Jump to content

వల్లభాయి పటేల్/స్వాతంత్ర్య వార్షికోత్సవ సందేశము

వికీసోర్స్ నుండి

మానుల కనుభవము, సంపద, రెండును గావలసినంతగా నున్నవి. వారు శక్తిసామర్థ్యములను, సంపదను, దేశముకోస మర్పించవలసియున్నది. అదియుఁ గాకపోయిన దేశము సర్వనాశనమైపోయినప్పుడు వారి సంపదయంతయు దమ్మిడీకిఁ గొఱగాదు.

"బొంబాయి సమస్యను బెర్లిన్ సమస్యగామాత్రము చేయకుఁడు, తరతరాలుగా శాంతిసద్భావములతో నివసించు చున్నప్పుడు గుజరాతీలు, మహారాష్ట్రులు నిప్పుడుమాత్ర మెందుకు శాంతి సద్భావములతో నివసించలేరు?

"మన యంతఃకలహములను మనమే పరస్పరసొహార్దముతోఁ బరిష్కరించుకొందము. ఈ సంకుచితరాష్ట్రీయ తత్త్వమునకు స్వస్తి చెప్పుఁడు. విద్వేషప్రచారమునకుఁ బూనుకొనకుఁడు. మన మిండియాను సుదృఢముగా నిర్మించవలసి యున్నది. ప్రపంచములోఁ గొలఁదిదేశములుమాత్రమే యిండియాయంతటి బలసంపత్తికలవి. ఇండియా శ్రేయస్సు కోసమే మన ముత్పత్తి నితోధికముగఁ జేయవలసియున్నది. మనము పరస్పరము సంప్రతించుకొని వ్యవహరించవలసియున్నది. అప్పుడే మనము దేశమునకు శక్తివంచనలేకుండ సేవచేసినట్లు కాఁగలదు. అప్పుడే మనము గాంధీజీ యనుయాయుల మనిపించుకొనుట కర్హులము కాఁగలము.

స్వాతంత్ర్య వార్షికోత్సవ సందేశము

"స్వాతంత్ర్యముపొందిన తొలి సంవత్సరములోనే మనము కష్టపరంపరలలోఁ దలమున్కలై పోయితిమి. కాని యకుంఠిత ధైర్యసాహసములను బ్రదర్శించుటవల్లనేమి, వజ్ర సంకల్పముతో వ్యవహరించుటవల్లనేమి, మన మా మహావిపత్తులన్నిటిని దాటి బయటఁబడగలిగితిమి. ఆ ధీరోదాత్త గుణసంపద మనకుఁ గొఱవడనంతవఱకు, సుశిక్షితులైన సైనికుల వలె, బాధ్యతాయుతముగా మనము ప్రవర్తించినంతవఱకు, భవిష్యత్తు విషయమై మన మాశతో మెలఁగవచ్చును.

