె
బెన్నిధానంబు గాంచినపేద వోలె.

22


తే.

కన్ను మనమును దనియ నక్కాంతఁ జూచి
యింత యొయ్యారమగు సతి యెందుఁగలదె!
యనుచుఁ, బ్రియమును గంపంబు ననఁగి పెనఁగ
నల్లఁ జేరంగ వచ్చిన, యతనిఁ జూచి.

23


మ.

సుకుమారుం డగు మారుఁడో, కళలచే సొంపారు పాంచాలుఁడో,
యకలంకుం డగు కూచిమారుఁడొ యితం, డంచుం బ్రశంసించుచుం
బ్రకటస్నేహ మెలర్ప నాతనిపయిం బద్మావతీకాంత వా
లికక్రొవ్వాఁడి మెఱుంగుఁజూపుల నివాళించెం గువాళించుచున్.

24


క.

కనుఁగొనినమాత్ర నొండొరు
మనములు నొడఁబడిన వారి మఱియొక్కడకుం
జనకుండ నడ్డపెట్టఁగ
మనసిజుఁ డను కోలుకాఁడు మాటికిఁ దఱిమెన్.

25


క.

చూపుల వక్కాణంబున
నాపుష్పకరండకాఖ్యుఁ డరుదెంచిన మా

యోపాయపుఁగార్యస్థితి
దీపించినఁ బరిణమించి తిలకించి మదిన్.

26


ఉ.

ఈసుకుమారతావిభవ, మీదరహాసముఖారవింద, మీ
భాసురమూర్తి, యీలసదపారకృపారసనేత్రకాంతివి
న్యాసము లెందుఁ గంటిమె? ప్రియంవదుఁ డీతనియంద కాక; నేఁ
జేసిన భాగ్య మెవ్వరునుఁ జేయరువో! యితఁ డేఁగు దెంచుటన్.

27


తే.

అనుచుఁ గొనియాడి తిలకించి యావధూటి
చిన్నిలేనవ్వు చెక్కులఁ జీరువాఱ
సిగ్గు నెగ్గించు మధురోక్తి చెవులఁ జిలికి
యెలమి మజ్జనభోజనాదులను దనిపి.

28


వ.

తదనంతరంబ వసంతుం డను నిజసఖుం బిలిపించి చౌర్యగతికళావిధేయంబు లగు మాయోపాయంబు లుపదేశించిన, వాఁడును దదుక్తప్రకారంబునఁ బుష్పకరండకుం బురోపకంఠోపవనాంతరంబునకుం దోకొని యాత్మీయపరిదానసంకేతలతానికేతనంబున నునిచికొని సముచితసల్లాపంబు లొనరించుచున్నంత నిక్కడ.

29


క.

మగఁ డింటికిఁ జనుదెంచిన
మొగమోటము వట్టి మోహమున జిత్తములో
నిగురొత్త, మెఱుఁగుఁజూపుల
జికురాకుంబోఁడి పూజచేసె న్నగుచున్.

30


ఉ.

ఆయన మీఁ దెఱుంగక, ప్రియంబు నిజం బని సమ్మి మోహముం
జేయుట చూచి; నావలలఁ జిక్కె నితం డని కౌఁగిలించి, సౌ
ఖ్యాయతకంఠరావమధురాధరపాననఖాంకనక్రియో
పాయములందు మైమఱవఁ బద్మవిలోచన యీలవెట్టుచున్.

31


సీ.

మకరందములతీపు మగలకుఁ జవిచూపు
        మధుకరమదవతీమణుల యొప్పు

ఫలరసంబులు క్రోల్చి పతుల నిక్కకుఁ బిల్చి
        కొనిపోవు కీరకామినుల బెడఁగు
బిసములఁ దనియించుప్రియులతో విహరించి
        యలరు రాయంచతొయ్యలుల చెలువుఁ
బల్లవంబులు దెచ్చి ప్రాణేశ్వరుల కిచ్చి
        చెలఁగెడు కోకిలస్త్రీలమురువు


తే.

నెలమిఁ గొనియాడి, యాత్మేశు నియ్యకొల్పి
యతఁడు నతనుండుఁ గార్ముకహస్తు లగుచు
దోడఁ జనుదేర, జారనాథుఁడు వసించు
నువవనాంతరభూమికి నువిద చనియె.

32


క.

చని యాదంపతు లాత్మల
ననురాగరసంబు నిండి యలువులువాఱన్
వనకేలీతత్పరులై
వినుతవిహారములఁ దగిలి విహరించుతఱిన్.

33


క.

పదములు తొట్రుపడంగా
వదనంబున లేనిదప్పి వాతెఱ యెండం,
గదియఁగ వచ్చి వసంతుఁడు
హృదయమున భయంబుదోఁప నిట్లని పలికెన్.

34


చ.

కడు వెర వేది నేఁ, బ్రథమగర్భవతిన్ సతిఁ బుట్టినింటికిం
దొడుకొనివచ్చుచో; నిచట దుస్సహ మైన ప్రసూతివేదనం
బడియెడు, నియ్యెడం దగినబాసట లే; దటుగాన నింక నీ
పడఁతుక చిత్త మాపడతి భాగ్యము, మాటలు వేయు నేటికిన్.

35


వ.

అనుటయు వానిదీనాలాపంబులకు బ్రమసి పద్మావతీరమణుండు పద్మావతిం జూచి యిట్లనియె.

