వల్లభాయి పటేల్/కర్మవీరుఁడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కర్మవీరుఁడు

కాంగ్రెసు మూల స్తంభములలో నాయన యొకఁడు. గాంధీజీతర్వాత కాంగ్రెసు విధాన నిర్ణేతలలో నగ్రస్థాన మాయనదే.

ఆయన పలుకే పెక్కుమందికి శాసనము. ఆయన యగ్నిగుండములో దూకుమన్నను వారు సంకోచించరు.

ఆయన యుపన్యసించిన నది సింహగర్జనమే. దేశభక్తుల నది యుత్సహింపఁ జేయును. విదేశీయ పరిపాలకుల నది కలవరపెట్టును.

సర్దార్‌వల్లభాయిపటేల్ నాయకత్వమున కింతటిప్రతిభ, యింతటి విశిష్టత యేవిధముగా వచ్చినవి ?

ఆయన నిష్కలంక దేశభక్తి యిందుకుఁ గారణమా? కాని దేశసేవానిరతిలో నాయనతో సమానులు కాఁగలవారు కూడ ననేకులు లేకపోలేదు.

కాగాఁ బాండిత్యములోఁ బ్రతిభలో ధీరశక్తిలో దూరదృష్టిలో నాయనతోఁ బోల్చదగినవారేమి, యాయన కంటె మిన్నలైనవారేమి, దేశములోఁ గొందరు లేకపోలేదు. అయినప్పుడు గాంధీజీతర్వాత దాదా వంతటి దేశ నాయకుఁడుగా నాయన యేవిధముగాఁ గాఁగలిగినాఁడను ప్రశ్న రాకపోదు.

ఇందుకుఁ బ్రత్యుత్తరము నొకే యొక పదములోఁ జెప్ప వచ్చును.

ఆపద మిది - స్థితప్రజ్ఞత

భగవద్గీతలో స్థితప్రజ్ఞునిగుఱించి - పూర్ణ మానవునిగుఱించి చెప్పఁబడిన నిర్వచనము సర్దార్ పటేల్‌కు దాదాపు పూర్తిగా వర్తించును.

ద్వంద్వముల కాయన చాలవఱ కతీతుఁడు. సుఖము వచ్చినప్పు డాయన యుప్పొంగిపోఁడు. కష్టము నెదుర్కొన్నప్పు డాయనక్రుంగిపోఁడు. విజయలబ్ధిలో నాయన గర్వీభూతుఁడు కాఁడు. పరాజయము తప్పక పోయినప్పుడాయన విహ్వలచిత్తుఁడు కాఁడు. సహచరుల, ననుయాయుల నాయన మనఃస్ఫూర్తిగాఁ బ్రేమించును. అయినను వారిపట్లఁ గఠినముగాఁ బ్రవర్తించుట తన విధ్యుక్తధర్మమైనప్పుడు కాఠిన్యమును వహించుట కాయన సంకోచించఁడు. ఆయనలోఁగల యాస్థితప్రజ్ఞుని లక్షణముల కాయన జీవితచరిత్రలోఁగల తార్కాణము లశేషము, అగణితము. ఒకనాఁడాయన యేదో యొక కోర్టులో నేదోయొక కేసులో వాదించుచున్నాఁడు. అప్పు డాయన సతీమణి పరమ పదించినట్టు వార్త చేరినది. ఒక్క త్రుటిపాటు - ఒకేత్రుటిపాటాయన మ్లానవదనుఁ డైనాఁడు. ఆవెనువెంటనే తా నా యతి ఘోరదుర్వార్తను విననట్టే తనవాదనను దిరిగి కొనసాగించినాఁడు. ఆ కేసులో గెలిచినాఁడుకూడ.

మరొకసారి యాయన శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చినది. "బాధతోఁగూడిన యాపరేషన్‌గనుక క్లోరోఫారము పుచ్చుకొనుఁడని డాక్ట రెంతోదూరము చెప్పిచూచినాఁడు. కాని యందుకు సర్దా రియ్యకొననే లేదు.

కె. యఫ్. నారిమ ననిన నాయన కెంతో ప్రేమ. నారిమన్‌కూడ నాయనపట్ల నెంతో భక్తిప్రేమలను బ్రదర్శించువాఁడు. "సర్దార్"అను బిరుదు కాయన తగినవాఁడని దానితో నాయనను బ్రప్రథమముగా సంబోధించినవాఁడుకూడ నారిమనే. అయినను నారిమన్‌పట్లఁ గాఠిన్యము వహించుట తన ధర్మమని తోచినప్పు డందు కాయన లవశేషముగానైన సంకోచించలేదు!

