Jump to content

రామాయణ విశేషములు-8

వికీసోర్స్ నుండి

9

వాల్మీకి భూగోళము

పురాణములను పరిశోధించువారు రెండుమూడు విషయములను గమనించియుండవలెను ఈ కాలములో పట్టపరీక్షలకు సెలెక్షన్సు ఎటులో, నూరు సంవత్సరాలక్రిందట బాలశిక్ష తెనుగుబాలురకెటులో, అటుల ప్రాచీనకాలమందు పురాణములు చదువను వ్రాయను నేర్చిన వారికి పనికివచ్చుచుండెను. వాటిలో రాజుల చరిత్ర, దేశాలచరిత్ర, కన్నంత విన్నంత ప్రపంచ భూగోళము అనగా ఏషియాఖండ భూగోళము, నీతిమతవిద్యలు (Ethics & religion), రాజశాస్త్రము (Politics), లలితకళలు (Fine arts), జ్యోతిషము, ధర్మశాస్త్రము చేరి యుండెను. అవి విజ్ఞానకోశములుగా సిద్ధమయ్యెను. కాలము మారేకొలది పురాణాలనుకూడా పెంచుతూవచ్చిరి. ఆ పెంచుటలో తర్వాతివారికి పూర్వుల భూగోళజ్ఞానము లేకపోయెను. సముద్రయాన మాగిపోయెను. హిందువులు ఇంటిపట్టు (insular) వారైరి. ఇతర దేశముల యొక్కయు, అందలి స్థలముల యొక్కయు, జనులయొక్కయు విశేషములను అర్థము చేసుకొనలేక శబ్దసామ్యముచేత కల్లలు కథలు పెంచి అడ్డాదిడ్డిగా వ్రాసిరి. శబ్దసామ్యమువలన నేర్పడిన కల్పనలను ఈ ప్రకరణములో కొన్నింటిని చూపించినాను. రెండవ దేమనగా కులాలు బిగిసిపొయ్యేకొద్ది ఉచ్చనీచ తలను పురాణాలద్వారా ప్రచారము చేసిరి. పరమతములను దూషించిరి. ఈ విధముగా పురాణాలను దుర్వినియోగము చేసిరి.

మరొక్క విషయమును గమనించవలెను. పురాణాలలోని నానా జాతులను యక్షరాక్షసకిన్నర గంధర్వాది జాతులను గురించి చదివి నప్పుడు వారు ఊర్ధ్వలోకాలలోనో ఆధోలోకాలలోనో యుండినవారని తలపరాదు. వారు భూలోకములోనివారనియే గమనించియుండవలెను. మరియు పైవారేకాక శక, పహ్లవ, హూణ, బర్బరాది జాతులను గురించి చదివినప్పుడు వారు హిందూస్థానములోనే యుండినారని తలపరాదు. వారికై ఏషియాఖండమందును, తూర్పు దీవులందును, ఆఫ్రికాలోని ఈజిప్టునందును, అబిసీనియాయందును, గ్రీకు దేశమందును వెదకవలెను. అనగా మన ప్రాచీనుల భూగోళ జ్ఞానము ఏషియాఖండమంతయును, ఆఫ్రికాలో ఈజిప్టు, అబిసీనియా దేశాలును, యూరోపులో గ్రీసు దేశ మును మాత్రమే. అంతకుమించి వారికి తెలియదనవచ్చును. పాతాళ లోకము అమెరికా అనియు, మయ అను మెక్సికో జాతివారు మయసభ నిర్మాతలగు మయ జాతివారేయనియు ఒక వాదమున్నది. అదింకను స్థిరపడలేదు.

ఈ దృష్టితో పురాణాలను చదువుటవలన మనము చాలా చిక్కు లను విడదీయగలమని తలతును. ఈ దృష్టితోనే నేనీచర్చను చేయు చున్నాను.

మన పురాణాలన్నింటిలో కొన్ని సామాన్యధర్మములు కానవచ్చు చున్నవి. అన్ని పురాణాలలోను వంశావళులు, నీతులు, ధర్మములు, సృష్టిక్రమమును వర్ణించియున్నారు. ఈ సృష్టిక్రమములోనే భూగోళ పరిజ్ఞానము చేరియున్నది. ప్రాచీన కాలములో పురాణకర్తలు తమకు తెలిసిన దేశాలను వర్ణించుటయేకాక తాము ఇతరులవలన విన్న సంగతులను గూడ చేర్చినారు. దధిక్షీరాది సప్తవిధ సముద్రా లుండినట్లు, చిత్రవిచిత్రజాతులు, అనగా యక్షరాక్షసగంధర్వాదు లుండి నట్లును వ్రాసినారు. ఇందు చాలావరకు సత్యమే యిమిడియున్నది. ఇప్పటి కాలమందును ఒక్కొక్క దేశానికి అనేక నామములున్నవి. ఆ కాలమందును విదేశములకు మన పూర్వికులు తమకు తోచిన పేరులను పెట్టి వ్యవహరించిరి టైగ్రిస్ అనెడు నది ఖాల్డియాలోనిది. అది బాణమువలె మహావేగముతో ప్రవహించును. అందుచేత ఆ భాషలో టైగ్రిస్ అనగా బాణము. మన పూర్వికులు శరావతి అను ఒక నదిని పేర్కొనిరి. అది యీ టైగ్రిస్ నదియేయైయుండును. యూఫ్రటీస్ అనెడు నది "యూ - భరతస్" అనున దనియు, భరతునిపేర దానికా పేరు మనవారు పెట్టియుండిరనియు ఒక చరిత్రకారుడు వ్రాసినాడు. ఆక్సస్ నదిని ఇక్షునది అనినట్లున్నది. రెడ్‌సీ అను ఇంగ్లీషు పదమునే మన పూర్వికులు లోహిత సముద్రము అని రామాయణములో వాడినారు. ఆ సముద్రములోని ఎర్రని ఛాయవలన ఈ పేరు వచ్చుటచే మనవారి వలెనే ఇంగ్లీషువారును దానికి “రెడ్‌సీ" (ఎఱ్ఱ సముద్రము) అని పేరు పెట్టి యుందురు. ఇదేవిధముగా యక్ష, రాక్షస, కిన్నర, నాగ, వాన రాది జాతులు మనుష్యులు కానట్టి భూతములు, జంతువులు అని మన పౌరాణికులు పొరపాటుపడిరి. ఆదిపౌరాణికుల కాభ్రమ లేకుండెను. తర్వాత పురాణాలను పెంచినవారికి ఆదికాలపువారికుండు భౌగోళిక జ్ఞానము లేనందున వారిట్టి పొరపాటులు చేసినవారైరి. యక్షాది జాతుల వారందరునూ మనుష్యులే. వీరందరునూ అనార్యులైయుండిరి. ఈ చర్చ “వానర రాక్షసతత్త్వము” అను ముందు ప్రకరణములో చేయుదును. ఇక రామాయణములో వాల్మీకికి తెలిసియుండిన ప్రపంచ భూగోళ మెట్టిదో విచారింతము.

రామాయణములో నాలుగు తావులలో సందర్భానుసారముగా భూగోళ పరిస్థితులు కొన్ని తెలుపబడినవి.

1. శ్రీరాముడు విశ్వామిత్రునితో ఆశ్రమమునుండి జనకరాజు రాజధానివరకు ప్రయాణము చేయుట.

2. భరతుడు తనతాత నగరములోనుండగా అతనిని పిలుచుకొని వచ్చుటకు వెళ్ళినవారి మార్గము, మరియు భరతుడు తన తాతయింట నుండి అయోధ్యకు వచ్చినమార్గము. 3. రాముడు వనవాసార్థమై చేసిన ప్రయాణములు.

4. సీతాన్వేషణమునకై సుగ్రీవుడు ప్రపంచము యొక్క నాలుగు దిక్కులకు తన వానర సైన్యములను పంపునప్పుడు వర్ణించిన భూభాగములు.

ఈ నాలుగున్నూ వాల్మీకియొక్క భూగోళపరిజ్ఞాన మెంతటిదో మనకు తెలుప గలుగుచున్నవి. అందుచేత ఈ నాల్గింటిని వరుసగా విచారింతును.

1. విశ్వామిత్రునితో రామలక్ష్మణులు ప్రయాణమైనప్పుడు అయోధ్యను వదలి సరయూనదిని దాటిరి. తర్వాత సరయువు గంగతో సంగమించు తావును చేరిరి. అదే అంగదేశమని విశ్వామిత్రుడు తెలిపెను. ఆ సంగమ స్థానమున గంగను దాటిన వెంటనే “అవి ప్రహతమును” “ఘోరసంకాశమును” అయిన అరణ్యమును వారు ప్రవేశించిరి. (బాల 24-12). ఇచ్చట గమనింపవలసిన దేమనగా సరయూ సంగమమగు గంగకు దక్షిణతీరమునుండి అరణ్యము ప్రారంభమగుచుండెను. రాముని కాలములో ఆర్యావర్తమున కదొక హద్దుగా కనబడుచున్నది. ఈ విష యము నింతలో చర్చింతును. ఈ యడవిలోనే మలద, కరూశ దేశము లుండెను. వీటిని తాటకియు, ఆమె కొడుకగు మారీచుడును పాలించి జనులను పీడించుచుండిరి. ఈ దేశములను తాటకావనమనియు అనుచుండిరి. దీనిని దాటినతర్వాత సిద్ధాశ్రమమను పేరుగలది యుండెను. ఆ ప్రాంతమందే పూర్వము బలిచక్రవర్తి రాజ్యము చేసి యుండెనట. ఆ సిద్ధాశ్రమమందే విశ్వామిత్రుడుండెడివాడు. ఇది మొదటి ఘట్టము. విశ్వామిత్రుడు కొంతకాలము తర్వాత రామలక్ష్మణులను మిథిలలోని జనకుని ఆస్థానమునకు పిలుచుకొనిపోవు మార్గమును ఇక విచారింతము. మిథిల హిమవత్పర్వత సమీపమందుండెనని తెలిపినారు. సిద్ధా శ్రమమునుండి వారు మొదట శోణనదిని చేరిరి. అచ్చట ఆయిదు పర్వతములుండెను . అందుచేత ఆ ప్రాంతమును గిరివ్రజ మనుచుండిరి. అది మగధ దేశమునకు రాజధాని. దాని కుత్తరమున గంగానదిని దాటి విశాలనగరిని చేరిరి. దాని కుత్తరమున గౌతమాశ్రమ ముండెను. అచ్చటనే అహల్య యుండెను. అటు తర్వాత వారు మిథిలకు వెళ్ళిరి.

2. భరతుని పిలుచుకొనివచ్చుటకు దూతలు పోవుమార్గమును గురించి యిదివరలో కొంత వ్రాసినాను. దానినే యిచ్చట వివరించు చున్నాను. దూతలమార్గ మిట్లుండెను: అయోధ్యకు పడమరగా వారు ప్రయాణముచేయుచు వెళ్ళిరి. మొదట అపరతాల పర్వతము, దానికి దక్షిణోత్తరమున ప్రలంబపర్వతము, తరువాత మాలినీనది, హస్తినా పురము, కురు జాంగల దేశములమధ్యన పాంచాలదేశము. అటుతర్వాత శరదండానది, తర్వాత కుళింగాపురము, ఇక్షుమతీనదిని దాటిరి. తర్వాత బాహ్లిక సుదామ పర్వతములకు మధ్యనుండి దారిబట్టిరి. అచ్చట విపాశా నదిని దాటిరి. అచ్చటికి బహుదూరముననున్న గిరివ్రజమను కేకయ రాజధానిని చేరిరి. ఇంతకుముందొక గిరివ్రజము వచ్చెను. అది మిథిలకు సమీపమందలిది. ఈ గిరివ్రజము ఈరాన్‌దేశము సమీపమందుండినట్టిది. ఇదేవిధముగా భరతుడువచ్చు మార్గమునుకూడా వాల్మీకి వర్ణించి యున్నాడు.

(అభిలాషులు అయో. 71 స. చూడగలరు.)

ఈ సందర్భములో ఒక్కవిషయమును విచారించవలెను. భరతుడు తాత యింటినుండి తిరిగివచ్చునప్పుడు ఐరావతములను బహుమానము లుగా గొనివచ్చెనని వ్రాసినారు. ఐరావతములనిన ఏనుగులని అర్థమని అందరెరిగినదే. దానిపై వ్యాఖ్యాతలు ఇరాపర్వతములలో పుట్టినవి కాన ఐరావతములని పేరువచ్చెనని వ్రాసినారు. ఈ ఇరాపర్వతమెక్కడ నున్నదో? మన మెరిగినంతవరకు ఏనుగులు బర్మా దేశములో సమృద్ధిగా నున్నవి. అచ్చట ఐరావతీనది ప్రవహించుచున్నది. అందుచేత ఏనుగుల కీ పేరువచ్చియుండరాదా? అయితే ఇరాపర్వత మెక్కడనైనా ఉన్నదా అనిన దానిజాడ కానరాదు “ఐరావతవర్షము" అను దేశము ఆర్కిటిక్ మహాసముద్రతీర ప్రాంతమున నుండెననియు, దాని కాపేరు మన ప్రాచీను లిచ్చియుండిరనియు రాయచౌధరీగారు (Geographical knowledge of the Hindus) అను గ్రంథములో వ్రాసినారని మరొక చారిత్రకుడు ఉదాహరించియున్నాడు. కాని అట్టి ఆర్కిటిక్ ప్రాంతపు ఐరావతవర్షములో ఏనుగులు లేనేలేవు. సింధునదీ ప్రాంతాలలో ఏనుగులు విశేషముగా నుండెను. అందుచేతనే పురుషోత్తముడు అలెగ్జాండరుతో యుద్ధము చేసినప్పుడు ఏనుగులబలముతో ఎదిరించియుండెను. సింధునదికి ఐరావతినది ఒక ఉపనదిగా నున్నది. అదే యిందు సూచితమై యుండును.

3. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో వనవాసార్థము అయోధ్యను వదలి గంగను దాటెను ఆ రెంటికినీ మధ్య ఈ క్రింది ప్రదేశములుండెను: అయోధ్యవద్ద సరయూనది, దానికి దక్షిణములో ఉత్తరకోసల, వేదశ్రుతీ నది, గోమతీనది, స్యందికానది శృంగిబేరము, అచ్చట గంగను దాటెను. గంగను దాటిన వెంటనే అరణ్యము మొదలయ్యెను. (ఆయో 52-95). ఈ విధముగా చెప్పుట ఇది రెండవమారు.

గంగ దక్షిణమున వత్సదేశముండెను. గంగాభాగీరధీ సంగమ స్థానమందు ప్రయాగ. దానికి 10 కోసుల దూరములో చిత్రకూట పర్వత ముండెను. (అయో. 54-28). దీనినిబట్టి ఇప్పుడు హంపీవద్ద ఒక చిత్ర కూటమున్నదని చెప్పుచున్నారు. అది వేరనియు, రాముడు నివసించిన చిత్రకూటము ప్రయాగవద్దదే యనియు గ్రహింపవలెను. చిత్రకూటము వద్దనే తమస. అదే వాల్మీకిస్థానము చిత్రకూటమునుండి రామాదులు యమున, కాళిందీ నదులు దాటిరి. చిత్రకూటమువద్దనే మాల్యవతీనదియు కలదు. రాముడు ప్రయాణముచేసిన లెక్కనుబట్టి అయోధ్యకు చిత్రకూటము ఇంచుమించు 5 దినాల ప్రయాణము దూరముండునట్టిది. అటుపై రాముడు దండ కారణ్యమును ప్రవేశించి అందలి "జనస్థానము" అను దేశమందు సంచ రించుచు గోదావరీనది సమీపమందుండు పంచవటిని చేరెను. అచ్చటనే పర్ణశాలను నిర్మించుకొని కొంతకాల ముండెను.

పంచవటి యెచ్చటిది ?

వాల్మీకి రామాయణములో పంచవటి గోదావరికి సమీపములో ఉన్నదని తెలిపినారు.


