వరవిక్రయము/షష్ఠాంకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

షష్ఠాంకము

మొదటి రంగము

(ప్రదేశము: లింగరాజుగారి వ్యాపారపు గది.)లింగ:-(బల్లకడఁ గూరుచుండి ప్రవేశించి) ఈ క్రొత్తగింజల దినములలోఁ గోమట్లు బదుళ్ళకొఱకుఁ గొంపచుట్టుఁ దిరిగెడివారు. ఈ యేఁ డింతవఱకు వచ్చి యడిగినవారే లేరు!

గీ.ఆస్తి కలిగి తీఱుప లేని - యప్పె యప్పు, నూఱు గొని వేయికై వ్రాయు - నోటె నోటు, పసిడి తాకట్టుపైనిచ్చు - బదులె బదులు, రోజువడ్డీలు వచ్చిన - రోజె రోజు.

ఘంట:-(వచ్చి) బాబూ! బట్టలు కొనుక్కుంటాను. జీతమిస్తారా?

లింగ:-నీ బట్టలు పాడు గాను! ఎందుకురా బట్టలు! గాంధి మహాత్మునిఁ జూడరాదా, గావంచా కట్టుకొని తిరుగుచున్నాఁడు.

ఘంట:-గాంధిగార్ని మెచ్చుకుంటారు గదా, ఖద్దరు కట్టరేం మీరు?

లింగ:-ఆవిషయములో, ఆయనకు మతి లేదురా! కట్టు కట్టు మనుటయే కాని, ఖరీదు తగ్గే సాధనము చూచినాఁడు కాఁడు.

ఘంట:-మీకున్న మతి ఆయనకు లేదు గాని నాజీతం మాటేమిటి?

లింగ:-ఆనక చెప్పెదఁ గాని అమ్మగా రేమి చేయుచున్నది?

ఘంట:-గదిలో కూర్చుండి కథలు చదువుకుంటున్నారు.

లింగ:-నిన్నా వైపునకు వెళ్ళవద్దంటిని గదా యెందులకు వెళ్ళినావు?

ఘంట:-బాగానే వుంది! యేవైపూ వెళ్ళక యెల్లాగండీ? ఆవైపుకు వెళ్ళితే అమ్మగార్ని కొరుక్కుతినేస్తానా? (అని నిష్క్రమించును.)

లింగ:-పెంకికుంక! పెడేలున నెంతమా టన్నాఁడో! అయినను, వాని ననవలసిన పనిలేదు! ఈడు కడచినవెనుకఁ బెండ్లి యాడిన బుద్ధిహీనుల కిట్టి చెప్పుదెబ్బలు తఱచుగా తగులుచునే యుండును!

  సీ.ప్రాయఁ ముడిగి, యేండ్లు - పైఁ బడ్డ తరి, భ్రాంతిఁ
    జెంది రెండవపెండ్లి - చేసికొనుట
  ఆస్తి దాయాదుల - కగు ననుచింతచేఁ
    బెరవారి బిడ్డను - బెంచుకొనుట
  క్రొత్తలోఁ జూపు మ-క్కువ లెల్ల మది నమ్మి
    అత్తవారింటను - హత్తుకొనుట
  అప్పులవారిని - దప్పించుకొన సొత్తు
    లితరులపేర వ్రా-యించి యిడుట
  పుడమి, నీ నాలుగుఁ జాల - బుద్ధిమాలి
  నట్టి పను లని పల్కుదు - రార్యులెల్ల
  రందు, మూడవ పెండిలి - యాడినట్టి
  బడుగునగు నన్నుఁ గూఱిచి - పలుకనేల?

బస:-(పత్రిక చేతఁ బట్టుకొని ప్రవేశించి) నాన్నా! ఆ సంగతి పత్రికలోఁగూడ పడినది సుమా!

లింగ:-ఏ సంగతి?

బస:-ఆపిల్ల బావిలోపడి చచ్చిన సంగతి. నాక్లాసు పిల్లలందఱు నిది చదివి, నన్నుఁ గాకులవలెఁ బొడుచుకొని తినుచున్నారు! పాడు కట్నము కొఱకు నీవెందుల కంత ప్రాకులాడవలెను నాన్నా?

