Jump to content

రామాయణ విశేషములు-2

వికీసోర్స్ నుండి

వివిధ రామాయణ కథలు

జైన రామాయణము

ప్రపంచానికంతయు వాల్మీకి రామాయణము పరిచితమయిపోయి నది. భారతీయభాషలలో అనువదింపబడిన రామాయణములలో బహు విధములైన మార్పులు చేసినారు. తులసీదాసు తన కిష్టము వచ్చినట్లు మార్చెను. గోనబుద్ధుడు చాలా మార్పులు చేసెను. వాల్మీకి రామాయణ ములో లేని ఇంద్రజిత్తు భార్యయగు సులోచనను గోనబుద్ధుడు సృష్టించి సులోచనా సహగమనము అను భాగమును గొప్పగా పెంచి వర్ణించి వ్రాసెను.[1]శతకంఠ రామాయణమని ఒకడు వ్రాయగా అంతకు మించిన శక్తిని చూపింతు నన్నట్లుగా సహస్రకంఠరామాయణమును మరొకడు వ్రాసెను. ఆధ్యాత్మ రామాయణము, అద్భుత రామాయణము, విచిత్ర రామాయణము ఇట్టివెన్నైనను సృష్టియై కొద్దిగనో గొప్పగనో ప్రజాదరమునుగూడ బొందినవి.

అన్ని రామాయణముల ముచ్చట యేమోకాని జైన రామాయణ మును గురించి మాత్రము ప్రత్యేకముగా చెప్పవలసియున్నది. "జైన రామాయణము” అను పేరుతో ఏ గ్రంథమున్నూ లేదు. హేమచంద్రు డను జైనుడు "త్రిషష్టి శలాక (శ్లోక) పురుష చరిత" అను పేరుతో ఒక గ్రంథాన్ని రచించెను. అది ఇప్పుడు ముద్రితమై లభ్యమగుచున్నది మూలమును నేను చూడలేదు. అందలి రామాయణకథను ఇంగ్లీషు వ్యాస రూపముగా నున్నదానిని చూచినాను. దానినుండియే యీ క్రింది కథ నుదాహరించుచున్నాను. జైన హేమచంద్రుడు పై గ్రంథములో రామా యణకథ నిచ్చినాడు. ఆ కథ వాల్మీకి రామాయణముతో ముఖ్యవిషయా లలో భిన్నించుచున్నది. అందుచేత భిన్నించిన విషయాలను చేర్చి దాని నిచ్చట వ్రాయుచున్నాను. భిన్నించని విషయాలు వ్రాయలేదు. అవి రెంటను ఒకటేరీతిగా నున్నవని గ్రహింపనగును.

జైనకథ - రాక్షస వానరోత్పత్తి '1

భరతఖండ మందలి వినీత పట్టణమున ఇక్ష్వాకువంశీయుడయిన సగర చక్రవర్తి రాజ్యము చేయుచుండెను. అతడొకనాడు వేట కరిగి బాటతప్పి యలసియుండెను. అప్పుడరణ్యమం దతడొక సుందరిని సుకేశ యనుదానిని జూచెను. ఇరువురు పరస్పరము మోహించిరి. అప్పుడొకడు వచ్చి యా సగరునితో నిట్లు చెప్పెను: "అయ్యా! విద్యాధరులలో నొకడయిన సులోచనుడను రాజు గగనవల్లభాపట్టణము నేలుచుండెను. అతనికి సహస్రనేత్రు డను కుమారుడును, సుకేశ యను కూతురును కలరు. రదనపురాధీశ్వరుడైన పూర్ణమేఘు డనువాడు సుకేశనుగోరియు నభీష్టము నెరవేరనందున సులోచనుని జంపి రాజ్యమపహరించెను. ఇప్పుడు సహస్రనేత్రుడును తన చెల్లెలగు సుకేశయు నీ యరణ్యమున దాగియున్నారు. తాము సుకేశను పరిగ్రహించ నర్హులు.”

అదే ప్రకారము సగరుడు సుకేశను పెండ్లియాడి సైన్యయుక్తుడై పూర్ణమేఘుని పారద్రోలి తన మఱదిని రదన పురమునేల నియోగించెను. కొంతకాలమునకీ బావమఱదులు తీర్థయాత్రచేయుచుండ పూర్ణ మేఘుడు వీరికెదురుకాగా సహస్రనేత్రు డతని జంపెను. పూర్ణమేఘుని కొడుకు ఘనవాహనుడు. భీముడను రాక్షసరా జతని జూచి "అయ్యా! నీవు నాకు పూర్వజన్మమున పుత్రుడవు, నా కాలము సమీపించినది. కావున నీకు నా నవ వజ్రముల హారమును నిచ్చితిని. నీవు రాక్షసద్వీపమందలి నా లంకాపట్టణమగు పాతాళలంకకు పరిపాలకుడవు కమ్ము" అని యతనికి పట్టము కట్టెను. ఇతనికి మహారాక్షసుడు, అతనికి దేవరాక్ష సుడు, అతనికి కీర్తిధవళుడును, అతనికి తటిత్కేశుడును బుట్టిరి.

