రామేశ్వరమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

రామేశ్వరమాహాత్మ్యము

ప్రథమాశ్వాసము

తుల్యాతటినీమహాజలధిసంశ్లేషస్థలోపాంతవి
ఖ్యాత శ్రీగురుజానపల్లిపురనిత్యావాసుఁ డబ్జాక్షకం
జాతప్రోద్భవసేవ్యుఁ డైందవకళాంచన్మౌళి మల్లేశ్వరుం
డాతారార్కముఁ బ్రోచుఁగావుత కృపాయత్తాత్ముల న్భక్తులన్.

1


ఉ.

శ్రీరమణీమణిన్ హృదయసీమ వహించినజాణసుందరా
కారుల కగ్రగణ్యుఁడగు గాదిలిబిడ్డనిఁ గన్నతండ్రి యం
భోరుహసంభవాదిసురముఖ్యుల నేలినమేటిలోకర
క్షారతుఁ డైనవేల్పు విలసత్కృప భక్తులఁ బ్రోచుఁ గావుతన్.

2


చ.

సనకసనందనాదిమునిచంద్రులు నింద్రముఖాఖిలామరుల్
తనచరణాంబుజద్వయము దద్దయు భక్తి భజింపఁగా జగ
జ్జనని సరస్వతిం గలసి సాంద్రమరందకణార్ద్రభాసురా
సనమున నుండు బద్మజుఁ డొసంగుఁ జిరాయువు సజ్జనాళికిన్.

3

ఉ.

శ్రీగిరిజాకుమారు మదసింధురవక్తృవిశాలలోచనున్
భోగికులేశహారు శశిభూషితమస్తకు వేదశాస్త్రవి
ద్యాగురుమూర్తి భక్తహృదయాభిమతార్థవిధానదక్షు స
ర్వాగమవేద్యు మత్కృతిసహాయు గణాధిపతి న్నుతించెదన్.

4


సీ.

వసుమతీధరచక్రవర్తిముద్దులపట్టి,
        విబుధులపాలిటి వేల్పుటావు
పతియర్ధదేహంబు పాలు గొన్న పురంధ్రి,
        ముజ్జగంబులుగన్న ముద్దరాలు
వికచకల్హారపీఠిక నుండు జలజాక్షి,
        క్రొన్నెలవిరిఁ దాల్చు కోమలాంగి
వేదాంతవీధుల విహరించు దైవంబు,
        బాలార్కురుచి గల్గు పరమసాధ్వి


గీ.

హస్తతలమునఁ బాశాంకుశాక్షవలయ
పుస్తకంబులు ధరియించు పువ్వుఁబోఁడి
పార్వతీదేవి నామన:పంకజమున
నింపు దళుకొత్తఁగా వసియించుఁగాత.

5


ఆ.

మరునిఁ గన్నతల్లి మాధవు నిల్లాలు
పాలకడలిపట్టి పరమసాధ్వి
కలుము లిచ్చుచాన కమలాక్షి సజ్జన
మందిరముల నెపుడు-మలయుఁగాత.

6


లయగ్రాహి.

వందన మొనర్తు నరవిందభవుసుందరికి
        గుందశరదిందుఘనచందనసుధాపౌ
రందరమహీజశరబృందధవళాంగికి మ
        రందమధురోక్తికి ముకుందశశిభృత్సం

క్రందనముఖత్రిదశవందితకు విద్వదళి
        నందితగుణాంబుధికమందకరుణాని
ష్యందకుఁ గచాధరమిళిందకు సఖీకృతశి
        వేందిరకు భక్తముఖమందిరకు భక్తిన్.

7


మ.

అగదంకారవిభుంద్రిమూర్తిమయుఁ బద్మాప్తుం ద్రయీవిగ్రహున్
జగదానందకరున్ విభాకరుఁ దమస్సంహారు స్సర్వేశ్వరుం
ద్రిగుణాత్మున్వివిధాగమాంతవిదితున్వదివ్యాసురారాధితున్
భగవంతుం గరుణానిశాంతహృదయు న్భాస్వంతు సేవించెదన్.

8


క.

వినుతింతు ననఘుఁ గవితా
జనకు రఘుస్వామి పుణ్యచరితాంబుధిఖే
లనపరుఁ బ్రాచేతసుహృ
ద్వనరుహసన్నిహితశివును వల్మీకభవున్.

9


క.

పంచమవేదగ్రధ సవ
రించెను బ్రహ్మర్షిగణవరేణ్యుం ద్రిదశా
భ్యంచితునిశ్చలసత్కరు
ణాంచదపాంగునిఁ బరాశరాత్మజుఁ దలఁతున్.

10


చ.

అనఘునిఁ గాళిదాసుని మహాకవిహర్షుని భట్టబాణు భా
సుని శివభద్రు భారవినిఁ జోరుమయూరుని మాఘుభట్టు దం
డిని భవభూతి వైభవపటిష్ఠుల బిల్హణ మల్హణాదులన్
ఘనులను బూర్వసత్కవుల-గౌరవ మొప్పఁదలంచి మ్రొక్కెదన్.

11


క.

భారతముఁ దెలుఁగు జేసిన
ధీరాత్ము న్నన్నయార్యు దిక్కనమఖి నం
భోరుహభవనిభు నెఱ్ఱసు
ధీరత్నము నాత్మలో నుతింతు న్భక్తిన్.

12


గీ.

మహితచింతామణీదివ్యమంత్రసిద్ధి
నైషధాదిప్రబంధసందర్భనిపుణు

సకలవిద్యావిశారదు సత్కవిత్వ
పట్టభద్రుని శ్రీనాథుఁ బ్రస్తుతింతు.

13


క.

భీమకవి రామభద్రుని
సోముని భాస్కరకవీంద్రు సూరనసుకవిన్
భూమీస్థలి నెన్నికగల
శ్రీమంతుల నాంధ్రకవివరేణ్యులఁ దలతున్.

14


మ.

సరసప్రౌడవచోవిలాసవిబుధాచార్యు న్సువర్ణాక్షమా
ధరధీరు న్వివిధప్రబంధరచనాదక్షు న్శివధ్యానత
త్పరచిత్తుం బ్రణమత్సమస్తధరణీపాల న్సుభద్రామనో
హరునిం గొల్చెద మత్పితామహు నిల చ్చామాత్యచూడామణిన్.

15


గీ.

మద్గురుస్వామి నఖిలాగమస్వభూమి
సద్వినుతకీర్తి పాండిత్యచక్రవర్తి
భక్తి భజియింతు నాకరపల్లికులసు
ధాపయోనిధిసోము కోదండరాము.

16


గీ.

అతిమధురకోకిలధ్వను లాలకించి
వాయసము లోర్వఁజాలక వనరుభంగి
సుకవిసూక్తుల కులికి యసూయఁ జెంది
కుకవుల రచినయంతన కొదువ గాదు.

17


ఆ.

కవుల మనుచు లేనికాని పే రూరక
పూని తమ్ము దారు పొగడుకొనుచు
సిగ్గు విడిచి తిరుగు చెడుగులు సర్వజ్ఞ
నృపసభాస్థలమున నిలువఁగలరె.

18


వ.

అని యిష్టదేవతానమస్కారంబును బురాతనాధునాతనసుకవిపురస్కారంబునుం
గుకవితిరస్కారంబునుం గావించి యొక్క మహాప్రబంధంబు సేయం దలంచియున్న
సమయంబున.

19

సీ.

ఏవదాన్యుని కులదైవంబు గురుజాన
        పల్లిమల్లేశుండు భవ్యమూర్తి
యేమంత్రి తాత భూమీశసంపద్గుణ్య
        మహిమోన్నతుఁడు చెన్నమల్లమంత్రి
యేమహాత్ముని తండ్రి యిందుచందనకుంద
        బృందనిర్మలకీర్తి భీమమంత్రి
యేధన్యు తల్లి ధాత్రీధరాధిపసుతా
        కలితసౌభాగ్యవిఖ్యాత సీత


గీ.

యేమహాత్ముని సోదరుం డీశ్వరాంఘ్రి
పూజనాసక్తిమతి సింగరాజు శౌరి
యతఁడు శ్రీభద్రిరాజువంశాధికుండు
మహితగుణశాలి మల్లనమంత్రిశౌరి.

20


వ.

ఒక్కనాడు వివిధవిద్వజ్జనపరివృతుండై నిజాస్థానభవనంబునం గొలువు దీర్చి
కూర్చుండి సప్తసంతానప్రముఖనిఖిలధర్మరహస్యసమాకర్ణనసముదీర్ణసకుతూ
హలాయత్తచిత్తంబున.

21


సీ.

శోభితాపస్తంబసూత్రు వాధూలస
        గోత్రు సమస్తసద్గుణసమేతు
నేనుఁగ లచ్చకవీంద్రునిపౌత్రుని
        శ్రీమాచిరాజు నృసింహమంత్రి
దౌహితృభూవరాస్థానపూజితుఁడు తి
        మ్మనమంత్రికినిఎ బేరమకుఁ దనూజు
ధన్యు ననంతప్రధానసోదరు వీర
        మంత్రి కగ్రజు రాజమాన్యచరితు


గీ.

నన్ను మతిమంతు లక్ష్మణనామధేయు
నమరఁ బిలిపించి యుచితాసనమున నునిచి

కవితసత్కార మొప్పఁగ గారవించి
పలికె గంభీరభాషణప్రౌఢి మెరయ.

22


క.

నిర్మలకీర్తివి సత్కృతి
నిర్మాణవిశారదుఁడవు నిర్మలఛందో
మర్మజ్ఞుఁడవు శివార్చన
ధర్మపరుండవు నుతింపఁ దరమే నిన్నున్.

23


వ.

మదీయవిజ్ఞాపనం బవధరింపుము సపాదలక్షగ్రంధసంఖ్యాసమేతంబును పంచాశ
త్ఖండమండితంబును, బహుసంహేతోసమాకీర్ణంబునునై యొప్పు స్కాందంబను
నాదిమపురాణంబునందు సేతుఖండంబు శ్రీరఘుపతి ప్రతిష్ఠిత రామేశ్వరస్వామి
మహాత్మ్యసమ్యుక్తం బగుటంజేసి రామేశ్వరపురాణం బనంబరగునది యాంధ్రదే
శభాషచేతం బ్రబంధంబు గావించి మదీయకులదైవతం బగు శ్రీగురుజానపల్లి మ
ల్లేశ్వరస్వామిపేర నంకితంబు సేయుము. దీనివలన మాకును మీకును శాశ్వ
తకీర్తియు సకలాభ్యుదయంబులు సిద్ధించునని బహుప్రకారంబులం బ్రార్ధించె
నయ్యవసరంబున.

24


ఉ.

రాజమహేంద్రదుర్గరుచిరంబుగ దేశమునం బ్రసిద్ధిచే
భ్రాజిలు గాకినాడ శలపాకమహాళ్ళకు రెంటికిన్ మహా
తేజ మెలర్ప నాస్థలపతిత్వముఁ గాంచినదిట్ట శాశ్వత
శ్రీజయశాలి వైరిగజసింహము నండురికామమంత్రియున్.

25


వ.

