వాసిష్ఠరామాయణము (ద్విపద)/ఆదిప్రకరణము
శ్రీరస్తు
వాసిష్ఠరామాయణము
ఆదిప్రకరణము
ఇష్టదేవతా, గురువందనము
శ్రీవిఘ్ననాథుని - క్షేత్రపాలకుని,
శ్రీవాణినిన్, విరిం-చిని, హయాననుని,
నలఘు దుర్గను, చౌడ-మాంబను, శివుని,
నల వరాహస్వామి - నాత్మయం దుంచి,
భక్తిచే నెపుడు సు-బ్రహ్మణ్య గురుని
ముక్తి ప్రదుని పాద-ముల నాశ్రయించి,
మురిసి నవగ్రహ-మ్ములకుఁ గేల్మొగిచి,
రచనోద్దేశము
ధరణిమీఁద మదాత్మ - తరియించుకొఱకు
సామోదమతిని సు-జ్ఞానవాసిష్ఠ
రామాయణార్థసా-రమును గ్రహించి,10
వరుసగా ద్విపద కా-వ్యముగా రచించి
యఱలేక మీకు స-మర్చింతు నిపుడు,
శ్రీ తారకోల్లాస! - శ్రీశ్రీనివాస!
శ్రీ తరిగొండ నృ-సింహ! ధూతాంహ!
విన్నవించెద నేను - వినుఁ డదె ట్లనిన
కథోపక్రమము
మున్ను భరద్వాజ - ముని పుంగవుండు
మోక్షేచ్ఛ నిజచిత్త-మునఁ బ్రకాశింప
[1]నక్షీణభక్తినిఁ - బ్రియము రెట్టింప
వరవిరక్తినిఁ బొంది - వాల్మీకిమౌని
చరణాంబుజములకుఁ - జాఁగిలి మ్రొక్కి,20
వినుతులు పెక్కు గా-వించి యిట్లనియె:
భరద్వాజుని ప్రశ్న
'ఘనమునీశ్వర! మీరు - కరుణించి నాకు
వేదశాస్త్రాది స-ద్విద్య లన్నియును
భేదంబు లేకుండ - చెప్పి ప్రోచితిరి:
మనుజులు సంసార-మాయాబ్ది దాఁటి
సునిశిత ముక్తి హె-చ్చుగఁ బొందు సరణి,
దెలుపవే!' యనుచుఁ బ్రా-ర్థింప, వాల్మీకి
యల భరద్వాజున - కపు డిట్టు లనియె:
వాల్మీకి వాత్సల్య వాక్కులు
'వత్స! భరద్వాజ! - వసుధ నందఱిని
వాత్సల్యమునఁ బ్రోచు - వైపు భావించి30
యతిరహస్యప్రశ్న - మడిగితి వార్య
[2]హితమొప్పఁ జెప్పెద - నెట్లన్న వినుము!
పుట్టి గిట్టుచునున్న - భూప్రజలందు
నెట్టన నెవరైన - నిఖిలభోగములు
నిరసించి, వైరాగ్య-నిష్ఠ పెంపెసఁగ
నెఱయు సంసారంబు - నిత్యంబు గాదు.
తను వశాశ్వతము, సి-ద్దముగ నే నెవఁడ?'
[3]నని విచారింపుచు - నార్తుఁడై, తనకు
నీ రహస్యముఁ జెప్ప - నిష్ఠుఁడైనట్టి
కారణగురుఁ డెందుఁ - గలుగునో? యనుచుఁ40
బొరిఁబొరి మదిఁదలం-పుచు నార్తుఁడైన
నరునకు గురుభక్తి - నాఁటుఁ జిత్తమున,
నా భక్తి దృఢముగా - నాత్మ నుంచుకొని,
ప్రాభవంబుల కాశ-పడక, కామాది
వైరుల ఖండించి, - వాంఛలు విడిచి,
యారూఢుఁడైన మ-హాగురుస్వామిఁ
శుశ్రూషఁ జే-సిన పుణ్యధనుఁడు
సార విహీనసం-సారాబ్ధి దాఁటి
రమణీయ మోక్షతీ-రమునందుఁ జేరి,
యమల సద్వస్తువం-దైక్యమై నిలుచు.50
ధరణి నజ్ఞుండైనఁ - దద్జ్ఞుండునైన
నిరవొందఁ దన్నుఁ దా - నెఱిఁగెడి కొఱకు
సదముల గురుసేవ - సల్పఁగా వలయు;
నది మానిరేని మో-క్షార్హులు గారు.
ఆకాశమందు నై-ల్యాది వర్ణములు
జోకగాఁ గనిపించి - శూన్యంబులైన
కరణిఁ జిద్వ్యోమప్ర-కాశంబునందుఁ
బొరిఁబొరి భూతముల్ - పుట్టి నశించు,
నట్టి మిథ్యారూప - మైన ప్రపంచ
మెట్టి దని మదినూ-హింపంగనీక,60
[4]పటు జాగరతభ్రాంతి - భ్రమలఁ బుట్టించు,
నటువంటి భ్రమకు లో-నై చెడిపోక,
మదిలోనఁ దద్భ్రాంతి - మఱచుటే లెస్స.
అదె చూడు! దృశ్యంబు లన్ని దబ్బఱలు
గానుండి, యజ్ఞాన-కర్మదృక్కులకుఁ
బూని యెప్పుడు నిజం-బుగ గావవచ్చు,
జ్ఞానదృక్కుకుఁ బ్రపం-చము గానరాదు;
మానితబ్రహ్మ మా-త్మకు గోచరించుఁ.
జిత్తవృత్తులు నశిం-చిన జీవతత్త్వ
మత్తఱిఁ జిత్తులో - నణఁకువై పొందు:70
ఇటువంటి సూక్ష్మార్థ-మెఱుఁగ నేరకను
ఘటికులై బహుకర్మ-కంధిలోపలను
పొరలుచుండెడివారు - భూలోకమందుఁ
దఱచైన కల్పశ-తంబులకైన
ముక్తిఁ బొందఁగ లేరు;- ముక్తి యెట్లనిన
యుక్తితో వినుము చే-యుచునుండు కర్మ
వాసవావాసమై - వచ్చుచు లేని
యాసల కాస్పదం-బైన పాపంబు
క్షీణించిపోవుటే - చిరముక్తి యనఁగ,
నాణెమై తగు వాస-నలు నెట్టి వనిన80
సరవిని మలిన వా-సన, యదిగాక
సరసమౌ శుద్ధవా-సనయు నీరెండు;
అందు మలినవాస-నాజ్ఞానతమము
పొందుగాఁ దా నహం- బు వహించి, జన్మ
కారిణియగుచు దుః-ఖము నిచ్చుచుండు,
సారమై శుద్ధవా-సన పునర్జన్మ
కారిణిగా కహం-కార భీజంబు
[5]వారూఢిగాఁ గాల్చి - యానంద మిచ్చుఁ;
దానర్ధదేహంబు - ధరియించియుండుఁ
గానం 'దద్జ్ఞ' యనంగఁ - గరమొప్పుచుండు.90
ఘనశుద్ధవాసనా-కలితులు ధరణి
ననఘ! జీవన్ముక్తు- లనఁగ నొప్పుదురు;
అందు జీవన్ముక్తుఁ - డగు పంక్తిరథుని
నందనుకథ విన్న-నరులకు జన్మ,
మరణ దుఃఖంబులు - మాయు; నా రాము
చరితంబుఁ జెప్పెదఁ - జక్కఁగా వినుము!'
అని పల్కు వాల్మీకి - కంజలిఁ జేసి,
మొనసి భరద్వాజ-ముని భక్తి నతనిఁ
గని రాముచరితంబుఁ - గ్రమముగా నాకు
వినిపింపవే!' యని - విశ్వాస మొదవ100
నడుగ భరద్వాజుఁ - డాత్మలో మెచ్చి
యడర వాల్మీకి యిట్ల-ని చెప్పదొడఁగె:
శ్రీరాముని జననము
'విను మో భరద్వాజ! - విబుధులఁ బ్రోవ
బనిఁ బూని యాపర-బ్రహ్మ మచ్యుతుఁడు
శ్రీవిష్ణుదేవుఁ డా-శ్రితజనావనుఁడు
పావనాచారుండు - భానువంశమునఁ
బొలుపాండ దశరథ-పుత్రుఁడై పుట్టి
తొలఁగక వృద్ధి బొం-దుచు నుండినపుడు,
దేవతల సంప్రార్థన
దేవత లతనిఁ బ్రా-ర్థించి యి ట్లనిరి:
'దేవాదిదేవ! పృ - థ్విని నీవు మనుజ110
దేహంబు ధరియించి-తివి, మానవులను
మోహాబ్దిలోఁ బడి - మునిఁగి పోనీక
కడతేర్చు కారణ-కర్తవే గనుక
నడర వసిష్మసం-యమి నాశ్రయించి
సరసవేదాంత వి-జ్ఞానధర్మముల
వరుసగా నాలింప-వలె నీవు, పరమ
గురుఁడ వయ్యును మదిన్ - కొంకక యన్య
గురు నాశ్రయించి, యీ - గురురహస్యమును
వినినను, గొంద ఱా-విధమున గురుని
ననుసరించి కృతార్థు - లగుదు' రటంచు120
బహువిధంబుల వారు - ప్రార్థింపఁగాను
విహితంబుగా విని - విజయరాఘవుఁడు
అనిమిషుల్ ప్రార్థించి - నందు కచ్చోట
తనమదిలో నిట్లు - దలఁచె నాఘనుఁడు
శ్రీరామచంద్రుని తలంపు
'దేహేంద్రియములు వృ-ద్ధినిఁ బొంది విషయ
వాహినిలోఁ ద్రోయ - వచ్చి హెచ్చినవి
మైత్రినిఁ దొలుత ని-మ్మాడ్కినిఁ జూపి
శత్రువైనటువంటి - సంసారవార్ధిఁ
గడపట ముంచుచు, - గట్టెక్క నీక
విడఁబడి చెఱచు నీ-విషయేంద్రియములు.130
కావున సకలభో-గంబులు విడిచి
నే విరక్తినిఁ బొంది - నిస్పృహత్వమునఁ
బొందిన, దశరథ-భూపతి చింత
నొందునో?'యను భీతి - యొక్కంత మదినిఁ
బొడమఁగా, నది మాని - పుణ్యతీర్థములఁ
బొడగాంచి గ్రుంకుచుఁ - బుణ్యాశ్రమములఁ
గనుఁగొని వచ్చి, య-క్కడ నుండినట్టి
మునివృత్తు లాత్మని-మ్ముగ మెచ్చుకొనుచు,
నిజరాజ్యసౌఖ్యంబు - నిరసించికొనుచు,
సుజనసాంగత్య మ-చ్చుగఁ గోరికొనుచుఁ,140
గుజనులతోఁ జెల్మి - కొఱగా దటంచు,
విజనస్థలమునందు - వేఱె తా నుండి,
'యారసి తన్ను మో-క్షార్హునిఁ జేయు
కారణగురుఁ డెందుఁ - గలుగునో?' యనెడి
చింతచే డస్సి యా-శ్రీరామచంద్రుఁ
డంతఃపురంబులో - నార్తుఁడై యున్న
విశ్వామిత్రుని రాక
వేళ గాధేయుండు - విమల సత్క్రతువుఁ
దాలిమితోఁ జేయఁ - దలచి వేడుకను
తా నయోధ్యకుఁ బోయి - దశరథుచేత
నానందముగ బూజ-లంది, యామీఁద150
గౌరవంబుగ మహీ-కాంతు నీక్షించి
ధీరత్వ మెసఁగ బ్రా-ర్థించి యిట్లనియె:
'నరనాథ! మత్సవ-నంబు రక్షింప
నఱ లేక శ్రీరాము - నంపవే!' యనిన
విని పంక్తిరథుఁడు నిర్-విణ్ణుఁడై పలికె:
'మునినాథ! యిపుడు రా-మునిఁ బంపలేను,
ఏ క్రమంబుననైన - నీక్షణమందె
నీ క్రతురక్షకై - నేనె వచ్చెదను:
అని పెక్కువిధముల - నమ్మహారాజు
వినిపింప, నమ్ముని-విభుఁడు కోపించి160
బహునిష్ఠురోక్తులు - భాషింపఁజాచి,
మహిమ నొప్పు వసిష్ఠ-మౌని యా నృపునిఁ
గని యిట్టు లనియె: 'నిష్-కర్షగా గాధి
తనయునివెంట నీ-తనయునిఁ బంపు'
మని యొప్పఁజెప్పఁగా - నా పంక్తిరథుఁడు
తమ మది హర్షించి, - తదనంతరమున
దశరధుఁడు శ్రీరామునిఁ బిలిపించుట
చారులఁ జూచి 'య-చ్చటికి మీ రరిగి
శ్రీరాముఁ దోడ్తెండు! - శీఘ్రంబుగాను'
అన విని చారు లి-ట్లనిరి: 'శ్రీరాముఁ
డెనలేని చింతతో - నెనయుచున్నాఁడు,170
సకలసుఖంబులు - చాలించినాడు,
వికలుఁడైనాఁ'డని విన్నవింపఁగను
విని నృపాలుఁడు చాల - విన్ననై 'యతనిఁ
గనవలెఁ దోడ్తెండు! - గ్రక్కున' ననిన
వేవేగ వారేగి - విజయరాఘవున
కా వార్త లెఱిఁగింప, - నందుండి లేచి
తా వచ్చి రాముఁ డా - తండ్రికి మ్రొక్కి
దీవెన లంది, గా-ధితనూభవునకు
మ్రొక్కి, వసిష్ఠ స-న్మునికిని మ్రొక్కి,
యక్కఱగాను వి-శ్వామిత్రుచెంతఁ180
రాముని ఆర్తి
జేరి చేతులు మోడ్చి: శిర మర [6]వాంచి,
యా రాముఁ డాత్మయం-దార్తి వహించి,
తన చింత రెట్టింపఁ - దనువు గంపింపఁ,
గనుల బాష్పము లొల్కగాఁ - దీను పగిది
నున్న, రాముని చంద - మూహించి, మౌని
'యన్న! ర'మ్మని పిల్చి - యాదరింపుచును,
తనువెల్ల నిమురుచుఁ - దాప మొందుచును
ముని దయ మీఱ రా-మున కిట్టు లనియె:
విశ్వామిత్రుని ఆదరోక్తి
'నాతండ్రి! రఘువర! - నాటుగా నిపుడు
నీ తండ్రి రాజ్యంబు - నెమ్మదిగాను190
పాలింప యువరాజ - పట్టభద్రుండ
[7]వై లలితసుఖంబు - లనుభవింపకను
ఎలుకలు ద్రవ్విన-యింటి చందమునఁ
గలఁగుచు [8]దిగఁబడఁ - గారణంబేమి?
[9]పట్టైన యౌవన-ప్రాయంబునందు
నెట్టన సుఖముల-నేఁ బొందవలయు,
నట్టి చందము మాని-యార్తిఁ బొందితివి;
ఇట్టి మనోవ్యథ-యేల జనించె?'
నని పెక్కువిధముల-నమ్మునీశ్వరుఁడు
నెనరుతో నడుగగా, - నృపనందనుండు200
మరల నంజలిఁ జేసి - మౌని నీక్షించి
కరఁగుచు గద్గద-కంఠుఁడై పలికె:
రాముని నిర్వేదము
'మునినాథ! యీ లోకమున మర్త్య వితతి
జనియించుటెల్లను - చచ్చుట కొఱకె,
చచ్చు టెల్లను మళ్లి-జనియించుకొఱకె,
హెచ్చుగా నిలుచుట- [10]కిర వెందు లేదు.
అన్ని యస్థిరములై-నట్టి చందంబు
మున్నుగాఁ దెలిసియు-మూర్ఖత్వ మెసఁగ
మది రాజ్యసుఖమందు-మల్లాడఁబోవు,
నదిమి నిల్పిన నిల్వ, -దాశతోఁ గూడి210
యొక్కచోటను నిల్వ - కుఱుకుచునుండుఁ,
జిక్కఁబట్టినఁ గాని - చెనఁటియై జరుగు,
నిట్టి మదిని నిల్పు-టె? ట్లని చింత
పుట్టిన, దిదిగాక - భూరి రాజ్యంబు
మొదలైన సంపదల్-ముందుగా సౌఖ్య
మిది యనిపించి దా-హెచ్చి, పిమ్మటను
మదమును బుట్టించి-మాయాబ్ది ముంచు;
నదిగాక దేహేంద్రి-యాదిభోగములు
ఆదియం దమృతమ-ట్లానంద మిచ్చి,
యాదట గరళమై-యతిఖేద మిచ్చు;
ఘసవిరాగము తొల్తఁ-గష్టమై తోఁచి,
యనుపమానానంద-మై యుండుఁ దుదను;
ఇది సుఖమో? లేక-యింద్రియభోగ
మది సుఖమో? దెల్పుఁ డరమర మాని,220
నావావిధంబుల-నాకుఁ జూచినను
జ్ఞాన వైరాగ్య భా-స్వరచింతనమున
నిఖిల భోగములను-నిరసించు సరణి
సుఖమిచ్చునంచుఁ దోఁ-చుచు నున్నదిప్పుడు
తక్కిన యాశాస్ప-దంబు లన్నియును
గ్రక్కున లేని దుః-ఖము నిచ్చు నెట్ల
నన్నను విత్తంబు-నాశచేఁ గూర్చి
యున్నవాఁ డేవేళ-నులుకు నేలనిన230
ధరను తా దాఁచిన-ద్రవ్యమెందున్న
బొరినిఁ జోరకులును,-భూమీశ్వరులును,
మొదలైన పగతు లి-మ్ముగఁ [11]బొంచి మించి
పొదివి యెక్కడఁ గొని-పోదురో? యనుచు
నూరకే ధనవంతుఁ-డులుకుచునుండు,
వారయఁగా వాని-కది సుఖం బగునె?