లింగ:-ఓరి దామోదరుఁడా సర్వము విడిచిపెట్టిన గాంధికి స్వరాజ్యము కొఱ కంత ప్రాకులాట యెందులకురా?

బస:-ఆయన ప్రాకులాట యంతయు నాయన కొఱకా?

లింగ:-నా ప్రాకులాట మాత్రము నాకొఱకా? నీ తెలివి తెల్లవారి నట్లే యున్నది. కాని ఏది యేమి యేడ్చినాఁడో చదువు!

బస:-(చదువును) "మాపురమునందలి పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారి కుమార్తెను లుబ్ధాగ్రేసర చక్రవర్తి యగు సింగరాజు లింగరాజుగారు తనకుమారునకుఁ జేసుకొనుటకై, అయిదువేల అయిదువందల రూపాయల కట్నము విధించి, యాసొమ్ము, కార్యమునకు ముందే కాఁజేసిరి! కట్నపుఁ బెండ్లియెడ నిష్టము లేక కాళింది యను నాచిన్నది తల్లిదండ్రుల కొక యుత్తరమువ్రాసి తన బల్లపైనుంచి బావిలోపడి ప్రాణములు విడిచెను! ఆ యుత్తరమునం దున్నమాట లివి-

  'నా ప్రియమైన తల్లిదండ్రులారా! నమస్కారములు! కట్నమిచ్చి తెచ్చిన వరునిచేఁ, గళ్యాణసూత్రము కట్టించుకొనుట గౌరవహీనమనియు - నా వివాహమునకై మీరు సర్వస్వము సమర్పించుట నా క్షేమమునకును, మీ సౌఖ్యమునకును గూడ భంగకరమనియు భావించి - ఈ రెంటియొక్కయు నివారణమునకై నేనీ లోకమును విడిచిపోవ నిశ్చయించుకొని యీ జాబువ్రాసి యిచ్చటినుంచి యనుజ్ఞ తీసికొనుచున్నాను. అమ్మకాని, మీరుకాని, నాకై అణుమాత్రమును జింతింప వలదని ప్రార్థించుచున్నాను. మీ యిరువురుకును బునః ప్రణామములు. చెల్లెలికి ముద్దులు!
  ఇట్లు విన్నవించు మీ యనుంగు పుత్త్రిక - కాళింది'

ఒక పౌరుఁడు"

లింగ:-(ఆగ్రహముతో) ఈ పౌరుఁ డెవ్వడో తెలిసికొని పరువు నష్టముక్రిందఁ బదివేలకు దావా పడవేయ వలసినదే! ఈ లుల్లిగానికి నేను లుబ్ధాగ్రేసర చక్రవర్తి నఁట. ఏమి పొగరు.

పేర:-(అంతలోఁ బ్రవేశించి) అంతమాట మి మ్మనగలవా డెవఁడు?

బస:-(లేచి చక్కఁబోవును.)

లింగ:-రావోయి పేరయ్యా రా! ఏమిటి విశేషాలు?

పేర:-(కూర్చుండి) ఏం చెప్పను? భ్రమరాంబగారి దుఃఖం పట్టలేకున్నాం.

లింగ:-అది సరేకాని ఆ చచ్చిన దెష్ట, ఆముడి కాసింతయు పడిన తరువాత నైన జచ్చినదికా దేమోయి?

పేర:-అవు నవును. అలా జరిగితే యీభూమీ దక్కి, యీ అయిదు వేలూ దక్కి యీపాటి కింకో అయిదువేలకు బేరం తగిలేది.

లింగ:-అదిగో అదే నాకు పట్టుకొన్న బాధ! చావునకేమి యెప్పుడైనఁ జావవలసినదే. రవంత సందర్భానుసారముగఁ జచ్చిన బాగుండెడిది! సరికాని యీసొమ్ముమాట యేమయిన వచ్చినదా?

