వల్లభాయి పటేల్/సర్దార్‌జీ జన్మదినోత్సవములు

వికీసోర్స్ నుండి

ననేక గ్రంథములు జైలులోనే వ్రాసినాఁడు. అజాద్‌కూడ కురూనుపై గొప్పవ్యాఖ్యానము జైలులోనే వ్రాసినాఁడు.

మన యాంధ్రదేశములోఁగూడ మాలపల్లి మున్నగు మహత్తర గ్రంథాలు కారాగృహములోనే రచింపఁబడినవి. నవ్యసాహిత్య మెంతో కటకటాలనుండియే బయలుదేరినది.

కార్యశూరుఁడని ప్రఖ్యాతిగాంచిన మన పటేలు లోగడ నెప్పుడును బుస్తకము పట్టువాఁడుకాఁడు. కాని యీ పర్యాయము చాల తీవ్రముగా గ్రంథపఠన చేసినాఁడు. సాహిత్యము, వేదాంతము, రాజకీయములు, ఆర్థికశాస్త్రము, వ్యాపారము మొదలగువానికిఁ జెందిన గ్రంథములను 300 వఱకుఁ బఠించెను. వెల్సు, బెర్‌నార్డుషా, టాగూర్, రస్సెల్, కారల్ మార్క్సు, ఏంజిల్ ప్రభృతుల గ్రంథములన్నిటిని గాలించినాఁడు. అన్నిటికంటె నిదొక గొప్ప విశేషము.

ఇట్లే పెక్కు విధములఁ దమ కాలము నానందముగాఁ గ్రంథావలోకనముతో గడపిన మన ప్రముఖులు మూడు సంవత్సరముల యనంతరము 1945 జూన్, 15 వ తేదీన మన మధ్యకు వచ్చిరి.

సర్దార్‌జీ జన్మదినోత్సవములు

సర్దార్‌పటేలు కాడంబరములన్నను నట్టహాసములన్నను గిట్టవు. అందుచే నంతకుముందు బటేలు జన్మదినోత్సవములు చాలవఱకు నిరాడంబరముగానే జరిగినవి. కాని 70, 74 వ జన్మదినోత్సవములుమాత్రము భారతప్రజ తమ 'కర్మవీరుని'యం దచంచలభక్తి విశ్వాసములు చూపెట్టుటకా యన్నట్టు లత్యంత వైభవముగా జరిగినవి.

70 వ జన్మదినోత్సవము 1945 అక్టోబరు 31 వ తేదీన బొంబాయి కాంగ్రెస్ ఆధ్వర్యవమున బొంబాయినగరములో జరిగినవి. ఆచార్య కృపలానీ యధ్యక్షతను జరిగిన మహాసభలో సిల్కుతోఁ జేనేఁతతో దయారుచేసిన సన్మానపత్రమును, 1600 తులాల తూకముగల వెండికాస్కెట్‌లో (దానిపై గాంధీజీ పటేల్ చిత్రములు చెక్కఁబడియున్నవి) నుంచి 7101 రూపాయలు రొక్కమునిచ్చి పటేల్‌ను సన్మానించినారు.

సర్దార్‌జీ 74 వ జన్మదినోత్సవముకూడ 1948 అక్టోబరు 31 తేదీన దేశమంతట జరిగినది. ముఖ్యముగా బొంబాయిలో ఎస్. కె. పాటిల్ అధ్యక్షతను జరిగినదే యన్నటికన్నఁ గొనియాడఁ దగినది. ఆ సందర్భములో ఎస్. కె. పాటిల్ బొంబాయి ప్రజలతరపున 731 తులాల తూకముగల బంగారముతోఁ దయారు చేయఁబడిన యశోకస్థూపమును సర్దార్‌జీకి బహూకరించినాఁడు. అహమ్మదాబాదు మిల్లుయజమానుల సంఘము వారు 73 వేలరూపాయలు, స్వర్ణ రాజదండము. గాంధీజీ రజత ప్రతిమను బహూకరించిరి.

స్వయముగా ననేకులు మిత్రులు వచ్చి యభినందించినారు. ఆయన నభినందించుటకై యరుదెంచిన స్వగ్రామ వాసులతో మాట్లాడుచుఁ బటే లిట్లన్నాఁడు.