కదిసి యౌవనము సు-ఖం బిచ్చు ననిన
నది రక్త, మాంస, హే-యాస్థి చర్మములు240
గూడి రూపములైన-కొమ్మల ముఖము
లాడాడఁ జూచి, మో-హభ్రాంతి పొంది,
తగఁ బెండ్లియాడి, వి-త్తము నపేక్షించి,
మగఁటిమిఁ జూపుచు, మదమత్తులైన
ధనికుల యాచించి-ధనము లార్జించి,
తనభార్య కొప్పించి,-తమకించి దానిఁ
గలసి స్వతేజంబుఁ-గరఁగించి విడిచి,
బలహీనుఁడై డస్సి-పామరుం డగుచు,
నందనులను గాంచి-వాటుగాఁ బెంచి,
యందున బహుసౌఖ్య-మబ్బె నటంచు250
మురిసి, వారలమీఁద-మోహంబు నుంచి,
మఱి మఱి సంసార-మాయలో మునిగి,
సారార్థ సరణి వి-చారింపఁ దనకుఁ
దీఱక, పగలు రా-తిరి యదే జోలి
గా కాల మూరకే-గడపుచునుండి,
యాకాల మరుగగా,-నట జరాభార
కలితుఁడై రోగదుః-ఖంబుల చేతఁ
బలుమాఱు వగచుచుఁ-బడి లేవ లేక,
దేహంబుపై నాశ-దిగవీడ లేక,
మోహ లోభములచే-మూఢాత్ముఁ డగుచుఁ260
దరలి తాఁ బోయినఁ దనయు, లిల్లాలు
వెఱవక యెట్లు జీ-వింతురో?' యనుచుఁ
జింతింపుచుండఁగాఁ-జేరువై మొనసి
యంతకాలము రాఁగ-నఁట మృత్యుదేవి
కనులకుఁ బొడగట్టఁ-గా; భీతి నొంది
తనుఁ దానె మఱువఁగా-దండికింకరులు
స్థూలమందుండిన-సూక్ష్మదేహమును
కాల పాశంబుతోఁ-గట్టి కొంపోయి,
మొనసి యా కాలుని-ముందర నిడఁగఁ,
గని యముఁ డా పాప-కర్మి నచ్చోట270
నారసి నిజకింక-రాళి కొప్పించి,
కాఱించి బహు నార-కంబులలోను
బడవైచి కొన్నాళ్లు-బాధించి, చాల
బడలించి, యట పుణ్య-ఫల మొక కొంత
గలిగియుండినను సు-ఖంబు నొందించి,
బలములై తగు పుణ్య-పాప శేషముల
తోడ ధారుణి మీఁదఁ-ద్రోయింప, మగుడి
వాఁడు దిగంబడి, -వాయుమార్గమున
జలదంబులోఁ జేరి-జలరూప మొంది,
మొలచు సస్యములందు-ముందుగాఁ జెంది,280
పటిమతో బీజరూ-పముల ధరించి,
యటమీఁదఁ దానన్న-మై పూర్వఋణము
గలిగిన పూరుషు-గర్భంబు సొచ్చి,
యల వీర్య రూపమై-యతివగర్భమునఁ
జేరి, పిండంబై, వి-చిత్రావయవము
లారూఢిఁ బొడమి త-న్నావరింపఁగను,
గర్భగత జ్ఞాన-కలితుఁడై యచట
నర్భకుఁడై యుండి-యలమటల్ పడుచు.
వెడలు దా రెఱుఁగక-వివశుఁడై దుఃఖ
పడుచు, నక్కడ నుండి-పదియవ నెలను290
ధరణిపైఁ బడి, తన-తల్లియుఁ దండ్రి
పేరిమి బోషింపఁ బెరుగుచునుండి,
యవల బాల్యావస్థ-యౌవనావస్థ
లవని ననుభవించి,-యట వృద్ధుఁ డగుచు,
భోగేచ్ఛఁ జేసిన-పుణ్యపాపముల
తోఁ గూడి కమ్మకుఁ-దొల్లిటివలెనె
పడిపోయి, పుణ్యపా-ప ఫలంబు లచట
చదయక మోద, ఖే-దముల నియ్యఁగను
నాక నారకముల-నవ్య భోగమును,
[12]శోకం బనుభవించు చును సొక్కి స్రుక్కి,300
యెప్పటి రీతిగా నిలమీఁదఁ బుట్టు;
నప్పుణ్యపాపంబు-లం దిందు నరుని
నెప్పుడు నెడఁ బాయ-కెల్లలోకములఁ
ద్రిప్పుటే కాని, ము-క్తినిఁ బొందనియవు.
బావిలో నేతము-బాన తామునిఁగి
యా వేళనే జలం-బందుండి తాను
గొని తెచ్చి భూమిపైఁ-గ్రుమ్మరింపుచును
మొనసి క్రమ్మఱ నందె-మునిఁగి లేచుచును
నుండు చందమున జీ-వుం డొకచోట
నుండక తిరుగుఁ గావున, జన్మకర్మ310
మరణ [13]దుఃఖముల వే-మఱుఁ బొందుచున్న
నరులను జూచితే-నా మది భీతి
పుట్టుచునున్నది-పుణ్యపాపములు
పుట్టువులకు హేతు-భూతంబు లనుచుఁ,
గడువడి నీటు కాల-కర్మద్వయంబు
విడఁబడి పుట్టించు-విధి రుద్రముఖుల,
నడిపించు జగముల-నానా విధములఁ,
గడపట వరుసగాఁ-గబళించు, మరలఁ
బుట్టించుఁ, ద్రుంచు,నీ-భూరివిశ్వంబు
నెట్టనఁ గల్గి లే-నిది యగుఁ దుదను:320
కావున నే రాజ్య-కాంక్ష శీఘ్రముగఁ
బోవీడి ముక్తినిఁ బొందెద నింక,
నెక్కడి సంసార?-మెక్కడి ఘోర?
మెక్కడి జాడ? యి-దెక్కడి పీడ?
కామాది రిపు,లహం-కార చిత్తంబు,
లా మతి, మానసం,-బఖిలేంద్రియములు
విషయముల్ తమ తమ-వృత్తుల తోడ
విషమగతుల మించి-వేధింపసాగె;
దానిచే హృదయంబు-దందహ్యమాన
మైనది, దానిఁ జ-లాలార్చి, మీ రెఱిఁగి330
యున్న సుజ్ఞానంబు-నుపదేశమిచ్చి
నన్ను రక్షింపకు-న్నను భుక్తి విడిచి
పూని నే మీపదాం-బుజముల చెంత
మేనుఁ దొఱఁగువాఁడ-మీయాన' యనుచు
ఫాల మామౌనీంద్రు-పదముల మీఁదఁ
జాల హత్తించి, బా-ష్పంబులు కనుల
వెడలుచు నుండఁగా,-వేడి నిట్టూర్పు
విడువఁగా నమ్ముని-వేదనఁ బొంది,
రాముని రెండు క-రంబుల నెత్తి,
ప్రేమతోఁ గూర్చుండ-బెట్టి లాలించి,340
శిరమును చుబుకంబు-చెక్కిళ్లు నిమిరి,
పరమార్ద్ర హృదయుఁడై-పలికెనిట్లనుచు:
★ విశ్వామిత్రుని ధైర్యవచనములు ★
'నాయన్న! రఘురామ!-ననుఁ గన్నతండ్రి!
నీయాత్మ కడతేఱు-నెళవు ముందుగను
నీయంతనే నీవు-నిశ్చయించితివి,
మాయా ప్రపంచ మ-ర్మంబు లన్నియును
దెలిసితి, విఁక నుప-దేశంబు సేయ
వలసినదేమి? స-ర్వము నెఱుంగుదువు:
కొదువ యే మన్నను-గురుముఖంబునను
విదితంబుగాఁ దత్త్వ-విజ్ఞాన సరణి350
వినకయే తొలుత వి-వేకంబుచేత
ఘనవిరాగము నీకుఁ-గలిగియుండియును
అనుమాన మొందితి,-వంతియే కాని
జననుత! నీకు మో-క్షము గల్గు టరుదె?
మహిని ముముక్షు ధ-ర్మము బాల్యమందె
సహజంబుగా నీకు-సంభవించినది.
★ శుకుని వృత్తాంతము ★
ఇపు డిందు కితిహాస-మేను చెప్పెదను
నిపుణుండవై విను-నీరీతి శుకుఁడు
మొనసి తనంతనే-మోక్ష ధర్మముల
ననఘుఁడై తెలిసియు,-ననుమానమొంది360
తన తండ్రియైన వేదవ్యాసుఁ జేరి
వినయంబుతో [14]విన్న-వించె నిట్లనుచు:
'జనక! యీ మలినంపు-సంసార మెచట
జనియించె? నెవరి దీ-సంసారవాంఛ?
ముందఱ గతి యేమి?-మూఢ సంసార
మెందు లయంబొందు?-నెఱిఁగింపుఁ డనుచుఁ
బాద పద్మములపైఁ-బడి లేవకున్న,
బాదరాయణుఁ డెత్తి-పలికె నిట్లనుచు:
'వినుము పుత్రక!-సూక్ష్మవిజ్ఞానసరణిఁ
గను మాత్మ బుద్ధి వి-కల్పన చేతఁ370
గలుగు విశ్వం, బావి-కల్పనం బణగి
పొలిసినప్పుడు జగం-బులు కానరావు,
అవి గానరాకుండి-నపుడు సంసార
మెవరిదిగాక తా-నెపుడో నశించు,
నది నశించిన దేహ-మం దహంభావ
ముదయింప కణఁగిపో-వుట ముక్తి' యనుచు
వినిపింప, నంతయు-విని శుకయోగి
యనుమానముసు వీడ-కందున్నఁ, జూచి
'వీని సంశయ మిందు-విడువలే' దనుచుఁ
దా నిశ్చయించి వే-దవ్యాసుఁ డనియె:380
'శుక! యింతకన్న హెచ్చుగ నే నెఱుంగ,
నిఁక నీవు చని మిథి-లేశ్వరుండైన
జనకుని నడుగు, నీ-సంశయం బతఁడు
సునిశితార్ధముగఁ దీ-ర్చును, నీ వచటికిఁ
దప్పకపొమ్మంచుఁ దయ దళుకొత్తఁ
జెప్పిన మిథిలేశుఁ-జేరె నా శుకుఁడు;
అప్పుడానంద మ-గ్నాత్ముఁడై లేచి
తెప్పున జనకుఁ డా-ధీరు నీక్షించి,
★ మిథిలేశుని పలుకులు ★
హెచ్చుగాఁ బూజించి-'యిచటికి మీరు
వచ్చిన పని యేమి?-వరయోగిచంద్ర!390
చెప్పుఁ డా పని నేను-చేసెద" ననఁగ,
నప్పుణ్యుఁ డా వ్యాసు-నడిగిన రీతి
జనకుని నడుగఁగా-సంతసమంది,
విసి యా నృపాలుండు విశ్వాస మొప్పఁ
బలికె నిట్లనుచు 'నో-పరమయోగీంద్ర!
సులలిత చిత్పూరు-షుం డొక్కరుండు
దక్క నన్యము లేదు,-తత్త్వార్థ మింత
నిక్కంబు: నీవు దీ-నికి సంశయింప
వల, దాత్మ సంకల్ప-వాంఛ బంధంబు,
వెలయు సంకల్పంబు-విడుచుటే ముక్తి:400
ఇది యథార్థము, సంశ-యింపకు మీవు.
మది దృశ్యముడిగి స-మ్మతిఁ బొందినావు!
పదిలంబుగా నిదే-పట్టి భావింప
మదియందె లయమొందు,-మఱి సంశయములు
నుదయింప, వదియె మనో-న్మని యగును,
సదమలచరిత! మో-క్షం బిదే సుమ్ము!
వేఱె మార్గం బింక- వెదకఁబోవలదు;
భూరిసంతోష సం-పూర్ణానుభవము
నొందు'మంచు వచింప,-నుప్పొంగి శుకుఁడు
మందస్మితాస్యుఁడై-మనుజనాయకుని410
నానందముగఁ జూచి,-యరమర విడిచి
'నా నిశ్చయిం బదే!-నాతండ్రి మొదటఁ
చెప్పిన యర్థమే-సిద్ధంబుగాను
[15]చెప్పితి వవనీశ!-చిత్తసంశయము
తీఱె'నంచు వచించి-దిగ్గున లేచి,
యారాజు సెలవంది-యరిగి యొక్కెడను
పరమైన నిర్విక-ల్ప సమాధి నుండి,
పరిపూర్ణుఁడై మోక్ష-పదమందె శుకుఁడు.
అని చెప్పి దయను-విశ్వామిత్రమౌని
మనుకులోత్తముఁ జూచి-మరల నిట్లనియె:420
'సకలజ్ఞ! శ్రీరామచంద్ర! తనంత
శుకుడు డెలిసినయట్ల-సూక్ష్మవిజ్ఞాన
సరణిఁ దెలిసితీవు,-సంశయార్థముల
మెరమెరఁ బొందనే-మిటి కింకమీఁద?
నలలేక యుపశాంతి-యనెడు తోయమున
మఱువక యిపు డాత్మ-మలినంబు గడిగి
భూరి విశ్రాంతినిఁ-బొంది సుఖింపు,
మూరకే పరితాప-మొంద నేమిటికి?
అమర జ్ఞాతృజ్ఞేయ-మైన చిత్తరతి
క్రమమొప్పఁగా సమ-గ్రంబుగా భోగ430
సముదయానుభవంబు-శాంతమై యేక
శమమొందు, దాని ల-క్షణ మదే యగును;
విశ్వంబు సద్వస్తు-వే యగుఁ గనుక
నీశ్వరరూపమై-యింపొందుచుండు.
వరుస బంధము భోగ-వాసనచేత
నఱిముఱి దృఢతరం-బై వృద్ధిఁ బొందు,
జగతిఁ దద్ భోగవా-సన శాంతమైనఁ
దగిలియున్నట్టి బం-ధము వీడిపోవు
నిన్ను నీ వెఱుఁగుచు-నిఖిలరాజ్యంబుఁ
బన్నుగా జ్ఞానివై-పాలింపుచుండు!'440
మని దృఢంబుగఁ జెప్పి-యపుడు వసిష్ఠ
మునిని వీక్షించి రా-మునకు సత్కృపను
సలలిత బుద్ధి వి-శ్రాంతి వాక్యములఁ
దెలివిగా మీ రుపదేశింపు-డిపుడు
అనిన విశ్వామిత్రు-నా వసిష్ఠుండు
కనుఁగొని పూర్వమా గాధిపుత్రుండు
తనకుఁజేసిన కీడు-దలఁప కామౌని
యనుమతిచే శాంతుఁ-డై పూర్వ మజుఁడు
తనకుఁ జెప్పిన గూఢ-తత్త్వవాక్యముల
మొనసి తలంచి రా-మున కిట్టు లనియె:450
★ విశ్వామిత్రుని ప్రేరణచే వసిష్ఠుఁడు శ్రీరామునకుఁ దత్త్వము నుపదేశించుట ★
'రామాభిరామ! యో-రఘువంశసోమ!
ప్రేమఁ గౌశికుఁడు చె-ప్పినవాక్యములను
తగ వింటి, వేనునుఁ-దదనుసారముగ
విగతసంశయముగా-వినిపింతు వినుము!
సారవిహీనసం-సారంబు నందు
పౌరుషంబునఁ బొందఁ-బడును సర్వంబు,
విరివిఁ బౌరుషమే ద్వి-విధముగా నుండు
సరవి నుచ్ఛాస్త్రంబు,-శాస్త్రితం బనఁగ,
నందెన్న శాస్త్రిత-మర్థసంప్రాప్తి
నొందఁ జేయుచునుండు,-నుచ్ఛాస్త్ర మనెడి460
గురుపౌరుషంబు మి-క్కుటము తా నగుచుఁ
బరమార్థసౌఖ్యసం-ప్రాప్తి నొందించు;
వదలకుండెడి పూర్వ-వాసనచేతఁ
బదపడి శాస్త్రిత-పౌరుషం బొనర
జనియించి నప్పుడీ-జగతి నుచ్ఛాస్త్ర
ఘనపౌరుషంబుచే-గ్రక్కున దాని
నారూఢయుక్తిచే నడ్డ పెట్టుచును
ధీరతఁ జిత్తశాం-తినిఁ బొందు మనఘ!
అనభిజ్ఞచిత్తుఁడై-నటువంటివాఁడు
తనియక యజ్ఞాన-తప్తుఁడై యుండు;470
నెందాక యజ్ఞాన - మిరవుగా నుండు
నందాఁకఁ గర్మంబు - లంటుచునుండు,
నెందాఁకఁ గర్మంబు - లెనయుచునుండు
నందాకఁ బుట్టుచు - నణఁగుచునుండు,
నెందాఁకఁ జన్మంబు - లెత్తుచునుండు
నందాఁక దుఃఖమ - గ్నాత్ముఁడై యుండుఁ;
గావునఁ దద్దుఃఖ - కంధి దాఁటుటకు
నావయై యుండు - జ్ఞానస్వరూపంబు,
ఇటువంటి జ్ఞానంబు - నెఱిఁగెడికొఱకుఁ
విటుభక్తి దీపింపఁ - బరమదేశికుని480
సేవించి గురుశాస్త్ర - సిద్ధాంత మెఱిఁగి,
జీవుండు మోక్షంబు - జెంది సుఖించు
నారీతిఁ గర్మమం - దంటక నీవు
సౌరవిజ్ఞానల - క్ష్యము నొందు రామ!
తుదలేని సంసార - దుఃఖంబు లణఁచి.
సదమలబుద్ధి వి - శ్రాంతిఁ బొందించి,
సంతోషకరమగు - సంపూర్ణతత్త్య
మంతఃకరుణచేత - నబ్జసంభవుఁడు
నా కుపదేశించి - నాఁ డా క్రమంబు
నీకుఁ జెప్పెద నన్న - నెమ్మది నొంది,490
యా వసిష్ఠునిఁ జూచి - యంజలిఁ జేసి
పావనాత్ముఁడు రామ - భద్రుఁ డిట్లనియె:
★ రామభద్రుని ప్రశ్న - వసిష్ఠుని యుత్తరము ★
'ఏ కారణమున ము - నీంద్ర! పద్మజుఁడు
నీ కుపదేశించె - నిశ్చితార్థమును?
ఆ నిశ్చితార్థ మె - ట్లభ్యసించితిరి?