నన్నుంజూచి లక్ష్మణకవీంద్రా మల్లనమంత్రి విన్నవించిన వచనంబు
లాదరించి ప్రబంధంబు రచింపుమని వినయపూర్వకంబుగా భా
షించిన నంగీకరించితి నంతట బహుమానంబుగాఁ గర్పూరతాం
బూల జాంబూనదాంబర మణిమయాభరణ హిరణ్య ధరణ్యాది
మహాపదార్ధంబు లిచ్చి మల్లనమంత్రి నన్నుం బూజించి వీడుకొల్పి
నం జనుదెంచి విరించిముఖనిఖిలబృందారకబృంద మహనీయ హా
టకకోటీర ఘటిత మణిగుణ ప్రభాంకూర నీరాజిత చరణార

విందుం డగు శ్రీగురుజానపల్లి చెన్న
మల్లేశ్వరస్వామినిం గృతికి నధీ
శ్వరుం గావించి రామేశ్వరమాహాత్మ్యంబను మహాప్రబంధంబు ని
ర్మింపం దొడంగితి నమ్మహాదేవునకు.

26


షష్ఠ్యంతములు

క.

శంభునకు గిరిసుతాకుచ
కుంభస్థలకలితలలితకుంకుమచర్చా
శుంభత్సౌరభవిభనవి
జృంభితవక్షునకు సవనజితదక్షునకున్

1


క.

కుండలికుండలమండిత
గండద్వితయునకుఁ బాండుకరడిండీరా
ఖండలవేదండశర
త్కాండదపాండురమనోజ్ఞగాత్రద్యుతికిన్.

2


క.

ఇందీవరసందోహక
ళిందసుతేందిందిరావళీసుందరరు
గ్బందీకరణచణశ్రీ
తుందిలకంఠున కకుంఠదోగ్దండునకున్.

3


క.

సురవర్ణితతుల్యాసా
గరసంగసమీపభూమి కమనీయగుణా
భరణ గురుజానపల్లీ
పురవిహరణశీలునకు విబుధపాలునకున్.

4


క.

చరణానతశతమఖముఖ
సురపరివారునకు గోటిసూర్యవిభాధి
క్కరణప్రవీణతేజః
పరిపూర్ణాకారునకుఁ గృపాచారునకున్.

5

క.

కరిచర్మాంబరునకు వర
సరసిజధృతశంబరునకు సజ్జనరక్షా
వరకరుణాపాంసునకు
న్నరకభయధ్వాంతభంజనపతంగునకున్.

6


క.

సోమునకు భక్తనిహిత
ప్రేమునకున్ భద్రిరాజు భీమయసుత మ
ల్లామాత్య మానసాంబుజ
ధామునకును నిరుపమానతతధామునకున్.

7


క.

దృహిణాదివిబుధసుతునకు
దుహినాంశుకళావిభూషితునకున్ లక్ష్మీ
సహితగురుజానపల్లీ
మహితనివేశునకుఁ జెన్నమల్లేశునకున్.

8


వ.

సభక్తిసమర్పితంబుగా నాయొనర్పం బూనిన రామేశ్వరమాహా
త్మ్యంబునకుఁ గథావిధం బెట్టిదనిన.


కథాప్రారంభము

శా.

శ్రీమత్కాంచనగర్భసన్నిభమహర్షిస్తోమధామంబు సు
త్రామస్తుత్యవిచిత్రవైభవగుణాధారంబు సద్గోమతీ
నామద్వీపవతీసమంచిత మమందజ్ఞానలక్ష్మీమయ
క్షేమోద్దామము నైమిశంబన వనశ్రేష్ఠంబు వొల్చున్ ధరన్.

1


సీ. శాంతమానసముక్త జాతిమత్సరబద్ధ
        సఖ్య నానాసత్త్వసంకులంబు
సంయమిదత్తఘాసగ్రాసమాంసల
        చారుసారంగికిశోరకంబు
తాపసేశ్వరనిరంతరయాగహోమధూ
        మస్తోమవృతనభోమండలంబు

మునిరాజకన్యకాజనకృతోద్వాహవై
        భవసుశోభితలతాపాదపంబు


గీ.

వేదశాస్త్రేతిహాసప్రవీణకీర
శారికాకేకికోకిలభూరివాద
నాదమేదురమూర్జితానందబోధ
కారణము వొల్చు నైమిశకాననంబు.

2


వ.

అందు.

3


సీ.

అష్టాంగయోగవిద్యాసమాసక్తులు
        బ్రహ్మవిజ్ఞానతత్పరులు లోక
పావనుల్ నిశ్చలబ్రహ్మవాదులు మహా
        త్ములు ముక్తికాములు దురితహరులు
ధర్మవేదులు సూనృతవ్రతు లనసూయు
        లపగతక్రోధులు విపులమతులు
విజితేంద్రియులు జగద్వినుతశీలురు సర్వ
        భూతదయాపరు ల్భువనహితులు


గీ.

 శౌనకాదిమునీశ్వరుల్ జలజనాభుఁ
బరమపురుషు సనాతను భక్తితోడఁ
బూజసేయుచు సలిపి రద్భుతతపంబు
పుణ్యతమమగు నైమిశారణ్యమునను.

4


ఆ.

భావితాత్ముఁడైన బ్రహ్మర్షి కుంజరు
లిరువదాఱు వేవు రెంచిచూడ
వారిశిష్యజనుల వారిశిష్యులనెల్ల
సంఖ్యఁ జేసి పలుక శక్య మగునె.

5


క.

వా రొక్కనాడుగ మియై
భూరిగతిన్ భోగమోక్షములకు నుపాయం
బారూఢి నెఱుఁగఁదలఁచి యు
దారకళాగోష్ఠి జేసి రన్యోన్యంబున్.

6

క.

ఆసమయంబున వేద
వ్యాసునిశిష్యుండు మౌనివర్యుఁడుని త్యో
ల్లాసుఁడు సూతుఁడు కథికా
గ్రేసరుఁ డచ్చటికి వచ్చెఁ గీర్తితభంగిన్.

7


చ.

అనలునిభంగిఁ దేజరిలు నమ్ముని నమ్మునినాథు లాదరం
బునఁ గని యర్ఘ్యపాద్యముల బూజనము ల్దగఁజేసి యున్నతా
సన మిడి చాలభక్తినిఁ బ్రసన్నునిఁ జేసి జగద్ధితార్థ మిం
పెనయఁగ వార లిట్లడిగి రిమ్ముల నొక్కమహారహస్యమున్.

8


క.

సూతా వింటివి సత్యవ
తీతనయునివలన సకలదివ్యపురాణ
వ్రాతంబులు జగదేక
ఖ్యాతగుణా నీకుఁ దెలియు నఖిలార్ధములున్.

9


క.

ఎయ్యవి పుణ్యక్షేత్రము
లెయ్యవి తీర్థోత్తమంబు లివ్వసుమతిలో
నెయ్యెడ లభించు మోక్షము
చయ్యన జనులకు భవోగ్రజలనిధివలనన్.

10


గీ.

ఎవ్విధమున నుమేశరమేశభక్తి
గలుగు నరులకు నెద్దానివలన దొరకుఁ
ద్రివిధకర్మఫలం బిది తెలియఁబలుకు
మాదరంబున మాకు మహామునీంద్ర.

11


క.

మునివరు లిట్లడిగిన వ్యా
సునకుం బ్రణమిల్లి పలికె సూతుండు తపో
ధనులార మంచిప్రశ్నం
బొనర్చితిరి లోకహితము యోజించి మదిన్.

12


ఆ.

ఈరహస్యతత్త్వ మిపు డేను లెస్స వ
చింతు మీకు మునుపు చెప్పలేదు

చిత్తనిగ్రహంబుఁ జేసి నిశ్చలభక్తి
పూర్వకముగ వినుఁడు పుణ్యులార.

13


సీ.

కడఁగి సేతువు జేరఁగానె ముక్తి లభించు,
        భవకేశవులయందు భక్తి వుట్టుఁ
ద్రివిధకర్మంబు సిద్ధించు నచ్చోటన
        నించుకంతయు సంశయించవలదు
మనుజుఁ డెవ్వఁడు జన్మమధ్యంబునను సేతు,
        బంధంబుఁ బొడగాంచు భక్తితోడ
ధన్యత నతఁడు మాతాపితృవంశకో,
        టిద్వయోపేతుఁడై ఠీవిమెఱయ


గీ.

బ్రహ్మపదమున నొక్కకల్పము వసించు
ముక్తుఁ డగుఁ దారలు పరాగములు గణింప
శక్యమగు సేతుదర్శనజనితపుణ్య
మహిపతికినైన లెక్కింప నలవిగాదు.

14


వ.

సేతుబంధంబు సకలదేవతాస్వరూపంబు గావున దానింజూచినవానిపుణ్యంబు
లెక్కింప నెవ్వనివశంబు సేతుదర్శనంబు జేసిన నరుండు సర్వయాగకరుండు,
సర్వతీర్థస్నాతయు, సర్వతపంబులుం జేసినవాఁడు సేతువునకుం జనుమని ప
లికిన పురుషుండు సేతువునకుం జనిన పుణ్యఫలంబు నొందు.

15


క.

ధర సేతుస్నానముగల
గురుపుణ్యుఁడు సప్తకోటికులములతోడన్
హరిభవనంబునకుం జని
సురచిరగతి ముక్తిఁ బొందు సువ్రతులారా.

16


గీ.

మానవుఁడు సేతువును గంధమాదనంబుఁ
బ్రీతి రామేశుఁ దలఁచుచుఁ బితృకులములు
లక్షకోటులు గూడి కల్పత్రయంబు
శంభుపదముననుండి మోక్షంబుఁ గాంచు.

17

వ.

మఱియు మూపావస్థయు, వసాకూపంబును, వైతరణీనదియు, శ్వ
భక్షణంబును, మూత్రపానంబును, తప్తశూలంబును, తప్తశిలయు
ను, పురీషహ్రదంబును, శోణితకూపంబును, క్రిమిభోజనంబును,
స్వమాంసభక్షణంబును, వహ్నిజ్వాలాప్రవేశంబును, శిలావృష్టి
యు, కాలసూత్రంబును, క్షారోదకంబు, నుష్టతోయంబునను న
రకంబులు సేతుస్నాతవిలోకింపండిది నిక్కంబు.

18


గీ.

సేతువున నవగాహంబు సేయువాఁడు!
పంచపాతకముక్తుఁ డై పద్మనాభు!
వీటఁ బితృమాతృకులశతకోటితోడ
మూఁడుకల్పంబులు వసించి ముక్తిఁ గాంచు.

19


సీ.

క్షారసేచనము పాషాణయంత్రము మరు,
        త్పతనంబు కరపత్రధారణంబు
సంధిదాహంబును శస్త్రబేదనమును,
        కాష్టనిర్మితయంత్రకర్షణంబు
పాశబంధంబు నానాశూలపీడనం
        బాస్యవాసాలవణాంబుసేక
మంగారపుంజశయ్యాశ్రవణంబును,
        దశనమర్దనమహిదంశనంబు


గీ.

తప్తపాషాణభుక్తియుఁ దప్తసూచి
భక్షణముఁ దప్తతిలతైలపానధూమ
పానములు మొదలైన యపారనార
కములు చూడఁడు సేతువుఁ గాంచు నరుఁడు.

20


వ.