గోదావర్యా స్సమీపే చ మైథిలీ తత్ర రంస్యతే. (ఆర. 13-21)


అట్లుండగా నాసిక్ ప్రాంతములో ఒక పంచవటి యున్నదని మహారాష్ట్రు లందురు. కాని అది రామాయణ మందుదాహృతమైనది కానేరదు. రాముడు వెళ్ళిన బాటను బట్టి యిప్పుడు భద్రాచలమునకు 20 మైళ్ళ దూరములో పంచవటి యను ప్రసిద్ధినొందిన స్థలమే సరి యైనదిగా కనబడుచున్నది. ఇందూరులోని ప్రసిద్ధులగు యం. వీ. కీబే గారు తాము ఇంగ్లీషుపత్రికలలో వ్రాసిన మూడు రామాయణ వ్యాసముల ప్రతులను నాకంపినారు. అందు ఒకదానిలో వారొక పటమునువ్రాసి అందిట్లు చూపించినారు: "శోణనదికి దక్షిణములో ఇప్పుడు కైమూర్ అనబడు పర్వతము గట్టులున్నవి. వాటికి దక్షిణములో అగస్త్యాశ్రమ మున్నది దానికి తూర్పున పంచవటి కలదు. దాని దక్షిణములో క్రౌంచ పర్వతము, దీనికి దక్షిణములో పంప, కిష్కింధలు కలవు. అచ్చటికి సమీపమందే అమరకంటక పర్వతములు కలవు. ఆ పర్వతములందే లంక యుండెను. అమరకంటక పర్వతాలలో ఇప్పుడు గోండుజాతివారు. న్నారు. వారే ప్రాచీన రాక్షసులు. ఈ లంక నర్మదానది పుట్టుతావున కలదు." దీనినిబట్టి ఈ క్రింది అంశములు తెలియవచ్చును: నర్మద అమరకంటక పర్వతాలలో పుట్టినది. ఆ పర్వతాల కుత్తరమున క్రౌంచము, దాని కుత్తరమున పంచవటియు కలవు. అటైతే రామాయణములో పంచవటి గోదావరికి సమీపమందున్నదని వ్రాసినది తెలిపియున్నానుగదా! ఆ విషయ మబద్దమగునా? కానేరదు. శ్రీ కీబేగారి నిర్ణయము తప్పగు చున్నది.

సీతాపహరణమైన తర్వాత రామలక్ష్మణులు సీత నన్వేషించుచు పంచవటిని వదలి దక్షిణమార్గముగా వెడలి క్రౌంచారణ్యమును దాటి పోయిరి. ఈ క్రౌంచారణ్యము దండకారణ్యమునకు దక్షిణభాగము. ఇచ్చటనే “జనస్థానము” అను దేశముండెను. ఈ జనస్థానములో రాక్షస సంచారముండెను పంచవటి కుత్తరమునుండి జనస్థాన మారంభమగునని తలచవచ్చును. అచ్చటినుండి మరికొన్ని అరణ్యములను దాటుచూ వెళ్ళినతర్వాత పంపాసరస్సు వచ్చెను. అచ్చటనే ఋశ్యమూక పర్వత ముండెను. అచ్చటినుండి ఒక దినప్రయాణములో మహేంద్రగిరి. ఇది రాముని వనవాస భూగోళము.

4. సుగ్రీవుడు సీత నన్వేషించుటకై తన వానరులకు నాలుగు దిక్కులలోని దేశములను గురించి వివరించి చెప్పెను. ఈ భాగమే ముఖ్య మైనట్టిది. అయోధ్యను ముఖ్యకేంద్ర స్థానముగా చేసికొని వాల్మీకి తన కప్పుడు తెలిసినంతవరకు ప్రపంచ భూగోళమునంతయు ఒక్క మారు మనకు సింహావలోకనముచేసి చూపించినాడు దానినిట్లు నిరూపించెను:

తూర్పుదిక్కు

గంగానది, సరయూ, కౌశికీ, యమునా, కాళిందీ, సరస్వతీ, శోణనదులు. శైలకానన శోభితమైన కాలక(వన)ము, బ్రహ్మమాల దేశము, విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ, పుండ్ర, వంగ, కోశ కారుల పట్టణము. అటుతర్వాత సముద్రము, మందర పర్వతము, దానికి తూర్పులో ద్వీపములున్నవి. అందలి జనులు "వికారచిత్రరూపులును, పురుషాదులును" (అనగా మనుష్యులను తినువారును) నై యుండికి. ఆ ద్వీపములలో ముఖ్యమైన వేవనగా, రత్నములకు ప్రసిద్ధికల యవ ద్వీపము, బంగారుగనులుకల సువర్ణరూప్యమను ద్వీపము. ఆ ప్రాంత మందే శిశిరము అను పర్వతమున్నది. ఆ ద్వీపముల కింకను తూర్పున ప్లక్షద్వీపము కలదు. అటు తర్వాత శాల్మలీ ద్వీపమున్నది. ఆ ప్రాంత ములోనే రక్తజలము ఇక్షుసముద్రము క్షీరసముద్రమును కలవు. కట్టకడపట ఉదయ పర్వతమున్నది.

దక్షిణదిక్కు

వింధ్యపర్వతము, నర్మదానది, గోదావరి, కృష్ణ, వరదానది, మేఖలానది, ఉత్కలానది, దశార్ణదేశము, అశ్వవంత నగరము, అవంతీ దేశము, విదర్భ ఋషికదేశము, మాహిషకదేశము, వంగ, కళింగ, కాశిక, దండకారణ్యము, ఆంధ్రదేశము, పుండ్రదేశము, చోళ, పాండ్య, కేరళ, సహ్యాద్రి, కావేరి, మలయపర్వతము, తామ్రపర్ణి, దానికి దక్షిణములో మహేంద్రపర్వతము, దానికి 100 యోజనముల దూరములో లంక కలదు. లంకకు దక్షిణమున 100 యోజనముల సముద్రము దాటిన తర్వాత పుష్పితకమను పర్వతము. తర్వాత సూర్యవంత పర్వతము, వైద్యుత పర్వతము, భోగవతీ నగరము, ఋషభ పర్వతము, తర్వాత పితృలోకము.

పడమటిదిక్కు

సురాష్ట్రదేశము, బాహ్లికము, తర్వాత కొన్ని ఎడారులు, మరచీ పట్టణము, జటీపురము, అవంతి, అంగలోపము, సింధుసాగర సంగమము, దానివద్దనున్న హేమగిరి, అటు తర్వాత సముద్రముపై వెళ్ళవలెను. వెళ్ళినచో 100 యోజనముల పొడవుగల పారియాత్ర పర్వతము కలదు. అటు తర్వాత వజ్రమను మహాపర్వతము, చక్రవంత పర్వతము, వరాహపర్వతము, అచ్చటనే ప్రాగ్జ్యోతిషమను నగరమున్నది. తర్వాత మేఘవంతము, మేరుపర్వతము, అస్తగిరి.

ఉత్తర దిక్కు

మ్లేచ్ఛదేశము, పులింద, శూరసేన, ప్రస్థల, భరత దేశము, దక్షిణకురుదేశము, మద్ర, కాంభోజ, యవన, శక, ఆరట్టక, బాహ్లిక, ఋషిక, పౌరవ, టంకణ, చీనా, పరమ చీనా, విహార, దరద, హిమా లయము, కాళపర్వతము, సుదర్శనపర్వతము, దేవసఖ పర్వతము కలవు. దేవసఖపర్వతమును దాటితే అక్కడ 100 యోజనముల విస్తీర్ణము కల “శూన్య” ప్రదేశము కలదు. అందు నదులు, వృక్షాలు లేవు. ఏ జంతు వున్నూ అచ్చట నివసించదు. దానిని దాటితే కైలాస పర్వతము వచ్చును. తర్వాత క్రౌంచపర్వతము, కామ్యపర్వతము, మానస పర్వతము, మైనాకము, వైఖానస సరస్సు. ఆ ప్రాంతములను సూర్య చంద్రుల సంచారము లేదు అచ్చట నివసించు తపస్సిద్ధుల స్వయం ప్రభలు వెలుగుచు సూర్యకాంతివలె ప్రకాశించుచుండును.


గభస్తిభి రివార్కస్య సతు దేశః ప్రకాశతే
విశ్రామ్యద్భి స్తపస్సిద్ధై ర్దేవకల్పై స్స్వయంప్రభైః.
                                                    (కిష్కి.. 43-38)


దానితర్వాత ఉత్తర కురు దేశమున్నది. దానితర్వాత ఉత్తర సముద్రము. అందు సోమగిరి కలదు. విమర్శ

వాల్మీకికి తెలియవచ్చిన ప్రపంచపు నాలుగు దిక్కులలోని దేశ పర్వతనదుల వివరమీ విధముగా నున్నది. అయితే అదంతయు సరిగా ఉన్నదని చెప్పుటకు వీలులేదు. క్రీ. పూ. 350 ప్రాంతాలలో గ్రీకులకు సింధునదికి తూర్పున ఇక ప్రపంచమే లేదను భావనయుండెను అందు చేత అంతకన్న చాల ప్రాచీనుడైన వాల్మీకికి ఇతర దేశముల సంగతు లును బాగుగా తెలియకుండిన అది తప్పుకాదు నేను మొదలే తెలిపి నట్లుగా ఇప్పుడు ప్రాచీన దేశాదినామములు మారిపోయినవి. అయినను కొన్నిమాత్ర మింకను గుర్తించి యూహించవచ్చును. వాల్మీకి చూపిం చిన వాటిలో కొన్ని అస్తవ్యస్తమైనవి. కొన్ని రెండుమూడు దిక్కులలో ఉండినట్లు తెలిపినాడు. తూర్పున పుండ్ర, వంగదేశంబు లున్నవన్నాడు. మరల అవే పుండ్ర, వంగ దేశములు దక్షిణములోను ఉన్నవన్నాడు. బాలకాండములో తెలిపిన అంగదేశమిచ్చటలేదు. దక్షిణములోని పుండ్ర దేశము ఓఢ్రదేశమై యుండవచ్చును. ఎందుకనగా దాని వెంటనే ఆంధ్ర దేశము పేరుచెప్పినాడు. అవంతిని దక్షిణములోను, పడమటను ఉండి నట్లు తెలిపినాడు. బాహ్లిక, ఋక్షదేశములు రెండు దిక్కులలోను ఉదాహరింపబడినవి.

ఇక మనకు ఇప్పుడు అర్థముకాని దేశసముద్ర ద్వీపాదులను గురించి ఆలోచింతము. మన ప్రాచీనులు, వ్యాపారము చేయుటకై సముద్రముమీద ఇతర దేశములకువెళ్ళి అచ్చటి విశేషములను కథలుగా పెంచి మనదేశమువారికి వర్ణించియుందురు. మరియు ఇతర విదేశముల పేరులను మనవారికి తెలుపగా వాటికి సమానధ్వనిగల సంస్కృత నామములను మనవారు వాడియుందురు. ఇక్షుక్షీర ఘృతదధి సముద్రా లిట్టివే. ఈనాటివరకు మన పల్లెలలో మళయాళమును ఆడు మండల రాజ్య మని ఎన్నియో కథలు, కల్లలు అల్లి వర్ణించుటను మనము విను చున్నాముకదా! అటులే మన ప్రాచీనులు విదేశములను గురించి తాము విన్న విషయములను పెంచి ఊహించి వ్రాసిరి. తర్వాత పురాణాలను పెంచువారు ఆదికర్తలు వాడినపదములకు అర్థమున్నదని తలచి ఇక్షుక్షీ రాది శబ్దముల నాధారముగాచేసికొని మరికొన్ని కథలు తమ బుద్ధికుశలత కొలది అల్లి మనకర్పించి పోయినారు. తుదకు మన పురాణాలు మన వారికే అబద్ధాల పంచాంగము వంటివైపోయినవి.

తూర్పు దిక్కుననుండు ద్వీపములలో కొన్నింటిని మనము గుర్తింపవచ్చును. వాల్మీకి తూర్పు దీవులలో మనుష్యులను తినువారున్నా రని వ్రాసెను. నేటికిని మనకు తూర్పుననుండు పాసిఫిక్ (శాంతి) మహాసముద్రములోని ద్వీపములందు కొన్నిట నివసించు ఆదిమనివాసులు మనుష్యులను తినువారని (Cannibals) పాశ్చాత్యులిప్పటికి వర్ణించి తెలుపుచున్నారు. వాల్మీకిచూపించిన యవద్వీపము. ఇప్పటి జవద్వీపము (Java) సువర్ణరూప్యక ద్వీపమే సుమిత్రా (Sumatra) ద్వీపము. దానికి తూర్పులో ప్లక్షద్వీపము, శాల్మలీద్వీపము, ఇక్షుక్షీరసముద్రములు కలవనినాడు. ఇవి ఇప్పటికి కలవుకాని తూర్పులో లేవు. ఇవి మనకు పడమట నున్నవి.

కిష్కింధకు తూర్పున బ్రహ్మమాలదేశ మున్నదనినాడు. ఇప్పుడు ఒరిస్సాలో కాబోలు బారామహల్ అను జిల్లా కలదు. ఇది ఉర్దూపదముగా కనిపించుచున్నది. ప్రాచీన బ్రహ్మమాలయే యీ రూప మును పొందెనేమో అని ఒక ఊహను తెలుపుకొనుచున్నాను.

లంకకు చాలా దక్షిణములో భోగవతీనగర మున్నదని వ్రాసి నారు. అది యవద్వీపములో కలదు. పడమటిదిశలో ఎడారులున్న వని తెలిపినారు. బహుశా అవి రాజపుత్రస్థానపు ఎడారియగు తార్ ఎడారి సూచనగా ఉండును. మధ్య ఏషియాలో గోబీ అను ఎడారి కలదు. దానిని మన పూర్వులు వాలుకార్ణవము అనినట్లున్నది. కాని అది ఉత్తరదిక్కున నున్నది. అందుచేత అది యిచ్చట సూచింపబడలేదు. ప్రాగ్జ్యోతిషము పడమటిదని రామాయణమందున్నది అది అస్సాం ప్రాంతములోనిదని చరిత్రకారుల అభిప్రాయము. మేరుపర్వతము పామీరుపర్వతాలే అని నే ననుకొనుచున్నాను. ఈరాను కుత్తరమున సుమేరు అనునది కలదు. అది హిందూకుష్ పర్వతాలలోనిది. అచ్చటనే మేరోస్ (Meros) అను పర్వత మున్నదని ఆరియన్ అను ప్రాచీన చారిత్రకుడు వ్రాసెను.[1] -పామీరు పర్వతమే మేరువని నేనీ కారణముచే అనుచున్నాను. పామీర్ అనునదే పాయెమేర్ అను శబ్దము. దానికి పార్సీభాషలో. మేరువుయొక్క పాదు అని అర్థము.దానితో తూర్పువరకు వ్యాపించిన పర్వతాన్ని మనము హిమాలయ మనుచున్నాము. అట్టి హిమాలయములోని ఒక దేశము కాశ్మీరము. కాశ్మీరపదముకూడా మేరుశబ్దమును పట్టించి యిచ్చుచున్నది. మేరువు సకాశములో ఉండు దేశము కావున, కాశమేర అయియుండును. క్రమ ముగా అది కాశ్మీరఅయి, తుదకు కాశ్మీర అయియుండును.

ఇక వాల్మీకి చూపించిన ఉత్తర దిక్కులోని దేశ పర్వతాలగూర్చి ఆలోచింతము. మొదటిది మ్లేచ్ఛదేశము. ఇదే చర్చలో 5 వ ప్రకరణ ములో ఫనికియా దేశమువారు మోలచ్ అను దేవునికి నరబలులు ఇచ్చు చుండిరనియు అట్టి మోలచ్ దేవపూజకులు కావున, వారు మ్లేచ్ఛులుగా పరిగణింపబడి యుందురనియు నే ననుకొని వ్రాసినాను. మాక్సుమూలర్ పండితుడిట్లు అభిప్రాయ మిచ్చియున్నాడు: "హిందూస్థానమునకు పశ్చిమములోనున్న బెలూచీజాతియే[2] మ్లేచ్ఛజాతి.” మాక్సుముల్లరు అభి ప్రాయముకూడ సరిగాదను కొందును పతంజలి కాలమువరకు ఆర్యులు సింధునదినుండి బిహార్‌వరకును వింధ్యపర్వత ప్రాంతమువరకును వ్యాపించి యుండిరి. ఇప్పటి పశ్చిమోత్తర సరిహద్దు సూబా (N W. F. province) లో హజారా అను జిల్లా కలదు. దానిలో మలచ్ అను తాలూకా స్థానము కలదు. ఆది పతంజలి కాలమందు ప్రసిద్ధమైయుండును. మలచ్ మండలమువారిని మ్లేచ్ఛులని, ప్రాచీనులని యుందురు. అది హిమాలయ పర్వతాలలోనిది. అచ్చటి కొండజాతులు నేడును అనాగరికులైన ఆఫ్రీడీ మహ్మంద్, వజీరీ జాతులవారు. వారందరును మన ప్రాచీనులకు మ్లేచ్ఛులే. వారి భాష మోటుగను అస్తవ్యస్తముగను నుండుటచేత వ్యాకరణాధ్యయనము చేయనివారు అపభ్రంశ వాక్కుకలవారై మ్లేచ్ఛ తుల్యులగుదురని పతంజలి వ్రాసెను. నా యభిప్రాయములో పై సరి హద్దులోని మలచ్‌గల హజారా జిల్లాయే ప్రాచీన మ్లేచ్ఛమండలము. భరతదేశమొకటి పశ్చిమములో నున్నదని వాల్మీకి వ్రాసినాడు. ఇప్పుడు మనము హిందూస్థానమునంతను భరతదేశ మనుచున్నాము. కాని వాల్మీకి కాలములో మద్రదక్షిణ కురుదేశముల మధ్యభాగమునే భరతదేశ మని నట్లున్నది. అది ఈరాన్ దేశమునకు సమీప దేశమగుటచేత నేను ఈ ప్రకరణాదిలో తెలిపినట్టి యూఫ్రటీస్ "యూ-భరతన్” నదికిని సంబంధించియుండును. యవన పదము ప్రాచీన హీబ్రూలో జవన్, యవన్ అను వానికి సంబంధించినదిగా తెలిపియున్నారు. సాధారణ ముగా యవన అనునది అయోనియా (గ్రీసు) ద్వీపాలకు వర్తించు నందురు. ఇక్కడ అంతదూరపు ముచ్చటలేదు. కాన జవన్ అను రాజు పేర బరగిన ఏషియమైనరులోని భూభాగమునకు ఇది వర్తించియుండును. బాహ్లికను గురించి యిదివరకే తెలిపినాను.[3] చీనాదేశమును గురించి యిందు తెలుపబడినది. క్రీస్తునకు పూర్వము యించుమించు 221 సంవత్సరముల కాలమునాడు చీన్ అను చక్రవర్తి రాజ్యము చేసిననాటి నుండియే చీనాదేశమునకు ఆ పేరు కలిగెను. అందుచేత చీనాదేశము పేరు మన వాఙ్మయములో ఎందు కానవచ్చినను అది క్రీ. పూ. 220 తర్వాత ముచ్చటగా నుండును. ఈ దృష్టితో చూచిన ఈ చీనా పద సంబంధమగు శ్లోకము రామాయణమందు ప్రక్షిప్తమనవలెను. దరద అనునది కాశ్మీరములోని “దరద్దేశము” అను మండలమని నేననుకొను చున్నాను. ఈ పేరు కాశ్మీరములోని మండలమున కుండెనని కల్హణుడు తన రాజతరంగిణిలో పలుమారులు వర్ణించియున్నాడు. హిమాలయము దాటి ఇతర పర్వతాలను, దేశాలనుకూడదాటివెళ్లిన ఒక గొప్ప “శూన్య” దేశము వచ్చునని వాల్మీకి వ్రాసెను. ఆ శూన్యప్రదేశములో వృక్షములు లేవనియు ఏ ప్రాణియు జీవించదనియు వర్ణించినాడు.

