Jump to content

రామేశ్వరమాహాత్మ్యము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

గద్య — ఇది శ్రీమదుమామహేశ్వరకరుణాకటాక్షవీక్షాపాత్ర,
యేనుగ లచ్చయామాత్యపౌత్ర, తిమ్మనామాత్యపుత్త్ర,
వివిధవిద్వజ్జనవిధేయ, లక్ష్మణకవినామధేయప్రణీ
తం బయిన రామేశ్వరమాహాత్మ్యం బను
మహాప్రబంధమునందుఁ
ద్వితీయాశ్వాసము.

శ్రీ శ్రీ శ్రీ

శ్రీరస్తు

రామేశ్వరమాహాత్మ్యము

తృతీయాశ్వాసము


రుచిరలశజలధిగ
భీరోన్నత భద్రిరాజుభీమాగ్రతనూ
జారాధితచరణ కృపా
పూరిత గురజానపల్లి పురమల్లేశా.

1


వ.

అవధరింపుము శౌనకాదిమహర్షులకు సూతుం డి ట్లనియె.

2


చ.

ఇటువలె రామచంద్రుఁడు మహేశ్వరలింగము నిల్ప నంతటం
బటుజవశాలి యైనహనుమంతుఁడు రౌప్యనగంబునుండి యు
త్కటగతి రెండులింగములు గైకొని వచ్చి కుతూహలంబు ని
వ్వటిలఁగఁ జేరి మ్రొక్కె రఘువర్యునకున్ ధరణీతనూజకున్.

3

క.

ఆవెనుకన్ లక్ష్మణసు
గ్రీవులకున్ మ్రొక్కి యతఁడు గృతమతి సీతా
దేవీసైకతలింగము
శ్రీ వెలయఁగఁ బూజ సేయు శివభక్తినిధిన్.

4


ఆ.

మునిసమేతు రాఘవునిఁ జూచి కోపంబు
గెరలఁ బరమఖేదఖిన్నుఁ డగుచుఁ
దనపరిశ్రమంబు పనిలేక చెడుటకు
వగచి నృపున కనియె వాయుసుతుఁడు.

5


సీ.

కేవలక్లేశభుక్తికి నై జగంబునఁ
        బుట్టినాడను నేను భూతలేంద్ర
యుక్కు మీఱిన పెక్కురక్కసిమూక నే
        ననిలోన ఖిన్నుండ నైతి మిగుల
జగతి నొకానొకసరసిజాతాక్షియుఁ
        గనదుగా నావంటికాన్పు నెచట
భవసాగరంబులోపల మునింగి యనంత,
        బాధల కెల్లఁ బాల్పడితి నహహ


ఆ.

మున్ను సేవ జేసి ఖిన్నుండ నైతిని
కలహభూమిఁ జాల కష్టి నైతి
నమితదుఃఖరాశి నైతి నీచే నవ
మాన మొంది యిపుడు మనుకులేంద్ర.

6


క.

సేవించె భార్యకై సు
గ్రీవుఁడు నిను రాజ్యసిద్ధికి న్సేవించెన్
రావణునితమ్ముఁ డూరక
సేవించితి నేను భక్తసేవథి నిన్నున్.

7


క.

వానరు లనేకు లుండఁగ
నే నాజ్ఞాపించఁబడితి నీచే శివలిం

గానయనార్థము రౌప్యమ
హానగమున కరుగు మనుచు నంబుజనయనా.

18


శా.

కైలాసాద్రికి జానకీరమణ శీఘ్రం బేగి లింగాకృతిన్
నీలగ్రీవుని నందుఁ గానకి తపోనిష్ట న్హామహాదేవునిన్
బాలందూజ్వలమౌళి సాంబశివునిన్ ఫాలాక్షు మెప్పించి నే
హాళిం దత్కృప లింగముం బడసి యయ్యా వచ్చితిన్ గ్రక్కునన్.

19


క.

ఇతరం బగులింగము సై
కతమునఁ గావించె దేవ గంధర్వముని
ప్రతతులతోడన్ సత్య!
వ్రత యిటు బూజింపుచున్నవాఁడవు కడఁకన్.

20


గీ.

దేవ రజితాద్రినుండి తెచ్చినట్టి
యీమహేశ్వరలింగ మిం కేటి కహహ
యవనిలో మందభాగ్యుండ నైననాదు
తనువుభారంబునక యవతార మొందె.

21


ఆ.

ఈదురంతఖేద మేను సహింపఁగాఁ
జాలనయ్య ధరణిపాలతిలక
యేమి సేతు నింక నెచ్చటి కేగుదు
తెలిసి చూడ నాకు దిక్కు లేదు.

22


క.

కావున దేహత్యాగముఁ
గావించెదననుచు నీప్రకారంబున నెం
తే వగచి పుడమిఁ బడి య
ప్పావని గడురోషశోకపరవశుఁ డయ్యెన్.

23


ఆ.

అతనిఁ జూచి మందహాసంబు సేయుచు
సురలు మునులుఁ గపులుఁ జూచుచుండ
మధురభాషణముల మారుతాత్మజుశోక
మెల్లఁ దొలఁగ రాముఁ డిట్టు లనియె.

24

ఆ.

మహిని జాతజాయమానమృతప్రాణి
వర్తనంబు నాత్మవర్తనంబు
నందరంగసీమ నంతయు నెఱుఁగుదు
నెల్లవేళలందు నిద్ధతేజ.

25


ఆ.

పుట్టు వెఱుఁగుచుండుఁ బొలియు నొక్కఁడ నర
కంబు జెందు జనుఁడు కర్మగతిని
పరమపుణ్యశీల పరమాత్ముఁ డెప్పుడు
నిర్గుణుండు సుమ్ము నిత్యమహిమ.

26


సీ.

ఇట్లు తత్వము నిశ్చయించి శోకము మాను
        మగచర వీరనిరంజనంబు
లింగత్రయవిముక్తముం గేవలము నిరా
        శ్రయమును నిర్వికారంబు జ్యోతి
రాత్మకంబును నెనయాత్మను దర్శింపు
        మాత్మబోధనిరోధ యైనశోక
మేల చేసెదవు నీ వెల్లకాలముఁ దత్వ
        నిష్ఠఁ గైకొనుము నిర్ణిద్రవృత్తి


గీ.

ఆత్మచింత యొనర్పు దేహాదికమున
మమత విడువుము ధర్మంబు మట్టుపరచు
మనఘ మానుము ప్రాణపీడనము సాధు
జనుని సేవింపు మింద్రియజయముఁ గనుము.

27


క.

పరనింద సేయకుము హరి
హరముఖ్యసమస్తదేవతార్చనము నిరం
తర మొనరింపుము సుగుణా
కర పలుకుము సూనృతంబుఁ గలకాలంబున్.

28


ఆ.

తాను బ్రహ్మ మగుట తత్వం బెఱుంగమి
బ్రబల మగుచు మోహభరము గ్రమ్మెఁ

బొసఁగ దానియందుఁ బొసఁగె శుభాశుభ
భ్రాంతి నిజమువోలెఁ బవనతనయ.

19


గీ.

శుభము గానిపదార్థంబు శుభమువోలెఁ
గానఁబడు మోహవైభనకలనవలని
భ్రాంతులకు రాగ ముదయించు రాగపాశ
బద్దు లై పుణ్యపాపైకపరతఁ జెంది.

21


క.

సురవిద్యాధరయోనుల
నరిదిగఁ బ్రభవింతు రుగ్రయాతనలకు నా
కర మగునరరముఁ జెందుదు
రరిసూదన మోహవశత నఖిలప్రాణుల్.

21


సీ.

కర్పూరచందనాగరుసుగంధంబు లె
        ద్దాని నంటిన మలం బై నశించు
భక్ష్యభోజ్యదిభవనపదార్థంబు లె
        ద్దాని సోకిన నశుద్ధత వహించు
ధవళదుకూలవస్త్రంబు లెద్దానిసం
        గమున మాలిన్యంబు గడు ధరించుఁ
గలితసుగంధిశీతలజలపూర మె
        ద్దానిసంగతిని మూత్ర మనఁ బరఁగు


గీ.