36


క.

జలజేక్షణ యెవ్వరికిం
గలసంసారము నుపేక్ష గావించుట గా,

దలసత్వ ముడిగి చను మని
పలికిన, నది చనియె జారపతి యున్నడకున్.

37


క.

చని సరసవచనరచనలఁ
జనవులఁ బరిరంభణాదిసంభావనలన్
మనసు గరఁగించి, పులకలు
తనువునఁ బొదలించి, రతులఁ దగిలించి తగన్.

38


సీ.

త్రుళ్ళుమింతలు వెట్టు తొడలదీప్తులతోన
        చనుదోయిమించులు చౌకళింప
రాణించు నందెలరవళితోడనె కూడ
        మొలనూలి మువ్వలమ్రోఁత నిగుడ
గటితటంబునఁ దోఁచు కదలు పెక్కువతోడఁ
        గర్ణభూషణములకదలు మెఱయఁ
గడలేని సుఖములఁ గరఁగిన మదితోడఁ
        జిత్రకస్ఫూర్తి లేఁజెమట గరఁగ


తే.

వదలుక్రొమ్ముడి యలరులవానఁ గురియ
హారమణిదీప్తి యుయ్యలలాడుచుండ
మగువ పుంభావలీలల మాఱుమగనిఁ
గంతుసామ్రాజ్యలక్ష్మికిఁ గర్తఁ జేసె.

39


వ.

ఆ పుష్పకరండకుండును సంతోషితస్వాంతుండై.

40


చ.

పురిఁ బురిఁ దప్పకుండ, మొలపూసలు ద్రెవ్విననాఁట నుండియుం
దిరిగితిఁ బెక్కుభూములు సతీ! రతిసౌఖ్యరసప్రసంగవి
స్ఫురణల తారతమ్యములు చూచితిఁ గాని, భవత్సమాన లే
తరుణులుఁ గారు భావభవతంత్రకళాకలనాచమత్కృతిన్.

41


వ.

అనవుడుఁ బద్మావతి మదీయచాతుర్యంబునకు నాశ్చర్యంబందనేల యని యిట్లనియె.

42

గుణవతి కథ

క.

చేరువ భర్మస్థల మను
నూర, గుణవతి యనంగ నొకయుగ్మలి చె
న్నారు, మనోహర మగుశృం
గారరసం బాఁడురూపు గైకొన్నక్రియన్.

43


సీ.

చందురునెఱ వరజాఱఁజేయుట గాక
        నెత్తమ్మిమీఁద దండెత్తఁ జూచుఁ
బసిఁడిసలాకపైఁ బగలుచాటుట గాక
        తొలకరిమెఱుఁగుల దొడరఁజూచుఁ
గరికుంభములమీఁడఁ గాలుద్రవ్వుట గాక
        జక్కవకవతోడ [1]వక్కరించు
మగమీలతో మగమాటలాడుట గాక
        పువ్వుఁదూవులకును బొమ్మవెట్టు


ఆ.

ననఁగ మోముఁ దనువుఁ జనుదోయి కనుదోయి
కనుఁగొనంగ నొప్పుఁ, గాముప్రోది
దీమమగు గుణావతీవధూమణికిని
సరి యనంగ మగువ జగతి గలదె?

44


క.

వలపులవదనిక, చిలుకల
కొలికి, రువారంపుఁగలికిగుబ్బల నవలా
పులుగడిగిన ముత్యముసిరి
పులకండపుఁబొమ్మ యనఁగఁ బొలఁతుక యొప్పున్.

45


చ.

కలువలు గండుమీలుఁ దొలుకారుమెఱుంగులు నిడురామికిం
జెలువుగ నేపదార్థ మెనసేయదునో సతికన్నుదోయికిం?
దలఁచి పయోజసంభవుఁడు తామరలం బ్రతిసేయఁబోలు; నౌఁ
బొలుపుగ నెల్లవారుఁ దమపుట్టినయిండ్లను బెద్దసేయరే?

46


క.

అట్టి గుణావతి, తనపతి
కట్టెదురను మాఱుమగనిఁ గవయఁగ నేర్చున్,

నెట్టుకొని యాఁడువారల
దిట్టతనం బెఱుఁగ బ్రహ్మదేవుని వశమే?

47


చ.

అనుచుఁ దదీయనైపుణగుణాళి విరాళిగొనంగఁ జెప్పఁగా
విని, యిటువంటి వెన్నఁడును విన్నది కన్నది లేదు మున్ను; చా
లును గణుతింపఁ [2]గోనొఱవలో నిజమో తెలియంగఁ జెప్పుమా
యనఁగ, లతాంగి నీయడుగులాన నిజం బని నమ్మఁ బల్కినన్.

48


వ.

తత్ప్రతీపదర్శినీదర్శనతత్పరుండై తత్పురంబునకుం జని.

49


క.

వన్నె మెఱయంగ నాసతి
యున్నగృహం బప్పు డరసి, యుచితస్థితితో
విన్ననువునఁ జని; యచ్చో
సొన్నాటంకంబువోలు సుదతిని గాంచెన్.

50


తే.

మోవి పవడంబుఁ దమలోన ముడివడంగ
నడుము బయలును దమలోనఁ దడఁబడంగ
మేను మెఱుఁగును దమలోన మేళవింపఁ
దెఱవ యొయ్యారముగ వానిదిక్కు చూచె.

