రామాయణ విశేషములు
రామాయణ విశేషములు
కీ॥ శే॥ సురవరం ప్రతాపరెడ్డి
ప్రచురణ :
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి
ఆంధ్ర సారస్వత పరిషత్తు
తిలక్ రోడ్, హైదరాబాదు - 500 001.
- ప్రచురణ :
- సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి
- ఆంధ్ర సారస్వత పరిషత్తు
- తిలక్ రోడ్, హైదరాబాదు-500 001
- తృతీయ ముద్రణ : 1987
- ప్రతులు : 1250
- వెల: రూ.30/-
- ప్రతులకు :
- సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి
- ఆంధ్ర సారస్వత పరిషత్తు
- తిలక్ రోడ్, హైదరాబాదు-500 001
పద్మావతీ ఆర్ట్ ప్రింటర్స్, హైదర్ గూడ, హైదరాబాదు—500 029.
శ్రీ సురవరం ప్రతాపరెడ్డి
జననం : 28 - 5 - 1896
అస్తమయం : 25 - 8 - 1953
“సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి"
విజ్ఞాపన
సురవరం ప్రతాపరెడ్డి నామ సంస్మరణ మాత్రాన ఆనాటి తెలంగాణలోని సాంఘిక చైతన్యం గుర్తుకు వస్తుంది. గోలకొండ వ్రాతల ఫిరంగి మ్రోతలతో తెలుగు గుండెలలో వీరావేశం నింపిన ధీరుడాయన. పత్రికా సంపాదకుడుగా, పరిశోధక పండితుడుగా, సంస్థల ప్రోత్సాహకుడుగా, ఉత్తమాభిరుచిగల రచయితగా, విశాలాంధ్రోద్యమ ప్రేరకుడుగా సురవరంవారి కృషి సంస్తవనీయం. విశిష్టమైన శైలి, నిర్దిష్టమైన భావం ఆర్జవావేశం, విషయ వైభవం వారి రచనలలోని సహజ గుణాలు.
ప్రతాపరెడ్డిగారి ముద్రితాముద్రిత రచనలు సేకరించి వాటి ముద్రణ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏర్పాటైన సంస్థ “సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి.” ఈ సంస్థలోని సభ్యులు :
అధ్యక్షుడు :
జస్టిస్ కొండా మాధవరెడ్డి
ఉపాధ్యక్షుడు :
శ్రీ దేవులపల్లి రామానుజరావు
సభ్యులు :
డా॥ సి. నారాయణ రెడ్డి
డా॥ బి. రామరాజు
డా॥ యం. రామారెడ్డి
శ్రీ యస్. యన్. రెడ్డి
డా॥ ఎల్లూరి శివారెడ్డి
iv
కార్యదర్శి :
శ్రీ మామిడి రామిరెడ్డి
కోశాధికారి :
శ్రీ గోలి ఈశ్వరయ్య
సురవరం వారి సంపూర్ణ గ్రంథావళి ప్రచురితమైతే పఠితృ లోకానికి, పరిశోధక విద్వాంసులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సంస్థ భావిస్తున్నది. ఈ ఆశయంతో మొదట “ఆంధ్రుల సాంఘిక చరిత్ర"ను ముద్రించటం జరిగింది. గ్రంథ ముద్రణ కార్యభారాన్ని వహించటానికి ఈ సంస్థ ప్రత్యేకంగా “సంపాదక మండలి"ని ఏర్పాటు చేసింది. ఇందులోని సభ్యులు
అధ్యక్షుడు :
డా॥ సి. నారాయణరెడ్డి
సభ్యులు :
శ్రీ దేవులపల్లి రామానుజరావు
డా॥ బి. రామరాజు
డా॥ యం. రామారెడ్డి
శ్రీ గడియారం రామకృష్ణ శర్మ
శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి
శ్రీమతి సురవరం పుష్పలత
డా॥ ఇందుర్తి ప్రభాకరరావు
కార్యదర్శి :
డా॥ ఎల్లూరి శివారెడ్డి
కోశాధికారి:
శ్రీ యస్. యన్. రెడ్డి
v
సంపాదకమండలి ముద్రణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రస్తుతం “రామాయణ విశేషములు”, “హిందువుల పండుగల”ను ముద్రించగలిగింది. సురవరంవారి ముఖ్య రచనలన్నీ అనతి కాలంలో ముద్రించాలన్నది సంపాదక మండలి నిర్ణయం. ఈ నిర్ణయానికి సహృదయులు, వదాన్యుల సహకారం తోడయితే మా ఆశయం అచిరకాలంలోనే నెరవేరుతుంది ఈ రెండు గ్రంథాల ముద్రణకు శ్రీ వై. బి. రెడ్డిగారు, శ్రీ జి పుల్లారెడ్డిగారు, శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవిగారి కుటుంబం హార్దికంగా, ఆర్థికంగా సహకారాన్ని అందించారు. తెలుగు విశ్వవిద్యాలయం పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసింది. వారికి “సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి" కృతజ్ఞతలు తెలుపుకొంటున్నది. నైజాం ట్రస్టు వారిని, తిరుపతి దేవస్థానం వారిని ఆర్థిక సహాయం కోసం అర్థించటం జరిగింది.
తేది : 28-5-1987
డా॥ సి. నారాయణ రెడ్డి
అధ్యక్షుడు
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి
(సంపాదక మండలి)
నా మనవి
శ్రీమద్రామాయణ పవిత్రకావ్యమును ఒక్కమారే చదివి నాకు తోచిన విషయములను విభూతి పత్రికలో ప్రకటించితిని. పండిత శ్రీ చిదిరెమఠము వీరభద్రశర్మగారు అయాచితముగా ధ్వనియుక్తముగా తమ మాటగా వ్రాసిన వాక్యాలకు కృతజ్ఞుడను. పండిత శ్రీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశర్మగారు నా కోరిక పై పీఠిక వ్రాసియిచ్చినందులకు నా హృదయపూర్వకమగు కృతజ్ఞతలను మనవి చేసుకొనుచున్నాను. నేను నా శైలిలో ఉద్దేశపూర్వకముగా వ్యావహారిక పదాలను వాడినాను. గ్రాంథిక వ్యావహారిక సమన్వయ శైలికై ప్రయత్నించుచున్నాను. విభూతినుండి 200 ప్రతులనే తీసికొని యున్నందున ఎక్కువగా ప్రచురించుటకు వీలులేకపోయినది. యుద్ధానంతరము అవసరమని ప్రోద్బలము కల్గుచో పునర్ముద్రణ మగును. కాదేని ప్రపంచానికిగాని నాకుగాని నష్టములేదు.
సురవరం ప్రతాపరెడ్డి
(ప్రథమ ముద్రణ పీఠిక)
సంపాదకీయము
తెలంగాణ మాంధ్రప్రదేశముగా నవతరించిన సందర్భమున, తెలంగాణా రచయితలసంఘ మాంధ్ర రచయితల సంఘముగా పరిణమించిన యవసరమున, తెలంగాణా సర్వతోముఖ వికాసమునకు మేలుకొల్పులు పాడిన వైతాళికులగు కీ. శే. శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి “రామాయణ విశేషము"లాంధ్ర భారతికి ప్రథమోపహారముగా సమర్పించుకొనుట మా భాగ్యవిశేషము. తెలుగువారికి సీతారాములు మీద గల భక్తి యపారము రామాయణమన్న చెప్పరాని యభిమానము. కాని భారత భాగవతాదులవలె మనసుకెక్కిన రామాయణ మింతవరకు తెలుగులో నవతరింపలేదు. భాస్కరుండు పదరకున్న మనకు రామాయణము కూడ బండ్లకెక్కి యుండును. ఐనను భారత భాగవత కథలకన్న రామాయణ కథలందే మన కభినివేశము మెండు శిష్టుల కిది వాల్మీకి రామాయణము నుండియు, తదితరులకు జానపద వాఙ్మయమునను దేశి సారస్వతమునను గల వాల్మీకీ యావాల్మీకీయ రామాయణ గాథల వలనను కలిగియుండు ననుకొందును. ఏతదభినివేశమే శ్రీ ప్రతాపరెడ్డిగారిచే రామాయణ గాథా పాథస్సుల లోతు లరయించినది. సార్వపథీనమైన వారి దృష్టి అంతరాంతరముల ప్రవేశించి అమూల్య విశేషములను కనుగొన్నది. అది చక్కని రామాయణము లేని కొఱతను చిక్కని రామాయణ విమర్శనముతో కొంతవరకు తీర్చినది. అందఱ మెప్పింపజాలు కవిత యెట్లసాధ్యమో యందఱి మన్నన నందుకొను విమర్శనముగూడ నటులే దుర్లభము. శ్రీ ప్రతాపరెడ్డిగా రెట్టి నిర్భీకులో, నిల్కల్మషులో వారి విమర్శనము గూడ అటులే నిష్పాక్షికము, సత్యాన్వేషణైక లక్ష్యము. గ్రంథస్థ విషయము గూర్చి కీ. శే. పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారును, కీ. శే. చిదిరెమఠం వీరభద్ర శర్మగారును, శ్రీ అనుముల సుబ్రహ్మణ్య శాస్త్రిగారును వ్రాసినదానికన్న నధికముగా వ్రాయవలసినది లేదు. ఇక గ్రంథము గూర్చి మాత్రము రెండు మాటలు మనవి చేతును.
రామాయణ విశేషములను నీ వ్యాసములను శ్రీ ప్రతాపరెడ్డిగారు తొలుత 'విభూతి' పత్రికలో ప్రకటించిరి. అప్పుడే రెండు వందల ప్రతులా భాగమునకు సంబంధించినవి ఎక్కువగా తీసి ముఖ పత్రము, మున్నగు వానితో రామాయణ విశేషములను గ్రంథముగా ప్రకటించిరి. తీసినవి 200 ప్రతులే కనుక నవి యాంధ్రదేశ మంతటను వ్యాపించలేదు. ఆరు సంవత్సరముల క్రిందట నేను యక్షగానముల గూర్చి పరిశోధన మొనర్చుచు యక్ష శబ్దచర్చ ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథ భాండాగారమందలి రామాయణ విశేషములందు చూచి సందేహము తీరక రెడ్డిగారి దగ్గరకు పోయితిని. వారు తమ చేతనున్న రామాయణ విశేషముల ప్రతిని నా ముందుంచిరి. ఈ ప్రతిలో వారెన్నియో క్రొత్తవిషయములను తెల్ల కాగితములపై వ్రాసి మధ్య మధ్యన నతికించిరి. పూర్వాభిప్రాయములు మారినచోట కొట్టివేసిరి. దీనిని మరల ముద్రించరాదాయని నేనంటిని. ఈ ప్రయత్నమంతయు నిందులకే యని వారు మారుచెప్పిరి. శ్రీ ప్రతాపరెడ్డిగారు 'ప్రజావాణి'కి సంపాదకులైన పిమ్మట మార్పులు కూర్పులతో కూడిన రామాయణ విశేషముల ముద్రణ మారంభించిరి. ఆరు ఫారములు ముద్రింపబడినవి. ఇంతలో 'ప్రజావాణి' యాగిపోయినది. ప్రతాపరెడ్డిగారి మనము బాధపడినది. రామాయణ విశేషములు సశేషముగా నుండి పోయినది. రెడ్డిగారు కీర్తిశేషులయిన పిమ్మట వారి స్థిరచరాస్తులు వారి కుమారులకును, వారి గ్రంథములు (ముద్రితా ముద్రితములు) శిష్యుడనైన నాకును దక్కినవి. రామాయణ విశేషములను ముద్రింపించిన బాగుండునని నేను తెలంగాణా రచయితల సంఘము వారిని కోరితిని. వారు నామాటను మన్నించిరి. మిత్రులు శ్రీ ఉరుపుటూరి రాఘవాచార్యులుగారు, శ్రీ బి. దామోదర రెడ్డి (తిరుమలాపురం), శ్రీ ఎస్. ఎన్. రెడ్డి (శ్రీ ప్రతాపరెడ్డిగారి జ్యేష్ఠ పుత్రులు) గారల సహాయమున ముద్రణమునకు కావలసిన ధనమును సేకరించిరి.
