Jump to content

రుక్మిణీపరిణయము/పీఠిక

వికీసోర్స్ నుండి

శ్రీరామకృష్ణపరబ్రహ్మణే నమః

రుక్మిణీపరిణయము

పీ ఠి క



నగజాగజాననులు చేరి నెఱిం దనమస్తకంబుపై
జానగుచందమామఁ గని చయ్యన నద్దము వెన్నముద్దయున్
గా నెలమిం దలంచి యది గైకొనఁబూని కరంబు లెత్తుచో
మానక వారిముగ్ధతకు మాటికి నవ్వుశివున్ భజించెదన్.

1


సీ.

మఘవముఖాఖిలామరభూరిసామ్రాజ్యభారధౌరేయతాకారణములు
కుంభినీధరభరణాంభోజసంభవస్ఫారాభిలాషప్రపూరణములు
బహుజన్మకృతఘోరపంకావళిస్ఫురిద్వారిభృజ్ఝంఝాసమీరణములు
పద్మదానవమహాసద్మపద్మాకరవ్రాతామితోన్మత్తవారణములు


తే.

సతతపాలితమునిసిద్ధచారణములు, క్రూరరుగ్జంతుభయవినివారణములు
శైలకన్యాకటాక్షప్రసారణములు, వెలఁగి భక్తాళి కభయంబు సేయుఁగాత.

2


సీ.

ఆభీరహితశీలు హరితనూజాలోలు నంచితార్జుననగహారలీలుఁ
బాలితామరగోత్రుఁ బ్రబలగోరిపుజైత్రుఁ జంద్రభాస్వద్రుచిచారునేత్రుఁ
బరిహృతాసమబాణు నరవాహసం త్రాణుఁ బరనిగమప్రభవప్రమాణు
నరకదుర్మదనాశు నాకప్రచురకేశు ఖరమయూఖాభిచక్రప్రకాశు


తే.

సుభగఖగరాజకీతువిస్ఫురదనంతు, భువనవిపులార్చనీయకపుణ్యవంతు
సాధుబృందావననిశాంతు సమరజయని, తాంతు దాంతు రమాకాంతుఁ దగ భజింతు.

3


క.

శరణార్థి నగుదుఁ బ్రముదిత, కరికిన్ ధృతగిరికి హృతమకరికిన్ నరకే
సరికిన్ బరిపాలితగ, హ్వరికిం దరికిం జితోద్యదరికిన్ హరికిన్.

4


సీ.

చలువపూఁదమ్మిబల్కొలఁకులాడెడుచోట్లు కఱివేల్పు పెనుఱొమ్ము గద్దెపీఁట
తోరంపుఁబాలమున్నీరుపుట్టినయిల్లు చిలుకతత్తడిరౌతువలపుఁగొడుకు
తెఱగంటియన్నులందఱు నూడిగపుఁజెలుల్ కలుములీనెడు కడకంటిచూపు
విలసిల్లు ప్రాఁబలుకులు గిల్కుటందియల్ తొగలసంగడికాఁడుతోడఁబుట్టు

తే.

వేమహాదేవికలరు నయ్యిగురుఁబోఁడి, గమలజునితల్లి నతజనకల్పవల్లి
యిందిరాసుందరాంగి మన్మందిరమున, నిండువేడుక ననిశంబు నిలుచుఁ గాత.

5


ఉ.

ఫాలతలంబునందుఁ గరపద్మయుగంబు ఘటించి మ్రొక్కెదం
బాలితసిద్ధకిన్నరనభశ్చరమౌనిసురాళికి న్దయా
శాలికి భారతీవదనసారసబాలమయూఖమాలికిన్
క్షాళితదోషపాళికి జగన్నుతిశీలికిఁ దమ్మిచూలికిన్.

6


సీ.

చంపకోత్పలమహాస్రగ్ధర సుస్వరమణిమాలికానర్గగుణమనోజ్ఞ
మత్తకోకిలవాణి మానితవిచికిలస్తబకవర్ణవిభాగతరలహార
సరసేందువదన బంధురకాంతిసంయుక్త సరసిజనయన సుందరవరాంగి
నిత్యవిభూతిమానిని రుచిరోత్సాహ ప్రాద్యభేదాఖండపరమశక్తి


తే.

యతినుతశ్లోకఛందోమయప్రకాశ, యసమభజినరతగణామితానుమోద
యైనవాగ్దేవి నాదుజిహ్వాగ్రమునను, నిలిచి సత్కావ్యగుంభన నెఱపుఁగాత.

7


చ.

అనుదినమున్ మదిం జలన మానక మానక పూని దీనులన్
మనుచుచుఁ గార్యవేళల నుమాధవమాధవముఖ్యు లౌసురల్
దను వినుతింప మేలిడుచుఁ దానగు దానగుణాఢ్యుఁ డంచు నిం
పెనయఁగఁ గోరి మ్రొక్కిడుదు నేనిఁక నేనికమోముసామికిన్.