దీనుఁడనగు నాకుఁ -దెలుపవే! యనిన
విని మునీంద్రుఁడు పల్కె - విమలం, బమృతము,
ననఘం, జనంతంబు, - నాదిమధ్యాంత
రహితంబు, సర్వపూ-ర్ణంబు, నిత్యంబు,
సహజంబు, సత్యంబు, - సచ్చిద్గగనము,500
శుద్ధచైతన్యంబు - సుస్థిరతత్త్వ
సిద్ధాంతమై ప్రకా - శింపుచు నిండి,
యెక్కడఁ జూచిన - నెడమింత లేక
యొక్క వస్తువు నిల్చి - యుండు నెప్పటికి:
నది చంచలించియు - నచలమౌ చోట
నుదయించె విష్ణుదే-వుం, డమ్మహాత్ము
సదమలనాభికం - జమున విరించి
సదయుఁడై జనియించి - సకలభూతములఁ
బుట్టించె, నతని త - పోవిశేషమునఁ
బట్టుగా సర్వప్ర - పంచమ్ము వెలసె,510
సరసభారతవర్ష - సంభవులైన
నరులు పామరులు, నా - నావిధాన్యాయ
కలితులు, లోభులు, - కాముకుల్, జడులు,
బలవిహీనులు, మోహ - పరవశుల్, శఠులు,
గురువంచకులును, మూ-ర్థులు, దాంభికులును,
పరధనాసక్తులు, - పరసతీరతులు
కావున బహునార - కములందు మునిగి
పోవుదు రని తన - బుద్ధి నూహించి,
శోకింపుచుండెడి - సుతులకై తాను
శోకించు జనకుని - చొప్పున నజుఁడు520
చింతించి, జప, హోమ, - శీల, ధర్మములు,
పంతు కెక్కిన తపో - వ్రతములు జనుల
శాంతినిఁ బొందింపఁ - జాల, వందఱికి
సంతోషమిచ్చు సు - జ్ఞానం బటంచు
మది నిశ్చయించి, స -మ్మతముగా నన్ను
ముదమొప్పఁ దన మనం - బుననె సృజించె.
నపుడు బ్రహ్మజ్ఞాని - నై నేను పుట్టి
కపట ప్రపంచ సం - గతులలోఁ జొరక,
తెలివియౌ నను నేనె - తెలియుదు, నందు
వలన సద్గురుఁడు గా వలె నను చింత530
నా కందు లేకయు-న్న విరించి చూచి
'యీ కుమారుఁడు తత్త్వ మిలఁ దనంతటనె
తాను దెలిసి గురు-త్వంబు నామీఁద
నూనికగా నిల్ప - కున్నాడు గురుఁడు
చెప్పని సద్విద్య - సిద్ధింపదనుచు
నప్పు డజ్ఞాని వీ - వై యిటుమీఁద
గురుభక్తి నెద నుంచు-కొని తత్కరుణను
మరల విజ్ఞానివై - మహి నుండు' మనుచు
శాపమియ్యఁగ, బ్రహ్మ - సత్తను మఱచి,
యా పట్ల నే నెవ్వ - రైనది మదికిఁ540
దోఁచక యుండఁగాఁ, - దోయజోద్భవునిఁ
జూచి శుశ్రూష హెచ్చుగఁ జేసి, మ్రొక్కి,
నిలిచి నే నెవ్వరు? - నీ వెవ్వ? రిపుడు
దెలుపవే! సద్గురు-దేవ!’ యటంచు
నేను ప్రార్థింప మ-న్నించి విరించి
తా నందు సద్గురు-త్వమును వహించి,
సరగున నాకు సం-సార రోగంబు
హరియింప నౌషధం-బైన జ్ఞానమును
దేఁటగాఁ దా నుప-దేశంబుఁ జేసి,
హాటకగర్భుఁ డి-ట్లనె 'నోకుమార!550
అరుదుగా శ్రమకారి - యగు క్రియాకాండఁ
గరుణతో బోధించు! - కర్మకారులకు,
నది మాని వైరాగ్య - మందుఁ జిత్తంబుఁ
గుదిరించువారికిఁ - గొంకక నీవు
నేను చెప్పిన జ్ఞాన - నిష్ఠ బోధించి
యానంద మొందించు' మని చెప్పెఁగనుక,
రహి నొప్పు భూతప-రంపరలందు
విహరింపుచుండుదు, - విజ్ఞాన పటిమ
వలనఁ గర్మత్వాది - వాంఛల విడిచి,
యులుకక యూరకే - యుండి నిద్రించు560
వాని, కైవడి దేహ - వాసన మఱచి,
మానసంబును గెల్బి - మతి శాంతిఁ బొంది,
కర్మకులకుఁ గ్రియా - కాండ బోధింతు,
నిర్మలవైరాగ్య - నిష్ఠుల కెల్లఁ
దిరముగా జ్ఞానోప-దేశము సేతు;
నరసి సంసారినై - యం దంట కుందుఁ,
జేయఁగాఁ దగు పనుల్ - చేసియు, నొకటి
చేయనివాఁడనై - జీవింపుచుందు,
గుఱిగానలేని మూ-ర్ఖుండైనఁ గాని
గురు సేవఁజేసి యా-గురుతర జ్ఞాన570
సరణిని వినుచున్న - సకలపాపములు
పొరిఁబొరి నశియించి - పోవుఁ బిమ్మటను,
అరయ మేధాశాలి - వై గురుమర్మ
మెఱిఁగి ముక్తినిఁ బొందు - మినకులోత్తమ!
సరససద్గురువాక్య - సరణి సచ్ఛాస్త్ర
మరసి, మనోనిశ్చ-యంబు, నాత్మైక్య
పరుఁడైన పురుషుండు - పరమందుఁబెందు.
ధరణీశ! వినుము తీ-ర్థస్నానములును,
మొనయుఁ, గాయక్లేశ-ములు, సతీసతులు,
ధనధాన్యములు, దేవ-తా సేవనములు580
పురుషుని ముక్తినిఁ - బొందింపలేవు
తిరముగా మది నిరో-ధింపకుండినను,
నది నిరోధంబగు - నటువంటి రీతి
విదితంబుగా నీవు - విను మదెట్లనిన
అమలిన మోక్షగృ-హద్వారమందు
శమము, విచారంబు, - సంతోష, మలఘు
సాధు సాంగత్య మెం-చంగ నీ నాల్గు
బోధకారకములై - పొసఁగు పాలకులు
అందు శమం బెట్టి - దన్నఁ జెప్పెదను
పొందుగా విను రామ - భూపాల! పరులు590
తనుఁ దిట్టి నప్పుడు-తా వారిమీఁద
నొనర నల్గక తిట్ట-కుండుటే శమము,
అట్టి నిర్మలశమం - బతిశయంబుగను
బుట్టి సంతోషముల్ - పొందించుఁ గనుక
సకల దుఃఖహరంబు - శాంతగుణంబు,
ప్రకట మోక్షద్వార - పాలుండు గాన
నందరి కన్న శాంతాత్ముఁడే ధన్యుఁ,
డిందుకు సందియం - బించుక లేదు,600
అల విచారం బెట్టి దన్నఁ జెప్పెదను.
పొలపొంద శాస్త్రావ - బోధచేఁ బ్రబలి
ఖ్యాతిగాఁ బూర్ణమై - ఘనమైన బుద్ధి
చేతఁ గారణమును - స్థిరముగా నెఱిఁగి
ధర నటువలెఁ జేయఁ -దగు పనులెల్ల
పరుఁడు తానై సేయ - బద్ధుడు కాడు.
తిమిరమం దణఁగదు - దీపప్రకాశ,
మమరఁ గల్గిన పుట్ట - దడ్డంబు లేక
యెంతటి మఱుఁగైన - నెదురుగాఁ జూచి
సంతోషమిచ్చు విచార -సద్దృష్టి,
ధీర! యీ సువిచారదృష్టి సంధింప
నేరిచి, యఁట మీఁద - నే ననువాఁడు610
ఎవ్వఁడు? సంసార - మెవరిది? నేను
నెవ్వఁడనో' యని - యిచ్చఁ జింతించి,
చిరమైన నిజయుక్తి - చేతఁ దన్నెఱుఁగు
సరణి భావింప వి-చారమా, దీని
భావింప తద్వారపాల కుడగును.
కావున రామ యీ-క్రమము భావించి
కాలగతులచేతఁ-గదిసి కీడులును,
మేలులు వచ్చిన - మిడికి యుబ్బకను
రెండును మది నొక్క - రీతిగాఁ గనుచు
నుండుట సంతోష-మో రామచంద్ర!620
సంతోషమే సుఖసారమై యుండు,
సంతోషమే మోక్ష-సౌఖ్యంబు,దానిఁ
బరికంపఁ దద్ద్వార - పాలకుం డగును.
మఱియును విను రామ! - మనుజుండు గర్వ
విరహితమతియై, వి-వేకియై, భోగ
నిరసనస్వాంతుఁడై, - నిస్పృహుం డగుచు,
జృంభణ మొప్ప హె-చ్చి యహంకరించు
రంభుల తర్క వా-దములలోఁ జొరక,
కోపతాపములను, - కుత్సితంబులను,
చాపల్యగుణములఁ - జాల వర్ణించి,630
జయకాంక్ష, జీవహిం-సల మాని, భూత
దయ గల పురుషుఁ డి-ద్ధ శాంతమూర్తి.
ఘనుఁ డట్టి సాధు సాం-గత్యంబుఁ జేయు
మనుజుఁడు తరియించు - మాయాంబునిధిని,
గనుకను సాధు సాం-గత్యంబు లోనఁ
బనుబడ తద్ద్వార - పాలకుం డగును.
చిరముగా నిది యభ్య-సించినవారు
వరుసగా మోహార్ణ-వంబు దాఁటుదురు.
స్పష్టంబుగాఁ బర-బ్రహ్మోపదేశ
దృష్టాంత మీరీతిఁ - వెలియజేసితిని,
ధీరాత్మ! యిదియేక - దేశ సామర్థ్య
మారసి చూడు -యంతరంగమున,
నమర నిరాకార-మగు బ్రహ్మమందుఁ
గ్రమముగా సాకార-కల్పన గలిగె.
తగఁ దాన దృష్టాంత - దార్ట్షాంతికంబు
లగుచు నెప్పుడుఁ బ్రమా-దాంతంబు లగుచు
ధర నొప్పు మూర్ఖ కు-తర్క వాదములఁ
జొరక సదా పరిశుద్ధమై వెలుఁగు
శుద్ధచైతన్య మ-చ్చుగ భావమందు
సిద్ధాంతముగఁ జూచి - చింతింపుచుండు;650
ధీర! నీ వందుఁ బొం-దెదవని కరుణ
నారూఢుఁడైన సంయమి- దృఢంబుగను
మొనసి రామునకు ము-ముక్షు ప్రకరణ
మనువొంద బోధించె ననుచు వాల్మీకి
క్రమమొప్ప వినిపింపఁ-గా భరద్వాజుఁ
డమర శ్రీరామున కా-వసిష్ఠుండు
మఱియేమి చెప్పె స-మ్మతముగా నాకుఁ
దిరమైన దయతోడఁ -దెలుపవే!' యనుచు660
నడుగ, భరద్వాజు-నాత్మలో మెచ్చి
యడర వాల్మీకి యిట్లని చెప్పఁదొడఁగె:
'వినుము భరద్వాజ! - విజయ రాఘవుని
గని వసిష్ఠుండు సత్-కరుణ నిట్లనియె:
'ధరణీశ! యుక్తియు-క్తములైన పాఠ్య
సరణి బాలుండైనఁ - జక్కఁగాఁ జెప్పె
[16]నేని నీ వాలించు - నిజముగా నెంచు,
మా నలినోద్భవుం - డైన నయుక్త
వచనముల్ చెప్పిన - వాంఛతో వినకు,
మచలుండవై సత్య - మాత్మ నూహించు;670
మాకాశ జాఖ్యాన - మాదిఁ జేసికొని
ప్రాకటంబుగ దశో - పాఖ్యానములను
నీకుఁ జెప్పెద, నది - నెళవుగా, దెలియు
[17]మాకాశజము సూక్ష్మ - మై చోద్యముగను
మొదటఁ దోఁచక యుండి - మూలవస్తువును
తుద నాత్మదృష్టికిఁ - దోఁపింపుచుండుఁ;
బొలుపొందఁ బ్రతిపత్తి, - భూతి, వేదనలు,
[18]నలయఁ బరోక్షంబు - నని చెప్పు నొప్పు
నీనాల్గు నామంబు - లెనయ జీవుండు
పూని [19]సంవిత్ స్వరూ-పున మించి తనరు;680
ఘనపదార్ధజ్ఞాన - కలితుఁడై యహము
నెనసి పూరుషుఁడన - నింపొందు నతఁడు
పరఁగ సంకల్పాది - భావంబులందు
విరివిగా నుదయించి - విపరీతమైన
జ్ఞానంబుచే మహా-జలనిధితరంగ
ఫేన బుద్బుదములై - పెంపొందినటులఁ
దానె ప్రపంచమై - తగవెల్గుచుండుఁ
గాని, తదన్య మె-క్కడఁ బుట్టలేదు.
ఆ ప్రపంచము బంధ-మై యుండుఁ గనుక,
నాప్రపంచముఁ దన-యం దణంచుటయె690
ముక్తి యనంబడు, - ముక్తికి వేఱె
యుక్తి లే దిది మహా-యోగి నిశ్చయము
మనుజేంద్ర! తద్దృశ్య - మార్గంబు నీకు
వినిపించెదను నేను - విశదంబుగాను
కల రీతిఁ దోఁచు జ-గంబు లన్నియును
విలయ కాలము లందు - విరిసి నశించుఁ;
గల లన్ని యణఁగఁ జొ-క్కముగా సుషుప్తి
యలవడినట్లుండు - నంధకారమును
జలజాప్త, చంద్ర, న-క్షత్ర పావకుల
వెలుఁగు లెక్కడ లేని - వేళఁ దా నొకటె700
720
అవ్యక్త మచల మ - నాద్యమై నిండి
దివ్య చిన్మాత్రమే - దీపింపుచుండు,
నల చిత్తున నకు [20]ఋత-మాత్మ సద్ బ్రహ్మ
మలఘు [21]సత్తామాత్ర - మని యార్య జనుల
చేతను వ్యవహార - సిద్ధికై వివిధ
పూత నామములఁ జె-ప్పుట [22]కొప్పు నతఁడు
చెలఁగి యన్యుని పోల్కి - జీవాత్ముఁ డగుచుఁ
గలనా కలత్వ సం-కలితుఁడై చెలఁగి,
మానసంబున మహా - మాయయై మించి
తానె సంకల్ప బృం - దము లగుచుండు,720
మొనసి తత్ సంకల్ప - మున నింద్రజాల
మనఁగ నొప్పుచు విశ్వ - మంతయుఁ బుట్టు,
వనధివల్లఁ దరంగ - వ్రారముల్, కనక
మున భూషణమ్ము లి-మ్ముగఁ బుట్టు కరణి
సత్యమైనటువంటి- సద్ బ్రహ్మమందు
నత్యంత నశ్వర-మగునట్టి సృష్టి
మనమై ప్రకాశించి - మాయాబలమున
మొనసి పృథగ్భావ-ముగఁ గల్గుచుండు
సునిశితమైనట్టి - సూర్యప్రకాశ
మున నెండమావులు - మొనసి కన్పించు730
కరణిఁ బరాత్మ ప్ర-కాశంబునందుఁ
బొరిఁబొరి విశ్వంబు - [23]పుట్టు నీరీతి
ఘనతరోత్పత్తి ప్ర-కరణంబు నీకు
వినిపించెదను మఱి - విను మింక నొకటి.
★ ఆకాశజోపాఖ్యానము ★
కరమర్థితోఁ బూర్వ - కాలమం దాత్మ
నరయ నాకాశజుఁ - డనఘవర్తనుఁడు
అలఘుఁ డాయుష్మంతుఁ - డను విప్రుఁడొకఁడు
గలఁడు, మృత్యువు వానిఁ-గదిసి కొంపోవ
వలె నంచు డగ్గఱ - వచ్చి తా నతని
బలము, తేజముఁ జూచి - భయమొంది, మదినిఁ740
దలఁచె నిట్లనుచు 'భూ-తంబుల నెల్ల
మెలపుగా నే దిగ-మ్రింగుచుండుదును,
అటువంటి నాకు నీ - యవనీసురుండు
ఘటికుఁడై చిక్కఁ డె-క్కడివాఁ డితండు?'
అని వితర్కింపుచు - నంతకు కడకుఁ
జని మ్రొక్కి నిలిచి, యా-చందమంతయును
'విను మృత్యుదేవి! యా విప్రపుంగవుఁడు
వినిపింపఁగాఁ బ్రేత-విభుఁ డిట్టు లనియె:
ఆకాశజుండు మ-హానుభావుండు
నీకుఁ జిక్కఁడు తపో-నిష్ఠ పెంపునను,750
ఆయు వుండిన వారి - నదిమి చంపుటకు
నీ యత్నమున్నదే? - నెఱి వారి వారి
కర్మానుసరణంబు-గా గతాయువుల
నర్మిలిఁ గొనిపోదు - వంతియె కాని,
యే కర్మములు చేయ - కిరవొందినట్టి
యాకాశజునిఁ ద్రుంప - నలవియె నీకుఁ?
గోపతాపములచేఁ - గ్రూరాత్ములైన
పాపకర్ములను జం-పందగుఁ బొమ్ము!
అనిన దండ్రికి మ్రొక్కి - యా మృత్యు వరిగె;
నన వసిష్ఠునిఁ జూచి - యా రాముఁడనియె: 760
'మునినాథ! యాకాశ - మునఁ బుట్టె విప్రుఁ
[24]డని యంటి, రతఁడు బ్ర - హ్మని తోఁచె, వాని
విశదంబుఁ జెప్ప-వే!' యన్న, నమ్మౌని
దశరథాత్మజుఁ జూచి - తగ నిట్టు లనియె:
'వసుధేశ! మృత్యుదే - వత కగపడని
యసమానుఁడే బ్రహ్మ - యగుఁ, బృథివ్యాది
భూతవిరహితుఁడై , పొసఁగి యాకాశ
మేతీరుగా నిండు - నెల్ల దిక్కులను
నా రీతిగా దా ని - రాకారుఁ డగుచు
భూరి సంకల్ప సత్ - పూరుషుఁ డయ్యె; 770
అరయఁగా నతఁ డజు - డాది మధ్యాంత
విరహితుం డాద్యుండు - విమలుండు నగుచుఁ
గలలోన నొక వంధ్య - గన్న పుత్రకుని
వలెఁ గల్గి తా దేహి - వలెఁ దోఁచుచుండుఁ,
దెలిసితే పరమాత్మ - దేహిగాఁ' డనఁగ
నల రామచంద్రు డి - ట్లనె: 'నోమునీంద్ర!