రెండవ ముద్రణమునకై సిద్ధపరచబడిన రామాయణ విశేషముల ప్రతిలో మొదటి ముప్పదిరెండు పుటలు లేవు. మార్పులు కూర్పులతో నున్నట్టి యా భాగము ప్రతాపరెడ్డిగారు ముద్రింపించిరి. కాని ముద్రింప బడిన యీ పుటలన్నియు లభించలేదు మొదటి ఫారము లభించలేదు. దానిలో పీఠికలు మున్నగునవి ఉండియుండును. ఈ యూహముతో నేను శ్రీ ప్రతాపరెడ్డిగారి 'నా మనవి', శ్రీ వీరభద్ర శర్మగారి 'మాట', శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారి పీఠిక లున్నవియున్నట్లుగా నిందు కూర్చితిని. వీనిని రెడ్డిగారు తాము రెండవ ముద్రణ మారంభించినపు డుంచిరో తీసివేసిరో తెలియదు. తీసివేయలేదనియే నా తలంపు. రెండవ ఫారమసలు గ్రంథముతో నారంభమైనది. ఈ గ్రంథమున 12 వ పుటలో రామాయణ ప్రాశస్త్యమను శీర్షికకు పూర్వమున్న వాక్యముతో రెడ్డిగారు మరల ముద్రింపించిన రెండవ ఫారము (16 వ పుట) పూర్తియైనది. మొదటి ప్రతితో పోల్చిచూడగా నీ రెండవ ఫారమున రెడ్డిగారు వాల్మీకి యెవరను శీర్షిక క్రింద అనేక విషయములు చేర్చినట్లు కనిపించినది. అనగా పదియవ పుట ఆరవ పంక్తినుండి గల విషయమంతయు క్రొత్తకూర్పే. మూడవ ఫారము మరల లభించలేదు. మన దురదృష్టమున నందేయే విశేషములు పోయినవో తెలియదు. నాల్గవ ఫార మీ గ్రంథమందలి 22 వ పుట 9వ పంక్తితో ప్రారంభమైనది. ఈ గ్రంథమున 12 వ పుటలోగల రామాయణ ప్రాశస్త్యమను శీర్షిక నుండి 22 వ పుట 8 పంక్తులవర కున్న విషయమంతయు ప్రథమ ముద్రణము ప్రతినుండి గ్రహించితిని. మొదటి ముద్రణమున వాల్మీకి యెవరను శీర్షిక క్రింద నున్న చివర 5 పంక్తులు ('వాల్మీకికి భరద్వాజుడను శిష్యు డుండెనని పై ద్వితీయ సర్గలో తెలిపినారు. ఇంతకన్న మించి వాల్మీకిని గురించిన యంశాలు మనకు తెలియవచ్చుట లేదు వాల్మీకి ఏకాలమువాడు అను విషయమును చర్చించుటకు గాను అతడు రాముని సమకాలికు డగుటచేత రాముని కాలము కూడ నిర్ణయించవలసి యుండును. కావున నీ రెండును ముందు చర్చింప బడును' అను మాటలు) ఈ ముద్రణమున కనుకూలించునట్లు నేనే తొలిగించితిని. నాలుగవ, ఐదవ ఫారము లక్కరకు వచ్చినవి. ప్రథమ ముద్రణ ప్రతిలో రెండవ ప్రకరణము బౌద్ధజాతక రామకథా విశేషముల చర్చతో (20 పుట) ముగిసినది. ఇది లభించిన ఫారములందు 38 వ పుటకును ఈ గ్రంథమున 42 వ పుటకును వర్తించును. ఈ గ్రంథమున 43 నుండి 45 పుటల వరకు గల విషయమంతయు లభించిన ఐదవ ఫారమందలి చివర రెండు (39-40) పుటలందు గలదు. ఇది ప్రథమ ముద్రణ ప్రతిలో లేదు. ఇది యంతయు రెండవ ప్రకరణమున రెడ్డిగారిచే క్రొత్తగా చేర్చబడినట్టిదే. ఈ గ్రంథమున 45 పుట......ఇట్టి గుర్తులతో విడిచి పెట్టితిని. లభించిన ఐదవ ఫారము చివర పుట (40) 'ఋషులు సంతృప్తులై రాముని శపింప' అను అర్ధ వాక్యముతో ముగిసినది. ఆరవ ఫారము లభించలేదు. కనుక నీ రెండవ ప్రకరణ మేరీతిగా ముగిసినదో తెలియదు. ఇంతేకాదు-మూడవ ప్రకరణ మంతయు లభించలేదు. అందు రెడ్డిగా రే యే విషయములు మరల చేర్చిరో తెలియదు. కనుక మూడవ ప్రకరణమున నధిక భాగము ప్రథమ ముద్రణ ప్రతి నుండి గ్రహించితిని. ద్వితీయ ముద్రణమునకై వారు సిద్ధపరచిన ప్రతి 32 వ పుటనుండి లభించినదని మొదట మనవి చేసితిని. ఆ 32 వ పుటలో సగము భాగము వారు కొట్టివైచుటచే నదియు నీ గ్రంథమున చేర్చబడలేదు. తక్కిన సగము భాగమున ప్రక్షిప్తములను శీర్షికతో నారంభమగు దానిని వారు నాల్గవ ప్రకరణముగా వ్రాసియుంచిరి. అందుచే ప్రక్షిప్తముల నుండి నేను నాల్గవ ప్రకరణ మారంభించితిని. (పుట 69). ఇచ్చటినుండి గ్రంథమంతయు సమగ్రముగా శ్రీ ప్రతాపరెడ్డిగారి హృదయ మాశించునటులే ముద్రింప గలిగితిమి. హైదరాబాదు నగరమందు రెడ్డిగారి యింటను, వారి స్వగ్రామమునను వారు ముద్రింపించిన ఫారములకై వెదకితిమి కాని లాభములేదయ్యెను. లభించని వానిలో నేయే విషయము లధికముగా చేర్చిరో తెలియరాదు. ఇది గ్రంథమును గూర్చిన కథ.
కీ. శే. శ్రీ ప్రతాపరెడ్డి గారి పేరుతో హైదరాబాదులో వాఙ్మయ పరిశోధన మొనర్చు వారి కొక యుపకార వేతనము నెలకొల్పవలయునని వారి కుమారుల యొక్కయు మాయెక్కయు తలంపు. దీనికై కనీస మేబదివేల ధనము మొదట ప్రోగుచేయబడవలెను. రెడ్డిగారి ముద్రితాముద్రిత గ్రంథములన్నియు ప్రకటించి వానిపై వచ్చెడు రాబడి నంతయు నిధిగా నొనర్చి దాని వడ్డీతో నీ యుపకార వేతన మీయవలయునని మా యభిప్రాయము. అందుకై రామాయణ విశేషముల ముద్రణ మారంభ ప్రయత్నము. తరువాత ఒక్కటొక్కటిగా వారి గ్రంథములు ముద్రింపింతుము. అటుపై నిధిని కూర్చుటకై ఆంధ్ర దేశము నర్థింతుము. ఆంధ్రలోకము మా యీ ప్రయత్నమును మన్నించునని యాకాంక్ష.
రెడ్డిగారి కత్యంత స్నేహపాత్రులగు శ్రీ అనుముల సుబ్రహ్మణ్య శాస్త్రి గారింకొక పీఠిక వ్రాసి దీనికి వన్నె గూర్చినారు. వారికి మా కృతజ్ఞతలు. గ్రంథ ముద్రణమునకు కావలసిన ఆర్థిక సహాయ మొనర్చిన శ్రీ ఎస్. ఎన్. రెడ్డిగారికిని, శ్రీ దామోదర రెడ్డిగారికిని, మా సంఘ సహాయ కార్యదర్శి శ్రీ ఉరుపుటూరి రాఘవాచార్యులవారికిని మా కృతజ్ఞతలు. సారస్వత ప్రియు లెందరో గ్రంథ ముద్రణమునకై విరాళములిచ్చినారు. వారికి నా నమోవాకములు.
హైదరాబాదు,
ఫాల్గుణ శుద్ధ సప్తమి.
శా. శ. 1878
బి. రామరాజు
కార్యదర్శి
ఆంధ్ర రచయితల సంఘం.
(ద్వితీయ ముద్రణ సంపాదకీయం)
మాట
"హేమ్నః సంలక్ష్యతే హ్యగ్నౌ విశుద్ధిః శ్యామికాపి వా" అను మహాకవి కాళిదాసుని చారుతరోపదేశము ననుసరించి, ఎట్టి విలువగల వస్తువైనను పరిశోధింప బడకయే ప్రతిష్ఠ నందజాలదు అట్లని విపరీత పరీక్షకు బూనుచో శ్రేష్ఠతరమైన రత్నము గూడ రాయిగా నిర్ణయింపబడవచ్చును. అందుకని విమర్శకునకు పరిశీలనపట్ల నా యా వస్తువుల యోగ్యతాజ్ఞానము కూలంకషముగ నుండి యున్ననే యది సహృదయుల సంభావనకు పాత్రము కాగలదు. లోకమందలి దోషజ్ఞుల కెల్లరకును నిట్టి యలౌకిక ప్రతిభ యదృష్టవశముననే పట్టును. ఐనను సామర్థ్యమున్నంతమట్టుకు అక్షరాస్యు లూరకుంట పాడి కాదు. పునఃపునరభ్యాస వశమున కొందరుత్కృష్ట పరీక్షకులుగను దేలవచ్చును. నీట మునుగకుండ ఈత నేర్చినవారు గలరా? తెలిసిన దానిని దేల్చుకొనుటకును కొందరు కలమును గదలింతురు. ప్రపంచమునంతను మెప్పింప బ్రహ్మతరము కాదన్నట్లు ప్రతి కృతియందును ఏదో కొరత యుండక తీరదు. ఈ వినయమును పరీక్షకులు దురుపయోగ పరపకుందురు గాక!
వివిధ భాషా విశారదులైన శ్రీ సురవరము ప్రతాపరెడ్డి బి. ఎ. బి.యల్. గారు ఇటీవల సంస్కృత గ్రంథములను గూడ సానబట్టుటకు బూనినారు. వారెద్దానినైనను ఊరక వదలువారు కారు. విశ్వవిఖ్యాతమైన వాల్మీకి రామాయణమును శ్రీ రెడ్డిగారు ఆత్మవిజ్ఞానాభివృద్ధికొరకు పఠించినను ఆ పఠనమును ఉపయోగింపదలచి యొక విమర్శలేఖను వ్రాయ నారంభించి యందలి కొంత భాగమును విద్వాంసుల పరిశీలనకై హైదరాబాదు ఆంధ్ర విజ్ఞాన వర్ధినీ పరిషన్ముఖమున శ్రుతపరచిరి. తరువాత నా వ్యాసమే విశదముగ “రామాయణ విశేషములు" అను పేరుతో రెండేడులనుండి “విభూతి” లో ప్రకటింప బడుచుంట పాఠకులకు సువిదితము. లోకమున భిన్నరుచు లుండుటయు క్రొత్త గాదు. ఈ వ్యాసము నవలోకించువారిలో కొందరు 'విభూతి' సంపాదకుల మందలించిరి. మరికొందరు శైవ పక్షపాతము వలన రామాయణమున కపకీర్తి కలిగింపబడుచున్నదనిరి. సమర్థమైన పరిశ్రమతో నిది వ్రాయబడినదనియును, త్వరగా పూర్తి గావింపుడనియును పొగడిన విజ్ఞులును లేకపోలేదు.
ఈ వ్యాసమును ప్రచురించుటలో నిందాస్తుతులతో నా కెట్టి ప్రసక్తియును లేదు. విమర్శన వ్యాసముల పట్ల సాజముగ నాకుండెడు ప్రీతిని బట్టియే ఇది 'విభూతి'లో వెలిగినది. శ్రీ ప్రతాపరెడ్డిగారు వైష్ణవ మతీయులే కావున 'విభూతి' వారి శైవత్వమువలన రామాయణమునకు రవ్వ గలిగించు నుద్దేశ్య మింతకంటెను కాదనుటను తెల్ప నవసరము లేదు. ఇందు భ్రమప్రమాదములు లేవని లేఖకులు ప్రతిన బూనలేదు. దీనిపై అర్హములైన ప్రతివిమర్శనా వ్యాసముల 'విభూతి'లో ప్రచురించుటకు సంపాదకులు సన్నద్ధులయియే యున్నారు.
