Jump to content

రామాయణ విశేషములు-7

వికీసోర్స్ నుండి

7

రాజనీతి

రామాయణమందు రెండు విధములగు నీతులు గలవు. సాధారణ నీతి, రాజనీతి హితోపదేశము చేయునట్టి నీతియే కాక, రాజులు రాజ్యాం గము నడుపుటలో ప్రత్యేకముగా నడుచు కొనవలసిన పద్ధతియు ఇందు పలుతావుల తెలుపబడియున్నది. మొదట రాజనీతిని గురించి తెలిపి తర్వాత ధర్మ నీతులను గురించి కొంత సూచింతును.

పూర్వము నుండియు హిందువులలో రాజును గౌరవించు పద్ధతి యుండెను. రాజుకు విష్ణ్వంశ కలదని హిందువులు విశ్వసించిరి. అయితే అది అంధవిశ్వాసము కాదు. హిందూరాజనీతిలో రాజు నిరంకుశుడగుటకు వీలులేదు అతడు ప్రజాభిప్రాయమునకు వశవర్తుడై యుండవలెను. అతడు ధర్మమును సక్రమముగా పరిపాలించవలెను. అతడు దుష్టుడైనచో ప్రజలు అతనిని తొలగించుచుండిరి. బుద్ధుని కాలానికి పూర్వమందే భారతదేశములో వైరాజ్యములు (Republics) వెలసియుండెను. ఈ సంగతులను దష్టియందుంచుకొని రామాయణ కాలమందలి రాజనీతి యెట్టిదో కనుగొందము.

హిందూరాజులు తాము పాలించిన రాజ్యములోని జనులు నీతి పరులై యుండిరని చెప్పుకొనుటలో గర్వించుచుండిరి. దశరథుని పరిపా లనములో ప్రజలెట్లు సుఖులై నీతిపరులై యుండిరో వాల్మీకి ఈ క్రింది విధముగా వర్ణించినాడు.


తస్మిన్ పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతాః
నరాస్తుష్టా ధనైః స్వైః స్వై రాలుబ్ధాః సత్యవాదినః


కామీ వా నకదర్యో వా నృశంసః పురుషః క్వచిత్
ద్రష్టుం శక్య మయోధ్యాయాం నా విద్వాన్ నచనాస్తికః
సర్వేనరాశ్ఛ నార్యశ్చ ధర్మశీలాః సుసంయుతాః
ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్షయ ఇవామలాః


ఈ విషయములో వివరములకై బాలకాండ షష్ఠ సర్గమంతయు చదువవలెను.

అయితే ఇదంతా కవి కపోలకల్పితమని యనవచ్చును. ఇంచు మించు అదేకాలములో నుండిన అశ్వపతి కైకేయ వృత్తాంతమునుగూర్చి ఛాందోగ్యోపనిషత్తు (5-11-5) లో ఇట్లు వ్రాసియున్నారు: ప్రాచీన శాలాదులు ఉద్దాలక ఆరుణి పురస్సరులై వైశ్వానరమునుగూర్చి తెలుసు కొనుటకై అశ్వపతి కైకేయ అను రాజునొద్దకు వెళ్ళిరి. రాజు వారికి కానుకలర్పించుకొనగా వారంగీకరించుటకు నిరాకరించిరి. తనలో ఏదో లోపమున్నదని వారట్లు సంకోచించిరేమో యని సంశయించి అశ్వపతి వారితో ఇట్లు మనవిచేసుకొనెను

“న మే స్తేనో జనపదే న కదర్యో. న మద్యపో, నా నాహితాగ్నిః, నా విద్వాన్, నస్త్వేరీ, న స్వైరిణీ కుతో"

నా రాజ్యములో దొంగలు లేరు, పిసినిగొట్టులు లేరు, మద్య పాయులులేరు, అగ్నిహోత్రము చేయనివారులేరు, చదువురానివారులేరు, స్త్రీ పురుషులందు వ్యభిచారు లొక్కరునులేరు.

ఇది కట్టుకథయందురేమో? అటైతే క్రీ పూ. 300 ఏండ్ల ప్రాంత మందు గ్రీకులు, రోమనులు ఏమన్నారో వినుడు. స్ట్రాబో యిట్లనెను: “హిందువులు సత్యనిరతులు. వారి యిండ్లకు తాళాలు వేయరు. వారి వ్యవహారాలకు పత్రాలవసరము లేదు." అర్రియన్ ఇట్లన్నారు: "అబద్ధ మాడు హిందువు కానరాలేదు.” మెగస్తనీసు ఇట్లనెను: “హిందువులలో అబద్ధమాడువారు, తస్కరులు, వ్యభిచారులు లేరు." ఇదికూడా కల్ల యందురా? అటైతే మరల వినుడు. క్రీ.శ. 1200 ప్రాంతపు షంషొద్దీన్ అబూఅబ్దుల్లా అను ఆరబిట్లు వ్రాసెను: “హిందువులు హింస చేయరు. మోసము చేయరు. వారికి మృత్యుభయము లేదు”. ఇదికూడా అబద్ధ మందురా? ఇక సర్వం కల్ల, సాగరంకల్ల అనువారితో మాకుప్రసక్తిలేదు.

ప్రజల కేది హితమో దానిని రాజులు ముఖ్యముగా ఆచరించ వలెనని బాలుడగు రామునికి విశ్వామిత్రుడు బోధించెను.


నృశంస మనృశంసంవా ప్రజారక్షణ కారణాత్
పావనంవా సదోషంవా కర్తవ్యం రక్షతా సతా.
                                                -బాల, 25-18.


'మంచిరాజు ప్రజల రక్షించు నిమిత్తమై క్రూరము కాని, అక్రూరముకాని, పాపముకాని, అపవాదము వచ్చునది కాని యేది ప్రజలకు హితమో దాని నవశ్యము చేయవలెను' అని బోధించెను.

విశ్వామిత్రుడు రాజుగా నుండగా వసిష్ఠుని చూడబోయెను. వసిష్ఠు డతని నిట్లు మొట్ట మొదటి ప్రశ్నగా విచారించెను:

“రాజా, నీకు క్షేమమా? ధర్మమార్గమున చరించి ప్రజల రంజించి ధార్మికుడవై రాజవృత్తముచే పరిపాలించుచున్నావు కదా?"

(బాల 52-7)


రాజవృత్తమును గురించి పూర్వికులిట్లు నిర్వచించినారు:
న్యాయే నార్జన మర్థస్య వర్ధనం పాలనం తథా,
సత్పాత్రే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధం.


న్యాయముగా ధనము సంపాదించుట, దానిని వృద్ధిపొందించుట, రక్షించుట, సత్పాత్రమున కొసంగుట, ఇవి రాజవృత్త మనబడును. వసిష్ఠు డింకను విశ్వామిత్రు నిట్లు విచారించెను: "నీ భృత్యులను నీవు సరిగా పోషించుచున్నావా? వారు నీ ఆజ్ఞలను సరిగా పాలింతురా? నీ శత్రువుల నందరిని గెలిచినావుకదా? నీ సైన్యబలము మొక్కపోనిదిగా ఉన్నది కదా? నీ ధనకోశము లోపము లేనిదికదా? నీ మిత్రవర్గము బలీయముగా నున్నదికదా? ” ఈ విధముగా ఆ కాలమందు రాజులను విచారించుట పరిపాటియై యుండెను.

దశరథుడు రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము సేయ దల పెట్టెను. కాని ప్రజల అనుమతిని అతడు ముందుగా కోరెను. సామంత రాజులను నగర ప్రముఖులను పల్లె పెద్దలను అందరిని పిలిపించి వారి ఆనుమతిని అర్థించుచు (ఆయో. 1-51) వారితో నిట్లనెను:

“ఆర్యులారా, మా పెద్దలు ప్రజలను తమ కుమారులవలె చూచు కొనుచు పరిపాలించినది మీ రెరుగుదురు కదా! నేనును పూర్వుల జాడ లలో యథాశక్తి నడిచినాను. నేను వృద్ధుడనైనాను. రాముడు నాకన్న శ్రేష్ఠుడు. అతనిని యువ రాజుగా చేయదలచితిని.


యదిదం మే౽నురూపార్థం మయా సాధు సుమంత్రితం,
భవంతో మే౽నుమన్యంతాం కథం వా కరవాణ్యహం.
                                                          (అయో. 2-15)


నా ఆలోచన సరియైనదేనా? నే నేమి చేయవలెను? నాకు సెల వియ్యగలరా?" ఈ మాటలను విని ప్రజ లేక వాక్యముగా మాకు రామ పట్టాభిషేకము సమ్మతమే అని పలికిరి. దశరథుడు మరల ఇట్లనెను: “నేను బాగుగా పరిపాలించుచున్నా ననుకొందును. నాలో ఏ లోపము లున్నవని నన్ను కాదని ఇంకొకరిని రాజుగా చేసుకొనుచున్నారు?” అని ప్రజల నడిగెను. వారప్పుడు రాముని ఉత్తమోత్తమ గుణములను వర్ణించి చెప్పిరి. రాముడు రాజు కాబోవుచున్నాడు; అతి వృద్ధుడైన దశరథుడు తన యనుభవమునుబట్టి రాముడు ఎట్లు రాజ్యము చేయవలెనో బోధించెను: “రామా, సప్తవ్యసనము లందెప్పుడును లగ్నుడవు కావలదు.


“అమాత్యప్రభృతీ స్సర్వాః ప్రకృతీ శ్చానురంజయ,”
                                                   అయో. 3-44
మంత్రులను మొదలుకొని సర్వప్రజలను సంతోషపెట్టుము
కోష్ఠాగారాయుధాగారైః కృత్వా సన్నిచయాస్ బహూన్
తుష్టానురక్తప్రకృతి ర్యః పాలయతి మేదినీం
తస్య నందంతి మిత్రాణి, లబ్ధ్వామృత మివామరాః
                                                      అయో. 3-45


కోఠాలను, ఆయుధములను, కోశములను బాగుగా సమకూర్చు కొని ప్రజలను బాగుగా సంతోష పెట్టి యేరాజు పాలించునో అతని మిత్రులు అమృతము పొందిన దేవతలవలె ఆనందింతురు.”

రాముడు వనవాసమునకు పోవలసివచ్చునని విని లక్ష్మణు డతనితో నిట్లనెను: "ఆర్యా, రాజు తమ ప్రజలను పుత్రులవలె కాపాడి పూర్వరాజర్షులవలె వృద్ధులైన తర్వాత వానప్రస్థాశ్రమములో చేరవలెను. తమ కుమారులకు రాజ్యమప్పగించి పోవలెను.” రామాయణములో అడుగడుగునకు ప్రజలను పుత్రులవలె పాలించవలెనని తెలిపినారు. రాజావిధముగా ప్రజలను ప్రేమించకుండిన అతడు కటికవాడుగాను ప్రజలు పశువులుగాను ఉందురని (సౌనికి పశవో యథా - అయో. 48-28) రామాయణమే బోధించినది.

దశరథుడు చనిపోయినప్పుడు అతని నల్వురు కుమారులలో ఇద్దరు వనవాసమందును ఇద్దరు మాతామహి గృహమందును ఉండిరి. రాజు లేకుండిన దేశ మరాజక మగుననియు దానివలన నీ క్రింది నష్ట ములు కలుగుననియు అయోధ్యలోని పెద్దరు పలికిరి: “రాజులేని రాజ్యము నాశనమగును. దొంగలు ఎక్కువగుదురు. వారి భయముచే రైతులు పంటలు పండించరు. శిక్షించువాడు లేనందున తండ్రిమాట కొడుకుగాని, మగనిమాట భార్యకాని వినరు. దేశములో ధనసంపద యుండదు. స్త్రీ పురుషులలో నీతివర్తన ముండదు. సత్యము పూర్తిగా దేశమందు మాయమగును. ప్రజలు తమ సభలను చేసికొనరు. ఉద్యాన ములు దేవాలయములు నిర్మించువారే యుండరు. యజ్ఞయాగాలెవ్వరును సేయరు. స్త్రీలకు దుర్మార్గులనుండి భయోత్పాతములు కలుగును. వర్త కులు బాటదొంగల భయముచే వ్యాపారాలు సేయరు. విజ్ఞానము వృద్ధి కాదు. ప్రజలు మత్స్యన్యాయముచే పరస్పరపీడకు లగుదురు. నాస్తికులు ప్రబలుదురు."

