రుక్మిణీపరిణయము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము



రుచితరసితాంగా
కారుణ్యమయాంతరంగకలుషవిభంగా
పారావారనిషంగా
గోరాజోన్నతతురంగ కుక్కుటలింగా.

1


తే.

అవధరింపుము మును శౌనకాదిమునుల, కనఘుఁ డాసూతుఁ డెఱించినట్లు వ్యాస
సుతుఁడు సుమహితికౌతుకోన్నతిని భరత, కులున కవ్వలికథయునుఁ దెలుపఁదొడఁగె.

2


క.

నరవర విను భీష్మకభూ, నరుఁ డాక్రియఁ బుత్రునకును వశుఁడై పుత్రీ
పరిణయకార్యారంధ, స్ఫురణం జెలరేఁగి యొక్కశుభకరవేళన్.

3


ఉ.

రమ్ము రయంబె కుండినపురమ్మునకున్ సచివాప్తబంధుజా
తమ్ములఁ గూడి నీ కవితధమ్ముగ నిచ్చట రుక్మిణిన్ వివా
హ మ్మొనరింతు రాజనివహమ్ములు మెచ్చఁగ నంచు జాళువా
కమ్మ లిఖించి పంచెఁ గుతుక మ్మలరన్ శిశుపాలుపాలికిన్.

4


ఉ.

పంచినరేఖఁ గాంచి శిశుపాలుఁడు తద్దయు నుత్సహించి య
భ్యంచితకాంచనాంబరచయంబున దూత కప్పు డి
ప్పించి సమస్తబాంధవులఁ బెద్దల సంగడికాండ్ర నెల్ల రా
వించి వివాహలేఖఁ జదివించిన వారలు సంభ్రమించుచున్.

5


తే.

మంచిపని యయ్యె నిపుడు భీష్మకునితోడఁ, జుట్టఱిక మబ్బె నెంతయు సులభ మగుచు
నిందులకు సంశయింపంగ నేటి కింక, శోభనోద్యోగ మాచరించుట మతంబు.

6


చ.

అదియునుఁ గాక రుక్ష్మిణియొయారము సార మయారె సారెకున్
వదలక భూసురేంద్రు లనవిద్యగతిన్ నుతిసేతు రా నవాం
బుదనికరోపమానకచఁ బోలరు పన్నగరాజకన్యలున్
సదమలసిద్ధసాధ్యసురచారణకన్యలు రాజకన్యలున్.

7


చ.

అలికులవేణియుం బిసరుహాననమున్ నిడువాలుఁజూపులుం
జిలిబిలిపల్కులుం దళుకుఁజెక్కులు కెంజిగురాకుమోవియుం

గులుకుమిటారిగుబ్బలును గొప్పపిఱుందులు లేఁతనవ్వులుం
గలయలరుక్మిణిం బొగడఁగాఁ దరమే పరమేష్ఠి కేనియున్.

8


ఉ.

సారము ముద్దుఁబల్కు ఘనసారము నిద్దపుమేనితావి కా
సారము నాభిరంధ్రము విసారము తేటమిటారిచూపు శ్రీ
కారము కర్ణయుగ్మము చొకారము నవ్వుమొగంబు షట్పదా
కారము కొప్పు సన్మధువికారము మోవి వధూలలామకున్.

9


క.

కనకంబే మెయివన్నియ, కనకంబే ముక్కు విమలకమలేక్షణకున్
ఘనమే జఘనము మేచక, ఘనమే చకచకల నలరు కచ మంగనకున్.

10


క.

లికుచంబులుగద జనరా, లికుచంబులు తేంట్లు పైఁదలికచంబులు లే
మకరంబులు కెందమ్ములు, మకరంబులు జంఘ లాహిమకరాననకున్.

11


తే.

మంద మానడ నెన్నడుమంద మాన, భంబు కుచపాళి కనకకుంభంబుడంబు
చందమామకుఁ దుల మోముచంద మామ, నోజుతూపులు చూపులు రాజసుతకు.

12


సీ.

తరుణేందుబింబంబుఁ దచ్చంద్రికాతతి నదలించు నాననహాసములను
దంతికుంభంబుఁ దద్గమనంబుల నపహసించు నురోజయానములను
దర్పకాశుగములఁ దచ్ఛరాసనములఁ బూని యోడించు దృగ్భూయుగములఁ
దామరపువ్వులఁ దద్బిసశ్రేణులఁ బరిభవించు వరాంఘ్రిబాహువులను


తే.

శరధివీచులఁ దన్మహాసైకతముల, గదుముఁబొదలువళిత్రయికటితటములఁ
జంపకంబులఁ దన్మృదుసౌరభముల, మొనయునాసాంగవాసనలను వధూటి.

13


క.

ఆకామిని నుద్వాహం, బై కామునిఁ గెల్చి చిరతరానందరసా
స్తోకగతిన్ వసియించుట, నాకాధికసౌఖ్యలీల నలరుట సుమ్మీ.

14


ఉ.

మంచముకోటఁ దేనె యిడుమాడ్కిఁ దనంతనె తానె యిప్పు డా
చంచలనేత్ర నీఁదలఁచి సారయశుం డగుకుండినేశ్వరుం
డంచితిలీలఁ గాంచనమయం బగుశోభనలేఖ యంపి పి
ల్పించినయప్పు డేటికివలెన్ మఱి జా గిఁక నంచు నెంచుచున్.

15


క.

భృత్యులఁ దీర్పరు లైనయ, మాత్యులఁ గన్గొని ప్రమోదమతి నఖిలజన
స్తుత్యముగ మంగళోచిత, కృత్యము లొనరింపుఁ డనినఁ గేరుచు వారున్.

16


క.

పరిపరివిధముల నమరన, గరిగరిమన్ మెఱయుపురి జగన్నుతగతి వా
విరి విరివిగ నలరఁగఁ జే, సిరి సిరి కిర వగుచుఁ గ్రొత్తచెలువు దలిర్పన్.

17


తే.

శిల్పకకళాదలేపకచిత్రకార, రజకమాలికకుంభకారకకువింద
చర్మకారకముఖ్యుల సరిగఁ బిలిచి, వలయు నయ్యైప్రయోజనంబులు ఘటించి.

18


క.

దివ్యము లగుకల్యాణ, ద్రవ్యములుం గూర్చి సముదంబున నిఁకఁ గ
ర్తవ్యం బెయ్యది యనుటయు, భవ్యమతిం బ్రోడ లైనబంధువు లెల్లన్.

19

గీ.

నెమ్మి యగుపెండ్లిలగ్నంబు నిర్ణయించి, కమ్మ వ్రాయించి యాభీష్మకక్షితీశు
భటునితోఁ గూర్చి మఱితమభటుని నొకని, నొనరఁ గుండిననగరికిఁ బనుపుటయును.

20


క.

ఆభటు లిరువురు బలజి, ద్వైభవుఁ డగుగుండినేంద్రు దర్శించి వెసన్
శోభనపత్రిక యొసఁగఁ జి, రాభినవానందమందహాసాననుఁ డై.

21


క.

మణికల్యాణాంచితభూ, షణము లనేకంబుగా నోసంగి నృపగ్రా
మణి కల్యాణాంచితభా, షణములఁ జేదీశభటుని సంతసపఱిచెన్.

22


ఉ.

అంతట వాని వీడ్కొలిపి యాప్తుల బాంధనకోటులన్ మహీ
కాంతులఁ బిల్వఁబంచి శుభకారణవస్తువులెల్లఁ గూర్చి వీ
డంతయు వింతమీఱఁగ రయంబ యలంకృతి సేయుఁ డంచు న
త్యంతకుతూహలం బలక నాజ్ఞ యొసంగినఁ బౌరు లందఱున్.

23


ఉ.