                "స్వదేశమే నా స్వగృహము.
                 ప్రజలే నా బంధుకోటి.
                 స్వాతంత్ర్యసాధనమే నా జీవితలక్ష్యము.

"ఈ వయస్సులో నాత్మీయులమధ్య నుండవలయునని యెవరు కోరరు? కాని నే నీ యైహిక వాత్సల్యబంధములను నేనాఁడో వదలుకొని, జాతీయస్వాతంత్ర్య సాధనాంబుధిలో మునిఁగితిని. దేశము దాస్యశృంఖలాబద్ధమై యున్నంతకాలము నేను జన్మించిన చిన్నగ్రామమునుగుఱించి నే నెట్లు గర్వింపఁ గలను? ఈ నగ్న సత్యము తెలిసివచ్చిననాటినుండి నా విశాల గృహ (భారతదేశ) స్వేచ్ఛకై పోరాడుచునే యున్నాను. జాతీయ స్వాతంత్ర్యమునకై నేను సాగించుచున్న సమరములో నాకు మార్గదర్శకుఁడుగా నుండి నాజీవితధర్మము (స్వరాజ్యము) త్వరలో ఫలప్రదమగునట్లు చేయవలసిన దని పరమాత్ముని బ్రార్థించుచున్నాను.

"దగ్గర బంధువులతోఁ గలసియుండవలయునని యెవరు కోరరు? తన జన్మస్థానమును జూచిరావలెనని యెవరి కుండదు? కాని స్వగృహముపట్ల నాప్రేమ, దేశముపట్ల ప్రేమాతిశయముగాఁ బరిణమించినదని మీకుఁ దెలియును. ఎప్పుడు కీలెఱిగి వాతపెట్టవలయుననియే నా కార్యాచరణమార్గము. నా జీవితకాలములో లక్ష్యసిద్ధిని జూడవలయునని కోరుచున్నాను. నా మాతృ దేశము సంపూర్ణ స్వాతంత్ర్యమును బొందిననాఁడే నేను నా గ్రామములోఁ బుట్టిన ఋణమును దీర్చుకోగలను.

"నేను 73 సంవత్సరములను బూర్తి చేసికొనుచున్నాను. ఇంక మఱికొంతకాలము జీవించవలెనని యాశించు చున్నాను. గాంధీజీ తనకుఁ దాను నియమించుకొన్న 125 సంవత్సరములనుదాటి బ్రతుకుట నా యభిమతముకాదు. స్వర్గములో గాంధీజీ సహచరులలో నుండఁగోరుచున్నాను."

భారతదేశము నలుమూలలనుండి వేలాది శుభసందేశములు వచ్చినవి. నాయకులుసైతము తమ 'కర్మవీరుని'స్థితప్రజ్ఞతను గొనియాడుచు దమశుభాకాంక్షలు తెలియజేసిరి. పటేల్ జన్మదినోత్సవ సందర్భములో సందేశ మియ్యవలసినదని బొంబాయికాంగ్రెసువారు మహాత్మగాంధిని గోరఁగా "సర్దార్ నా కొడుకువంటివాఁడు. కొడుకు పుట్టినరోజు పండుగనాఁ డభినందించు లాంఛనమును దండ్రి వేఱుగఁ బాటించవలయునా" యన్నారు.

"నా అన్నగారు"

గత 25 సంవత్సరములకుఁబైగా సర్దార్ వల్లభాయి పటేల్ సన్నిహితపరిచయభాగ్యము నాకు లభించినది. కేవల మొక మార్గదర్శకుఁడేగాక, నాయకుఁడేగాక, యాయన నాకన్నగారివలె నున్నాఁడుకూడ.