అరయ భూతంబుల - కాతివాహికము,
తెఱఁగొప్ప నాధిభౌ - తికమన రెండు
తనువులు గల, వా వి - ధాత కా రెండు
నొనరంగఁ గలవొ? లే - వో?' యన్నమౌని 780
పలికె నిట్లని 'భూత - పటలి కారణము
వలనఁ బుట్టఁగఁ దను - ద్వయము ఘటించె,
ఘనకారణాత్ముండు - గాక, విజ్ఞాన
మెనయఁగా నాతివా - హికుఁ డయ్యె నజుఁడు;
గనుక జీవుండు సం - కల్ప పూరుషుఁడు
తనుతర చిత్తమా - త్ర స్వరూపుఁడును
వెలయు సృష్టి, స్థితి, - విలయకారుణుఁడు,
మొలచు మనోరూప-మును, స్వయంభవును
తానె యై సృష్టి వి - స్తారంబు సేయుఁ
గాన నీ తోఁచు జ - గంబు లన్నియును 790
మొనసి మనోమయం - బుగఁ జూడు రామ!'
యనిన 'మనోరూప - మన నెద్ది? దాని
సరణిఁ జెప్పు' మటంచు - జలజాప్తకులుఁడు
మఱువక యడుగ న - మ్మౌని యి ట్లనియె:
'జననాథ! విను మాత్మ - సంకల్పసరణి
మన మనంబడుఁ గాని - మఱివేఱె కలదె?
సంకల్ప జాలముల్ - సంకీర్ణ మగుచుఁ
బొంకంబులై మనం - బుననె వసించుఁ,
గావున మదికి సం - కల్పంబులకును
దావలమగును,భే - దములే; దవిద్య 800
యగు మనంబు మలంబు, - నంధకారంబు
నగుచు సంకల్పాఖ్య - లగుచుండు, వాటి
వలన జగంబులు - వర్ధిల్లు చుండుఁ,
జెలువారి యవి నశిం - చిన వేళలందు
గగనాది భూతసం - ఘములు లయంబు
లగు, నందుఁ జిన్మాత్ర-మంతట నిండి
యగణితముగ నేక-మై వెల్గు చుండుఁ,
దగ జగద్రష్టయై - తనరు నాత్మకును
నెనవుగా నీవును - నేను జగంబు
లను దృశ్య సత్త యు-న్నట్టి వేళలను 810
తలకొని కేవల-త్వము లేక నుండు,
నల దృశ్య సంభ్రమం - బణఁగిన తఱినిఁ
బ్రతిబింబ రహిత ద-ర్పణము చందమున
హితమొప్ప ద్రష్టృత్వ - హీనమై నిండి
ఘన కేవలాత్మ యొ-క్కటి వెల్గుచుండు;
మొనయు చిదాకాశ - మున మానసంబు
అనిశంబు తాన స-దాకృతి యగుచుఁ
గను మూసి నిద్రించు - కాలంబులందుఁ
గనిన స్వప్నంబుల - కైవడిగాను
పెనుచు లోకములను - భేదరూపముల 820
నటువంటి లోకంబు - లణఁగెడి వేళ
స్ఫుటముగాఁ గ్రమ్మఱఁ - బుట్టెడి వేళ
శాంతమై గ్రుంకని - జలజాపుకరణి
నంతట నవశిష్ట-మై నిల్చియున్న
యజరుఁ డనామయుఁ- డాదిదేవుండు
నజుఁ డనంతుఁడు పర - మాత్ముఁ డీశ్వరుఁడు
సర్వకాలంబును - శాశ్వతుఁ డగుచు
సర్వవిశ్వమును ము - చ్చటగఁ జేయుచును,
నన్నియుఁ జేసి, చే - యనివాఁడు నగుచుఁ
బన్నుగా నంతటఁ - బరిపూర్ణుఁ డగుచు, 830
నరయఁగా వాఙ్మన - సాతీతుఁ డగుచుఁ
బరమమోక్షస్వరూ - పకుఁ డగుచుండు;
నతనికి నాత్మ ము - ఖ్యాభిధానములు
ప్రతిభతోఁ గల్పింపఁ - బడు నదె ట్లనినఁ
దొలుత వేదాంత వా - దులు బ్రహ్మ మనుచుఁ,
బొలుపొంద సాంఖ్యులు - పూరుషుం డనుచు,
విజ్ఞానవిదులు భా - వించి నిక్కముగఁ
బ్రజ్ఞాన మేనని -పల్కఁగా, మఱియు
శూన్యమతస్థులు - శూన్యమే ననుచు
ధన్యమౌ శుద్ధ చై - తన్యంబునకును 840
నెనలేని నామంబు - లీ ప్రకారముల
మొనసి కల్పింతు, రా - మూలతత్త్వంబు
జలజాప్త చంద్రన - క్షత్ర పావకుల
కలఘుగ్రహంబుల - కమిత తేజములఁ
దా నిచ్చి వానిచే - తను దాను వెలుఁగ,
కా నిర్మల స్వప్ర-కాశత్వమునను
వెలిఁగి, సూర్యాదుల - వెలిఁగింపుచుండుఁ
బొలుపుగా స్మర్థయు, - భోక్తయు, భర్త, 850
ద్రష్ట, ఋతంబునై - తానన్ని యెడల
నిష్టంబుగా నుండి - యెచట నంటకను
అరయ దేహస్థుఁ - డై, దాని కెపుడు
దూరమై తానె చి - త్తును, సత్తు నగుచుఁ
బొలుపుగా స్త్రీపున్న - పుంసక లింగ
ములు గాక, యింతకు - మూలమై యుండు
అతని దేహంబునం - దమితాబ్జజాండ
వితతులు పుట్టుచున్ - విరియుచు నుండు
అ యనంతుఁడు విశ్వ - మంతయుఁ జేసి
సేయకయే నిర్వి - శేషమై యుండు' 860
నని తత్త్వనిశ్చయం - బా రాఘవునకు
మనమొప్పఁ జెప్పి - యమ్మౌని యిట్లనియె:
'అరయఁగా [25] నఖిలేతి - హాససారంబు
పరమమాకాశజో - పాఖ్యాన మగును,
అనుభవంబుగ దీని - నాలించు వార
లనఘ! జీవన్ముక్తు - లై సుఖింపుదురు.
ఇలను జీవన్ముక్తు - లెట్టి వా? రనిన
బలీయు రాగ, ద్వేష - భయములు లేక,
నాకాశమును బోలె - నత్యుచ్చ మగుచుఁ,
బ్రాకటంబుగ నన్ని - పనులు చేయుచును, 870
ఎల్లకార్యములందు - నేవేళ నాత్మ
చల్లనై తగునట్టి - శాంతి వహించి,
పొరిఁ [26]బదార్థములందుఁ - బూర్ణుఁడై, గర్వ
విరహితుఁ డగుచు వి - వేకియై నట్టి
వాఁడు నిక్కముగ జీ - వన్ముక్తుఁ డగును,
పోఁడిమిగా నట్టి - పుణ్యాత్మకుండు
కాలవశంబునం - గాయంబు విడిచి
వాలాయమైన జీ - వత్వంబు నణఁచి
పరమాత్మ యందుఁ ద - ప్పక పొందు; నదియె
మురువు మీఱ విదేహ - ముక్తి యటంచుఁ. 880
బలుక నొప్పు' నటంచుఁ బట్టు గాఁ జెప్పి
పలికె నమ్ముని, యీ యు - పాఖ్యానమందు
నల పరమాత్మ మా - యా మనోరూప
కలితుఁడై జగములఁ - గల్పించినట్టి
సరణిఁ జెప్పంబడె; - సాత్త్వికి మాయ
కిరవైన దుర్ఘట - హేతుత్వ మహిమ,
మతి జగత్తునకును - మాయికత్వమును
తరమిడి యెఱుగంగఁ - దగునట్టి లీల
చరితంబుఁ జెప్పెదఁ - జక్కఁగాఁ దెలియు
మరు దది యెట్లన్న - నాలించి వినుము! 890
* లీలో పాఖ్యానము *
కమనీయ సామ్రాజ్య - కలితుఁ డనంగ
నమరెడు పద్మకుఁ - డను మహీపతికి
నలర భార్యామణి - యైనట్టి లీల
వలనొప్పఁగా సర - స్వతినిఁ బెక్కేండ్లు
కడఁక నుపాసింపఁ - గా వాణి వచ్చి
పొడసూప, లీల తె - ప్పున లేచిమ్రొక్కి
వినుతులు పెక్కు గా - వింప, నవ్వాణి
'వనిత! నీ కిపు డేమి - వర మిత్తు' ననఁగ
నీ లీల పలికె 'నా - కన్న ముందుగను
తాలిమి లేక నా - ధవుఁ డొకవేళ 900
[27]దెప్పునఁ గాల గ - తినిఁ జెందెనేని
యొప్పి నాయింట [28]జీ - వుం డుండు నట్టి
వర మీయు, మదిగాక - వరుఁడు దేహంబు
దొరఁగిన తఱి నాకుఁ - దోడుగా నీవు
వచ్చి నాపతిఁ బ్రోవ - వలె' నన్న వాణి
మెచ్చి యిట్లనియె 'నో - మెలఁత! నీవిభుఁడు
తనువు వీడిన వేళఁ - దడయ కా క్షణమె
పనిఁబూని సుమమంట - పంబుఁ గల్పించి,
యందు నీ పతి నుంచి - యపుడె పుష్పములఁ
బొందుగాఁ బైనఁ గప్పుము, దానఁ దనువు 910
కందక కుందక - కాంతితో నుండు
ముందరఁ దత్ ప్రాణములు వచ్చు మరల
బ్రదికి యీరాజె నీ - భర్తయై యుండు,
నిది నమ్మియుండు మో - యింతి! యటంచు
నా లీల కెఱిఁగించి - యరిగె నవ్వాణి,
మేలు గోరుచు లీల - మెలపుగాఁ బతిని
కలిసి యుండఁగ, నంత- కాలంబు రాఁగ
నల పద్మభూపాలుఁ - డంగంబు విడిచి
చనఁగ నా లీల పు-ష్పముల మంటపము
పనిఁబూని నిర్మించి - పతిదేహ మచట 920
బెట్టి, పైఁ బూలు గ-ప్పించి, కన్నీరు
పెట్టి, వాణినిఁ దాను - బేర్కొనఁగానె
వచ్చి సరస్వతి - వర పీఠమందుఁ
జెచ్చరఁ గూర్చున్నఁ, - జేదోయి మొగిచి
కనుల బాష్పము లొల్క-గా లీల భార
తినిఁజూచి పలికె 'నో - దేవి! మద్విభుఁడు
ఎచ్చటి కరిగెనో - యెఱుఁగఁ దద్దేహ
మిచ్చటి నుంచి, నీ - వెఱిఁగించినటులఁ
జేసితి, నిఁక నేమి - సేతు? మత్పతిని
బాసి ప్రాణము లెట్లు - భరియింతు నేను?'930
అని యేడ్చుచుండఁగా - నాదరం బెసఁగ
నెనసిన నెనరుతో - నిట్లనె పాణి
“ఓ లీల! క్లేశంబు - మపసంహరింపు
జాల మెంతటి వాడు గడవగా లేరు
పుట్టినవారెల్లఁ - బోవుట నిజము,
నెట్టనఁ దిరముగా • నిల్వ రెవ్వరును,
కలలవంటిది యీ జ-గంబులో రీతి:
తెలిపెద నెట్లన్న - డేటగా వినుము!
నానాశరీరముల్ - నశియించి పోవు.
నూని శాశ్వతముగా - నుండు జీవుండు.940
ఆ విధమెల్ల నీ - వరుదుగాఁ జూడఁ
గా వలసినఁ జూతు - గాక! నీకిపుడు
తిరముగా జ్ఞానోప-దేశంబుఁ జేతు
నరసి భావించు చి-త్తాకాశ మొకటి,
యసుపమంబైన చి-దాకాశ మొకటి,
యొనరంగ నాకాశ - మొకటి యీ మూఁడు
గలవినెప్పుడు నిరా - కారంబు లగుచు
నలరఁగా నొండొంటి - నంటక యుండు
[29]జగతివే యాకాశ - శబ్ద వాచ్యంబు
లగును, చిత్తాకాశ - ముందు నాకనము 950
నందుఁ బొందకనె చి - దాకాశ మొప్పు,
నందుఁ జిత్తాకాశ - మను దాని యందు
గడఁకతో వృత్తి[30] వి - కారంబు లుండు,
నడరార నాకాశ - మందుఁ బూర్ణతయు ,
జడత గలిగియులకు - సతత మారెంటి
కెడమై వికారత్వ, - మిల జడత్వముసు
బొరయక తా స్ఫురత్ - స్ఫూర్తులు గలిగి
యిరవౌ జిదాకాశ - మెట్లన్న వినుము !
ఒక దేశమందుండి - యూరకే మఱియు
నొకదేశమునఁ బొంది - యుండఁగా, రెంటి 960
నడుమ నేదేశ మె-న్నఁగ రాక వృత్తిఁ
బొడముట లేక సం-పూర్ణమై యుండు
నమలచిదాకాశ - మన నొప్పు సదియె.
క్రమముగా నీవు సం-కల్పంబు మఱచి,
యా చిదాకాశంబు - నాత్మ భావించి
చూచి దృశ్యము లన్ని - శూన్యంబు లగుట
తెలిసితే బ్రహ్మమం-దే పొందఁగలవు.
వలనుగా నిప్పుడు మ-ద్వరముచేఁ బతిని
నీవు చూతువు గాక! - వేఁ జెప్పినట్లు
భావించు'మని వాణి - బ్రహ్మలోకంబుఁ 970
జేరె: నిక్కడ లీల - చిత్తవృత్తులకు
దూరమై, నిర్లేప - తుర్య సమాధి
యందుండి పరమాత్మ - యందు వేగముగఁ
బొంది, నిజేశుండు - పూఁ బాన్పుమీఁదఁ
బదియు నాఱేండైన • ప్రాయంబుతోడఁ
బదిలుఁడై యుండఁగా - భావించి చూచి,
మదిని భారతిని స-మ్మతముగాఁ దలఁచె;
సదయాత్మయై వేగ - శారద వచ్చి
ముందర నిలువఁగా - మ్రొక్కి పీఠంబు,
నందుంచి లీల యి-ట్లని విన్నవించె. 980
తల్లి! గీర్వాణి! నా - ధవునకు సృష్టి
వల్ల వేఱొక సృష్టి - వచ్చె వింతగను.
ఈ జాగ్రత భ్రాంతి - యే?'మని యడుగ
నా జలజాక్షి కి - ట్లనియె గీర్వాణి
అతివరో! మృతిఁ జెంది - నట్టి నీ యాత్మ
పతి పూర్వ జన్మ వి - భ్రాం తీవు గనిన
యది విప్రదేహమౌ, - హరిణాక్షి! రెండ
వది రాజదేహమై - వసుధఁ బాలించి,
యీ దేహమం దుండి - యేఁగి వేవేగ
నా దేహమునఁ జొచ్చె - నద్భుతంబుగను. 990
ఆ రీతిఁ జెప్పెద - నాలించి తెలియు!
మారూఢమైన చి - దాకాశమందు
మానిత సంసార - మంటప ముండు.
దానియం దొక శైల - తటమున నొక్క
పట్టణంబుస నిజ - భర్తతోఁ గూడి
పట్టుగా నొక్క వి - ప్రవరేణ్యుఁ డుండి,
యల కొండక్రింద మహా - వినోదములు
బలముఁ జూపుచు నొక - పార్ధివేశ్వరుఁడు
అలరుచు మెకవేట - లాడఁగాఁ జూచి
తలఁచె నిట్లనుచుఁ జి - త్తమున 'నీ రాజు 1000
పగిది నెన్నడు భూమి? - బాలింతు? ననుచు
వగచి, చింతను బొంది - వాఁ డందుఁ దనువుఁ
బడవైచి పద్మ భూ-పాలుఁడై పుట్టె
నడలుచు నతని భా-ర్యామణి మేనుఁ
బాసి లీలాఖ్యతోఁ - బ్రభవించి నీవు
భాసురాత్మకుఁడైన - పద్మభూపతికి
నిల్లాలవైతివి, యష్టభోగముల
నెల్లవా రెఱుఁగ భూ-మేలు చుండితిరి.
మొనసి బ్రాహ్మణ దేహ-ములు మీరు విడిచి
యెనిమిదినా ళ్లయ్యె, - నిచ్చట మీరు 1010
పొడమి డెబ్బది యేండ్లు - భోగేచ్ఛ మీఱఁ
బుడమి యేలతిరి యి-ప్పుడు రాజతనువు
వీడిన దిన మందె - విను పదాఱేండ్ల
వాఁ డయ్యె నని మఱి - వాణి యి ట్లనియె:
ఆ విప్రుభార్య నీ - యటువలె నన్ను
వా వీరి నర్పించి - వరయుగళంబు
నడుగ నిచ్చితి విప్రుఁ - డానాఁడు తనువు
విడిచియు నా యిల్లు - వెడలి పోకుండెఁ
గాన మీ యిరువురి - కాపురమెల్లఁ
బూని బ్రాహ్మణ గృహం-బున నున్న దిపుడు, 1020
అరయఁ బునార్జాతుఁ-డైన భూవిభుని
గురుతర సంసార - గోష్టి నీయింట
నిలిచియున్నది యని నిశ్చయంబుగను
పలుకఁగా విని లీల : భారతి కనియె:
అక్కట! జనని. బ్రాహ్మణవర్యు జీవ
మెక్కడ వచ్చి పూ - యింటిలో జొచ్చె?
వాఁ డేడ? మే మేడ? .. వన, గిరుల్ దిశలు
నేడ? నవెల్ల మా - యింట నె ట్టణఁగె?
నిమ్మాడ్కి వచియింప - నేల? యిచ్చోట
నమ్మ! యీ వాక్యంబు లన్ని దబ్బఱలు. 1030
కుదురైన సర్పకో - టరమందుఁ బిదపఁ
బదవడి సురధంతి - బంధింపబడియె,
బలమొప్ప నణువులో - పలనుండు సింహ
ములతోడ మశక మి-మ్ముగఁ బోరి గెలిచెఁ,
గమలబీజంబులోఁ - గనకాద్రి యున్న
నమర భృంగము మ్రింగె - ననిన చందంబు
గా వచియింప కె - క్కడిమాట' లనఁగ
నా వాణి లీల కి - ట్లనియె 'నెన్నడును
నే దబ్బఱాడను, - నీచేత నియతి
భేదన సేయ న-భేద మాత్మీయ 1040
మందిరమందు బ్రా-హ్మణుని జీవాత్మ,
పొంది యున్నది. యిది - బొంకు గా దతివ!
