Jump to content

రామేశ్వరమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

గద్య:- ఇది శ్రీమదుమామహేశ్వర కరుణాకటాక్షవీక్షాపాత్ర,
యేనుగ లచ్చయామాత్యపౌత్ర, తిమ్మనామాత్యపుత్త్ర,
వివిధ విద్వజ్జనవిధేయ, లక్ష్మణకవినామధేయప్రణీ
తంబయిన రామేశ్వరమాహాత్మ్యంబను
మహాప్రబంధము నందుఁ
బ్రథమాశ్వాసము.
శ్రీ. శ్రీ. శ్రీ.

శ్రీరస్తు

రామేశ్వరమాహాత్మ్యము

ద్వితీయాశ్వాసము


మత్సమస్తసుజన
ప్రేమాస్పద భద్రిరాజు భీమయసుత మ
ల్లామాత్య నిత్యవైభవ
క్షేమప్రద పార్వతీశ శ్రీమల్లేశా.

1


వ.

అవధరింపుము శౌనకాదిమహర్షులకు సూతుం డిట్లు శ్రీరామేశ్వర
లింగవైభవంబు వచింపందొడంగె.

2

క.

రామస్థాపితలింగం
బేమానవుఁ డేకవార మీక్షించు నతం
డోమునులార శశాంకశి
ఖామణిసాయుజ్య మొందు గతగల్మషుఁ డై.

3


సీ.

మునులారకృతయుగంబున దశవత్సరం
        బులచేత నగునట్టి పుణ్యఫలము
సాధించఁబడు మహాజనులచే నొకవత్స
        రంబునఁ ద్రేతాయుగంబునందుఁ
మాసంబుచేత నమ్మహితపుణ్యము సంభ
        వించు ద్వాపరయుగవేళయందు
నొకవాసరమున నయ్యున్నతసుకృతంబు,
        కలికాలమున శీఘ్రగతి లభించు


గీ.

ప్రతినిమేషంబుఁ దత్పుణ్యఫలము కోటి
గుణిత మగుచు నిరూఢి చేకురును రామ
నాథశివలింగసందర్శనంబు సేయు
వారలకు సంశయము సేయ వలదు వలదు.

4


క.

రామేశ్వరలింగంబున
ధీమన్నుత సకలపుణ్యతీర్థములు సమ
స్తామరపితృదేవముని
స్తోమములు వసించు నెపుడు సువ్రతులారా.

5


గీ.

ఆర్థితో మూఁడువేళల నైన రెండు
వేళలం దైన మఱియొకవేళ నైన
రామలింగంబుఁ దలఁచువారలకు ఘోర
పాపము నశించు నిర్వాణపదము గలుగు.

6


గీ.

రామచంద్రసమర్చితరామలింగ
నామసంస్మరణంబున నరుల కెల్లఁ

బ్రబలమైనట్టియమదూతభయము దొలఁగు
నఖిలతీర్థాభిషేకపుణ్యము లభించు.

7


క.

శీరామేశ్వరలింగస
మారాధన మాచరించుమనుజులు మనుజుల్
గారు మహేశ్వరమూర్తులు
వారక మది సంశయంబు వల దియ్యెడలన్.

8


గీ.

హాళితోఁ దాను రామలింగార్చనంబు
సేయఁ డెవ్వఁడు దురార్గశీలుఁ డగుచు
వాఁడు పెక్కేండ్లు దరిలేని వనటఁ జెందు
ఘోరగంభీరసంసారకూపమునను.

9


ఉ.

పూనిక రామచంద్రపరిపూజితు నవ్యయు రామనాధు నీ
శానునిఁ జూచు నెవ్వఁ డొకసారె తపోనిధులార వానికిన్
దానతపోధ్వరవ్రతవిధానము లేటికి నన్యదేవతా
ధ్యానము లేటికిన్ వివిధధర్మము లేటికి కర్మ మేటికిన్.

10


చ.

శ్రుతిమయు రామనాథుఁ దనచూడ్కుల కింపుగ జూడఁ డేనరుం
డతఁడు జడుండు మూఢుఁ డత డంధుఁ డతండు కరాంఘ్రివర్జితుం
డతఁడు దరిద్రుఁ డాతఁ డురుజార్తుఁ డతండు ఖలుం డతండు త
త్సుతధనధాన్యమందిరపశుప్రకరంబు నశించు నెంతయున్.

11


ఉ.

మానుగ దుర్లభం బయిన మానుషజన్మముఁ బూని భూమిలో
మానవు లెవ్వరేని ఫణిమండనమండితు రామనాథుఁ బం
చానను గాంచి మ్రొక్కి వినయంబునఁ బూజ లొనర్తు రాజనుల్
మౌనివరేణ్యులార నుతి మత్ప్రవరుల్ కృతకృత్యు లిద్ధరన్.

12


గీ.

రామనాథునిఁ ద్రిభువనస్వామిఁ దలఁచు
వారలకుఁ బూజనము సేయువారలకును
బద్మలోచనపద్మసంభవపురంద
రాదిసురపూజనంబు నిరర్థకంబు.

13

గీ.

అవని రామేశశివభక్తు లైననరుల
యందు నెవ్వారులకు భక్తి యమరియుండు
వారు చూడరు భేద మేవంక నైనఁ
జనరు దారుణసమవర్తిసదనమునకు.

14


గీ.

విప్రహత్యాసహస్రంబు విలయ మొందు
మద్యపానాయుతంబులు మడసిపోవుఁ
కాంచనస్తేయగురుతల్పగమనదోష
లక్షలు నశించు రామేశువీక్షణమున.

15


మత్తకోకిల.

భూరిసంతతభోగలాభముఁ బూజ్యనిర్జరరాజ్యమున్
గోరుధీరులు చంద్రశేఖరు గూఢపాద్గుణకార్ముకున్
హీరవర్ణుని రామనాథమహేశ్వరున్ జగదీశు నోం
కారమూర్తి నమస్కరింతురు గాఢనిశ్చలచిత్తు లై.

16


సీ.

ఉభయలోకముల నత్యూర్జితానందంబు
        సతతరామేశ్వరస్మృతినిఁ గల్గు
గోటిజన్మార్జితఘోరపాతకనివ
        ర్తన మగురామేశుదర్శనమున
నఖిలమానవవాంఛితార్థసంసిద్ధులు
        గృప సేయు రామేశకీర్తనంబు
శాశ్వతం బగురుద్రసాయుజ్యవిభవంబుఁ
        పొందించు రామేశుపూజనంబు


గీ.

దావవహ్ని విజృంభించి దారుతతులఁ
గాల్చి పొడి సేయుకైవడి ఘనతరోగ్ర
కలుషవిసర మశేషంబుఁ గడఁగి ద్రుంచు
సిద్ధరామేశశివలింగసేవనంబు.

17

సీ.

మునులార వివరింతు వినుఁ డష్టవిధములఁ
        జెన్నొందు రామేశశివునిభక్తి
తద్భక్తులందు వాత్సల్యంబు గలుగుట
        పూజావిధాన ముప్పొంగి కనుట
తాఁ బూజ సేయుట తత్పూజనార్థంబు
        దేహ మెచ్చట నైనఁ ద్రిప్పికొనుట
కరమరిఁ దత్పుణ్యకథ లాలకించుట
        స్వరదృగంగవికారశాలి యగుట


గీ.

యెలమి నెప్పుడు రామేశుఁ గొలిచి మనుటఁ
విత్తము తదర్పితంబు గావించి మనుట
యిట్టిశివభక్తి గలుగువాఁ డెవ్వఁడైన
బ్రహ్మసాయుజ్యపదవికిఁ బాత్ర మఁతడు.

18


శా.

వేదాంతశ్రవణైకసంభవమహావిజ్ఞానలక్ష్మీయుతుల్
ఖేదామోదవివర్జితుల్ యతులు ము క్తిం బొందుచందంబునన్
వేదాత్ము న్శివు రామనాథు నభవు న్వీక్షించుధన్యుల్ జను
ఖేదాపాయకరాపవర్గమును భక్తిం గాంతు రెప్పట్టునన్.

19


శా.

వైరాగ్యంబు యతిత్వమున్ శ్రుతిశిరోవాక్యార్థవిజ్ఞానముం
గోరంగాఁ బని లేదు మానవుల కక్షోభంబుగా నేరికిన్
శ్రీరామేశ్వరలింగదర్శనమునన్ సిద్దించు మోక్షంబు ద
త్కారుణ్యాతిశయంబ సాధన మగుం గైవల్యసంప్రాప్తికిన్.

20


గీ.

క్రిమికులంబు శకుంతముల్ కీటములును
జనులు బ్బందారకులు తపోధనులు మునులు
పుణ్యరామేశ్వరక్షేత్రభూమియందు
సములు రామేశ్వరునిసుప్రసాదకలన.

21


గీ.

పుణ్యుఁడ నటంచు గర్వంబు బూనవలదు
పాతకి నటంచు మనమున భయము వలదు

సొంపు దీపింప రామేశుఁ జూచిరేని
యెల్లజనులును సములని యెఱిఁగికొనుఁడు.

22


గీ.

కన్ను లారంగ రామేశు గరళకంఠుఁ
గాంచు నెవ్వాఁడు సద్భక్తికలితుఁ డగుచుఁ
జర్చ చేసిన నతనికి సాటి గాడు
విప్రకులవర్యుఁ డగుచతుర్వేదియైన.

23


ఉత్సాహము.

హాళి మెరయ రామనాథునందు భక్తి గలుగుచం
డాలునకును దానముం గడంక తోడ నీ దగున్
మేలు గాదు భక్తి లేని నిఖిలవేదశాస్త్రవి
న్మౌళి కిడినఫలము లేశమాత్ర మైనఁ గల్గునే.

24


గీ.

నెమ్మి రామేశ్వరక్షేత్రనిలయు లైన
వారు శశిశేఖరులు పంచవదను లురగ
భూషణులు పాలనేత్రులు భూతికలిత
దేహులు మహేశు లగుదురు ధీరులార.

25


క.