(అరాజకమగు దేశమందలి ప్రజల కష్టనష్టములను గురించి తెలుసుకొనుటకు అయోధ్యాకాండలోని 62 సర్గను సాంతముగా చదువ వలెను).

రామాయణ కాలములో రాజులు ప్రజలనుండి వారి ఆదాయములో ఆరవభాగమును పన్నుగా గ్రహించుచుండిరి. (బలిషడ్భాగం : - అయో. 75-25). ఉత్తమ రాజనీతిని తెలుసుకొనగోరిన, పైన రాముడు అరణ్య మందుండినప్పుడు భరతుడు రాగా అతనికి బోధించిన విషయములను గమనింపవలెను. (ఈ సందర్భములో అయోధ్యాకాండ 100-వ సర్గ సాంతముగా చదువవలెను.) రాము డిట్లనుచున్నాడు: “శూరులును జితేంద్రియులును విద్వాంసులును కులీనులును ఇంగితజ్ఞులును నగు వారిని రాజు మంత్రులుగ నియోగించవలెను. మంత్రాలోచన ఇతరులకు తెలియ కుండునట్లుగా చూచుకొనవలె. ఉత్తమభృత్యులను ఏర్పాటు చేసుకొన వలెను. ప్రజలను రాజు కఠినముగా శిక్షించగూడదు. ప్రజలు భరింప రాని పన్నులను విధింపగూడదు. శూరులను సమ్మానించి చేరదీయ వలెను. భృత్యులకు సైనికులకు సకాలములో జీతముల నియ్యవలెను. చారులద్వారా 18 విధములగు అధికారవర్గమును అనగా పురోహితులు, సేనాపతి, కోశాధిపతి, నగరాధ్యక్షులు, దండపాలురు, దుర్గపాలురు, ధర్మాధికారులు, కర్మాంతికులు మున్నగువారు తమతమ కార్యములను చక్కగా నిర్వర్తించుచున్నారా లేదా యని విచారించుకొనుచుండవలెను. గ్రామములవృద్ధి, తటాకాది నిర్మాణములచే సస్యవృద్ధి, పశుసంపద, చోరభయరాహిత్యము కలుగునట్లుగా రాజు పాలింపవలెను. ప్రతిదినము ఉదయముననే రాజు ప్రజలకు దర్శన మియ్యవలెను. సైన్యమున కవసరమగు ఏనుగులను, గుఱ్ఱములను సమకూర్చుకొనవలెను. కోటలలో ధనధాన్యములను ఆయుధములను యంత్రములను ఉంచవలెను. ఆదా యము ఎక్కువగా నుండినను వ్యయము మాత్రము స్వల్పముగా చేయ వలెను. న్యాయమును నిష్పక్షపాతముతో భాగ్యవంతులకును దరిద్రుల కును ఒకేవిధముగా ప్రసాదించవలెను................."

“ఏరాజు ప్రజలవద్ద ఆరవభాగము పన్ను తీసుకొని వారిని తన కుమారులవలె రక్షించడో అతడు అధికమైన అధర్మము చేసిన వాడగును.” (ఆర. 6–11) అని మునులు రామునికి బోధించిరి.

శూర్పణఖ రావణుని చెల్లెలు. స్వైరకామిని. తత్ఫలితముగా ముక్కు చెవులను బోగొట్టుకొనెను. స్వార్థముతోనైనను సరే, మరే కారణముతోనైనను సరే, శూర్పణఖ రావణుని నిందించెను. అతడు రాజధర్మము సరిగా నిర్వర్తించలేదని కఠినముగా పలికెను. ఆమె చెప్పిన రాజనీతి అది రాక్షసులదే యైనను ఉత్తమ రాజనీతియై యున్నది. ఆమె రావణునితో ఇట్లనెను: “నీవు గ్రామ్యస్వైర కామభోగము లందు ప్రమత్తుడవై నిరంకుశుడవై యున్నావు. ఇట్టి రాజును ప్రజలు శ్మశాన మును చూచినట్లుగా చూచి దూరముగా తొలగిపోదురు. స్వయముగా సకాలములో చేయవలసిన విధులను ఏ రాజు నెరవేర్పడో అతని రాజ్యము నాశనమగును. తగని కార్యముల చేయునట్టివాడును, ప్రజలకు దర్శన మియ్యనివాడును, పరవశుడైనవాడును అగు రాజును జూచి ప్రజలు దూరముగా తొలగిపోదురు................... క్రూరుడును, లుబ్ధుడును, గర్వితుడును, శఠుడును, వ్యసనాసక్తుడును నగు రాజును ప్రజలు గౌరవింపరు.”

- (ఆర. 33-3,4,5,6,15,16)

సుగ్రీవుడు తన వాగ్దానప్రకారము ఆచరించ లేదని లక్ష్మణుడు క్రుద్ధుడై అతనితో ఇట్లనెను: “బలవంతుడును, కులీనుడును, ఆర్తరక్ష కుడును, జితేంద్రియుడును, కృతజ్ఞుడును, సత్యవాదియు నగు రాజు లోకమందు పూజ్యుడగును అధర్ముడును, అసత్యవాదియు, కృతఘ్ను డును అగు రాజుకన్న నీచుడు మరిలేడు."

-(కిష్కి. 34-7, 8)

సీత రావణునితో ఇట్లనెను: “తెలివిలేనివాడును, నీతిహీనుడును నగు రాజుయొక్క సమృద్ధమైన రాష్ట్రములు కూడ నశించును.”

-(సుంద. 21-11)

రాక్షసులను వదలి వారి శత్రువులదగు రామవర్గమును ఆశ్ర యించిన భీషణుని ఇంద్రజిత్తు నిందించు వాక్యములు చాలా ఉత్తమ రాజనీతితో కూడినట్టివి.


శోచ్య స్త్వ మసి దుర్బద్ధే నిందనీయశ్చ సాధుభిః
యస్త్వం స్వజన ముత్సృజ్య పరభృత్యత్వ మాగతః
నై తచ్ఛిథిలయా బుద్ధ్యా త్వం వేత్సి మహదంతరం
క్వచ స్వజనసంవాసః క్వచ నీచపరాశ్రయః


గుణవాన్ వా పరజన స్స్వజనో నిర్గుణోపివా
నిర్గుణ స్స్వజన శ్శ్రేయాన్ యః పరః పరఏవ సః
య స్సపక్షం పరిత్యజ్య పరపక్షం నిషేవతే
స స్వపక్షే క్షయం ప్రాప్తే పశ్చాత్తై రేవ హన్యతే.
                                     యుద్ధ 87-13, 14, 15, 16.


“దుర్బుద్దీ! నీవు స్వజనమును వదలి పరులకు భృత్యుడవైతివి. దీనిని పెద్దలు నిందింతురు. స్వజనులలో నివసించుట మంచిదా, లేక పరుల నాశ్రయించి నీచుడై బ్రదుకుట మంచిదా? పరులు గుణవంతులే యగుదురుగాక. స్వజనులు గుణహీను లగుదురుగాక. గుణహీనులైనను స్వజనులే శ్రేయస్కరులు, పరులు పరులేకాని తన వారెన్నటికిని కారు. ఎవడు తనవారిని పరిత్యజించి పరపక్షములో చేరి వారిని సేవించు చుండునో వాడు తన పక్షము నాశనమైన తర్వాత పరులచేత తానుగూడ నాశనము పొందును.”

హిందూస్థాన చరిత్రలో గ్రీకుదండయాత్ర నాటినుండి నేటివరకు అడుగడుగునకు దేశద్రోహులే కానవచ్చుచున్నారు. మనకు పైశ్లోకాలు నిత్యమననార్హములు.

ఇంతకుముందు శూర్పణఖ యొక్క యు ఇంద్రజిత్తుయొక్కయు రాజనీతి పరిజ్ఞానమును వెల్లడించినాను. రాక్షసుల నీతికి ఆర్యుల నీతికి భేదములేదు వాల్మీకి అందరినోటను ఒకేవిధమగు రాజనీతిని ప్రకటించి నాడు. కుంభకర్ణుడుకూడ తన యన్న యగు రావణునికి అతని యవసాన దశలో మంచి రాజనీతిని ఈ విధముగా బోధించెను “హితుల మాటలు వినకపోవుట దోషహేతువు. పాపకర్మములు నరకపాతము కలిగించును. ఏ రాజు ముందు చేయవలసిన కార్యములను వెనుక, వెనుక చేయవలసిన వాటిని ముందు చేయుచుండునో అతడు నయానయములను తెలియని వాడు. దేశకాల విరుద్ధములగు కార్యములు నాశనము చెందును. ఏ రాజు మంత్రులతో బాగా ఆలోచించి ఉత్తమ మధ్యమాధమ కార్యముల లక్షణ ముల నెరిగి పురుష ద్రవ్యసంపత్తు, దేశకాల విభాగము, వినిపాత ప్రతీ కారము, కార్యసిద్ధి కార్యారంభోపాయము అను అయిదువిధాల నెరిగి యుండునో అతడు కార్యసిద్ధి పొందును. రాజు ధర్మార్థకామముల సద్వినియోగము నెరిగి యుండవలెను. పశువులవంటి బుద్ధిగలవారిని సభలో ఆలోచనకై చేర్చుకొనిన వారు వట్టి ప్రగల్భాలు ప్రకటించు చుందురు. అర్థశాస్త్రము తెలియని వారితో ఆలోచింపగూడదు. శత్రువుల వద్ద లంచములు గొన్నవారిని ఎరిగి రాజు అట్టివారిని పరిహరించవలెను.”

(యుద్ధ. 93-3 నుండి 18 వరకు)

రామాయణకాలమందు రాజ్యస్థిరత్వమునకు, అభివృద్ధికి, శత్రు వులనుండి బాగా రక్షణచేసికొనుటకు రాజులు మంచి వ్యవస్థను ఏర్పాటు చేసియుండిరి. ప్రజాపాలనమునకు గాను 18 విధములగు అధికార వర్గమును ఏర్పాటు చేసియుండిరి. వారిని "తీర్థములు" అని వ్యవహ రించిరి.


కచ్చి దష్టాదశాన్యేషు స్వపక్షే దశపంచచ
త్రిభి స్త్రిభి రవిజ్ఞాతై ర్వేత్సి తీర్థాని చారకైః.
                                      అయో. 100.36


ఈ 18 తీర్థా లేవనగా: (1) మంత్రులు, (2) పురోహితులు, (3) యువరాజు, (4) సేనాపతి, (5) దౌవారికులు, (6) అంతర్వం శికులు, (7) కారాగారాధికారులు, (8) కోశాధ్యక్షులు, (9) కార్య నియోజకులు, (10) ప్రాడ్వివాకులు (Judges), (11) సేనానాయకులు, (12) నగరాధ్యక్షులు (City Profect-Kotval), (13) కర్మాంతికులు, (14) సభాధికృతులు, (15) ధర్మాధికారులు, (16) దండపాలురు (Police), (17) దుర్గపాలురు, (18) రాష్ట్రాంతపాలకులు. మొదటి మూడువర్గాలు తప్ప తక్కిన అధికారులపై చారులను పెట్టి వారు అన్యాయములుకాని, రాజ దేశద్రోహములుకాని చేయకుండు నట్లుగా రాజులు విచారించుకొనుచుండెడివారు.

కోటలను ఎల్లప్పుడును శత్రువులనుండి భయము లేకుండు నట్లుగా రక్షించు ఏర్పాట్లు చేయుచుండిరి. అందు ధనము, ధాన్యము, ఉదకము, యంత్రములు ఉంచుచుండిరి. యంత్రములను శత్రువులపై ప్రయోగించుటలో కుశలులగు శిల్పులను, బాణములను ప్రయోగించుటలో ప్రవీణులైన ధనుర్ధరులను అందు కాపుంచుచుండిరి.