అట్టి ప్రతీతికలది మృతసముద్రము, డెడ్‌సీ (Dead Sea) అను నట్టిదని మనమెరుగుదుము. అయితే యిదొక్కటే కాదు. ఇంకను అట్టి రెండు సముద్రములు డెడ్‌సీని మించినవియు దానికంటె చాలా పెద్దవియు నగునవి కలవు.

కకేషన్ పర్వతాలకు దక్షిణభాగములో రెండు పెద్ద సరస్సు లున్నవి. ఒకటి వాన్ సరస్సు. అది సముద్రముకంటె 5000 అడుగుల తక్కువ లోతులో నున్నది. రెండవది ఉరుమియా సరస్సు. అది సముద్రముకంటె 4000 అడుగుల తక్కువలోతులో ఉన్నది. అందే ప్రాణులును జీవించవు. డెడ్‌సీ అనునది సముద్రముకంటె 1300 అడుగుల తక్కువ లోతులో ఉన్నది. బహుశా రామాయణములో పేర్కొనబడిన శూన్యప్రదేశము వాన్, ఉరుమియా సరస్సులను సూచించును. పూర్తిగా ఉత్తరములో ఉత్తరసముద్ర మున్నదనినారు. అనగా అది ఇప్పటి ఆర్కిటిక్ మహాసముద్రము; దాని సమీపములోనే వైఖానసులను తేజోమూర్తులు నివసించు చున్నారనియు, ఆ ప్రాంత ములో సూర్యచంద్రుల సంచారము లేనందున దేశమంతయు అంధకార మయమనియు, అచ్చట మునులతేజస్సు “స్వయంప్రభ”తో కూడినట్టి దనియు, ఆ స్వయంప్రభ మూలాన ఆ దేశమందు పెద్ద వెలుతురు ఏర్పడుచుద్నదనియు రామాయణమందు వర్ణించినారు. (కిష్కి 43-38). ఇదేమి చిత్రము? ఆర్కిటికు సముద్రప్రాంతములో రష్యా ఉత్తర భాగమున్నది. అచ్చట ఆరునెలలు పగలు ఆరునెలలు చీకటియని ఇప్పటి భూగోళశాస్త్రము ద్వారా మనమెరుగుదుము. ఆరునెలల చీకటి కాలములో అచ్చటి నివాసులకు ప్రకృతి సహాయపడుచున్నది. అచ్చట అప్పుడప్పుడు గొప్ప వెన్నెలవంటి ఒక జ్యోతి ఆకాశములో వెలుగు చుండును. దానినే ఇంగ్లీషులో ఆరోరా బోరియాలిస్ (Aurora Borialis) అని యందురు. దానినే మన వాల్మీకి "స్వయంప్రభ" అని అన్నాడని నేనూహించుచున్నాను. వైఖానసులు అడవిలో ఉండేవారని భావము. ఆరోరా వెలుగునట్టి ఆర్కిటికు ప్రాంతమందే సైబీరియా దేశమున్నది. అది యీనాటివరకును మహారణ్యమయ ప్రదేశమైయున్నది. ఇంతవరకు నాకు స్ఫురించిన భావములను తెలుపుకొన్నాను. ఇంకను కొన్ని విషయము లను గురించి తెలుపవలసియున్నది అవంతి యనునది ఇప్పటి అహమదు నగరు ప్రాంతములోనిదని కొందరు చరిత్రకారు లనినారు. మాళవయే యవంతియని నందలాల్‌దేవ్‌గారు వ్రాసిరి. అది ఇప్పటి మట్రా అనున దనియు ఉజ్జయినియొక్క రాజధానిగా నుండెననియు మిత్రా అనువారు వ్రాసినారు[4]. 'కళింగము' సుప్రసిద్దమే. మహానదీ గోదావరీ మధ్యప్రదే శము. తూర్పు తీరభూమి. విదర్భ యిప్పటి బీరారు మండలము. అయితే ఈవిదర్భ సుగ్రీవునియొక్క కిష్కింధకు దక్షిణములో నుండలేదు. వాల్మీకి యొక్క అయోధ్యకును, తమసానదికిని దక్షిణములో నుండినది. ఉత్తర దిశలో టంకణ అను దేశముండెనని వాల్మీకి వ్రాసినాడు. అదెక్కడిదో తెలియదు. టెంకణదేశమొకటి యుండెను. అది కావేరీప్రాంతముది. ఈ పదములోని అర్థముకూడా అది దక్షిణములోనిదనియే తెలుపుచున్నది. (తెం లేక టెం అనిన దక్షిణము. కణ లేక కడ అనగా దిక్కు). పుండ్ర దేశము అంగ వంగ దేశములవద్ద నుండెను. దానివద్దనే మగధదేశము, సహ్యాద్రి అనునది ఇప్పటి పడమటి పర్వతములు (ఘాటులు) మహేంద్ర పర్వతము, ఇప్పటి ఒరిస్సా దక్షిణభాగములో తూర్పు సముద్రతీరమున నుండు తూర్పుపర్వతములు (ఘాటులు); కాని రామాయణములో ఇది దక్షిణదిశలోనున్నట్లు వ్రాసినారు. అంటే అయోధ్యకు దక్షిణమందే కాని కిష్కింధకు మాత్రము తూర్పుననే అని సరిపెట్టుకొనవలెను. ఇదేవిధముగ గంగా, యమునా, సరయూ, శోణాది నదులన్నియు కిష్కింధకు ఉత్తరముగ నున్నవి. కాని అవి అయోధ్యకు తూర్పుగా పారు చున్నవి. సుగ్రీవునిచేత కిష్కింధా నగరమునుండి భూగోళ శాస్త్రము చెప్పించినప్పుడు వాల్మీకి అయోధ్యను దృష్టిలో నుంచుకొనకుండ వ్రాయ లేకపోయెను.

ఇప్పటి తూర్పుఇండియా దీవులగు జావా సుమిత్రాల తర్వాత శాల్మలీద్వీపము కలదనియు, ఆ ప్రాంతములోనే ఇక్షుక్షీరాది సముద్రము లున్నవనియు వాల్మీకి తెలిపినాడు. కాని యివి మన హిందూస్థానమునకు పడమటనున్నవి. తూర్పుసముద్రములలో రక్తజలము కలిగిన లోహిత సాగరమున్నదని వాల్మీకి తెలిపినాడు.

“తతో రక్తజలం భీమం లోహితం నామ సాగరం" (కి. 40-37) అర్థమునుబట్టి లోహితసాగర మనగా ఎర్ర సముద్రము. అనగా ఇది ఇంగ్లీషులో రెడ్‌సీ అగును. అయితే బ్రహ్మపుత్రానది పారునట్టి అస్సాం (కామరూప) ప్రాంతములో లౌహిత్య అను పేరుగల ఒక లోయ (valley) కలదని సు. మ. శాస్త్రిగారు కనింగ్‌హాం గ్రంథ టీకలో ఒకచోట వ్రాసి నారు. అదే వాల్మీకి సూచించిన “సాగరము” అనగా నదీప్రాంతము అని యర్థము చేసిన చేయవచ్చును. శాల్మలీ ద్వీపమే ఖాల్డియా దేశము. నందలాల్ దే అనువారు ఇట్లు వ్రాసినారు: "మహాభారత భీష్మపర్వ 11వ అధ్యాయములో శకద్వీపముచుట్టును క్షీరసాగర మున్నదని వర్ణించినారు. కాస్పియన్ సముద్రమును షీర్వాన్ సముద్రమని యందురు."[5] ఖాల్డియా దేశమే శాల్మలము. దానివద్దనే ఘృత సముద్రమున్నది. “దానినే ఇరిధ్రియా (Erythria) అని యిప్పుడు పాశ్చాత్యు లుచ్చరించు చున్నారు.”[6] “ఇక్షుసముద్రమునే ఇప్పుడు ఇంగ్లీషులో ఆక్సస్ (Oxus) నదియని పిలుతురు.”[7]

ఈ నది మధ్యఏషియాలోని అరల్ (Sea of Aral) అను సముద్రములోనికి పారుచున్నది. ప్రాచీనార్యులు సముద్రమునకు, నదులకు, సరస్సులకును, సముద్రమనియే వాడినట్లున్నది. చిత్రవిచిత్ర ములుగా తర్వాతి పౌరాణికులు ఊహించి వర్ణించిన సప్త సముద్రముల యథార్థ్యమును నందలాల్ దే గారిట్లు నిరూపించినారు:

"షీర్వాన్ (కాస్పియన్ సముద్రము) క్షీరసముద్రమయ్యెను. సరైన్ (Sarain) అనునది సురసముద్రమయ్యెను. ఇరిధ్రాస్ అనునదే ఘృతసముద్రము. దహి అనునదే దధిసముద్రము.”[8] ఆక్సస్‌నది ఇక్షు సముద్రమయ్యెను. “చాదున్ (Tcha - dun) అనునదే స్వాదుజల మయ్యెను."[9] ప్రాచీన హిందువులు ప్రపంచాన్ని సప్త ద్వీపములుగా విభజిం చిరి. అవెట్టివో నందలాల్‌గారిట్లు తెలుపుచున్నారు: "ద్వీపమనగా (ద్వి + ఆప) రెండుదిక్కుల నీరుండు ప్రదేశము. ఆ నీరు సముద్రము కానక్కరలేదు, నదికూడ కావచ్చును. కావున ద్వీపమనగా నీటిమేరకల ఒక భూభాగమను నర్థములో ప్రాచీనులు వాడిరి. ఏడుద్వీపము లేవనగా (1) జంబు, (2) శక, (3) శాల్మల, (4) పుష్కర, (5) కుశ, (6) క్రౌంచ, (7) ప్లక్ష.[10]” ప్లక్షద్వీపమునే కొన్ని పురాణాలలో గోమేద లేక శ్వేతదీపమనియు చెప్పినారు. ఇప్పటి భూగోళపరిభాషలో పైద్వీపము లీవిధముగానున్నవని యెరుగవలెను. (1) జంబూ ద్వీపమనగా హిందూ స్థానము. ప్రాచీనార్యులకు సింధునదీ ప్రాంతభూములే మొదట పరిచయ మయ్యెను. ఆ పరిచయములోని మొదటి పరిచయము ఇప్పటి కాశ్మీరు రాజు పరిపాలనలోని జమ్మూఒకటి. ఆ జమ్మూపదమే జంబూ పదమై యుండును. ఆ పేరునే హిందూస్థానమున కంతయు ప్రాచీనార్యులిచ్చి యుందురు. తర్వాతికాలములో సింధులే హిందూనామమును మొత్తము దేశానికి ఈరానీలు, గ్రీకులు ఇయ్యలేదా? కావున నా అభిప్రాయములో జమ్మూ మండలమునుండియే జంబూద్వీపనామ మేర్పడియుండును. (2) శకద్వీపము అనగా సితియా (కాస్పియన్ సముద్రదక్షిణభాగము). ఈ కాస్పియన్ సముద్రానికి షీర్వాన్ అని మరొక పేరు. ఈ శకద్వీపమునే పూర్వము సగ్గియా అని అచటివారనిరి. (సగ్దియా (Sogdia) అనగా సగ్ + దియా. సగ్= శక, దియా = ద్వీపము) (3) శాల్మలీద్వీపమే ఖాల్దియా (4) పుష్కరద్వీపమును ట్రాన్సు ఆక్సేనియా (Trans- Oxania) అని యందురు. అనగా ఆక్ససునది కవతలనుండు భాగము. దీనినే ఇప్పుడు బుఖారా (Bukhara) అని యందురు. ఈ శబ్దము పుష్కరశబ్ద సారూప్యము కలది. (5) కుశద్వీపమువద్ద సురసముద్ర ముండెనన్నారు. కాస్పియన్ సముద్రానికి సరైన్ (Sea of Sarain) అను మరొక పేరున్నది. అదే సురసముద్రము. సరైన్ అనునది షీర్వాన్ అనుదాని అపభ్రంశమైయుండును. కుషానులు అను హూణ జాతి వారినుండి కుశ అను పేరు వచ్చియుండును. లేదా కకేసస్ పర్వతమునుండియైన ఈ కుశ అను పేరు వచ్చియుండును. ఎందుకనగా కకేసస్ అనుదానిని కోహ్ కుస్ అని అన్నారు. దానినే పురాణాలలో కుశేశయ పర్వతమని అనినారు. (6) క్రౌంచద్వీపము వద్దనే దధి సముద్రము. అనగా అరల్ సముద్రము (Sea of Aral) దహియ అను శకజాతియుండెను. ఆ జాతిపేరుతో ఈ దధిసముద్ర మేర్పడియుండును.[11] తూర్పు తుర్కిస్థానములో కుచర్ అను మండలమున్నది. అది ప్రాచీన మందు బౌద్ధమత ప్రచార స్థానముగా ఉండెను. అదే ఈ క్రౌంచముగా నుండును. (7) ప్లక్షద్వీపమే శ్వేతద్వీపము స్వాత్ (Swat) అనునది పారునట్టి దేశమే శ్వేతద్వీపము.

ఇది ఆల్టాయి పర్వతప్రాంతాలలో నున్నది. దీనివద్ద స్వాదుజల సముద్రమున్నది. అనగా ఆల్టాయి ప్రాంతమందలి మంగోలియాలో “ఛాదూన్" (Tcha-dun) పారుప్రదేశము. శ్వేతద్వీపమందే ఉత్తర కురు ద్వీపమున్నది. అనగా కొరియా (Kor-ia) దేశము.”[12] కాని నా యభి ప్రాయములో ఇది ఉ త్తరకురుదేశము (ఆఫ్గనిస్థాన్ ప్రాంతముది). పై ద్వీపాలలో శకద్వీపమును పూర్వము శకసేన దేశమనిరి.[13] కస్సి లేక కుష్ అను జాతివారినుండియే హిందూకుష్ పర్వతనామ మేర్పడినది.[14] మ్లేచ్ఛులు ప్రచేతసరాజు సంతతివారని పురాణాలలో తెలిపినారు.

సుగ్రీవునిచే వర్ణింపజేయబడిన భూమండల భాగములలోని విశేష భాగమును ఇప్పటి భూగోళ శాస్త్రమునుబట్టి తెలుసుకొనినాము. ఇక మూడు విషయాలను గురించి ఆలోచించి యీ చర్చను ముగింతును. ఆ మూడేవనగా (1) కిష్కింధ ఎక్కడనున్నది? (2) లంక ఎక్కడ నున్నది? (3) ఆర్యావర్తమేది ?

కిష్కింధ ఎచ్చట నున్నది?