కడువేడ్క డెందముల సం
దడి గొన శ్రీమంతు రామ నా జూడన్
బడిబడి నేగెడుసుజనుల
కడుగడుగున నశ్వమేధయాగఫల మగున్.

26


గీ.

రామసేతువునకుఁ జని రామనాథ
శంకరునకుఁ బ్రియంబుగ సద్విజునకు
గ్రామ మొకటిని నొసఁగిన భూమిపతికి
నఖిలభూచక్రదానపుణ్యము లభించుఁ.

27


క.

దళమును కుసుమము ఫలమును
జలమును శ్రీరామనాథశంకరునకు ని
శ్చలభక్తి నొసఁగుజనములఁ
నల రామేశ్వరుఁడు బ్రోచు ననవరతంబున్.

28

క.

కరుణానిధి యగురామే
శ్వరుభజనము పూజనంబు స్తవమును నామ
స్మరణమును మానవులకున్
ధరణిం గడుదుర్లభములు తాపసులారా.

29


గీ.

భక్తితోడ మహాదేవు భవుని రామ
నాథుశరణంబు వేడిననరుల కెల్ల
శాంతమతులార లాభంబు జయము గల్గు
నరయ నిహపరలోకద్వయంబునందు.

30


గీ.

పరమకారుణ్యరసపూరభరితహృదయుఁ
డైనరామేశునందు నెవ్వానిబుద్ధి
పగలు రేయును గదలక దగిలి నిలుచు
ధాత్రిలోపల నాతండు ధన్యతరుఁడు.

31


క.

శ్రీవిశ్రుతరామేశ్వర
సేవావైభవమువలన సిద్ధించనిచే
తోవాంఛితశుభఫలములు
వావిరి బ్రాపించు నితరపరధర్మములన్.

32


ఉ.

పంకజగర్భవంద్యపదపంకజు నాగమవేద్యు గూఢపా|
త్కంకణు రామనాథు శితికంధరు నంధకవైరి నిందురే
ఖాంకురమౌళి నీశ్వరు నొకప్పుడు జూడనిదుర్జనుం డిలన్
సంకరజాతి గాక పితృసంభవుఁడే మది నెంచి చూచినన్.

33


క.

రామేశ్వర రామేశ్వర
రామేశ్వర యనుచు జనులు ప్రత్యూషమునన్
నేమంబుతోఁ బఠించిన
నామేటికిఁ బూర్వదినకృతాఘము వాయున్.

34


క.

నరులార ముజ్జగములకు
దొర భక్తత్రాణదీక్షితుఁడు శ్రీరామే

శ్వరుఁ డుండఁ జెంద నేటికి
నరకాలయఘోరయాతనాసంపాప్తుల్.

35


గీ.

విశ్వలోకకుటుంబి రామేశ్వరుండు
సాంద్రకరుణాపయోధి ప్రసన్నుఁ డైన
వివిధదుర్వారయాతనల్ విలయ మొందు
మంచు తపనోదయమున నశించుకరణి.

36


గీ.

అవని నెవ్వాడు ప్రాణనిర్యాణవేళ
రామనాథుని గిరిసుతారమణుఁ దలఁచు
నతఁడు గ్రమ్మర మాతృగర్భాంతరమున
నధివసింపక శంకరుఁ డై వెలుంగు.

37


గీ.

రామనాథ మహాదేవ రాజమకుట
భర్గ రక్షించు నన్ను గృపానిధాన
యనుచు నెవ్వాఁడు బలుకు నహర్నిశంబుఁ
గలుగ దతనికి నేమియుఁ గలిభయంబు.

38


సీ.

నందివాహన రామనాథ జగన్నాథ
        నీలలోహిత రుద్ర నిర్మలాంగ
శితికంఠ హర సదాశివ మహాదేవ రా
        మేశ శంకర వ్యోమకేశ యభవ
అంతకాంతక త్రిపురాంతక రామేశ
        శర్వ మహేశ పశ్యల్లలాట
కాలకూటాశన గౌరీమనోహర
        భర్గ రామేశ్వర భవ గిరీశ


గీ.

యనుచు సంతత మనురాగమున వచించు
నరుఁడు మాయకుఁ జిక్కక దురితములకు
బట్టుపడఁబోక కామునిబారిఁ బడక
క్రోధహితుఁడును గాక చేకొను సుఖంబు.

39

సీ.

రామనాథునిమందిరము దారువులఁ జేయు
        మనుజుండు సురలోకమునఁ ద్రికోటి
కులయుతుఁ డై నిల్చు కుదురుగా నిటుకఁ గ
        ట్టినవాఁడు వైకుంఠమున వసించు
శిలలచేఁ గట్టించు నలఘుపుణ్యుఁడు బ్రహ్మ
        పట్టణంబున నెప్డు బాయకుండు
స్ఫటికాదిబహువిధోపలముల రామేశు
        భవనంబు నిర్మించుపావనుండు


గీ.

భానుమండలతులితవిమాన మెక్కి
సురవధూకరచారుచామరమనోజ
మారుతాంకూరసంవీజ్యమానుఁ డగుచు
హరునిలోకంబునకుఁ జను సురలు వొగడ.

40


గీ.

ధీరుఁ డెవ్వఁడు రామేశుదేవళంబు
వెండిపలకల రచియించు వేడ్క మీఱఁ
భవ్యశంకరసారూప్యపదవిఁ గాంచు
నతఁడు శివుమాడ్కి నానంద మనుభవించుఁ.

41


గీ.

మట్టు మీఱంగ రామేశుమందిరంబుఁ
గలిమి గలవాఁడు గట్టించుఁ గాంచనమున
పూని మట్టినిఁ గట్టించు లేనివాఁడు
తెలియ నిరువాగునకుఁ బుణ్యఫలము సమము.

42


గీ.

శక్తికొలఁదిని వివిధోపచారములును
పూని రామేశ్వరునిఁ గొల్వఁ డేనరుండు
భుక్తికిని ముక్తికిని రాజ్యమునకు నతఁడు
భాజనము గాఁడు పరమనిర్భాగ్యుఁ డతఁడు.

43


వ.

మఱియు భక్తితాత్పర్యంబుల రామనాథీశ్వరుం బూజించువాఁడు
భుక్తిముక్తిరాజ్యభాజనం బగు రామనాథార్చనసమంబునుం దద
ధికంబును నగుపుణ్యంబు లేదు. రామనాథేశ్వరలింగద్వేషి యగు

మూఢుండుబ్రహ్మహత్యాయుతంబు గాంచిన పాతకంబుఁ జెందు.
తత్సంభాషణమాత్రంబున నరుండు నరకంబునం బడు. వేదంబులు
యజ్ఞంబులు, ధర్మంబులు, రామనాథపరంబు లై వర్తించు. తదన్యం
బగుపదార్ధం బెద్దియుం గలుగనేరదు కావున సర్వంబు విడనాడి రా
మనాథేశ్వరు నీశ్వరు నాశ్రయించునది. అమ్మహాదేవుశరణుఁ జెంది
నజనుండు నరకంబుఁ గనుంగొనక శివలోకంబునకుం జను. సకల
యజ్ఞతపోదానతీర్థస్నానంబుల వలనం గలుగుఫలంబు కోటిగుణి
తం బై రామేశ్వరుసేవావైభవంబునం గలుగు.

44


సీ.

నాగభూషణు రామనాథేశ్వరుని రెండు
        గడియలు చింతించుఘనుఁడు వేడ్క
నేకవింశతికులోపేతుఁ డై శివలోక
        మున కేగి సంతోషమున వసించు
బత్తి మీఱఁగ నొక్కపగలు చూచినవాఁడు
        పాపవిముక్తుఁ డై ఫలము నొందు
కడఁక వేకువ లేచి గౌరీశు రామేశుఁ
        దలఁచుఁనరుండు ప్రత్యక్షశివుఁడు


గీ.

రామనాధునిఁబొడ గాంచు నేమహాత్ముఁ
డతనిఁ జూచినయంతన యఖిలజంతు
సంతతికి రౌరవాదిదురంతనరక
యాతనాహితదురితసంఘాత మడఁగు.

45


క.

మధ్యాహ్నవేళ మునిహృద
యధ్యేయుని రామనాథు నభవుని జగదా
రాధ్యునిఁ గనుఁగొనుజనుల క
సాధ్యసురాపానదోషశయనాశ మగున్.

46


మాలిని.

నతిజనహితు గౌరీనాథు శ్రీరామనాధున్
జితమదను గృపారాశిం బ్రదోషంబునందున్

శ్రుతివినుతచరిత్రుం జూచు సద్భక్తి నెవ్వం
డతనికి గురుతల్పావాప్తిదోషం బడంగున్.

47


క.

సాయంకాలంబున శుభ
దాయకు రామేశు బహువిధంబుల స్తవముల్
సేయునరు౦డు సువర్ణ
స్తేయసహస్రంబు వడఁగు దేవునికరుణన్.

48


గీ.

మౌనులార ధనుష్కోటిమజ్జనమునఁ
దారకం బగురామేశుదర్శనమున
శివునియర్ధాసనమున వశించునరుఁడు
ముదితుఁ డై శివసాయుజ్యపదము గాంచు.

49


వ.

రామేశ్వమహాదేవుని మజ్జనశాలాంగణంబునఁ ద్రిసంధ్యంబును నృ
త్యగీతఘంటాకాహళభేరీమృదంగశంఖవేణువీణాపటహపణవ
గోముఖమడ్డుడిండిమఝర్ఝరాదిమహావాద్యఘోషంబుల మహో
త్సవంబు గావించువాఁడు మహాపాతకవిముక్తుం డై రుద్రలోకంబు
న సుఖం బుండు. రామేశ్వరునభిషేకసమయంబున రుద్రాధ్యా
యంబును, చమకంబును, బురుషసూక్తంబును, ద్రిసుపర్ణంబును,
బంచశాంతులునుం, బావమానసూక్తంబులును జపించువారును,
పంచగవ్యంబుల నభిషేకంబు సేయువారును నరకంబుఁ జూడ రిది
సత్యంబు.