ఇక వానరోత్పత్తి యెట్లనగా రత్నపురమున తొల్లి పుష్పోత్తరు డను విద్యాధరుడు రాజ్యము చేయుచుండెను. అతనికి పద్మో త్తరుడను కుమారుడును, పద్మయను కూతురును గలిగిరి. శ్రీకంఠుడను రాజు పద్మను వివాహమాడదలచి తన విమానముపై నెత్తుకొనిపోయెను. పుష్పోత్తరుడు కోపించి శ్రీకంఠుని చంప నుద్యుక్తుడయ్యెను. అప్పుడు పైన చెప్పబడిన కీర్తిధవళుడను రాక్షసుడు వారికి సంధి సమకూర్చెను. కొంతకాలమునకు శ్రీకంఠుడు వానరద్వీపమునకు రాజయ్యెను. ఇతనికి వజ్రకంఠుడు, అతనికి దశరథుడు పుట్టిరి.

పై జెప్పిన రాక్షసరాజుకు తటిత్కేళు డొకనాడు వానరద్వీప మందు భార్యాసహితుడై యిచ్చావిహారముచేయుచుండ నతని భార్య యొక్క ముఖము నొక్క వానరుడు బరికిపెట్ట భర్త కోపించి వానిని జంపెను. పిమ్మట పశ్చాత్తప్తుడై వైరాగ్యమును బొంది తన కొమరుడగు సుకేశునికి బట్టము గట్టెను. అచ్చట వానరద్వీప రాజగు దశరథునకు కిష్కింధుడు పుట్టెను. ఇతనిని స్వయంవరమందు మందిరమాలియను రాజు కూతురు వరింపగా అశనివేగు రాజు కోపోద్దీపితుడై వానరద్వీప మును జయించి యచటినుండి కిష్కింధుని బారదోలి రాక్షసద్వీపముపై తన సైన్యమును నడుపగా సుకేశుడును పారిపోయెను. ఈ సుకేశుడును కిష్కింధుడును పాతాళ లంకలో దాగుకొనిరి. అచ్చట సుకేశునికి మాలి, సుమాలి, మాల్యవంతులను ముగ్గురు కుమారులు పుట్టిరి. మాలి పెద్ద వాడైన పిమ్మట తనతండ్రి కపచారముచేసిన రాజును, అతని రాజ్యమును జయింపగోరి బయలుదేరెను. కాని యతడు యుద్ధమందు మరణించెను. అతని తమ్ముడగు సుమాలి కేకసి యనుదాని బెండ్లియాడి రత్న శ్రవసుడు, భానుకర్ణుడు, విభీషణుడను కుమారులను చంద్రనఖ యను కూతును కనెను. వీరి పూర్వికు డిచ్చిన నవరత్నముల హారము సుమాలిదగ్గఱనుండెను. దాని నెవ్వరు నెత్తజాలకుండిరి. దానిని వేయి సర్పములు కావలి కాచియుండెను. అట్టి వజ్రహారమును రత్నశ్రవసు డవలీలగా ధరించెను. ఆ నవరత్నములందీ బాలుని ముఖప్రతిబింబమును చూచి తండ్రి సంతసించి యతనికి "దశముఖ” యను బిరుద మిచ్చెను. భానుకర్ణునికి కుంభకర్ణుడని పేరువచ్చెను. మరియు చంద్రనఖకు శూర్పణఖ యను పేరు వచ్చెను.

దశముఖుడు పెద్దవాడై తపస్సుచేసి యనేక శక్తుల సంపాదించి మండోదరి యనుదాని బెండ్లియాడి యింద్రజిత్తను కొడుకును బడసెను.