ఇట్టి వ్యక్తినిగాకపోయిన మరెవరిని మనము స్థితప్రజ్ఞుఁడని పేర్కొనఁగలము?

స్వధర్మనిర్వహణలో నిర్భీకత్వమును, నిశ్చలత్వమును బ్రదర్శించు కర్మవీరుఁడు గనుకనే సర్దార్‌పటేల్ పైకిఁ గర్కశుని వలెఁ గాన్పించవచ్చునుగాని యాయన మనస్సు వెన్నకంటే మెత్తనిది. ఆయనహృదయము చంద్రశిలకంటె స్నిగ్దమైనది.

ఆయన యీ విశిష్టతయే యాయనకు భారతదేశ రాజకీయరంగములో నేఁ డింతటి ప్రముఖస్థానమును సంపాదించినది. కాని రాజకీయరంగములోఁగంటెఁ బ్రజాసామాన్య హృదయములో నాయన కధికస్థానము కలదు.

ఆయన న్యాయవాదివృత్తిని జేసియుండవచ్చును. రాజకీయవేత్తగా రాణించవచ్చును. కాని తన తాతముత్తాతలవలె నాయన స్వభావసిద్ధముగా సామాన్య కర్షకుఁడు. సామాన్య గ్రామీణుఁడు. అందువల్లనే యాయన కర్షకులను గ్రామీణుల నర్థము చేసుకోఁగలఁడు. వారుకూడ నాయన నర్థము చేసుకోఁగలరు.

పండితనెహ్రూ "నా సన్నిహితుల బృందము మధ్యనే నే నేకాకి"నని చెప్పియున్నాఁడు. ఇది సర్దార్‌పటేల్ కణుమాత్రమైన వర్తించదు. ఆయన సామాన్య ప్రజల దృష్టిలో, ముఖ్యముగాఁ గర్షకుల దృష్టిలో - నన్ని సమస్యలను జూడఁ గలఁడు. వారిలో నొకఁడుగా, లీనమైపోగలఁడు. వారి కష్ట సుఖముల నాశ నిరాశలను బంచుకోగలఁడు.

ఇదే భారత కర్షకలోకము - ముఖ్యముగా గుజరాతీల కర్షకలోకముపై - నాయనకుఁగల ప్రాబల్యమునకుఁ గీలకము.

'సర్దార్ పటేల్‌'

[1]సందేహములులేవు; సంశయములులేవు. సంకోచములులేవు. డోలాందోళనలేదు. తనలక్ష్యములేవో తనకుఁ దెలియును. తనశక్తియుక్తులేవో తనకుఁదెలియును. తన బలప్రజ్ఞ లేవో తనకుఁదెలియును. సమయాసమయములు తెలియును. పట్టువిడుపులు తెలియును. అందుచేతనే సర్దారు వల్లభాయి పటేల్ లాలించవలసిన వారిని లాలించఁగలఁడు. బెదరించ వలసినవారిని బెదిరించఁగలఁడు. కీలెఱిగి వాతపెట్టఁగలఁడు. అదనుజూచి దెబ్బతీయఁగలఁడు.

ఆయన ప్రవృత్తిలో నావేశము తక్కువ. ఆలోచన యెక్కువ. కారుణ్యము తక్కువ, కాఠిన్యమెక్కువ. వైవిధ్యము తక్కువ, విస్పష్టత యెక్కువ.

ఆయన దృక్పథము సంకుచితమైనదే, కాని, దాని సరిహద్దులు నిర్దిష్టమైనవి. ఆయన లక్ష్యములు పరిమితమైనవే, కాని వానిసాధనలో నాయనప్రజ్ఞావిశేషము లపరిమితము.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకున్న సంస్కృతి యాయనకు లేదు. అయితే "నేనటు పాశ్చాత్యసంస్కృతికిఁ జెందిన వాఁడనుగాను. ఇటు ప్రాచ్యసంస్కృతికిఁ జెందినవాఁడనుగాను. ప్రాచ్యపాశ్చాత్య ప్రపంచములు రెండింటిలో దేనిలోను బూర్తిగా నిముడలేకపోవుచున్నా"నని నెహ్రూకుఁ బట్టిన బాధ యాయనకు లేదు. నెహ్రూ కున్న విశాలాశయములుగాని, విశిష్టలక్ష్యములుగాని యాయనకులేవు. అయితే "యెవరి జీవితమునకైన నైతికవిశ్వాసములు లంగరువంటివి. అట్టి లంగరునుండి నా సహచరులు నన్నీడ్చి వేయుచున్నారని తోఁచినప్పుడు నా మనస్సులోఁ బెద్దతుపానులు రేగినవి. అయినను నేను రాజీచేసి కొన్నాను. అది బహుశః తప్పే కావచ్చును. జీవితపు లంగరును విడిచిపుచ్చుట యే విధముగా నొప్పుగాఁగలఁదని" నెహ్రూ వలె బశ్చాత్తాపము చెందవలసిన యగత్య మాయనకులేదు.