నట్టిదేహంబు సుఖకరం బగుట యెట్లు
వినుము చెప్పెద నంజనాతనయ నీకుఁ
బరమతత్వరహస్యంబు భవమునందు
జంతువులకును సౌఖ్యలేశంబు లేదు.

22


ఆ.

మొదట జన్మ మొందుఁ బదపడి బాల్యంబుఁ
జెందు జవ్వనంబుఁ జెందు మఱియు
నంత ముదిమిఁ జెందు నంతట మరణంబుఁ
జెందు మరల జనన మొందు నరుఁడు.

23

క.

మానవుఁ డివ్విధమున న
జ్ఞానంబున వనటఁ జెందు సంతత మయ్య
జ్ఞానము దొలఁగిన నుత్తమ
మైనమహాసుఖముఁ జెందు ననిలతనూజా.

24


క.

జ్ఞానమువలనం జెడు న
జ్ఞానము కర్మమునఁ జెడదు జ్ఞానము నబ్ర
జ్ఞానిలయపరబ్రహ్మ
జ్ఞానము వేదాంతవాక్యజనితంబు సుమీ.

25


గీ.

అట్టియెరుక విరక్తుఁ డౌ నట్టిమాన
వునకు నుదయించుఁ గాని యన్యునకుఁ గాదు
జగతి ముఖ్యాధికారికి సంభవించు
జ్ఞానవిభవంబు గురునిబ్రసాదమహిమ.

26


గీ.

అంతరంగస్థితములు కామాదు లెపుడు
విడుచు మానవుఁ డాత్మసంవేది యగుచు
నపుడు బ్రహస్వరూపుఁ డై యమరు నతఁడు
శాంతమానస వినుము కేసరికుమార.

27


క.

మేలుకొనునతని నిద్రా
శీలుని భజియించునతని సితుఁ డగువానిం
బాలిశు నున్మత్తుం గల
కాలముఁ జేకొనుచునుండుఁ గాలుఁడు జనులన్.

28


గీ.

నిశ్చయము సంక్షయాంతముల్ నిచయములు స
ముఛ్రయంబులు పతనాంతములు దలంప
నరయ సంయోగములు వియోగాంతము లగు
జీవితము మరణాంతంబు సిద్ధ మనఘ.

29


క.

పతనమునకంటె ఫలసం
తతులకుఁ బెరచోట భయము దగలనికరణిన్

క్షితిఁ బొడమినజంతువులకు
మృతికంటె భయంబు లేదు మిథ్యావచనా.

30


సీ.

పటుతరస్తంభసంభార మైనగృహంబు
        కాలంబు చన జీర్ణకలనఁ జెంది
నశియించుకరణి నా నానాప్రాణినికరంబు
        వాలాయముగ మృత్యువశత నడఁగు
దినములు రాత్రులు చనచన సర్వమా
        నవుల కాయుష్యంబు నాశ మొందు
నాత్మకు శోకింప నగు నన్యమున కేల
        శోకించెదవు తెల్వి లేక నీవు


గీ.

నెరయఁ బరువెత్తుచున్నవానికిని నిలిచి
యున్నవానికి నైన నాయువు నశించుఁ
దాని సమవర్తియును జనుదాన నిలచు
దూర మరిగియు మృత్యువుతోన మరలు.

31


క.

వళు లుద్భవించు మేనం
దలవెండ్రుక లెల్ల నెరియు దంతము లూడున్
బల ముడుగు శ్వాసకాసము
లలముకొను న్మదిని దేహ మలజడి నొందున్.

32


గీ.

వరదకట్టియ యొకచోట వనధియందుఁ
గలసి యంతట విడిపోవుకరణి దార
పుత్రబాంధవధనపశుక్షేత్రవర్గ
మొక్కచో గూడు నెడఁబాయు నొక్కవేళ.

33


సీ.

చనుచున్న తెరువరిఁ గని త్రోవ నొకతెరు
        వరి నేను నీతోడ వచ్చెదనని
యంత వారిద్దఱుఁ గొంతకాలము గూడి
        చని వెండియును భిన్నసరణి జనిన

పగిది భార్యాసుతప్రభృతులకూటమి
        నశ్వరంబగుఁ గపినాథ వినుము
మేనిపుట్టువుతోడ మృత్యువు జనియించు
        సందేహ మింతయుఁ జెందవలదు


గీ.

భావిమరణంబుఁ దప్పింప బ్రహ్మకైన
నలవి గాదు శరీరిదేహాంతవేళఁ
గర్మవశుఁ డై స్వతంత్రుఁడు గామి నన్య
తనువుఁ గైకొని మునువంటి తనువు విడుచు.

34


క.

కేసరిసుత కలకాలము
వాసం బొకచోటఁ బ్రాణివర్గంబునకుం
దా సమకూడదు కర్మము
చే సర్వజను ల్వియుక్తిఁ జెందుదు రెందున్.

35


క.

ప్రాణంబులు దేహంబులు
పోణిమి చెడు మగుడఁ బ్రభవముల జెందు జగ
త్ప్రాణాత్మజ జన్మము ని
ర్యాణంబుం గలుగనేర దాత్మకు నెపుడున్.

36


గీ.

కాన శోకహరంబు విజ్ఞాన మద్వ
యంబు సద్రూప మమలంబు నైనబ్రహ్మ
మాత్మలో భజింపు మనారతంబు
విగతశోకుఁడ వగుము వివేకధుర్య.

37


గీ.

త్వత్కృతం బగుకార్యంబు మత్కృతంబుఁ
మత్కృతం బగుకార్యంబు త్వత్కృతంబు
లీల నా యొనరించిన లింగపూజ
లీల నీ యొనరించిన లింగపూజ.

38


వ.

కావున నీనామంబున లింగప్రతిష్ఠ గావించిన ముక్తుండ వగుదువు.
హరదత్తం బగుహమన్నామలింగంబు దర్శించి రామనాథేశ్వ

రుం జూచిన నరుండు కృతకృత్యుం డగు యోజనసహస్రదూరంబు
ననైన హనుమల్లింగంబు సంస్మరించి రామేశ్వరునిం దలంచి సా
యుజ్యంబు వడయునరుం డని రాఘవుండు మఱియు ని ట్లనియె.

39


ఆ.

ఆతఁడు చేసినాఁడు యజ్ఞంబులన్నియు
సకలతపము లతఁడు సలిపినాడు
హర్ష ముప్పతిల్ల హనుమదీశ్వరరాఘ
వేశ్వరులను జూచు నెవ్వఁడైన.

40


వ.

హనుమత్ప్రతిష్ఠితలింగంబును, రామేశ్వరలింగంబును, జానకీ
లింగంబును, లక్ష్మణేశ్వరలింగంబును, సుగ్రీవకృతలింగంబును,
సేతుకర్త యగునలుండు నిలిపినలింగంబును, అంగదేశ్వరలింగం
బును, నీలస్థాపితలింగంబును, జాంబవదీశ్వరలింగంబును, విభీ
షణుండు గావించింన రత్నలింగంబును, ఇంద్రాదిదేవతా
ప్రతిష్ఠితలింగంబును, శేషాదినాగరాజపూజితలింగంబును,
నన ద్వాదశరూపంబుల శివుండు సాక్షాత్కరించి రాజిల్లు సా
ర్వకాలంబు నీలింగంబులందు మహేశ్వరుండు సన్నిహితుఁ డై
యుండుఁ గావున పాపక్షయార్థంబు శివలింగస్థాపనంబుఁ గా
వింపుము.

41


క.

కాకున్న మత్ప్రతిష్ఠిత
సైకతలింగంబు కడువెసం దివియుము ధై
ర్యాకర యంతట నిలిపెదఁ
జేకొని నీ తెచ్చినట్టి శివలింగంబున్.

42


క.

లలిఁ బాతాళంబు రసా
తల మతలము సుతలమును వితలలోకతలా
తలములు భేదించి సము
జ్జ్వల మై యీలింగ మమరె వానరముఖ్యా.