ఇంతదూరము చర్చించినను కిష్కింధ ఎచ్చట నున్నదో విచా రించలేదు. కిష్కింధ ఇప్పటి హంపీ ప్రాంతములోనిదని అందరునూ అంటున్నారు. యం. వీ. కీబేగారు మాత్రము అది నర్మద పుట్టినట్టి ప్రాంతములో దీని కుత్తర భాగమున నున్నదని చూపించినారు. అచ్చటనే పంపా సరస్సుకూడా కలదని వారు తెలిపినారు. పంచానన మిశ్రగారిట్లు వ్రాసినారు. "బళ్లారినుండి ధార్వాడుకు వెళ్లు మార్గములో ఒక పెద్ద మిట్ట కలదు. అచ్చటిజనులు దానిని హిడింబ సమాధి అని యందురు. ఇదే రామాయణములో చెప్పబడిన కిష్కింధ.[15] వాల్మీకివ్రాసిన ప్రకారము రాముడు గోదావరీ తీరమందలి పంచవటినుండి సీత నన్వే షించుచు దక్షిణముగా కదలివచ్చెను. అచ్చట అరణ్యములో విరాధుని చంపెను. అక్కడినుండి యింకను దక్షిణముగా ప్రయాణమై ఋశ్య మూక పర్వతమునకు వచ్చెను. ఇప్పుడు హంపీ అనబడు బళ్లారిజిల్లా లోని స్థలము చుట్టుముట్టియుండు ప్రదేశములలో పంప, ఋశ్యమూకము మున్నగు ప్రదేశము లుండెనని స్థానికులందురు.

లాంగ్‌హస్టుగారు ఇట్లు వ్రాసినారు: “రామాయణములో వర్ణింప బడిన కిష్కింధ హంపీ ప్రాంతములోని దనుటలో సందేహము లేదు.”

అందువల్ల వర్ణింపబడిన స్థలములు హంపీ చుట్టుపట్టుల కలవు. వంపాతీర్థమే పంపాసరస్సు. అది ఆనెగొందివద్ద కలదు. తుంగభద్రకే ప్రాచీనకాలమందు పంపానది యని పేరుండెనని చెప్పుదురు. ఋష్య మూకపర్వతము నిజాము రాజ్యము సరిహద్దులో కలదు. మతంగ పర్వతము హంపివద్దనే కలదు. హంపీయాత్రికులకు స్థానికాభిమానులు రామాయణ ఘట్టములను, వాలివధ జరిగిన స్థలము మున్నగువాటిని చూపింతురు.[16]

లంక యెచ్చట ?

ఇదే గడ్డుప్రశ్న : అదెక్కడ ఉన్నదో నాకు తెలియరాదని ముందే తెలుపుకొనుచున్నాను. రామాయణ మీ విషయములో మన కేమియు సహాయము చేయదు పైగా చిక్కులు తెచ్చి పెట్టి యున్నది. అందరునూ ఇప్పటి సింహళద్వీపమే లంకయనియు, అచ్చటనున్న సేతువే రాముడు కట్టిన వారధియనియు, అది రామేశ్వరమువద్ద నున్నదనియు, అందు చేతనే అది ముఖ్యతీర్థస్థల మైనదనియు అందురు. కాని ఈ అభిప్రాయ మునకు తగిన ఆధారములు కానరావు. యం. వీ కీబేగారిట్లన్నారు: “నర్మదానది పుట్టుస్థానము అమరకంటక పర్వతము అను కొండలు. ఈ అమరకంటక పర్వతములు నేటి రీవా సంస్థానములో నున్నవి. అచ్చటనే నేడు పుష్పరాజ్‌గఢ్ అను అడవి కలదు[17] అందు గోండు లుందురు.

అట్టి అమరకంటక దక్షిణ భాగములోనే లంకయున్నది.[18] ఈ సిద్ధాంతములో ఒక్కలోపమున్నది. నర్మదకు దక్షిణములో గోదావరి కలదు. అచ్చట పంచవటి యుండెను దానికి చాలాదూరమున దక్షిణ మందు కిష్కింధయుండెననియు, దానికి చాలాదూరమందు దక్షిణము లోను సముద్రమును 100 యోజనముల దూరము దాటినతర్వాత లంక యుండెననియు రామాయణములోనున్నది. అందుచేత కీబేగారి వాదము సరిగానున్నట్లు కానరాదు.

ఇక రామాయణములో ఏమన్నారో చూతము. హనుమంతుని యాజమాన్యములో సీతాన్వేషణమునకై కొందరు వానరులు కిష్కింధకు దక్షిణముగా ప్రయాణము చేసిరి. అట వింధ్యపర్వతములోని గుహలను వెదకిరి అని వ్రాసినారు. వింధ్యపర్వతము కిష్కింధకు చాలా ఉత్తరములో నున్నది. ఇదెట్లు సరిపోవును? వింధ్యపర్వతమన మధ్యహిందూదేశము లోని పర్వతమొక టేకాదు దక్షిణ హిందూస్థానములోను కొన్ని పర్వత భాగాలుగూడ పౌరాణికులు పొరపడియో, లేక తెలియకనో వింధ్యనామ ముతో పేర్కొనిరని కొందరు చారిత్రకు లనుచున్నారు.

అటులే సరిపెట్టుకొని ముందుకుసాగుదము. బహుకాలము హనుమ దాదులు సీతాన్వేషణముచేసి తుదకు సంపాతిచే ప్రబోధితులై లంక యుండెడి దిక్కునెరిగి మహేంద్ర పర్వతమునకు బోయిరి. ఆ మహేంద్ర గిరి సముద్రతీరమందున్నది. కాని అది కిష్కింధకు దక్షిణమునగాక తూర్పుననున్నది ఇప్పటి ఒరిస్సారాష్ట్రములో అదియున్నది. తూర్పుగట్లు అను పేరుగల యీస్టరన్ ఘాట్లకు అది మకుటాయమాన మహీధరము. మహేంద్రగిరి అయోధ్యకు దక్షిణమున నున్నదని సరిపెట్టుకొని ముందుకు సాగుదము. అక్కడినుండి 100 యోజనముల దూరములో దక్షిణపుదిక్కుగా లంక కలదని రామాయణములో వర్ణించినారు. ఒరిస్సా లోని మహేంద్రగిరి నుండి యప్పటి సింహళము ఇంచుమించు 100 యోజన ములు అనగా 800 మైళ్ళుండును. కాని రామేశ్వరమువద్ద దీనిని చేరుటకు వీలైయుండగా 100 యోజనములు ఒకే దుముకుతో ఆకాశములో ఎగిరి హనుమంతునికి పోవలసివచ్చిన శ్రమ యెందుకు కలిగెను? మహేంద్ర గిరికిని లంకకును మధ్య భూభాగమే లేనట్లును ఒకే అగాధమగు సముద్ర మున్నట్లును వర్ణించినారుకదా! ఆ లెక్కచొప్పున దక్షిణమునకు మారుగా మహేంద్రగిరికి తూర్పుదిక్కుననే చాలా దూరమువరకు సముద్ర మున్నది. అట్లు వెళ్ళినచో మహేంద్రగిరినుండి ఇంచుమించు 600 మైళ్ల దూరమున అండమాన్ దీవులును, నికోబార్ దీవులును ఉన్నవి.

ఆ దీవులలో మనుష్యులను తినువారును క్రూరులును అనాగరికు లును ఆటవికులును అగు నివాసులున్నారు. నిజమేకాని ఆ దీవులలో రావణాదుల రాజ్యముండినట్లుకాని, వాటికి లంకలు అను పేరు లుండినట్లు కాని, నాగరికత చెందినవిగా నుండినట్లుకాని కానరాదు.

శ్రీరాముడు సుగ్రీవ హనుమత్సమేతముగా వానర సైన్యముతో లంకపై దండెత్తి నప్పుడు కిష్కింధనుండి మహేంద్రగిరికి ఒక్కదినములో ప్రయాణము చేసెనని రామాయణములో వర్ణించినారు. ఒక్కదిన ప్రయా ణము పొసగదు. పొసగునని యనుకొందముగాక ఒక్కదిన ప్రయా ణము దూరములోనున్న మహేంద్రగిరికి 100 యోజనముల దూరమున నున్న లంకను, దాని నేలు ప్రబలుడైన రావణుని సుగ్రీవు డెరుగలేక పోయెనా? అంతమాత్రము పనికై కోట్ల కొలది వానరమూకను నేల నాలుగు చెఱగులు శోధించుటకై మాసకాలావధితో పంపించనేల? మూడు మాసాలకు మించిన కాలమువరకు హనుమదాదులు వెదుక నేల? వెదకిరిపో, సైన్యముతో రాముడు కిష్కింధనుండి మహేంద్రగిరికి ఒకే దినములో ప్రయాణమెట్లుచేసెను? వానరులు ఆకాశములో పోయినట్లుకాని, రామ లక్ష్మణులనుగూడ ఆకాశములో తీసుకొని పోయినట్లుకాని తెలుపక పాద చారులై వెళ్ళినట్లే వర్ణించినారు. కొందరు సనాతన పండితులు లంక ఎన్నడో మునిగిపోయిన దందురు. ఏమి నిదర్శనము? వారి పదవాక్య ప్రమాణమే! అదిచాలదు. ఒప్పుకొనుటకు వీలులేదు. మరి లంక యెక్కడ నున్నట్లు? ఈ సందర్భములో నాకు తోచిన యూహలను వెల్లడింతును. హిందూస్థానపటమును చూచిన దక్షిణములో తిరువాన్కూరుకు పశ్చిమ భాగములో "లక్కా దీవ్సు" (Lakadives) అను చిన్న చిన్న ద్వీపాలు కలవు. దీప్సు అంటే దీవులు. కావున ఆ పదము లక్కాదీవులు అగును. లంకాదీవులు అను ధ్వనికి దగ్గరగానున్నది. ఈ దీవులే లంకా ద్వీపమై యుండునా అని పలుమారు అనుమానించినాను. కాని ఆ దీవులలో జనులు నరభక్షుకులు (Cannibals) అగుదురో కాదో, వారాటవికులో కారో, తెలియరాలేదు. వాల్మీకి రామాయణములో వానరసైన్యము మహేంద్రగిరికి నడిచెనన్నప్పుడు లక్కాదీవులకు వెళ్ళువారు తూర్పునకు వెళ్ళుటకు వీలుండదు. వారు పశ్చిమమునకే వెళ్ళియుందురు. వాల్మీకి దిశలను నిరూపించుటలో పలుమారు పొరపాటు చేసినందున వానరసైన్యము పశ్చిమమునకే వెళ్ళెననియు సహ్యాద్రి పర్వతా లను పేర్కొనుటకు మారుగా మహేంద్రగిరిని పేర్కొనెననియు సరిపెట్టుకొనవలసి వచ్చును. లక్కాదీవులను సమర్థించుకొనుటకై ఈ విధముగా అన్నియు సరిపెట్టుకొనుట తగదు. అందుచేత భవిష్య త్పరిశోధకుల కొక సూచనచేసి ఈ యూహను పరిహరించి మరొక యూహను తెలుపుకొందును. నాకు బహుకాలమునుండి మరొక సందేహము కలుగుచుండెను. లంక అను పదము గీర్వాణ పదము కాదు. అది తెనుగు దేశపు ఆదిమ నివాసుల పదమేయైయుండును. గోదావరి, కృష్ణా డెల్టాభూములను లంకలు అని నేటికిని అందురు. అట్టి లంకయె యేదోయొక గోదావరిలంకయె రావణుని లంకయై యుండును. గోదావరీ నదినిదాటి రాముడు లంకను ముట్టడించి యుండును. ముండాలు అను జాతివారు చాలా ప్రాచీనులు. దక్షిణాపథమందలి ఆదిమనివాసులు వారిని మహాభారతమందును పేర్కొనియున్నారు. అట్టి ముండాజాతిలోని ఒక శాఖకు “ఉరోవన్" అను పేరుకలదు. నేటికిని తమిళ భాషలో రేఫకుముందు ఇకారమునుచ్చరింతురు. వ్రాయుదురు. ఉరోవన్ అనునది రోవన్ అగును. అనగా రావణ అను శబ్దమునకు సమీపమన్న మాట. ఈ ఉరోవన్ జాతివారు నేటికిని ఆటవిక స్థితిలోనున్నారు. విశేష మేమనగా తాము రావణసంతతి వారమని చెప్పుకొనుచున్నారు. అనగా రావణ శబ్దము జాతిబిరుదమేకాని ఒక వ్యక్తి నామము కాదు. రావణుడు ఉరోవన్ జాతిలోనివాడనియు వారి రాజనియు ఊహించిన రావణుని లంకయు ముండజాతి వారుండు ప్రదేశమందే యుండియుండును. రావణుని సేనానులగు ఖరాదుల జనస్థానములోని పరిపాలకులు. “జన స్థానము" అనుపదము సవరుల జైతాన్‌పదమే యైయుండును. కావున ముండాలు సవరులు ఉండు ప్రదేశాలలోనే లంకను వెదుకవలెనని నేను నేను సూచిస్తున్నాను. బాలకాండలో (3-28) "లంకామలయదర్శనం” అని లంకయు మలయమును రెండును కలిపి చెప్పినారు. మలయ శబ్ద మునకు పర్వతమని యర్థము (మలయః పర్వతాంతరే, పర్వతాంశే, ప్రియోధ్యానే - అని రత్నమాల) మలయ శబ్దము ద్రావిడశబ్దమేమో? నల్లమల, ఎర్రమలలు దక్షిణాపథములోనివి. మలయజము చందనము దక్షిణముదే. మలయానిలము దక్షిణవాయువే! మలై యని తమిళమందు మలయమని తెనుగునందు కలవు. మలయమువలెనే లంకయు దాక్షిణాత్య పదమైయుండును. తూర్పు మలలలోని ( Eastern ghats) లంక కావున “లంకామలయ” మన్నారని యూహింపవచ్చును.

సీతాన్వేషణ సమయములో సుగ్రీవుడు చూపి చెప్పిన స్థలము లెచ్చటెచ్చటివో చాలవరకు నిరూపించినాను. అందింకను కొన్ని స్థలము లనుగురించి తెలుసుకొందము. ఈ క్రింది వాటిని గురించి నందలాల్‌దేవ్ తన ప్రాచీన హిందూ భూగోళములో నిట్లు తెలిపినారు.

కరుశ అనునది బీహారులో షాహాబాదుజిల్లా తూర్పు భాగము. ఇక్షుమతీనది రోహిల్ ఖండులోని కాలీనది. దశార్ణము ఇప్పటి ఛత్తీస్ ఘఢ్‌ జిల్లా. ఆరట్టకము పంజాబుదేశము. మందరగిరి భాగల్పూరు జిల్లా లోనిది.

ఆర్యావర్త మేది ?

ఇది మరొక గడ్డుప్రశ్న. దీనిపై పెద్ద పెద్ద గ్రంథాలు వ్రాసినారు. ఆర్యులు మధ్యఏషియానుండి హిందూస్థానములోనికి వచ్చిరనియు, ఉత్తరధ్రువ ప్రాంతమునుండి క్రమముగా క్రిందికి దిగుచూ దిగుచూ సింధునదీ ప్రాంతములోనికి వచ్చిరనియు కొందరు వ్రాసిరి. అదంతా తప్పు, ఆర్యులీ దేశము వారే అని మరికొందరు వ్రాసిరి.

నా అభిప్రాయములో రామాయణ కాలముకంటె చాల పూర్వ మందు ఆర్యావర్తమనిన, కాన్పియన్ సముద్రము నుండి హిందూకుష్ హిమాలయములవరకు ఉత్తరసీమగాను, కాస్పియన్ సముద్రమునకు, పెర్షియన్ గల్ఫునకు మధ్యనున్న ఆసీరియా బాబిలోనియాలు పశ్చిమ సీమగాను, సింధునది తూర్పుసీమగాను, అరేబియన్ సముద్రము దక్షిణ సీమగాను కలిగియుండిన ఆ మధ్యప్రదేశమంతము ఆర్యావర్తముగా పరిగణింపబడుచుండెను. రామాయణ కాలమునాటికే ఆ సీమ పశ్చిమ ములో తగ్గిపోయెను. అప్పటికే మీడ్ జాతి, మీడియా దేశమువారు (అజామిళుని సంతతివారు) మరియు ఈరాన్ వారు (పర్ష్యావారు) ఆర్యులనుండి భిన్నించిరి. తర్వాత పతంజలి కాలమునాటికి ఆర్యావర్తపు సీమాంతములు (సరిహద్దులు) ఈ విధముగా నుండెను. పతంజలి పాణినీయ 6-3-109 సూత్రమగు “పృషోదరాదీని యథోపదిష్టం” అను దానిపై వ్యాఖ్య వ్రాయుచూ ఇట్లు చర్చించినాడు:


“కః పున రార్యావర్తః?”