50


చ.

కృప గలరామనాథునకుఁ గేవలభక్తి దలిర్ప గోఘృత
స్నపనము సేయువాఁడు బహుజన్మశతార్జితపాపముక్తుఁ డై
విపులసుఖంబుఁ జెందుఁ గడువేడుకఁ బాల నొనర్చువాఁడు శీ
లపరత నేకవింశతికులంబులతో హరుఁ జేరు నొప్పుగన్.

51


సీ.

దధిని రామేశ్వరుఁ దడుపుమానవునకుఁ
        గమనీయవిష్ణులోకంబు గలుగు
మధువున నభిషేకవిధి యొనర్చినవాఁడు
        నలినగర్భునిపట్టణమున నిలుచు

మొనసి తైలాభ్యంగ మొనరించుఘనునకు
        షణ్ముఖలోకవాసంబు దొరకు
రామేశ్వరుని నిక్షురసపూరమున ముంచు,
        నతఁడు చందురునింట నమరి మెలఁగు


గీ.

రామనాథునిఁ ద్రిభువనస్వామి నభవుఁ
బాకవిదళితపరిమళభరితచూత
ఫలరసాసాలకలన జొబ్బిలఁగఁ జేయు
పుణ్యశీలుండు పితృలోకమున వసించు.

52


శా.

సంతోషంబున నారికేళసలిలస్నానోపచారంబు మా
కాంతాభర్తకు రామనాథునకుఁ జక్కంజేయుమర్త్యుండు దు
ర్దాంతబ్రహ్మవధాదిభూరికలుషవ్రాతంబుల న్నిర్మల
స్వాంతుం డై పరిమార్చు భోగపరుఁ డై వర్తించు నెప్పట్టునన్.

53


క.

లలితపచేళిమరంభా
ఫలరసముల రామనాథభవలింగము జొ
బ్బిలఁజేయుభాగ్యవంతుఁడుఁ
పొలుపుగ పామీకలోకమున వసియించున్.

54


ఆ.

వస్త్రపూతవిమలవారిని రామనా
థాభిషేకకృత్య మాచరించి
నరుఁడు వరుణలోకపరమసౌఖ్యము నొందు
వానివంటివాఁడు వసుధఁ గలఁడె.

55


గీ.

ఎలమి నెవ్వాఁడు రామనాథేశ్వరునకుఁ
జందనోదకధారల జలక మార్చు
నతఁడు గాంధర్వలోకవిఖ్యాతమత్త
కాశినీదివ్యసంభోగకలనఁ గాంచు.

56


సీ.

పుష్పవాసితతోయముల రామనాథున
        కభిషేక మొనరించి యమరనాథు

నర్ధాసనం బెక్కి యతిసౌఖ్యమున నుండు
        పాటలపున్నాగపంకజాత
కువలయకల్హారకుసుమవాసితవారి
        ధారావగాహనోత్సవముఁ జేసి
కలుషవిముక్తుఁ డై కనుపట్టుమానవుం
        డితరవిచిత్రవిశ్రుతసుగంధి


గీ.

సుమచయామోదసమ్మిళత్సురభిసలిల
పూరమున రామనాథు నాప్లుతునిఁ జేసి
సకలభువనమహోన్నతశంభులోక
శాశ్వతసుఖాంబునిధి గేళి సలుపుచుండు.

57


క.

ఏలాలామజ్జకహిమ
వాలుకలం బరిమళించువారిని స్నానం
బోలిన్ రామేశ్వరునకుఁ
లోలతఁ గావించ వహ్నిలోకము గలుగున్.

58


చ.

చెలు వగురామనాథు నభిషేక మొనర్చుటకై మనోజ్ఞమృ
త్కలశము లిచ్చునట్టిశుభకరుడుఁ గాంచుఁ జిరాయురున్నతుల్
విలసితతామ్రకుంభములు వేడ్క నొసంగినవాఁడు నిర్జరాం
జలిపుటలాలితోన్నతవిశాలపదంబున నుండు నప్పుడున్.

59


గీ.

చేరి రామేశ్వరునియభిషేకవిధికి
దివ్యతీర్థజలంబులు దెచ్చుకొఱకు
వెండికుండలు నెమ్మది నిండువేడ్క
నిడెడువాఁడు వసించు వాణీశుపురిని.

60


క.

బంగారుబిందె లిడి యు
ప్పొంగుచు ముక్కంటివీటఁ బొలుచును రతనం
పుంగడవలు గడువేడ్క నొ
సంగిన నెలదారిచెంత జక్కఁగ నిలుచున్.

61

గీ.

పొసగ రామేశునభిషేకమునకు భక్తి
బొదలఁ బా లిచ్చుపెనుసాధుమొదవు నిడిన
భాగ్యశాలికి హయమేధఫలము దొరకు
నభవుసారూప్య మమరదే హాత్యయమున.

62


క.

సేతువున ధనుష్కోటి
ప్రీతిని రామేశు నీశుఁ బేర్కొని పురుషుం
డేతోయమున మునింగిన
సేతునిమజ్జనఫలంబు శివకృపఁ గలుఁగున్.

63


వ.

మఱియు రామనాథలింగంబు సుధాలిప్తంబు గావించినవానిపు
ణ్యఫలంబు వక్కాణింప శతసంవత్సరంబులకైన సమర్ధుడఁ గాను.
రామేశుమందిరంబు శిథిలం బగునేని వెండియు నూతనంబుగా నమర్చి
నపురుషునకుఁ బూర్వకర్తకన్న శతగుణం బగుమహాపుణ్యంబుఁ జెం
దు పదివేలబ్రహ్మహత్యలు నశించు నాస్వామియగ్రభాగంబున
దీపంబు లిడినజను లవిద్యాపటలంబు భేదించి పరబ్రహ్మసాయు
జ్యంబుఁ జెందుదురు. ఘృతతైలముద్గతండులగుడశర్కరాదిపదా
ర్థంబులు సమర్పించువారు దేవేంద్రస్థానంబున వసింతురు. రామే
శ్వరమహాదేవలింగంబు దర్శించినఁ బూజించిన స్మరించిన స్పృ
శించిన నెల్లవారికి సకలపాపంబులును దొలంగు.

64


గీ.

కంచుగంటయు నద్దంబు కాన్క గాఁగ
నెలమిలో రామనాథున కిడినప్రోడ
భాసురవిమానశతభోగపరత నొంది
శ్రీమహాదేవుపురిని వసించుఁ దడవు.

65


సీ.

డమరుకడిండిమఢక్కకాదుందుభి
        పణవగోముఖశంకపటహలటహ
వంశకాంస్యాదికవాదిత్రములు నవ్య
        వాద్యవిశేషము ల్వలను మీఱ

సమకూర్చి రామేశ శంకరు సేవించు
        ఘనులు మహాభోగకలితు లగుచు
వాద్యఘోషాన్వితవరవిమానము లెక్కి
        శివునిలోకమునకుఁ జేరి తడవు


గీ.

నిలుతు రెవ్వాఁడు ప్రేమచే నిఖిలభర్త
రామనాథేశు నద్రిజారమణుగురిచి
కొంచెమేని యొసంగు నాగుణపయోధి
కమితఫల మగు నది సంశయంబు వలదు.

66


క.

రామేశక్షేత్రంబున
రామేశునిచెంగట న్నిరంతరము మహా
ప్రేమమున నుండుజనుని క
నామయమోక్షంబు కరతలామలక మగున్.

67


చ.

సిరులును జవ్వనంబు మఱి జీవనముల్ సుతదారవర్గమున్
వెరవరి యేగు క్షేత్రపశువిత్తగృహాదులు రాజతస్కరా
ద్యురుతరబాధచే వణఁగు నూర్జిత మెద్దియుఁ గాదు గానఁ ద
త్పరిచితమాని మానవుఁడు భవ్యవిరాగముఁ బూని ధీరుఁ డై.

68


క.

కరుణానిధి యగురామే
శ్వరు బిరబిర నేగి కాంచి శర ణొందవలెన్
వరదుం డగునద్దేవుని
స్మరణంబును గీర్తనంబు సలుపఁగవలయున్.

69


క.

ఆపన్నార్తిని వృత్తి
వ్యాపారధురీణు దీనవత్సలు నగరా
ట్ఛాపుని రామేశ్వరుఁ గరు।
ణాపరుఁ గొల్చినను గర్భనరకము దప్పున్.

70


క.

రామేశ్వరదేవునకున్
గ్రామము లిడువాఁడు పుణ్యగౌరవకలితుం

డై మేలుఁ జెంది తుది హిమ
ధామకళాధారి యై ముదంబున నుండున్.

7


క.

పాత్రములలోన నుత్తమ
పాత్రము రామేశ్వరుండు పరమార్థము త
త్పాత్రసమర్పిత మగు నణు
మాత్రమును విశేషఫలసమగ్రతఁ జేయున్.

72


గీ.

నందివాహను గౌరీసనాథు రామ
నాథుఁ బొడఁ గనునంతకు నరునివెంట
నంటి తిరుగును విప్రహత్యాదు లయిన
కలుషపుంజంబు లంతట విలయ మొందు.

73


చ.

గొడుగులు తాళవృంతములు కుంచియలున్ సితచామరంబులుం
బడగలు తామ్రకాంస్యమయపాత్రచయంబును వెండిగిన్నెలుం
గడుబెడ గైనచిత్రమణికాంచనకుంభములు న్సుభక్తిచే
నిడియెడివాఁ డఖండితమహీతల మేలు భవాంతరంబునన్.

74


వ.