51


తే.

కందు వొరయని పున్నమచందురుండొ
శివునికనుఁబాటు దాఁకని చిత్తభవుఁడొ
కాక, నరమాత్రుఁడే వీఁడు నాకుఁ జూడ
ననుచుఁ దలయూచి కొనియాడె వనజగంధి.

52


క.

వేడుకమై నపు డిరుమైఁ
గాడంగఁ దొణంగె నతనిఁ, గామునిశరముల్
చేడియచూపులుఁ దమలో
సూడించె ననంగ నొక్కసూటిం బెలుచన్.

53


క.

మనసిజుఁ డిద్దఱకును గుం,
టెనకానితనంబు చేసెడిం గనుఁగొన నాఁ,

జనవులు మాటలయనువులు
దనువునఁ బులకలును గలుగఁ దత్తఱపెట్టెన్.

54


క.

చెన్నారు వచనరచనలు
మున్నాడం గనిన వలపుమొలకల తెఱఁగుల్
మున్నాడి మనసులతో
గ్రన్నన వీడ్కొనిరి సిగ్గుఁ గన్నెఱికంబున్.

55


చ.

పులకితచిత్రరూవముల పోలిక నిద్దఱుఁ గొంతప్రొద్దు చూ
పులఁ బరిణామముల్ దెలిసి, పుష్పకరండకురాక యంతయుం
దెలిసి, గుణావతీలలన దిగ్గన మజ్జనభోజనాదిపూ
జలఁ బరితుష్టుఁ జేసి, తనచల్లనిమాటల గారవించుచున్.

56


సీ.

అరవిరి విరవాది బిరుదపెండెములతో,
        సోలు కోయిలమావటీలతోడఁ
బూఁదేనెగందాన బ్రుంగుడుపడి యున్న
        గండుఁదుమ్మెదలెంకగములతోడఁ
బరువంపు జాజిపక్కెరలతోఁ జెలరేఁగు
        చిలుకగుఱ్ఱపుఁబౌఁజుసిరులతోడ
గుబగుబ వాసన గుబులుకో ముంగల
        నేఁగెడి చలిగాలి వేగుతోడ


తే.

హరిహరబ్రహ్మగాఢమానాపహారి
త్రిభువనధనుర్విహారపరీక్షకుండు
కమ్మవిలుకాఁడు మెఱమ, శృంగారవనము
లోని గురివెందపొదక్రింద వాని నునిచి.

57


ఉ.

ఇంటికి వచ్చునంత మగఁ డింటికి వచ్చిన, నాథ! నీవు న
న్నొం టిడి, రాక యింతదడ వుండఁగ గారణమేమి? యింక న
న్నంటిన నీకు నీ వెఱుఁగు దంచు నొకానొక తప్పు వెట్టి, వె
న్వెంట నతఁడు రాఁ జనియె వెండియుఁ దొయ్యలి పువ్వుఁదోఁటకున్.

58

చ.

చనునెడ, దాని మన్మథపిశాచము సోఁకిన నొచ్చెనంచుఁ దూ
యని పలుమాఱుఁ దూపొడిచి, యల్ల నఁ బుప్పొడి రక్షవెట్టి, క్ర
మ్మన నధరామృతంపుబలుమం దొకయించుక యిచ్చిమించులం
బొనరినచూపులం బడిసిపో నటువైచుచుఁ గౌగిలించుచున్.

59


చ.

 కనదురుకాంతి కాంత శశికాంతశిలాతలకుట్టిమస్థలిన్
వినుతలతావనీజసుమవేదికపై, శ్రమమార్ప దానునుం
దనమగఁడుం గళాకుశలశావశతం దదుపాంతవిస్ఫుర
ద్ఘనవకుళావనీరుహశిఖామణినీడ సుఖానురక్తయై.

60


వ.

కొంతదడవుండి, యాపొంతం గుసుమవిసరభరితం బగుచుఁ జెన్నారుచున్న సురపొన్నఁ గన్నారం గనుంగొని, యిందుల పువ్వులకుం గల పరిమళం బెందుల పువ్వులకుఁ గలదని మునుముట్ట మాయవెట్టం గడకట్టు చేసికొని, యప్పటికిఁ గదలి యాసురపొన్నక్రిందికిం జనుదెంచి యిట్లనియె.

61


సీ.

సేమంతిచవికెలఁ జెలరేగి చిలుకలు
        మదనశాస్త్రంబులు చదువుచుండఁ
గడిమికూటములఁ బికమ్ము లనంగ నే
        పాళప్రబంధంబు లాలపింప
జాజి యోవరులలోఁ జంచరీకంబులు
        వలరాజు బిరుదాంకములు పఠింప
సంపెంగ నాటకశాలలఁ గలహంస
        లతనుగీతంబుల నాడుచుండ


తే.

వేడుకలతోడఁ జూడంగ వినఁగఁ గంటి
మిట్టివనములు గలవె యేపట్టణముల?
ననుచు మగనిమనంబును నలరఁజేయు
కరణి, నుపకాంతు మాటల గారవించె.

62


తే.

కురులకప్పున నెలదేఁటియిరులు బెరసి
మరులుగొలుపంగ, మరుచేతియురులు దగిలి

కన్ను గానక, మాఱుమగండు మగఁడు
బలుపుఁజీఁకటి దప్పంగఁ బడి విసువఁగ.

63


సీ.