దీనిని రచించుటలో శ్రీ రెడ్డిగారు మిక్కిలి పరిశ్రమించిరనియును పెక్కు గ్రంథముల నవలోకించిరనియును ఎట్టివారైనను జెప్పవచ్చును. ఆంధ్రమున నింత విపులముగ వ్రాయబడిన రామాయణ విషయక వ్యాసము వేరొకటి కనుపడలేదు. దీనిని సరిగా నుపయోగించుకొని మరియొక యుద్గ్రంథమును విజ్ఞులు సిద్ధపరచవచ్చును. ఈ దృష్టితో శ్రీ రెడ్డిగారి ఈ చిన్ని పొత్తమునకును విలువ యుండకలదు. ఓర్పుతో నీ వ్యాసమును “విభూతి” కందించినందులకు శ్రీ రెడ్డిగారికి ధన్యవాదములు.
ఈ వ్యాసమున ననేక స్థలములలో శ్రీ రెడ్డిగారు తమ నిశితమైన బుద్ధిఫాటవమును జూపియేయున్నారు. కాని ఏకవేణీశబ్దార్థము, హను మంతుని బ్రహ్మచర్యము, విమానములు, ఆర్యావర్తప్రదేశము మున్నగు వానిని నిర్ణయించుటలో వారి యూహ సమర్థమైనది కాదని నా యల్ప బుద్ధికి దోచుచున్నది. ఇటులే యింకను కొన్ని దోషములు కొందరికి స్పష్టముగ గోచరము కావచ్చును. వాల్మీకి రామాయణ మొక పరమ పావన గ్రంథమని విశ్వసించుట భారతీయుల ధార్మిక కర్తవ్యమేయైనను, సద్విమర్శనకు గురిగాని గ్రంథరత్నము ప్రకాశింపదు. కావున పరీక్షకులు జంకక దొసగులను దొలగింప ప్రయత్నింతురని సాదరముగ నభ్యర్థించుచున్నాను.
సికింద్రాబాదు,
శా. శ. 1865- వైశాఖ
శుద్ధ ఏకాదశి.
చిదిరెమఠము వీరభద్రశర్మ,
విభూతి - సంపాదకుడు.
పీఠిక
నాకు ముప్పది యేండ్లనాఁడు (1913) రామాయణాంశములను విమర్శింపుచుఁ జిన్న గ్రంథమును వ్రాయు కుతూహలము కలిగి 'శ్రీరాముని జనన కాలనిర్ణయము', 'దక్షిణదేశమునకుఁ దొలుత వచ్చినవారెవరు?', 'రామాయణ చరిత్ర' అను వ్యాసములను వ్రాసి 'మానవ సేవ' 'ఆంధ్ర భారతి', 'ఆం. సా. పరిషత్పత్రిక' మొదలగువానిలోఁ బ్రచురించితిని. ఆ వ్యాసము పైఁ గొందఱానాడె వ్యతిరేకాభిప్రాయములను సదభిప్రాయములను గూడ సూచింపుచుఁ బత్రికలకు వ్రాసిరి. నాకు వేఱుకార్యములు కల్గుటచే రామాయణ చరిత్రను వ్రాయలేనైతిని. కాని యిపుడు మిత్రులగు శ్రీ సురవరము ప్రతాపరెడ్డిగారు వ్రాసిన “రామాయణ విశేషములు" అను గ్రంథముఁ జదువ నా యభిలాషయు సంపూర్ణముగాఁ దీరినదని సంతసించితిని. కొన్ని యెడల నభిప్రాయభేదములుండుట సహజమె. నేనే వ్రాసినయెడల శ్రీ రెడ్డిగారు వ్రాసిన ప్రాచ్య పాశ్చాత్య పండితులు రామాయణముఁ గూర్చి సంస్కృతాంధ్రేతర భాషలలో వ్రాసిన యంశములను గ్రహింపకుందును. శ్రీ రెడ్డిగారు ఆంధ్రాంగ్ల, సంస్కృత, హిందీ, ఉర్దూ భాషలలో నికరమైన సాహిత్యము కలవారు. నాకు సంస్కృతాంధ్రములే శరణ్యములు. కాన సర్వవిధముల రెడ్డిగారి గ్రంథ ముత్కృష్టమైనదని నా తాత్పర్యము.
నేను 1941 సంవత్సరము అక్టోబరు నెలలో హైద్రాబాదు వెళ్లినపుడు శ్రీ రెడ్డిగారీ గ్రంథములోని కొన్ని యంశములను వినిపించి దీనికిఁ బీఠికను వ్రాయుమనగా యట్లేయని యంగీకరించితినిగాని బహుళ గ్రంథాంశములు గల దీని జూడ నాపీఠిక సరిగా నుండదని తలఁతును. అయిన నాకొలఁదిగ వ్రాయుచున్నాను.
శ్రీ రెడ్డిగారు రాముని కాలముఁ గూర్చియు, వాల్మీకి కాలముఁ గూర్చియుఁ జాల చర్చించియున్నారు. శ్రీరాముఁడు ఋగ్వేదావిర్భావమునకుఁ బూర్వుడనుట నిశ్చయమె. వాల్మీకి విరచితమని చెప్పబడు దృశ్యమాన శ్రీమద్రామాయణమంతయుఁ బ్రాచీనుఁడగు వాల్మీకిచే రచియింపఁబడలేదు. ప్రాచీన వాల్మీకి రామాయణము భిన్న వృత్తములు కలదిగాఁ గాక వేదోదితమగు “అనుష్టుప్” ఛందస్సులోఁ గొంచెము మార్పునొందిన యనుష్టు బ్రూపయుక్త గ్రంథమని లౌకిక ఛందోరూపమగు "మానిషాద” అను శ్లోకమే యుదాహరణముగాఁ గల్గియున్నది. 'మానిషాద' అను శ్లోకము అనుష్టువ్ ఛందోజనితము . వైదిక వాఙ్మయమునం దనుష్టుప్ఛందస్సు కలదు. అది ప్రతిపాదమునకు నెన్మిదేసి యక్షరములుగల నాల్గుపాదములు గలది. గురులఘు నియమము లేదు. కాని యా అనుష్టుప్పును వాల్మీకి లౌకిక వాఙ్మయమునకుఁ దెచ్చుటలోఁ గొంత మార్పును గల్గించియున్నాఁడు. ఆదేదనగా - లౌకికానుష్టుప్పునఁ బ్రథమ తృతీయ పాదములలోని పంచమాక్షరములును ద్వితీయ చతుర్థ పాదములలోని సప్తమాక్షరములును నియమ యుక్తములగుటచేఁ బాడు నపుడు లయకు సరిపడును. ఇదియే వాల్మీకి మహర్షి లౌకికమునకు దెచ్చి రచించి పాడించిన రామకథ. యజ్ఞములయందు కర్మములనడుమఁ గల విశ్రాంతి సమయమున సదస్యశాలలో యజమానుఁడు, ఋత్విజులు, పెద్దలు కూడినపుడిట్టి గాథలఁ బాడించుట కల్గును. రాముఁడశ్వమేధముఁ జేయునపుడు వాల్మీకి రామాయణమును 'కుశలవ' సంజ్ఞలుగల యిరువురు శిషులగు 'కుశలవు' లచే బాడించెను. ప్రాచేతస (వాల్మీకి) ద్రష్టములగు కొన్ని సామములు సామవేదమునఁ గాన్పించుచున్నవి. అవి యశ్వమేధమున నేసమయమున హోతచే గానము చేయఁబడునో పరిశీలింపవలసి యున్నది. వాల్మీకి తొలుత రచించి పాడించిన రామకథ అనుష్టుప్పులచేఁ గూర్పఁబడి నేటి రంగనాథ రామాయణములోని ద్విపద గాధవలె నుండును. దానిని 4 - 5 దినాలలో వీణలమీద కుశలవులు పాడియుందురు. ఆందు భిన్నభిన్న వృత్తములుండవు. భిన్నభిన్న వృత్తములు గల వాఙ్మయముతోఁగూడిన రామకథ పిమ్మట చేర్పఁబడినదేయని తలతును. రామాయణమునకు ప్రస్తుతరూపము కాళిదాసునకుఁ బూర్వము (క్రీ. శ. 4 శతాబ్దము) గోతమీపుత్ర శాతకర్ణికిఁ బిమ్మటను ( క్రీ. శ. 2 శతాబ్ది) గల ప్రాకృత వ్యాకరణకర్తయగు (వాల్మీకి) కూర్చియుండెనా యని తలచుచున్నాను. కారణమేమనగా, క్రీ. శ. రెండవ శతాబ్దమునకుఁ గాని మన యీ దేశమునకు 'ఆంధ్ర' సంజ్ఞ కలుగలేదు. కిష్కింధాకాండలో నాంధ్రదేశ ప్రశంస కలదు. రాముఁడరణ్యావాస మొనర్చిన పంచవట్యాదు లిప్పటి యాంధ్రదేశాంతర్గతములు. అవి నాఁడు ఘోరా రణ్యయుతములు. ఆంధ్రదేశ సంజ్ఞ రామునినాఁ డెట్లుండును? కాన నా భాగము రెండవ వాల్మీకి కల్పితమె. ఇట్లే ఉత్తరకాండతో హనుమంతుని వ్యాకరణ జ్ఞానప్రశంసలో నాతఁడు 'పాణినిసూత్రములు వరరుచి వార్తికము, పతంజలి భాష్యము' కూడ చదివినట్లు క్రింది శ్లోకముచే సూచింపబడెను.
శ్లో॥ ససూత్రవృత్యర్థ పదంమహార్థం। ససంగ్రహంసాధ్యతి
వైకపీంద్రః|| - 49 ఉత్తరకాండ. 36 స.
పై శ్లోకమునకు మహేశ్వర తీర్థీయవ్యాఖ్య యిట్లు కలదు: “సూత్రం, అష్టాధ్యాయీ లక్షణం, వృత్తిః (కాశికావృత్తిః) తాత్కాలిక సూత్రవృత్తిః ఆర్థపదం సూత్రార్థబోధక పదవద్వారికం, మహార్థం, మహాభాష్యం పతంజలికృతం, సంగ్రహం వ్యాడికృత సంగ్రహాఖ్య గ్రంథసహితం”.
ఇట్లు క్రీ. పూ. 2వ శతాబ్దమునందలి పతంజలి భాష్యమును గోతమీపుత్ర శాతకర్ణి నిర్మితమగు నాంధ్రదేశమున స్మరింపబడిన రామాయణములోని కిష్కింధోత్తర కాండాంశములు నవీనములు. కాని కాళిదాసు మహాకవి తన రఘువంశ మహాకావ్యమున రామాయణోత్తరకాండలోని గాథలను చేర్చియుండుటచే కాళిదాసునకు పూర్వముననే దృశ్యమాన వాల్మీకి రామాయణము పూర్తియైనదని చెప్పనగుచున్నది. మరియు అయోధ్యకాండలోని భరత శ్రీరాముల సంభాషణమునందలి రాజనీతి శ్లోకములను మహాభారతాంతర్గతమగు సభాపర్వములోని నారదుడు ధర్మజునకు జెప్పిన రాజనీతి విశేషములే. అట్లే సుందరకాండలోని సీతావర్ణనము మహాభారతములోని అరణ్యపర్వాంతర్గతమగు దమయంతీ వర్ణనము లేక రూపములే భారతకర్త వాల్మీకమునుండి దొంగిలించెనా? వాల్మీకి భారతమునుండి యపహరించెనా? నాకుఁ జూడ దృశ్యమాన వాల్మీకి రామాయణములోని బెక్కు శ్లోకములు భారతాదులనుండి కైకొన బడినవనియే యని తలంచుచున్నాను.
మరియు మహాభారతములోని యారణ్యపర్వమున రామాయణకథ కలదు. అందలి గాధలకును దృశ్యమాన వాల్మీకి రామాయణములోని గాథలకును గొన్నియెడల భేదములున్నవి. భారతమున రావణుడును విభీషణుడును భిన్నోదరులు కుంభకర్ణుని లక్ష్మణస్వామి వధించి యున్నాడు కాని "భారత తాత్పర్య నిర్ణయము" అను మహాభారత వ్యాఖ్యలో శ్రీ మధ్వాచార్యులవారు కుంభకర్ణునకు అతికాయుడు అను నర్థము పొసగునట్లు విమర్శనమును చేసియున్నారు. భారతములో రామాయణకథయం దుత్తరకాండ గాధలు లేనందున నది ప్రాచీనమనియు రెండవసారి వృద్ధికాబడిన వాల్మీకి రామాయణములోని రామకథ భారతాంతర్గత రామకథకు పెంపకము చేయబడినదని తలంచుచున్నాను.