(అయో. 100-58)

రాజు కుండవలసిన లక్షణములను రామాయణమందు చాలా తావులందు నిరూపించినారు. రాజు జితేంద్రియుడుగను, కామక్రోధాది వర్జితుడుగను, నిష్పాక్షికత కలవాడుగను, రాజ్యాంగవేత్తగను, ధైర్య స్థైర్యాది వీరగుణయుక్తుడుగను ఉండవలెనని తెలిపినారు.


దశపంచ చతుర్వర్గాన్ సప్తవర్గం చ తత్త్వతః
అష్టవర్గం త్రివర్గంచ విద్యా స్తిస్రశ్చ రాఘవ
ఇంద్రియాణాం జయం బుద్ధ్వా షాడ్గుణ్యం దైవమానుషం
కృత్యం వింశతివర్గంచ తథా ప్రకృతిమండలం
యాత్రాదండవిధానం చ ద్వియోనీ సంధివిగ్రహౌ
కచ్చిదేతాన్ మహాప్రాజ్ఞ యథావ దనుమన్యసే.
                                         (అయో. 100-68, 69, 70)


ఈ శ్లోకాలలో కొన్ని సాంకేతికములు తెలిపినారు. రాజనీతి బోధించునప్పుడు పురాణాలలో అందందు ఇట్టి సాంకేతికములను వాడుట

పరిపాటి. మహాభారతములో విదుర నీతిలో


"ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తి చేర్చి" అనునట్టి దిట్టిదే.


పది, అయిదు, నాలుగు వర్గాలలో పది అంటే వేట, జూదము, కామము, మదము మున్నగు వ్యసనాలని కొందరు, అసత్యలుబ్ధత్వాది దుర్గుణములని కొందరు చెప్పుదురు. పంచవర్గము లనగా అయిదు విధాల దుర్గములనియు, పంచవిధ వైరములనియు చెప్పుదురు. నాల్గువర్గాలనగా సామ దానాదులు, లేక చతుర్విధమిత్రులు అని చెప్పుదురు. సప్త వర్గములనగా రాజు, మంత్రులు, రాష్ట్రము, కోశము, సేన, మిత్రులు అనియు లేదా ఏడు విధములగు మిత్రులనియు చెప్పుదురు. అష్టవర్గ మనగా కృషి వాణిజ్య దుర్గములు, సేతు బంధములు (P. W. D), ఏనుగులను కూర్చుట, గనులను త్రవ్వుట, పన్నులు తీసికొనుట, క్రొత్త గ్రామాలను స్థాపించుట అనియు, లేదా పైశున్య సాహస ద్రోహాది దుర్గుణాలనియు చెప్పుదురు. త్రివర్గమనగా ధర్మార్థకామములనియు, ఉత్సాహ ప్రభుమంత్ర శక్తులనియు, లేక శత్రువుల క్షయ స్థానవృద్ధు లనియు చెప్పుదురు. “విద్యాతిస్రములు” అనగా త్రయీవార్తా దండ నీతులని చెప్పుదురు. షాడ్గుణ్యం అనగా సంధి విగ్రహాది షడ్గుణములు. వింశతి వర్గమనగా బాలుడు, వృద్ధుడు, దీర్ఘ రోగి, బంధు పరిత్యక్తుడు, భీరువు, లుబ్ధుడు, కామి, దేవబ్రాహ్మణ నిందకుడు, సత్యధర్మ రహితుడు మున్నగు 20 విధాలవారనియు, లేదా రాజద్రోహి, వనితాపహారి, పరస్వత్వావహారి, ధర్మదేవమిత్రాదివిరోధి, క్రూరుడు మున్నగు దుర్మార్గులనియు చెప్పుదురు.”

ఈ శ్లోకాలలోని రాజనీతి అస్పష్టముగా నున్నది. వ్యాఖ్యాతలు ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానించినారు. (వివరణకై పై శ్లోకాలపై వ్రాయబడిన గోవిందరాజాది వ్యాఖ్యాతల అభిప్రాయములను చూడ గలరు.) రామాయణమందలి రాజనీతి ఇంకను విపులముగా కలదు. ముఖ్యవిషయాలను మాత్రమే చూపించి వదలివేయుచున్నాను. ఇక హితోపదేశ తుల్యమగు నైతికబోధ రామాయణ మందెట్లు నిరూపింపబడినదో సంగ్రహముగా తెలిసికొందము.

జటాయువు ఆటవికుడు. రామునకు భృత్యుడు. రావణుడు సీత నెత్తుకొని దొంగయై పోవుచుండగా అతని కెదురై అనేకనీతులు బోధిం చెను. "పరదారలను తాకుట నీచమైన పని. ఇతరులు గర్హించు కార్య ములను బుద్ధిమంతుడు చేయరాదు.

(ఆర. 50-7)


యథాత్మన స్తథాన్యేషాం దారా రక్ష్యా విమర్శనాత్.
                                                       (ఆర. 50-8)


తన భార్యను పరపురుషులు అభిమర్శనము చేయకుండా ఎట్లు రక్షించుకొనవలెనో పరభార్యలను అట్లే రక్షించవలెను.


రాజా ధర్మస్య కామస్య ద్రవ్యాణాం చోత్తమో నిధిః.
                                                    (అర. 50-9)


రాజు ధర్మార్థ కామములకు మూలము. రాజు పాపమాచరించిన జనులును అదేపని చేయుదురు. ఈ విధముగా బహునీతులను బోధిం చెను. (వివరములకై ఆరణ్య 50 అధ్యాయము పూర్తిగా చూడుడు) తుదకు తన స్వామిసేవలో జటాయువు రావణునితో యథాశక్తి పోరాడి ప్రాణము లర్పించెను. ఆటవికులలో ఇట్టి విశ్వాసపాత్రమగు సేవ రామాయణమందు పలుతావుల నిరూపింపబడినది.


లక్ష్మణుడు దశరథునిపై కోపించుకొని ఇట్లనుచున్నాడు:

గురో రప్యవలిప్తస్య కార్యాకార్య మజానతః
ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అయో. 21-13


తండ్రియైనను యుక్తాయుక్త కార్యవిచక్షణ లేనివాడగుచో అతనిని కుమారులు దండింపవలెను. ఇదే నీతి శ్లోకము భారతమున నున్నదని లోకమాన్య తిలకుగారు తమ గీతారహస్యమందు తెలిపియున్నారు. సగర చక్రవర్తియొక్క ధార్మికపాలనమును గురించి యొక యంశము రామాయణమందు ఒకే శ్లోకమందు సూచింపబడినది. సగరుని పెద్దకుమారుడు, అతని యనంతరము చక్రవర్తి కావలసినవాడు, యౌవనమందు పిల్లవాండ్రను సరయూనదిలోవేసి ముంచి వారి బాధల కానందించుచుండెను. ఈ వార్త సగరునికి తెలియగా తన పుత్రుని తన రాజ్యమునుండి నిర్వాసితునిగా జేసెను.

రామాయణమందు నీతివాక్యములుగా జ్ఞాపక ముంచుకొనదగిన వాక్యములు చాలా కలవు. కొన్నిటిని మాత్రమే యిందు ఉదాహరించు చున్నాను.

'అనిషిద్ధసుఖత్యాగీ పశురేవ న సంశయః' (బాల.4) శాస్త్ర నిషిద్ధములుకాని సుఖములను వదలుకొనువాడు పశువే.


పరప్రవాసే హి వదంత్యనుత్తమం
తపోధనా స్సత్యవచో హితం నృణాం. (అయో. 11-29)


సత్యమే మనుష్యులకు స్వర్గలోకప్రాప్తి హేతువని ఋషులు చెప్పినారు.


"యదాయదాహి కౌసల్యా దాసీవచ్చ సఖీవచ
భార్యావ ద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్ఠతి”

దశరథుడు కౌసల్యా ప్రాశస్త్యము నిట్లు నిరూపించెను:


'ఆమె నాకు దాసివలె, సఖివలె, భార్యవలె, చెల్లెలివలె, తల్లివలె వర్తించుకొనుచున్నది.' అయో. (12-68)


"సత్యం హి పరమం ధర్మం" (అయో. 14-3)

"సత్య మేకపదం బ్రహ్మ సత్యే ధర్మః ప్రతిష్ఠితః
సత్యమేవాక్షయావేదా సత్యే నైవాప్యతే పరం.” (అయో. 14-7)

“మృదుర్హి పరిభూయతే” (అయో. 21-11)

మెత్తనగువానినే లోకులు అవమానము చేయుచుందురు. ( మెత్త

నగుచోటనే గుద్దలి వాడియౌకదా-చేమకూర-సారంగధర.)


“ధర్మోహి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం”
                                               (అయో. 21-40)
“విక్లబో వీర్యహీనో య స్సదైవ మనువర్తతే
వీరా స్సంభావితాత్మానో న దైవం పర్యుపాసతే”
                                                 (అయో. 23-16)


ఇది లక్ష్మణుని నీతి. అతడు హిందువుల కవసరమగు నీతిని బోధించుచున్నాడు. ఈ సర్గలో దైవము బలీయమా, పురుషకారము బలీయమా అను చర్చచేసినాడు. “చేతకానివారు నా కర్మ మిట్లుంది అని ఏడ్తురు. బుద్ధిమంతులైన వీరులు దైవమును లెక్క పెట్టక పురుష ప్రయత్నము తప్పక చేసితీరుదురు” అని వాదించినాడు. (ఈ చర్చకై అయోధ్యకాండ 22, 23 సర్గలను పూర్తిగా చదువవలెను.)


"బుద్ధియుక్తాహి పురుషా న సహంతే పరస్తవం"
                                                  (అయో. 26-25)
బుద్ధిమంతులు ఇతరులు తమ్ము స్తుతించిన సహింపరు.
“నహి నింబాత్ స్రవేత్ క్షాద్రం" వేపనుండి తేనె కారదు.
                                                  (అయో. 35-15)
"పితౄస్ సమనుజాయంతే నరాః మాతర మంగనాః”


(అయో. 35-26) తండ్రి పోలిక కొడుకులకు, తల్లి పోలిక బిడ్డలకు


"ఆత్మాహి దారా స్సర్వేషాం దారసంగ్రహ వర్తినాం”
                                                   (అయో 37-24)


గృహస్థులకు భార్య మగనియొక్క ఆత్మయే.

"నహి తావ దతిక్రాంతా సుకరా కాచన క్రియా”
                                             (అయో. 50-97)

ఏ కార్యమైనా చెడినపిమ్మట సవరింప నలవికాదు.

"న పరేణా౽శితం భక్ష్యం వ్యాఘ్రః ఖాదితు మిచ్ఛతి”
                                                   అయో. 61-16

ఇతర జంతువులు తిన్న మాంసమును వ్యాఘ్రము ముట్టదు.

“గతి రేకా పతి ర్నార్యా ద్వితీయాగతి రాత్మజః
తృతీయా జ్ఞాతయో రాజం శ్చతుర్థీ నేహ విద్యతే"
                                                       (అయో. 61-24)

ఇది "పితా రక్షతి కౌమారే” వంటిది.

“శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శ్రుతం
శోకో నాశయతే సర్వం, నాస్తి శోకసమో రిపు : "
                                                  (అయో. 62-15)

“పూర్వాపకారిణాం త్యాగే న హ్యధర్మో విధీయతే"
                                                  (అయో. 96-24)


ముందుగా అపకారము చేసినవారిని శిక్షించుటలో అధర్మము లేదు. ఇది లక్ష్మణుని నీతి.


సత్యముయొక్క ప్రాముఖ్యమును తెలుసుకొనుటకై అయోధ్యా కాండ 109 సర్గలో 10 నుండి 22 శ్లోకములను చదువవలెను.


"యద్వృత్తా స్సంతి రాజానస్తద్వృత్తా స్సంతిహి ప్రజాః"
                                                         (అయో. 109-9)

ఇది యథా రాజా తథా ప్రజా వంటిది.

“పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః" (అర. 1-18)


"ధర్మా దర్థః ప్రభవతే, ధర్మాత్ ప్రభవతే సుఖం
ధర్మేణ లభతే సర్వం, ధర్మసార మిదం జగత్." (ఆర. 9-30)

“పరేతకల్పాహి గతాయుషో నరా
హితం న గృహ్ణంతి సుహృద్భి రీరితం.” (ఆర. 41-21)


స్నేహితుల హితమును గ్రహించనివారు చెడినవారు. ప్రేత సమానులు.


“ఉత్సాహవంతోహి నరా న లోకే,
సీదంతి కర్మ స్వతిదుష్క రేషు.” (ఆర. 68-19)


ఉత్సాహవంతులైనవారు అతిదుష్కరమగు కార్యములందు కూడా పరాజయము పొందరు.


"ఉత్సాహవంతః పురుషా నావసీదంతి కర్మసు."


(ఉత్సాహ వర్ణనమును గురించి కిష్కి. 1-122 నుండి 125 వరకు చూడుడు.)


"శోచతో వ్యవసీదంతి సర్వార్థా”. (కిష్కి. 27-34)

వ్యసనమందు లగ్నుడగు వానికి ఆనర్థములు కలుగును.

“నహి ధర్మార్థ సిద్ధ్యర్థం పాన మేవం ప్రశస్యతే
పానా దర్థశ్చ ధర్మశ్చ కామశ్చ పరిహీయతే" (కిష్కి. 38-46)


మద్యపానమువలన ధర్మార్థకామములు నాశనమగును. ఇది మితపాన సంఘ (Temperance) ప్రచారానికి పనికివచ్చు నీతి.


"మనోహి హేతు స్పర్వేషా మింద్రియాణాం ప్రవర్తనే”
                                                        (సుంద. 11-41)


మనస్సే సర్వేంద్రియ ప్రవర్తనకు హేతువు. ఇది "మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః" అను ఉపనిషద్వాక్యమును బోలియున్నది.


“అకామాం కామయానస్య శరీర ముపతప్యతే" (సుంద. 22-42)


కోపము ఉండకూడదు. దానివలన నష్టములను గురించి సుందర కాండ 55 సర్గలో 4, 5, 6, 7 శ్లోకాలలో బాగా ఉపన్యసించినారు.

భృత్య లక్షణములను గురించి యుద్ధకాండ 1వ సర్గలో 7, 8,

9, 10 శ్లోకాలలో బాగా నిరూపించినారు.


"సర్వే చండస్య బిభ్యతి". (యు. 2-21)


అందరును చండునికి భయపడుదురు. ఇదివరలో చూపిన 'మృదుర్హి పరిభూయతే' అను లక్ష్మణ నీతి కిది అనుబంధము. దాయా దులు మత్సరమును గురించి యుద్ధకాండ సర్గ 16 లో 3, 4, 5, 6, 7, 8, 9 శ్లోకాలలో చక్కగా వర్ణించినారు. మరియు సర్గ 18 లో 10, 14 శ్లోకాలను చూడుడు.


“సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః."
                                                    (యుద్ధ, 16-20, 21)


ప్రియముగా మాట్లాడేవారు చాలామంది. అప్రియమైన హితవు చెప్పువారును వినువారును మాత్రమే దుర్లభులు.

పిఱికితనముయొక్క నష్టములను గురించి హిందువులు బాగా అర్థము చేసుకొనవలెను అంగదుడు చెప్పిన నీతులలో ఇవి చాలా శ్రేష్ఠ మైనట్టివి. చూడుడు:


యుద్ధకాండ. సర్గ, 66 శ్లోకాలు 19 నుండి 27 వరకు
"న కత్థనాత్ సత్పురుషా భవంతి" (యుద్ధ. 71-58)

ఆత్మశ్లాఘనచే సత్పురుషులు కానేరరు.
“పౌరుషేణతు యో యుక్తః సతు శూర ఇతి స్మృతః"
                                                    (యు. 71-59)

పౌరుషము కలవాడే శూరుడు.
"యస్యార్థ సస్య మిత్రాణి, యస్యార్థ స్తస్య బాంధవాః
యస్యార్థా స్స పుమాంల్లోకే, యస్యార్థా స్సచ పండితః"
                                                      (యు. 83-35)

ఈ శ్లోకాన్ని హితోపదేశములో ఉదాహరించినారు.
“మరణాంతాని వైరాణి” (యు. 112–26)


ఈ విధముగా రామాయణము నీతులకు నిధియై యుండుటచేత

కూడ పూజ్యస్థానమును పొందియున్నది.

8

కవిత-గుణపోషణము


ష్లెజల్ అను జర్మన్ ప్రాచ్య విద్యాపండితుడు “రామాయణము ప్రపంచ పురాణములన్నింటిలో గంభీరమైనది (Ramayana is the noblest of epics)" అని అభిప్రాయమిచ్చెను.

మోనియర్ విలియమ్స అను ఇంగ్లీషు పరిశోధకుడిట్లు వ్రాసెను: “రామాయణము సంస్కృత వాఙ్మయములోని మహానిధులలో ఒకటై యున్నది. మొత్తము సంస్కృత సాహిత్యమందు రామాయణముకంటె మనోహరతరమైన కవిత మరి లేదు. ఉత్తమ సాంప్రదాయక పవిత్రత, స్పష్టత, స్వాభావికత దాని శైలిలో కలవు. కవితా సన్నివేశము అతి మనోహర భావములతో కూడినట్టిది. దానిలో శౌర్య సంఘటనల ఉదార వర్ణనలు, ప్రకృతిలోని సుందరతమమైన రంగముల ప్రదర్శనము, మానవహృదయము నందలి గంభీరోద్రేకములు, వాటి పరస్పర సంఘర్ష ణముల గాఢపరిచయము - ఇవన్నియు ఈ రామాయణమునకు సర్వ కాలములందును సర్వదేశములందును అతి సుందరమైన రచనలని ప్రఖ్యాతిగాంచిన కావ్యములలో అగ్రస్థాన మిచ్చుచున్నవి.”[1] ఇతర పాశ్చాత్య పండితులును ఇట్టి అభిప్రాయములనే యిచ్చి యున్నారు. ఇక భారతదేశమందలి హిందువులు రామాయణమును గురించి సదభిప్రాయమే కలవారై యున్నారనుటలో ఏ సందేహమును లేదు. రామాయణము హిందువులందరికినీ ఒక పవిత్ర గ్రంథము. దానిలోని ఉత్తమ కవితను గురించి హిందూ పండితు లందరును అతి ప్రాచీన కాలమునుండి, అనగా కనిష్ఠము 2000 ఏండ్లనుండి అత్యుత్తమ మని అభిప్రాయమిచ్చుచూ వచ్చుటయే గాక నిన్న మొన్నటివరకు సంస్కృతము నభ్యసించిన ప్రతి పండితుడును ఇతర కావ్యాలను ప్రారంభించుటకు ముందు రామాయణములో కొన్ని భాగములను మొదట చదువుకొనుచుండెను. ఎంతటి మహా కవి యైనను సరే, అతడే భాష యందైనను సరే కవిత్వము వ్రాసినను, మొట్ట మొదట వాల్మీకి మహర్షికి నమస్కారము చేయనిది ముందునకు సాగకుండెడువాడు. తుదకు రామా యణమును చదువని హిందువు కవియే కానేరడు అని చెప్పిన అతిశ యోక్తి కాదు.

రామాయణములోని కవితా ప్రాశస్త్యమును గూర్చి మహా విద్వాం సులు నూర్లకొలదిగా ప్రాచీనము నుండియు నేటివరకు బహు విధముల తెలిపియున్నారు. అట్టి దానిని గురించి నేను మరల వ్రాయుట కాల హరణ హేతువున్నూ, పునరుక్తి దోషమున్నూ, తుదకు తలవని తలంపుగా భావ చౌర్యమున్నూ కావచ్చును. అలంకారికులు రామాయణ మహా భారతాదుల రచనానంతరము, తుదకు కాళిదాసుని యనంతరమే బయలుదేరి కొన్ని కవితా నిబంధనలను ఏర్పాటు చేసినారు. ఆ కొలత బద్దతో నేను వాల్మీకిని కొలుచుటకు పూనుకొనను. సూటిగా నాకెట్లు భావ స్ఫురణము కలిగినదో దానిని మాత్రమే నివేదించుకొందును.

కవితా ప్రయోజనము ఆనందము, లేక విజ్ఞాన ప్రదానము, లేక బోధ - రామాయణములో ఈ మూడున్నూ సంపూర్ణముగా కలవు. "ఏకో రసః కరుణ ఏవ” అని కొందరు ఆలంకారికులు తెలిపియున్నారు. రామాయణమం దీ రసము సమగ్రముగా ఉన్నది. ఒక విధముగా రామాయణము కరుణ రస పూరిత కావ్యము. దశరథునికి సంతానము లేదను చింత, కలిగిన కొన్ని యేండ్లకే పుత్రుల వియోగము. తర్వాత సీతారామలక్ష్మణుల అరణ్యావాసము, దశరథుని మరణము, భరతుని సంతాపము, అరణ్యమందు రామాదుల కష్టములు, శూర్పణఖా పరాభవము, కబంధుని మరణము, శరభంగుని మృతి, ఖరాదుల వధ, సీతాపహరణము, రాముని పరితాపము, జటాయువుయొక్క ఆత్మార్మ ణము, వాలి వధ, లంకాదహనము, రాక్షసుల వినాశము, లక్ష్మణుని మూర్ఛ, రాముని వ్యసనము, సీతాపరీక్ష, ఈ విధముగా అడుగడు గునకునూ శోకమే పాఠకుల నెదుర్కొనుచున్నది. సాంప్రదాయకముగా రామాయణమందు సుందరకాండ శ్రేష్ఠమైన దందురు. నాకు అయోధ్యా కాండయే శ్రేష్ఠతమ మైనది. ఏ భాగము చదువుకున్నను ఒక్క అయోధ్యాకాండను మాత్రము చదివితే అనేకోత్తమ కావ్యాలు చదివినట్లు అని భావింతును.

రామాయణములో కథయొక్క యైక్యత కలదు. ఇతర పురాణా లలో అది కానరాదు. మహాభారతములో ఉపాఖ్యానాలు కొల్లలుగా ఉన్నవి. మూలకథకు సంబంధము లేని శాంత్యానుశాసనికాది పర్వాలు బహు దీర్ఘమైనవి కలవు. రామాయణ మందును కొన్ని యుపాఖ్యానాలు కలవు. ఋశ్యశృంగోపాఖ్యానము, కుశనాభకోపాఖ్యానము, భగీరథో పాఖ్యానము, అహల్యాకథ, విశ్వామిత్ర చరిత్ర, ఋషికుమార వధాఖ్యా నము, ఇట్టివి. మరికొన్ని కలవు. కాని యవి మూలకథకు సంబంధించి నవై యున్నవి. పైగా ఇవి చిన్నవగుటచేత ప్రధాన విషయమునకు భంగము కలిగింపవు. కథావస్తువు యొక్క యైక్యత (Unity of plot) కావ్యానికి జీవము వంటిది.

బహు సంస్కృతాంధ్ర కావ్యాలో అష్టాదశ వర్ణనలు కలవు. ఇవన్నియు వాల్మీకిలో లేవు. అయినను రామాయణము ఇటీవల ఆలం కారికుల నిబంధనల ప్రకారము మహాకావ్యము కాజాలదని చెప్ప సాహ సించువారు కానరారు. మరి కావ్యాలలోని వర్ణలనుకూడా ఒకేవిధ మైనట్టివి. పలుమారు పాఠకులను విసిగించును. ఉత్పేక్షాతిశయోక్తుల కవి పుట్టినిండ్లు. కాని వాల్మీకి సహజకవి, ప్రకృతి కుమారుడు, ఉప మానములకు ఆది పురుషుడు, రమ్యమగు వర్ణనలకు నిధి.

