లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/పద-వాక్య విభాగము

వికీసోర్స్ నుండి


(2) పదవాక్య విభాగము

పదపరిచ్చేదము - Etymology

అర్థవంతమైన అక్షరముగాని, అర్థవంతమైన అక్షరసము దాయము గాని పదమనబడును. పదములు పూర్ణార్థమునీయక వాక్యాంశములై యుండును. తెలుగు భాషయందు ఐదు విధముల పదములు గలవు.

1. తత్సమములు.
2. తద్భవములు.
3. దేశ్యములు.
4. అన్యదేశములు.
5. గ్రామ్యములు.

తత్సమములు

తెనుగు భాషయందు తత్సమములు 14814, తద్భవములు 2083, దేశ్యములు 12337 కలవని నిఘంటు వలన తెలియుచున్నది.

చరిత్ర మొదలగు పదములకు మువర్ణకంబు కలిగి యొక రూపమును లేక ఒక రూపమును కలదు.

చరిత - అణిమ - అక్షత - అర్పణ - ఆరాధన - కంధర - గరిమ - గ్రీవ - చామర - తరంగ - దంష్ట్ర - నటన - పఠన - పాదుక - పారణ - ప్రశ్న - భ్రమ - భిక్ష - మహిమ - లఘిమ - వధ - వేధ - హంస - మొదలైనవి.

కుశ - దర్భ - మొదలగు కొన్ని పదములకు మువర్ణ కంబు రాదు.

దీర్ఘములగు ఏకా క్షర పదములు కురుచలు కావు.
శ్రీ - హ్రీ - ధీ - గ్లౌ - స్త్రీ - మా. మొదలైనవి.

మిత్ర శరణ ప్రధాన పాత్రాదులు పుల్లింగ రూపమునను, నపుంసక రూపమున నుండును.

మిత్రము - మిత్రుడు - శరణము - శరణుడు - ప్రధానము - ప్రధానుడు - పాత్రము - పాత్రుడు - భాజనము - భాజనుడు - వృద్ధుడు. మొదలగు కొన్ని పదములలో డు - వర్ణ కంబు లోపించును. ఉత్వము లోపించదు.

వృద్ధుడు - వృద్ధు; గృహస్థుడు - గృహస్థు; మూర్ఖుడు - మూర్ఖు; నీచుడు - నీచు; ఛార్వకుడు - చార్వాకు - మొదలైనవి.

దూత మొదలగు కొన్నింటికి ఉత్వ'డు', వర్ణకంబులు లోపించును.

దూతుడు - దూత
యోధుడు - యోధ
శుంఠుడు - శుంఠ మొదలైనవి.

విశ్వకర్మ మొదలగు పదములకు ఉత్వ'డు', వర్ణకంబులు రావు.

విశ్వకర్మ - కృష్ణవర్మ - అశ్వత్థామ - యజ్వ - బ్రహ్మ మొదలైనవి.

దీర్ఘంబు మీది హల్లునకు ద్విత్వంబు వైకల్పికము.

వాక్కు - వాకు; విరాట్టు - విరాటు - మనస్సు మొదలగు పదములకు ద్విత్వము వైకల్పికము. 'న'కారంబు లోపమై ము వర్ణకము వచ్చును.

మనస్సు - మనసు - మనము

శిరస్సు - శిరసు - శిరము.


సదస్సు - సదసు - సదము.

కొన్నింటికి 'ము' వర్ణకము రాదు.

హవిస్సు - పయస్సు - వయస్సు మొదలైనవి.
తత్సమముల గుర్తించు విధము. :-
ఋ - ఋ - ఌ - ౡ - విసర్గ - ఖ - ఛ - ఠ - థ - ఫ - ఘ - ఝ - ఢ - ధ - భ - ఙ - ఞ - శ - ష - లు గల శబ్దములు.
సంస్కృత సమములు.
కృప - పితృణము - క్ఌప్తి - ౡ - కారము పయఃపానము - ఖడ్గము - ఛత్రము - కంఠము - రథము - ఫలము - ఘటము - ఝరము - ఢక్క - ధనము - భరము - శార్జ్గము - అజ్ఞ - శరము - షండము.

య కారమును జై - చై - లును - మొదట గల శబ్దములు సంస్కృత సమములు.

యతి - యావకము - యియాసువు - యుక్తము - యూపము - యోగము - యౌవనము - మొదలగు యాది శబ్దములును, జైమిని - చైత్రము మొదలగు జై - చై మొదట గల శబ్దములును సంస్కృత సమములు.

స్థిరములకు ముందు బిందువు గల పదములు సంస్కృత సమములు.

నంయమి - హంస - సింహము - మొదలగు,

క్రావడి కాక యితర సంయోగ మాదియందు గల శబ్దములు సంస్కృత సమములు.

స్యందనము - గ్లాని - క్వాచిత్కము - స్నానము - క్లమము - స్వరము - మొదలగునవి.
అ - ఆ - ఉ - ఊ - ఓ - ఔ - లతో కలిసి యు తా ల వ్య చ - జలు గల శబ్దములు సంస్కృత సమములు.
చంద్రుడు - చామరము - చంద్రిక - చూర్ణము - చోరుడు - చౌర్యము - జట - జాతి - మంజులము - జూటము రజోగుణము - వ్రజౌకము మొదలగునవి.

త్ర్యాది సంయోగము గల శబ్దములు సంస్కృత సమములు. (త్రి + ఆది = (త్యాది)

మత్స్యము - అగ్ర్యము - కార్త్న్యము మొదలగునవి. సమాసముల మారు శబ్దములు సంస్కృత సమములు.

ధనము - ధనాఢ్యుడు.
వనము - వనవాసము.
రాముడు - రామ బాణము.

హలంత శబ్దములు (తత్సమములు) సంస్కృత సమములు.

దిక్ - దిగీశుడు
అజ్ - అజంతము.
చిత్ - చిదంబరము.
రాట్ - రాట్కులము.
కకుప్ - కకుబంతము మొ..లైనవి

తద్భవములు

తద్భవములు వర్ణలోప - వర్ణాగమ - వర్ణాదేశ - వర్ణ వ్యత్యయంబుల పొంది యేర్పడుచున్నవి. ఇవి వికృతులు.

వర్ణ లోపము : (అక్షర లోపము)

హరణము - అరణము.
పరీక్షించు - పరికించు,
ప్రయాణము - పయనము.
స్మరుడు - మరుడు.
పటోలి - పొట్ల.
యశము - అసము.
పున్నాగము - పొన్న.
ఉపాధ్యాయుడు - ఒజ్జ.


వర్ణాగమము (అక్షరము అధికముగా వచ్చును)

రాత్రి - రాతిరి;
యాత్ర - జాతర.
జీరకము - జీలకఱ్ఱ.
యత్నము - జతనము.
పుష్పము - పొరట;
వృషభము - బసవడు.
హర్షము - అరుసము.

వర్ణాదేశము :- ఉన్న అక్షరము పోయి క్రొత్తది వచ్చుట.

