వరవిక్రయము/పంచమాంకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పంచమాంకము

ప్రదేశము: కాళిందీ కమలల గది.


కాళిం :- (విచారముతో బచారుచేయుచు) కటకటా! కట్నము కాళ్ళకడకుఁ బంపుట కూడ జరుగునపు డిఁక కార్యమేమున్నది?

ఉ. తెల్లముగా మనోగతము తెల్పినఁ నేడ్చిన, మొత్తుకొన్న, నా
    తల్లికిఁ దోఁచదాయె విది తప్పిదపుం బని యంచుం దండ్రియుం
    జల్లగ గ్రిందిమెట్టునకు జారి ననుం గమనింపఁ డాయె! నన్‌
    జెల్లని డబ్బు క్రింద నిటు చేసితి వేమిటి కయ్య దైవమా!

ఔరా! ఆఁడుదానిబ్రతు కెంత యలసుబ్రతు కైనది!

ఉ. లేదు స్వతంత్ర మొక్క లవలేశము కూడ, నొకింతయేనియున్‌
    లేదు యధార్థ గౌరవము లేదొక యింతయు మెప్పు, పెండ్లియే
    కాదు గృహంబు లమ్ముకొని కట్నము లర్పణ సేయకున్న నీ
    మాదిరి నాఁడుపుట్టు నవ మానపుఁబుట్టువు క్రింద నేర్పడెన్‌.

ఇంతకునూ మూల మిప్పుడు నేను జేయవలసిన దేమిటి?

గీ. పయిక మాశించి దిగిన యబ్బాయి చేత
   బొందు కట్టించుకొని తృప్తిఁ బొందఁ దగున?
   తల్లిదండ్రుల నెదిరించి తగవు పెంచి
   మొండికెత్తినయట్లు కూర్చుండఁ దగున?

కమ :- అక్కా! అక్కా! యీ యాశ్చర్యము విన్నావే. (అని యఱచుచు వార్తాపత్రిక చేతఁబట్టుకొని, చరచరఁ బ్రవేశించును.)

కాళిం :- ఏమిటది?

కమ :- ఇదిగో చదివెద వినుము. "ఓరుగల్లులో నొక యువతి యొక యువకుని వరించెను. ఆ యువకుఁ డారువేలు కట్నమిచ్చినఁ గాని యామెను బెండ్లి యాడనని నిరాకరించెను. ఆమె తలిదండ్రులా విత్త మీయలేక, అన్య సంబంధమును సిద్ధపఱిచిరి. ఆయువతి ఆ యువకుం దక్క నన్యుని బెండ్లియాడుట కిష్టము లేక యారాత్రి విషపానముచేసి మరణించెను! ఈ వరశుల్కములు ఫలితమింతవఱకు వచ్చినది."

కాళిం :- సెబాసు! చాల చక్కనిపని చేసినది!

గీ. పుట్టినపుడె లిఖియించు గిట్టు మనుచు
   సకల జీవుల నొసట జలజభవుఁడు,
   ఇట్టిచో నంతరాత్మ స హింపని పని
   కొడఁ బడుటకంటె జచ్చుటే యుత్తమంబు.

కమ :- అట్టిసాహస మందఱకు నలపడుట యెక్కడ? కాని అమ్మ యన్నమునకుఁ బిలుచుచున్నది పోవుదము రమ్ము.

కాళిం :- నాకింకను నాఁకలి యగుటలేదు. నీవుపోయి భుజింపుము.

కమ :- అయ్యో! నీయాకలి అక్షయముకాను! ఇప్పుడెంత ప్రొద్దుపోయినదో యెఱుగుదువా? నాన్నగారు భోజనముచేసి, నారాయణ దాసుగారి హరికథలోనికి వెళ్ళినారు. అమ్మ మనకొఱకట్టె యున్నది.

కాళిం :- సరే కాని, యొక్క మాట, ఇంటనిప్పుడు సొమ్మేమియులేదు గదా, యీ కట్నపుసొమ్మెట్లు వచ్చినదో నీకేమైన తెలియునా?

కమ :- పోతునూరులోని పొల మమ్మివేసినారు.

కాళిం :- శ్రీరామ రామా! చివర కిదికూడనా?