రావణుని దిగ్విజయము 2

పిమ్మట లంకాపురమును సాధించి దానికధీశుడయ్యెను. వానర రాజైన కిష్కింధుని కుమారులగు ఆదిత్యరజస్సు, రక్షరజస్సు అను వారు నరకములో బడినారని విని యమరాజను పారదోలి వారిని వానర ద్వీపమందు రాజులనుగా జేసెను. ఆదిత్యరజస్సునకు ఇందువతివలన వాలి, సుగ్రీవులు పుట్టిరి. రక్షరజస్సునకు నలుడు, నీలుడు పుట్టిరి. వాలి కిష్కింధ నేలెను. దశముఖుడు లంక నేలుచుండెను. అతడు వాలి పరాక్రమము వినినవాడై యోర్వక యతనిపై యుద్ధమునకు బయలుదేరి యోడిపోయి బంధింపబడెను. పిమ్మట వాలి యతనిని విడిచిపెట్టి మేరు పర్వతముపై తపస్సు చేయబోయెను. సుగ్రీవుడు తన కూతురగు సుభద్రను దశముఖున కిచ్చి పెండ్లిచేసెను. దశముఖు డంతటితో నూరకుండక రత్నావళియను నందకత్తె సత్యలోకమున నున్నదని దానిని తెచ్చుకొనదలచి పోవుచు మార్గమధ్యమందు వాలిని జూచి మేరువు క్రింద చేయివెట్టి పర్వతముతోగూడ నతనిని గూల్పజూచెను. కాని వాలి తన బొటనవ్రేలితో పర్వతము నదుమగా క్రిందనుండిన దశముఖుడు పీడితుడై యనేక సంవత్సరములు రోదనముచేసెను. అందుచేత నితనికి రావణుడను పేరువచ్చెను. రావణుడెట్టకేలకు ముక్తినొంది మారుతరాయడు యజ్ఞము చేయుచు జీవహింస చేసినందులకు కుపితుడై యా యజ్ఞమును ధ్వంసము చేసెను. పిమ్మట నలకూబరుడను రాజు ప్రజాపీడకుడని విని వానిని శిక్షింప రావణుడు బయలుదేరెను. కాని నలకూబరుని భార్యయగు ఉప రంభ తన భర్తను సన్మార్గమునకు ద్రిప్పెదనని వేడుకొనగా రావణుడు క్షమించి వెడలిపోయెను. పిమ్మట రదనపుర రాజగు ఇంద్రుని జయిం చెను. ఇంద్రు డింతవర కజేయుడుగానుండి యిప్పు డోడిపోయి దుఃఖించు చుండ నొకముని యిట్లు చెప్పెను: “నీవు ఆనందమాలిభార్యయగు అహల్య నవమానించియుంటివికాన నీ కిప్పుడీ యవమానము కలిగినది.” ఇట్లు దిగ్విజయోన్మత్తుడై రావణుడు తన రాజధాని కరుగుచుండ అనంత వీర్యుడనుముని యతనితో నిట్లనెను: "ఓయీ! నీవు పరదారాసక్తుడ వగుటంజేసి నీ వింతలో వాసుదేవుని యంశసంభూతుడగు వాని భార్యను చెరపట్టుదువు, దానివలన నీకు మరణము తప్పదు.” ఈ మాటలను విని రావణుడు కటకటబడి తన్ను తానై కోరని స్త్రీని ఇకముందు పొందనని శపథముచేసిపోయెను.

హనుమంతుని జన్మకథ (3)

మహేంద్రపురమునకు మహేంద్రుడను రాజుండెను. అతనికి హృదయసుందరివలన అంజనాసుందరి యను కూతు రుద్భవించెను. అనేకరాజు లీమెను వివాహమాడగోరిరి. అందు ఇద్దఱుమాత్రము మహేంద్రున కిష్టులైరి. అందొకడు విద్యుత్ప్రభ యను సతడు. అతడు ధనవంతుడు, రూపవంతుడు కాని అల్పాయుష్మంతుడని విశదమయ్యెను. రెండవవాడు పవనాంజయుడు. అతడు విద్యలలో తక్కువవాడైనను దీర్ఘాయుష్మంతుడగుటచే అంజనాసుందరి నాతనికే వివాహముచేయ నిశ్చయించెను. బంధువులందఱు విచ్చేసిరి. వివాహదివసమున అంజనా దేవిచెలికత్తె యామెతో నిట్లనెను: "అమ్మా! మన రాజెంత పొరపా టొనరించినాడో గమనించితివా? ఉత్తమనాయకుని వదలి ఒక సాధారణ జనుని నీ కంటగట్టెను. అమృతమొక దినమైన త్రాగిన మేలు. యావజ్జీ వము విషము త్రాగుట పొసగునే!”. ఈ మాటలు విని అంజనాసుందరి యేమియు ననలేదు. ఈ సంభాషణము పవనాంజయుని చెవినిబడెను. పెండ్లియైన వెంటనే భార్యనొకగదియందుంచి యామెను పలుకరింపక పోయెను. అంత కొంతకాలమునకు రావణుడు వరుణునితో యుద్ధము చేయువాడై పవనాంజయుని సాయము కోరెను. పవనాంజయుడు ప్రయాణమైపోవుచు మార్గమధ్యమం దొక పెంటియంచ విభుని ప్రవాస మునకు వగచుచు విరహతాపమొందుట గాంచి తన భార్య జ్ఞాపకమునకు వచ్చి వెంటనే రహస్యముగా తన నగరు చేరి అంజనాసుందరితో భోగించెను. పిమ్మట యదేరాత్రి తాను మరలిపోవునపుడు తన ముద్రాంగుళీయకము నామెకు గుఱుతుగా నిచ్చిపోయెను కొన్ని మాసాలతర్వాత ఆమెలో గర్భచిహ్నములను జూచి అత్తమామలు ఆశ్చర్యాత్ములై యామె వ్యభిచరించెనని భావించి యెన్ని చెప్పినను వినక యామెను వెడలనడచిరి. ఆమె హనుపురమను పట్టణమందు నివసించుచుండ ఆమెకు కుమారు డుద్భవించెను. ఆ కుఱ్ఱనికి హనుమంతుడను జన్మస్థానపుబేరును బెట్టెను. భర్త యుద్ధమునుండి మరలి వచ్చి తన భార్యకు కావింపబడిన అపచారమును విని చింతించి యామెను వెదకి మరల తన యింటికి బిలిచికొనివచ్చెను. హనుమంతుడు పెద్దవాడై తన తండ్రివలెనే రావణునికి యుద్ధములందు చాల సహాయము చేసెను. రావణుడు ప్రీతుడై సత్యవతియను తనకూతు నతనికిచ్చెను. శూర్పణఖ కూడ తనకూతురగు అనంతకుసుమ యనుదాని నతనికిచ్చెను. ఈ ఇద్దరి భార్యలతో హనుమంతుడు తన దేశమునకు మరలి వచ్చి నప్పుడు సుగ్రీవుడును, నలుడును, తమ మిత్రుడగు రావణునికి సాయ పడినందున హనుమంతునికి తమ కూతులగు పద్మరాగ, హరిమాలిని అను వారినిచ్చి పెండ్లిచేసిరి.