గోడల నెల్లఁ జిత్తరువు గూరిచి నిద్దపుఁజందమామరా
మేడ లలంకరించి జిగి మీఱఁగఁ బల్లవహల్లకంబులం
గూడినరత్నతోరణపుఁగోటు అమర్చి బహిర్విహారపుం
జాడల వీథివీథులను జల్లిరి సారపటీరనీరముల్.

24


క.

నిగనిగజిగిఁ బొగడఁగఁ దగు, పగడపుఁగంబములు నించి పఱపు దలిర్పం
సొగసుగ ముత్తెపుఁబందిరు, లగణితముగ నిల్పి రప్పు డాకస మొరయన్.

25


ఉ.

రంగుగ మేలిబంగరుమెఱంగుటరంగుల నంగనామణుల్
పొంగుచు రంగవల్లికలు ప్రోడతనంబుల వ్రాసి వాసి మీ
ఱంగ మృగీమదంబుఁ గపురంబును సాంకవమున్ మెదించి యు
త్తుంగకపోతపాలికల దోర దర్పఁగ మెత్తి రత్తఱిన్.

26


తే.

పురములోపల రత్నగోపురము లెల్లఁ, గరము మెఱయ నలంకృతి నెఱి నొనర్చి
భూరిశోభాసమేతప్రభూతశాత, కుంభకుంభంబు లామీఁదఁ గుదురుపఱిచి.

27


క.

నగరులలోపలఁ గపురము, నగరులదూపములుఁ బెట్టి యతిశయగతి న
న్నగరిపునగరికి సరియె, న్నఁగ నగణితలీలఁ జెలు వొనర్చిరి వరుసన్.

28


వ.

అప్పు డప్పురవరంబు మరకతమణికృతవితతవిభావిభాసితోన్నతజాకలజాలకాంతర్ని
ష్క్రాంతాగరుధూపధూమశ్యామాభ్రభ్రమామితకామితలీలాఖేలనలోలశాలానీల
కంఠానీకంబును, బ్రతినికేతనకేతననూతనవితానశతానర్ఘ్యమణినికాయకాయమాన
విరాజమానంబును, నవరత్నకీలితలాలితశోభాసమానభాసమానానూనమానవేశనివేశ
ద్వారాపారప్రమోదపూరణకారణతోరణావలంబబింబఫలశంకాంకురకరామలకమ
లరాగోపలచాపలభావధావన్మహోత్సుకశుకనికరంబును, ఘనఘనసారసారసారంగ
మదామోదకహిమోదకధారావారాభిషిక్తసంసక్తముక్తాఫలచూర్ణకీర్ణనిరర్గళరాజ
మార్గంబును, సభాభవనభువనాద్భుతికరారచితరుచిరతరవ్యాజరాజీవరాజోన్ములనా

రంభసంరంభసమయసమర్యాదాకుంఠితకపటకంఠీరవభైరవాకారవిలోకనభీతభీత
మాతంగవ్రాతంబును, ధాళధళ్యప్రభాపూరహీరశిలాబద్ధస్నిగ్ధకుడ్యాంతర్నిహితమ
హితముకురనికురుంబబింబితాభ్యర్ణస్వర్ణసంభోజ్జృంభమాణమాణిక్యఖచితపాంచా
లికాబాలికావదనేందుబింబచుంబనలాలసబాలిశయువజనభజనాభిరామంబును, బ్ర
భూతశాతకుంభకుంభరంభాస్తంభశుంభద్బహిర్ద్వారప్రదేశంబును, రంగత్కురంగ
మదాగరుచందనచంద్రాకలంకసంకుమదాదికామోదశాదమేదురవేదికాంగణదేహళీ
మోహనంబును, సురుచిరదరీకుహరాంతరనిరంతరనిద్రారతఘోరతరేభాహితోత్థ
సన్నద్ధహేతుకకౌతుకప్రణాదితవిదితమురజదరఝర్ఝరపటుపటహకాహళభూరిభేరీ
భాంకారనినదంబును, సువాసినీకృతమంగళగానానురూపతానమానసంధానకగోపు
రోపరిపరిస్ఫుటత్కనకఘటాంతర్న్యస్తప్రశస్తలీలారవిందనిష్యందన్మరందపానా
నందితసుందరెందిందిరబృందామందమధురఝంకారంబును, నిరతభరతకళాకౌశలప్ర
ణర్తితనర్తకీజనఘనస్వేదోదకాపనోదకమహోద్యననానాసుగంధగంధిలసౌగంధిక
సారససౌరభ్యసరససరసీతలశీతలమారుతచారుతరంబును, విలసితఫలకుసుమవిసరా
వసరనైవేద్యసద్యోఘృతయుతాపూపసూపాన్నధూపదీపవాటీరవీటీరాజన్నీరాజన
పూజనాలంకృతదేవతాయతనంబును, హాటకతాటంకకంకణికింకిణీవలయతులాకో
టికోటీరహారకేయూరగళాభరణచరణకటకోర్మికాంచత్కాంచీముఖనిఖిలవిభూ
షణాంబరమాల్యానులేపనప్రదీపితసకలయువయువతీజనమనోహరంబును, బహు
విధవర్ణోల్లిఖితచిత్రాలీలాతిరస్కృతతిరస్కరిణీజాతజాతరూపనిర్మితనిర్మలహర్మ్య
భిత్తికానిచయంబును, మకరనికరాహీనమీనతిమీనఢులీకుళీరదుర్ధరదర్దురో
ద్రోరగాంభఃకుంభికుంభీరనీరాధారపరిఖావిహరమాణమానసౌకఃకోకాద్యఖిలఖగ
కులకలకలరావానుకూలతాలప్రమాణమానితపూర్ణకుంభసంభారాతిమందయానా
నుకరచిరంటీమంజుమంజీరనినదంబును, పవనజవననిరాఘాటఘోటకబంధురసింధు
రారోహణకోణకృపాణబాణబాణాసనాద్యనేకాయుధాభ్యాసవాసవాసనాప్రవీణ
ధరణీవరకుమారవర్గంబును, జతురచతురాగమపారగోర్వీసురభాసురాశీర్వాదనాదవే
దనాదామోదకరంబు నై త్రిదివంబునుంబోలె వివిధబుధప్రకరాకరంబై వైకుంఠపు
రంబునుంబోలె ననవరతలక్ష్మీనివాసం బై కైలాసస్థానంబునుంబోలె సర్వమంగళాలం
కృతం బై సత్యలోకంబునుంబోలె నతులితశతానందం బై రసాతలంబునుంబోలె నవి
రళకంచుకిసమంచితం బై యొప్పె నంత.

29


క.

ఇత్తెఱఁ గంతయుఁ దనచెలి, కత్తె లెఱింగింప విని మొగంబున దైన్యం
బత్తుకొన నపుడు రుక్మిణి, చిత్తము దత్తఱము నొందఁ జిడిముడిపడుచున్.

30


తే.

కటకటా రుక్మి యన్పాపకర్ముఁ డిపుడు, చేదిభూనాథునకుఁ బెండ్లి సేతు ననుచుఁ
బూని యున్నాఁడు వాని కీబుద్ధి మాన్పి, తవిలి శౌరికిఁ గూర్చువా రెవరు గలరు.

31

క.

వినయవిహీనుం డగుచును, దనయానతి మీఱి తిరుగుతనయానుమతిం
బని యొనరింపఁగ దొరఁకొనె, జనకుండును వేఁదు రగుచుఁ జంచలబుద్ధిన్.

32


చ.

చెఱకున బండు లుద్భవము సేయక బుద్ధివిహీనుఁ డై ఫలో
త్కరము ముసిండిచెట్టునకుఁ గల్గగఁజేయుచు నున్నకైవడిన్
హరహర పాపజాతివిధి యావనమాలికిఁ గూర్ప నొల్ల కీ
పరమనికృష్టుఁ డైనశిశుపాలున కేక్రియఁ గూర్పఁ జూచెనో.