నీరము - నీరు;
ఇంగాలము - ఇంగలము.
యముడు - జముడు;
వకుళము - పొగడ
వూగము - పోక
కుబ్జుడు - గుజ్జు
రూపము - రూపు
కలశము - కడవ

వర్ణవ్యత్యయము (అక్షరముల తారు మారు)

అలీకము - కల్ల;
కక్షము - చంక
శుచి - చిచ్చు;
పంకించు - పంపించు

అర్ద భేదముచే వికృతులు భేదించును.

పూగము (గుంపు)- ప్రోగు.
పూగము (వక్క)- పోక
కాలము (సమయము)- కారు.
కాలము (నలుపు)- కాఱు

భిన్నపదములకు ఏకరూపమగు వికృతులుండును.

కృత్తిక - కత్తెర. కర్తరి - కత్తెర.
కాలము - కాఱు. గహనము - కాఱు.

కొన్ని పదముల కొక యర్థమున వికృతి యుండి యొకప్పుడు లేకుండును.

వంశము (కులము) వంగడము. వెదురు అర్థమున వికృతి లేదు.

పురము (పట్టణము) ప్రోలు.

దేహమను అర్థమున వికృతి లేదు.

ఒక్క యర్థముననే కొన్ని పదముల కనేక వికృతులుండును

మృగము మెకము
మెగము
హృదయము
ఎద
ఎడద

అన్ని పదములకు వికృతులుండవు. కొన్నిటిలో మాత్రమే వికృతులుండును.

దేశ్యములు

త్రిలింగ దేశ వ్యవహార సిద్దమగు భాష వ్యాకరణముననుసరించి తెనుగు దేశమునందు గ్రంథములందు వాడు భాష దేశ్యము.

పాలు - పెరుగు తల్లి - తండ్రి
అక్క - అన్న మొదలైనవి

ఊరు - పేరు - తల్లి తండ్రి - మొదలగు మాటలు తద్భవములు - తత్సమములు కాక మన భాషలో వ్యవహరింప బడుచున్నవి. ఇట్టివి దేశ్యములు.

అన్య దేశ్యములు

ఇతర దేశ భాషా పదములైయుండి కాలక్రమమున తెలుగు భాషా పదములలో కలిసి పోయినవి.

ఆంగ్లము : రైలు - టికెటు - కార్డు - పెన్ను.
హింది : దస్తావేజు - హాజరము
తమిళము : కెలసము - తిరుమణి - తిరుచూర్ణము.

గ్రామ్యము

లక్షణ - (వ్యాకర) విరుద్ధమగు భాష గ్రామ్యము. ఇది ప్రత్యేక భాష కాదు. దేశ్యము మొదలగు వాని అపభ్రంశమే గ్రామ్యము.

రామునికి - బదులుగా రాముడికి.
సంతోషము - బదులుగా సంతోషం అనుట గ్రామ్యమే.

కూ కో - లెగు - ఏంది - మొదలగునవి నింద్య గ్రామ్యములు. ఇట్టివి గ్రంధములందు వాడరాదు. అనుకరణమునందు గ్రామ్యము ప్రయోగింప వచ్చును.

"మొక్కేముసామి" యని వేట గ్రాండ్రనిరి. మొ..లగునవి

ఆర్యవ్యవహార దృష్ణమనింద్యము.

కఱకంఠుడు - ప్రాణగోడ్డము.

దినవెచ్చము - రాయభారము మొ..నవి.ఈ ప్రయోగములు నన్నయ - శ్రీనాధాది మహాకవులవి. వీనికి అనింద్యగ్రామ్యమని పేరు. కొందరు వీనిని తద్బవములను చున్నారు.

భాషా భాగములు

తెలుగు పదములు అయిదు విధములు .అవి.
1. నామవాచకములు (Nouns)
2.

సర్వనామములు(pronouns).

3. విశేషణములు(Adjectives).
4. అవ్యయములు(Propositives).
5. క్రియలు(Verb).

1.

నామవాచకములు (Nouns):వీనిని విశేష్యములందురు. ఇంద్రి యాదులకు గోచరించు వస్తువులను గూర్చి తెలియ జేయునవి నామ వాచకములు. ఇవి ఏడు విధములు.
1. సంజ్ఞా నామవాచకము. (proper noun): ప్రత్యేకముగా ఒక్కొక్క దానికి పెట్టబడిన పేర్లను గూర్చి తెలుపునవి.
ఉదా : బొంబాయి - రాముడు - హిమాలయము - గంగా - మొదలైనవి.
2. జాతి నామవాచకము (Common noun) : జాతిని గూర్చి ప్రత్యేకముగా తెల్పునది.
ఉదా : మేక - ఆవు - కోతి - కుక్క. మొదలైనవి.
3. గుణ నామవాచకము : మనుష్యులయొక్క, ప్రదేశముల యొక్క గుణమును గూర్చి తెలుపునవి.
ఉదా : నలుపు - తెలుపు - పులుపు - మొ..నవి.
4. సమూహ నామవాచకము (Colleective noun) : మనుష్యుల యొక్క గాని, వస్తువుల యొక్కగాని ప్రత్యేకముగా ఏకరాశిగా తెల్పునవి.
ఉదా : గుంపు, మంద, రాశి, ప్రోగు.
5. భావ నామవాచకము : ఇంద్రియ గోచరముగాని మనోభావముల దెల్పునవి.
ఉదా : తెలివి - ధర్మము - న్యాయము - ప్రేమ - హర్షము.
6. క్రియా నామవాచకము : క్రియలనుండి పుట్టినవి.
ఉదా : నేయు - నేత - కోయు - కోత - వండు - వంట - నడుచు - నడక.
7. లోహాది నామవాచకము : లోహాది ఘన పదార్దములను, ధాన్యమును గూర్చి తెల్పునవి.
ఉదా : బంగారము - వెండి - ఱాయి - బియ్యము.

లింగము

1. మహద్వాచకము
2. మహతీవాచకము
3. అమహద్వాచకములు

తెలుగు భాషయందు మహద్వాచకము - మహతీవాచకము - అమహద్వాచకమని లింగములు మూడు విధములు. వీనినే మహదర్దకము - మహత్యర్దకము - అమహదర్దకము అని వ్యవహరింతురు. దేవ మనుష్య జాతులలోని పురుష నామములకు మహద్వాచకములని పేరు.

ఇంద్రుడు - రావణుడు - హరి - రాముడు - రంగడు - ఇత్యాదులు

విభక్తులు: ఏక - బహువచనములు

ప్ర. వి : రాముడు - వనము - ధేనువు - (ఏక)

చిలుకలు - (బహు)

ద్వి. వి : రాముని - వనమును - (ఏక)

ధేనువులన్ - చిలుకలగూర్చి (బహు)

తృ. వి : రాముని చే - వనముచే - ధేనువుతో - (ఏక)

చిలుకలతోడన్ - (బహు)

చ. వి : రాముని కొఱకు - వనమునకై - ధేనువునకై - (ఏక)

చిలుకల కొఱకున్ - (బహు)

పం. వి : రాముని వలనన్ - వనమున కంటేన్ - ధేనువు నుండి. - (ఏక)

చిలుకల పట్టి - (బహు)

ష. వి : రామునికిన్ - వనమునకున్ - ధేనువుయొక్క - (ఏక)

చిలుకలలోన్ - (బహు)

స. వి : రాముని యందున్ - వనమునన్ - ధేనువునందున్ - (ఏక)

చిలుకల యందున్ - (బహు)

సంబోధనా ప్రధమావిభక్తి:-

ఓ రాముడా!
ఓ రాముడ!
ఓసి చిలుకా!
ఓసీ చిలుక!
ఓయి రామా! ఓరి రామా!
ఓయీ రామ! ఓరీ రామ!