"ప్రాగాదర్శాత్ ప్రత్యక్ కాలకవనాత్, దక్షిణేన హిమవంతం ఉత్తరేణ పారియాత్రం ఏతస్మిన్ ఆర్యావర్తే నివాస, యే బ్రాహ్మణాః కుంభీధాన్యా అలోలుపా అగృహ్యమాణకారణాః కించి దంతరేణ కస్యాశ్చి ద్విద్యాయాః పారంగతాః తత్రభవంతః శిష్టాః."

అనగా ఆర్యావర్తమునకు పశ్చిమమున ఆదర్శపర్వతములును, తూర్పున కాలకవనమున్నూ, ఉత్తరమున హిమాలయమున్నూ, దక్షిణ మున పారియాత్రమున్నూ సీమాంతములుగా ఏర్పడియున్నవి. పతంజలి క్రీ. పూర్వము 200 నుండి 300 ఏండ్ల ప్రాంతమందుండినాడని చెప్పు దురు. కావున నేటికి 2200 ఏండ్లక్రిందట ఆర్యావర్తమునకు ఒక నిర్ణయ మగు భౌగోళికస్వరూప మేర్పడెనని చెప్పవచ్చును. అయితే ఈ ప్రదేశా లేవో మనము నిరూపింపగలమా అనునదే ప్రశ్న. మనుస్మృత్యాదుల లోను, కొన్ని పురాణాలలోను ఆర్యావర్తమును గురించి వర్ణించి యున్నారు. పురాణాలు క్రీ. శ. 10వ శతాబ్దమువరకు పెరుగుచూ వచ్చినందున మన్వాదిధర్మశాస్త్రాలు పరస్పర భిన్నమైనవిగాను మధ్య మధ్య స్వార్థుల హస్తలాఘవముచే అందందు తారుమారై నవిగాను ఉండుటచేతను, పతంజలి భాష్యానికట్టి అవస్థ పట్టుటకు వీలులేనందునను నేను పతంజలినే ఉదాహరించినాను. ఇక పతంజలి నిరూపించిన సీమ లేవో నిర్ణయింప ప్రయత్నింతము నాలుగు హద్దులలో హిమవంతము అను దానిని మాత్రము మనము తటాలున గుర్తింపగలుగు చున్నాము. అది ఇప్పటి హిమాలయ పర్వతము. అయితే హిమవంతమను పర్వతమింకొకటికూడా ఉండి నట్లున్నది. మావర్ అను ఇంగ్లీషు గ్రంథకర్త క్రీ.శ. 1812 లో తాను ప్రకటించిన గ్రంథములో ఇట్లు వ్రాసెను "సితియనులు (శకులు) ఇమౌస్ (Imaus) పర్వతమువద్ద నివసించుచుండిరి".[19] అయితే సుప్ర సిద్ధమగు మన హిమవత్పర్వతము మనకు తెలిసిన దుండగా ఎక్కడనో శక దేశములో క కేసస్ పర్వతప్రాంతాలవరకు వెళ్ళి అప్రసిద్ధమును అస్పష్టమును అగు ఇమయుస్ లేక ఇమౌస్ అను పర్వతమును ఉదాహ రించుట ఏల? ఒక కాలములో అంతవరకును ఆర్యావర్తము వ్యాపించి యుండుటచేత దానిని సూచించుచు భావి పరిశోధకుల కదియు దృష్టిలో నుండవలెనని వ్రాసినాను. కాని మన పతంజలి చెప్పినది హిమవత్పర్వత రాజమే అని నేను విశ్వసించుచున్నాను. ఇక తూర్పున కాలకవనము ఉన్నదని వ్రాసినారు. అదెచ్చటిది? సుగ్రీవుడు వానరులకు తూర్పు భూభాగమును సీతాన్వేషణకై వర్ణించునప్పుడు ఇట్లన్నాడు:


“సరస్వతీంచ సింధుంచ శోణం మణినిభోదకం,
మహీం, కాలమహీం చైవ శైలకాననశోభితాం" - కిష్కి 40-21.


ఇచ్చట నాలుగు పేరులు తెలిపినాడు. సరస్వతీనది, శోణనది, మహియనుదేశము, శైలకాననములతో కూడిన కాలమహిప్రదేశము. ఇందు సరస్వతీనదిమాత్రము సింధూనదివద్ద నుండునట్టిది. అయోధ్యకు చాలా పడమట నున్నది. శోణనది పాటలీపుత్రమువద్ద అయోధ్యకు తూర్పుదిక్కున గంగతో కలియుచున్నది. కావున పాటలీపుత్ర ప్రాంత మందే మహీదేశమున్నూ, కాలమహియున్నూ ఉండి యుండును. “కాలమహి” శైలములతోను అడవులతోను శోభించునట్టిదని వర్ణించినారు. ఈ కాలమహియే పతంజలిచెప్పిన కాలకవనమని నే ననుకొనుచున్నాను. కావున ఆర్యావర్తమునకు పతంజలి కాలమునాడు పాటలీపుత్ర ప్రాంత మందలి కాలకవనము తూర్పు హద్దైయుండెను. రెండు హద్దులను నిర్ణ యించినాము. ఇక దక్షిణపు హద్దేదియో కనుగొందము. ఆర్యావర్తము నకు దక్షిణమున పారియాత్రమున్నదని పతంజలి చెప్పెను. అదెక్కడ నున్నది: రాధాకుముదముఖర్జీగారు తమ హిందూ సివిలిజేషన్ అను గ్రంథములో ప్రకటించిన పటములో "పారిపాత్ర పర్వతములు” అని వ్రాసినారు. పారియాత్రకే పారిపాత్రమనుపేరు పలుతావుల కనబడు చున్నది. ఆ పర్వతమును వారు వింధ్య కుత్తరముగాను, ఆభీర, నిషధ దేశములమధ్య నుండునదిగాను, సాళ్వదేశమునుండి నిలువుగా నిషధ వరకు వ్యాపించినదిగాను చూపించినారు. పారియాత్రము లేక పారి పాత్రము వింధ్యపర్వతాల కుత్తరముననుండు పర్వతము పేరని ఇతర భూగోళ శాస్త్రజ్ఞు లంగీకరించియున్నారు. నందలాల్‌దేవ్ గారిట్లన్నారు: “నర్మదానది నుండి కాంబే అఖాతమువరకు వ్యాపించిన వింధ్యపర్వతాల యొక్క పశ్చిమభాగమే పారియాత్రము. " ఇప్పటికి మూడు హద్దు లయ్యెను. ఇక మిగిలినది పశ్చిమపుహద్దు. అదియే నాకు తెలియ రానట్టిది. కావున తుదిలో చర్చించుటకై ఆగితిని. దానినిగూడ ఊహతో నైనను ఏదోఒకటిగా నిర్ణయించి వేయుదము. హిందూస్థాన పశ్చిమ భాగములో అనగా బెలుచిస్థాన సరిహద్దులోగాని కాశ్మీరులోగాని ఆదర్శ పర్వతము లెచ్చటనున్నవో పరిశోధకులెవ్వరును తెలుపలేదు. ఆదర్శ మనునది పర్వతమని "ఆదర్శాదయః పర్వతవిశేషాః" అని టీకలో వ్రాసినారు. అట్టి పర్వతమేదో నాకు కానరాలేదు. పర్ష్యా (లేక ఈరాన్) దేశములో సీస్థాన్ అను మండలమున్నది. అందు హామూన్ జిర్రా (ఝరీ) సరస్సు ఉన్నది. దానిలోనికి హెన్‌రూడ్ అను నది పాఱును. దాని ఉపనది పేరు ఆద్రస్‌కుండ్ అనునది కలదు. అనగా ఆదర్శకుండ నది. ఈ విషయమును గురించి "గజెటియర్ ఆఫ్ ది వరల్డు" అను గ్రంథములో ఇంచుమించు 120 ఏండ్ల క్రిందట వ్రాసినారు.[20] పర్ష్యా సంబంధమగు ఇతర గ్రంథాలలో ఈ ముచ్చట కానరాదు. ఇదే సరియగున దైనచో ఆర్యావర్తముయొక్క పశ్చిమహద్దు ఈరాన్‌లోని తూర్పు మండలమును ఆక్రమించుకొనుచున్నది. అది ఆశ్చర్యజనకము కాదు. కన్నింగ్‌హాం వ్రాసిన ఇండియా ప్రాచీన భూగోళము అను నాంగ్ల గ్రంథమునకు విపులమగు పీఠిక వ్రాసిన సురేంద్రనాథ మజుందార్ శాస్త్రగారు కాలకవనమును గురించి, “ఆదర్శ” మును గూర్చియు ఇట్లు వ్రాసినారు.

“వసిష్ఠబౌద్ధాయన సూత్రాలలో ఆర్యావర్తము సరస్వతీనదికి తూర్పునను, కాలకవనమునకు పశ్చిమమునను, పారిపాత్ర కుత్తరము నను, హిమాలయమునకు దక్షిణమునను ఉండినట్లు వ్రాసినారు. ఇందుల చిత్రమేమన ఋగ్వేదార్యుల నివాస భూమియగు బహుభూభాగమును ఈ స్మృతికారులు ఆర్యావర్తమునుండి వదలివేసినారు. ఆదర్శ అనిన ఏమి ? బుహ్లర్‌గారు అదర్శన లేక వినశన అనగా సరస్వతి కావున అదే ఆదర్శయై యుండవచ్చును అని ఊహించినారు. ఇది సరిగా కాన రాదు............. ప్రయాగయే కాలకవనమని నే ననుకొందును ............ .ఆర్యావర్తమునకు పడమటి హద్దు అయిన ఆదర్శము ఎచ్చటనున్నదో ఏ పరిశోధకుడునూ దానిని నిరూపించలేదు. బృహత్సం హితలో (14–25) యమున, త్రిగర్త మున్నగువాటితోకూడ ఆదర్శను చెప్పినందున ప్రాచీన శ్రుఘ్న దేశమునకు, త్రిగర్త దేశమునకును (కాంగడాకు) సమీపములో నుండునని ఊహింపవచ్చును.”

ఇక నేను చూపించిన ఆదర్శమన్నట్టిది ఒక నది. అది హామూన్ జిర్రాలోనికి పారును జిర్రా అనిన సరస్సు. పై శాస్త్రిగారు దాని విషయమై యిట్లన్నారు: "సరస్వతిని 'హరహ్వతి' అని యందురు. అది పర్ష్యాలోని ఒక నది. సరస్సు కలది కావున సరస్వతి. అది హామూస్ సరస్సులోనికి పారును.” అదే సరస్సులోనికి నేను తెలిపిన ఆదర్శ కుండనది పారును. ఇది పతంజలినాటిమాట. అశోకుడు ఆఫ్గనిస్థానమును పర్ష్యాలోని కొంతభాగమును జయించియుండెను గదా! అందుచేత ఇందు అసంగతము కానరాదు.

రామాయణకాలముకంటె పూర్వకాలములో ఆర్యజాతి ఒక ప్రసిద్ధ జాతియై యుండెను. కేవలము వైదికార్యులేకాక ఈరాన్‌లోని పారసీకులు అనగా జరధుస్త్రమతానుయాయులుగా నుండిన ఈరానీలు, మీడులు (మీడియావారు) కాషి, కస్సి, కుష్ అను పేరులుగల జాతి, వీరందరునూ ఆర్యులమని చెప్పుకొనిరి. ఈ విషయమును గురించి మాక్సుమూలర్ (మోక్షమూల) పండితుడిట్లు వ్రాసెను: “ఆర్యశబ్ధము √ ఆర్ అను ధాతువునుండి ఉత్పన్నమైనది. దానికి వ్యవసాయము చేయుట అని అర్థము. తుర్వసులు (గుఱ్ఱములమీద వేగముగా ఎల్లప్పుడు సంచారము చేయు తురాన్ జాతివారు) తమకు భిన్నులని సూచించుటకు ఆర్యులీ పదమును తమకు ప్రయోగించుకొనిరి. ఆర్య అను పదము జాతి వాచకము (a national name). మనుస్మృతిలో ఆర్యభూమి, ఆర్య దేశము అని ఆర్యావర్త పర్యాయపదములుగా వాడబడినవి. జెండు భాషలో జర్య (airya) అనగా పూజ్యుడు అని యర్థము. సింధూనది, పర్ష్యాఖాతము (gulf), హిందూ కుష్ పర్వతము, కాస్పియా సము ద్రము - ఈ నాల్గింటిమధ్యనున్న దేశమును స్ట్రాబో (అను ప్రాచీన చరిత్రకారుడు) ఆర్యాణ (Ariana) దేశమనిచెప్పెను అట్టి ఆర్యాణమునకు బాక్ట్రియా (Bactria) తిలకాయమానమగు మండలమనియు చెప్పెను. (క్రీస్తునకుపూర్వము చాలా శతాబ్దములకు ముందుండిన) హేరొడోటస్ కంటె ఇంకనూ పూర్వికుడైన హెల్లామియస్ అనునతడు ఇప్పటి పర్ష్యాను ఆర్యదేశము (Aria) అని పేర్కొనెను. ఎలమైస్ (Elymais) అను పదము ఐలమ (ailama) నుండియు, అదియు ఐర్యాణనుండియు ఏర్పడెను."[21] ఇంకను మాక్సుమూలర్ గారిట్లు వ్రాసిరి: "పారశీకులు, బాక్ట్రియావారు' మీడులు, సగ్దియావారు స్ట్రాబో కాలమువరకు ఒకే భాషను మాట్లాడు చుండిరి. తురాన్ జాతికి వీరు భిన్నులై తామందరును ఒకేజాతి వారమని చెప్పికొనిరి. దరయన్ (దారా) పర్ష్యా చక్రవర్తి తన శాసనములలో తాను ఆర్యజాతివాడనని వ్రాయించుకొనెను. క కేసస్ కనుమలలో ఒసెట్టి (Ossetti) అను జాతి ఆర్యభాషను మాట్లాడుచున్నది. వారు తమను ఐరను (Iron) జాతిగా చెప్పుకొనుచున్నారు".[22] మరల పై పండితు డిట్లు వ్రాసినాడు-“క కేసస్ పర్వతాలపొడవునను ఆక్సన్, జక్సార్టీస్, నదులుపారు ప్రాంతాలలోను ఆర్య, అనార్యజాతులు రెండును కలగలుపు అగుచూవచ్చెను. తుర్వసుడును, అతని సంతతి వారును తురానులైరి. ఆక్సన్ నదికి (పశ్చిమముగా) బహుదూరము వరకును ఆర్యులుండిరి. హిర్కేనియా ప్రాంతములో అరికీ అనుజాతియు, అంతర్యాని అను నదియు కలవు. జర్జీస్ కాలములోని ఒక రాజు అరిపితస్ (ఆర్యపతి) అని వ్యవహరింపబడెను. థ్రేస్ దేశము ఆర్య (Aria) అని పిలువబడు చుండెను. విశ్చులా నదివద్ద ఒక జర్మను జాతి అరియై (Arii) అని పిలువబడుచుండెను.[23] పంచానన మిత్రగారిట్లు వ్రాసినారు: “జంద వెస్టా (చంధో౽అవస్థా) గ్రంథములో ఆర్యదేశము చెప్పబడినది. నేటి పర్ష్యాలోని హీరట్ నగరము చుట్టునుండు మండల మంతయు ఆర్యాణ మనియు అదే ఆర్యభాషల కేంద్రమనియు ప్రాచీనులు చెప్పుకొనిరి."[24] రగోజిన్ గ్రంథములో ఇట్లున్నది: "ప్రాచీనములో బాక్ట్రియాను ఆర్యా ణము (Ariana) అని పిలుచుచుండిరి. అదే ఏరాన్ (Eran) తుదకు ఈరాన్ (Iran) అయ్యెను. వీరిలో మొట్టమొదట ప్రసిద్ధినొందినవారు మీడులు. వారినే బైబిల్‌లో మాదాయ (Madai) జాతి అని వ్యవహ రించిరి."[25] ఆర్మీనియా యనునది ఆర్యదేశమే. అందు జంద్ ఆర్యు లుండిరి. ఇప్పటి త్రేస్ దేశాన్ని పూర్వము ఆర్య (Aria) దేశమని పిలిచిరి. ప్రాచీన ఐరిష్ భాషలో ఐరీ (Aire) అనిన రాజపురుషుడు. ఐర్-లెండ్-ఐర్ దేశము అనగా ఆర్య దేశము. గ్రీకుభాషలో ఆర్యన్ అనిన ఉత్తమత్వము. మండాలు (Mandas) అను జాతి తామార్యులమని చెప్పుకొని పశ్చిమపర్షియాలో క్రీ. పూ. 2500 ప్రాంతములో నివసించిరి.