శ్రీరాముని జననము '4'

హిమచూడాదేవి భర్తయు వజ్రబాహు పురందరుల తండ్రియు నగు విజయుడు అయోధ్య నేలుచుండెను. వజ్రబాహునకు కీర్తిధరుడు, అతనికి కోసల, అతనికి హిరణ్యగర్భుడును బుట్టిరి. అతని తర్వాత 27 గురు రాజులు రాజ్యము చేసిరి. కడపటివాడగు అనరణ్యుడు రఘు రాముని కుమారుడు. అతనికి దశరథుడు పుట్టెను. ఇక్కాలమం దొకనాడు రావణుడు వినోదార్థముగా నారదునితో నిట్లనెను: “ఓయి నారదా! నేనెప్పుడు మరణింతునో చెప్పగలవా?" నారదుడు గుణించి యిట్లు చెప్పెను: "దశరథునికొడుకును జనకునికూతురును నీకు మరణమ ను ప్రసాదింతురు.” రావణు డులికిపడెను. కాని విభీషణు డతని భయముపోనార్చి వారికి సంతానము కలుగకపూర్వమే వారిరువురుని సమయింతును చూడుడని చెప్పి బయలుదేరెను. నారదు డంతకుమున్నే యా యిద్దరి కీ వార్త నంపెను. దశరథుడును జనకుడును భీతిచే తమ సింహాసనములపై తమ విగ్రహముల నునిచి యిద్దఱును గలసి యెటకో పోయిరి. తెలివిదప్పిన విభీషణుడు వారి విగ్రహములు పగులగొట్టి తృప్తి నొంది తిరిగిపోయెను. దశరథుడు తన నలుగురు భార్యలతో మగధ దేశము చేరెను. ఈ నలుగురి పేర్లు అపరాజిత, సుమిత్ర, కైకేయి, సుప్రభ. అందు కైకేయి యను నామెభర్తకు ప్రవాసమందొక యుద్ధ మందు సాయపడుటచే భర్త ప్రీతుడై రెండు వరముల కోరుకొమ్మనెను. కైకేయి వలయునపుడు కోరుకొందునని చెప్పెను. పిమ్మట దశరథునికి నలుగురు కుమారులు పుట్టిరి. అపరాజితకు పద్ముడు పుట్టెను. ఇతడే రాముడు. సుమిత్రకు లక్ష్మణుడు పుట్టెను. ఇతడు నీలవర్ణుడు. విష్ణ్వవ తారుడు. కాన నారాయణుడను పేరుపొందెను. కైకేయికి భరతుడును, సుప్రభకు శత్రుఘ్నుడును పుట్టిరి. ఇక్కాలమున జనకునకు విదేహవలన సీతయను కూతు రుద్భవించెను. ఒకనాడు బర్బర దేశమందలి మయూర మాలకు రాజైన అంతరంగమ యను మ్లేచ్ఛుడు మిథిలపై దాడివచ్చెను. జనకుడు దశరథుని సాయము వేడ రాముడుపోయి యతని నోడించెను. జనకుడు ప్రీతుడై సీత నిత్తునని మాట యిచ్చెను. తంటాల తాకట్ల నారదుడుడొకనాడు సీతను చూడవచ్చెను. నారదునిగడ్డము జడలు మున్నగునట్టి భయంకర చిహ్నములజూచి సీత బెదరి యింటిలో దాగు కొనగా నా కలహభోజనుడు సందుదొరకెనని భామండిలుడను రాజునకు సీతను బలాత్కారముగా నెత్తుకొనిపొమ్మని పురికొల్పెను. అతడటుల చేయక తనయొద్ద నుండిన ధనుస్సును జనకునకు బంపి దానిని రాము డెత్తి బాణము సంధింపగలిగెనేని పెండ్లిచేయుమని చెప్పెను. రాముడా ధనుస్సు నవలీలగా నెత్తి సంధించెను. సీతను పెండ్లియాడెను. లక్ష్మణుడు విద్యాధరులలోని పదునెనమండ్రు స్త్రీలను పెండ్లియాడెను. దశరథుడు వృద్ధుడై తన రామునకు రాజ్య మప్పగింపగోర కైకేయి తన వరముల జ్ఞాపకముచేసి రాము నడవికంపెను. సీతారామలక్ష్మణులు అడవిలో తిరిగి తిరిగి చిత్రకూటమును చేరిరి.