ఆయనకు వయస్సుమళ్ళినది. ఆరోగ్యముచెడినది. కాని స్వాతంత్ర్యపిపాసాగ్ని యీషణ్మాత్రమైనఁ జల్లార లేదు. గాంధీజీ పెద్దవాడైపోయినాఁడని తానుగూడఁ బెద్దవాఁడనై పోవుచున్నానని, జాతీయాభ్యుదయభారమును యువకులుపంచుకోవలయునని యాయన యొకపర్యాయము యువకులకుఁ జెప్పుచుండఁగా విన్నాను. గాంధీజీయుఁ దానును సజీవులైయుండఁగానే తమ జాతీయాభ్యుదయ కృషిఫలితమును జూడఁగల్గుటకై యువకులు సర్వశక్తుల నశేషత్యాగములను జాతీయస్వాతంత్ర్యమునకై ధారఁబోయవలసినదని యాయనచెప్పుచున్నప్పు డాయన కంఠస్వరములో గాద్గద్యము కన్పించినది. ఆయన యిట్లన్నాఁడు గదా యని యాయనశక్తి యుడిగిపోయినదని భావించవలదు. ఈనాటికిఁగూడ జాతీయాభ్యుదయకార్యనిర్వహణలో నెంతటి భారమును మోయుటకైన నాయన సంసిద్ధుఁడే. ఆరోగ్యము, తుదకుఁ దనప్రాణముకూడఁ బ్రమాదమునకు లోనుగాఁగల యవకాశ మున్నప్పటికి నాయన వెనుదీయఁడు. ఇట్టి నాయకుని యావశ్యకత భారతదేశమున కెంతయిన నున్నది. తన శ్రమ ఫలించిన మహాపర్వదినోత్సవము చూచుటకై యాయన సజీవుఁడుగా నుండవలయునని భగవంతుని బ్రార్థించుచున్నా" నని సందేశమంపినాఁడు డాక్టరు రాజేంద్రప్రసాద్.

"అనుపమకార్యదక్షుఁడు"

"ఇప్పటికి 25 సంవత్సరములకుఁ బైగా మనము సహచరులముగాఁ బెక్కు కష్టముల నెదుర్కొన్నాము. ఈ 25 సంవత్సరములు భారతీయుల కందఱకుఁగూడ బరీక్షాకాలము. ఈ పరీక్షనుగొందరు తట్టుకోలేకపోయిరి. మఱికొందరుయథాపూర్వము గానే యుండిపోయిరి. కొద్దిమంది, చాల కొద్దిమందిమాత్రమే కాలముతోపాటుగాఁ బ్రతిభను బెంపొందింపఁజేసికొని, భారత జాతీయ చరిత్రలోఁ బ్రముఖసంఘటనలుగా నిలచిపోయిన ఘట్టములపైఁ దమ ప్రతిభ నచ్చొత్తఁగలిగినారు. ఈకొద్ది మందిలో సర్దార్ వల్లభాయిపటే లొకఁడు.

"దృఢనిశ్చయము - కార్యదీక్ష - నిర్మాణ చాకచక్యము - జాతీయ స్వాతంత్ర్యమునకై పరిపూర్ణపిపాస - సర్దార్ జీవిత విశిష్ట లక్షణములు. ఆయనతోపాటు ముందడుగు వేయ లేకపోయిన కారణమున కొంద రాయనను నిరసించిరి. కాని యసంఖ్యాక ప్రజానీకము సర్దారులోఁ దమకు నచ్చిన నాయకునిఁ జూచినది. ఆయనతోఁగలసి యాయన నాయకత్వమునఁ బనిచేసి భారతస్వాతంత్ర్యసాధనకు స్థిరమైన పునాదిని వేసినది.

"సర్దార్ దుర్భేద్యమైన కోటవంటివాఁడు. ఆయన సలహాను విశ్వసించవచ్చునని యాయనతోఁగలసి పనిచేయు భాగ్యము లభించినవారు గుర్తించియుందురు. ఆయనమైత్రి నత్యధికగౌరవముగా భావించియుందురు.

"భారత జాతీయోద్యమ మాయన సేవానిరతిలో నింకెంతో కాలముపాటు లాభముపొందఁగలదని యాయన నాయకత్వభాగ్యమును బొందుచునే యుండఁగలదని' విశ్వసించు చున్నాను. ఆయన జన్మదినోత్సవ శుభసమయములో నివే నా జోహారు"లని భారతప్రధాని పండిట్ నెహ్రూ జోహారు లర్పించినారు.

"దైవభీతి కలవాఁడు"

26 సంవత్సరములక్రితము మద్రాసులో నాతో మాట్లాడుచు వల్లభాయిపేరును గాంధీజీ యుచ్చరించిన క్షణము నాకుఁ జిరస్మరణీయము. ఆయనను గలసికోవలయునని, యాయనతోఁగలసి పనిచేయవలయునని యొక తీవ్రాకాంక్ష నాలో బయలు దేరినది. నాటినుండి నేటివఱకు నుభయులము గలసి పనిచేసితిమి. ఆయన నర్థముచేసికొంటినని చెప్పఁగలను. సర్దార్‌తో నెగ్గుట కష్ట మనుకొనువారిది పొరపాటు. ఆయనలో బ్రేమ మూర్తియైన స్త్రీవాత్సల్యము మూర్తీభవించినది. చూపులకుఁ గర్కశుడు. కాని లోపలనున్నది యావేశపూరితహృదయము, శ్రమనెఱుఁగని కార్యదీక్ష.

