వల్లభాయి పటేల్/రాజకీయ సమీక్ష

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రాజకీయ సమీక్ష [1]

"ఇండియాసమస్య లన్నింటికి బొంబాయి కీలకము. బొంబాయిమార్గదర్శకమైన నిండియాలోని తక్కినప్రాంతములు దాని ననుసరించవచ్చును. నాపట్లఁ బ్రదర్శించిన ప్రేమాభిమానములకు బొంబాయి ప్రజలందరకు నా కృతజ్ఞతను దెల్పుచున్నాను. మీ యాదరమునకు బ్రేమాభిమానములకు నే నర్హుడ నను విషయము నిరూపించుకొందును. నేనికఁ గార్యరంగమునుండి నిష్క్రమించి, విశ్రాంతిగైకొనవలసినవయస్సులో నున్నాను. కాని జీవిత శేషమునుగూడ దేశసేవకే యంకితము చేయవలయునని నా హృదయ మువ్విళ్ళూరుచున్నది. సుస్థిరమైన, బలవత్తరమైన, భాగ్యవంతమైన దేశముగా నిండియా నభివృద్ధిపఱచి, యెవ్విధమైన ప్రమాదము వాటిల్లకుండ దానికి రక్షణ కల్పించవలయునని హృదయపూర్వకమైన నాయాకాంక్ష. ఈ పవిత్ర కార్యసాధనకై నా జీవితశేషము నంకితమిత్తును.

దేశ విభజన

"గత సంవత్సర మిండియా యెట్టి పరిస్థితుల నెదుర్కోవలసి వచ్చినదో మీకుఁ దెలియును. పెక్కు క్లిష్ట సమస్యలను మన మెదుర్కోవలసి వచ్చినది. కొన్నికొన్ని సమయములలో రేయింబవళ్లు మన మాతురతతో, భయసందేహములతోఁగృషి చేయవలసివచ్చినది. ఎక్కడఁ గాలుజారి తప్పుటడుగు వేయుదుమో, యందువల్ల దేశమున కేమి కీడుమూడునో యను భీతితో, బహుజాగరూకతతో, మన మిన్నాళ్ళుఁ గృషి చేయుచు వచ్చితిమి. ఈ గండములన్ని గడచి మనము బయట పడలేమని తలపోసినవారు, విశ్వసించినవారుకూడఁ బెక్కుమంది యున్నారు. ఒకవిధముగాఁ జెప్పవలయునన్న దేశవిభజనకు నేను చాల ననిష్టముగా నంగీకరించితిని. దుఃఖభారముతో నా హృదయము క్రుంగిపోయినది.

"అంతరాంతరములయందలి నా మనఃప్రవృత్తుల కది విరుద్ధము. మన జీవితలక్ష్యమునకు మన యాదర్శముల కిది పూర్తిగా విరుద్ధము. కాని మఱియొకవిధముగాఁ జూచిన నైచ్ఛికముగానే మనము దేశవిభజన కంగీకరించితిమి. దాని పరిణామము లెట్లుండగల వను విషయమును బూర్తిగాఁ దఱచి చూచిన పిమ్మటనే యంగీకరించితిమి. కలసి మెలసి నడువలేక పోయినప్పుడు విడిపోవుట మంచిదని మనము నిర్ణయించుకొన్నాము. ఇతర విధముల మనకు స్వాతంత్ర్యము లభించునదికాదు. దేశవిభజనకు మన మామోదించియుండకపోయినఁ బరిస్థితు లిప్పటికన్న నప్పు డెక్కువగా విషమించియుండును. ఆరోజులలో మనము పరస్పరము తగవులాడుకొనుచుఁ గాలము గడుపుచుంటిమి మన విషమపరిస్థితి నవకాశముగాఁ దీసికొని మూడవపక్షమువారు తమ పబ్బము గడుపుకొనుట మొదలు పెట్టిరి. అందువల్ల స్వాతంత్ర్యసిద్ధికి మనము మూల్యమును జెల్లించవలసి వచ్చినది. సాధ్యమైనంత త్వరలో విదేశీయులు వైదొలఁగినట్లయిన దానికి మూల్యముగా దేశవిభజన కంగీక రించ వచ్చునని యప్పుడు మేము నిశ్చయించితిమి. దేశ విభజనవల్ల మనము చాలబాధలకు లోనైతిమి. శరీరములో నొక యంగమును ఖండించి వేసినట్లైనది. కాని దేశవిభజన కామోదించియుండనిపక్షములో నేర్పడియుండు పరిస్థితులలోఁ బోల్చి చూచిన నిది చాలా నయమని చెప్పవలయును.

"అందువల్ల దేశవిభజన కంగీకరించినందుకు నే నేమియుఁ జింతించుటలేదు. దేశవిభజనకుఁ బూర్వమున్న విధముగానే వ్యవహరించుచు దేశవిభజన నంగీకరించకపోయిన మన మింకను బెక్కు దురవస్థలపాలై యుండువార మని ప్రభుత్వ నిర్వహణలో నేను బొందిన యనుభవమునుబట్టి యిప్పుడిప్పుడు నేను నిర్ణయించుకొనుచున్నాను.