43

ఉ.

నేమముతోడ నే నిచట నిల్పినయీశివలింగమూర్తి నీ
సామిని వీకతోఁ దివియఁజాలెడులా వరియున్నవాఁడె సం
గ్రామజయాఢ్య లింగ మిటఁ గైకొని పెల్లగిలంగఁజేయు ము
ద్దామత నీదులింగము ముదంబున నిల్పుము మాను శోకమున్.

44


చ.

అనవుఁడు సంతసంబున దశాననవైరికి మ్రొక్కి యంజనా
తనయుఁడు గ్రక్కునం బెఱికెదన్ సికతామయలింగ మేను రౌ
ప్యనగమునుండి తెచ్చినసమంచితలింగము నిందు నిల్పెదన్
వినకరిలింగసైకతవిభేదన యింబనియే తలంపఁగన్.

45


సీ.

అని విచారము చేసి హనుమంతుఁ డంతటఁ
        దమకంబు మదిని సందడి గొనంగ
సురలును మునులు వానరులు దైత్యులు రఘు
        స్వామి సౌమిత్రియు జానకియును
గనుఁగొనుచుండ సైకతిలింగమూర్తినిఁ
        గరమునఁ గొని యత్నగౌరవమున
లావున నటునిటులాది చలింపంగఁ
        జేయుచుఁ గదలఁగఁ జేయలేక


గీ.

కిలకిలధ్వని సేయుచుఁ గేశవరుఁడు
తోక నిగుడించి రెండుచేతులును బొదివి
యూచి బెరికియుఁ బెకలింప నోపఁడయ్యె
నవనిఫలయుక్త మగునెదురాగ్రహంబు.

46


వ.

అంత.

47


మ.

అమితోదారబలుండు వాయుతనయుం డాలింగము న్వాలపా
శమునం జుట్టి బిగించి తీవ్రముగ హస్తంబుల్ భువి న్మోపి వే
గము నిండారఁగ నభ్రవీథి కెగసెన్ గాఢోద్ధతిన్ భూమిచ
క్రము శైలంబులతో నారణ్యములతో గంపంబు నొందింపుచున్.

48


ఆ.

ఇట్లు గగనవీథి కెగసి రాఘవలింగ
మునకుఁ గ్రోశమాత్రమున నరుండు

పుడమిఁ ద్రెళ్ళి మూర్చఁ బొందె వడంకుచు
శివవిరోధి మేలుఁ జెందువాఁడె.

49


ఆ.

పుడమిఁ బడియె గాడ్పుకొడుకు ముక్కున నోటఁ
గన్నుదోయివలన గర్ణరంధ్ర
ములన పానమార్గమునఁ జాల నెత్తురు
గురిసి నిండి రక్తకుండ మయ్యె.

50


వ.

అంత దేవదానవతపోధననరవానరులు హాహాకారంబుఁ జేసిరి.
రామలక్ష్మణులు సీతాదేవియు నంతరంగంబుల నెంతయుఁ జిం
తింపుచు శోకవ్యాకులత్వంబు నొంది రంత నండఱుం జని ఘూర్ణిత
గాత్రుం డై ధాత్రిం బడి రక్తంబుఁ గ్రక్కుచు మూర్ఛిల్లియున్న
మరున్నందనుం జూచి కపులు పుడమిం బడిరి. జానకీదేవియు వా
త్సల్యంబునం గరపల్లవంబులం దదీయదేహస్పర్శనంబు సేసి తం
డ్రీ నీ కిట్టి దుర్దశ వాటిల్లెనే యని వగచె రాఘవుండు బాష్ప
ధారాకులలోచనుం డై తనతొడమీఁద నతని నిడుకొని కరకమ
లంబుల నెమ్మేను నిమురుచు ని ట్లనియె.

51


క.

దీనుల మగుమము జంపా
కాననమునఁ జూచి మేలుఁ గావించుటకై
భానుజునితోడ సఖ్యము
మానుగఁ జేయించితివి సమంచితవృత్తిన్.

52


క.

అనఘా నిన్నుఁ గనుంకొని
జననీజనకులను బంధుజాతములను బే
ర్కొని తలఁచము నీయుపకృతి,
గొనకొని యెంతని వచింతు గుణరత్ననిధీ.

53


సీ.

బహుయోజనం బైనపాధోనిధానంబు
        తివిరి నాకై దాటితివి మహాత్మ
తలపాతమును దొట్టి దట్టించితివి వీక
        నాకై నగేంద్రు మైనాకు ననఘ

సురగణంబులు మెచ్చె సరసను నాగమా
        తృకను నాపై గెల్చితివి గుణాఢ్య
ఛాయాభిధానరాక్షసిని శిక్షించితి
        వధికదోశ్శక్తి నాకై హరీశ


ఆ.

దినసమాప్తిసమయమున సువేలముఁ జేరి
లంక పొంక మడఁచి శంక లేక
పఙ్క్తిముఖునికేళిభవనంబులోనికి
నరిగితివి మదర్థ మనిలతనయ.

54


క.

వెర వెఱిఁగి రేయి లంకా
పురిలోపల సీత వెదికి పొడ గానక మే
దుర మగునశోకవనమున
కరిగి కనుంగొంటి వచట నవనీపుత్త్రిన్.

55


చ.

కనుఁగొని సాగి మ్రొక్కి మణికల్పితముద్రిక యానవాలుగా
విలయ మెలర్ప నిచ్చి ఘనవేణి యొసంగినమానికంబుఁ జే
కొని సుకుమారచారుసుమగుచ్ఛవిరాజదశోకకాననా
వనిరుహిభంజవంబు బుధవత్సల సేయవె నాకు మేలుఁ గాన్.

56


వ.

అంత.

57


ఉ.

శంక యొకింత లేక బహుసైన్యుల రావణతుల్యుల న్నిరా
తంకబలాఢ్యుల న్విజయధాటి కశీతిసహస్రవీరులం
గింకరనామదైత్యు లని కృతిమదైత్యుల సంగరక్షితిం
బొంక మడంచి యంతకునిప్రోలికి బంపవె వానరోత్తమా.

58


చ.

అనిమొన జంబుమాలినిఁ బ్రహస్తకుమారుని సప్తమంత్రినం
దనుల వధించి పంచపృతనాపరులం బొలియించి దక్షు న
క్షునిఁ దెగటార్చి యంతట నకుంఠితశక్తినిఁ ద్రాళ్ళఁ గట్టి గ్ర
క్కువఁ గొనిపోవ రావణునికొల్వునకుం జని తీవు పావనీ.

59


ఉ.

ఆసభలోన నిల్చి దనుజాధిపువాక్కుల ధిక్కరించి దు
ష్టాసురు లెల్లఁ దల్లడిల నాదట రావణువీడు తండ్రి కెం

తేసఖుఁ డైనవహ్నికి నతిప్రమదంబుగఁ గాల్చి క్రమ్మరన్
భాసురశక్తి దాటితివి పావని నీవు మహాపయోనిధిన్.

60


గీ.

అంత వచ్చితి ఋష్యమూకాద్రికడకు
నివ్విధంబున నాకై యనేకగతుల
ననుభవించినఖేద మోయాంజనేయ
నాకు నీవంటిచుట్ట మున్నాడె యెందు.

61


గీ.

నీవు నిదురింపుచున్నావు నేలమీఁద
నాకు నపరిమితం బగుశోక మొదవఁ
బ్రాణతుల్యుండ వగునీవు బ్రదుకవేనిఁ
బ్రాణములు నిల్చునే నాకుఁబవనతనయ.

62


క.

ఏమిపని నాకు సీతా
సౌమిత్రులచేత భరతశత్రుఘ్నులచే
నేమి మహీరాజ్యముచే
నేమి భవద్రహితసుఖము లేటికి వత్సా.


క.

లెమ్ము హనుమంత భూమిత
లమ్మున నిదురింపనేల లలిఁబల్లవపుం
జమ్మునఁ జేయుము నిద్రా
ర్థ మ్మిప్పుడు నాకు నొక్కతల్పము వత్సా.