తొలుత అనుష్టుప్ఛందస్సుగా వాల్మీకిచే నిర్మింపఁబడిన రామాయణకథయే నించుమించుగ భారతారణ్య పర్వమున నేడువందల యిరువది మూఁడు (723) అనుష్టుప్పులతో జెప్పబడి యున్నది. ఇవి వాల్మీకి విరచితగేయానుష్టుప్పులు గాకుండినను తదనుకరణములుగా నుండవచ్చును.
మరియు అధర్వసంహిత 13 కాండ 1 సూక్తములో కొన్ని సూత్రములు నరుడు చేయరాని కర్మలఁ జెప్పును. ఆ మంత్రములే పెక్కులు శ్లోకరూపముగా, అయోధ్యకాండ 75 సర్గయందు భరతుఁడు కౌసల్యకడఁ జేయు ప్రమాణములలోఁ గాన్పించును. జైన బౌద్ధమతాంశము లెట్లు శ్రీమద్రామాయణమునఁ జేరినవో శ్రీ రెడ్డిగారు వివరించియే యున్నారు.
రెడ్డిగారు వానరరాక్షస తత్వములు, నాటి సాంఘికాచారములు మొదలగు వానిని జక్కఁగా విమర్శించుచు రామాదుల మాంస, గోమాంస, మధుపర్క భక్షణములానాఁడు కలవనియు, నవి యానాఁడు విరుద్ధములు గావనియు వ్రాసిరి. నాకుఁజూడనన్ని స్మృతులలో శ్రాద్ధాది క్రియలలో మాంసభక్షణము విహితముగానె గాన్పించినది. మాంసభక్షణమునకుఁ బ్రాయశ్చిత్తము చెప్పిన స్మృతిగాని “ఉల్లిపాయ” (లశున) భక్షణమునకుఁ బ్రాయశ్చితము చెప్పని స్మృతిగాని కాన్పింపలేదు. మాంసము లేనిదే మధుపర్కము కాదనినాడు తన గృహ్యసూత్రమున, ఆశ్వలాయనమహర్షి (నా మాంసోమధుపర్కః). "పంచనఖాభక్ష్యాః" అనినాడు, పతంజలిమహర్షి. "ధేన్వనడుహోర్భక్షం- మేధ్యమానడుహమితవాజస నేయకం” అన్నాడాప స్తంబమహర్షి, తన ధర్మసూత్రమున. శ్రీరాముడు గోమధుపర్కముఁ గొనుట యాశ్చర్యముకాదు. శ్రీ కృష్ణమూర్తి గోపాలుడు సంధికై హస్తిపురి కేగినపుడు దుర్యోధనుఁడు తన యింట భుజింపుమనగా భుజింపనని నిరాకరించెనేగాని ధృతరాష్ట్రు మందిరమున కేఁగినవెంటనే ధృతరాష్ట్రుడు నగరిపురోహితులచే నిప్పించిన గోమధుపర్కము నాప్యాయనముగా నాస్వాదించెను ఇవి ప్రాచీనకథలు. ఇప్పటి కాఱువందలయేండ్లకుఁ బూర్వమువఱకు సకృత్తుగా మత్స్యమాంస భక్షణము మన యాంధ్ర బ్రాహ్మణులలో నున్నదేమోయని శ్రీ మాధవాచార్యులవారు తన పరాశరమాధవీయములో నిత్యనైమిత్తికములలో మత్స్య మాంసభక్షణముఁ గూర్చి చర్చించి చర్చించి తుదకు “యథావిధి ప్రయుక్త శ్రాద్ధే నియుక్తస్య నమత్స్య మాంసభక్షణో దోషావహః” అని చెప్పుటచే నూహ్యమగుచున్నది. కేతన మహాకవి తన విజ్ఞానేశ్వరీ యాంధ్రీకరణమున మూలమునందుండిన 'మహోక్షం వా మహాజం వా శ్రోత్రి యాయప్రకల్పయేత్" అను శ్లోకము నాంధ్రీకరింపలేదు. కాని యితరములగు “నంజుడు" నములుటను గూర్చిన శ్లోకములను యథా మాతృకగా నాంధ్రీకరించెను.
మఱియు సత్రములలో బ్రాహ్మణుల భోజనమునకును ఈశ్వర నైవేద్యమునకును నంజుడు నుపయోగించుచుండినట్లు South Indian Inscriptions, 4th, 5th volumes లో పెక్కు శాసనములున్నవి.
ఇప్పుడును పంచగౌడులలో మత్స్యమాంసభక్షణము దోషము కాదు. మహామహోపాధ్యాయులైన మిథిలదేశపు పండితులును, వేదవేత్త లైన ఉత్కళదేశపు వైదికులును మత్స్యమాంసభక్షణమును జేయుటను జూచి యొక యాంధ్రపండితు డిట్లనినాఁడు:
శ్లో॥ అవతారత్రయం విష్ణోః మైథిలైః కబళీకృతం.
శ్లో॥ మత్స్యమాంస భక్షణం, కక్షకేశరక్షణం ఓఢ్రజాతి లక్షణం.
అని విచిత్రముగాఁ జెప్పియున్నాడు. పర్లాకిమిడి కళాశాల యం దుపాధ్యాయుడును నాకు మిత్రుడునగు నొక వైదిక ఓడ్ర బ్రాహ్మణుని వారియందుగల మత్స్యమాంస భక్షణమును గూర్చి నేను బ్రశ్నింపగా పొలుసుగల మత్స్యములను జాంగలములగు “యిర్రి, దుప్పి, కణుసు" అనువాని మాంసములను మాలో పెక్కండ్రు భుజించుచుందురని జెప్పియున్నాడు. మత్స్యమాంసభక్షణము చేయుటచే హిందువు బలమును వృద్ధిచేయుటకు హేతువని బ్రహ్మసమాజ మతస్థాపకుడగు శ్రీ రాజారామమోహనరాయలవారు తమ పార్లమెంటు సాక్ష్యములో జెప్పిరి. శ్రీ వివేకానంద స్వాములవారు ప్రాక్పశ్చిమములు (East and West) అను గ్రంథమున భారతీయులు దాస్యవిమోచనము నొందువరకు మత్స్యమాంస భక్షణము విధిగా జేయవలయునని ప్రోత్సహించి యున్నారు. అమాంసభుక్కులగు నాంధ్రాది పంచద్రావిడులకుఁ బై వాక్యములన్నియును నే డసహ్యకరములును నాశ్చర్యకరములుగా నుండునుగదా!
రామాణమునందలి పరశురాముడు భారతములో భీష్మునితో బోరాడుట విచిత్రాంశము. బ్రహ్మాండ పురాణములో పరశురాముడు శ్రీకృష్ణునికై తపస్సు చేసి వరములనొందియే క్షత్రియ సంహారమునకు గడంగెనని కలదు. ఇదెట్టి విచిత్రాంశమో! వైదిక వాఙ్మయమున ఋగ్వేదమున మాత్రమే రాముని ప్రశంస కలదు. అతడు శ్రీరాముడే యనదగు. పరశురామ బలరాములు పేరులు గాన్పింపవు. కాని ఐతరేయ బ్రాహ్మణమున మార్గవేయరాముడను నొక ఋషి కాన్పించుచున్నాడు. కాశ్యపులైన బ్రాహ్మణులు 'శ్యాపర్ణి' మహారాజు యొక్క యజ్ఞశాలకుం బోయి సోమపానముంజేయ సిద్ధపడగా శ్యాపర్ణి యాబ్రాహ్మణులను యజ్ఞశాలనుండి కొట్టి తరిమివేసెను. అప్పుడు పరుగెత్తుచుండిన కాశ్యపులకు మార్గవేయరాముడు తోడ్పడి శ్యాపర్ణిని వాగ్వివాదముననే జయించి కాశ్యపులకు సోమపానార్హతను కలిగించెనని పై బ్రాహ్మణము చెప్పుచున్నది.
ఈ కథయే భార్గవేయరాముని జయముగా బురాణములలో వృద్ధి కాబడెనేమో! (నాగరలిపిలో మ, భ అను నక్షరముల కంతగా భేదము లేనందున భార్గవను మార్గవగా చదివిరేమో)
వానరులగూర్చి విశేషచర్చను రెడ్డిగారు చేసియున్నారు. వానర, కిన్నర, కింపురుష శబ్దములు ఏకార్దబోధకములుగా కూచిమంచి తిమ్మకవి ( ప్రసిద్ధ తిమ్మకవియొక్క పౌత్రుడు) తన రామాయణ విమర్శనమునఁ జెప్పియున్నాడు. కింపురుష శబ్దమునకు తైత్తిరీయ బ్రాహ్మణమున ఆటవికులకు సంగీతమునుబాడి జీవించువాడు అను నర్థము గలదు. (చూ. సున్నాలపన్నము) వానరాది పై శబ్దములు వికల్పనరుడు కుత్సితనరుడు అను నర్థము నిచ్చునుగదా!
ఆర్యావర్త, ఏకవేణిశబ్దములగూర్చి శ్రీ చిదిరెమఠం వీరభద్రశర్మగారు భిన్నాభిప్రాయమిచ్చియున్నారు. ఆర్యావర్తమన నొకప్పుడు టైగ్రీసు (శరావతి) వరకు పాటలీపుత్రము మొదలు వ్యాపించియే యున్నదని నాయొక్క యభిప్రాయమునై యున్నది. వేదమునందు పవిత్రదేశముగా వర్ణింపబడిన గాంధారము (Kandhahar) నేటి యార్యావర్తములోని దనదగునా? వేదములో నపవిత్రదేశముగా చెప్పబడిన కీకటము (మధ్యగయా ప్రదేశము) నేడు పవిత్రదేశమేకదా! ఆర్యావర్త సంజ్ఞ నేడు భిన్న రూపముననే యున్నది. ఇప్పటి యార్యావర్తముయొక్క పటమును మహా మహోపాధ్యాయ శివదత్తశర్మ లాహోరు సంస్కృత కళాశాలాధ్యక్షుడు తాను ప్రకటించిన పతంజలి భాష్యముయొక్క పీఠికలో జిత్రించియున్నాడు. దేశసీమలు వేరువేరు కాలములలో ప్రభుత్వము ననుసరించి మారుట సహజమే. ఏకవేణిశబ్దమునకు జటకట్టిన కేశపాశముకలదియని యర్థము. ప్రోషితభర్తృక కేశ సంస్కారమును చేసికొనరాదని పతివ్రతాధర్మములలో గలదు. కేశపాశమును ద్విధా విభాగించి ముడిచికొనుట స్త్రీలకు నశ్వమేధకాలమున మేధాశ్వమునకు జేయు పరిచర్యలో మాత్రమె కలదని శ్రీమద్రామాయణముయొక్క బాలకాండ 14 సర్గ. వ్యాఖ్యలో జర్చింపబడియున్నది. పురుషుడు కేశపాశమును రెండుగా విభజించి ముడుచుకొనుట పితృమేధ సమయముననే. ప్రాచీనకాలమునుండి నేటివరకు సనాతన ధర్మిష్ఠలగు స్త్రీలు కబరీభారయుక్తలు. ఆ కొప్పు పెట్టుకొనుటలో ఆర్యద్రావిడాంగనలకు భిన్న రూపములు కలవు.
సీతారాముల చరిత్రములను గూర్చి యీ క్రింది గ్రంథములలోఁ గలదు. అందు భిన్నరూపగాథలును గలవు.
1. పూర్వధర్మఖండము 2. ఉత్తరధర్మఖండము 3. పద్మపురాణము 4. రామతాపన్యుపనిషత్తు 5. హిరణ్యగర్భసంహిత 6. ఉమాగస్త్యసంహిత 7. భాగవతము 8. అధ్యాత్మరామాయణము 9. భారతము 10. విష్ణుపురాణము 11. కూర్మపురాణము 12. శేషధర్మము 18. బ్రహ్మపురాణము 14. స్కాందపురాణము 15. మత్స్యపురాణము 16. గరుడపురాణము 17. విష్ణుయామిళము 18. మోక్షఖండము 19. తత్వసంగ్రహ రామాయణము.