33


చ.

సరసగుణాభిపూర్ణుఁ డగుశౌరిపదాంబుజసేవ సేయఁగా
మరిమరి గోరుచిత్త మిఁక మక్కున నన్యులఁ జేరఁగోరునే
నిరతశుభాకరామరధునీపృథువీరవిరాజచూర్మికా
పరిచితరాజహంస మొకపట్టున పచ్చికపట్టుఁ జేరునే.

34


క.

హైమవతి కిపుడు నాపై, ప్రేమ మదిం గలిగెనేని వెస నొనఁగూడున్
దామోదరసాంగత్యము, దామోదరసాభ్యుదయనిధానం బగుచున్.

35


సీ.

కృష్ణమేఘ మురోజగిరిశృంగములమీఁద మెఱపు దీపింపఁగా మెలఁగు టెపుడు
మెలఁగి గంభీరవాగ్విలసితనిర్ఘోషములచేతఁ బలుమాఱుఁ జెలఁగు టెపుడు
చెలఁగి కృపారసోజ్జ్వలజలధారలు మరిమరి దఱచుగాఁ గురియు టెపుడు
కురిసి మనఃక్షేత్రగురుతరతాపాగ్ని యుడుగ నిర్భరలీలఁ దడుపు టెపుడు


తే.

తడిసి సంతతసౌఖ్యప్రదంబు లగుచు, మెండుకొని కామసస్యముల్ పండు టెపుడు
నిపుణమతి నూహ యొనరింప నపుడు గాక, తొలఁగునే దైన్యమతియెల్ల దూర మగుచు.

36


ఉ.

మారునిఁ గేరుచారుసుకుమారుని నందకుమారుని న్మనో
హారుని మౌనిమానసవిహారుని సన్మణిహారునిన్ రమా
ధారుని ఘోరశాత్రవవిదారుని శశ్వదుదారునిన్ సదా
చారుని భక్తరక్షణవిచారుని నేక్రియఁ జూడఁగల్గునో.

37


ఉ.

ఎవ్వరి వేఁడుకొందు మది నెంతని మోహము నిల్పుకొందు నిం
కెవ్వరు పంకజాయతదళేక్షణుఁ దోడ్కొని తెచ్చి యాత్మలో
నెవ్వగ మాన్పఁ జాలుదురు నీలబలాహకవర్ణుఁ డెప్డు తా
నివ్వసుధేశ్వరాధముల నెల్ల జయించి వరించు నన్ గృపన్.

38


సీ.

వికసితవిశదారవిందబృందంబులు గిరిరాజసుత కొసంగినఫలంబు
కలితప్రభాపూరకర్పూరపారతుల్ శివవధూమణికి నిచ్చినఫలంబు
మధురతామోదితమధురసంబుల జగజ్జనని కర్పణ మొనర్చినఫలంబు
కమనీయకల్హారసుమదామములు చండికకుఁ గూర్చి యిడిననిక్కపుఫలంబు


తే.

కొదవఁ బొదవక యిపు డొనఁగూడెనేని, నందనందనుఁ డతులితానందుఁ డగుచు
ననుఁ గృపాదృష్టి వీక్షించి నగుచు మధుర, భాషణంబులచేఁ గరస్పర్శ సేయు.

39

క.

హరినీలోపలనిభుఁ డగు, హరి నీలోపలనె తెచ్చి యవనిపులెల్లం
బరిభన మొందఁగ నాకుం, బరితోష మొనర్చుపుణ్యపరుఁ డెవ్వఁడొకో.

40


క.

అని కజ్జలజలధారలు, కనుఁగవ దొరఁగఁగ దురంతఘనతరచింతా
వినమితముఖి యగుకాంతా, జనరత్నముఁ గాంచి యొక్కసఖి యిట్లనియెన్.

41


క.

ఘనుఁ డగుభీష్మక జనవరు, తనయవు సతతప్రకాశితనయవు సిరులం
దనరినదానవు మానస, మున నిటు వగ పేటికమ్మ ముద్దులగుమ్మా.

42


తే.

ఆనతీవమ్మ యిపుడె నీయాన తీవ, బోణి కూరిమి మదిలోనఁ బూని వేగ
దానవారిని దెత్తు నీదానవారి, రాశినడుమను వెలయుద్వారకకు నరిగి.

43


ఉ.

మేలు బలా బలానుజుఁడు మేటి సుమీ యబలా బలారియుం
జాలఁడు వానివైఖరులు సారమతి న్నుతిసేయ నట్టిగో
పాలకుమారుఁ గోరి శిశుపాలుని నొల్లక యున్నదాన విం
కేల మదిన్ విచార మిపు డీక్రియ చక్రి కెఱుంగఁజేయుమా.

44


ఉ.

ఓరమణీలలామ యిటు లూరక కోరికలూర సారకుం
బేరుకొనంగ నేమిటికిఁ బెక్కువిధంబుల నీకు వేఁడు కౌ
తీరున నాచరించెదము తెల్పుము నిక్కము మీఱ మేము నీ
వారము గామె యేమి పగవారమె వేఱ మఱొండు నేర్తుమే.

45


క.

వల నగునీకోరిక మా, వల నగుఁ గల నైనఁ జింత వలవదు మదిలోఁ
గల దెఱిఁగింపవె ముద్దులు, చిలుకఁగ మాతోడఁ బలికి చిలుకలకొలికీ.

46


క.

నవలా నెఱ వగునీయభి, నవలావణ్యంబుతెఱఁగు నలినాక్షునకుం
జెవిసోఁకినంతమాత్రనె, తెవిలి వెసన్ రాకయున్నె తత్పరమతి యై.

47


తే.

సతతసత్యవ్రతుని గుణాన్వితుని మతిమ, హితుని విహితుని మీపురోహితునిసుతునిఁ
బనుపఁగదవమ్మ సరగ నోపసిడిబొమ్మ, తడ వొనర్పక యాజనార్దనునిఁ బిల్వ.

48


క.

అను నెచ్చెలినునుఁబలుకులు, విని యచ్చెలి మదిఁ జెలంగి వెర వెఱుఁగఁగఁ చె
ప్పిన ఘనవినయాన్విత ర, మ్మని తనదరి నునిచి మిగుల హర్షము వెలయన్.

49


ఉ.

చంచలనేత్ర నీదు నెఱజాణతనంబున మన్మనోరథం
బంచితవైఖరిన్ సఫలమై పెనుపొందుఁగదా గదాగ్రజుం
గాంచినయంత మంచిమణికాంచనదివ్యవిభూషణంబు లి
ప్పించెద నీకు నే నెలమిఁ బెట్టెఁడు పెట్టెడు నింపు మీఱఁగన్.

50


క.

నీమహిమకు సరివోల్పఁగ, నీమహి మఱి కలదె తఱుచు లేమిటి కిటు లో
రామరొ నీ విపు డనినధ, రామరు నిచ్చటికిఁ దెమ్మ హర్షం బెసఁగన్.

51


ఉ.

నావుడుఁ జెల్మికత్తె నృపనందనకుం దనకూర్మి చూపుచుం
భావనచిత్తుఁ డై నిగమపారగుఁ డై వెలుఁగొందుచున్నభూ

దేవకుమారుఁ జేరి సొరిదిన్ మధురోక్తులఁ దత్ప్రకార మెం
తో వెరవొప్పఁగాఁ దెలిపి తోడ్కొని ముందరఁ దెచ్చి నిల్పినన్.

52


క.

జగతీసురసుతు శశిమణి, జగతిం గూర్చుండఁజేసి సవినయనిర్వ్యా
జగతిం బూజ లొసంగి త్రి, జగతీస్తుతసుందరాంగి చతురత ననియెన్.

53


చ.