రామాయణములో అయోధ్యావర్ణన (బాల. సర్గ 5) రాజవర్ణన (బాల. 6) అమాత్య వర్ణన (బా. 7) అరాజక దురవస్థావర్ణన (అయో. 67) చిత్రకూట వర్ణన (అయో. 94) వసంతము (అయో. 56) మందా కినీ వర్ణన (అయో. 95) హేమంతము (ఆర.16) రామపరితాపము (ఆర. 60) రామవిలాపము (ఆర.62) ప్రావృట్కాలము (కి. 28) శరత్కాలము (కి. 30) పుష్పక వర్ణనము (సు. 8) మధువన క్రీడలు (సు. 61, 62) అను వర్ణనలు ముఖ్యమైనవి. అరణ్య వర్ణన పలుతావులలో సుందరముగా కావింపబడినది. (ఆర. 11, కి. 1; కి. 27) పై వర్ణనలలో కొన్ని యుదాహరణార్థము ఈ క్రింద ఎత్తి చూపింపబడుచున్నవి.

"ఈ చిత్రకూటపర్వతము సెలయేరుల చేతను, ఊటల చేతను, మదపు టేనుగువలె ప్రకాశించుచున్నది. (అయో. 94-13) నాట్యము చేయుచు విలాసముగా పూలను చల్లు నటకునివలె ఈ చిత్రకూటములోని వృక్షములు గాలిచే పూలను మందాకినిపై విడుచు చున్నవి. (అయో. 95–8)

చలికాలమందు సూర్యుడు దక్షిణగామి యగుటచేత ఉత్తరదిశ తిలకములేని స్త్రీవలె కాంతి హీనయై యున్నది. (ఆర. 16-8)

చలికాలములో పున్నమనాడుకూడా చంద్రునివెన్నెల తుషార మలినమై ఆతపశ్యామయైన సీతవలె ప్రకాశము తగ్గియున్నది. (అర. 16-14)

శూరులు కానివారు యుద్ధములో జొరబడుటకు వెనుకముందాడి నట్లు ఈ పక్షులు శీతజలములను తాకుటకు భయపడుచున్నవి. (అర. 16-22)

వసంతర్తువునందు అంతటను నిప్పంటుకొన్నదా అన్నట్లు మోదుగుపూలు వికసించియున్నవి. (అయో. 56-6)

వానకాలమందు పర్వతములు మేఘములచే గప్పబడి జలధారలు కల సెలయేరులతో నొప్పి గుహలందు గాలిచొచ్చి ధ్వనించుచుండుట వలన కృష్ణాజినములు తాల్చి జందెములను ధరించి వేదాధ్యయనము చేయుచు (ఋషివలె) ఒప్పుచున్నది, (కి. 28-10)

నల్లని మేఘాలలో చలించుచున్న మెఱుపు, రావణుని తొడపై విడిపించుకొనుటకై పెనఁగులాడుచున్న శోచనీయయగు సీతవలె నున్నది. (కి. 28–12)

పచ్చని బయళ్లలో చిన్న యారుద్ర పురుగులు నిండియున్నవి. చిలుకవన్నె వంటి చీరపై లక్కచిత్తరువులు వ్రాసిన చీరను కట్టిన స్త్రీవలె ఆ బయలు ఒప్పుచున్నది. (కి. 28-24) నవసంగమసంవ్రీడలగు స్త్రీల జఘనములవలె శరత్కాలమందు నీరింకుటచేత నదులు పులినములను ప్రదర్శించుచున్నవి. (కి. 30-28)

తర్వాతికాలపు కవులందరును రామాయణములోని ఋతువర్ణన లతో తులదూగు వర్ణనలు రచింపజాలిన వారుకారు. ఋతుసంహారమును రచించిన కవి (కాళిదాసైనను సరే, మరెవ్వరైనను సరే) రామాయణము నుండియే భావములను, తుదకు శైలినిగూడా అనుకరించెను.

వాల్మీకికి ఉపమానాలు చాలా యిష్టము. తర్వాతి కాలములో కాళిదాసు ఈ పద్ధతిని బాగా అనుకరించెను. రామాయణమందేవర్ణన నైనను చదివినచో ఉపమానములందు కనబడును. కావున ప్రత్యేకముగా వాటి నుదాహరించుట అనవసరము.

రామాయణ కవితను తర్వాతి కవులు చాలామంది విశేషముగా అనుకరించుచు వచ్చిరి. కొందరు కవులు అందలి భావములను స్పష్ట ముగా గ్రహించిరి. మహాభారతమందు కొన్ని రామాయణ శ్లోకాలు కనబడుచున్నవి. మరికొన్ని భావాల అనుకరణముకూడా కనబడు చున్నది. ఎట్లనగా -


“అనార్యజుష్ట మస్వర్గ్యం కుర్యాం పాప మహం యది”
                                                     (అయో. 82–14)
“అనార్యజుష్ట మస్వర్గ్యం మకీర్తికర మర్జున" భగవద్గీత.

"యద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్
నాహం తత్ప్రతిగృహ్ణీయాం భక్షా న్విషకృతానివ."
                                                      (అయో. 97-4)
"కులక్షయకృతం దోషం మిత్రద్రోహేచ పాతకం" భగవద్గీత.
“నహిచ్ఛేయ మధర్మేణ శక్రత్వ మపి లక్ష్మణ"
                                                       అయో. 97-7

ఇదే భావము ఉద్యోగ పర్వమందును ధర్మరాజును గురించి చెప్ప

బడినది.


“మనోహి హేతు స్సర్వేషా మింద్రియాణాం ప్రవర్తనే.”
                                                        సు. 11-41
మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః”
                                               ఉపనిషద్వాక్యము
వేపతే స్మాధికం సీతా విశంతీ వాంగమాత్మనః
వనే యూథపరిభ్రష్టా మృగీ కోకై రివార్దితా.
                                                   సు. 25-5
ప్రావేపత భయోద్విగ్నం సింహం దృష్ట్వేవ గోగణః
                                  మహాభారతం భీష్మ. అ. 13 శ్లో. 10


ఇక్కడ సింహమును చూచిన ఆవులు వణకినట్లుగా భీష్మ మరణ కాలమందు కౌరవ సైన్యము కంపించెనని వర్ణించినారు. కాని తిక్కన సోమయాజి పూర్తిగా రామాయణ మందలి పై శ్లోకమునే అనుకరించెను.


అంగద నాథు మ్రింగిన వృకావలి తన్ వెసజుట్టుకొన్న స
ర్వాంగములం జలించి వెగ డందుచు, దిక్కులు సూచుచున్న సా
రంగియపోలె నుండె కురురాజ! భవత్సుతుసేన భీష్ము నా
జిం గబళించి పాండవులు జృంభితవిక్రమలీలఁ బొల్చుటన్.

అసంశయం హరిశ్రేష్ఠ! క్షిప్రం మా ప్రాప్స్యతే పతిః
అంతరాత్మా హి మే శుద్ధ స్తస్మింశ్చ బహవో గుణాః
                                                     సు. 37 - 12
ఈ భావమును సంపూర్ణముగా కాళిదాసు సంగ్రహించుకొనెను.

అసంశయం క్షత్రపరిగ్రహక్షమా, యదార్య మస్యా మభిలాషి మే మనః


సతాం హి సందేహపదేషు వస్తుషు, ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః.
                                              అభిజ్ఞాన శాకుంతలం. అంకం 1, శ్లోకం 13

“ఇదం శ్రేష్ఠ మభిజ్ఞాన బ్రూయా స్త్వంతు మమప్రియం."
                                                                సు. 38-12
'నివేదయిత్వా౽భిజ్ఞానం ప్రవృత్తించని వేద్యచ" బాల. 1-74

"అభిజ్ఞాన ప్రదానంచ రావణస్యచ దర్శనం” బాల. 3-30


కాళిదాసునికి అభిజ్ఞాన శాకుంతలమేకాక రఘువంశ కుమార సంభవ నామములు సహితము వాల్మీకి సూచితమైయుండునేమో!


“కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవచ" బాల. 37-32

"రఘువంశస్య చరితం చ కార భగవానృషిః". బాల. 3-9

అను శ్లోకాలనుబట్టి యిట్లూహించితిని.


సీతాపహరణా నంతరము రాము డాక్రోశించి చెట్లను గట్లను నా సీతను చూచితిరాయని విచారించుటను కాళిదాసు తన విక్రమోర్వశీయ ములో పురూరవుడు ఊర్వశి జాడను విచారించు ఘట్టమున పూర్తిగా వినియోగించుకొనెను.

రామునికి జ్ఞాపకము చేయుటకై కాకాసురుని కథ ఒక గుర్తు అని సీత హనుమంతునితో చెప్పెను. ఈ శ్లోకములోని "అభిజ్ఞానం” కాళి దాసునకు అభిజ్ఞాన శాకుంతలము యొక్క భావము నిచ్చినట్లు కనబడు చున్నది.


యస్యార్థా స్తస్య మిత్రాణి యస్యార్థా సస్య బాంధవాః
యస్యార్థా స్స పుమాన్ లోకే యస్యార్థా స్సచ పండితః
                                                              యుద్ధ. 83-35


ఈ శ్లోకము ఉన్నదున్నట్లుగా హితోపదేశమందు ఉదాహరింప

బడినది.


ఋక్షేణ గీత శ్ల్శో కో మే తన్ని బోధ ప్లవంగమ. యుద్ధ, 116-42

ఇది సుప్రసిద్ధమైన “ససేమిరా” భల్లూకము కథ.


దీనిని రామాయణమందు పెంచకుండా ఒకే శ్లోకములో సూచించి వదలినారు. అదేవిధముగా అష్టావక్రుని కథను ఒకే శ్లోకములో సూచించి వదలినారు.


నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతిన మారుతః
చలోర్మిమాలి తందృష్ట్వా సముద్రోపి నకంపతే. బాల. 15-10


రావణునిపై సూర్యుడు ఎండగాయడు, గాలి వీచుటకు భయ పడును, సముద్రుడు చలింపడు అను భావమును పోతన హిరణ్య కశిపునిచే నిట్లు చెప్పించినాడు


అస్మదీయంబగు నాదేశమునగాని మిక్కిలి రవిమింట మెరయ వెరచు
అన్ని కాలములందు ననుకూలుడై కాని, విద్వేషియై గాలి వీవవెరచు
మత్ప్రతాపానలమందీకృతార్చియై విచ్చలవిడి నగ్ని వెలుగువెరచు
అతిశాతయైన నా యాజ్ఞ నుల్లంఘించి శమనుండు ప్రాణులజంప వెరచు

ఇంద్రుడౌదల నా మ్రోల నెత్త వెఱచు
అమరకిన్నర గంధర్వయక్ష విహగ
నాగవిద్యాధరావలి నాకు వెరచు
ఏలవెరవవు పలువ నీకేది దిక్కు?
                              భాగవతము సప్తమస్కందము 257

అష్టావక్రేణ ధర్మాత్మా తారితో బ్రాహ్మణో యథా.
                                                 యుద్ధ. 122-7


సంస్కృత సాహిత్యమందు మంచి ప్రవేశముగల వారి కిట్టి వింకెన్నియో కనబడకమానవు. గుణపోషణము

ఇంతవరకు కవితా విశేషములను గురించి యథామతి సంక్షిప్త ముగా తెలుపబడినది. రామాయణము కవితయందెంతటి ప్రాముఖ్యము వహించినదో అందలి పాత్రల గుణపోషణమందును అంతటి ప్రాముఖ్యము వహించినది.