పై చెప్పబడిన ప్రధమా విభక్తి ప్రత్యయములు ఎవ్వియు కనిపింపకున్నను, ఆ పదము నామవాచకముగా గాని, సర్వనామముగాగాని యుండి ఇతర విభక్తి ప్రత్యయము లెవ్వియు నందు కన్పింపకున్నచో అది ప్రధమాంతముగ గ్రహించవలెను.

చిలుక - అన్న - సీత - రాజు - హరి - మొ..నవి.

విశేషాంశములు

సంస్కృత పదములు కొన్నింటికి - ఇ - ని- అ - ఇక మొదలగు ప్రత్యయములు చేర్చుట వలన పుల్లింగములు స్త్రీ లింగములుగా మారును.

పుం. -స్త్రీ. (ఇ) పుం. -స్త్రీ (అ)
జనకుడు -జనని బాలుడు -బాల
బ్రాహ్మణుడు -బ్రాహ్మణి సుతుడు -సుత
పద్మాక్షుడు -పద్మాక్షి పద్మనేత్రుడు -పద్మనేత్ర
ప్రభువు -ప్రభ్వి శూద్రుడు -శూద్ర
సుందరాంగుడు -సుందరాంగి ధన్యుడు -ధన్య
దేవుడు -దేవి ప్రియుడు -ప్రియ
కర్త -కర్త్రి


పుం. -స్త్రీ. (ని)
బుద్ధిశాలి -బుద్ధిశాలిని
చక్రవర్తి -చక్రవర్తిని
రాజు -రాజ్ఞి
యశస్వి -యశస్విని


పుం. -స్త్రీ. (ఇక)
బాలుడు -బాలిక
దూతుడు -దూతిక
పుత్రుడు -పుత్రిక
పరిచారకుడు -పరిచారిక

నిత్యైక వచనములు

బహు వచనములు లేనివి, నిత్యైక వచనములు.

1. బంగారము - వెండి - రాగి - ఇనుము - సీసము - కంచు - ఇత్తడి - తుత్తనాగము మొదలైనవి.

2. నిన్న - మొన్న - రేపు - మాపు - అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు - మొదలగు కాలముల దెలుపునవియు, అచ్చట - ఇచ్చట - అట మొదలగు స్థలముల దెలుపునవి.

3. కేలు - ఇరులు మొదలగు కొన్ని పదములును, ప్రత్తి - దూది మొదలగు సస్య వాచకములు.

4. నలుపు - తెలుపు - పసుపు - మొదలగు రంగుల తెల్పునవి.

5. సరి - సాన - ఈడు - జోడు - ఎన - ఉద్ది - దీటు మొదలగు సమానార్థకములు.

6. నూనె - నేయి - చమురు - కర్పూరము - బెల్లము మొదలగు రసవాచకములు.

7. బియ్యము - జీలకఱ్ఱ - మొదలగు ధాన్య వాచకములును - పసుపు - ఉప్పు - చింతపండు పులుసు మొదలగు సంభార వాచకములును నిత్యైక వచనములు.

నిత్య బహువచనములు

1. వడ్లు - పెసలు - కందులు - మినుములు - సెనగలు - జొన్నలు మొదలగు ధాన్య వాచకములు. 2. దాగుడు మూతలు - అచ్చనగాయలు - ఓమన గుంటలు - చల్లుడు పిచ్చెలు - గుజ్జెన గూళ్లు - గొబ్బిళ్లు - మొదలగు క్రీడా వాచకములు.

3. ఇద్దరు - ముగ్గురు - పలువురు - అందరు - ఇందరు - ఎందరు - కొందరు మొదలగు సంఖ్యేయార్దకములు.

4. గుగ్గిళ్లు - కురులు - పులకలు - పేలాలు - బొరుగులు - మనము (మీరు + మేము) మొదలగునవి నిత్య బహువచనములు.

విభక్తుల ప్రయోగము

తృతీయ యందు చేత - చే ప్రత్యయములకు 'చేసి' అను అవ్యయమును, తోడ - తో ప్రత్యయములకు మై - మేఱు అను అవ్యయమును వచ్చుట కలదు.

1. దానం చేసినా కార్యంబయ్యె.
   అతని సాయముంజేసి బ్రతుకగలిగితి.
   రయముమై జనుదెంచె శ్రద్ధమై వినిరి.

2. చతుర్థీ ప్రత్యయమునకు పొంటె అను అవ్యయము వచ్చుట కలదు. జగముల రక్షించు పొంటె రాముడవతరించె.

3. పంచమి యందు వలనకు నుండి ఎడ - కొలె - పోక అవ్యయములును, కంటెకు కన్న అవ్యయమును వచ్చును. నీ నుండి బ్రదికితి. దొంగల యెడ భయము - అతని కన్న ఇతడు పెద్ద మొ..నవి. ఈ ఉండికి - కొలె కొలె అవ్యయములు వచ్చును. నాటి నుండి - నాటగొలె - నాటగోలె మొ..నవి. 4. షష్ఠి యందు సంబంధార్థమున - నీ - నా - తన - లకు - దు ప్రత్యయము వచ్చుట గలదు. నీపని - నీదు పని - నాదు పుస్తకము.

5. స్త్రీల సంబోధించునప్పుడు రొ - రో - ప్రత్యయములు వచ్చుట గలదు.

అక్కరొ - చెల్లిరో - అమ్మరో!

6. కొన్ని చోట్ల ఒక విభక్తికి మరియొక విభక్తి వచ్చుట గలదు.

1. ద్వితీయకు ప్రధమ అతడు రథమెక్కెను.
ఆమె సొమ్ములు దాల్చెను.
2. తృతీయకు ద్వితీయ కత్తిం గొమ్మను నరికె
3. సప్తమికి ద్వితీయ కుండను నీరున్నది
4. సప్తమికి ప్రధమ వాడు నేడు పోయె, తీర్థమాడితిమి
5. పంచమికి తృతీయ పాపులు బీదలచే లంచము గొందురు
6. ద్వితీయకు చతుర్థి వర్షము కొఱకు జపము.
7. ప్రధమకు షష్ఠి నా చేసిన పని
8. చతుర్ధికి షష్ఠి రామునకు వందనము
9. పంచమికి షష్ఠి రాముడు భరతునకు పెద్ద
10. సప్తమికి షష్ఠి కుండలో నీరున్నది.