సరసీరుహాసనాన్వయనిశాకర నన్ గృప నాదరించి యి
త్తఱి నుపకార మొక్కటి యుదంచితలీల నొనర్చి లోకభా
సుర మగుకీర్తిఁ జెంది సరసుల్ నుతిసేయఁ జెలంగు ముర్విపై
నరయఁ బరోపకారవిమలాత్ములు గారె బుధేంద్రు లెప్పుడున్.

54


తే.

విను ధరామర హరికి విద్వేషి యగుచుఁ, బాపమతి రుక్మి నను శిశుపాలుఁ డనెడు
పరమదౌర్భాగ్యునకు నేఁడు పరిణయంబొ, నర్స నూహించియున్నాఁడు దర్ప మెసఁగ.

55


క.

ఈకుండినపతి శక్తుఁడు, గాకుండినవాఁడు వానిఁ గాదని హరియున్
రాకుండిన నిపు డతనికి, నీకుండినఁ గోర్కు లెల్ల నె ట్లొనఁగూడున్.

56


ఉ.

ఓవసుధాసుధాశనకులోత్తమ చిత్త మహర్నిశింబులున్
బావని యైనకృష్ణపదపంకరుహద్వయిసేవఁ గోరుచుం
గేవలకౌతుకస్ఫురణఁ గేరుచు నున్నది యెన్నిభంగులన్
నీ వరుదెంచి యివ్విధము నేర్పున శౌరికి విన్నవింపవే.

57


క.

భూసురనిరుపమగుణగణ, భాసురఘనరాజహంసపరిచితలీలా
వాసంబు గాక మానస, కాసారం బేక్రియం బ్రకాశత నొందున్.

58


చ.

మెఱయుచు నీలవర్ణమున మీఱి నిరంతరచంద్రికాప్రభా
కరసముదంచితాంబరముఁ గప్పి గభీరతరప్రణాదభా
సురుఁ డగునట్టియాఘనుని సొంపుగఁ దోడ్కొని తెచ్చినప్పుడే
యిరవుగ భూరివృష్టిఁ గురియింతుఁ జుమీ ద్విజముఖ్య యర్మిలిన్.

59


క.

సాక్షులు సు మ్మిత్తామర, సాక్షులు నీకొసఁగుదాన నభిమతము కృపా
వీక్షణమునఁ గన్గొని నీ, వీక్షణమున ద్వారవతికి నేఁగుము విప్రా.

60


శా.

నీకుం జెప్పెడిదేమి భూమిసుర యానీరేజపత్రాక్షుతో
నాకార్యంబు సమస్తముం దెలిపి యానందంబు గావించి య
స్తోకానేకపవాహవాహినులతోఁ దో డ్తెమ్ము పొ మ్మంచుఁ దా
నేకాంతంబునఁ గొన్నిమాట లపుడే యేర్పాటుగాఁ దెల్పినన్.

61


క.

విని బాడబకులతిలకుఁడు, ఘనతరపరితోషహృదయకమలుం డగుచున్
వనితామణిఁ గన్గొని యి, ట్లనియెన్ మృదువచనరచన లలరారంగన్.

62


క.

లలనా సురుచిరతరలీ, లల నానృపుఁ దెత్తు వేయులాగులఁ దెలుపన్
వలెనా మదిఁ దలఁపఁగ నీ, వలె నా కిఁక నాప్త లైనవారలు గలరే.

63

క.

అరుదెంచును రే పవ్విభుఁ, డరుదెంచినఁ గాంచి మోదమందెదవు సుమీ
హరి కరులఁ దఱుముకరణియె, హరి కరులం దఱుము టెల్ల హరిణాంకముఖీ.

64


ఉ.

మానిని యేవిచారమును మాని నిరంతరకౌతుకంబులో
నాని జెలంగుదుండుము జనార్దనుఁ డానరనాథయూధమున్
భూనుతవిక్రమం బలరఁ బోవఁగఁ దోలి నినున్ వరించు నం
చానలినాక్షికిం దెలిపి యానతిఁ గైకొని సాదరంగబుగన్.

65


తే.

రామకార్యంబు మదిఁ బూని రభసవృత్తి, దనర నరిగినయామరుత్తనయుపోల్కి
రామకార్యంబు మదిఁ బూని రభసవృత్తి, దనర నరిగెను భూమరుత్తనయుఁ డంత.

66


క.

మనుజాధిపసుత యివ్విధ, మున దామోదరునిఁ బిల్వ భూసురవర్యుం
బనిచియును నమ్మఁజాలక, ఘనతరచింతాభరంబు గడలుకొనంగన్.

67


క.

యెద దిగులు గదిరి మిగులన్, వదనాంభోరుహము వంచి వదలనికోర్కుల్
గుదిగొన నునుఁజెక్కునఁ గే, ల్గయించి విరించి నెంచి కళవళ మొదవన్.

68


వే.

కనుఁగొనలవల్ల వెడలెడుకజ్జలంబు, కలుము లొయ్యన లేఁజెక్కుఁగవకు జాఱ
వేఁడినిట్టూర్యుఁ దెమ్మెరల్ వృద్ధిమీఱ, నుసురసురటంచుఁ గృశియించుచున్నఁ జూచి.

70


ఉ.

కంపిలిగుంపులై చెలిమికత్తియ లత్తఱి బిత్తరిన్ విమ
ర్శింపను గార్య మెద్దియును జేయఁగనేరక చెంగటం బ్రవ
ర్తింపఁగఁ గొంతసేపునకుఁ దెల్వి వహించి నృపాలపుత్రి బ
ల్గెంపుమెఱుంగువాతెర చలింపఁగ వారలతోడ నిట్లనున్.

71


సీ.

చెలులార భూసురశ్రేష్ఠుఁ డాద్వారక కేరీతి నురవడిఁ జేరఁగలఁడు
చేరి యన్యులు ప్రవేశింపఁ జెల్లని రాజశుద్ధాంత మేలీలఁ జొరఁగఁగలఁడు
చొచ్చి యచ్చట దివ్యశోభానిరూఢిఁ గ్రీడించునచ్యుతు నెట్లు కాంచఁగలఁడు
కాంచి వంచనలేక గమలనాభునకు నాతెఱఁగెల్ల నెబ్భంగిఁ దెలుపఁగలఁడు


తే.

తెలుపఁగా విని విభుఁడు మదిం జెలంగి, యెవ్విధంబున న న్వరియింపఁగోరుఁ
గోరి యేక్రియ నెగ్గించుకొనక వచ్చు, వచ్చి యేగతి నిమ్మహీవరులఁ గెలుచు.

71


చ.

గెలుచుట దుస్తరంబు పరికింపఁగ నంబుజసూతి యీగతిం
జలము వహించె నించుకయు శాంకరికిం గృపఁ గల్గదయ్యె ని
మ్ముల నొనరించుదేవగురుపూజలు నిర్మలదానధర్మముల్
ఫల మిడఁజాలవయ్యె మదిఁ బాయదు కూర్మి యిఁకేమి సేయుదున్.

72


శా.

రాజీవేక్షణుఁ డేపుతో నిచటికిన్ రాకున్న గర్వాంధుఁడై
రాజశ్రేణులఁ గూడి చేదిపతి సంరంభంబుతోఁ జేరి వి
భ్రాజల్లీలల న న్వరించినపుడే పంతంబు చేకూరి యీ
వ్యాజస్వాంతుఁడు రుక్మి యుబ్బుఁగద రే యత్యంతసంతుష్టుఁ డై.

73

తే.

ఎన్నఁ డావెన్నుఁ డాదరం బెసఁగఁ జూచు, నెన్నఁ డీరుక్మిపంతంబులెల్ల నడఁగు
ఖిన్నుఁడై చేదిజగతీశుఁ డెన్నఁ డుఱుకు, నిష్టభోగానుభవసిద్ధి యెన్నఁ డొదవు.

