Jump to content

వల్లభాయి పటేల్/సమైక్య నవభారత నిర్మాత

వికీసోర్స్ నుండి

మున్నమాట వాస్తవమే. గాంధీమహాత్ముని యనుచరులలో నొకఁడనుగా దేశమునకు సేవచేయుటకు నేను దీసికొన్న దే యా స్థానము. నా కంతే చాలు."

ఇట్టిది వల్లభాయి మనఃప్రవృత్తి, మహాశయము. దీనిపై నింకను వ్యాఖ్యానమేల?

Politics mesns organised life of a nation - రాజకీయములనిన జాతియొక్క నియమబద్ధమైన జీవితము. అట్టి జీవిత మలవడినపుడే మన మభివృద్ధిఁ బొందఁగలము

సమైక్య నవభారత నిర్మాత

సంస్థానశాఖామాత్యుడుగా నుండి పటేల్ సాధించిన ఘనవిజయము భారత చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపఁ దగినది.

1947 ఆగస్టు 15 వ తేదీ బ్రిటిషు ప్రభుత్వమునకు స్వరాజ్య ప్రదానము చేసినమాట వాస్తవమే. కాని స్వరాజ్యము వచ్చినదని సంతోషము మినహా మనము ప్రాముకొన్నది యేమియు లేదు. దానికిఁ గారణము లనేక మున్నవి. స్వాతంత్ర్యానంతరము మన మనేకక్లిష్టసమస్యల నెదుర్కొనవలసి వచ్చినది. అందులో నధికభాగము బ్రిటిషువారి కుటిల తంత్రమువల్ల నేర్పడినవే.

దేశమును గృత్రిమముగా రెండుగాఁ జీల్చినందున మనము పొందిన నష్టమొకటి. దానిని దలఁదన్నినది సంస్థానముల స్వాతంత్ర్యము మఱియొకటి. పోవుచుఁబోవుచు బ్రిటిషు వారు స్వదేశసంస్థానములమీఁద బ్రిటిషురాజులకుఁ గల సార్వభౌమాధికారము రద్దయినదన్నారు. ఇంతేగాక ప్రతి సంస్థానము నొక స్వతంత్రరాజ్యముగా నేర్పడు హక్కు వానికి లభించుననికూడ సూత్రప్రాయముగా సూచించినారు. దీనివల్ల భారతదేశ మిండియా, పాకిస్థాన్‌లు, రెండుగానేగాక యాఱువందలు ముక్కలుగా విభాగమైపోఁగల ప్రమాద మేర్పడినది. భారతదేశమునకు స్వాతంత్ర్య మిచ్చు చుంటిమని చెప్పి బ్రిటిషువారు దేశమును ముక్కలు చేసి కల్లోలమునకుఁ గారకులైనారు. ఈ నింద తమ నెత్తిపైఁ బడకుండ సంస్థానములు సూత్రప్రాయముగా స్వతంత్రరాజ్యములైనను వాని స్వాతంత్ర్యమును దాము గుర్తించమని యేదో యొక యధినివేశములోఁ జేరిపోవలసినదే నని యనిరి. కాని నిజమున కిది వారు మన స్వాతంత్ర్యమునకుఁ గలిగించిన గొప్ప ముప్పు. ఒక్క మాటలో వచింపవలెన్న వారు వచ్చిన స్థితిలో భారతదేశమును బెట్టి వెళ్ళిరి.

1946 సెప్టెంబరు 2 వ తేదీనుండి కేంద్రములో జాతీయ ప్రభుత్వ మున్నప్పటికిని బ్రత్యేకముగా సంస్థాన సమస్యలు పరిష్కరించుటకు 1947 జులై 5 వ తేదీని సర్దార్ పటేల్ క్రింద సంస్థానశాఖ యొకటి యేర్పడినది. కాని బ్రిటిషువారు స్వదేశ సంస్థానముల విషయమై చేసిన ద్వైధీభావ ప్రకటన వల్ల వచ్చిన స్వరాజ్యము దక్కునా యని యనుమానము కలిగినది.

ప్రతి సంస్థానము తనకు సమీపములో నున్న యధినివేశముతో నొడంబడిక చేసికొనుట మంచిదని బ్రిటిషు ప్రభు త్వమువారు, గవర్నర్ జనరల్ మౌంట్‌బాటెన్ హెచ్చరించినారు.