(2) సర్వ నామములు - Pronouns

ఇవి ఆరు విధములు.

నామవాచకములకు బదులుగా వాడబడునవి సర్వనామములు. ఇవి ఆరు విధములు.

1. పురుష బోధక సర్వనామములు (Personal Pronouns): ఉత్తమ - మధ్యమ - ప్రధమ పురుషులకు సంబంధించినవి.

ఉదా : నీవు - అతడు - ఆమె - నేను. మొదలైనవి.

2. ప్రశ్నావాచక సర్వనామములు (Interogative Pronouns):ఎవరు ? ఏది ? ఎందరు ? మొదలగునవి.

3. సంబంధ సర్వనామములు (Relative Pronouns): వాక్యమందలి ఒక పదమునకు మరి యొక పదమునకు గల సంబంధమును గూర్చి తెలియజేయునవి. ఏ - ఆ - అనుపదములు నిత్య సంబంధము కలవియై యొక వ్యక్తిని బోధించుచుండును. ఇట్టి సంబంధముగల సర్వనామములను సంబంధ సర్వనామములందురు.

ఉదా : ఎవడు - ఎవతె - ఏది - ఎందఱు - ఎంత - ఎన్ని - ఎవరు మొదలగునవి.

1. ఎవడు చదువు చెప్పునో వాడు గురుడు.
2. ఎవతె పాలిచ్చి పెంచునో ఆమెయె తల్లి.
3. ఏది యశంబు నోడ గూర్చునో దానినే చేయుము.
4. ఎందరు వచ్చిరో అందరును కానుక లిచ్చిరి.

4. నిర్దిష్ట సర్వనామము (Defenite Pronoun): సంబంధించిన విషయమును నిర్దేశించి తెలియ జేయునది.

ఉదా : ఆ బాలుడు - ఈ బాలిక.

5. అనిర్దిష్ట సర్వనామములు (Indifenite Pronoun): సంబంధించిన విషయము నిర్దేశించి చెప్పలేనివి.

ఉదా : అవి - ఇవి - అన్ని - కొన్ని - ఎన్ని
6. సంఖ్యా వాచక సర్వనామములు.

ఉదా: పది - నూఱు-వేయి మున్నగునవి.

(3) విశేషణములు(Adjectives)

విశేష్యము యొక్క గుణమును తెల్పునవి విశేషణములు. ఇవి ఐదు విధములు.

I.నామవిశేషణములు,II.విధేయ విశేషణములు, III. క్రియా విశేషణములు, IV.క్రియా జన్య విశేషణములు, V. క్రియా ప్రయుక్త విశేషణములు.

I.విశేష్యము గుణాదులు తెల్పునవి నామ విశేషణములు. ఇవి 5 విధములు. (1) గుణ వాచకములు. (2) గుణప్రయుక్త విశేషణములు. (3)జాతి ప్రయుక్త విశేషణములు. (4) సంజ్ఞా ప్రయుక్త విశేషణములు. (5) ద్రవ్య ప్రయుక్త విశేషణములు.

నామవాచకములు గుణమును తెల్పునవి,

1.గుణవాచకములు.: తెల్లతామర - నల్లగలువ

ఇట తెల్ల - నల్లని అనునవి తామర-కలువల గుణమును తెల్పునవి.

2. గుణవాచకములకు తచ్ఛబ్దమును చేర్చుట వలన గుణప్రయుక్త విశేషణములేర్పుడును. వాడు - వారు -అది - అవి తచ్ఛబ్దములు.

ఉదా:

మన్మధుడు చక్కని వాడు.
శ్రీరాముడు నల్లని వాడు.

ఇట మన్మధుడు- శ్రీరాముడు అను శబ్దములకు చక్కినివాడు, నల్లనివాడు

అను పద విశేషణములైనవి. ఇవి చక్క - నల్ల అను గుణవాచకములకు వాడు అను తచ్ఛబ్దము చేర్చుట వలన నేర్పడినవి. కావున చక్కనివాడు - నల్లనివాడు అనునవి గుణప్రయుక్త విశేషణములు.

3. జాతిని చెప్పు విశేషణములను జాతి ప్రయుక్త విశేషణములందురు.

ఉదా : పరశురాముడు బ్రాహ్మణుడు - శ్రీరాముడు క్షత్రియుడు. ఇట పరశురాముడు - శ్రీరాముడు అను శబ్దములకు బ్రాహ్మణుడు - క్షత్రియుడు విశేషణములయినవి.

4. విశేషణమువలె వారి పేరులను. సుజ్ఞా ప్రయుక్త విశేషణ మందురు.

ఉదా : వాడు ధృతరాష్ట్రుడు.

వీడు సుయోధనుడు.

ఆమె ద్రౌపది.

ఇది కృష్ణానది.

ఇందు - ధృతరాష్ట్రుడు - సుయోధనుడు - ద్రౌపది - కృష్ణానది అనునవి సంజ్ఞా వాచకములు. వానికి పూర్వమునందున్న వాడు - వీడు - ఆమె - ఇది - అనువానికి క్రమముగా విశేషణములగుచున్నవి. కావున వీనిని సంజ్ఞాప్రయుక్త విశేషణములందురు.

5. ద్రవ్య వాచకములకు మతుబాదులు చేర్చుటవలన ద్రవ్య ప్రయుక్త విశేషణము లేర్పడును.

ఉదా : కుబేరుడు ధనవంతుడు.

భీముడు బలవంతుడు.

ఇట ధనవంతుడు - బలవంతుడు అనునవి వానికి పూర్వమందున్న కుబేరుడు - భీముడు అను శబ్దములకు విశేషణములు. ఇవి ద్రవ్యవాచకములయిన ధన - బల అను శబ్దములకు మతుబాదులు చేర్చుట వలన నేర్పడినవి. కాననివి ద్రవ్యప్రయుక్త విశేషణములు.

II. విధేయ విశేషములు : విశేష్యమును ముందు చెప్పి, విశేషణమును తరువాత చెప్పినచో అవిశేషణమును విధేయ విశేషమందురు.

ఉదా : రాముడు శూరుడు. లక్ష్మణుడు వీరుడు. బృహస్పతి బుద్ధిమంతుడు. ఇట శూరుడు, వీరుడు, బుద్ధిమంతుడు అను విశేషణములు. వాని విశేష్యములగు రాముడు - లక్ష్మణుడు - బృహస్పతి అనుశబ్దములకు తరువాత ప్రయుక్తములయినవి. అందువల్లనివి విధేయ విశేషణములు.

III. క్రియా విశేషణములు : క్రియల యొక్క గుణమును తెలుపునవి క్రియావిశేషణములు. గుణనామంబులకు చివర కాన్ - కన్ - అను వానిని చేర్చుట వలన ఈ క్రియావిశేషణము లేర్పడును.

ఉదా : వడిగా పరుగెత్తెను.

బిగ్గరగా అరచెను - ఇందు వడిగా, బిగ్గరగా అనునవి - పరుగెత్తెను - అరచెను అను క్రియలకు విశేషణములు.