తరుణి యశోకంబు తన్ను నందెలమ్రోత
        గాంచీవిరావంబు గడ కొదుంగ
లలితాంగి తిలకించి తిలకంబుఁ గనుఁగొనుఁ
        గనుదోయిమెఱుఁగు లాకసము గప్పఁ
బొలఁతి పుక్కిటికల్లు పొగడపై నుమియు లేఁ
        జెక్కుల చిఱునవ్వు చెక్కులొత్తఁ
గలకంఠి యెలక్రోవిఁ గౌఁగిటిలోఁ జేర్చు
        గంకణ ఝణఝణత్కార ములియఁ


తే.

దియ్యవిలుకాని విడివడ్డదీమ మనఁగ
నతను మోహనమంత్రదేవత యనంగ
మగని ముందట విరహాగ్నిఁ బొగులుమాఱు
మగనిముందటఁ బ్రోడయై మదము కవిసి.

64


వ.

ఇవ్విధంబునఁ బువ్వువిలుకాని నవ్వుక్రొవ్వుగల యలజవ్వని మగనిముందట ముద్దుగురియుచు, సరసంపువచనరచనల మనంబుకొలఁది యరసి గరువంపు వలపుపొలపులు గ్రిక్కిఱిసి పునఃపునరాలింగనంబు చేసి, యతనితో నిట్లనియె.

65


ఉ.

ఈసురపొన్న యెక్కి నుతికెక్కిన కమ్మనిపువ్వు లెల్ల నేఁ
గోసెదఁ జూడుమీ! యనుచుఁ గోమలి యాతరు వెక్కి, యొక్కపూఁ
గోసి నుతించి మూర్కొనుచుఁ గుత్సితబుద్ధి నిదేశుఁ జూచి, సే
బా! సిటు లేను జూడఁ బెఱభామినితో రమియింపఁ బాడియే?

66


తే.

అనుచు వలవని [3]వలపనికినుకతోడ
మ్రానుడిగ్గినఁ, దొయ్యలి మ్రానుపడుచు
సొలయఁగా నేల? యిచ్చోట జోటి యన్య
కాంతఁ జూపుమ వల దింత కటికితనము.

67

క.

అనుచును వెలవెలఁబాఱెడు
తనపతి మది మెచ్చ, నీవు తరు వెక్కి ననుం
గనుఁగొను; మే వేఱొకపురు
షునిఁ బొందిన చంద మగునొ చూతమటంచున్.

68


చ.

జిగి దొలకాఁడు లేనగవు చిమ్మెడు చూపులు మీఁదఁ జల్లుచున్
సగినల వంటి చన్నుఁగవ జక్కవపిట్టల బైలువెట్టుచో
నిగిడెడుప్రేమ మీఁ దెఱుఁగ నేనక, తా సురపొన్న యెక్కె న
మ్మగఁ డిల నాఁడువారి పలుమాయలఁ గాయజుఁ డైనఁ జిక్కఁడే!

69


వ.

ఇవ్విధంబునఁ బువ్వుంబోడి పిఱుతివ్వని నవ్వుటాలమాటల వాని మ్రానెక్కించి, యొక్కపువ్వుఁ గోసి మూర్కొనుసమయంబున, నతండు చూచుచుండఁ గుసుమరసవిసరలసదహంకారఝంకార లలితశిలీముఖజ్యాటంకార సముద్దండప్రసవకోదండనిర్ముక్త పుష్పశిలీముఖమఖానలశిఖాసంతప్తమానసుం డగు పుష్పకరండకుం గనుసన్న నాసన్నుంజేసి, తనయధరామృతంబున సేదదేర్చి పరమానందకందళితహృదయుం జేసి కందర్పక్రీడం దనిపి, విస్మయానందకందళితస్వాంతుం డగు నతని కిట్లనియె.

70


క.

నను మెచ్చెద, విది యచ్చెరు
వన నేటికి? నాసుధర్మ యను నగరమునన్
జనమోహిని లీలావతి
యనుకామిని యుండు, ననుజ యగు మఱ నాకున్.

71


లీలావతి కథ

తే.

కమ్మని పదాఱువన్నె బంగారుకరువు
కామవిద్యారహస్యముల్ గఱప గురువు
సరసజనములు భ్రమపడి తిరుగుతెరువు
మెఱయు లీలావతీకాంత మేనిమురువు.

72


ఆ.

ఆలతాంగి చూపు లల్లార్చి చూచిన
నతనుమహిమచేత యతులకైన
దెమలి యినుపకచ్చడము లూడిపడు నన్న
నున్నవారి నింక నెన్న నేల?

73

ఆ.

అమృతరసముతేట లంగన మాటలు
మరుని చేతియురులు మగువకురులు
కప్పురంపుఁగ్రోవి కలకంఠికెమ్మోవి
యాలతాంగిఁ బొగడ నలవి యగునె!

74


వ.

ఆలీలావతి మగండునుం దాను నేకశయ్య నుండి యుపనాయకునిం గుసుమసాయకక్రీడ నలరించు, నీ వాలలనవలని చోద్యంబులు చూడవలదేనిం జను మని వీడుకొలిపి.

75


క.

తనవిభుని నగవుఁజూపులఁ
గనుఁగొని, నామాట నిజమొ కల్లయొ చెపుమా!
యనిన నది యట్ల తప్పద
యొనరఁగ నీమాయ తెరవుదో పువ్వులదో?