"భారత స్వాతంత్ర్య ప్రథమవార్షికోత్సవము జరుగుచున్న యీనాఁడు మన మనుసరించుచున్న యభ్యుదయమార్గములో మఱొక మజిలీ చేరుకొన్నాము. ఈ సందర్భములో నొక్కసారి మన పూర్వాపరములను సమీక్షించుకొనుట సమంజసము. గత సంవత్సరము స్వాతంత్ర్యము సిద్ధించిన యీ రోజున మన హృదయము లెట్లుప్పొంగినవో యొకమాఱు జ్ఞప్తి చేసికొందము. ఆ మరుక్షణమునుండియే మనలను ముంచి వేసిన కష్టపరంపరలు, పాకిస్థాన్‌లోఁ దమ సర్వస్వమును గోల్పోయి నిరాశ్రయులై లక్షలకొలది శరణార్థులు కట్టుగుడ్డలతోఁ దండోపతండములుగా నిండియన్ డొమినియన్‌కుఁ దరలి వచ్చుట, మన మనుగడనే భగ్నముచేయుటకు మనదేశములోనే కొంతమంది ప్రయత్నించుట, సుఖవిలసితమైన కాశ్మీర్ మాగాణములో శాంతియుతముగా జీవయాత్ర సాగించుచున్న నిస్సహాయప్రజలపైఁ బొరుగు దేశమునుండి దుండగీం డ్రమానుష కృత్యములు జరుపుట, నిజాం సైనికదళముల యండ దండలతో ఫాసిస్టుమూఁకలైన రజాకార్లు మన సరిహద్దులలోఁ బశుకృత్యములు కావించుట, స్వాతంత్ర్యము పొందిన తొలి సంవత్సరములోనే మనల నెదుర్కొన్న యితర క్లిష్ట జటిల సమస్యలు - వీని నన్నిటి నొక్కమారు జ్ఞప్తి చేసికొనుఁడు. "అంతయు గందరగోళమై పోవునని, ప్రభుత్వము కూలి పోవునని తలపోసినవారుకూడ లేకపోలేదు. మన దేశములోనే బయలుదేరిన యభివృద్ధి నిరోధకులతో, విధ్వంసకులతో బ్రభుత్వము తలపడవలసి వచ్చినది. చేరువనుండి దూరమునుండి కూడ మనపైఁ గన్ను వేసిన దుష్టగ్రహములు బారినుండి మన దేశమును గాపాడుకోవలసి వచ్చినది. ఏమైనను బ్రజల సాహాయ్యసంపదలవల్లనేమి, సముత్సాహ పూరితులైన, ప్రజాసేవకుల యవిరళ కృషివల్లనేమి, స్వాతంత్ర్యమునే తుడిచిపెట్టి వేయఁగల యా మహోపద్రవములనుదాటి బయటపడఁ గలిగితిమి. ఈ క్లిష్టదశాపరంపరలో మునిగియున్నందువల్ల నతిముఖ్యమైన యితర సాంఘికార్థికసమస్యల పరిష్కారమునకు హృదయపూర్వకముగా మేము ప్రయత్నించ లేక పోయితిమి. మన సర్వశక్తులు వినియోగించి కృషిచేసినప్పుడు కాని యీ సమస్యలకు నిశ్చితమైన పరిష్కారమార్గము లభ్యము కాదు - ఈమాట నమ్ముఁడు. యుద్ధమువల్లఁ గలుగగల విజయములకుఁ దీసిపోని శాంతి విజయసాధనకుఁ గృషి చేయవలయునని మేము చాల ప్రయత్నించితిమి. కాని విరామము లభించ లేదు.

"గతసంవత్సరము మన హృదయములకుఁ దగిలిన గాయము లింకను మానిపోలే దను విషయము నాకుఁ దెలియును.

"తల దాచుకొనుటకు మాకు నీడఁ జూపించుఁడు, మాకు బ్రతుకు తెరువు కల్పించుఁడని లక్షలకొలఁది శరణార్థులు నేఁడు మనలను బ్రశ్నించుచున్నారు.

"కాశ్మీర్ రంగములో దుండగీండ్ర యత్యాచారము లింకను సాగుచునే యున్నవి. దేశవిభజనవల్లఁ గలిగిన యఘాతమునుండి మనము కోలుకోలేదు. అన్నిటికంటె నత్యంత విషాద సంఘటన భారతపిత దారుణహత్య - మన హృదయములను నింకను గెలఁక వేయుచున్నది. చీఁకటివేళల మనకుఁ దెన్ను చూపిన యా కరుణజ్యోతి నేఁ డదృశ్యమైపోయినది. ఇక నార్థిక రంగములో ననియు సవ్యముగా జరిగిపోవుచున్నవను సంతృప్తితో వ్యవహరించుచున్నందుకు మన మిప్పటికి దెబ్బ తినుచునేయున్నాము. సమన్విత కృషి జరుగకపోవుటవల్ల నేమి, యజమానులకుఁ గార్మికులకు మధ్య, సామరస్యము లేనందువల్ల నేమి, మన మింకను జిక్కులకు లోనవుచునేయున్నాము.