74


వ.

అని పలికి కలికి తనమనంబున.

75


ఉ.

చిక్కనిగుబ్బచన్ను లెదఁ జేర్చి కవుంగిట బిగ్గఁ గూర్చి లేఁ
జెక్కుల ము ద్దొసంగి తమిచేఁ గళలంటినఁ బొంగి నెమ్మదిన్
జొక్కి సుధాధరంబు చవి చూపి గళధ్వను లుప్పతిల్లఁ బె
న్మక్కువ నవ్విభుం గలసి మారునికేలిఁ జెలంగు టెన్నఁడో.

76


క.

ఎగ్గించుక నే నతనిన్, సిగ్గున డగ్గఱకయున్నఁ జెలువుఁడు తమిచే
దిగ్గునఁ గైకొని కౌఁగిట, బిగ్గరఁ గదియించి రతులఁ బెనఁచుట యెపుడో.

77


ఉ.

నిచ్చలు విచ్చల న్విడిని నిద్దపుటద్దపుగుంపుసొంపుగా
గ్రుచ్చినపచ్చమానికపుగోడలనీడలు గాంచి యిచ్చటన్
నుచ్చుచు నచ్చముత్తియపుమేడల గొజ్జఁగిపువ్వుసెజ్జపై
మచ్చిక నచ్యుతుం గదిసి మన్మథలీలలఁ గేరు టెన్నఁడో.

78


క.

అకటా శకటాసురహరుఁ, డొకటం బ్రకటానురాగ మొదవఁగఁ గారు
ణ్యకటాక్షంబునఁ గోరిక, వికటము గావింప కెపుడు వీక్షించునొకో.

79


తే.

అనుచు మోహాతిరేకంబు పెనఁగొనంగ, నాత్మలోపల నూహించి యన్న సేయు
పనికిఁ గ్రేధించి మఱియు నిబ్బరపుటార్తి, మానసమునందు నంటి యామచ్చెకంటి.

80


ఉ.

కట్టదు పట్టుపుట్టములు కాంచదు కాంచనకాంచికాదులన్
బెట్టదు కొప్పు విప్పుగను బెంచదు కొంచెపుటంచబోదలన్
ముట్టదు వీణెపాణులను ముద్దుఁజెలుల్ దరిఁ జేరఁ గేరి చే
పట్టదు పట్టెడన్న మొకపట్టున నైన భుజింప దింపునన్.

81


క.

పాడదు మృదుగానము తమి, నాడదు నెచ్చెలులఁ గూడి యార్తులఁ గృపతోఁ
జూడదు హృదయాంతరమున, వీడదు చింతాభరంబు వెలఁదుక యెపుడున్.

82


ఆ.

కురులు తురుముదిద్ది విరులు నింపదు కుచ, గిరుల నురులుగొన్నసరులు విప్ప
దలర జలకమాడ దద్దంబుఁ గన్గొని, తిలక మిడదు నిటలఫలకమునను.

83


తే.

పసను బొంగారుబంగారుపళ్లెరమున, రసిరసాన్నంబు లిడి దాది ర మ్మటన్న
మసలుచును జేరి యుసురని బిసరుహాక్షి, కసరి కసిగాటులుగ వెస మెసఁగి లేచు.

84


ఉ.

చెంతలఁ జేరి యూడిగపుఁజేడియ లాకుమణుంగు లిచ్చినం
గాంత పరాకు మీఱ నవి గైకొని వేనలి నుంచు మంచిసే
మంతు లొసంగినం గుసుమమంజులగాత్రి విడెంబు సేయు నిం
కెంతని తెల్ప శక్యము నవేందునిభాస్యమనోవికారముల్.

85

మ.

తలయూఁచున్ గనుదోయి మూయుఁ దనలోఁ దా నవ్వుచుం బిల్వకే
పల్కుం జెక్కునఁ జెయ్యి సేర్చు సఖులం బ్రార్థించు నిట్టూర్పుగా
డ్పులు నించున్ బయ లాలకించు విధిఁ దిట్టున్ గుట్టురాపట్టికిన్
బలుచందంబుల మ్రొక్కుఁ జొక్కు హరిపై భావంబు రంజిల్లఁగన్.

86


సీ.

కరిరాజయాన భాసురశీతకరచూతశరవాతపోతవైఖరుల కులుకు
ముకురాభవదన హంసకిశోరపికకీరనికరారవములరేవకుఁ దలంకు
ధవళాబ్జనయన యాసవవాననవగానరవసూనమాలికాప్రతతిఁ దెగడు
తరుణీలలామ నూపురజాలవరచేలహరినీలమణిభూషణాదు లిడదు


తే.

కలికి ఘనసారహిమపూరగంధసార, సారసారంగనాభికాసాంకవాది
మేదురామోదశాదంబు మేనఁ బూని, యలఁద నొల్లదు సంతాప మతిశయిల్ల.

87


తే.

కలఁగు జెలఁగును మాధవాగమనలీల, ద్విజముఖంబునఁ దేటగాఁ దెలుపుటకును
దొలఁగు మెలఁగును విధు నెమ్మితోడఁ జూడఁ, దమిని బలుమాఱు నమ్మదదంతియాన.

88


తే.

అలికిఁ జులుకిత మగుకరువలికిఁ గులికి, ములికిగము లేయుమరునియంకిలికిఁ దొగల
చెలికిఁ గలకంఠములహళాహళికిఁ గనరు, చిలుకుచిలుకలపలుకుల కులికి కలికి.

89


సీ.

అందమా నీకు మిళిందమా శారికాబృందమా పున్నమచందమామ
వైరమా నీకు మయూరమా చంద్రికాసారమా శౌరికుమారమార
పంతమా నీకు లతాంతమా కీరశకుంతమా క్రూరవసంత మదిని
మేలమా నీకు మరాళమా కోకిలజాలమా మందవాతూల మఱియుఁ


తే.

గేరి యీరీతి నీతి వోఁ గోరి మీఱి, దారి తొలగి మెలంగుట తగవు గాదు
వాదురాఁగద్ద మీ కిటుల్ వ ద్దటంచు, సెంచుఁ జలియించుఁ గొంచు నమ్మించుబోఁడి.

90


సీ.

జుమ్మని నెమ్మోముఁదమ్మి నిమ్ముగఁ గ్రమ్మి యెమ్మెతోఁ ద్రిమ్మరుతుమ్మెదలకుఁ
గమ్మనికపురంపుదిమ్మెలఁ గలదుమారమ్ము చిమ్మెడుకమ్మదెమ్మెరలకు
హుమ్మని క్రమ్మక దొమ్మిఁ జిమ్మిలిరేఁగి నెమ్మదిఁ గూయుపికమ్ములకును
గుమ్మనివీణె లొక్కుమ్మడి మ్రోయ రాకొమ్మలు సేయుగానమ్ములకును


తే.

దాలి మంతంతకును వీడి తూలి జాలి, బాలికామణి సోలి విరాలిఁ దేలి
మే లిడఁగఁ జాలి తనపాలియేలికైన, శూలి గారాపుటిల్లాలి నోలిఁ బొగడు.

91


తే.

అత్తెఱంగునఁ దత్తఱం బెత్త చిత్త, వృత్తి బురుషోత్తమునిమీఁద హత్తుకొల్పి
బత్తి దనరెడిబిత్తఱి నత్తిఱిని మృ, దూత్తిరంబులఁ జెలికత్తె లొత్తి యనిరి.

92


క.

మగువా హరి యిఁక నీసొ, మ్మగు వానికి నీకుఁ బెండ్లి యగు నిటు వగవం
దగవా జగములు పొగడం, దగ వాసవవైభనమునఁ దనరుదు వెపుడున్.

93


తే.