మఱియు రామేశ్వరస్వామికి వివిధసురభికుసుమమాలంబులు గ
ల్పించినపుణ్యహృదయులకు హయమేధయజ్ఞఫలంబు గలుగు చం
దనాగరుకుంకుమకర్పూరకస్తూరిగుగ్గులుదేవదారుద్రవ్యంబు
లును, పునుగుచాదుజవ్వాదిపన్నీరు మొదలయిన సుగంధంబులు
ను, నానావిచిత్రదుకూలవస్త్రంబులును, కిరీటకుండలకేయూర
హారకంకణాదిమణిభూషణంబులును సమర్పించువారు ధనా
ఢ్యులును, వేదపారగులు నై జన్మింతు రమ్మహాదేవుని కణుమాత్రంబు
ను నిచ్చువాఁడును చక్రవర్తి యై పుట్టు నద్దేవునిపూజానమస్కార
స్మరణశ్రవణదర్శనంబుల దుర్లభం బనునది యెద్దియుం గలుగదు.
గంగాతోయంబులు దెచ్చి యభిషేకంబుఁ జేసిన భాగ్యవంతుఁడు
సాంబశివునిచేతం బూజ వడయు నమ్మహాలింగమూర్తిని సేవించం
బోఫువానిం గనుంగొని తత్పాపంబులన్నియు భయంబునం బరుగు

లిడుం గావున నింద్రియంబులు వికలంబులు గానిముంద, ముదిమి రా
నిముంద, మతి చలింపనిముంద, ముముక్షు లగువారు వందనార్చన
ధ్యానస్మరణకీర్తనస్తుతిశ్రవణదర్శనంబు లాచరించి రామేశ్వరు
నారాధింపవలయు తత్పూజాసమానం బయినధర్మంబు సకలపు
రాణధర్మశాస్త్రంబులయందు లేదు. నిత్యంబును భక్తితాత్పర్య
విశ్వాసంబుల నతని సేవించుపుణ్యశీలురు భూలోకంబునం బుత్త్ర
దారధనధాన్యసంపన్ను లై పెద్దకాలంబు సకలశుభంబు లనుభవిం
చి శరీరాంతంబున శివసాయుజ్యముక్తిం బొందుదు రిది రామేశ్వరు
వైభవంబు దీని వినినం జదివిన నెల్లవారికి రామేశ్వరసేవాఫలంబు
ను, ధనుష్కోటితీర్థస్నానపుణ్యంబును సిద్దించునని సూతుండు శౌ
నకాదిమహామునులకు వివరించిన నమ్మహానుభావులు శ్రీరామచం
ద్రుం డెటువలె శివలింగప్రతిష్ఠంబు గావించెఁ దత్ప్రకారంబును,
నమ్మహాలింగమూర్తి మహిమంబును సవిస్తరంబుగా నుపదేశించి మ
మ్ముఁ గృతార్ధులం గావింపుఁడని ప్రార్ధించిన నతం డి ట్లనియె.

75


ఉ.

రాముఁడు లోకరక్షకుఁడు రాక్షసమాయలఁ జిక్కి కానలో
భూమితనూజఁ బాసి రవిపుత్రుఁ గనుంగొని మైత్రి చేసి శా
ఖామృగసేనఁ గూర్చి దశకంఠజయార్థ మొనర్చె విక్రమ
శ్రీ మెరయన్ సముద్రమున సేతువు మోక్షసుఖైకహేతువున్.

76


గీ.

ఇ ట్లగాధపయోధిపై నెలమి గదుర
సేతువు ఘటించి రాముఁ డాసేతుసరణి
పూర్ణిమాతిథి రావణుపురికి నేగె
బహుళకపివీరపరివారసహితుఁ డగుచు.

77


వ.

ఇట్లు లంకకు జని సువేలశైలం బెక్కి నిలిచె ననంతరంబ.

78


చ.

కరుకుదనంబు మీఱఁగ జగజ్జనయిత్రిని ధాత్రిపుత్త్రికం
జెరగొని దెచ్చి పట్టణముచెంతకు రాముఁడు వచ్చినప్పుడు

న్వెరువక సీత నీయక యనీతికిఁ జొచ్చె దశాస్యుఁ డంచు నే
డ్తెరరుషఁ బూనెనో యనఁగఁ దిగ్మకరుండు వహించె రక్తిమన్.

79


సీ.

మహనీయత్రిభువనమధ్యస్థశాఖితా
        పసమస్తకములకుఁ బల్లజడలు
తారకాపథభద్రదంతావళమునకు
        నపనవరక్తరాంకవపటములు
యాధోధిరాజమహారణ్యరేఖకు
        లసమానకోమలకిసలయములు
నిఖిలహరిత్పురంధ్రీలలాటములకు
        సింధూరధాతువిశేషకంబు


గీ.

లగుచుఁ గింశుకముకుళరక్తాబ్జబంధు
జీవకంకేళికుసుమరుచిప్రబంధ
బాంధవము లైనవృద్ధప్రభాకరారు
ణాతపములు దనర్చె నయ్యవసరమున.

80


శా.

ఘోరాపారగభీర మైనజలధిం గోదండముక్తోజ్వల
క్రూరాస్త్రంబుల నింకఁజేసి యిదె కాకుత్స్థుండు లంకేశసం
హారేచ్ఛం జనుదెంచె మీకు నిఁక సౌఖ్యం బంచు లోకాళి కిం
పారం జెప్పఁగ నేగె నాఁ జనియె ఛాయానాథుఁ డస్తాద్రికిన్.

81


గీ.

జరఠదినకరపశ్చిమజలధిపతన
సమయతద్దీప్తిహరణార్థజలవినిర్గ
తౌరదుర్వారకీలంబు లనఁగ నంబ
రమునఁ గనుపట్టె నవసాంధ్యరాగరుచులు.

82


చ.

అగణితవీరవానరబలావృతుఁ డై విజిగీష రాముఁ డొ
ప్పుగఁ జని లంకపై గవిసె భూరిరణం బగుఁ దోడు గావలెం
దగినగతిం దశాస్యునకుఁ దారని యెల్లెడ నున్నరక్కసుల్
బిగువుగఁ గూడి వచ్చి రన భీషణవృత్తినిఁ గ్రమ్మెఁ జీఁకటుల్.

83

సీ.

అస్తోకశోకప్రియావియోగాగ్నిసం
        భూతోగ్రధూమసంఘాత మనఁగ
విరహిసంహరణతత్పరపంచశరనవో
        త్పలశిలీముఖకాంతిపటలి యనఁగ
రమణీయదశదిశారమణీమణీకుచో
        ద్దీపితమృగమదాలేప మనఁగఁ
గమనీయరోదసీకాసారశైవాల,
        మంజులమంజరీపుంజ మనఁగఁ


గీ.

బతిసమాగమకుతుకసంభృతమనోజ్ఞ
యామినీకామినీమఘువాశ్మనిచయ
ఖచితసముచితభూషణరుచిరరుచివి
తాన మన నంధకారంబు దనరెఁ దెసల.

84


గీ.

రాజురాకకు గగనమార్గమున మృగమ
దమునఁ గలయంపి పెట్టి దిగ్రమణు లాణి
ముత్తియఁపుమ్రుగ్గు లిడి రన మొనసి తిమిర
కలితఘనవీథి నక్షత్రగణము లమరె.

85


చ.

అనయము దూరదేశగతుఁ డైననిజేశునిమేలురాకకై
గొనకొని యిష్టదేవతలఁ గొల్వఁగఁ బూని మిళన్మధువ్రతాం
జననిజదృగ్నిమీలనము సల్పి కరంబును ధ్యాననిష్ఠఁ గై
కొనె వలినీకులం బన నిగూఢరుచిన్ ముకుళించె నబ్జముల్.

86


చ.

అమరెడు సాంధ్యరాగకిసలాంచితనిర్జరమార్గశాఖికిం
దిమిరతతుల్పికంబు లన నిండిన ఖండితకాంతి దారకల్
సుమము లనంగ నెంతయును శోభిలెఁ బండినపం డనంగ ను
త్తమనవరాగసంపద సుధాకరబింబము దోఁచె నత్తరిన్.

87


చ.

మొనయుచు నిండి పారెడుదమోయమున న్విదళించి దాటు చూ
పినబలుఁడో యనంగ శశి పెం పెసఁగెన్ దివి వానివల్వ నాఁ

దనరె మనోజ్ఞలాంఛనము తత్తనుకాంతు లనం దగె న్శర
ద్ఘనఘనసారహారగుళికాదరసోదరసాంద్రచంద్రికల్.

88


శా.

కాసారంబులు పెల్లు గాఁ గురిసె నీహారాంశుపాషాణముల్
కాసారంబులఁ గుందెఁ గోకవితతుల్ గన్నీరుమున్నీరుగా
కాసారంబులఁ బాంధబృందము లసంఖ్యాతవ్యధం జెందె రా
కాసారంగధరప్రకారములు వీకం బైపయిం బర్వఁగాన్.

89


క.

పారావారము గర్వ మ
పారముగా విరహితతికి భారముగా నం
భోరుహములకు వికాసము
దూరముగా నలుముకొని విధుప్రభ లమరెన్.

90


సీ.

పస స్థాణుమతి నైనఁ బల్లవింపఁగఁజేయఁ
        జాలుపుష్పాస్త్రుయశం బనంగ
లోకంబు లెటువంటివో కాంతు ననువేడ్క
        వచ్చి త్రిమ్మరుదుగ్ధవార్ధి యనఁగ
వరం కోరులు పిండి-వంట కైయారిం డు,
        శాలితండుల చూర్ణ-పాళియనఁగ ర్
వైరి యి ట్లని క్రోధవహ్ని మారుఁడు గాంచఁ
        గరగి నీ రగువెండిగ ట్టనంగ


గీ.

నిఖిలభువనాంతరస్థితనీలవస్తు
ధవళిమాపాదనప్రౌఢతెరనిరూఢ
పాండురాఖండచంద్రికామండలంబు
పుండరీకభవాండంబు నిండి మెరసె.

91


వ.

అయ్యెడ.

92


ఉ.

పెన్నిధిసన్నిధిం గనిన బీదలభంగిఁ జెలంగి యాడుచుం
బున్నమవెన్నెలల్ చెలులపొత్తునఁ గుత్తుకబంటి గ్రోలుచుం

గ్రొన్ననవిల్తుకేళి నెలకొన్న సుఖాంబుధి నోలలాడుచున్
సన్నుతలీల వేడ్క కొనసాగఁ జరించెఁ జకోరదంపతుల్.