రామాయణమందలి ప్రతివ్యక్తికిని ఒక ప్రత్యేకత కలదు. ఆ వ్యక్తిత్వము అంతటను ఏక విధముగా నిరూపింపబడినది ఆంగ్లదేశ మందు 400 ఏండ్ల క్రిందట జగత్ప్రసిద్ధిగాంచిన షేక్స్పియర్ మహాకవి తన నాటకములలో ఎంతటి చిన్నపాత్రయైనను సరే దానికొక విశిష్టగుణ పోషణమును (Characterisation) చేయుటలో అద్వితీయుడని పేరు పొందినాడు. రామాయణమందును అదే లక్షణము సమగ్రముగా కనబడు చున్నది. వాల్మీకి షేక్స్పియరులలో భేద మేమనిన ఒకడు ఇంచుమించు 4000 ఏండ్ల క్రిందటివాడు. ఇంకొకడు 400 ఏండ్లక్రిందటివాడు ! ఇంతే ! !

రామాయణమందలి పాత్రలన్నిఁటి గుణపోషణమును గురించి చర్చించినచో విషయవిస్తర మగును. కావున వాల్మీకి చిత్రించిన కొందరిని గురించిమాత్రమే, అదియును సంగ్రహముగానే, యిందు సూచింపబడుచున్నది

శ్రీరాముడు

ఇతడు కథానాయకుడు. ప్రధానపాత్ర. ప్రపంచ మహానాయకు లలో అగ్రగణ్యుడు. ఏమాత్రము కూడ కళంకములేని అవతారపురుషు డని హిందువుల విశ్వాసము. అందుచేతనే దేవుడై వెలసినాడు. ఇచ్చట అతనిని మానవోత్తమునిగానే గ్రహించి విచారింతును. యౌవరాజ్య పట్టాభిషేక కాలములో రాముని ఉత్తమోత్తమ గుణములు వ్యక్త మయ్యెను. గొప్ప సామ్రాజ్యమునకు పట్టాభిషేకము చేయుటకై తండ్రి, మంత్రులు, పురోహితులు, నగరవాసులు, పల్లెజనులు, తమ్ములు, తల్లులు అందరునూ హర్షించిరి. కాని కైకేయికి మంథర దుర్బోధలు చేయుటచేత బుద్ధిమారెను. దశరథుడు ఆమెకు రెండువరాలు ఇచ్చియుండెను. వాటిని పాలించవలసివచ్చెను. పట్టాభిషేకము కొన్ని గడియలలో జరుగవలసి యుండెను అప్పుడు రాముడు కైకేయీ దశరథుల సన్నిధికి పిలువ బడెను. తండ్రికి అమంగళము పలుకుటకు నోట తడిలేదు. మూర్ఛా వస్థలో నున్నాడు. గట్టి గుండెగల కైకేయి బండుగా రామునితో రాజ్య త్యాగము, వనవాసము చేయవలెనని చెప్పును. పిడుగువంటివార్త. దానిని వినిన ఇతరులందరును గట్టిగా రోదనము చేయుచుండిరి. మరి రాముడో? అభిషేక మప్పుడు ఆనందమును ప్రకటింపలేదు. ఇప్పుడు కూలబడి వాపోవలేదు.


ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం, నచైవ రామః ప్రవివేశ శోకం
ప్రవిధ్యతే చాపి మహానుభావో, రాజాతు పుత్రవ్యసనాభితప్తః
                                                               (అయో. 19-41)
పైగా వెంటనే యిట్లనెను.

ఏవ మస్తు, గమిష్యామి వనం వస్తు మహం త్వితః
జటాజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞా మనుపాలయన్.


ఇంతేనా, ఇదిగో ఇప్పుడే అడవికి వెళ్ళుచున్నాను. జడలు దాల్చి రాజునాజ్ఞను పాలించుచున్నాను అని అన్నాడు. మరియు ఇట్లన్నాడు. “ఇంత మాత్రపు కోరికను నాకు తెలిపి యుండరాదా? దీనికై వరములు కోరవలెనా? వనమునకు పోవుటకు సిద్ధముగా నున్నాను కదా!" అనియు నిశ్చింతతో పలికెను. జనులతనిపై ఏ వ్యసనచిహ్నములు కూడా చూడజాలక పోయిరి. పైగా అతడు ప్రసన్నుడుగా కాంతియుక్తుడుగా నుండెను. అయితే రామునిలో అంతయు నిగ్రహమే కాని కష్టకాలమందు వ్యసనపడు మానవ సహజ గుణమే లేదా అనిన అదియును కలదు. అతడెవ్వరి యెదుట నిగ్రహము, ప్రసన్నత, గాంభీర్యము చూపింపవలెనో బాగా ఎరుగును. తనతల్లి వద్దకూడా అట్లే చాలాసేపు ఆచరించుకొనెను. కాని ఎంతసేపు? ఆమె దుఃఖపరంపరలకు లోబడి-


"తాం తథా రుదతీం రామో రుదన్ వచన మబ్రవీత్.
                                                       (అయో. 42-20)


తల్లి దుఃఖాన్ని చూచి తుదకు పట్టలేక రోదనము చేసెను. ఇదే వ్యసనముతో అతడు సీతను చూడబోయెను. ఆ యమాయకురాలి కింకను తారుమారైన యీ వ్యవస్థ తెలియనే తెలియదు. ఆమె చింతావ్యాకులుడైన రాముని చూచి భయపడెను. మరి రాముడున్నూ ఆమెను చూచిన వెంటనే దుఃఖము నాపుకొనలేక రోదనము చేసెను ఇది తన ఆంతరంగికుల యెదుట. మరల సీతాలక్ష్మణులతో తుదిమారు తండ్రి సెలవు తీసుకొను నప్పుడు నిగ్రహమును, ప్రశాంతతను, గాంభీర్యమును ప్రకటించెను. ప్రజ లందరు ఏడ్చిరి కాని ఆతడేమియు సంచలించలేదు. లక్ష్మణు డేడ్చెను. రౌద్రమూర్తియయ్యెను. కాని రాముడతని నోదార్చి, శాంతు నిగా జేసెను. అరణ్యా వాసమందును ఎన్నడును తండ్రిని కినియలేదు. మహా వ్యసనము ముంచుకొనివచ్చిననాడు మాత్రమే రెండుమూడు మారులు ఇక కైకేయి సంతోషపడుగాక అని జారవిడిచెను. భరతుడు తనను అడవిలో కలిసెను. అప్పుడతనితో తనతల్లి నేమాత్రమున్నూ కష్ట పెట్టవద్దని ఆజ్ఞాపించెను. ఇంకొకరైయుండిన ప్రజలు, పురోహితులు, మంత్రులు, భరతశత్రుఘ్నులు, కైకేయీదేవితో కూడవచ్చి రాజ్యము చేయుటకై మరలిరమ్మని ప్రార్థించియుండిన ఒప్పుకొని యుందురు. రాముడట్లు చేయలేదు. రామునికి హనుమంతుడు నమ్మినబంటుగా లభించెను. సుగ్రీవుడు మంచి మిత్రుడుగా దొరకెను. అయితే వాలివధ మాత్రము అంతగా సమర్థనీయము కాజాలదు. వాలిని చంపుటకు ముందు అతనికి రాయబార మంపవలసియుండెను. అతని నుండి ఏమి సమాధానము వచ్చెడిదో తెలిసికొనవలసి యుండెను. అటుపై యుద్ధయు ప్రకాశముగా చేయవలసి యుండెను. తెలియకుండా దాగియుండి కుస్తీపట్టుచున్న వాలిని బాణముతో వధించుట ఏల? వాలి మరణశయ్యపై సూటిగా పోటుమాటలతో రాముని అధిక్షేపించెను. “నేను నీకపకారము చేయలేదుకదా! యుద్ధము చేయదల చిన ఈలాటి పనియేల? నీ సీతను తెచ్చుటకు సుగ్రీవుడు సాయపడునని చేసితివా? నన్ను అడిగియుండిన అవలీలగా ఆ పనిని సాధించియుందునే? నన్ను అడవిమృగ మని వేటాడితివా? అటైతే కోతులను తినువారి నెందును చూడలేదే! మాంసాపేక్షలేని వేట యెందులకు?" ఈ విధముగా ప్రశ్న పరంపరలను రామునిపై కురిపించెను. రాముడన్నింటికిని సమా ధానమిచ్చెను. అవన్నియు తృప్తికరముగా లేవు. వ్యాఖ్యాతలందేవో పరమ రహస్యపు జాడలను తీసినారు. అవన్నియు బలవంతపు బ్రాహ్మణార్థమువలె కనిపించుచున్నవి వాల్మీకి అట్టి ద్వంద్వార్థాలు వ్రాయునట్టి మాయాకవి కాడు! ఈ భావమును నేనొక్కడనే ప్రకటించిన అపచారము చేసిన వాడ నగుదునేమో!

భవభూతి తన మహావీర చరితములో చేసిన మార్పును గమ నించవలెను. చెట్టుచాటునుండి తన కపచార మేమియు చేయని వాలిని బాణముతో కొట్టుట తన కథానాయకుని శౌర్యమునకు లోటని భవభూతి వాలికిని శ్రీరామునికిని ద్వంద్వయుద్ధమును కల్పించెను. అదేవిధముగా ఉదాత్త రాఘవమును రచించిన మూయురాజకవియు తన నాటకమందు వాలి రాముల ద్వంద్వయుద్ధమును కల్పించెను. ఈ విధముగా ప్రాచీన ప్రామాణిక పండిత కవులును వాలివధా ఘట్టములో న్యూనతను గమ నించియున్నారు. - హనుమన్నాటక మను సంస్కృత నాటకములో రాముడు వాలిని చంపుట తప్పని వాలితో నొప్పుకొన్నట్లును, అతని నన్యాయముగా జంపినందులకు ప్రాయశ్చిత్తముగా సీతావియోగమును మరొకమారు పొందుననియు చెప్పినట్లును కవి నిరూపించినాడు. (ఉత్తర కాండలోని సీతావియోగ సూచన యీ రెండవ వియోగము).

రామునికి సీత అంటే రెండవప్రాణము. కాని ఆయన లక్ష్మణుని ఎంతగాఢముగా ప్రేమించెనో ఆ ముచ్చట తుదివరకునూ వ్యక్తపరుప లేదు యుద్ధకాండలో లక్ష్మణుడు మూర్ఛనొందినప్పుడు రాముడు నాకు రాజ్యమేల, సీతయేల ? నా కెవ్వరునూ లక్ష్మణుడు లేనిది కాబట్టరు అని విలపించెను. లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపి వచ్చినప్పుడు అతనిని గాఢముగా కౌగలించుకొని చిన్న పిల్లవానిని వలె తన తొడపై కూర్చుండ బెట్టుకొని లాలించెను.

రావణుడు తనకు చేసినంత యపకారము మరెవ్వరును చేయ లేదుకదా! మొదటిసారి ఇరువురును పోరాడినప్పుడు రావణుని రథమును ధనుస్సును ఆయుధాలను అన్నింటిని రాముడు ధ్వంసము చేసెను. అప్పు డీతనిని చంపి యుండవచ్చును కదా! చంపలేదు. “నీవు నిరా యుధుడవు; నీ నగరములోనికి వెళ్ళి మరల క్రొత్తరథమెక్కి ఆయుధా లతో రమ్ము" అని పంపివేసెను. రావణుడు చనిపోయిన వెంటనే రాము డిట్లనెను.


మరణాంతాని వైరాణి నివృత్తం నః ప్రయోజనం
                                                  యుద్ధ. 112-26


ఇతని చావుతో నా వైరముకూడా ముగిసినది. ఇతని యుత్తర క్రియలను లోపము లేకుండా చేయవలెను అని ఆజ్ఞాపించెను

రామునికి సీతయొక్క పాతివ్రత్యము, ఆమె లోకోత్తర పవి త్రతయును తెలియును. కాని రావణునియింట ఒక ఏడు ఉండిన సీతకు, ప్రపంచము నింద లొడిగట్టుననియు రామునికి తెలియును. సీతచే అగ్నిపరీక్ష చేయించినప్పటి అతని నిగ్రహము అద్వితీయమైనది.

రాముడు మహావీరుడు. అతనికి సాటివారు లేకుండిరి. సత్య సంధుడు. జితేంద్రియుడు. ఈ కారణాలచేత అతడు దేవసముడయ్యెను.