ఆవిప్రుఁ డున్న మ-హారాష్ట్ర మాత్మ
భావింప గగన రూ-పంబగుఁ గనుక,
గగనాత్మకుండై ప్ర-కాశించి, యన్ని
యగణితుఁ డగుచుఁ దా నందుండి చూచు;
నానాఁటిదేహంబు లందున్న తలఁపు
లీనాఁడు మఱచితి, - రిద్దఱియందు
మనముల వేఱె సం-స్మరణలు పుట్టె,
వనజాక్షి! జాగ్రద-వస్థలు దలఁచు 1050
తలఁపు లన్నియును జి-త్తమున వసించి
కలలందు సుఖము, దుఃఖమును జీవునకుఁ
బరిపరి విధములఁ - [31]బాపపుణ్యముల
సరణులఁ దోఁపించి, - జాగ్రదవస్థ
మరల వచ్చిన [32]నన్ని - మాయంబులైన
కరణిని మరణంబు - గలిగిన వేళ
బొందిలో మును పుండి - పుణ్యపాపముల
నిందుఁ జేసిన వెల్ల - నెనసి వెన్నాడి
చనఁగ, లింగశరీర - సహితుఁడై స్వర్గ
మున మహాసుఖము ని - మ్ముగ నారకముల 1060
యందు దుఃఖము పూర్వ - మవనిపైఁ గలలఁ
జెంది తా ననుభవించిన చందములను
ననుభవించిన మీఁద - నవనిపై మరల
జనియించి, పరలోక - సౌఖ్యదుఃఖముల
మఱచుచు సంసార - మాయలోఁ దగిలి,
పరువడి పుణ్యపా-పంబులు చేసి,
చని పుట్టు, నిటువంటి - చావు, పుట్టుకలు
కలిసి జీవునకుఁ గ ల్గిన చందమునను
గనిపించు నజ్ఞాన - కలితులై నట్టి
మనుజున 'కని చెప్పి - మరల నిట్లనియె: 1070
ముదితరో ! సంకల్ప ముకురంబు పోలెఁ
గుదురు [33]చిదాకాశ - కోటరమునను
నందొప్ప నంతఃస్థ-మై యుండు భూమి,
యందెన్నఁ బరమాణు - వనఁ దోఁచు నాత్మ
యందుఁ దద్రూపమై - నట్టి మనంబు
నందు సర్వజగంబు - లద్భుతంబుగను
గనఁ బ్రతిభాపాత్మ - కంబులై యుండు'
సన విని లీల యి-ట్లనె సంశయమున
'జనని' యావిప్రుండు - చనిపోయి నేటి
కెనిమిదినా ళ్లంటి - విచ్చట నాకు 1080
నెన్నఁగా డెబ్బది - యేం డ్లయ్యె. నిట్టు
లున్న కలఁకఁ దీర్చు - మోతల్లి ! యనిన
విని వాణి పలికె నో విరిఁబోణి ! నిజము
పనుపడ నాలించు - ప్రతిభాసకన్న
నల దేశ కాలముల్ - హ్రస్వముల్. దీర్ఘ
ములు లేవు. చిద్రూప-మున కన్న వేఱె
ప్రతిభాసలే దట్టి - ప్రతిభాసవిదము
సతి! విను మెట్లన్న - జంద్రచంద్రికల
కరణి భేదా భేద - కలితంబు లగుచుఁ
బరమచిత్తుసు చిత్ర - భాసలు వెలుఁగుఁ 1090
జిత్తానఁ [34]బ్రతిఫలించిన కారణమునఁ
జిత్తు జీవాత్ముఁడై సృష్టితోఁ దగిలి
మరణ మూర్ఛలఁ బొంది - మదిఁ బూర్వ సరణి
మఱచి, క్రమ్మఱఁ బుట్టి మాయచే జిక్కి
కలఁ గాంచి మేల్కొన్న - కైవడిగాను
వలనుగా న న్యభా-వన నొంది, తాను
నాధేయ మగుచు నా - కాస్థూల దేహ
మాధార మనుచు దే-హాభిమానమునఁ
దనకు వీరలు తల్లి-దండ్రులటంచు
గునిసి భార్యా పుత్ర-కులు వా రటంచు1100
మించి, కొందఱు శత్రు - మిత్రు లటంచు
నెంచి, వివేక వి-హీనుడయినందు
చేఁ బ్రపంచము దోఁచు - సిద్ధమైనట్ల,
ఈ ప్రపంచము కల్ల, - యీ భ్రాంతు లెల్ల
విడువుము! జీవుండు - వివిధ దేహములఁ
బడవైచుచును ప్రాఁత - బట్టల విడిచి
క్రొత్త బట్టలఁ గట్టి - కొనిన చందమునఁ,
జిత్త విభ్రాంతిచే - జీర్ణంబులైన
తనువుల విడిచి నూ-తనశరీరముల
నొనరంగ ధరియింపు-చుండు, వానికిని1110
నెందఱు తలిదండ్రు, - లెందఱు భార్య,
లెందఱు నందను, లెందఱు హితులు,
శాత్రవు లెందఱు - చర్చింప, నీకు
మాత్ర మీపురుషుండు - మగఁడయ్యె ననుచు
భ్రాంతి నొందుచు దుఃఖ - పడక, నీ యాత్మ
నంతరంగంబునం - దరసితి వేనిఁ
బొలుపార స్త్రీ పున్న - పుంసకలింగ
ములు గల్గ వాత్మ కి-మ్ముగ నెన్నఁటికిని,
కావున నీవు నిక్కము నెఱింగినను
నీవు స్త్రీయును గావు - నెఱి బూరుషుఁడవు1120
గావు. నపుంస కా-కారంబు గావు.
భావింప నీకొక్క - పతి లేఁడు, నీవు
పద్మభూపాలుని - భార్యవు గావు
పద్మాక్షి నీ విట్టి భ్రాంతి వర్జించి
పరమాత్మ నే నని - భావింపు మనుచుఁ
బరిపరివిధముల భారతీదేవి
చెప్పినం, దనుఁ దానె చింతించి లీల
యప్పు డిట్లనియె నో - యమ్మ గీర్వాణి!
నీవు చెప్పిన రీతి నిశ్చయంబయ్యె,
నావిప్రమిథున మున్నట్టి సజ్ఞకును1130
ననుఁ గొనిపొమ్మన్న - నగుచు నద్దేవి
మనమున భావించి మరల ని ట్లనియెఁ
'దరుణి! యప్పరమచైతన్యచిద్రూప
సరణిని నీవు నిశ్చయముగా నాత్మ
భావించి తత్వరూపంబున నైనఁ
బోవచ్చు నావిప్రపుంగవుఁ జూడఁ
రావచ్చు నీ స్థూల - కాయంబుతోడఁ
బోవుట దుర్లభంబుగ నుండుఁ గానఁ
బరఁగఁ జిత్తస్వరూపమును ధరించి
తెఱఁగొప్ప నాటి భౌతికశరీరంబు1140
నారసి ధ్యానింప నపుడు మావంటి
వారి కెల్లను చిర - వాసనచేత
బలవంతముగఁ గనఁ - బడునట్టి వాస
నలు తనుత్వము నొంది-నను శరీరమునఁ
దగ నాతివాహిక - త్వం బుదయించుఁ
బగలైనఁ, దపన తా-పంబున మంచు
కరిగి నీరంబైన - కైవడిగాను
సురుచిరంబైనట్టి - శుద్ధసత్యంబు
దఱచుగాఁ జిత్తను - తనువాసనయును
వరుసగా గన నాతి - వాహికం బగును1150
నన విని లీల యిట్లనియె నీ జ్ఞాన
మెనసి నే సాధించు - టెట్లొకో? యనుచు
ననుమాన మొందఁగా నా వాణి పలికెఁ
'దనుమద్య! విను పర- తత్త్వచింతనము
ధన్యతా ప్రదముగు, - తత్కథాశ్రవణ
మన్యోన్యభోదనం - బతిశయకాంతి
పనుపడిన తదేక - పరత యభ్యాస
మనఁబడు, దృశ్యంబు లన్ని సత్యములు
గా మదిఁగని కర్మకారు లందఱును
బామరు లని వారి [35]పథములం జౌక1160
యూరకే యుపశాంతిఁ బొందినరీతి
నారూఢమైన బ్రహ్మానుసంధాన
సరణి యటంచు నిశ్చయముగాఁ జెప్ప
సరిప్రొద్దువేళ నిశ్చలతరజ్ఞాన
దేహంబుతో భార-తీ దేవి, దివ్య
దేహంబుతో లీల - దిగ్గున లేచి
గ్రక్కున గగన మా-ర్గంబున కెగసొ
యక్కఱగా లీలఁ - బద్మజాండ మండలముఁ
బటుతీవ్రముగ నెడఁ - బాసి యా యిరువు
రట పోవఁగా నొక్క - యద్రి పైఁ బురము1170
వేవేగఁ గని, యందు - విప్రమంటపము
భావించి యిరువు రా - పంథను బోయి,
అచట రెండవ స్వర్గ - మందుఁ బొదివికొని
ప్రచురమై తగు పూల - పానుపు మీఁదఁ
బవళంచి యుండిన పద్మభూపాలు
శవముతో నొప్పిన - సదనంబుఁజేరఁ
గాను, దత్పతి వారిఁ - గని మ్రొక్కి, వాణి
నానందముగఁ జూచి యంఘ్రు లర్పించి,
యందున్న, జూచి యి-ట్లనె వాణి 'నృపతి!
పొందుగా నిపుడు నీ - పూర్వ జన్మములఁ1180
దలఁపు' మటంచు మ-స్తకముపై హస్త
జలజంబు నిడఁగ, నా - జననాయకునకు
మనమునం దంటీన - మాయ దొలంగె :
ననఘుఁడై, విజ్ఞాని-యై పూర్వజన్మ
సరణిఁ దాఁ దెలిసి యా-శ్చర్యంబు నొంది
'నరవి నహో! మహా - సంసారమాయ!
గెంటక దివ్య యో-గినుల సత్కృపను
గంటి' నంచుఁ దలంచి - గరములు మొగిచి,
పలికె ని ట్లనుచు 'నో - భామినులార!
వెలయుచుండిన మేను - విడిచిన దినమె1190
నాకు షోడశహాయనము - లయ్యె, మఱియుఁ
బ్రాకటకార్యముల్, - బంధుమిత్రాది
జనులును దోఁచిరి - స్వాంతమం'దనిన
విని వాణి యా భూమి - విభునకిట్లనియె:
'అలవడు మోహ మూ-ర్భానంతరమునఁ
గలిగెఁ దత్‌స్మృతి నీకుఁ - గలఁగన్నకరణి,
నాలోకమును బాసి - యరుగ ముహూర్త
కాలమై యింతలో-గా విచిత్రముగ
మఱియు వేఱే విభ్ర -మం బుదయించె,
నరయఁగ ఘననిభం - బగు మనమందు1200
విను తగ వ్యవహార - విభ్రమకృతము
ననఁగ నొప్పఁగ -నందు నల ప్రతిభాస
పుట్టె, షోడశ వర్ష-ముల వాఁడ వైతి,
విట్టిరీతిఁ దలంప - నిలఁ గల యందుఁ
దగు ముహూర్తమున న-బ్దశతంబును నైన
పగిదిఁ దోఁచుచునుండుఁ బటు మాయ వలన,
దానికైవడి జాగ్ర -త భ్రాంత మిదియుఁ,
కాని నిశ్చయమనఁ - గా రాదు నృపతి!
యలపరమార్ధంబు - నందుఁ బుట్టుటలు,
పొలియుటల్ నీటి బు-ద్బుద. వికారములు;1210
నిరుపాధికుఁడ వీవు - నిర్లేపనుఁడవు,
పరమభోగ స్వరూ-పకుఁడవు నీవు
అన్నియుఁ గనుచుందు - వన్నియుఁ గనవు.
నిన్ను నీ వెఱిఁగిన - నీ కన్య మగుచుఁ
గనిపించు వస్తు వె-క్కడ నైనలేదు.
తనర బాలకుఁడు భే-తాళభూతమును1220
కని మరణాంతదుఃఖము నొందు కరణి.
మనుజేంద్ర! యదిగాక - మరుమరీచికలఁ
గాంచి మృగములు తత్కాంతిఁ దోయముగ
నెంచిఁ ద్రావను బరు-గెత్తుచందమున
ననపరతం బసత్తైన ప్రపంచ
మును సత్తుగా నెంచి - మూఢు లయ్యెదరు.
సత్తుగా దీప్రపంచం బస త్తనుచు
నత్తఱి సకలవేదాంతమర్మములు
చెప్పి వీడ్కొని దివిఁ జేరి యా యిరువు
రొప్పగాఁ జూచుచునుండి రంతటను.
ఆవిదూరదుఁడు నం-దాత్మతత్వమును
భావింప నంతలోఁ బరరాజొకండు
బలముతోఁ బద్మభూపాలునిమీఁద
నలిగి కయ్యముఁ జేసి - యతని వధించె
నప్పుడు వాని దేహంబులో నుండి
తెప్పున నొక సూక్ష్మ - తేజంబు వెడలిఁ
గ్రక్కున గగనమార్గంబున కెగిరె
నక్కడఁ జూచుచున్నటువంటి వాణి1230
పదపడి లీలతోఁ బలికె ని ట్లనుచు
"ఇదె చూడవే లీల! - యింతకు మున్ను
మనలతో భాషించు - మనుజనాయకునిఁ
బనిఁ బూని యన్యనృ - పాలుండు ద్రుంచె
వాని తేజంబిదే - వచ్చి యాకసము
నూని పై కెగిరిపో-వుచు నున్నదిపుడు 1240
చూడు' మనుచుఁ - జూపుచును వాణి లీల
తోడఁ బోవ, విదూర - ధుని జీవరేఖ
రహిమీఱ సర్గ ప-రంపరలందు
సహజంబుగాఁ బొంది. - చనిచని మఱియు
గురుతర బ్రహ్మాండ - కోటులయందు
మెఱయుచును బరిభ్ర - మించి, యా మీఁద
మరల దిగంబడి - ముహిమీఁద వ్రాలి.
యిరువుగా మును పద్ముఁ - డేలిన పురముఁ
జేరి యిల్లిల్లుఁ జొ-చ్చియును వెళ్ళియును
వారక పద్మ భూ -వరుని మందిరముఁ 1250
గనుఁగొని యట కేఁగి - క్రమ్మఱఁ బద్మ
మనుజేంద్రు తనువులో మాయగాఁ జొచ్చి
వెలుగ. నప్పద్మభూ - విభుఁడు నిద్రించి
కలఁగాంచి లేచిన కైవడిగాను
ఆవులింపుచుఁ గన్ను - లప్పుడు దెఱచి
లేవగా, జూచి యా లీల సంతోష
కలితయై భారతి - ఘనమహామహిమఁ
దలచి నుతింపుచుఁ - దత్పతి కడకుఁ
దొలఁగ కాశారద - తోడఁ దా వచ్చి
నిలువ, లీలను జూచి నృపుఁ డిట్టులనియె: 1260
'మానిని! యీ పుష్ప - మంటపస్థలము
నే నెన్నఁ డైనను - నిర్మించలేదు,
ఈ లక్షణం బేమి? - యెఱింగింపు' మనఁగ
నా లీల నడచు వృ-త్తాంతంబు లెల్ల
వినిపింప, విని రాజు - విస్మయ మొందె
అనుపమకరుణతో - నా నృపాలునకు
జ్ఞానోపదేశ మ-చ్చటఁ జేసి, వాణి
పూని లీలను జూచి - పొసఁగ దీవించి,
గ్రక్కున సత్యలో-కంబున కరిగె;
ఇక్కడ లీల ని-జేశ్వరుఁ గూడి1270
యెనుబదివేల యేం-డ్లిష్టభోగముల
ననుభవింపుచు నుండి - యట ముక్తులైరి.
మానవేశ్వర! మనో - మాయావశమున
నూని కనంబడు - చున్న విశ్వంబు
పొలుపార లీనమై - పోవుట జనులు
తెలిసికొందు రటంచుఁ - దీటగా లీల
కథఁ జెప్పితిని ని-క్కము లన కవలి
కథ విను!' బ్రహ్మ మ- ఖండచిన్మయము,
పరిపూర్ణ, మమలంబు, - భావనాతీత
పరమాత్మతత్త్వంబు • భావింప నదియె1280
యచలమై సర్వ దే-హములందుఁ బొంది,
ప్రచుర నిర్వాత దీ-పము భంగి నుండు;
నదె జీవకళ యని - యాత్మ భావించు!
వదలక సంసార-వాసన నదియె
గణుతి కెక్కుచు నహం - కారమై నిలిచి,
యణువట్ల సూక్ష్మమై - యగ్ని కణంబు
బహుకష్టములఁగూడి - ప్రబలింప, నందు
బహువిస్ఫులింగముల్ • ప్రభవించు కరణి
నాయహంకారాణు - వం దనేకములు
గా యహం కారాణు - గణములు గలిగె:1290
ఘనమైన యాద్యహం-కారమే ప్రకృతి
యన, మాయ యన, మనం బనఁగాననేక
నామ రూపముల నా నా ప్రపంచముగను
దామించి వికసించి, - తన కాదియైన
పరమాత్మ తత్త్వంబు భావింపనీక
మఱుఁగు తానై నట్టి - మాససమందుఁ
బొలువుగా నీ జగం-బులు విస్తరించుఁ,
గలల చందంబునఁ - గనిపించు, నణఁగు
నల జీవులకుఁ బరమాత్మ కైక్యంబు
గలిగిన చందంబు- గాను జీవాత్మ1300
చిత్తరూపము, దాల్చి చేష్టింప, నపలఁ
జిత్తంబు ప్రబలించి సృష్టి గల్పించె:
సదమల చైతన్య - సాన్నిధ్య పటిమ
నొదవి విశ్వము పుట్టు. - నుండు. నశించు:
ఆ పరమాత్మ తా నణఁగ దెన్నఁటికిఁ ,
గాపట్య జగములె - గలుగు, లయించుఁ
గాన, నంతటి కాది - కారణ మాత్మ
దానిని నీవుగాఁ - దలఁపు శ్రీరామ!