కమ :- ఏమి చేయమనెదవు? ఈ దినములలో బిడ్డలం బడయుట యిందులకుఁ గాక మరెందులకనే నీ యభిప్రాయము?

ఆ. కొడుకు పుట్టి చదువు కొఱకుఁ దాతలనాఁటి
    మడులు మాన్యములును దుడిచివేయఁ
    గూఁతు రవతరించి కొంపలుం గోడు ల
    మ్మించుచుండె బెండ్లి లంచములకు.

కాళిం :- నిజమే! నిజమే! అదిగో అమ్మ పిలుచుచున్నది. వెళ్ళు.

కమ : -నీవు కూడ రమ్ము.

కాళిం :- నా కాకలి లేదని చెప్పలేదా? తలకూడా నొచ్చుచున్నది. తక్షణమే పండుకొనినగాని తగ్గదు. (అని తివాచిపైఁ గూలఁబడును.) కమ :- సరే నీ యిష్టము! (అని నిష్క్రమించును.)

కాళిం :- హరహరా! ఆపది ఎకరములు విక్రయించి, అల్లునకుఁ జెల్లించుచుంటిరిగా గదా! ఆవల వీరిగతి యేమికావలసినది? మా ప్రాణముల కుసూరు మనుచు మలమల మాడవలసినదేనా? ఈ మాట వినికూడ నేనీ దుర్నయకార్యమున కెట్లు సిద్ధపడుదును దైవమా? యిందుల కేదియు దారి యగపఱుపవా? (స్మృతితో) అన్నట్లు దారికేమీ? అపురూపమైనదారి యాయోరుగంటి యువతి యగపఱిచియే యున్నది. ఆ దారిని నేను మాత్రమేల యనుసరింప గూడదు? ఈశ్వరాదేశమున కూడ నదియె కాకున్న ఈ పూటనె యావార్త యేల చెవిని బడవలెను? కమలయేమన్నది? "అట్టి సాహస మందఱకు నలవడుట యెక్క" డనియా? కాళిందీ? నీవీపాటి సాహసమునకుఁ గన్నులు మూసికొని సిద్ధపడలేవా? మానము కాపాడుకొనలేకున్న మానవతి యనిపించుకొనఁగలవా? చెఱుపునుండి మరలించినదే స్నేహము. పాపరహితమైనదే పని, పుణ్యమార్జించినదే బుద్ధి. అనుభవించినదే యైశ్వర్యము. స్వాతంత్ర్యము కలిగినదే జన్మము, మర్యాద గాపాడుకొన్నవాఁడే మగవాఁడు. మానము దక్కించుకొన్నదే మగువ. ఇప్పుడు తప్పిన నీవిక నెన్నఁడును జావకుండ బ్రతుక గలవా? ఏనాడు ప్రాణులు తల్లికడుపున, బడునో ఆనాడె మృత్యువు కూడ వెంటపడును. శిశువు పుట్టగానే ముందు మృత్యువు ముద్దుపెట్టుకొని తరువాత దాదికిఁఁ బలెఁ దల్లి కిచ్చును. అట్టి స్థితిలోఁ జావున కంత సందేహింపవలసిన పని యేమున్నది? లెమ్ము. లేచి నీ తలల్లిదండ్రులకొక లేఖవ్రాసి అవమానకరమైన నీయాడుబొంది నింతటితో విడిచిపెట్టుము. (అని దిగ్గునలేచి, గది తలుపు మూసి) అవునుగాని ఆత్మహత్య అపకీర్తికిని, అధోగతికిని గూడ గారణము కదా. అట్టిపని చేయవచ్చునా? (క్షణమాలోచించి) అయ్యో! నా మతికాల! నన్ను నేనేపొరపెట్టుకొనుచుంటి నేమి? బుస్సీ కంట పడనొల్లక బుగ్గియైన బొబ్బిలి వెలమ యాఁడువారి పోడిమి తగ్గినదా? రుస్తుంఖానుని వశమగుట కిష్టములేక, రుధిరాంబరంబులతో నగ్నింబడి రూపుమాసిన పెద్దాపుర క్షత్రియాంగనల పెంపు సన్నగిల్లినదా? ఆయుధముచే నరులం బరిమార్చుట హత్యకాక, వీర ధర్మ మగునపుడు, భర్తతో సహగమనము సలుపుట బలవన్మరణము కాక, పాతివ్రత్యమగునప్పుడు, అవమానమును, దప్పించుకొనుటకై ప్రాణములను విడుచుట ఆత్మారాధనముకాక ఆత్మహత్య యెట్లగును? కాదు ముమ్మాటికిని గాదు. ఈ త్యాగమువల్ల నాగౌరవము నాకు దక్కుటయెకాక తల్లిదండ్రుల ధననష్టము కూడఁదప్పును. (అని వ్రాఁతబల్లకడకుఁ బోయి యుత్తరము వ్రాసి మడిచి, బల్లపై నుంచి, లేచి) ఓ గదీ! నీకొక నమస్కారము! ఓ శయ్యాదులారా, మీకు సాష్టాంగ ప్రణామములు. (రాట్నముకడకుఁబోయి, ముద్దు పెట్టుకొని) నా ముద్దుల రాట్నమా! యింతటితో నీకును నాకును ఋణము సరి. గడియారపు ముండ్లవలె నీయాకులెప్పుడును గదులుచునే ఉండుగాక! నీ మధురగాన మెల్లప్పుడు నిఖిలదిసలయందును ధ్వనిఁచుచునే యుండుగాక! కడపటి సేవగా నిన్నొకసారి కదిపి మఱిపోయెద! (అని రాట్నము తిప్పి నూలుతీసి) ఈ బారెడు పోగును నాభక్తికి నిదర్శనంగాఁ ప్రపంచమున నుండుఁగాక! (అంతట తెర యెత్తగా పెరడును, బావియు గోచరించును.) అటునిటు జూచుచు, మెల్లగాఁ బెరటిలోని కరిగి) నాకంటె ముందు పుట్టిన నవమల్లికా! నమస్కారము. కమలయు నేనును గష్టపడి పెంచిన చేమంతులారా! మీకుఁజేమోడ్పు. (అనుచు బావికడకుఁబోయి) ఓ పరమేశ్వరా! ప్రయోజనార్థమై నీవు ప్రసాదించిన యీశరీరము నిట్లు బావిపాలు చేయుచున్నందులకు మన్నింపుము. ఓ తలిదండ్రులారా, నన్నుఁ గని పెంచినందులకు మీ కివిగో నా కడపటి వందనములు. కాళింది యను కూఁతును గననే లేదనుకొనుఁడు గాని, గర్భశోకముచేఁ గృశింపకుఁడు! భరతమాతా, ప్రణామములు. తల్లీ, నీవే నిర్భాగ్యస్థితిలో నుండునప్పుడు నీ తనయల కేమిదారి చూపగలవు? ఓ పాలకులారా మీ పన్నులగొడవయే మీది కాని, ఆపన్నులగు నాఁడుఁపడుచుల పన్నుల గొడవ మీకక్కఱలేదు. గదా! వంగరాష్ట్ర శిక్షాస్మృతులేకాని, వరశుల్క శిక్షాస్మృతులను గల్పింపరు గదా, ఓ సంఘ సంస్కర్తలారా! ఉపన్యాసవేదికలపై నూఁదర గొట్టుటయే గాని, మీరేకరు పెట్టు ధర్మములనైన మీరనుష్ఠింపరేమి? పాచినోటనె కాఫీ, ప్రాతఃకాలము కాఁగానే క్షౌరము, మై గుడ్డతో తిండి, మదరాసు కాఫీ హోటళ్ళలో టిఫెను, ఇంటిలోఁగూడ నింగ్లీషు, బయటకు గూడ పాడుమొగము, గొల్లవానిచేతి రొట్టె, గొడారువాని చేతిసోడా, స్వమతము నెడ రోత, స్వధర్మమునెడ విముఖత, పదవులకై ప్రాకులాట, బిరుదులకై పీకులాట, దాస్యమునకు ముందడుగు, త్యాగమునకు వెనకడుగు. ఇవితప్ప యింతవరకూ సంఘమునందు మీరు ప్రవేశపెట్టిన సంస్కారములగపడవేమి? ఓ దేశసేవా దురంధరులారా! ఈ కట్నములదుర్నయమునుగూర్చి మీ రించుకయినాలోచింపరేమి? శుల్కమననేమి? సుంకము, సుంకమననేమి పన్ను. ఈ పన్ను చెల్లించినఁగాని బాలికలకు భర్త యోగము లేదట. ఇంతకు మించిన యవమాన మింకేమున్నది? మీ బిడ్డల యవమానమును దప్పించలేని మీరు, మీ దేశమాతయవమానమేమి తప్పింపగలరు? మీయల్లుర పన్నుల నడ్డుకొనలేని మీరు, మీ దొరతనమువారి పన్నులనేమి యడ్డుకొనఁగలరు? ఎన్నెన్ని సంసారము లేటఁ గలిసిపోవుచున్నవో యెరుఁగుదురా! ఎందఱాఁడుబిడ్డల తండ్రులు ఏమిగతి దైవమా యని యెత్తుపడియున్నారో చిత్తగించితిరా, కాసునకు గతిలేనివాఁడు, కడుపుచీల్చి కంచుకాఁగడాలతో వెదకిన గాసింత యక్కరముముక్క కానిపింపనివాఁడు, కన్యనిచ్చెదమనగాఁనే కట్నము కొఱకెంత బిఱ్రబిగియుచున్నాడో గమనించితిరా? ఆఁడుపడుచుల యవమానమునిట్ల లక్ష్యము సేయుచున్న దేశమున కయ్యయో, అన్న వస్త్రము లుండునా! మగబిడ్డలంగన్న యొయ్యారులారా, కొడుకు పుట్టినది మొదలు, కొండంత యాశతో, కలలోగూడ కట్నములనే పలవిరించు కలికాల పిశాచము లారా! మీరు పుట్టినదిమాత్ర మాఁడుపుట్టువు కాదా? ఆడ పడుచు నిట్లవమానపరుచుట మిమ్ములను మీరవమాన పరుచుకొనుటకాదా? ఇకనైన బుద్ధితెచ్చుకొని మీదురాచారమును విడువుఁడు. విడువకున్న కాళింది యుసురు మీ కంఠములకు జుట్టుకొనక మానదు. ఓయాఁడుబిడ్డలంగను నదృష్టహీనురాండ్రా, ఆఁడుబిడ్డ పుట్టగానే ఆవలనైనఁ బారవేయుఁడు గాని అడిగిన లంచమిచ్చి పుస్తె కట్టించి అవమానముపాలు, మాత్రము చేయకుఁడు! చెల్లీ కమలా! యిరువురమొక కంచమునఁ దిని యొక మంచమునఁ బరుండి పెరిగినఁవార మగుటచే నిన్నువిడిచి పోవుట నాకు నిజముగ దుస్సహముగానే యున్నది! తప్పనిసరియైనచో, నీవుగూడ నీదారినే యనుసరింపుము కాని, అవమానమున కొడంబడి, నీయక్క కప్రతిష్ఠమాత్రము కలిగింపకుము! ఓ శరీరమా నీయవమానమును దప్పించుటకై, నిన్ను విడనాడి పోవుచున్నాను. ఓ జీవితమా నీకు జిరకాలచింత లేకుండ జేయుటకై, నీ లెక్క ముగించుచున్నాను? ఏమి హృదయమా యేమి చేయుచున్నావు? నీవు నిర్మలముగా నుండవలసిన నిముసమిదియే! సాహసమా నీవుసాయపడవలసిన సమయ మాసన్నమైనది. పిరికితనమా! నా దరికి రాకుము. దాక్షిణ్యమా నీవు దవ్వులకుం బొమ్ము. మోహమానీవు మొద్దువలె బడియుండుము. ధైర్యమా! నీవు దాపునకురమ్ము. కన్నులారా మీ కడసారి చూపులు కానిండు. (చీర చెంగులు బిగించుకొని బావికి ప్రదక్షిణము చేసి) ఓ కూపమా నా తొలిస్నానము నీ నీటితోనైనది, నా శరీరము నీ నీటితో బెరిగినది. నా తుదిస్నానము కూడ నీ నీటితోనె కావించి, నీవు పెంచిన శరీరమును నీకేసమర్పించుచున్నాను! వినుట అభినయించి అదిగో! ఆకాశవాణి - నన్నమ్మాయీ రమ్మని పిలుచుచున్నది. అమ్మా! ఇదిగో వచ్చుచున్నాను. హా! పరమేశ్వరా! (అని బావిలో పడును.)

ఇది పంచమాంకం.


★ ★ ★