పేర:-ఎందుకు రాదూ? ఆసొమ్ముకోసమే నేనిపుడు వచ్చింది.

లింగ:-అలాగుననా? అయితే, ఆసొమ్మంత మీఁదమీఁద నున్నదా? నేనెంత ప్రయత్నము చేసినానో యెంతైనదో యెఱుఁగుదువా?

పేర:-ఆ నష్టం మినహాయించుకుని మిగతసొమ్మే యివ్వండి!

లింగ:-ఇవ్వని యెడల?

పేర:-దావా చేస్తాడు.

లింగ:-సాక్ష్యము?

పేర:-మీ రసీదులే!

లింగ:-పేరయ్యా! నేనంత పెయ్యమ్మనా? నా దస్తూరీవలె వ్రాయలేదు. నా సంతకమువలె చేయలేదు, నన్నా రసీదు లేమి చేయును?

పేర:-(తనలో) ఆరిముండాకొడకా! అయిదువేలూ మింగివెయ్యాలనేనా కావోసు! (పయికి) అంత పనొస్తే మేమందరం లేమూ?

లింగ:-అందఱ మాటయు నావల చూతము గాని ముందు నీమాట చెప్పు. నీ యైదువందలు మరల క్రక్కుట నీకిష్టమేనా?

పేర:-కార్యం తప్పి వచ్చినప్పుడు కక్కకేం చేస్తాం?

లింగ:-ఇదిగో యిదే వైదికము! ఈమాట నియోగియైన వాఁడనునా?

పేర:-అదుగో ఆమాటమాత్రం నే నంగీకరించను. మావాళ్ళిప్పుడు మీవాళ్ళ నమాంతంగా మింగేసేవాళ్ళయినారు. మీవాళ్ళు మీసాలమీద నిమ్మకాయలు నిలబెడితే, మావాళ్ళు మామిడికాయలు నిలవబెడుతున్నారు! మీవాళ్ళు జుట్టుమానేస్తే మావాళ్ళు బొట్టుకూడా మానేశారు! మీవాళ్ళు మూరెడుగోచీ పెడితే మావాళ్ళు బారెడు గోచీ పెడుతున్నారు! మీవాళ్ళు వేలెడుచుట్ట కాలిస్తే మావాళ్ళు జానెడుచుట్ట కాలుస్తున్నారు! మీవాళ్ళు కాఫీహొటేళ్ళకుపోతే మావాళ్ళు రెపరేషుమెంటు రూములకు పోతున్నారు! విన్నారా? యిన్నిమాట లెందుకూ ఇప్పుడు మీరన్న మాటల్లో యేం నియ్యోగముంది? ఆనక కోర్టుమాట ఆలోచింతాం యీ సంగతి పైకివస్తే పదిమందీ మిమ్మల్ని బ్రతుకనిస్తారా? ఈ రోజుల్లో యింతచప్పని ఆలోచన మేము చేస్తామా!

లింగ:-అట్టయిన, నీ కమ్మని యాలోచన యేమో కాసింత చెప్పుము.

పేర:-అదిగో అల్లా అడగండి! ఆ సొమ్మూ, ఆ భూమీ దక్కించు కోవాలంటే ఆ రెండోపిల్ల నెల్లాగయినా చేసుకోవడమే సాధనము. మఱి యేదారి త్రొక్కినా మర్యాద పోకమానదు.

లింగ:-అందుల కాయన యంగీకరించుట లేదని విన్నానే?

పేర:-అది నిజమే. అయినా, నన్ను ప్రయత్నం చెయ్యమంటే చేస్తాను.

లింగ:-ప్రయత్నము చేయుటకాదు, పనియే చేసికొని రావలయును.

పేర:-సరే నాశక్తి యావత్తూ ధారపోస్తాను. శలవు. (నిష్క్రమించును.)

లింగ:-ఇంటను బయటను గూడ నల్లరి పడుటకన్న నిదే మంచిపని! పోయెనా దానితోపాటుగ నిదికూడ పోనేపోవును. లేదా అది యున్నది నే నున్నాను.

(తెర పడును.)