సీతాపహరణము 5

అచ్చటినుండి విజయపురమును చేరిరి. అచ్చట నొక సుందరి లక్ష్మణునివరించి యాతనిమెప్పింపలేక యురివేసుకొనదొడగెను. అప్పుడు రాముడు వారిరువురకు పెండ్లి చేసెను. క్షేవాంజలి యనురాజ్యములో జితపద్మయను రాకన్నియను లక్ష్మణుడు పెండ్లియాడెను. రామాదులు పిమ్మట దండకారణ్యమును ప్రవేశించిరి. అచ్చట కూర్పణఖ కుమారుడు శంబూకుడు తపస్సుచేయుచుండ లక్ష్మణుడు చంద్రహాసముతో నతని జంపెను. శూర్పణఖ శ్రీరామునితో మొరపెట్టుకొనబోయి వచ్చినపనిని వదలి యతనిని మోహించెను. మోహము విఫలమయ్యెను. అందుపై ఆమెభర్తయగు ఖరుడు యుద్ధముచేయవచ్చి రామునిచే చచ్చెను. రావణుడు తనచెల్లెలిని తృప్తిపరుపదలచి లక్ష్మణుడు లేనిసమయములో దూరమునుండి లక్ష్మణునివలెనే యార్తనాదము చేసెను. సీత రాముని లక్ష్మణ సహాయార్థమంపెను. అంత రావణుడు సీతనెత్తుకొని విమాన ములో వెడలిపోయెను,

సీతాన్వేషణము 6

సీతకై రాముడు వెదకి వెదకి విఫలుడయ్యెను. అంతనొక సంఘటనము జరిగెను. సహజజాతి అనువాడు సుగ్రీవుని భార్యయగు తారను ప్రేమించి మాయచే సుగ్రీవుని వేషమున నామెతో క్రీడించెను. నిజమైన సుగ్రీవుడు వచ్చి చూచి మాయాసుగ్రీవునితో తగవులాడి యోడిపోయి రాముని నాశ్రయింప నతడు యథార్జమునెఱిగి దొంగమగని జంపి సుగ్రీవునకు తారను, రాజ్యము నిప్పించెను.

పిమ్మట హనుమంతుడు లంకజేరి సీతనుచూచి రావణుని కిరీటమును తన్ని లంకను దహించి తిరిగివచ్చెను. రాముడు సుగ్రీవ హనుమదాదుల సైన్యములతో లంకనుముట్టడించి రావణునితో యుద్ధము చేసెను.

యుద్ధకాండము 7

రావణుడు ఇంద్రజిన్నాగములతో రామసైన్యమును గట్టెను. లక్ష్మణుడు తన గరుడవాహనమును పిలిచి నాగముల నాశనము చేసెను. రావణుడు లక్ష్మణునిపై శక్త్యాయుధము ప్రయోగింప అతడు చచ్చినట్లు క్రిందపడెను. భామండలుడు 'ద్రోణఘము' నుండి అమృతము తెచ్చి లక్ష్మణుని బాగుచేసెను. లక్ష్మణుడు అపుడు గరుడారూఢుడై తన చక్రముతో రావణుని తల దునియెను.

ముగింపు 8

విభీషణుడు లంకకు రాజయ్యెను. కుంభకర్ణుడును ఇంద్రజిత్తును చిన్నచిన్న రాజ్యములకు రాజులయిరి. రాముడు పుష్పవిమానములో అయోధ్యచేరెను. రాముడు పట్టాభిషిక్తుడయ్యెను. సీతతోడను, ప్రభావతి, రతినిభ, శ్రీదమ యను తన తక్కిన మువ్వురుభార్యలతోడను శ్రీరాముడు సుఖముగా నుండెను. లక్ష్మణుడు తన యెనమండుగురు. భార్యలగు విశల్య, రూపావతి, వనమాల, కల్యమాలిక, రత్నమాలిక, జితపద్మ, భయవతి, మనోరమ యను వారితోడను వారి 25 మంది పుత్రులతోడను, పైగా తన 16 వేల యెక్కుడు భార్యల తోడను సుఖ ముగా నుండెను.

'లఘువిమర్శ

ఇది జైనరామాయణ కథాసారము. స్థలసంకోచముచే ఇంకను కొన్ని విషయములు పరిత్యక్తములయ్యెను. దీనివలన తెలిసికొనదగిన విషయములు కొన్ని గలవు. మనము జైన గ్రంథములు నవలోకనచేయుట అవసరము. మన మతమునకు విరుద్ధములయిన బౌద్ధ జైన చార్వాక లోకాయత సిద్ధాంతములను మనము పాషండమతముల పట్టీలోజేర్చి తదనుయాయులను నాస్తికులనియు, వేదవిరుద్ధులనియు వేదబాహ్యు లనియు నిందించి యుపేక్షాభావమును చూపినారము. ఆటుకాక వారి వాఙ్మయమును వారి జాతక కథలనుగూడా చదువవలెను.