కర్కటికోపాఖ్యానము
ఇపు డొక యితిహాస - మేను జెప్పెదను
చపలత నొందక - చక్కఁగా వినుము!1310
అర్కకులేశ! యీ - యవనీతలమునఁ
గర్కటి యనెడి - రక్కసి గల దొకతె,
అది హిమ శైలోత్త - రారణ్యములను
గదిసి చరింపుచుఁ.. గనఁబడినట్టి
జనుల ననేకులఁ - జంపి భక్షింపు
చును. దిరుగుచు మహా - క్షుద్రాత్మయైన
పాపరాక్షసి, పుణ్య - పరిపాకకాల
మా పట్ల రాఁగఁ దా- నాహారముడిగి,
శాంతిచే జీవహిం-సలఁ జేయ రోసి,
యాంతరంగిక దృష్టి - నాత్మ భావించి1320
కనుచు వెయ్యేండ్లు నిష్కర్షగాఁ దపము
నొనరింప, నటుమీఁద - నొక్క నాఁ డజుఁడు
వాని చెంతకు వచ్చి - తరుణి! నీ తపము
నేను మెచ్చితి, శాంతి - నిలిచె నీ మదిని :
కూడు పిడిచి పెట్టి - ఘోరతపంబు
నీడ చేయక, లేచి - యేగి యెందైనఁ
బాపకర్ములఁ జంపి - భక్షింపు' మనుచు
నా పద్మజుఁడు దాని - కప్పుడు చెప్పి
చనియె; నంత సమాధిఁ - జాలింప కతివ
పనిఁబూని నిర్విక-ల్ప సమాధియందుఁ1330
దెగువ మీఱ ననేక - దివ్యవత్సరము
లగణిత మతి నుండి, - యట లేచి పోయి,
యాఁకలి మునుపటి - యట్ల పుట్టఁగను
వీఁకతో మనుజుల - వెదకుచు నొక్క
యడవిలో నడిరేయి - నరుగుచునుండి,
విడఁబడి మెకముల - వేఁటాడి యెదురు
వచ్చుచున్న కిరాత - వరునిఁ, దన్మంత్రి
నచ్చుగా నీక్షించి - యార్భటింపుచును
పదరి పల్కె' గిరాత-పతి! నిన్ను, మంత్రి
నదిమి చంపి భుజింతు - నాఁకలిదీఱ,1340
నటుచావరేని నే-నడిగిన ప్రశ్న
లిట మీఁదఁ జెప్పు,(డ - వెట్టన్న వినుఁడి!
పాయక మితి లేని - పద్మజాండంబు
లేయణు వందుండు - నింపుసొం పెసఁగఁ?
గదిసి యనేక సం-ఖ్యల బుద్బదములు
వదలక యే మహా - వార్ధిలో నుండు?
నాది ననవకాశ - మైన యాకాశ
మేది? తా నరయఁగా - నేమియు లేక
యించుక గలవస్తు - వెయ్యది గలదు?
చాంచల్యసంసార - సౌఖ్యంబు లనెడి1350
జాడలఁ జరియించి - చలియింపకున్న
వాఁడు నెవ్వాఁడు? స-ర్వంబునం దెపుడు
ఘనముగా నుండియుఁ - గడముట్టఁ జూడ
నొనర నుండక వెల్గు - చుండు నెవ్వండు?
ధరను చేతన నొంది - తానెవ్వఁ డయ్యె?
నరయ నెవ్వఁడు మింట - నద్భతంబుగను
జిత్తరువును వ్రాసెఁ - చిత్ర వర్ణముల?
సత్తైన సూక్ష్మ బీ - జంబులో స్థూల
వృక్షం బణఁగి నట్లు - వివిధ ప్రపంచ
మక్షయ ముగుచునే - యణువులో నుండుఁ?1360
బ్రాకటంబుగఁ బృథ - గ్భావమై యెప్పుడు
నేకమై తగువస్తు - వెయ్యది ? ద్రవము
నుదకంబు నొకటిగా - నుండుచందమున
వదలకయే రెండు - వలెఁ దోచి యొకటి
యగుచు నుండెడి దెద్ది? - యని వితర్కించి
పగటుతో నడుగ న-ప్పుడఁతి వాక్యములు
విని. భీతిలక జన - విభుఁ డాత్మ మంత్రిఁ
గనుఁగొని 'దీనీ వా-క్యముల కర్దములు
దెలుపు మటన్న మం-త్రి వివేకయుక్తి
కలీతుఁడు గానఁ గ-ర్కటి కిట్టు లనియె:1370
'అతివ రాక్షసి! మమ్ము - నడిగిన ప్రశ్న
అతిరహస్యములు వే-దాంత గూఢములు
కావునఁ జెప్పు శ-క్యంబు గా, దైన
భావించి చెప్పదఁ -బట్టుగా వినుము!
సదమల బ్రహ్మంబు - సత్య, మనంత
మది, వాఙ్మనో తీత, - మాకాశనిభము
నగుచుండు, నటువంటి - యాత్మాణువందు
తగ నజాండములు వి-స్తారంబు లగుచుఁ
బొడముచు బుద్బుదం-బుల మాడ్కి నణఁగు,
నడరార మఱియు న-త్యద్భుతం బగుచుఁ1380
బ్రవిమలాకాశమై - బాహ్యంబులేని
యవకాశమై చిన్మ - యంబౌచు నిండి,
యద్వయం బై యిది - యది యనరాదు,
తద్వస్తుసంతతి - దాననే కలిగెఁ;
గ్రమ మొప్పఁగాఁ దత్ప్ర- కాశత వలన
నమరి చేతనుఁడైన - యతఁ డభేద్యుండు
గనుక స్వశీల సం-కలితుఁడై యుండి,
యనుపమాత్మాకాశ - మం దీజగములఁ
దనతలంపుననె చి-త్తరువుగా వ్రాయు,
ననఘాత్ముఁడై నట్టి -యతని తలంపు1390
వలననే సర్వ వి-శ్వము దోఁచెఁ గనుక
వెలయు నీ విశ్వంబు - వేఱుగా, దన్ని
తానె యగుటఁ జేసి - తన కన్య వస్తు
వేనాఁటికినిఁ గల్గ - దింత కాశ్రయుఁడు
నగువాఁ డొక్కడు నిశ్చ-యంబుగా నుండు.
నగణితసద్రూప మగుచుండుఁ గనుకఁ
బరమాత్మ గలఁడని - పండితోత్తములు
చిరతర ప్రజ్ఞతోఁ - జెప్పఁగా నొప్పు'
నని మంత్రి కర్కటి - కాత్మ నిశ్చయము
వినిపింప, నది వాని - వినుతించి, యతని1400
దొరను సంతోషంబు - తోఁ జూచి 'నీవు
నెఱిఁగిన రీతి నా-కెఱిఁగింపు మనఁగ
విని యమ్మహీపతి - వేడ్కగా దానిఁ
గని యిట్టు లనియే - నఖండయుక్తులను
'వినవె కర్కటి! సర్వ - విశ్వంబు మిథ్య,
యని యెఱింగిననె మ-హాత్మునిఁ దెలియ
వచ్చు, సంకల్ప వి-వర్జితుండైన
హెచ్చుగానే స్వామి - నెద నుంచవచ్చు.
మెఱయు నే స్వామి యు-న్మేష నిమేష
సరణి నంతయుఁ బుట్టి - సమయుచునుండు,1410
ఘననిగమాంత వా-క్యంబు లేదైవ
మును గొప్పగా నెంచి - మొనసి నుతించు?
గురుతర బ్రహ్మాండ - కోటుల నిండి
తిరముగా నుండి యే - దేవుండు దృష్టి
విషయంబు గాకయే - వెలుఁగుచు నుండు,
ఝష ఫష లేక యీ- సచరాచరములు
లలన! యేదేవు లీ - లను బ్రభవించి
బలసి వర్తిలు నదే - బ్రహ్మమౌ నింతి!
విశ్వాత్ముడై సర్వ - విశ్వంబుఁ జేసి,
విశ్వంబు తానయై - విశ్వంబుఁ గనుచు1420
విశ్వేశ్వరుం డన - వెలుఁగుచున్నట్టి
శాశ్వతాత్మబహ్మ - సన్మాత్రసత్య
[36]వాక్య ఫణితి నీవు - వరుసగా నడుగ
నైక్యానుసంధాన - మబ్బెమా'కనుచుఁ
బలికిన సంతోష - భరితాత్మ యగుచు
నలరీ కర్కటి యిట్టు - లనియె నోసృపతి!
యహహ! మీ వాక్యంబు - అమృత తుల్యములు
సహజసుజ్ఞానభా-స్వరములు గాన,
మీరు పుణ్యాత్ములు - మీదయన్ జ్ఞాన
మారూఢమై, సంశ-యములఁ దీర్చినది,1430
యానంద మొదవె నా' - కన విని వాఁడు
దాని కిట్లనియే నో - దానవి! నీవు
పనిఁబూని వికృత రూ-పము మాని సౌమ్య
తనువుతో వచ్చి మా - స్థలమునం దుందు!
సతి! నీకు వస్త్ర భూ-షణముఖ్యవస్తు
వితతుల నిత్తు, మా - వీడులయందుఁ
జరియింపుచున్న రా-జద్రోహమతుల,
బరఁగు చోరుల, మహా - పాపకర్ములను,
జెనఁటులఁ జంపి భ-క్షింపుచు నుండు '
మని చెప్పి మంత్రితో - నా నృసాలుండు1440
తనగృహంబున కేఁగెఁ;- దదనంతరమున
జవపతి చెప్పిన - సరణి దప్పకను
దనపూర్వ దారుణ - తను వది వీడి,
ఘన సుందరాంగియై - గంధ, మాల్యములు,
చేల, భూషణము లి-చ్చిన ధరింపుచును
మేలిమి నా నృపు - మేడలం దుండుఁ.
బాపకర్ములఁ జంపి - [37] భక్షింపుచుండు,
నాపట్ల నుండక - యరిగి హిమాద్రిఁ
జేరి, యండు సమాధిఁ - జేసె' నటంచు
నా రామచంద్రున - కాపసిష్టుండు1450
పనుపడఁ గర్కటి - ప్రశ్నోత్తరముల
మన మొప్పఁగాఁ జెప్పి - మరల ని ట్లనియె:
'జనవర! నీకును - సంసారసుఖము
తనియ కున్నట్టి చి-త్త విలాసములను
గలుగు రాగాది వి - కార దోషములఁ
జెలువార్చి రోసిన - చిత్తమే మరల
విమలమై, సంసార - విభ్రమ మొక్క
సమయమం దణఁగక - చపలించెనేని
తెప్పున సుజ్ఞాన - దృష్టి సంధించి
యప్పు డాచాపల్య - మణ(పుచు నుండు:1460
మినతేజ! యిఁక నొక్క - యితిహాస మేను
వినుపింతు నెట్లన్న - విమల చిచ్ఛక్తి
సువిలాసమున మను-జుల నిశ్చయంబు
ప్రవిమలంబై జగ-ద్భ్రాంతి నణంచు,
అది యెట్లనినఁజిత్త - మను బాలకుండు
పొదువౌ ప్రపంచమన్ - భూతమున్ గాంచి
వెఱచుచున్నటువంటి - వేల గురుండు
'సరసాత్మ యిది ప్రపం- చ పిశాచ మనుచు
'భయము నొందకు, మీ ప్ర-పంచంబు బ్రహ్మ
మయ'మని చెప్పఁగా, " మది భీతి విడిచి1470
యరసి చిత్తార్చకుఁ - డానంద మొందు
భరణి నీ కిఁక, నొక్క - కథ వినిపింతు.
ఇందుపుత్రోపాఖ్యానము
అది యెట్లనిన నిందుఁ - డను భూసురుండు
కదలక సతితోడఁ - గైలాసమందుఁ
బరమేశుఁ గూర్చి త-పముఁ జేసి శివుని
వరమునఁ బదిమంది - వరపుత్రకులను
గాంచి, కొన్నాళ్లుండి, - కాలవేగమునఁ
బంచత్వమునఁ బొంది - పడిపోవ, నతని
సతి యగ్నిలోఁ జొచ్చి - సమయఁగా, వారి
సుతు లందఱును జూచి - శోకించి, తాము1480
సేయఁగాఁదగు క్రియల్ - చేసి, యా మీఁద
నాయగ్రజుడుఁ దమ్ము - లందఱిఁజూచి
తల్లినిఁ దండ్రినిఁ - దలఁచి పేర్కొనుచుఁ
దల్లడింపుచు నేడ్చు - తమ్ములఁ బిలిచి
'యేల యేడ్చెదరు? మీ - రెంత యేడ్చినను
జాలిచే జనకుండు - జనని క్రమ్మఱను
వచ్చి మీశోకంబు - వారింపఁ గలరె?
ఇచ్చట వగవక - యేమైన వరము
లఱలేక మీరు న-న్నడుగుఁ డటంచుఁ
గరుణ మీఱఁగఁ బల్కఁ-గాఁ దమ్ములనిరి:1490
'అన్న! [38] గోపగు నూరి - యధికారి కొదవు
నున్నత పదవి మా - కొసఁగు' మటంచు
నడుగఁగా 'నది స్వల్ప - మది, మీకు వలవ,
దడర నింకేమైన - నడుగుఁ డటంచుఁ
బలుకఁగా, 'సామంత - పదవి మా కొనఁగు
[39] మలర నిప్పు'డటన్న - 'నది యేటి పదవి?
ఇఁక మఱేమైన నే - నిచ్చెద' ననినఁ
'బ్రకటమై తగు రాజ - పదవి ని'మ్మనివ
'వివి యది మీకేల? - వేఱె వరంబు
మొనసి న న్నడుగుఁ-డి మ్ముగ నన్న వారు1500
'సకల రాజన్య శా-సనుఁడైన నృపతి
యకలంక పద మియ్యు' - మనఁగ, 'నశ్వరము
ఆరాజపదమేల?' - యన, నింద్రపదము
గౌరవంబుగ వేడఁ - గా, నతం డనియెఁ:
'దగఁ బ్రజాపతికి సి-ద్ధముగా ముహూర్త
మగువేళఁ జెడిపోవు - నయ్యింద్రపదవి,
కావున మీ రది - కాంక్షింపవలదు,
వేవేగ నడుగుఁడీ! - పేజొక్క వరము'
అనపుడు వారు 'క-ల్పాంతరంబులను
ఘనమై లయింపని - గతినీయు' మనిన1510
వాయగ్రజుండు 'క-ల్పాంతరంబులను
మాయక వెలుఁగు బ్ర-హ్మపదంబు మీకు
నిచ్చెద" ననఁగ, న-దే రీతి మాకు
హెచ్చుగా బ్రాపించు? - నెఱిఁగింపు' మనిన
దయను దజ్జ్యేషుండు - తమ్ములఁ జూచి
నయముగా నిట్లనె - నానా జగములఁ
బుట్టించు బ్రహ్మను - బుద్ధిచేఁ జిక్కఁ
బట్టి ధ్యానించి, త-త్పద మందవచ్చు'
నని చెప్పి, తమ్ముల - నందఱఁ దోడు
కొని చని యొక దిక్కు - గురుశుచిస్థలినిఁ1520
జేరి, పద్మాసనా - సీనులై బ్రహ్మ
నారూఢిగా చిత్త-మందు భావించి,
యమరులఁ బుట్టించు - నటువంటి బ్రహ్మ
లము తా మనుచు నిశ్చ-లత్వంబు నొంది,
తముఁ దామె చూచుచుఁ - దప మాచరింప,
నమితామౌ వర్షశీ -తా తపవాత
ములచేతఁ దద్దేహ-ములు నాశ మొందె;
నలఘు దివ్యాంగంబు - లా పదిమంది
ధరియించి, తాము వి-ధాతలై వేఱె
పొరిఁ బొరి జగములఁ - బుట్టింపఁ, జూచి1530
మొదటి బ్రహ్మాశ్చర్య - మునఁ బొంది తలలు
కదలించి యూఁచె, నీ - క్రమము భావింపఁ
జిత్తమే కర్తయ్యె- సృష్టి కంతటికిఁ,
జిత్తమే జీవుఁడై - చేష్టింపుచుండు;
నది యెట్టు లనిన బ్ర-హ్మల మని వారు
పదిమంది చిత్తముల్ - పట్టి భావించి
భావనా సిద్ధిచే - బ్రహ్మలై దేహ
భావన మఱచి రో - పార్థివాధీశ!
దేహవాసనలఁ బొం-దిన దేహి మరల
దేహమే దాల్చు, ముక్తినిఁ బొందలేఁడు;1540
ఆత్మ వాసన నొంది-నటువంటి దేహి
యాత్మయం దైక్యమౌ' - నని వసిష్ఠుండు
చెప్పిన, నూహించి - శ్రీరామచంద్రుఁ
డప్పుడిట్లనియె 'దే-హమున, కందున్న
జీవునకును వేరు - సిద్ధమై యుండు,
నావిధంబుగ నుండి - నప్పటికైన
గాయంబు సుఖము, దుః- ఖంబు జీవునకు
నా యా యెడం గల్గిన-ట్లుండకున్నె?
హిత మొప్పఁజెప్పు ము-నీంద్ర!' యటంచు
నతిభక్తితో రాముఁ - డడుగ, వసిష్ఠ1550
మౌని యిట్లనియె 'నో-మనుజేంద్ర! దీని
కేనొక యితిహాస - మెఱిఁగింతు వినుము!
కృత్రిమేంద్రోపాఖ్యానము.