షష్ఠాంకము - రెండవ రంగము


(ప్రదేశము: పురుషోత్తమరావుగారి కచేరి చావడి.)

(ప్రవేశము: క్రిందఁ గూర్చుండి యొకవంక పురుషోత్తమరావుగారు, పేరయ్య, మఱియొక వంక కమలను ముం దిడుకొని భ్రమరాంబ.)

పురు:-చివరకుఁ దేలిన యంశ మేమి? పేర:-ఏం తేలిం దని మనవి చేయను? మీరు నానుకోవాపరేటర్లనీ కోర్టుకు వెళ్లరని ఆయనకు బాగా తెలుసును. అందుచేత అంత మొండికెత్తి కూర్చున్నాఁడు.పురు:-అందుల కిప్పుడు మన మాచరింపవలసిన పని యేమిటి?

పేర:-నేనేం మనవి చెయ్యను? కోటివరహాలు పోయినా మీరు కోర్టుకు వెళ్ళడం ధర్మం కాదు. అకారణంగా అంతసొమ్ము పోగొట్టుకోవడం అంతకన్నా ధర్మంకాదు. ఈచిక్కు లన్నీ ఆలోచించే చిన్నమ్మాయి నా చిన్నవాడికే యిస్తే తీరిపోతుందని మనవి చేశాను.

పురు:-అయిదువేల యైదువందలు నా బ్రాహ్మణుఁడు హరించినను సరియే కాని, యిఁక నాయనతో సంబంధము నాకిష్టము లేదు!

  చ.పరువుఁ బ్రతిష్టయుం గనక, - పాపభయం బను మాటలేక యి
  క్కరణి ధనంబె జీవితము-గాఁ దలపోసెడు వానితోడఁ జు
  ట్టరికముచేసి, నిత్య మ-కటా! యని చింతిలు కంటె; గౌరవా
  దరపరు లౌ గృహస్థుల ప-దంబుల పైఁ బడవైచుటే తగున్‌!

పేర:-బాబూ! యీ విషయంలో మీ రిల్లాటి పట్టుదల పెట్టుకో వలసిన పనిలేదు. ఆయనమీద రోతచేత ఆయన పిల్లవాణ్ణి పోగొట్టుకోవడం నా అభిప్రాయం కాదు, ఏభయ్యేళ్ళ ముండాకొడు కెన్నాళ్లు బ్రతుకుతాడు! ఆ తరువాత పెత్తనమంతా అమ్మాయిదే. అవన్నీ అటుండఁగా అంతసొమ్ము ఆయన చేతులలో చిక్కుపడ్డప్పుడు అడుసు త్రొక్కడమా అని సందేహించడం ఆలోచన తక్కువపని కాదూ? అమ్మా! మీరల్లా వలపోస్తూ యేమీ చెప్పకపోతే యెల్లాగ? ఏదోవిధంగా మఱచిపోవాలి కాని యెల్లకాలం అదేపనిగా విచారిస్తూ వుంటే యెల్లా సాగుతాయి వ్యవహారాలు!

భ్రమ:-(కన్నీటితో ) అయ్యా పేరయ్యగారూ!

  ఉ.ఆనునుచెక్కు, లాపెదవు, - లామొగ, మామురిపెంపు భ్రూయుగం,
  బానొస, లాశిరోరుహము, - లామృదువాక్యము, లామృదుస్వరం
  బానయనంబు, లానడక, - యావినయం బకటా! సుషుప్తియం 
  దేనియు సాధ్యమే మఱువ - నీ దురదృష్టపు జీవితంబునన్‌!
  సీ.ఎన్నఁడు నామాట - కెదురు చెప్పఁగ లేదు!
    తండ్రి గీచినగీఁటు - దాఁట లేదు!
  బడి యన్న నెన్నఁడుఁ - బ్రాలుమాలఁగ లేదు!
    రాట్నంబు నెడలఁ బ-రాకు లేదు!
  అది నాకుఁ గావలె - నని యెన్నఁ డన లేదు!
    కుడుచునప్పుడుఁ గూడ - గొడవ లేదు!
  ఆటలయం దైన - నలుక యెన్నఁడు లేదు!
    పొరుగింటి కేనియుఁ - బోక లేదు!
  కలికమున కేనియును నోటఁ - గల్ల లేదు!
  మచ్చునకు నేనియుం బొల్లు - మాట లేదు!
  అట్టి బిడ్డను బ్రతికి యు-న్నంతవఱకు
  మఱవ శక్యమె! వెఱ్ఱి బ్రా-హ్మణుఁడ! నాకు!

పురు:-అహర్నిశ లిట్లు వలపోయుచు ఆబిడ్డ నడలఁ గొట్టెదవా?

  తే.ఎంత చెప్పిన విన విది - యేమి వెఱ్ఱి
  యెవరిపని యైనతరువాత - నెవ్వ రుంద్రు?
  నాటకములోని వేష గాం-డ్రకును మనకు
  నించుకేనియు భేద మెం-దేని గలదె!

పేర:-అంతే నమ్మా! అంతే. బొమ్మలాటకా డేంచేస్తాడు? ఏబొమ్మ పనివచ్చినప్పు డాబొమ్మను తెరమీది కెక్కిస్తాడు. ఆబొమ్మ పని కాగానే అడుగున పారేస్తాడు. ఆలాగే భగవంతుడూను! ఇం తెందుకూ? ఇరవయేళ్ళ నుంచివున్న పొడుంకుండు మొన్న నిట్టె పగిలిపోతె, నే నేం చెయ్యగలిగాను! ఏడిస్తే వచ్చేలా గుంటే యెన్నా ళ్ళేడవమన్నా యేడుస్తును!

పురు:-ఏమే? యీ విషయమునందు నీ యభిప్రాయ మేమిటి?

భ్రమ:-(కన్నులు తుడుచుకొని) మన యభిప్రాయములకు ఫలితముగా మనకు జరుగవలసిన శాస్తి జరుగనే జరిగినది. ఇంకను మన యభిప్రాయముల మీఁదనే నడచినచో ఈయమ్మ కేమిబుద్ధి పుట్టునో యెవరు చెప్పగలరు! కావున, దాని యభిప్రాయము తెలుసుకొని దాని యిష్ట మెట్లో యట్లే జరిగింపుఁడు.

పేర:-అదీ బాగానే వుంది. అమ్మాయీ! నీయభిప్రాయ మేమిటో చెప్పమ్మా! నీ కా చిన్నవాణ్ణి నిశ్చయించమంటావా? లేక, అయిదువేల అయిదువందల పదిరూపాయలూ - ఆబ్రాహ్మడికి అర్పితంచేసి వూరుకోమంటావా!

కమ:-(తనలో) ఇప్పుడు నా కర్తవ్యమేమిటి? అక్క సిద్ధాంతమునే యనుసరింపఁ దగునా? అందులకు భిన్నము గావించి తల్లిదండ్రులకుఁ దాత్కాలిక మనశ్శాంతిని గలిగింపఁ దగునా! అక్క చెప్పిన వాక్యము లన్నియు నాణెముత్తెము కోవలు. కట్నాల రాయలచేఁ గళ్యాణసూత్రము గట్టించుకొనుట కంటెఁ గతిమాలినపని మఱి లేదనుట నిశ్చయము! అట్టి వివాహము నాకును నంగీకారము లే దన్నచోఁ, దలిదండ్రులు నన్నుఁ బలవంతపెట్ట రనుటయు నిశ్చయమే. కాని, దానివల్లఁ దేలు పర్యవసాన మేమి? అయిదువేల యైదువందలు నా దుర్మార్గుని పొట్టను బెట్టించుట తప్ప మఱేమియు లేదు. అందువల్లఁ నా దారి విడిచిపెట్టి యా సంబంధమునే యంగీకరించి, పణమునకుం దగిన ప్రాయశ్చిత్తము చేయఁ గలిగినచో వీరిచ్చిన ద్రవ్యము వినియోగములోనికిఁ దెచ్చినదాన నగుటయేగాక అక్క కసి తీర్పఁగలిగిన దాననై ప్రపంచమున కొక పాఠము నేర్పినదానను గూడ నగుదును. అయితే, అట్టి ప్రతీకార మే విధముగాఁ జేయగలుదును. (ఆలోచించి) సరే కానిమ్ము.