మఱియు నధశ్శిరశ్శోషణంబును, గజదంతహననంబును, క్షారాం
బుపానంబును, క్షారోదకబిలప్రవేశంబును, మేహభోజనంబు
ను, స్నాయుచ్ఛేదనంబును, స్నాయుదాహంబును, నస్తిచ్ఛేద
నంబును, శ్లేష్మాదనంబును, పిత్తపానంబును, మహాతిక్తనిషేవణం
బును, నుష్ణసైకతాస్నానంబును, దప్తాయశ్శయనంబును, సంత

స్తాంబుసేవసంబును, నేత్రనఖసంధిసూచీప్రక్షేపంబును, నండస
హితశిశ్నంబున నయోభారబంధనంబును, వృక్షాగ్రంబువలనం
గషోదకకూపంబునం బడంద్రోఁచుటయును, తీక్ష్ణఖడ్గధారాశ
యనంబును, మొదలగు మహాఘోరనరకంబులు విలోకింపక సేతు
స్నాత సుఖించు సేతుయాత్ర గావింతునని తలంచి యెవ్వండేని
నూడడుగులు నడచు నతండు పంచమహాపాతకంబులు విడనాడి
యీ చెప్పిననరకంబులు గనుంగొనక కైవల్యంబు నొందు.

21


గీ.

మానవుఁడు సేతుసైకతమధ్యధూళి
పాళిఁ బొదలుచు నెవ్వాఁడు పవ్వళించు
నతని మెయి నెన్నిరేణువు లంటి నిలుచు
నన్నిద్విజహత్యలు నశించు నాక్షణంబ.

22


క.

తీరమృదుసేతుమధ్యస
మీరాంకురసముదయములు మేనులపైనిం
పారఁగ సోకినజనుల క
పారమహాఘోరపంచపాపము లడఁగున్.

23


సీ.

మార్గభేదియును బ్రాహ్మణదూషకుండును,
        స్వార్థపాకియును నత్యాశనుండు
వేదవిక్రీతయు వీ రేవురును బ్రహ్మ
        ఘాతకు ల్మఱి విప్రగణములకును
ధనముఖ్యవస్తువుల్ తగనిత్తునని పిల్చి
        యంత లేదని పల్కునట్టివాఁడు
ధర్మరహస్యంబు తనకు బోధించిన
        గురునితో వైరంబు గూర్చువాఁడు


గీ.

చెరువునకు నీరు ద్రావంగఁ జేరునట్టి
గోగణంబుల మరలించు కుత్సితుండు
బ్రహ్మఘాతుకులని చెప్పఁబడినవీర
లనఘు లగుదురు సేతుమజ్జనమువలన.

24

క.

సురఁ ద్రాగుమగువఁ గలసిన
పురుషుఁడు గణదేవలాన్నభోజియుఁ బతితా
న్నరతుఁడు గణకాన్నాశియుఁ
బరిహృతహోముఁడును మద్యపాయిసమానుల్.

25


క.

ఫలకందమూలదుగ్ధం
బులు మృగమదచందనక్రముకకర్పూరం
బులు రుద్రాక్షములును మ్రు
చ్చిలువారు సువర్ణహరులు సిద్దము దలఁపన్.

26


క.

వీరికి మఱియుం దక్కిన
చోరులకును సేతుతీర్థసుస్నానమునన్
ఘోరాఘములు నశించువి
చారం బియ్యెడ వలదు సన్మునులారా.

27


ఆ.

భ్రాతృభార్యఁ బుత్త్రభార్య రజస్వల
భగిని హీనవనితఁ బతివిహీనఁ
గల్గుఁ ద్రావు వెలఁదిఁ గలయువాఁ డిల గురు
తల్పగతసముండు తపసులార.

28


వ.

వీరునుం దక్కినగురుతల్పగసమానులుం దత్సంయోగులును మహా
సేతునిమజ్జనులై ముక్తిం బొందుదురు.

29


సీ.

యాగంబు సేయక నమరలోకాంగనా
        సంగమసుఖవాంఛ సలుపువారు
జ్వలనార్కులను దేవతలను పాసింపక
        కుశలంబు మదిలోనఁ గోరువారు
దిలమహీహేమతండులధాన్యదానంబు
        సేయక స్వర్గేచ్ఛ సేయువారు
సతతోపవాసనిష్ఠల దాప మొందక
        బలభేదిపురి నుండదలఁచువారు

గీ

సేతుతీరాభిషేకంబు సేయవలయు
సేతుమజ్జనమున నగుఁ జిత్తశుద్ధి
యనఘపతులార జపతపోయజ్ఞహోమ
దానములు సేతువున మోక్షదాయకములు.

30


క.

పాతకవిమోచనార్థము
సేతువున మునింగి నరుఁడు జితపాపుఁ డగున్
భూతకి నై స్రుక్కినవాఁ
డాతతసామ్రాజ్యవైభవాన్వీతుఁ డగున్.

31


చ.

అమరవధూమణీపృథుకుచాగ్రతటీమకరీవిలేఖన
క్రమసువినోదవాంఛ మదిఁ గల్గి భోగులు భక్తియుక్తులై
యమలమనోజ్ఞసేతుసలిలాఫ్లుతదేహులు గావలెన్ జనా
భిమతము లెల్ల నొప్పుగ లభించును సేతునిమజ్జనంబునన్.

32


శా.

కైవల్యంబు లభించుదోవమడఁగుం గన్పట్టు గళ్యాణముల్
ధీవిస్తారము సంభవించు నభివృద్ధిం బొందు ధర్మార్థముల్
శ్రీవైకుంఠకపర్దిలోకసుఖముల్ చేకూరు వేదాదివి
ద్యావైదుష్యము గల్గు సేతుసలిలాంతర్మగ్ను లౌవారికిన్.

33


క.

ఆరోగ్యము రూపంబును
దారిద్ర్యవిమోచనంబు ధనవృద్ధియునుం
గోరి మది సేతుజలముల
నారూఢి మునుంగువారి కవి సిద్ధించున్.

34


గీ.

శ్రద్ధచే నైన మనుజుఁ డశ్రద్ధ నైన
సేతుసలిలావగాహంబు సేయువాఁడు
ఘనత దీపింప నుభయలోకంబులందు
బాధ లెఱుఁగక సౌఖ్యసంపదలు గాంచు.

35


వ.

సేతుస్నానంబున సర్వజనులకుం బాపసంచయంబు నశించు, ధర్మం
బు శుక్లపక్షశాంకుండునుంబోలె వృద్ధింబొంద, రత్నంబులు సా
గరంబునం బెఱుఁగుగైవడి పుణ్యంబు లంతకంతకుం బెఱుఁగు, కా

మధేనువు చంచంబునం, గల్పవృక్షంబు వడువున, చింతామణి తె
రంగున, సేతుస్నానంబు సకలపురుషమనోవాంఛితార్థంబు లొ
సంగు. లేమింజేసి సేతుయాత్రఁ గావించ సమర్ధుండు గానివాఁడు,
శిష్టులగు విప్రుల ధనంబు యాచించునది వార లియ్యరేని క్షత్రి
యవైశ్యశూద్రులనైన యాచించి యెవ్విధంబుననైన ధనంబు వడసి సే
తుస్నానం బాచరింపవలయు ఎవ్వండేని సేతుయాత్రాపరునకు ధన
ధాన్యవస్త్రాదికంబులిచ్చి ప్రవర్తింపంజేయు నతనికి నశ్వమేధాది
యజ్ఞఫలంబునుం జతుర్వేదపారాయణపుణ్యఫలంబునుం, దులా
పురుషముఖ్యమహాదానఫలంబును సిద్ధించు బ్రహ్మహత్యాది పా
తకంబులు దొలంగు సర్వకామంబులు ఫలించు. పరిగ్రహించు
వాఁడునుం బ్రతిగ్రహదోషంబు లేక తత్తుల్యఫలంబు వడయును.

36


గీ.

సేతుయాత్రార్థ మర్థ మార్జించి పిదప
జననిలోభికిఁ దత్సేతువునకు నేగు
వాని కి చ్చెదనని యియ్యలేనిలోభి
కరయ భూసురహత్యయౌ నండ్రు బుధులు.

37


క.

ధనవంతుం డయ్యు దరి
ద్రునిగతి నెవ్వాఁడు వేఁడఁ దొడఁగున్ లోభం
బున సేతుయాత్రకొఱకు న
తనినిన్ ద్విజహంతయండ్రు తత్వవిధిజ్ఞుల్.

38


క.

మానక నరుఁ డేవెరవుల
చేనైన న్సేతుయాత్ర సేయందగు ధా
త్రీనిర్జరున కశక్తు ల
నూనధనం బిచ్చి పంప నుచితము ధరణిన్.

39


ఉత్సాహము.

కృతయుగమున ముక్తి దొరుకు నెరుకచే జనాళికిం
గ్రతువు లొసఁగు ముక్తి త్రేత కడమ రెండు యుగముల
న్వితతదానముల లభించు విమలసేతుతీర్థ మం
చితవిధమున ముక్తి గలుగఁజేయు నాల్గుయుగములన్.

40

వ.

అని వివరించిన రౌమహర్షణితో శౌనకాదిమునీంద్రు లి ట్లనిరి.

41


గీ.

సూత గంభీరజలధిపై సేతుబంధ
మెట్లు గావించె రఘుకులాధీశ్వరుండు
సేతుగతగంధమాదనక్షితిధరమున
నెన్నఁదగుపుణ్యతీర్ధంబు లెన్ని గలవు.

42


గీ.

కలితరామేశశంభులింగప్రతిష్ఠ
రాముఁ డొనరించె నేప్రకారమున మున్ను
తేటపడ మాకు నీకథ తెలియఁ బలికి
మముఁ గృతార్థులఁ జేయుము మౌనితిలక.

43


వ.

అని ప్రార్ధించి యడిగిన శౌనకాదిమహర్షులకు సూతుం డిట్లని చెప్పం
దొడంగె.

44


చ.

దశరథునాజ్ఞచేత గుణధాముఁడు రాముఁ డరణ్యభూమికిం
గుశల మతిఁబ్రియాంగనయుఁ గూరిమితమ్ముఁడుఁ దన్ను గొల్చిరా
వశజనమానసప్రియుఁడు వచ్చి చరింపుచు దండకాటవిన్
విశదగతి న్వసించె నతివిశ్రుతపంచవటీతటంబునన్.

45


గీ.

అంత మారీచవిరచితవ్యాజయుక్తి
రాజసుతులను వంచించి రావణుండు
తపసివేషంబుఁ గైకొని ధర్మ మెడలి
జానకీదేవిని హరించె సాహసమున.

46


మ.

అనఘుం డంతట రాఘవేశ్వరుఁ డరణ్యక్షోణులన్ మేదినీ
తనయాన్వేషణ మాచరించుచు సముద్యల్లీలఁ గాంచెన్ మహా
స్వనదంభోజవసద్విరేఫబకహంసక్రౌంచవంద్యుక్తిగుం
భవశుంభజ్జలరాట్సభాభవనముం బంపాసరోరాజమున్.

47


వ.

