Jump to content

లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/సంధి విభాగము

వికీసోర్స్ నుండి

3. సంధి విభాగము

I.సంధి -157-187

1.ఆగమ సంధులు

2.ఆదేశ సంధులు

3.ఏకాదేశ సంధులు


II. సంస్కృత సంధులు :

III. తెలుగు సంధులు :

సంధి పరిచ్ఛేదము

వర్ణములకు గాని, శబ్దములకుగాని, వ్యవధానము లేకుండ, ఉచ్చారణ జరిగినపుడు కలుగు కలయిక సంధి అనబడును.

పూర్వపరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధి యని సూత్రము. రాజు + అతడు - రాజులోని ఉకారము పూర్వస్వరము. అతడులోని అకారము పరస్వరము. కాన ఆ రెంటికి (ఉ+అ) మారుగ పరస్వరమైన, అకారము నిలిచినది. ఇచ్చట అవ్యహితమై, సంధి యేర్పడినది.

రాజు + అతడు = రాజతడు

ఆది + అమ్మ = ఆదమ్మ

పిచ్చి + అయ్య = పిచ్చయ్య

తాటి + ఆకు = తాటాకు మొదలైనవి.

ఈ సంధులంధు వర్ణలోప - వర్ణాగమ - వర్ణాదేశాదులు కల్గుచుండును. ఆంధ్ర భాష అజంతము కాన అచ్ సంధియే జరుగుచుండును. సంధి జరిగినపుడు ఒక వర్ణలోపము కల్గినచో వర్ణ లోపమందురు.

ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు

యడాగమము రాగా - ప్రాయిల్లు అగును. ఇందు 'త' లోపించినది - యడాగమము వచ్చినది.

వర్ణమింకొకటి వచ్చి చేరుట వర్ణాగమము. సంధి లేని చోట వర్ణాగమము జరుగును. మా + ఇల్లు

మా + య్ + ఇల్లు - మాయిల్లు. ఒక వర్ణమునకు బదులు మరియొక వర్ణము వచ్చిచేరుట వర్ణాదేశము. కృష్ణుడు + పోయెను - కృష్ణుడు వోయెను.

పకార స్థానమున వకారము వచ్చినది. ఇది ఆదేశము.

సంధులను స్థూలముగా సంస్కృత సంధులు, తెలుగు సంధులు అని విభజింప వచ్చును. అక్షరముల మార్పును బట్టి కూడా సంధుల వర్గీకరించవచ్చును.

1. ఆగమ సంధులు

పూర్వపర పదములలోని ఏ వర్ణమును తొలగింప కుండా, మరి యొక వర్ణము మిత్రుని వలె వచ్చి చేరిన దానిని ఆగమసంధి అందురు.

ఉదా : నీ + కలము = నీదు కలము
            నా + మాట = నాదుమాట
            తన + ఫలము = తనదు ఫలము.
            నీ + దు + కలము
            నా + దు + మాట
            తన + దు + ఫలము

రుగాగమ - టుగాగమ - నుగాగమ - దుగాగమ సంధులు ఈ కోవకు చెందినవి.

2. ఆదేశ సంధులు

సంధిలోని పూర్వపర పదముల మధ్య గల ఒక వర్ణమును తొలగించి, దాని స్థానమున మరియొక వర్ణము శత్రువు వలె వచ్చిచేరుట ఆదేశ సంధి.

అతి + అంతము =

అతి + య్ + అంతము = అత్యంతము

అత్ + ఇ + య్ + అంతము

యణా దేశ పుంప్వా దేశ సంధులు ఈ కోవకు చెందినవి.

3. ఏకాదేశ సంధులు

సంధిలోని పూర్వపర పదముల నడుమగల రెండు వర్ణములను తొలగించి, ఆ రెంటింటి స్థానమున ఒకే వర్ణము వచ్చి చేరిన దానిని ఏకాదేశసంధి అందురు.

దేవ + ఇంద్రుడు

దేవ్ + అ + ఇంద్రుడు

అ + ఇ = ఏ

దేవేంద్రుడు - గుణసంధి - సవర్ణ దీర్ఘసంధి - వృద్ధిసంధి ఈకోవకు చెందినవి.

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి :

అ - ఇ - ఉ - ఋ లకు సమానాచ్చులు పరమగునపుడు దాని దీర్ఘ మేకాదేశమగును. సవర్ణమనగా సమానమైన వర్ణము అని అర్థము. ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క కుటుంబము కలదు. ఈ అక్షరములు ఎన్నియో మార్పులనందు చుండును.

అక్షరములు హ్రస్వము - దీర్ఘము, ప్లుతము అని మూడు విధములు

మాత్ర ఒక క్షణకాలము.

         ఒక మాత్రకాల ఉచ్చారణ కలది హ్రస్వము.
         రెండు మాత్రల కాలము ఉచ్చారణ కలది దీర్ఘము.
         మూడు మాత్రల కాలము ఉచ్చారణ కలది ప్లుతము.

ఒక్కొక్క అక్షరము మూడు విధముల ఉచ్ఛరింపబడును.

1. హ్రస్వము 2. దీర్ఘము 3. ప్లుతము.

I. 1. హ్రస్వము : రామ + అనుజ = రామానుజ

2. హ్రస్వదీర్ఘము : రామ + ఆజ్ఞ = రామాజ్ఞ

3. హ్రస్వ ప్లుతము.

II. దీర్ఘ హ్రస్వము
    దీర్ఘ దీర్ఘము
    దీర్ఘ ప్లుతము

III. ప్లుత హ్రస్వము
     ప్లుత దీర్ఘము
     ప్లుత ప్లుతము
 
                ఈ రీతిగ ఒక్కొక్క అక్షరము

3 X 3 = 9 విధముల రూపొందును. ఇట్లే ఇ కార ఉ కారములకు కూడ ఇన్ని రూపములుండును. ఇవి అన్నియు సవర్ణములు.

            రామ + అనుజ = రామానుజ
            రామ + ఆజ్ఞ = రామాజ్ఞ
            కవి + ఇంద్ర = కవీంద్ర
            ఋషి + ఈశ్వర = ఋషీశ్వర
            గురు + ఉపదేశము = గురూపదేశము
            చమూ + ఉదధి = చమూదధి
            పితృ + ఋణము = పితృూణము
            ఇవి ఏకాదేశ సంధులు.

2) గుణ సంధి :

ఏ - ఓ - అర్ - అను వర్ణములు గుణములు. వీని వలన నేర్పడిన సంధి గుణసంధి.

అకారమునకు ఇ - ఉ - ఋ లు పరమైన క్రమముగా ఏ - ఓ - ఆర్‌లు ఏకాదేశముగా వచ్చును.