నెహ్రూవలె నాయన చుక్కలలోకిఁ జూడ లేఁడు. అయితే నేలపై నడచుటలో నాయన యడుగులు తడఁబడవు.

నెహ్రూవలె నాయన కిట్టే కోపమురాదు. ఒకసారి కోపము కలిగించినవారిని సామాన్యముగా క్షమించ లేఁడు.

ఒక్కమాటలో నెహ్రూ స్వభావములోఁగల ద్వంద్వములు పటేల్ ప్రవృత్తిలో లేవు. తన కేమికావలయునో యాయనకుఁ దెలియును. దానినెట్లు సాధించవలెనో యాయనకుఁ దెలియును. ఒక్కపనిచేయఁ దలచుకొనిన మొగమోటములకుఁ దావీయఁడు. మెత్తదనమును జూపఁడు. మొఱటుగా నడచుకొనుటకైన వెనుదీయఁడు. ఎవరినైనఁ ద్రోసిపుచ్చగలఁడు. ఎంతకైనఁ దెగించగలఁడు. ఒక్కమాటలోఁ బటేల్ వాస్తవికవాది. వ్యవహారదక్షుఁడు.

ఇండియన్ యూనియన్ మంత్రులలో మరెవ్వరు సాగించ లేక పోయినంతటి కార్యక్రమమును పటేల్ సాగించ గలుగుటలోని రహస్యమిదే. దేశములో శాంతి భద్రతల రక్షణ కాయన యనుసరించిన పద్ధతులు మనకు నచ్చక పోవచ్చును. సంస్థానముల విషయములో నాయన యమలు జరిపిన విధానములు మనకు రుచించక పోవచ్చును.

ఇన్‌ఫర్‌మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖ పరిపాలన సందర్భములోనైన నాయన ధోరణిని మనము విమర్శించ వచ్చును. కాని యీ యన్నింటిలోఁ దానేమి చేయదలఁచు కొన్నాఁడో దాని నాయన నిక్కచ్చిగాఁ జేసినాఁడు. కేవల మటునుండి వఱకుకొని వచ్చినాఁడు.

అందువల్లనే యాయన భావములతో నేకీభవించలేక పోవుచున్నవారుకూడ నాయన భల్లూకపట్టును బ్రశింసింపవలసి వచ్చుచున్నది. ఆయన విధానములను విమర్శించుచున్న వారుకూడ నాయన కార్యకుశలతను గాదనలేక పోవుచున్నారు. ఆయన దేశమును దప్పుదారిని బెట్టుచున్నాడని నమ్ముచున్న వారుకూడ నాయన గుడినేకాక గుడిలోని లింగమునుగూడ మ్రింగఁగల పాటివాఁడని యొప్పుకోవలసి వచ్చుచున్నది.

ఆయనపట్ల మీకు భక్తి యుండవచ్చును. లేకపోవచ్చును. కాని యాయననుజూచి భయపడకతప్పదు. ఆయన కోరున దైనను మీ హృదయముకాదు. మీ విధేయతయే. ఆయనను మీరు ప్రేమించవచ్చును, ప్రేమించక పోవచ్చునుగాని యాయన రెండువైపులఁ బదనున్న కత్తిని బోలినవాఁడని గుర్తించక తప్పదు. ఆయన వాంఛించునదైన మీ ప్రశ----- తనవని చక్కఁబడుటయే. నేటి దేశనాయకులలోఁ గొందరి కెంతటి యున్నత భావములున్నను, నుత్తమలక్ష్యము లున్నను నీ వజ్రసంకల్పము లేదు. ఈ కార్యదక్షతలేదు. నేటి మన దేశపరిస్థితులనుబట్టి యన్నిటికంటె నెక్కువగాఁ గావలసినది వజ్రసంకల్పమే. కార్య దక్షతయే. కాఁబట్టి వీనిని ప్రదర్శించుచున్న పటేల్ నాయనను విద్వేషించువారుకూడ మెచ్చుకొనక తప్పనిసందర్భములు కొన్ని వచ్చుచున్నవి.

అట్టి యొక సందర్భమే "చర్చిల్ నోటికిఁ దాళమువేయించకపోయిన జాగ్రత్త సుమీ!" యని యట్లీ ప్రభుత్వమును హెచ్చరించుచు నాయన చేసిన ప్రకటన.

  1. ఆంధ్రప్రభ ప్రధాన వ్యాసమునుండి