సర్దార్‌పటేలు మౌంట్‌బాటెనులు సంస్థానాధిపతులతోఁ జేసినమాలోచనల ఫలితముగా సంస్థానప్రభువు లధికముగా ఇండియన్ యూనియన్‌తో నొడంబడికఁ జేసికొనిరి. కాని కొన్ని తలతిక్క సంస్థానములు లేకపోలేదు. తిరువాన్కూర్ సంస్థానము తాను స్వతంత్రముగా నుందునని ప్రకటించినది. నైజాము తన రాజ్యపరిస్థితి ప్రత్యేకమైనదని, యందువల్ల దాను ఇండియన్ యూనియన్‌లోఁ గాని పాకిస్థాన్‌లోఁగాని చేరఁజాలనని, యయినప్పటికి నిండియారక్షణ కవసరమైన సహాయము చేయుదునని స్వాతిశయముగాఁ బ్రకటించినాఁడు.

గుజరాతులోనున్న జునాగడ్ నవాబు తాను జేరవలసిన యిండియన్ యూనియన్‌లోఁ జేరక మతాభిమానముతోఁ బాకిస్థాన్‌లోఁ గలిసినాఁడు. ప్రజలు దీని కిష్టపడక నవాబును ద్రోసిరాజు చేసి, తాము స్వతంత్రమును బ్రకటించినారు. అక్కడ నొక కల్లోలము బయలు దేరినది.

తూర్పు పాకిస్థాన్ (తూర్పు బెంగాల్) తూర్పుసరిహద్దున నున్న త్రిపురస్టేటులోఁ బాకిస్థానుగుండాలు చేరి యల్లకల్లోల మారంభించగా నిండియన్ యూనియన్ సహాయము నర్థించగా నక్కడకు సైన్యమును బంపించి శాంతి నెలకొల్పుట జరిగినది.

కాశ్మీర్ తా నే యధినివేశములోను జేరనని ప్రకటించినది. అంతట పాకిస్థాన్ ప్రభుత్వము కొండజాతులను బురికొల్పఁగా వారు గ్రామాలకు గ్రామాలను దోచుకొని పోవుటే గాక కాశ్మీర్‌నుగూడఁ గబళింపఁ బ్రయత్నించఁ గాశ్మీర మిండియన్ యూనియన్ సహాయము కోరుటచే సైన్యాల నక్కడకుఁబంపి పాకిస్థాన్ సైనికులతోను, గొండజాతుల వారితోను, బోరాడవలసి వచ్చినది.

హైదరాబాదు నైజాము నసమర్థతవల్లఁ గాశీంరజ్వీ యనునతఁడు రజాకార్లను దోపిడిమూఁకకు నాయకుఁడై హిందువుల ధనమానప్రాణములు హరించుచుండఁగా బ్రజాశాంతి రక్షణకొఱకు నైజాముపైఁ బోలీసుచర్యలు తీసికొని మిలిటరీ గవర్నరు నధికారముక్రింద హైదరాబాదు నుంచుట జరిగినది. సంస్థానప్రభువు లను మత్తగజేంద్రములకుఁ బటేలువంటి యంకుశము లేకపోయిన వీరినిఁ బట్టపగ్గా లుండెడివికావు.

వల్లభాయిపటేల్ తన రాజకీయధురంధరత్వమువల్ల స్వదేశ సంస్థానములన్నిటిని భారత సమాఖ్యక్రిందకుఁదెచ్చెను.

ఆయన చతుస్సూత్ర ప్రణాళిక నొకదాని నేర్పాటు చేసెను. అదేదన, నా యా సంస్థానములు కొన్ని చేరి యొకకూటమిగా నేర్పడుటయో, లేక పరిసరరాష్ట్రాలలో లీనమైపోవుటయో, లేక కేంద్రప్రభుత్వమున కధికారమును దత్తత చేయుటయో, సంస్థానములలో బాధ్యతాయుతప్రభుత్వమును నెలకొల్పుటయో, యైయున్నది.

విలీనీకరణము

చిన్నచిన్న సంస్థానములలోఁ బరిపాలన భారత స్వాతంత్ర్య సంపాదనానంతరము కొనసాగించుటకు దుర్ఘటమైనది. వల్లభాయి యీ సమస్య నొక్క సంవర్సరములోగా రెండు విధములఁ బరిష్కరించెను. మొదటిది విలీనీకరణము. రెండవది సమ్మేళనము. విలీనీకరణము ననుసరించి పరిసర రాష్ట్రములలోఁ జేర్చివేయబడినవి.

50 లక్షలు జనసంఖ్యగల సంస్థానములు ఒరిస్సా రాష్ట్రములోఁ బ్రప్రథమముగా 1948 జనవరి 1 వ తేదీనఁ గలిపివేయఁబడినవి.

14 సంస్థానములు మధ్యరాష్ట్రములో 1948 జనవరి 1 వ తేదీన జేర్చబడినవి.

మద్రాసు రాష్ట్రములోని బనగనపల్లి, పుదుక్కోట, సాందూర్ సంస్థానములుకూడ మద్రాసు రాష్ట్రములోఁ గలిపివేయబడినవి.