అ + ఇ = ఏ

అ + ఉ = ఓ

అ + ఋ = అర్ ఏకాదేశములగును

     ఉదా : సుర + ఇంద్ర = సురేంద్ర (అ+ఇ) = ఏ
                 రమా + ఈశ = రమేశ (ఆ+ఈ) = ఏ
                 రాజ + ఉత్తమ = రాజోత్తమ (అ+ఉ) = ఓ
                 గంగా + ఉదకము = గంగోదకము (ఆ+ఉ) = ఓ
                 దేవ + ఋషి = దేవర్షి (అ+ఋ) = అర్
                 మహా + ఋషి = మహార్షి (ఆ+ఋ) = ఆర్
              ఇది ఏకాదేశ సంధి.

3) వృద్ధి సంధి :

ఐ - ఔ - అర్ అను వర్ణములు వృద్ధులు. వీని వలన ఏర్పడిన సంధి వృద్ధి సంధి.

అకారమునకు ఏ - ఐ లు పరమగునపుడు ఐకారమును, ఓ - ఔలు పరమైనపుడు ఔ కారమును వచ్చును. ఋకారము పరమైన అర్ - ఏకాదేశమగును.

అ + ఏ = ఐ ----- అ + ఐ = ఐ

అ + ఓ = ఔ ----- అ + ఔ = ఔ

అ + ఋ = అర్.

     ఉదా : లోక + ఏక = లోకైక (అ + ఏ = ఐ)
                 సకల + ఐశ్వర్య = సకలైశ్వర్య (అ + ఐ = ఐ)
                 పావ + ఓఘ = పాపౌఘ (అ + ఓ = ఔ)
                 రమా + ఔదార్య - రమౌదార్య (అ + ఔ = ఔ)

ఋణము (అప్పు అను అర్దము) అనుపదము పరమైన అర్ వచ్చును. కావున నిది వృద్ధిసంధిగా గుర్తించవలెను.

            ప్ర + ఋణము = ప్రార్ణము
            వత్సతర + ఋణము = వత్సతరార్ణము
            దశ + ఋణము = దశార్ణము
            వనన + ఋణము = వననార్ణము
            కంబల + ఋణము = కంబలార్ణము
              ఇవి ఏకాదేశ సంధి.

4. యణాదేశ సంధి :

ఇ - ఉ - ఋ అనువర్ణములు ఇక్కులు

య - వ - ర - ల అనునవి యణ్ణులు.

ఇక్కుల స్థానమున యణ్ణులు ఆదేశమగుటచే ఇది యణాదేశ సంధి

ఇ - ఉ - ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరంబగునపుడు వరుసగ య - వ - ర - ల లు ఆదేశమగును.

          అతి + అంతము = అత్యంతము
          అత్ + ఇ + అంతము = ఇ + అ = య్
          మధు + అరి = మధ్వరి
          మధ్ + ఉ + అరి = ఉ + అ = వ్
          పితృ + ఆదరము = పిత్రాదరము.
          ఋ + ఆ = ర్
          ఌ + అకృతి = లాకృతి - ఌ + ఆ = ల్

5. అనునాసిక సంధి :

నాసిక అనగా ముక్కు. ముక్కుతో పలుకు వర్ణములగుటచే వీనికి అనునాసికములని పేరు. వర్గ ప్రధమాక్షరములగు (క చ ట త ప లు) - అనునాసికములు పరమగునప్పుడు ఆయా వర్గాను నాసికములు ఆదేశమగును.

వర్గమందలి తొలి అక్షరములైన క చ ట త ప లకు - న మ లు పరమగునపుడు ఆయా వర్గముల తుది వర్ణములు ఆదేశమగును.

       వాక్ + నైపుణ్యము = వాఙ్నపుణ్యము
       వాక్ + మహిమ = వాఙ్మహిమ
       రాట్ + నిలయము = రాణ్ణిలయము
       రాట్ + మందిరము = రాణ్మందిరము
       జగత్ + నాధ = జగన్నాధ
       కకుప్ + నేత = కకుబ్నేత
       లసత్ + మూర్తి = ల సన్మూర్తి
       మృట్ + మయము = మృణ్మయము
             ఇది ఆదేశ సంధి.

6. జస్త్వసంధి :

గ జ డ ద బ లకు ఆదేశముగ వచ్చు సంధి జస్త్వ సంధి.

పరుషములకు అచ్చులుగాని, వర్గ తృతీయ - చతుర్థాక్షరాలుగాని - హయ వరలు పరమైనచో గ జ డ ద బ లు ఆదేశములగును.

   వర్గ ప్రధమాక్షరాలు : క చ ట త ప లు.
                        పరుషములు.
   వర్గ తృతీయాక్షరములు : గ జ డ ద బ లు
                           సరళములు.

వర్గచతుర్ధాక్షరాలు : ఘ - ఝ - ఢ - ధ - భ - లు

       వాక్ + అధిపతి = వాగాధిపతి
       అచ్ + అంతము = అజంతము
       రాట్ + గణము = రాట్గణము
       తత్ + విధము - తద్విధము
       కకుప్ + అధీశుడు = కుకుబధీశుడు
       వాక్ + యుద్దము = వాగ్యుద్దము
       తత్ + విధము = తద్విధము
       శరత్ + రాత్రి = శరద్రాత్రి
       తత్ + ధర్మము = తద్ధర్మము
                 ఇవి ఆదేశ సంధులు.

7. శ్చుత్వసంధి :

శ - చ - ఛ - జ - ఝ - ఞ - అను వర్ణములు శ్చుత్వములు.

సకారత వర్గములకు శకారచ వర్గములు పరమైనచో క్రమముగా అవియే ఆదేశములగును.

       మనస్ + శాంతి = మనశ్ + శాంతి = మనశ్శాంతి
       సత్ + చరితము = సచ్ + చరితము = సచ్చరితము
       శరత్ + చంద్రిక = శరచ్చంద్రిక
       తపన్ + శక్తి = తపశ్శక్తి
       తత్ + చక్రము = తచ్చక్రము
               ఇవి ఆదేశ సంధులు


8. లాదేశ సంధి :

పదాంత మందలి తకారమునకు లకారము పరమైనచో లకారము ఆదేశమగును.

         జగత్ + లీల = జగల్లీల
         విద్యుత్ + లత = విద్యుల్లత
         వసత్ + లక్ష్మి = వసల్లక్ష్మి

9. విసర్గసంధి :

సంస్కృత పదముల చివరనున్న విభక్తి ప్రత్యయము 'న్‌' కారము. ఉప సర్గపదములలోని 'న్‌' ముందుగ రేఫగా మారును. మరల ఆ రేఫము విసర్గమగును.