64


సీ.

స్నానంబు సేయంగఁ జనియెద నిప్పుడు
        కొని తెమ్ము చీరయుఁ గుండికయును
సురపూజనములకు సురభిపుష్పము లేర్చి
        పొసఁగఁ గోయుము పత్రపుటమునందుఁ
గానలో కే నేగి కందమూలంబు లా
        హారమునకును దె మ్మాదరమున
నజినదర్భాంశుకవ్రజసమాహరణంబుఁ
        గావింపు మాచార మావహిల్ల

గీ.

జగము లభినుతి సేయ నోషధులు తెచ్చి
యన్నదమ్ముల మమ్ము బ్రహ్మాస్త్రబంధ
ముక్తులను జేసినాడవు శక్తి మెఱయ
దాతవును లక్ష్మణప్రాణదాత వీవ.

65


క.

కేసరిసుత యనిమొన నీ
బాసటచే రావణాదిబలముల దైత్యా
గ్రేసరుల గెల్చి లీలన్
భూసుత నతిసాధ్వి మఱలఁ బొందితి సుఖి నై.

66


ఆ.

అంజనాకుమార హనుమంత జానకీ
శోకమునను సకలలోకవినుత
యుచితవృత్తి మము నయోధ్యకుఁ దోడ్కొని
చనక విడిచి నీవు చనుట దగునె.

67


క.

ఓపౌలస్త్యమదాంతక
యోపపనకుమార యోమహోన్నతబాహా
టోపవిరాజిత యోకరు
ణాపర యోవత్స లేచి న న్గనుఁగొనుమీ.

68


క.

అని బహుభంగుల నుపలా
లనవచనము లాడి రఘుకులప్రవరుం డా
తనినోటిమాటలేమికి
వనరుచుఁ గన్నీటఁ దడిపె వాయుతనూజున్.

69


వ.

అంతఁ గొంతసేపునకు మూర్ఛ విడనాడి ప్రబోధంబు నొంది.

70


మ.

కనియె న్మారుతి సర్వలోకపరిరక్షాదక్షు నంభోజులో
చను లీలాధృతమానవాకృతిని విశ్వధ్యేయు నారాయణున్
మునివంద్యున్ రణధూళిధూసరు నతాంభోవాహసంకాశు భూ
తనయాలక్ష్మణవానరాన్వితు మహోదారున్ హరిన్ రాఘవున్.

71


క.

కని రఘువరకరసంస్ప
ర్శన పరిపూర్ణాంగుఁ డగుట జగతీస్థలి నొ

య్యన జాగి మ్రొక్కి మారుతి
ఘనభక్తి దలిర్ప నిటలఘటితాంజలి యై.

72


గీ.

పార్థివలలాము తారకబ్రహ్మనాము
జానకీరాము జలధరశ్యాము నతఁడు
శ్రుతిమనోవారగంభీరసూక్తి గుంభ
దోవాలంబుగ నుతి సేయ దొడఁగె నిట్లు.

73


దండకము.

శ్రీరామవిశ్వస్వరూపా హరీ యాదిదేవా పురాణా గదాహస్తదేవా
మహాపుష్పకాశీనవార్షోల్లసద్వానరానీకసంజుష్టపాదాబ్జనిష్పిష్ట
దుష్టా సురేంద్రా జగద్వాంఛితార్థప్రదా నిర్మలాత్మా సహస్రోత్తమాం
గా సహస్రాంఘ్రిపద్మా సహస్రాక్షనారాయణా రాఘవా భక్త
లోకార్తిహారీ మహీనందనావల్లభా నారసింహా సురారాతిరాడ్భం
జనాసోత్రిమూర్తీ నిశాతాగ్రదంష్ట్రోకృతక్షోణిచక్రా అవక్రో
జ్వలద్విక్రమా శాంబరీ వామనా సిద్ధవంద్యా బలీంద్రారియాగాంతకా
మందరగ్రావధారీ మహాకచ్ఛపా వేదసంరక్షకా మత్స్యరూపా జిత
క్షత్రియా భార్గవశ్రేష్ఠ రాత్రించరధ్వాంత సంతానపంకేజనీబాంధవా
రాఘవా ఛండఫాలాక్షకోదండనిర్భేదనా పార్థివధ్వంసకృద్భార్గవ
త్రాసకారీ అహల్యాసతీశాపసంతాపహృత్పాదపంకేజనా గాయుతో
దారసత్త్వోజ్వలత్తాటకాప్రాణహృత్సాయకా వాలిపక్షశ్శిలాఖండలా
ప్రౌఢదోర్దండమాయాసువర్ణాంగసారంగసద్దర్పహారీ దురంతాఘ
సంతాపహారీ దశస్యందనోర్విశదుఃఖాబ్ధిసంశోషణాగస్త్యరూపా
అనేకోర్మిమాలావలీఢాఖిలాశాంతదుర్దాంతవారాశిగర్వాపహా మై
థిలీమానసాంభోజమార్తాండవిశ్వైకసాక్షీ సరాజేక్షణాభక్తసంర
క్షణాసక్తరాజేంద్రసీతాపతీ తారకబ్రహ్మరూపా వరేణ్యా చిదానం
దమూర్తీ ప్రసన్నార్తిహారీ జగన్నాయకా రామచంద్రా కృపాసా

గరా గాధిపుత్త్రాధ్వరత్రాణదక్షా శరత్కాలచంద్రప్రసన్నాననా
నీలజీమూతసంకాశపుణ్యాకృతీ పద్మగర్భాదిబృందారకానందసంధా
యిలీలావతారా హతారాతిబాహాబలోత్సేకకాకాసురైకాంబకా
దాంతృప్తాంబకా శారదారంభరాకా నిశాకాంతసాహస్రశోభాతి
రస్కారకారిస్ఫురత్కీర్తిసందోహసంఛన్నదిఙ్మండలా మండలాగ్ర
ప్రచండాహిరాజోపహారీ కృతాశేషదోషా చరప్రాణవాతామహా
తాపసస్వాంతహృద్దివ్యసౌందర్యలీలారసాసారసాప్తాత్మజాశేష
కీశాధిరాజ్యప్రదా వేదవేదాంతిసంవేద్యనిర్మాయరూపా మహీతో
యశుప్మానిలాకాశభూతోద్భవా నిర్జితావిద్యయోగీశ్వరోపాస్యఓం
కారమంత్రార్థవిజ్ఞేయభక్తప్రియానంతకళ్యాణచారిత్రషడ్భావ
దూరా కృపాధారచిత్తాంబుజా చండరుఙ్మండలీమధ్యవర్తీ సుధాభా
నుమూర్తీ భుజంగేశశాయీ చతుర్వ్యూహదేహా అనంతావతారా శ
తానందముఖ్యామరప్రార్థితా విశ్వవిశ్వంభరా భారకృద్దైత్యసం
హారకామాదికాంతర్గతారాత్రిజైత్రా సమస్తాశ్రితారామచైత్రా
సితాంభోజనేత్రా ధరిత్రీకుమారీకళత్రా మనోజ్ఞాతసీపుష్పసం
కాశగాత్రా పవిత్రా గుణామత్రకాకుత్స్థవంశాగ్రణీ భక్తచింతా
మణీ నీకు దండంబు నీకుం బ్రణామంబు నీకు న్నమస్కారముల్ నీకు
జేజే నమోవాకము ల్నీకు కారుణ్యదృష్టిం బ్రసన్నుండ వై నన్ను రక్షిం
పవే నిన్ను సేవించెదన్ నిన్ను భావించెద న్నీపదాంభోజదాస్యంబు
గావించెదన్ మ్రొక్కెదన్ రామచంద్రా మధీయాపరాధంబు క్షం
తవ్య మోసామి నామీఁద నీమేదురాంచత్కృపాదృక్ప్రసాదంబు తో
రంబుగాఁ జేసి చేపట్టవే రాఘవా మజ్జనార్చాదిభుక్తిక్రియాజాగరూ
కత్వనిద్రాసుషుప్త్యావ్యవస్తావిశేషంబుల న్నన్ను రక్షించుమీ జానకీ
కాంత వేదాంతవాక్యంబుల న్నిన్ను వాక్రుచ్చఁగా లేవు లోకత్రయి
న్నిన్ను వర్ణింప నెవ్వాఁడు శక్తుండు నిత్యోత్సవా నీమహత్యం బచిం
త్యం బనంతంబు సర్వాత్మకా నీకచంబుల్ మహామేఘముల్ లోక