దక్కనులోని 17 సంస్థానములు 1948 మార్చి 8 వ తేదీన బొంబాయి రాష్ట్రములోఁ గలసిపోయినవి

1948 మే 18 వ తేదీన 3 సంస్థానములు బీహారు రాష్ట్రములో గలిసిపోయెను.

1948 జూన్ 10 వ తేదీన గుజరాతు సంస్థానము లను పేరుగల 157 సంస్థానములు బొంబాయిరాష్ట్రములోఁ గలిసి పోయినవి. బరోడా కొల్హాపూరువంటి గొప్ప సంస్థానములు కూడ బొంబాయి రాష్ట్రములో లీనమైనవి.

ఈ విధముగాఁ గొన్ని చిన్న సంస్థానములను బరిసర రాష్ట్రములలోఁ గలుపుట జరిగెను.

సమ్మేళనము

కొంచెము పెద్ద సంస్థానముల సమస్యకు మఱియొక పరిష్కారము. అనగా సంస్థానముల నొక కూటమిగా నేర్పఱచుట. కూటమిగఁజేరిన యీ సంస్థానముల పరిపాలన కొక కేంద్రప్రభుత్వ ముండును. పెద్ద హోదాగల సంస్థానాధీశు లొక మండలిగ నేర్పడి యైదుగురు సభ్యులుగల యొక యధిపతి మండలి నెన్నుకొందురు. దాని కొక యధ్యక్షోపాధ్యక్షు లుందురు. రాజ్యపరిపాలన విషయమున నధిపతిమండలి యధ్యక్షుని మంత్రాంగమునకు మంత్రివర్గ మెన్నుకోఁ బడును. ప్రతి సంస్థానాధిపతి తన రాజరికము నధ్యక్షుని కప్పజెప్పవలెను. ఆ యధ్యక్షునికి "రాజప్రముఖ్" అని హోదా యుండును.

ఈ నియమముల ప్రకారము నైసర్గిక, సాంఘిక, భాషా, వైజ్ఞానిక సన్నిహితత్వములుగల పెక్కు సంస్థానములు సమ్మేళనములుగ రూపొందినవి.

217 సంస్థానములు జాగీర్లు కలసి సౌరాష్ట్రముగ నేర్పడినవి. దీనినే కథియవా డందురు. 1948 ఫిబ్రవరి 1 వ తారీఖున నీ సమ్మేళన మేర్పడెను. దీనికి నవనగర్ మహారాజు రాజప్రముఖ్.

ఆల్వార్, భరత్‌పూర్, ధోల్పూర్, కరవోలీ యీ నాలుగు సంస్థానములతో మత్స్య రాజ్య మేర్పడెను. ధోల్పూర్ మహారాజు రాజప్రముఖుఁడు.

బుందేల్‌ఖండ్, బగేల్‌ఖండ్, 35 సంస్థానములతో వింధ్యప్రదేశ్ సమ్మేళన మేర్పడెను. దీనికి దివామహారాజు రాజప్రముఖుఁడు.

విశాలరాజస్థాన్ పేరుతో 14 రాజపుత్రస్థాన సంస్థానములు కూటమిగా నేర్పడెను. ఉదయపూర్ మహారాజు రాజప్రముఖుఁడు.

'మధ్యబారత్‌' అను 22 మాలవసంస్థానములతో నొక సమ్మేళన మేర్పడెను. దీనికి రాజప్రముఖ్ గ్వాలియర్ మహారాజు.

పాటియాలాతోపాటు తొమ్మిది సంస్థానములు కలిసి 'వూల్కియా' సమ్మేళన మేర్పడెను. పాటియాలా మహారాజు దీనికి రాజప్రముఖుఁడు.

ఆఖరుగా 1949 జూన్ 1 వ తేదీని కేరళ యూనియనేర్పడినది. ఇందులోఁ దిరువాన్కూర్, కొచ్చిన్ సంస్థానములు కలవు. దీనికి రాజప్రముఖ్ తిరువాన్కూర్ మహారాజు.

కేంద్రప్రభుత్వము దత్తము చేసికొన్నవి.

కచ్చి సంస్థానము బొంబాయి రాష్ట్రమున కుత్తరముగా పాకిస్థాన్, సరిహద్దులలో నుండుటచేత చీఫ్ కమీషనర్ రాష్ట్రముగా నేర్పడినది.

తూర్పు పంజాబులోని 21 సంస్థానములు హిమాచల ప్రదేశ్ అను పేరుతోఁ గేంద్రప్రభుత్వములోఁ జేరినవి.

భోపాల్, నేపాల్ సంస్థానములుకూడఁ గేంద్రప్రభుత్వములోఁ జేరినవి.