రామః అనుశబ్దము మొదట రామ+న్

తరువాత = రామ + ర్‌రామః

దీనిని విసర్గ అందురు. వివిధ వర్ణములు విసర్గకు పరమగునపుడు ఆ విసర్గ పొందు మార్పులను సూచించునది విసర్గ సంధి

1. విసర్గమునకు (సకారాంతము) క ఖ ప ఫ లు పరమగునపుడు విసర్గ మారదు.

         మనః + కమలము = మనఃకమలము
         మనః + ఖేదము = మనఃఖేదము
         తపః + పుంజము = తపఃపుంజము
         తపః + ఫలము = తపఃఫలము

2. అకారము పూర్వమందున్న విసర్గమునకు హ్రస్వ అకారము - వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరములు - య - ర - ల - వ - హ - లు పరమైనచో, విసర్గ ఉకారముగా మారును. గుణము వచ్చి తుదకు ఓ కారమగును.

       వర్గ తృతీయాక్షరాలు : గ జ డ ద బ
       వర్గ చతుర్థాక్షరాలు : ఘ ఝ ఢ ధ భ
       వర్గ పంచమాక్షరాలు : ఙ ఞ ణ న మ
       మనః + గతము :
       మన + ః + గతము
       మన + ఉ + గతము, (గుణము)
       మనోగతము.

       ఇదే సూత్రమును ఈ క్రింది విధముగా కూడ చెప్పవచ్చును.

విసర్గమునకు కఖ పఫలుగాక మిగిలిన కలిగిన హల్లులుగాని అచ్చులుగాని పరమగునప్పుడు ఓ కారము వచ్చును.

       దుః + ఉదరము = దురోదరము
       తపః + వనము = తపోవనము
       శిరః + రత్నము = శిరోరత్నము
       మనః + హరము = మనోహరము
       అన్యః + అన్య = అన్యోన్య
       పయః + ఘృత = పయోఘృత
       శిరః + మణి = శిరోమణి
       రజః + రాగము = రజోరాగము

3. పూర్వమున అకారాద్యచ్చులు గల సకారాంత శబ్దములకు, వర్గ ప్రధమ, ద్వితీయాక్షరములు, శషలుగాక మిగిలిన హల్లులు అచ్చులు పరమగునప్పుడు రేఫము ఆదేశమగును.

        అంతః + ఆత్మ = అంతరాత్మ
        ఆశీః + నినాదము = ఆశీర్నినాదము
        దుః + వృత్తము = దుర్వృత్తము
        దుః + భావము = దుర్భావము
        దుః + మానము = దుర్మానము
        దుః + అవస్థ = దురవస్థ
        పునః + దర్శనము = పునర్దర్శనము
        దుః + వర్తనము = దుర్వర్తనము
        చతుః + ఉపాయములు = చతురుపాయములు
        హవిః + దావము = హవిర్దావము
        చతుః + భుజము = చతుర్భుజము
                 ఇది ఆదేశ సంధి.

4. విసర్గమునకు చ ఛ లు పరమగునపుడు శ వర్ణము - ట ఠ లు పరములగు నప్పుడు ష వర్ణము, త ధ లు పరమగునపుడు స వర్ణము వచ్చును.

        దుః + చే ష్టితము = దుశ్చేష్టితము
        ధనుః + టంకారము = ధనుష్టంకారము
        మనః + తాపము = మనస్తాపము

5. విసర్గమునకు శ ష స లు పరమగునపుడు శ ష స లే వచ్చును.

        తపః + శాంతి = తపశ్శాంతి
        మనః + శాంతి = మనశ్శాంతి
        చతుః + షష్టి = చతుష్షష్టి
        తపః + సాధనము = తపస్సాధనము
        ప్రాతః + సమము = ప్రాతస్సమము

తెలుగు సంధులు

తెలుగునందు అ - ఇ - ఉ లను కురుచ అచ్చులకు తక్క ఇతర అచ్చులకు సంధిలేదు.

1. అకారసంధి :

అత్తునకు సంధి బహుళముగానగు. అత్తు అనగా హ్రస్వ అకారము. ఇదేవిధముగ ఉత్తు = హ్రస్వ ఉకారము - ఇత్తు - హ్రస్వ ఇకారము. అత్తు - ఉత్తు - ఇత్తు. వీనిని సంస్కృతమున తవర కరణములందురు. హ్రస్వమగు అకారమునకు సంధి బహుళముగనగును, అని సూత్రార్దము.

బహుళ గ్రహణముచేత -
నిత్యముగా సంధి జరుగుట -
అయ్య - అమ్మ, అన్న - ఆకు మొదలగు పదములకు సంధి నిత్యము

           రామ + అయ్య - రామయ్య
           రామ + అమ్మ - రామమ్మ
           రామ + అన్న - రామన్న
           చింత + ఆకు - చింతాకు మొదలైనవి.

వైకల్పికముగా, జరుగుట, అనగా ఒకసారి సంధి జరుగుట, మరియొకసారి సంధి జరుగకుండుట.

       ఉదా :- మేన + అత్త = మేనత్త (సంధి)
                     మేనయత్త (యడాగమము)
               చూడక + ఉండెను = చూడకుండెను (సంధి)
                     చూడక యుండెను (యడాగమము)

సంధి జరుగకుండుట -
స్త్రీ వాచక - తత్సమపద - సంబోధ నాంతంబులకు సంధి రాదు.

అమ్మ + ఇచ్చెను = అమ్మయిచ్చెను
దూత + ఇతడు = దూతయితడు
రాముడు + ఇదిగో = రాముడయిదిగో

అన్యవిధముగవచ్చుట
వెల + ఆలు = వెలయాలు.

2. ఇకారసంధి :

ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగ నగును. ఏమి - ఏది - ఏవి - అవి - ఇవి - కిన్ అనునవి ఏమ్యాదులు. ఇత్తు హ్రస్వ ఇకారము.

ఏమ్యాదుల హ్రస్వ ఇకారమునకు సంధి వైకల్పికముగా జరుగును.

ఉదా :- ఏమి + అంటివి = ఏమంటివి
                      ఏమియంటివి
       మఱి + ఏమి = మఱేమి
                    మఱియేమి
       హరికిన్ + ఇచ్చె = హరికిచ్చె
                     హరికినిచ్చె.

ii. క్రియాపదములందిత్తునకు సంధి వైకల్పికముగా నగును.

ఉదా :- వచ్చిరి + అప్పుడు = వచ్చిరప్పుడు; వచ్చిరి యప్పుడు.
        వచ్చితిమి + ఇప్పుడు = వచ్చితిమిప్పుడు; వచ్చితిమి యిప్పుడు.

iii. మధ్యమ పురుష క్రియలందిత్తునకు సంధి యగు.

