వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/చిన్ననాటి ముచ్చట్లు

వికీసోర్స్ నుండి

చిన్ననాటి ముచ్చట్లు (1953) - రచయిత:కె. ఎన్. కేసరి

Download this featured text as an EPUB file. Download this featured text as a RTF file. Download this featured text as a PDF. Download this featured text as a Mobi. పుస్తకం దింపుకోండి!

పుస్తక ముఖచిత్రం

కె.ఎన్.కేసరి గా పేరు పొందిన ఈయన అసలు పేరు కోట నరసింహం. ప్రముఖ ఔషధశాల 'కేసరి కుటీరం' స్థాపకుడు. కేసరి చేతికి ఎముకలేని దానశీలిగా ప్రసిద్ధి గాంచారు. స్త్రీ జనోద్దరణకై గృహలక్ష్మి మాసపత్రికను స్థాపించాడు. ఈయన స్వీయచరిత్ర చిన్ననాటి ముచ్చట్లు గురించి ప్రత్తిపాటి సత్యనారాయణరావు వ్రాసిన ముందుమాటలో ఆనాటి చెన్న నగరము ఎట్లుండెనో, అప్పటి విద్యార్థులెట్లు కాలము గడిపిరో, రోడ్లు, కాఫీహోటల్లు భవనములు ఏరీతిన ఉండెడివో తెలుసు కొనుటకు అనువగు వర్ణనలు కలవని, కేవలము వైద్యవృత్తిలోనేగాక, శిల్పమందు, లలితకళలయందు, సనాతన ధర్మరక్షణయందు వారికిగల నైపుణ్యము తెలుసుకొనవచ్చునన్నారు.

"నా గృహిణి కొన్ని గ్రహములతో కూడ నా గృహము చేరినది. ప్రతిదినము యేదో గ్రహము ఆమెకు సోకటము, తల ఆడించడము, కేకలు వేయడము దగ్గరకు పోయిన తన్నడము, పీకడము, కొరకడము! ఈలాగున యింటిలో గ్రహములు తాండవమాడుచుండెను. మాకు తోడు యెవరు లేరు. పొరుగున అరవ కాపురము; దయ్యాలతో కూడ ఆ యింటిలో మేముండుట అరవలకు యిష్టము లేదు. క్రమముగ నా భార్య మెడనిండుగ లెఖ్కలేనన్ని రక్షరేకులకు తావు కలిగెను. పలువిధములయిన రుగ్మతలతో బాధపడుచు మంచమెక్కుచుండెను.

నాతో కూడ అరవ బడిపంతులు కాపురముండెను. ఆ పంతులు పేరు వెంకటేశయ్యరు. భార్య పేరు మంగళాంబ. వీరికి యిరువురు బిడ్డలుండిరి. ఈ బడిపంతులుకును, నాకును మాసమునకు రూ. 20 లు మాత్రమే వరుంబడి యుండెను. మేముండిన యింటిలో యొక భాగమునకు రూ. 1-6-0 నెలకు బాడుగను నేనిచ్చుచుంటిని. మరియొక భాగమునకు అయ్యరు నెలకు రూ. 2 లు యిచ్చుచుండిరి. వారిది తంజావూరు ప్రాంతము. మాది వంగోలు ప్రాంతము. నాకు కొద్దిగ అరవము తెలిసినను వంగోలాడబిడ్డకు అరవభాష అయోమయముగా నుండెను. అయితే అరవ గృహలక్ష్మి, ఆంధ్ర గృహలక్ష్మి వద్ద కొలది కాలములోనే తెలుగుభాషను చక్కగ నేర్చుకొని మాతో ధారాళముగ సంభాషించుటకు తయారైనది. తెలుగు గృహలక్ష్మి ఆరవభాషను వెక్కిరించుటకు తయారైనది. నేను మా ఆవిడను 'అరవమును నేర్చుకొనరాదా'యని హెచ్చరించినపుడు 'ఆ అరవమొత్తుకోళ్లు, ఆ చింతగుగ్గిళ్లు నాకక్కరలే'దని చీదరించుకొనుచుండెడిది. "