93


వ.

ఇట్టిసాంద్రచంద్రికావికాసనికామభాసురనిశాసమయంబున.

94


ఉ.

పంబినవేడ్కతోడఁ కనుపట్టు హిరణ్మయశృంగతుంగసౌ
ధంబున నున్నరావణునిఁ దప్పక కన్గొని భానుసూనుఁ డు
ర్విం బడఁద్రోచెఁ దన్మణికిరీటము వాఁడును బన్న మంది రో
షంబున నందు నిల్వక వెసం జనియె న్సదనంబులోనికిన్.

95


గీ.

అంత సుగ్రీవుతోఁ గూర్మియనుజుతోడ
సేనతోఁ గూడి రఘువంశశేఖరుండు
కడఁగ నగ్గిరి డిగ్గి లంకాపురంబు
చెంగట ననీకముల విడియంగఁ జేసె.

96


వ.

అంత జతనంబుగ విడిసిన యవ్వానరవీరులం గవిసిన, ఆయుధపాణు
లును, మహాకాయులును, సైనికసమేతులు నగు రావణానుచరులు
పర్వణుండును, పూతనుండును, జృంభుండును, ఖరుండును, క్రో
ధవశుండును, హరియును, ప్రరుజుండును, అరుజుండును, ప్రహ
స్తుండును మఱియుం బెక్కురక్కసు లుక్కు మీఱి యదృశ్యు ల
యి పోరుచున్న విభీషణుం డంతర్ధానవధంబుఁ గావించె. బలవం
తులగు హరియూధవులు దూరపాతు లయి విజృంభించిన రాత్రిం
చరులు నిహతు లయి పుడమిం బడి రవ్వార్త విని సహింపక రావణుండు.

97


క.

కర మలిగి దనుజసేనా
పరివృతుఁ డై బయలు వెడలి పటుదోర్గర్వ
స్ఫురణంబు మెఱయ నతిశిత
శరముల నొప్పించె వృక్షచరులం బెలుచన్.

98


వ.

అంత.

99


చ.

కలువలదాయ ముజ్జగముకన్ను వెలుంగులనిండుప్రోగు చు
క్కలదొర జోడుతమ్మిచెలికాఁడు కడానిపసిండిఛాయకు

న్నెలవగువాఁడు జక్కవలనెచ్చెలి పచ్చగుఱాలజోదు గా
ములయెకిమీడు దోఁచె జగముల్ గడువేడుకఁ జెంద నత్తరిన్.

100


గీ.

వ్యూహరచన ఘటించి రఘూద్వహుండు
బలము నందందఁ దగుభంగిఁ బదిలపరచి
కడఁక నిగుడంగ రావణుఁ గదిసి పోరెఁ
గలహ మపు డయ్యె నారెండుబలములకును.

101


గీ.

మేఘనాదుండు పోరె సౌమిత్రితోడ
రవిసుతుండు విరూపాక్షుఁ గవిసి తాకె
నంగదునితోడ ఖర్పటు డని యొనర్చెఁ
బౌండ్రకుఁడు సేసె నలునితో భండనంబు.

102


క.

పుటశుఁ డనుదనుజవీరుఁడు
పటుశక్తిం దురముఁ జేసెఁ బనసునితో న
చ్చట దనుజభటులకును మ
ర్కటులకు నందఱికి ద్వంద్వకలహం బయ్యెన్.

103


వ.

అయ్యిరుదెరంగులజోడులు మచ్చరంబునం గచ్చుకొని పెచ్చుపెరి
గి విచ్చలవిడి నిట్లు వ్రేట్లాడుచున్నం బోరు ఘోరం బయ్యె ననం
తరంబ.

104


క.

ఘోరపరాక్రము లగుహరి
వీరశిఖామణులు బిట్టు విదళించిన నిం
ద్రారాతిచమూనాథులు
శూరత చెడి తిరిగి లంకఁ జొచ్చిరి భీతిన్.

105


ఉ.

ఈగతి నాజిలోన బల మెల్ల వినాశముఁ జెంద నంతటన్
వేగ దశాననుం డనుప విక్రమధుర్యుఁడు మేఘనాదుఁ డ
భ్యాగతుఁ డై వలీముఖుల నందఱి నొంచె మహావిషోజ్వల
న్నాగశరంబు వేసి నరనాథుల బదులఁ జేసె నీసునన్.

106

క.

చేసిన యాపిమ్మట విన
తాసుతుఁ డచ్చోటి కతిముదం బలరఁగ వేం
చేసెను పాశవిముక్తులఁ
జేసెను రాసుతులఁ గడువిశేషప్రీతిన్.

107


ఉ.

అందు విభీషణుం గని ప్రహస్తుఁడు గొబ్బున డాసి యార్చి వా
సిం దనరారుఘోరగదచేఁ బ్రహరించినఁ గంప మేమియుం
జెందక నిల్చె దద్దనుజసింహము శీతనగంబుమాడ్కి నా
చందముఁ జూచి డెందముల జానుగ నచ్చెరు వొంది రందఱున్.

108


వ.

అంత విభీషణుండు.

109


గీ.

అష్టఘంటమహాశక్తి నడరి పూని
యల ప్రహస్తునిశిరము లక్ష్యముగ నేసె
వాఁడును హృతోత్తమాంగుఁ డై వజ్రపాత
భగ్నభూజమువలెఁ జూడఁ బడియె నపుడు.

110


చ.

అనిమొన నట్లు గూలినప్రహస్తునిఁ గన్గొని ధూమ్రలోచనుం
డనుబలురక్కసుం డతిరయంబునఁ గోతులఁ బారఁద్రోలినం
గినిసి మహీరుహంబున నొగిన్ హనుమంతుఁడు వానిఁ ద్రుంచె నా
జినిహతు వానిఁ జూచి హతశేషులు లంకకు నేగి రత్తఱిన్.

111


వ.

చని వారు సమరవృత్తాంతం బంతయు రావణునితో విన్నవించిన.

112


మ.

అసురాధీశుఁడు కుంభకర్ణు నతినిద్రాసక్తు మేల్కొల్పి శ
త్రుసమూహంబు వధించఁ బంచె నతఁడున్ దోర్గర్వ మేపార యు
ద్ధసముత్సాహము మీఱ వచ్చి కపులం దాకెం గృతాంతాకృతిన్
వెస బ్రహ్మస్త్రమున న్సుమిత్రకొడు కుర్విం గూల్చె నద్దానవున్.

113


గీ.

దూషణునితమ్ము లరిభయచూరమతులు
వజ్రదేహప్రమాదు లన్వారు గాడ్పు
కొడుకుచే నీలుచేఁ ద్రుంచఁబడిరి పఙ్క్తి
వదనుమదిలోనఁ గలుగుదుర్మదము దొలఁగ.

114

సీ.

వజ్రదంష్ట్రుం డనువానిపీచ మడంచెఁ
        బ్లవగోత్తముఁడు మహాబలుఁడు నలుఁడు
బహువిధసమరలంపటు నకంపను బట్టి
        కుముదుండు రణభూమిఁ గూల్చి యార్చె
నతికాయబలమదోద్ధతుఁ డైనత్రిశిరుని
        సౌమిత్రి దురమున సమయఁజేసె
మునుపుగ దేవాంతకుని ద్రుంచి పదపడి
        యినసుతుండు నరాంతకుని వధించెఁ


గీ.

గుంభకర్ణాత్మజుల గాడ్పుకొడుకు దునిమె
ఖరునికొమరుని మకరాక్షుఁ గడఁగి పొదివి
పే రణంగించె గెరలి విభీషణుండు
దురమునకు నంత నింద్రజిత్తుండు వచ్చె.

115


క.

ఆయింద్రజిత్తు దారుణ
సాయకములు వరపి రామసౌమిత్రుల స
ద్గేయచరిత్రుల వీరులఁ
బాయక మోహితులఁ జేసె భండనభూమిన్.

116


ఆ.

వాయుపుత్రునివాతవాజి యై యమ్మేటి
నింగి కెగసి నిలిచి నిశితకనక
పుంఖమాన మైనభూరిశిలీముఖా
సారములను గపులబీర మడఁచె.

117


క.

ద్యోవీథి నున్న యారణ
కోవిదుశరవృష్టి నిగిడెఁ గుముదాంగదసు
గ్రీవనలజాంబవంతుల
తో వానరు లెల్లఁ ద్రెళ్ళి దుర్దశ నొందన్.

118

వ.

ఇత్తెరంగున నింద్రజిత్తుండు తత్తరంబునం గోతిమొనగాని మొత్తం
బులతోడ నయ్యుత్తమవీరుల నత్తరి విపత్తి నొందించి వియత్తలంబు
న నంతర్హితుం డయ్యె నంత.

119


చ.

ఎలమి విభీషణండు మిథిలేశసుతాపతికిం బ్రణామముల్
బలుమరు నాచరించి తగఁ బ్రాంజలి యై పలికె నామహాత్మ జ
క్కులయెకిమీనియానతిని గుహ్యకుఁ డీతఁడు మంత్రపూత మౌ
సలిలము నీదుపజ్జకు వెసం గొనివచ్చినవాఁడు భూవరా.

120


క.

హితవృత్తి మెరయ నంత
ర్హితభూతివలోకనార్థ మిజ్జల మెసఁగెన్
ధృతి నీకు ధనేశ్వరుఁ డా
శ్రితరక్షక నేత్రశుద్ధి సేయుము దీనిన్.

121


వ.

ఇట్లు గావించిన నంతరిక్షంబున నంతర్హితంబు లైనభూతంబులు నీ
కు దృష్టిగోచరంబు లగు ఎవ్వారి కెవ్వారిం గృప సేయుదు నవ్వార
లును గగనంబున నంతర్హితంబు లగుభూతంబులం జూతు రని విభీ
షణుండు విన్నవించిన.

122


శా.