ప్రాచీనార్యుల యాదిస్థానమునుగూర్చి పాశ్చాత్య పరిశోధకులు మధ్యఏషియాయనియు, ఈరాననియు, కాస్పియన్ ప్రాంతమనియు, రష్యా మధ్య దక్షిణభాగాలనియు, ఆల్టాయి పర్వతోత్తర భాగాలనియు, బహుముఖముల తర్కించినారుకాని ఆర్యులు మొదట హిందూస్థానమువారు కారని యందరును అంగీకరించినారు. యూరోపులోని బ్రెస్లో (Breslau) వాసులగు “ప్రొఫెసర్ స్క్రోడర్ (Schrader) అనువారిదిప్పుడు తుది నిర్ణయము (latest theory). అదేమన ఆర్యులు వాల్గానదీ ముఖప్రాంత మందును కాస్పియన్ సముద్రో త్తర తీరములందును మొట్టమొదట నుండి నట్టివారు.”[26] మరొక విశేషమును గమనింపవలెను. ఏషియాఖండ పటమును చూచినట్లైన అందు ఫ్రిజియా అను దేశము కట్ట కడపటి పశ్చిమ దేశముగాను, మధ్యధరాసముద్ర తూర్పు తీరములో నున్నదిగాను తెలియును. అనగా హిందూస్థానమునకు పశ్చిమముగా ఈరాన్, అసీరియా, సిరియా, ఈరాఖ్ దాటిన నల్ల సముద్రమునకు దక్షిణములో ఫ్రిజియా కలదు. ఫ్రిజియావారు ఆర్యశాఖవారు. వారు ఫ్రిజియాకు ఇంకనూ పశ్చిమోత్తరముగానున్న థ్రేస్‌లోకూడా నివాసము చేసిరి. వారు బహుకాలమువరకు తాము 'భృగులము' (Bhryges) అని చెప్పుకొనిరి. ఈ మాటల రగోజిన్ అనువారు వ్రాసిరి.[27] ఈ భృగువంశమువారిలో కొందరు నైరీపీఠభూములలోనికి బోయిరి. అచ్చటి ఆర్మినియా జాతులకు మూలపురుషులైరి.[28] ఈ విషయమునే బైబిలులోని జెనిసిస్ (సృష్టి ప్రక రణము) లోని 10వ అధ్యాయము జాఫెటిక్ వంశచర్యలో తెలిపి యున్నారు.[29] పై విషయాలను బట్టి ఆర్యశాఖలు గ్రీసు దేశమువరకు కూడ వెళ్ళి యుండెనని తెలియును. మరియు అతి ప్రాచీన కాలములో ఆర్యుల కేంద్రము ఈరాన్‌లో నుండినట్లు కానవచ్చుచున్నది.

భృగువంశము వారిని గురించి మరొక్కమాట. హీవిట్ ఇట్లనెను: “భృగులు ఫ్రిజియాలో నివసించిరి. అచ్చట వారు అగ్ని పూజను ప్రచారము చేసిరి."[30] నేను మొదటి ప్రకరణములో భృగువు జరథుస్త్రుడే యని తెలిపినాను. జరథుస్త్రుని మతములో అగ్నిపూజకే ప్రాధాన్య ముండెను. ఈ విషయము కూడ ఆర్యుల వ్యాప్తి ఫ్రిజియా వరకు సాగి యుండెనని నిరూపించుచున్నది ఆర్యావర్తమనగా "ఆర్యా ఆవర్తంతే అత్ర" - ఆర్యులుండు ప్రదేశమని అర్థము. ఈరానులో కకేససు ప్రాంతములో ఆర్య, ఆర్యాణ దేశములుండగా మరొక ఆర్యావర్త మెందుకేర్పడెను? భార్గవార్యులతో ఈరాన్ ఆర్యులతో వైదికార్యులు వేరుపడి ఇప్పడి హిందూస్థానములోనికి వచ్చినతర్వాత ఇచ్చట వారికి భిన్నించిన జాతులతో సంఘర్షణ జరిగెను. వారిని గెలిచి మొదట సింధూనది హిమాలయ పర్వత పశ్చిమ భాగపు ప్రాంతాలను ఆక్రమించుకొని క్రమముగా వింధ్యవరకును పాటలీపుత్రము వరకునూ వ్యాపించిరి. మరికొంత కాలానికి తూర్పు, పశ్చిమ సముద్రా లకును వింధ్య హిమాలయములకును మధ్య దేశమునంతయు ఆక్రమించు కొని ఇప్పుడు మనము ఉత్తర హిందూస్థానమను భాగములో వారు నిండుకొనిరి. ఈ భావములనే అమరసింహుడును, మనువును, వసిష్ఠ బోద్ధాయనులు తమతమ కాలములలోని ఆర్యావర్తపు హద్దులను వివిధ ముగా వర్ణించిరి. అయితే ఒక విషయమును మనము దృష్టిలో నుంచుకొన వలెను, భారతవర్ష మననేమి? భరతఖండమననేమి? ఆర్యావర్త మననేమి? ప్రాచ్య ఉదీచ్య మధ్యదేశము లననేమి? ఈ విషయాలను మనము స్పష్టముగా తెలుసుకొనవలెను.

భారతవర్షము ఏషియా ఖండమంతటి భాగము. దానిలో భరత ఖండ ముండెను. కాని మనము చర్చించు కాలమునాడు భారతవర్షమే యుండెను. భరతఖండము అను పేరు లేకుండెను. భారత వర్షములో హిందూస్థానమే కాక ఇతర దేశాలు చాలా చేరియుండెను. అందుచేత భారత వర్షమును చెప్పుచు మనవారు ఆర్యావర్తమును అందలి ఒక చిన్న భాగముగ చూపించియున్నారు. సు. మ. శాస్త్రిగారిట్లు వ్రాసినారు.

“పూర్వము భారతవర్షములో నవ ద్వీపములుండెను. పురాణా లలో ఇట్లు వ్రాసినారు “భారతస్యాస్య వర్షస్య నవభేదాన్ నిబోధమే." అవి ఇంద్రద్వీపము, కశేరు, తామ్రపర్ణిగభస్మిమాన్, నాగద్వీపము, సౌమ్యము, గాంధర్వద్వీపము, వారణము, కుమారీద్వీపము, కుమారీ ద్వీపమే మన హిందూస్థానము. కావ్యమీమాంసలో దానినిట్లు వర్ణించినారు: వింధ్య పరిపాత్ర ఋక్షశుక్తిమాన్ - మహేంద్రసహ్యాది మలయపర్వ తాలుకల దేశమే కుమారీద్వీపము. ఇక తక్కిన ద్వీపము లేవనగా ఇంద్ర ద్వీపమే బర్మాదేశము. తామ్రపర్ణము సింహళద్వీపము, క శేరుమద్ద్వీపము మలయా పెనిన్సులా. గాంధర్వము పశ్చిమోత్తర పరగణాలలోని గాంధారదేశమే. తక్కిన నాలుగేవో తెలియదు" (పుట 751 నుండి). పై విషయమును దృష్టిలోనుంచుకొని అమరసింహడు తన నామలింగాను శాసనములో ఏ మన్నాడో తెలిసికొందము-


"లోకోయం భారతం వర్షం శరావత్యాస్తు యో౽వధేః
దేశః ప్రాగ్దక్షిణః ప్రాచ్య, ఉదీచ్యః పశ్చిమోత్తరః
ప్రత్యంతో మ్లేచ్ఛదేశ స్స్యా న్మధ్యదేశస్తు మధ్యమః
ఆర్యావర్తః పుణ్యభూమి ర్మధ్యం వింధ్యహిమాగయోః"
                                                              (ద్వి. కాం)


ఈ శ్లోకాలకెట్లర్థము చెప్పవలెను? చెప్పి యెట్లు సమన్వయించ వలెనో తెలియదు. నాకు వచ్చినట్లు తెలుపుకొనుచున్నాను. “ఇది భారత వర్షము. శరావతీ అనునది కలదు. దానికి ప్రాగ్దక్షిణభూభాగము ప్రాచ్య మనబడును. దానికి పశ్చిమోత్తర భాగము ఉదీచ్యమనబడును. అటు తర్వాతది మ్లేచ్ఛదేశము. మధ్యనుండునది మధ్యదేశము. ఆర్యావర్తము వింధ్య హిమాలయములకు మధ్యనున్నది. భారతవర్షము వేఱు అనియు తక్కినదంతయు అందులోని అంతర్భాగమగు హిందూస్థానములోని దనియు మనము గమనింపవలెను. ఎందుకనగా, భారతవర్షములో నవ ద్వీపాలున్నవనియు, అందు కుమారీద్వీపము మన హిందూస్థానమనియు తెలిపినాను. ప్రాచ్య, ఉదీచ్య, మధ్యదేశములను ఆర్యావర్తమును ఉత్తర హిందూస్థానములోని భాగములని ఇతరాధారముల వలన మనకు తెలియ వచ్చుచున్నది. కావ్య మీమాంసలో యీ వాక్యములను సు. మ. శాస్త్రి గారుదాహరించినారు :--

“తత్ర వారణావత్యాః పరతః పూర్వదేశః, మాహిష్మత్యాః పరతః దక్షిణాపథః, దేవసభాయాః పరతః పశ్చాద్దేశః పృథూదకాత్ పరతః ఉత్తరాపథః వినశన ప్రయాగయోః గంగాయమున యోశ్చ అంతం అంతర్వేదీ.”

ఇందు పృథూదకము ఇప్పటి పెహోవా అనుస్థలము. థానేశ్వరము నకు 14 మైళ్ళు పశ్చిమములోనున్నది. సరస్వతీ నదీతీరములోనున్నది. దేవసభాప్రాంతములో సురాష్ట్ర, భరుకచ్చ (ఇప్పటి బ్రోచ్) మున్నగు దేశాలు చేరినవి. మాహిష్మతి నర్మదాతీరములో మాంధాత అను స్థలము; అంతర్వేది యనగా మధ్యదేశము. కావున ఈ భాగమంతయును వింధ్య హిమాలయ మధ్యప్రదేశమే. అమరుడు చూపిన ప్రాచ్యదేశమే గ్రీకులు తెలిపిన ప్రాసీ (Prasii) అయి యుండును. లేదా మగధదేశమై యుండు నని కన్నింగ్హాంగారు వ్రాసిరి. (పుట. 520). అంతయు బాగున్నది కాని శరావతి ఎక్కడనున్నదో అంతపెద్ద గ్రంథము వ్రాసి కన్నిగ్‌హాం తన (Ancient Geography of India) భూగోళములో ఎచ్చటను తెలుప లేదు సింధు గంగానదుల యుపనదుల నన్నింటిని పలువురు తెలిపి నారు. అందెందును శరావతిలేదు. సు. మ. శాస్త్రిగారు కన్నింగ్‌హాంగారి గ్రంథమునకు పీఠికను వ్రాయుచు ఇట్లు వ్రాసినారు: బౌద్ధులు మధ్య దేశపు హద్దులను దివ్యావదానమను గ్రంథములో వ్రాసినారు మధ్య దేశమునకు ప్రాగ్దక్షిణములో శలలావతి కలదు. అదే శరావతియేమో?” అని సూచించినారు. కాని ఇంతకు మించి మనకేమిన్ని తెలియదు. అమరసింహుడు “వారి వర్గము"లో ఇట్లు వ్రాసినాడు : “శరావతీ వేత్రవతీ చంద్రభాగా సరస్వతీ" హిందూ స్థాన మందలి నదుల పట్టికలో వీనిని తెలిపినాడు శబ్దకల్పద్రుమ నిఘంటువులో నిట్లున్నది .


"శరాః తృణవిశేషాః సంతి అస్యా మితి నదీవిశేషః”
మహాభారతే 9, 6, 20 "శరావతీం పయోష్ణీంచ వేణాం భీమరథీమపి”
రఘువంశే “శరావత్యాం సతాం సక్తైః జనితాశ్రులవం లవః"
                                                                             (15-97)


భారతములో ఒక నదిగాను, రఘువంశములో రాముని కుమారు డైన లవుడు రాజ్యము చేసిన నగరముగాను శరావతి తెలుపబడినది. ఇట్లు వ్రాసినను మనకు ఏమియు బోధయగుట లేదు. ఇదిట్లుండనీ. మధ్య దేశ మేదియో తెలిసికొందము. మనువు ఇట్లన్నాడు :


"హిమవద్వింధ్యయో ర్మధ్యం యత్ ప్రాగ్వినశనా దపి
ప్రత్యగేవ ప్రయోగాచ్చ మధ్యదేశః ప్రకీర్తితః"
                                                            (2-20)


ఉత్తరమున హిమాలయము, దక్షిణమున వింధ్య, తూర్పులో ప్రయాగ, పశ్చిమములో వినశన అనగా సరస్వతీనది. ఈ విధముగా హద్దులుకలది మధ్యదేశము. ఇంతవరకు స్పష్టమైనట్లేకదా! ఇకైనా మనకు శరావతి యెచ్చటిదో తెలియవచ్చుచున్నదా? లేదు. సరస్వతికి పశ్చిమములోనైనను, ప్రయాగకు తూర్పులోనైనను ఈ శరావతి యుండ వలెను. బౌద్ధజాతకసూచనయే సరియైన, శరావతి ప్రయాగకు తూర్పు దిక్కులో నుండవలెను. ప్రాచ్యదేశము మగధయై యుండునని కన్నింగ్‌హాం అన్నాడు. అందుచేత శరావతి మగధకును ప్రయాగకును మధ్యన నుండియుండవలెను. అట్లైనచో అది గంగానది కుపనదిగా నుండి యుండును. భరతుడు తాతయింటినుండి వచ్చినపుడు శరదండానదిని దాటెనని రామాయణములోనే కలదు అయితే అది చాల పడమరగా నున్నది, తుదకీ శరావతి యెచ్చటనున్నదో నిర్ణయము కాలేదు.

ఇక నేను నా సొంతముగా ఒక ఊహ నిత్తును. అది ఎవ్వరునూ ఒప్పుకొననట్టిదిగా నుండును. ఇట్టి అజ్ఞాత విషయములలో మంచివో చెడ్డవో ఊహలు చేసిన భావి పరిశోధకులు తుది నిర్ణయమునకు రాగలరు. శరావతి భారతవర్షము లోనిదిగా నుండియుండును. కాని హిందూస్థానము హద్దులలో కాక యితర దేశములలోనిదైయుండును. జడ్. ఏ రగోజిన్ రచితమైన ఖాల్డియా అను గ్రంథములో ఒక వాక్య మిట్లున్నది: "Tigris was named in the ancient Languages as "the arrow from the swiftness of the current " టైగ్రీసునది ప్రచండవేగముతో ప్రవహించుట చేత దానిని శరము (బాణము) అని యనిరి. అది పర్ష్యా ఖాతములోనికి ప్రవహించును. అదియే శరావతీనదియై యుండును. (శరశబ్దము పుల్లింగముకాన శరవతికాక శరావతి యెట్లగునని పాణినీయులు తగవున కెగబడుదురు. శబ్దసామ్య చర్చలో అది యప్రధానము.) శరావతి అను చిన్ననది మైసూరు సంస్థానములో కలదని తెలియవచ్చినది. దాని నుండియే జోగ్ జలపాతము (water fall) కలదు అచ్చట జల విద్యుత్తును మైసూరు ప్రభుత్వమువారు నిర్మించినారు. అదొక చిన్న ఉపనదికదా! ఏ మాత్రమున్నూ భూగోళ ప్రఖ్యాతిలేని నదిని అమరుడు ఒక ఖండముయొక్క హద్దుగా నిర్మించికొని యుండునా ?

కాళిదాసుని రఘువంశమందలి రామాయణ కథలో 15 వ సర్గ ములో రాముడు తన నిర్యాణసమయములో కుశునికి కుశావతిని, లవునికి శరావతిని ఇచ్చిపోయెనని కలదు దానిపై నందార్గికర్ పండితుడు ఇట్లు వ్యాఖ్యానించెను: “ఉత్తరకోసలలోని శ్రావస్తియే శరావతి యందురు. మత్స్య పురాణములో 'గండ' అను జిల్లాలోని నేటి 'గండ' యే శరావతియందురు. అయోధ్యకుత్తరముననున్న నేటి సాహేత్ మాహేత్ అనునదే శరావతియని కన్నింగ్‌హాం అన్నాడు. రాముని పూర్వజులలో నొకడగు శ్రావస్త అనువాడు నిర్మించినది శ్రావస్తియని విష్ణుపురాణ మంటున్నది. శరావతి యెక్కడిదో తృప్తికరమగు నిర్ణయముకాలేదు.”