పై గ్రంథములలో స్మార్తులు రాముని అద్వైత పరబ్రహ్మము గాను వైష్ణవులు విష్ణురూపునిగాను మాధ్వులు ద్వైత మతానుసారినిగాను నిరూపించుచు తత్తన్మతానుసారులకు బాహ్యచిహ్నములను జిత్రించి తమ వానినిగా జేసుకొని యారాధించుచున్నారు. ఈ నడుమ నొక మహాపండితుడు రాముని లలితావతారునిగా నిరూపించి శక్తిస్వరూపునిగా రామాయణమునకు వ్యాఖ్యానము రచించియున్నాడు. వాల్మీకి రామాయణమునకు పై మతముల ననుసరించి బహువిధ వ్యాఖ్యానములు గలవు. ఇప్పటికి 30 యేండ్లకుముందు కీ. శే. బొబ్బిలి మహారాజాగారు రామాయణముపైని భారతముపైని చిన్న విమర్శన గ్రంథములను వ్రాసి యున్నారు. ఆ గ్రంథములు పండితులచేఁ బరిష్కృతములే. అందుఁ గొన్ని యంశములు శ్రీ రెడ్డిగారి గ్రంథాంశమునకు సరిపడియేయున్నవి. కాని అంతకంటె నిది సమగ్రమైనది. ఇంకొక మనవి యేమనగా:-
శ్రీ రెడ్డిగారు వ్రాసిన విభూతిలోని రామాయణ వ్యాసములపై నిప్పటికే పెక్కండ్రు విరుద్దాభిప్రాయముల నిచ్చియున్నారట పీఠిక కూడ వారి ఖండనములకు గురియగుటలో విరుద్ధములేదు. నేను భారత విమర్శనము వ్రాసి పెక్కండ్ర నిందలకు బాల్పడి యున్నాను గాన నా కది క్రొత్తగాదు. శ్రీ రెడ్డిగారుగాని నేనుగాని దీనిని విభూతిలో ప్రకటించిన శ్రీ వీరభద్రశర్మగారుగాని రామునియందు భక్తి లేనివార మని చెప్పుటమాత్రము సత్యమునకు బహుదూరమై యున్నది. నాచే పవిత్ర రామనామ స్మరణమే నిద్రనుండి లేచునపుడు, పండుకొనునప్పుడు, భుజించునపుడు సర్వకాల సర్వావస్థలయందు స్మరణీయ మగుచున్నది. అదియే తరణోపాయమని దృఢముగ దలఁచువాఁడను. కాని కథాదికమును విమర్శించుట మాత్రము నా ముఖ్యకార్యముగఁ దలతును.
శ్రీ రెడ్డిగారి రచనా విధానము ధారాశుద్ధిగలిగి ఆకర్షణీయముగ నున్నదికాని నాకందుగల వాడుకపదముల ప్రయోగము మాత్రము మనస్సునకు విరుద్ధమైనది అని సాహసించి చెప్పుచున్నాను.
పిఠాపురము
పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి
ది. 31-8-43
మలికూర్పు పీఠిక
నా ప్రియమిత్రులు కీ. శే. సురవరము ప్రతాపరెడ్డిగారు 'రామాయణ విశేషములు' అను నీ విమర్శన గ్రంథమును రచించి దాని ప్రథమ ముద్రణమును గావింపించి ప్రకటించియున్నారను విషయము సుప్రసిద్ధము. వారి యీ రచనాకాలమున కెంతో పూర్వమునుండియే మాకు సుఘటితమును సౌభ్రాత్రతుల్యమునైన గాఢమైత్రియున్నను దత్ప్రథమ ముద్రణానంతరము ప్రతి యొకటి పంపఁబడువఱకును వారి రచనోద్దేశముగాని, తత్పూరణముగాని తెలిసికొను నవకాశము నాకుఁ గలిగినదికాదు.
తరువాత మాత్రము మేము పలుమాఱు గలియుటయు గ్రంథస్థ విషయములను జర్చించుటయుఁ బ్రాయికముగా సంభవించుచుండెడిది. అందుఁ బరస్పర భిన్నాభిప్రాయములైన సందర్భములలోఁ బునర్ముద్రణమున నా యా విశేషములు వ్యక్తీకరింపఁబడునను నమ్మిక నాకు వారు గలిగించుచుండెడివారు. మొత్తము మీదఁ జారిత్రక విషయములలో ననేకములు నాకు నచ్చినవియే యై యున్నవి.
ఈ గ్రంథాదిని గానవచ్చు కీ. శే. చిదిరెమఠము వీరభద్రశర్మగారి యొక్కయు, కీ. శే. పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారి యొక్కయు బీఠికలను జూచువారికి రెడ్డిగారి గ్రంథరచనా ప్రకటనములలో నెంతెంతటి ప్రతిఘటనముల నెదుర్కొనవలసివచ్చెనో తెలియవచ్చుచునే యున్నది. ధీరులైన రెడ్డిగారు వానిని లెక్కింపక తమ కార్యమును దాము కొనసాగింపఁగలిగిరనుట యెంతయు గమనార్హమయిన విశేషము. “రామాయణ విశేషములు" అని తమ యీ పొత్తమునకుఁ బేరిడుటలో నేయే యుద్దేశములు వారి హృదయములో నుండెనోయవి దీని సాంగోపాంగముగాఁ జదువఁగల సహృదయులకు సాధారణముగాఁ దెలియవచ్చెడివియే యై యున్నవి. కావున వానిని నే నీ పీఠికలోఁ బ్రత్యేకము జ్ఞప్తిచేయనవసరము లేదనుకొనియెదను. శ్రీ పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తమ పీఠికలో వివరించినట్లు రెడ్డిగారు బహుభాషాకోవిదులు. వారికి సాధ్యమైన విమర్శనఫక్కి నాఁబోటివారికి సాధ్యముగాదని నేనును బాఠకులకు మనవిచేయుచున్నాను. గ్రంథ పునర్ముద్రణమున వారు సవరించుకొనఁదలఁచిన యనేక విశేషములు క్రోడీకృతములు గాకముందే నిర్దయదైవము నా ప్రియమిత్రుని మనకు దూరము చేసినది.
రామాయణక థావిషయమున నేను ప్రత్యేకించి చెప్పవలసిన యొకటి రెండు ముఖ్యవిశేషము లీ పీఠికలోఁ దెలియఁజేయుచున్నాను.
శ్రీమద్రామాయణము రామునికాలముననే రచింపఁబడినదని నమ్మించు ప్రయత్నము దాని యుపోద్ఘాతమునందే చేయఁబడినది. దీనిని రెడ్డిగారు బాగుగాఁ బరికించి యందలి యసంగతములను జూపుచు మూల మెంతవఱకుఁ బ్రక్షిప్త మెంతవఱకునని బహుముఖములఁ జర్చించి యున్నారు. వారు పునర్ముద్రణమున సవరించికొనఁబూని వ్రాసియుంచుకొన్న కొన్ని లేఖనములవలన నీ గ్రంథవిస్తరము క్రీస్తుశకమున కీవలఁ గూడ విరివిచేయఁబడుచువచ్చినదని వారు విశ్వసించినట్లు మనకుఁ దెలియవచ్చుచునేయున్నది. ఈ విషయములో నేను వారితో నెల్లవిధముల నేకీభవించుచున్నాను. ఇట్టి యీ మహా గ్రంథమువలన శ్రీరామచంద్రుని దేశకాలవిశేషముల స్వరూపనిర్ణయము చేయఁబూనుట సామాన్యముగా దుర్ఘటము గదా! అనుష్టుప్ఛందమున నున్న శ్లోకము లన్నియుఁగాని యం దనేకములుగాని ప్రథమకవివై యుండునను నూహసైతము సోపపత్తికముగా నున్నదని నేను తలంపను.
xxvii
కాని యీ మహారామాయణమునకు మూలమని చెప్పఁదగిన
సంక్షేప రామాయణముమాత్రము కథానాయకుని కాలమున కతి సన్ని
హితమైనదని నేను జాలకాలముగా నమ్ముచున్నాను. అది యిప్పటి
మహారామాయణమున కాదిమసర్గగా నందుఁ బ్రదర్శింపఁబడినది. కాని
యది యత్యంత పురాతనమయిన యొకానొక యార్షకావ్యముగా నేను
దలంచుచున్నాను.
“దృష్టార్థ కథన మాఖ్యానం" అని మన ప్రాచీన పురాణము
లందుఁ జెప్పఁబడిన యాఖ్యానలక్షణమున కది సర్వధా సరిపోవు
చున్నది. "శ్రుతార్థ కథన ముపాఖ్యానం" అను నుపాఖ్యాన లక్షణము
మహాభారతారణ్యపర్వమునఁ గానవచ్చు రామోపాఖ్యానమునకే యను
రూపముగ నున్నది. కనుక నా నిర్ణయము ప్రకారము -
“ఏతదాఖ్యాన మాయుష్యం పఠన్ రామాయణం నరః
సపుత్ర పౌత్ర స్సగణః ప్రేత్య స్వర్గే మహీయతే.”
రా. సర్గ 1. శ్లో 99.
అను తదుపసంహార శ్లోక ప్రమాణమునుబట్టి రామచరిత్రాత్మకమైన ఆ
యాఖ్యానముమాత్రమే మనకుఁ జారిత్రక ప్రమాణమనుట న్యాయమైనది.
ఇట్టి యాఖ్యానమున నే వృత్తాంతము లేదో అది యనైతిహాసిక మనియు
నేది కలదో అది యైతిహాసిక మనియు నొక నిర్ణయమునకువచ్చి విమర్శ
కులు రామకథా నిర్ణయమునకుఁ బూనుకొనుట యుక్తతమము.
ఆఖ్యానములు వేదములవలె నా ప్తవాక్యములుగాఁ మన పూర్వులు నిర్ణయించియున్నారు. వాయుపురాణమున విద్యాస్థానమునందు "ఆఖ్యాన పంచమాన్ వేదాన్" అను వర్ణన మనేక ఘట్టములలోఁ గలదు. ఇందు వలన నీ యాఖ్యానములు వేదములతోపాటు పఠింపఁబడవలసినవిగాఁ గూడఁ బెద్దల నిర్ణయము. ప్రసిద్ధములైన రామాయణ మహాభారత హరి వంశములందు వానికి మూలములై శ్రీరామ పాండవ శ్రీకృష్ణ చరిత్రాత్మకములైన యాఖ్యానములు తదారంభముననే నిక్షేపింపఁబడినవి. వాని ప్రాధాన్యమును గ్రహింపఁజాలని విమర్శకులు తత్తన్మహా గ్రంథకర్తలు మొదట వ్రాసి పెట్టుకొనిన విషయసూచికలుగా భావించి చేఁజేత వదలుచున్నారు. నేను శ్రీ లాలా లజపత్రాయి బంకించంద్ర చటర్జీ వగైరాలు వ్రాసిన శ్రీకృష్ణచరిత్రములఁ జూచి యవి వట్టి యూహామాత్రములగుట గమనించి సరియైన చరిత్ర ప్రమాణములు గలవేమో యని వెదకుచుండ హరివంశములో వేదవ్యాస విరచితమనఁదగి “ఇత్యువాచ పురావాస స్తపో నీర్యేణ చక్షుషా" అను నుపసంహారముగల యొక యాఖ్యానము గానరాగా దానిని బరికించి సత్యమును నిర్దరించి తద్వ్యాఖ్యానప్రాయముగనే శ్రీకృష్ణ చరిత్రమును వ్రాసియున్నాను. అందు మహాభారతాదిని "తతోధ్యర్థ శతం భూయః శుకమధ్యాపయన్మునిః" అను నారంభముగల 150 శ్లోకములుండ వలసిన యొక భారతాఖ్యానమునుగూడఁ బరీక్షించి మహాభారతకథ కది మూలమని సైతము నిశ్చయించియున్నాను. కాని నా యితర గ్రంథముల వలెనే అదియు "జీర్ణమంగే సుభాషితం" అన్న విధముగా నంగమునఁ గాకున్న నా ప్రాతపెట్టెలలో శిథిలమగుచున్నది. ఇది నా యదృష్ట విశేషము. ఈ కృష్ణచరిత్రమును శ్రీ రెడ్డిగారు పలుమారువిని దాని ముద్రణనిమిత్తము గొంత ప్రయత్నించియు లబ్ధమనోరథులు కాఁజాల రైరి. సరి-ప్రసక్తానుప్రసక్తమైన నా యీ యప్రకృత ప్రసంగమునకుఁ బాఠకులు క్షమింతురుగాక.