ఆతోయంబుఁ బరిగ్రహించి రఘువంశాధీశుఁ డెంతేనియుం
జేతఃప్రీతిని నేత్రశుద్ధి యొనరించెన్ లక్షణుండున్ సరో
జాతాప్తప్రియపుత్రుఁ డాది యగుకీశశ్రేష్ఠులున్ హాళిమై
సీతావల్లభదత్తమంత్రజలసంస్పృష్టాక్షు లై రందఱున్.

123


క.

రవినందనహనుమజ్జాం
బవదంగదనీలగంధమాదనమైంద
ద్వివిదాదికపులు గాంచిరి
దివి నణఁగిన యింద్రజిత్తు ధీరోదాత్తున్.

124


గీ.

అంతట నభోంతరంబున నణఁగియున్న
యింద్రజిత్తును బొడ గాంచి యదిరి పొదివి

కోప మేపార దుర్వారఘోరబహుళ
కాండములఁ జెందె నట లక్ష్మణుండు వాని.

125


క.

మును జక్రికి ప్రహ్లాదున
కునువోలె మహావిచిత్రఘోరతరాయో
ధన మయ్యె సుమిత్రానం
దనునకు నమ్మేఘనాదునకు నచ్చోటన్.

126


ఉ.

అంత నిసర్గదుర్గమభుజార్గళదక్షుఁడు లక్షణుండు క
ల్పాంతకృతాంతభీషణదురంతమహోగ్రతఁ బేర్చి ఖేచరుల్
సంతసిలం దృతీయదివసంబున సంగరభూమిఁ గూల్చె దు
ర్దాంతపరాక్రమక్రమవిధానవినోదుని మేఘనాదునిన్.

127


వ.

అంత ఖరాంతకుండు మూలబలంబులం బొలియించె నిట్లు లక్ష్మ
ణునిచేత నింద్రజిత్తు బొలియుట హతేశేషదోషాచరులవలన విని
రావణుండు కోపంబుతోడఁ బుడమికన్నియం ద్రుంచ నుద్యో
గించి పెద్దలచే నివారించంబడి మగుడి నిబిడసమరసన్నాహసా
హససముత్సాహదోహులుం డై వెడలి మణిగణప్రచురవైజయం
తికావిరాజమానంబును, తప్తచామీకరమాలికాజాలకావృతం
బును, తరుణారుణప్రభారమణీయంబును, సకలశాస్త్రశోభితం
బును, మహాజవబహుతురంగసమేతంబురు, రత్నకింకిణీనాద
మేదురంబును, మహోదారిసారథికంబును నగు నొక్కదివ్య
రథం బెక్కి సముద్దండకాంచనకోదండధరుం డై ప్రచండమండ
లాగ్రముసలముద్గరపరశుపట్టిసపరిఘగదాశూలభిండివాల
ప్రాసశరశరాసనచక్రాదిప్రహరణప్రాణులును, శతాంగమా
తంగతురంగసింహశార్దూలశరభవరాహాదిమృగవాహనా
రూఢులును, ప్రళయసమయసమారంభసంరంభసముజ్జృంభణ
శుంభదంభోధరగంభీరనిర్దోషప్రతిభటచటులవికటాట్టహాస
భాసురకఠోరకంఠహుంకారులును నగు నసంఖ్యాతయాతు

ధానసైనికులు బలిసి పరివేష్టించి కొలువ, హేషాగంధసింధుర
బృంహితదనుజవీరభటసింహనాదంబులు భేరీమృదంగశంఖ
కాహళప్రణవగోముఖాదిమహావాద్యధ్వానంబులతోడ నేకీ
భూతంబు లై భూనభోంతరంబులు నిండింప నఖండితత్వరాహం
కారపరాభూతమాతరిశ్వమహాశ్వనికరఖురపుటనిర్దళితధరా
పరాగపటలంబు లంబుజాప్తబింబకబళనం బొనర్ప, సూతమాగధ
వందిసందోహసముచ్చార్యమాణజయజయశబ్దంబులు చెలంగ
నభంగురసంగరోత్కంఠుం డై దశకంఠుండు పురంబు నిర్గమించి
నడచె నయ్యెడం గడుదుర్నిమిత్తంబులు వొడమె నవి సరకు
గొనక కఱకుదనంబున నురువణించి చని రణవేదికాప్రజ్జ్వలన్మ
హాజ్వలనంబువోలె నున్న యన్నరేంద్రసార్వభౌమునిం జూచి
కదియనడిచె నయ్యవసరంబున.

128


చ.

సురమునిసిద్ధసాధ్యబలసూచనలోకనివాసమేదినీ
శ్వరవృషభుల్ ప్రభాతరవిసన్నిభహేమవిమానకాంతి వి
స్ఫురణమునన్ దిశ ల్వెలుఁగ భోరన వచ్చి నభంబునందు ని
ల్చిరి దశకంఠుతోడ నని సేయ నజేయుని రాముఁ జూడఁగన్.

129


ఉ.

ఆతరి మాతరిశ్వహృదయాతిగవేగహరిత్తురంగమో
పేత మరాతిభీమము హిమేతరభానువిభాప్రభావవి
ఖ్యాతము నౌరథంబు కడకన్ బలశాసనుశాసనంబునన్
మాతలి దెచ్చె మెచ్చుగ క్షమాతలనాథకులేంద్రుచెంతకున్.

130


ఉ.

భూతలభర్త యెక్కి పరిభూతసమీరతరస్తురంగ ము
ద్యోతరథాంగమున్ మణిశిలోచ్చయభాసురశృంగతుంగమున్
కేతుపటానిలోద్భవదకించననాకధునీతరంగ మ
బ్జాతహితోపమానరుచిసంగము నిర్జరరాట్ఛతాంగమున్.

131

వ.

అట్లుపురందరస్యందనారూఢుం డై దశరథనందనుండు దశముఖు
న కభిముఖుం డై నడచె న ట్లెదురుకొని యద్దనుజేంద్రమనుజేంద్రులి
ర్దఱుం బరస్పరవిజయాభిలాషంబుల నశేషదివ్యాస్త్రశస్త్రంబుల
నతినిచిత్రప్రకారంబునం బోరి రంత యుగాంతభీషణుండు యు
గాంతకుపితకృతాంతభీషణుండును నిదాఘసమయమధ్యాహ్న
మార్తాండదుర్నిరీక్ష్యుండును త్రిపురసంహారణప్రచండఖండ
పరశుమహారౌద్రుండును నై రామభద్రుండు గిరిభేదనంబు సరి
చ్చోషకంబు నరణ్యదాహకంబు నశనిజనకంబు గ్రహభుజనంబు
జ్యోతిర్మయంబు, మహానిష్ఠురంబున ప్రతిహతంబు దూరపాతి
యు, దుర్విభావ్యంబు, శత్రుసూదనంబు, బలకరంబు, జయదా
యకంబు, సర్వాస్త్రరాజంబు, నత్యుత్తమసాధనంబు, సమంత్ర
కంబునగు, బ్రహ్మస్త్రసాయకంబు రావణవధార్థంబు చాపంబున
సంధించిన.

132


మ.

క్షితి గంపించె సముద్రము ల్గలఁగె మ్రొగ్గెన్ దిగ్గజశ్రేణి బ
ర్వతసంఘంబు వడంకె మిన్ను మొరసెన్ రాలెన్ మహోల్కాతతుల్
గతి దప్పెన్ గ్రహపఙ్క్తి కింబడియెను గ్రస్ఫీతనిర్ఘాతముల్
దితిజవ్రాతము నేలఁ గూలెఁ గవసెన్ దిగ్ధూమము ల్పెల్లుగన్.

133


వ.

ఇ ట్లతిరౌద్రరసాదిర్భావదుర్భరంబుగా బ్రహ్మాస్త్రంబు వింట సం
ధించి వారాశి బంధించిన యాధనుర్ధరాగ్రేసరుండు రావణాసురు
ని శిరం బవలీల ద్రుంచి విజయలక్ష్మీసమేతుం డై తేజరిల్లె నంత ది
క్కులు వికాసంబు నొందె సురభిశీతలమందపవనంబు లొలసె నా
దిత్యాదిగ్రహంబులు ప్రకాశించె. లోకంబులు నిర్భీకంబు లయ్యె.
పురందరాదిబృందారకు లమందానందంబు డెందంబులం గ్రందుకొ
న దేవదుందుభిధ్వానపూర్వకంబుగాఁ బుష్పవర్షంబు గురిసిరి గంధర్వ
గానంబు చెలంగె రంభాదిసురాంగనాలాస్యప్రసంగంబు రాణించె సి
ద్ధమునిచారణవిరచితాశీర్వదనాదంబులు భోర కలంగె. ఈప్రకారం

బున రావణసంహారంబు గావించి విభీషణునకు లంకారాజ్యపట్టాభిషే
కంబు సేయించి సురగరుడగంధర్వకిన్నరసిద్ధసాధ్యవిద్యాధరత
పోధరసమన్వితుండును సుగ్రీవాదివానరవీరసైనికపరివృతుండు
ను సీతాలక్ష్మణసహితుండును నై పుష్పకం బెక్కి యక్కౌసల్యాసూ
నుండు సకలజగజ్జేగీయమానపుణ్యశ్లోకదురంధరుం డై గంధమాద
నపర్వతంబునకుం జని యందు.

134


క.

సురమునిసన్నిధి రాముఁడు
తిరముగ శోధించినపుడు త్రిజగన్మాతం
గరుణోపేతం గోమల
చరణసరోజాతనవనజాతన్ సీతన్.

135


శా.

సీతాలక్ష్మణసంయుతున్ వికచరాజీవాక్షుభాశ్వత్తనూ
జాతాదిప్లవగాన్వితున్ దివిదివంసత్పూజితుం దాపసో
పేతున్ రాముని రావణాంతకు గుణాబ్ధిన్ దండకారణ్యవి।
ఖ్యాతావాసులు చూడవచ్చిరి మునుల్ కౌతూహలం బొప్పఁగన్.

136


గీ.

వచ్చి మౌనులు జయజయధ్వనులు చెలఁగ
రాము నభిరాము జానకీరమణుఁ గాంచి
యెదుట కుంభంబు నిడుకొని హృదయవీథి
నింపు దళుకొత్త నుతి జేసి రివ్విధమున.