మఱియు నాసరోవరంబున రసభరితబిసఖండంబులు భుజించుతరి
నెడనెడం బొడము పిపాసవలన శతపత్రపాత్రనిక్షిప్తమకరంద
పానీయంబులు గ్రోలుచు నుద్వేలానురాగంబునం దద్బిందుకణం

బులు వరటీసముదాయంబులకుఁ జంచచ్చంచూపుటంబుల నొసం
గిన నదియు వాత్సల్యంబునం గిశోరనికురంబ వదనంబులకు మంద
ప్రకారంబున నందించుచున్నం గనుంగొని పరమహర్షవికస్వర
కందంబులై కలకలనాదంబులు గావింపుచుం గాంచనచ్ఛాయాపం
చకగరుదంచలక్షేపంబు సేయుచు, మనోహరమందగమనంబులం
బుండరీకషండంబులం గ్రీడగావించు రాజహంసంబులవలనను,
కంఠదఘ్ననీరపూరంబున నపారకౌతుకంబున నోలలాడు చెంచు
గుబ్బెతల కవుంగిళ్ళ డాఁగిలిమూతలాడు బెడంగు సిబ్బెంపుగ
బ్బిగుబ్బలు గనుంగొని స్వబంధుచక్రమిథునంబులు వారిచేతం
బట్టుపడెనని తలంచి తమ్ముం బట్టుకొందురో యను శంక పుట్టి కోకిల
నికాయంబులతోడ నెగసి పెరచోటులకుం జని యచ్చట భయం
బు దక్కి చక్కెరవిలుకానికేళిం దేలుచుం దమబాంధవుండగు మా
ర్తాండునిం బొగడు పడుపున రుతంబులు సేయుచుఁ దోయంబుల
మునింగి తేలుచు నభిమతిగతుల వర్తించు చక్రవాకంబులవల
నను, నికటనిసితరుమూలకుశాసనాసీనమౌనిరాజులం జూచి నే
ర్చినయవియుంబోలె మునివృత్తి వహించి వనవాసులై స్వచ్ఛత
గలిగి ధ్యానపరాయణంబులై హఠాన్నీరసముత్పతన్మత్తమీనం
బులు రభసంబువ నతిదీర్ఘత్రోటిపుటనికటంబుల వ్రాలిన వానిం
బట్టి కబళించి యదృచ్ఛాలాభసంతుష్టాంతరంగంబుల సుఖించి
మెలంగుచున్న బకంబులవలనను, పునఃపునఃకృతసురతసముదిత
క్లమంబునం దిర్యగావర్తితకంఠంబులై శిరంబులు గరుత్పరంపర
లం గప్పి యేకపాదస్థితిం జెంది తీరభూముల నిదురబోవుచున్న
తఱిం గేళీరతసంయమికన్యకాజనంబులు ఫేనపుంజభ్రాంతిం
దమ్ముం బట్టికొని చన నుద్యోగించునంతలోనం దదీయకరకమల
సంస్పర్శంబునం బ్రబోధంబునొంది, బెదరి బెదరి చూచి యుల్లం
ఘించి తొంటి తమ విహరణస్థలంబుల వ్రాలి జాలింబడు తమ

చుట్టంబులంగలసి ప్రమదంబున సుఖక్రీడలం బొదలు బాతువుల
వలనను, నభిరామంబై నీలకంఠకాళిమచ్ఛాయాదాయాదమేదుర
దళ విసర విలసిత నవకువలయు సమాజసౌరభ్యసంభరితంబును,
పథికజననాసాపుటస్ఫుటతరానందసంధాయక పరిమళమిళత్పరాగ
పుంజమంజుల కంజాత సంజాత మధురమధూళిమాధుర్య రసికమ
ధుకర నిరంకుశ ఝంకార కోలాహలసంకులంబును, సరస సం
గీత సమాకర్ణన సమ్మోదమాన జలదేవతాప్రసాదలబ్ధమధుకరాధీన
తప్తకాంచన పాననషక తర్కోచిత కోకనద విరాజమానంబును,
పాశపాణిపరివృఢ పర్యట త్సాండురాఖండ యశోమండల సం
భావనాస్పద కుముదసముదయ ప్రభాపరిపూర్ణంబును, తీరభూర
మణీయ కుసుమిత బతానికేతన మకరకేతన కేళీరసానుషక్త శబ
రకాంతాపరిశ్రాంతిహరణ ప్రవీణ విమలజలశీకరకిర త్సరసిజరజ
స్సుగంధిగంధవాహంబును, జలవిలోకత ప్రతిబింబ శాఖిశాఖా
గ్ర ప్రత్యగ్రపల్లవగ్రహణార్థ పతిత పరిభ్రాంత పరభృత నిర్వా
హక పంచబాణప్రేరిత మారుతప్రయుక్తనిశ్రేణీకృతకూలపాదప
విశాలశాఖాదళచ్ఛన్నంబును, దావపావకదహ్యమాన కాలాగగు
ధూమమాలికాళికకాళికాలోకనప్రహృష్యన్మదమయూరనట
నానురూప భృంగాంగనాసంగీతభంగిసంగతి సముత్తుంగతరంగ
మృదంగనాదగుంభనకరంభితంబును, మత్తవేదండశుండాదండ
చుళికితప్రోజ్జిత పుష్కరచ్ఛటానిర్వాపిత వనవాతోద్ధూత నభ
చ్ఛుంబినీ బిడాంబుజరాజి పరాగంబును, కోమలశ్యామల బాల
తృణాంకుర చర్వణ సంజనిత పిపాసాపరవశ సమాయాత పీత
విశ్రాంత వాతాయుయూధ సమాశ్రిత సవిధవివిధ పాదపచ్ఛా
యాతలంబును, సుందరారవింద మందిరవిహారదిందిరాసత్కార
కారి వనదేవతా విశ్రాణిత మహోపాయ నాస్తరణారాంకవపట
శంకాకరజలోపరి పరిచ్యుతాను తటప్రరూఢకదంబమంజరీకుసు

మకేసర విసరంబును, వరుణరాజానుచర మకరనికర మత్స్యక
చ్ఛపకుళీర ప్రభుతి సకలజలజంతుసంతాన సంతతసంచార సంకు
లంబును నగుచు, గగనంబుభంగి రాజహంసభరితంబై, విష్ణుజఠ
రంబుగతి భువనపరిపూర్ణంబై, అలకానగరంబు తెఱంగున శంఖ
మకరకచ్ఛప పద్మమండితంబై, క్షీరసాగరంబుమాడ్కి మధురా
మృతస్థానంబై, ఛందశ్శాస్త్రంబువోలె విచిత్రనృత్తశోభితంబై,
దీనార్థిక్రియలఘుజీవనంభై, సాధుజనచరితంబుకరణిపంకరహితం
బై, రథంబువిధంబున చక్రసహితంబై, స్వర్గంబుభాతీవాసద స
మృద్ధిసంపన్నంబై, సుందరీగళంబురీతి జలజభాసురంబై, ధనికభ
వనంబు ప్రకారంబునం గమలాభిరామం బై రాజాస్థానంబుకైవడి
కవివాగ్గుంభితంబై, సముద్రంబువోలెఁ గువలయాభరణంబై, కోణ
పదిగ్భాంబులాగునం గుముదాశ్రితంబై, యొప్పుపంపాసరోవరంబు
గనుంగొని తత్తీరంబున.

48


సీ.

జానకీపతి యొక్కవానరుం గాంచె న
        క్కపియును రాముని గాంచి మ్రొక్కి
యయ్య మీరెవ్వరం చడుగ వానికిఁ దన
        వృత్తాంతమంతయు విస్తరించి
యనఘ నీ వెవ్వండ వనినఁ గౌసల్యాత్మ
        జునకు ని ట్లనియె నవ్వనచరుండు
దేవర యేను సుగ్రీవుని సచివుఁడ
        హనుమంతుఁడనువాఁడ ననిలసుతుఁడఁ


గీ.

జెలిమి మీతోడ సేయంగఁ దలఁచి భాను
సుతుఁడు పుత్తెంచె నన్ను మీ రతనికడకు
వేగ విచ్చేయుఁ డనిన భూవిభుఁడు లెస్స
యనుచు సౌమిత్రియును దాను నచటి కరిగె.

49


క.

ఇనపుత్త్రుని ముద మొప్పం

గనుఁగొని వెస నగ్నిసాక్షికంబుగ సఖ్యం
బొనరించి వాలిం జంపుదు
నని విభుఁడు ప్రతిజ్ఞఁ జేసె నర్కసుతుండున్.

50


వ.

సీతాదేవిం దోడి తెచ్చెదనని ప్రతిజ్ఞ పలికె ని ట్లన్నరేశ్వర వానరేశ్వ
రులు సమయంబుఁ గావించి పరస్పరంబు విశ్వసించి నితాంతసం
తోషసమన్వితులై ఋష్యమూకగిరిశిఖరంబునఁ గూర్చుండి రంత.

51


క.

గిరినిభదుందిభికాయము
బరువడి రాఘవుఁడు జిమ్మె బహుయోజనముల్
చరణాంగుష్ఠనఖంబున
హరిసూనుని మదికిఁ బ్రత్యయము పుట్టుటయున్.

52


గీ

మఱియు నతనికి నమ్మిక మది జనింపఁ
గడఁకతో వింట నొకతూఁపుఁ దొడిగి సప్త
సాలములు నేలఁగూలంగ లీల నేసె
రాఘవుఁ డమోఘతరబాణలాఘవుండు.

53


ఉ.

ఆపటువిక్రమంబుఁ గని యద్భుత మంది దినేంద్రసూతి సీ
తాపతితోడ ని ట్లనియె దక్షుఁడ వీవు సఖుండ వౌటన
న్నాపురుహూతముఖ్యసురలైన జయింపఁగలేరు చిత్తసం
తాపము దీరెఁ బఙ్క్తిముఖదైత్యునిఁ ద్రుంచెద సీతఁ దెచ్చెదన్.

54


క.

అనవుడు రఘునాథుఁడు నె
మ్మనమున ముద ముప్పతిల్ల మార్తాండతనూ
జనిజానుజుసహితుండై
చనియెం గిష్కింధ కపుడు సరభసవృత్తిన్.

55


సీ.

అంతఁ గిష్కంధాగుహాముఖంబున నిల్చి
        రవిపుత్త్రుఁ డగ్రజురాకఁ గోరి
ప్రళయజీమూతంబుపగిది గర్జిల్లె నా
        ధ్వని యాలకించి యవ్వాలి గినిసి

రయమున నంతఃపురంబు వెల్వడి వచ్చి
        యనుజునితోడఁ గయ్యం బొనర్చ
బెట్టిదంబుగ వాలి పిడికిట సుగ్రీవుఁ
        బొడిచినఁ గడునొప్పిబడి తొలంగి


గీ.

చనియె దశరథరాజనందనునికడకు
నమ్మహీజాని సుగ్రీవునరుత నొక్క
సుమమాలిక గదియించి గుఱుతుచేసి
యపుడ పురికొల్పె వెండియు నాలమునకు.

56


వ.

ఇట్లు పురికొల్పుటయు సుగ్రీవుండు కిష్కింధాద్వారంబుఁ జేరి
భూగర్జితంబున వాలిం బిల్చి యతనితోడ బాహుయుద్ధంబు సే
యుచుండె నంత.

57


క.

చాపమున శరముఁ దొడగి మ
హీపతి నిండార దిగిచి హెచ్చిన వీర్యా
టోపమునఁ గూలనేసె భు
జాపటు విక్రమవినోదశాలిన్ వాలిన్.