ఆయన యుద్దండుఁడు - నియంతవలెఁగాక, తల్లివలె. ప్రపంచములో నాయన యనుభవించిన సుఖము స్వల్పము. తనను గుఱించిన యాలోచనయే యాయనకు లేదు. అన్యాయము నేమాత్రము సహించఁడు. కనుకనే యాయన నన్యాయము చేయఁజూచువారి కాయన ముక్కోపిగాఁగనుపించును. అది క్రోధముకాదు - ఆత్మవిశ్వాసము.

"ఆయన మంత్రములు చదువఁడు కాని, దైవభీతి కలవాఁడు. పెక్కుమందికంటె శిష్టాచార సంపన్నుఁ" డన్నారు రాజాజీ.

"భారత సర్దార్"

"జైలునుంచి బయటికి రాఁగానే 'బార్డోలి సర్దార్‌'ను 'భారత సర్దార్‌' అని నేను సంబోధించితిని. క్షణికావేశములో నే నట్లనియుండలేదు. నాలుగు సంవత్సరములపాటు నేను దీవ్రముగాఁ జేసిన యాలోచన ఫలితమది.

1942 ఏప్రియల్ 27 వ తేదీని అలహాబాదులో జరిగిన వర్కింగుకమిటీ సమావేశములో రాజేన్‌బాబుతో, ఆచార్య కృపలానితోఁగలిసి యాయన ప్రకటించిన వైఖరిని తరువాత నే నెన్నో పర్యాయములు సంస్మరించితిని. "క్విట్ ఇండియా"యని గాంధీజీ సిద్ధపఱచిన ముసాయిదా తీర్మాన మా సభలోనే చర్చించఁబడినది. ఆ సభలో నాయన పలికిన యీ పలుకు లీ నాటికిని నా చెవిలోఁ బ్రతిధ్వనించుచున్నవి.

"యుద్ధారంభకాలమునుండి కలసి ముందడుగు వేయుటకే మనము ప్రయత్నించితిమి. కాని యీసారి యది సాధ్యపడకపోవచ్చును. గాంధీజీ యొక నిర్దిష్టవైఖరి నవలంబించినాఁడు. నేను గాంధీజీ వశంవదుఁడను. అనేక విషమస్థితులలో నాయన మనకిచ్చిన నాయకత్వము సమంజసమని ఋజువైనది. నేఁడుకూడ నాయన వైఖరి యత్యంతము సమంజసమైనదనియే యభిప్రాయము. ప్రభుత్వముతో రాయబారములకై పెక్కు పర్యాయములు ప్రయత్నించి నిందాపరంపరనే పొందితిమి. ఇక నీ రాయబారపువ్యవహారము కట్టిపెట్టవలయును. ముసాయిదా తీర్మానముతో నేను బూర్తిగా నంగీకరించుచున్నాను."

గాంధీజీ తీర్మానము గుఱించి బ్రిటిషువారు, అమెరికనులు, నేవిధముగా నభిప్రాయపడుదు రని సర్దా రొక్కక్షణమైనఁ దటపటాయించలేదు. గాంధీజీ తీర్మానము ఫలితముగాఁ బ్రపంచములో బ్రిటిషుప్రభుత్వప్రతిపత్తి దెబ్బతినఁగలదని యాయనకుఁ దెలియకపోలేదు గాని, యాయన చలించలేదు. హిమాద్రివలెఁ పట్టుఁబట్టినాఁడు. జాల్పైగురీ, త్రిపురీసభలలోఁ బ్రారంభమైన కార్యక్రమమును బొంబాయిలో నంతిమ స్వరూపమునకుఁ దెచ్చెను. తరువాత జరిగినది భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో సమరఘట్టము. చూచీ చూడనట్టుగాఁగాని యేదో జరుగునని కార్యశూన్యత్వముతోఁగాని యుండుట గత 25 సంవత్సరములలో సర్దార్‌తత్త్వము కానేకాదు. భారతజాతీయ స్వాతంత్ర్యోద్యమమునకుఁ దత్క్షణస్వార్థలాభమునకు మధ్యఁ జిక్కుపడి యాయన యేనాఁడుకూడఁ దర్జనభర్జన పడలేదు. తాత్కాలికపు టేర్పాటులద్వారా ప్రజాస్వామిక స్వాతంత్ర్యము సిద్ధించఁగలదని కొందఱు తక్కువతరగతివారభిప్రాయ పడుచున్నకాలములో "క్విట్ ఇండియా" తీర్మానమును దృష్టిలోనుంచుకొని 1945 జూన్ 30 వ తేదీన సర్దా రిట్లు సింహగర్జన చేసినాఁడు.