137


గీ.

జగదనుగ్రహకారికి శాశ్వతునుకు
జగ మరావణ మొనరింప జగతియందు
నవతరించినవారికి వారికి రామ
చంద్రునకు మ్రొక్కెదము నీకు జలజనాభ.

138


గీ.

తాటకాంతకునకు గాధితనయయాగ
పాలునకు దుష్టమారీచభంజనునకు

ఘోరబాహుసుబాహుసంహారునకును
బ్రణతు లొనరించెదము నీకుఁ బరమపురుష.

140


క.

గౌతమపాణిగృహీతీ
పాతకమోచనవిధానపటుతరపదకం
జాతస్ఫీతపరాగ
వ్రాతున కాద్యునకు నీకు వందన మభవా.

141


గీ.

ఖండపరశుశరాసనభండనునకు
జనకకన్యాకరగ్రహోత్సవకరునకు
భార్గవవినిర్గళాగ్రహభంజనునకు
నంజలి ఘటించెదము సరోజాక్ష నీకు.

142


గీ.

ఎలమిఁ గైకకు వరయుగం బిడినతండ్రి
పలుకు నిక్కము నాలింప భార్యతోడ
ననుఁగుసైదోడు తోడుగా వనము జేరి
నిలిచినగుణాంబురాశికి నీకు శరణు.

143


సీ.

భరతసంప్రార్థనాబలదత్తపాదుకా
        ద్వయునకు శరభంగతాపసేంద్ర
సురలోకసంప్రాప్తకరునకు సాధువి
        రోధివిరాధనిరోధకునకు
ప్రాప్తగృధ్రకులాదిరాజసఖ్యునకును
        మాయావిమారీచమర్దనునకు
బాహుమదాంధకబంధభేదనునకు
        శబరిసమర్చితచరణునకును


గీ.

వానరాధీశసఖునకు వాలివధవి
ధాయికి నగాధసింధుబంధనున కఖిల
రాక్షసవినాశకరునకు రావణాంత
కునకు నభివాదనము నీకు వనజనాభ.

144

క.

దారుణసంసారార్ణవ
తారకపాదారవింద దానవివత్సం
హార జగదేకరక్షణ
కారణ మ్రొక్కెదము నీకుఁ గరుణాబలధీ.

145


గీ.

భక్తరక్షణదీక్షిత పరమపురుష
సచ్చిదానందవిగ్రహ సర్వజనక
నామరూపకజనదోషనాశ యీశ
కేశవ నిరీశ మమ్ము రక్షించు మభవ.

146


క.

రక్షారక్షతదశముఖ
రాక్షసుని వధించి జగము రక్షించితి సౌ
మ్యేక్షణ మము రక్షింపుము
రక్షింపుము లోకనాథ రఘుకులతిలకా.

147


వ.

ఇట్లు స్తోత్రంబు చేసి సకలమును లూరకుండిరి. ఈరామస్తోత్రంబు
త్రిసంధ్యంబు భక్తిపూర్వకంబుగాఁ బఠించువాఁడు భక్తిముక్తు
లు వడయు ప్రయాణకాలంబునఁ బఠించువానికి భయంబు నివ
ర్తించు. భూతప్రేతభేతాళగ్రహంబులు నశించు. సకలలోక
బాధ లడంగు.

148


గీ.

పుత్రకాముఁడు గాంచు సత్పుత్త్రమణుల
కన్య చక్కనిపతిఁ బొందు ఘనత మెఱయ
మోక్షకాముఁడు గన్గొను మోక్ష మర్థ
కాముఁ డగువాఁడు జెందుఁ బుష్కలధనంబు.

149


క.

ఈరామస్తవరాజం
బారూఢిఁ బఠించునట్టి యనఘాత్ములకుం
గోరిక లెల్ల లభించును
శ్రీరామస్వామికరుణచే ననిశంబున్.

150

సీ.

అంత రాఘవుఁడు సంయమిపుంగవులకు సా
        ష్టాంగప్రణామంబు లాచరించి
సమధికభక్తి నంజలిపుటంబు ఘటించి
        యి ట్లని పల్కె మునీంద్రులార
సంశుద్ధికై సర్వజనసంఘముల కేను
        బ్రాప్యుఁడ మద్దృష్టిపథముఁ జేరు
జంతువు మోక్షభాజనము సందియము లే
        దైవనిచ్చెలు నిరహంకృతులను


గీ.

స్వాత్మలాభసంతుష్టుల నధికశాంత
చిత్తులను సర్వభూతసుహృత్తములను
దాంతులను విప్రులను సర్వదా భజింతుఁ
బ్రేమ మిగురొత్త బ్రాహ్మణప్రియులు నగుట.

151


క.

మి మ్మొక్కటి యడిగెదఁ జి
త్తమ్ములఁ జింతించి నిశ్చితము జేసి గతా
హమ్మతులార వచింపుఁడు
సమ్మదమున నాకు మీరు సౌహార్ధ్రమునన్.

152


గీ.

పఙ్క్తికంధరవధమునఁ బాప మెద్ది
గలిగె నాయందు నమ్మహాకలుషమునకు
నిష్కృతి వచింపుఁ డెద్దాని నే నొనర్చి
పాపముక్తుఁడఁ నగుదు నో భవ్యులార.

153


వ.

అని యడిగిన నమ్మహాత్మున కమ్మహామును లి ట్లనిరి.

154


గీ.

నిత్యసత్యవ్రతాచార నిగమవినుత
లోకరక్షాధురంధర లోకనాథ
కలుషసంహార లోకోపకారముగ శి
వార్చనము సేయు మంబుజాతాయతాక్ష.

155


ఉ.

ఏపున గంధమాదనమహీధరశృంగమునందు లింగసం
స్థాపన మాచరింపు దురితవ్రజశాంతికి లోకసంగ్రహ

వ్యాపృతబుద్ధి వై ధవళవారిజలోచనశంభులింగసం
స్థాపనజన్యపుణ్యము విధాతకు నైన వచింప శక్యమే.

156


గీ.

శ్రీలు మెఱయ భవత్ప్రతిష్ఠితమహీశ
లింగదర్శనమున జనాళికి లభించుఁ
గాశిశివలింగదర్శనకనకంటెఁ
గోటిగుణితఫలంబు సద్గుణపయోధి.

157


క.

ఈలింగము నీనామము
చే లోకమునం బ్రసిద్ధిఁ జెందు న్విపదా
భీలాంహోగహనోగ్ర
జ్వాలానల మగుచు సాధుజనసులభం బై.

158


క.

రామేశ్వరనామంబున
నీమహినీమహితలింగ మిమ్ముగ వెలయున్
రామ విలంబము సేయక
నేమముగ శివప్రతిష్ఠ సేయుము నెమ్మిన్.

159


క.

అనిన విని పుణ్యకాలము
జనపతి ద్విముహూర్తముగ విచారించి ప్రభం
జనతనయుని నెన రెనయం
దనచెంతకు డాయఁ బిలచి తగ ని ట్లనియెన్.

160


గీ.

ఆంజనేయ హనూమంత యనిలతనయ
శంభుపద మగుకైలాసశైలమునకుఁ
బొరి మనోవేగశాలి వై పొమ్ము సంప్ర
దిష్ఠ సేయంగ లింగంబుఁ దెమ్ము నీవు.

161


క.

పతి యి ట్లాజ్ఞాపించిన
నతిశయముగఁ బుణ్యకాల మతఁడు ముహూర్త
ద్వితయవ్యవధానముగా
మతి నెఱిఁగి ప్రమోదమానమానసుఁ డగుచున్.

l62

వ.

భుజాస్ఫాలంబుఁ గావించి సురగరుడగంధర్వకిన్నరసిద్ధసాధ్య
విద్యాధరతపోధరపుంగవులు గనుంగొనుచుండ నుద్దండవేగుం
డై యక్కొండఁ జలింపంజేయుచు నభోమండలంబున కెగసి యా
కాశమార్గంబు లంఘిపుచుం జని చని ముందట.

163


మ.

కనియె న్మారుతనందనుండు శశిరేఖాశేఖరావాసముం
గనదుద్యచ్ఛరదభ్రవిభ్రమతిరస్కారిస్ఫురద్భాసమున్
ఘనరత్నజ్వలదంతికస్థలపరిష్కారత్తుషారాద్రినం
దనికాలక్తకరక్తకకభ్రమరవిన్యాసంబు కైలాసమున్.

164


వ.

మఱియు నవ్వెండికొండ చండభానుమండలాతిక్రమణరమణీయత
రాగ్రశిఖరలిర్గతముఖరనిరర్గళనిర్ఝరశతంబులచేతను పారిజాతమ
హీజాతసంజాతసమంజసకుసుమమంజరీపరిచ్యుతమకరందకు
ల్యాకూలకల్పితానల్పచింతామణివేదికాజాలఖేలత్కిన్నరసుం
దరీబృందంబులచేతను లాస్యప్రసంగతలాసికివిలా సాదృశ్యమా
నసానుగతజీమూతమాలికామేదురసౌదామినీలతాసహస్రంబుల
చేతను, రుచిరవిచిత్రమణిమరీచికాకందళసంతోహతుందిలసుంద
రీమందిరరంగత్తురంగవదనకురంగనయనాసముచ్చార్యమాణపంచ
బాణవిరోధివిజయగాథాప్రబంధబంధురమాధురీధురంధరవీణా
క్వాణంబులచేతను, స్నానార్థసమాయాతసప్తమాతృకాచరణా
రవిందవిన్యాసధన్యతరసురతరంగిణీతీరహిరణ్మయవాలుకాప్ర
దేశంబులచేతను, హిమవన్నగరాజన్యకన్యకాపీనసమున్నతనిస్తుల
స్తనమండలన్యస్తకస్తూరిపంకలబలపూరనీరజాకరవిశేషంబులచే
తను, సకలదిగ్వలభిదుర్భదనిర్భరాకుంఠకంఠనాదమహోత్తుంగ
పుంగవేంద్రనిశాతవిషాణకోణవిశృంఖలసంఘాతనితంబమణి
ఖనిప్రభాధాగధగ్యంబులచేతను, గంధసింధురవదనశుండాదండ
పీతప్రోజ్ఝితనిలింపతటినీజలచ్ఛటాపటలపాతనిరుద్ధగగనపద్ధతి
చూరనిస్సరత్పథికవైమానికనికరంబులచేతను, సుధారసవాసికా
ప్రాంతకాంతసంతానపాదపశీతలచ్ఛాయాతలయక్షమృగాక్షీ