"అందువల్ల గత సంవత్సరము మన యాశలలోఁ గొన్ని మాత్రము ఫలించినవి. అనుకొన్న యాపద లనేకము తప్పి పోయినవి మొత్తముమీద మనల నెదుర్కొన్న కష్టము లన్నింటిని నెట్టుకొని వచ్చితిమి. గత సంఘటనలనుగుఱించి విచారము, భవిష్యత్తును గుఱించి భయాందోళనలు మన హృదయములలో ముప్పిరిగొనుచున్నవి. ఏ మహత్తరలక్ష్య సాధనకై, మనము స్వాతంత్ర్యసమరము సాగించితిమో, యా లక్ష్యమును విడనాడనంతవఱ కెట్టి యకుంఠిత ధైర్య సాహసములతో, వజ్రసంకల్పముతో వ్యవహరించి మనలనెదుర్కొన్న ప్రమాదములనుండి బయటఁబడితిమో యట్టి ధీరోదాత్త గుణ సంపత్తి మనకుఁ గొఱవడనంతవఱకు సుశిక్షితులైన సైనికులవలె మనము బాధ్యతాయుతముగాఁ బ్రవర్తించినంతవఱకు - భవిష్యత్తుపట్ల మన మాశతో మెలఁగవచ్చును.

"వేయి సంవత్సరములు గడచినతర్వాత భౌగోళికముగా నేకఖండమైన భారతదేశములోని సువిశాల ప్రాంతము నేక ఛత్రమక్రిందికిఁ దీసికొని రాఁగలుగుట యిదే మొదటిసారి. పాలనారీత్యా జరుగఁదగు పునర్నిర్మాణకార్యకగాని మింక వెనువెంటనే ప్రారంభము కావలసియున్నది. మన మార్థిక సమస్య లన్నిటినిఁ గృతనిశ్చయముతో ధైర్యసాహసములతో సర్వుల సహకారసుహృద్భావముతోఁ బరిష్కరించవలసి యున్నది.

"విదేశములతో మనకుఁగల సుహృద్భావ సంబంధ బాంధవ్యములను మఱింత దృఢతరము చేసికోవలసియున్నది. ఇఁక నాంతరంగికవ్యవహారములలో మతసంబంధములేని ప్రజాస్వామికలక్ష్యమున కనుగుణముగా సహన, సహకార, సుహృద్భావములతో మనము మెలఁగవలసియున్నది. ప్రభుత్వముపట్ల తమకుఁగల బాధ్యతలను బ్రతివారు గ్రహించవలయును. దేశము పట్ల ప్రతివారు భక్తివిశ్వాసములు కలిగియుండవలయును. రెండు ప్రభుత్వములపట్ల భక్తి విధేయతలు కలిగియుండువారి కిండియాలో స్థానములేదు. ఆంతరంగిక సమస్యలను, నై దేశికసమస్యలను బరిష్కరించుటకై ప్రతిపౌరుఁడు సహకరించవలెనని కోరుటకుఁ బ్రభుత్వమునకు హక్కున్నది. అందువల్ల స్వాతంత్ర్యముపొందిన యీ రెండు సంవత్సరములలో మన మీదఁబడిన బాధ్యతలన్నిటిని బూర్తిగా నిర్వర్తింతము. మన మాతృదేశ ప్రతిష్ఠను బెంచుటకు, మన మాతృదేశ శ్రేయస్సును బరిరక్షించుకొనుటకు మనమందఱము మనకృషిని నెరవేర్తము. ఇంతకంటె నుత్తమమైన యాదర్శము నెవ్వరు నారాధించఁజాలరు. ఇంతకంటెఁ బవిత్రమైన బాధ్యత నెవ్వరు నిర్వర్తించఁజాలరు."