Jump to content

రామాయణ విశేషములు-1

వికీసోర్స్ నుండి

రామాయణము-
ఇలియడ్ పురాణము

"వాల్మీకే ర్మునిసింహస్య కవితావనచారిణః
శ్రుణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిమ్?"


శ్రీ మద్రామాయణ మహాకావ్యమునుగురించి నావంటివాడు వ్రాయుట మహాసాహసమే! ఎందరో ప్రాచ్యపాశ్చాత్య పండితులు వాల్మీకి రచిత రామాయణ మహాకావ్యమును గురించి విపులముగా చర్చించి యున్నారు. హిందువు లందరికిని శ్రీమద్రామాయణముపై నుండునంతటి భక్తి ప్రేమాదరములు ప్రపంచములోని మరే గ్రంథముపైనను లేవు. వాల్మీకి రచితమగు గ్రంథము ఆది కావ్యము. రాముడన్న నో, సాక్షా ద్విష్ణ్వవతార పురుషుడుగా హిందువులచే పూజింపబడునట్టి దేవుడు. హిందూ పండితులు నేటివరకును రామాయణములో అవతార తత్త్వమును, ఆధ్యాత్మిక విషయమును విశేషముగా చర్చించిరి. కాని యితరాంశములు కూడ తెలుసుకొనదగినవై యున్నవి.

రామాయణమును గురించి యాధ్యాత్మికపరముగాను, చారిత్రికముగాను రెండు విధములగు విమర్శన పద్ధతులు కనబడుచున్నవి. ఆధ్యాత్మికముగా పరిశీలించు మొదటి వర్గము వారికి రాముడు అవతార పురుషుఁడు, పురుషోత్తముడు. ఆతనిలో ఏ లోపమును లేదు. అతడు సాక్షాద్విష్ణు భగవానుడే. సీతాదేవి అపరలక్ష్మీదేవియే. రామునిబంటు అయిన హనుమంతుడును దేవుడే. అతనినెందరో కులదైవతముగా పూజించుచున్నారు. రామాయణము భక్తి ప్రధాన గ్రంథము. అందు వేదాంత రహస్యము లున్నవని పండితులు పెద్ద పెద్ద వ్యాఖ్యలు వ్రాసినారు. ఇట్టి భావ పరంపరలచే హిందువులు, అందు ముఖ్యముగా వైష్ణవులు, శ్రీమద్రామాయణమును పూజించువారై యున్నారు. రెండవ వర్గమువారు శ్రీరామచంద్రుని ఆదర్శ మహాపురుషునిగా స్వీకరించుచున్నారు. కేవలము చారిత్రిక దృష్టితోనే విమర్శించుచున్నారు. ఈ దృష్టితో చూచువారు ఒక్కొక్కప్పుడు అస్తినాస్తి విచికిత్సలో తటపటాయించుచున్నారు. యథార్థముగా శ్రీరాముడు చారిత్రికపురుషుడేనా యని సంశయించుచున్నారు. రామాయణమును ఒక ఆదర్శనీతిదాయకమగు కథగా కల్పించి యుండరాదా? అని వాదింతురు. కొందరు పాశ్చాత్య విమర్శకులు రామాయణకథ కల్పితకథ యని యభిప్రాయపడినారు. వెబర్ అను వాడిట్లు వ్రాసెను: "ఆర్యులు దక్షిణాపథమును సింహళమును ఆక్రమించుకొన్న నిరూపక గాథ రామాయణము. రామాయణ పాత్రలన్నియు కల్పితములే. సీతయన నాగటిచాలు. నాగటిచాలుపూజను తెలుపునట్టిదీ కథ."

జాకోబీ యిట్లువ్రాసెను: "వేదములలోని వృత్రవధయే రామాయణమునకు మూలము. రాము డింద్రుడు. వృత్రుడు రావణుడు. వేదాలలో మరుత్తులు (గాడ్పులు) ఇంద్రుని మిత్రులు. ఇచ్చట గాడ్పుకొడుకు - హనుమంతుడు - రామునికి ముఖ్యుడు. సీత నాగటిచాలు. వృత్రుని చంపి మేఘాలను నాగటి చాళ్ళకు విడిపించినవాడు ఇంద్రుడు లేక రాముడు."

పర్గిటర్ రామాయణము యథార్థగాథ యని యభిప్రాయపడెను. "ప్రాచీనపు ఇతిహాసములను శ్రద్ధతో పరికించి శోధించిన తర్వాత వాటిని నిరాకరించు నాలోచన చేయరాదు. రాముని చరిత్ర దక్షిణాపథమందలి యార్యవిజృంభణమనిచెప్పి అవలీలగా త్రోసివేయరాదు" అని యతడనెను.

నా అభిప్రాయములో శ్రీరాముడు కల్పిత పురుషుడనుటకు ప్రబలాధారములు కానరావు. రామాయణములోని ప్రధానఘట్టములు జరిగినవనియే విశ్వసింప వీలుకలదు. రాముని ఉత్తమోత్తమ గుణసంపదనుబట్టి హిందువు లతనిని దేవునిగా పూజించుచున్నారు. అందుచేత అతని చరిత్రకు సంబంధించిన విషయాలను మానవాతీతములైనవిగా వర్ణించి పెంచివ్రాసినారు. చారిత్రిక పద్ధతిపై విపులముగా విమర్శచేసిన గ్రంథాలు తక్కువగా నున్నవి. అందుచేత ఈ గ్రంథ రచన అవసరమయ్యెను.