ఇండియావ్యవహారములో పాకిస్థాన్ జోక్యము

"చిఱిగిన చదరవలెఁ బాకిస్థాను దమకు సిద్ధించినదని చెప్పుచు బాకిస్థాన్ నాయకులు కాపట్యముతోనే దేశవిభజన కంగీకరించిరి. వారు దుర్బుద్ధితో నున్నారని మనపట్ల నవిశ్వాసముతోనే వ్యవహరించుచున్నారని మాకుఁ దెలియును. అదే నిజమై యదను చిక్కినప్పు డిండియాపై దండెత్తవలయునని వారు తలపోసినట్లయిన నట్టి పరిస్థితి నెదుర్కొనుటకు మనము సర్వసన్నద్ధముగా నుండవలయునని మేము గ్రహించితిమి. పాకిస్థాన్ సాధన యత్నములోనే బయటవారి తోడ్పాటు వారి కున్నప్పుడు, పాకిస్థాన్ సిద్ధించిన పిమ్మటఁగూడ వారి దుష్కృత్యముల కా తోడ్పాటుండితీరునని మనకుఁ దెలియును. అందువల్ల మన దేశమును సమైక్యపఱచి, సుసంఘటితముచేయుట యత్యావశ్యకమైనది.

వజ్రసంకల్పము

"స్వాతంత్ర్యసిద్ధి పిమ్మట సార్వభౌమాధికార మంతరించిపోవునని కొత్తడోమినియనులలోఁ జేరుటకుగాని లేక స్వతంత్రముగా విడిపోవుటకు గాని సంస్థానములకు స్వేచ్ఛయుండునని, దేశవిభజన ప్రణాళికలో నొక షరతున్నది. కాని చిన్న చిన్న సంస్థానాధిపతు లందరికి నున్నట్టుండి యొక్క పెట్టున సార్వభౌమాధికారము సంక్రమించునని తలపోసిన యమాయకుఁ డెవఁడు నుండఁడు. నిజముగా నట్టిపరిస్థితి యత్యంతప్రమాదభరితమైనది. దానికి మనమెన్నడు నంగీకరించువారముకాదు. ఈ తరుణములోనే పెక్కుమంది సంస్థానాధిపతులు దేశభక్తి ప్రేరితులై మనతోఁ గలసిపోవుటకు నిశ్చయించుకొన్నారు.

"విడిగా నుండిపోవుదమని భావించువారు, మనతోనే కలియక తప్పినదికాదు. చివరకు మూడుసంస్థానములుమాత్రము మిగిలిపోయినవి - జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్ - ఈ మూడు సంస్థానములవిషయములలో జోక్యము చేసికొనుటకే పాకిస్థాను కవకాశము కలిగినది. దొంగలవలె, బందిపోటువలె, మన యాంతరంగిక వ్యవహారములోఁ గల్పించుకోవలదని వారిని మనము హెచ్చరించితిమి. కాని మన హెచ్చరికలను వారు పెడచెవిని బెట్టిరి.

"జునాగఢ్ సంస్థానము పాకిస్థాన్‌లో జేరినట్లు, జునాగఢ్ నవాబుచేఁ బ్రవేశ నియమావళిపై సంతకము చేయించిరి. ఆ నవాబుకు వా రాశ్రయమిచ్చి రక్షణ కల్పించవలసివచ్చెను. కాని పాకిస్థాన్‌లో ననుభవించు స్వాతంత్ర్యముకంటె నిండి యాలోఁ గారాగారవాసము నయమని యాయన తలపోయు చుండఁగలఁడని నా విశ్వాసము.

"ఇదే తరుణములో వారు కాశ్మీరులో గూడ జోక్యము చేసికొన్నారు. ఆపోరాట మింకను సాగుచునేయున్నది. కొండజాతులప్రాంతాలలోఁ బాకిస్థాన్‌కు విషమపరిస్థితు లేర్పడినవి. పొగడ్తలవల్ల నేమి, యొత్తిడివల్ల నేమి, యా సమస్యల బరిష్కరింపఁజూచిన పాకిస్థాన్‌నాయకులు, చివరకు వీరిని గాశ్మీరముపై నుసికొల్పిరి. ముస్లిము లత్యధిక సంఖ్యాకులుగాఁ గల కాశ్మీర్ సంస్థానము విధిగా బాకిస్థాన్‌లోఁ జేరిపోవలెనని కొందరభిప్రాయపడుచున్నారు. అసలు మనము కాశ్మీరులో నెందుకున్నామా యని వా రాశ్చర్యపడుచున్నారు.

"దీనికి సమాధానము చెప్పుట యతిసులభము. కాశ్మీర్ ప్రజలు మన తోడ్పాటును గోరుచున్నారు. కనుకనే మన మిక్కడకు వెళ్ళితిమి.

"కాశ్మీర్ ప్రజల కిష్టములేనిపక్షములో మనమక్కడ నొక్కక్షణముకూడ నుండఁబోము. కాశ్మీర్ యుద్ధమింకను సాగుచునేయున్నది. ఆ యుద్ధములోఁ దన కేమియు జోక్యము లేదని పాకిస్థాన్ ప్రభుత్వము ముందు బుకాయించినది. తమ సైనికు లక్కడఁ బోరు సల్పుచున్నమాట వాస్తవమేనని, యిప్పుడది యంగీకరించుచున్నది.

"కాశ్మీర్‌లో దాని ప్రవర్తనకుఁ బాకిస్థాన్ పరువుప్రతిష్ఠలు మంటఁ గలిసెనని చెప్పవచ్చును. కాని హైదరాబాద్ సమస్య నవకాశముగాఁ దీసికొని తన పబ్బము గడుపుకొంద మని యది చేసిన ప్రయత్నములకంటె దాని పేరుప్రతిష్ఠలను భంగించునది మఱొకటిలేదు.