నాథా సుధాభానుభానుల్ భవన్నేత్రముల్ శేషదృక్కర్ణశాయీ
దిశ ల్నీకుఁ గర్ణంబు లానందకందా కృశానుండు నీమోము దేవేశ్వరా
శారదాదేవి నీజిహ్వ బాణాసనామ్నాయపారీణ నీప్రాణము ల్వా
యువు ల్దానవిద్యానిధీవారిధు ల్నీకుఁ గుక్షిప్రదేశంబు రాజీవపత్రేక్షణా
యంతరిక్షంబు నీనాభి యోగీశ్వరధ్యేయపాదా భవత్పాదముల్ భూ
మి శ్రీకేశవా నీశరీరంబు విశ్వంబు శ్రీరామచంద్రా సముద్రంబునన్
ఫేనపుంజోర్మికాబుద్బుదశ్రేణిచందంబునన్ దేవతిర్యఙ్నరాదిప్రపం
చంబు నీయందు జన్మించు నీయంద యేకీభవించున్ జగజ్జీవనారత్న
బృందంబు సూత్రంబునుంబోలె సర్వంబు నీయం దగు న్సూత్ర మై పొల్చుధ
ర్మాకృతీ నిన్ను నిర్మావమోహున్ విరక్తాత్ము లధ్యాత్మనిత్యుల్ మునీం
ద్రుల్ నివృత్తాభిలాషుల్ జితస్వాంతు లత్యంతనిష్టానిధుల్ భక్తి
యుక్తుల్ వివిక్తస్థలాసీను లాచారవంతుల్ బుధు ల్గాంతురాదిత్యకోటి
ప్రభాతారకాదిత్యచంద్రాగ్నివిద్యుత్సమూహంబు లెచ్చోట తే
జంబు వాటింపఁగాఁజాల వెద్దానధీరుల్ ప్రవేశించి శోకించ రచ్చోట
నీదివ్యధామంబు శ్రీరామచంద్రా కృపాసాంద్ర నీతత్వ మెవ్వారికిన్
నిర్ణయించగ శక్యంబు గాకుండు నే నేమి వర్ణింపఁగా నేర్తు లోలాత్ము
డన్ బాలుఁడ న్గర్వశీలుండ నానేరము ల్పెక్కు లెంచ న్సహించం
దగున్ మ్రొక్కెద న్నిన్ను బ్రార్థించెద వేఁడెదన్ దివ్యపాదార
విందద్వయీదాస్యయోగ్యాత్ముఁ గాఁ జూచి నన్నుం గటాక్షించి రక్షిం
చవే యంచు మదారుమందార భూమీరుహారామరాముం బ్రశంసిం
చి నిర్వంచనప్రౌఢభక్తిన్ జగత్ప్రాణసూనుండు శ్రీజానకీదేవి నీరీతిఁ
గైవారము ల్చేసె శ్రీమైథిలీ నీకు దండప్రణామంబు సర్వాఘసంహారిణీ
నీకుఁ జేమోడ్పు దారిద్ర్యవిచ్చేదినీ నీకు జేజే రుణధ్వంసినీ నిన్ను
సేవింతు భక్తప్రజాభీష్టసంధాయినీ నిన్ను భావింతు ధర్య న్విదేహక్ష
మాధీశకన్య న్బ్రశంసించెద న్రాఘవానంద దాత్రి న్మహీపుత్రిక న్విద్య
నాద్య న్బ్రధానస్వరూప న్శివన్రాణశైశ్వర్యసంహర్త్రి భూతస్సతి
న్భారతిన్ జూనకి న్గొల్చెద న్సత్కృపాదివ్యమూర్తిన్ హరిపేయసి న్బ్ర

హ్మవిద్యం ద్రయీరూపిణిం బార్వతీరూప నాత్మం దలంతు న్బ్రస
న్నావనాంభోరుహన్ లక్ష్మి దుగ్ధాబ్ధిపుత్త్రిన్ బవిత్ర న్భజింతు
న్శశాంకస్వస న్బూజ గావింతు సర్వాంగసౌందర్యసంశోభిని
న్నిన్ను వర్ణింతు ధర్మస్వరూపన్ దయామూర్తి సావిత్రి గాయత్రి
బద్యాలయ న్బద్మపాణి న్సరోజాక్షవక్షస్స్థలీమందిరం జంద్రబింబా
నన న్జంద్రబింజాసనాసీన నాహ్లాదరూప న్మహాసిద్ధసాధ్వి న్సుభ
ద్రప్రదాత్రిన్ ద్రిలోకైకధాత్రిన్ ధరిత్రీకుమారి న్జగత్పావని
న్సీత సర్వానవద్యాంగి నంభోజగంధి న్మహాదేవి వాక్పుష్పపూజా
విధానంబున న్సేవ గావింతు మాతల్లికి న్రాఘవస్వామిదేవేరికి న్సీత
కు న్భక్తజాతంబుమీఁదం గృపాశీతలాపాంగవీక్షాసుధాసార
ముం జిల్కు విన్నాణికి న్నిత్యకల్యాణికి న్నీలజీమూతరేఖాతిర
స్కారకృద్వేణికి న్బారిజాతప్రవాళోల్లసత్పాణికిం దమ్మిపూమే
డలం గ్రీడ గావించు వాల్గంటికి న్వేల్పుప్రోయాళ్ళచే మ్రొ
క్కు గొన్నట్టిదాకన్నెకుం జాళువాప్రోగుజొంపంబుడా ల్తళ్కు
లం జుల్కగాఁ జూచు నెమ్మేనిచాయం జగంబెల్ల నిండించుసీతా
మహాదేవికి న్నీకుఁ బల్మాఱు నే మ్రొక్కెదన్.

74


గీ.

ఇవ్విధంబున హనుమంతుఁ డింపు వెలయ
రామచంద్రుని సీతను బ్రస్తుతించి
సమధికానందసందోహజనితబాష్ప
వారిపూరితహృదయుఁ డై యూరకుండె.

75


క.

మునులార పవనసుతకృత
జనకసుతారామచంద్రసంస్తవపఠనం
బొనరించునరుఁడు గాంచును
ధనధాన్యగజాశ్వసంపదలు మోక్షంబున్.

76


వ.

ఈసీతారామస్తోత్రంబు భక్తిపూర్వకంబుగా నేకవారంబు విను
వారికిం బఠించువారికి నాయుర్విద్యాపుత్త్రవనితాసౌఖ్యంబులు

సిద్ధించు బ్రహ్మవధాదిఘోరపాతకంబులు నశించు. నరకదర్శనం
బు లేదు. సకలమనోరథంబులు ఫలించు. సమస్తక్రతుఫలంబు దొ
రకు నిట్లు వాయునందనప్రార్థితుం డై కౌసల్యానందనుం డతని
కి ట్లనియె.

77


క.

ఎఱుఁగక కావించితి వి
త్తఱి సాహస మీవు హరివిధాత్రాదిసురు
ల్వెఱుపరె మత్కృతలింగముఁ
బెఱుఁగనోపుదురె యసురభీకరమూర్తీ.

78


గీ.

హరుని కపరాధ మొనరించి యవనిమీఁదఁఁ
ద్రెళ్ళి మూర్ఛిల్లితివిగదా ధీరవర్య
యింక నెన్నటికిని బార్వతీశు నెడల
ద్రోహ మొనరింపకుము గంధవాహతనయ.

79


వ.