IV. క్రియాజన్య విశేషణములు : ధాతువులనుండి పుట్టిన విశేషణములు క్రియాజన్య విశేషణములు.

ఉదా : - చదువుచున్న బాలుడు
        చదివిన పుస్తకము
        చదువగల బాలుడు
        చదువని బాలుడు

     చదువు బాలుడు
     చదివెడు బాలుడు
     చదివెడి బాలుడు

ఇందు చదువుచున్న - చదివిన - చదువగల - చదువని - చదువు - చదివెడు - చదివెడి అను నేడును చదువు ధాతువు నుండి పుట్టిన విశేషణములు. ఇట్లే ప్రతి ధాతువు నుండి ఏడేసి విశేషణములు పుట్టును.

v. క్రియాజన్య విశేషణములకు తచ్చశబ్దమును చేర్చుటవలన క్రియాప్రయుక్త విశేషణము లేర్పడును.

    ఉదా : - వచ్చినవాడు ఫల్గుణుడు.
            ఆడుచున్నవాడు పుష్కరుడు.
            దుమికెడివాడుత్తరుడు.

ఇందు వచ్చినవాడు - ఆడుచున్నవాడు - దుమికెడివాడు - అనునవి క్రియాప్రయుక్త విశేషణములు.

4. అవ్యయములు

లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు. ఇవి ప్రతిపదోక్తములు, లాక్షణికములు అని రెండు విధములు.

స్వతస్సిద్ధములైన అవ్యయములను ప్రతి పదోక్తములందురు.

అవి :- అంతటన్ - అదిగోన్ - అందులకున్ - ఇందున్ - ఇదిగోన్ - ఇందులకున్ - ఎందులకున్ - ఎట్టకేలకున్ - కడున్, కాబోలున్ - కాపుతన్ - కావునన్ - క్రచ్చరన్, గ్రక్కునన్ - చయ్యనన్ - తటాలునన్ - తెప్పునన్ - తోడుతన్, తోడ్తోన్ - దాకన్ - దబ్బునన్ - ఫక్కునన్ - పెందలకడన్ - బొత్తిగన్ - మెట్టుకున్ - వలెన్ - వెంబడిన్ - సారెకున్ - అక్కటా, అయ్యో - ఆహా - ఊరక - ఓహో - ఔర - కదా - ఇంచుక - కొంచెము - ఇసుమంత - గోరంత - మడి - పదవడి - ఒకొ - అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు - రకము - అట్లు - ఇట్లు - ఎట్లు - కట్టా - కటకటా - ఏమి - ఏల - ఛీ - తలా - కరము - మునుకొని - హా - హోరాహోరి - కాని - కాబట్టి - మిక్కిలి - యు - ను - అను సముచ్చయములు.

ధాతువులనుండి పుట్టిన అవ్యయములను లాక్షిణికావ్యయములందురు.

(1) క్త్వార్దక (2) వ్యతిరేకక్త్వార్దక (3) శత్రర్దక (4) తుమర్దక (5) అనంతర్యార్దక (6) చేదర్దక రూపములను లాక్షిణికావ్యయములందురు. అవి.

చదివి క్త్వార్దకము
చదువక వ్యతిరేకక్త్వార్దకము
చదువుచున్ శత్రర్దకము
చదివింపన్ తుమర్దకము
చదివించుడున్ అనంతర్యార్దకము
చదివించినన్ చేదర్దకము

ఇవి చదువు అనుధాతువు నుండి పుట్టిన లాక్షణికావ్యములు.

5. క్రియలు

పనులను దెలుపు పదములను ధాతువు లందురు. ధాతువులు సాధారణముగా ఉకారాంతములైయుండును.

సకర్మకములు - అకర్మకములు అని ధాతువులు రెండు రకములు.

కర్మలనపేక్షించునవి సకర్మకములు. కర్మల అపేక్షింపనివి అకర్మకములు.

సకర్మకధాతువులు : - ఇచ్చు - ఎరుగు - కప్పు - కొట్టు - కోయు - గ్రుచ్చు - చేయు - తలచు - తిను - తీయు - తెరచు - నోచు - పఠించు - పలుకు - పెట్టు - పోలు - భుజించు - మ్రింగు - వండు - వ్రాయు మొదలైనవి.

అకర్మకధాతువులు : - అగు - అణగు - అలుగు - ఉండు - ఉదయించు - ఎదుగు - కాగు - కురియు - కూలు - చను - చీలు - చెడు - తిరుగు - నడుచు - నవ్వు - నిద్రించు - పడు - పెరుగు - మునుగు - మొలచు - వచ్చు మొదలగునవి.

డు-రు, వు-రు, ను-ము, అను క్రియా విభక్తులతో కూడిన ధాతువులను క్రియలందురు.

భాషను బట్టి తత్సమక్రియలు - దేశ్యక్రియలు అని రెండు రకములు.

సంస్కృత పదములకు - ఇంచు చేర్పగా నేర్పడునవి తత్సమక్రియలు. ఉదా : కోపించు - స్రవించు - తపించు - వచించు - జయించు - భుజించు - భాగించు - మొదలైనవి.

అచ్చ తెలుగువి దేశ్య క్రియలు :

వచ్చు - పోవు - చదువు - తిను మొదలైనవి.

ఉపయోగమును బట్టి సహాయ క్రియలు - స్వతంత్ర క్రియలు - న్యూనక్రియలు అని క్రియలు మూడు రకములు.

కాలము మున్నగువాని నేర్పరుచుట యందు ఇతర క్రియలకు సాయపడునవి సహాయక్రియలు. వీనినే ఉపక్రియలందురు. ఇవి తెలుగున నాలుగు.

ఉండు - కలుగు - పడు - కొను అనునవి.
ఉండు - వచ్చియుండును, వచ్చియున్నాడు.
కలుగు - చదువకలిగెను, రాగలడు.
కొను - చదువుకొంటిని, వేడుకొందును.
పడు - భయపడెను, చేయబడును.

వీనికి స్వతంత్ర ప్రయోగము కూడ కలదు.

స్వతంత్రముగా ఉపయోగింపబడునవి స్వతంత్రక్రియలు. అవి : పోషించు - భుజించు - వచ్చు - పోవు మొదలైనవి.

కొన్ని కాలములందును - పురుషములందును మాత్రము ప్రయోగింపబడునవి న్యూనక్రియలు. ఇవి.

ఒల్లడు - వలయును - వలదు - కూడును - కూడదు - తగును - తగదు - మొదలైనవి.

కొన్ని ధాతువులకును - నామములకును సహాయక్రి యలు నాలుగు కాకా తక్కిన ధాతువులు కొన్ని చేరి అర్ద భేదము కలిగించును. అవి శబ్దపల్లములు. నిలుచుండు - కూరుచుండు - చొప్పడు - ఆకొను - ఈకొను - అలవడు - ఏరుపడు - తలపోయు - విజయంచేయు - పరుండు - మేలుకొను మొదలైనవి.

కార్యమును బట్టి సమాపక క్రియలు - అసమాపక క్రియలు అని రెండు రకములు.