"హైదరాబాదులోఁ బాకిస్థాన్‌కు స్వప్రయోజనము లేవియు లేనప్పటికి నా రోజులలో హైద్రాబాద్ ప్రధానిగాఁ బనిచేసిన మీర్ లాయక్ ఆలీ నిజమునకుఁ బాకిస్థాన్ ప్రతినిధి. ఇతర సంస్థానములకంటె హైదరాబాద్‌పట్ల మనము చాల నుదారముగాఁ బ్రవర్తించితిమి. హైదరాబాద్‌కు బెక్కువిధముల ననుకూలమైన యధారీతి యొడంబడికకు మనము సమ్మతించితిమి. కాని యిదే తరుణములోఁ బాకిస్థాను కఱువదికోట్ల రూపాయలను ఋణమిచ్చుటకు హైదరాబాద్ ప్రభుత్వము రాయబారము చేసినది.

"అయినప్పటికిఁ దన యభీష్టానుసారము నిజాం సమస్యను బరిష్కరించుటకు లార్డు మౌంట్ బాటెన్ కవకాశమిచ్చితిమి. చివరివఱకు నాయన యాశతోనే యున్నాఁడు. హైదరాబాదుకు స్వయముగా వెళ్ళి యొడంబడికపై నిజాముచేత సంతకము చేయించవలెననికూడ నాయన తలపోసినాఁడు. కాని యాయన యాశలు ఫలించలేదు. విఫలమనోరథుఁడై విచారముతో నాయన వెళ్ళిపోయినాఁడు.

"లార్డు మౌంట్ బాటెన్ నిష్క్రమణపిమ్మట మనకుఁదోఁచినవిధముగ మనము నిజాముసమస్యను బరిష్కరించుకోవలసి వచ్చినది. హైదరాబాదుకుఁ బాకిస్థాన్ పెక్కు విధములఁ దోడ్పడుచున్నదని మనకుఁ దెలియును. "ఇంగ్లండులోఁగూడఁ గొందఱు మనపట్ల శత్రువైఖరి నవలంబించి, యీ వివాదములను గుఱించి మిత్రరాజ్యసమితికి ఫిర్యాదు చేయవలయునని రహస్యముగా మంత్రాంగముచేసిరి. గోవా నమ్ము విషయమై రాయబారములుకూడ జరిగినవి. హైదరాబాద్‌కు దొంగతనముగా నాయుధముల సరఫరా జరిగినది.

నిస్సహాయుఁడు నిజాము

"దీని కంతకు నెవరు బాధ్యులను విషయము నిప్పుడప్పుడే తేల్చి చెప్పలేము. ఇతరుల చేతులలోఁ దాను బందీనయిపోతినని నవాబ్ చెప్పుచున్నాఁడు. మిత్రరాజ్యసమితిలో నీ వినాదను గొనసాగించుట తన కిష్టము లేదనియు ఫిర్యాదు నుపసంహరించుకొనుచు మిత్రరాజ్యసమితికిఁ దా నొక లేఖ వ్రాసితినని నేఁ డాయన చెప్పుచున్నాడు. నవాబ్ పేరిట స్టర్లింగ్ నిల్వలన్నిటిని నాయన ప్రతినిధులు పాకిస్థాన్‌కు బదిలీ చేసినారు. తమ కుటుంబములను వారు పాకిస్థాన్‌కు దరలించివేసినారు. ఇన్ని జరిగినతర్వాతగూడ సుహృద్భావమని, యిరుగుపొరుగువారమని ప్రేమాభిమానములని, పాకిస్థాన్ ధర్మపన్నాలు చెప్పు చున్నది. అదంతయు నర్థములేని ప్రసంగము.

"ఇండియా దుర్బుద్ధితో జేసిన యొక్క దుష్కృత్యము నైన వ్రేలుమడచి చూపించవలసినదని పాకిస్థా^కు సవాలు చేయుచున్నాను. వారట్లు చూపించిన దానికిఁ దగుసమాధానము మన మీయవచ్చును. కాని యాంతరంగిక వ్యవహారములలో దాని జోక్యమును మన మిక సహించఁజాలము. ఈ సందర్భములో నిండియాకాని, పాకిస్థాన్ కాని - యామాటకు వచ్చినఁ బ్రపంచమంతయు నిర్మూలమై పోయినను సరే మనము లెక్కచేయము. పాకిస్థాన్ తనగోతిని తానే త్రవ్వుకొనఁదలఁచుకొన్న, నందుకు దానికిఁ బూర్తిగా స్వేచ్ఛయున్నది.

హైదరాబాద్ భావి

"హైదరాబాద్ సంస్థానమును భాషా సయుక్తముగా విభజించి సరసనున్న రాష్ట్రములలోఁ గలిపివేయవలయునని కొందరు సూచించుచున్నారు. నిజాం నవాబున గద్దెదించవలెనని కొందరు, బాధ్యతాయుత ప్రభుత్వమును నెలకొల్పినఁ జాలునని కొందరు సూచించుచున్నారు.