కల్పితసురతాంతిమశ్రమాపనోదకనవకిసలయతల్పంబులచేతను
తరుణారుణకిరణసంతతిప్రతిమల్లపల్లవసముల్లసద్బిల్వతరువాటి
కాంతరనిరంతరపురాంతకచింతనామృతరసానుభవపులకితప్ర
తీకయోగికులాగ్రగణ్యులచేతను నికుంభకుంభోదరభృంగిరిటాది
మహాప్రమథపరిచారకనిరంతరసంతాడ్యమానఢక్కాడమరుడిం
డిమపటహపణవాదివాదిత్రనాదసంగతమారుతపూరితగుహాఘో
షంబులచేతను పంచబ్రహ్మపంచాక్షరప్రముఖనిఖిలశైవమంత్రరాజ
జపానుష్ఠాననిష్ణోత్సుకశుకపికశారికామయూరసమాశ్రితవితత
వివిధవాసనాసనాథసకలర్తుప్రత్యగ్రప్రసూనపరిష్కృతలతావి
తానపరిరంభసంభోగసుఖాలసమలయపవనసంచారసమంచితో
పవనంబులచేతను, ప్రియాంగనాభుజాలింగితకంధరగంధర్వపా
ణిపంకజపరిగృహీతయాతాయాతజాతరూపడోలికాపాశపరిణద్ధ
విటపవిలసదనిమిషతరువాటికానికామరమణీయాధిత్యకాభాగం
బులచేతను, నభిరామం బై పార్వతీపరమేశ్వరయశోరాశియుంబో
లెఁ బ్రకాశించుకైలాసపర్వతరాజంబు దర్శించి రోమాంచకంచు
కితశరీరుం డై అనేకదండప్రణామంబులు గావించి యందు లింగ
రూపధరుం డైనమహేశ్వరుండు దృష్టిగోచరుండు గాకున్న మరు
న్నందనుండు ప్రాగగ్రకుశాసనసమాసీనుండును, ఊర్థ్వబాహుండు
ను, నిరాలంబుండును, నిరుఛ్వాసుండును, జితేంద్రియుండును నై త
పంబు గావించి పరమేశ్వరు నారాధించి ప్రసన్నునిం జేసి లింగం
బు వడసినంతలోనం దత్వవేత్త లగుమహామునులు హనుమంతునా
గమనంబు లేమియుం బుణ్యకాలంబు స్వల్పావసిష్టం బగుటయు నె
ఱింగి రఘుపుంగవునితో ని ట్లనిరి.

165


క.

అయ్యా హనుమంతుఁడు రా
డయ్యెను మఱి పుణ్యకాల మతిసన్నిహితం

బయ్యె నిక మించి చను నీ
వియ్యెడఁ దడ వేల చేసె దినకులతిలకా.

166


గీ.

పావనాచార జానకీదేవి యెద్ది
లీలఁ గావించె వాలుకాలింగ మిచట
నిదియ నీవు ప్రతిష్ఠింపు మిపుడు దీని
కంటె నుత్తమ మైనలింగంబు గలదె.

167


క.

అని మునులు విన్నవించిన
విని జానకితోడ రామవిభుఁ డెలమిని గ్ర
క్కున నిత్తరిఁ గృతమంగళ
ఘనకౌతుకుఁ డగుచు మౌనిగణములతోడన్.

168


వ.

జ్యేష్ఠమాససితపక్షదశమీసౌమ్యవారంబున హస్తనక్షత్రంబున
వ్యతీపాతయోగంబునం, గన్యయందుఁ జంద్రుండు, వృషభంబున
సూర్యుండు నుండ నిట్టిదశయోగపుణ్యకాలంబున సేతుమధ్యం
బున గంధమాదనపర్వతంబునందు.

169


ఆ.

నిలిపె రాఘవుండు నీలకంధరుని లో
కైకగురుని వాంఛితార్థకరుని
చంద్రశేఖరుని నగేంద్రకన్యామనో
హరుని లింగమూర్తిధరుని హరుని.

170


క.

లింగస్థితు నీశానున్
గంగాధరు నభవు నీలకంధరు గౌరీ
సంగతునిఁ బుంగవేంద్రతు
రంగుని శివుఁ బూజ చేసె రఘుపతి భక్తిన్.

171


ఆ.

అంత లింగమూర్తియందు నిల్చినసాంబ
శంకరుండుఁ బ్రసన్నుఁ డగుచు
రాఘవునకు లోకరక్షకునకు వరం
బిచ్చెఁ గరుణ వెలయ నివ్విధమున.

172

ఉ.

భూతలనాథచంద్ర రఘుపుంగవ నిశ్చలభక్తి నిందు నీ
చేతఁ బ్రతిష్ఠితం బయిన శ్రీశివలింగముఁ జూచి యీమహా
పాతకు లైనవారికినిఁ బాపము లేల వినాశ మొందు న
బ్జాతహితప్రకాశము సనం తమసంబు లణంచుకైవడిన్.

173


గీ.

మనుకులేంద్ర ధనుష్కోటిమజ్జనమున
రామనాథీశలింగదర్శనమువలన
వివిదుదుస్తరదురితము ల్విలయ మొందు
సత్య మీవచనంబు సంశయము లేదు.

174


క.

ఇత్తెరఁగున నత్తరని మ
హత్తర మగువర మొసంగి యభవుఁడు హిమభూ
భృత్తనయేశుఁడు రవివం
శోత్తమునకు రాఘవునకు నురుతరకరుణన్.

175


క.

అందముగ రామనాథుని
ముందట నందీశుఁ బ్రమథముఖ్యు నమందా
నందప్రదు నిలిపె దశ
స్వందననందనుఁడు విబుధు లభినందింపన్.

176


ప్రాకటముగ నీశ్వరునభి
షేకార్థము చాపకోటిచే నాపుణ్య
శ్లోకుఁడు ధర భేదించి మ
హాకుండం బొంటి జేసె నచ్చట నంతన్.

177


క.

తజ్ఞలములఁ గొని శివునకు
మజ్జనవిధి సలిపె రామమనుజేంద్రుఁడు ధీ
మజ్జననుత మత్తీర్థము
సజ్జనవరులార కోటిసంజ్ఞ వహించెన్.

178


మ.

సురలున్ సిద్ధులు సాధ్యు న్మునులు యిక్షుల్ నాగగంధర్వకి
న్నరవిద్యాధరు లప్సరోగణము నానావానరుల్ హాళితో

నురునిష్ఠావిభవానుషక్తమతు లై యొక్కొక్కలింగంబు ని
ల్పిరి సేతుస్థితగంధమాదనమహాపృథ్వీధరేంద్రంబునన్.

179


గీ.

ఇట్లు వివరించితిని మైథిలీశకృతహ
రప్రతిష్ఠాపనప్రకారంబు మీకు
నిధి పఠించిన వినిన రామేశలింగ
సేవనఫలంబు మోక్షంబుఁ జెందు నరుఁడు.

180


వ.

అని సూతుండు చెప్పిన విని శౌనకాదిమహర్షులు తదనంతరకథావి
ధం బెట్టిదని యడిగిన.

181


మ.

వననిక్షేపతటాకదేవగృహకావ్యబ్రాహ్మణోద్వాహనం
దనసంజ్ఞాసముదగ్రసప్తవిధసంతానస్వతంత్రాఢ్యమ
ల్మంలనత్రీశ్వరమానసాంబురుహఖేలాలోలరోల౦బకాం
చినగర్భాదిసుపర్వరక్షణకళాజాగ్రత్కృపావీక్షణా.

182


క.

పశ్యల్లలాటదురితా
వశ్యాయసహస్రకరణవర్షాకాలా
భ్రశ్యామలకందరదృ
గ్దృశ్యపరిజ్ఞానవేద్యదివ్యాకారా.

183


భుజంగప్రయాతము.

ఫణిస్వామిమంజీరభాస్వత్పదాబ్జా
రణక్షోణినిర్ధూతరాత్రించరౌఘా
గణేశాదిశైవాగ్రగణ్యాభినంద్యా
గుణీభూతదృక్కర్ణగోత్రేంద్రచాపా.

184

గద్య — ఇది శ్రీమదుమామహేశ్వరకరుణాకటాక్షవీక్షాపాత్ర,
యేనుగ లచ్చయామాత్యపౌత్ర, తిమ్మనామాత్యపుత్త్ర,
వివిధవిద్వజ్జనవిధేయ, లక్ష్మణకవినామధేయప్రణీ
తం బయిన రామేశ్వరమాహాత్మ్యం బను
మహాప్రబంధమునందుఁ
ద్వితీయాశ్వాసము.

శ్రీ శ్రీ శ్రీ

శ్రీరస్తు

రామేశ్వరమాహాత్మ్యము

తృతీయాశ్వాసము


రుచిరలశజలధిగ
భీరోన్నత భద్రిరాజుభీమాగ్రతనూ
జారాధితచరణ కృపా
పూరిత గురజానపల్లి పురమల్లేశా.

1


వ.

అవధరింపుము శౌనకాదిమహర్షులకు సూతుం డి ట్లనియె.

2


చ.

ఇటువలె రామచంద్రుఁడు మహేశ్వరలింగము నిల్ప నంతటం
బటుజవశాలి యైనహనుమంతుఁడు రౌప్యనగంబునుండి యు
త్కటగతి రెండులింగములు గైకొని వచ్చి కుతూహలంబు ని
వ్వటిలఁగఁ జేరి మ్రొక్కె రఘువర్యునకున్ ధరణీతనూజకున్.

3