  గీ.కట్టె మథియింప మథియింపఁ - గలుగు నిప్పు!
  భూమి త్రవ్వంగఁ ద్రవ్వంగఁ - బుట్టు నీరు;
  పెరుఁగు తరువంగఁ దరువంగఁ - బేర్చు వెన్న;
  కన్పడదె దారి యోజింపఁ - గార్యములకు?

పురు:-అమ్మాయి! ఆయన యడిగిన మాటకు బదులు చెప్ప వేమి! సందేహ మక్కఱలేదు. నీ యభిప్రాయ మేమో స్పష్టముగా జెప్పు, నిన్ను మే మించుకయు నిర్బంధించువారము కాము.

కమ:-(తల వంచుకొని) మీ యిష్టము. పురు:-మా యిష్టము కొఱకుఁ జూడ వలదు. నీ యిష్టమే మా యిష్టము, నిశ్చయముగా నీ యిష్ట ప్రకారము జరిగింతుము.

కమ:-(కొంచె మాలోచించి) ఈ వివాహమునకు సంబంధించిన యితర విషయములలోఁ గూడ నా యిష్టానుసారముగ నడువనిత్తురా?

పురు:-సందేహ మేమీ, సర్వత్ర నీ యిష్టమే మా యిష్టము. ఈ మాటకు నే నిసుమంతయుఁ దప్పిపోవువాఁడను గాను.

కమ:-అట్లయిన, నా కంగీకారమే.

భ్రమ:-(తల నిమురుచు) అమ్మా! ఆనక మా గొంతుక కోయక ఆలోచించి మఱి జెప్పుము!

కమ:-ఆలోచించియే చెప్పినాను. అనుమాన మక్కఱలేదు.

పేర:-సెబాసు తల్లీ! నా మనస్సు కిప్పుడు నచ్చావు! సమయానికి లేకపోయింది కాని, వుంటే, వుద్ధరిణెడు పంచదార నోట్లో పోస్తును.

పురు:-పేరయ్యగారూ! పెరయాలోచనము లిఁక నెందులకు. సాయంకాలము మీరు వెళ్లి సంగతి యాయనతోఁ జెప్పి, సరే యనిపించుకొని రండు. (మెల్లగా) ఇంకొకటి కార్య మీ నెలలోనే కావలెను. యేమనెదరా? యీబిడగా రీసందడిలోఁబడి యిప్పటి వ్యసనమును గొంత మఱచిపోఁ గలదు.

పేర:-బాగుంది బాబూ! బాగుంది. శలవు పుచ్చుకొని వెళ్ళి శటల్‌ చేసుకు చక్కావస్తాను. అమ్మా! శలవు. (అని నిష్క్రమించును.)

పురు:-(లేచి కమల నెత్తి యక్కునఁ జేర్చుకొని) తల్లీ!

  ఆ.ఏండ్లకన్నఁ జాల - హెచ్చగు బుద్ధి నీ
  కిచ్చి మమ్ముఁ దేల్చె - నీశ్వరుండు!
  అక్క యట్లు చేసి-నందుల కీ వైన
  మాదు కనుల యెదుట - మనఁ గదమ్మ!

కమ:-(కొంచె మీవలకు వచ్చి తనలో)

  ఉ.అక్కరొ! నీ మతంబునకు - నడ్డముగాఁ జనుచున్న నా యెడన్‌
  మక్కున వీడబోకు! మభి-మానము లేని కతాన గాదు నే
  నిక్కరణిం భ్రమించుట మ-ఱేమన దేవుఁడు మధ్యవర్తిగా
  నిక్కము దెల్పుచుంటి నిటు - నీ కసి తీర్ప మదిం దలంచితిన్‌.

ఇది షష్ఠాంకము. (తెరపడును.)