58


ఆ.

అట్లు వాలి నిహతుఁ డైన కిష్కింధకు
నరిగి సకలవానరాధిరాజ్య
పట్టబద్ధుఁ డగుచుఁ బద్మాప్తనూనుఁ డు
ద్వేలహర్షజలధి నోలలాడె.

59


శా.

అంతన్ భాస్కరనందనుండు కపిసేనాన్వీతుఁడై రామభూ
కాంతాగ్రేసరుపాదసన్నిధికి వేడ్క న్వడ్చి ధీరు న్హనూ
మంతుం బిల్చి ధరాత్మజ న్వెదుక సన్మానంబుతోఁ బంపె న
త్యంతాటోపసమగ్రుఁడై యతఁడు శక్రాదుల్ నుతు ల్సేయఁగన్.

60


క.

వనరాశి దాటి లంకకుఁ
జని సీతం జూచి పవనసంభవుఁ డరయం

బున మరలివచ్చె యాసతి
పనిచినమానికము రామభద్రున కిచ్చెన్.

61


వ.

ఇట్లు హనుమంతుం డిచ్చిన యామాణిక్యంబుం గనుంగొని హర్ష
శోకపరవశుండై యప్పశుపతిచాపభంజనుండు సౌమిత్రిసుగ్రీవాం
జనేయనలనీలజాంబవత్ప్రముఖకపివీరులతోడంగూడి యభిజి
న్ముహూర్తంబునం బ్రయాణంబు వెడలి వివిధగిరిసరిదరణ్యంబులు
గడచి చని ముందట.

62


చ.

కనియె రఘూద్వహుండు కటకస్థలగాఢచరత్కరీంద్రసం
జనితమదప్రవాహపరిసర్పదమందసుగంధసాంద్రమున్
ఘనమణిశృంగగానకలనారతదేవవధూనిషాదని
స్వనరచనాక్రమశ్రవణచండమృగేంద్రము నమ్మహేంద్రమున్.

63


గీ

అమ్మహేంద్రధరిత్రీధరమ్ము గడచి
చక్రతీర్థంబునకు నేగి జనవిభుండు
పొసఁగ నచట వసించె నప్పుడు దశాస్యు
ననుజుఁడైన విభీషణుఁ డటకు వచ్చె.

64


వ.

నలుగురుమంత్రులతో నటకు వచ్చిన యమ్మహాత్మునిఁ జూచి సుగ్రీవు
నకు గూఢచారుండను శంక వొడమి రఘువీరుం డతని హితసము
చితచేష్ట లరసి దుష్టుండు గాఁడని తెలసి సంభావించి యవ్విభీషణు
నకు సకలరాజ్యపట్టాభిషేకంబు సేయించి రవిపుత్త్రు నట్ల మంత్రిప్ర
వరుం జేసి చక్రతీర్థంబు డాసి.

65


క.

చింతింపుచు రామమహీ
కాంతుఁడు సుగ్రీవుఁడాదిగాఁ గలకపిసా
మంతులకు ననియె నీదు
ర్దాంతపయోరాశి యెట్లు దాఁటుద మింకన్.

66


క.

జలనిధి దుస్తర మిక్కపి
బలములసంఖ్యమ్ము లేయుపాయుము మనకుం

గల దియ్యెడ మర్కటసే
నలతోడంగూడి యివ్వనధి దాఁటి చనన్.

67


మ.

అతిగంభీరపయఃప్రపూరము సముద్యన్మత్స్యసంచార ము
ద్దతనక్రగ్రహచక్రఘోరము మహాధావత్కుళీరంబనా
రతవాతాహృతనీలనీరధరవారం బియ్యకూపార మే
గతిచే నిప్పుడు దాఁటువారము వనౌకస్సైన్యముల్ గొల్వఁగాన్.

68


మ.

ప్రళయాంభోధరగర్జితప్రతిభటప్రస్ఫీతనిర్ఘోషదో!
హలమై దుస్సహబాడబజ్వలనగాఢార్చచ్చటాక్రాంతమై
విలుఠద్వీచిఘటాంటుప్రవారణోద్వ్వృత్తాభమై యున్నయి
జ్జలధిం దాఁట నుపాయ మెద్ది దగు నీశాఖామృగశ్రేణికిన్.

69


క.

శతయోజనవిస్తారం
బతిఘోరము తిమితిమింగిలాకర మంత
ర్గతనగ మగునీసరితాం
పతిఁ గడువఁగ వశమె మనకు మతిచే నైనన్.

70


గీ.

తలఁచి చూడంగ విఘ్నుముల్ తరుచు గలవు
పుడమికన్నియ నేరీతిఁ బడయువాఁడ
నధికసంకట మిచట సంప్రాప్తమయ్యెఁ
గార్యసిద్ధి కుపాయంబు గానరాదు.

71


గీ.

అకట రాజ్యంబు గోల్పోయి యడవిఁ జేరి
తండ్రిపోకకు వగచి భూతనయఁ బాసి
యెంతయును గాసిఁబొందితి మంతకన్న
గడుఁబ్రయాసంబు మున్నీరుఁ గడచుతెరఁగు.

72


గీ

నీవు రావణు దెగటార్చి నిఖిలదోష
శాంతికై గంధమాదనశైలమునకు
నరుగుమని మున్ను గుంభజుం డానతిచ్చె
నమ్మహామునిభాషణం బనృత మగునె.

73

తరల.

అని పురాంతకచాపభంజనుఁ డానతిచ్చినవాక్యముల్
విని కృతాంజలులై వలీముఖవీరు లర్కసుతాదు ల
య్యనఘశీలునితోడ నిట్లని రయ్య నావలు దెచ్చి సొం!
పెనయఁ దెప్పలుగట్టి దాఁటెద మిమ్మహాలవణాంబుధిన్.

74


వ.

అప్పుడు కపిసేనలనడుమ నిలచి విభీషణుం డి ట్లనియె.

75


క.

శరధిన్ దశరథసూనుఁడు
శరణొందుట సముచితంబు సగరకృతం బీ
కరుణాలయంబు తత్కుల!
పరిపాలకుఁ డగుటఁ దోడుపడు రామునకున్.

76


సీ.

అనవుడు రఘురాముఁ డగచరవీరుల
        నాదరింపుచుఁ బల్కె ననఘులార
తెప్పలచేఁ గపు లిప్పయోనిధి నూరు
        యోజనంబులు తాఁటనోపువారె
పెక్కునావలు గల్గ విక్కపిసేనకు
        వైశ్యులగతి మనవంటివారు
కలములచే నబ్ధి గడతురే గడచునో
        నెడచేసి పగవార లిడుము సేతు


గీ.

రట్లు గావున మీయుపాయంబు నాకు
సమ్మతము గాదు మఱి విభీషణునిపలుకు
మది నింపగుచున్నది మార్గసిద్ధి
కర్థితో నిప్పయోధి నుపాస్తి సేతు.

77


గీ.

పెంపుతో నిట్లు త్రోవఁ జూపింపకున్న
ననలగంధవహత్యుజ్వలాస్మదీయ
భాసురామోఘదివ్యాస్త్రపటలమునకు
నిమ్మహోదధి గురి జేసి యే పడంతు.

78

క.

అని పలికి సానుజుండై
జనకసుతావల్లభుండు శాస్త్రోక్తవిధిన్
వనధికి నెదురుగ నయ్యెడ
ఘనకుశతల్పమున నుచితగతి శయనించెన్.

79


క.

మేదురదర్భాస్తీర్ణమ
హోదధితీరమున రాఘవోర్వీనాథుం
డాదరమున శయనించెన్
వేదిపయి న్వెలుఁగుజాతివేదుఁడుబోలెన్.

80


చ.

సురచిరశేషభోగనిభశోభితసవ్యభుజోపధానుఁడై
నరపతి నవ్యదర్భశయనంబున నొప్పుగఁ బవ్వళించి త
త్పరమతితోడ సాగరు నుపాస్తి యొనర్చుచు నుండఁగా విభా
వరు లొకమూడు సూర్యకులవర్యునకుం గడిచెం గ్రమంబునన్.

81


వ.

ఇట్లు త్రిరాత్రోషితుఁడై నయమార్గంబు వదలక మార్గలాభంబు గో
రి వారాశి నుపాసించిన నతండు మూఢభావంబునం బొడజూపకు
న్నం గోపరక్తాంతలోచనుండై రఘువీరుండు లక్ష్మణునితో ని ట్లనియె.

82


క.

పాయక యమోఘతరమ
త్సాయకనిర్భిన్నమకరసముదయములచేఁ
దోయధి నిరుద్ధసలీలం
బైయుండఁగఁ జేతు నిప్పు డతివేగమునన్.

83


మ.

అనుజా న న్నసమర్థుఁగాఁ దలఁచె నీయంభోనిధానంబు దు
ర్జనుచోట న్సహసంబు యుక్తమగునే సామంబుచే నాత్మద
ర్శన మీనోపఁడు సాగరుండు వెస న- స్మత్క్రూరబాణాగ్ని నీ
తని శోషింపఁగఁజేతుఁ గోతులకుఁ బాదన్యాసము ల్గల్గఁగాన్.

84


ఆ.

మేర మీఱి నిక్కి మిన్నందితరగల
నెలమి యెల్లదిక్కు లాక్రమించి

మొనసియున్న యీసముద్రిని నడఁగింతు
బాణవహ్నిశిఖలపాలు జేసి.

85


క.

భూభారకరసురారిగ
ణాభీలం బైనయీమహాంభోనిధి సం
క్షోభిత మొనరించెదఁ గీ
లాభీకరసాయకానలస్ఫురణమునన్.

86


వ.

ఇట్లు పలికి కోదండపాణియుం గ్రోధపర్యాకులేక్షణుండునై ర
ఘుకులాధ్యక్షుండు త్రిపురసంహరణోద్యుక్తుండగు రుద్రుండువో
లెఁ గనుపట్టి చాపాకర్షణంబుఁ జేసి శరంబులు నిగుడించి జగంబు
లు గంపింప నతినిశితోగ్రవిశిఖంబులు మఱియును సముద్రంబునం
బ్రయోగించిన నవియును బ్రజ్వలింపుచు ఘోరంబులై దశదిశలు
వెలింగింపుచు మహాదానవసంకులంబగు సాగరంబు ప్రవేశించె నం
త సముద్రుండు భీతచిత్తుండై కంపింపుచు దిక్కులేక పాతాళంబు
వలన వెడలివచ్చి కృతాంజలియై రాఘవునిశరణంబుఁ జొచ్చి యి
ట్లని నుతించె.

87


క.

సురబృందసేవ్యములు సుఖ
కరముల హల్యోగ్రశాపఖండనరేణూ
త్కెరకలితములగు నీపద
సరసిజములు గొలుతు రామచంద్రమహాత్మా.

88


సీ.

దండంబు తాటకాతనువిదారణ నీకు
        ప్రణతి కౌశికయాగరక్ష నీకు
శంకరచాపభంజన నమస్కృతి నీకు
        నభివాదనంబు మహాత్మ నీకు
జమదగ్నిసుతగర్వశమన జేజే నీకు
        నంజలి దైత్యసంహార నీకు

కేలుమోడ్పు కృపాలవాలమాసస నీకు
        వందనంబు మునీంద్రవరద నీకు


గీ.