భవత్పతనస్థానం బగు నేతత్కుండంబు నీనామంబున నిదిమొదలు
గ ముజ్జగంబుల నతివిఖ్యాతం బై వర్తిల్లు దీనియందు మజ్జనమాత్రం
బున మహాపాతకసంఘాతంబు నశించు నని మఱియు ని ట్లనియె.

80


గీ.

శివజటాఘాతసంజాతశీతలోర్మి
గౌతమీనదిసరిదగ్రగణ్యకీర్తి
యశ్వమేధాఖ్యయజ్ఞసహస్రఫల మొ
సంగుఁ దననీట మునిగినజనుల కెల్ల.

81


గీ.

దానికంటెను శతగుణం బైనఫలము
మనుజవరుల కొసంగు నిర్మలతరంగ
యమునయు సరస్వతియు రెండు నమరతటిని
కరణి ఫల మీయఁగా నేర్చు నరుల కెందు.

82


గీ.

భువనపావను లీమూఁడుపుణ్యనదులఁ
గలసి ప్రవహించు నిచ్చోటఁ గపివరేణ్య
యచట నవగాహనమున సహస్రగుణిత
ఫలము సిద్ధించు జనులకు నలఘుమహిమ.

83

క.

ఇమ్మూఁడునదుల నపగా
హమ్మున ఫల మెద్ది గలుగు ననఘా జనబృం|
దమ్మున కీహనుమత్కుం
డమ్మునఁ దత్ఫలము మజ్జనంబున దొరకున్.

84


మ.

మనుజుం డై వసుధన్ జనించియు హనూమత్కుండతీరంబునన్
ఘనభక్తిం బితృకార్య మర్థి సలుపంగా నొల్లఁ డెవ్వాఁడు కోఁ
పను లై పోదురు వానిఁ జూచి పితరుల్పా కారిముఖ్యామరుల్
మునులు న్సిద్ధులు కోప మూనుదురు దన్మూఢాత్ముపై నెంతయున్.

85


గీ.

హానుమతకుండసన్నిధి ననఘులార
జపము హోమము దానంబు సలుఁపడేని
జనునిజీవిత మప్రయోజకము దుఃఖః
భాజనం బగు గడువిష్టపద్వయమున.

86


క.

హానుమతకుండసన్నిధి
నేనరుఁడు తిలోదకంబు లిడు నియతుం డై
వానిపితరు లాజ్యనదీ
పానము సేయుదురు నిజము పలికితి వత్సా.

87


వ.

ఇట్లు శ్రీరామచంద్రుండు పలికినపలుకులు విని సంతుష్టస్వాం
తుం డై హనుమంతుండు వెండికొండనుండి తనతెచ్చినలింగంబు
రఘుపుంగవు నాజ్ఞాక్రమంబున రామనాథేశ్వరునుత్తరంబునం
బ్రతిష్ఠించి కృతార్ధుం డయ్యె హనుమద్వాలవేష్టితసంజాతం బగువ
లిత్రయంబు రామనాథేశ్వరుండు భరించు నిట్లు సేతుమ
ధ్యంబున గంధమాదనగిరిశృంగంబున శ్రీరాఘవుండు శివలింగ
ప్రతిష్ఠాపనంబు చేసినతెరంగు మీ కెఱింగించితి నిది పఠించువారు
ను, విన్నవారును, దురితంబులం బారదోలి శివలోకంబునం బూ
జ పడయుదురని సూతుండు వివరించిన శౌనకాదిమహర్షు లమ్మహా
త్ము కి ట్లనిరి.

88

గీ.

జలజహితతేజ రోమహర్షణతనూజ
రావణుఁడు బ్రాహ్మణుఁడు గాడు రక్కసుండు
వాని దునిమిన నెటువలె వచ్చె భువన
భర్త యగురఘువరునకు బ్రహ్మహత్య.

89


క.

ఇది లెస్సగ వచియింపుము
మది సంశయ మెల్లఁ దీర మా కిపుడు దయా
హృదయ సమస్తార్థవిశా
రదుఁడవు నీ వనఘ బాదరాయణుకరుణన్.

90


వ.

అని యడిగిన సూతుం డి ట్లని చెప్పందొడంగె.

91


క.

వరరుహభవునకు సుతుఁ డై
జనియించెఁ బులస్త్యుఁ డధికశాంతాత్ముం డా
తని కుద్భవించె విశ్రవుఁ
డన విశ్రుతుఁ డైనపుత్రుఁ డసమానుం డై.

92


క.

మునిపుంగవుఁడు పులస్త్యుని
తనయుం డగువిశ్రవుండు ధర్మాత్ముం డై
యునిమిషులకు దుష్కర మగు |
ఘనతప మొనరించె నజుఁడు కౌతుక మొందన్.

93


వ.

అతండు తపంబు సేయుచున్నకాలంబునం గాలాంబుదసంకాశదే
హుండును, హేమనిష్కాంగదధరుండు నగుసుమాలి యనురా
క్షసుండు పాతాళస్థానంబువలన నిర్గమించి నెత్తమ్మి కేలం బూనని
పాలమున్నీటికన్నియం బోని తనచిన్నిముద్దుకన్నియం దోడ్కొని
భూలోకంబున నన్నియెడలం గ్రమ్మరుచుండె నయ్యిందుముఖి
సౌందర్యంబు వర్ణింప నరవిందసంభవునకైన నలవి గాదు.

94


చ.

మినుకుగడానిపైఁడిజిగిమించులచాయయు సంగ్రహించి క్రొ
న్ననఁ గలసౌకుమార్యము ఘనం బగుపద్మసుగంధసారముల్
గొని వనజాతసంభవుఁడు కోమలిమేను రచించె వీనికిం
గనుఁగొనఁగానిదర్శనము కాంతి మృదుత్వసుగంధసంపదల్.

95

గీ.

తరుణినెమ్మోముతోడ సుధాకరుండు
సాటి గాలేక జనితలజ్జాభరమున
శివజటాజూటవనదుర్గసీమఁ జేరె
నబ్జమును ముకుళీభావ మాశ్రయించె.

96


క.

ముక్కు తిలకుసుమ మవురా
చక్కెరకెమ్మోవి భళిరె జక్కవలే పో
చిక్కనిచనుగవ చొక్కపు
చెక్కులజిగి లెక్క సేయ శేషునితరమే.

97


క.

కుందంబులు రదనము లర
విందంబులు కరము లలరు వెండ్రుక లళినీ
బృందంబులు నడకలు కడు
మందంబులు మాట లెన్న మకరందంబుల్.

98


క.

తమ్ములు నయనము లళిపో
తమ్ములు చికురములు పర్వతమ్ముల కనుఁగుం
దమ్ములు గుబ్బలు మరుకుం
తమ్ముల పా ల్గారె బుధులు దానిం గన్నన్.

99


క.

మంజులత నమరి కెంపుల
కెంజాయకు జుఁట్ట మై యకృత్రిమరుచులన్
రంజిల్లి తొగరువాతెర
క్రొంజిగురున మేలు గూర్చెఁ గొమ్మకు భళిరే.

100


గీ.

మేలు గలవాలుగల గెల్వఁజాలువాలు
వాలుగన్నులు నిజరుచిజాలకలనఁ
దరుణహిమకరరేఖ నుద్ధతిని గ్రమ్ము
తరుణిఫాలంబునవఘనస్ఫురణమహిమ.

101


సీ.

మాలూరఫలముల మేలుచూరలు పట్టి
        కందుకంబులతీరుఁ గ్రందుపరచి

నెత్తమ్మిమొగ్గలబిత్తరంబు భ్రమించి
        చక్రవాకస్ఫూర్తి నాక్రమించి
కుసుమగుచ్ఛంబులపస హసింపఁగఁజాలి
        భర్మకుంభములఁ జేపట్ట నేర్చి
మత్తవారణకుంభమహిమంబు ఛేదించి
        యలఘుపర్వతలీలఁ జులకఁ జూచి


గీ.

బాహుమూలంబు లొరయుచు బలసి పొగరు
కొని విజృంభించి యొప్పులకుప్ప లగుచు
మేలువట్రువసిబ్బెంపుమెఱుఁగుగుబ్బ
చన్ను లలరారె నల శరచ్చంద్రముఖికి.