76


క.

అనుచు వెడనగవుతోడను
మనమునఁ గడు జోద్య మంది మ్రాను దిగి, నిజాం
గనయును దానును వీటికి
జనియె; విలాసినుల నమ్మఁజన దెవ్వరికిన్.

77


క.

అటఁ బుష్పకరండకుఁ డె
క్కటి యరిగె గుణావతీనఖవిలిఖతలతా
స్ఫుటకక్షకంధరాతల
నిటలతటవిలాసుఁ డగుచు నెయ్యం బలరన్.

78


వ.

అట్లు చనుచుఁ దదంగనానంగసంగరసంగతనఖాసిపథాలంకృతం బగు నిజాంగంబుఁ గనుంగొనుచుఁ దనమనంబున.

79


మ.

చిగురాకు న్నునుఁగెంపు లేఁదొడవు లిచ్చెం జిత్తజుం, డిచ్చెఁ బో
నగు నీలాగు ఋణంబు వీరలక యెన్నం డబ్బె నమ్మా! యనుం
దగుఁబో వీరికి నాకు సంగమము హా నాపాలిభాగ్యం బనున్
ముగురం గూర్చిన ముండ దైవమునకున్ మ్రొక్కంచు ‘జేజే’యనున్.

80

వ.

అని యంతస్స్మితసంస్మితవదనుం డగుచు, సుధర్మానగరంబునకుం జని లీలావతీమందిరంబు ప్రవేశించుటయు.

81


సీ.

దారపారలు గాఁగఁ దాఁకిన మలుపచ్చి
        కసమస వలరాచమసలతోడ
నక్కడక్కడ మేర నడ్డపాటులుగాఁగ
        వైచిన గందంపువలపుతోడఁ
దొలకరించి నటించు మొలకసిగ్గులచేత
        సుడివడి కడకొత్తు చూపుతోడ
నూరక మంటయై యుబ్బినవిరహాన
        లపుశిఖి నెగయు నూరువులతోడ


తే.

నెలమిఁ దనరారి, దనదు కట్టెదుర నిలువఁ
బడిన విటచక్రవర్తి సౌభాగ్యమూర్తి
రసికజనముఖ్యుఁ బుష్పకరండకాఖ్యు
దెఱవ కనుఱెప్ప వెట్టక ముఱిసి చూచె.

82


క.

చూచిన, వాఁడుఁ దలోదరిఁ
జూచెం బులకించి, చూపుఁ జూపును దమలో
ద్రోచికొని రాకఁ గ్రీడా
శ్రీచతురత మెజయ సాముచేసె న్నడుమన్.

83


ఉ.

ఇందునికందు వేర్పఱచి, యిందునిచే సతిమోము చేసి; యా
కందును గుంతలంబులుగఁ గంజభవుం డొనరించెఁ, గానినాఁ
డెందును మోమునుం గురులు నిట్టివి గంటిమె! యీతలోదరిం
బొందనియట్టివాని మగపుట్టువుఁ బుట్టువుగాఁ దలంతురే!

84


వ.

అనుచు మనోహరాలోలహేలాలలితపాంచాలుండగు నప్పుష్పకరండకుం లీలావతీవిలాసినీవిలోకనవాగురుం దగిలి, యల్లనల్లనఁ గదియం జనుటయు.

85


మ.

వరసౌభాగ్యవిలాసమూర్తి యితఁ డెవ్వండొక్కొ! యీ రూప మె
వ్వరియందుం గనుఁగొంటిమే? యితని లావణ్యంబుఁ గన్నారఁ గ

[4]న్న రమానందనుఁడైన సిగ్గువడఁడే నాపాలిభాగ్యంబుగా
నరు దేఁబోలుఁ దలంప నీతఁ డనుచుం హర్షించె నక్కాంతయున్.

86


క.

అంతట నిద్దఱ మనసులుఁ
గంతునిపస గలసె, వింతకసమస లొలయన్
మంతనములు పెదవుల నిసి
ఱింతలు వాఱంగ, నగవు ఱెప్పలు గోరన్.

87


వ.

తదనంతరం బాపుష్పకరండకుండు.

88


క.

తా వచ్చినకార్యమును, గు
ణావతి పుత్తెంచినట్టి నైపుణమును లీ
లావతికిఁ జెప్ప నదియును
భావంబున సంతసంబు బైసుకవెట్టన్.

89


ఉ.

ఆసమయంబునం దపనుఁ డస్తగిరీంద్రమునందుఁ బొంద, లీ
లాసరసానుకూలగతులం దగ వానికి నాఁడురూప మె
చ్చై సొబగారుచుండ, మణిహారవిభూషణ రాజిచేతఁ గై
సేసిన, నొప్పెఁ గృత్రిమపుఁజేడియయైన ముకుందుఁడో యనన్.

90


ఉ.

అప్పుడు నాథుఁ డింటికి రయంబున వచ్చిన మ్రొక్కఁబంచినం
దప్పక చూచి చీఁకటికతంబున నాఁటదిగాఁ దలంచి, యీ
యొప్పులకుప్ప యెవ్వ, రని యువ్విళులూరుచు వేఁడఁజొచ్చినం
జెప్పఁదొణంగెఁ దొయ్యలి వశీకృతదుశ్చరితప్రవీణ యై.

91


క.