8


ఉ.

పాయనిభక్తితోడ మదిఁ ప్రస్తుతిసేసెద దీనరక్షణో
పాయుని యోగమార్గనిరపాయుని సంతతిరామకార్యధౌ
రేయుని దివ్యకాయుని వరిష్ఠవిధేయుని శిక్షితోగ్రదై
తేయుని నప్రమేయుని సుధీజనగేయుని నాంజనేయునిన్.

9


క.

వితతాగమశరణుండై, ప్రతిదినగూఢపదచరవిభాసితుఁడై ది
వ్యతరవిరాడ్విగ్రహుఁ డై, ధృతిఁ గేరు నజేయు వైనతేయున్ గొలుతున్.

10


క.

తవిలి నవప్రభ లెసగఁగ, భువి గేరడుమిత్రజాతబుధగురుభాస్వ
త్కవిమాహేయకలానిధి, కువలయచక్రారివంచకులఁ బ్రణుతింతున్.

11


సీ.

గురుతరకౌండిన్యగోత్రవిఖ్యాతుండు బయ్యనామాత్యుఁ డేభవ్యుతాత
నిరతాన్నదానవర్ణితయశస్సాంద్రుండు తిమ్మనసచివుఁ డేధీరుతండ్రి
ఘనులు జగ్గనయు సింగనమంత్రియును నరసన్నయు నేమంత్రి యనుఁగుఁదమ్ము
లలకఁ దిమ్మకవి రాజన్న జగ్గనయును సూరన యేధన్యు సుతవరేణ్యు


తే.

లొనర వీరమ్మ పాపమేఘనునిసహజ, లతిపతివ్రతలక్ష్మి యేచతురురాణి
యట్టి శ్రీకూచిమంచివంశాబ్దిచంద్రు, మజ్జనకు నలగంగనామాత్యుఁ దలఁతు.

12


క.

క్షితి నతిచతురతల ననా, రతనవిజనహితము లైనరామాయణభా
రతము లొనర్చినజగద, ప్రతిముల వాల్మీకిశక్తిపౌత్రుల నెంతున్.

13

ఉ.

ఆరయ సంస్కృతోక్తిరచనాంచితకావ్యధురీణులై భువిన్
భూరియశంబుఁ గైకొనినపుణ్యుల నామది సన్నుతించెదన్
భారవికాళిదాసశివభద్రుల భోజనృపాలబాణులన్
జోరమయూరమాఘులను సువ్రతులౌ భవభూతిముఖ్యులన్.

14


చ.

స్థిరమతి నన్నయాహ్వయునిఁ దిక్కన నెఱ్ఱన భీమనార్యు భా
స్కరు నమరేశుఁ బోతకవిచంద్రుని సోముని శంభుదాసునిన్
నిరతముఁ బ్రస్తుతింతు నవని న్మహితాంధ్రకవిత్వవైభవ
స్ఫురణఁ బ్రసిద్ధు లైనకవిముఖ్యుల భూప్రసరత్సమాఖ్యులన్.

15


క.

సారము గలచో నలరుచు, నేరము గలచోటు మిగుల నిందింపక స
త్కారుణ్యంబునఁ గనుఁగొను, సూరికవీంద్రుల నుతింతు సురుచిరభక్తిన్.

16


ఉ.

శంక యొకింతలేక కవిసంఘముఁ జూచి వృధావివాదముల్
బింకముతోడఁ జేయుచును బెద్దల మంచును బద్యమెల్లఁ గు
శృంకలు సేయుచున్ గవితసార మెఱుంగక సారెసారెకు
న్ఱంకెలు వేయుదుష్కవిగణంబులనెల్లఁ దృణీకరించెదన్.

17


వ.

అని నిఖిలదేవతాప్రార్థనంబును, గురుచరణస్మరణంబును, పురాతననూతనమహా
కవివర్ణనంబును, కుకవినిరాకరణంబును గావించి, మఱియు నిష్టదేవతాప్రార్థ
నంబు చేసెద.

18


సీ.

చిన్నివెన్నెలఱేఁడు చెన్నైనసికపువ్వు పసమించుపులితోలు పట్టుసాలు
చిరునలయెకిమీఁడు బలుమానికపుఁదాళి వాటంపుఁదెలిగిబ్బ వారువంబు
గఱికిపూజల మెచ్చు గారాబుకొమరుండు వలిగొండకూఁతురు వలపుటింతి
జేజేతుటుములెల్లఁ జేరి కొల్చెడుబంట్లు నునువెండిగుబ్బలి యునికిపట్టు


తే.

