Jump to content

వల్లభాయి పటేల్/అస్తమయము

వికీసోర్స్ నుండి

మనదేశము చక్రవర్తిక్షేత్రమనియు, నేకైక కేంద్ర ప్రభుత్వ పాలనమున నుండదగుననియుఁ, గౌటిల్యుఁడు నిర్వచించిన లక్షణము నేటికి సర్దారు పటేల్‌ద్వారా సార్థకమైనది.

అస్తమయము

              "కత్తి దొలుచును. ఒర క్షీణించును;
               శరీరము నశించును, ఆత్మ నశించదు."
                                                    -బైరన్.

వల్లభాయిపటేల్ గాంధీజీ యనుచరులలో నన్నిటఁ బెద్దవాఁడు. వార్ధక్యదశలో నిరంతరకార్యనిమగ్నుఁడై యుండుట చేత నాయన యారోగ్యము చెడెను. 1948 నుండి యాయన యనారోగ్యదశలోనేయుండెను. స్వాస్థ్యమునకై మాంటిసోరీలో నివసించుట యవసరమని వైద్యులు వచించిరి. అచట నుండఁగనే హైదరాబాదు కల్లోలము పెరుగుటచే విశ్రాంతి తీసికొనకయే యాయన మఱలఁ గార్యభారము వహించవలసివచ్చెను.

ఆయనకుఁ గార్యభారముతోపాటు వార్ధక్యముగూడ నధికమాయెను. ఆరోగ్యము క్షీణించెను. ఢిల్లీలో నాయనకు సుస్తీ ప్రారంభముకాఁగా, నక్కడి వాతావరణముకన్న బొంబాయి వాతావరణములో నాయన కారోగ్యము చేకూరు నను నాశతో వైద్యుల సలహామీద 1950 డిశంబరు 12 వ తేదీ విమానముమీఁద వచ్చెను. అప్పటినుండియు బిర్లాభవనములోనే యుండెను. బొంబాయికిరాఁగానే యీవాతావరణములో నాయన కొంచెము తేరుకొన్నట్లే కనుపించెను. కాని 13 బుధవారము రాత్రి పొత్తికడుపులో బాధ యెక్కు వయ్యెను. 15 వ తేదీ శుక్రవారము తెల్లవారుజామున 3 గంటలకల్ల నాయన హృదయగతికి నరోధము కల్గెను. వైద్యులువచ్చి పెక్కు చికిత్సలుచేసిరి. ఉదయము 8 గంటల కాయనకుఁ గొంచెము స్పృహవచ్చెను. ఆ స్పృహ తుదివఱకు నుండెను. ఆయన కుమార్తె మణిబెన్, కుమారుఁడు దయాభాయిపటే లాయనకు సర్వసపర్యలు చేయుచుండఁగా, సరిగా 9 గంటల 37 నిమిషములకు బార్డోలీ సత్యాగ్రహ సమరసేనుని, స్వతంత్ర భారతరథ చోదకుఁడు, సమైక్య నవభారతనిర్మాత, మన సచివుఁడు, సోదరుఁడు, సర్దా రస్తమించెను.

ఈ సంగతి వల్లభాయి ప్రైవేటుకార్యదర్శియగు శంకర్, ప్రధాని పండిట్ నెహ్రూకుఁ, బ్రెసిడెంటుకుఁ, దదితరమంత్రులకు బొంబాయిలోని మంత్రులకు టెలిఫోన్ చేసినాఁడు.

ఈ సంతాపవార్త వినినంతనే బొంబాయిమంత్రులు సర్దార్ భవనము చేరిరి.

వేలాది స్త్రీ పురుషులు సర్దారును దుది దర్శనముచేసి విలపించసాగిరి. బిర్లా భవనమంతయు జనారణ్యమైయుండెను. ఢిల్లీనుండి సాయంకాలము 4 గంటలకుఁ బ్రెసిడెంటుప్రసాద్, ప్రధాని నెహ్రూ, తదితరాధికారానధికారప్రముఖులు వచ్చిన యనంతరము వల్లభాయి యంత్యక్రియలు ప్రభుత్వలాంఛనములతో నాయన యగ్రజుఁడు విఠలభాయి పటేల్‌కు జరిగిన సోనేపూరు శ్మశానములో జరిగెను. వల్లభాయి నిర్యాణమునకు భారతదేశమంతయు దుఃఖ సముద్రములో మునిగెను. తండ్రితోపాటు సోదరునిగూడఁ గోల్పోయితిమని ప్రముఖనాయకులేగాక ప్రజలందరుకూడ విలపించిరి.

భారతదేశమందేగాక ప్రపంచము నలుదిశలనుండి యా మహాబాహువు మరణమునకు విచారసూచనలు వెలువడెను.

నెహ్రూ-పటేల్

పొట్టునుండి పప్పును వేఱుచేయుటలో వల్లభభాయి కత్యద్భుతమైన సామర్థ్యమున్నది. జవహర్లాలువలె, నావలె నతఁడు భావనా స్వప్నప్రపంచములోఁ దిరుగువాఁడుకాదు. ధీరత్వ విషయములో నతనితో సమాను లుండిన నుండవచ్చును గాని, మించినవారుమాత్ర ముండరు. స్థిరసంకల్పుఁడు ఏవిషయములోనైన నొక నిశ్చయమునకు వచ్చిన నంతే; దానికిఁ దిరుగులేదు. ప్రజాసేవయే యతని నిత్యైకసాధన. దేనికయిన లక్షణనిరూపణచేయుటకు జవహర్లాలు; ఆ లక్షణముల ననుసరించి కార్యక్రమ నిర్ణయము చేయుటకుఁ బటేలు. కాఁబట్టి జవహర్లాలు నడిగి లక్షణములు తెలిసికొనుఁడు, పటేలు నడిగి క్రియాకలాపము గ్రహించుఁడు.

-మహాత్ముఁడు

స్వతంత్ర భారతీయతకుఁ బ్రపంచ మెఱిఁగిన బాహ్య చిహ్నము పండిట్ నెహ్రూ; అంతశ్శక్తి పటేల్.