ఈ జైనకథ వాల్మీకిరామాయణమునకు చాలభిన్నమైయున్నది. రాక్షసులకును, వానరులకును సంబంధ ముండెనని తెలియుచున్నది. సీత అయోనిజ కాదు. ఆమె తల్లిపేరు “విదేహ”. విదేహ కూతురు అయోనిజ యని మనవారు వర్ణించిరి. రాము డేకపత్నీ వ్రతుడుకాడు. రాముడోడించి నది అంతరంగమ యను మ్లేచ్చరాజును. అనగా అతడే పరశురాముడు. పర్ష్యావాడు. హనుమంతుడు నిత్యబ్రహ్మచారికాడు. రావణుడొక్క స్త్రీలోలత్వమున దక్కతక్కిన విషయములం దాదర్శప్రాయుడే. బహు రాజులకు స్త్రీ సంగతి నాటికిని నేటికిని మిక్కుటము. కాని రావణుడెన్ని చేసినను సీతాపచారకుడు కాకుండిన నిప్పటి యనేకవిటరాజులవలె, రాజ విటులవలె నిందాస్పదుడు కాకుండెడివాడు. అతడహింసా ప్రియుడు: యజ్ఞములయందు హింస యుండుటచే యజ్ఞధ్వంసి యయ్యెను. కాని యతడు వేదమతద్వేషియనియు, మునిహింసకుడనియు వాల్మీకి తన కలముయొక్క మసిచే రావణుని ముఖమును నల్లగా చిత్రించెను. లక్ష్మణు నకు ఎనమండ్రు పట్టపు భార్యలట, 16 వేలు పై పెండ్లాలట! ఈ గుంపు నంతయు భాగవతమునందు శ్రీకృష్ణులవారి కంటగట్టినారు ఈ బేరసార మేపౌరాణికునివలన జరిగెనో దురూహ్యము. ఇచ్చట లక్ష్మణుడే గరుడ వాహనుడు. చక్రి, రావణాంతకుడు. మఱియు నారాయణాపరావతారుడు. ఇందు మారీచుడు లేడు. బంగారుజింక మొదలేలేదు. ఇందలి వంశావళులు వాల్మీకులవారి వంశావళులతో భిన్నించుచున్నవి. శంబూకుడు శూర్పణఖ యొక్క పుత్రుడనియు నతనిని లక్ష్మణుడు వధించెననియునిందున్నది. శంబూకుడను శూద్రతపస్విని రాముడు ఖండించెనని యుత్తర రామాయణ మున నున్నది. శూద్రుల తపస్సు అంత యోర్వరానిదై యుండెనేమో? “దశముఖ” యను పదమున కుత్పత్తిహేతు విందు సమంజసముగా గనబడుచున్నది. జైన రామాయణ మందు కుంభకర్ణుడును, ఇంద్ర జిత్తును మరణించలేదు. మరియు సంజీవిపర్వతమును హనుమంతుడు తెచ్చెనన్న దిచట కల్ల. భామండలుడు (ఇతడెవడో?) అమృతమును దెచ్చెననియున్నది. రావణుడు మహేశ్వరునిగూర్చి తపస్సుచేసెననియు అతని చేతులదురదవదలునట్లు కైలాసముపై బొటనవ్రేలితో శివుడే యదిమెననియు మనము వినినసంగతి. ఇందు వాలిచే నదుమబడెనని యున్నది. మఱియు నీ జైన రామాయణములో నహింసా విషయమును, రావణుని యజ్ఞ ధ్వంసకత్వమును తెలుపుట జైన సిద్ధాంత ప్రచారము నకై చేసిన మార్పని స్పష్టమగుచున్నది మహేశ్వరునకు మారుగా నిచ్చట ప్రతి ఘట్టమందు జిననాథుని పేర్కొనియున్నారు. ఇదియు మత ప్రచారార్థమేయై యుండనోపు. ఈ రామాయణములో విశ్వసనీయ విషయము లనేకములున్నవి. వాల్మీకి రామాయణమందు రాముడాదర్శ పురుషుడు. ఏక పత్నీవ్రతుడు. రావణుడు పరమ దుర్మార్గుడు. ఇది హిందూ పౌరాణిక సంప్రదాయమే. విద్వద్వరేణ్యులు ఈ జైన రామా యణము అంతర్భాగముగా కలిగిన త్రిషష్టి శలాక పురుషచరితను చదివి తమ పరిశోధన ఫలితమును ఆంధ్రులకు ప్రసాదింతురుగాక!

బౌద్ధజాతక రామకథ

వెబర్ అను పాశ్చాత్య పండితుడు జాతక కథలలోని “దశరథ జాతకము" అను కథను ఆధారముగా చేసికొని ఒక పిచ్చి సిద్ధాంతమును చేసి రామాయణము క్రీ. శ. 400 లో వ్రాయబడినట్టిదని చాలా అవస్థపడి వాదించినాడు. బౌద్ధజాతక కథలలోని విశేషమేమో దాని సారాంశ మిచ్చట వ్రాయుచున్నాను.