రూఢఖరదూషణత్రిశిరోనిశాట
గహనదహనాయమానభీకరశరాస
ముక్తదివ్యాస్త్రసముదాయ మ్రొక్కు నీకు
శరణు రఘురామ నిఖిలదుర్జనవిరామ.

89


గీ.

రఘుకులంబున దేవకార్యంబు సేయ
నవతరించినవారికి నారాయణునకుఁ
బుండరీకాక్షునకు జగన్మూలమునకు
భక్తిచే మ్రొక్కెదను రామభద్ర నీకు.

90


క.

కోపంబు సంహరింపుము
నీపదకమలములు గొలిచి నిల్చిననన్నుం
జేపట్టుము మ్రొక్కెద నా
చాపలము సహింపు రామ సద్గుఁధామా.

91


వ.

దేవా మహానుభావా! భావజజనక, జనకసుతామనోహర,
హరవిరించి పురందరాది సురపూజిత, జితదానవ, నవజలధరనీల,
నీలకంఠచాపభంజన, జననాదివికారరహిత, హితమితసత్యమృదు
మధురభాషాధురంధర, ధరణీభారహరణార్థకృతావతార, తార
కబ్రహ్మస్వరూప, రూపలావణ్యవిలాసవినిర్జితకోటికందర్ప, ద
ర్పాంధబంధకంధసింధురమృగరాజ, రాజశేఖర, ఖరదూషణాది
రాక్షససంహార, హారకేయూరకిరీటకుండలకంకణాద్యలంకార
శోభతదివ్యమంగళవిగ్రహ, గ్రహరాజవంశాభిరామ, రామ,
నావిన్నపంబుఁ జిత్తగింపుము, నానేరములు సహింపుము. నాప్రా
ర్థనంబుఁ గైకొనుము, నన్ను రక్షింపుమని మఱియు నిట్లనియె.

92


క.

చలువదొర వేయుమోములు
గలిగియు నీగుణము లెన్నఁగాలేఁ డనఁగాఁ

గలితభవద్గుణవర్ణన
మలవియె మావంటిజడుల కాదిమపురుషా.

93


గీ.

భూజలాదిక మగుపంచభూతతతికి
నెద్ది నైజంబుగా రచియించె ధాత
యట్టికట్టడి విడువక ననియునిలుచు
మత్స్వభావ మగాధత్వమహిమసుమ్ము.

94


క.

రాగమున లోభమున భయ
యోగంబున నైన నన్వయోచితధర్మ
త్యాగము కర్తవ్యము గుణ
సాగర యీభాషణంబు సత్యము గాదే.

95


క.

వనచరసేనలు లంకకు
జనుటకు నే నాచరింతు సాహాయ్యము నీ
కని విన్నపంబుఁ జేసిన
జనపతి యిటు లానితిచ్చె జలనిధితోడన్.

96


సీ.

తరుచరవాహినీపరివారములతోడ,
        జనియెద లంక కశంకవృత్తి
నిప్పుడ జనపూర మింకించి తెరువిమ్ము,
        నావు డి ట్లనియె నదీవిభుండు
సావధానుండవై యవధరింపుము దేవ,
        విని సేయవలసిన పని యొనర్చు
మయ్య నీయాజ్ఞ ని ట్లావరించితినేని,
        కార్ముకవిద్యాప్రగల్భులైన


గీ.

ఘనులు నిటువలె నియమింపగలరు నన్ను
గానఁ దరణార్థ మొక్కటి గల దుపాయ
మది వచించెద విశ్వకర్మాత్మజుండు
వానరుఁ డిందు నలుండనువాఁడు గలఁడు.

97

గీ.

శిల్పి సమ్మతుఁ డధికుఁ డనల్పబలుఁడు
హరికులశ్రేష్ఠుఁ డతఁడు నాయందు వైచు
తృణశిలాదారుబృంద మొద్దిక ధరింతు
నదియు దృఢముగ సేతువై యమరియుండు.

98


క.

ఆసేతుమార్గమున సే
నాసహితుఁడవై నిశాటనాథునిపురి క
బ్జాసనవందిత చనుమని
యాసాగరుఁ డరిగె నంత నంతర్హితుఁడై.

99


ఉ.

అంతట జానకీరమణుఁ డంచితబాహుబలున్ నలున్ దృఢ
స్వాంతునిఁ జూచి రమ్ము కపివర్య రచింపుము సేతుబంధ మ
త్యంతదృఢంబుగా జనకునంతటివాఁడవు శిల్పశక్తి న
శ్రాంతవినిర్మలోన్నతయశంబులు జేకురు నీకు నీక్రియన్.

100


చ.

అన విని జానకీపతికిఁ బ్రాంజలియై పలికె న్నలుండు మ
జ్జనకుఁడు విశ్వకర్మ కడుఁజక్కనిమందిరశైలసీమ మ
జ్జననికి ముందు దా వర మొసంగెను మత్సమవీర్యుఁ డైననం
దనుఁడు జనించు నీ కనుచుఁ దామరసప్రియవంశదీపకా.

101


క.

ధీరుఁ డగువిశ్వకర్మకు
నౌరసపుత్త్రుఁడను శక్తి నతనికి సముఁడన్
వారక నే నిర్మించెద
పారావారమున సేతుబంధన మధిపా.

102


సీ.

అని విన్నవించిన విని యన్నరేంద్రుండు
        శుభవాసరంబున శుభముహూర్త
సమయంబునందుఁ గుంజరరాజవదను లం
        బోదరు హేరంబు వేదవేద్యు
నావాహనముఁ జేసి హారిమాణిక్యసిం
        హాసనంబున నుంచి యర్ఘ్యపాద్య

పంచామృతస్నానభవ్యకృత్యము దీర్చి
        గంధం బలంది యక్షతము లొసఁగి


గీ.

లలితదూర్వాంకురంబులు నలినకుముద
చంపకాశోకపున్నాగజాతివకుల
పాటలాదిప్రసూనము ల్బత్తి నొసఁగి
ధూపముల దీపములను సంతుష్టి సలిపి.

103


అనంతరంబ జంబూ రంభా కపిత్థ ఖర్జూర పనస నారికేళ బదరీ
చూతఫల పుండ్రేక్షు గోక్షీర ద్రాక్షారసక్షౌద్రఘృతపాయసమోదు
కాపూప బహువిధభక్ష్యసమన్వితమహోపహారంబులు సమర్పిం
చి సకలోపచారంబుల సపర్య గావించి యనేకప్రకారంబులం
గైవారంబు లొనర్చి గణపతిం బ్రసన్నునిం జేసి.

104


గీ.

అంత మిథిలేశకన్యకాప్రాణనాథుఁ
డచటనున్న మహాదేవినాదిశక్తి
మహిషదానవమర్దిని మహితచరిత
నధికభక్తినిఁ గొల్చి తదాజ్ఞ వడసి.

105


క.

వాణీపతిముఖసురసం
త్రాణైకధురీణమైన తనహస్తమునన్
క్షోణీనాథుఁడు నవపా
షాణస్థాపనముఁ జేసె జలనిధిలోనన్.

106


క.

ఈరీతి సేతుబంధ
ప్రారంభముఁ జేసి రామభద్రుఁడు దవ్వ
త్తీరంబునవల రచితమ
హారమ్యసుభద్రపీఠికాసీనుండై.

107


సీ.

బలవంతు లైనట్టి ప్లవగవీరులఁ జూచి
        సేతునిర్మాణంబు సేయుఁ డనిన

నట్ల వారును గరుడానిలవేగులై
        నలుగడనున్న కానలకు నేఁగి
గిరులును దరులును గిరిశృంగములుఁ దరు,
        శాఖలు దారుపాషాణతతులు
దృణభారములు సారె దెచ్చిన వానిని
        గైకొని యల విశ్వకర్మసుతుఁడు


గీ.

నలుఁడు మున్నీటిపైఁ జేర్చి నిలిపి శిల్ప
సమయపద్ధతి దశయోజనములు పరుపు
నెమ్మి శతయోజనంబులు నిడుపు నమర
సేతు వొనరించె నధికసుస్థిరము గాఁగఁ.

108


క.

బుధులు నుతింపఁగ లవణాం
బుధిపైఁ గట్టించెఁ బదిలముగ రాఘవుఁ డి
వ్విధమున సేతువు లంకా
పథిగానలముఖ్యకీశవర్యులచేతన్.

109


గీ.

ఇట్టి సేతువునకుఁ జని యెట్టిపాప
కర్ములును ముక్తదోషులై ధర్మయుక్తి
నఖిలవాంఛితభోగంబు లనుభవించి
ముక్తిఁ గాంతురు తాపసముఖ్యులార.

110


క.

దానతపోవ్రతహోమవి
ధానంబులచేఁ బ్రసన్నతం జెందఁడు గౌ
రీనాయకుండు సేతు
స్నానంబునఁ జెందుకరణి సన్మునులారా.

111


క.

భానునితేజముతోడ స
మానంబగు తేజమొకటి మఱి లేనిగతిన్
జ్ఞానప్రదమగు సేతు
స్నానమునకు సాటి పుణ్యచయ మున్నదియే.

112

గీ.

రూఢి రఘుపతిచేత నారూఢమైన
నలవినిర్మితసింహాసనంబు గాంచి
మ్రొక్కు నెవ్వాఁడు పులకితమూర్తి యగుచు
నతనికి లభించు మోక్షసింహాసనంబు.

113


గీ.

తనరుఁ బడమటికోణంబు దర్భశయ్య
తూర్పుకోణంబు మెెఱుఁగుడు దుర్గపురము
సేతుమూలంబు లని రెండుఁబాతకార్తి
భంజనసమర్థములు మహాపావనములు.

114


క.

సీతారామునిఁ బరమ
జ్యోతిర్మయు నాత్మ దలచుచు న్మున్నుగ వి
ఖ్యాతశుభహేతువునకున్
సేతువుకు నరులు బ్రణుతి సేయఁగవలయున్.

115


శ్లో.

రఘువీరపదన్యాస పవిత్రీకృతపాంసవే
దశకంఠశిరచ్ఛేద హేతవే సేతవే నమః.


శ్లో.

సేతవే రామచంద్రస్య మోక్షమార్గైకహేతవే
సీతాయామానసాంభోజ భానవే సేతవే నమః.

117


క.

అనుమంత్రములు పఠించుచు
మునుపుగఁ దైర్థికులు సేతుమూలంబుఁ గనుం
గొని సాష్టాంగనమస్కృతు
లొనరింపఁగవలయు భక్తియోగముపేర్మిన్.

118


వ.