అరయ నింద్రద్యుమ్నుఁ - డను వానిభార్య
మెఱయుచుఁదగు పైఁడి - మేడపై నుండి,
యొకవీథి నొకచోట - నాక విటకాని
సుకుమారదేహునిఁ - జూచి మోహించి,
కలయఁ గోరుచు నుండఁ-గా, నానృపాలు
కొలువులో నితిహాస - కుఁడు చేరి మదినిఁ
దలఁచి ప్రస్తావోచి-తంబుగా మున్ను
బలభేది గౌతము - భార్యను గూడి1560
చనిన వృత్తాంత మా - జననాయకునకు
వినిపింప, నది తాను - విని రాజపత్ని
తనమది నిటు తాను - దలఁచె నహల్య
మొనసి యింద్రుని బొందె - మునిని వంచించి,
యటువంటి పెద్దల - ట్లైరఁట! పూర్వ,
మిట పాపభీతి నా - కేల? యహల్య
నేను నీవిటకాఁడు - నిర్జరేశ్వరుఁడు
గా నిర్ణయించి, యా - ఘనునిఁ బొందెదను
నాకేమి భయ? మని - నడి రేయి పోయి,
జోకగా మును తాను - చూచినవిటునిఁ1570
గలిసి వేడ్కల నుండఁ- గాఁ, బొంచిపొంచి
వలనుగాఁ దలవరుల్ - వారి నిద్దఱిని
గనుఁగొని, దండించి, - గ్రక్కునఁ దోడు
కొనిచని, యొకదిక్కు - కూర్చుండఁ బెట్టి,
క్షితిపతి కావార్త - చెప్పిన, లేచి
యతి భీషణాకారుఁ-డై వారిఁజేరి
కఱకఱిఁ గొట్టింపఁ గా, వారు మోహ
పరవశులై మోహ - బాధ లాత్మలకు
తోచక యందుఁ బొం-దుకు నొండొరులను
జూచుచుఁ, బలుమారుఁ - జొక్కుచు, హావ1580
భావవిలాస వి- భ్రమవికారములఁ
గావింపఁ జూచి, యా-గ్రహముతో నృపుఁడు
కొంకక మఱి మఱి - కొట్టింప, నగుచు
శంకింప కిరువు రా-జనపతిఁ జూచి
పలికిరి ట్లనుచు 'భూ-పాల! మా మైత్రిఁ
దెలియక కొట్టించి -తివి, శరీరములఁ
గోయించినను నొప్పి - కోపంబు, భయము,
కాయాభిమానంబు - గలుగ, దెట్లనిన
సరసమౌ దేహ వా-సన నెడఁ బాసి
వరమనోవాసనా - వశులమై కలిసి1590
యుండఁగా, నీ విప్పు -డొట్టి దేహముల
దండించి కొట్టింపఁ - దగ ద దెట్లనిన
జిత్తమే హేతు వా - సృష్టి కంతటికిఁ,
జిత్తంబు లేకయే - సృష్టి యె ట్లగును?
నారయ భూజల - తాదులన్ జగము
సారెకు హత్తి ర-సంబైన కరణిఁ
దనువులయందుఁ జి-త్తము ప్రకాశించి,
తనియక పను లిట్ల-తానె గావింపఁ
గాను, జడములైన - ఘటముల నీవు
పూని కొట్టించినఁ - బోవువే కినుక!1600
తను వణంగినమ జి-త్తము దేహశతము
లను దాల్చు, విడుచు, మూ - లముగఁ దా నిల్చుఁ:
దా (దాల్చి విడిచిన - తనువులకొఱకుఁ
దాదాపపడువె చి-త్తం బేడనైనఁ?
జిత్త ధర్మముల ల-క్షించి నీ వెఱుఁగు
మిత్తఱి నీకోపమేల వీ?' కనిన
విని, వారి నా యూరు - వెళ్లఁ గొట్టించి,
మనుజేశ్వరుండు స-మ్మతిఁ బొందె; నంత
వారిద్ద ఱరిగి, య-వ్వలఁ గోర్కె తీఱఁ
గూరిమితోఁ గూడి - కొన్ని యేం డ్లుండి1610
తనివొంది, యట మీఁదఁ - దనువులు విడిచి,
మొనసిన సుజ్ఞాన-మున సిద్ధులైరి'.
అని చెప్పి మరల ని-ట్లనె వసిష్ఠుండు
'జననాథ! వినవయ్య! - సకలదేహులకు
నరయఁగా రెండు దే-హములుండు, నందుఁ
దెఱఁ గొప్పఁగా మనో - దేహంబు క్షిప్ర
గతి చలనంబు, నా - క్రమముగాస్థూల
మతిశయ మాంసమ - యంబుగా నుండు;
నన విని రాముఁ డి-ట్లనె నోమునీంద్ర!
మనము జడంబును, - మఱి యమూర్తమును,1620
పొరిని సంకల్ప ప్ర-భూతమై యుండి
ధరను దేహము నెట్లు - ధరియించి యుండు?'
నన వసిష్ఠుం డిట్టు - లనియె: 'నో రామ!
విను మనంతంబును, - విమల, మద్వయము
నచలంబు నగు పర-మాత్మ సంకల్ప
ఖచితమే మన మన-(గా వొప్పుచుండు.
తిరముగా బ్రహ్మోప - దేశమౌ నొక్క
సరసేతి హాస మా-శ్చర్యంబుగాను
శ్రీ మహితాత్మ! నేఁ - జెప్పెద ననుచు
నామౌని వర్యుఁ డి-ట్లనియె వెండియును,1630
చిత్తో పాఖ్యానము
చొరవగా నే దిక్కుఁ - జూచినఁ గాని
యరుదుగా నూఱేసి - యామడలంత
నిడు పెడల్పును గల్గి - నెరసియున్నట్టి
యడవిలోపల సహ-స్రాక్షులు, వెయ్యి
కరములు గల భీమ-కాయుండు మించి
పరిఘలఁ దనమేను - పలుమాఱు తానె
నఱికి కొంచును నాశ-నంబును బొంద
కరఁటు లుండిన తోఁట - కరిగి కరంజ
వనములోఁ జేరి, య-వ్వల నూతిలోన
మునిఁగి గ్రక్కున లేచి, - మునుపటి రీతిఁ 1640
గదళికావనములోఁ - గాఁ బ్రవేశించి,
పదపడి మేనెల్లఁ - బగుల నడంచి
కొనుచున్న, నేను గ-న్గొని 'యంతఁ గటికి
తనమున నడిచికోఁ - దగదని పట్టి
వారింప, నెలుఁగెత్తి - వాఁ డేడ్వ, ' నేడ్వ
కూరకుండు' మటంచు - నూఱడింపఁగను,
నతఁడు నవ్వుచు, మేను - హస్తంబు లెత్తి
ప్రతిఘతో ఖండించి - పాఱవైచినను,
నది చూచి వెఱఁగొంది - యావలఁ జనఁగఁ,
గదిసి భయంకరా - కారుఁడం దొకఁడు 1650
తనమేని కండలు - తానె ఖండించి
కొనుచున్నఁ జూచి 'యీ - ఘోరకృత్యంబు
వలదు నిలుపు' మటన్న - వాఁడు నామీఁద
నలిగి, తిట్టుచుఁజని - యంధకూపమునఁ
బడియె, నం దిటువంటి - ప్రజలను పెక్కు
పొడఁగంటినో రామ! - భూపాల! నీకు
నీ కథాతత్పర్య - మెఱుఁగరా, దేను
వీఁకతో, జెప్పెద - విను మ దెట్లనిన
సరవి నరణ్యంబు • సంసారఘోర,
మిరువురు పురుషులం - దెవ్వరటన్న 1660
గన మానసాఖ్య,ల - క్కరములు పరిఘ
లనినవి ధీవృత్తు - లగుచుండు, మఱియుఁ
బొలుపారు ప్రహరణం-బులు పాపదుఃఖ
ములు, నంధకూపంబు - మొగి నిరయంబు,
అరఁటితోఁ టన్నది - యమరలోకంబు,
మఱి కరంజములన - మనుజసంఘములు.
ఎలమి శాస్త్ర వివేక - మేను భావింప
నల భోగ శైథిల్య - మగుచుండుఁ, జిత్త
పరితాపమగు వాని - ప్రబల దుఃఖంబు,
సరసహాసం బాత్మ - సంతోషసుఖము, 1670
తలఁప నమంగళ - త్యాగం బనంగ
విలసిత మైనట్టి - వృత్తి నాశంబు,
ననువాఁడు కోపించి నది నాస్తికత్వ'
మని పితామహుఁడు ము -న్నతికృపతోడఁ
దేటగాఁ దన కుప - దేశించినట్టి
మాటల వరుస రా - మక్షితీంద్రునకు
మచ్చిక నెఱిఁగించి - మౌని యిట్లనియె:
'హెచ్చుగా మోక్షంబు - నిశ్చయింపుచును,
నొనర నాత్మ వివేక - మొకకొంత గలిగి
యును, భోగములు మాని - యును, బాహ్యసంగ 1680
మును బాసి సంశయ-ముల వీడలేక,
పనుపడి నిర్వాణ - పద మొందలేక,
స్థిరమోక్ష పదమొందఁ - దివురుచందంబు
పరితాప మనఁబడు - భావించి చూడ
జ్ఞానయోగము నొంది - సర్వంబు రోసి,
పూని మనోలయం-బు నొనర్చునదియె
హత్తిన యానంద -మని చెప్పఁబడును
చిత్తమే పురుషుండు, - చిత్తమే ప్రకృతి,
చిత్తమే సంసార - సృష్టి యటంచుఁ,
జిత్తమందే నీవు - చింతించి తెలిసి, 1690
మొనసి చిత్త త్యాగ-మును జేసి సౌఖ్య
మును బొందు రామ! యి-మ్ముగ సర్వశక్తి
పర, మద్వయము, సర్వ - పరిపూర్ణ, మజము,
పరమాత్మయును, బర - బ్రహ్మ మనంగఁ
దగి, సర్వ భూత వి-తానంబులందు
నగణితమై యుండి - యంతట నుండు;
సకల దేహములందు - శక్తి రూపమున
సకలంకమై మాన-సము వెల్లుచుండు
అలఘు చరిత్ర! నీ-వది యేది? యనిన
విలసిత ప్రజ్ఞతో - వినుము! చెప్పెదను, 1700
లలి మించునాత్మకు - ల్లాస శక్తియును,
బొలుపొందు నా బ్రహ్మ-మునకుఁ జిచ్ఛక్తి,
సలిలంబునకు ద్రవ - శక్తి, యగ్నికిని
అలరు దాహకశక్తి, - యా కసమంటి
నలువొప్పు వాయువు-నకు స్పందశక్తి,
యల గగనంబున - కతి, శూన్య శక్తి,
కొన వినాశనమునకును లయశక్తి
యును గల్గుచుండు, మ-యూరంబు తరువు
పై నుండ నీళ్ళ లోపల దానినీడ
కానవచ్చిన రీతి-గా, సూక్ష్మమగుచు 1710
వెలయు బీజంబులో - విపుల వృక్షంబులు
పొలుపొందు చుండిన - పోలికగాను
సలలిత స్థూల సూక్ష్మ స్వరూపముల
వెలుఁగుచు నుండు నీ - విశ్వ మంతయును.
అలరారు దేశ కా-లాది వైచిత్రి
వలన సస్యంబులీ - వసుమతి మీఁదఁ
బరమాత్మ బలముచేఁ - బండు, నశించు;
నరయఁగా వృద్ధి క్ష-యంబులు లేక
ఫలితార్థమగు పర-బ్రహ్మ సాన్నిధ్య
బలముచేఁ జిత్తంబు • బహువిధ సృష్టి 1720
గావించు, లేనివి - గలిగించుఁ, బ్రోచు,
భావింపఁ దాఁ గనఁ-బడ; దందులకిపుడు
ఒక యితిహాసమే - నొగి వినిపింతు
నొక రాజుపుత్రకు - నొకదాది చాల
గారవింపుచు నొక్క - కథ వినిపించె
నా రీతి యెట్లన్న - నరుదుగా వినుము!
బాలకోపాఖ్యానము
అరయఁగా నతిశూన్య - మైన పట్టణము
నిరవొంద నొక్కరా - జేలుచు నుండు,
వానికి మువ్వురు - వరసుతుల్ గలరు.
గాని యం దిరువురఁ - గనలేదు తల్లి, 1730
ఒకఁడు గర్భంబునం - దుదయింపఁ, డట్టి
యకలంకపుత్రకు - లాకాశ వనముఁ
జేరి, యచ్చటను పూ-చి ఫలించు వృక్ష
వారంబులను గాంచి -వా రందు నిలిచి,
యపుడొప్పు మెకవేఁట - లాడి రటంచు
విపరీత కథఁ జెప్ప, - విని బాలకుండు
నిజ మనుకొనినట్లు . నీవు లోకముల
నిజ మని చూడక, - నిస్పృహత్వమున
సంకల్పముల మాని, • సారెకుఁ బొడము
శంకల నణచి, ని-శ్చలశాంతిఁ బొందు! 1740
సంకల్పములు చిత్త - సంభవంబులుగ
నంకితంబుగఁ జూడు, - మవి నీవు గావు:
కడఁగి తాఁజేయు సం-కల్పంబుచేత
నడరారఁగా బద్ధుఁ - డగు మూఢ జనుఁడు:
ఘనుఁడు తాఁ జేయు సం - కల్పంబువలన
ననఘాత్ముఁడై ముక్తుఁ- డగు నిశ్చయముగ.
సరవి నెన్నఁగ నస - త్సంకల్పములను
మఱచి, సత్సంకల్ప - మతి నొందు మీవు,
అతిబాల్య కాలంబు - నందు విజ్ఞాన
రతుఁడవై గాఢ వై-రాగ్య మొందితివి; 1750
కనుక బద్దుండవు - గావు, బద్ధుండ
నని చింతఁ జేతురే?- యర్కకులేశ!
సరస మనో విలాసము బంధమగును;
మెఱయఁ దన్నిరసన - మే ముక్తి యగును.
లలినిఁ దన్మాన సో - ల్లాసవైభవము
వలన గోష్పదమంత - వసుధ యోజనము
కరణిఁ దోఁచును, క్షణ కాలంబుఁ జూడఁ
బరువడి బ్రహ్మ క-ల్పం బగుచుండు;
నొక నిదర్శన మిందు - కూహించి నీకుఁ
బ్రకటించి చెప్పెద - భావించి వినుము: 1760
లవణ శాంబరికోపాఖ్యానము
అవని మహోన్నతం - బగు పురమందు
లవణుం డనెడు రాజు - లలి నొక్కనాఁడు
చదురునఁ గొలువున్న - సమయమం దతని
కెదుట నిల్వంబడి - యింద్రజాలికుఁడు
మాయలఁ బన్నుచున్ - మంత్రింప, సభ్యు
లాయెడ మోహితు-లై చూడఁగాను
నొనరఁగా రెండు ము-హూర్తముల్ రాజు
కను మూసి నిద్రించి - కలఁగాంచి లేచి
తనమంత్రివరులతోఁ - దగ నిట్టు లనియె:
'ఘనులార! నే నొక్క కలఁ - గంటి నిపుడు 1720
అది యెట్టు లన్న ఘో-రారణ్యమునకుఁ
బదపడి తురగంబు-పై నెక్కి చనఁగ,
నప్పు డాఘోటక - మడవిలో నన్ను
దెప్పునఁ బడవైచు - తెఱఁగున మించి
పరుగెత్తఁగా, నేను - ప్రాణభీతినను
తరుశాఖ వేగ హ -స్తంబుతోఁ బట్టి
వ్రేలియాడఁగ వాజి - విడఁబడి యుఱికె,
నాలోన సూర్యోద-యం బయ్యె; నంతఁ
వనచేని కాఁపున్న - తండ్రి కన్నంబుఁ
గొని యా వనము దారి - గులుకు మిటారి 1730
యగు నొక్క చండాలి - యరుదేరఁ జూచి
'దిగువకు మెల్లగా - దించవే! నన్ను
నీ'వనగాఁనది - నేర్పుగా ఱాళ్లు
వేవేగఁ దెచ్చి యా - వృక్షంబు క్రింద
నెత్తుగాఁ బేర్చి, పై - కెక్కి నన్నట్టి
మెత్తగా దించిన, - మెచ్చి నేదానిఁ
గామించి, వరియించి, - కలిసి, యచ్చోట
నా మాలదానియం - దమరఁగా సుతుల
నలుగురిఁగని, కొన్ని - నాళ్లు పోషింప,
నలజడి పొడమఁగా - నాలుబిడ్డలను 1740
దోడ్కొని వలసతో దూరాటవులకుఁ
గడు వేగఁ జని, కొంత - కాల మందుండఁ
గాను, బిడ్డలు, నాలుఁ - గాలవేగమున
మేనులు విడువఁగా - మిడికి, దుఃఖంబు
చే సహింపఁగ లేక - చిచ్చులో దుమికి,
యాసమయంబునం - దదరి మేల్కొంటి,
మహి నిది శాంబరీ - మాయాకృతంబు,
సహజమైనటువంటి - స్వప్నంబుగాదు;
అలరు మనోమాయ - లఖిల మర్త్యులకుఁ
గలిగించు దుఃఖ మీ - కరణి నటంచు 1750
నెఱుఁగఁగా నందున్న - యింద్రజాలికుఁడు
మఱియందు నిల్వక - మాయమై చనియె;
వెఱఁగంది సభ్యులా - వింత భావించి,
యెఱిఁగె యాభూపాలు - నీక్షించి యనిరి:
'జననాథ! వీఁ డింద్ర - జాలియై యున్న
ధనము గైకొనక యం-తర్ధాన మంది
చనునె? జగద్విలా - సం బిట్టి దనుచు
జనులకుఁ జూప ని - చ్చటికిఁ దా వచ్చి
మెఱసిన వాఁ డని - మిషదూత గాని,
నరుఁడనఁ గూడ, ద : నంత రూపముల 1760
నలరుచున్న పరాత్ముఁ - డాఢ్యుడై తాను
నొలయక, మాయా మ-నోరూపములను
దా తాల్చి సకల భూతములకు భ్రమల
ఖ్యాతగా నీరీతిఁ - గల్పించు చుండుఁ;
గావునఁ జింతింపఁ - గా నేల? యనుచు
భూవరునకు వారు - పొసఁగఁ జెప్పి' రని
పలికి, క్రమ్మఱ రామ-భద్రునిఁ జూచి
'జలజాప్త కులదీప! - స్వల్పకాలమునఁ
జాలఁగాఁ బెక్కేండ్లు - జరిగిన యింద్ర
జాలంబుగాని, ని-శ్చయ మనరాదు, 1770
చింతించి యెంత చేసిన మనోమాయ
లంత హెచ్చుచు నుండు, - నణఁచిన నణఁగు
నలువొప్పు సంయమ-నంబున శాంతి
గలుగుఁ, దచ్ఛాంతిని - గట్టిగాఁ బట్టి
మదిని నిరోధించి, - మానితజ్ఞాన
మెద నుంచి, ధ్యాన స-మేతుఁడై దినము
మఱువక ధ్యానమన్ - మంథాచలమున
నరసి సంసారతో - యధినిఁ గలంచి
విడిచి, సంకల్పముల్ - విడిచి, భోగేచ్ఛ
విడనాడి, సంసార - వృక్షమున్ ద్రుంచి, 1780
యల మనోవ్యాధుల - కౌషధం బగుచు
వెలసిన వైరాగ్య • విభవంబు నొంది,
చిరతర సచ్ఛాస్త్ర - శిక్షచేఁ జిత్త
మఱి ముఱి మెత్తనై -నప్పు డేమఱక,
యెఱుకతో నినుమును - నినుముతోఁ ద్రుంచు
కరణిని సుజ్ఞాన - కలితచిత్తంబు
చేత నీ వజ్ఞాన - చిత్తముం ద్రుంచు!