ఈయంగన పద్మావతి
మాయక్క, ననుం దలంచి మన సూఱటగా
నీయెడకు వచ్చె ననుచును
మాయోపాయంబుగాఁగ మగనికిఁ జెప్పెన్.

92

ఉ.

నావుడు సంతసిల్లి, వదినం దగులాగులబుజ్జగించి, లీ
లావతితోఁ "దలంపని తలం పిట వచ్చిన దీలతాంగి ప
ద్మావతి దీనికిం దగిన మజ్జనభోజనవస్త్రగంధమా
ల్యావలులందుఁ బొందుగఁ బ్రియంబు దలిర్పఁగఁ జేయు మిత్తఱిన్.”

93


వ.

అని, ప్రియానులాపంబులం గలుపుకొని సరసవచనరచనలం బ్రొద్దుపుచ్చుచుం, బ్రొద్దువోయినపిదప నమ్ముద్దియ లిద్దఱుం దానును బొత్తునం గుడిచి, పులుకడిగిన పసిండిగలంతిం బరిమళమిళితోదకంబులం జేతులు గడిగికొని వార్చి, మడుంగులం దడియొత్తులం గరంబులు దుడిచికొని, కర్పూరతాంబూలంబులుం గైకొని, సస్మితముఖారవిందు లగుచు దదుచితానురంజనసమంజసమంజులానులాపోద్వృత్తవిభవక్రీడారసాయత్తప్రమత్తాకులచిత్తులై, రత్తఱి లీలావతి మెత్తఁదనంబు లిగురొత్త నెత్తమ్మిఱేకు లేఱి పయింబఱచిన మెఱుంగుతళుకులు గిఱికొనిన హంసతూలికాతల్పంబుమీఁదికిం జని.

94


క.

మగఁడును మాఱుమగండును
దగ నిరుదెసఁ బవ్వళింపఁ, దా నడుమై యొ
ప్పుగ శయనించె ముదంబున
బిగిచన్నులనడిమి మణులపేరుం బోలెన్.

95


సీ.

అందిచాపుల నధరామృత మాని తా
        హృదయేశుచిత్తంబు పద నెఱింగి
చిడిముడిపడి మేను చెమరించె నటు ముట్టఁ
        బొమ్మని, యుపనాథు బుజ్జగించి
కర్ణాభరణహల్లకము వోవ మీటెడు
        తెఱఁగున గొబ్బున దీప మార్చి
యెఱుఁగనియది వోలె నింక నోయనుచును
        జీఁకటిరాఁదగఁ జెలఁగి చెలఁగి


తే.

లీలఁ జేసన్న బరణ బాగాలు గులికి
యిద్దఱకుఁ బెట్టి చుట్టి యా కిచ్చి యిచ్చి

మగనిదిక్కు మొగంబుగా మంతనంబు
మాటగా నిట్టు లనియె నమ్మాయజోటి.

96


తే.

ఇంపు లొదవంగ నేను నాయింతి గూడి
యాలిమగనాట లాడుదు మాదికాల
మిప్పు డిది చూతుగాక నీ వెఱుఁగునట్లు
కన్నుమూసినవిధమునఁ గదలకుండు.

97


వ.

అనుచు నాభద్రేభగమన ముద్రవెట్టి కపటనిద్రాముద్రితుం జేసి సమున్నిద్రాతిశయరతితంత్రస్వతంత్రమర్మసమరత్యుపరతులఁ బుష్పకరండకునిఁ బుష్పకోదండక్రీడం దేల్చిన నతండు లీలావతీవిలాసినీకుహనాచాతురీధురీణత్వంబునకు వెఱఁగుపడియె నంత నరుణోదయప్రకటకుక్కుటకంఠకఠోరనిర్గళన్నిరర్గళాత్యంతభయంకరారవంబు వీతెంచిన నుదరిపడి లీలావతీకాంత నిజకాంతునికిఁ దెలిపి పద్మావతీప్రయాణం బెఱింగించి యతనిచేత ననిపించి తానును గొంత దవ్వరిగి పునఃపునరాలింగనంబు చేసి మఱవకుండు మని పద్మావతీనామాభిరామ పరిహాసవిహారుండగు నప్పుష్పకరండకునిం దగులాగున వీడుకొలిపి శయ్యకుం జని యాశ్చర్యకరుండైన మగనిమనసు తదవసరోచితక్రియలం బడసె నని ప్రతాపార్కుండైన విక్రమార్కునకు సువర్ణకుంభంబు మనోహరకథావిధానంబు పరిపూర్ణంబుగా నెఱఁగించి యిట్లనియె.

98


క.

ఏవిన్నపంబు చేసిన
యీ వెలఁదులలోన జాణ యెవ్వతె? యనుచుం
దా వేడుక నడిగిన బ
ద్మావతి యని పలికె నతఁడు మందస్మితుఁడై.

99


వ.

పలికినం గోపించి.

100


సీ.

చెక్కులందు నివాళి సేయు లేనగవులు
        తాటంకరుచి కొల్లకోటు సేయ
జిగి ధగధ్ధగయను బిగువుఁజన్నులమీఁదఁ
        క్రొమ్మించుసరులు త్రోద్రోపులాడ

నంటినఁ గందునో యనుమేనినునుఁగాంతి
        యిరుగెలంకులకు నుప్పరము దాఁటఁ
దొంగలిదెప్పలఁ దూఱుదుంకెనలాడు
        సోలుఁజూపులు మరు మేలుకొల్పఁ


తే.