విందు మహిమాన్యుఁ డైనగోవిందుమహిమ, గణనయిడఁజాలఁడట చుట్టు కైదువయును
దరముఁ గరమునఁ బూని పోఁ దఱముఁ గరము, సమరతలమున నరిసమూహముల నెల్ల.

ఉ.

ఇంతిరొ యింతచింత మది నేటికి నేఁటికిఁ జూడు శౌరి రే
పెంతయు సంతసం బలర నెల్లజనుల్ వినుతింప మేదినీ
కాంతులఁ బాఱఁదోలి నినుఁ గైకొనుఁ బైకొని యోడి ఖిన్నులై
పంతము వీడి రుక్మిశిశుపాలజరాసుతు లిండ్లు దూఱఁగన్.

95


క.

మోహావేశంబున నటు, లాహా యాహార ముడిగి హాహా యనుచున్
నీహారకరముఖీ ఘన, సాహసవృత్తి న్మెలంగఁ జాడయె నీకున్.

96


చ.

అలరెడురాజనందనుల నాత్మగతంబునఁ గోరి కేరి మున్
నిలచినవారు లేరొ యిటువంటివి గంటిమె యెందునైన నీ
వలన బళా బళా తెలిసి వచ్చెను వింత లొకింత యిప్పు డో
కులుకుమిటారి చిత్తమునఁ గోపముఁ గల్గినఁ గల్గని మ్మిఁకన్.

97


క.

చీటికిమాటికి నేటికి, సాటికిఁ బాటిలెడుతోడిసకియలపైఁ గో
పాటోపము చూపెదవు వ, ధూటీ యిటు దగునె యెంతదొరతనమైనన్.

98


ఉ.

వంచనతోడ నూడిగపువారిజగంధులు చేరి సేవగా
వించ గణంగినం బరిభవించి సళించుదు ముందు పొందుగాఁ
బెంచినరాజహంసశుకబృందములన్ బెదరించే దేటి కో
చంచలనేత్ర నీవలపుచందము లెంచఁగఁ జిత్ర మియ్యెడన్.

99


ఉ.

నాన వహింప కిట్లు దగునా నవసూనశరానలార్తి లో
నానఁగ మానరానితమి నానగధారిఁ దలంచి చెల్లఁబో
దీనగతిం గృశింప వెలఁదీ నగరే నగరి న్మఱి న్మఱిన్
మానినులెల్ల నెంచుకొనుమా నిను మాటికిఁ బల్క నేటికిన్.

100


సీ.

జలకంబు లాడనిచులుకఁదనం బేమి గంధంబు పూయనిచంద మేమి
తొడులు దొడుగనియుడుగనిచల మేమి తిలకంబు దిద్దనికఁక యేమి
ముకుుంబుఁ జూడనివికలభాసం బేమి విరిసరుల్ దాల్పనివరుస యేమి
పెన్నెఱుల్ దువ్వనివిన్నఁదనం బేమి యాహార మొల్లనియూహ యేమి


తే.

రామ యీరీతి వర్తింపరాదు నీదు, కోర్కు లేడేఱు నందునికొడుకు రేపె
యేపుతోఁ జెలి ని స్వరియించు నించు, కైన మదిలోన సంశయం బందవలదు.

101


చ.

సొలయక కూడి వేడుకల శోభిలి జాబిలిరాలమేడలోఁ
దళుకుఁబసిండిజీనిపనితల్పముపై వసియించి నీవునుం
జెలువుఁడు సారెసారెకును జిత్రవిలాసములన్ మెలంగుచోఁ
దలఁతువొ లేదొ మ మ్మపుడు తామరసాక్షి నిజంబుఁ దెల్పుమా.

102


క.

అని యనుఁగుఁజెలులు పలికిన, విని వనరుహనయన వినయవినమితముఖి యై
ఘనతరలజ్జాభరమునఁ, దనమది నూఱడిలి యుండె తమి నిగుడంగన్.

103

క.

అంత వసంత మనంతల, తాంతనితాంతాళిపికశుకాదిశకుంతా
క్రాంతవనాంతరమై జగ, మంతయు సంతసిల నలరె నభినవలీలన్.

104


సీ.

ఘనసారకేతకీపనసారవిందాదివనసారసౌరభ్యవాసితంబు
సురసాలతులితామితరసాలఫలలోలసరసాలపనశీలవరశుకంబు
సుమనోరసాస్వాదనమనోరథాత్యాశుగమనోరరీకృతభ్రమరకంబు
సుకరావయవచారుపికరావహృతపా౦థనికరావలేపాత్మనిశ్చలంబు


తే.

మదనకదనక్రియార్హతమప్రసూన, మంజరీమంజుమాధవీకుంజపుంజ
సంజవనరంజితాఖండకంజజాండ, మండలంబు వసంతాగమంబు దనరె.

105


క.

పెళపెళలాడెడుకారా, కులు జలజల డులిచి చింతకొమరు దలిర్పన్
మిలమిలలాడెడుకెంజివు, రులతోఁ బొలుపారె భూమిరుహనివహంబుల్.

106


చ.

సరసగతిం జగిర్చిన విశాలరసాలలతావితానముల్
మెఱసె వసంతుఁ డాదరము మీఱ వనేందిరఁ బెండ్లి యౌటకున్
సురుచిరలీలఁ జేరు ననుచున్ సమయాఖిలకార్యదక్షుఁ డ
త్తఱి నలరింపఁజేయు వితతం బగుకెంజిగిమేలుక ట్లనన్.

107


తే.

దట్టముగఁ బూచి శాల్మలీతరువు లమరె, విరహిణుల నేఁచ వాహ్యాళి వెడలఁదలఁచి
యలరఁ జేసినధాతురాగారుణితము, లగుమనోజునిమదపుటేనుఁగు లనంగ.

108


తే.

వనరమాధవోద్వాహవైభవమున, కింపుఁ దళుకొత్తఁ గ్రొత్తఁగా నేర్చి యిడిన
మేలితెలిముత్తియపుసేసఁబ్రా లనంగ, మొనసి యున్నట్టె జిగిమల్లెమొగ్గ లమర.

109


క.

నన లెత్తినకింశుకములు, దనరెన్ మాధవుఁడు వలవు దళుకొత్తంగా
వనలక్ష్మికిఁ గానుక లి, చ్చిన నునుఁగెంజాయపట్టుచీర లనంగన్.

110


తే.

రమణఁ బున్నాగమహిళలు సుమకదంబ, లీలలఁ జెలంగఁ బొంగి యవ్వేళయందుఁ
బుష్పవతి యయ్యు మిగులు నేపునఁ గుమారి, విటపపరిరంభవృత్తిచే వెలసె గణిక.

111


క.

చిగురాకు మెక్కి మిక్కిలి, పొగరెక్కి రసాలసాలములపైఁ బికముల్
తగ నిక్కి చొక్కి పాంథుల, కగణితముగ గుండె జల్లురన వడిఁ గూసెన్.

112


క.

ఎక్కడఁ జూచిన శారిక లెక్కడఁ జూచినఁ బికంబు లెడ మింతయు లే
కెక్కడఁ జూచినఁ దుమ్మెద, లెక్కడఁ జూచినను కంబు లిలఁ జెలరేఁగన్.

113


సీ.

సుందరశుకరాజవందిబృందంబులు కలకంఠవరకంఠకాహళములు
వికచతిరీటప్రవిమలాతపత్రముల్ సహకారమంజరీచామరములు
లాలితాశ్వత్థపల్లవకేతనంబులు మత్తసషట్పదగాయకోత్తములును
భవ్యప్రసకవకుంజపటకుటీరంబులు సంఫుల్లచంపకస్వర్ణరథము


తే.

అతులతరకేతకీదళోగ్రాయుధములు, నలర బలయుతుఁడై మనోజావనీశుఁ
డేపుతోఁ బాంధవీతతుల నేఁచఁ బూని,ని హర్ష మిగురొత్త నపుడు వాహ్యళి వెడలె.