మహారామాయణములోని బాలకాండకుఁ బైఁ జెప్పబడిన సంక్షేప రామాయణములో నేమాత్ర మాస్పదములేదు. అందు రామపట్టాభిషేక ప్రయత్నమును దద్విఘ్నమును గథారంభవిషయములుగానున్నవి. కావున నయోధ్యకాండమే రామాయణమున కాదిమభాగమని తలంపఁదగును. 1
“ఇక్ష్వాకువంశప్రభవో రామోనామా" అను శ్లోకము మొదలు “దండకాన్ ప్రవివేశహ" అను శ్లోకమువఱకునుగల (8 మొదలు 40 వఱకు) 33 శ్లోకములు మహారామాయణమునందలి యయోధ్యకాండకు మూలభూతములు. వీనికిఁ బూర్వమున్న 7 శ్లోకములు కథావతారికామాత్ర ప్రయోజనములు.
2
"ప్రవిశ్యతు మహారణ్యం" అను 41 వ శ్లోకము మొదలు "శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః" అను 57½ శ్లోకమువఱకునుగల 17½ శ్లోకములు అరణ్యకాండమునకు మూల భూతములు.
3
“పంపాతీరే హనుమతా సంగతో” అను 58 వ శ్లోకము మొదలు “తతో గృధ్రస్యవచనా త్సంపాతేర్హనుమాన్ బలీ" అను 71 వ శ్లోకము వఱకును 14 శ్లో. కిష్కింధాకాండ విషయములు.
4
“శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం" అను 72 వ శ్లోకము మొదలు "సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం" అను 78 వ శ్లోకమువఱకును గల 7 శ్లోకములు సుందరకాండ విషయములు.
5
"న్యవేదయ దమేయాత్మా కృత్వా రామం ప్రదక్షిణం" అను 79 వ శ్లోకము మొదలు "రామ స్సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్" అను 89 వ శ్లోకమువఱకును గల 11 శ్లోకములు యుద్ధకాండ విషయములు. ఇట్లు మహారామాయణమునందలి 5 కాండములకు మాత్రమే మూలమున్నది తక్కిన 90వ శ్లోకము మొదలు 100 వ శ్లోకమువఱకునుగల 11 శ్లోకములు ఫలశ్రుతి విషయములు.
ఇట్లు చూచిన మహారామాయణము నందలి బాలకాండమంతయు నమూలమనక తప్పదు. రాముని వనవాసారంభ సందర్భమున “రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమా హితా జనకస్య కులేజాతా దేవమా యేవ నిర్మితా" అనియున్న శ్లోకమున నొక కృత్రిమ వ్యాఖ్యానరూపమే మహారామాయణము నందలి సీతాజన్మ వృత్తాంతము. “జనకస్య కులే” అనఁగా జనక గృహమునందు అని యర్థముచేసి అది యజ్ఞశాలగా గల్పించి 'సీతాలాంగల పద్ధతిః' అను నిఘంటువున కనురూపముగా మహారామాయణకర్త సీతాజన్మ వృత్తాంతమును బెంచియున్నాడు. నిజములో కుల శబ్దమున కిచ్చట వంశమనిమాత్రమె యర్థము. సీతా శబ్దము మైథిలుల ప్రియవస్తువిషయముగా వచ్చును. “దేవమాయేవ నిర్మితా" అను దానికి "అమృతమథనానంతర మసురమోహనార్థం నిర్మితా విష్ణు మాయేవస్థితా" అని గోవిందరాజులు వ్యాఖ్యానించి కడకు “అనేన సౌందర్య పరాకాష్ఠోక్తా” అని సిద్ధాంతీకరించియున్నాడు.
“అమృతమథనము పిమ్మట ఆసురులను భ్రమింపఁజేయుటకై నిర్మింపఁబడిన ఆ విష్ణుమాయవలె నున్నది" అని వ్యాఖ్యానార్థము. “దీనిచేత సీతయొక్క సౌందర్యాతిశయము చెప్పఁబడినది" అని యాతని సిద్ధాంతము. ఈ నిర్ణయమే సరియైనది. "జనకస్య కులేజాతా” అనుటలో నామె వంశోన్నతి చెప్పఁబడినదని గోవింద రాజుల నిర్ణయము. కనుక జనకుని యజ్ఞ శాలలో భూమి దున్నునప్పుడు లేచివచ్చినదను కల్పన చాతురీమాత్రమని మనము తలంపవచ్చును.
హనుమంతునికిని సుగ్రీవునకును మాత్రమే యిందు వానరశబ్దము విశేషణముగా నీయఁబడినది. వాలి వానర రాజనిమాత్రము పలుమాఱుఁ దెలుపఁబడినది మఱియు వాలి సుగ్రీవులు సహోదరులని సైత మిందుఁ జెప్పఁబడియుండలేదు. హనుమంతుఁడు "శత యోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం" నూరు యోజముల విస్తారముగల మహాసముద్రమును దాటెను లేక యీదెను అను నీ యర్థముగల వాక్య మతిశయోక్తియై యుండును.
వానరశబ్దము వనచరమాత్రవాచకమని తలంపఁదగియున్నది కనుక వానరు లాటవికులైన మనుష్యులనుట యుక్తము. వాలి వారికి రాజనియు నతని భార్య తార యనియు నిందున్నది. కాని యా వాలి వానరుఁడో తదన్య జాతీయుఁడైన రాజో చెప్పు నవకాశము లేదు. వానరులలో హనుమ త్సుగ్రీవులే గాక "నలంసేతు మకారయత్" అని సేతువు గట్టిన నలునిపేరుగూడ నున్నది. అయినను వీనికి వానరశబ్ద విశేషము లేదు.
ఇంకొక చిత్రమేమనగా రాముని తమ్ములలో శత్రుఘ్నుని పేరెచ్చటను గానరాదు కాని రాముఁ డయోధ్య జేరెనను సందర్భమున “భ్రాతృభిః సహితోఽనఘః" అని భ్రాతృశబ్దము బహువచనము నం దున్నందున శ్రీరామునకు భరత లక్ష్మణులేకాక మఱియొక తమ్ముఁడుగూడ నుండవచ్చునని తెలియుచున్నది. అట్లుకానిచో “భ్రాతృభ్యాం సహితోఽనఘః" అనిమాత్రమే యుండఁదగును.
రాక్షసులలో రావణుఁడును విభీషణుఁడును రాజవంశ్యులుగాఁ జెప్పఁబడియున్నారు. అక్షుఁడను వాడొక సేనాధిపతి యని మాత్రమే తెలియవచ్చుచున్నది ఇంతకుమించి మఱియెవ్వరి పేర్లును గానరావు. అన్నిటికంటెఁ చిత్రము రామజననికిగాని భరతజననికిఁగాని వారి తల్లిదండ్రులు పెట్టుకొన్న పేర్లేమో యీ సంగ్రహమువలనఁ తెలియవచ్చుట లేదు. లక్ష్మణ జనని సుమిత్రా నామధేయురాలగును. కాని యామె యభిజనము తెలియదు - కౌసల్య యనఁగాఁ గోసల రాజపుత్రి లేక కోసలదేశ జాత అనియుఁ గైకేయి యనఁగా గేకయ రాజపుత్రి లేక కేకయ దేశజాత అనియు మాత్రమే అర్థము కావున నవి విశేషణములే కాని విశేష్యరూపములైన నామధేయములుకావు. మహారామాయణకారున కింతకంటె నీ విషయ మధికముగాఁ దెలియదేమో. అతఁడును నంతేచేసి యున్నాడు. ఇట్టి సందర్భములలో మహాభారతమునకున్న ప్రత్యేకత రామాయణమునకు లేదనవచ్చును. అందుఁ గథానాయకుల విషయము ననేకాక నడుమవచ్చు నుపాఖ్యాన పాత్రల విషయమునఁగూడ నెన్నో విశేషములు గాన్పించుచున్నవి. ఉదా:- దమయంతి కొక పినతల్లి యున్నదట. ఆమె దశార్ణ దేశపు రాజు బిడ్డయట--
మనమింతవఱకును జర్చించిన ఈ ఆఖ్యానమునకంటె రామాయణకథ మహాభారతారణ్య పర్వములో నున్న రామోపాఖ్యానమున విస్తారముగానున్నది. అది రమారమి 700 శ్లోకములుగల యొక చిన్న ప్రత్యేక గ్రంథము. ప్రకృత మహారామాయణ మా రెంటి నాధారము చేసికొనియే యుత్పన్నమైనదని నమ్మవచ్చును.
మనము ప్రమాణముగా నమ్మవలసిన యాఖ్యానములో వెనుక మఱపున వ్రాయక విడిచిన మహర్షుల పేర్లు రాముని కాలనిర్ణయమున కవసరమైనవి. కనుక వానిని గొంత పరిశీలింతము.
1. భరద్వాజుఁడు
శ్లో. "చిత్రకూట మను ప్రాప్య భరద్వాజస్య శాసనాత్”
శ్రీరాముడు చిత్రకూటము చేరుటకు ముందు భరద్వాజుని యానతిం బడసెనని పైదాని భావము.
2. వసిష్ఠ ప్రముఖులైన ద్విజులు
"మృతేతు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజై:
నియుజ్యమానో రాజ్యాయ”
దశరథుఁడు చనిపోయిన పిమ్మట భరతుఁడు వసిష్ఠ ప్రముఖులైన ద్విజులచే రాజ్యపాలనము కొఱకు నియోగింపఁబడిన వాడయ్యెనని దీని భావము.
'శరభంగం దదర్శహ' “సుతీక్ష్ణం చాప్యగస్త్యంచ . అగస్త్య
భ్రాతరం తథా”
దండకారణ్య ప్రవేశానంతరము రాముడు : (1) శరభంగుని (2) సుతీష్ణుని (3) అగస్త్యుని (4) అగస్త్యభ్రాతను జూచెనని పై వాక్యముల యర్థము. పై నలుగురును మహర్షులు. ఇంతేకాక -
అగస్త్య వచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం
ఖడ్గంచ పరమ ప్రీత స్తూణీచాక్షయ సాయకౌ”
అగస్త్యుని మాటప్రకారము రాముఁడింద్ర సంబంధియైన చాపమును ఒక ఖడ్గమును అక్షయ సాయకములైన రెండమ్ముల పొదులను దీసికొనెనట.
మఱి కొందఱు ఋషులువచ్చి యసురులయొక్కయు రాక్షసుల యొక్కయు సంహారముకొఱకు బ్రార్థింపగా రాముడు రాక్షసులఁ జంపుదునని ప్రతిజ్ఞ గావించెనట.
ఆ కాలమున రాక్షసబాధ ఋషుల కెక్కుడుగా నున్నదని వీనిచే గ్రహింపవచ్చును.
ఇవియన్నియు నట్లుండనిచ్చి వసిష్ఠ భరద్వాజుల కాలముకు గూర్చి చర్చించి చూతము.
శ్లో. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం.
అనునది ప్రసిద్ధమైన వ్యాసభగవానుని గూర్చిన స్తుత్యాత్మక శ్లోకము. మహాభారతమునందన్ని యెడలను వ్యాసమహర్షివంశమిట్లే చెప్పఁబడినది కావుననిది ప్రమాణము గాదనరాదు అయినచో మన యాఖ్యానమునఁ బేర్కొనబడిన వసిష్ఠుఁడీతఁడే యనగా వ్యాసుని ప్రపితామహుఁడే యనినమ్మి పరిశీలింతుమేని భారతకథానాయకులు వసిష్ఠమహర్షి కాఱవతరము వారగుదురు. ఏలయన వసిష్ఠప్రపౌత్రుఁడైన వ్యాసుడు కురు పాండవుల పితామహుఁడేకదా! మహాభారత రామాయణాది పురాణముల యందొక విషయము పెక్కింటియం దొకేవిధముగా, గాన్పించిన నొకదానియందే పెక్కుసారు లేక రూపముననున్నను నది విశ్వసనీయమైన చరిత్రాంశముగాఁ దలంపవచ్చునని నా యభిప్రాయము. ఈ నిర్ణయముతోడనే నేను నా చరిత్ర రచనను సాగించు చుందును. ఇంతకు మించి మన పురాణ కథల సమన్వయమునకు సరియైన సాధనము గనుపింపదు. వసిష్ఠున కాఱవతరమువారైన కురు పాండవులు వసిష్ఠుని పిమ్మట మూడువందల సంవత్సరములకంటె నర్వాచీను లనుట చారిత్రక పద్ధతి కాఁజాలదు ఇట్లు చూతుమేని మహాభారత కథా కాలమునకు రామాయణ కథాకాలము రమారమి 300 సంవత్సరముల పూర్వపుదై యుండవచ్చును. వాయ్వాది పురాణములలో పరీక్షిజ్జన్మ కాలము మొదలుకొని మహాపద్మనందుని యభిషేక పర్యంతమైన కాలము 1050 సం॥ లనియు 1500 లనియు రెండు విధములైన లెక్కలు చెప్పబడినవి. అందు రెండవ విధమే బహుతుల్యము గావున దానినే మనము గ్రహింతము. నందుని పిమ్మట 100 సం॥లకు మౌర్య చంద్రగుప్తుడు రాజ్యమునకు వచ్చినట్లు పురాణము లన్నింటను గలదు. చంద్రగుప్తుని రాజ్యారంభ కాలము క్రీ. పూ. 320 ప్రాంతముగా నేఁటి చరిత్రకారు లందఱును నిశ్చయించి యున్నారు. ఇందువలన క్రీ. పూ. (320 + 100 + 1500) = 1920 సంవత్సరముల నాటిది భారత యుద్ధకాలము. దానికి 300 సం॥ల పూర్వుడుగా రాముఁడు క్రీ. పూ. 2220 సంవత్సరముల కీవలి వాఁడనుకొన్నను దప్పుగా నుండదు. కాఁబట్టి రామాయణ కథాకాలము నేఁటికి 4176 సంవత్సరముల లోపలి దనుకొందును. ఇందుకు విరుద్ధమైన యే నిర్ణయమైనను నిరాధారము.