"ప్రస్తుతమునకుమట్టుకుఁ బ్రతివారు చెప్పునది విని, సమయమువచ్చినప్పు డాయా సూచనలను బరిశీలించవలసియున్నది. కాని యొకటిమాత్రము స్పష్టము. హైదరాబాదు ప్రజల ప్రయోజనముల కేది క్షేమకరమో, హైదరాబాదు ప్రజలు దేనిని వాంఛింతురో దానికే మనము పూనుకొందుము. తమ భవిష్యత్తు విషయమై నిర్ణయించుకోవలసిన బాధ్యత నిజాం ప్రజలపై నేయున్నది. నవాబ్‌ను గద్దె దింపవలయునని కనుక ప్రజలు నిర్ణయించు పక్షములో బయటివా రెవరు నా నిర్ణయమును ద్రోసిపుచ్చజాలరు. ఇది గృహకృత్యవిషయము. దీనిలో చర్చిల్ జోక్యముచేసుకొన్నను నతని తలఁదన్నినవారు కల్పించుకొన్నను సహించుటలేదు.

"కాశ్మీరుకు మన మెందుకు వెడలితిమని కొందరు ప్రశ్నించుచున్నారు. దీనికి సమాధానము విస్పష్టముగా కన్పిం చుచునే యున్నది. కాశ్మీర్ ముస్లిములు మనలను వెళ్ళిపొమ్మన్నచో మన మాలాగే వచ్చి వేయుదుము. అంతేకాని కాశ్మీరీల నూరకే శత్రువులచేతికి విడిచిపెట్టి యక్కడనుండి వైదొలఁగిపోము. టోరీలుకాని, లిబరల్సుకాని, బయటివారు మరెవరైనఁ గాని, యీ విషయములో జోక్యము చేసికోఁగూడదు. కాశ్మీర్ ప్రజాప్రయోజనములకు విరుద్ధముగా వారు చెప్పు సలహాలను వినిపించుకోఁబోము. ఇప్పటికిఁగూడ ప్రతి విషయములోను గల్పించుకోవలయునని వారు ప్రయత్నించుచున్నారు. ఇండియా నేఁడు స్వతంత్ర మయినదని వారు గ్రహించుచున్నట్టు లేదు. అది వారు గ్రహించనంతకాలము వారితోఁ గలసి మెలఁగుట మనకు సాధ్యముకాదు."

పరస్పరప్రేమాభిమానములు కలిగియుండి, యొకరిపై నొకరు తూటాలు విసరుకొనుట యసాధ్యమైన విషయము. కామన్‌వెల్తులోనే మన ముండిపోవలయునని వారి యాకాంక్ష. ఇండియా శ్రేయస్సుదృష్ట్యా యా విషయమును మనము నిర్ణయించుకొందుము.

చర్చిల్ దుర్భ్రమ

ఇండియారక్షణ తనవల్లనే సాధ్యమగునని చర్చిల్ భావించినట్లయిన నాయన నా దుర్భ్రమలోనే యుండనిండు. ముం దాయన యింగ్లండును రక్షించుకొనుట మంచిది. సత్యము, ప్రేమ, న్యాయము - ఈ యుత్తమ గుణములే నేఁడు ప్రపంచమును రక్షించఁగలిగినవి. ఇకఁ బ్రపంచము తృతీయ ప్రపంచ సంగ్రామమును భరించఁజాలదు. చర్చిలుది వినాశాత్మక పద్ధతి. నేటి కల్లోల ప్రపంచమునకు గాంధీ విధానమే శాంతి సామరస్యములను మార్చఁగలదు.

సమైక్య, పటిష్ఠ భారతనిర్మాణ సాధనము

"దేశవిభజన జరిగిన వెంటనే యిండియా నెన్నో క్లిష్ట పరిస్థితు లెదుర్కొన్నవి. ఇండియా ప్రతిష్ఠకుఁ గళంకము కలిగినది. కాశ్మీర్ సమస్యకంటె హైదరాబాదు సమస్య చాల విషమముగాఁ బరిణమించినది. దానిమూలమున దేశములోని వాతావరణమంతయు మారిపోవుటయే దీనికిఁ గారణము. విద్వేషములు ప్రబలిపోయినవి. గాంధీజీహత్య జరిగినది. ఈ విషాద సంఘటనమూలముగా మనకుఁగలిగినహాని యింతయు నంతయుఁ గాదు. ఆయన సలహాలు, మార్గదర్శకత్వము, నన్నిటికంటె మించి యాయని యాశీర్బలము మన కత్యవసరమైన తరుణములో మన మధ్యనుండి యాయన తిరోహితుఁడైనాఁడు. కాని యాయన దృష్ట్యా, ప్రపంచదృష్ట్యా చూచిన నాయననిర్యాణ మొకవిధముగా లాభదాయకమే యని చెప్పవలయును. నా మట్టుకు నే నట్టి మరణమునే కోరుచున్నాను. అయినప్పటికి నా దుష్కృత్యమునకుఁ బాల్పడ్డవారుమాత్రము పశ్చాత్తాపము చెందకతప్పదు. ఈ ప్రమాదము లన్నిటిని మనము గడచి బయటఁబడితిమి. ఈ ప్రమాదములను వీలైనంతవఱకు స్వప్రయోజనానుగుణముగా మనము వినియోగించుకొన్నాము. ఇండియాకు శాంతి సామరస్యములను జేకూర్చితిమి. గాంధీజీ నిర్యాణానంతరము దేశములోఁ గలిగిన పరిణామమువల్లనే హైద్రాబాద్‌పైఁ బోలీసుచర్యల సందర్భములో శాంతిభద్రత లకు రక్షణ కలిగినది. నేఁడు ప్రజలలోఁ బరస్పర విశ్వాసము కానవచ్చుచున్నది. పాకిస్థా నిఁకముందు మన విషయములో జోక్యము చేసుకోఁగూడదనియే మనము వాంఛించుచున్నాము. వారు జోక్యము చేసికొనుట యనఁగా ముస్లిములలో, నాతురత, భయసందేహములు,కలుగుట యన్నమాట. శాంతి స్థాపనకే యిఁకఁ గృషిచేయవలయునని మనము ప్రయత్నించు చున్నాము. ఇండియాను మన మేకరాజ్యము చేసితిమి. ఇక దానిని సమైక్యము, పటిష్ఠము చేయవలసియున్నది. శాంతి భద్రతలను,సుపరిపాలనమును మనము నెలకొల్పవలయును.