ఈప్రకారంబున శ్రీరామునిచేత నిర్మితంబగు సేతుబంధంబున ననే
కకోటితీర్థంబులు గలవు. వానినామంబులు, సంఖ్యయును వాకృ
చ్చి వర్ణింప శేషండును సమర్ధుండు గాఁడు. చతుర్వింశతితీర్థంబు
లు ప్రధానంబులై యుండు. చక్రతీర్థంబును, బేతాళవరదంబును,
పాపవినాశనంబును, సీతాసరంబును, మంగళతీర్థంబును అమృ
తవాపియు, బ్రహ్మకుండంబును, హనూమత్కుండంబును, ఆగ

స్త్యతీర్థంబును, రామతీర్ధంబును, లక్ష్మణతీర్థంబును, జటాతీర్థం
బును, లక్ష్మీసరంబును, అగ్నితీర్ధంబును, చక్రతీర్థంబును, శివతీ
ర్థంబును, శంఖతీర్థంబును, యామునతీర్థంబును, గంగాతీర్థంబును
గయాతీర్థంబును, కోటితీర్ధంబును, సాధ్యామృతంబును, మాన
సంబును, ధనుష్కోటితీర్ధంబును, సేతుమధ్యగతంబులై ప్రకాశిం
చు. వీని లక్షణంబులు వివరించెద. గాలవుం డను మునీశ్వరుఁ
డు విష్ణుపూజాపరుండై దక్షిణతీరసముద్రతీరంబున దపంబు సే
యుచు నొక్కనా డొక్కరక్కసునిచేతం జిక్కుపడి కావవే
యని హరిం బ్రార్తించిన హరిప్రేరితంబై సుదర్శనచక్రం బారక్క
సుం దునిమి యమ్ముని కొనియాడ నేతీర్ధంబున సన్నిహితంబై యుం
డె నది చక్రతీర్ధం బనంబరగె. దానిం దలంచినవారికి గర్భవాసంబు
గలుగనేరదు. సుదర్శనుండను విద్యాధరసుతుండు గాలవముని
కన్యకం గాంతిమతియనుదానిం చూచి కామమోహితుండై కేశాక
ర్షణంబుఁ జేసిన నమ్ముని యలిగి భేతాళత్వంబుఁ జెందుమని శపించె.
నతం డట్ల భేతాళుం డయి కొంతకాలంబు పరిభ్రమించి పుణ్యవశం
బున సేతువుకుం జని చక్రతీర్థసమీపంబునం గల యొకతీర్థంబు
తటంబున నిల్చి తజ్జలశీకరిస్పృష్టగాత్రుండై శాపమోక్షంబు నొంది
దివంబునకుం జనియె. నది భేతాళవరదం బయ్యె. తొల్లి దృఢమతి
యనుశూద్రునకు వైదికకర్మోపదేశంబునం జేసి సుమతి యనువిప్రుం
డు చిరకాలంబు నరకంబు లనుభవించి నీచయోనులం బుట్టి క్ర
మంబున బ్రాహ్మణుం డయి జనించి బ్రహ్మరక్షాబద్ధుం డయ్యె. తద్భే
దంబు సహించక యతనితండ్రి యగస్త్యునిశర ణొంది యాముని
చెప్పినచొప్సున సేతువునకుం బోయి తనపుత్త్రు నొక్కతీరంబున
ముంచె. నందువలన నతండు రక్షోముక్తుం డయ్యె. నాశూద్రుండు
ను బెద్దకాలంబు నరకంబు లనుభవించి గృధ్రంబై పొడమి యొక్క
నాడు తత్తీర్థజలపానంబుఁ జేసి పాపముక్తుం డయ్యె. నిట్లు పాపం

బుల నశింపఁజేయుటఁ బాపవినాశం బన నొప్పె. రాఘవప్రత్యయా
ర్థంబు సీతామహాదేవి వహ్నిప్రవేశంబుఁ జేసి వెడలి వేల్పులు వొగ
డ నొక్కతీర్థంబు నిర్మించి యందు స్నానంబుఁ గావించె. దానివలన
నాతీర్థంబువకు సీతాసరం బనునామంబు గలిగె. నందుఁ గృతాభిషే
కుండై పాకశాసనుండు బ్రహ్మహత్యావిముక్తుం డయ్యె. నిది సీతాస
రోమహిమంబు. మనోజవుం డనురాజు పాపకర్మవశంబున రాజ్య
భ్రష్టుండై యడవులం బడి యిడుములపాలై పరాశరహితోపదేశం
బున సేతువుఁ జేరి మంగళతీర్థంబున మాసత్రయంబు గ్రుంకి మహా
నుభావుండై రిపులం ద్రుంచి యిష్టరభోగంబులు భుజించి శరీరాంతం
బునం గైవల్యంబుఁ గాంచె. నందు సీతారాములు లోకరక్షార్థంబు స
న్నిహితులై యుందురు. సర్వమంగళకారణం బగుట నిది మంగళతీ
ర్థం బయ్యె. హిమవత్పార్శ్వంబున నగస్త్యభ్రాత భూతేశుం గూర్చి
తపంబు జేసినం బ్రత్యక్షంబై విరూపాక్షుండు ముముక్షుండగు
నమ్మునిం జూచి సేతుమధ్యంబున మంగళతీర్థంబుసన్నిధి నొక్కమ
హాతీర్ధంబుఁ గలదు. దానియందు స్నానంబు సేయుము. ముక్తిం బాొం
దెద వని బోధించె. నతం డట్ల యేఁగి మూడేండ్లు స్నానంబుఁ గావించి
యంత ముక్తిం జెందె. అగస్త్యభ్రాత యమృతుండైన కారణం
బున నది యమృతవాపి యయ్యె. తొల్లి బ్రహ్మవిష్ణులకుఁ గలహం
బు జనించె. నయ్యిద్దరినడుమ నొక్కజ్యోతిర్మయలింగం
బుద్భవించె. దానియాద్యంతంబులు చూచినవాఁడ జగత్కర్త య
గునని సమయంబుఁ గావించి హంసవరాహరూపంబులు ధరించి
వారు చని. రందు గోవిందుండు మరలివచ్చి చూడనైతి నని సత్యంబు ప
లికె. నలువ వచ్చి లింగంబుతుదఁ జూచితి నని యనృతంబు పలికె. నది
సహింపక యపూజ్యుండవు గమ్మని విధికి శాపం బిచ్చి నంత బ్రహ్మ
దేవుండు శివుని బ్రార్థించిన బ్రసన్నుండై గంధమాదనపర్వతమం
దు యాగంబు సేయుము. దీన నీకు మిథ్యావాదదోషంబు నశించు

శ్రౌతస్మార్తకర్మంబులుఁ బూజలుఁ గలుగునని చెప్పె. నట్లు బహుయ
జ్ఞంబు లనుష్ఠించి పరమేష్ఠి కృతార్థుం డయ్యె. నయ్యాగస్థలంబు బ్ర
హ్మకుండం బనం బరగె. అందు నఘమర్షణం బొనరించువారును
దత్కుండభసితంబు ధర్మసఖుం డను రాజుపుత్త్రకుండై గురూ
పదేశంబువ సేతువునకుం జని హనూమత్కుండంబుఁ జేరి తీరంబు
నం బుత్త్రకామేష్టి యాచరించి శతభార్యలయందు శతపుత్త్రు
లం బడసి చిరకాలంబు రాజ్యంబు పాలించి పుత్త్రులకు రాజ్యం
బు విభజించి హనూమత్కుండంబుఁ జేరి సభార్యుండై తపంబు జే
సి శివసాయుజ్యంబుఁ గాంచె. నిది హనూమత్కుండప్రభావంబు.
కక్షవంతుండను తాపసుఁడు తొల్లి యుదంకుసన్నిధి సాంగవే
దాధ్యయనంబుఁ జేసి తదుపదిష్టప్రకారంబున గంధమాదనంబున
కేగి అగస్త్యతీర్థంబునం బ్రత్యహంబు స్నానంబు సేయుచు మూఁ
డేం డ్లుండి యంతం దత్తీర్థజలవినిర్గతం బైన చతుర్దంతగజంబు లెక్కి
యమ్మునికుమారుండు మధురాపతియైన స్వనయభూపతిం గాంచి,
యతనిచేత నభినందితుండై యారాజకన్యక మనోరమ యనుదా
నిం బెండ్లియై గృహస్తధర్మంబు లనుష్ఠించె. నిది యగస్త్యతీర్థవైభ
వంబు. కుంభసంభవుని శిష్యుండు సుతీక్ష్ణుండు రామమంత్రో
పాసకాగ్రేసరుం డయ్యెఁ. దత్తీర్థతటంబున రామచంద్రుండు శివ
లింగంబు నిల్పి లోకానుగ్రహార్ధంబుఁ బూజించె. నాసరోవ
రంబునం గృతమజ్జనుండై ధర్మజుం డనృతవచనదోషనిర్ము
క్తుండై రాజ్యంబుఁ బాలించె. నిది రామతీర్థప్రభావంబు. బలభ
ద్రుందు నైమిశారణ్యంబునకుం జని మునులకు నిఖిలపురాణకధలు
వచింపుచున్న సూతుం బ్రమాదంబున వధించి యోగబలంబునం బు
నరుజ్జీవితుం జేసి దోషనివృత్తికై గంధమాదనంబునకుం జని లక్ష్మణ
వినిర్మితం బగుతీర్థంబున మునింగి లక్ష్మణేశ్వరలింగంబు దర్శించి

బ్రహ్మహత్య నశింపఁజేసె. నాతీర్థంబు రోగదారిద్ర్య మహా
పాపకనాశనం. బిది లక్ష్మణతీర్థమహాత్మ్యంబు. రావణుం ద్రుంచి
రాఘవుం డేతీర్థతోయంబున జతక్షాళనంబుఁ జేసె నది జటాతీ
ర్థం బయ్యె. నం దవగాహంబు సేయువారికిఁ జిత్తశుద్ధి సిద్ధించునని
రాఘవుండు వరం బిచ్చె. వరుపుత్త్రుండు భృగుండును, వ్యాససు
తుండు శుకుండును, గురూపదేశంబునం జేసి వచ్చి తజ్జలంబులం
దోఁగి చిత్తశుద్ధి వడసిరి. తజ్జలావగాహమాత్రంబున మనశ్శుద్ధి సం
భవించు. నిది జటాతీర్థాతిశయంబు. తొల్లి కుబేగుం డేతీర్థంబు సేవిం
చి నిధీశ్వరుం డయ్యె నది లక్ష్మీప్రదంబగుట లక్ష్మితీర్థంబున విఖ్యాతి
నొందె. నందుఁ గృతస్నానుండై నలకూబరుండు రంభాసంభోగం
బుఁ గాంచె. ధర్మజుండునుఁ గృష్ణోపదేశంబున నిమజ్జనం బాచరిం
చి పుణ్యవైభవంబువ దిగంతంబులు గెల్చి రాజసూయం బనుష్ఠించి
చక్రవతి యయ్యె. ఇది లక్ష్మీతీర్థసముత్కరంబు. రావణవధానంత
రంబున రాఘవుండు సురమునివానరసమేతంబుగా సేతుమార్గం
బున గంధమాదనంబునకు వచ్చి సీతాశోధనార్థం బెచ్చోట నగ్నిదే
వు నావాహనంబుఁ జేసె నాప్రదేశం బగ్నితీర్థం బయ్యె. నది మహా
పాతకశోధనంబునుం బిశాచత్వాదిమోచకంబును మహాతీర్థం
బను నిది యగ్నితీర్థప్రశంస. పూర్వకాలంబున గంధమాదనశై
లంబున సుదర్శనచక్రంబుఁ గూర్చి యహిర్భుధ్నుం డనుమహర్షి త
పంబుఁ జేసె. నది సహించక రాక్షసు లతని బాధించినఁ దచ్చక్రంబు
వారిం ద్రుంచి మునిరక్షణకొఱకు నిరంతరంబు నేతీర్థంబున ని ల్చె
నది చక్రతీర్థనామంబుఁ బూనె. నిందుఁ గ్రుంకినవారికి గోర్కు
లు లభించు. అంధమూకబధిరత్వాదివైకల్యంబు దొలంగు. నిది చ
క్రతీర్థఘనత్వంబు. జగత్కర్మృత్వాహంకారదూషితుం డగున
జుని పంచమముఖంలు భేదించి శివాంశభవుండు భైరవుండు హ
త్యాదోషనివృత్తికై సర్వతీర్థంబులు సేవించి కాశికిం బోయి యే