చ్యవన రామాయణము

ప్రధాన విషయములోనికి ప్రవేశించుటకు పూర్వమొక్క యంశాన్ని గూర్చి చెప్పవలసియున్నది. రామాయణములు చాలా యున్నవి. సంస్కృతములో వాల్మీకి రామాయణము తర్వాత రామచరిత్రమును మహాభారతములోను, భాగవతములోను, విష్ణుపురాణములోను, వాయుపురాణములోను వ్రాసియున్నారు. కాళిదాసాదులు శ్రీరాముని గురించిన కావ్యనాటకములను వ్రాసిరి. భారతీయ భాషలలో అనేక రామాయణములు రచింపబడెను. తులసీదాసు రామాయణము హిందీభాషకు మకుటాయమానము. కంబ రామాయణము అరవములో అగ్రస్థానము వహించినట్టిది. తెలుగులో భాస్కరుడు, గోన బుద్ధుడు, మొల్ల, గోపీనాథమువారు, వావిలి కొలనువారు మున్నగు పలువురు వ్రాసిరి. నేటికిని ప్రతిభాషలో రామాయణమును భక్తులు తమశక్తికొలది వచనములోను పాటలలోను పద్యాలలోను నానావిధాలుగా రచించుచున్నారు. వీనికన్నిటికిని మూలము వాల్మీకి రామాయణమే. అయితే వాల్మీకికంటెముందుగా మరొకరెవరైనా రామచరిత్రమును వ్రాసిరా? అని విచారించిన చ్యవనుడు అనునతడు రచించియుండెనని నందార్గికర్ పండితుడు క్రీ. శ. 1897 లో వ్రాసెను. దానికి మూలాధారము అశ్వఘోషుని బుద్ధచరితములోని యొక శ్లోకభాగము. అశ్వఘోషుడు కాశిదాసుకంటె పూర్వుడనియు, కొంచెము తర్వాతి వాడనియు క్రీస్తుశకారంభము వాడనియు క్రీస్తుశకములో ఆరవ శతాబ్దమువాడనియు చర్చలు కలవు. అవి మనకిప్పుడు ప్రధానములు కావు. అశ్వఘోషు డిట్లువ్రాసెను.


వాల్మీకినాదశ్చ ససర్జ కావ్యం, జగ్రంథ యన్న చ్యవనో మహర్షిః
చికిత్సితం యచ్చ చకార నాత్రిః, పశ్చాత్త దాత్రేయ ఋషిర్జగాద - బుద్ధచరిత. 1 - 49.

"చ్యవనమహర్షి యేది రచింపజాలకపోయెనో అట్టి కావ్యాన్ని వాల్మీకి రచించెను. అత్రి యేవైద్యమును చేయజాలకపోయెనో దానిని అతని కుమారుడగు ఆత్రేయుడు పూర్తిచేసెను." అని పై శ్లోకము యొక్క అర్థము. దీనిని బట్టి చ్యవన మహర్షి రామాయణమును బాగా రచింపజాలక యేదో యొకరీతిగా వ్రాసినదానిని వాల్మీకి సమగ్రముగా పెంచి వ్రాసినాడని కొందరు వాదింపవచ్చును. కాని యట్టి యర్థాని కవకాశములేదు. అశ్వఘోషుడీ శ్లోకాన్ని రచించిన పూర్వాపర సందర్భాలను గమనింపవలెను. బుద్ధుని తండ్రి చేయలేనిపనిని బుద్ధుడు చేసెను అను వంశాన్ని వర్ణించుచు అత్రి చేయలేని పనిని అతని కుమారుడగు ఆత్రేయుడు చేసెను. అట్లే చ్యవనుడు చేయనిపనిని వాల్మీకి చేసెనని యుపమాన వాక్యములచే నిరూపించెను. అయితే రామాయణానికేమియు సంబంధములేకుండిన చ్యవనుని పేరెందుకెత్తుకొన్నాడు? అని ప్రశ్నింప వచ్చును. చ్యవనుడు భృగువంశమువాడు. వాల్మీకియు భృగువంశమువాడు.[1] బుద్ధఘోషుడు తండ్రి కొడుకుల ఉపమానములనే ఇచ్చి యున్నాడు. అట్టి యితరోపమానములనుబట్టి బహుశా చ్యవనుడు వాల్మీకి తండ్రియై యుండెనేమో అని ప్రబలమగు సంశయము కలుగుచున్నది. చ్యవనుడు కవిత్వవేదిగా నుండియుండును. ఆ కవితయే వాల్మీకిలో పరిణతి పొందినది.

చ్యవనుడును, వాల్మీకియు భృగువంశములోనివారని కొన్ని నిదర్శనములు కలవు. వాల్మీకియే తన రామాయణములో నిట్లు వ్రాసినాడు.


"భార్గవ శ్చ్యవనోనామ హిమవంత ముపాశ్రితః"
                                                -బాల. స. 70. శ్లో. 29.

అయితే ఈ శ్లోకసందర్భము వేరుగా కనబడుచున్నది. ఇక్ష్వాకు వంశములో భరతుని కుమారుడు అసితుడను వాడుండెను. అతడు రామునికన్న 21 తరములు ముందువాడు. అతడు రాజ్యమును పోగొట్టుకొని హిమవంత మందుఁడగా అచ్చటికి చ్యవనుడు వెళ్ళియుండెనను సందర్భములో నుదాహరింపబడినాడు. రామునికన్న 21 తరముల పూర్వ మందుండిన రాజుయొక్క సమకాలికుడగు చ్యవనుడు బుద్ధ ఘోషోదాహృత చ్యవనుడు కానేరడు. ఆ పేరే వహించి వాల్మీకి కాలములో నున్నవా డింకొకడై యుండును.

ఈ సందర్భములో మరొక యంశము చర్చనీయమగుచున్నది

భృగువెవ్వరు ?

"భృగువే శుక్రుడు.[2] శుక్రుడు రాక్షసులకు గురువు. రాక్షసుల కింకొక పేరు అసురులు. వీరినే పారసీకులు అహురులు అనిరి. సంస్కృత సకారము ఫార్సీలో హకారముగా మారును. ఫార్సీవారి భాషలో “అహుర” మంచి దేవత “దేవ" "దుష్ట" దేవత. దీనినిబట్టి అహురుల గురువగు భృగువు పారసీకులకు ముఖ్య గురువై యుండెను” అని జతీంద్రమోహన ఛటర్జీ గారు “గాథా” జరుథుస్త్ర మత గ్రంథ పీఠికలో వ్రాయుచు మరల ఇట్లు తెలిపినారు. అథర్వవేదమునకు "భృగ్వంగిరసి" అను పేరుకలదు. అథర్వ వేదమందొక భాగమునకు భృగువు ద్రష్ట. ఇంకొక భాగానికి అంగిరసుడు ద్రష్ట. భృగువు లేక శుక్రుడు అసురుల గురువు. అంగిరసుడు లేక బృహస్పతి సురల గురువు. అథర్వ వేదములోని భృగుసంహితా భాగము ఖిలమైనదని ఆర్యులందురనియు, ఆ భృగుసంహితయే “గాథా” “అవెస్తా" అను రూపమున జరథుస్త్రునిచే ఈరాన్ దేశమందు వ్యాప్తినొందింపబడెననియు ఈ ఛటర్జీగారి వాదము. పాశ్చాత్య పరిశోధకులు కొందఱిట్టి అభిప్రాయమునే వెల్లడించియున్నారు. అథర్వ వేద కాలములో దేవాసుర పూజా పద్ధతిలో ఆర్యులలో భిన్నాభిప్రాయము లేర్పడెననియు అసురపూజాభి మానులు ఈరానులోనికి వెళ్ళిరనియు వారికి జరథుస్త్రుడు మతకర్త యయ్యెననియు పాశ్చాత్యపండితుల యభిప్రాయము. 'గాథా' గ్రంథములోని భాషయు వేదతుల్యముగా నుండుట ఆశ్చర్యజనకముగా నున్నది. ఉదాహరణార్థముగా “గాథ" లోని మొట్టమొదటి సూక్తము నుదాహరించు చున్నాను. 'యానీం మనోయానీం వచోయానీంస్య ఓధనేం అషఓనో జరథుస్త్రహే.' దానికి సంస్కృత సామ్యమును ఛటర్జీపండితుడీవిధముగా చూపించినాడు:


జినంమనః జినంవచః జినం స్యోదనం అషవనః జరథుస్త్రస్య.

ఈ విధముగా భృగువంశమువాడు చ్యవనుడు. చ్యవనుని కుమారుడు వాల్మీకియై యుండినచో వీరు ఈరాన్ సంబంధముకూడ కలవారని యూహింపవలసివచ్చును.
వాల్మీకి యెవరు ?

వాల్మీకినిగురించి యించుమించు మనకేమియు తెలియదు. అతడు వ్యాధుడుగా నుండెననియు, అడవులలో దొంగల గుంపు పెద్దయై బాటసారులను దోచి జీవించుచుండెననియు, నారదాదు లొకనాడు అతని బారి పడిరనియు, వారు 'ఓయీ! నీవు చేయు పాపకర్మలను నీవే యనుభవింతువా? అందు భాగస్వాములున్నారా?' యని యడుగగానే నేనెవ్వరిని పోషించుచున్నానో వారందరు భాగస్థులగుదురని చెప్పెననియు, ఆ సంగతి నీ భార్యాపుత్రుల విచారించి చూడుమని చెప్పగా, చూతముగాక యని తనవారి నడుగగా వారికి పాపములో భాగముండదని రనియు, అప్పుడతడు విరక్తుడై మునుల యుపదేశము నొంది తపస్సు చేసెననియు, అట్టి యాచరణలో అతనిపై వల్మీకము (పుట్ట) పెరిగెననియు, అందుచేత వాల్మీకిపదవాచ్యుడయ్యెననియు, తపశ్శక్తిచే మహర్షియైన తర్వాత రామాయణమును రచించెననియు ఒక గాథ కలదు. దాని కాధారము సరియైనది కానరాదు. వల్మీకము పెరిగిన తర్వాత వాల్మీకియైనచో అంతకుముందతని పేరేమైయుండెనో ఎవ్వరును తెలుపలేదు.

వాల్మీకి రాముని సమకాలికుడనియు తమసానదీతీరమున శిష్యులతో కూడ ఆశ్రమము స్థాపించి యందుండెననియు, అతడే యాదికవి యనియు శ్రీ మద్రామాయణమందు కానవచ్చుచున్నది. శ్రీమద్రామాయణ ములో ఉత్తరకాండను విమర్శకులు ప్రాచీనముగా నంగీకరింపలేదు. రామాయణములోని మొట్టమొదటి సర్గలోనే రామాయణ కథా సంగ్రహము నారదవాక్యముగా వ్రాయబడినది. అందు అన్నిటిని చెప్పినారు. కాని ఉతరకాండలోని విషయాలేమియు తెలుపలేదు. ఉతరకాండలో అపవాదభీరువై యుండిన శ్రీరాముడు సీతను పరిత్యజించినప్పుడు ఆమె గర్భవతిగా నుండెననియు, ఆమెకు వాల్మీక్యాశ్రషములో ఆశ్రయము లభించెననియు వ్రాసినారు. వాల్మీకి యాదికవి యని యందరును ఒప్పుకొనుచున్నారు. అతడు శ్లోకమును కనిపెట్టిన కథ అందరకును తెలిసినదే. కాళిదాస మహాకవి వాల్మీకిని 'కవి' యనియే సంబోధించెను. పరిత్యక్తయయిన సీత అరణ్యములో వాల్మీక్యాశ్రమ ప్రాంతములో విలపించుచుండగా వాల్మీకి ఆమెను కాంచెనని కాళిదాసిట్లు వర్ణించినాడు:


తా మభ్యగచ్ఛ ద్రుదితానుసారీ కవిః కుశేధ్మాహరణాయ యాతః
నిషాదవిద్ధాండజదర్శనోత్థః శ్లోకత్వ మాపద్యత యస్య శోకః.
                                     -రఘువంశము. 14 సర్గ. 70 శ్లో.

రామాయణములోనే బాలకాండ ద్వితీయ సర్గమందు క్రౌంచవధ కథ కలదు.


"ఋక్షోభూత్ భార్గవస్తస్మాద్వాల్మీకిర్యోభిధీయతే”

అని విష్ణుపురాణములో కలదు దీనినిబట్టి వాల్మీకికి ఋక్షుడను పేరుండె ననవలెను. ఈ విషయమునుగురించి శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు తమ సంస్కృత వాఙ్మయ చరిత్రలో నిట్లువ్రాసిరి: “ఇరువదినాల్గవ వ్యాసుడు ఋక్షుడనియు 28 వ వ్యాసుడు ద్వైపాయనుడనియు వాయుపురాణము చెప్పినది....ఈ పురాణ సంప్రదాయమునుబట్టియు “భృగు ర్వైవారుణిః” అను తైత్తిరీయోపనిషద్వాక్యమును బట్టియు వరుణ వంశమువాడును భృగువంశమువాడునైన వాల్మీకి యొక డేయనియు, అతడు వేదవ్యాసుడు కూడనై యుండెననియు తెలియుచున్నది."

వెబర్ భారతీయ వాఙ్మయ చరిత్రను వ్రాయుచు నందు తైత్తిరీయ ప్రాతిశాఖ్యలో ప్రాచీనాచార్యుల పట్టికలో వాల్మీకి పేరు కలదని వ్రాసెను.

పర్గిటర్ ప్రాచీన ఋషుల పట్టికను సిద్ధము చేసి అందు వాల్మీకి దశరథునికి రెండు తరముల తర్వాత నుండినట్లు తెలిపినాడు. సంగ్రహ ముగా పాటపాడి కథ చెప్పుటకు తగినట్లుగా రామాయణమును వాల్మీకి వ్రాసియుండుననియు తర్వాత యది పెరుగుచు వచ్చెననియు నతడు తలచెను.


బ్రహ్మాండ పురాణములో అధ్యాత్మ రామాయణము చేరియున్నది అందు వాల్మీకి మొదట గజదొంగగా నుండెననియు రామమంత్రోప దేశముచే మహాత్ముడయ్యెననియు వర్ణించినారు. ఈ పురాణము క్రీ. శ. 800 ఏండ్ల తర్వాతిదై యుండును. వాల్మీకి బోయ యనియు, దొంగ యనియు వర్ణించు కథలకంతయు నిదియే మూలమైయుండును. బ్రహ్మాండ పురాణ రచయితలు వాల్మీకి రామాయణములో లేని కల్పనలు చేసివేసిరి.


రామాయణములో “చక్రేప్రచేతసః పుత్రః” అనుటచేతను వాల్మీకికి ప్రాచేతసుడను పేరుండుట చేతను వాల్మీకి ప్రచేతసుని కుమారుడని తెలిసెను. వాల్మీకి "తపస్వి" అని "తపస్స్యాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం" అని రామాయణములోని మొట్ట మొదటి పంక్తియే తెలుపుచున్నది. వాల్మీకి తమసా నదీతీరమం దాశ్రమమును స్థాపించుకొని యుండెను. (బాల. 2-3) అతనికి శిష్యులుండిరి. (బాల. 2-1; 4) ఒక శిష్యుని పేరు భరద్వాజుడు (బాల. 1 - 5). వాల్మీకి బోయవాడను కథ కల్లయని యీ పంక్తి తెలుపుతున్నది. “మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ" (బాల 2-31) బ్రహ్మన్ అనిన బ్రహ్మ జ్ఞానము కలవాడనియు, బ్రాహ్మణుడనియు, పూజ్యుడనియు నర్థము లగును. వాల్మీకి ఋషిగా వర్ణితుడు. “రఘు వంశస్య చరితం చకార భగవాన్ ఋషిః” (బాల 3-9). 'భగవంతుడును ఋషియునునైన వాల్మీకి రఘు వంశ చరితమును వ్రాసెను' అని యన్నాడు. బాలకాండ మొదటి మూడు సర్గలలో వాల్మీకి తనకు తానే భగవాన్ ఋషిః, ఋషిపుంగవ, తపస్వి, మహాముని యనియు మహర్షి వ్రాసెను. ఋషి పుంగవు డిట్లనెను అనియు వ్రాసియుండునా? ఈ మూడు సర్గలన్య రచితములో యేమో? నాల్గవ సర్గ మొదటి శ్లోకములో "వాల్మీకిర్భగవాన్ ఋషిః" అని యుండుటచే అదియు వాల్మీకిది కాదేమో? వాల్మీకి రాముని సమకాలికుడో కాడో సంశయాస్పదమే. “చిరనిర్వృత్తమప్యేత త్ప్రత్యక్ష మివదర్శితం"(బా. 4-18) . చాలా కాలము క్రిందటి సంఘటనలైనను వాటిని ప్రత్యక్షముగా చూచినట్లు వాల్మీకి వ్రాసెనని వర్ణించినారు. ఇక బాలకాండలోని అయిదవ సర్గమును గనుడు. “తదిదం వర్తయిష్యామి సర్వం"(బా. 5-4) అని ప్రారంభించుచున్నాడు. “ఇక ఈ రామాయణ కథను పూర్తిగా వివరిస్తాను వినండి” అంటున్నాడు వాల్మీకి. వాల్మీకిరచన బాలకాండ అయిదవ సర్గతో ప్రారంభమగునని తలతును. కథా ప్రారంభము చక్కగా మొదలై సూటిగా సాగినది.

రామాయణ ప్రాశస్త్యము


హిందువులకు రామాయణమన్న నెంత గౌరవమున్నదో అంత గౌరవము మరే గ్రంథానికిని లేదని తెలిపినాను. భారతదేశమందలి సర్వ భాషలను మాట్లాడు హిందూ కవులందరును మొదట వాల్మీకికి నమస్కారము చేయనిది కవిత్వ మారంభించినవారు కారు. కేవల సంస్కృత సాహిత్యము నందే కాక దేశభాషలలోని కవితలందును వాల్మీకిస్మరణ అగ్రస్థానము వహించినట్టిదై యున్నది. సంస్కృత మహాకవులందరును వాల్మీకి రామాయణమును చదువనిది తమ సాహిత్య విద్య పూర్తికాదని పూర్వ కాలములో భావించుచుండినట్లు కనబడుచున్నది. పూర్వకాలములోవాల్మీకి రామాయణములోని కొన్ని భాగాలను శిష్యులకు చదువు చెప్పిన తర్వాత తక్కిన పంచకావ్యాదులను చెప్పుచుండిరని ప్రతీతి. ఇప్పుడైనను వాల్మీకి రామాయణములోని కొన్ని ముఖ్యభాగములను విద్యార్థులకుచెప్పి తర్వాత రఘువంశాదులను ప్రారంభించిన బాగుండును. కాళిదాసాది మహాకవులందరు వాల్మీకి కవితను ఆదర్శముగా పెట్టుకొని తమగ్రంథాలను రచించినట్లు అనేక నిదర్శనాలు కలవు. ఇంచుమించు 200 సంవత్సరాలనుండి ముఖ్యమగు యూరోపు భాషలలో ఇంగ్లీషుద్వారా రామాయణకథ పరివర్తనమునుపొంది పాశ్చాత్యులకు పరిచితమైపోయినది కాని మొదటి భాషాంతరీకరణములు సంగ్రహమైనవగుటచేతను సంస్కృత భాషలోని రమ్యత తెలియనివారిచే వ్రాయబడి అట్టివారిచే చదువబడినవగుటచేతను పాశ్చాత్యులకు రామాయణ ప్రాశస్త్యము కానరాకపోయెను. పైగా చాలామంది పాశ్చాత్యులు మొదటినుండియు సంకుచిత దుర్ర్భమకు లోనై నట్టివారు. తమ సాహిత్యము, సంస్కృతి, గ్రీకు, లాటిను భాషలనుండియే వచ్చినవని వారి భావనయై యుండెను. గ్రీకు లాటినులలో వ్రాయబడినవాటికన్న మించిన ప్రాచీన గ్రంథాలు ఏ యితర ప్రపంచ భాషలలోను లేవను సిద్ధాంతము వారిలో దృఢపడిపోయి యుండెను. హోమర్ అను గ్రీక్ ప్రాచీనకవి వ్రాసిన ఇలియడ్, ఒడెస్సి అను పురాణాలే ఉత్తమ పురాణాలని వారు భావించిరి. కాని హోమరు గ్రంథముకన్న మూడురెట్లకన్న అధికమయిన రామాయణము, ఇంచుమించు 15 రెట్లకన్న అధికమయిన మహాభారతము ఉన్నవని వారికి తెలిసినపుడు వారు దిగ్ర్భమ చెందిరి.[3] కాని తమ పూర్వాభిమానములను చంపుకొనలేక ఆర్యులీ పురాణాలను గ్రీకులనుండియే సంగ్రహించి యుందురని వాదించిరి. హోమరు వ్రాసిన ఇలియడ్ కథకును రామాయణకథకును చాలా పోలికలున్నవి. అందుచేత రామాయణము హోమరు యొక్క ఇలియడ్ నుండి దొంగిలించిన పురాణమే అని పలువురు వ్రాసిరి. ఎవరు దొంగలో ఎవరు దొరలో ఇప్పుడే నిర్ణయించుకొందము. ఇంతలో ఈ రామాయణప్రాశస్త్య ప్రశంసాసూచనను ముగించి తర్వాత ఆ చర్చకు వత్తును. రామాయణము ఆర్యుల కాదర్శగ్రంథము. అందలి యుత్తమ పాత్ర లన్నియు మన కాదర్శపాత్రములే. రామునివంటి రాజు, సీతవంటి భార్య,, హనుమంతునివంటి బంటు, లక్ష్మణునివంటి సోదరుడు, భరతుని వంటి భక్తుడు, సుగ్రీవుని వంటి స్నేహితుడు, దశరథుని వంటి కరుణామయమూర్తి, ప్రపంచ వాఙ్మయములో నెందును సృష్టికాలేదు. వెయ్యేండ్ల నుండియు పరాధీనతయే సంప్రాప్తమైనను హిందువులలో నేటికిని విశేషముగా ధార్మికగుణాలు వ్యక్తమగుచున్నవంటే దానికి కారణము శ్రీమద్రామాయణమే! చదువురానివారికిని, స్త్రీలకును, అస్పృశ్యబ్రువులకును, తక్కువకులా లనబడు వారికిని బోధచేయు దిక్కేలేని సంప్రదాయములో నీతివర్తనము పట్టుకొనివచ్చినదంటే అది శ్రీమద్రామాయణ మాహాత్మ్యమే. సీత పేరు, సీత కథను వినని హిందూ దౌర్భాగ్యులు లేనేలేరు. రామాయణములో హిందువులకు పై విశేషాలే కానవచ్చుచుండును. కాని దాని నర్థము చేసుకోలేని కొందరిపాశ్చాత్యుల కందు కోతులు, భూతాలు, తిక్కకథలు, నమ్మగారానిముచ్చటలు - ఇట్టివే కనబడుచుండును. తమ హోమరులో ఇంతకుమించినవి ఎన్ని యున్నను అవి వారికి కానరావు.

ఇలియడ్ పురాణము


హోమరువ్రాసిన ఇలియడు పురాణమును మన రామాయణముతో లంకెపెట్టినందున ఇలియడ్ పురాణకథను కట్టె, కొట్టె, తెచ్చెనన్న మాదిరి సంగ్రహముగా వ్రాయుచున్నాను.

పూర్వకాలములో ట్రాయి అను ఒక గొప్ప నగరముండెను. దాని రాజుపేరు ప్రియం. అతనికి హెక్టరు అను కొడుకును, ప్యారిసు అను వాడును మరికొందరు కుమారులును కలిగిరి. ప్యారిస్‌మూలాన ముందుకాలంలో దేశానికి ప్రమాదమున్నదని జ్యోతిష్కులు చెప్పినందున వాడు పుట్టిన కొంతకాలానికి వానిని ఇళా అను పర్వతాలలో వదలివేసిరి. వానిని గొల్లలు పెంచిరి. ప్యారిస్ పసులు మేపుచు పెద్దవాడై మంచి తగవుతీర్పరి యని యనిపించుకొనెను. ఇట్లుండ గ్రీసులోని భాగమగు థెసలీ దేశము యొక్క రాజు పెండ్లాడెను. ఆ పెండ్లికి దేవతలుకూడ ఆహూతులైరి. కాని కలహదేవతను మాత్రము పిలువలేదు. ఆమె పెండ్లిసందడిలో కల్పించుకొని సభలో ఒక బంగారు సేపుపండును పారవేసి “అందరిలో సుందరియైన స్త్రీయే దీని కర్హురాలు" అని చెప్పిపోయెను. ఇంకేమున్నది? నేనే సుందరిని, నేనే జగదేకమోహినిని అని దేవతలంతా తగవులాడిరి. తుది పరీక్షలో ముగ్గురు దేవతలే నిలిచిరి. ఆ ముగ్గురును అసమాన సుందరాంగులే తుదకు వీరు ప్యారిసువద్దకు వెళ్ళి తీర్పు చెప్పుమనిరి. ప్యారిసు వారిని ఎగ దిగ చూచుచు పరీక్షించుచు ఏ నిర్ణయము చేయజాలక తర్కసాగరములో మున్కలు కొట్టదొడగెను. అప్పుడు ఒక దేవత నన్నే నీవు మెచ్చుకొంటివా నీకు సామ్రాజ్యమిప్పింతు ననెను. ఇంకొకతె విద్య నిత్తుననెను. వీనసు అను దేవత "నీకు భువనమోహిని యగు చక్కెరబొమ్మ నిప్పింతు”ననెను. ప్యారిసుకు నోరూరెను. వీనసే అందరిలో సుందరాంగి యని వెంటనే నిర్ణయము చేసివేసెను. కొంతకాలానికి ప్యారీసు యొక్క యస్తిత్వ మాతని తండ్రికి తెలిసి వానిని ట్రాయికి పిలిపించుకొనెను. ప్యారిసు అచ్చటినుండి వీనసు ప్రేరితుడై స్పార్టా అను గ్రీకుదేశ భాగముయొక్క రాజైన మెనిలాస్ అనువాని నగరానికిపోయెను. మెనిలాస్ చాలా ప్రేమతో అతని కాతిథ్య మిచ్చెను. మెనిలాస్ భార్యపేరు హెలెస్ (హాలీ). ఆమెయే భువనమోహిని. హెలెనున్నూ ప్యారిసున్నూ పరస్పరము గాఢముగా ప్రేమించుకొనిరి. ఇంతలో మెనిలాసు పనిబడి దేశాంతరము వెళ్ళెను. అతడు వచ్చులోపల ప్యారిసు హెలెనును ఒప్పించి మెప్పించి తనవెంట లేవదీసుకొని వెళ్లెను. ట్రాయిలో ఇరువురుసు భార్యాభర్తలవలె సుఖముగా ఆనందాలలో ఓల లాడుచుండిరి. మెనిలాసు తిరిగివచ్చి తనభార్య లేచిపోయిన వార్త విని తన కపచారము చేసిన ప్యారిసుపై పగ సాధించుటకును తన హెలెనును మరల తెచ్చుకొనుటకును ఇతర గ్రీకు రాజులకు జాబులు వ్రాసి పిలిపించు కొనెను. వారిలో ముఖ్యులు యులిసిస్, ఆకిల్లీ అనువారు. ఈ సైన్యానికి నాయకుడు మెనిలాస్ అన్నయగు అగమెమ్నాన్. (గ్రీకు భాషలో అగమెమ్నాన్ అంటే మనుష్యులలో ఉత్తముడు అనగా "అగ్రమానవ” అను పదమును పోలిన నామము.) వీరందరును ఓడలలో పోయి ట్రాయిని ముట్టడివేసిరి. పదియేండ్లపాటు యుద్ధము జరిగెను. ఉభయత్ర మహా వీరులు చాలా మంది చనిపోయిరి. ఈ యుద్ధములో ప్యారిసు అన్నయగు హెక్టరునకున్ను గ్రీకులలో మహావీరుడయిన ఆకిల్లీసునకున్నూ జరిగిన యుద్ధము ముఖ్యమైనది ఎట్లయితేనేమి ఉభయులును చచ్చిరి. ఈ పదేండ్ల కాలములో ప్యారిసు ఎడతెగకుండా హెలెనుతో భోగా లనుభవించుచు తుదకు తానును యుద్ధము చేసి రణరంగ మందు మరణించెను. కాని ఇంతకునూ ట్రాయి గ్రీకుల వశము కాకపోయెను. గ్రీకులు ఒక యుక్తిని పన్నిరి. ఒక గొప్ప కట్టె గుర్రాన్ని చేసిరి. దాని కడుపులో మహావీరులు దాగియుండిరి. దాన్ని దిగతుడుపుగా అచ్చట వదలి తమ ఓడలలో ఎక్కి వెళ్ళిపోయిరి. ట్రాయివారు గ్రీకులు పారిపోయిరని కోటబయటకువచ్చి ఆ కట్టెగుర్రాన్ని ఊరిలో ఊరేగింపుతో ఉత్సవాలు చేసి రాత్రి మైమరచి నిద్రించిరి. తర్వాత గుర్రములోనివారు బయటకు వచ్చి కోట తలుపులు తెరిచిరి. పోయినట్లు నటించి ఆ రాత్రియే తిరిగి వచ్చిన గ్రీకులు లోపలికి ప్రవేశించి నగరాన్ని దగ్ధముచేసి జనులను చంపిరి. హెలెనును మెనిలాసు తీసుకొనిపోయెను.

ఇది హోమరు వ్రాసిన ఇలియడు కథ. హోమరు పాత్రలలో ఉత్తమత్వము లేదు. హెలెను పరకీయ. ప్యారిసు అతిథి సత్కారాన్ని పొందినవాడు. దాని కుపకృతిగా హెలెనును లేవ నెత్తుకొనిపోవును. బలవంతముగా ఆ పని చేయలేదు. హెలెనే వానివెంబడి పోయెను. అట్టి దానికై పదేండ్ల యుద్ధము జరిగెను అట్టి వ్యభిచారిణికై చాలామంది వీరులు చావగా హెలెనును మెనిలాసు ప్రేమతో తన యింటికి తెచ్చుకొని తృప్తిపడెను.

హోమరు యొక్క పాత్రల హైన్యత వ్యక్తమగుచున్నది. హెలెను ఎక్కడ? సీత ఎక్కడ? నక్క ఏడ? నాక లోక మేడ? హోమరు యొక్క ఇలియడులో రామునివంటి నాయకుడు ఎంత వెదికినను కానరాడు. ఇలియడు పురాణానికేమియు ఆదర్శము లేదు హిందువులు ఆదర్శ రహితమైన కథలను స్వీకరించినవారు కారు. పైగా హోమ రెప్పటివాడు ?

హోమరు కాలము

క్రీ. పూ. 685 నుండి క్రీ. పూ. 1159 సంవత్సరాలమధ్య హోమ రుండియుండవచ్చును అని విమర్శకు లూహలు చేసినారు. హెరెడోటస్ అను ప్రాచీన చారిత్రకుని అభిప్రాయ ప్రకారము హోమరు హెరెడోటసుకంటే 400 సంవత్సరములకు పూర్వ ముండినవాడు. అనగా క్రీ. పూ. 830 లో ఉండెను. అరిస్టార్కసు అభిప్రాయములో అతడు క్రీ. పూ. 1044 లో ఉండెనట. ఇదంతయు ఊహయే. హోమరు అను వాడే లేకుండెనని పలువురు పాశ్చాత్య పండితులు వ్రాసినారు. ట్రాయి యుద్ధము అనగా ఇలియడ్ కథ జరిగినకాలము క్రీ. పూ. 1200 ఏండ్లనాడు. హోమరు వ్రాసిన గ్రంథములో నీతిబాహ్యమైన విషయములు చాలా యుండినందున క్రీ.పూ. 150 లో ఇలియడును కొందరు పండితులు తీర్చిదిద్ది యిప్పటి రూపానికి తెచ్చి ప్రపంచాని కర్పించిరి. ప్లేటో అను గ్రీకు నై యాయికుడు ఇలియడు పురాణములోని అసభ్యతను గర్హించెను. జెనోడోటస్ కవి దానిలో చాలా మార్పులు చేసెను. అట్లు దిద్దినను అసభ్య దూషణలు, అన్నచెల్లెండ్ల వివాహములు, శవాల వస్త్రాపహరణములు, విషదిగ్ధమగు బాణాల ప్రయోగము, ఇఫిజీనియా వంటి నరబలులు - ఇట్టి వెన్ని యో యింకను ఇలియడులో నిలిచి పోయినవి. హోమరు కవియే రామాయణగాథను అడ్డదిడ్డిగా విని దాని వంటి ఘట్టాలు కలిగినట్లు కనిపించిన ట్రాయి యుద్ధాన్ని పురాణముగా వ్రాసినట్లు కనబడుచున్నది. అయితే రామాయణగాథ క్రీ.పూ. 800 లేక 900 ఏండ్ల క్రిందట గ్రీసువంటి దూరదేశమునకు వ్యాపించిపోయెనా ? అని శంకింపవచ్చును.

ఒక్క రామాయణ మేమిటి? హిందువుల గాథలు, వారి కళలు, అశ్వశాస్త్రాలవంటి శాస్త్రములు, వైదిక దేవతలు ఇవన్నియు గ్రీసువరకు క్రీస్తునకు పూర్వము రెండు మూడు వేలయేండ్ల క్రిందటనే వ్యాపించి యుండెను. ఎట్లనగా గ్రీకు దీవులకు సమీపమందే సిరియా అను దేశమున్నది పూర్వములో అచ్చటనుండిన మండలాన్ని హట్టిదేశమనిరి. అచ్చట బోఘాజ్‌క్వీ (Boghazkuei) అను నగర ముండెను. దానికి తూర్పున టైగ్రస్ యూఫ్రటీసు నదులమధ్య మిటన్నీ అను దేశ ముండెను. అది యిప్పటి మెసపొటోమియాలోని మండలము. హట్టి రాజు మిటన్నీ రాజుతో క్రీ. పూ. 1380 లో ఒక సంధి చేసుకొనెను. దానిని శాసనముగా చెక్కించిరి. ఆ సంధికి సాక్షులుగా మిత్ర, వరుణ, ఇంద్ర, నా సత్య దేవతలు పేర్కొనబడినారు. జోఘాజ్‌క్వీలోని దిబ్బలలో కొన్ని శాసనాలు దొరికినవి. వాటిపై అశ్వశాస్త్రసూత్రములను వ్రాసినారు. ఐకవర్తన, తిర ((త్రి) వర్తన, పంజ (పంచ) వర్తన, షట్ట (షష్ఠ) వర్తన, అను నడకలను గుర్రాలకు నేర్పించవలెనని అందు వ్రాసినారు. ఈ పదాలు సంస్కృతభాషలోనివి. సిరియా పాలస్తీనా ప్రాచీనరాజుల పేరులు సంస్కృతనామములతో కూడియుండెను. అర్తతమ (ఋతతమ), తుష్రత, సుబంధు అనునవి కొన్ని పేరులు. ఈ నిదర్శనాలనుబట్టి సిరియాప్రాంతాలకు హిందువులు క్రీస్తునకు పూర్వము 3000 ఏండ్లక్రిందటనే వెళ్ళియుండిరని పాశ్చాత్యులే వ్రాసియున్నారు. క్రీ. పూ. 2635 లో అక్కడ్ (సిరియా ప్రాంతములోని దేశము) రాజగు సర్గాం అనువాడు ఏషియామైనరులోని “పురుషఖండము” రాజైన నూర్‌దగన్ అనువానిపై దాడివెడలెను. నేటికి ఇంచుమించు 4600 ఏండ్ల క్రిందట సిరియాప్రాంతములో పురుషఖండ రాజ్యముండెను. [4] దీనినిబట్టి రామాయణగాథను గ్రీకుకవి క్రీ. పూ. 800 లేక 900 ఏండ్ల నాడు వినియుండుట ఆశ్చర్యకరము కాదు. పైగా ఇంచుమించు ఏడెనిమిది నూర్ల ఏండ్ల కాలములో అనగా క్రీస్తుపూర్వము 150 నాటివరకు ఇలియడును దిద్దుచునే వచ్చినారు. కావున దాని తుది స్వరూపము క్రీ. పూ. 150 లో ఏర్పడెను.

ఇంతేకాక గ్రీసుదేశానికి సమీపములోఉండే ఛాల్డియాదేశములో క్రీస్తునకు పూర్వము 3000 ఏండ్ల క్రిందట పంపబడిన ఇండియా టేకు దూలములు కనబడినవి. టేకుకట్టె ఇండియాలో తప్ప మరెచ్చటను లేకుండెను అని మిస్ రగోజన్ (Vedic India) లో వ్రాసెను. ఆమె యింకను ఇట్లు వ్రాసెను: “బాబిలోనియాలో హిందువులు నేసిన బట్టలను 'సింధు' అను పేరుతో వ్యవహరించిరి " సాలమన్ కాలములో ఇండియా నుండి యెగుమతి యయిన చందనము, దంతము, కోతులు, నెమళ్ళు మున్నగు భారతీయ వస్తువులకు హీబ్రూ భాషలో పేరులు లేనందున భారతీయనామములతోనే వ్యవహరించిరి. ఇట్టి ప్రమాణాలనుబట్టి హోమరుకంటే ఎన్నియో శతాబ్దములకు పూర్వమే హిందూవ్యాపారులు, వైదిక మతబోధకులు, గ్రీసు దేశమువరకు కూడా వెళ్ళివచ్చుచుండిరని స్పష్టమగుచున్నది. కొందరు పాశ్చాత్యపండితుల అభిప్రాయ ప్రకారము హోమరే రామాయణమునుండి తన కథావస్తువునుగ్రహించెను. “హోమరు వ్రాసిన ఇలియడ్ పురాణము రామాయణముయొక్క ప్రతి ధ్వనియే. మరియు దానియొక్క అస్పష్టమగు అనుకరణము. ఈ అనుకరణము ప్రతి చిన్న విషయములో కూడా స్పష్టముగాను నిరాకరింపరానిదిగానూ కనపడు చున్నది" అని యం. జల్లికోట్ పండితుడు వ్రాసినాడు. [5]

హిప్పోలిట్ ఫౌష్ (Hippolyte Fauche) ఇట్లనెను: “రామాయణము నుండియే ఇలియడ్ ఏర్పడినదని పూర్తిగా విశ్వసించుచున్నాను."[6]

ఎమిల్ బుమౌఫ్ (Emile Bumouf) క్రీ. శ. 1888 లో ఇట్లు వ్రాసెను: “ఈ 19 వ శతాబ్దములో రెండు ఆశ్చర్యాలు సంభవించెను. (1) క్రైస్తవమతమునకు సంబంధించిన చాలావిషయాలు హిందువులనుండి వచ్చినవనియు, (2) గ్రీకు పురాణాలు స్వతస్సిద్ధములు కావనియు తెలిసెను. గ్రీకు దేవతలును శూరులును కలిసి యొక సుందరాంగి మానభంగమునకై పగతీర్చుకొనుటకు గుమికూడుకథ అంతకుపూర్వమే గంగాతీరములో రచితమైయుండెను. [7] వెబర్ అను నతడు రామాయణము క్రీ. శ. 400 లో రచింప బడెనని వ్రాసినాడు. ఎందుకనగా బౌద్ధ జాతక కథలలోని ఒకకథలో సీతారాముల ముచ్చట కలదట. జాతక కథలు బుద్ధుని పూర్వజన్మ కథలు. అవి కల్పితములైనవి. అయినను ఏడవ అవతార పురుషుడయిన రాముడు తొమ్మిదవ అవతారపురుషుడయిన బుద్ధునితర్వాత నుండినట్లు వెబరు వాదించుట హాస్యాస్పదమని విల్లీపండితుడు ఖండించినాడు. ఒకోబీ అను పండితుడు రామాయణములో “యవన" అను పదము మూడుమారులు వచ్చినందున రామాయణము అలెగ్జాండరు దండయాత్రకు తర్వాతికాలపు రచనయై యుండునను సూచనను చేసినాడు. “యవన” పదము అలెగ్జాండరుతో మనదేశములోనికి వచ్చినదని పాశ్చాత్యులెప్పుడును ఒక తప్పుడు వాదము చేయుచుందురు. అలెగ్జాండరుగాని అతని పెద్దలుకాని పుట్టుటకు 2000 ఏండ్లకు పూర్వమే హిందువులు సిరియా, గ్రీకుదేశాలవరకు తమ మతవ్యాప్తి చేసియుండినట్టి వారని ఇదివరకే చూపినాము. కావున పదేపదే అలెగ్జాండరుతో “యవన” పదము యొక్క దిగుమతిని ఆధారము చేసుకొని అపక్వసిద్ధాంతాలను చేయుట అజ్ఞానవిలసనముగా నుండును. ఇట్టి కారణాలనుబట్టి దొంగ యెవరో దొర యెవరో మనకు విశదమగుచున్నది.

వాల్మీకి రామాయణములో విదేశీయవస్తుప్రభావము యొక్క జాడలేవియు కానరావు. భావములలో, సాంఘీకాచారములలో, భూగోళ వర్ణనలలో, పాత్రలపేరులలో, ప్రకృతివర్ణనలలో ఏవియు వైదేశిక లక్షణములు కానరావు. కావున వాల్మీకినుండియే హోమరు తన పురాణమును సృష్టించియుండును. లేదా పరస్పర సంబంధ ముభయులకును లేకుండును.

దేశి విదేశి పురాణాలు

ఈ చర్చను ముగించుటకు పూర్వ మొక సూచనను చేయదలచినాను. జైన బౌద్ధమత వ్యాప్త్యనంతరము ఇంచుమించు ఒక వేయి సంవత్సరములవరకు స్వార్థపరులు తమతమ భావాలను ప్రచారము చేయుటకై పురాణములలో కల్పిత కథలను, భావాలను, నీతులను దూర్చి పెంచుచు వచ్చిరని పలువు రభిప్రాయపడినారు. అందుచేత మన కాలములో పురాణాలకు విలువ తగ్గెను. పురాణాలలో అతి పురాతన చారిత్రికాంశములిమిడి యున్నవి. మన పరిశోధకులు-ఇంగ్లీషు సంస్కృతము బాగా నేర్చినవారు - కేవలము మన సంస్కృత పురాణాలనే కాక విదేశీయ పురాణాలనుగూడా తారతమ్య దృష్టితో (Comparative Study) చదువవలెను. ఆర్యావర్తమందు ఆర్యుల సంస్కృతి, నాగరికత, విజ్ఞానము ఒక దిక్కు విజృంభించుచుండగా ఇంచుమించు అదే విధముగా కొంత కాలముతర్వాత ఈరాన్, బాబిలోనియా, హట్టి, అసీరియా, ఛాల్డియా, ఫినీషియా, సిరియా, గ్రీసు, ఈజిప్టు, (మిశ్ర దేశమునందలి నీలనదీ ప్రాంతములో) రోముదేశములలో నాగరికత పెంపొందుచు వచ్చెను. పై దేశాలలోను పురాణాలు రచింపబడెను. వాటిలో విశేషభాగము ఇంగ్లీషులో లభించుచున్నవి. వాటిని మన పురాణాలతో సరిపోల్చు దృష్టితో చూచుచు వచ్చిన, మన పురాణాలలోని విశ్వామిత్రుడు, భృగువు, పరశురాముడు, బలరాముడు వాల్మీకి మున్నగు వారికి ఆ దేశాలతో ఏమైన సంబంధముండెనో యేమో తెలియరాగలదు. ఆ దేశాల చర్చ మన పురాణాలలో కనబడవచ్చును.

  1. ఋక్షో౽భూద్భార్గవస్తస్మా ద్వాల్మీకి ర్యో౽భిధీయతే - విష్ణు పురాణము 3. 3.
  2. శుక్రుడు భృగువంశపు "భార్గవుడు" అని మన పురాణాలు చెప్పుచున్నవి.
  3. మహాభారతములో 2,20,000 పంక్తులున్ను, రామాయణములో 48,000 పంక్తులున్ను, ఇలియడ్‌లో 15,693 పంక్తులున్ను కలవు.
  4. హట్టి(Hithite)ని గుఱించి ఇంకను వివరాలు తెలుసుకొనగోరువారు ఎన్ సైక్లోపీడియా బ్రిటానికాలో పై ఇంగ్లీషు పదమువద్ద చూచుకొనగలరు.
  5. The Iliad of Homer is nothing but an echo an enfeebled souvenir of the Ramayana.... .... The imitation is flagrant, undeniable, met with even in details. - M. Jellicot in Bible in India. P. 32.
  6. Rama & Home.-Lille p. 175.
  7. “The 19 th century had experienced two great surp-rises ( 1) The Indian origin of much that is called “Christianity,” (2) and that the Greek epics were not original, and even the great hordes of Gods and men and their muster to avenge the rape of a pretty woman had been previously made into a great epic on the banks of the Ganges. Ibid p. 175