సంపూర్ణాభిప్రాయమును దెల్పునవి సమాపకక్రియలు.

కృష్ణార్జునులు ఖాండవ వనమును దహింపజేయించిరి. - ఇట చేయించిరి అనునది సమాపకక్రియ.
సంపూర్ణాభిప్రాయమును తెలుపనివి అసమాపకక్రియలు.


కృష్ణార్జునులు అగ్నిదేవునికి సహాయపడి, ఖాండవ వనము దహనము చేయించిరి. ఇటు సహాయపడి - అనునది అసమాపకక్రియ.

ప్రతి ధాతువునకు నాలుగేసి కాలములు - మూడేసి పురుషములు - రెండేసి వచనములుండును.

జరుగుచున్న కాలబోధకము వర్తమానకాలము

- బ
ప్ర -చదువుచున్నాడు
-చదువుచున్నది
-చదువుచున్నారు.
-చదువుచున్నవి.
-చదువుచున్నావు -చదువుచున్నారు.
-చదువుచున్నాను -చదువుచున్నాము.

జరిగి పోయిన కాలము భూతకాలము
ఏక బహు
ప్ర చదివెను చదివిరి
చదివితిని
చదివితి
చదివితిరి
చదివితిని చదివితిమి.
జరుగబోవు కాలము భవిష్యత్కాలము
ఏక - బహు
ప్ర -చదువగలడు
-చదువగలదు
-చదువగలరు
-చదువగలరు
చదువగలవు చదువగలరు
చదువగలను చదువగలము.

వస్తువులయొక్క సహజధర్మము స్వభావాదులదెల్పునది తద్దర్మకాలము.

ఏక బహు
ప్ర చదువును చదువుదురు
(వారు)
చదివెడును చదివెదరు
(అవి)
చదివెడివి చదువును
చదివెడును
చదివెడివి
చదువుదువు చదువుదురు
చదివెదవు చదివెదరు
చదువుదును చదువుదుము
చదివెదను చదివెదము

ఈ నాలుగు కాలములుగాక:-

1. ప్రార్ధనాద్యర్దకము
2. ఉభయ కర్తృక ప్రార్దనాద్యర్దకము
3. వ్యతిరేకార్దకము
4. వ్యతిరేకప్రార్దనాద్యర్దకము
5. ఆశీరర్దకము అనునైదు భాగములు కూడ కలవు

1. ప్రార్దనాద్యర్దకమునకు మధ్యమ పురుషమాపంబులు మాత్రముండును.

మధ్యమ చదువుము చదువుడు.

2. ఉభయ కర్తృక ప్రార్దనాద్యర్దకమునకు ఉత్తమపురుష బహువచనము మాత్రముండును.

ఉదా:- ఏ. - బ. చదువుము.

3. వ్యతిరేకార్దకము:

ప్ర చదువడు చదువరు
చదువదు చదువవు
చదువవు చదువరు
చదువను చదువము

4. వ్యతిరేక ప్రార్దనాద్యర్దకము:

మ - చదువకుము - చదువకుడు. ఇవి గాక ప్రతిధాతువు నుండి రెండు విశేష్యములు - ఆరు అవ్యయములు - ఏడు క్రియాజన్య విశేషములు కలుగుచున్నవి.

5. ఆశీరర్దకమున మధ్యమపురుష రూపంబులు మాత్రముండును. (ఇవి ఏకవచన బహువచనంబులు రెండింట నొకే రూపములు కలిగియుండును).

మ - చదివెడును - చదువుతాను

రెండు విశేష్యములు:

1. భావార్ధకము: చదువుట

2. వ్యతిరేకభావార్ధకము: చదువమి.

ఆరు అవ్యయములు:-

1. క్త్వార్ధకము : చదివి
2. వ్యతిరేకక్త్వార్ధకము : చదువక
3. శత్రర్ధకము : చదువుచున్
4. తుమర్ధకము : చదువన్ - చదువగాన్ - చదువంగాన్ - చదువగన్ - చదువంగన్.
5. అనంతర్యార్ధకము : చదువుడున్
6. చెదర్ధకము : చదివినన్

క్రియాజన్య విశ్లేషణములు ఏడు :

1. చదువుచున్న బాలుడు
2. చదివిన పుస్తకము
3. చదువగల బాలుడు
4. చదువని బాలుడు
5. చదువు బాలుడు
6. చదివెడు బాలుడు
7. చదివెడి బాలుడు

ధాతువులకు చివర నాయా పురుషంబులందు వచ్చు క్రియా విభక్తులు.

ప్ర డు రు
వు రు
ను ము

తనంతట తాను చేయుట అప్రేరణము. ఇతరులచే చేయుట ప్రేరణము. ప్రేరణమున ధాతువునకు ఇంచు అను దానిని చేర్తురు.

అప్రేరణము : రాముడు పాఠము చదువుచున్నాడు. ఇట రాముడు పాఠమును తనంతట తానే చదువుచున్నాడు. కావున చదువుచున్నాడు అను దానిని చదువు ధాతువు యొక్క అప్రేరణ రూపమందురు. లేక స్వార్థకరూపమందురు.

ప్రేరణము : రాముడు పాఠమును చదివించుచున్నాడు. ఇట రాముడి ఇతరుని పాఠము చదువునట్లోనర్చుచున్నాడు. కావున చదివించుచున్నాడు అను దానిని చదువు ధాతువు యొక్క ప్రేరణ రూపమందురు. తక్కిన ధాతువులిట్లే గ్రహించునది.

విద్యార్థుల ఉపయోగార్థము చదువు ధాతువుయొక్క రూపము లిట చూపుచున్నాము.

చదువు దాతువు సకర్మకము (Transitue)

1. కర్త్రర్థకము (Active voice)

వర్తమానకాలము (Present tense)

ప్ర : చదువుచున్నాడు చదువుచున్నారు.
చదువుచున్నది చదువుచున్నవి.
మ : చదువుచున్నావు చదువుచున్నారు
ఉ : చదువుచున్నాను చదువుచున్నాము

2. భూతకాలము (Past tense)

ప్ర : చదివెను చదివిరి
మ : చదివితివి చదివితిరి
ఉ : చదివితిని చదివితిమి

3. భవిష్యత్కాలము (Future tense)

ప్ర : చదువగలడు చదువగలరు
చదువగలదు చదువగలవు
మ : చదువగలవు చదువ గలరు
ఉ : చదువగలను చదువగలము

4. తద్ధర్మకాలము (Aorist)

ప్ర : చదువును చదువుదురు (వారు)
వదివెడును చదివెదరు
చదివెడిని చదువును (అని)
చదివెడును
చదివెడిని
మ : చదువుదువు చదువుదురు
చదివెదవు చదివెదరు
ఉ : చదువుదును చదువుదుము
చదివెదను చదివెదము

5. ప్రార్థనాద్యర్థకము

మ : చదువుము చదువుడు

6. ఉభయకర్తృక ప్రార్థనాద్యర్థకము

ఉ : ______ చదువుదము

7. వ్యతిరేకార్థకము

ప్ర : చదువడు చదువరు
చదువదు చదువవు
మ : చదువవు చదువరు
ఉ : చదువను చదువము

8. వ్యతిరేక ప్రార్థనాద్యర్థకము

మ : చదువకుము చదువకుడు

9. ఆశీరాద్యర్థకము

మ : చదివెడును చదువుతాను

ఈ తొమ్మిదియు సమాపక క్రియారూపములు.