"ఆ తీర్మానములో నొక్క యక్షరమును మార్చుటకు వీలులేదు. మభ్యపఱచుటకు వీలులేదు. దాని తరువాత నొక మెట్టనుచు నుండిన నది "క్విట్ ఆసియా."

కర్మవీరుని వాక్కులవి. భారత జాతీయ కాంగ్రెసు భావ్యధ్యక్షుని గర్జన యది. బార్డోలీలో, గుజరాత్‌లో, చారిత్రకప్రసిద్ధోద్యమములను నడిపి, తిరిగి చరిత్రలోఁ బ్రధాన ఘట్టమును రచించఁగల స్పష్టాభిభాషణ మది.

సర్దా రెప్పుడుకూడఁ గర్మవీరుడు. వాగడంబరుఁడు కాదు. ఆయన సృజించినది రెండే మాటలు - "క్విట్ ఆసియా" ఆ రెండు మాటలలోనే సర్దార్ పరిపూర్ణముగాఁ బ్రతిబింబించు చున్నాఁడు. భారతదేశమునకు, నాసియాకు నదే యాదేశము. నాయకుని యాదేశమైనది, స్వాతంత్ర్యవీరుల పురోగమనము ప్రారంభమైనది. జైహింద్ ! జై ఆసియా !" అని కర్మవీరుని ధీరతను జాటినారు శరత్ చంద్రబోసు.

"మనపెద్దరైతు"

బార్డోలీ కర్షకలోకము తమ నాయకుఁడైన వల్లభాయిని "సర్దార్ పటేల్" అని సంబోధించి గౌరవించిన పర్వదినమునాఁ డాధునికభారతకర్షకలోకములో నంతర్లీనమైయున్న విప్లవ శక్తికి గౌరవనీరాజనము సమర్పింపఁబడినది. ఇది - 1928లో. ఆ శుభవార్త రాఁగానే నే నెంతయానందించితినో మాటలతోఁ జెప్పలేను. ఆనాడు సర్దార్‌జికూడ నావలె నొక కర్షక మాత్రుఁడు. కాని యాధునిక కర్షకలోకముకూడ నొక యఖండప్రతిభావిలసితనాయకుని. దేశ రాజకీయరంగములోనికిఁ బంపఁగలదని, యా నాయకుఁడు బ్రిటిషుప్రభుత్వముతో ముఖాముఖిని బలాబలాలు చూడఁగలఁడని. విజయసిద్ధినందఁగలఁడని సర్దార్‌జీ ఋజువు చేసినాఁడు. కిసాన్ సర్దార్ నాగురుపీఠ మని భావించితిని. సర్దార్ సామ్రాజ్యవాద వ్యతిరేకామరభావమూర్తిగాఁ బ్రతి భారతీయ విప్లవకారునికిఁ గన్పించును. కిసాన్ విప్లవకారులలో నాయన మేటి. ఏవో స్వల్పప్రయోజనముల నిమిత్తముతోఁగాక, స్వార్థ కాంక్షాసిద్ధి నాశించికాక, ప్రజాబాహుళ్యసౌభాగ్యసిద్ధికై యధికారమును వాంఛించు కిసాన్ మనస్తత్వమును సర్దార్ తనలో మూర్తీభవింపఁ జేసుకోఁగలిగినాఁడు. వివిధ కాంగ్రెసు రాష్ట్రములలోను జరిగిన రైతుఋణబాధనివారణపు చట్టాలలో నాయన యాకాంక్ష ప్రతిబింబితమైనది. ప్రజాబాహుళ్యమును సేవించఁగోరు తనమార్గమునకు ధనికవర్గము లడ్డువచ్చుట జరుగఁగా భయరహితముగా వారి నెదిరించినాఁడు. కిసాన్ విప్లవకారులలో నాదిపురుషుఁడని మన మాయనను బ్రస్తుతించుచున్నా"మని ప్రశంసించినాఁ డాచార్యరంగా.