114

సీ.

ప్రకటపాలాశకోరకనఖక్షతయును గలరవాంచితరుతగళరవయును
సమదమిళిందనిస్వానసీత్కారయు నవనీపతత్పుష్పహారమణియుఁ
కీరశారీరవకింకిణీనినదయు శుంభల్లతాపరిరంభణయును
బరభృతసందష్టపల్లవాధరయును గళదురుమకరందఘర్మకణయుఁ


తే.

బరిమళానిలనిశ్వాసభాసురయును, వితతఘనసారచూర్ణభావితయు నగుచు
నలరి వనఃక్ష్మి మాధవు నతులగతులఁ, గూడి క్రీడించె వేడుకతోడ నపుడు.

115


వ.

మఱియునుం జుఱుకు గలతురంగంబులం బఱపిన గొరగొరం బరువులిడుచాడ్పున
ధరణీపరాగంబు నభంబున కెగయ విసవిసవిసరు సుడిగాడ్పులును, గాడ్పులవలనం
జలించుదు బెడిదంపుటంప గుంపుసొంపున బెం పలరి జలజలరాలు కారాకుతండంబు
లును, గారాకుతండంబులెల్ల డుల్లిన పెల్లున మొల్లంబుగఁ గవచంబులు దొడిగి
యుడుగని చలంబునఁ గయ్యానకుఁ గాలు ద్రవ్వుచు నిల్చిన బిరుదురాహుత్తుల
పగిది నిగురుజొంపంబుల నలరుమహీరుహంబులును, మహీరుహాగ్రంబు లెక్కి
వెక్కసంబుగఁ గెంజివురులు మెక్కి చొక్కి పొగరెక్కి నిక్కి చిక్కక యొక్కు
మ్మడిం బరుల వెన్నాడి నిలు నిలు పోకు పోకు మని తాఁకం గూఁక లిడు వీర
భటుల యటుల కో యని కూయుపికనికరంబులును, బికనికరంబుఁకుఁ దోడుగఁ
గూడి ధీరు లగువజీరుల బిరుదులు పొగడు వందిబృందంబులచందంబున నందం
బుగఁ బల్కు శుకంబులును, శుకముఖోపమానముకుళాభిరామంబులై భీమంబుగ
నెదిరి పిఱుతవియక కఱకుటడిదంబులు వెఱికి యుఱికి నఱకులాడి యచ్చంపుపచ్చి
గాయంబులతో నలరు శూరులతీరునం గేరు పలాశంబులును, బలాశభూతభేతాళ
నిచయంబులకుఁ బ్రియంబు లగు మాంసఖండంబుల లాగునఁ బ్రోగులై రాలు
శాల్మలీకుసుమంబులును, గుసుమరసవాదోన్మాదంబున మోదంబున మీఁదికి నురవడి
నెగయుచు మరునిమౌర్వీనాదంబువిధంబున ఝంకారంబులు సేయు మధుకరంబు
లును, మధుకరంబు లాస్వాదంబు లొనరించుతఱిం గ్రిందికిం జింది రక్తప్రవా
హంబలపోలికం జాలువాఱు పూఁదేనెటేఱులును, దేనెటేఱులయోకల మకరంద
ధారలం బద నెక్కి మస్తిష్కపంకంబుల పొంకంబున నొప్పు పుప్పొడికుప్పలును,
మెఱుఁగుటరిగల గరమ వెలుంగు గురివింద విరిగుత్తులును, గేతనంబులరీతిఁ బొదలు
చలదళపల్లవంబులును, వాఁడిబల్లెంబుల పోఁడిమిం జెన్నారు గేతకీదళంబులును,
దంతపంక్తులలీలం గ్రాలు మల్లికాప్రసవంబులును, విమలాతపత్రమౌక్తికంబుభాతి
డుల్లు శిరీషకుసుమంబులును, జామరంబులకైవడిం బడు రసాలమంజరులును, నాస
లమాడ్కిం దెగి జాఱు చంపకంబులును, మస్తకస్తోమంబుల వడువున నెడతెగక
పుడమిం బడు కపిత్థంబులును, ముండెంబులతెఱంగునం బొరలాడుపనసఫలంబులుం
గల్గి ఘోరరణరంగంబు నధిగమించుచు, వేశవాటియుంబోలె నపరిమితపల్లవసల్లలి
తంబై, త్రిదివంబునుంబోలె నమితసుమనోవిరాజితంబై, తూణీరంబునుంబోలె

సాంద్రశిలీముఖోపేతంబై, వితరణి నృపసభాభవనంబునుంబోలె ద్విజగణపరివృతం
బై, సరోవరంబునుంబోలెఁ గువలయామోదకరంబు నై యొప్పె నప్పుడు.

116


తే.

రుక్మిణీకన్యమదిని నిరూఢమైన, విరహతాపభరంబున వేఁగి వేఁగి
యోర్వజాలక కృశియించుచుండి యొండు, దెఱఁగు భావింపనేరక దిగులు పూని.

117


ఉ.

పట్టెలఁ జేతు లానుకొని పానుపు మెల్లనె డిగ్గి పాదుకల్
మెట్టక చేలచెంగు దగ మేలుముసుంగిడి కీరశారికల్
చుట్టును రాఁగఁ బోఁ దఱుముచుం జెలికత్తియలన్ మొఱింగి యి
ట్టట్టును నల్దిశల్ గనుచు హా యనుచున్ వలఱేనిఁ దిట్టుచున్.

118


ఉ.

వేనలి జాఱ సూనశరవేదన మీఱ శ్రమాంబుబిందువుల్
మేనను జాలువాఱ మది మిక్కిలి గోరిక లూరఁ గేరి తేం
ట్లాననపద్మగంధమున కర్మిలిఁ జేర మరాళయానయై
కౌనునఁ జేయి పూని తమకంబునఁ బాదయుగంబు దొట్రిలన్.

119


చ.

అనిమిషరాజనీలలలితాలకతాళకపువ్వుదోఁటకుం
జని నునుపోఁకబోదియలచాయల కప్రపుదిన్నెలన్ వినూ
తనలవలీలతావలులతావుల పూఁబొదరిండ్లలోన నిం
పెనయఁగఁ గొంతసేపు మది కేమియుఁ దోఁచక సంచరించుచున్.

120


సీ.

అడుగులఁ గమ్మపుప్పొడి చుఱుక్కున నాట గండుఁగోయిలరొద గుండె లదర
మోముఁదమ్మిని దేఁటిమూఁక జుమ్మున మూఁగఁ గన్నులఁ గపురంబు గప్పుకొనఁగ
నుడుగనిబలుగాడ్పువడల నెమ్మెయి గంద చిలుకపల్కులు బెట్టు చెవుడుపఱుప
మరునితూపులమాడ్కి విరులు పైపై రాల విలసితమోదముల్ వెగటుచూపఁ


తే.

దగిలి యచ్చోట నిలువంగఁ దరముగాక, బెగడి దిగులున వేవేగ మగిడి చెలులఁ
దెగడివచ్చినఫల మిటుల్ సెగడె నంచుఁ, జంచలించుచు నృపతనూజాత యపుడు.

121


తే.

చెలుని చెంగల్వకొలఁకులకెలన వలపు, గులుకుపూఁదేనెసోనలు చిలుకుచున్న
తలిరుజొంపంపులేమావితరులనడుమ, మేలికపురంపుఁదిన్నెపై మేను సేర్చి.

122


ఆ.

ఏమి సేయుదాన నిఁకఁ జలింపక పిక, ప్రతతి గూయఁదొణఁగె రామరామ
మరునిచేతివెతలు హరహర ఘనమయ్యె, శ్వసనుఁ డేఁచదొణఁగెఁ జక్రధరుఁడ.