1. భావార్థకము. చదువుట ఇవి విశేష్యములు.
2. వ్యతిరేక భావార్థకము. చదువమి
3. క్త్వార్థకము. చదివి ఇవి లాక్షిణక అవ్యయములు . వీనిని అసమాపక క్రియలని కూడ అందురు.
4. వ్యతిరేక క్త్వార్దకము. చదువక
5. శత్రర్దకము. చదువుచున్
6. తుమర్థకము. చదువన్ - చదువగాన్ - చదువంగాన్ - చదువగన్ - చదువంగన్
7. అనంతర్యార్థకము చదువుడున్
8. చేదర్థకము. చదివినన్
9.వర్తమానార్థక విశేషణము. చదువుచున్న ఇవి క్రియాజన్య విశేషణములు
10. భూతార్దక విశేషణము. చదివిన
11. భవిష్యదర్ధక విశేషణము. చదువగల
12. తద్దర్మార్థక విశేషణములు. చదువు - చదివెడు - చదివెడి
13. వ్యతిరేకార్థక విశేషణము - చదువని


కర్మార్థకము (Passive Voice)

1. వర్తమాన కాలము

ప్ర : చదువబడుచున్నాడు చదువబడుచున్నారు.
చదువబడుచున్నది చదువబడుచున్నవి.
మ : చదువబడుచున్నావు చదువబడుచున్నారు
ఉ : చదువబడుచున్నాను చదువబడుచున్నాము

2. భూతకాలము

ప్ర : చదువబడియెను చదువబడిరి
చదువబడెను
మ : చదువబడితివి చదువబడితిరి
చదువబడితి
ఉ : చదువబడితిని చదువబడితిమి

3. భవిష్యత్కాలము

ప్ర : చదువబడ గలడు చదువబడగలరు
చదువబడ గలదు చదువబడగలవు
మ : చదువబడ గలవు చదువబడగలరు
ఉ : చదువబడగలను చదువబడగలము

4. తద్దర్మార్థకము

ప్ర : చదువబడును చదువబడుదురు (వారు)
చదువబడియెడును చదువబడియెదరు
చదువబడెడును చదువబడెదరు
చదువబడియెడిని చదువబడును (అవి)
చదువబడెడును
చదువబడియెడిని
చదువబడెడిని
మ : చదువబడుదువు చదువబడుదురు
చదువబడుదు
చదువబడియెదవు చదువబడియెదరు
చదువబడిదవు
చదువబడియెదు చదువబడెదరు
చదువబడెదు
ఉ : చదువబడుదును చదువబడుదుము
చదువబడియెదను చదువబడియెదము
చదువబడెదను చదువబడెదము

5. ప్రార్థనాద్యర్థకము

మ : చదువబడుము చదువబడుడు

6. ఉభయ కర్తృక ప్రార్థనాధ్యర్థము

మ: ______ చదువబడుదుము

7. వ్యతిరేకార్థకము

ప్ర : చదువబడడు చదువబడరు
చదువబడదు చదువబడవు
మ : చదువబడవు చదువబడరు
ఉ : చదువబడును చదువబడము

8. వ్యతిరేక ప్రార్థనాధ్యర్థకము

మ : చదువబడకుము చదువబడకుడు

9. ఆశీరాధ్యర్థకము

మ : చదువబడియెడును చదువబడెడును
చదువబడుతును

1. భావార్థకము - చదువబడుట ఇవి విశేష్యములు
2. వ్యతిరేక భావార్థకము - చదువబడమి
3. క్త్వార్ధకము - చదువబడి ఇవి లాక్షణిక అవ్యయములు. వీనిని అసమాపక క్రియలని కూడా అందురు.
4. వ్యతిరేక క్త్వార్ధకము - చదువబడక
5. చేత్రర్థకము - చదువబడుచున్
6. తుమర్థకము - చదువబడన్ - వదువబడగాన్ - చదువబడంగాన్ - చదువబడగన్ - చదువబడంగన్
7. అనంతర్యార్థకము - చదువబడుడున్
8. చేదరర్థకము = చదువబడ్డన్ - చదువబడినన్
9. వర్తమానార్థక విశేషణము - చదువబడుచున్న ఇవి క్రియాజన్య విశేషణములు
10. భూతర్థక విశేషణము - చదువబడిన - చదువబడ్డ
11. భవిష్యదర్థక విశేషణము - చదువబడు - చదువబడియెడు - చదువబడెడు - చదువబడియెడి - చదువబడెడి
12. వ్యతిరేకార్ధక విశేషణము - చదువబడని

వాక్యపరిచ్ఛేదము

1. అభిప్రాయము పూర్తిగా తెల్పు పద సముదాయము వాక్యము.

శ్రీరాముడు సీతను వివాహమాడెను.

2. ఆకాంక్షా యోగ్యతాసన్నిధులభిప్రాయ బోధకములు.

ఆకాంక్ష : అనగా, పదముల పరస్పర సంబంధము.

శ్రీరాముడు సీతను - అనినంతనే ఏమిచేసెనను ప్రశ్నఉత్పన్నమగును. వివాహమాడెనని ఉత్తరము - ఇది ఆకాంక్ష.

యోగ్యత : అనగా అర్ధము సరిగా కుదురుట. నీళ్లతో కాల్చుచున్నాడు. ఇందు ఆకాంక్ష యున్నను యోగ్యత లేదు. నీళ్లతో కాల్చుట అసంభవము.

సన్నిధి : అనగా మాటలు వెంట వెంట పలుకుట. నేడు రాముడు అని - రేపు సీతను అని, ఎల్లుండి వివాహమాడెను - అన్న అభిప్రాయము బోధపడదు.

3. ఏక వాక్యము నందొకానొకడు తప్ప సర్వపదములు క్రియ నిరపేక్షములై యుండవచ్చును.

శ్రీరాముడు సీతను వివాహమాడెను.
సీతను శ్రీరాముడు వివాహమాడెను.
రావణుడు సీతనపహరించెను.
సీతను రావణుడపహరించెను.

అని యిట్లు కర్తగాని కర్మగాని మొదట ఉండునట్లు వ్రాయవచ్చును.

4. కొండొకచో వాక్యము వాక్యాంతర గర్భితమగు

ఇచ్చట కెంతకాలమయ్యె మీరు, రారేల? ఎంతకాలమయ్యె నిచ్చటికి మీరు రారేల? అని అర్థము.