నీవు - మీరు అను మధ్యమ పురుష క్రియలందలి హ్రస్వమగు ఇ కారమునకు సంధి తప్పక జరుగును.

ఉదా : - ఏలితివి + అపుడు = ఏలితివపుడు
         ఏలితి + ఇపుడు = ఏలితిపుడు
         ఏలితిరి + ఇపుడు = ఏలితిరిపుడు.

iv. క్త్వార్దంబైన 'యిత్తు' నకు సంధి లేదు. క్త్వార్దమనగా భూతకాలమును తెల్పు, అసమాపక క్రియ. అట్టి క్రియ లందలి హ్రస్వ ఇ కారమునకు సంధి లేదు.

ఉదా : - వచ్చి + ఇచ్చిరి = వచ్చియిచ్చిరి.

ఇత్వసంధి కొన్నిచోట్ల వైకల్పికముగను, కొన్నిచోట్ల నిత్యముగను, మరికొన్నిచోట్ల నిషేధముగను జరుగును.


3. ఉకారసంధి :

ఉత్తునకు అచ్చుపరమగు నపుడు సంధి నిత్యము. హ్రస్వమగు ఉ కారమునకు అచ్చుపరమగునపుడు సంధి జరుగును.

ఉదా : - రాముడు + అతడు = రాముడతడు.
         సోముడు + ఇతడు = సోముడితడు.
         అతడు + ఉండెను = అతడుండెను.
         వాడు + ఎవడు = వాడెవడు.

ఉ కారసంధి కొన్నిచోట్ల వైకల్పికము. ప్రధమేతర విభక్తి శత్రర్దక చు వర్ణము నందున్న ఉ కారమునకు సంధి వైకల్పికము. ప్రధమేతర విభక్తులనగా ద్వితీయ - తృతీయ - చతుర్ది - పంచమి - షష్ఠి - సప్తమి - విభక్తులకు శత్రర్దక చువర్ణము నందలి ద్రుతమునకు సంధి వైకల్పికము.

నన్నున్ + అడిగె = నన్నడిగె - నన్నునడిగె
నాకొఱకున్ + ఇచ్చె = నాకొఱకిచ్చె - నాకొఱకునిచ్చె
నాకున్ + ఆదరువు = నాకాదరువు - నాకునాదరవు
నాయందున్ + ఆశ = నాయందాశ - నాయందు నాశ
ఇందున్ + ఉన్నాడు = ఇందున్నాడు - ఇందు, నున్నాడు
ఎందున్ + ఉంటివి = ఎందుంటివి - ఎందునుంటివి
చూచుచున్ + ఏగెను = చూచుచేగెను - చూచుచునేగెను.

4. యడాగమసంధి :

సంధిలేని చోట, స్వరంబుకంటె పరంబైన స్వరంబునకు, యడాగమంబగు.

యట్ + ఆగమము = యడాగమము.

'యట్‌' లోని లు కారము ఈ చేయబోవు యడాగమము. సంధిలోని పర పదము మొదటనే, చేరవలెనని, సూచించి పోవును. య కారములోని అ కారము ఉచ్చారణా ర్దము అని గ్రహించవలెను. చేయబడు ఆగమము కేవలము 'య్‌' మాత్రము అని గ్రహించవలెను. సంధి రానిచోట, అచ్చు తర్వాత నున్న, అచ్చునకు, యకారమాగమ మగునని అర్దము. ఆగమమనగా మరియొక అక్షరము సంధిలో వచ్చి చేరుట.

ఉదా : - మా + అమ్మ - మా + య్ + అమ్మ = మాయమ్మ
         మీ + ఇల్లు - మీ + య్ + ఇల్లు = మీయిల్లు
         మా + ఊరు - మా + య్ + ఊరు = మాయూరు
         ఇదిగో + ఇమ్ము = ఇదిగో + య్ + ఇమ్ము = ఇదిగో యిమ్ము - మొదలైనవి.

5. టుగాగమసంధి :

కర్మధారయమునం దుత్తునకు, అచ్చుపరమైనపుడు, టుగాగమంబగు.

విశేషణ, విశేష్యములకు, జరుగు సమాసము కర్మధారయము.

ఉత్తు = హ్రస్వమైన ఉకారము

టుక్ + ఆగమము = టుగాగమము

టుక్ - అనుపదము లోని 'క్‌' కారము ఈ రాబోవు ఆగమము సంధిలోని పూర్వ పదము చివర చేరవలెనని సూచించును. "టులోని ఉ కారము ఉచ్చారణార్దము ఆగమముగా వచ్చునది 'ట్‌' మాత్రమేయని గ్రహింపవలెను".

ఉదా : - కఱకు + అమ్ము = కఱకు + ట్ + అమ్ము = కఱకుటమ్ము - అట్లే
        నిగ్గు + అద్దము = నిగ్గు + ట్ + అద్దము = నిగ్గుటద్దము
        సరసపు + అలుక = సరసపు + ట్ + అలుక = సరసపుటలుక
        చెక్కు + అద్దము = చెక్కు + ట్ + అద్దము = చెక్కుటద్దము
        పండు + ఆకు = పండు + ట్ + ఆకు = పండుటాకు

II. కర్మధారయమునందు, పేర్వాది శబ్దముల కచ్చు పరంబగునపుడు, టుగాగమము విభాషణగు.

కర్మధారయమున, పేరులోన వానికి అచ్చు పరముకాగా టుగాగమము వైకల్పికముగానగును.

వేరు - చిగురు - తలిరు - అలరు మొదలైనవి పేర్వాదులు.
విభాష అనగా చెప్పిన టుగాగమము
ఒకసారి వచ్చుట - వేఱొకసారి రాక పోవుట అని అర్దము


పేరు + ఉరుము = పేరు + ట్ + ఉరము = పేరుటురము - పేరురము
చిగురు + ఆకు = చిగురు + ట్ + ఆకు = చిగురుటాకు - చిగురాకు
అలరు + అమ్ము = అలరు + ట్ + అమ్ము = అలరుటమ్ము - అలరమ్ము
పొదరు + ఇల్లు = పొదరు + ట్ + ఇల్లు = పొదరుటిల్లు - పొదరిల్లు


6. పుంప్వాదేశసంధి :

కర్మధారయంబునందు, ము వర్ణమునకు, పుంపులగు. పుంపులు - పు - ౦పు - అని అర్దము. ఇవి ఆదేశసంధి.

కర్మధారయ సమాసములోని, పూర్వపదము చివర గల 'ము' అను ప్రథమా విభక్తి ఏక వచన ప్రత్యయమునకు పు - గాని - ంపుగాని ఆదేశమగును.

ఉదా : - సరసము + మాట = సరసపుమాట - సరసంపుమాట
        సౌందర్యము + పాలు = సౌందర్యపుపాలు - సౌందర్యంపుపాలు
        ఆకాశము + పందిరి = ఆకాశపుపందిరి - ఆకాశంపుపందిరి.


7. సరళాదేశసంధి :

ద్రుత, ప్రకృతికముమీది, పరుషములకు సరళములగు. ద్రుతమనగా నకారము - నుకారము - న్ - లుగా గ్రహించవలెను. ద్రుతప్రకృతికముల తరువాత నున్న క చ ట త ప అను వర్ణములకు సరళములగు గ జ డ ద బలు ఆదేశములగును.

పరుషములు
సరళములు.

ఉదా : - పూచెను + కలువలు = పూచెనుగలువలు
         తోచెన్ + చుక్కలు = తోచెనుజుక్కలు
         చేసెన్ + టక్కులు = చేసెను డక్కులు
         నెగడెన్ + తమములు = నెగదెను దమములు
         మొగిడెను + పద్మము = మొగిడెను బద్మము.

II. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషణలు విభాషనగు. ఆదేశ సరళములనగా, వ్యాకరణ కార్యము వల్ల వచ్చిన గ జ డ ద బ లు

బిందువు - సున్న - ౦


ఖండబిందువు - అరసున్న - c

సంశ్లేషమనగా మీది హల్లుతోకూడిక. ఆదేశ సరళములకు, ముందున్న ద్రుతమునకు బిందువుగాని - సంశ్లేషముగాని, వచ్చునని సూత్రార్ధము.

ఉదా : - పూచెను + గలువ = ఇందలి 'గ' ఆదేశ సరళము.
         పూచెంగలువలు = బిందువు
         పూచెంగలువలు = ఖండబిందువు
         పూచెన్గలువలు = సంశ్లేషము.

         తోచెను + జుక్కలు = తోచెంజుక్కలు - తోచెంజుక్కలు - తోజెన్జుక్కలు.
         చేసెను + టెక్కులు = చేసెండెక్కులు - చేసెండెక్కులు - చేసెన్డెక్కులు
         నెగడెను + దమము = నెగడెందమము - నెగడెందమము - నెగడెన్దమము.
         మొగిడెను + బద్మము = మొగిడెంబద్మము - మొగిడెఁబద్మము - (మొగిడెన్బద్మము)

8. గసడదవాదేశ సంధి :

ప్రథమము మీది పరుషములకు, గసడదవలు బహుళముగానగు - ప్రథమా విభక్తులమీది కచటతపలకు వరుసగా గసడదవలగు నని అర్దము. బహుళ మనుటచే వైకల్పికముగా - ఇతరములకు అగునని అర్దము.

ఉదా : - వాడు + కొట్టె = వాడుగొట్టె - వాడుకొట్టె
         నీవు + టక్కరివి = నీవుడక్కరివి - నీవుటక్కరివి
         మీరు + తలడు = మీరుదలడు - మీరుతలడు
         వారు + పోరు = వారువోరు - వారుపోరు.

ఇందు ప్రథమా విభక్తి 'డు' మీది పరుషములకు ఒకసారి గసడదవాదేశమైనది, ఒకసారి రాలేదు. వైకల్పికము (విభాష) అయినది.

ii. ఈ గసడదవాదేశము కళలగు, క్రియా పదములమీద సహితము కానంబడియెడి.

ఉదా : - రారు + కదా = రారుగదా! రారుకదా!

        వత్తురు + పోదురు = వత్తురువోదురు - వత్తురుపోదురు

III. తెనుగులమీది, సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు. సాంస్కృతిక పరుషములనగా సంస్కృత సమశబ్దములు. తెలుగు పదముల మీది సంస్కృత సమ పరుషములకు గసడదవలు రావు.

ఉదా : - వాడు + కంసారి = వాడు కంసారి
         వీడు + చక్రపాణి = వీడు చక్రపాణి
         ఆయది + టంకృతి = ఆయది టంకృతి
         అది + తధ్యము = అది తధ్యము
         ఇది + పథ్యము = ఇది పథ్యము. ఇందు కంసారి - చక్రపాణి - టంకృతి - తద్యము - పథ్యము

మొదలైనవి. సంస్కృత సమ శబ్దములు. అందు వల్ల సరళములురాక, పరుషములే నిల్చినవి.

iv. ద్వంద్వంబునం, బదంబుల పయి పరుషములకు, గసడదవ లగు. ద్వంద్వమనగా ద్వంద్వసమాసము. ద్వంద్వ సమాసముమీది పరుషములకు, గ స డ ద వలు, ఆదేశముగ వచ్చును.

ఉదా : - కూర + కాయ = కూరగాయలు
         కాలు + చేతులు = కాలుసేతులు
         టిక్కు + టెక్కు = టిక్కుడెక్కులు
         తల్లి + తండ్రి = తల్లిదండ్రులు
         ఊరు + పల్లె = ఊరుపల్లెలు
                      దీనికి వైకల్పిక విధిలేదు.

9. రుగాగమ సంధి :

కర్మధారయము లందు, పేదాది శబ్దములకు ఆలు శబ్దము, పరంబగునపుడు, రుగాగమంబగును.

పేదాదులు : పేద - బీద - జవ - కొమ - బాలెంత - మనుమ - గొడ్డు - ముద్ది మొదలగునవి పేదాదులు. ఇవి కేవలము అచ్చతెలుగు పదములకు సంబంధించినవి - ఆలు శబ్దము స్త్రీ మాత్ర పరము.

"రుక్" ఆగమము రుగాగమము. 'క్‌' అను వర్ణము సంధిలో చేయబడు ఆగమవర్ణము. పూర్వపదము చివరి మాత్రమే వచ్చునని, శాసించి పోవును. రు వర్ణములోని ఉ కారము ఉచ్చారణార్దమని గ్రహించవలెను. మిగులునవి 'ర్‌' మాత్రమే.

ఉదా : - పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు
         కొమ + ఆలు = కొమ + ర్ + ఆలు = కొమరాలు
         ముద్ద + ఆలు = ముద్ద + ర్ + ఆలు = ముద్దరాలు
         జవ + ఆలు = జవ + ర్ + ఆలు = జవరాలు
         బాలెంత + ఆలు = బాలెంత + ర్ + ఆలు = బాలెంతరాలు
         మనుమ + ఆలు = మనుమ + ర్ + ఆలు = మనుమరాలు

ii. కర్మధారయంబులందు, తత్సమశబ్దంబులకు, ఆలు శబ్దము పరంబగునపుడు, అత్వంబునకు ఉత్వంబును, రుగాగమంబునగు. తత్సమ శబ్దములకు ఆలు శబ్దము పరమైన ఆ తత్సమశబ్దము చివర అ కారమునకు ఉ కారమునకు, పిదప రుగాగమంబు, వచ్చునని అర్దము.

ఉదా : - ధీర + ఆలు = ధీర + ఉ + ఆలు = ధీరురాలు
         నాయక + ఆలు = నాయక + ఉ + ఆలు
         నాయకు + ర్ + ఆలు = నాయకురాలు
         శ్రీమంత + ఆలు = శ్రీమంత + ఉ + ఆలు
         శ్రీమంతు + ర్ + ఆలు = శ్రీమంతురాలు
         బలవంత + ఆలు = బలవంత + ఉ + ఆలు
         బలవంతు + ర్ + ఆలు = బలవంతురాలు

10. దుగాగమసంధి :

నీ - నా - తన శబ్దములకు, ఉత్తరపదంబు పరంబగునపుడు దుగాగమంబగు.

         దుక్ + ఆగమము = దుగాగమము.
         ఉత్తరపదము పరమగు టయన, సమాసమగు నని భావము. క్ - కారములోపించును.
         నీ + వార్త - నీదు వార్త
         నా + పలుకు - నాదు పలుకు
         తన + రాక - తనదురాక

11. ద్విరుక్తటకారసంధి :

కుఱు - చిఱు - కడు - నడు - నిడు శబ్దముల ఱ - డలకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.

కుఱు - చిఱు అను పదములలోని ఱకారమునకు - నడు - నిడు - కడు పదములలోని డ కారమునకు - అచ్చుతో మొదలైన పదములు పరమైన, ద్విరుక్తమగు 'ట్ట్‌' ఆదేశమగును. ఱ - డ లు అనగా ఱకార, డ కారములు. ద్విరుక్తమనగా రెండు మారులు పలుకబడుట - ద్విత్వము.

ఉదా : - కుఱు + ఉసురు = కుట్ + ట్ + ఉసురు = కుట్టుసురు.
         చిఱు + ఎలుక = చిట్ + ట్ + ఎలుక = చిట్టెలుక.
         నడు + ఇల్లు = నట్ + ట్ + ఇల్లు = నట్టిల్లు.
         నిడు + ఊర్పు = నిట్ + ట్ + ఊర్పు = నిట్టూర్పు.
         కడు + అలుక = కట్ + ట్ + అలుక = కట్టలుక.

12. త్రికసంధి :

1. ఆ - ఈ - ఏ లు త్రికములు అనబడును.

2. త్రికంబుమీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3. ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆచ్చికంబుమీది దీర్ఘంబునకు హ్రస్వంబగు

ఉదా : - ఆ + కన్య - త్రికము.

రెండవ సూత్రము వలన ఉత్తర పదాది అక్షరమైన 'క' అసంయుక్తము కాన దానికి ద్విత్వము వచ్చి, ఆ + క్కన్య - అయినది. మూడవ సూత్రము వలన, ద్విరుక్తమైన హల్లుకు పూర్వమందున్న ఆచ్చికమగు, ఆకారము హ్రస్వమై - అకారమగును.

అప్పుడు అక్కన్య - అను రూపమేర్పడును. ఆచ్చికములు - తెలుగు పదములు, ద్విరుక్తము. రెండుసార్లు ఉచ్చరించబడునది.

ఉదా : - ఆ + కాన = అక్కాన
         ఈ + కాన = ఇక్కాన
         ఏ + కాన = ఎక్కాన

      అట్లే అత్తరి - ఇత్తరి - ఎత్తరి - రూపములు గ్రహించునది.

13. ఆమ్రేడిత సంధి :

I. అచ్చునకు ఆమ్రేడితము, పరంబగునపుడు సంధి తరుచుగా అగును. ద్విరుక్తము యొక్క పర రూపము ఆమ్రేడితము.

        ఔర + ఔర = ఔర - ఆమ్రేడితము
        ఆహా + ఆహా = ఆహాహా
        ఎట్టు + ఎట్టూ = ఎట్టెట్టూ
        ఏగి + ఏగి = ఏగేగి
        ఏమి + ఏమి = ఏమేమి - ఏమియేమి

ఏమ్యాదుల ఇ కారమునకు సంధి వైకల్పికము అగుటవలన ఏమికి రెండు రూపములు వచ్చినవి.

II. ఆమ్రేడితంబు పరంబగునపుడు కడాదుల తొలియచ్చుమీది వర్ణంబులలెల్ల, అదంతంబగు, ద్విరుక్తటకారంబగు.

కడాదులు - కడ - ఎదురు - కొన - చివర - తుద - తెన్ను - తెరవు - నడుమ - పగలు - పిడుగు - బయలు - మొదలు ఇత్యాదులు. ఆమ్రేడితమున మొదటి పదముమీది వర్ణముల కన్నింటికి, హ్రస్వ అకారము అంతముందు గల ద్విరుక్తటకారము ఆదేశమగును.

కడ + కడ = క + ట్ట + కడ = కట్టకడ.

ఎదురు + ఎదురు = ఎ + ట్ట్ + ఎదురు = ఎట్టయెదురు

ఇట్లే తక్కినవి గ్రహించునది.

iii. ఆమ్రేడితంబు పరంబగునపుడు విభక్తి లోపంబు తరుచుగ నగు. ఆమ్రేడితము పరమగునపుడు పూర్వపదము తుది నున్న విభక్తి బహుళముగ లోపించును.

అప్పటికిన్ + అప్పటికిన్ = అప్పటప్పటికిన్ - అప్పటికప్పటికిన్.
అక్కడన్ + అక్కడన్ = అక్కడక్కడన్ - అక్కడనక్కడన్.
ఇంటన్ + ఇంటన్ = ఇంటింటన్ - ఇంటనింటన్.

బహుళమనుటచే, ఇంచుక - నాడు ఇత్యాదులందును విభక్తి లోపించును.

ఇంచుక + ఇంచుక = ఇంచించుక - ఇంచుకయించుక
నాడు + నాడు = నానాడు - నాడునాడు.

IV. అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యములు. అదుకు మొదలగునవి ప్రయోగించినట్లే తక్కినవియు ప్రయోగార్హములని గ్రహించవలెను.

ఉదా : అదుకు + అదుకు = అందదుకు
      ఇంకులు + ఇంకులు = ఇఱ్ఱింకులు
      ఇగ్గులు + ఇగ్గులు = ఇల్లిగ్గులు
      చెదరు + చెదరు = చెల్లాచెదరు
      తునియలు + తునియలు = తుత్తునియలు
      మిట్లు + మిట్లు = మిరుమిట్లు.