'గాంధీజీ వశంవదుఁడు'

"సర్దారు కాయన జన్మదినోత్సవ సందర్భములో నా హృదయపూర్వకాభివందనములు. ఆయన పరిచయభాగ్యము నాకు లభించినది. ఆధ్యాత్మికముగా నాయన గాంధిజీకి వశంవదుఁడు. నిర్మాణప్రతిభ యాయనలో మూర్తీభవించినది. భారతజాతీయోద్యమకృషిలో నత్యంతప్రధానపాత్రను నిర్వహించినాఁడు. భారత స్వాతంత్ర్యసమరములో నతిరథుఁ" డన్నా రాహారమంత్రి కె. యం. మున్షీ.

"మనసు బాగుగా లేకపోయిన దివ్యౌషధము పటేల్"

"సర్దార్ పటేల్ పరిచయ మొక మేటి భాగ్యము. చూపులకు వజ్రకఠోరుఁడు. మనస్సు నవనీతము. నిష్కపటి! మంచి చతురుఁడు! సంభాషణలో దిట్ట. బాపూజీకి (గాంధీజీకి) కొంచెము మనస్సు బాగుగా లేకపోయినప్పు డౌషధము - సర్దార్‌తో భేటీ!

జన్మతః ప్రజానాయకుఁడు. దరిద్ర ప్రజలలో నొకఁడ నని భావించు నుదాత్తచిత్తుఁడు!

"ఆయన సాహసము, నాయన పట్టుదల, యాయన చిత్తశుద్ధి, యాయన త్యాగనిరతి, యాయనవలె జీవించుటయే యాయనను, గౌరవించుట కుత్తమమార్గ" మని ప్రస్తుతించినది రాజకుమారి అమృతకౌర్.

డాక్టర్ పట్టాభిః-

"సర్దార్‌జీ! మీకు నా యభివందనములు. నేడు డెబ్బదవ సంవత్సరము పూర్తిచేసికొని హస్తసాముద్రిక ప్రోక్తజీవితమును బూర్తిచేసినారు. ఉపనిషత్తులు చెప్పు పూర్ణాయుస్సుకు (116 సంవత్సరములు) నింకను 46 యేండ్లు మీరు గడుపవలయును. సంపూర్ణారోగ్యముతో దేశసేవానిరతితో మీరు దానినిఁ బూర్తిచేయఁ గలుగుదురుగాక!

పండిట్ పంత్ః-

"సర్దార్‌పట్ల నా కశేషభక్తి. ఆయన యన్నచో నా కమితగౌరవము. ఆయన ధైర్యసాహసములకు, దృఢసంకల్పమునకు నమోవాకములు. స్వార్థరహిత జాతీయసేవకుఁడు."

యూసఫ్ మెహరాలీః-

ఆధునిక భారతదేశచరిత్రలో రాఁగల ప్రముఖులలో సర్దా రొకఁడు. దాదాభాయి, ఫిరోజషా, గోఖలే, తిలక్, మహమ్మదాలీ, చిత్తరంజన్ దాస్, ఆన్సారీలతోఁ దులతూఁగు కర్మవీరుఁడు.

"కాని యాయన గొప్పతనము వేరొకవిధమైనది. నిర్మాణశాలిగా ననన్యప్రతిభయే యాయనలోని విశిష్ట లక్షణము.

"మాటలోఁజేతలో నిష్కపటి. నిష్కర్ష తత్వముగలవాఁడని యాయనపేరు మన రాజకీయపదజాలములోనికి బ్రవేశించినది."

యస్. కె. పాటిల్ః-

"నిర్దుష్టమై, విశిష్టమైనవిధముగాఁ దక్షణమే నిర్ణయించ గల భారత రాజకీయవేత్త యెవరని యడిగిన నొక్క క్షణమైన నాలోచించకుండ నేను సర్దార్ పటేలని యందును.

"ప్రపంచ జ్ఞానములో నితరులకుఁ బైచేయి, నిష్కపటి, కర్మవీరుఁడు."