"మనము సక్రమముగా వ్యవహరించకపోయినఁ జిక్కులు తప్పవు. గాంధీజీ నిర్యాణానంతరము కొల్హాపూరులో నేమి జరిగినదో చూడుఁడు. ఈ సందర్భములో నియమించఁబడిన విచారణసంఘము దర్యాప్తుచేసి మంత్రివర్గము పెద్ద పొరపాటు చేసినదని నిర్ణయించినది. ఇతర ప్రాంతములలోఁగూడ నీలాగే జరిగిన స్వరాజ్యముకంటె బ్రిటిషు ప్రభుత్వమే నయమని ప్రజలు భావించుకొందురు.

"స్వాతంత్ర్యము సిద్ధించిన ప్రథమ సంవత్సరములో నెదుర్కొన్న ప్రమాదముల నిండియా గడచి బయటఁ బడినది.

"అసలు పని యిఁకఁ బ్రారంభము కావలసియున్నది. విదేశ పాలకులనుండి మనము ప్రభుత్వమును స్వాధీనము చేసికొంటిమి. కాని దానిని నిర్వహించు విషయమై మన మాలోచించుకొని దానికిఁ దగు నేర్పాట్లు చేయవలసియున్నది. ఈ మహాకార్యమును మనము నిర్వహించవలసియున్నది. ఊపిరి సలుపుటకుఁగూడ మన కిప్పుడు తీరిక లేదు. రేయింబవళ్లు పని చేసిననే మన కృషి తృప్తికరముగా సాఁగును. మన సరిహద్దులలో నేమి జరుగుచున్నదో చూడుఁడు. బర్మా, మలయా, ఇండోనేషియా, చైనాలలో నేఁడు శాంతిలేదు. మన పొరుగు రాజ్యము మనపైఁ గన్నువేసి యున్నది. చిత్తశుద్ధి, పవిత్రాంతఃకరణ లేని దేశ మిది.

"ఈ పరిస్థితులలో నీ సమస్యను బరిష్కరించుటకు నా సూచన యేమిటో బొంబాయిపౌరులకుఁ దెలియపఱచఁదలచుకొన్నాను. ఇకనుండియైన సంకుచితమైన రాష్ట్రీయవాదనకు స్వస్తిచెప్పుఁడు ఒకవేళ మీరు రాష్ట్రీయవాదము నవలంబించుచున్నను గొంచెము నిగ్రహముతో మాట్లాడుట యెంతో యవసరము. బొంబాయిసమస్య బెర్లిన్‌సమస్యవలెఁ బరిణమించఁగలదనుట శుద్ధావివేకము. మన మందరము చిత్తము వచ్చినట్టు మాట్లాడుచు, వాతావరణమును విషకలుషితము చేసివేసినట్టయిన నిండియా సర్వనాశనమైపోవును. "సిరి రా మోకా లడ్డుపెట్టి"నట్టగును.

బానిసలుగా నున్నప్పుడు మనకుఁ బరస్పరము గౌరవము, నాప్యాయత యుండెడివి. పరాధీన పరిస్థితులలో మనము పరస్పరము కలసియున్నాము. ఇప్పుడు స్వతంత్రుల మైనతరువాత మన మెందుకుఁ గలహించుకోవలయును?

మన గతచరిత్ర నొక్కసారి సంస్మరించుకొనుడు. కేవలము పరస్పర విభేదములతో, భ్రాతృహత్యలకు బితృహత్యలకుఁ బూనుకొనుటచేతనే మన సామ్రాజ్యములు పోయినవి. స్వతంత్రము వచ్చిన తర్వాత మనము కలహించుకొని, దీనిని గొంచెము వమ్ముచేసిన, భవిష్యత్సంతతులవారు మనలను దిట్టుకొందురు. కేవలము మనలను మనమే పొగడికొనుచుఁ గూర్చొనలేము. మన కున్న సహజసంపదలపై నాధిపత్యము సంపాదించు కొనవలయును. లేకపోయిన మనముఖమునకుఁ దారిద్ర్యమే గతి కాఁగలదు.

ఇంతకు మనమందరము నేఁ డెదుర్కొనవలసిన క్లిష్ట సమస్య యేమిటి? ఇండియాలో శాంతి భద్రతల సంరంక్షణ కాదా ? కొంచెము కాలూని నిలుచుటకు మన కవకాశము కలిగినది. ఇప్పుడు మన పునాదులను మనము గట్టిపఱచుకో వలయును. పరస్పరప్రేమ, విశ్వాసములవల్ల మాత్రమే యిండియా యఖండమై సుదృఢముగా వర్ధిల్లఁగలదు.