నందాలాల్‌దేవ్‌గారు ప్రాచీన హిందూస్థాన భూగోళము (1899)లో ఇట్లు వ్రాసినారు: "శరావతి (1) గుజరాతులోని సబర్మతీనది. (2) ఔధు లోని ఫైజాబాదు. (3) శ్రావస్తియొక్క అపభ్రంశము శరావతి యైనట్లు న్నది. శ్రావస్తినిప్పుడు సాహేత్ మాహేత్ అందురు.” అట్లైనచో ఆర్యావర్తమందు చేరునా? చేరునని నేను చెప్పను. ఒక కాలములో శరావతి ఆర్యాణము అని గ్రీకులలో వర్ణింపబడిన ఆర్యులనివాసమునకు పశ్చిమసీమయైయుండెను. దానికి ఉత్తరపశ్చిమ భూములలోను ఆర్యు లుండిరి. అదే ఉదీచ్యమనవచ్చును. దానికి తూర్పుదక్షిణము ప్రాచ్యము. అటైతే టైగ్రిసునదికి పడమటిభాగమందలి దక్షిణభాగమేమై యుండును? అది ఆర్యభూమికాదు. మ్లేచ్ఛభూమి. అందే అసిరియా, బాబిలోనియా, ఫినికియా, అరేబియా, సిరియా, ఈరాఖు దేశములున్నవి. అవి అనార్యజాతుల దేశములు. అమరసింహుడు స్పష్టముగా వ్రాయక ఇంతకథకు కారకుడయ్యెను.


ఇక మనువేమన్నాడో విచారింతము:

“ఆసముద్రాత్తువై పూర్వాత్ ఆసముద్రాత్తు పశ్చిమాత్
తయోరేవాంతరం గిర్యో రార్యావర్తం విదుర్భుథాః." (2-22)


తూర్పు పడమర సముద్రాలకును వింధ్యహిమాచలములకును మధ్యన ఉండుదేశము (అనగా ఇప్పటి ఉత్తర హిందూస్థానము) ఆర్యా వర్తము. ఈ శ్లోకము మనువు సొంతముగా వ్రాసెనో ప్రక్షిప్తమో తెలియదు. ఎట్లైనను ఈ శ్లోకము పతంజలికి చాలా తర్వాతిది. ఆర్యులు తూర్పునకు, దక్షిణమునకు ఎక్కువగా వచ్చినట్లు తెలుపు భాగము లన్నియు పతంజలికి చాలా తర్వాతివనుట స్పష్టమే. సారాంశమేమన ఆర్యులు మొదట క కేసస్ పర్వతాలనుండి సింధువరకుండిరి. తర్వాత మీడులతో, అక్కడులతో (Accadians), ఫ్రిజియావారితో, ఈరానీలతో వేరుపడి హిందూస్థానమందే నివసించిరి.

శ్రీరాముని కాలములో ప్రయాగ, మరియు దానికి 10 కోసుల దూరములోనుండిన చిత్రకూటము, తర్వాత అనార్యదేశము ప్రారంభ మగుచుండెను. చిత్రకూటమునుండి దండకారణ్యము, జనస్థానము, యక్షులు అనగా అనార్యులగు జక్కులవారు నివసించు తాటకావనము, ఇంకనూ దక్షిణములోను, తూర్పులోను అనగా ఇప్పటి ఒరిస్సా రాష్ట్రములో నుండు ముండాజాతి పూర్వికులగు వానరులు, రాక్షసులు అనబడు అనార్య జాతివారును, ఇంకను దక్షిణములో శబరికులము వారగు సవర జాతివారును, కిష్కింధలో వానర లేక “హరి" జాతివారుగు ఆటవికు లును, వారికి దక్షిణములో ఇప్పటి తమిళనాడులో రావణవర్గమువారగు రాక్షసులు నివసించినట్లు నే నూహించుచున్నాను. అనార్యులను సంస్క రించి, ఆర్యుల వలసలకు దేశమును యోగ్యముగాచేయుటకు నేటి క్రైస్తవ మిషనరీలవలె అత్రి, అగస్త్యుడు మున్నగు మునులు జనస్థానములో ఆశ్రమములను ఏర్పాటుచేసుకొని యుండిరి.

గుఱ్ఱము లేదేశములనుండి అయోధ్యకు వచ్చెడివో యిట్లు తెలిపి నారు:


“కాంభోజ విషయే జాతై బాహ్లికైశ్చా హయోత్తమైః
వనాయుజైర్నదీ జైశ్చ పూర్ణాహరి హయోత్తమైః" (బాల. 6-22)


కాంభోజ, బాహ్లిక, వనాయు, సింధుదేశాలనుండి ఉత్తమాశ్వములు అయోధ్యకు దిగుమతి యగుచుండెనని తెలిపినారు. కాంభోజము ఇప్పటి ఆఫ్గనిస్థానమనియు, బాహ్లికమిప్పటి ఈరాన్‌లోని బలఖ్ అనియు తెలిపి నాను. వనాయువనగా అరేబియా దేశమని నందలాలన్నాడు. కాని “వనాయుః పారసీకః” అని రత్నకోశమన్నది. నదీజములనగా సింధూ నదీ ప్రాంతోద్భవములు. "వింధ్య, హిమవంతము, ఐరావతము, అంజ నాద్రి అను ప్రదేశాలనుండి ఏనుగులు దిగుమతి యయ్యెను” (బాల. 6-23, 24) అని తెలిపినారు ఐరావతమనిన ఇంద్రుని ఏనుగుయొక్క కులము అని వ్యాఖ్యాతలు వ్రాసిరి. అది తప్పు. ఇరానదీ ప్రాంతమందలి భద్రగజమునే పౌరాణికులు ఇంద్రునికి వాహనముగా జేసిరి. ఇరానది నిప్పుడు రావి యందురు. అది సింధూనది కుపనది.

దశరథుని పుత్రకామేష్టికి మిథిల, కాశి, కేకయ, అంగ, సింధు, సౌవీర, సౌరాష్ట్ర రాజులును, ప్రాచ్యదాక్షిణాత్య రాజులును ఆహూతు లైరి (బాల. 13-25) ప్రాచ్యదాక్షిణాత్యులెవరో వాల్మీకికే తెలియదు. సౌరాష్ట్రము గుజరాతు, సౌవీరముకూడ గుజరాతు భాగమే. కేకయ - బియాస్, సత్లెజ్ నదుల మధ్యదేశమని నందలాల్ దేవన్నాడు. అంగ ఇప్పటి భాగల్పూరు మండలము.

ఈ ప్రకరణమును ముగించుటకు పూర్వము మరొక్క విషయ మును స్పృశించి వదలివేయుచున్నాను. రామాయణములో సీతాన్వేషణ నిమిత్తముచే భూగోళపరిజ్ఞానము వెల్లడించినట్లే మహాభారతమందు సభా పర్వములో ధర్మరాజు యొక్క అశ్వమేధయజ్ఞార్థమై, నలుగురు తమ్ము లును నాలుగు దిక్కుల దిగ్విజయముచేయు సందర్భములో, వ్యాసుడు తన కాలమునాటి భూగోళ జ్ఞానమును వెల్లడించుకొనినాడు. ఈ రెంటిని పోల్చిచూచిన మరికొన్ని విషయములు స్పష్టపడును. అట్టి తారతమ్య పరీక్షచేయు నభిలాషులకై యీ సూచనను చేసినాను.

రామాయణమందలి ఉత్తరకాండలో చాలా కొత్త దేశాల పేరులు వచ్చును. అశ్మదేశము, వరుణపురము, బలి ఆలయము, రసాతలము మున్నగు ప్రదేశము లందు కలవు. ఉత్తరకాండ చర్చ ప్రత్యేకము

చేయదగినది. అందుచేత దాని నిందు తీసుకొనలేదు.

10

వానర రాక్షస తత్త్వము


మన పురాణాలలో సాధారణముగా అన్నింటను రాక్షసులు కాన వచ్చుచున్నారు. రామాయణములో రాక్షసులతోపాటు వానరులు కాన వచ్చుచున్నారు. ఒక ఎలుగుబంటి, మూడు పక్షులు (గరుడ జటాయు సంపాతులు), తాటకవంటి యక్షిణి కానవచ్చుచున్నారు. పురాణాలలో పైవారేకాక కిన్నర, గంధర్వ, అప్సర, నాగ మున్నగు విచిత్రజాతులు వర్ణింపబడినవి. ఈ వర్గములవారు మనుష్యులకు భిన్నించిన వారును, మనుష్యాతీతశక్తి కలవారును, మాయారూపులును, ఆకాశగాములునై యున్నారని తెలిపినారు. హిందువులలో బహుళ సంఖ్యాకులు వీటిని నమ్ముచున్నారు. ఈ పేరులు గల జాతు లుండెనని నేను విశ్వసింతును. కాని, వారు మనవంటి మనుష్యులే యనియు, వారికిని మనకును ఏమియు భేదము లేకుండెననియు తలతును. ఆది పౌరాణికులకు వీరి నిజతత్త్వము తెలిసి యుండెను. ఆర్యులకు మధ్య ఏషియాలోను ఏషియా మైనరు లోను, హిందూస్థానమందలి దక్షిణాపథమందును, తూర్పున బర్మా మలయాలోను, జవా బోర్నియో బలి సుమిత్రా ద్వీపాలలో తమతో భిన్నించిన ఆచార వ్యవహార విశ్వాసములు కల జాతులు కనిపించినారు. పలుమారు వీరితో ఆర్యులకు సంఘర్షణలుకూడా జరిగెను. అందుచేత తమ కనుకూలురైన వారిని నిందించక మంచివారని వర్ణించిరి. తమకు ప్రతికూలురైన వారికి ఘోర రూపములనిచ్చి వారిని దూషించిరి. తర్వాత పౌరాణికులకిది తెలియక తమ యూహబలము కొలది వీరిని వర్ణించిరి. వీరికి రెండుచేతులకు మారుగా అనేక హస్తములను ప్రసా దించిరి. ఒక తలకు మారుగా మూడు తలలు, పది తలలు పెట్టిరి. ఒక్కొక్కమారు (కబంధునికివలె) తలనే తీసివేసిరి. మరొకమారు గుఱ్ఱము తలల నతికించిరి. అంతటితో తృప్తినొందక వారికి శిరశ్ఛేద శిక్ష నియ్యక తక్కిన శరీరమునంతయు పాముగానో చేపగానో గుఱ్ఱము గానో చేసివేసిరి.

ఇదంతయు వారు పై వర్గములవారి నిజతత్త్వము తెలియక చేసిన యపరాధ మనవలెను. వానరరాక్షసాదు లెవరై యుండిరో చర్చించుటకు ముందు వారికి సంబంధించిన పర్యాయపదము లేవో అమరసింహుని నిఘంటువునుండి ఎత్తి వ్రాయుచున్నాను.

“విద్యాధరో, ప్సరో, యక్ష, రక్షో, గంధర్వ, కిన్నరాః, పిశాచో, గుహ్యక, స్సిద్ధోభూతో౽మీ దేవయోనయః. అసురా, దైత్య, దైతేయ, దనుజేంద్రారిదానవాః శుక్రశిష్యా, దితిసుతాః, పూర్వదేవా, స్సురద్విషః. రాక్షసః, కోణపః, క్రవ్యాత్, క్రవ్యాదో౽స్రప, ఆశరః, రాత్రించరో, రాత్రిచరః, కర్బురో, నికషాత్మజః, యాతుధానః పుణ్య జనో, నైరృతో, యాతు, రక్షసీ.”

ఈ పదములేకాక ఇంకను 'కిర్మీర' అను పదము కూడ రాక్షసు లకు వాడినారు. ఆ పదము మేదినీనిఘంటువులో కలదు. రాక్షసాదు లను గురించి విచారించుటకు ముందు వానరులను గురించి తెలుసు కొందము.

వానరులెవరు ?

ఈ ప్రశ్న ఇంచుమించు నూరేండ్ల నుండి బయలుదేరినది. వానరులు కోతులని అందరికినీ తెలియునుకాని రామాయణములోని వానరులు కోతులేనా అని పండితులు సందేహించినారు. వారు అడవి మనుష్యులని, బెత్తెడు పొడవుగల చిన్న తోకలను కలిగియుండిన ఆటవికు లనియు, కాదు నిజముగా వారు కోతులేయనియు, అదికాదు తోకలవలె గోచులను పెట్టి కౌపీనములు కట్టిన యాటవికులనియు, ఎవరికి తోచినట్లు వారు వ్రాసినారు. ఈ చర్చ ఇంకను ముగియలేదు. రామాయణ వానరులు కోతులు కారనియు, వారు దక్షిణాపథ మందుండిన ఆటవికు లనియు నా అభిప్రాయము. దీనిని గురించి పరిశోధకులిచ్చిన అభిప్రాయ ములను కొన్నింటిని తెలుపుదును. శ్రీయుత గో. రామదాసు, బి ఎ. గారు క్రోధన, ఫాల్గుణమందలి భారతి మాసపత్రికలోను, అక్షయ చైత్ర భారతి లోను 'రామాయణమునందు వానరులెవరు?' అని వ్రాసిన వ్యాసములు అత్యుత్తమములైనవి. వారి వాద సారాంశమిది: “వానరులకు రాక్షసుల కును సామీప్యత కలదు. వారిరువురును సవర మూండా జాతులవారు. వారి నామములు సవరభాషలోనే అర్థవంతములుగా ఉన్నవి. లంకా పదము సవరభాషలో పెద్దమిట్ట అని యర్థమిచ్చును. జైతాన్ అనగా దిగువ లేక బయటిభూమి. అదే జనస్థానము. జటాయువు సవరజాతి వాడు. దాన్‌డాన్ అనిన జలము కలది. అదే దండక ఋశ్యమూకము ఏనుగులకొండ. ఆనెమల అన్నామలె అయి యుండును. సవరలలో అసురులు అను జాతివారు కలరు. వారిని లంబోలంజియా అని యందురు. కౌపీనము కట్టి తోకవలె క్రిందికి బట్టను వదలుదురు. రామాయణములో మగకోతులకే తోకలున్నట్లు వర్ణించినారు. స్త్రీలకావర్ణనలేదు.” అభిలాషులు రామదాసుగారి వ్యాసములను పూర్తిగా చదువవలెను.

శరచ్చంద్రరాయ్ (Mundas and their Country) ముండా జాతిని గురించి ఒక గ్రంథమును వ్రాసినారు. అందలి కొన్ని విషయ ముల నిందుదాహరించుచున్నాను:

“ముందాలుండు ప్రాంతములోని గట్టులను మందరపహాడ్ అందురు. రావణుడు వానరసైన్యమును చూచినప్పుడు అందు మందర పర్వతము నుండి వచ్చిన “హరి" జాతివారున్నారని వినెను, ముందాజాతిలో “హరో” అని ఒక జాతి కలదు. హరో అనగా మనుష్యుడు అని వారి భాషలో అర్థమిచ్చును. (సంస్కృతములో వారి అనిన కోతి అనియొక అర్థము). ముందాలలో "ఉరోవన్" (Uroans) అను శాఖ కలదు. తాము రావణసంతతి వారమని వీరిప్పటికినీ చెప్పుకొనుచున్నారు. ఉరోవనులకును ముందాలకును పూర్వము యుద్ధములు జరిగెనని చెప్పుకొందురు.” కాల్డ్వెల్ తన ద్రావిడభాషాశాస్త్రములో ఇట్లు వ్రాసినాడు. “ఇంగ్లీషులోని కోరమాండల్ తీరము అనునది తెనుగువారు చోళమండలమునకు ఇచ్చిన పేరునకు ఏర్పడిన పదము. (హిందూస్థానములోని దక్షిణముననుండు) తూర్పుతీరమును తెనుగువారు ఖరమండలము అనిరి. అనగా ఉష్ణ ప్రదేశమను నర్థములో ప్రయోగించిరి."

కాని ప్రాచీనమందు రావణునితమ్ముడగు ఖరుడు రాజ్యముచేసిన దేశమగుటచేత ఖరదేశమని ఆదికాలమందు ప్రఖ్యాతియై యుండెనో యేమో?

తిరుచునాపల్లిని పూర్వము త్రిశిరప్పల్లి అనిరి. అనగా త్రిశిరుని పట్టణము. త్రిశిరునిపేర కట్టిన గ్రామమగుటచేత రావణుని వర్గమువారా ప్రాంతములో పాలించిరని ఒకరనిరి. కాని యది విశ్వసనీయ మన వీలులేదు..


బ్రహ్మాండ పురాణమున నిట్లున్నది. -

“ఆంధ్రవాకా ముద్గరకా అంతర్గిరి బహిర్గిరాః
తతః ప్లవంగ వోజ్ఞయో మలదామలవర్తికాః
........................................................................
మల్లామగధ గోనర్దాః ప్రాచ్యాం జనపదాః స్మృతాః."

ఇచ్చట నానాజాతులతోపాటు ప్లవంగజాతి యొకటి పేర్కొన

బడినది. తక్కినవన్నీ మనుష్యజాతులైతే ప్లవంగజాతియు మనుష్య జాతీయే. ఆంధ్రాది ప్రాచ్యజాతులలో నిదొకటియన్నారు. కావున రామాయణకాలములోని ప్లవగజాతియు అనార్యజాతియే. తర్వాతి ప్రక్షిప్త కారులు ప్లవగశబ్దమునకు కోతియను నర్థముండుటచే వారు కోతులని భావించి పేరువ్రాసినారో యేమో?