బట్టుగవుసెన దీసిన భావభవుని
పసిఁడివిలుకమ్మియో నాఁగ ముసుఁగు దిగిచి
పఱపుమీఁదను గూర్చుండఁబడి కళావ
తీశిరోమణి యారాజుదిక్కు సూచి.

101


క.

మీమాట కాదనఁగ రా
దేమీ తప్పంగఁ జెప్పు టిది తగ వగునే,
భూమిప! లీలావతి యను
భామినియె విదగ్ధ గాక పద్మావతియే?

102


వ.

అని పలికి నిజప్రభావవిశేషంబున నతని విక్రమాదిత్యుఁగా నెఱింగి కళావతీముగ్ధ కళావిదగ్ధయై వికసితస్నిగ్ధాంచితనయనారవిందంబుల నవ్విభునిం గనుంగొని.

103


ఉ.

చాటున కెక్కినట్టి నెఱజాణతనంబున వాగ్విలాసతన్
మేటివి నీవు; నిన్ను నుపమింపఁ ద్రిలోకములందు రాజు లె
ప్పాట లేరు; నామనసుపాఁ తగలంచి వెలార్చినట్టియా
మాటలు మూఁడు నుంకువగ మానవనాయక నీకుఁ దక్కితిన్.

104


చ.

నను వరియింపు కీర్తిలలనాకలనాలలితప్రతాప, యా
చనభజనానురూప, జలజాతముఖీసరసానులాప, నూ
తనవరపుష్పచాప, కవితామృదుగానకళాకలాప, శో
భనకరరూప! సర్వనరపాలకులోచితవర్తనంబునన్.

105


క.

అని రాజు చిత్తమునఁ గృప
తనరంగా మాటలాడి, తమ కిద్దఱకున్
మనసిజుఁడు పెండ్లిపెద్దగఁ
జనవున వరియించి, కేళిశయ్యకుఁ దార్చెన్.

106

ఆ.

తార్చి, వచనరచనఁ చేర్చి, చిత్తములోని
మదనవహ్ని యార్చి, ముద మొనర్చి
యసమరతుల నోలలార్చి, కౌఁగిటఁ జేర్చి
మనసుకోర్కి దీర్చి, మదిఁ దనర్చి.

107


క.

మానిని కరపాశంబుల
చే నీగతిఁ గట్టివైచి, జిగి దొలఁకెడు పూ
బానుపునఁ బెట్ట వలదా
మానధనం బపహరింప మరగినదొంగన్.

108


క.

ప్రోడ యగుకళావతి యిటు
కూడి మెలఁగె రాజుమనసుకొలఁదినె, విభుఁడుం
జేడియఁ గూడి చరించెను
నీడయు రూపంబుఁబోలె నెయ్యం బలరన్.

109


వ.

అంత నొక్కనాఁడు.

110


సీ.

మణిపంజరాంతర మంజుకీరశ్రేణి
        యాత్మీయవిజయంబు లభినుతింప
సరసవిలాసినీచామరానిలమున
        నలినీలకుంతలంబులు నటింపఁ
బ్రతిపన్నకామినీప్రౌఢగానక్రియా
        రచనలు కర్ణపారణ మొనర్ప
రత్నసింహాసననూత్నప్రభారాజి
        తన తనుద్యుతులచే నినుమడింప


తే.

నంతిపురమున మండపాభ్యంతరమున
నంగనలు గొల్వఁ గొలువుండి, యానరేంద్ర
సింహుఁ డుజ్జయినీపురశ్రీలఁ దలఁచి
యింపుమీఱఁ గళావతి కిట్టులనియె.

111


సీ.

కాంచనపేటికాకర్పూరవీటికా
        లలితవధూటికావిలసనంబు

నీలశైలస్థూలనిభిడమహాభీల
        శుండాలఘీంకారశోభితంబు
సలలితాంగకురంగజవతురంగతరంగ
        మంగళహేషాసమంచితంబు
మన్మథసుకుమారమహితసుఖాకార
        కలితరాజకుమారకలకలంబు


తే.

వేదశాస్త్రాదివిద్యాప్రవీణవిప్ర
జనమనోహరచిరనిజస్థానకంబు
ఘనతరైశ్వర్యవిజితాలకాపురంబు
నిఖిలఫలసార ముజ్జయినీపురంబు.

112


ఉ.

ఆపుటభేదనంబు, సమదారి మనఃపుటభేదనక్రియా
లాపవటుప్రతాపరణలంపటసద్భటతోమరప్రభా
దీపశిఖాగళత్తిమిరదీప్తిదివానిశ, మస్మదీయబా
హాపరిఖావృతంబు, మన మక్కడ కేఁగుట యొప్పు నిత్తఱిన్.

113


వ.

అనిన విని, దరహసితవదనయై కళావతి నిజకళాకౌశలంబు మెఱయఁ గరంబుప్రియంబున నతనికరంబు కరంబునం గీలించి, హృద్యానవద్యమందిరోద్యాన సముద్యత్కాసారకనత్కనకమరీచి సముజ్జ్వలత్సారసనాభంబుఁ బ్రవేశించి, యుజ్జ్వలోజ్జయినీపురవర సరసలీలాకుతుకానుకూలావనీరుహకుసుమవిసర పరిమళపరాగానురాగసుఖపరాయణ శిలీముఖపక్షవిక్షేపణోద్ధూత మందమారుతసంచరణ సమంచితసరోజవిరాజితరాజమార్గంబున నిర్గమించె, నంత సైన్యసమేతుం డైన భట్టి చనుదెంచి సర్వాంగసంగతోర్వీతలం బగుదండప్రణామం బాచరించిన, సాహసాంకమహీపాలుండు పులకకలికాకంచుకితసకలాంగుండును హర్షబాష్పతరంగితనయనాద్యపాంగుండునునై, పునఃపునరాలింగనంబు చేసి యతనితో నిట్లనియె.