రావణుఁడు
ఆఖ్యానములో వీనినిగూర్చి యత్యల్పముగనే చెప్పఁబడియున్నది. ఖర దూషణాదులైన బంధువుల వధను విని క్రోధముచే నొడలు తెలియనివాఁడై రావణుఁడు మాయావియైన మారీచుని సహాయమున రామ లక్ష్మణులను దూరముచేసి సీతనపహరించెనట. కారణము జ్ఞాతివధ జనిత క్రోధముగాని యన్యముగాదట. ఈ సందర్భమున మన యాఖ్యానకారుఁడు “నవిరోధోబలవతా క్షమో రావణ తేనతే”. 'రావణా! బలవంతుడైన రామునితోడి విరోధము నీకు సాధ్యమైనదిగాదు' అని మారీచుడు పెక్కు తెఱఁగుల వారించినను వాఁడు వినలేదని సైతము చెప్పి యున్నాఁడు. హనుమంతుఁడు నూరామడ సముద్రమునుదాఁటి లంకఁ జొచ్చెనని యిందున్నది కదా! ఈ విషయమున నితరాధారము లెట్లున్నవో పరికింతము. అతి ప్రాచీనమని నేఁటి చరిత్రకారు లనేకులచే నిర్ణయింపఁబడిన వాయు పురాణములో భూగోళవర్ణన 16 అధ్యాయములందున్నది. అందు మలయద్వీప వర్ణనానంతరము లంకాద్వీపము,
శ్లో. తథాత్రికూట నిలయే నానాధాతు విభూషితే
అనేక యోజనోత్సేధే చిత్రసాను దరీగృహే
తస్యకూట తటేరమ్యే హేమప్రాకార తోరణా
నిర్వ్యూహవలభిచిత్రా హర్మ్యప్రాసాదమాలినీ
శతయోజన విస్తీర్ణా త్రింశదాయామ యోజనా
నిత్య ప్రముదితా స్ఫీతా లంకానామ మహాపురీ
సాకామరూపిణాంస్థానం రాక్షసానాం మహాత్మనాం.
అను నిత్యాది శ్లోకములలో వర్ణింపఁబడినది. ఈ లంకా ద్వీపము 100 యోజనముల పొడవును 30 యోజనముల వెడల్పును గలదట! ఇచేయట కామరూపులగు రాక్షసులకు నివాసస్థానము! ఈ స్థాననిర్దేశ మీ క్రింది విధముగాఁ జేయబడినది.
శ్లో. తస్య దీపస్యవై పూర్వేతీరే నదనదీపతేః
గోకర్ణ నామధేయస్య శంకరస్యాలయం మహత్.
తా. ఆ ద్వీపమునకు సంబంధించిన సముద్రముయొక్క తూర్పు తీరమునఁదు గోకర్ణ నామధేయుఁడగు శంకరుని మహనీయమగు నాలయ మున్నదట
దీనినిబట్టి నేఁటి మార్మగోవా ప్రాంతమున నున్న గోకర్ణ క్షేత్రమునకుఁ బశ్చిమదిశయందు లంకయున్నదని ఖండితముగాఁ జెప్పవచ్చును. మహాభారతారణ్యపర్వము నందలి రామోపాఖ్యానమునందుఁ గూడ రావణుఁడు రథమార్గముననే గోకర్ణక్షేత్రమునందుఁ దపస్సు చేయుచున్న మారీచునికడకువచ్చి వాని సాహాయ్య మభిలషించినట్లు స్పష్టముగాఁ జెప్పఁబడినది. నేఁడీ ద్వీపము శిథిల ప్రాయమై కొంత మునిగిపోగా మిగిలినది గోకర్ణ క్షేత్రమునకు నైరృతిలో ఖండఖండములుగా లక్కాదీవులను పేరఁ గానవచ్చెడిని. అత్యుత్తమసాధన సాధితమైన యీ లంక పశ్చిమసముద్ర తీరస్థము గాని యన్యముగాఁజాలదు.
రాముఁడు శూర్పణఖ ముక్కు గోసిన స్థానముగా మహారాష్ట్రులు నాసికాత్రయంబక స్థానమును ఆంధ్రులు భద్రాచల ప్రాంతమును వర్ణించుచు బహుభంగుల వివాదపడుచున్నారు గదా! ఏ స్థానమునుండి నైరృతికి సూటిగాఁ బోయినచో గోకర్ణక్షేత్రము చేరఁగలమో ఆ మార్గమున కనుకూల ప్రాంతమైన గోదావరీతీరమే శూర్పణఖాదర్శనస్థానమైన ప్రదేశము కాఁదగియున్నది. కావున పై వివాదమున కాస్పదము లేదన వచ్చును. అటు నాసికాక్షేత్రమునుగాక యిటు భద్రాచలమునుగాక యా రెంటి మధ్యప్రదేశము రాముని పర్ణశాలా స్థానమనవలెను. ఇట్టి యీ స్థానమునకును రామునికాలమువాఁడుగాఁ దేలిన భరద్వాజునికిని మిక్కిలి సంబంధమున్నట్లుగూఁడ బైఁ జెప్పఁబడిన వాయుపురాణమునందలి భారత భూవర్ణన ప్రకరణమునఁ గొన్ని చక్కని శ్లోకములున్నవి. చూడుడు:
భరద్వాజుఁడు
శ్లో. సహ్యస్యచోత్తరార్థేతు యత్ర గోదావరీనదీ
పృథివ్యామిహకృత్స్నాయాం సప్రదేశో మనోరమః
(తత్ర గోవర్థనోనామ సురరాజేన నిర్మితః)
రామప్రియార్థం స్వర్గోఽయం వృక్షా ఓషధయస్తధా
భరద్వాజేన మునినాత్ప్రతియార్థేఽవతారితాః
అంతఃపురవరోద్దేశస్తేన రాజ్ఞే మనోరమః
సహ్యపర్వతోత్తరార్ధమున గోదావరీనది ప్రవహించు ప్రదేశము మిగుల రమణీయమైనదట. భూమి కంతటికిని నంతరమ్య ప్రదేశముమాత్ర మొక్కటి లేదట. (కుండలీకృతభాగము కొన్ని ప్రతుల లేదు). ఇట్టి యీ స్వర్గసుఖకారియైన ప్రదేశము వృక్షౌషధీయుక్తముగా రామునికిఁ బ్రీతి చేకూర్ప భరద్వాజమునిచే నవతరింపఁజేయఁబడినదట.
ఇందువలన భరద్వాజమునికిని రామునకును గాఢసంబంధ మున్నదని మనము నిశ్చయింపవచ్చును. ఇట్టి యీ భరద్వాజుడు భారత కథానాయకుల ధనురాచార్యునకుఁ తండ్రి యని భారతమునం దున్నది. కాఁబట్టి ద్రోణ భీష్మ వ్యాసులు రాము నెఱింగియుందురనవలెను. పరశురామునితో యుద్ధము చేసిన భీష్ముఁ డాతనికిఁ దొలుత శిష్యుఁడు. ఈ గురుశిష్యుల యుద్ధమునాఁటికి పరశురాము డస్త్ర త్యాగము చేసి మహేంద్రపర్వతమునం దపస్సు చేయుచుండినట్లు భారతము చెప్పు చున్నది. మహారామాయణముసైత మట్లే పరశురాము డస్త్రసన్యాసము గావించిన పిమ్మటనే రామపరీక్షార్థము తద్వివాహానంతరము మార్గమునం దతని సంధించినట్లు చెప్పుచున్నది.
ఇట్టి వెన్నియో సమాచారములు రామాయణ మహాభారత కథా నాయకుల సన్నిహితకాలీనతను దెలియఁజేయుచున్నవి.
రామాయణ మహాభారతములలోని కథా సాదృశ్యములు
1
రామకథ మహాభారతములోని యరణ్యపర్వమునందేకాక సభా పర్వమునందలి యధిక పాఠభాగములోగూడ నున్నది. దానిని వదలినను ద్రోణ శాంతిపర్వములయందలి షోడశరాజోపాఖ్యానముల రెంటియందును నొకచోటఁ గొంత సంగ్రహముగను వేఱొకచోటఁ గొంత విస్తారముగను గన్పట్టుచున్నది.
2
శల్యపర్వమునందలి బలరామతీర్థయాత్రా ఘట్టమున శ్రుతావతి యను భరద్వాజపుత్రిక మానవులఁ బెండ్లాడనొల్లక యింద్రుని గోరి తపస్సుచేసి యగ్ని ప్రవేశమున నిష్టార్థము సాధించినట్లు గలదు. రామాయణోత్తర కాండమునందు వేదవతియను (బృహస్పతి పౌత్రికయుఁ గుశధ్వజుని పుత్రికయునైన యొక) కన్య యుపేంద్రుని బెండ్లాడఁ గోరి తపస్సు చేయుచు రావణునిచే నవమానింపఁబడి యగ్ని ప్రవేశము చేసి మఱుజన్మమున సీతయై పుట్టినట్లున్నది. ఇందు శ్రుతావతీ వేదవతీ నామములు సదృశార్థములు. ఇంద్రోపేంద్రులకును గొంత సాదృశ్యము గలదు. ఈ యిద్దరితండ్రులపేర్లు భేదించినను తాతయగు బృహస్పతి యొక్కడే - బృహస్పతికొడుకు భరద్వాజుఁడనుట ప్రసిద్ధము. ఆది పర్వములోని ద్రోణజన్మకథయు నీ శల్యపర్వములోని శ్రుతావతికథయు తజ్జన్మవిషయమున నేకీభవించెడిని. కావున శ్రుతావతియే వేదవతియు భరద్వాజుడే కుశధ్వజుడునై యుందురని యూహించు నవకాశమున్నది.
3
భారత శల్యపర్వమునందలి యదేఘట్టములోనే ఋక్షగోలాం గూలములు జన్మ హేతువు చెప్పబడినది. తొల్లి యేక తద్వితత్రితులనంబడు గౌతమపుత్రులు తండ్రిమరణానంతరము బహుదేశములు సంచరించి త్రితుని పాండిత్యబలమునఁ బెక్కండ్రు రాజులవలన గోధనము నెంతేని యార్జించి తమయూరుచేరవచ్చుచుఁ దమలోఁ గనిష్ఠుఁడైన త్రితుని పేరు పెంపుల కసూయఁచెంది మార్గమధ్యమున నొక పాడుబావిలోఁ బడిపోవు నట్లు చేసిరట - ఆ త్రితుఁడు దైవానుగ్రహమునఁ గొంతకాలమునకుఁ బైకివచ్చి యన్నల దుండగమునకుఁ గోపించి వారి వంశజులు ఋక్షగోలాంగూలములై పోవునట్లు శపించెనట - ఇదే ప్రస్తావన మరల శాంతి పర్వములో నుపరిచరవసువుయొక్క వైష్ణవ యాగ సందర్భమునఁ జెప్పఁబడి యా యేకతద్వితుల సంతానమువారగు ఋక్షగోలాంగూలములే అనఁగా భల్లుక వానరములే శ్రీరామునికి రావణయుద్దమునఁ దోడ్పడినవని సైతము స్థిరపఱుపఁబడినది.