123


క.

అలికీరశారికాదులు, చెలిమి యొకింతైన మదిని జేర్పక యకటా
చెలఁగి రొదసేయఁదొణఁగెను, బలుమఱు నిపు డంచుఁ దెగడి పలికెన్ దానిన్.

124


క.

చలమా నీ కటు మధుకర, కులమా వలమానకీరకోకిలశారీ
బలమా తలమా మలయా, నిలమా మము నేఁచుటేమి నీకున్ ఫలమా.

125


క.

పదమాననీకధృతిసం, పద మానుపఁ దలఁచి నీదుపద మాపదకా
స్పద మౌనటుపాడెదు ష, ట్పదమా పదమా సువర్ణపదమార్గమునన్.

126

శా.

తాపోద్రేక మొనర్పకున్న నిజవిద్యాభంగమా భృంగమా
కోపాటోపముఁ జూపి యేఁచెదవు నీకున్ వైరమా కీరమా
పాపం బెన్నక సాధుకోటి నలయింపం గోరికా శారికా
కాపట్యం బిఁక మాను మన్యభృతమా కాదంబసంఘాతమా.

127


తే.

అనుచుఁ దనచుట్టుఁ గ్రమ్మి గయ్యాళితనము, లలరఁ జెలరేఁగి కడుహళాహళి యొనర్చు
చెఱకువిలుకానిబలములఁ దఱిమి పలికి, కలికి మదిలోన వగల నాక్రాంత యగుచు.

128


చ.

ఉసు రసు రంచు వేసరిలు నూరుపుగాడ్పుల నించు నూరకే
కసరుకొనున్ దిశల్ వెదకుఁ గన్గవ మూయు విధిం దలంచు సా
రసదళనేత్రు నెన్నఁడు తిరంబుగఁ గాంచెద నంచు నెంచు వె
క్కస మగుమన్మథానలశిఖావిసరంబులఁ గ్రాఁగి లోఁగుచున్.

129


తే.

మఱియు గుఱిలేని విరహార్తిఁ బొరలుచుండి, యంబురుహపత్రనేత్ర డెందంబునందు
సకలసంతాపశాంతిహేతుక మటంచు, హరిపదధ్యానలాలస యగుచుఁ బలికె.

130


ఉ.

గోపవధూకుచప్రచురకుంకుమసంకుమదాదికాధికో
ద్దీపితముల్ నవీనతరదీధితిజాలవిశాలరత్నసం
స్థాపితహేమనూపురవితానఝణంఝణరాగశోభన
ప్రాపకముల్ ముకుందమృదుపాదసరోరుహముల్ దలంచెదన్.

131


చ.

అరుదుగ రాధికాకిసలయాధరఁ గూడి కళిందనందనీ
పరిసరమంజుకుంజగృహభాసురపల్లవతల్పకల్పిత
స్మరసరసక్రియావిహితచాతురిఁ గేరెడువల్లవీమనో
హరునివిలాసవైఖరు లహర్నిశమున్ బ్రణుతింతు వేడుకన్.

132


సీ.

నవమోహనాకారు నతజనమంచారు తరలముక్తాహారు దురితదూరు
సౌవర్ణమయవాసుఁ జంద్రికానిభహాసుఁ గరుణారసోల్లాసు ఘనవిలాసు
ముఖకాంతివిజితేందు మునిమనోజ్ఞమిళిందు సూరిజనానందు సుగుణబృందు
వికచసారసనేత్రు సకలలోకపవిత్రు సతతసజ్జనమిత్రు నుతచరిత్రు


తే.

నరితమోహంసుఁ గేకిపింఛావతంసు, హరిమణిశ్యాము వనమాలికాభిరాము
నసురకులభంగు గోపకన్యాభుజంగు, మహితబృందావననిశాంతు మదిఁ దలంతు.

133


మ.

తళుకుంబంగరుబొంగరా లనుచు నాత్మం బొంగి కెంగేల లేఁ
గులుకుంబ్రాయపుగొల్లగుబ్బెతలచన్గుబ్బల్ బిగంబట్టి కెం
దలిరుంగైదువుజోదుకేళికిఁ బ్రయత్నం బింపుతోఁ జేయుచుం
బలుచందంబులఁ గేరుచెల్వుని మదిన్ భావింతు నత్యంతమున్.

134


క.

కుందనపుటందె లడుగుల, నందంబుగ ఘల్లుఘల్లు రని మ్రోయఁ గడున్
నందయశోదలముందరఁ, జిందులు త్రొక్కెడుమహాత్ముచెలువు నుతింతున్.

135

చ.

తన కెన యైనబాలకులఁ దార్చుక మెల్లనె గొల్లయిండ్లకుం
జని పెనువెన్నముద్దలు మెసంగుచుఁ జొంగుచు జున్ను మీఁగడల్
దినుచు విశుద్ధదుగ్ధపరిదిగ్ధకళేబరుఁ డై వెలుంగువె
న్నుని నవమోహనాకృతి మనోరథసిద్ధి యొనర్చుఁ గావుతన్.

136


ఉ.

వల్లవపల్లవాధర లవారితమోహనిబద్దబుద్ధిఁ ద
న్వల్లభుఁ గాఁగఁ గోరుచు భవానికిఁ బూజ లొసంగి నీటిలోఁ
బెల్లుగఁ జల్లులాడ దరిఁ బెట్టినవల్వలు మ్రుచ్చిలించి సి
గ్గెల్లను గొల్లలాడినరతీశగురున్ మదిఁ బాదుకొల్పెదన్.

137


క.

బుద్దు లెఱుంగక తిరిగెడు, గద్దరి యని తల్లి ఱోలఁ గట్టినఁ గినుకన్
మద్దులఁ దద్దయుఁ గూల్చిన, ముద్దులగోపాలబాలమూర్తిఁ దలంతున్.

138


చ.

పదముల నందియల్ మొరయ బ ల్జిగి బంగరురావిరేక నె
న్నుదుట నటింప మేలిమొలనూలున గంటలు గల్లనంగ నం
గదములు రత్న హారములు కంకణముల్ మణికుండలంబులున్
బొదలఁగ గొల్లగీములను బూని చరించువిభున్ భజించెదన్.

139


తే.

అని తలఁచుచుండె నని సూతుఁ డఖిలమౌను, లకు నెఱింగించినట్టు లాశుకుఁడు భరత
కులవరేణ్యున కెఱిఁగింప నెలమి నలరి, యవలికథయెల్ల వినఁగోరి యడుగుటయును.

140


చ.

దురితలతాలవిత్ర శశితోయజమిత్ర కృశానునేత్ర సుం
దరతరగాత్ర సంతతబుధస్తుతిపాత్ర తుషారభూమిభృ
ద్వరతనయాకళత్ర, నిజదాసజనావనసూత్ర యక్షకి
న్నరనరసిద్ధసాధ్యసురనందితచిత్రచరిత్రవైభవా.

141


పంచచామరము.

హరా ధరామరాదరా మురాసురాహితస్ఫుర
చ్ఛరా పరాత్పరా ధరాత్మజామనోహరా వరా
బరాంబరా కిరాతరూపభాసురా సురాసురా
కరాజిరా మరాళరాజకాంతకాంతవిగ్రహా.

142


మాలినీ.

పురదనుజవిభంగా భూషితోద్యద్భుజంగా
సురుచిరధవళాంగా సూరిచేతోబ్జభృంగా
కరకమలకురంగా కాంతగంగోత్తమాంగా
తరణిశశిరథాంగా దైవవేశ్యాభుజంగా.

143


గద్య.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర కౌండి
న్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్ర బుధజనవిధేయ తిమ్మన
నామధేయప్రణీతం బైన రుక్మిణీపరిణయం బనుశృంగారప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము.