Jump to content

వల్లభాయి పటేల్/బాధ్యతాయుత ప్రభుత్వము

వికీసోర్స్ నుండి

బాధ్యతాయుత ప్రభుత్వము

సంస్థానముల విషయములో బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన సందర్భములోఁ గేంద్రప్రభుత్వము చూపిన శ్రద్ధకు నైజాం విషయమే నిదర్శనము. మైసూర్, తిరువాన్కూర్ ప్రజాసమరములకు నైతికసహాయ మిచ్చినది. గ్వాలియర్, ఇండోర్, బరోడా, జోధపూర్, ఉదయపూర్, బికనీర్ సంస్థానము ల విషయములోఁ గేంద్రప్రభుత్వము తన యాశయమును సాధించినది.

చేరనన్న కాశ్మీర్ శరణన్నది. స్వతంత్రముగా నుండునన్న తిరువాన్కూర్ తిక్క కుదిరినది. తన ప్రత్యేకతను బ్రకటించుకొంద మనుకొన్న నైజాముకుఁ గోఱలుతీసిన పాముగతియే పట్టినది.

మైసూర్, జోధపూర్, జయపూర్ మొదలగు కొన్ని సంస్థానములు ఇండియన్ యూనియన్‌లోఁ జేరినప్పటికి స్వతంత్రముగా నుండుటకు నిశ్చయించుకొన్నవి.

564 సంస్థానములలో 544 ఇండియాలో నున్నవి. వీని మొత్తము పాకిస్థాన్ మొత్తముకంటె నధికము. అనగా 8,88,00,000.

పటేల్ సాధించినదంతయు మితవాదకార్యమే యని తలచెడివారు లేకపోలేదు. దానికి సమాధాన మాంధ్రప్రభ యిచ్చినది గమనింపదగినది. "నిజమున కిండియా స్వరాజ్యము పొందిన మఱుక్షణములో నందరు సంస్థానాధిపతులను బదవీభ్రష్టులను జేయవలసినది; రాష్ట్రములకు, సంస్థానములకు మధ్యగల యన్ని సరిహద్దు గీతలను చెఱిపి వేయవలసినది. అయితే యది విప్లవాత్మక చర్య. బ్రిటన్‌తో నొడంబడికద్వారా కాకుండ, జాతీయవిప్లవ ఫలితముగా స్వరాజ్యము సిద్ధించినట్లయిన బహుశః అంతే జరిగి యుండును.

"సంస్థానముల నొక్కసారిగా రద్దుపఱచివేయుట దుస్సాధమైన పరిస్థితి. సంస్థానములలో వారు ప్రస్తుత మవలంబించుచున్న విధానమే శరణ్యము.

"మనము కోరుచున్నంత త్వరగాఁ గాకపోయినను, గోరుచున్న రూపములోఁ గాకపోయినను - ఈ విధానము మొత్తముపై సత్ఫలితముల నిచ్చుచున్నది.

"ఈ విధానము దాదాపు 500 సంస్థానములను రెండేండ్లలోపల నయిదారింటికిఁ దగ్గించినది. అందువల్ల దీనిలోఁ గొన్ని లోపములున్నను నిది మొత్తముపై హర్షించఁ దగినట్టిదే కాఁగలదుగదా! సమ్మేళన విలీనీకరణ ద్వివిధ కార్యక్రమమును సంస్థానశాఖవా రనుసరించుచు వచ్చినారు. ఈకార్య క్రమములో రెండవభాగమే యుత్తమమైనట్టిది. సమ్మేళనద్వారా సంస్థానముల సమస్య తెగుటకుమాఱు క్రొత్తచిక్కులు కొన్ని యేర్పడుచున్నవికూడ. ఇందువల్లనే మధ్య యూనియనును విశాల రాజస్థాన్‌లోఁ జేర్చి వేయవలసి వచ్చినది. మధ్య భారత్‌ను సి.పి. యు.పి. లలో గలిపివేయవలయునా యని యాలోచించవలసివచ్చు చున్నది. ఏనాటికైన, మనము సాధించ వలసినది రాష్ట్రములకు - సంస్థానములకు రాజ్యాంగరీత్యా యేమి, యన్యరూపములలో నేమి, యెట్టి భేదములేకుండఁ జేయుటయే. (ఆంధ్రప్రభ. 1948 మే 31.)

జమీందార్లు, సంస్థానాధీశులు, బ్రిటిషువారిచే నిలుపఁ బడిన పరపీడకులు. వారున్నంతవరకు వీరుండిరి. వారితో వీరికి నంత్యమే. అయితే యాపని మనపరిస్థితుల ననుసరించి పటేల్ చేయుచున్నాఁడు.

ఇండియన్ యూనియన్ లో సంస్థానముల ప్రవేశ మను విజయమెట్టిదో భారతప్రభుత్వము ప్రకటించిన "వైట్ పేపరు" వల్ల విదితము కాఁగలదు.

"ఇండియన్ యూనియన్‌లో నిండియా సంస్థానములు ప్రవేశించుట యపూర్వసంఘటన. సంస్థానముల పూర్వచరిత్ర పరిశీలించిన దీని ప్రాముఖ్యము విదితమగును. కడచిన యేఁబది యేండ్లుగ సంస్థానములు బ్రిటిష్ భారతప్రజానాయకులకు మెట్టరాని కోటలుగాఁ గొఱుకరాని కొయ్యలుగ నుండినవి. సంస్థానములలో స్వాతంత్ర్య ప్రజాస్వామ్యోద్యమములు చొఱఁ జాలనట్టి యినుపకోటలు కట్టఁబడినవి. అభివృద్ధినిరోధకులకు, విధ్వంసకులకు, సంస్థానములు ఠావులై యుండెడివి. ఒకటి కాక పది రాజస్థానముల నిర్మాణమునకు సన్నాహములు జరిగినవి. విభజనవల్లను, సంస్థానముల మంకుపట్టువల్లను, భారత ప్రభుత్వ పతన మనివార్యమని పలువురు భావించిరి.

"రాజకీయస్వేచ్ఛయే యాదర్శముకాదు; అది ప్రజాభ్యుదయమునకు సాధనము మాత్రమే. సంస్థానప్రభుత్వము లకుఁగూడ నిదే యొఱవడి; ఇదే సంస్థానములకుఁ బరీక్ష. పెక్కుసంస్థానములు మున్నీ పరీక్షలో నెగ్గలేదు. నిరంకుశముగాఁ బ్రవర్తించెడివి; ప్రజల యోగ క్షేమములయెడ శ్రద్ధవహించెడివికావు. మధ్యయుగముల జమీందారీహయాము నడిపినవి. పలు సంస్థానములలోఁ బ్రధానప్రభుత్వ కార్యాలయముకాని, స్వతంత్రన్యాయస్థానముకాని, ముఖ్యములైన యితరకార్యాలయములుకాని లేవు. ప్రజల యోగక్షేమములకు సరియగు ప్రణాళికలే లేవు. ఈ లోపముల సవరించి నూతనపరిపాలనము నేర్పాటు చేయవలెను. నిరంకుశాధికారము రూపుమాసి బాధ్యాతాయుతప్రభుత్వము నెలకొనినప్పుడే పరిపాలనమున నూతనత్వము విలసిల్లును."

పటే లెన్నడో యీ సంస్థానములను నాశనము చేయుదునని శపథము చేసెను. ఆయన పలికిన పలుకు తప్పక నెఱవేర్చుకోగలిగినాఁడు.

బార్డోలీ సత్యాగ్రహోద్యమమును నడుపుచు పటేల్‌జీ యొకయుత్తరములో "బ్రిటీషు సామ్రాజ్యాంతమునేగాదు, స్వేదేశసంస్థాన రాజరికములనుగూడ నీ దేశమున నామరూప రహితము చేసితీరుదు"నని వ్రాసి ప్రత్యేకదూతద్వారా దానిని నాటి బొంబాయి గవర్నరుకు కందజేసెను.

ఆనాడు పల్కిన పలుకులను నే డక్షరాలఁ గార్యాచరణలోఁ బెట్టి పటేల్ మహితప్రతిజ్ఞాపాలకుఁ డైనాఁడు.

ప్రపంచము కని విని యెఱుఁగనిరీతిగా సంస్థానముల సమస్యను బరిష్కరించిన యీ ఘనత యాయన కొక కీర్తి కిరీటము. మనదేశము చక్రవర్తిక్షేత్రమనియు, నేకైక కేంద్ర ప్రభుత్వ పాలనమున నుండదగుననియుఁ, గౌటిల్యుఁడు నిర్వచించిన లక్షణము నేటికి సర్దారు పటేల్‌ద్వారా సార్థకమైనది.

అస్తమయము

              "కత్తి దొలుచును. ఒర క్షీణించును;
               శరీరము నశించును, ఆత్మ నశించదు."
                                                    -బైరన్.

వల్లభాయిపటేల్ గాంధీజీ యనుచరులలో నన్నిటఁ బెద్దవాఁడు. వార్ధక్యదశలో నిరంతరకార్యనిమగ్నుఁడై యుండుట చేత నాయన యారోగ్యము చెడెను. 1948 నుండి యాయన యనారోగ్యదశలోనేయుండెను. స్వాస్థ్యమునకై మాంటిసోరీలో నివసించుట యవసరమని వైద్యులు వచించిరి. అచట నుండఁగనే హైదరాబాదు కల్లోలము పెరుగుటచే విశ్రాంతి తీసికొనకయే యాయన మఱలఁ గార్యభారము వహించవలసివచ్చెను.

ఆయనకుఁ గార్యభారముతోపాటు వార్ధక్యముగూడ నధికమాయెను. ఆరోగ్యము క్షీణించెను. ఢిల్లీలో నాయనకు సుస్తీ ప్రారంభముకాఁగా, నక్కడి వాతావరణముకన్న బొంబాయి వాతావరణములో నాయన కారోగ్యము చేకూరు నను నాశతో వైద్యుల సలహామీద 1950 డిశంబరు 12 వ తేదీ విమానముమీఁద వచ్చెను. అప్పటినుండియు బిర్లాభవనములోనే యుండెను.