5. వాక్యసముదాయము కావ్యము. శ్రీరాముడు సీతను వివాహమాడెను. తండ్రి యాజ్ఞచే నడవికేగెను. సీతను రావణుడపరించెను. రాముడు రావణుని వధించి, సీతను విడిపించెను. ఇట్లు పరస్పర సంబంధముండునట్లు రచించబడిన వాక్య సముదాయము కావ్యము.

6. కావ్యము గద్యకావ్యము, పద్యకావ్యము, చంపూ కావ్యములని మూడు విధములు. వచనము విస్తారముగా గలది గద్యకావ్యము. కేవలం పద్యములతో కూడినది పద్య కావ్యము. గద్యపద్యములతో కూడినది చంపు కావ్యము.
7. ప్రాతిపదికము లెల్ల ప్రధమాంతములు. నామవాచకములు ప్రధమాంతములుగా ఉండును.

రాముడు - కుక్క - పిల్లలు - చీమలు మొదలైనవి.

8. ప్రధానమునకు ప్రధమా విభక్తియగును.

శ్రీరాముడు రావణుని సంహరించెను.
దొంగలు ధనమును అపహరించిరి.
దేవదత్తుడు చెట్లను పెంచెను.

ఇందు - శ్రీరాముడు - దొంగలు - దేవదత్తుడు - ప్రధానమైనవి. ఇవి ప్రధమా విభక్తి యందుండును.

9. అప్రధానమనకు చే - చేతలగును.

రావణుడు సంహరింపబడెను.
ధనము అపహరింపబడెను.
చెట్లు పెంపబడును.
ఈ వాక్యము లందు కర్మలు ప్రధానములు. కర్త అప్రధానము. కర్తృవాచకములగు రామ - దొంగ, దేవదత్త శబ్దములకు చే - చేతలువచ్చి - రామునిచే - దొంగలచే - దేవదత్తునిచే అని యగును.

10. అప్రధాన కర్మకు ని - ను లగు

శ్రీరాముడు సంహరించెను.
దొంగలపరించిరి.
దేవదత్తుడు పెంచెను.
ఈ వాక్యములలో కర్తలు ప్రధానమైనవి. కర్మలైన రావణుడు - చెట్టు - ధనశబ్దములు అప్రధానములు. వీనికి ని - ను లు చేరును.

శ్రీరాముడు రావణుని సంహరించెను.
దొంగలు ధనమునపహరించిరి.
దేవదత్తుడు చెట్లను పెంచెను.

11. జడ. పదంబుల ద్వితీయకు ప్రధమ యగు

ధనము - చెట్టు - జడవాచకములు. వాని ద్వితీయకు ప్రధమ వచ్చి - దొంగలు ధనమపహరించిరి - దేవదత్తుడు చెట్లు పెంచెను - అని కాని లేక వెనుకటివలె ని - ను లు చేర్చిగాని వాడనగును. రాముడు కుక్కను కొట్టెను అనుచోట కుక్క జడము కాదు. కాన రాముడు కుక్క కొట్టెను, అని కుక్క శబ్దమునకు ప్రధమ రాదు.

12. వచ్యార్థా ముఖ్య కర్మంబునకు - తో - తోడ కి - కు లు తరుచుగానగును. వచ్యర్థమనగా చెప్పుట - దాని ప్రధానకర్మకు ద్వితీయ యగును.

రావణునితో విభీషణుడు నీతులు చెప్పెను.
జానకకి త్రిజట స్వప్నమును దెల్పెను.
రావణుడు - జానకి - అముఖ్య కర్మలు.
నీతి - స్వప్నము - ముఖ్యకర్మలు.

13. కర్త ప్రధానమైన కర్త్రర్ధక వాక్యము.

కర్మ ప్రధానమైన కర్మర్థకవాక్యము.

రాముడు సంహరించెను - కర్త ప్రధానము.
రావణుడు సంహరింపబడెను - కర్మ ప్రధానము.

14. ప్రధానమును బట్టి క్రియల లింగవచన పురుషములుండును.

కర్త్రర్థక వాక్యము కర్మర్థకవాక్యము
శ్రీకృష్ణుడు నన్ను రక్షించును - శ్రీకృష్ణునిచే నేను రక్షింపబడుదును.
గురువు మమ్ము చదివించును - గురునిచే మేము చదివింప బడుదుము.
నేను నిన్ను ప్రార్దింతును - నీవు నాచే ప్రార్థింపబడుదువు.
మేము మిమ్ము పూజింతుము - మాచే మీరు పూజింపబడుదురు.
నీవు దుష్టులను దండింతువు - దుష్టులు నాచే దండింపబడుదురు.
మీరు కీడును చేయరు - కీడు మీచే చేయబడదు.

15. అకర్మక ధాతువులకు, అప్రేరణంబున కర్తయగునని ప్రేరణంబున కర్మయగును.

సామాన్య వాక్యము -ప్రేరణార్థక వాక్యము
చెట్లు పెరిగెను -చెట్లను పెంచెను.
విల్లు విరిగెను -వింటిని విరిచెను.
హృదయము భేదిల్లెను - హృదయమును భేదించెను.

16. గతి - బుద్ధి - వ్రత్యవసానార్థ శబ్దకర్మంబులకు అప్రేరణంబున కర్తయగునది ప్రేరణంబున కర్మయగును.

పోవు - పొందు -గత్యర్థకములు.
తెలియు - ఎరుగు -బుద్ధ్యర్థకములు.
తిను - మ్రింగు -ప్రత్యవసానార్దకములు
విను - చదువు - చెప్పు -శబ్దకర్మములు.
రాముడింటికిపోయెను -తండ్రి రామునింటికి పంపెను.
నాకు మంచి తెలియును -మిత్రుడు నాకు మంచి తెల్పెను.
నేను చదివితిని -తండ్రి నన్ను చదివించెను.
నీవన్నియును తింటివి -తండ్రి నిన్ను అన్నమును తినిపించెను.

17. అప్రధాన కర్తకు ఒకానొకచో కి - కు లు బహుళముగా కాన్పించును.

       ఇంద్రుడు తత్వమును దెలిపెను
           బ్రహ్మ ఇంద్రునకు తత్వమును దెలిపెను.
           రాముడు మిధిలను జూచెను.
       విశ్వామిత్రుడు రామునకు మిధిలను చూపించెను.

ప్రశ్నలు

1) ఆంధ్ర భాషలో పదము లెన్ని రకములు? అవి యేవి?
2) తత్సమ-తద్భవము లేర్పడు విధమును వ్రాయుము.
3) భాషా భాగము లెన్ని? అవి యేవి?
4) నామవాచకము నందలి రకములు సోదాహరణముగా తెల్పుము.
5) సర్వనామము నందలి రకములు వివరింపుము.
6) విశేషణము లెన్ని రకములు? అవి యేవి? సోదాహరణముగా తెల్పుము?
7) అవ్యయములనగా నేమి? అవి ఎన్ని రకములు? సోదాహరణముగా తెల్పుము?
8) క్రియలనగానేమి? వాని భేదములు సోదాహరణముగా వివరింపుము.
9) వాక్యమున ఆకాంక్ష - యోగ్యత, సన్నిది అనగానేమో తెల్పుము.