లక్ష్మణుడు

ఇతడు ప్రీతిపాత్రుడు. రామునంతటి నిగ్రహుడుకాడు. ధర్మా గ్రహుడు. ఉత్తగా కోపించుకొనడు. మంచిదెల్లను అతనికి సన్నికర్షము. దుష్టమెల్లను అతని కసహ్యము. కోపము వచ్చెనా దానిని శాంతింప జేయువాడు రాముడొక్కడే. రామునిలోని ఉత్తమత్వము అతనికి చాలా ప్రియమైనట్టిది. అందుచేత అతనికి స్వయంసేవకు డయ్యెను. రాముని యౌవరాజ్య పట్టాభిషేకము భగ్నమైనప్పుడు, రాముని త్యాగమును మొదటిసారి చూచినప్పుడు అతడు కన్నీరు కార్చినాడు. ఎట్లో కోపము బిగబట్టినాడు. రామునివెంట నోరుమూసుకొని తిరిగినాడు. తుదకు రాముడున్నూ తల్లివద్ద ఏడ్చినప్పుడు లక్ష్మణుని క్రోధము బయట పడినది. కాలరుద్రుడైనాడు. చిన్న భార్యచే మోహితుడై పెద్దకొడుకును అడవికి పంపే తండ్రి తండ్రికాడని అన్నాడు. ఎవ్వరడ్డము వత్తురో చూచెదనుకాక, నేనొక్కడనే ధనుర్ధరుడనై ప్రపంచాన్ని ఎదిరించి రామునికి పట్టము కట్టుతానని హుంకరించినాడు. రాముడు ఆగు మాగుము, శాంతించుము అని బోధించినాడు. మదపుటేనుగునకు ఆ మాటలు సంకెళ్లైనవి. “మృదుర్హి పరిభూయతే” "మెత్తనగుచోటనే గుద్దలి వాడియౌకదా"! అని రాముని మెత్తదనాన్ని గర్హించినాడు. కర్మము ననుభవించవలెనందురా? దైవవిధి అనుల్లంఘనీయ మందురా?


"వీరా స్సంభావితాత్మానో నదైవం పర్యుపాసతే"
                                                 (అయో. 23–16)

పరాక్రమశాలురకు దైవము అడ్డము రాజాలదు అని గట్టిగా

పలికినాడు.

భరతుడు తల్లివంటి గుణాలుకలవాడై యుండునని మొదలను కొన్నాడు. దూరమందు భరతుడు అరణ్యానికి వచ్చుట చూచినాడు, అతడు దురుద్దేశముతో వచ్చినాడు. ఇదిగో ఇప్పుడే అతని పని పట్టించు తాను చూడు అని అన్నతో పలికినాడు. భరతుడు చాలా మంచివాడే అని తేలిన తర్వాత అట్టి తల్లి కిట్టి కొడుకు పుట్టినాడే అని ఆశ్చర్య పడినాడు.

రామునందే కాక సీతయందును లక్ష్మణునికి పరమభక్తి. సీతా రాములకు ఏమాత్రమున్నూ ఆయాసము, శ్రమ, కష్టము కలుగకుండా సేవించిన బంటు రాత్రులందు వారికి పహరాయిచ్చి కావలికాచినాడు. వారి ఆజ్ఞలను పాలించినాడు. కాని తన ధర్మాగ్రహమును ప్రకటించక మానలేదు. సీత కిష్కింధలో పారవేసిన ఆభరణాలను లక్ష్మణునికి చూపించినారు. అందేదియు అతడు గుర్తించ జాలినవాడుకాడు. ఒక్క నూపురమును మాత్రము వెంటనేగుర్తించినాడు.


“నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే
నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్." (కి. 9-22)


ఇది సుందరమైన భావము. అతని అకల్మషత్వమును వెల్ల డించును. సీతను తల్లికంటె ఎక్కువగా పూజించినదిందు ధ్వనింప బడినది. అయితే గంగను దాటేకాలములో రామునాజ్ఞచేత లక్ష్మణుడు సీతను చేతులతో ఎత్తి పడవలోని కెక్కించెను. ఆవిధముగా ఆమెను తాకుటలో ఆ నిష్కలంకునికి దోషములేదు. నూపురములను మాత్రమే గుర్తింతును అనుటలో అతడు సీతను పరికించి యెన్నడును చూడ లేదని భావము. ఆమె తన దృష్టిలో అంత పవిత్ర. శౌర్యములో లక్ష్మణుడు రాముని కేమాత్రమును తీసిపోనివాడు. రామునైనను ఇతరులు తేరిపార జూడగలరేమో, లక్ష్మణునికి కోపము వచ్చెనా అతని నెదిరించుట కష్టము.

భరతుడు


అతనికి తన తల్లి లక్షణాలు బాగా తెలియును.
“ఆత్మ కామా, సదా చండీ, క్రోధనా ప్రాజ్ఞమానినీ”
                                                 (అయో. 69-10)


అని మొదలే అన్నాడు. అయోధ్యకు వచ్చి సంగతులు కను గొన్నాడు. తల్లిపై మండిపడినాడు. "నిన్ను చంపివేయవలెను. కాని రాముడు కోపపడునని ఊరకున్నాను". అని అన్నాడు. ప్రజలకు మొదలతనిపై మంచి భావము లేకుండెను. కాని అతని యుద్దేశములు విన్న తర్వాత వారతనిని గౌరవించిరి. అరణ్యమందలి ఋషులును అతనిని మెచ్చుకొనిరి. రాము డీతనిని ప్రథమసమాగమములోనే కౌగిలించుకొని తొడపై కూర్చుండబెట్టుకొని గాఢముగా ప్రేమను ప్రకటించెను. రాముడు తిరిగివచ్చుటకై అతడు చేయవలసినన్ని ప్రయత్నాలు చేసెను. కడప కడ్డము పండుకొనెను. లాభము లేకపోయెను. తుదకు రాముని పాదుకలు తలపై ధరించి మహావ్యసనముతో వెళ్ళెను. 14 ఏండ్లు అయోధ్యను ప్రవేశించక పోయెను. తానును తాపసియై నందిగ్రామములో రాముని పాదుకలవద్ద కూర్చుండి ధర్మపరిపాలనము చేసెను.

శత్రుఘ్నుడు

అప్రసిద్ధుడు. మంచివాడే కాని వీరుడుకాడు. వ్యపదిష్టుడుకాడు. ఎటులో మంథరపై కోపమువచ్చి ఆమెను బాధించి చంపుటకై లేచెను. అటుతర్వాత అతని ముచ్చట మనకు ఏమియు తెలియదు. యథాజ్ఞా పయతి రాజా (జో హుకుం సర్కార్) ఆనునట్టి వ్యక్తిగా కానవచ్చు చున్నాడు. కై కేయి

మొదట మొదట స్వార్థము లేనట్టిది. కాని మంథర ఆమెకు దుర్బో ధలు బాగానూరిపోయగా పోయగా ఆమెలో పూర్తిగా మార్పుకలిగెను. అటు తర్వాతఎవరేమనినాసరే ఆమె అచంచల యయ్యెను. రాజ్యమంతయును తిట్టిపోసెను. దశరథుడు చావనేచచ్చెను. అప్పటికినీ ఆమెకు మనస్తాపము కలుగలేదు. ప్రాయశ్చిత్తమన్న మాటలేదు. ఆమె పారసీక దేశపు స్త్రీయని తెలిపినాను. ఆమె చెలికత్తె మంథరకూడా అక్కడిదిగానే కనబడుచున్నది. అందుచేతనే దాని నిట్లు వర్ణించినారు.


“జ్ఞాతిదాసీ యతోజాతా, కైకేయ్యాస్తు సహోషితా"
                                                          (అయో. 7-1)


పుట్టింటివారిచే అరణముగా నియ్యబడినట్టిది; ఎక్కడనో పుట్టి నట్టిది; కైకేయివెంట పంపబడి ఆమెదగ్గరనే సదా ఉండునట్టిది అని వర్ణించుటచే కై కేయియొక్కయు మంథరయొక్కయు వైదేశికత మరింత స్పష్టమగుచున్నది. పైగా మంథర "కుబ్జ”. పర్షియాలోకూడ పూర్వ కాలమందు రాజులు తమ అంతఃపురాలవద్ద నపుంసకులను, గూని స్త్రీలను కాపలాగా ఉంచుచుండినట్లు ప్రతీతి.

కై కేయి తల్లిదండ్రులున్నూ కఠినులని తెలిపినారు. వారిజాడయే బిడ్డకును పట్టువడినది. అయినను భరతుని కన్నందున ఆమెను రాక్ష సిగా లోకము తలపజాలక పోయినది.

సీత

మహాపతివ్రత. ఆమెపేరు భారతీయస్త్రీలకు ఉత్తమోత్తమ మంత్రరాజము. హిందూస్త్రీలకు రామునకంటే సీత యెక్కువ ప్రీతిపాత్ర. పతిభక్తి ఆమెలో అచంచలము. రావణుని సామ్రాజ్యము, 5000 దాసీ జనుల సమర్పణము, రావణుడే స్వయముగా దాసుడై యుండుమాట, సకల భూలోక వైభవములు, ఆమెకు రాముని పాదధూళితో సమానము. ఘోరహింసలు ఆమెను ఆవంతయు చలింపజేయలేదు. జగద్విద్రావణు డగు రావణుడు ఆమెకు గడ్డిపుల్లతో సాటి. అతనితో మాట్లాడినప్పుడు గరికపుల్ల నడ్డముగా పెట్టి మాట్లాడినది. "నీ విలువయంతే" అని చెప్ప కయే చెప్పినది. హనుమంతుడామెను తన వీపుపై ఎక్కించుకొని తీసు కొని పోదుననెను. ఆమె నీతిజ్ఞ. అట్లు చేసిన తన కపవాదము, పర పురుషునిస్పర్శ, రాముని శౌర్యమునకు భంగము, రావణునికి శిక్ష తప్పుట, ఇవన్నియు సంభవించునని నిరాకరించెను.

ఆమె ధైర్యము, కష్టములనోర్చు సహనము చాలా ప్రశంసనీయ ములు. అడవికి పోవుటకై సిద్ధమైననాడు ఆమెకు తాపసు లెట్టివారో తెలి యదు. అందుచేత కైకేయి ఆమె చేతికి నారచీర లియ్యగా కంట నీరు పెట్టుకొని, రామా !


"కథన్ను బధ్నంతి మునయో వనవాసినః
ఇతి హ్యకుశలా సీతా సా ముమోహ ముహు ర్మహుః
                                                          అయో. 37-12


వనవాసినులు నారచీరలెట్లు కట్టుకొంటారు? అని సభలో అందరి యెదుట అడిగెను. ఆమె యమాయకత్వాని కందరును విలపించిరి. రాముడామెకు సభలోనే చీరపై చీరకట్టు విధమును తనకు వచ్చినట్టుగా చూపించెను సీత రామునికి సేవకురాలుగానే యుండలేదు. అవసరమని తోచినప్పుడు మంత్రివలె తనకు తోచిన అభిప్రాయముల నిచ్చుచుండెను. ఋషులు రాముని రాక్షసులను సంహరించుటకు ప్రేరేపించినప్పుడు చక్కని హితమును చెప్పి తుద కిట్లనెను: “రామా! స్త్రీచాపలముచే నేనిట్లు చెప్పితిని నీకు ధర్మోపదేశము చేయ సమర్థుడెవడు? నీ తమ్మునితోగూడా ఆలోచించి మీ కేది యుచితమని తోచునో దాని నాచరిఁచుడు.” హనుమంతుడు


ఒకటి చెప్పితే రెండు చేసుకొనివచ్చు రాముని నమ్మిన బంటు. మహాసమర్థుడు. కాని నిగర్వి, మహాప్రజ్ఞా ధురీణుడు. కాని వినయ సంపన్నుడు. సంస్కృతములో మహా పండితుడు బహుభాషల నెరిగిన వాడు. విశ్వాసపాత్రుడు.