114


క.

ఎట్టిదొకో సంసారము
నెట్టన నిముసంబుఁ బాయనేరని మనలం

గట్టిఁడివిధి చూపోపక
భట్టీ! యెన్నాళ్ళు నిన్నుఁ బాయఁగఁ జేసెన్.

115


క.

నావుడు సుమతితనూజుఁడు
ప్రావీణ్యము మెఱయ మనుజపతి కిట్లనియెన్
దేవర యెం దరిగిన, నా
భావంబునఁ బాయకుంటఁ బాయుట గలదే?

116


వ.

అని యిట్లు సలాపంబు లొనరించి యనంతరంబ.

117


సీ.

ప్రకటదానోన్నిద్రభద్రేభములు గొల్వ
        నానామణిస్యందనములు గొల్వ
జవసత్త్వసుమహత్త్వచటులాశ్వములు గొల్వ
        బలసముద్భటవీరభటులు గొల్వ
ధర్మవిధానప్రధానోత్తములు గొల్వ
        సామంతమండలేశ్వరులు గొల్వ
వరవిలసనచారువారాంగనలు గొల్వ
        గాయకనాయకోత్కరము గొల్వ


తే.

నాత్మతరుణిసమేతుఁ డై యరద మెక్కి
శ్రీ మదుజ్జయినీసతీశ్రేణి పాణి
తామరసముక్తముక్తాక్షతప్రసక్త
నవ్యమణిమస్తకుండు నై నగరు చొచ్చి.

118


క.

తనుఁ గొల్చి వచ్చువారల
ననురాగరసార్ద్రహృదయుఁ డై గృహమునకుం
జనుఁ డని, సతియును దానును
జననాయకుఁ డంతిపురికిఁ జను సమయమునన్.

119


ఉ.

నైజకటాక్షరోచులుఁ గనత్కరమూలమరీచులుం, గుచ
భ్రాజితకాంతివీచులును బైకొని దీపశిఖాలిఁ బ్రోవఁగా;
రాజితకంకణధ్వనులరాగ మెలర్పఁగ, నేర్పుతోడ నీ
రాజన మాచరించిరి పురంధ్రులు దంపతు లిచ్చ మెచ్చఁగన్.

120

ఉ.

శ్రీయువతీధరాసతులఁ జెంది విహార మొనర్చు నాదినా
రాయణురీతిఁ, బ్రీతి వెలయంగ ననంగవతీకళావతీ
తోయజపత్త్రలోచనలతోడ నిరంతరసౌఖ్యవైభవుం
డై యఖిలప్రజావనపరాయణతన్ నుతి కెక్కె నెంతయున్.

121


ఉ.

పాడి సమస్తముం బొగడఁ బాయక, యాశ్రమవర్ణధర్మముల్
జాడలు దప్పకుఁడ, మఱి సజ్జనరక్షణ దుష్టశిక్షణ
క్రీడలె భూషణంబులుగఁ గీర్తి వహించె ధరిత్రి నవ్విభుం
డేడవచక్రవర్తి పదునేడవరాజునునై మహోన్నతిన్.

122


చ.

అతులితసామవాదసుఖితాఖిలబాంధవసత్కవీశ్వరా
ర్పితము నిత్యమౌ మహిమఁ జేర్చి చెలంగెను సిద్ధనార్యుఁ డీ
క్షితి నతిదానవైభవదశేషవిశేషకళాగమప్రభా
సితహితమంత్రిసామ్యగుణశిష్టయథోచితదండనైపుణిన్.

123


క.

భూరమణమంత్రి భాండా
గార సుహృద్దుర్గరాష్ట్రఘనబలవిభవో
దార, మదమత్సరాది వి
కారవిదూరప్రకార, కవితాకారా!

124


మంగళమహశ్రీ వృత్తము.

శ్రీమ దుభయాన్వయ విశిష్టతరకీర్తిబుధశేఖరవిరాజితవివేకా
కామితఫలప్రకరకల్పితవితీర్ణిజితకల్పకసమాజసురరత్నా
స్వామిహితకార్యగతి సంఘటననైపుణవిచార నయమార్గమహనీయా
సామజహయాదిబహుసంపదభిరామ గృహసన్నిహితమంగళమహాశ్రీ.


గద్యము:

ఇది శ్రీమదఖిలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కయనామధేయప్రణీతం బైనవిక్రమార్కచరిత్రం బనుమహాకావ్యంబునందు సర్వంబును నష్టమాశ్వాసము.

  1. డీకొను
  2. నీ యొఱపులో నిజమో. అని పాఠము (?)
  3. మదనక్రీడ
  4. న్న రమానందనుఁ డైనఁ జిక్కువడఁడే; నాపాలిభాగ్యంబు దా
    నరు దేఁబోలుఁ దలంప నీతఁ డనియన్ హర్షించె నక్కాంతయున్.