పూర్వకాలమందు వారణాసిలో దశరథుడను రాజుండెను. అతని భార్యకు 16000 దాసీ జనముండెను. ఆ దంపతులకు యిద్దరు, కుమారులు ఒక కూతురును కలిగిరి. కుమారుల పేరులు రామ లక్ష్మ ణులు. బిడ్డపేరు సీత. రాణి చనిపోయెను. రాజు మరొకతెను పెండ్లా డెను. ఆమెకు భరతుడనువాడు పుట్టెను. వాడు ఎనిమిదేండ్లవాడు కాగా రాణి భర్తతో యిట్లనెను. "రాజా! పూర్వము నాకొక వరమిచ్చి యుంటివి. యిప్పుడు దానిని పూర్తి చేయుము. నా కుమారునికి రాజ్య మిమ్ము.". తన మొదటి భార్య సంతానాని కపాయ మగునని రాజు భయపడి వారిని 12 ఏండ్లవరకు వేరు చోట నుండుటకై నియోగించెను. జ్యోతిష్కులు దశరథునితో తానింక 12 ఏండ్లవరకు బ్రదుకునని చెప్పినందున పై విధముగా వారికి చెప్పెను. సీతారామలక్ష్మణులు హిమాలయానికి వెళ్ళి అచ్చట నివసించిరి. తొమ్మిదేండ్లు గడచిన తర్వాత జ్యోతిష్కుల లెక్కలను తప్పుజేయువాడై దశరథుడు చనిపోయెను. రాణి తన కుమారునికి పట్టము గట్ట జూచెను. కాని భరతుడు రామాదులను తెత్తునని బయలుదేరి రాముని కాంచెను. రాముడు రాజ్యము స్వీకరింప నిరాకరిం చెను. “నా తండ్రి 12 ఏండ్లవరకు నన్ను రాజ్యములోనికి రావలదన్నాడు. అతని యాజ్ఞ నుల్లంఘించను" అని యనెను. మరెట్లు? "నా పాదుక లిత్తును తీసుకొనిపొమ్ము” అనెను. అట్లే భరతుడు పాదుకలను సింహాస నముపై నుంచి రామునిపక్షముగా పాలించెను. 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత రాముడు తిరిగివచ్చి పట్టాభిషిక్తుడై 16,000 ఏండ్లు పరిపాలించెను.

బుద్ధుని పూర్వజన్మలో ఈ కథ జరిగెను. శుద్ధోదనుడే దశర థుడు. రామునితల్లియే మాయాదేవి. సీతయే రాహులుని తల్లి. ఆనందుడే భరతుడు. శారిపుత్రుడే లక్ష్మణుడు. బుద్ధుడే రాముడు.

ఇది దశరథ జాతకము అను పేరుగల కథ. బుద్ధుని మత వ్యాప్త్యనంతరము అతని గొప్పతనము నిరూపించుటకు భక్తులచేత ఇట్టి "జాతక కథలు” కొల్లలుగా అల్లబడెను. దీని నాధారముగా చేసు కొని విమర్శించుట చాలా దుర్బలమగు వాదము. సుప్రసిద్ధమగు రామా యణకథను బౌద్ధులు తమ జాతక కథలోనికి తమ కవసరమగు మార్పు లతో స్వీకరించినారని స్పష్టముగా వ్యక్తమగుచున్నది.

ఇందులో ఇంకొక విశేషమున్నది. ఈ బౌద్ధ రామాయణములో రాముడును సీతయు అన్న చెల్లెండ్రుగా నిరూపింపబడినారు. వీరిరువురికిని పెండ్లి యైనట్లు ఈ జాతక కథ తెలిపినది. ఇదేమి చిత్రమనగా శక జాతిలో (Scythian) ఈ యాచారముండెనని పీకాక్ గారు తెలిపినారు[2] అయితే యీ యాచారము ఆర్య హిందువులలో ఏనాడును ఎందును లేకుండెను. ప్రధానాదర్శమందే భిన్నించిన యీ విధానమునుబట్టి బౌద్ధులు సుప్రసిద్ధ రామాయణమును అనుసరించి ఒక జాతక కథను కల్పించినా

రని వెల్లడి యగుచున్నది.

ఇతర రామకథలు

కాళిదాసు రఘువంశములో శ్రీరామునికథ నెత్తుకొన్నాడు. కాళి దాసుని కాలము క్రీ. పూ. 55 నుండి క్రీ. శ. 450 మధ్యన అని విమర్శ కులు రెండుమేరలకు వచ్చినారు.

జైనరామాయణ మొకటికలదు. అదియు క్రీస్తు శకాదియందు రచితమైయుండును. రామాయణము జైనమతవ్యా ప్తికాలమందు జనాదరణ మందిన సుప్రసిద్ధ కథయగుటచేత జైనులును దానిని తమ మతవ్యాప్తి కనుకూలపరచుకొన్నట్లున్నది.