ఆతరువాత మన మెదుర్కోవలసిన మఱియొక మహా క్లిష్ట సమస్య ఇన్ ఫ్లేషన్. మనకుఁ జాలినంతగా మనము వేనిని మన దేశములో నుత్పత్తి చేయుటలేదు. అందుకోసము బోలెడు సొమ్ముపోసి విదేశములనుండి దిగుమతి చేసుకోవలసి యున్నది. మనము వాని రవాణాకోసమే యనేక కోట్ల రూపాయలు పోయవలసి వచ్చుచున్నది. మనము కాస్త వివేకముతోఁ గ్రొత్త నౌకలను నిర్మించినను లేక ఖరీదు చేసినను నీ డబ్బంతయు నాదా యయ్యెడిదికాదా! మనకుఁ జాలినంత గుడ్డను మన ముత్పత్తి చేయుటలేదు. మనకుఁ దినఁదిండి, కట్ట బట్ట కావలసినంత యుండిన శాంతిగా బ్రతుకవచ్చును. తక్కిన యిబ్బందుల వేనినయినఁ దేలికగా భరించవచ్చును. ఒకవేళ మనము చాలినంత యుత్పత్తిని గొనసాగించినను దాని నందఱకుఁ బంచుటలో నెన్నో చిక్కు లేర్పడుచున్నవి. మనము కంట్రోల్సు నమలుజరిపిన మనకుఁ బ్రతిపక్ష మెక్కువయగును. అట్లని మనము కంట్రోల్సు నెత్తివేసిన ధరలు పెరిగిపోవుటయే కాక, యక్రమవ్యాపారు లిది యదునుగాఁజూచి, రాసులు రాసులు లాభములు గుంజుటకుఁ బ్రయత్నించుచున్నారు. దేశములో శాంతిభద్రతలను రక్షించి, సౌభాగ్యవంతము చేయుటకు శైశవావస్థలోనున్న ప్రభుత్వ మేమిచేయఁగలదో, చేయవలసియున్నదో, మీ రీ సరికి గుర్తించియేయుందు రను కొందును. ఇంతవరకు నిండియాప్రభుత్వ మాధారపడియున్న "యుక్కు చట్ర" మిప్పుడు భగ్నమైపోయినది. దానిపని గావలసినంతవఱ కిది బాగుగానే పనిచేసినది. మేము ప్రభుత్వమును జేపట్టుసరికే యీ చట్రము బ్రద్దలైనది. ఇందులో నూటి కేబదియైదువంతు లుద్యోగములను నిర్వహించు విదేశీయులు స్వదేశములకుఁ దిరిగిపోయిరి. దేశవిభజనవల్ల నీ వ్యవస్థ మఱింత బలహీనమైపోయినది. మిగిలినవారిలో ననేకులు మన రాయబారులుగా విదేశములకు వెళ్ళవలసి వచ్చినది. ఫలితముగా నతిస్వల్పసంఖ్యాకులుమాత్రమే మనకు మిగిలినారు. చాలమంది వారు పాతపద్ధతులలోనే వ్యవహరించుచున్నారని విమర్శించుచున్నారు. కాని పరిపాలనానుభవమున్న వారికే వా రే పరిస్థితులలోఁ బనిచేయుచున్నదియు నర్థము కాఁగలదు. బయటివారి కాపని యర్థముకాదు. వారిలో ననేకులు విశ్వాసపాత్రులు, దేశభక్తులు నున్నారు. వా రందరు మాతోఁగలసి యహోరాత్రములు పాటుపడుచున్నారు. వారు మనఃస్ఫూర్తిగా సహకరించుటవల్లనే, కాశ్మీర్‌లో, సంస్థానములరంగములో నితరత్ర సాధించిన ఘనవిజయములు సుసాధ్యమైనవి. ఇవి యన్నియు మే మెదుర్కొనుచున్న కష్టములు. అందువల్ల మా మనోవ్యధకు మేర లేకుండఁ బోవుచున్నది. ఈ లోపములను సవరించుకొనుటకు మేము గట్టి ప్రయత్నము చేయుచున్నాము. కాని యిందుకుఁ గొంతకాలము పట్టఁగలదు.

ప్రతిపక్షమునకుఁ దరుణముకాదు

మేము కంట్రోల్సును రద్దుచేసి యందువల్ల నేర్పడిని పరిస్థితులను బరిశీలించితిమి. దొంగలాభములు పోసికోఁదలచిన వారు తమకుఁ గావలసిన దంతయు సంపాదించినారు. వీరిలోఁ గొంద రాదాయపన్నుగూడఁ జెల్లించలేదు. ఆదాయపు పన్ను చెల్లించవలసి వచ్చునను భయముతో వారు తాము దాచిపెట్టుకొన్న సంపదను బయటపెట్టుటకు సాహసించుట లేదు.

ఈలోగా ధరలు పెరిగిపోయినవి. కార్మికు లెక్కువ జీతము లడుగుచున్నారు. ప్రభుత్వోద్యోగులు నిదే పాట పాడుచున్నారు.

ఈ సంగతు లన్నింటి నాలోచించి, యిండోనీషియాలో, చైనాలో, మలయాలో, బర్మాలో నేమి జరుగుచున్నదో, దానితోఁ బోల్చిచూడుఁడు. ఈ దేశములగతియే మన దేశమునకుఁగూడఁ బట్టినట్లైన మనము సాధించిన స్వరాజ్యము నిష్ఫలము కాఁగలదు.