ఖ్యాతిగాఁ బౌరుష - కలితేప్సితముల
వదల కనుభవింప - వలె నన్న చిత్త
మదియె కోరుచునుండు - నణఁచిన నణఁగుఁ 1790
గావునఁ, జిత్త వి-కారధర్మముల
భావించి, వానికి - బరుఁడవై యుండు'
మని మఱికొన్ని ర-హస్యముల్ దెలుప,
విని రాముఁ డమ్ముని - విభునకి ట్లనియెఁ:
దొడరి తామర నోలి - తోఁ బర్వతములఁ
బడనీడ్చి బంధించు - పగిది విశ్వమును
దెరలక తాను బం–ధించె నవిద్య,
వెఱఁగైన దీ రీతి - వినవిన, లవణ
కుతలాధిపతి తన - కొలువులో నుండి
యతికష్టముల నొంది, - యపల మేల్కాంచి, 1800
మఱి యేమీ చేసి స-మ్మతిఁ బొందె? ననఁగ
వరమునీంద్రుడు భూ - వరున కి ట్లనియె:
పరువడి లవణ భూపాలపుంగవుఁడు
సురుచిరమతి రాజ - సూయాధ్వరంబు
నూని సేయఁగఁ బురు - హూతుండు చూచి
తా నోర్వఁజాల కా - ధరణీంద్రుకడకుఁ
దనదూత నంప,న-త్తఱి వాఁడు లవణ
జనపతిసభ నింద్ర - జాలంబు పన్ని
యావేళ నతని మో-హాంధునిఁ జేసి
వేవేగఁ జనియె, న-వ్విధ మేల? యనిన 1810
నది విను! రాజసూ - యాధ్వరకర్త
పదియును రెండేండ్లు - ప్రబల చుఃఖముల
ననుభవించుట నిజ- మటుగాన, నతఁడు
తనియ కాద్వాదశా-బ్దముల దు:ఖంబుఁ
గన ముహూర్తద్వయ - కాల మా కష్ట
మనుభవించిన మీఁద - నంతఃపురంబుఁ
జేరి, యా స్వప్న వి-చిత్రంబు మఱువ
కారట పడుచుండి, - యమ్మఱునాఁడు
కలలోనఁ దాఁ గన్న - కాననంబునకు
బలములతోఁ దాను - పయనమై పోయి, 1820
యాకలలోఁ గాంచి - నట్టి చందములు
వీఁకతో నిజముగా - వేవేగఁ జూచి,
యది యెవ్వరికిఁ - జెప్పు 'కక్కటా!' యనుచు
మదిఁ జింత నొంది, యా-త్మపురంబుఁజేరి,
యట సుఖస్థితి నుండె - నా లవణుండు
పటుతరావిద్యా ప్ర - భావ మిట్టిదియె!
జగతి నసత్యంబు - సత్యమై తోఁచు
నగణితాత్మక! యిది - యద్భుతం' బనిన
విని రామచంద్రుండు - వెఱఁగు నొందుచును
మనము సంశయ మొంద - మరల ని ట్లనియె: 1830
'కలలోన లవణుండు - గనిన చిహ్నములు
నిలుకడగా నందు - నిలిచి యె ట్లుండె?
ఈ వింత దెలుపు ము-నీంద్ర!' యటన్న
నా వసిష్ఠుం డిట్టు - లనియె నవ్వుచును:
'విను రామచంద్ర! యవిద్య - పెం పిదియె!
కని యిది, యది యని - గణుతింపరాదు;
కలది లేదనిపించుఁ, - గలుగనిదానిఁ
బెలుచ నిశ్చయ మని - పెంపుచునుండు.
ఘనతపోధనుఁడైన - గాధివర్తనము
విన నది యిట్టిదే - వెనుకఁ జెప్పెదను, 1840
నలిని జాగ్రద్వా స -నలు నిక్కములుగఁ
గలలోన నిజములై - కనిపించి, మరల
మేలు కొన్నపు డవి - మిథ్య గావలయు
నాలవణుండు ప్ర-త్యక్షంబుగాను
మఱునాఁడు చూచిన - మాయయే? మనినఁ
గరమొప్ప వింధ్య పు - ష్కర దేశములను
బరఁగఁ జండాల - సంస్పర్శనుం డొక్క
నరపతి పురములో - నంగనఁ బడును,
భావి కార్యముల స్వ-ప్నములు సూచించుఁ
గావున, లవణుని - కల నది దోఁచె, 1850
జగతిని దీని కా-శ్చర్య మేమిటికి ?
నగధీర! వినుము జ్ఞా-నం బజేయంబు,
వరుస నాపాదించు - వస్తుసత్తతను
వెఱఁగేల? నజ్ఞాన - విధ మిదే సుమ్ము,
ఆవింత లనృతంబు - లంచు భావించు!
వావిరి బహువస్తు - వరమధ్యమముల
యందుఁ గేవల గగ - నాభమై నిండి
యెందు నెవ్వరికిఁదా - నెదురుగాఁ గానఁ
బడక, తెలివిలేక - భావనగాక
జడత లేకుండెడి - సద్రూప మెద్ది ? 1860
ఆది నీవుగాఁ గని మానంద మొందు,
పొదువుగా నా బ్రహ్మ మున నాదియందుఁ
జిత్తంబు పొడమెను - చేష్టాకరముగఁ,
జిత్తమందే పుట్టెఁ - జింతనంబులును,
సటల చింతనముల - నవికల్ప జాల
పటిమ జనింపఁ, బ్ర-పంచంబు నభము
నందు నీలిమ దోఁచి - నటువలె దోఁచి,
యెందును శూన్యమై-యే నిజంబుగను
గనఁబడుచుండుటటే - గాని, యథార్థ
మని దానిఁ జూడకు, - మాత్మనే చూడు! 1870
సంకల్పజాలముల్ - చాలింప, నపుడు
కొంకక చిత్తంబు - కుదిరి తా నణఁగుఁ
జిత్తం బణంగినఁ - జి త్తన్నియెడల
సత్తై వెలుఁగుఁ జంద్ర - చంద్రికరరణి,
నని లవణు చరిత్ర - మరుదు గాఁ జెప్పి,
మునిపతి మరల రా-మున కిట్టు లనియెఁ:
అజ్ఞానభూమికాసప్తకము
బొలుపొందు నజ్ఞాన - భూమిక లేడు
కలవని యెట్లన్నఁ - గ్రమముగా బీజ
జాగ్రత్తు, మఱియును - జాగ్రదవస్థ,
జాగ్రదతిశయంబు, - జాగర స్వప్న 1880
మును, మఱియును స్వప్న-మును, స్వప్నమందు
జనియించు జాగ్రత్తు - నరవి సుషుప్తి
యసఁబడు నిఁక వీటి - కర్థ మె ట్లనిన
విను! చిత్తునకు నాది - విమలచేతనము
ఆదిప్రకరణము
వై వెలుంగుచునుండి - నట్ల చిత్తార్థ
జీవత్వ భజన కం - చితముగా నమరి.
బేధ బీజంబగు - బీజజాగ్రత్త,
అది భూమిక యిదె - యన నొప్పు, తెలివి
యను దాని కది నూత - నావస్థ యగును;
మనుజేంద్ర! యిదియె నా - మందిరం బనుచు, 1890
నా దేహమిది, వారు - నా వా రటంచుఁ
బాదుగా విశదమై - ప్రాగ్భావమునను
జనియించు నెఱుకయే - జాగ్రదవస్థ
యఁనంబడుః రెండోది - యను భూమి కదియెః
నేనతఁడితఁడంచు - నిగుడి జన్మాంత
రానుభవము నొంది - నటువంటి యెఱుక
చంద మెన్నఁగ మహా - జాగ్రత్త యగును
పొందుగా మూఁడవ - భూమిక యిదియె
ఊరక యొకచోట - నుండి భోగముల
సారెకుఁగోరుచు - సంతసించినది 1900
యలఘు మనోరాజ్య - మనఁబడు, నదియె
పొలుపుమీఱఁ జతుర్ధ - భూమిక యయ్యెఁ;
జెదరెడి మరుమరీ - చికయందు జలము,
నదియుఁ గాకను శుక్తి - యందు రౌప్యంబు,
కల దంచు నివి యాది - గా వృథా భ్రమల
కలవడుటే స్వప్న - మని చెప్పఁబడును.
వాసిష్ఠరామాయణము
పారి నిది పంచమ - భూమిక యయ్యె;
అఱిముఱి బహుకాల - మరిగి రాకుండి,
మరల వచ్చిన వాని - మఅచి, యవ్వలను
సరవి నెఱుంగుటే - స్వప్న జాగ్రత్త, 1910
భూమీశ! విను షష్ట - భూమిక యిదియె;
కామాకరంబు లీ - క్రమము లన్నియును
వరుసగా నీ ష - డవస్థలఁ దొరఁగి,
కరఁగుచు భావి దుఃఖములఁ దలంచి,
యచలుఁడై చింతించు - నదియె సుషుప్తి;
ప్రచురాత్మ! యిదియె స - ప్తావస్థ యగును.
అట్టి యవస్థామ - హాంధకారమునఁ
బట్టు దోఁచక జీవ - పటలి మునుంగు;
* జ్ఞానభూమికాసప్తకము *
జననాథ! యివియె య - జ్ఞానభూమికలు.
విను జ్ఞానభూమికల్ - వివరింవ నేడు.
గల, వవి యెట్లన్నఁ - గ్రమముగా నీకుఁ
దెలియఁ జెప్పెదఁ దేట - తెల్లంబుగాను 1920
వసుధపై బహుపుణ్య - వాననచేతఁ
బొసఁగ జనించిన - బుద్ధిమంతుండు
తనమదిలోఁ దానె - తలఁచు నిట్లనుచు
'జనియించి యీఘోర - సంసారపార్థి
ఆదిప్రకరణము
మునుఁగుట కే నేల - మూఢుండ నైతి?
ననుచు, వైరాగ్య శాస్త్రా - భ్యాపి యగుచుఁ.
గడఁకతో సాధు సాం -గత్యంబుఁ జేసి,
యడర గాఢవిరక్తుఁ - డగుట శుభేచ్చ
యననొప్పు, నిది చూడ - నాది భూమిక యె; 1930
జనవర! వైరాగ్య - శాస్త్ర విచార
సరణుల మఱువక, - సజ్జన మైత్రి
యురుభక్తితోఁ జేయు - చుండెడిరీతి
పొదువుమించు విచార - భూమిక రెండ
వది యిదె యగుచుండు - వసుధాతలేంద్ర!
ఈ రెండు భూమిక - లెక్కిన మీఁద
దారుణ విషయబృం - దంబును రోసి,
తనమననము తను - త్వంబు నొందుటయె
తను మానసాఖ్యచేఁ - దనరి మూఁడవది
యన నొప్పు భూమిక - యగుచుండు; మఱియు 1940
ననఘుఁడై యీ మూఁటి - నభ్యసింపుచును.
సకలవాంఛల వీడి - సత్యాత్మనిష్ఠ
సకలంకుఁడై చింత - లన్ని వర్ణించి,
జననుతుఁ డగుటయే - నత్త్వసంప్రాప్తి
యన నొప్పు భూమిక - యగు నాలుగవది:
వాసిష్ఠరామాయణం
యీ నాల్గిఁటను మది - నిరవుగా నుంచి,
తాను నిస్పంగుఁడై - తత్త్వచింతనము
వదలక యెపుడు స - త్త్వస్థితి నుండి
నదియె సంసక్తినా - మాంకితం బగుచుఁ
బొలుపొందుపంచమ - భూమిక యనుచుఁ 1950
బలుక నొప్పుదునుండు - భానుకులేశ!
పొగడొందు నియ్యేను - భూమిక లెక్కి
యగణితాత్మారాముఁ - డై చలింపకను
అనిశంబు బాహ్య మ - ధ్యాంతరంబులను
మొనసి యస్యపదార్థము ములు లేమి దెలిసి,
పరమార్థ మెఱిఁగి ని - ర్భరుఁడైన రీతి
నరసి చూచినఁ బదా - ర్థాభావసిద్ధి
యన నొప్పుచుండుః నీ - యాఱు భూమికల
ఘనతరగుతల ని - ష్కర్తగా నెఱిఁగి,
తన కన్యమైన య - ర్థములేని దెఱిఁగి. 1960
పనుపడి తగుతత్వ - భావైకనిష్ట
నొదవిన యెఱుక యం - దూహించి చూడ
నది తుర్యగాగతి - యన నొప్పుచున్న
సప్తమభూమికై - శాంతమైమించి
సప్తాశ్వగతిఁ బ్ర - కాశంబుగా నుండుఁ;
ఆదిప్రకరణము
దుద కెక్కు నిటువంటి - తుర్యగావస్థ
వదల కుండెడిది జీ - వన్ముక్తి యగును;
మురువుమీఱ విదేహ - ముక్తి యనంగఁ
దెఱఁగొప్పఁ దుర్యగా - తీతమై యుండు.
నమలాత్మ! సప్తమం - బగు తుర్యగాఖ్య 1970
నమరు భూమిక కెక్కి - నటువంటివారు
అనఘు లాత్మారాము - లధ్యాత్మవేత్త
లనుపమానులును, మ - హానుభావులును
జననుతుల్ వారు సం - సారసౌఖ్యముల
ననుభవింపుచునుందు - రంటి యంటకను,
సుఖదుఃఖిరసముల - సుళ్లలోఁ బడక
నిఖిలకార్యంబుల - నిరపింతు రెపుడు;
మా యాగుణములందు - మన్నలు గాక
సేయఁగాఁ దగుపనుల్ - సేయుచుండుదురు;
మరులు పట్టిన వారి - మాడ్కి మాటలను 1960
మఱతురు, బాలుని - మాడ్కి నుండుదురు;
పట్టిన నిర్వాణ - పద మిదే యనుచు
నెట్టనఁ దెలియు మో - నృపకులోత్తంస!'
అని రామచంద్రున - కా వసిష్ఠిండు
ఘనతరోత్పత్తి ప్ర - కరణంబుం జెప్పె'
నని భరద్వాజ సం - యమికి వాల్మీకి
వినిపించె నా కథ - విశదంబుగాన
వాసిష్ఠరామాయణము
*ప్రకరణాంతద్విపద*
ఇది సోమనాథ వి - శ్యేశ్వరస్వామి
పదపద్మ భక్త సు - బ్రహ్మణ్య యోగి
చరణాంబుజాత ష -ట్బరణాయమాస
పరిపూర్ణనిత్య స - ద్భావనిమగ్న 1990
మానసాంబుజ వెంగ - మాంబికారచిత
మై నిత్యమై, సత్య - మై, ధన్యమైన
సామర్థసార సు - జ్ఞానవాసిష్ట
రామాయణం బను - రమ్యసద్విపద
యందు సారంబగు - నాదిప్రకరణ
మందమై విమల మో - క్షాకరం బగుచు
శ్రీ తరిగొండ నృ - సింహుం డనంగ
ఖ్యాతిగా వెలయు వేం - కటరాయ! నీదు 2000
పదయుగళికి సమ - ర్పణమయ్యె దీని
నదమలులై వ్రాసి - చదివిన వినిన
నరులు తాపత్రయా - ర్ణనము తరించి,
పరమైన నిర్వాణ - పదము నొందుదురు.
భూచక్రమున నిది - పురుషార్థ మగుచు
నాచంద్ర తొరార్క - మై యుండుఁగాత!
-:ఆదిప్రకరణము సమాప్తము:-
- ↑ వేక్షణ భక్తిని - వా.
- ↑ హిత మతిఁ జెప్పెద - వేం.
- ↑ నని విచారించి దీనార్తుఁడై తనకు - వా.
- ↑ పటు జాగ్రతన్ భ్రాంతి - వా.
- ↑ నారూఢిఁ గాల్సిన యానంద మిచ్చు-వా.
- ↑ వంచి. వా.
- ↑ వై లలి సుఖము లె-ల్లనుభవింపకయ. వా.
- ↑ దిగులొందఁ గారణంబేమి? వా.
- ↑ పట్టి! నీ యౌవనప్రాయంబునందు. వా.
- ↑ స్థిరమెందు లేదు. వా
- ↑ బొంచి పాంచి వా.
- ↑ శోకం బనుభవించి సొక్కి స్రుక్కినను-వా.
- ↑ దుఃఖము లచే మఱిఁ బొందుచుండు-వేం.
- ↑ విన్నవించి యిట్లనియె - వేం.
- ↑ చెప్పితి పరమేశ! - వా.
- ↑ నేని భావించు, నిజముగా నెంచు-వా
- ↑ మాకాశము నిజసూక్ష్మంబైన చోట - వా
- ↑ నల యుపమోక్షంబు నని చెప్పనొప్పు - వా
- ↑ సంవిత్ స్వరూపము మించి దనరు - వా
- ↑ ఋతుమాత్ర సద్ బ్రహ్మ - వా.
- ↑ సత్తనుమాత్ర - వా.
- ↑ కింపు నతఁడు
- ↑ పుట్టినరీతి - వా.
- ↑ డనఁగ నాతఁడు బ్రహ్మముని తోఁచె, దాని - వా.
- ↑ నిది యితిహాససారంబు వా.
- ↑ నరార్థములందు - వా.
- ↑ గప్పి తెప్పునఁ గాల గతి నొందెనేని - వా.
- ↑ జీవుండున్నయట్టి - వా.
- ↑ జగతిన్ ఇవే అని పదవిభాగము
- ↑ యే కాలంబు లుండు
- ↑ బాప పుణ్యాను వా
- ↑ నందు మాయంబులైన-- వా
- ↑ చిదాకాశ కోశ కోటరము
- ↑ ప్రతిభవించిన కారణమున - శ.
- ↑ కథల నొకవేళ
- ↑ 34. వాక్యార్ధమును - వా
- ↑ 35. భక్షించి కొనుచు
- ↑ 36 గోపుగ నూరి యధికారి కొలది.నా
- ↑ 37. మలయు కిప్పుడటన్న -
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.