4
భారత శాంతిపర్వములో శ్రీకృష్ణుఁడు ధర్మరాజునకుఁ జెప్పినట్లున్న పరశురామునికథలో మగథరాజైన బృహద్రథుఁడు (జరాసంధునితండ్రి) పరశురామభీతుఁడై పాఱిపోయి ఋక్షవత్పర్వతము చేరగా నచ్చటి ఋక్షగోలాఁగూలములాతనిఁ గాపాడెననియున్నది. మఱియు-సభాపర్వమునందలి బృహద్రథ వృత్తాంతమును ముఖ్యముగా తద్దుందుభి నిర్మాణకథను బరికింపఁగా రామాయణమునందలి దుందుభి వధఘట్టము జ్ఞప్తికివచ్చుటయేకాక యా బృహద్రథుడే వాలియనియ నాతని యుపాస్యదైవతముగాఁ బేర్కొనంబడిన తారానామక యక్షిణియే తారాయనియు, జరాసంధుఁడే యంగదుఁడనియు నూహింప సాధ్యమగు చున్నది.
5
మహాభారత ద్రోణపర్వమునందలి షోడశరాజోపాఖ్యానములోఁ గల రామవృత్తాంతమునందు జనస్థాననివాసుల విషయమునగల శ్లోకములు గమనార్హములు.
1. శ్లో. జఘానచజనస్థానే రాక్షసాన్ మనుజర్షభః
తపస్వినాం రక్షణార్థం సహస్రాణి చతుర్దశ.
..........................................................................
..........................................................................
2. శ్లో. స్వథాపూజాంచ రక్షోభిర్జనస్థానే ప్రణాశితా
ప్రాదాన్ని హత్య రక్షాంసి పితృదేవేభ్య ఈశ్వరః.
తా॥ సర్వశ క్తి సంపన్నుఁడైన రాముఁడు రాక్షసులచే జనస్థానమునందు నాశనముచేయఁబడిన స్వధాపూజను (పితృదేవతల యారాధన విశేషమును) రాక్షసులనుజంపి మరల నా పితృదేవతలకు సమకూర్చెను అని పై రెండవ శ్లోకముయొక్క తాత్పర్యము. ఇందువలన జనస్థానరక్షోవధకుఁ గారణము పితృదేవతల యారాధనకు వారు భంగముచేయువారగుటేయని తెలియవచ్చుచున్నదిగదా! ఇది యౌత్త రాహులకును ఆకాలపు దాక్షిణాత్యులకునుఁగల కర్మకాండ వైరుద్ధ్యమును అందురామునకుఁగల యభిమానవిశేషమును దెలుపుచున్నది. ఇది యిట్లుంచి యొక ముఖ్యవిషయమును గొంచెము వివరింతును.
రామాయణము నందలి ఖరదూషణాదులవధ ప్రకరణమున మహేశ్వరతీర్థులను పూర్వవ్యాఖ్యాత శేషధర్మములలోనివని యీ క్రింది,
శ్లో. యాజ్ఞవల్క్యసుతారాజన్ త్రయోవై లోకవిశ్రుతాః
చంద్రకాంత, మహామేథ, విజయా, బ్రాహ్మణోత్తమాః
ఖరశ్చ, దూషణశ్చేతి త్రిశిరా బ్రహ్మవిత్తమాః
ఆసంస్తేషాంచ శిష్యాశ్చ చతుర్దశ సహస్రధా.
అను రెండుశ్లోకముల నుదాహరించియున్నాడు. వీనినిబట్టి ఖరదూషణ త్రిశిరులు యాజ్ఞ్యవల్క్యమహర్షి పుత్రులని తేలుచున్నది. ఇందుపైఁ జూతమని శేషధర్మములను గ్రంథమును వెదుకఁగా నీ కథయందు విరివిగా నున్నది. చంద్రకాంతమహామేథ విజయులు శివునిగూర్చి తపస్సు చేసి కడపట "సంసార విష వృక్షస్యచ్ఛేత్తా భవ మహేశ్వర!" అని యద్దేవుని వరమడుగఁగా వారి వాక్పారుష్యమును గర్హించి మీరును మీ శిష్యులును రాక్షసులై జనస్థానమున వసించుచు శ్రీరామచంద్రునిచేత సంహరింపఁబడి మీ కోరిన మోక్షమును బొందుదురు గాతమని యాయన వరమిచ్చినట్లున్నది. ఈ శేషధర్మములును మహాభారత శేషభూతములే యని చెప్పఁబడును.
పులస్త్య విశ్వామిత్రాగస్త్యుల సంతతివా రనేకులు రాక్షసులైరని వాయ్వాది పురాణములందున్నది, అందు విశ్వామిత్రుని సంతతివాఁడు యాజ్ఞవల్క్యమహర్షి. వాసిష్ఠులకును వీరికిని బొసఁగదు. శ్రీరాముఁడు వాసిష్ఠపక్షీయుఁడనుట ప్రసిద్ధము. రామపత్నియైన సీతాదేవి జనకరాజ పుత్రిగదా! ఆ జనకుని పేరు దేవరాత జనకుఁడని రామాయణాయోధ్యా కాండములోని సీతానసూయా సంవాదఘట్టమువలనఁ దెలియుచున్నది. భారత శాంతిపర్వములోని యాజ్ఞ్యవల్క్య జనక సంవాదములో దైవరాతికి అనగా దేవరాతపుత్రునకు వేదాంతోపదేశము చేయుసందర్భమున నమ్మహర్షి తన పూర్వకథఁ జెప్పుచు- "నీ తండ్రి సభలో వ్యాస వైశం పాయనాదుల యెదుట నాకును విదగ్ధశాకల్యుఁడను వైశంపాయన శిష్యునకును శాస్త్రవాద మతిఘోరముగా జరిగి యందు నేను జయించితి" నని చెప్పినట్లున్నది దైవరాతితండ్రి దేవరాతుఁడేకదా! ఇతఁడే సీతాజనకుఁ డనదగియున్నాడు. కావున యాజ్ఞవల్క్యపుత్రులు రాముని కాలమువారే యనియు నిర్ణయమగుచున్నది. వాసిష్ఠ వైశ్వామిత్రుల కలహము సకల పురాణ ప్రసిద్ధము. యాజ్ఞవల్క్యుఁడు మొదట వైశంపాయనునియొద్దఁ జదివి కారణాంతరమున నతనిచే నిరాకృతుఁడై శుక్ల యజుర్వేదమును సంపాదించిన విషయముగూడఁ బ్రఖ్యాతమైనదే! పై జనక సభావృత్తాంతము బృహదారణ్యకఛాంద్యోగములందును గలదు.
ఇట్టి యనేకవిశేషములు రామకథకు మూలములై మహాభారతము నందందందుఁ గానవచ్చుచున్నవి. వీని నన్నింటిని సేకరించియే తన కావ్యఫక్కి కనురూపముగా మార్చుకొని మహారామాయణమును దత్కర్త రచించియున్నాఁడని గ్రహింపవీలగుచున్నది. కాఁబట్టి రామాయణమెప్పు డెవరిచే నే యుద్దేశమున రచింపఁబడినను నమూలకమైన కల్పితకథ మాత్రము కాదని ఖండితముగాఁ జెప్పవచ్చును.
మహారామాయణ సాహిత్యము నేఁడు రామాయణమను పేరఁ బ్రఖ్యాతమైన మహాకావ్యము. కావ్యదృష్టితోఁ బరీక్షించిన నొకసంస్కృతమునందేకాక మఱియేభాషయందును “నభూతో నభవిష్యతి” అనునట్లు సాటిచెప్పనలవిగాని యసాధారణకావ్యము. కవికులగురువని ప్రసిద్ధి చెందిన కాళిదాసుడు సయితము దీనిశైలి నలవఱచుకొనఁగోరి కొంత ప్రయత్నించెనందురు. కానియతఁడు సైతమీ ప్రయత్నమున లబ్ధమనోరథుఁడయ్యెనని చెప్పజాలము ఇమ్మహాకావ్యమునుజదివి యొకానొక ప్రాజ్ఞుఁడిందు,
శ్లో. తదుపగతసమాస సంధియోగం
సమ మధురోపనతార్థ వాక్యబద్ధం
రఘువరచరితం మునిప్రణీతం
దశశిరసశ్చవధం నిశామయధ్వం.
అను శ్లోకమును నుచితస్థానమునఁ బ్రతిష్ఠించియున్నాడు. పదమంజిమ యందేమి, సంధిసమాస విన్యాస చాతురీవిశేషమునందేమి, యీ మహాకావ్యము తరువాతఁ బుట్టిన కావ్యము లన్నింటికిని మేలుబంతియన నొప్పుచున్నది. “గతింఖర ఇవాశ్వస్య" అని యమ్మహాకవి యేదో సందర్భమునఁ జెప్పినట్లు తచ్ల్ఛోకగతి యనన్య సామాన్యమైనది. చరిత్ర శోధనపద్ధతిలో నీ కావ్యవిశేషముల కొకింత విలువ తగ్గించి చూచినను సాహిత్యశోధన పద్ధతిలో నీ కావ్యమనర్ఘ మనక తప్పదు. ఇందలి యనేక విషయములు సమూలములేయనఁదగియున్నవి. తక్కినవి సైత ముద్దేశ పూర్వకముగా గావింపఁబడిన మార్పులేయన నొప్పును. గ్రంథమంతయు గాకున్నను జాలభాగ మొకేచేతఁ దీర్చి పెట్టఁబడిన విచిత్రశిల్పమనియే తలంపఁదగియున్నది. శ్రీ పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారన్నట్లు మహారామాయణకవి ప్రాకృత వ్యాకరణకర్తయగు వాల్మీకియైయుండిన నుండవచ్చును. అమ్మహాకవి కీనామము రామాయణరచనవలనఁ గలిగిన బిరుదనామ మగునేమో!
తుదిమాట
శ్రీ రెడ్డిగారు తఱచుగా నేఁటి ప్రాచ్య పాశ్చాత్య విమర్శకులు రామాయణమునుగూర్చిచేసిన విమర్శల నన్నింటిని గ్రోడీకరించి చూపియు వాని సత్యాసత్యముల ననేకవిధములఁ జర్చించియు గుణమును స్వీకరించియు దోషమును నిరాకరించియు 'రామాయణ విశేషములు' అను నీ గ్రంథరచనము గావించి దీనిమూలమున లోకమునకు మహోపకారము చేసియున్నారు. దీనివలన మనము దెలిసికొనవలసిన విషయము లెన్నియేని కలవు. వారి పునర్ముద్రణ సంస్కరణములు స్వహస్తముననే పూర్తియైయుండినచో నా యీ పీఠికావిశేషములు వారి కలమునుండిమే ఖచితములయ్యెడివేమో! కాని అట్టి యవకాశమును భగవంతుడు మనకు గలుగఁజేయలేదు. సర్వేశ్వరు డా పవిత్రజీవికి శాశ్వతశాంతి విశ్రాంతు లొసంగి తనలో నిమిడ్చుకొనుగాక యని నా యీ యుపోద్ఘాతము నింతటితో విరతము గావించుచున్నాను.
ఇట్లు
జనగామ
అనుముల వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి
17-10-1956
తెలుగు పండితుడు
ప్రెస్టన్ ఇన్స్‌స్టిట్యూటు
జనగామ
విషయానుక్రమణిక
పుటసంఖ్య
1 |
3 |
5 |
7 |
10 |
12 |
15 |
20 |
21 |
21 |
22 |
24 |
25 |
27 |
28 |
29 |
29 |
29 |
30 |
32 |
34 |
35 |
37 |
41 |
43 |
48 |
54 |
55 |
56 |
56 |
57 |
59 |
62 |
63 |
67 |
68 |
69 |
71 |
1. ముఖ్య సంఘటనలు కాలచర్చ 2. రామ పట్టాభిషేకము 3. సీతారాముల వివాహకాలము 4. రాముని ప్రవాసకాలము.
1. సాంఘికాచారములు 2. వర్ణ వ్యవస్థ 3. అనార్యులు 4. నరమేధము 5. అశ్వమేధము పుట:రామాయణ విశేషములు.pdf/49 పుట:రామాయణ విశేషములు.pdf/50