ఈ సమస్య లన్నింటికి మన మొక పరిష్కారమార్గమును గనుగొనవలసియున్నది. మన శక్తిసామర్థ్యములను, సంపదను, సమీకరించి దేశము నీ కష్టములనుండి గట్టెక్కించుట యెట్లో యాలోచింపవలయును. కార్మికులు, కర్షకులు, ధనికులు, నందరు నిప్పటివలెనే పరిస్థితు లీలాగే యుండినట్టయిన నిండియా సర్వనాశనము కాకతప్పదను సంగతిని గుర్తింపవలసియున్నది. ఇండియా యిప్పుడు శత్రువుల నెదుర్కొనుచున్నది.

ఇండియాకు స్వాతంత్ర్యము వచ్చినప్పుడు సేనలసంఖ్య తగ్గించి వెయ్యవచ్చునని భావించితిమి. కాని నిజమున కా సంఖ్యను బెంచవలసియున్నది. బలమైన కేంద్రప్రభుత్వము, బలమైన సైన్యము నిండియా కెంతో యవసరము. హైదరాబాదులో నా సంస్థాన ప్రధాని, మఱియొక విప్లవకారుఁడని చెప్పుకొను వ్యక్తి కలసి ప్రారంభించిన యలజడులను మన మణచివేసితిమి. ఇందుల కేది కారణమో, మనము దానిని గ్రహించవలసియున్నది.

మనకుఁ బ్రతిపక్ష ముండవలయునని ప్రజ లనుచున్నారు. అయితే ప్రతిపక్ష ముండుట కిది తరుణముకాదని, సహకార మత్యవసరమని నేను సవినయముగా మనవి చేయుచున్నాను. ప్రస్తుత మిండియా నుదృఢమై యాసియా దేశములకు సహజముగా నాయకత్వము వహించవలసియున్నది. ఆ పరిస్థితి యేర్పడిన తరువాతనే మనము పరస్పరము వివాదపడుట కవకాశ మున్నది. మీరు నా సలహాను వినకపోయిన నిండియా సర్వనాశనము కాకతప్పనట్లు కనబడుచున్నది.

లాభములు పోసికొనుటకు సమయముకాదు

ఈ సమస్యలను బరిష్కరించుటలో బొంబాయినగర మెట్లు తోడ్పడఁగలదో, వివరించుచు సర్దార్ పటే లిటు లన్నాడు.

"ఇండియాలోఁ గీలకమైన ప్రదేశములో బొంబాయి నగర మున్నది. మన యార్థిక వ్యవస్థయంతయు నిప్పు డల్లకల్లోల పరిస్థితులలో నున్నది. ఈ పరిస్థితిని మనము చక్కజేయక పోయినట్టయిన మన సైనికవ్యవస్థకూడ శిథిలము కాక తప్పదు. మనకు డబ్బుకావలయును. మనకు సాధనసంపత్తి కావలయును. దేశముకోసము మనము సర్వస్వము త్యాగము చేయవలసియున్నది. లాభములు పోసికొనుట కిది తరుణము కాదు. ప్రతి కార్మికుఁడు, మిల్లుయజమాని, వ్యాపారి దానిని గుర్తించవలసియున్నది. నిర్విరామకృషికి, స్వార్థరహితసేవకు, నిది యదను."

మిల్లు యజమానులకు విజ్ఞప్తి.

"పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించనున్నారను బూటకపుకబుర్లు విని యపోహపడవద్దని మిల్లుయజమానులకు విజ్ఞప్తి చేయుచున్నాను.

"మరొకచోట సంపద యెక్కువైన నిక్కడ దానిని మరొక విధముగా వినియోగము చేయవచ్చును. అట్లు గాక పోయిన దేశము సత్వరమే యధోగతిపాలై పోవును.

"అక్రమముగా లాభములు తీయుచున్నారను నిందకు మీరొడిఁగట్టక తప్పదు. మీరు స్వయంకృతమైన యిబ్బందు లనే యెదుర్కోవలసి వచ్చుచున్నది. మేము తిరిగి కంట్రోల్సు విధించుటవల్ల ననేకులు వర్తకులు, వారి గుమాస్తాలుకూడ నిరుద్యోగులై పోయినారు.

"మీ డబ్బువల్ల నెవరికి మేలుగలుగుచున్నదో యాలోచించుఁడు. మీ డబ్బు విదేశస్థు లెవరికిని జేరుటలేదు. కేవలము మన దేశీయులకే చెందుచున్నది. మీరు బహిరంగముగా సంపాదించు పక్షములోఁ బ్రభుత్వముతోడ్పాటుతో నెంత సంపాదించినను ఫరవా లేదు. ధరలు తగ్గించుటకు మీరు యధాశక్తి తోడ్పడవలసియున్నది. ఇందు మీరే యొక యుత్తమాదర్శమును బ్రారంభించవచ్చును. ప్రభుత్వము మీకు శత్రువుకాదు. దేశశ్రేయస్సు కాటంకముగా నున్నదని నమ్మకము కలిగినట్లయినఁ బెట్టుబడిదారీతనమును వెంటనే తుదముట్టించవలసినదని నేనే ముందుగాఁ బ్రభుత్వము నర్థించ గలను. పరిశ్రమలను మీరు స్వయముగా నడుపఁగలిగిననే జాతీయము చేయుట మంచిది. మన ప్రభుత్వమును నిర్వహించుటకే తగు సిబ్బంది, చాలినంత ధనము లేకున్నది. మన యుద్యోగులను సంస్థానములకుఁగూడఁ బంపవలసివచ్చుచున్నది. అయినను నా సంస్థాన ప్రభుత్వములు సమర్థముగా నిర్వహించబడుటలేదు.