14. నుగాగమసంధి :

సమాసంబున, నుదంత స్త్రీ సమంబులకు, పుంపులకు అదంత గుణ వాచకంబునకు, తనంబు పరంబగునపుడు నుగాగమంబగు. సమాసము నందు, హ్రస్వ ఉ కారము చివర గల స్త్రీ సమపదములకు, - పుంపులకు, హ్రస్వ అకారము, చివరగల గుణవాచకములకు, తనయు పరంబగునపుడు నుగాగమమగును. ఇది వచ్చినపుడు అర్దబిందు - బిందు - సంశ్లేష రూపములు మూడును జరుగును.

ఉదా : - సొగసు + తనము = సొగసు + న్ + తనము = సొగసుందనము
                                            సొగసుందనము
                                            సొగసున్దనము
                              సొగసు - ఉదంత స్త్రీసమము.

ఉదా : రాజు + యొక్క + ఆజ్ఞ
      రాజు + ఆజ్ఞ
      రాజు + ను + ఆజ్ఞ - రాజునాజ్ఞ.
      పితృ + ను + ఆనతి = పితృనానతి అగును.

15. ప్రాతాధిసంధి :

సమాసంబున, ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబుల లెల్ల, లోపంబు బహుళంబుగానగు

ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు - ప్రాతయిల్లు
లేత + దూడ = లేదూడ - లేతదూడ
పూవు + రెమ్మ = పూరెమ్మ - పూవురెమ్మ.

ప్రాత మొదలగు, శబ్దములచే నేర్పడు సమాసమున మొదటి అచ్చుమీది, వర్ణంబులకెల్లను లోపము బహుళముగా నగును.

ప్ + ర్ + ఆ - త్ + అ = ప్రాత - ఇందు మొదటి అచ్చు 'అ' మీది అక్షరములన్నియు లోపింపగా ప్ + ర్ + ఆ = మిగిలి (ప్రా) త్ + అ = త లోపించును. అప్పుడు ప్రా - ఇల్లు - యడాగమమురాగా ప్రా + య్ + ఇల్లు = ప్రాయిల్లు - లోపించనియెడల ప్రాతయిల్లు అనియే యుండును ఇట్లే తక్కిన ఉదాహరణములు గ్రహించునది.

ii. లుప్త శేషమునకు, పరుషములు పరములగునపుడు, నుగాగమంబగు.

         ప్రాత + కెంపు = ప్రాగెంపు
         లేత + కొమ్మ = లేగొమ్మ
         పూవు + తోట = పూదోట
         మీదు + కడ = మీగడ
         కెంపు + తామర = కెందామర
         చెన్ను + తోవ = చెందోవ.

లుప్త శేషమున, లోపింపగా మిగిలినది, ప్రాతలో త లోపింప ప్రా మిగులును. దానికి పరుషము పరముకాగా నుగాగమమగును. ప్రాతలో తలోపింప ప్రా శేషించును. ప్రా + కెంపు - అనుచో ప్రా మీది 'కె' పరుషము పరముకాగా నుగాగమమై ప్రా + ను + కెంపు = ప్రాగెంపు. ఇచ్చట సరళాదేశసంధి యు జరిగినది, ఇట్లే పూదోట తెలియునది. మీదు + కడలో 'దు' లోపించి - మీ + కడ యగును. నుగాగమమైన, సరళాదేశసంధి జరిగి, మీ + ను + కడ = మీగడ అగును. కెంపులో కె మిగులును - తామర అను దానిలో, తా పరుషము చేరగా, నుగాగమ మగును. కె + ను + తామర = కెందామర.

ఇందు ద్రుత సంధి జరిగి, కెందామర అయింది.
అట్లే చెన్ను + తొవ
    చె + తొవ
    చె + ను + తొవ - చెందొవ.

iii. క్రొత్త శబ్దమునకు, అధ్యక్షర శేషమునకు కొన్ని యెడల, నుగాగమంబును, కొన్ని యెడల మీది హల్లునకు ద్విత్వము నగు.

       క్రొత్త + చాయ = క్రొంజాయ
       క్రొత్త + చెమట = క్రొంజెమట
       క్రొత్త + పసిడి = క్రొంబసిడి
       క్రొత్త + కారు = క్రొక్కారు
       క్రొత్త + నన = క్రొన్నన
       క్రొత్త + తావి = క్రొత్తావి.

క్రొత్త శబ్దము ప్రాతాదుల లోనిది. క్రొత్తలో మొదటి అక్షరమునకు పరుషము పరముకాగా, నుగాగమ మగును. కొన్ని చోట్ల మీది హల్లున మీ ద్విత్వమగును. క్రొత్తలో - క్రొ మిగిలును - చాయ - పరము కాగా నుగాగమమువచ్చి క్రొ + ను + చాయ అగును. తర్వాత సరళాదేశము వచ్చి నిండు సున్న వచ్చి - క్రొంజాయ అయినది.

అట్లే క్రొంజెమట - క్రొంబసిడి గ్రహించునది.

క్రొత్తలో క్రొ మిగిలి కారులో - కా పరుషము - సరళము కాగా నుగాగమము రాక బహుళ గ్రహణముచే హల్లునకు ద్విత్వము వచ్చును.

      క్రొ + కారు - క్రొ + క్ + కారు = క్రొక్కారు
      క్రొ + నన - క్రొ + న్ + నన = క్రొన్నన
      క్రొ + తావి - క్రొ + త్ + తావి = క్రొత్తావి.

iv. అన్వంబులకు సహితమీ, కార్యంబు కొండొకచో కానంబడెయెడి.

      పది + తొమ్మిది = పందొమ్మిది
      తొమ్మిది + పది = తొంబది
      వంక + చెఱకు = వంజెఱకు
      సగము + కోరు = సంగోరు
      నిందు + వెర = నివ్వెర
      నెఱ + తఱి = నెత్తఱి

పది + తొమ్మిది - ప మిగిలి, తొమ్మిది పరముకాగా, నుగాగమమై - సరళాదేశము వచ్చి - ప + న్ + తొమ్మిది = పందొమ్మిది అయినది. ఇందు నిండు సున్న చేరినది. అట్లే తొంబదిలోను రూపములు గ్రహించునది.

నిండు + వెర = లో - ని మిగిలి - వెరపరము కాగా, మీది హల్లునకు ద్విత్వము వచ్చి ని + వ్ + వెర = నివ్వెర అయినది. అట్లే తక్కిన రూపము లెరుగునది.

16. పడ్వాదేశసంధి :

పడ్వాదులు, పరంబగునపుడు, ము వర్ణమునకు లోప, పూర్ణబిందువులు, విభాషనగు.

       భయము + పడె - భయపడె
                      భయంపడె
                      భయముపడె
       సూత్రము + పట్టె - సూత్రపట్టె
                      సూత్రం పట్టె
                      సూత్రముపట్టె.

పడ్వాదులు - పడు - పెట్టు - పెట్టు మొ..నవి. ఈ కార్యము కర్తృవాచి ము వర్ణమునకు కలుగదు.

గజముపడియె - అశ్వము పడియె. పడు - మొదలగునవి. పరంబగునపుడు ప్రథమా విభక్తి ప్రత్యయముగల, ము వర్ణమునకు లోపముగాని, పూర్ణ బిందువుగాని వికల్పముగా వచ్చును. భయము + పడె = భయపడె. ము వర్ణము లోపించినది. పూర్ణ బిందువు రాగా భయంపడె రూపము కల్గును. ఈ లోప - పూర్ణ బిందువులు రానిచో భయముపడె అని లోపముకాని రూపమే యుండును. ఇట్లే రెండవ ఉదాహరణము గ్రహించునది. ఈ ము వర్ణలోపము కర్తను దెల్పు పదమునకు కలుగదు. గజముపడె - ఇది పడియె అను క్రియాపదమునకు గజము కర్త. దాని ము వర్ణమునకు లోపమురాదు. పూర్ణ బిందువును కలుగదు. గజంపడియె - అశ్వంపడియె - అనునవి అసాధు రూపములు.

17. డు వర్ణ లోప సంధి :

సమానాధికరణంబగు, ఉత్తరపదంబు, పరంబగు నపుడు, మూడుశబ్దము, డు వర్ణమునకు లోపమును, మీది హల్లునకు, ద్విత్వమును విభాషనగు.

మూడు + జగములు = ముజ్జగములు

మూడు + లోకములు = ముల్లోకములు

విశేషణ విశేష్యములకు ఒక పదమే ఆశ్రయమగుట సమానాది కరణము. అట్టి సమాసములో ఉత్తర పదము పరమగునపుడు పూర్వపదముగా మూడు శబ్దమున్న యెడల దానిలోని డు - లోపించి మీది హల్లునకు ద్విత్వము వచ్చును.

మూ + జ్జగములు.

ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు, ఆచ్చికంబు మీది, దీర్ఘంబునకు హ్రస్వంబగు, అను సూత్రము ననుసరించి, 'మూ' లోని దీర్ఘము లోపించి 'ము' అగును - అప్పుడు

ముజ్జగములు - ముల్లోకములు

అను రూపములు ఏర్పడును.

18. పోడ్వాదేశసంధి :

బహువ్రీహిని స్త్రీ వాచ్యంబగుచో, ను సమానంబు మీది, మేనునకు బోడియగు. పూర్వపద ముపమావాచకమై, యుత్తర పదముగా మేను శబ్దమున్నచో, ఆ మేను శబ్దమునకు పోడియను నదాదేశముగ వచ్చును.

       అలరు + మేను = అలరుబోడి
       నన + మేను = ననబోడి
       పూ + మేను = పూబోడి
       విరి + మేను = విరిబోడి.

19. లు-ల-న ల సంధి :

లు-ల-నలు పరంబగునపుడు డొకానొకచో, ముగాగమంబునకు లోపంబును తత్పూర్వస్వరంబునకు, దీర్ఘంబును విభాషణగు లు-ల-నలు పరమగు నపుడు, ఆగమమైన 'ము' వర్ణమునకు కొన్ని చోటుల లోపమును దానికి ముందున్న అచ్చునకు దీర్ఘమును వికల్పముగా వచ్చును.

        వజ్రము + లు = వజ్రాలు
        వజ్రము + ల = వజ్రాల
        వజ్రము + న = వజ్రాన
        పగడము + లు = పగడాలు
        పగడము + ల = పగడాల
        పగడము + న = పగడాన

20. అపదాదిస్వరసంధి :

అందు అవగాగమంబు లందప్ప, నపదాది స్వరంబు పరంబగునపుడు అచ్చునకు సంధియగు.

       మూర + ఎడు = మూరెడు
       వీసె + ఎడు = వీసెడు
       ఇందు 'ఎడు' అపదము. అనగా స్వతంత్ర ప్రయోగములేనిది.

21. అల్లోపసంధి :

అది - అవి శబ్దముల అకారమునకు సమాసమున, లోపము బహుళముగ వచ్చును.

ఉదా : ఎక్కడ + అది = ఎక్కడిది
       ఎట్టి + అది = ఎట్టిది
       నా + అది = నాది.

22. తకారదేశసంధి :

       చు వర్ణంబు తోడి, దుగ్దకారంబు తకారంబగు.

       ఇచ్చు + దును = ఇత్తును
       వచ్చు + దము = వత్తము
       తెచ్చు + దును = తెత్తును
       చూచు + దము = చూతము
       నియమించు + దురు = నియమింతురు.

23. తచ్చబ్ద వకారలోపసంధి :

ఉన్న - కల - న వర్ణముల మీది తచ్చబ్ద వ కారమునకు, లోపము విభాషణగు.

  ఉదా : - ఉన్న + వాడు = ఉన్నాడు - ఉన్నవాడు
           కల + వాడు = కలాడు - కలవాడు
           చేసిన + వాడు = చేసినాడు - చేసినవాడు.

ఆచ్చిక సమాసము లందు, తఱచుగ వర్ణలోప - ఆగమ - ఆదేశాది వికారములు నిత్యవైకల్పికముగా పెక్కులు కానంబడియెడి-

   ఉదా : - అంత + దాక = అందాక
            కవ + వడి = కవ్వడి
            సగము + పాలు = సాబాలు
            ఏడు + పది = డెబ్బది
            నడుము + రేయి = నడురేయి
            నిక్కము + కల = నిక్కల
            మూడు + న్నాళ్లు = మూన్నాళ్లు
            ఇంత + దనుక = ఇందనుక.

3. ప్రశ్నలు

1) సంధి అనగానేమి ? సంది యెట్లు జరుగును ?
2) ఆగమ - ఆదేశ - ఏకాసంధులను వివరింపుము ?
3) సంస్కృత సంధులేవి ? అనునాసిక సంధిని సోదాహరణముగ తెల్పుము.
4) ఈక్రింది సంధులకు సూత్రములు వ్రాయుము.

1) ప్రాయిల్లు 2) ఏమంటివి 3) వాడెవడు 4) మాయమ్మ 5) చెక్కుటద్దము 6) సరసపుమాట 7) కూరగాయలు 8) పేదరాలు 9) నిట్టూర్పు 10) అక్కాన.