కభాగావశిష్టంబగు హత్యాపాపంబుతోడ గంధమాదనంబునకుం
జని శివతీర్థసేవఁ జేసి నిశ్శేషనష్టపాతకుం డయ్యె. నిది శివతీర్థ
ప్రభావంబు. శంఖుండను ముని మున్ను గంధమాదనంబునం దపం
బు సేయుచు స్నానార్థం బచ్చోట నొకతీర్థంబు గల్పించె. న
ది యతనిపేర శంఖతీర్థం బనందగె. తల్లిదండ్రుల నవమానించు
వారునుం గృతఘ్నులును నందొకమారు తానంబుఁ జేసి ముక్తుల
గుదు. రిది శంఖతీర్థమహిమ. చైర్వుండు సంయుగ్వంతుండు,
రైక్వుండు ననుపర్యాయనామంబుల నెగడిన మునివరుండు గం
ధమాదనగిరియందుఁ దపంబు సేయుచుం దనమంత్రబలంబున నచ్చో
టికి గంగాయమునాగయాతీర్థంబుల నాకర్షించి యందు న
భిషవం బొనర్చె. నమ్మహాయోగిప్రసాదంబున నజావశ్రుతియను రా
జు తత్తీర్థత్రయాభిషేకంబుఁ జేసి శుద్ధచిత్తుండై ముక్తిం జెందె. ని
ది యమునాగంగాగయాతీర్థవైభవంబు. రాఘవుండు గంధ
మాదనంబున శివలింగంబు నిల్పి ధనుష్కోటిచేత భూతలంబు భేదిం
చి తద్వివరనిర్గతగంగాతోయంబుల రామేశ్వరు నభిషేకించె.
దానివలన గోటితీర్థం బయ్యె. నందు స్నానంబుఁ గావించి
గంధమాదనంబున నిల్వక తైర్థికుండు మగుడవలయు. నది సకల
తీర్థరాజం. బిది కోటితీర్థమాహాత్మ్యంబు. పురూరవుండను చ
క్రవర్తి సాధ్యామృతసేవఁ గాంచి యూర్వశీసంభోగసుఖంబు ల
నుభవించె. నందు నఘమర్షమాత్రంబున యజ్ఞదానతపోబ్రహ్మ
చర్యాదులవలనం గలుగు సుగతి లభించు. దానిమహిమంబు తొ
లి సనకాదులకుఁ జతుర్ముఖుండు వివరించె. నిది సాధ్యామృతవైభవం
బు. భృగువంశజుండయిన సుచరితుం డనుముని జాత్యంధుండు గావు
నఁ దీర్థయాత్ర సేయ శక్తుండుగాక గంధమాదనంబున శంకరు
నుద్దేశించి తపంబుఁ జేసె. నంత నమ్మునికిఁ బ్రత్యక్షంబై శివుండు వరం
బు వేఁడు మనిన సర్వతీర్థస్నానంబు సేయుట నా కభిమతంబని వి

న్నవించిన పట్ల శంకరుండు సర్వతీర్థంబుల నాహ్వానంబుఁ జేసి
స్నానంబు సేయుమని యాజ్ఞాపించె. నామునియు నట్ల కృతాభిషే
కుండై మహాసుందరమూర్తియై తత్తీర్థంబుఁ గీర్తించె. నందు
స్నానమాత్రంబునం గైవల్యంబు లభించు. శివుండు తన మానసం
బుచేతం దీర్థంబులనెల్ల నాకర్షించెఁ గావున మానసతీర్థాభి
ధానంబునుం గలిగె. నిది మానసతీర్థమాహాత్మ్యం. బింక ధనుష్కో
టితీర్థవైభవంబు వివరించెదఁ. దదీయస్మరణమాత్రంబున బ్రహ్మ
సాయుజ్యంబు గలుగునని యిట్లనియె.

119


సీ.

అంధతామిస్రమహౌరౌరవాదిదు
        ర్గజాతయాతనాఖండనంబు
మహితాశ్వమేధాది బహుధాధ్వరక్రియా
        తతపుణ్యవిభవసంధాయకంబు
భువనాభిసురతు నా పురుషప్రభృతిమహా
        దానఫలోత్కర్షదాయకంబు
బ్రహ్మహత్యాసురాపానహేమస్తేయ
        గురుతల్పగమనాఘకోటిహరము


గీ.

బ్రహ్మచర్యోపవాసాది పరమనిగమ
గమ్యబహువిధపుణ్యలోకప్రదంబు
కామితార్థైకవితరణకల్పతరువు
ధీరులార ధనుష్కోటితీర్థవరము.

120


ఉ.

రావణు నాజిఁ ద్రుంచి రఘురాముఁడు లంకకు న్వభీషణున్
శ్రీ విలసిల్లఁగా నధిపుఁ జేసి సురాసురసిద్ధసాధ్యసం
ఘావృతుఁడై వెసన్ మరలి యంచితభూతిని గంధమాదన
గ్రామముఁ జేరె లోకములు రంజిల సేతుమహాపదంబునన్.

121


సీ.

అంత రామునిఁ జూచి ప్రాంజలియై సత్య
        భాషణుండైన విభీషణుండు

పలికె నోదేవ నీభక్తునివిన్నప
        మవధరింపుము వీరులైన యన్య
మనుజేశులును సేతుమార్గంబువలన లం
        కకు వచ్చి పీడింపఁగలదు గానఁ
జెలఁగి ధనుష్కోటి చేసెడు భేదనం
        బాచరింపుము కరుణార్ద్రచిత్త


గీ.

అనుచుఁ బ్రార్థింప గాకుస్థుఁ డట్ల చేసె
నందువలన ధనుష్కోటి యయ్యె దాని
దర్శనంబున జంతుసంతతికి ముక్తి
గలుగు నవగాహఫల మేమొ తెలియ రామ

122


గీ.

రావ కరచాపకోటినిర్దళితసేతు
రేఖ కైలాసమునకు విరించిలోక
మునకు వైకుంఠపట్టణంబునకు స్వర్గ
మునకుఁ దెఱు వది తాపసముఖ్యులార.

123


వ.

మఱియు బ్రహ్మవిష్ణుమహేశ్వరులును, వాణీలక్ష్మీపార్వతులును,
వసురుద్రాదిత్యవిశ్వమరుదశ్వగంధర్వకిన్నరకింపురుషాదులును
పితృదేవతలును, దశకోటితీర్థగణంబులతోడ ధనుష్కోటితీ
ర్థంబున సన్నిహితులై వసింతురు. దేనమునిగంధర్వాదు లందుఁ
దపంబుఁ గావించి మహాసిద్ధిం జెందిరి. తజ్జలంబులం బితృదేవతాత
ర్పణంబు సేయువారు సర్వపాపముక్తులై సత్యలోకంబునం బూజ
నొందుదురు. భక్తిపూర్వకంబుగా నచ్చోట నొక్కభోజం బిడి
నవారికి అనంతఫలంబు సంభవించు. రేవాతీరంబునం దపంబును,
గంగాతటంబున మరణంబును, కురుక్షేతంబున దానంబును, మ
హాపాతకంబుల నశింపఁజేయు. ఏతత్రయంబును ధనుష్కోటి
యందుఁ బాప్తంబయ్యెనేని ముక్తి నొసంగు. సకలాభీష్టంబులు సి
ద్ధించు. ధనుష్కోటిస్నానం బేకవారంబైన నాచరించినవారికి సి

తాసితసరిత్తోయంబుల నేమి ప్రయోజనంబు. ధనుష్కోటి దర్శిం
చిన ధన్యులకుఁ గాయక్లేశకరంబులగు తపోయాగాధ్యయనతీర్థా
టనంబుల నేమిలాభంబు. ధనుష్కోటితీర్థంబుతోడ సమానంబగు
తీర్ధంబు లోకత్రయంబునం గలుగదు. సత్యంబు చెప్పితి నిది
ధనుష్కోటితీర్ధవైభవం. బీతెరంగున సేతుబంధనిబంధనప్రకారం
బును, చతుర్వింశతితీర్థవైభవంబును సంగ్రహప్రకారంబున మీకు
వివరించితి. సవిస్తరంబుగా వచింప ననేకయుగంబులకైన శక్యం
బుగాక యుండు. నీయుపాఖ్యానంబు సుచిత్తంబుగా విన్నవారికిఁ
జతుర్విధపురుషార్థంబులు సిద్ధించునని సూతుండు చెప్పిన శౌన
కాదిమహామునులు శ్రీరామేశ్వరశివలింగవైభవంబు వచింపుమని
ప్రార్థించిన.

124


మ.

కనకక్ష్మాధరచాపపాపభయహృత్కళ్యాణచారిత్రమి
త్రనిశాధీశకృశానులోచనయనంతప్రస్ఫుటానందచం
దనకుందేందుసితాంగమంగళకరోదంచత్కృపాపాంగభృం
గనవేందీవరనీలకంధరనిరాఘాటప్రభావోన్నతా.

125


క.

తరుణతరశిశిరకరశే
ఖరసరసిజభవశతారకరముఖనిఖిలా
మరమకుటఘటితమణిఘృణి
పరిషద్రుచిరుచిరచరణపంకజయుగళా.

126


మాలిని.

శ్రితకమలపతంగా శ్రీశివాసంయుతాంగా
ధృతతరుణకురంగా దివ్యగోరాట్తురంగా
రతిపతిమదభంగా రాజభాస్వద్రథాంగా
క్షితిరచితశతాంగా చెన్నమల్లేశలింగా.

127

గద్య:- ఇది శ్రీమదుమామహేశ్వర కరుణాకటాక్షవీక్షాపాత్ర,
యేనుగ లచ్చయామాత్యపౌత్ర, తిమ్మనామాత్యపుత్త్ర,
వివిధ విద్వజ్జనవిధేయ, లక్ష్మణకవినామధేయప్రణీ
తంబయిన రామేశ్వరమాహాత్మ్యంబను
మహాప్రబంధము నందుఁ
బ్రథమాశ్వాసము.
శ్రీ. శ్రీ. శ్రీ.

శ్రీరస్తు

రామేశ్వరమాహాత్మ్యము

ద్వితీయాశ్వాసము


మత్సమస్తసుజన
ప్రేమాస్పద భద్రిరాజు భీమయసుత మ
ల్లామాత్య నిత్యవైభవ
క్షేమప్రద పార్వతీశ శ్రీమల్లేశా.

1


వ.

అవధరింపుము శౌనకాదిమహర్షులకు సూతుం డిట్లు శ్రీరామేశ్వర
లింగవైభవంబు వచింపందొడంగె.

2