పాణినికిని, అశ్వలాయనునికిని పూర్వము మహాభారత కథామూల ముండెననియు, రామాయణ మపుడున్నది లేనిది నిర్ణయించుటకు వీలు లేదనియు, ఆర్. జి. భండార్కరుగారు దక్కన్ ప్రాచీనచరిత్రలో వ్రాసిరి. పాణినిలో కృష్ణాదుల పేరులు కలవు కాని యెచ్చటను శ్రీరామునిపేరు కానరాదనియు విమర్శకులందురు. పాణిని క్రీ. పూ. 600 లో నుండెనని కొందరు, 500లో నుండెనని మరికొందరందురు.

కథా సరిత్సాగరమును గుణాఢ్యుడు శాలివాహనుని కాలమందు అనగా క్రీ. పూ. 200 ప్రాంతమందు రచించెను. అందు రామాయణ కథా సారమున్నది. అయితే గుణాఢ్యుని పైశాచీక లుత్సన్నములై మన కిప్పుడు లభ్యముకావు. సోమదేవుడు కథా సరిత్సాగరమును సంస్కృతములో రచించెను. కాళిదాసు, సోమదేవుడు మున్నగువారికి తెలిసినరామకథ యెట్టిదో ఆ కథలు మన కిప్పుడు లభ్యమగు వాల్మీకి రామాయణకథతో నెందెందు భిన్నించినవో తెలుసుకొనుటకు వాటిని సంగ్రహముగా నిం దుదాహరింతును. శ్రీరాముని కథలు భారతాది పురాణాలలోను, ఇతర గీర్వాణ గ్రంథములందును కలవు. అందు కొన్నింటిలో నుండు విశేషములను మాత్రము సంగ్రహముగా సూచింతును.

1. కథాసరిత్సాగరము

దీనిని పైశాచీభాషలో గుణాఢ్యుడు రచించెనందురు. అదిప్పుడు లభించుటలేదు. క్రీ. శ. 1100 ప్రాంతమందు కాశ్మీరమును హర్షదేవుడను రాజు పాలించెను. ఆ కాలమందచ్చట నుండిన సోమదేవుడను నాతడు దీనిని సంస్కృతములో రచించెను. అతడా గ్రంథాదిలో నిట్లు ప్రతిజ్ఞ చేసెను: “ఇది మూలమైన పైశాచీ బృహత్కకథకు సరిగా నుండును. ఇంచుకైనను అతిక్రమింపదు.” మూలగ్రంథము క్రీ. పూ. 200 ఏండ్ల ప్రాంతమందు రచితమని తెలిపినాను. కావున క్రీస్తుశకాదికాలమందో అంతకు పూర్వమో రామాయణ కథ జనులం దెట్టిరూపమున వ్యాపించెనో కొంత తెలుసుకొనవచ్చును. అందుచేత శ్రీ వేదం వెంకటరాయశాస్త్రిగారి తెనుగు సేతనుండి యీ క్రిందివి ఉదాహరించుచున్నాను.

“తొల్లి అయోధ్యాపతియైన దశరథుని కొమరుడు భరత శత్రుఘ్న లక్ష్మణుల యన్న శ్రీరాముడు ఉండెను. ఆయన రావణుని పరిమార్చు టకు అవతరించిన విష్ణువు. తండ్రి విధివియోగమున సీతాలక్ష్మణులతో అడవికి బంపెను. అచట రావణుడు మాయచే సీతను హరించి, దారిలో జటాయువును సంహరించి ఆమెను లంకకు గొనిపోయెను. రాముడు వాలి వధచే సుగ్రీవుని వశపరుచుకొని యాంజనేయునిబంపి యామె వృత్తాంత మును తెలిసికొనిపోయి సముద్రమున కానకట్టగట్టి రావణుని సంహరించి లంకారాజ్యము విభీషణునికిచ్చి సీతను గైకొనిపోయెను. "సీతపై జనులు నిందమోపిరని గర్భవతియగు సీతను కానకు బంపెను. ఆమె వాల్మీకి ఆశ్రమమున జేరెను. అచ్చటి మునులును సీతను సందేహించిరి. అప్పుడు సీతను పరీక్షించుటకై మును లిట్లనిరి: 'ఇచట టిటిభసరస్సు కలదు పూర్వమొక టీటిభిని భర్త శంకించి దూషణ చేసెను. టీటిబి ఆక్రందించెను. ఆ సరస్సును దేవతలామె శుద్ధ్యర్థమై నిర్మించిరి. అందు సీత తన పారిశుద్ధ్యమును రుజువు చేయ గాక!' సీత ఆ సరస్సులో దిగి అవతలిగట్టు చేర భూదేవిని ప్రార్థించెను. ఆమె సీతను ఒడిలో నుంచుకొని అవతలిగట్టు చేరెను....”

  1. నా కడనుండిన తాళపత్రప్రతిని ఆంధ్ర విద్యాపీఠమువారు ప్రచురణార్ధము తీసుకొనియుండిరి. అందలి సులోచనా సహగమన భాగమును వారు అనుబంధములో విపులముగా ప్రకటించినారు.
  2. Peacocke - India in Greece. PP 191-195.