102


క.

లలితాధరమధురసుధా
రలు గ్రోలఁగఁ దలఁచి సుందరం బగునాభీ
బిలము వెడలివచ్చినచీ
మలబా రన రోమరాజి మగువకుఁ దనరెన్.

103


క.

సురకన్య లసురకన్యలు
గరుడోరగయక్షరాజకన్యలు నరకి
న్నరకన్య లెందరైనను
గరిగమనకు దనుజరాజకన్యకు సరియే.

104


క.

మొగముసిరి గళముతీరును
బిగిగుబ్బలబెడగు నడుముపేదరిక మహో
తగ నింతింతని తెలుపఁగ
నగునే నలుమోముదమ్ములయ్యకు నైనన్.

105


క.

అని పొగడఁదగిన చక్కన
తనకన్నియితో సుమాలి తగ భూలోకం
బున మెలఁగుచు నొకచోటం
గనుగొని వైశ్రవణుఁ బుష్పకస్థుఁ గుబేరున్.

106

ఆ.

కని కుబేరసముఁడు తనయుండు మనలకు
దొరికెనేని వెరపు దొరఁసి వృద్ధిఁ
జెందఁగల మటంచుఁ జింతించి తనకూఁతుఁ
బిలిచి యిట్టు లనియెఁ బ్రేమ గులుక.

107


గీ.

అమ్మ కైకసి సంప్రాప్త మయ్యె నీకు
నిండుజవ్వన మటు గాన నిన్ను పరున
కెవ్వనికి నైనఁ దగువాని కీయవలయు
నెవ్వఁడు వరించునో కాని యెఱుఁగరాదు.

108


క.

తగుమగనికిఁ బడుచు నిడం
దగు ని ట్లిడకున్నఁ గన్నతండ్రికి దుఃఖం
బగుఁ గాన నాడుబడుచుల
జగతిం గనువారి కెల్ల సౌఖ్యము గలదే.

109


ఆ.

ఆదిలక్ష్మికరణి నన్నితెరంగుల
దొడ్డదాన వమ్మ బిడ్డ నీవు
తగరు మీర లనుచుఁ దెగడుదు నని యెట్టి
వారు వెరచి యడుగరారు నిన్ను.

110


ఉ.

కావున సన్మునిం గనకగర్భునిపౌత్రుఁ బులస్త్యపుత్త్రు భూ
దేవుని విశ్రవుం జరమధీరు గుణాకరు నీవ యేగి స
ద్భావమున న్వరింపుము శుభంబుగ నీకుఁ గుబేరసన్నిభుల్
శ్రీ వెలయం గుమారులు ప్రసిద్ధులు గల్గెద రబ్జలోచనా.

111


క.

అని పలికిన నవ్వాక్యము
విని కైకసి మందహాసవిలసితముఖి యై
వినయమున నట్ల యగుఁ గా
కని మనమున సమ్మతించి యంచితబుద్ధిన్.

112


వ.

అంత.

113


క.

బాలారత్నము సాయం
కాలంబున జనకునాజ్ఞఁ గైకొని తగ న

ప్పాలస్త్యుబర్ణశాలకు
లీలావతి చనియె హంసలీలాగతులన్.

114


క.

చని మునిచెంగట లజ్జా
వనతాననకమల యగుచు వనితామణి యొ
య్యనఁ జరణాంగుష్ఠాగ్రం
బున నవని లిఖించుచుండె ముద మెద గదురన్.

115


క.

ఆసమయంబున నంబురు
హాసనకులదీపకుఁడు హుతాశననిభతే
జోసహ్యుఁ డగ్నిహోత్ర ము
పాసించెన్ విశ్రవుం డుదంచితనిష్ఠన్.

116


వ.

అనంతరంబ.

117


మ.

కనియెం జెంగట విశ్రవుం డపుడు రాకాచంద్రబించాననన్
ఘనవేణిం బికవాణిఁ గుందరదన న్నవ్యప్రవాళాధరం
దనుమధ్య న్మదకుంభికుంభపృథులోద్యద్బాహుకూలంకష
స్తనభారానమితాంగి హంసగమనన్ దైతేయకన్యామణిన్.

118


క.

కని సొగసులగని యగున
ద్దనుజేంద్రకుమారిచక్కదనమున కెంతే
మనమున నచ్చెరువడి యా
ముని మొగమున నలతినగవు మొలువం బలికెన్.

119


క.

లలనా తెలియం బలుకుము
పొలయలుక వహించి వల్లభున్ మొరగి వన
స్థలిలోన డాగ వచ్చిన
వలరాయనిసతివొ కాక వనదేవతవో.

120


గీ.

తరుణి యెవ్వానిముద్దుకూఁతురవు నీవు
వచ్చి తెచ్చటినుండి నీ విచ్చటికిని
యేమి కార్యంబుఁ దలఁచి నీ విందు నిలచి
తెఱుఁగఁ బల్కుము నిజముగా నిందువదన.

121

ఉ.

నా విని యావినీలకచ నమ్రత నంజలి సంఘటించి మ
ద్భావ మెఱుంగఁజాలుదువు భవ్యతపోమహిమంబునన్ జగ
త్పావన యేను కైకసినిఁ దథ్యము సుమ్ము సుమాలికూఁతురన్
వావిరి నీదుసన్నిధికి వచ్చితి మద్గురునాజ్ఞచొప్పునన్.

122


క.

మిగిలినకార్యం బెఱుఁగం
దగుదువు నీదివ్యదృష్టిఁ దాపస యని
మ్మగువ వచించిన న ట్లా
త్మగతంబున నెఱిఁగి తపసి మానిని కనియెన్.

123


సీ.

కేకసి నీమనోగతవాంఛ యెఱిఁగితి
        పుత్రలాభముఁ గోరి పొసఁగ నిపుడు
ననుఁ జెందితివి నీవు ననబోఁడి తెలియంగ
        వివరింతు లెస్సగా వినుము క్రూర
మైనసాయంసమయమున నిప్పుడు నన్ను
        వరియించితివి పుత్త్రవాంఛఁ గాన
దారుణాకారుల దారుణశీలురఁ
        గ్రూరకర్ములఁ బాపకుటిలమతుల


గీ.

దారుణాభిజనప్రియతముల సుతుల
రక్కసులఁ గాంతు వనిపల్క మ్రొక్కి కేలు
దమ్ములు మొగిడ్చి నొసల నందముగ నిలిపి
పలికె ని ట్లని తపసితోఁ గలువకంటి.

124


క.

మునికుంజర నీవలనం
దనయుల నీదృశులఁ గాంచఁ దగునే యన న
మ్ముని యనియె మత్కులోచిత
ఘనమతి యగుకొడుకు గలుగుఁ గడపట నీకున్.

125


గీ.

వాఁడు ధార్మికుఁ డతిసాధువర్తనుండు
సర్వశాస్త్రార్థతత్వవిశారదుండు

శాంతచిత్తుండు సద్గుణశాలి యతఁడు
కంబుంభకంఠి మది సంశయంబు వలదు.

126


వ.

ఇట్లు దివ్యజ్ఞానసంపన్నుండును, మహానుభావుండును, బ్రహ్మర్షి
శేఖరుండును, షడ్గుణైశ్వర్యశాలియు నగువిశ్రవుండు సుమాలి
కన్య యగునక్కైకసికిం జెప్పి దానిం బరిగ్రహించె నవ్వరారో
హయు సౌహార్దతియు, సౌందర్యవతియు, సౌభాగ్యవతి
యు నై విశ్రవునిడెందంబున కానందంబు సంపాదింపుచు నభిమత
సముచితోపచారంబులు గావింపుచుండె నంత నయ్యింతికిం గతి
పయకాలంబునకు గర్భంబు నిల్చిన.

127


సీ.