నగుచుఁ జెలువొంద భువనంబు లనుదినంబు, రమణఁ బాలించునిన్ను నేఁ బ్రస్తుతింతు
బుధనుతవిలాస పీఠికాపురనివాస, కుముదహితతోటిసంకాశ కుక్కుటేశ.

19


సీ.

బృందారకామందమందారవీతాఘబృందారవిందాక్షనందనీయ
పాటీరవర్ణేందుకోటీరగౌరీవధూటీరతాదిత్యకోటితేజ
క్షోణీరథాంభోధితూణీరగంగాప్రవేణీరవామోదపాణిహరిణ
నీహారవాగ్భామినీహారహారానిలాహారవర్యాభవాహనార్వ


తే.

శర్వ సర్వజ్ఞ దుర్వహాఖర్వగర్వ, సర్వపూర్వామరోదగ్రశార్వరహర
సారసుకుమారసంతతోదారవీర, చారుతరకుక్కుటాకార జయసుధీర.

20


క.

చిరతరముగ నానేర్చిన, కరణిన్ రచియించి నీకుఁ గావ్య మొసఁగెదన్
సరగున దోషము లెల్లను, బరిహార మొనర్చి దయను బాలింపు శివా.

21


క.

అని విన్నవించి కావ్యం, బొనరింపఁగఁ బూని మొదల నుద్యద్గతి దే

వున కిర వగుపీఠాపురి, ఘనతర మగుమహిమ మెన్నఁ గావలయు నొగిన్.

22


సీ.

పాదగయాక్షేత్రపరమపవిత్రంబు పురుహూతికాంబకుఁ బుట్టినిల్లు
యేలానదీజలావృతతటాకానీక మఖిలశక్తులకు విహారభూమి
తోరంపులవణపాథోనిధితీరంబు నిర్మలగౌతమీనికటసీమ
కుంతిమాధవదేవుగురుతరస్థానంబు విలసితభీమమండలతలంబు


తే.

సేతుకాశీప్రయాగాద్యశేషదివ్య, తీర్థరాజంబులందుఁ బ్రతిష్ఠఁ గాంచి
సకలదోషాపనోదకశక్తి నలరు, పుణ్యసారంబు పీఠికాపురవరంబు.

23


సీ.

చక్రవాళాహార్యజలధితుల్యోన్నతప్రాకారపరిఖావిరాజితంబు
సాంద్రముక్తాసౌధచంద్రశాలానేకభర్మనిర్మితహర్మ్యశర్మదంబు
కరిసైంధవాందోళికాధేనుధనధాన్యవనదేవగృహసరోవర్ణితంబు
విమలచాతుర్వర్ణ్యవిద్వత్కవిశ్రేష్ఠభటనటామాత్యవిస్ఫారితంబు


తే.

రాజమాహేంద్రవకదుర్గరాజ్యభూరి, భారసంభరణాశ్రాంతభాసమాన
రావుమాధవనృపపరిరక్షితంబు, భోగనికరంబు పీఠికాపురవరంబు.

24

షష్ఠ్యంతములు

క.

ఏతత్పురనేతకు ఘన, దాతకు రోషప్రశమితధాతకు భువన
త్రాతకు సకలాగమవి, జ్ఞాతకు శీతాచలేంద్రజామాత కొగిన్.

25


క.

ధండనపరఖండనకర, మండనశరచాపఖడ్గమహనీయున కా
ఖండలమణికుండలఘృణి, మండలఫణిరాజరాజమానాంగునకున్.

26


క.

కమలాధిపసఖునకు ధృతి, కమలునకు మునిస్తుతాంఘ్రికమలునకు లస
త్కమలధితూణీరునకును, గమలశిరోజునకు సమధికమలహరునకున్.

27


క.

నారదదరపారదశర, శారదశరదాభ్రకరితుషారాభ్రఝరీ
తారాహితహీరామృత, ధారామితసితవిలాసదరహాసునకున్.

28


క.

వృషవర్ధనునకుఁ గిన్నర, వృషసఖునకు రిపుమదేభవివృతముఖునకున్
వృషసేవితచరణునకును, వృషవాహనజనకునకును వృషవాహునరున్.

29


క.

హరిమణినిభకంధరునకు, హరిమదమథనునకు నిశితహరిబాణునకున్
హరివరకేయూరునకును, హరికోటిసమానకాంతిహరిణాంగునకున్.

30


క.

సంగరజయునకుఁ గుక్కుట, లింగస్వామికి నవీనలీలావిలస
ద్భృంగిరిటినటనరతునకు, గంగాజూటునకు దివిజగణసేవ్యునకున్.

31


వ.

అనంతసాష్టాంగదండప్రణామంబులు సమర్పించి తత్కృపాతిశయంబున నద్దేవతా
సార్వభౌమునకు నంకితంబుగా నారచియింపంబూనిన రుక్మిణీపరిణయంబను మహా
కావ్యంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన.

32