రావణుడు

మహాబలాఢ్యుడు. అనేక దేశాలను జయించినవాడు. శత్రు భయంకరుడు. విషయాసక్తుడు. 1000 మంది భార్యలు కలవాడు. సీతను కామించి ప్రపంచమందు శాశ్వతమగు అపకీర్తిని పొందినవాడు. ఈ సందర్భములో రావణునికి దుర్యోధనునికిని కల తారతమ్య మెరుగ వలెను. రావణుని చెల్లెలగు శూర్పణఖయొక్క ముక్కు చెవులు కోయించిన వాడు రాముడు. ఖరదూషణాదుల 14000 మందిని సంహరించినది రాముడు. దానికి ప్రతీకారము చేయదలచినది రావణుడు. రాముడు ఆర్యుడు. రావణుడు రాక్షసుడు. ఇద్దరును సంపూర్ణముగా భిన్నజాతు లకు చేరినవారు. దుర్యోధనుడును ధర్మరాజును అన్నదమ్ముల కుమారులు. జ్ఞాతులు. ద్రౌపది దుర్యోధనునికి వదినెవరుస. ఆమెను జూదములో దుర్యోధనుడు గెలిచినాడు. ఆమెను తన తమ్మునిచే సభకు సిగబట్టి లాగించినాడు. నిండుసభలో ఆమెను దిగంబరనుగా చేయించి నాడు. నా తొడపై కూర్చుండరమ్ము అని ద్రౌపదిని పిలిచినాడు. రావణుడు ఒల్లని సీతను బలాత్కార కామమునకు గురిచేయలేదు. రాక్షస వివాహాలలో ఒల్లని స్త్రీలకు ఒక సంవత్సరము గడువిచ్చుచుండిరి. సీతకు అదే గడువిచ్చినాడు. రావణుని జాతి నరమాంసమును తినునట్టిదని వర్ణింపబడెను. తన బలమంతయు, తన కుమారులు, బంధువులు, తమ్ములు నాశనమైనప్పుడు కూడా సీతను చంపలేదు. అయినను ఆర్యులలో బలాత్కామమును గర్హించినట్లు మరి దేనిని గూడా గర్హింపకుండిరి. దుర్యోధనునికిని, రావణునికిని ప్రాయశ్చిత్తము తప్పదయ్యెను. రావణుడు బంధుప్రీతి కలవాడు. తన తమ్ముడు చనిపోయి నప్పుడు చాలా వ్యసనపడెను. ఇంద్రజిత్తు చనిపోయినప్పుడు అతని దుర్భరదుఃఖమును వాల్మీకి బాగా వర్ణించినాడు. రావణుడు కన్నీరు జొటజొట కార్చెను. అవి కాలుచున్న నూనెబొట్లవలె నుండెను. అతనికి క్రోధముకూడా నిండియుండెను. అందరును స్తబ్ధులైరి. ఎవరికిని అతనితో మాట్లాడే ధైర్యములేకుండెను. అతని పట్టపురాణి మండోదరి. అప్పుడప్పు డామెను సలహా అడుగుచుండెను. తుదికాలములో కూడా అడిగెను. ఆమె చక్కని నీతియుక్తమగు బోధకావించెను. కాని అతని పాపము పండినందున దానిని విను బుద్ధి అతనికి పుట్టలేదు.

విభీషణుడు

దేశద్రోహి, బంధుద్రోహి అని రాక్షసులచేత గర్హింపబడినాడు. తన యన్న నీతిబాహ్యుడైనందున రాముని ఆశ్రయింపవలసి వచ్చెను. అతడు రాక్షసులలో తప్ప బుట్టినాడు. శాంతపురుషుడు. ధార్మికుడు. నీతిజ్ఞుడు. రామునికి గొప్ప సహాయము చేసినవాడు. అందుచేత కీర్త నీయుడై నాడు.

దశరథుడు

బహుకాలము బహుభార్యలతో భోగాలనుభవించెను. ముసలి ముప్పునకు కైకేయిని పెండ్లాడెను. లేక లేక నల్గురు కుమారులు కల్గిరి. అందు రామునిపై పంచప్రాణా లప్పజెప్పుచుండెను. తాను చూచు చుండగనే అతనిని రాజుగా చేసి ఆ వైభవమును చూడగోరెను. కై కేయి భగ్నపరచెను. అతడు కరుణామయమూర్తి. సత్యవాక్యపరిపాలకుడు. లోకానుభవము సంపూర్ణముగా కలిగినవాడు. కైకేయిని పరిపరివిధముల ప్రార్థించిన ఘట్టము ప్రపంచవాఙ్మయమున సాటిలేనట్టిది. శ్రోతలు కంట తడిబెట్టక మానరు. అయోధ్యాకాండమంతయు మహాపరితాపముతో చిత్రింపబడిన భాగము దశరథుని ఉత్తమగుణములు చాలా సుందరముగా ఇందు వర్ణింపబడినవి.

వసిష్ఠుడు

ఇతని ప్రతిభను గురించి చాలా వినుచుందుము. విశ్వామిత్రుని తన కామధేనువుయొక్క దివ్యశక్తిచే పరిపరి విధముల పరిభవించి ఓడించిన వాడట! అట్టి వసిష్ఠుడు రామాయణములో పనికిరాని ఒక పంచాంగ పురోహితునివలె కనబడుచున్నాడు. దశరథునికి కలిగిన చిక్కును తీర్చడు. కైకేయిని గర్హింపడు దశరథుడు చనిపోయిన తర్వాత నలుగురు పెద్దమనుష్యులలో తానును ఒకనివలె కనిపించును కాని అతని ప్రాధాన్యము కానరాదు. భరతునివెంట నలుగురితోపాటు వెళ్లును. ఇది సరి, ఇది తప్పు అని యేమియు నిర్ణయింపడు. భరద్వాజుని ఆశ్రమములో ఇతని ఖ్యాతికి తగిన మన్నన కానరాదు. భరతుడు పాదుకలతో వెళ్ళి పోయినప్పటినుండి మరల రామాయణములో వసిష్ఠుడు కానరాడు.

విశ్వామిత్రుడు

వసిష్ఠునివలెనే రామాయణములో పనికిరానివానివలే కానవచ్చును. అతని గొప్పతనాన్ని బాలరామ లక్ష్మణులకు ఇతర మునులెవ్వరో చెప్పుదురు. కాని ఆ గొప్పతనానికి తగిన చర్యలు రామాయణములో కాన రావు. రామునికి బాణవిద్యను నేర్పువాడతని సహాయమునే పొందును. కొంత కాలములోనే శ్రీరాముని మిథిలకు పిలుచుకొనిపోవును. అక్కడ సీతను రాముని కిచ్చునట్లు ఏర్పాటుచేయును. అంతటితో అతనిపని ముగిసినది. ఇక రామాయణములో ఎచ్చటను కానరాడు. ఏమైపోయినట్లు?

విశ్వామిత్ర వసిష్ఠులను గురించి ఒక అంశమును గమనింప వలెను. పురాణకర్తలు, వీరు ఓకేవ్యక్తి అనుకొని పొరపాటుపడినారు. వసిష్ఠవంశములో పలువురా పేరుతో వెలసిరి. అదేవిధముగా విశ్వామిత్ర వంశములో చాలామంది విశ్వామిత్ర నామధేయులుండిరి. ఒక్కొక్కరు కొన్ని ఘనకార్యములను చేసిపోయిరి. అవన్నియు ఒకే వ్యక్తికి తర్వాతి పౌరాణికు లంటగట్టినారు.

పర్గిటర్‌గారిట్లు వ్రాసినారు: “విశ్వామిత్రులు ఇద్దరుండిరి. ఒకరు శునశ్శేఫుని రక్షించినవారు. ఇంకొకరు పాంచాల రాజైన సుదాసుని పురో హితులు. వీరిద్దరిని ఒకటిగా భావించి ఇద్దరి చర్యలను కలగలిపినారు . గాధికుమారుడైన వాడు మొదటి విశ్వామిత్రుడు. రామాయణములో విశ్వామిత్రుడు రెండవవాడు. వసిష్ఠునిచేత పరాభము పొందినవాడు మొదటి విశ్వామిత్రుడేకాని రాముని కాలములో నుండిన రెండవ విశ్వామిత్రుడు కాడు. అదేవిధముగా అనేక వసిష్ఠులుండిరి. వీ రందరును ఒకే వసిష్ఠునిగా పౌరాణికులు భావించిరి. అదేవిధముగా మార్కండే యులును బృహస్పతులును పలువురుండిరని ఎరుగవలెను.” [2]పర్గిటర్ ఇంకను ఇట్లు వ్రాసినారు:

“జనకులును అనేకు లుండిరి. సీరధ్వజ జనక, ధర్మ ధ్వజ జనక, దైవరాతి జనక, ఖాండిక్య జనక అనువారెందరో యుండిరి. హరిశ్చంద్ర, సగర, కల్మాషపాద, దశరథ రాజుల సంబంధములో పేర్కొనబడిన వసిష్ఠులు, వేర్వేరు వారని ఎరుగవలెను.[3]” “పూర్వములో ఎనిమిది సుప్రసిద్ధ బ్రాహ్మణ మూలకుటుంబము లుండెను. భృగు, అంగిరస, మరీచి, అత్రి, వసిష్ఠ, పులస్త్య, పులహ, క్రతువంశములు. మొదటి అయిదు బ్రాహ్మణ వంశములుగానే నిలచెను. తక్కిన మూడింటి లోని పులస్త్యవంశములో రాక్షస, వానర, కిన్నర, యక్షులు పుట్టిరి. పులహవంశములో పిశాచాదులును క్రతువునకును వాలఖిల్యాదులును పుట్టిరి. రామాయణములోని వసిష్ఠుడు తన వంశములో ఆరవవాడు. రామాయణములో విశ్వామిత్రుడు ఉండినది అనుమానమే.”[4] ఈ సందర్భమును గమనించినచో రామాయణములో వసిష్ఠ విశ్వామిత్రులు మనము వినిన మానవాతీతశక్తులగు వారు కారనియు, వారి వంశములోని వారనియు, వారు రామాయణములో ముఖ్యస్థానములో నుండినవారు కారనియు విశదమగును.

ఈ విధముగా రామాయణములో ప్రతి పాత్రకును ఒక వ్యక్తిత్వ మున్నది ముఖ్యమగు వ్యక్తుల గుణపోషణమును లోపము లేనట్లుగా వాల్మీకి పోషించినాడు. ఇట్టి పవిత్ర గ్రంథము, చదివినకొలది ఆనంద మతిశయించుచుండును. రామాయణమందలి సహజ వర్ణనలు, సుందర భావములు, ఉత్తమ నీతివర్తనము, కేవలము హిందువులకే కాక ప్రపంచ మందలి ధార్మికాభిలాషు లందరికిని ఆదర్శప్రాయములు. ఇట్టి కావ్యము సంస్కృతమందే కాదు, ప్రపంచమందే భాషయందును నేటివరకునూ సృష్టికాలేదు. హిందువుల సంస్కృతిని, నాగరికతను, భావౌన్నత్యమును, ధార్మికోదాత్తతను, కవితాప్రాగల్భ్యమును, ప్రతిభాశక్తిని ఈ వాల్మీకి రామాయణమే సర్వకాలములందు, సర్వదేశములందును చాటుచు వచ్చినది. ఇకముందును చాటుచుండగలదు.

  1. Monier Williams says :- Ramayana is undoubtedly one of the greatest treasuries in Sanskrit Literature. There is not in the whole range of Sanskrit Literature a more charming poem than the Ramayana. The classi- cal purity, clearness, and simplicity of its style, the exquisite touches of true poetic feeling, with which it bounds, its graphic descriptions of heroic incidents, nature's grandest scenes, the deep acquaintance it displays with the conflicting workings and the most refined emotions of the human heart, all entitle it to rank among the most beautiful compositions that have appecred at any period or and country. P. 191.
  2. Pergiter.Ancient Indian Historical tradition P 64
  3. Pergiter.Ancient Indian Historical tradition P 138
  4. Pergiter.Ancient Indian Historical tradition P 236