ఎనలేనివలిగుబ్బచనుమొన ల్నలు పెక్కె
        సొగసుసైకపుగౌను జూడనయ్యె
గలికికన్నులయందుఁ దెలిడాలు రెట్టించె
        వెలిదమ్మిపోలికె నలరె మోము
కడునల్ల నగుచు నేర్పడియె లేనూగారు
        తరుచు కోరికలు డెందమున మొలిచె
నోపిక లేక నిట్టూర్పు లగ్గల మయ్యె
        నెమ్మేనఁ జెమట లుగ్ర గమ్మె సారె


గీ.

పొదలె నెంతయు నలయిక నిదుర మించె
నడరెఁ గూర్కులు నడకలు జడను పడియెఁ
దళుకురెప్పలు సోమరితనముఁ బూసె
నెగడె నొకచెల్వుప్రొద్దులు నిండె సతికి.

128


వ.

అంత.

129


మ.

కనియెం గైకసి పుత్త్రు నున్మదు మహాకాయున్ మహోగ్రున్ దశా
నను వింశద్భుజకాండుఁ గృష్ణవదనుం దామ్రాధరున్ భీకరున్
ఘనదంష్ట్రాన్వితు భూమిభారకరు రక్తశ్మశ్రుకేశు న్మదాం
ధుని లోకాంతకు నాదితేయవినుతున్ దుర్వర్తనున్ రాక్షసున్.

130

గీ.

వాఁడు రావణుఁ డన దశవదనుఁ డనఁగ
నామము వహించె నంత నన్నలినముఖికి
కుంభకర్ణాహ్వయుం డైనకొడుకు వొడమె
నంత రాకాశి శూర్పణఖాఖ్య పుట్టె.

131


క.

అంతట నుదయించెను గుణ
వంతుఁడు శాంతుండు ధర్మవర్తనుఁడు దయా
వంతుఁడు విభీషణాఖ్యుఁ డ
నంతసమాఖ్యుండు పశ్చమాత్మజుఁ డగుచున్.

132


వ.

దశగ్రీవాదులైన వీరు విశ్రవునిపుత్రు లది కారణంబుగ రావణకుంభ
కర్ణవధంబున నక్లిష్టకర్ముం డైనరామునకు బ్రహ్మహత్య ఘటించె నది
గావునం దద్దోషశాంతికొఱకు రామేశ్వరలింగప్రతిష్టాపనంబు
గావించి శ్రీరామచంద్రుండు కృతార్ధుం డయ్యె నిట్లు రామునకు
నిచ్చోట బ్రహ్మహత్యామోక్షం బయ్యె నిది బ్రహ్మహత్యావిమోచ
నం బనుతీర్థం బయ్యె నందు నవగాహనంబుఁ గావించిన బ్రహ్మహత్యా
వినాశనం బగు రావణుండు ఛాయారూపంబువ నచ్చోట నేటికిం
గానంబడుచుండు.

133


గీ.

దానిముందట నొకమహత్తరబిలంబు
గలదు పాతాళమార్గ మాబిలమునందు
రావణవధప్రసక్త యౌ బ్రహ్మహత్య
నుండుఁట్లుగఁ జేసె రఘూద్వహుండు.

134


ఆ.

ఆబిలంబుమీద నమరంగ దుట్పొపం
బొక్కటి చెవియందు నుచితరీతి
కాలభైరవుని నఖండితశాసను
నిలిపె రక్షకొఱకు నృపవరుండు.

135


గీ.

భైరవునిశాసనంబున భయముఁ జెంది
దారుణోద్యోగ మెడలి యెంతయుఁ గృశించి

యాగభీరబిలంబున నణఁగియుండె
బ్రహ్మవిదులార రావణబ్రహ్మహత్య.

136


సీ.

శ్రీరామనాథుదక్షిణమున ననిశంబు
        నిండువేడుకతోడ నుండు గౌరి
యుభయపార్శ్వములందు నుండి సేవింతురు
        భక్తిచేఁ జంద్రుండు భాస్కరుండు
మ్రోల వహ్ని వసించు ముదమునఁ దూరుపు
        మొదలైనదిశలందు గదిసి వరుస
నమరనాయకముఖ్యు లష్టదిక్పాలకుల్
        వర్తింపుదురు హృష్టవదను లగుచు


గీ.

భవునితనయులు గణనాదబాహులేయు
లిద్దఱు భజింపుచుందు రహీనభక్తిఁ
బరమమాహేశ్వరులు వీరభద్రముఖులు
తగినయెడల వసింతు రాదరముతోడ.

137


భుజంగప్రయాతము.

సుర ల్పన్నగుల్ దాపసుల్ చారణు ల్కి
న్నరు ల్సిద్ధసాధ్యాదినాకౌకసుల్ ద
త్పరత్వంబున స్సంతతప్రీతి రామే
శ్వరుం గొల్తు రష్టార్థసంసిద్ధి కర్థిన్.

138


క.

సరయూయమునాగంగా
సరస్వతు ల్రామనాథు జగదారాధ్యుo
బరమేశు సేతువునఁ ద
త్పరత భజించున్ స్వకీయపాపచ్యుతికిన్.

139


గీ.

భువనగురు రామనాథునిఁ బూజ సేయు
పూజకులశ్రోత్రియుల విప్రపుంగవులను

నెమ్మి రామేశ్వరంబున నిలిపి రాము
డొసఁగె వారికిఁ గ్రామంబు లురుధనంబు.

140


నైవేద్యారము రామచంద్రుఁ డొసఁగెన్ నానావిధగ్రామముల్
దేవగ్రామమణి రామలింగమునకున్ దేదీప్యమానంబు లౌ
గ్రైవేయాంగదరత్నకుండలపరిష్కారావళుల్ చంద్రికా
ధావళ్యాపహనద్దుకూలపటముల్ దాల్చంగ నిచ్చెం గడున్.

141


వ.

ఈయుపాఖ్యానంబు వినినవారికిఁ బఠించినవారికి సకలపాపక్ష
యకరం బగు. శరీరాంతంబున హరిసాయుజ్యంబు సిద్ధించునని సూ
తుండు శౌనకాదిమహర్షులకు వివరించె.

142


మ.

కరుణాసాగర కామదర్పహర లోకత్రాణదీక్షాధురం
ధర గర్వాంధజలంధరాంధకమహాదైతేయసంహార ని
ర్జరసంసేవితపాదపద్మ మునిరాజస్వాంతరాజీవ సం
చిందిందిందిర యిందుశేఖర సదాచారప్రతిష్ఠాపకా.

143


క.

పుష్కరలోచనలోచన
పుష్కరపూజావిధాన భూషితచరణా
పుష్కరభవముఖమందుర
పుష్కరనిధిరాజతూణభువనధురీణా.

144


పృథ్వీవృత్తము.

ధరాధరసుతాపయోధరవివిక్తకస్తూరికా
స్ఫురత్ప్రచురవాసనా సురభితోరుదోరంతరా
శరిశ్చరదసత్సంధా శరదరేందుమందాకినీ
సురద్రుమమరాళభాసురశరీరగౌరీచ్ఛవీ.

145

గద్య— ఇది శ్రీమదుమామహేశ్వరకరుణాకటాక్షవీక్షాపాత్ర,
యేనుగ లచ్చయామాత్యపౌత్ర తిమ్మనామాత్యపుత్త్ర,
వివిధవిద్వజ్జనవిధేయ, లక్ష్మణకవినామధేయప్రణీ
తంబయిన రామేశ్వరమాహాత్మ్యంబను
మహాప్రబంధమునందుఁ
దృతీయాశ్వాసము.

శ్రీ శ్రీ శ్రీ

శ్రీరస్తు

————

రామేశ్వరమాహాత్మ్యము

చతుర్థాశ్వాసము


మల్లనమంత్రిమనః
కామితఫలదాయికల్పకద్రుమశుభకృ
న్నామగురుజానపల్లీ
ధామా మల్లేశలింగ ధరణిశతాంగా.

1


వ.

అవధరింపుము శౌనకాదిమహర్షులకు సూతుం డి ట్లనియె.

2


క.

అవనిసురులార యిప్పుడు
వివరించెద నేను మీకు విస్పష్టముగా