వనచర శబ్దమునకు వానర (కోతి) అని అర్థము కలదు. అడవి మనిషి (వనేచరః) అని యర్థముకూడా కలదు. రామాయణమును పెంచిన వారు అడవిమనుష్యులకు మారుగా కోతులనే అర్థమునే స్వీకరించి యుందురు.

యస్. యస్. ప్రధాన్‌గారు (Chronology of ancient India లో) ఇట్లు వ్రాసినారు: “మహాభారతము, 13 వ పర్వం, 53-21 లో మంద పాలుడను బ్రాహ్మణుడు శార్జ్గి అను శూద్రి యందు నలుగురు కుమారు లను కనెను. అనార్యులలోని ఇంటిపేరులలో శార్జ్గి అనునదొకటి. అనా ర్యులలో అజ, మర్కట, సర్ప, నాగ, మృగ, మత్స్య అను పేరులు కల జాతులుండెను.”

ఈ విధముగా వానరులు అనార్యజాతి వారని వివిధ పండితుల అభిప్రాయము ఇక రామాయణమే ఏమి తెలుపుచున్నదో కనుగొందము. రావణునికి వానర ముఖ్యుల వర్ణించి చెప్పునప్పుడు వారు నర్మదానది, వింధ్య, పారియాత్ర, సహ్య, సుదర్శన, కృష్ణగిరి, సాల్వేయ పర్వతాల నుండి వచ్చినట్లు తెలిపెను. ఒకరిద్దరు హిమాలయ, మేరు ప్రాంతాల నుండి వచ్చినట్లు తెలిపినను ఎక్కువ వానరవీరులు దక్షిణాపథము వారే అని విశదమైనది, కృష్ణగిరి నల్లమల యేయో తెలియదు. నీలగిరి కూడా కానవచ్చును. సుదర్శన, సాల్వేయ గిరు లెచ్చటివో తెలియదు. వానరులకొక భాష యుండెను. వారిలో ముఖ్యులైన వారికి సంస్కృ తముకూడ వచ్చి యుండెను. హనుమంతుని మొట్టమొదట రాముడు కలసినప్పు డతనిగూర్చి యిట్లనెను: “ఇతడు మూడు వేదాల నెరిగిన వాడుగా కనబడుచున్నాడు" (కి. 3-28). పైగా వ్యాకరణ జ్ఞాన మున్నది. (కి. 3-29). హనుమంతుడు సీతను జూచినప్పుడు ఆమెతో సంస్కృ తములో మాట్లాడుదునా లేక నా భాషలో మాట్లాడుదునా అని వితర్కించు కొనెను. (సు. 30-7). ఇందతిశయోక్తి యున్నను వానరులకొక భాష యుండెననియు వారార్యులతో మాట్లాడగలవారై యుండిరనియు ఊహించుకొనవచ్చును వానరులలో వివాహాచారములలో ఒక విశిష్టత యుండెను. అన్నదమ్ములలో ఎవరైనను గతించిన అతనిభార్యను మిగిలిన తమ్ముడు పొందుచుండెను. వాలి తన తమ్ముడగు సుగ్రీవుడు బ్రతికి యుండగా తమ్ముని భార్య యగు రుమను పొందెను. ఇది పాప కార్యమని రాముడిట్లు వాలిని దూషించెను:


“అస్య త్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః
రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయం పాపకర్మకృత్.”
                                                            (కి. 18-19)


వాలి చనిపోయినప్పుడు అతని శవమునకు రాముడు దహన సంస్కారము చేయించెను. వానరులలో దహనకర్మ లేకుండెనేమో. కాని ఆర్యాచారములను రాముడు వానరులందును, రాక్షసులందును ప్రచారము చేయువాడుగా కనిపించుచున్నాడు. అందుచేతనే కబంధాది రాక్షసులను వారి కోర్కెచేత పూడ్చినవాడైనను రావణునికి దహనసంస్కారమే చేయించెను.

వానరులకు ధనుర్విద్య తెలియదు. రాక్షసులకును ఆ విద్య రాకుండెను వాలి సుగ్రీవులు కుస్తీ పట్టిరి. రాముడు తనబాణముతో వాలిని చంపుదు నన్నప్పుడు సుగ్రీవునికి దాని శక్తి తెలియనందున పరీక్ష తీసుకొని తృప్తిపడెను. సుగ్రీవునికి పట్టాభిషేకము చేసినప్పుడు అతనికి అడవిపంది తోలుతో చేసిన చెప్పులను దొడిగించిరి. ఆర్యరాజులకు జరుగు పద్ధతిగానే పట్టాభిషేకము చేసిరి. బ్రాహ్మణులు వేదమంత్రము లతో నతనికి పట్టము కట్టిరి. కిష్కింధలో బ్రాహ్మణు లెక్కడినుండి వచ్చిరి? అప్పటికే ఆర్యులు కొందరు అచ్చట నివసించియుండి రనవలెను. కోతులకు ఇండ్ల యవసరము లేదు కదా! కిష్కింధానగరము మంచి నాగరికత పొందినట్టిది. అందు తెల్లని మేడలుండెను (కి. 33-12). వారికి ఇనుము, బంగారు మున్నగు లోహముల ఉపయోగము తెలిసి యుండెను (కి. 33–16,17). వెండినికూడా వారుపయోగించుచుండిరి. (కి. 33–19). వారు వీణావాద్యసంగీతము లెరిగియుండిరి (కి. 33-21). కోతియందము మనకు తెలిసినదే! మరి కిష్కింధా వానరస్త్రీలు 'రూప యౌవనగర్వితలు.' సుగ్రీవుని సేవకులు ఉత్తమ వస్త్రములను కట్టుకొని యుండిరి (కి. 33-23). వానర స్త్రీలు నూపురములు, మొలనూళ్ళు మున్నగు ఆభరణములు ధరించియుండిరి (కి. 33-24). సుగ్రీవుడును, తారయు బాగా మద్యపానముచేసి మత్తులై యుండిరి (కి. 33-37,45). సీతజాడను కనుగొనివచ్చిన వానరులు సుగ్రీవుని మధువనమంతయు ధ్వంసముచేసి చెడద్రాగిరి.

వానరులకు రాక్షసులకును అంతగా భేదము లేనట్లున్నది. రావణుడు సుగ్రీవునికిట్లు చెప్పిపంపెను:


న కశ్చి దర్థ స్తవ నాస్త్యనర్థ స్తథాహి మే భ్రాతృసమో హరీశ!
                                                          -యు. 20-11.


"సుగ్రీవా! నీవు సత్కుల ప్రసూతుడవు. ఋక్షరజసుని కుమారుడవైనందున నీవు నాకు తమ్మునితో సమానుడవు.” వానరులు వింధ్యకు దక్షిణముననుండిన అనార్యులనియే నా విశ్వాసము. వారు కోతులు కారు. కళింగములో లాంగుల్యా అను నది కలదు. అచ్చటనే సవర, కోదుజాతులవారున్నారు. కావున లాంగుల్యా నదీప్రాంతజనులను లాంగూలము కలవారనియు వారు కోతులనియు తర్వాత రామాయణ మును పెంచినవారు భావించియుందురు. శబరి యుండు ప్రాంతమందే సవరులున్నారు. సవరలకు సజాతీయులైన లాంగుల్యానదీ ప్రాంత వాసులగు ఆదిమాటవిక నివాసులు వానరులై యుందురు (లాంగుల్యానది నిప్పుడు నాగావళియందురు).

హనుమంతుని పెండ్లి

సాధారణముగా హనుమంతుడు నిత్యబ్రహ్మచారి యని అందరును భావింతురు. వాల్మీకి రామాయణములో హనుమంతుని పెండ్లి లేదా భార్యముచ్చట లేదని తలచి యీ ప్రవాదము కలిగినదేమో? అట్లైతే, నీలుడు మొదలగు బహువానరవీరుల భార్యలసంగతికూడా తెలుపలేదు. వారందరును నిత్యబ్రహ్మచారులా? హనుమంతుడు బ్రహ్మచారికాడు. అతడు వివాహితుడు. పైగా బహుభార్యలు కలిగియుండినట్టివాడు. ఏమి ప్రమాణ మందురా? వాల్మీకి రామాయణమే ప్రమాణము. రాముడు అయోధ్యకు వచ్చుచున్నాడని హనుమంతుడు ముందుగాపోయి భరతునితో తెలుపగా అతడు అధికానంద భరితుడై యిట్లనెను:

"ప్రియాఖ్యానస్య తే సౌమ్య దదామి బ్రువతః ప్రియం, సుకుం డలా శ్శుభాచారా భార్యాః కన్యాశ్చ షోడశ, హేమవర్ణా స్సునాసోరూ శశిసౌమ్యాననాః స్త్రీయః సర్వాభరణ సంపన్నాః కులజాతిభిః" (యుద్ధ. 128-42,44)

"ఓయీ, హనుమంతుడా! ప్రియమైనవార్తను నాకు తెలిపినందులకు నీకు మంచి కుండలములు కలవారును, మంచి ఆచారములు కలవారును, అందమైనవారును, చక్కని ముక్కు, చక్కని తొడలు కల వారును, చందమామవంటి ముఖములు కలవారును, సమస్త భూషణ భూషితలైన వారును, మంచి కులములో పుట్టినవారును, కన్యకలును (పెండ్లికాని వారును) అయిన 16 మంది స్త్రీలను భార్యలనుగా ఇచ్చుచున్నాను" అని భరతుడు చెప్పెను. ఈ మాటలకు హనుమంతుడు 'నాకెందుకయ్యా! నేను నిత్యబ్రహ్మచారిని' అని అనలేదు. పాంచరాత్రములో హనుమంతుని భార్యపేరు సువర్చల యని యందురు. అతనికొక కొడుకుండెనందురు. హనుమంతునికి వివాహమయ్యెనో లేదో కాని దీనినిబట్టి యొకసంగతి స్పష్టమగుచున్నది. ఎంత పెద్దకోతియైనను భరతుడు అతనిని చూచిన వెంటనే మంచిజాతిలో పుట్టిన సుందర స్త్రీలను భార్యలనుగా ఇత్తునని చెప్పునా? హనుమంతుడు యౌవనుడుగను, చూడదగిన మనుష్యుడుగను, ఉండిననేకదా 16 సుందరాంగులైన కన్యలను భార్యలుగా బహూకృతు డగుటకు అర్హుడయ్యెను? ఈ విషయాలన్నింటినిబట్టి వానరులు నాగరికత పొందిన అనార్యజాతివారనియు, వారు కోతులు కారనియు స్పష్ట మగుచున్నది. వీరు సవర, ముందాజాతులకు, సంబంధించిన వారై యుందురు. హనుమంతుడు నిత్యబ్రహ్మచారియె యనువారికి రెండాధార ములు కానవస్తున్న వి.


(1) “అన్యత్ర భీష్మాద్గాంగేయా దన్యత్ర చ హనూమతః
      హరిణీఝరమాత్రేణ చర్మణా మోహితం జగత్."


ప్రపంచములో స్త్రీలచే మోహితులు కానివారిద్దరే యిద్దరట! భీష్మ హనుమంతులట!

(2) హనుమంతునికొక భక్తుడు షోడశనామములిచ్చి స్తుతించెను. అందు బ్రహ్మచారియను బిరుదొకటి.


“అచలోద్ధారకో భీమో బ్రహ్మచారీ మహాబలః.”


ఈ రెంటినెవరు ప్రమాణీకరించిరో తెలియదు. వాల్మీకి రామాయణ ములో నెచ్చటను హనుమంతుడు నిత్యబ్రహ్మచారియని వర్ణింపలేదు. స్పష్టముగా హనుమంతునికి పెండ్లియైనట్లును నిదర్శనములులేవు. కాని పైని కనబరచిన కన్యాదానపుముచ్చట మాత్రము కలదు!

జాంబవంతుడు ఎలుగుబంటి కాడు. అతడును అనార్య (వానర) మనుష్యుడే. అందుచేతనే అతడు వానర సేనలో నుండెను. జటాయువు అనార్యుడైన ఆటవికుడు. నమ్మకమైన బంటుగా పంచవటిలో సీతా రాముల సేవ చేసెను. ఇట్టి వానరజాతిలో సేతువులు నిర్మించు మంచి నేర్పరులుండిరి. చికిత్సలుచేయు వైద్యులుండిరి. సకలధర్మము లెరిగిన పెద్దలుండిరి. వీరివంటి అనార్యజాతివారే అయిన రాక్షసులు మనుష్యుల వంటివారే. అయినప్పుడు వీరు మాత్రము కోతులగుదురా! కావున సర్వ విధముల వీరు ఆటవికులైన మనుష్యులే. అనార్యులలో ఉత్తములైనవారే. కోతులలో ఎలుగుబంట్లను, [31]గద్దలను గూడా చేర్చి యుండుటకు తగిన కారణ ముండవలెను. వానరులు కోతులు కారు. వారు వనేచరులు అనగా ఆటవికులని నిర్ణయించినాను. ఋక్షులు ఎలుగుబంట్లు కారు. వారును అడవి మనుష్యులే. వారు ఋక్షవత పర్వతాలలో నివాసము చేసినట్టివారు.


అన్యేఋక్షవతః ప్రస్థాన వతస్థు స్సహస్రశః
అనే నానావిధాన్ శైలాన్ భేజిరే కాననానిచ.
                                    -బాల. సర్గ. 13 శ్లో. 30.


కొందరు వనచరులు ఋక్షవతపర్వతాలలో ఉండిపోయిరి. తక్కినవారు వివిధ శైలాలలో (అనగా ఋక్షవతమునకు దక్షిణమున నుండు భాగాలలో నుండనోవు) ఉండిపోయిరి అని వర్ణించినారు.

ఋక్షవతము అను శబ్దమునుబట్టి ఋక్షులు (ఎలుగులు) ఉండు తావు అని యర్థము వచ్చును. ఆ పదము యొక్క అర్థము నాశ్రయించి

  1. రసాతల by నందలాల్ దేవ్. పుట. 12.
  2. Max Muller's Science of Language Vol. I P. 93. RV-14
  3. భారతములో బల్హిక అనియు బాహ్లిక అనియు రెండు పేరులు వచ్చును. ఇది ఇప్పటి పశ్చిమోత్తర సీమలోని భాగమే. పర్ష్యాలోనుండు బలఖ్ అనునదే బల్హికా అని కొందరు. అదివేరు ఇదివేరు.
  4. Pre-historic India by Panchanan Mitra.
  5. Rasatala by Nandalal Dey P. 83. షీర్వాన్ అనునది ఫార్సీ పదము షీర్ అనగా క్షీరము.
  6. రసాతల పుట. 134
  7. రసాతల పుట. 135
  8. దహి అనునది దధి అను పదమే. ఇప్పటికి ఉర్దూలో దధిని దహి అని యందురు.
  9. రసాతల-పుట. 143.
  10. నా అభిప్రాయములో అట్లుకాదు. హూణుల ప్రాముఖ్యము క్రీ. పూ. 5 వ శతాబ్దమునకన్న ముందునకుపోదు. క్రీ పూ 10 వ శతాబ్దమందే ఖాల్దియాకు ఉత్తరములో కాషి లేక కస్సి అను జాతివారుండిరి. వారినే ఇంగ్లీషులో కస్సైట్ అని యందరు. కస్సీలుండు భాగమే కుశద్వీపమైయుండును
  11. ఇప్పటికినీ భూగోళపటములో దహి (Dahae) దేశము అనుదానిని చూపించుచున్నారు—సు. ప్ర.
  12. రసాతల-పుటలు: 132 నుండి 140 వరకు.
  13. అసీరియా-జద్. ఏ. రగోజన్
  14. అసీరియా-జద్. ఏ. రగోజన్
  15. Prehistoric India by Panchanan Mitra.
  16. Hampi ruins by A H Longhurst P.P 7, 8
  17. పుష్పితక పర్వతము దక్షిణమం దున్నదని (అనగా అయోధ్యకు దక్షిణ మందని) వాల్మీకి చెప్పెను. ఈ పుష్పరాజగఢ్ అదే అయి యుండును. -సు ప్ర.
  18. Mr. M. V. Kibe's Gultural descendants of Ravana in Studies in Indology. P. 264.
  19. Universal History by Mayor (1812) RV-15
  20. Adraskand-Adruskand a rivar in Seistan which rises to the N. W. of Ghore and flowing S.S.W. past Sub- zawive is continued in the Hen Rud river which flows in lake Hamoon Zerrah - Gazeteer of the World. Vol. 1.
  21. Maxmuller - Science of Language, Vol I, P 295
  22. Maxmuller - Science of Language, Vol I, P 296
  23. Maxmuller - Science of Language, Vol I, P 297
  24. Prehistoric India by P. Mitra
  25. Z A. Ragozin's Assyria
  26. Taraporewala - Elements of the Science of language P. 232.
  27. Z A Ragozin s Assyria
  28. Z A Ragozin s Assyria
  29. Z A Ragozin s Assyria
  30. Hewitt's Primitive Traditional History
  31. విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో జటాపులను కోండులున్నారు.