"అందుచేత మనలోనున్న యవినీతిని బూర్తిగా నిర్మూలింతము. ఈ పనిచేసి, సత్యము, ప్రేమ, న్యాయము ప్రబోధించిన గాంధీజీ యాత్మకు శాంతిఁజేకూర్చుదము. ఈపనిని మనము సాధించఁగలిగిననాఁడు మనదేశములో శాంతి భద్రతలను నెలకొల్పఁగలుగుదుము. ధరలు తగ్గిపోయిన నింక నెక్కువ సౌకర్యములు కావలయునని కోరుట సమంజసముకాదని కార్మి కులే గుర్తింతురు. అంతేకాదు, సమ్మెలుచేయుటద్వారా లభించు నాయకత్వ మట్టే నిలఁబడఁబోదని వారు గుర్తించగలరు కూడ. కార్మికులకు హానిచేయవలయుననికాని, యజమానులకు లాభముచేయవలయుననికాని కాక, మేము కేవలము దేశశ్రేయస్సుదృష్ట్యా ప్రభుత్వభారమును వహించుట కంగీకరించితిమి.

"యూరపును బునరుద్ధరించుట కింగ్లండు, అమెరికా లెంత గట్టి ప్రయత్నముచేయుచున్నవో, యొక్కసారి యాలోచించుఁడు. ముప్పది నలుబదిలక్షల పౌనుల ఋణమును బ్రిటిషు ప్రభుత్వము ప్రారంభించనున్నదను సంగతిని మనము రెండు మూడు రోజులక్రితము విన్నాము. నేఁడు మేము ఋణముచేయ దలచుకొన్న నొక్కఁడును ముందుకు రాఁడు. అందుకుఁ గారణ మాదాయపు పన్నెగవేసినందు కెక్కడ సంజాయిషీ యడుగుదుమో యను భయమే.

దేశమునకు మీ ఋణము తీర్చుకొనుఁడు.

"ఆదాయపు పన్నెగవేయువారిని వెదకి పట్టుకొని శిక్షించుటకు తగు సిబ్బందిని నియమించితిమి. వారొక ప్రశ్నావళిని జారీచేసినారు. వీరు తమ డబ్బునంతను రాఁబట్టుకొనుటకు రెండుసంవత్సరములు పట్టవచ్చును.

"ఇందువల్ల నెవ్వరికిఁ గలుగు ప్రయోజనమేమియు లేదు. అందుచేత దేశమునకు మీరు ఋణపడి యున్నదంతయుఁ దిరిగి యిచ్చివేయుఁడు. ఈ సందర్భములో మాకుఁ దోడ్పడ వలసినదని యనుభవజ్ఞులందరికి విజ్ఞప్తి చేయుచున్నాను. యజ మానుల కనుభవము, సంపద, రెండును గావలసినంతగా నున్నవి. వారు శక్తిసామర్థ్యములను, సంపదను, దేశముకోస మర్పించవలసియున్నది. అదియుఁ గాకపోయిన దేశము సర్వనాశనమైపోయినప్పుడు వారి సంపదయంతయు దమ్మిడీకిఁ గొఱగాదు.

"బొంబాయి సమస్యను బెర్లిన్ సమస్యగామాత్రము చేయకుఁడు, తరతరాలుగా శాంతిసద్భావములతో నివసించు చున్నప్పుడు గుజరాతీలు, మహారాష్ట్రులు నిప్పుడుమాత్ర మెందుకు శాంతి సద్భావములతో నివసించలేరు?

"మన యంతఃకలహములను మనమే పరస్పరసొహార్దముతోఁ బరిష్కరించుకొందము. ఈ సంకుచితరాష్ట్రీయ తత్త్వమునకు స్వస్తి చెప్పుఁడు. విద్వేషప్రచారమునకుఁ బూనుకొనకుఁడు. మన మిండియాను సుదృఢముగా నిర్మించవలసి యున్నది. ప్రపంచములోఁ గొలఁదిదేశములుమాత్రమే యిండియాయంతటి బలసంపత్తికలవి. ఇండియా శ్రేయస్సు కోసమే మన ముత్పత్తి నితోధికముగఁ జేయవలసియున్నది. మనము పరస్పరము సంప్రతించుకొని వ్యవహరించవలసియున్నది. అప్పుడే మనము దేశమునకు శక్తివంచనలేకుండ సేవచేసినట్లు కాఁగలదు. అప్పుడే మనము గాంధీజీ యనుయాయుల మనిపించుకొనుట కర్హులము కాఁగలము.

స్వాతంత్ర్య వార్షికోత్సవ సందేశము

"స్వాతంత్ర్యముపొందిన తొలి సంవత్సరములోనే మనము కష్టపరంపరలలోఁ దలమున్కలై పోయితిమి. కాని యకుంఠిత ధైర్యసాహసములను బ్రదర్శించుటవల్లనేమి, వజ్ర

  1. సర్దార్ పటేల్ తన 74 వ జన్మదినోత్సవసందర్భములో బొంబాయి చౌసాతీలో జరిగిన బహిరంగసభలో నిచ్చిన యుపన్యాస సారాంశము. అంత మహాసభ యెప్పుడును జరుగలేదు.